మృతజీవులు – 3

గదిలో ప్రవేశిస్తూనే చిచికవ్ కళ్ళు చిట్లించాడు. కొవ్వొత్తులు, దీపాలు, ఆడవాళ్ళ దుస్తులు కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఆ ప్రదేశమంతా కాంతిమయంగా ఉన్నది. ఒకటొకటిగానూ, గుంపులు గుంపులుగానూ నల్లకోట్లు తచ్చాడుతున్నాయి. వేసవి రోజున ఇల్లు చూసుకునే ఆమె కిటికీ దగ్గర నిలబడి చక్కెరగడ్డ పగులగొట్టి, తళతళలాడే ముక్కలు చేసినప్పుడు ఈగలు దానిపైన ఇలాగే తచ్చాడుతాయి; పిల్లలు ఆవిడ చుట్టూ చేరి ఆమె తన మొరటు చేతులతో సుత్తె ఎత్తి గడ్డను పగులగొట్టటం చూస్తుంటే, ఈగల మందలు మందలుగా, ఇల్లు తమదే నన్నట్లు ఎగురుతూ వచ్చి చక్కెర ముక్కల పైన వాలుతాయి; ఆమెకు అసలే చత్వారం, అందులోనూ ఎండకు కళ్ళు సగం మూసేస్తుంది, ఈగలు అది ఆసరా చేసుకుంటాయి; అవి కొన్ని చోట్ల విడివిడిగానూ, కొన్ని చోట్ల గుంపుగానూ చేరి, తినటం కంటే ఆత్మప్రదర్శనం ప్రధానంగా పెట్టుకుని చక్కెర మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ, మధ్య మధ్య తమ వెనుక కాళ్ళను గాని, ముందు కాళ్ళనుగాని ఒకదానికొకటి పెట్టి రుద్దుకుంటాయి, లేదా ముందుకాళ్ళు చాచి తల అంతా తుడుచుకుంటాయి, అలా బయటికి ఎగిరిపోయినట్టు పోయి, ఇంకా అధిక సంఖ్యలో మళ్ళీ లోపలికి ఎగురుతూ వస్తాయి.

చిచీకవ్ చుట్టూ కలయ చూసే లోపునే గవర్నరుగారు వచ్చి చెయ్యి పట్టుకు తీసుకుపోయి తన భార్యకు పరిచయం చేశాడు. ఆగంతకుడు కలవరపడక, తన వయస్సుకూ, అంత గొప్పదీ అంత తక్కువదీ గాని తన హోదాకూ తగిన విధంగా ఆమెతో ప్రియవచనాలాడాడు.

డాన్సు చేయబోయే జంటలు తమతమ స్థానాలు ఆక్రమించుకొనేసరికి మిగిలిన వాళ్ళు గోడలకేసి ఒత్తుకోవలసి వచ్చింది. అతను చేతులు వెనక్కి పెట్టుకొని ఆ జంటలకేసి రెండు, మూడు నిమిషాలపాటు తదేక దీక్షగా చూశాడు. యువతులలో చాలామంది బాగున్నారు, ఫాషన్ గా డ్రెస్ చేసుకున్నారు. ఇతరులు ఈ మారుమూల బస్తీలో దైవికంగా ఎలాటి దుస్తులు దొరికితే అవే ధరించారు. అన్నిచోట్లలాగే ఇక్కడి మగవాళ్ళలో కూడా రెండు రకాలు: మొదటి రకం, బక్కపలుచగా వుండి ఆడవాళ్ళను పట్టుకు వేళాడే వాళ్ళు; వీరిలో కొందరు అచ్చు పీటర్స్‌బర్గ్ రాజధాని పౌరుల్లాగే ఉన్నారు, వారిలాగే ఎంతో శ్రద్ధాసక్తులతో దువ్విన పుస్తీలు1 ధరించారు, లేదా నున్నగా క్షౌరం చేసిన చూడముచ్చటైన కోలమొహాలు కలిగి ఉన్నారు; వీరు ఆడవారి పక్కనే ఆసీనులై, ఫ్రెంచి భాష మాట్లాడుతూ, పీటర్స్‌బర్గ్ వారిలాగే స్త్రీలను వినోదపరిచారు.

రెండవ రకం వాళ్ళు లావుగానూ, చిచికవ్ లాగే అట్టే లావు, అట్టే సన్నగా ఉండకుండా ఉన్నారు. వీరు మటుకు స్త్రీలను కోరచూపులు చూసారే గానీ వారి ఛాయలకు రాలేదు. వారి దృష్టి అంతా, గవర్నర్ గారి నౌకర్లు చీట్లాడే బల్లసిద్ధం చేస్తున్నారా లేదా అని చుట్టూ కలియచూడటంలో నిమగ్నమై వుంది. వారి మొహాలు గుండ్రంగా, నిండుగా వున్నాయి. కొందరికి ఉలిపొర కాయలున్నాయి. కొంతమందికి స్ఫోటకం మచ్చలు కూడా ఉన్నాయి. వారు తమ జుట్టును పైకి లాగి ముడివెయ్యటంగాని, ఉంగరాలు తియ్యటంగాని చెయ్యక, అంటకత్తిరించడమో, అణచి దువ్వడమో చేశారు. వారి ముఖభాగాలు కూడా గుండ్రంగా నిండి ఉన్నాయి. వీరంతా నగరంలోని పెద్ద అధికారులు. లావుపాటి వాళ్ళు తాము వ్యవహారాలు చూసుకున్నంత బాగా పాపం సన్నవాళ్ళు చూసుకోలేరు. సన్నని వాళ్ళు ప్రత్యేకమైన పనులకు వినియోగించడానికో అదనపు వ్యక్తులుగా పడిఉండడానికో పనికి వస్తారు, వారిని ఇక్కడికీ అక్కడికీ తోస్తూ ఉంటారు. వారి మనుగడే తేలికగా, గాలి వాగుగా వుండి పటుత్వం లేకుండా ఉంటుంది.

లావుపాటి వాళ్ళు పక్కదారులు పట్టక రాజమార్గానే వెళుతారు. వారెక్కడైనా తిష్ఠవేసినా వూతంగానూ నమ్మకంగానూ వేస్తారు. వారు కూచున్న ఆసనం విరిగితే విరుగుతుందేమో గాని వారు మాత్రం దానిని వదలరు. వారికి పటాటోపాలతో పని లేదు. వారి కోట్ల కత్తిరింపు సన్నవాళ్ళ కోట్ల కత్తిరింపు లాగా నాజూకుగా వుండదు, అయితే వాళ్ళకు బోలెడన్ని దుస్తులుంటాయి. సన్ననివాడు మూడేళ్ళలోపుగా తన కమతగాళ్ళందరినీ తాకట్టు పెట్టేస్తాడు. జాగ్రత్తగా పరిశీలించినట్టయితే లావుపాటి వాడికి ఊరిచివర భార్య పేర కొన్న ఇల్లొకటుంటుంది; మరికొన్నాళ్ళకి ఊరి రెండో చివర మరొక ఇల్లు కొంటాడు, తరువాత బస్తీకి దగ్గరగా ఒక చిన్న గ్రామం కొంటాడు, ఆ తరువాత సమస్త సౌకర్యాలు కలిగిన ఒక ఎస్టేటు కొనేస్తాడు. చిట్టచివరకు ఈ లావు మనిషి దేవుడి సేవా, జారు (Tsar) సేవా చేసి అందరి మన్ననలూ అందుకొని, పదవి విరమించి, ఎడంగా వెళ్ళిపోయి భూస్వామి అయి, సరదాగా అతిథి మర్యాదలలో మునిగితేలే రష్యను సంప్రదాయం పాటించి తండ్రి సంపాదించినదంతా అలాములూ, పలాములూ చేస్తారు. అక్కడ చేరిన వారిని పరీక్షిస్తున్నంత సేపూ చిచీకవ్ కు కలిగిన ఆలోచనలివే.

అతను చివరకు లావుపాటివాళ్ళ మధ్యకు చేరుకున్నాడు. అతనికి తెలిసిన వారందరూ వారిలోనే వున్నారు: నల్లగా దట్టంగా వున్న కనుబొమలుగల పబ్లిక్ ప్రాసిక్యూటరున్నాడు. “నీకో సంగతి చెప్పాలి, అలా అవతలి గదిలోకి రావోయ్” అన్నట్టుగా ఎడమ కన్ను కొద్దిగా చికిలించే అలవాటున్నది ఆయనకు, కాని ఆయన స్వభావం గంభీరమైనది, మితభాషి; పోస్టుమాస్టరున్నాడు, ఆయన చమత్కారి, తాత్విక దృష్టి కలవాడు; న్యాయ స్థానాధ్యక్షుడు, సూక్ష్మదృష్టి గలవాడు, మర్యాదస్తుడు – అందరూ చిచీకవ్ పాత స్నేహితుడిలా పలకరించారు, అతను కూడా వారు చేసిన మర్యాదలకు జవాబుగా తలవంచాడు. కొంచెంగా ఒక పక్కకు వంచితేనేం గనక తరువాత అతను మానిలవ్ అనే మర్యాదస్తుడైన భూస్వామి తోనూ, సబాకివిచ్‌ అనే కంగారు మనిషితోనూ పరిచయం చేసుకున్నాడు. ఈ కంగారు మనిషి ఆదిలోనే అతని కాలు తొక్కి “క్షమించాలి”, అన్నాడు. తరువాత ఒకే పేకముక్క తీసుకోమన్నాడు. అతను దాన్ని తలవంచి స్వీకరించాడు. వారు ఒక ఆకుపచ్చని బల్ల వద్ద ఆటకు కూచుని భోజనాలదాకా లేవనేలేదు; అతి ముఖ్యమైన పనికి ఉపక్రమించేవారిలాగా వారు సంభాషణ కట్టిపెట్టివేశారు.

పోస్ట్ మాస్టర్ కబుర్లరాయడే అయినా తన ముక్కలు చేతిలోకి తీసుకోగానే ఆయన మొహం ఆలోచనా నిమగ్నమైపోయింది. ఆయన పై పెదవి కింది పెదవి మీదికి వాలి ఆయన ఆడుతున్నంత సేపు అలానే వుండిపోయింది. ఆయన బొమ్మ ముక్కలు వేసినప్పుడల్లా చేత్తో బల్లనుబాదుతూ, రాణిని వేస్తే “పోవే పూజారి పెళ్ళామా” అనీ, రాజును వేస్తే, “పోరా తంబోవు రైతూ!” అనేవాడు. అధ్యక్షుడేమో “వాడి పుస్తీలు పీకేస్తా, వాడి పుస్తీలు పీకేస్తా” అనేవాడు. ముక్కలను బల్లకేసి కొట్టేసినప్పుడు, ” ఏమయితే అయ్యింది, డైమను ఆడక తప్పేది లేదు!” ఇత్యాది వ్యాఖ్యానాలు కూడా నడిచేవి. కొందరు రంగులకు ముద్దుపేర్లు కూడా పెట్టుకొనే వారు. ఆట అయిపోయినప్పుడల్లా మామూలుకు భిన్నంలేకుండా తగువు జరిగేది. కథానాయకుడు కూడా విమర్శించేవాడు, కానీ ఎంతో చాకచక్యంగా తను చేసేది విమర్శ కాదని అవతల వాళ్ళకు అనిపించేలా మాట్లాడేవాడు. ” మీరు దిగి వచ్చారు” అనడానికి బదులుగా “తమరి వద్ద వరుస ప్రారంభమయింది. తమరు వేసిన రెండు పైన వేసేందుకు నా దగ్గర పెద్ద ముక్క ఉండిపోయింది” – ఈ ధోరణిలో మాట్లాడేవాడు. తన ప్రత్యర్థులను మంచి చేసుకోవటానికి అతను వారికి తన వెండి నస్యండబ్బీ అందిస్తూ వచ్చాడు. దాని అడుగున రెండు సువాసనా పుష్పాలుండటం గమనించారు. ఇంతకు ముందు చెప్పిన మానిలవ్, సబాకివిచ్ అనే భూస్వాములు అతన్ని ప్రత్యేకంగా ఆకర్షించారు. అతను ఆలస్యం చెయ్యకుండా అధ్యక్షుణ్ణీ, పోస్టుమాస్టరునూ ఎడంగా పిలిచి వాళ్ళను గురించి వాకబు చేశాడు. అతని ప్రశ్నలలో కేవలం జ్ఞానతృష్ణ మాత్రమే గాక ఇంగిత జ్ఞానం కూడా వ్యక్తమయ్యింది. ఎలాగంటే అతన ముందుగా వారికింద ఎంతెతమంది కమతగాళ్ళున్నారో, వారి భూములు ఎలాటివో విచారించి, వారి పేర్లు, వారి తండ్రుల పేర్లు ఆ తరువాత విచారించాడు. తరువాత కొద్ది సేపట్లోనే అతను వారి సద్భావాన్ని కూడా సంపాదించాడు. మానిలవ్ అతన్ని చూసి చాల ముచ్చట పడ్డాడు; చిచీకవ్‌ దయచేసి తమ గ్రామానికి తన అతిథిగా రావాలనీ, నగర ద్వారం నుంచి పది మైళ్ళు మాత్రమే ఉంటుందనీ అన్నాడు. దానికి చిచికవ్ తల వంచి, ఆయన చెయ్యి నొక్కి ఆలా చెయ్యటం తన అభిలాష మాత్రమే గాక తన విధిగా కూడా భావిస్తున్నాను అని చెప్పాడు. సబాకివిచ్ సంగ్రహంగా “నేనుకూడా అలగే ఆహ్వానిస్తున్నాను” అన్నాడు.

ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడుపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు. అతను ఏ సందర్భంలోనూ కొంచెం కూడా తడబాటు లేకుండా తన లౌకిక పరిజ్ఞానం ప్రదర్శించుకొనే వాడు. మెచ్చుకోదగిన సంగతేమిటంటే ఇవన్నీ మాట్లాడటంలో అతను ఎలాటి ఆర్భాటమూ లేక, ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసునని రుజువు చేసుకున్నాడు. గొంతు ఎత్తడం కానీ గొణగడం కానీ లేకుండా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడే వాడు. ఏ విధంగా చూసినా అతను నిఖార్సైన పెద్దమనిషి అని స్పష్టమైంది. అతని రాకను ప్రభుత్వాధికారులందరూ హర్షించారు. అతను పూర్తిగా నమ్మదగిన మనిషి అని గవర్నరు ఎన్నిక చేశాడు; దక్షత గలవాడని పబ్లిక్ ప్రాసిక్యూటరు అన్నాడు; మంచి సంస్కృతిగల వాడని స్పెషల్ పోలీస్ అధికారి చెప్పాడు; బాగా తెలివైన వాడు, గణనీయుడూ అని న్యాయస్థానాధ్యక్షుడన్నాడు; స్నేహపాత్రుడని పోలీస్ అధిపతి అన్నాడు. సబాకివిచ్ ఒకంతట ఎవరినీ మెచ్చుకునే ఘటం కాదు, అటువంటి వాడు సయితం బాగా పొద్దు పోయి బస్తీ నుంచి తిరిగివచ్చి ఎముకల గూడు లాటి తన భార్య ప్రక్కన పడుకుంటూ, “సాయంకాలం గవర్నరుగారింటికి వెళ్ళి, పోలీసు అధిపతి ఇంట భోంచేశానే, అక్కడ పావెల్‌ ఇవానోవిచ్‌ చిచీకవ్‌ అనే ఆయనను పరిచయం చేసుకున్నాను, భలేవాడు!” అన్నాడు. ఆయన భార్య “హుఁ,” అని భర్తను కాలితో తన్నింది.

ఈ పట్నానికి వచ్చిన ఆగంతకుణ్ణి గురించి నలుగురికీ ఇంత ఘనమైన అభిప్రాయం ఏర్పడింది. అతను తన వింత వ్యాపకంతో ఒక సంఘటన కల్పించినదాకా ఈ అభిప్రాయం మారలేదు. ఆ తరువాత నగరమంతా విస్తుపోయింది. ఈ సంఘటనలు ముందు ముందు మనకే తెలుస్తాయి.

(ఇంకా ఉంది)
——–
1. పుస్తీలు = జులపాలు (whiskers or sideburns)

Posted in కథ | Tagged | 1 Comment

TMAD, ఎర్రకోట, నవీన్, గడి

group-photo_2.jpgచిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……

ఏమిటో ఈ నెల అతిథి ఉప్పలపాటి ప్రశాంతి వివరిస్తున్నారు.

వి.బి.సౌమ్య అంపశయ్య నవీన్ రచనల గురించి “నేను చదివిన నవీన్” వ్యాసంలో వివరిస్తున్నారు.

గడి శీర్షికలో ప్రొఫెసర్ గారు కూర్చిన జూన్ నెల గడికి విశేష స్పందన లభించింది. ఈ నెల గడి జంట కూర్పరులు కూర్చింది కావడం మరో విశేషం.

ఎర్రకోటను UNESCO World Heritage Site గా గుర్తించిన సందర్భంగా సచిత్రకథనం అదనం.

పొద్దులో మరికొన్ని విశేషాలు:

మే నెలలో బ్లాగు పేరడీల వల్ల బ్లాగు సమీక్షలు వెనుకబడ్డాయి. ఈ నెలలో ఒక ప్రముఖ తెలుగుబ్లాగు సమీక్షతో ఆ శీర్షిక పున:ప్రారంభమౌతుంది. ఇక గతకొన్ని నెలలుగా కదలిక లేని వికీ శీర్షికను ఈ నెలనుంచి తెవికీ అధికారి (Bureaucrat) రవి వైజాసత్య నిర్వహిస్తారని తెలుపడానికి సంతోషిస్తున్నాం. ఇవేకాకుండా ఈ నెలనుంచి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కాల్పనికేతర రచనలను పొద్దు పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం.

ఇక కొ.కు. గారి అనువాద రచన మృతజీవులు పట్ల పొద్దు పాఠకులు విశేషమైన ఆసక్తిని కనబరచారు. ఆ రచన తదుపరి భాగాలు ప్రతినెలా రెండవ మరియు నాల్గవ సోమవారాల్లో ప్రచురితమౌతాయి.

ఈ నెల రచనలు:

ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా… – 1 (అతిథి)
నేను చదివిన నవీన్ (వ్యాసం)
ఎర్రకోట (వ్యాసం)
గడి (గడి)
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా…- 2 (అతిథి)
మృతజీవులు – 2 (మృతజీవులు)
సారంగపాణికి సామెతల సుమ మాల (సరదా)
తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (వికీ)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

మృతజీవులు-1 (మృతజీవులు) న్యూవేవ్ సినిమా (సినిమా) చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి) నవతరంగం (సినిమా) గడి (గడి) పుస్తక సమీక్ష (వ్యాసం) ‘గ్యాస్’ సిలిండర్ (సరదా) అంకెలతో పద్య సంకెలలు (వ్యాసం) మరో వనాన్ని స్వప్నిస్తాను (కవిత)

Posted in ఇతరత్రా | 1 Comment

తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు

రవి వైజాసత్య
[రవి వైజాసత్య]

(ఈ వ్యాసంలో నేను చేసిన వ్యాఖ్యలు, వ్యక్తపరచిన అభిప్రాయాలు, కేవలం తెలుగు వికీలో గత రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవముతో నేను గ్రహించినవి మాత్రమే. వీటికి వికీపీడియా కానీ, వికీమీడియా సంస్థ కానీ, పొద్దు పత్రిక కానీ ఎటువంటి బాధ్యతా వహించదు. – రవి వైజాసత్య)

వికీపీడియా ఒక ప్రజా విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా తెలుగు సంచిక భారతీయ భాషలన్నంటిలో అగ్రస్థానములో ఉండటం తెలుగు వారంతా ఒకింత గర్వపడదగిన విషయం. ఇది వరకు పొద్దు సంపాదకవర్గం మీకు ఈ శీర్షికలోని మొదటి వ్యాసంలో వికీని, వికీపీడియాను పరిచయం చేశారు. ఆసలు ఈ వికీ ఏంటీ? వికీపీడియా ఏంటి? అన్న సందేహలు కలిగితే ముందుగా మీరా వ్యాసాన్ని తప్పకుండా చదవవలసిందే!!.

తెలుగు వికీపీడియా యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను అర్ధం చేసుకోవటానికి మనం ఇప్పటి దాకా తెలుగులో జరిగిన విజ్ఞాన సర్వస్వ కృషిని క్లుప్తంగా కొంత మేరకు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పూర్వం తెలుగు విజ్ఞానాన్నంతా ఛందోబద్ధంగా పద్యరూపములో ఇమిడ్చేవారు. అయితే వీటి విస్తృతి చాలా తక్కువ. ప్రస్తుతం వీటికి సాహితీ విలువ ఉన్నది కానీ అందులోని విజ్ఞానము పరిమితము. తెలుగులో కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారి ఆంధ్ర విజ్ఞానసర్వస్వము ప్రపథమ విజ్ఞానసర్వస్వంగా భావించవచ్చు. ఇది ఒక అకారాది క్రమములో కూర్చిన విజ్ఞాన సర్వస్వము. అనగా అకారాది క్రమములో అ నుండి ఱ వరకు వివిధ అంశాలను గూర్చి వ్రాయ సంకల్పించారు. ఆయన మూడవ సంపుటం కూడా పూర్తిచేయకుండానే కాలధర్మం చేశారు. 20వ శతాబ్దపు తొలి దశకాలలో ప్రారంభమైన ఈ కృషిని 1930వ దశకములో కాశీనాథుని నాగేశ్వరరావు గారు నెత్తినెత్తుకొని కొంత ఆధునీకరించి, పొడిగించి రెండు సంపుటాలు తిరిగి పునర్ముద్రించారు. మూడవ సంపుటం ముద్రణలో ఉండగా ఆయన మరణించటంతో ఈ కృషీ ఆగిపోయింది.

అయితే అది అకారాది విజ్ఞానసర్వస్వమైనందున కొన్ని వ్యాసాలలో దీని తర్వాత ప్రచురించబోయే సంపుటాలలో వచ్చే ఫలానా వ్యాసం చూడండి అని రాసారు కానీ అవి అలా అసమగ్రంగానే మిగిలిపోయాయి. ఉదాహరణకు అనంగుఁడు అన్న శీర్షికలో ఇది మన్మథుని పేరు, ఆ తరువాత వచ్చే సంపుటాలలో మన్మథుని క్రింద దీని సమాచారం చూడండి అని రాశారు. కానీ ఆ మన్మథుని వరకీ ప్రయత్నము సాగలేదని వేరే చెప్పక్కర్లేదు.

అకారాది క్రమములో విజ్ఞాన సర్వస్వము కూర్చటం వలన, అన్ని సంపుటాలు పూర్తయ్యేవరకు విజ్ఞాన సర్వస్వము అసమగ్రముగా ఉండి, అంతగా ఉపయోగకరము కాదని, కేవలం ఒక నిర్దిష్ట విషయం పై ఆసక్తి ఉన్నవారు కూడా విజ్ఞాన సర్వస్వము నుండి అవసరమైన సమాచారం పొందడానికి విజ్ఞాసర్వస్వము యొక్క అన్ని సంపుటాలు కొనవలసి ఉండటం బాగాలేదని గ్రహించిన తెలుగు విశ్వవిద్యాలయం తాము తీసుకువచ్చిన తెలుగు విజ్ఞానసర్వస్వంలో వివిధ రంగాల వారీగా సంపుటాలు వెలువరించింది. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అయుర్వేదం, మతములు-దర్శనములు, భారత భారతి, విశ్వ సాహితి, తెలుగు సంస్కృతి, జ్యోతిష్యం, మొదలైన సంపుటాలను సిద్ధం చేసింది. ఇవి అనేక మంది పండితుల యొక్క దశాబ్దాల కృషి వల్ల రూపొందిన అమూల్య గ్రంథాలు. అయితే ఇవి అందరికీ ఉచితంగా లభ్యం కావట్లేదు. మిగిలిన అచ్చు విజ్ఞానసర్వస్వములలో వలెనే, వీటిలోని సమాచారానికి ప్రచురించిన కొద్దికాలానికే కాలదోషం పట్టే అవకాశముంది. పెరుగుతున్న విజ్ఞానాన్నంతా చేర్చి, అన్ని సంపుటాలనూ తరచుగా తాజాకరించి ప్రచురించటం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అంతర్జాల విజ్ఞానసర్వస్వాల్లోలాగా వీటిలో ఏదైనా విషయం గురించిన సమాచారం వెతకటం అంత సులువు కాదు. వీటి విస్తృతి కొన్ని రంగాలకే పరిమితమైనది.

ప్రపంచ విజ్ఞానము ప్రతి దశాబ్దకాలములో రెట్టింపవుతున్న ఈ తరుణంలో తెలుగు సాంప్రదాయిక అచ్చు విజ్ఞానసర్వస్వాలు రెండో లేదా మూడో సంపుటం ప్రచురించేసరికి మొదటి సంపుటంలోని విషయాలకు కాలదోషం పడుతుందంటే అతిశయోక్తి లేదు. పైగా అచ్చుప్రతుల ప్రచురణ వ్యయప్రయాసలతో కూడుకున్నపని. ఇలాంటి బృహత్తర కార్యంలో సామాన్య ప్రజలు పాలుపంచుకొనే అవకాశముండదు. ఒకవేళ ప్రచురించినా, ఉచితంగా పంపిణీ చెయ్యటం ఆర్థికపరంగా జరిగే పనికాదు.

ఇక్కడ మనం నేర్చుకోవలసినదేంటంటే విజ్ఞాన సర్వస్వ కృషి ఎంతటి మహానుభావులైనా ఒకరిద్దరి వల్ల సుసాధ్యమయ్యే పనికాదని గ్రహించాలి. తెలుగు విద్యావంతులంతా నడుంకట్టి తమకు చేతనైన సహాయం అందిస్తేనే ప్రస్తుత కాలమాన పరిస్థితులకు మనగలిగే అర్థవంతమైన, సందర్భోచిత విజ్ఞాన సర్వస్వం సృష్టించగలం.

తెలుగు వికీపీడియా ఉచిత విజ్ఞానసర్వస్వమే కాకుండా తెలుగులో అత్యంత విస్తృతి కలిగిన విజ్ఞాన సర్వస్వమున్నూ, అత్యంత తాజా విజ్ఞానసర్వస్వము అయ్యే విధంగా రూపొందించబడినది. మరి వికీ పద్ధతిలో స్థిరత్వము అంటూ ఉండదు కదా. తరచూ మారే విజ్ఞానసర్వస్వములో నాణ్యతను ఎలా కాపాడతారు అని ప్రశ్నించవచ్చు. ఇది సమంజసమైన ప్రశ్నే. వీటికి పరిష్కారముగా నియమిత సమయాలలో ఒక స్థిరమైన సీడీ (కాంపాక్ట్ డిస్క్) సంచికలను విడుదలచేయాలన్న ఆలోచన ఉన్నది. తెలుగు వికీపీడియాలో ఎంతో కొంత ఉపయోగకరమైనవిగా భావించే సమాచారమున్న వ్యాసాలు ప్రస్తుతం ఒక వెయ్యి దాకా ఉన్నాయి. అవి పదివేల సంఖ్యకు చేరగానే వాటిలో సమగ్రమైన వ్యాసాలను, సభ్యులతో కూడిన ఒక సంపాదక వర్గం ఎంపిక చేసి తెలుగు వికీపీడియా స్థిర సంచిక 0.1 ఒక సీ.డీ. లో విడుదల చేయాలన్న ఆలోచన ఉన్నది. ఈ సీ.డీ.ని ఎవరైనా ఉచితంగా కాపీ చేసి పంపిణీ చేసేందుకు ఎటువంటి కాపీహక్కుల అడ్డంకులూ లేవు. కాబట్టి వీటిని అలా ఒకరినుండి ఒకరికి పంపిణీ చేస్తూ ఆంధ్ర దేశమంతటా తెలుగు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రతి బడికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి పంపిణీ చేయటానికి, ఒక వెయ్యి పేజీల ఉద్గ్రంథాన్ని పంపిణీ చేసే ఖర్చులో వెయ్యో వంతు కూడా ఖర్చు కాదు.

తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన వికీ ప్రాజెక్టు వికీపీడియా అయినప్పటికీ తెలుగు విక్షనరీ (ఒక మహా నిఘంటువు, పదకోశము) మరియు తెలుగు వికీసోర్స్ (ఒక ఉచిత మహా గ్రంథాలయము) లో కూడా కృషి పుంజుకొంటున్నది.

తెలుగు విక్షనరీ ఒక అనేక భాషలు – అనేక భాషలు (many – many) నిఘంటువు. అంటే తెలుగు పదానికి పలు భారతీయ మరియు ప్రపంచ భాషలలోనూ, పలు ప్రపంచ మరియు భారతీయ భాషలలోని ప్రముఖ పదాలన్నింటికి తెలుగులోనూ అర్థాలు ఇస్తుంది. ప్రస్తుతానికి ఇందులో తెలుగు-ఆంగ్లం, ఆంగ్లం-తెలుగు పదాలపైనే దృష్టి కేంద్రీకరించటం జరిగింది. తెలుగు విక్షనరీలో సుజాత గారు విశేష కృషి చేస్తున్నారు. తెలుగు వికీలో నిర్వాహకుడైన మాకినేని ప్రదీపు గారు బ్రౌణ్య ఆంగ్ల – తెలుగు నిఘంటువును మొత్తం విక్షనరీలో చేర్చే ప్రయత్నములో ఉన్నారు. దీనితో పాటు బ్రౌణ్య తెలుగు – ఆంగ్ల నిఘంటువు, కాపీహక్కులకు లోబడి వీలైతే వేమూరి గారి అంగ్ల – తెలుగు నిఘంటువులు కూడా చేర్చి తెలుగు పదాలన్నింటినీ ఒకచోట అందించాలని విక్షనరీ సభ్యుల అభిలాష. విక్షనరీ లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవటానికి విక్షనరీ సందర్శించాల్సిందే.

తెలుగు వికీసోర్సులో ఒక తెలుగు ఔత్సాహికుల బృందం ఆంధ్ర మహాభారతాన్ని యూనీకోడీకరించే బృహత్తర కార్యం చేపట్టింది. ఇప్పటికి 7 పర్వాలను పూర్తిచేశారు. మిగిలిన వాటిపై కృషి కొనసాగుతున్నది. అవే కాక వికీసోర్స్ లో చురుగ్గా పాల్గొంటున్న అన్వేషి మరియు రాజ్ గార్లు ఇప్పటికే 1300కు పైగా అన్నమయ్య కీర్తనలను, వందకు పైగా త్యాగరాజ కీర్తనలు, వ్యాస మహాభారతం, వాల్మీకీ రామాయణాన్ని తెలుగు వికీసోర్సులో చేర్చారు. ఆ రామాయణ మహాభారతాలు నా దగ్గర పుస్తక రూపములో ఉన్నాయి వీటివల్ల నాకుపయోగమేమి అని మీరడగవచ్చు. బోలెడన్ని. ఉదాహరణకు ‘శకునం’ అన్న పదాన్ని వాల్మీకి రామాయణంలో ఎక్కడ ఏ సందర్భములో ఉపయోగించారో వెతికి పట్టుకోవటానికి ప్రయత్నించండి . గడ్డివామిలో సూదిని వెతికినట్టే అని అనుకుంటున్నారా? అయితే వికీ ప్రాజెక్టులన్నీ యూనీకోడ్లో ఉన్నవి. దాని వల్ల గూగూల్లో వీటిని వెతకటం “క్లిక్కులో”పనే. ఇందులో కాపీహక్కులు లేని తెలుగు పుస్తకాలన్నింటినీ చేర్చవచ్చు. చెప్పుకుంటూపోతే ఇలా చాలా కృషి జరుతోంది కానీ వీటిగురించి తర్వాతి టపాలలో విపులంగా చర్చిస్తాను.

తెలుగులో విజ్ఞానాన్ని అందరికీ ఉచితంగా పల్లె పల్లెకు, వాడ వాడకు వ్యాపింపజేసే ఈ బృహత్తర ప్రయత్నానికి మన వంతు సహాయాం చేద్దాం రండి. ఈ కృషిలో మీవంతు సహాయం చెయ్యటానికి శతకోటి విధానాలున్నాయి. మీరు కంప్యూటరు ముందు కూర్చుని వ్యాసాలే రాయక్కర్లేదు. మీరు ఫోటోగ్రాఫర్లైతే వికీలో పెట్టడానికి సరిపోతాయనిపించే ఫోటోలను ఇవ్వవచ్చు. చిత్రకారులు చిత్రాలను గియ్యవచ్చు, సంపాదకులు, భాషా పండితులు భాషా విషయమై సూచనలు చేయవచ్చు, వ్యాసాలలోని అచ్చుతప్పులు దిద్దవచ్చు, మీరు మాష్టారైతే వ్యాసాల నాణ్యతను బేరీజు వేసి మార్కులు వేయవచ్చు. బహుభాషా కోవిదులు, అనువాదకులైతే ఇతర భాషలనుండి తెలుగులోకి వివిధ వ్యాసాలను అనువదించవచ్చు. ప్రోగ్రామింగ్ గురు అయితే వివిధ చాకిరీ పనులను ఆటోమేట్ చెయ్యటానికి బాట్లను రాయవచ్చు, మీ గళం సూపర్ అనిపిస్తే వికీలోని వ్యాసాలను చదివి, రికార్డు చేసి పంపించవచ్చు. మీరు డిటెక్టివ్ నారద అయితే నిజ నిర్ధారణకు వచ్చిన విషయాలను కూపీ లాగవచ్చు. ఇవన్నీ చేయటానికి మీకు అర్హతలేమీ ఉండాల్సిన అవసరమేంలేదు. ఆసక్తి ఉంటే చాలు. అలా మనసుండలే కానీ మార్గముండదా?

పొద్దులో ఈ వికీ శీర్షిక ద్వారా తెలుగు వికీపీడియా, విక్షనరీ, వికీసోర్స్ మొదలైన సోదర ప్రాజెక్టులలో ముఖ్యంగా వికీపీడియాలో వెలువడిన కొత్త కొత్త వ్యాసాలను, జరుగుతున్న కృషిని చదువరులకు పరిచయం చేయాలని భావిస్తున్నాను. ఇంకా వికీ గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ వ్యాఖ్యలలో రాయండి. లేదా, తెలుగువికీ గూగుల్ బృందాన్ని సందర్శించండి. అదీ కాకుంటే, teluguwiki@yahoo.co.in చిరునామాకు ఈ-మెయిల్ పంపండి. వాటికి వెంటనే సమాధానమివ్వటానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఈ అవకాశాన్ని కల్పించిన పొద్దు సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.

==మూలాలు==

*ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ద్వితీయ సంపుటం (1935) కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు

*తెలుగు విశ్వవిద్యాలయము యొక్క విజ్ఞాన సర్వస్వము నాలుగవ సంపుటం (మతములు-దర్శనములు) (1994)

రవి వైఙాసత్య (http://saintpal.awardspace.com/)

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

Posted in జాలవీక్షణం | Tagged | 5 Comments

సారంగపాణికి సామెతల సుమ మాల

jyothi.bmp
[వలబోజు జ్యోతి]
————————————–

saranga.jpg

ఆ తిరుమల వేంకటేశ్వరుడికి రోజూ పూలతో అలంకరించుకుని కాస్త విసుగెత్తిందేమో ..మనం సాహిత్యాభిషేకం చేద్దామా! తలా రెండు సామెతల సంపెంగలో, సన్నజాజులో సమర్పించండి. మాల చేసి స్వామిని అలంకరిద్దాం!

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 1000 పైచిలుకు టపాలు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.

Posted in వ్యాసం | Tagged | 16 Comments

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా – 2

ప్రశాంతి ఉప్పలపాటి

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)

(ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఒకటవ తేదీన ప్రచురించబడింది.)

వెనుకబాటుతనం – లోపం ఎక్కడుంది?

ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సామాజికాంశాల మీద తరాల తరబడి కృషి చేస్తున్నా ఆశించదగ్గ స్థాయిలో పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు?

ఒక ఊరిని తీసుకుంటే, ఆ ఊరి అవసరాలకి అక్కడి ప్రజల చేయూతే సరిపోతుంది. ఉదాహరణకు ఊరి అవసరాలకి ఇంత మొత్తం అవసరమవుతుంది అనుకుంటే ఆ మొత్తం ఆ ఊరివారి వద్ద ఉండదా? ఉంటుంది. కానీ అందరూ కలిసి రానందువల్ల ఆయా పనులు జరగవు.

సేవా దృక్పథం ఉన్నవాళ్ళ మధ్య కూడా సహకారం, సమన్వయం లేకపోవడం పరిష్కారసాధనకు ప్రధాన అవరోధం. ప్రతి ఒక్కరు (అంటే సంస్థలు కానివ్వండి లేదా వ్యక్తులు కానివ్వండి) తమ చుట్టూ ఓ గిరిగీసుకుని ఆ వృత్తం లోపలే తిరుగుతూ ఉంటారు. అలా కాక అందరూ ఒక ఉమ్మడి వేదిక ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ, ఒకరి ప్రయత్నాలకు మరొకరు సహకారం అందించుకుంటే తప్పకుండా ఓ మంచి మార్పు వస్తుంది.

[అమెరికా సభ్యుడు కార్తీక్ జలమంగళ (కుడివైపు చివర)తో బెంగుళూరు సభ్యులు రాజశేఖరుడు, పవన్]

గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా ఈ సహకార ధోరణి మొదలైతే తొందరలోనే మనం అభివృధ్ధిని సాధించగలం. సేవ అంటే ఓ రోజు చెత్త ఊడ్చడమో, పండ్లు పంచడమో కాదు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, ఉత్సాహంగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండడం.

ఉదాహరణకు, హైదరాబాదు జనాభాను, ఇక్కడి కంపెనీలను, సంక్షేమ హాస్టళ్ళు, ఇతరత్రా సేవా సంస్థలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, ఇక్కడి అవసరాలకి, ఇక్కడి ప్రజల నిధులు సరిపోతాయి. కావాల్సిందల్లా అందరి సహకారమే. తమవంతు సహకారం అందించడానికి ప్రజలు కూడా ముందుకు వస్తారు. కాకపోతే మనం వారికి నమ్మకాన్ని కలిగించాలి. అదేమీ పెద్ద పని కాదు, కష్టం కాదు. మనం అలవాటుగా చేసే సహాయమే ఇంకొంచెం నేర్పుగా చేస్తే చాలు, అని.

ఈ ఆశయం దిశగా మా గ్రూపు ప్రయత్నాలు:

మేం చేసే పనుల వల్ల మాకు ఇప్పటికే చాలా మంది పరిచయం అయ్యారు. వారికి మేం ఇది వివరించినప్పుడు ఎంతో ఆసక్తి చూపారు. తప్పకుండా కలిసి పని చేద్దాం అనుకున్నాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబరు 2007 లో పూర్తి ప్రణాళికతో మేం పనులు ప్రారంభించగలం.
meeting1.JPG
[థలస్సీమియా సెషన్ అయ్యాక SHiFT సభ్యులతో కలిసి]

ఏమేం చేయొచ్చు:

1. హైదరాబాదులో ఎక్కడ ఎవరికి రక్తం అవసరమైనా నిముషాల వ్యవధిలో రక్తం అందించచ్చు.

2. అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో కూడా చికిత్స చేసుకునేందుకు డబ్బులు లేని పేద వారికి వారి సామాజిక స్థితిననుసరించి, వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలియచెప్పడం, అలాగే ఆసుపత్రుల వాళ్ళతో మాట్లాడి వీలైనంత తక్కువ మొత్తానికి ఆపరేషను చేయించడం, అందుకు తగిన ఆర్థిక సహాయం చేయడం.

3. చేనేత కార్మికులు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ప్రతి సంస్థలోని మానవ వనరుల విభాగం వారితో మాట్లాడి నెలకు ఒకసారి కానీ, రెండు సార్లు కానీ కార్యాలయాల్లో చేనేత వస్త్రాల ప్రదర్శన పెట్టించగలిగితే బాగుంటుంది. మనం అదే పనిగా వెళ్ళి కొనుక్కోవాలంటే కష్టం. కానీ మన దగ్గరకే వచ్చి అమ్మితే తప్పకుండా మనం కొంటాం. ఈ విధంగా చేనేత వారికి మనం సాయం చేయచ్చు. అలాగే ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవచ్చు – ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో చేనేత వాడకాన్ని పెంచాలి అని.

4. థలస్సీమియా లాంటి వ్యాధుల గురించి మనకు ఎక్కువ తెలీదు. అలాగే మన అవయవాల్ని దానం చేయగలగడం కూడా. ఇలాంటి వాటి అన్నిటి గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలి.

5. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, మానసిక, శారీరక వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వారికి జీవితం పట్ల ఆశ కలిగించాలి.

[డా. సుందర్ డా. ఉమా రతన్ తో కలిసి నిర్వహించిన మెడికల్ క్యాంపు]

6. పాత పుస్తకాలు, బట్టలు లాంటివి రెగ్యులర్ గా అందచేయచ్చు.

7. అన్నిటికీ మించి మనందరం ఒకటవాలి. ఈ విధంగా కలిసిపని చేయడం వలన అందరిలోను మనమంతా ఒకటే అనే భావన బలంగా వేళ్ళూనుకుంటుంది. మన తోటి వారి పట్ల ప్రేమానురాగాలు బలపడతాయి. వసుధైక కుటుంబమనే భావన ప్రాంతాల వారీగా పెంపొందుతుంది.

8. ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా సమాజం కొరకు కృషి చేయాలి. యథా రాజా తథా ప్రజా నే కాదు. యథా ప్రజా తథా రాజా గా మార్పు తేవాలి.

చేయి చాస్తేనే కదా తెలిసేది ఆశయం అందుబాటులో ఉందో, లేదో? అందరూ కలిస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఆయుధాలతో పోరాడడమే విప్లవం కాదు. ఆలోచనతో ఓ మంచి మార్పుకై పాటు పడడం కూడా విప్లవమే.

[ఆహార పంపిణీ]

మరువలేని సంఘటనలు:

1. శిరీష కేసులో (ఆరు సంవత్సరాల పాప – గుండె ఆపరేషను జరిగింది) ఆటో డ్రైవరు సగం డబ్బులు మాత్రమే తీసుకోవడం. కృష్ణా గారు, శిరీష కుటుంబ సభ్యులు ఆటోలో మాట్లాడుకుంటున్న మాటలు విన్న డ్రైవరు, ‘అయ్యా! నేను పేద వాడిని. మీ మాటలు విన్నాను. ఇంతకన్నా ఏమీ సహాయం చేయలేను ‘ అంటూ కేవలం సగం చార్జీ మాత్రమే తీసుకున్నాడు. ఈ విషయం కృష్ణా గారు చెప్పినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేనిది.

2. సాయి చరణ్ (4 నెలల బాబు, క్రిటికల్ కండిషనులో గుండె ఆపరేషను) కేసు ఒక హైలైటు. యుద్ధ ప్రాతిపదిక మీద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అనిల్ సంకల్పం, సహాయం నిజంగా అనితర సాధ్యమే. ఒక రోజంతా ఆసుపత్రిలో ఉండి, నాకు అప్ డేట్ చేస్తూ, టెస్ట్ లు జరిపిస్తూ, అలాగే డాక్టర్లతోను, నారాయణా హృదయాలయా అనుబంధ సేవా సంస్థ వారితో మాట్లాడడం. తలుచుకుంటే ఇప్పటికీ ఎంతో ఆనందం వేస్తుంది. ఆ రోజు అర్థరాత్రి వరకు మేలుకునే ఉన్నాము. క్రిటికల్ ఆపరేషను సక్సెస్ అయ్యింది. బాబు ఎంతో చురుకు కూడా. ఓ డిటెక్టివ్ స్టోరీ చదివినంత ఉత్కంఠతో ఉన్నాం మా గ్రూపు అందరమూ, ఏమవుతుందా అని.

[దీవెన]

3. దీవెన విషయం కూడా అంతే. 45 రోజుల పాటు వారు నిమ్స్ లో ఉన్నారు. ఆపరేషను రోజు నేను ఆసుపత్రిలోనే ఉన్నాను. ఆ పక్క నుంచి ఒకావిడ వచ్చి, ‘దీవెన కి సంబంధించిన వారు ఎవరు రండి ‘, అనగానే నా గుండె కొన్ని క్షణాల పాటు కొట్టుకోవడం మానేసింది. ఏమి చెప్తుందిరా దేవుడా అనిపించింది. వాళ్ళ నాన్నగారు వచ్చి డబ్బులు అడిగింది అన్నా కూడా తృప్తి లేదు. డాక్టరు చెప్తే బాగుండు అని ఒకటే టెన్షను. పర్లేదు బాగుంది అని తెలియగానే అప్రయత్నంగా ఓ కన్నీటి చుక్క, ఆనందబాష్పం అనచ్చు, రాలింది. మనసెంతో తేలిక పడింది.

4. దీవెనకు మొదట్లో చాలా సీరియస్ అయింది. నేను పరుగున వెళ్ళా, వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ ఫోన్ చేసిన వెంటనే. ఆయన మందులు కొనడానికి వెళ్ళారు. ఈ పిల్ల గొంతు దగ్గర తీవ్రంగా కొట్టుకుంటూ ఉంది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఏడుపొచ్చేస్తోంది. అలాగని ఏడిస్తే ఆ పిల్ల ఇంకా భయపడుతుంది. నిజానికి నన్ను చూడగానే ఆ పిల్ల కంట్లోంచి జల జలా నీళ్ళు రాలాయి. అక్కడి నర్సులు ఈ అమ్మాయి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నేనేమో తన చేతిని గట్టిగా పట్టుకుని మనసులో బాబాని తలుచుకుంటూ ఉండిపోయాను. ఓ పది నిముషాల కల్లా గొంతు కొట్టుకునే తీవ్రత తగ్గింది. అప్పుడు మొదటిసారిగా ప్రేమ విలువ అర్థమైంది నాకు. ఆ పిల్లకి, ఎందుకో తెలీదు కానీ, నేనంటే చాలా ఇష్టం. నేను రాగానే, నన్ను చూడగానే తనకి భయం పోయింది. మామూలు స్థితికి వచ్చింది.

5. దీవెన కేసులో ప్రతి ఒక్కరం చాలా శ్రద్ధ తీసుకున్నాం. ఎంత రాత్రైనా సరే తనని కలిసే వాళ్ళు వాణీ, చైతన్య. మా గ్రూపు సభ్యులే కాదు, సభ్యుల స్నేహితులు కూడా వచ్చారు.

6. లక్ష్మీ నరసమ్మ కేసులో వాణీ, చైతన్య, జయరాం, కెకె గారు ఇలా అందరూ, ఆఫీసులో ఎంత పని ఉన్నా సరే పర్మిషను తీసుకుని, ఈ పని చేసి, లేట్ నైటు వరకు ఆఫీసులో ఉన్నారు. శనివారాలు వెళ్ళి పని పూర్తి చేసుకున్నారు.

7. అన్నిటినీ మించిన హైలైటు మా గ్రూపు రెండవ వార్షికోత్సవమే. ఈ సారి మాకు మేమే సేవ చేసుకోవాలి అనుకున్నాం. అంటే అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేయడం. రతన్ గారు, ఉమ గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. వీడియో కూడా తీసారు. జూ పార్క్ లో జరుపుకున్నాం. మేమందరమూ ఒక కుటుంబం అన్నట్టుగా జరుపుకున్నాం.
ద్వితీయ వార్షికోత్సవం
[ద్వితీయ వార్షికోత్సవం]

చేయలేకపోయినవి:

మా గ్రూపు మొదటి యానివర్సరీకి పూర్వం టీవీ లో (ఏ ఛానలో గుర్తు లేదు) ఓ యువకుడి మరణం గురించి చూసాను. అతను బెంగుళూరు వాసి. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. తరచూ రక్తదానం చేసేవాడు. తను చేయడమే కాదు, తన స్నేహితులు, తోటి ఉద్యోగస్తుల చేత కూడా చేయించేవాడు. అతనికి యాక్సిడెంట్ అయింది. చాలా సేపటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. తరువాత ఏదో ఆసుపత్రికి తీసుకెళితే తన గ్రూపు రక్తం దొరకలేదు. కేవలం తన గ్రూపు రక్తం దొరకనందువల్లే తను చనిపోయాడు. ఎంత బాధాకరమైన విషయం !! తరచూ రక్తదానం చేసే వ్యక్తి రక్తం దొరకక చనిపోవడమా!!

నేను అతని పేరు, ఇతర వివరాలు గుర్తుపెట్టుకోలేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు అన్నం తింటూ చూసాను. కనీసం ఏ ఛానల్ లో చూసానో కూడా గుర్తు లేదు. కానీ అతని వివరాల కోసం బాగా ప్రయత్నించాను. మా బెంగుళూరు సభ్యులందరినీ అడిగాను, స్నేహితులని అడిగాను. వివరాలు దొరకలేదు. మా గ్రూపు మొదటి వార్షికోత్సవం రోజున బెంగుళూరులో అతని ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులకు ఒక మెమెంటో ఇవ్వాలి అనుకున్నాను. వాళ్ళ కొడుకు మామూలు వ్యక్తి కాదు, ఎందరికో స్ఫూర్తి. మేము అతన్ని గుర్తుపెట్టుకున్నాము అని తెలియచెప్పి వారికి కొంత ఓదార్పు నిద్దామనిపించింది. అలాగే అతని గురించి, అతను చేసిన సేవ గురించి, ఎందువల్ల అతను చనిపోవాల్సి వచ్చింది ఇత్యాది వాటికి విరివిగా ప్రచారం కల్పించి, ఆయన మరణించిన రోజుని ఓ స్మృతి దినంగా ప్రకటించాలి. ఆ రోజున మన దేశ ప్రజలందరూ ప్రమాణం చేయాలి. అతని లాగా రక్తం దొరకక చనిపోయే దుస్థితి ఇంకెవ్వరికీ కలగనివ్వమని. ఇది నా కోరిక.

ఎవరికి ఆ వ్యక్తి గురించి తెలిసినా చెప్పాలని విజ్ణ్జప్తి చేస్తున్నాను. ఎప్పటికైనా ఆయన వివరాలు సేకరించి, అనుకున్నది సాధించాలి. అందుకు మీ అందరి సహకారం మాకు కావాలి.

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)

“When you want something, all the universe conspires in helping you to achieve it.” అని బలంగా నమ్మే ఉప్పలపాటి ప్రశాంతి To Make A Difference గ్రూపు వ్యవస్థాపకురాలు. ప్రశాంతి తల్లిదండ్రులు విజయలక్ష్మీ, రాం ప్రసాద్. తమ్ముడు శాంతారామ రాధాకృష్ణ. స్వస్థలం నెల్లూరు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం. ఇన్నోమైండ్స్ సాఫ్ట్ వేర్ లో టెక్నికల్ రైటర్ . మనసు స్పందించినప్పుడు తనకు కలిగే భావాలను రాసుకోవడమన్నా,ఒంటరిగా గడపడమన్నా చాలా ఇష్టం. నెల్లూరంటే మరీ అభిమానం.

ఎం. ఎస్ . సి. కంప్యూటర్ సైన్స్, ఎం . ఏ . ఇంగ్లీషు చదివిన ప్రశాంతి (లేఖిని వాడి) యూనికోడ్ తెలుగులో చేసిన మొట్టమొదటి రచన ఇది. ఇక మీదట తన బ్లాగును (http://prasanthi.wordpress.com/) తరచు అప్ డేట్ చేస్తానంటున్నారు.

Posted in వ్యాసం | Tagged | 2 Comments

మృతజీవులు – 2

గొగోల్ స్వయంగా రూపొందించిన మృతజీవులు ముఖచిత్రం

dsmast.JPG

[మొదటి వరుసలో రష్యన్ భాషలో చిన్న అక్షరాల్లో ఉన్నది “చిచికోవ్ సాహసాలు”. దానికింద కాస్త పెద్దక్షరాల్లో “మృతజీవులు”. దానికింద అన్నిటికంటే పెద్దక్షరాల్లో “కావ్యగాథ” అని, ఇంకా కింద చిన్నక్షరాల్లో “గొగోల్” అనే పేరు, అట్టడుగున “1842”.

పైనున్నది చిచికోవ్ బండి, గిలకబావితో సామాన్యంగా కనిపించే ఒక రష్యన్ ఎస్టేటు, వైను బాటిళ్ళు – గ్లాసులు, ఒక టవరు. వాటికింద మృతజీవులు అనే పేరుకు ఎడమపక్కన ఆహారపదార్థాలు, కుడిపక్కన నాట్యమాడే రైతు, చుట్టూ చిన్న చిన్న కపాలాలు. “కావ్యగాథ”కు ఇరుపక్కలా కవిత్వాన్ని సూచించే విధంగా ఒక దేవుడి తల, లైర్ (lyre – ఒక సంగీత వాయిద్యం), మరో వాయిద్యపరికరం. దిగువన ఎడమపక్క వైను, తిండి, బాలలైకా (Balalaika); కుడిపక్కన నాట్యమాడే జంట. అట్టడుగున ఒక తల. ఈ పుస్తకంలోలాగే రష్యన్ల జీవితాల్లో కవిత్వము, సజీవము-నిర్జీవము కలగలిసిపోయి ఉంటాయి. దీన్నంతటినీ ఆవరించుకుని ఉన్న డిజైను గొగోల్ రచనాశైలికి ప్రతీక.]
(http://www.macalester.edu నుంచి)

వెయిటర్ ఇంకా ఈ వివరాలని కూడబలుక్కుని చదువుకుంటూండగానే పావెల్ ఇవానవిచ్ చిచికోవ్ బస్తీ పరికించ వెళ్ళాడు. అది ఇతర బస్తీలకు ఏ విధంగానూ తీసిపోకపోవటంచేత అతనికి నచ్చినట్టే కనబడింది. ఇటుకలతో కట్టిన ఇళ్ళమీది పసుపుపచ్చ రంగు కళ్ళు చెదిరేలాగుంది. కొయ్యతో కట్టిన ఇళ్ళు నల్లగా ఉన్నాయి. ఇళ్ళు ఒక అంతస్తువీ, రెండంతస్తులవీ, ఒకటిన్నర అంతస్తువీనూ. ప్రతి ఇంటికీ విధిగా పొట్టికిటికీలు పెట్టి ఉన్నాయి. మారుమూల ప్రాంతాల ఇళ్ళు కట్టేవాళ్ళకవి చాలా ఇష్టం.

బస్తీలో కొన్ని జాగాలలో వీధులు పొలాలంత ఉండటం చేతా, ఎడతెగని చెక్కకంచెల మూలానా ఇళ్ళు కాన రావటం లేదు; మరికొన్ని జాగాలలో ఇంటిమీద ఇల్లున్నది, ఇటువంటి చోట్ల సంచలనమూ, సందడీ ఉన్నది. షాపులకు సైన్ బోర్డులున్నాయి. వాటిమీద రొట్టె చుట్టలో, బూట్లో వేసి ఉన్నాయి, అవి వానకు దాదాపు మాసిపోయి ఉన్నాయి. ఒకచోట కుళాయిలదుకాణం ఉన్నది. బయట ఇలా రాసి ఉన్నది: “వసీలిఫ్యోదరన్, పరదేశి”. మరొక చోట ఒక బిలియర్డ్ టేబుల్ బొమ్మ ఉన్నది. దానివద్ద ఇద్దరు ఆటగాళ్ళు చూపబడ్డారు.

ఎక్కడ చూసినా పేవ్‌మెంట్లు ఛండాలంగా ఉన్నాయి. అతను నగరపు పార్కు లోకి కూడా తొంగి చూచాడు. అక్కడి చెట్లు పలుచ పలుచగానూ వడలిపోయీ ఉన్నాయి. అతడు ఒక పోలీస్ వాణ్ణి అడిగి చర్చికీ, ప్రభుత్వ భవనాలకీ, గవర్నరు గారుండే చోటికీ దారులు వైనంగా తెలుసుకొని, ఊరిమధ్యగా ప్రవహించే నదిని చూడబోయాడు. దారిలో ఒక స్తంభానికి అంటించిన పోస్టర్ కనబడితే, గదికి వెళ్ళాక తాపీగా చూసే ఉద్దేశ్యంతో దాన్ని చించాడు. పావెల్ ఆ ప్రదేశమంతా వివరంగా జ్ఞాపకం పెట్టుకోదలచిన వాడిలాగా మరొక్కసారి కలయజూసి, హోటల్ చేరుకుని నేరుగా తన గదికి వెళ్ళాడు. మెట్లెక్కేటప్పుడు వెయిటర్ సాయపడ్డాడు.

అతను టీ తాగి, బల్ల దగ్గర కూచుని, కొవ్వొత్తి ఒకటి తెప్పించుకొని, జేబులోనుంచి పోస్టర్ పైకి తీసి దీపం దగ్గరగా పెట్టి, కుడికన్ను కాస్త చిట్లిస్తూ చదువసాగాడు. అయితే అందులో గొప్ప విషయాలేమీ లేవు. కొట్జెబుయె రచించిన నాటకంలో పప్ల్యోవిన్ రోలా పాత్ర, కుమారి జాకబ్ కోరా పాత్ర ధరిస్తున్నారు, తదితర పాత్రలు ధరించే వారు ఇంకా అనామకులు. అయినా అతడు అందరి పేర్లు చదవటమే గాక టిక్కెట్టు ధరలు కూడా చదివి ఆ పోస్టర్ అచ్చు వేసినది రాష్ట్ర ప్రభుత్వ శాఖా ముద్రణాలయం లోనని తెలుసుకున్నాడు. ఆ తరువాత పోస్టరును తిప్పి వెనక ఏమన్నా ఉందేమోనని చూశాడు కాని అక్కడ ఏమీ లేకపోవడంచేత కళ్ళు నలుచుకుని, పోస్టరును భద్రంగా మడిచి అతని పెట్టెలో పెట్టుకున్నాడు. చేతికి అందినదల్లా అందులో పెట్టటం అతనికి అలవాటు. ఒక ప్లేటు లేగ మాంసంతోనూ, లోటాడు కాబేజీ సూప్ తోనూ గాఢమైన నిద్రతో ఆ రోజు ముగిసిందనుకుంటాను.

మరునాడంతా అతడు పట్నంలో ఉన్న ప్రముఖులందరినీ చూడబోయాడు. గవర్నరుగారి దర్శనం చేసుకున్నాడు. ఆయన కూడా చిచీకవ్ లాగే అంత లావూ, అంత సన్నమూ కాని మనిషి. ఆయన మెడలో అదివరకే “అన్నా” పతకం కూడా ఉంది. ఆయనకు “నక్షత్రం” కూడా బహుకరించబడనున్నట్లు చెప్పుకున్నారు. అయితే ఆయన మటుకు చాలా సాధారణ మనిషి. భేషజం లేని వాడు, అప్పుడప్పుడూ చిల్లుల గుడ్డమీద ఎంబ్రాయిడరీ చేసేవాడు కూడానూ. తరువాత అతను డిప్టీగవర్నరుగారింటికి వెళ్ళాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్నూ, న్యాయస్థానాధ్యక్షుణ్ణీ, పోలీసు పెద్దనూ, అబ్కారీ పన్ను కంట్రాక్టరునూ, ప్రభుత్వ ఫ్యాక్టరీల సూపరింటెండెంటునూ సందర్శించాడు. అతను చివరకు మెడికల్ బోర్డ్ ఇనస్పెక్టరునూ, నగర వాస్తు ప్రవీణుణ్ణీ చూసి దణ్ణాలు పెట్టాడు.

తాను కలుసుకున్న ప్రముఖులతో సంభాషించేటప్పుడతను ఎంతో నేర్పుగా వారిని ఉబ్బవేశాడు. అతను గవర్నరుగారితో మాట్లాడేటప్పుడు, మాటల సందర్భాన అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయాణిస్తుంటే స్వర్గంలో సంచరిస్తున్నట్టుగా ఉన్నదనీ, ఎక్కడ చూసినా రోడ్లు పట్టుపరిచినట్టుగా ఉన్నాయని, సమర్థులైన పాలకులను నియోగించిన ప్రభుత్వం ప్రశంసనీయమైనదనీ అన్నాడు. పోలీసు పెద్దతో మాట్లాడేటప్పుడు నగర పోలీసు శాఖను ప్రశంసించాడు. డిప్టీ గవర్నరూ, న్యాయస్థానాధ్యక్షుడూ, సివిల్ ఉద్యోగులే అయినప్పటికీ వారితో మాట్లాడేటప్పుడు రెండు సార్లు నోరుజారి “యువర్ ఎక్సిలెన్సీ” అని సంబోధించేసరికి వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బయారు. దీనికంతటికీ పర్యవసానం ఏమిటంటే, గవర్నరు గారు ఆ సాయంత్రమే తన ఇంట్లో ఏర్పాటైన “పార్టీ”కి అతన్ని ఆహ్వానించాడు. మిగిలిన అధికారులు కూడా అతన్ని భోజనానికీ, “బోస్టన్” ఆడటానికీ, టీకీ వేరువేరుగా ఆహ్వానించారు.

అతడు తన గురించి అట్టే చెప్పుకోకుండా తప్పుకున్నాడు. చెప్పినది కాస్తా అందీ అందకుండా, ఎంతో వినయంగలవాడిలాగా, పుస్తక భాష అనిపించేలా చెప్పాడు: తానొక అనామకుడు, ఖ్యాతికి దూరమైన వాడు; చాలా రకాల అనుభవాలు చూశాడు, న్యాయం కోసం కష్టాలకు గురి అయినవాడు; తనకు చాలామంది శత్రువులున్నారు. కొందరు తన ప్రాణాలను కాజేయ జూసారు కూడా; ఇప్పుడు ప్రశాంత జీవనం గడపాలన్న కోరికతో స్థిరపడిపోవడానికి తగిన చోటు వెతుకుంటూ ఈ ఊరు వచ్చాడు గనుక, ఇక్కడి పెద్దలనందరినీ సందర్శించటం తన కర్తవ్యం. అతడు తనను గురించి ఆ ఊరి వాళ్ళకు చెప్పుకున్నది ఇంతే.

త్వరలోనే అతను గవర్నరుగారి పార్టీకి హాజరయ్యాడు. ఇందుకు తయారుకావడానికి అతనికి రెండు గంటలకన్నా ఎక్కువకాలం పట్టింది, ఈ సారి అతను మామూలు కన్న ఎక్కువ శ్రద్ధగా ముస్తాబయ్యాడు. భోజనానంతరం చిన్న కునుకు తీసి లేచి సబ్బూ, నీరూ కావాలన్నాడు. తన బుగ్గలను నాలుకతో లోపలి నుంచి పైకి తోస్తూ చాలాసేపు సబ్బువేసి రుద్దాడు; తరువాత వెయిటర్ భుజంమీదనుంచి తువాలు తీసుకుని, వాడి ముఖాన రెండుసార్లు గట్టిగా గాలి వదలి, చెవుల వెనుక ప్రారంభించి తన మొహాన్ని అన్ని వైపులకూ తుడుచుకున్నాడు; తరువాత అద్దంముందు నిలబడి రొమ్ము మీద షర్టు అమర్చుకుని, ముక్కులోనుండి బయటికి వచ్చే రెండు వెంట్రుకలను పీకేసి, ఎర్రరంగు డ్రెస్ కోటు, పొట్టిది ధరించాడు.

ఇలా ముస్తాబై అతను బండీలో ఎక్కి బయలుదేరాడు. వీథులు అతి వెడల్పుగా ఉన్నాయి. అక్కడక్కడా కిటికీలలో నుండి వచ్చే వెలుగు తప్ప రోడ్లపైన వెలుగు లేదు. గవర్నర్ గారి భవనం దేదీప్యమానంగా ఉన్నది. వెలిగించిన దీపాలతో ఎన్నో బళ్ళు వచ్చి వున్నాయి. వాకిట ఇద్దరు పోలీసులు గుర్రాలెక్కి ఉన్నారు, దూరాన కాసా* వాళ్ళు కేకలు పెడుతున్నారు – ఇంతెందుకు, సమస్తమూ ఉండవలసిన తీరుగా ఉన్నది.

(ఇంకా ఉంది)
*కాసా వాళ్ళు = దాసులు లేక వెట్టివాళ్ళు

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 2

నేను చదివిన నవీన్

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com)

ఆధునిక తెలుగు సాహిత్యం లో నవీన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ” అంపశయ్య ” తో మొదలై ఇప్పటికీ సాగుతూ నవల , కథ , విమర్శ ఇలా వేర్వేరు పాయలు గా చీలినా ఒకటే అంతరాత్మ తో ఇంకా గలగలమంటూ ప్రవహిస్తున్న నది నవీన్. నేను సాహిత్యం, అందునా తెలుగులో, చదివింది తక్కువ. కానీ చదివినంత మటుకు ఇటీవలి కాలం లో విరివిగా చదివింది నవీన్ నే. నవీన్ గారు చలాన్ని గురించి రాసిన వ్యాసాలు చదివాక నేనూ నవీన్ గురించి రాయడానికి ప్రయత్నిస్తాను అనుకున్నా. ఆ ఆలోచనకి అక్షరరూపమే ఈ వ్యాసం.

మొదట నవలల సంగతి: ” అంపశయ్య ” గురించి , అది సృష్టించిన సంచలనం గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ” చైతన్య స్రవంతి” ని సామాన్యుల ముంగిట నిలిపి అందులోని అందాన్ని ఆవిష్కరించడమేగాక , జీవితమొక చైతన్య స్రవంతి అన్న భావాన్ని కలిగించారు ఆ నవలతో. సాధారణ మైన భావాలకు సాధారణమైన భాష లోనే అక్షరరూపం ఇవ్వడం, అక్కడక్కడా తొంగి చూసే కవితాత్మకత ఈ అంపశయ్యను చదివింపజేస్తాయి. అయితే అతిగా ఆంచనాలు వేసుకున్నందువల్లో ఏమో మరి నన్ను ఈ నవల అంతగా తృప్తి పరచలేక పోయింది.

ఇక ” కాలరేఖలు ” త్రయం. 1940 ల నుంచి 1990 ల దాకా తెలంగాణా ప్రజా జీవితాన్ని చిత్రిస్తూ రాసిన నవలా త్రయం. వీటిలో ” కాలరేఖలు” మొదటిది. కథానాయకుడు రాజు స్కూల్ రోజుల్లో నడిచిన కథ. “చెదిరిన స్వప్నాలు” రెండోది. “బాంధవ్యాలు” మూడోది. మూడింటిలోనూ నేను ప్రధానంగా గమనించినది – సామాజిక చిత్రణా , ఒక వ్యక్తి కుటుంబ చిత్రణా , జనం ఆలోచనా విధానం వెరసి ప్రజా జీవితమూ. సామాన్యులే ఈ త్రయంలో నాయకులు. వాళ్ళ కష్ట -నష్టాలు , కోప – తాపాలు , భయాలు , నవ్వులూ , మాటలు , చేతలూ , నమ్మకాలూ – ఇవన్నీ కలిపితే “కాలరేఖలు” , “చెదిరిన స్వప్నాలు” , “బాంధవ్యాలు” – మూడు నవలలు అవుతాయి. వరుసగా ఇవి మూడూ చదివితే కథానాయకుడు మన కళ్ళ ముందు పెరిగిపెద్దవాడైన అనుభూతి…. రాజు (బాంధవ్యాలు లో నరేందర్) జీవితంలో ప్రతి మెట్టు నూ చదువరి రాజుకి సన్నిహితంగా అనుభవించిన అనుభూతి కలుగుతుంది. ఇంతకంటే సామాన్యుడి పదజాలంలో గొప్పరచన అన్న పదానికి మంచి అర్థం ఉంటుందా ?? బాంధవ్యాలు కి వచ్చేసరికి పట్టు తగ్గి కాస్త నిరాశ కలిగించినా అది కూడా చదివించే నవలే.

” రక్తకాసారం” – ఓ ప్రయోగం లా తోస్తుంది. ఆసక్తి కరమైన చర్చలు , అక్కడక్కడా కాస్త వ్యంగ్యం , ఆలోచింపజేసేలా ఉన్న శైలి , రచయిత ఎక్కడా తన అభిప్రాయాలు మనపై రుద్దడానికి ప్రయత్నించకపోవడం నాకు నచ్చాయి ఈ పుస్తకంలో. ఇదే నవీన్, ఇన్ని మంచి నవలలు రాసిన నవీన్ “సంకెళ్ళు”, “చెమ్మగిల్లని కన్నులు”, “తీరని దాహం”, “సౌజన్య”, “మౌన రాగాలు” – లాంటి నవలలు రాసారు అంటే ఓ పట్టాన నమ్మాలనిపించదు. “తారు – మారు”,”విచలిత” వంటి నవలల్లో సమస్య ని బాగా చర్చించినా చూపిన పరిష్కారం అంత హర్షింపదగ్గదిగా తోచదు నాకు. ఈ రెంటిలోనే ఎందుకో నాకు నవీన్ పై చలం ప్రభావం ఎక్కువేమో అనిపించింది. ఆయన చలం పై రాసిన వ్యాసాలు చదివాక అది నిజమే అని అనిపించింది.

“చీకటి రోజులు” నవల ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల పై రాసిన నవల. అనుకుంటా నవీన్ రచనల్లో నేను ఆంగ్లానువాదం చదివింది ఇదొక్కటే. పూర్తిగా డైరీ లా అనిపించింది. అయినా కూడా చదవడానికి బానే ఉండింది. కానీ, ఎందుకో దీన్ని గురించి ప్రత్యేకంగా తలుచుకునేంత గొప్పగా అనిపించలేదు.

కథలు – నవీన్ కథలలో నవలల్లో ఉన్నంత పట్టు లేదు అనిపించింది. కొన్ని కథలు డాక్యుమెంటరీల్లా ఉన్నాయి. వస్తు వైవిధ్యం లేక పోవడం దీనికి ఓ కారణం అయి ఉండవచ్చు. అయితే ఇవి అన్నీ కూడా తెలంగాణా జీవితం పై నవీన్ కి ఉన్న స్పష్టమైన అవగాహన ను తెలియజేస్తాయి.

వ్యాసాలు – నవీన్ వ్యాసాలు అద్భుతంగా రాస్తారు. సాహిత్యం ధోరణుల గురించీ, ప్రముఖుల శిల్పం గురించీ – ఇలా ఎన్నో విషయాల గురించి చక్కని పరిచయం కలుగజేస్తాయి. నవీన్ విశ్లేషణలు ఆయన ఎంతగా చదివారో, ఎంతగా గమనించారో చెప్పకనే చెబుతాయి. నవలల్లో లేని చమత్కారం, వ్యంగ్యం వ్యాసాల్లో చాలనే ఉన్నాయి. ఈ విమర్శలు సాహిత్యాభిమానులకు , కొత్తగా చదవడం మొదలుపెట్టిన వారికీ – ఇద్దరికీ చాలా ఉపకరిస్తాయి.

అయితే ఆద్యంతమూ నేను గమనించింది నవీన్ హాస్యానికి తగిన స్థానం ఇవ్వకపోవడం. నిజ జీవితంలో సందర్భవశాత్తూ తొంగి చూసే హాస్యమైనా కనబడదు ఆయన నవలల్లో. ఈ కారణం వల్లే నవలలు రాసిన నవీన్, వ్యాసాలు రాసిన నవీన్ ఒకరేనా అని సందేహం వచ్చింది – వ్యాసాల్లోని చమత్కారమూ వ్యంగ్యమూ చూసాక. వర్ణనల్లో కొన్ని వర్ణనలు మిగతా వర్ణనల మీద ఎక్కువ స్థానం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రతి నవల లోనూ సమాజం గురించి ఆలోచనలూ , సమస్యల గురించిన ఆవేదనలూ, పరిష్కారం కోసం అన్వేషణా కనిపిస్తాయి. చక్కని అబ్జర్వేషన్ కనిపిస్తుంది చాలా చోట్ల. కొన్ని చోట్ల అర్థం కాని వర్ణనలూ ఉన్నాయి … ఉదాహరణ కి “మనోరణ్యం” లోని “…ఎందుకనో గానీ ఆమె కళ్ళల్లో విపరీతమైన అలసటా విసుగూ కనిపిస్తాయి. అలా కనిపించడం వల్లనేమో ఆమె మామూలు స్త్రీలకంటే కొంత ఉన్నతమైన సంస్కారం కల్గినదానిలా కనిపిస్తుంది. ” వంటివి.

మొత్తానికి నేను పట్టుబట్టి వరుసగా నవీన్ వి చదవాలి అనుకోకపోయినా కూడా ఒక దశ లో వరుసగా అవే చదివాను. బోరు కొట్టించినవి ఉన్నా కూడా ఇదో మంచి అనుభవం. విమర్శకుడిగా నవీన్ రచనలు ఎంతగా చదువరులకి ఉపకరిస్తాయో చాలా వరకు ఆయన నవలలు అంతగా చదివిస్తాయి. నా అనుభవంలో నేను నవీన్ ని నాలుగు రకాలుగా చూస్తున్నాను – చదువరి, విమర్శకుడు, నవలారచయిత, కథకుడు. ఇదే వరుస నాకు నచ్చిన వరుస కూడా.

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com)

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రచనల్లో 2 కథలు పొద్దులో, 2 కథలు ఈమాటలో, మరికొన్ని కథలు, కవితలు తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.

Posted in వ్యాసం | 3 Comments

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా

ప్రశాంతి ఉప్పలపాటి

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)

చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……ఏమిటో ఆమె మాటల్లోనే:

నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. ఏదైనా మంచి పని చేయాలని ఉండేది. ముందు నిలబడే చొరవ లేక ఎవరైనా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను పని చేద్దాం అనుకునేదాన్ని. మొత్తానికి ఏమీ చేయకుండానే కాలం గడిచిపోయింది.

కార్గిల్ యుద్ధం అప్పుడు మాత్రం ఏదైనా చేయాలనే తపన నా భయాలనన్నిటినీ అధిగమించి డబ్బులు సేకరించి పంపేలా చేసింది. ఇంకోసారి పేపరులో స్రవంతి అనే అమ్మాయికి రక్తమార్పిడి కోసం డబ్బులు అవసరమని చదివి నెట్ స్నేహితులందరికీ మెయిల్స్ పంపితే తక్షణమే స్పందించి వారి సహాయాన్నందించారు. మంచి పని ఏదైనా సరే అనుకున్న వెంటనే అమల్లో పెట్టేయాలి, తోడ్పాటు దానంతటదే అందుతుందని అర్థమయ్యేలా చేసారు.
group-photo_2.jpg
అయినా నాలో పెద్ద మార్పు లేదు. ఎందుకంటే అవి అన్నీ తాత్కాలిక స్పందనలే. ఆ సమస్య పరిష్కారాం కాగానే, హమ్మయ్య ఓ మంచి పని చేయగలిగాననే ఆనందం తప్ప, ఇంకా ఏమి చేయగలనా అని ఆలోచించలేదు. అప్పట్లో ఉద్యోగరీత్యా నాకు మంచి బ్రేక్ రాలేదు. మానసికంగా కూడా నేను సరిగా లేను.

“నేను జీవితంలో ఇంకా నిలదొక్కుకోలేదు.”
“కొంత వెనకేసాక సేవ చేస్తాను.”
“నాకు అంతటి సామర్ధ్యం ఉందా?”
“నాకు సమయం చాలదు.”
“ఎవరైనా ముందు ఉంటే నేను చేస్తాను.”

ఇలాంటి పలాయనవాదంతో గడిపేదాన్ని. ఎప్పటికైనా చేస్తానులే, సేవ చేయాలంటే పక్కా ప్రణాళిక ఉండాలి అని నన్ను నేను సముదాయించుకునేదాన్ని.

అలాంటి సమయంలో నాలో మార్పు తెచ్చింది ఓ ప్రయత్నం. చేద్దాంలే, చూద్దాంలే, పక్కా ప్రణాళిక వేసుకుందాం ఇలా అనుకుంటే అసలు మొదలే కావు. ఏదో ఒకటి మనం చేయలేనంత మాత్రాన మిగతావేవీ చేయలేమని కాదు. ఫలానాదేదో చేశాక, సాధించాక ఇంకేదో చేయడం కాదు. అసలు మనం ఉన్న పరిస్థితుల్లో, మనకు ఉన్న వనరులను ఉపయోగించుకుని పని చేసేటట్టు ఉండాలి. ఏవో లేవు అనుకోకూడదు, అని నేర్పిందో సందర్భం.

అర్థరాత్రి …… అపురూప క్షణాలు

2005 ఫిబ్రవరి 4 రాత్రి, ఈనాడు హెల్ప్ లైన్ లో ‘పదకొండేళ్ళ బాలిక అస్మా కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ కి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది’ అని చదివి మనసాగక తెలుగుపీపుల్ డాట్ కాం చర్చావేదికలో పోస్ట్ చేసాను. మనం అందరం కలిసి ఎంతో కొంత పంపుదాం అని. ఏదో పోస్ట్ చేసానే కానీ ఎంతమంది స్పందిస్తారు అనేదాని మీద నాకు ఎలాంటి ఆలోచన లేదు. నేను ఒక్కదాన్నే ఇవ్వగలిగే మొత్తం కంటే, ఏ కొంచెం ఎక్కువ అందచేయగలిగినా చాలు అనుకున్నాను.

పొద్దున లేచి చూస్తును కదా, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. చాలా మంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. డబ్బులు ఎలా పంపాలి అని అడిగారు. భాస్కర్ గారైతే అప్పటికే ఎమ్మార్వో గారికి డబ్బులు పంపేసారు. నాకు కొంచెం ఉత్సాహం వచ్చి, కొద్ది రోజుల వ్యవధి పెట్టుకుని ఎంత సేకరించగలిగితే అంత ఒక్కసారే పంపుదాం అని చెప్పాను. అలా మొదలైన ప్రయత్నం, ఇంకా బాగా సహాయం చేయగలమా అనే ఆలోచనతో మొదలై చివరికి మేమే బాధ్యత తీసుకునే స్థితికి వచ్చింది. ఎంతో అనుభవం ఈ మొదటి కేసులోనే. ఎలాగైతేనేమి ఆ పాపకి ప్రాణభయం లేదు, ఆపరేషను అవసరం లేదు, ఫిజియోథెరపీతోనే నయం చేయచ్చు అని విన్నాక ప్రాణం లేచొచ్చింది.

అస్మా విషయం విజయవంతంగా ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు నాలో చాలా అంతర్మథనం జరిగింది. ముందు నిలబడగలిగితే, కొంచెం బాధ్యత తీసుకుంటే మనకు చేయూతనిచ్చేవారు ఎంతమంది ఉన్నారు, ఇతరులకి సహాయపడడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు అని అనిపించింది. అందరూ ఒకలాగే ఆలోచిస్తారు. ఎవరో ముందు నడిస్తే తాము ఎంతటి పని చేయడానికైనా సిద్ధపడతారు. ఒకసారి మనం ముందు నిలబడితే చాలు, తరువాత ఇక నడవనవసరం కూడా లేదు, మన తోటి వారే మనల్ని ముందుకు తీసుకెళతారు. ఇది నా అనుభవం నాకు తెలిపిన నిజం.

ఐతే ఆ బాధ్యత తీసుకోవడానికి ముందు వ్యక్తిగతంగా నా లోటుపాట్లు ఏమిటి, నలుగురికీ ముందు నిలబడగలగడానికి నా అర్హత ఏమిటి అనేది నా పరంగా ఎలా ఉంది, నలుగురి దృష్టికోణంలో ఎలా ఉంది అని ఆలోచించాను. అంతమంది నన్ను నమ్ముతున్నప్పుడు, నా మాటకు విలువిచ్చి మంచి పనికి తోడుగా వస్తున్నందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా అనిపించింది. నన్ను పట్టి పీడించే అపోహలు, నా పట్ల, నా సమర్థత, అర్హతల పట్ల నాకు గల భావాలు అన్నిటినీ ఆ నాటి ఆ స్ఫూర్తి అధిగమించింది.

సరే. ఈ సాయాన్ని ఇలాగే కొనసాగించాలి, ఇలా ముందుకు వచ్చిన వారిని వెనక్కి పోనీయకుండా ఇంకా ముందుకు సాగాలి అనుకున్నంత వరకు బాగుంది. ఎలా సాగాలి, ఇది తదుపరి ప్రశ్న. ఇలాంటి పనులు చెయ్యాలనుకున్నప్పుడు మొదట ఎదురయ్యే పెద్ద సమస్య కమ్యూనికేషన్. అవసరమొచ్చినప్పుడల్లా ఒక్కొక్కరికి మెయిల్స్ పంపడం చాలా కష్టం. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అలా కాకుండా ఒక మెయిలింగ్ గ్రూప్ ప్రారంభించినట్లైతే ఆ గ్రూప్ కు నేను మెయిల్స్ పంపుతూ ఉంటాను, ఇష్టమైన వాళ్ళే అందులో సభ్యులుగా చేరుతారులే అనుకున్నాను. గ్రూప్ ప్రారంభించాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఆ గ్రూప్ కి పేరు ఏమి పెట్టాలి అనే ప్రశ్న ఎదురైంది.

పేరులో ఏముంది!!

నెల్లూరులో శ్రీ పెరుగు రామకృష్ణ దంపతులు, శ్రీమతి జయప్రద గారి ప్రోద్బలంతో, మిగతా కవులందరి ప్రోత్సాహంతో నేను రెండు మూడు కవి సమ్మేళనాల్లో పాల్గొనడం జరిగింది.

శ్రీమతి పెరుగు సుజనారామం గారి శ్రేయోభిలాషి ఒక రిటైర్డ్ అంకుల్ ఉండేవారు. సాహిత్యం అంటే తనకి ఎంతో ఇష్టం. ఆయనకు నా కవితలు నచ్చాయి. నన్ను రామకృష్ణ గారి ఇంటిలో కలిసారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము అందరమూను. ఆ తరువాత ఒకసారి ఆయన తను కొత్తగా చదివిన పుస్తకం గురించి చెప్తూ, తనకు బాగా నచ్చిన కథ చెప్పారు:

సముద్రంలోని ఆటుపోట్ల వల్ల ఎన్నో స్టార్ ఫిష్ లు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. కొన్ని కిలోమీటర్ల మేర పరుచుకున్న ఒడ్డంతా స్టార్ ఫిష్ లే ఉన్నాయి. ఒకతను ఒక్కొక్క స్టార్ ఫిష్ ను తీసుకుని సముద్రంలోకి విసరసాగాడు. ఓ బాటసారి అతన్ని చూసి దగ్గరకి వెళ్ళి ఇలా అడిగాడు:

‘చూడు ఒడ్డు ఎంత పొడవుగా ఉందో. ఎన్ని వేల స్టార్ ఫిష్ లు ఉన్నాయో. ఒక్కొక్క దాన్ని అలా విసరడం వల్ల ఈ సమస్య తీరుతుందా, పరిస్థితిలో మార్పు వస్తుందా! ఎందుకీ వృథా ప్రయాస!’.

అప్పుడు అతను ఇతనికేసి చూసి, మరలా ఇంకొక స్టార్ ఫిష్ ను చేతిలోకి తీసుకుని ‘దీని పరిస్థితిలో మార్పు వస్తుంది’ అంటూ సముద్రం లోకి విసిరేస్తాడు.

చాలా అద్భుతమైన కథ అనిపించింది. ఆ రోజు అంకుల్ చెప్పిన ఆ కథ నాకు మరలా గుర్తొచ్చింది. మనందరి మనస్తత్వానికి సరిపోయే కథ. సమస్య పెద్దదైనప్పుడు, మనం చేసే ఓ చిన్న ప్రయత్నం వల్ల ఏమి ప్రయోజనం అనే నిరాశావాదం, పలాయన ధోరణే ఎక్కువ ఉంటుంది సమాజంలో.

అంతే కానీ ఏ ఒక్క వ్యక్తికి మనం మేలు చేయగలిగినా అది గొప్ప విషయమే అని అనుకోం. ఏది చేయలేం అనేదాన్ని గురించే ఆలోచిస్తాం తప్ప, మార్పుకోసం ఏది చేయగలం అని ఎప్పుడూ ఆలోచించం. అందుకే ఆ ఆలోచన కలిగించడానికే గ్రూపు పేరు “మార్పుకోసం” (ఇంగ్లీషులో “To Make A Difference”) అని పెట్టాను. గ్రూపు URL ఇది: http://groups.yahoo.com/group/tomakeadifference
గ్రూపుకొచ్చే మెయిళ్ళను, గ్రూపులో జరిగే చర్చలను అక్కడ చూడవచ్చు.

స్ఫూర్తిదాయకం

గ్రూప్ పెట్టాలనుకోవడం, పేరు నిర్ణయించడం అయిపోయాక, ఇక ఆచరణలో పెట్టడమే మిగిలింది. అప్పుడే ఎప్పుడో చదివిన మరొక కథ గుర్తొచ్చింది:

ఒకతను ఏదో కారణం వల్ల జైలుకెళ్తాడు. వాళ్ళ నాన్న అతనికొక ఉత్తరం రాస్తాడు. ‘ఒరేయ్ బాబు! మేం ముసలివాళ్ళమైపోయాం. బయటిపనులు చేయలేం. మన పెరడులో పాదులేసుకుని, పండే కూరగాయలతో ఏదో బతుకుబండిని నెట్టుదామనుకుంటున్నాం. పెరడు చదును చేసే శక్తి లేదు. వేరే వాళ్ళ చేత చేయించడానికి డబ్బులు లేవు. నువ్వు ఇక్కడ ఉండి ఉంటే ఈ బాధ్యత నువ్వు తీసుకునేవాడివి కదా’ అంటూ. అది చదివి ఇతను ఆలోచనలో పడతాడు.

ఓ పదిహేను రోజుల తరువాత తండ్రి నుంచి మళ్ళీ ఓ ఉత్తరం వస్తుంది తనకి. ‘ఒరేయ్ బాబు! పోలీసులకు నువ్వు ఏమి చెప్పావు? వాళ్ళు వచ్చి పెరడు అంతా తవ్వి వెళ్ళారు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. కానీ నాకైతే సంతోషంగా ఉంది. ఇక మొక్కలు వేసుకోవచ్చు’, అని. ఆ ఉత్తరం చదివి ఇతను తృప్తిగా నవ్వుకుంటాడు.

నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అన్నదాంతో సంబంధం లేకుండా, మనస్ఫూర్తిగా ఏమైనా చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలవు అనేదే నీతి ఈ కథలో.

యాడ్ వాల్యూ టు యువర్ మనీ – ఇది టాగ్ లైను. డబ్బుకి విలువ జోడించడమంటే, ఆ డబ్బు ద్వారా కలిగే ప్రయోజనంతో పోల్చడం. మనం ఇచ్చిన 100 రూపాయలు లేక 500 రూపాయలు, ఒక సహాయానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఒక ఆపరేషను నిమిత్తం మనం ఇచ్చే డబ్బు, అందరి చేతులు కలిసే సరికి పది వేలో, ఇరవై వేలో, లేదా ఓ లక్షో అవుతుంది. ఇక్కడ 100 విలువ ఆ లక్షతో సమానం. ఓ మనిషికి దక్కిన ఆరోగ్యంతో, నిలబెట్టిన ప్రాణంతో సమానం, వెరసి ఓ జీవితం, ఊపిరి పీల్చుకున్న కుటుంబం. ప్రపంచంలోని ఏ బాంక్ అయినా, ఏ షేర్, స్టాక్ లేదా మ్యూచ్యువల్ ఫండ్ అయినా మన డబ్బుని అన్ని రెట్లు చేయగలదా, ఇంత తక్కువ సమయంలో. ఈ సత్యమే ఆ టాగ్ లైనుకి అర్థం.

ఇక గ్రూప్ పేజీలో ఉన్న ఫోటో గురించి కూడా చెప్పాలి. గూగుల్ లో గాలించి రెండు, మూడు ఇమేజులను కలిపి ప్రస్తుతం ఉన్న ఫోటో ని సృష్టించాను. “మిమ్మల్ని మీరు గ్రూప్ కి పరిచయం చేసుకోండి”. అందరికీ మన గురించి తెలియచేయడానికి సూర్యకిరణాలు సంకేతం. పరిచయం చేసుకున్నాక అందరితోను మన భావాలు, అనుభవాలు, సలహాలు పంచుకోవాలి. అప్పుడు ఒకరికొకరం బాగా అర్థమవుతాం. మార్గం చాలా పెద్దది. ఆశయం ఉదాత్తమైనది. కలిసి పని చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాం.

ప్రత్యేకతలు:

ఎన్నో సంస్థలు సంఘసేవలో రకరకాల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే, ఓ కొత్త గ్రూపు పెట్టాల్సిన అవసరం ఏముంది! దీని ప్రత్యేకత ఏమిటి?

1. ఏ ఒక్క నిబంధనకో బందీ కాకపోవడం:

సాధారణంగా సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వాటికి లోబడే అవి పనిచేయాలి. ఎంత డబ్బున్నా సరే, అవసరం ఎంత న్యాయమైనదైనా సరే వారి పరిథిలోకి రాకపోతే వారు ఎలాంటి సహాయం చేయరు. ఇది ఎవరి తప్పు కాదు. ఒక సంస్థ ప్రణాళికాబధ్ధంగా నడవాలంటే నిబంధనలకు అనుగుణంగానే పని చేయాలి.

ఈ గ్రూపు అలా ఉండకూడదు, ఏ ఒక్క నిబంధనో ఓ మంచి పని చేయడానికి అడ్డు రాకూడదు అనేదే ముఖ్యోద్దేశ్యం. ఇవే చేయాలి, ఇలాగే చేయాలి అనే థంబ్ రూల్స్ ఏవీ లేవు. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడమే. ఒక కేస్ మా దృష్టికి వచ్చినప్పుడు, అది సరైనదేనా, ఫలాన వారికి సహాయం చేయాలా, వద్దా, చేయదలుచుకుంటే ఎలా చేయాలి అనేది నిజానిజాలు తేల్చుకుని, అందరూ కలిసి నిర్ణయిస్తాము.
ముఖ్యంగా ఎవరూ, ఏ సంస్థ సహాయం చేయని కేసులని మేము తీసుకుంటాము. అవసరం నిజమైందా కాదా అని మాత్రమే చూస్తాము. మానవతా దృక్పథమే మా నిర్ణయాలకు ప్రాతిపదిక.

2. నగదు చేతికి ఇవ్వకుండా ఉండడం:

విద్యా పరమైన సహాయమైనా, ఆరోగ్య పరమైన సహాయమైనా, ఇక ఏ రకమైనా సాధ్యమైనంతవరకు మేము డబ్బులు అవసరార్థులకు ఇవ్వము. పాఠశాల లేదా కళాశాల యాజమాన్యానికి కడతాము. టెక్స్టు మరియు నోటు పుస్తకాలు, సంచీలు, పెన్సిల్స్, పెన్ లు వగైరా అన్నీ మేమే కొంటాము. అలాగే హాస్పిటల్ కు రోగి తరపున డబ్బులు కడతాము. మందులు మేము కొనడం కానీ లేదా రోగి కొనుక్కుంటే డబ్బులు ఇవ్వడం కానీ చేస్తాము.

3. పాలనపరమైన ఖర్చులు లేకపోవడం:

మేం ఏ పని మీద వెళ్ళినా ఖర్చులు వలంటీర్లే భరిస్తాం. కన్వేయన్స్ చార్జులు, ఫోను బిల్లులు ఇలాంటి ఖర్చులు ఏవీ ఉండవు. ఎవరు ఎంత పంపినా సరే, మొత్తం ఆయా కేసుల పరంగా ఖర్చు అవుతుందే తప్ప, వాలంటీర్ల ఖర్చులంటూ ఏవీ ఉండవు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆయా ఖర్చులు భరిస్తాం.

4. కుటుంబం లాగా ఉండడం:

సాధారణంగా సంస్థలు సంస్థల్లాగే ఉంటాయి, సభ్యులు సదస్యులలాగే ఉంటారు. కానీ మేం ఈ గ్రూప్ ని ఓ కుటుంబంలా భావిస్తాం. ఒకే రకమైన అభిప్రాయాలు లేకపోయినా, ఆలోచనా విధానాలు, ఆశయాలు ఒకటే. మా వ్యవహార శైలి అంతా ఆత్మీయంగా ఉంటుంది. ఓ సభ్యుల సమూహంగా కాక, స్నేహితుల కూటమిగానే దీన్ని మేం పరిగణిస్తాం. అలాగే వ్యవహరిస్తాం.

సేవ, ఇతరులకేనా?

నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అస్మాకు నేను సహాయం చేసానా, అస్మా నాకు సహాయం చేసిందా అని!!

1. నా సమయాన్ని నేను చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఒకప్పుడు చాలా వృథాగా గడిపేదాన్ని.

2. ఓ కవిత రాస్తేనో, ఓ పుస్తకం చదివితేనో, ఓ పాట వింటేనో, ఓ సినిమాకెళ్తేనో కలగని ఆనందం నాకు ఈ పనులు చేయడం వల్ల కలుగుతోంది.

3. ఎంతో మంది మంచివారితో నాకు పరిచయం కలిగింది. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత. అన్ని వయసుల వారిలోనూ ఉత్సాహం. ఏదో చేయాలనే తపన.
allgroups_1.jpg
4. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అనుభవాలు పాఠాలు నేర్పాయి.

5. నాకు నా బ్లడ్ గ్రూపు ఏదో కొన్ని నెలల క్రితం వరకు తెలీదు. భయం. డాక్టర్లన్నా, ఇంజెక్షను అన్నా చాలా భయం. అలాంటిది నేను థలస్సీమియా వ్యాధి గురించి తెలుసుకున్నాక నా బ్లడ్ గ్రూపు చెక్ చేయించుకున్నాను. నేను ఎలాంటి సేవ అయినా చేస్తాను కానీ రక్తదానం మాత్రం చేయను అనుకునేదాన్ని. ఇంజెక్షను అంటేనే భయం. ఇక రక్తదానం అంటే అమ్మో!! కానీ త్వరలో అది కూడా చేయబోతున్నాను.

6. నాకు చిన్నప్పటి నుంచి షిర్డీ బాబాతో మంచి అనుబంధం. ఎప్పుడూ ఏదో ఒకటి తగువులాడుతూ ఉంటాను. అలాంటిది లోకంలో ఉండే బాధలు కొంచెం దగ్గరగా చూడడం మొదలెట్టాక, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినందుకు మనం ఎంతగా వినమ్రులమై ఉండాలో, అందుకు ప్రతిగా మన తోటివారికి ఎంతగా సేవ చేయాలో కదా అనిపిస్తుంది.

7. పాశ్చాత్య దేశాల్లో మనం ఎవరి ఇంటికైనా వెళ్ళాలంటే ముందుగా వారి అనుమతి తీసుకోవాలి అని చదివి తెగ విమర్శించుకునేదాన్ని. కానీ ఆ మాటకర్థం నాకు ఇప్పుడు బాగా తెలుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరు మా ఇంటికి రావడం, నా పనులు నిలిచిపోవడం, లేదా చేయాలనుకున్నవి చేయలేకపోవడంతో విలువ తెలిసొస్తోంది. ఎవరినీ విమర్శించకూడదు. ఆయా పరిస్థితులు మనకు అనుభవంలోకి వస్తే కానీ అలానే ఎందుకు ప్రవర్తిస్తారో మనకు అర్థం కాదు.

8. మనసుంటే మార్గముంటుంది. అలాగే మనం తీవ్రంగా దేనికోసమైనా తపిస్తే తప్పక దాన్ని మనం సాధించగలం. పరిస్థితులు వాటంతట అవే ఎదురవుతాయి మనం ఏ ప్రయత్నం చేయకపోయినా. ది అల్కెమిస్ట్ లోని ‘వెన్ యు వాంట్ సంథింగ్, ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్’. ఇది చాలా నిజం. సమాజానికి ఏదో చేయాలి అనే తపన నాకు చిన్నప్పటి నుంచీ ఉండేది. అనుకోకుండా నేను మొదలెట్టాను. అనుకున్నట్టుగా చేయగలుగుతున్నాను. ఇంకా బాగా చేయాలనే ఉత్సాహాన్ని పొందుతున్నాను.

9. సహజంగా నేను చాలా మూడీ. అలాంటిది ఓ కొత్త వ్యక్తి గ్రూపు గురించి మెయిల్ చేసినా, ఫలానా విధంగా పని చేద్దాం అని చెప్పినా, ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అన్నీ మరిచిపోయి ఇంకా ఇంకా శ్రమించాలని ఉత్తేజం కలుగుతుంది.

10. అన్నిటికీ మించి వెలకట్టలేనిది, వర్ణించలేనిది, మన సహాయం అందుకున్న వారి మొహంలోని సంతోషం, కృతజ్ఞతాభావం.
allgroups_2.jpg

ఇప్పుడు చెప్పండి. మనం ఇతరులకు సహాయం చేస్తున్నామా, మనకు మనమే సహాయం చేసుకుంటున్నామా?

వెనుకబాటుతనం – లోపం ఎక్కడుంది?

ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సామాజికాంశాల మీద తరాల తరబడి కృషి చేస్తున్నా ఆశించదగ్గ స్థాయిలో పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు?

ఈ ప్రశ్నకు, ప్రత్యేకతే నిబంధనగా పెట్టుకున్న ఈ గ్రూపు సభ్యుల సమాధానమేమిటి, వారు ఏమేమి చేసారు, చేద్దామనుకుంటున్నారు, చేయలేకపోయినవేంటి… ఇవన్నీ ……… వచ్చే వారం తెలుసుకుందాం.

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net)

“When you want something, all the universe conspires in helping you to achieve it.” అని బలంగా నమ్మే ఉప్పలపాటి ప్రశాంతి To Make A Difference గ్రూపు వ్యవస్థాపకురాలు. ప్రశాంతి తల్లిదండ్రులు విజయలక్ష్మీ, రాం ప్రసాద్. తమ్ముడు శాంతారామ రాధాకృష్ణ. స్వస్థలం నెల్లూరు. ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం. ఇన్నోమైండ్స్ సాఫ్ట్ వేర్ లో టెక్నికల్ రైటర్ . మనసు స్పందించినప్పుడు తనకు కలిగే భావాలను రాసుకోవడమన్నా,ఒంటరిగా గడపడమన్నా చాలా ఇష్టం. నెల్లూరంటే మరీ అభిమానం.

ఎం. ఎస్ . సి. కంప్యూటర్ సైన్స్, ఎం . ఏ . ఇంగ్లీషు చదివిన ప్రశాంతి (లేఖిని వాడి) యూనికోడ్ తెలుగులో చేసిన మొట్టమొదటి రచన ఇది. ఇక మీదట తన బ్లాగును (http://prasanthi.wordpress.com/) తరచు అప్ డేట్ చేస్తానంటున్నారు.

Posted in వ్యాసం | Tagged | 19 Comments

ఎర్రకోట

– త్రివిక్రమ్

“భూమ్మీద స్వర్గమంటూ ఉంటే
అది ఇక్కడే అది ఇక్కడే అది ఇక్కడే!!!”

“If there is Heaven on the Earth,
It is this, It is this, It is this”

“అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్,
హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.”

అని అమీర్ ఖుస్రో పరవశించి పాడే నాటికి మొఘలులు భారతదేశంలోకి ఇంకా రాలేదు. ఎర్రకోట లాంటి బృహత్తర నిర్మాణమొకటి ఇక్కడ వెలుస్తుందని ఎవరూ ఊహించనైనా లేదు. ఐనా ఎర్రకోటలో షాజహాన్ ఆంతరంగిక సమాలోచనలు జరుపుతూ ఉండిన మందిరం దివాన్-ఇ-ఖాస్ గోడ మీద చెక్కబడి ఉన్న ఆ అమృతవాక్కులు ఆ కోట విశిష్టతను చాటడానికి సరిగ్గా సరిపోయాయి. ఎన్నో భవంతులుండగా ఎర్రకోటనే స్వర్గధామంగా భావించడానికి కారణం అది ఖురాన్ లో స్వర్గం గురించి ఉన్న వర్ణనకు అనుగుణంగా నిర్మించబడడమే!
800px-red_fort_delhi_by_alexfurr.jpg

ఖొరాన్ లో వర్ణించిన స్వర్గాన్ని తలపించే విధంగా అమృతవాహిని (నహర్-ఎ-బిహిష్ట్) తో సహా నిర్మించబడ్డ ఈ అద్భుతమైన కట్టడం World heritage site గా గుర్తింపు పొందడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టిందనేది ప్రశ్న.

నిజానికి పదహైదేళ్ల కిందటే ఎర్రకోటను ఆ జాబితాలో చేర్చడానికి UNESCO వాళ్ళు పరిశీలించారు. ఐతే అప్పుడు అది సైన్యం ఆధీనంలో ఉండేది. అప్పుడే కాదు, అంతకు నూటయాభయేళ్ల కిందటి నుంచి 2003 వరకు అది సైన్యం ఆధీనంలోనే ఉంది. ఎర్రకోట ప్రాభవం మనకళ్ళముందే మసకబారిపోతూండడాన్ని గమనించిన UNESCO ‘ఇంత గొప్పదైనా ఈ కట్టడం ఒకపక్కనుంచీ నాశనమైపోతుంటే పట్టించుకునే నాథుడే లేడే’ అని దాన్ని అప్పుడే ప్రపంచవారసత్వసంపదగా ప్రకటించడానికి నిరాకరించింది.
800px-red_fort_28-05-2005.jpg

కోట లోపలా, వెలుపలా అడ్డదిడ్డంగా వెలసిన 250 పైగా ఆధునిక కట్టడాలు ఎర్రకోటను భ్రష్టుపట్టించాయి. అలాంటి కట్టడాల్లో స్వాతంత్ర్య పూర్వకాలానికి చెందినవీ, స్వాతంత్ర్యానంతరం సైన్యం నిర్మించినవీ కూడా ఉన్నాయి. దాంట్లో ఆవాసాలున్న సైనికాధికారుల నేమ్ ప్లేట్లు కోటగోడల మీద వదిలిన గుర్తులు కోట అందాన్ని దెబ్బతీశాయి. సైన్యం నుంచి ఆ కట్టడాన్ని స్వాధీనం చేసుకున్న పురాతత్వశాఖ కోట ఆవరణలో అడ్డదిడ్డంగా వెలసిన కట్టడాలను తొలగించి, కోటగోడలను శుభ్రం చేసే పనిలో ఉంది.
d-i-khas.JPG
“అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్,
హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.”

అన్న అమీర్ ఖుస్రో పలుకులు ఈ కోటలో పాలరాతితో నిర్మించబడిన దివాన్-ఇ-ఖాస్ అనే భవనంలోని గోడలమీద చెక్కించాడు షా జహాన్ పెద్ద కొడుకైన దారా షిఖో. ఈ భవనంలోనే చరిత్రప్రసిద్ధి గాంచిన నెమలిసింహాసనం మీద కూర్చుని కొలువుదీరేవాడు షా జహాన్. ప్రస్తుతం ఆ నెమలి సింహాసనమూ లేదు, ఆ కొలువుదీరడాలూ లేవు. విశాలమైన కొలువుకూటం మాత్రం జరిగిన దారుణానికి సాక్షీభూతంగా నిలిచి ఉంది. ఆ భవంతిలోని అపురూపమైన జాలీ లు కొన్ని ధ్వంసమై జాలిగొలుపుతున్నాయి.
732px-jama_masjid_is_the_largest_mosque_in_india_delhi_india.jpg

భారతదేశంలోని మసీదులన్నిట్లోకీ అతిపెద్దదైన జామామసీదు ఈ కోటకెదురుగానే ఉంది.
యునెస్కో ఒక కట్టడాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన తర్వాత కేవలం ఆ కట్టడమొక్కటే కాకుండా ఆ కట్టడం లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల మెయింటెనెన్స్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందువల్ల కోట ఆవరణలోని మీనాబజారులో ఉన్న దుకాణసముదాయాల్లో అమ్మే వస్తువుల నాణ్యత మీదే కాకుండా, ఏయే రకాల వస్తువులు అక్కడ అమ్మొచ్చో, మరేయే రకాలు అమ్మకూడదో కూడా పురాతత్వశాఖ నిర్దేశించనుంది.
800px-fuerte_rojo_delhi_2.JPG
ఆర్కిటెక్చరు:
తైమూరు, పర్షియన్, హిందూ భవననిర్మాణశైలులు ఈ కోటనిర్మాణంలో కనిపిస్తాయి. ఈ భవన నిర్మాణ శైలి, ఇందులోని తోటల ప్రణాళికల ప్రభావం ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్, తదితర ప్రాంతాల్లోని కట్టడాలు, తోటల మీద స్పష్టంగా కనిపిస్తుంది.

చరిత్రలో ఎర్రకోట: ఆధునిక భారతదేశ చరిత్రతో ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధముంది.
800px-fuerte_rojo_delhi_1.JPG

1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి మహా సంగ్రామంగా రూపు దాల్చింది. తొలుత మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు ఆఘమేఘాల మీద ఢిల్లీకి వచ్చి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-II ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించిందీ, ఆయన (నామమాత్రపు) నాయకత్వం కిందే సమరయోధులంతా ఒక్కటై నడిచిందీ.

ఈ ఎర్రకోటలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ కు చెందిన ముగ్గురు వీరులు గురుభక్ష్ సింగ్ ధిల్లాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, సయ్యద్ షానవాజ్ ఖాన్ లపై రాజద్రోహనేరం మోపి సైనిక విచారణ (కోర్ట్ మార్షల్) జరిపిందీ. స్వాతంత్ర్య పోరాటాన్ని క్లైమక్స్ కు చేర్చిన మహోద్విగ్న ఘట్టాలవి. కోట లోపల విచారణ జరుగుతుండగా వెలుపల నుంచి అశేషప్రజానీకం
“లాల్ ఖిలే సే ఆయీ ఆవాజ్,
సెహగల్, ధిల్లాన్, షానవాజ్,
తీనోంకీ హో ఉమర్ దరాజ్”

అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసింది. ఈ నినాదాలే దేశమంతటా ప్రతిధ్వనించాయి. లా చదివినా అప్పటికి ఎన్నో యేళ్ళ కిందటే కోటు విప్పి కదనరంగంలోకి దూకిన హేమాహేమీలు -జవహర్లాల్ నెహ్రూ, అసఫ్ అలీ, భులాబాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, కైలాస్ నాథ్ కట్జు – మళ్ళీ లాయర్లుగా మారి ఈ యోధత్రయం తరపున వాదించింది ఇక్కడే.

ఇక స్వాతంత్ర్యానంతర చరిత్ర అందరికీ తెలిసిందే! ప్రతీ ఆగస్టు పదహైదు నాడు ఎర్రకోట బురుజులమీద మువ్వన్నెల పతాకావిష్కరణ తర్వాత ప్రధాని ఇచ్చే ప్రసంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

ఇక రిపబ్లిక్ దినోత్సవం రోజు ప్రపంచంలోనే అతి విశిష్టమైన రిపబ్లిక్ డే పెరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి మొదలై, ఇండియా గేటు, కనాట్ ప్లేసుల మీదుగా ఎర్రకోటకు చేరుతుంది. ఆ పెరేడ్ లో భాగంగా ఎర్రకోట ముందు విన్యాసాలు చెయ్యాలని ఉవ్విళ్ళూరని సైనికుడుండడు. ఏనుగుమీదెక్కి ఎర్రకోటకు వచ్చే అవకాశం తమకు దక్కినందుకు పులకించిపోయే సాహసబాలల ఉద్వేగానికి హద్దులుండవు. ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో తన విశిష్టతను అక్కడ ప్రదర్శించాలని పోటీ పడని రాష్ట్రముండదు. త్రివిధ దళాల పాటవప్రదర్శనకు అచ్చెరువొందని ప్రేక్షకులుండరు.

రిపబ్లిక్ డే పెరేడ్ ఏడాదికొక్కసారే జరిగితే అదే ఎర్రకోటలో ప్రతిరోజూ జరిగే అద్భుతమొకటుంది. అదే సౌండ్ అండ్ లైట్ షో. ప్రేక్షకులకు తాము కాలనాళికలో ప్రవేశించామా అని భ్రాంతి కలిగేలా కాలాన్ని వెనక్కి తిప్పి చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల కిందట షాజహాన్ మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కోట నిర్మాణం గురించి ఆయన మదిలో మెదిలిన ఆలోచన మొదలుకుని స్వాతంత్ర్య సాధన వరకు ఎర్రకోటతో సంబంధమున్న చారిత్రిక ఘట్టాలను వివరించే ఆ షో చూడడమొక మరపురాని అనుభూతి.
red_fort_night.jpg

భారతదేశంలోని యునెస్కో World Heritage Sites:

  1. ఆగ్రా కోట
  2. అజంతా గుహలు
  3. ఎల్లోరా గుహలు
  4. తాజ్ మహల్
  5. మహాబలిపురంలోని కట్టడాలు
  6. కోణార్క సూర్యదేవాలయం
  7. కజీరంగా నేషనల్ పార్క్
  8. కేవల్దేవ్ ఘనా నేషనల్ పార్క్
  9. మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ
  10. గోవాలోని చర్చ్ లు
  11. ఫతేపూర్ సిక్రీ
  12. హంపీ
  13. ఖజురహో
  14. ఎలిఫెంటా గుహలు
  15. చోళ దేవాలయాలు (తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం, దారసూరంలోని ఐరావతేశ్వరం)
  16. పట్టడకల్
  17. సుందర్ బన్స్
  18. నందాదేవి, వేలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కులు
  19. సాంచీ స్తూపం
  20. హుమయూన్ సమాధి
  21. కుతుబ్ మీనార్
  22. డార్జిలింగు, నీలగిరిల్లోని పర్వత రైల్వేలు
  23. బుద్ధ గయ
  24. భీంబేత్కా గుహలు
  25. చంపానేర్-పావగడ
  26. ఛత్రపతి శివాజీ టెర్మినస్
  27. ఎర్రకోట

(గమనిక: ఈ పేజీలో వాడిన ఫోటోలు వికీమీడియా కామన్స్ లోనివి)

Posted in వ్యాసం | 1 Comment

జూన్ గడి సమాధానాలు

-సత్యసాయి కొవ్వలి (http://satyasodhana.blogspot.com)

మా మాటః

ఈసారి గడికి అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి నుంచి గడిని పూరిస్తున్నవారే కాకుండా ఈసారి కొత్తపాఠకులు కూడా ఎక్కువ ఉత్సాహంగా పాల్గొనడం సంతోషించదగ్గ పరిణామం. ఇది గడికి ఆదరణ క్రమంగా పెరుగుతోందనడానికి నిదర్శనం. ఐతే కొత్త పాఠకుల గురించి వారి పేర్లు, ఈమెయిళ్ళు తప్ప ఇతర వివరాలు తెలియకపోవడం వెలితిగానే ఉంది. వారికి సంబంధించిన వెబ్సైట్లు గానీ, బ్లాగులు గానీ ఉన్నట్లైతే వాటి URLs ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.

ఆల్ కరెక్టు సమాధానాలు పంపినవారుః

సిముర్గ్, బి. కామేశ్వరరావు, రాకేశ్, జ్యోతి, స్వాతి, చిట్టెళ్ళ కామేశ్, ఫణికుమార్, రాజ్యలక్ష్మి

ఒకటి రెండు తప్పులతో:

చిట్టెళ్ళ శ్రీకాంత్, శ్ర్రీరామ్, రవి వైజాసత్య, డా.ఇస్మాయిల్ పెనుగొండ

మూడునాలుగు తప్పులతో:

ఎందుకులెండి, అరుణ, రాధిక

అందరికీ అభినందనలు!!!

1తా పీ 2ని   3ఎం 4రో   5తం 6పు లు
లిం     షా   దు     7జా లి  
8బా 9సుం ది   10గో కు లం   11క వూ   12ఏ
    13ఈ     14అ ల్ల రి మూ
15అ కా సు   16మి స్స మ్మ   వీ   వీ
  య్య   17రో టి     18జా నె
19ఆ   20భా       21చె మా      
22రు క్కు ణి   23లా వొ క్కిం 24యు 25లే 26దు
ద్ర             చి   27గాం ధా
28న 29రా 30వ తా 31రం     నా   32త
33క్ష యా   దూ     34రు ము   వా
త్రం   35గ్రా సిం హం         36పో టు

ఆధారాలకు వివరణ:

అడ్డం

1 గుళ్ళల్లో బూతుబొమ్మలెందుకూ అని ప్రశ్నించిన ఈ పెద్దమనిషి, ఇళ్ళు కట్టే పని చేస్తాడా ? (4)
తాపీపని. దేవాలయాల్లో బూతుబొమ్మలెందుకూ? అన్న పుస్తకం వ్రాసినాయన తాపీ ధర్మారావు.
3 ఈ కాకర్ల వంశోద్భవుడికి మహానుభావులెంతమందో లెక్క తేలిందా ? (3)
ఎందరో. ఎందరో మహానుభావులు అని తేల్చిచెప్పినాయన కాకర్ల త్యాగరాజు.
5 నారదుడు జనాల మధ్య పెట్టేవి – తెలియక పోతే, బుర్ర తలుపులు తీసి మరీ ఆలోచించండి. (3)
తంపులు. అంటే తగాదాలు. ఆధారంలోని ‘తలుపులు’ లో సమాధానం ఉంది.
7 6 నిలువులోని జంతువుకి ఎంత వేడుకున్నా వేడుక పుడుతుంది గానీ ఇది పుడుతుందా? జాలీగా తినెయ్యదూ? (2)
జాలి. 6 నిలువులోని జంతువు పులి. ధానికి జాలి ఉండదు.
8 ఈ స్వీటు పేరు విని బాగుందని సరిపెట్టుకోనక్ఖర్లేదు. తిని చూడొచ్చు (3)
బాసుంది. ‘బాగుంది’ అన్న పదానికి రైమింగుగా ఉంటుంది.
10 కులాన్ని పొమ్మని ఇంగ్లీషువాడు ఎంత తరిమినా పోకుండా ఇక్కడ తిష్టవేసినట్లుంది(3)
గోకులం. ‘పొమ్మని’ = గో (go) అని.
11 ఊరికే వెళ్ళిపోక అటూ ఇటూ చూసి దంపుడుపన్యాసాలా? (2)
ఊక. ఊరికే వెళ్ళిపోక కి అటూ ఇటూ ఉన్న అక్షరాలతో పదం
14 కరి, అల్లమూ కనబడ్డం లేదా? వాళ్ళే ఎత్తుకెళ్ళి ఉంటారు. వెతకండి. (5)
అల్లరిమూక. కరి, అల్లమూ ఎత్తుకెళ్ళి ఏడిపించేవాళ్ళు వాళ్ళు అల్లరి మూకేకదా.
15 మేమడిగింది చిన్నమెత్తు బంగారమే! తిరకాసేం లేదు. లెక్క తేడా రాకూడదు మరి (4)
అరకాసు. బంగారాన్ని తులం, కాసులలో కొలుస్తారు.
16 అమ్మని కుమారి అని సంబోధించచ్చా? ఈసగం ఇంగ్లీషు నీలకంఠ అలాగే చేసాడు. (3)
మిస్సమ్మ. = Miss. అమ్మ. నీలకంఠ భూమిక, శివాజీలతో తీసిన సినిమా పేరు.
17 రోట్లో తల పెట్టాకా, 36 అడ్డాలు తప్పవు మరి. (3)
రోకటి పోటులు. రోట్లో తల పెట్టాకా, రోకటి పోటులు తప్పవు అని సామెత.
18 ఒకేఒక్కడు, అదీ అర్జునుడు, తన మీద ఓపాట పాడగానే, అటూఇటూ ఊగిపోయిందీ సింహపురి నేర్పరిది. (4)
నెరజాణ. నెల్లూరి నెరజాణ అని ఒకేఒక్కడు సినిమాలో అర్జున్ పాడతాడు. నెల్లూరు పాతపేరు సింహపురి. నెరజాణ అంటే నేర్పరిది అని.
21 ముందు కోసి తర్వాత సాగదీస్తే చేమ దురద పోతుందా? (2)
చెమా. చేమలో ‘చే’ ని కోస్తే ‘చె’, ‘మ’ ని సాగదీస్తే ‘మా’.
22 మణిరత్నం చేతిలో పడితే గులాబీ లాంటి కృష్ణుడి పట్టమహిషి పేరైనా ఇలా అయిపోతుంది. (4)
రుక్కుమణి. కృష్ణుడి పట్టమహిషి రుక్మిణి. మణిరత్నం రోజా (గులాబీ) సినిమాలో రుక్కుమణి, రుక్కుమణి అన్న పాటనుంచి ఈఆధారం.
23 శక్తంతా హరించుకుపోయిందని శ్రీ బి. పోతన గారు ధైర్యంలేకపోయినా భలే చెప్పాడే. (7)
లావొక్కింతయు లేదు. బి అంటే బమ్మెర అని చెప్పక్కరలేదనుకొంటా.
27 దుస్సల మేనమామ పుట్టిల్లు తాలిబానుకెరుక (3)
గాంధార. తాలిబాన్లు ఆఫ్గనిస్థాన్ (భారతకాలంలో దీనిపేరు గాంధార దేశం) లో ఉంటారు. గాంధారి కూతురు దుస్సల మేనమామ శకుని దేశమదే.
28 ఈ ఏకాదశావతారం నండూరి రామ్మోహనరావు గారి సృష్టి. (5)
నరావతారం. ఇది నండూరి రామ్మోహనరావు గారు వ్రాసిన పుస్తకం.
32 తల మధ్యలో మొదటి హల్లా ? అంతా తెలుగు కన్ఫ్యూజన్. దెబ్బకి, ఈ పదం కూడా కన్ఫ్యూజయిపోయింది. (3)
తకల. కలత అంటే తెలుగులో కన్ఫ్యూజన్. మొదటి హల్లు ‘క’ని త,ల మధ్యలో పెడితే వచ్చే పదం.
33 పెళ్ళాంలో భూదేవి గుణముండాలా- ఏజమానాలో ఉన్నావ యా? అది సంస్కృతం మాట్లాడే రోజుల్లో. (3)
క్షమయా. పెళ్ళం ‘క్షమయా ధరిత్రి’ లా ఉండాలన్నారుకదా.
34 కామినీ తైలమా, ఏమి నీ రుచమా వహ్వ- వహ్వ. ప్రాస కుదిరే లోపు నూనె కాస్తా ఒలికి అటూనిటూ అయిపోయింది. (3)
రుచము. తైలం అంటే చమురు. అది అటూ, యిటూ అయిపోతే రుచము.
35 పల్లెలో మృగరాజా? ఛా. అక్కడుండేదేమిటో మాకు తెలుసులే. (4)
గ్రామసింహం. ఊళ్ళో కుక్కల్ని గ్రామసింహాలని అంటారు.
36 పన్నుకైనను, వెన్నుకైనను తప్పునే ఇది ఎవరికైనను. (2)
పోటు.

నిలువు

1 ఈమె బిడ్డని కని రెండే రోజులయిందా? అయ్యో, తెలియక శీర్షాసనం వేయించానే. (3)
బిడ్డని కన్న స్త్రీని బాలింత అంటారు. శీర్షాసనం అంటే తిరగేయాలి. తాలింబా. ప్రశ్నగుర్తు ఉందికదా- ‘తా’ కి దీర్ఘం వస్తుంది.
2 తాగితే ఎక్కకుండా ఉంటుందా. (2)
తాగితే ఎక్కేవి మత్తు లేదా నిషా. ఇక్కడ నిషా సరిపోతుంది.
3 ఈమూడూ తెలిసికొని గొప్పవాళ్ళై పోదామనుకుంటే, ముఖం మాడచ్చు. మాయలోడు బాబూమోహన్ కి అలాగే అయింది మరి. (3,3,2)
ఎందుకు, ఏమిటి, ఎలా. ఈమూడు ప్రశ్నలకి సమాధానం తెలుసుకుంటే గొప్పవాళ్ళయిపోవచ్చని బాబూమోహన్ అంటాడు.
4 రోజూ తగూలుంటే సంసారమ్మీద పుట్టేదిదే. (2)
రోత. రోజూ తగూలుంటే లో మొదటి అక్షరాలతో ఈపదం వస్తుంది.
5 ఈవాయిద్యం తయారీకి బొబ్బిలిలానే, ఈవూరు కూడా ప్రసిధ్ధి. (4,2)
తంజావూరివీణ. వీణతయారీకి బొబ్బిలి, తంజావూరులు ప్రసిద్ధి.
6 జంతువులకి ఎయిడ్స్ వస్తుందా? (2)
పులి. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్న ప్రకటన గుర్తుంది కదా.
9 పుచ్చ కాయలు తినిపారేయకుండా ఇంటి లో పెట్టుకుని, ఎర్రజెండా పట్టాడీ అందమైన అయ్య (4)
సుందరయ్య. పుచ్చలపల్లి ఇంటిపేరుగాగల ఈయన, ప్రముఖ కమ్యూనిస్టు.
11 కల ని ఎంత వత్తినా అబద్ధమే (2)
కల్ల.
12 కవిసమ్రాట్ ఇద్దరువీరుల కథను రాసి పేరెందుకలా పెట్టాడో (4)
ఏకవీర. కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ వ్రాసారు.
13 మనుషులిలా ఉంటే ఏదేశమైనా ఎలా బాగుపడుతుంది ? (3)
ఈసురో’ మని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అన్న గేయభాగం ఆధారంగా.
14 మాక్సింగోర్కీ అయినా, ఆయన బాబైనా తెలుగు తల్లిని ఇలాగే పిలుస్తారు. (2)
అమ్మ. మాక్సింగోర్కీవ్రాసిన నవల.
18 తమాషాగా మేంగోడ్రింక్ తలకిందులుగా తాగిన అల్లుడిలో తల్లిని చూడచ్చా? (3)
జామాత. మేంగోడ్రింక్ మాజా. తల్లి = మాత.
19 త్వమేవాహం అని ఆయనరాసిస్తే మాత్రం నువ్వూ ఆయనా ఒకటైపోతారా ? ఆయనకి పెద్దగడ్డం ఉంది. పైగా ఓ స్టారు కూడాను. (3,3)
ఆరుద్రనక్షత్రం. త్వమేవాహం వ్రాసినది పెద్దగడ్డం ఉన్న ఆరుద్ర.
20 ఈవిడా కృష్ణుడి సగం పెళ్ళామా? 22 అడ్డానికి సవితా? (2)
భామ. కృష్ణుడి పెళ్ళం, రుక్మిణికి సవతి సత్యభామలో సగం.
21 శిలలపై శిల్పాలు చెక్కినారు.. . అబ్బే, వాళ్ళు చెక్కలేదు. ప్రభువులు ______________ (5)
చెక్కించినారు.
24 మహాప్రళయం వచ్చే సమయం (4)
యుగాంతం.
25 చైనా వాళ్ళు శివసేన సుప్రీమో పేరు పిలవగానే, ఆయన పాపం కకావికలైపోయాడు. ఎందుకా? చైనా వాళ్ళు ర్ ని ల్ చేసి పాడేస్తారు కదా. (3)
థాకరే కాస్తా థాకలే అవుతాడు. ఆపై కకావికలై లేథాక అవుతుంది..
26 దురద – చెడు అలవాటు (5)
దురలవాటు
29 తారకనామ – దశరథ పుత్ర (2)
రామ
30 ఆగ్రా మీదుగా వెళ్ళడమే కామోద్దీపకమా? (3)
వయాగ్రా. (వయా ఆగ్రా)
31 హనుమంతుడి బొట్టది, తిరగేసి పెట్టద్దూ అని చెప్పినా, అలానే పెట్టావా? (3)
ఆంజనేయస్వామి బొట్టుని సింధూరం అంటారు. తిరగేస్తే రంధూసిం.

Posted in గడి | Tagged | 1 Comment