నందనవనం – వచనకవి సమ్మేళనం – రెండవ భాగం

ఎదురు చూస్తూ

– స్వాతీ శ్రీపాద

పొరలు పొరలుగా ఊరుతున్న రణగొణ ధ్వని తెరలపై
అప్పుడే చిత్తడిగా మెరిసిన కన్నీళ్ళ నీటి చెలమ ఒడ్డున
తల తుడుచుకుంటున్నసూరీడి వెలుగు వాగులో
గలగలలను వింటూ
నిద్ర కళ్ళతో చలి పొగలు వదులుతూ
కాలం నరనరానా ఒక్కోచుక్కగా ఇంకుతున్న  సౌందర్య వివశతలో
వసంతం అటు ఒరిగి ఇటు ఊగి
సయ్యాటల్లో రూపాలు మార్చుకుంటూ
చిరునామా గుర్తింపుకోసం ఒకదానితో ఒకటి తలపడుతూ
నీలిగగనం ఆధిపత్యానికి తోదచరిచి పెనుగులాడే నిండు మేఘాలు
మంచు కన్నీళ్ళో హిమ పాతం అధికార జలపాతమో
మసక మసక పొగలు కనుమరుగు చేసే నవనీతపు ఉషస్సులు
ఆకుపచ్చ కొండా కోనల్లో ఆగకుండా  నర్తిస్తున్న ఆనంద హేల
అలసిసొలసి ఆకులు రాల్చి విశ్రమించిందేమో
శూన్యంతో ముచ్చటిస్తున్న నగ్న శాఖోపశాఖలు
పంచుకునే విషాదం తాగి
అదృశ్యంగా పచార్లు చేస్తున్న రేపటి తరాలు
కొత్తచిగుళ్ళై మోడు వారిన కొమ్మల గుండెల్లో పసిపాపలై
నిశ్శబ్దంగా ఒక ఋతువుకు జీవంపోస్తూ…
చీకటిదే రాజ్యం కాదు,
శిశిరం కాలాన్ని తాకట్టుపెట్టుకోలేదు
కాస్త ముందో వెనకో సహనం వికసిస్తుంది
వెయ్యి వసంతాలుగా ఎదురు చూపులు ఎడారి ఎండమావులు కావు
ఏనాటికైనా పల్లవించే ఒయాసిస్సులు
వసంతాన్ని కాలం పల్లకిలో  మోసుకు వచ్చే బోయీలు
అందుకే
ఎదురు చూపుల శిలువపై ….

——–

 

అందంతే అలా జరిగిపోతుంటుంది..

-కె. లుగేంద్ర

వేకువ జాముననే లేచి నడిచినంత మాత్రాన చీకటి పోయి సూర్యోదయం వచ్చినట్టుకాదు.. సాయం సంధ్య లో బతుకు మసకబారిందని జడిసి నింగి చుక్కల చీర కట్టుకున్నట్టు కాదు.. ఎందుకని ప్రశ్నించకు అందంతే అలా జరిగిపోతుంటుంది కాలం కర్పూరమై కరిగిపోతుంటుంది   పేద, గొప్పతేడా ఎక్కడుంది కనుల రెప్పలు మూసినప్పుడు కలల రెక్కలు విచ్చుకుంటాయి కనులు తెరిచి చూసినప్పుడు అలజడి అలలు క్రమ్ముకుంటాయి పుట్టుక, చావు మాత్రమే సమానమై బతుకంతా తారతమ్యం ఉన్నప్పుడు పగటి కలలు కూడా పగబట్టి ఒక నిర్దిష్ట వలయంలోనే ఉండిపోతాయి   ఎంతగా నటించినా మోముపై పులుముకున్న నవ్వుల ఇంద్రధనస్సు వట్టిదని తేలిపోతుంది. ఎంతగా దట్టించినా మాటలలో నింపుకున్న డాబుసరి గాలి తీసిన ట్యూబులా వాలిపోతుంది.   నిస్సహాయంగా చూసే కళ్ళను తప్పు పడితే ఏమోస్తుంది. జలపాతమై నేల రాలే కన్నీటి చుక్కలు తప్ప నిర్దయగా మారిన మనసు పొరలను తిడితే ఏమోస్తుంది వికలమైన నోట రాలే సారీ అనే రెండు పదాలు తప్ప

——-

మరో కవిత

– జాన్‍హైడ్ కనుమూరి

దేహాన్ని గాలిలో తేల్చి వుంచాలనుకుంటాను అది ఎగరడమని నీవంటావు ఆకర్షణేదో క్రిందికి లాగిపెడ్తుంది నా ప్రయత్నాలకు రెక్కలులేవని గుర్తుకొస్తుంది గమ్యాన్ని చూసే కళ్ళపై రెప్పలు భారమనిపిస్తాయి కునుకుపడిందో కలలన్నీ భూకంపపు భవనశిధిలాలౌతాయి భారమైన కదలికల్లోంచి కుబుసం విడిచిన దేహం విడిపోతుంది అడుగులు చక్రాలై కదిలిపోతాయి చాపిన హస్తం అందుకోవడానికి వురకలువేస్తుంది నిలిపినచూపు  నిరంతరం సంఘర్షణల మధ్య నలుగుతూంది రెక్కలగుఱ్ఱంపై రాజకుమారుడు నావైపే వస్తుంటాడు

———

 

మట్టి – మరికొన్ని ప్రశ్నలు 

–      సిరికి స్వామినాయుడు

అన్నమారబోసిన దా(గఱలా.. మా యింటిల్లిపాదికీ ఆకలి తీర్చిన భూమి… పత్తి పూవై విరిసి మా చిరుగుల ఒంటిమీద సిగ్గును కప్పిన భూమి పెళ్ళిళ్ళు పేరంటాళ్ళో పెద్ద ముత్తైదువై కథా కార్యాల్ని గట్టేక్కించిన భూమి… పండగ పున్నాల్ని ఒంటి చేత్తో యింటి యిల్లాలై ఒడ్డెక్కించిన భూమి తలపాగా చుట్టి, భుజం మీద కండువా పెట్టి మట్టి పీఠం మీద నన్ను మారాజును చేసిన భూమి తరాల జీవనదై మా సంసారాల్ని సారవంతం చేసిన భూమి…యిప్పుడెందుకు బిడ్డల్ని తినే పెద్ద పులైంది? నేల తల్లి ఒడిలో పారాడాల్సిన నన్ను పాలేరును చేసి వలసెందుకు పొమ్మంటోంది?!అప్పుల నిప్పుల మీద నన్ను మొక్క జొన్న పొత్తును జేసి బతుకును పచ్చిపుండు చేసి చాలు మీద శవాల్నెందుకు పండిస్తోంది!? భారమై, నలుగురు దొంగలెత్తుకు పోయిన నల్ల మేకలా నాకు దూరమయ్యిందెందుకు?! యిన్నేళ్ళు కరువు కురిసిన నేల యిపుడెందుకక్కడ మోన్సాంటో మొగ్గై రాలుతోంది?! నా కంచంలో బుగ్గిపోసి కలవాడింట కాసులెందుకు కురిపిస్తోంది?! నేనున్నాను! భూమీ వుంది! నా రెక్కల కష్టమూ వుంది! మరి భూమి?? మరుభూమైందెందుకో….?!

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.