మృతజీవులు – 2

గొగోల్ స్వయంగా రూపొందించిన మృతజీవులు ముఖచిత్రం

dsmast.JPG

[మొదటి వరుసలో రష్యన్ భాషలో చిన్న అక్షరాల్లో ఉన్నది “చిచికోవ్ సాహసాలు”. దానికింద కాస్త పెద్దక్షరాల్లో “మృతజీవులు”. దానికింద అన్నిటికంటే పెద్దక్షరాల్లో “కావ్యగాథ” అని, ఇంకా కింద చిన్నక్షరాల్లో “గొగోల్” అనే పేరు, అట్టడుగున “1842”.

పైనున్నది చిచికోవ్ బండి, గిలకబావితో సామాన్యంగా కనిపించే ఒక రష్యన్ ఎస్టేటు, వైను బాటిళ్ళు – గ్లాసులు, ఒక టవరు. వాటికింద మృతజీవులు అనే పేరుకు ఎడమపక్కన ఆహారపదార్థాలు, కుడిపక్కన నాట్యమాడే రైతు, చుట్టూ చిన్న చిన్న కపాలాలు. “కావ్యగాథ”కు ఇరుపక్కలా కవిత్వాన్ని సూచించే విధంగా ఒక దేవుడి తల, లైర్ (lyre – ఒక సంగీత వాయిద్యం), మరో వాయిద్యపరికరం. దిగువన ఎడమపక్క వైను, తిండి, బాలలైకా (Balalaika); కుడిపక్కన నాట్యమాడే జంట. అట్టడుగున ఒక తల. ఈ పుస్తకంలోలాగే రష్యన్ల జీవితాల్లో కవిత్వము, సజీవము-నిర్జీవము కలగలిసిపోయి ఉంటాయి. దీన్నంతటినీ ఆవరించుకుని ఉన్న డిజైను గొగోల్ రచనాశైలికి ప్రతీక.]
(http://www.macalester.edu నుంచి)

వెయిటర్ ఇంకా ఈ వివరాలని కూడబలుక్కుని చదువుకుంటూండగానే పావెల్ ఇవానవిచ్ చిచికోవ్ బస్తీ పరికించ వెళ్ళాడు. అది ఇతర బస్తీలకు ఏ విధంగానూ తీసిపోకపోవటంచేత అతనికి నచ్చినట్టే కనబడింది. ఇటుకలతో కట్టిన ఇళ్ళమీది పసుపుపచ్చ రంగు కళ్ళు చెదిరేలాగుంది. కొయ్యతో కట్టిన ఇళ్ళు నల్లగా ఉన్నాయి. ఇళ్ళు ఒక అంతస్తువీ, రెండంతస్తులవీ, ఒకటిన్నర అంతస్తువీనూ. ప్రతి ఇంటికీ విధిగా పొట్టికిటికీలు పెట్టి ఉన్నాయి. మారుమూల ప్రాంతాల ఇళ్ళు కట్టేవాళ్ళకవి చాలా ఇష్టం.

బస్తీలో కొన్ని జాగాలలో వీధులు పొలాలంత ఉండటం చేతా, ఎడతెగని చెక్కకంచెల మూలానా ఇళ్ళు కాన రావటం లేదు; మరికొన్ని జాగాలలో ఇంటిమీద ఇల్లున్నది, ఇటువంటి చోట్ల సంచలనమూ, సందడీ ఉన్నది. షాపులకు సైన్ బోర్డులున్నాయి. వాటిమీద రొట్టె చుట్టలో, బూట్లో వేసి ఉన్నాయి, అవి వానకు దాదాపు మాసిపోయి ఉన్నాయి. ఒకచోట కుళాయిలదుకాణం ఉన్నది. బయట ఇలా రాసి ఉన్నది: “వసీలిఫ్యోదరన్, పరదేశి”. మరొక చోట ఒక బిలియర్డ్ టేబుల్ బొమ్మ ఉన్నది. దానివద్ద ఇద్దరు ఆటగాళ్ళు చూపబడ్డారు.

ఎక్కడ చూసినా పేవ్‌మెంట్లు ఛండాలంగా ఉన్నాయి. అతను నగరపు పార్కు లోకి కూడా తొంగి చూచాడు. అక్కడి చెట్లు పలుచ పలుచగానూ వడలిపోయీ ఉన్నాయి. అతడు ఒక పోలీస్ వాణ్ణి అడిగి చర్చికీ, ప్రభుత్వ భవనాలకీ, గవర్నరు గారుండే చోటికీ దారులు వైనంగా తెలుసుకొని, ఊరిమధ్యగా ప్రవహించే నదిని చూడబోయాడు. దారిలో ఒక స్తంభానికి అంటించిన పోస్టర్ కనబడితే, గదికి వెళ్ళాక తాపీగా చూసే ఉద్దేశ్యంతో దాన్ని చించాడు. పావెల్ ఆ ప్రదేశమంతా వివరంగా జ్ఞాపకం పెట్టుకోదలచిన వాడిలాగా మరొక్కసారి కలయజూసి, హోటల్ చేరుకుని నేరుగా తన గదికి వెళ్ళాడు. మెట్లెక్కేటప్పుడు వెయిటర్ సాయపడ్డాడు.

అతను టీ తాగి, బల్ల దగ్గర కూచుని, కొవ్వొత్తి ఒకటి తెప్పించుకొని, జేబులోనుంచి పోస్టర్ పైకి తీసి దీపం దగ్గరగా పెట్టి, కుడికన్ను కాస్త చిట్లిస్తూ చదువసాగాడు. అయితే అందులో గొప్ప విషయాలేమీ లేవు. కొట్జెబుయె రచించిన నాటకంలో పప్ల్యోవిన్ రోలా పాత్ర, కుమారి జాకబ్ కోరా పాత్ర ధరిస్తున్నారు, తదితర పాత్రలు ధరించే వారు ఇంకా అనామకులు. అయినా అతడు అందరి పేర్లు చదవటమే గాక టిక్కెట్టు ధరలు కూడా చదివి ఆ పోస్టర్ అచ్చు వేసినది రాష్ట్ర ప్రభుత్వ శాఖా ముద్రణాలయం లోనని తెలుసుకున్నాడు. ఆ తరువాత పోస్టరును తిప్పి వెనక ఏమన్నా ఉందేమోనని చూశాడు కాని అక్కడ ఏమీ లేకపోవడంచేత కళ్ళు నలుచుకుని, పోస్టరును భద్రంగా మడిచి అతని పెట్టెలో పెట్టుకున్నాడు. చేతికి అందినదల్లా అందులో పెట్టటం అతనికి అలవాటు. ఒక ప్లేటు లేగ మాంసంతోనూ, లోటాడు కాబేజీ సూప్ తోనూ గాఢమైన నిద్రతో ఆ రోజు ముగిసిందనుకుంటాను.

మరునాడంతా అతడు పట్నంలో ఉన్న ప్రముఖులందరినీ చూడబోయాడు. గవర్నరుగారి దర్శనం చేసుకున్నాడు. ఆయన కూడా చిచీకవ్ లాగే అంత లావూ, అంత సన్నమూ కాని మనిషి. ఆయన మెడలో అదివరకే “అన్నా” పతకం కూడా ఉంది. ఆయనకు “నక్షత్రం” కూడా బహుకరించబడనున్నట్లు చెప్పుకున్నారు. అయితే ఆయన మటుకు చాలా సాధారణ మనిషి. భేషజం లేని వాడు, అప్పుడప్పుడూ చిల్లుల గుడ్డమీద ఎంబ్రాయిడరీ చేసేవాడు కూడానూ. తరువాత అతను డిప్టీగవర్నరుగారింటికి వెళ్ళాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్నూ, న్యాయస్థానాధ్యక్షుణ్ణీ, పోలీసు పెద్దనూ, అబ్కారీ పన్ను కంట్రాక్టరునూ, ప్రభుత్వ ఫ్యాక్టరీల సూపరింటెండెంటునూ సందర్శించాడు. అతను చివరకు మెడికల్ బోర్డ్ ఇనస్పెక్టరునూ, నగర వాస్తు ప్రవీణుణ్ణీ చూసి దణ్ణాలు పెట్టాడు.

తాను కలుసుకున్న ప్రముఖులతో సంభాషించేటప్పుడతను ఎంతో నేర్పుగా వారిని ఉబ్బవేశాడు. అతను గవర్నరుగారితో మాట్లాడేటప్పుడు, మాటల సందర్భాన అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయాణిస్తుంటే స్వర్గంలో సంచరిస్తున్నట్టుగా ఉన్నదనీ, ఎక్కడ చూసినా రోడ్లు పట్టుపరిచినట్టుగా ఉన్నాయని, సమర్థులైన పాలకులను నియోగించిన ప్రభుత్వం ప్రశంసనీయమైనదనీ అన్నాడు. పోలీసు పెద్దతో మాట్లాడేటప్పుడు నగర పోలీసు శాఖను ప్రశంసించాడు. డిప్టీ గవర్నరూ, న్యాయస్థానాధ్యక్షుడూ, సివిల్ ఉద్యోగులే అయినప్పటికీ వారితో మాట్లాడేటప్పుడు రెండు సార్లు నోరుజారి “యువర్ ఎక్సిలెన్సీ” అని సంబోధించేసరికి వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బయారు. దీనికంతటికీ పర్యవసానం ఏమిటంటే, గవర్నరు గారు ఆ సాయంత్రమే తన ఇంట్లో ఏర్పాటైన “పార్టీ”కి అతన్ని ఆహ్వానించాడు. మిగిలిన అధికారులు కూడా అతన్ని భోజనానికీ, “బోస్టన్” ఆడటానికీ, టీకీ వేరువేరుగా ఆహ్వానించారు.

అతడు తన గురించి అట్టే చెప్పుకోకుండా తప్పుకున్నాడు. చెప్పినది కాస్తా అందీ అందకుండా, ఎంతో వినయంగలవాడిలాగా, పుస్తక భాష అనిపించేలా చెప్పాడు: తానొక అనామకుడు, ఖ్యాతికి దూరమైన వాడు; చాలా రకాల అనుభవాలు చూశాడు, న్యాయం కోసం కష్టాలకు గురి అయినవాడు; తనకు చాలామంది శత్రువులున్నారు. కొందరు తన ప్రాణాలను కాజేయ జూసారు కూడా; ఇప్పుడు ప్రశాంత జీవనం గడపాలన్న కోరికతో స్థిరపడిపోవడానికి తగిన చోటు వెతుకుంటూ ఈ ఊరు వచ్చాడు గనుక, ఇక్కడి పెద్దలనందరినీ సందర్శించటం తన కర్తవ్యం. అతడు తనను గురించి ఆ ఊరి వాళ్ళకు చెప్పుకున్నది ఇంతే.

త్వరలోనే అతను గవర్నరుగారి పార్టీకి హాజరయ్యాడు. ఇందుకు తయారుకావడానికి అతనికి రెండు గంటలకన్నా ఎక్కువకాలం పట్టింది, ఈ సారి అతను మామూలు కన్న ఎక్కువ శ్రద్ధగా ముస్తాబయ్యాడు. భోజనానంతరం చిన్న కునుకు తీసి లేచి సబ్బూ, నీరూ కావాలన్నాడు. తన బుగ్గలను నాలుకతో లోపలి నుంచి పైకి తోస్తూ చాలాసేపు సబ్బువేసి రుద్దాడు; తరువాత వెయిటర్ భుజంమీదనుంచి తువాలు తీసుకుని, వాడి ముఖాన రెండుసార్లు గట్టిగా గాలి వదలి, చెవుల వెనుక ప్రారంభించి తన మొహాన్ని అన్ని వైపులకూ తుడుచుకున్నాడు; తరువాత అద్దంముందు నిలబడి రొమ్ము మీద షర్టు అమర్చుకుని, ముక్కులోనుండి బయటికి వచ్చే రెండు వెంట్రుకలను పీకేసి, ఎర్రరంగు డ్రెస్ కోటు, పొట్టిది ధరించాడు.

ఇలా ముస్తాబై అతను బండీలో ఎక్కి బయలుదేరాడు. వీథులు అతి వెడల్పుగా ఉన్నాయి. అక్కడక్కడా కిటికీలలో నుండి వచ్చే వెలుగు తప్ప రోడ్లపైన వెలుగు లేదు. గవర్నర్ గారి భవనం దేదీప్యమానంగా ఉన్నది. వెలిగించిన దీపాలతో ఎన్నో బళ్ళు వచ్చి వున్నాయి. వాకిట ఇద్దరు పోలీసులు గుర్రాలెక్కి ఉన్నారు, దూరాన కాసా* వాళ్ళు కేకలు పెడుతున్నారు – ఇంతెందుకు, సమస్తమూ ఉండవలసిన తీరుగా ఉన్నది.

(ఇంకా ఉంది)
*కాసా వాళ్ళు = దాసులు లేక వెట్టివాళ్ళు

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.