నిత్యాన్వేషణే జీవితం

జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/)

చూపులు వెతుకుతుంటాయి
కుత కుత మంటూ

గిన్నెలో వుడుకుతూనే వుంటుంది

పైకి కనిపించేదంతా

ఆవిరై అదృశ్యమౌతుంది

చూపులు వెతుకుతుంటాయి

నాల్గు రోడ్ల కూడలిలో

నాట్యమాడుతున్న నియాన్ కాంతిలో

జీవిత మాధుర్యమేదో

జుర్రేయాలని ఇటూ అటూ చూస్తుంటాయి

చూపులు వెతుకుతుంటాయి

ప్రయాణ సమయాలలో

ఎదురయ్యే

అనేకానేక భంగిమల ఆకృతుల్లో

సరికొత్త రసాన్వేషణ సాగిస్తాయి

చూపులు వెతుకుతుంటాయి

జీవన శంఖారావంలో

మనసు పొరల్నించి

జారిపోయిన వాస్తవాల మూలాలకోసం

తవ్వకాలుగా సాగిపోతాయి

చూపులు వెతుకుతుంటాయి

కవి హృదయాన్ని పిండి

అక్షరాలను విత్తనాలుగా నాటిపోతే

చిగురిస్తున్న ఆకుల మధ్య

లేనిమొగ్గల కోసం

తడుములాట మొదలౌతుంది

చూపులు వెతుకుతుంటాయి

ఎండకాస్తే నీడకోసం

వానవస్తే ఎండకోసం

చలివేస్తుంటే వెచ్చదనం కోసం

నిరంతరం

లేనిదేదో తలపోసుకుంటూ

జీవితాలు సాగిపోతుంటాయి

వెదికేది దొరుకుతుందా

?
దొరికింది వెదికేదేనా

?
తృప్తి అసంతృప్తుల మధ్య నిత్యాన్వేషణే
!

జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/)

(వీరు రాసిన ‘హృదయాంజలి’ కవితాసంపుటి మార్చి 2004 లో శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన ‘హసీనా’ గురజాడ రాసిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి ‘అలలపై కలలతీగ’ కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది. వీరి గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని వీరి బ్లాగులో చూడవచ్చు.)

Posted in కవిత్వం | 4 Comments

జూలై గడి సమాధానాలు

తప్పుల్లేకుండా పూరించినవారు:

బి. కామేశ్వరరావు, స్వాతికుమారి.

అసంపూర్తిగా:

శ్రీరామ్.

ప్రయత్నించినవారందరికీ అభినందనలు!!

1నా 2గా 3నం ది 4ని
5పా
6పాం 7 8 న్యం
9రా నం ది
10రా బం దు

11కా డి
చా
12కం 13 డం
14 15 16 రం
17
లు
18 19డి
20 డి
21వి ను

22రా పో
23రం 24 తి
25పా ము
26సా కే 27మే
28అం గి
29 ర్ణ
వే
30రా కా 31సి
డి
న్యో

32
33రి 34వా జు
35రా 36
37 న్యా 38సీ
వి


39పే
40ను 41డి
42శ్ర 43
44 ణా నం
45ర్మా

46


47రా సం
48వా దో డు
గు
49వి తం డా లు

50సం తో షం
51దొ డ్డ

1. శంకరాభరణానికి శివుడి వాహనాన్ని జోడిస్తే నిజంగా సరాగమే (నాగానందిని) : నాగానందిని కర్ణాట సంగీతంలో ఒక రాగం పేరు.
6.
అందమైన అమ్మాయి మెడలా ఉండాలా – మరైతే ఐదులోంచి పుట్టించు మురారీ? (పాంచజన్యం): అందమైన అమ్మాయి మెడని శంఖంతో పోలుస్తారు కవులు.
9.
రోజును రమ్మంటే వీపు చూపింది (రానంది) వీపు చూపిన ‘రోజు’ (దినం) నంది

10. శ్మశానంలో చక్కర్లు కొట్టేవానితో ఉంటేగింటే శివుడి కుండాలి గాని అనుబంధం మధ్యలో రాముడికేంటి? (రాబందు)

11ఇదెత్తుకొచ్చిన గడుసుపిల్లడుకనబడితే నాకొళ్ళు తెలవదు అని నాయిక పరవశం (కాడి): దసరాబుల్లోడులో కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు అని పాటుందికదా?

12. దండకం కమలడం పద్యంతో మొదలు (కందడం) కమలడం = కందడం. కందం ఒక పద్యం.

14. నిద్రలో లభించిన పెన్నిధి, పోయిందనా అంత కంగారు? (కలవరం = కల+వరం)

18. బుడుతడు నడువగ అడుగులు పడెనిలా… (తడబడి)

20. ఉత్తరాదివాళ్ళ మజ్జిగపులుసు (కడి)

21. ఆకాశం చెప్పేది ఆలకించు (విను) విను అంటే ఆకాశం. ఆలకించు = విను

22. తికమకపడకుండా పోయిరా (రాపో) తికమక: anagram indicator. పోయిరా = రాపో.

23. మొఖానికి రంగులేసుకొని మరీ నాటకాలాడే మొగుడికి ముద్దుపేరు ఏంపెడతారు? (రంగపతి)

24. క భాషలో తలతెగిన పాము తినదగినదే (పాకము) క భాషలో పాము: కపాకము. ‘తల’ తెగితే పాకము.

26. అయోధ్యే! (సాకేతమే) అయోధ్యనే సాకేతపురి అంటారు. ఇంకోలా చెప్పాలంటే సాకేతపురి జయించరానిది కాబట్టే దానికి అయోధ్య అని పేరు వచ్చింది.

28. చొక్కా పొట్టిదైపోయింది (అంగి) అంగరఖా/అంగీ = చొక్కా. పొట్టిదైపోతే అంగి.

29. ఎండుటాకులు మాత్రమే తిన్నదీ అన్నపూర్ణ (అపర్ణ ) : శివుడిని భర్తగా పొందడానికి తప్పస్సు చేసిన సమయంలో పార్వతి ఎండుటాకులు మాత్రమే తిన్నదట. అందుకే ఆవిడకి అపర్ణ అనే పేరు వచ్చింది.

30. పున్నమి చంద్రుడితో రాక్షసి (రాకాసి) రాకా = పున్నమి చంద్రుడు

33. బిర్లా వారి కంపెనీ సరిచేస్తే మామూలైపోదా? ( రివాజు) బిర్లా వారి కంపెనీల్లో ఒకటి జువారి. సరిచేస్తే రివాజు = మామూలు

35. శ్రీకృష్ణుడి ప్రేమధారలో తడిసి తరించింది (రాధ)

37. సీసన్యాయం సరిగా లేదు. ఆశ్రమవాసిని పిలవండి (సన్యాసీ) సీసన్యాయం లోని మొదటి మూడక్షరాలకు ఇది anagram. ‘సరిగాలేదు’ అనేదొక anagram indicator.

40. శ్రద్ధగ వినుడీ మాట (నుడి) నుడి = మాట

42. బౌద్ధ భిక్షువు పాపం ఎంత కష్టపడ్డా కణమైనా రాలలేదు గాబోలు (శ్రమణక) :శ్రమణకుడంటే బౌద్ధ భిక్షువు.

44. రమణీ లహరిలో పడితే మునగడమే తప్ప తేలడముండదు (ఋణానంద) : ఋణానంద లహరి ముళ్ళపూడి సాహిత్య సర్వస్వంలో వచ్చిన ఒక సంపుటి. అది చదవడం మొదలుపెడితే ఆపలేమని, అప్పుల్లో పడితే కోలుకోలేమని శ్లేష.

45. రంగమెళ్ళడం కాదు, తిరిగిరావడం (ర్మాబ) బర్మా రాజధాని రంగూన్ ను గతంలో ’రంగం’ అని కూడా అనేవాళ్ళు

46. అక్కడ నొక్కి పలికినా అర్థం మారదు (2) (అల) “అల వైకుంఠపురంబులో” అన్నా, “అదివో అల్లదివో” అన్నా అర్థం ’అక్కడ’ అనే కదా?:

47ఏలినవారి దర్పం (3) రాజసం

48. చేతసాయం కుదరకపోతే, మాటసాయనికైనా నిలవరూ? (వాదోడు) (చేదోడు-వాదోడు అంటారు – చేదోడు అంటే చేత సాయం, వాదోడు అంటే మాట సాయం)

49. వాదాలకు దారితీసే వికటించిన గుంపులు(4) (వితండాలు)

50. మనోవ్యాధికి సగం మందు? (సంతోషం) : సంతోషం సగం బలం.

51. పెద్దమ్మ.. దొడ్డ


నిలువు:

1. నారాయణా వేసిన బాణాలు చాలు (నారాచాలు) – నారాచాలంటే బాణాలు.

2. ప్రియురాలితో రాజీపడ్డ జగదేకవీరుడు ప్రేయసినుంచి కోరిందేమిటో? ( గానం) : జగదేకవీరుని కథ సినిమాలో “అయినేదేమో అయినది ప్రియ, గానమేదే ప్రేయసీ” అనే పాట ఆధారంగా.

3. అంత ఎద్దు పావురంతో కలసి సింహాసనమెక్కితే కొండవీటిలో పూజలందుకొన్న కత్తికటారి (4,4) (నందికంత పోతరాజు) – నందికంత పోతరాజు అనేది కొండవీటి రెడ్డిరాజుల ఇలవేల్పు అయిన ఒక కత్తి. దీనిని స్వర్వజ్ఞ సింగభూపాలుడు, యుద్ధంలో కొండవీటి రాజులనోడించి పట్టుకుపోతే, అతనిని మెప్పించి శ్రీనాధుడు కొండవీటికి తిరిగి తెచ్చాడట.

4. స్త్రీలింగం ఆకాశాన్నంటి భేషజాన్ని వదిలేసింది (నిరాడంబరం): అంబరం = ఆకాశం, స్త్రీలింగం (ఆడ) ఆకాశాన్నంటితే – అంటే అంబరంతో కలిస్తే ఆడంబరం, బేషజాన్ని వదిలేస్తే – నిరాడంబరం.

5. రాజముద్రికకు సైతం ఏనాడూ లేని గౌరవం దీనికి దక్కింది మరదే చెప్పుకో చూదాం (పాదుక) – మొదట భరతుడి నెత్తినెక్కి, పిదప అయోధ్యనేలింది కదా? చెప్పుకో అనే పదంలో చెప్పుకి పర్యాయపదమని సూచించటం జరిగింది.

7. ఈ కారం పడకపోతే వ్యాసుడు శ్లోకం చెప్పలేడని కాళిదాసు వ్యంగ్యోక్తి – సంస్కృతంలో కంజంక్షన్ (చకారం ) : కాళిదాసు సినిమా చూసినవారందరికీ ఈ కథ తెలిసిందే.

8. ముదిరితే గాలివాన (జడి)

13. సరళంగా ఉండేవి వణుకు పుట్టిస్తాయా? (దడ) ద, డ రెండూ సరళాలే

15. చెదిరిన నుదుటిబొట్టు(లతిక)

16. దిక్కు తెలియని వేగం (వడి) (భౌతికశాస్త్ర నిర్వచనాల ప్రకారం)
17.
కొండదారిలో కాకైనా కదలని రోజు (కనుము) : కనుమునాడు కాకైనా కదలదని సామెతుందికదా? కనుమ అంటే కొండదారి
19.
దుకాణం కట్టేశాం. దొడ్డిదారిన ప్రయత్నించండి (డిగఅం)

21. చెవి తెగిన పాండవజ్ఞాతి? (వికర్ణ)

22. ఇందువదనకి ముందు చేరగల మరో విశేషణమే (రాకే)

24. ఢిల్లీలో ఇల్లద్దెకి కావాలంటే ముదుపుకోసం తలపాగా తాకట్టు పెట్టొచ్చు. (పగిడి తలపాగా, ఇల్లద్దెకి తీసుకొనే ముందు కట్టే ముదుపుని కూడా పగిడీ అనంటారు)

25. పాపం చిన్నది (పాప)

26. దక్షిణాదివాళ్ళ జీవనది పేర్లో మొదటక్షరం నీవైతే? (కావేరి) (సా అంటే సంస్కృతంలో నీవు అని అర్ధం. కావేరిలో మొదటక్షరం సా అయితే, సావేరి) సావేరి

27. పంచపాషాణాల్లో తెనాలి రామలింగని పద్యం నిండా ఇదే కదా? (మేకా) : శ్రీనాథుడు రాసిన నాలుగు పద్యాలు, తెనాలి రామలింగడి మేకతోక పద్యము కలిపి పంచపాషాణాలంటారు.

29. ఒకరిమీద మరొకరు ఆధారపడి చిలకాగోరింకల్లా ఉంటే తప్పా? (అన్యోన్యాశ్రయ దోషం)

31. తనికెళ్ళ భరణికి పేరు తెచ్చింది (సిరా) తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన సిరా అనే లఘు చిత్రం అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది

32. సన్డ్రీమ్క్లాత్ (రవికల గుడ్డ)

34. వాతావరణం కంగితే కొంపలంటుకోవచ్చు (వారణావతం): వారణావతంలోనే కదా పాండవుల లక్క ఇల్లు దహనమైనది?
36.
చలికాలంలోనైనా నెలరోజులు ఎక్కుపెట్టొచ్చు (ధనుర్మాసం)
38.
దొరలొచ్చేది ఇక్కడనుంచే (సీమ)

39. పెద్దమ్మ బిడ్డ (పేదరాలు) –

41. పూర్వకాలంలో అయ్యవార్ల అరుగులమీద నడిచేది, ఇప్పుడు పెరటి దోవ పట్టింది (డిబ)

43. కింది నుంచి చదివినా పైనున్నదే…చిన్నబోయిన పాత కరెన్సీ (అణ): సాధారణంగా ’ణ’ను అణ అని పలుకుతాం. పాత కరెన్సీ అణా.

48. దొడ్డి దారా? (వాతో) వెనుక నుంచి ’తోవా’.

Posted in గడి | Tagged | 1 Comment

అతిథి, కవిత, సమీక్ష

ఈ నెల అతిథి ప్రముఖ బ్లాగరి తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు మన జాతీయ కళారూపాల సంరక్షణ గురించి రాస్తున్నారు. దాంతోబాటే ప్రముఖ కవయిత్రి లలితా ముఖర్జీ గారి కవిత “డిటో, డిటో”, ఇటీవలే విడుదలైన “కడప కథ” కథాసంకలనంపై సమీక్ష అందిస్తున్నాం. ఇక జ్యోతిగారు మిమ్మల్ని టైమ్ మెషీన్ ఎక్కించి ’కళ్ళు తిరిగేదాకా’ తిప్పాలని “సరదా” పడుతున్నారు.

ఇప్పటిదాకా ప్రతినెలా ఒకటో తేదీన వెలువడుతూండిన గడిని ఈ నెల నుంచి నిర్వహణాపరమైన కారణాల వల్ల ఏడో తేదీకి మారుస్తున్నాం. గడి గడువు కూడా ఏడో తేదీనే ముగుస్తుందని గమనించగలరు. గతనెలలో ప్రకటించిన వాటిలో బ్లాగుసమీక్ష, గ్రంథపరిచయం అందివ్వలేకపోయాం. వాటిని ఈ నెల నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ నెల రచనలు:

మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి)
డిటో, డిటో (కవిత)
కడప కథ (సమీక్ష)
టైమ్ మెషిన్ (సరదా)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా… – 1 (అతిథి)
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా…- 2 (అతిథి)
మృతజీవులు – 2 (మృతజీవులు)
మృతజీవులు – 3 (మృతజీవులు)
అన్నదాత బోర్లాగ్ (వ్యాసం)
మంచి సినిమా (సినిమా)
తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (వికీ)
నేను చదివిన నవీన్ (వ్యాసం)
ఎర్రకోట (వ్యాసం)
గడి (గడి)
సారంగపాణికి సామెతల సుమ మాల (సరదా)

Posted in ఇతరత్రా | Comments Off on అతిథి, కవిత, సమీక్ష

డిటో, డిటో

-లలితా ముఖర్జీ (http://roudrisms.blogspot.com/)

మన చిన్నపుడు
మనల్ని రాక్షసులు చెర పట్టారు
చేతులు కడిగీ మూతులు తుడిచీ
తలంటి స్నానాలు చేయించీ హింసలు పెట్టేరు
రాత్రిళ్ళు వెన్నెట్లో వెలిసిన కొమ్మల వెర్రి నాట్యాలు
చూసి జడుసుకొమ్మని వదిలేసారు
గడియారాల టిక్కుటిక్కుల్లో
భూమి సంతానాన్ని నమిలి మింగే చప్పుళ్ళు
మెలుకువొచ్చిన పీడకలల్లో వినమని శాసించారు

పగటి వేళల్లో మనం పంచదార నవ్వులూ
చేగోడీల వుంగరాలు తొడుక్కున్న వేళ్ళతో
చెమ్మచెక్క లాడుకున్నాం
జేబుల్లోని గచ్చకాయలూ గోళీలూ బొంగరాల తాళ్ళూ
చరాస్తులుగా మనం వ్యాపారాలు చేసాం
మేజాల కింద బూజూ మంచాల కింద నవారు నేతా
మనకి సుపరిచితాలు
చీమలూ చిట్టి పురుగులూ పిల్లిపిల్లల మీద
మనం జులుం చెలాయించాం
గులక రాళ్ళతో ప్రహరీ గోడలు కట్టి
యిసకలో పుల్లలతో గీసిన రాజభవనాలని
మనం రక్షించుకున్నాం
వొంటి కంటితో మనం వొక్క గడ్డిపరక
పచ్చదనాన్ని పరిశోధించాం

మామిడిపళ్ళ రసంలో పొగడపూల వాసనలో
నూతినీళ్ళ చల్లదనంలో
మధ్యాహ్నాల వేడిలో
పెద్దలందరూ నిద్దర్లోయే వేళల్లో
వేసంగి సెలవుల స్వర్గం మనని తాకింది

అదంతా మనకి కాలం తెలియని కాలం
యిపుడు వేరు, నేర్చుకున్నాం కద.
అంచేతే మన పిల్లలకీ అదే నేర్పుదాం.

-లలితా ముఖర్జీ (http://roudrisms.blogspot.com/)

“అప్పుడప్పుడూ కవిత్వం, అనుకోకుండా నవలలు రాసే” (I am an occasional poet, accidental writer) లలితాముఖర్జీ నిశీథిసంగీతం, నిద్రపోని పాట అనే కవితాసంపుటాలు, పారిపోయిన వసంతం, అగ్నిపంజరం అనే నవలలు వెలువరించారు. ఇరవయ్యేళ్ల క్రితం, స్వీయ కవితాసంపుటి ‘నిద్రపోని పాట’కి ముందుమాటలో “కవిత్వానికి యీ రోజుల్లో చలామణీ అవుతున్న అనేక ఇజాల్లో నాది కేవలం రౌద్రిజం మాత్రమే” అని రాసుకున్నారు లలితా ముఖర్జీ. “ఒక విశుధ్ధ చిత్తవృత్తినుండి వెలువడిన కవితలు” అన్నారు శ్రీ శ్రీ ‘నిశీథిసంగీతం’కి ప్రివ్యూ వ్రాస్తూ. “అనుభూతి సాంద్రత గుండెలో ఇమడలేనప్పుడు విస్ఫోటిస్తుంది; ఓసారి ముకుళంలా –ఓసారి జ్వాలా గర్భశిఖరంలా. రౌద్రి కవితాశీలమూ ఇదే అనుకుంటాను. ‘నిద్రపోని పాట’ అనే శీర్షిక ఈ విస్ఫోటన గుణానికి ప్రతీక” అన్నారు సినారె ‘నిద్రపోని పాట’కు రాసిన ముందుమాటలో. తన చివరి కవితాసంపుటి 1987లో వెలువరించిన లలిత గారు గత సంవత్సరం బ్లాగడం మొదలుపెట్టినప్పట్నుంచి క్రమం తప్పకుండా రాస్తున్నారు. తెలుగులో రౌద్రి, ఆంగ్లంలో lalitalarking వీరి బ్లాగులు. గళ్లనుడికట్లంటే వీరికి విపరీతమైన ఆసక్తి.

Posted in కవిత్వం | 1 Comment

టైమ్ మెషిన్

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

jyothi.bmp

ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి….

1975 జనవరి 1

ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా ఏళ్ళయింది. దానికి ప్రకాశమే వ్యవస్థాపక నిర్వాహకుడు. ఇంతలో బయటనుండి కలకలం వినిపించింది. ప్రకాశం ఏంటా అని బయటకెళ్ళి చూసాడు.

అనాథాశ్రమం మెట్లపైన చీరలో చుట్టిన ఒక పసిపాప. ఆడపిల్ల. అంతటి చలిలో రోజుల పాపను అలా వదిలేసి వెళ్ళిన వాళ్ళపై ప్రకాశంకు చాలా కోపం వచ్చింది. ముద్దులొలికే ఆ పసిపాపను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

17 ఏళ్ళ తరవాత..

ఆ పసిపాప (పద్మ) పెరిగి పెద్దదై ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. పద్మ వాళ్ళ క్లాస్‍మేట్ ఒకతనిని ప్రేమించింది. ఇద్దరొకటై గర్భవతైంది. అది తెలిసి హాస్టల్ నుండి గెంటేసారు. ప్రకాశం అది తెలుసుకుని వచ్చి పద్మను తిరిగి అనాథాశ్రమానికి తీసికెళ్తాడు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది, కాని ఆ పాపను ఎవరో ఎత్తుకెళ్తారు. అది విని తట్టుకోలేక ప్రకాశం ఆత్మహత్య చేసుకుంటాడు.

ప్రసవ సమయంలో కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల పద్మ డాక్టరును కలిసింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టరు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు: ఆమెకు Adrenalo Sytosis అని, ఇది ఒక సీరియస్ జబ్బు .. దీనివల్ల శరీరంలో హార్మోనుల అవకతవకలు జరుగుతాయి. ఆపరేషన్ చేయాలి అని. కొద్ది రోజుల తర్వాత పద్మకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ ఫలితంగా ఆమె మగవాడిగా (ప్రభు) మారిపోయింది.

ప్రభు చాలా బాధపడుతూ ఉండేవాడు, తన కన్నబిడ్డను పోగొట్టుకున్నందుకు, తనను పెంచిన ప్రకాశంగారు చనిపోయినందుకు, తన ప్రేమికుడు మోసగించినందుకు, మగవాడిగా మారవలసి వచ్చినందుకు… ఇది తలుచుకుంటూ తాగుడుకు అలవాటు పడ్డాడు.

ఒకరోజు ప్రభు తమ కాలనీలో ఒక కొత్త బార్ తెరవడం చూసాడు. దాని పేరు “అమృతా బార్”. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. ఆ వ్యక్తి ప్రభును పిలిచి తాను కనుగొన్న “టైం మెషీన్” చూపించాడు. ప్రభు ఆ వ్యక్తిని బ్రతిమిలాడి అది ఇంటికి తెచ్చుకుని తాను గతం లోకి వెళ్ళాడు. 1992 సంవత్సరంలోకి….

1992 సంవత్సరం…

ప్రభు తన టైం మెషీన్తో పాటు 1992 సంవత్సరంలోకి అడుగెడతాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు( అదే మగవాడిగా మారక ముందు ఉన్న అమ్మాయి). ఆమెని ప్రేమించి, కలిసి తిరిగి, ఒకానొక గడియలో ఒకటవుతారు. ఆ అమ్మాయి గర్భవతైంది. ప్రభు ఆమెను పెళ్ళాడటానికి నిరాకరించి, ఆ ఊరినే వదిలి వెళ్ళి పోతాడు. అలా ఇంకో ఊరికెళ్ళి కొంత డబ్బు సంపాదించి తిరిగి తను ప్రేమించిన అమ్మాయి ఉన్న ఊరికొస్తాడు.

కాని తనను గుర్తుపట్టకుండా ఉండాలని బారెడు గడ్డం పెంచుకుంటాడు.ఒక బార్ మొదలెడతాడు. “అమృతా బార్ “అని. ఒక రోజు అతను బార్లో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వస్తాడు( అదే వ్యక్తి ఇంతకు ముందు అమ్మాయిగా ఉన్నవాడు). గడ్డపు వ్యక్తి తన దగ్గరున్న టైమ్ మెషిన్ను ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి దాని సాయంతో గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక ముసుగు దొంగ వచ్చి కత్తి చూపించి ఆ టైమ్ మెషిన్ తన దగ్గర్నుంచి లాక్కుని ఆ గడ్డపు వ్యక్తిని తీసుకుని గతంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళాక ఆ ముసుగు దొంగ ఆ మెషిన్ తిరిగిచ్చేసి గడ్డపు వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు.

గడ్డపు వ్యక్తి అలా అలా తిరుగుతూ బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. లోపలికెళ్ళి చూస్తే అక్కడొక అమ్మాయి (తర్వాత అబ్బాయిగా మారిన అమ్మాయే), పక్కన అప్పుడే పుట్టిన ఆడపిల్లను చూస్తాడు. ఆ పసిగుడ్డును తీసుకుని టైమ్ మెషిన్ మొదలెట్టి ఆ పాపతో సహా గతం (1975) లోకి వెళతాడు.

1975 జనవరి 1

ఉదయం సుమారు నాలుగున్నర అయింది. గడ్డపు వ్యక్తి ఆడపిల్లతో బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. ఆ పాపను ఆశ్రమ గుమ్మంలో వదిలి వెళ్ళిపోతాడు. కాలేజీలో చేరి బాగా కష్టపడి చదివి డాక్టరవుతాడు. ఒక రోజు ఒక స్త్రీ అతని ఆసుపత్రికి వస్తుంది. ఆమెను పరీక్షించి, ఆమెకు Adrenalo Sytosis అనే ప్రమాదకరమైన జబ్బు ఉన్నట్టు కనుగొని ఆపరేషన్ చేసి ఆ స్త్రీని మగవాడుగా మారుస్తాడు. ఆ తర్వాత టైమ్ మెషిన్ సహాయంతో గతంలోకి వెళతాడు. ఆప్పుడు అతను జనాలు పడుతున్న కష్టాలు చూసి మనసు ద్రవించి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభిస్తాడు. దానికి బాపూ అనాథాశ్రమం అనే పేరు పెట్టి అనాథ పిల్లలకు ఆసరా ఇస్తాడు.

ఒక రోజు అతని ఆశ్రమం ముందు ఎవరో ఒక పసికందును వదిలి వెళతారు. అతను ఆ బిడ్డను తన కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. ఆ పాప పెరిగి పెద్దదై చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు అతనికి ఒక విషయం తెలుస్తుంది: ఆ ఆడపిల్ల ఒక వ్యక్తి వల్ల మోసపోయి గర్భవతైందని, హాస్టల్ వాళ్ళు గెంటేసారని. జాలితో ఆ అమ్మాయిని తమ ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్లని కంటుంది.

ఆ వ్యక్తి…అదే ప్రకాశం భవిష్యత్తులోకి వెళ్ళాలని అనుకుంటాడు. ముసుగు ధరించి, ఒక తుపాకి తీసుకుని టైమ్ మెషిన్ తీసుకుని అమృతా బార్ కి వెళతాడు. బార్ లోపలికి వెళ్ళి ఆ గడ్డపు వ్యక్తిని బెదిరించి తనతో పాటూ గతంలోకి తీసికెళ్తాడు. కాని గతంలోకి వెళ్ళాక పశ్చాత్తాప పడి ఆ గడ్డపు వ్యక్తికి టైమ్ మెషిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా తిరిగి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చాక తెలిసిందేమంటే పుట్టిన పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళారని. అది విని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇంతకూ ఆ పసిబిడ్డను ఎత్తుకెళ్ళింది ఎవరూ????

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

(ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 1000 పైచిలుకు టపాలు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.)

Posted in వ్యాసం | Tagged | 35 Comments

కడప కథ

– త్రివిక్రమ్

కడప జిల్లాలో మొట్టమొదటి కథారచయిత భారతం నాదమునిరాజు. ఆయన 1956 లో రాసిన నీలవేణి నుంచి 2006 వరకు యాభయ్యేళ్ళ కాలంలో 55 కు మించిన కథారచయితలు రాసిన కథల్లోనుంచి ఎంపిక చేసిన 46 కథల సంకలనం కడప కథ. కడప జిల్లాలో కథాసాహిత్యం గురించి 1992లో కేతు విశ్వనాథరెడ్డి రాసిన విశ్లేషణాత్మక వ్యాసం వీటికి అదనం. ఐతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పదైదేండ్లలో వచ్చిన కథల గురించి కూడా రాయించి ఉన్నట్లైతే సమగ్ర విశ్లేషణకు అవకాశముండేది.

ఇక కథల విషయానికొస్తే,ఈ 47 కథల్లో తొలి 34 సంవత్సరాల (1956 -1989 మధ్య) కాలానికి చెందినవి 14 మాత్రమే ఉండగా మిగిలిన 33 కథలు తర్వాతి 16 సంవత్సరాల (1990-2006 మధ్య) కాలానికి చెందినవి. అంటే గడచిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలో కడప జిల్లాలో కొత్త రచయితలు ఎక్కువ మంది కలం పట్టడమో, సీనియర్ రచయితలు మరింత ఉత్సాహంతో కథలు రాయడమో జరిగిందన్నమాట. మొదటి వర్గంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్, వేంపల్లి గంగాధర్ లాంటివాళ్ళుండగా చక్రవేణు, దాదా హయత్, సొదుం జయరాం, పి. రామకృష్ణారెడ్డి (తులసీకృష్ణ), మొదలైనవారు రెండవ వర్గం.

వంశీకృష్ణ అన్నట్లు ఈ సంకలనంలో “అంతర్లీనంగా కనిపించేది ఒకే ఒక అంశం. అది భూమికీ, మనిషికీ, పశువుకీ మధ్య, ఇతరేతర సామాజిక, రాజకీయ అంశాలకీ మధ్య స్పష్టాస్పష్టంగా, విడదీసీ విడదీయరాని విధంగా కనిపించే బంధాన్నీ, దాన్ని నిలుపుకోవడంలో ఎదురయ్యే అనేకానేకాంశాల పట్ల పెంపొందించుకోవలసిన అవగాహన గురించిన సమ్యక్ పరిశీలన.”

అందులోనూ ప్రత్యేకించి కడప అనగానే గుర్తొచ్చేవి కరువు, కక్షలు, కువైట్ (బతుకుతెరువు కోసం కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఎక్కువ). అందుకు తగినట్లే ఈ సంకలనంలో కరువు యొక్క భిన్నపార్శ్వాలను చూపే కథలు అలికిడి (శశిశ్రీ), జీపొచ్చింది (వేంపల్లి షరీఫ్), కడుపాత్రం (తవ్వా ఓబుల్ రెడ్డి రాసిన ఈ కథ సన్నపురెడ్డి నవలిక తోలుబొమ్మలాట కు మాతృక), జీవసమాధి (ఇబ్రహీం), కొత్తచిగురు (దేవిరెడ్డి వెంకటరెడ్డి), కరువురాగం (సొదుం రమణ); కక్షలకు సంబంధించి కూలిన బురుజు (కేతు విశ్వనాథరెడ్డి), చుక్క పొడిచింది (పాలగిరి విశ్వప్రసాద్), చంద్రగ్రహణం (నాగులారపు విజయసారథి), సింహము-కుక్క-పులి (చెరువు అనంతకృష్ణశర్మ), గాయం (రాధేయ); కువైట్ కథలు కువైట్ సావిత్రమ్మ (చక్రవేణు), మున్నీ బేగం (ఎన్.ఎస్.ఖలందర్), చీకటి సవ్వడి (డి.రామచంద్రరాజు), మొదలైనవి ఉన్నాయి.

ఈ సంకలనంలోని మొదటి కథ “నీలవేణి”లో కథకుడు ఒక రచయిత. అతడు నీలవేణి అనే ఒక యువతి గురించి కథ రాయడానికి కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఐతే విద్యావంతురాలైన ఈ నీలవేణి కథకుడనుకున్నట్లు బేల కాదు. ఆమె తెలివితేటలకేం కొదవలేదు. తేడా వస్తే ‘ఎవరినైనా’ నిలదీసి ముక్కుమీద పిడికిలి ఝాడించే రకం.

అంతేకాదు, ఆమె మంచి మాటకారి కూడా. చిన్నప్పుడు మత్తుపదార్థాలకే మాత్రం తీసిపోని చౌకబారు పుస్తకాలు విపరీతంగా చదివినమ్మాయే కానీ వయసొచ్చాక వాస్తవపరిస్థితులను ఆకళింపు చేసుకుని, తన జీవితాన్ని తనే తీర్చిదిద్దుకుంది. ఉద్యోగం సంపాదించుకుని తనకు నచ్చినవాణ్ణే చేసుకుంది. ఐతే ఆ విషయాలేవీ తెలుసుకోకుండా ‘అలవికాని ఆశల్ని రేపుకుని జీవితంలో నికరంగా ఓడిపోయిన నీలవేణి’ కథ రాస్తూ, ‘స్త్రీపాత్ర కాబట్టి’ ఆమె మీద సానుభూతి కనబరచడం, సానుభూతి చిహ్నంగా ఆమెను చంపడం తన కర్తవ్యంగానే గాక అదొక ఫ్యాషన్ కూడా అని భావించి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు రాయడమా లేక పిచ్చిదాన్ని చేసి రాళ్ళు రువ్వించి చంపడమా అని ఆలోచిస్తున్న కథకుడికి ఆమె ధోరణి మింగుడుపడదు. ‘ఇది మీకు ధర్మమేనా మాష్టారూ?’ అని స్వయంగా ఆ నీలవేణే కట్టెదుటికి వచ్చిఅడిగినా “విద్యావివేకాలుండి కూడా వెర్రితలలు వేసేవారు, వంచింపబడి ఆత్మహత్యలకు దిగేవారు విద్యావంతులైన స్త్రీలలో లేరా?” అని ఎదురుప్రశ్నిస్తాడు. దానికామె “ఎవరో కొందరలాంటివారున్నారని స్త్రీజనోద్ధరణ అనే గోచర్మాల్ని కప్పుకుని ‘నస్త్రీ స్వాతంత్ర్యమర్హసీ’ అని గర్జించవయ్యా! పోయిందేముంది?” అని యెద్దేవా చేసి జవాబునాశించకుండా వెళ్ళిపోతుంది నీలవేణి. కడప జిల్లాలో కథాసాహిత్యం ఆలస్యంగానే ఐనా సాహిత్య ప్రయోజనమేమిటో సూచిస్తూ, ఎలాంటి సాహిత్యం రావలసిన అవసరముందో దిశానిర్దేశం చేసే నీలవేణితో మొదలై అతి త్వరలోనే శిఖరాగ్రస్థాయినందుకుంది.

నీలవేణి ప్రేరణతోనేనా అన్నట్లు ఈ సంకలనంలోనే ఉన్న ‘యంత్రం’ (రచయిత షేక్ హుస్సేన్ సత్యాగ్ని) కథలో ఒక వంచితురాలు అధైర్యపడిపోకుండా తనలాగ ముళ్లకంచెలో ఇరుక్కుని విలవిలలాడుతున్న అభాగినులకు చేయూతనివ్వడానికి నిశ్చయించుకుంటుంది.

‘కాలచక్రం’ (రచయిత డి.లక్ష్మీకరరాజు) కథలో ఒకప్పుడు దొంగతనం చెయ్యడాన్ని చీత్కరించుకున్నవాడే మారిన పరిస్థితుల్లో గత్యంతరం లేక దొంగతనం చేయబోయి పట్టుబడి పోలీసు కస్టడీలో ఇలా తర్కించుకుంటాడు: “ఆకలిగొన్న కడుపుకు అన్నం పెట్టనివారేనా తనను చితకబాదింది? తనలాగ వారికి ఆకలి వేస్తే దోపిడీ దొంగలను మించి దోపిడీ చేసేవారేనేమో?” ఈ ఆలోచనల్లో నుంచి “కష్టాల్లో గానీ మనిషి నిజస్వరూపం బయటపడదు.” అని తెలుసుకుంటాడు.

దీని తర్వాతిది రాచమల్లు రామచంద్రారెడ్డి ‘నీతిగానుగ’ కథ. తనకు ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్ళికి రెండు గంటలు ముందు జరిగిన పరిణామాల్లో పెళ్ళికూతురు కాసేపు కనిపించకుండా పోయి తిరిగిరావడం, ఆ సమయంలో పెళ్ళికొడుకు అక్క అక్కడికెళ్ళడం, దాని ఫలితంగా కట్నం ఎవరూ అడక్కుండానే అప్పటికప్పుడు రెండువేలు పెరగడం, చివరి నిమిషాల్లో కట్నం ఎక్కువిస్తామని ఎందుకు అంటున్నారో, అసలేం జరిగిందో తెలియని అయోమయంలో పెళ్ళి కొడుకు, అతడికి అసలు విషయం తెలియనివ్వకుండా పెళ్ళి జరిగేలా చూసేందుకు అతడి అక్క, నాన్న పడే ఆరాటం, ఫలితంగా జరగరానిదేదో జరిగిందని ఊహించి, ఈ పెళ్లితో తన పరువు మొత్తం గంగపాలైందని ఏడుచుకుంటూనే పెళ్ళి చేసుకుని, అసలేం జరిగిందో తెలియకపోయినా శోభనం రాత్రి భార్యతో డాంబికంగా “నువ్వు చెయ్యరాని తప్పు చేసినావు. ఐనా నిన్ను ఉదారంగా పెండ్లి చేసుకున్నాను.” అనే పెళ్ళికొడుకు, తన ప్రేమ విఫలమైనందుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అప్పటికే తీర్మానించుకున్న పెళ్లి కూతురు.

స్థూలంగా ఇదీ కథ. ఈ కథ మధ్యమధ్యలో చైతన్యస్రవంతి ధోరణిలో నడుస్తుంది. తన సాహితీజీవితంలో శిల్పానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినవాడు రారా. ఐతే చక్కటి కథనసామర్థ్యంతో ఆద్యంతం ఆసక్తికరంగా, కథలోని పాత్రలన్నిటి చేత నీతి’గానుగాడించిన’ ఈ కథ రాసేటప్పుడు మాత్రం శిల్పాన్ని అంతగా పట్టించుకున్నట్లు కనబడదు.

ఇక సొదుం గోవింద రెడ్డి రాసిన “ప్రేమ” అనే అద్భుతమైన రెండు పేజీల కథలో ఒక పెద్దమనిషి ప్రేమ అనేది సిరిసంపదలు కలవారి సొత్తేనని (‘దీనురాండ్రను ప్రేమించడానికి తమబోంట్లకు తాహతుంది’), అవి లేనివారు ప్రేమను ప్రకటిస్తే అది ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించేనని (‘ఉత్తినే ప్రేమ ఒలకబోసుకునేందుకు దానికేమంత సిరిసంపదలు కారిపోతున్నాయని!’) భావించి దారుణంగా దెబ్బతింటాడు. (‘దయ, ప్రేమ, కరుణ – అనే గుణాలు అటు వైపు నుంచి రావడం మంచిది కాదు!’ అని తీర్మానిస్తాడు కానీ వాటిని ఎలా అడ్డుకోవాలో అతడికి తోచదు.)

ఇది పేదవారి ప్రేమకు సంబంధించిన కథైతే పేదవారి నిజాయితీకి సంబంధించిన కథ ‘జవాబులేని ప్రశ్న’ (టి.వి.బ్రహ్మం). ఆసుపత్రిలో ఉన్న తన మనవడికి జబ్బుగా ఉందని, మందుకు సరిపోయేంత డబ్బులేదని, రెండురోజుల్లో తెచ్చిస్తానని, ప్రస్తుతానికి మందిమ్మని తన మందుల షాపుకు వచ్చి వేడుకున్న ముసలామె ముక్కూ మొహం ఎరక్కపోయినా నమ్మి మందులిస్తాడు కిషన్ కుమార్. ఐతే మందు తీసుకెళ్ళి పదిరోజులైనా ఆమె తిరిగిరాదు. ఇక రాదని నిరాశ చేసుకున్న తర్వాత ఒక రోజు డబ్బివ్వడానికే వస్తుంది ఆమె. అన్నిరోజులూ ఎందుకు రాలేదో తెలుసుకున్న తర్వాత ఆమె గుర్తుపెట్టుకుని తిరిగొచ్చినందుకు కిషన్ కళ్ళలోనే కాదు పాఠకుల కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతాయి.

‘గట్టిగింజలు’ కథారచయితగా ప్రసిద్ధుడైన వై.సి.వి.రెడ్డి రాసిన ‘దొంగబర్రెగొడ్లు’ దీని తర్వాతి కథ. చిన్న, సన్నకారు రైతులు పండించే పంటకు బర్రెగొడ్లను మించిన ముప్పు ఎవరివల్ల కలుగుతుందో తేటతెల్లం చేస్తుంది.

పాఠకుల మనసులను కదిలించేలా మోహ్న రాసిన “రాముల వారి గుడి ముందు” కథ ఇంతకుముందు సీమకథలు సంకలనంలో కూడా వచ్చింది. ఆదెన్న అనే చాకలి రంగారెడ్డి దగ్గర నూర్రూపాయలకు చిల్లర తెచ్చుకుంటాడు. ఆ నోటును మడిచి జోబీలో పెట్టుకున్న రంగారెడ్డి ఆ విషయం మర్చిపోయి ఆదెన్న నోటివ్వలేదని ఫిర్యాదుచేస్తే, ఊళ్ళోని పెద్దలు కలిసి ఆదెన్న చెప్పేది వినిపించుకోకుండా “వాడు సెప్పేదేంది? రంగారెడ్డేం నూర్రూపాయల కాడ యింతమందిలో అపద్ధం సెప్తాడా? రంగారెడ్డి సిల్లరిచ్చి నోటడిగేది మర్చిపోయినాడు. యిదే సందని వీడు సిల్లర తీస్కొనొచ్చి యిప్పుడు యిచ్చినానని తప్పుడుకూతలు కూస్తాండాడు…సొలకాల తెగేట్లు కొడ్తే వాడే వొప్పుకుంటాడు.” అని తీర్మానిస్తారు. అప్పటికీ ఆదెన్న “తప్పు” ఒప్పుకోకపోవడంతో అతణ్ణి “కర్రు దూయమనడం” (మడక్కర్రు ఎర్రగా కాగబెట్టి దేవునిగుడికాడ రెండుసేతుల్తో పట్కోని దుసల్ల. నాను సుల్ల (అబద్ధం) సెప్పింటే నా సేతులు కాల్తాయి. నాను దొంగతనం సేసిండననుకో నా సేతులు కాలవ్), అసలు జరిగిందేమిటో ప్రత్యక్షంగా చూసిన రంగారెడ్డి జీతగాడు తన యజమానురాలి బెదిరింపుకు జడిసి నోరు మెదపలేకపోవడం, ఈ దుర్మార్గాన్నంతటినీ దగ్గరనుంచి చూసినా ఎవురికీ సెప్పను అని దేవున్తోడు ప్రమాణం చేసిన శివు అనే బడిపిల్లాడికి పంచాయతీలో ఆదెన్న మాత్రమే ఎందుకు కర్రు దూసాడో, పెద్దమనుషులు మామనెందుకు కర్రుదూయమని చెప్పలేదో, నిజం చెప్పినా ఆదెన్న చేతులెందుకు కాలాయో అర్థంకాక వొళ్ళుతెలీని జ్వరమొస్తుంది.

కుట్ర కథల రచయితగా ప్రసిద్ధుడైన కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి రాసిన ‘ఓబిగాడు’ కథ ప్రత్యేకించి పేర్కొనదగ్గది. ఈ కథ ద్వారా ఈయన సాహితీలోకంలో చిరస్మరణీయుడైనాడు. కేతు చెప్పినట్లు కుసంస్కారం పట్ల వెగటు కలిగించగలిగిన పద్మనాభుడి ప్రాతినిధ్య కథగా నిలచిన ఈ కథలో విషాద, బీభత్స వాతావరణం పఠితలను ఊపిరి సలుపుకోనివ్వకుండా కమ్ముకొస్తుంది.

తెలుగు కథాసాహిత్యంలో ‘కువైట్ సావిత్రమ్మ’, ‘కసాయి కరువు’ లాంటి మాస్టర్ పీస్ లను సృష్టించిన గొప్ప కథకుడు చక్రవేణు. వాటిలో నుంచి కువైట్ సావిత్రమ్మ, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కథల్లోనుంచి సాహిత్యనేత్రం నిర్వహించిన కథలపోటీలో ప్రథమ బహుమతి పొందిన ‘చనుబాలు’ కథ ఈ సంకలనంలో చోటుచేసుకున్నాయి. ఉన్న ఊళ్ళో జీవనాధారం దొరక్క పొట్ట చేతపట్టుకుని కువైట్ తదితర దేశాలకు వెళ్ళేవారి వెతల గురించి మరింత మంది కథారచయితలు దృష్టిపెట్టి కథలు రాయడానికి ప్రేరణగా నిలిచిన కథ కువైట్ సావిత్రమ్మ. ఇక వ్యక్తిగతంగా తాను ఒక దళిత మహిళ చనుబాలు తాగి పెరిగినందుకే తోటివారి ముందు కించపడే ఆ ఊరి ప్రెసిడెంటుకు, దళిత-భూస్వాముల సంబంధాల గురించిన స్వస్వరూపజ్ఞానం కలగడం చనుబాలు కథాంశం. సన్నపురెడ్డి కథల్లో ఇదొక మైలురాయి.

పెన్నేటి కతల రచయితగా ప్రసిద్ధుడైన పి. రామకృష్ణారెడ్డి రాసిన ‘మనిషీ-పశువూ’ మరో గొప్ప కథ. ఈ కథలో రైతుకు-పశువుకు మధ్యనున్న అనుబంధం; రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య ఈ అనుబంధం వ్యక్తమయ్యే తీరులోని తేడాలే కాకుండా రాయలసీమలో స్థితిమంతులైన రైతు కుటుంబాల్లో సైతం పశువులను ఇంట్లోనే కట్టెయ్యడం, మనుషులు వాటితో సహజీవనం చెయ్యడం, బయటి ప్రాంతాల వాళ్లకు అది అనారోగ్యకారకంగానేగాక అనాగరికంగా అనిపించడం – ఇవేకాకుండా ఇక్కడ ఎవరికీ విడిగా పడగ్గదులు లేకపోవడంలోని వైచిత్రి, ఇబ్బందులను గురించి కూడా వివరంగా, నిష్పాక్షికంగా చర్చిస్తారు రచయిత.

ఇవే కాకుండా ఈతరం వారికి తమ కుటుంబాలను, జీవితాలను ధ్వంసం చేసిందని సేద్యం పైన కసిపెరగడం తట్టుకోలేని మనుషుల్లో భవిష్యత్ రైతాంగంపై, పల్లెలపై భయం గూడుకట్టుకుని ‘కరువురాగం'(సొదుం రమణ) ఆలపిస్తే, నిరుద్యోగుల వెతలను ‘అలకపాన్పు’ (ఎన్.సి.రామసుబ్బారెడ్డి), ‘రెకమెండేషన్’ (మలిశెట్టి జానకీరాం) కథలు రెండుకోణాల్లో ఆవిష్కరిస్తాయి. హాస్యానికో, లేక తమ ప్రత్యేకతలను బట్టో ఏర్పడే మారుపేర్లను అడ్డం పెట్టుకుని “ఒక బక్కోని బతుకుమింద బలవంతులేసిన మచ్చ”ను ఎత్తిచూపే ‘మచ్చ’ (కొమ్మద్ది అరుణారమణ), ముసలితనంలో తమవాళ్లనుంచే ఎదురయ్యే దయనీయమైన సమస్యలను విశదీకరించిన కరుణరసాత్మకమైన కథలు ‘ఈ గుండె కరగదు’ (ముంగర శంకరరాజు), ‘అంతరం’ (బిజివేముల రమణారెడ్డి). భూస్వామ్య భావజాలం ఎంతలోతుగా పాతుకుని ఉందో తెలిపే ‘తొందరపడి ఒక కోడి ముందే కూసింది’ (ఆరవేటి శ్రీనివాసులు), మతసామరస్యాన్ని చాటే కథ ‘మతాతీతం’ (మల్లెమాల వేణుగోపాలరెడ్డి), రాజకీయాల రైల్వేస్టేషన్లో వస్తున్న మార్పులను సూచిస్తూ అసలైన గాంధేయవాదులను లోపలికి రావద్దని హెచ్చరించే ‘రెక్కమాను’ (ఎం.వి.రమణారెడ్డి), అధికారమున్నవాడు అది లేనివాళ్లకు చేసే దుర్మార్గమైన అన్యాయాన్ని కళ్లకు కట్టే ‘ఎల్లువ’ (దాదా హయత్), ఈ ప్రాంతపు ఆచారాలకు, సంస్కృతికి సంబంధించిన కథలు ‘పాడె’ (సొదుం జయరాం), ‘శిలబండి’ ( వేంపల్లి గంగాధర్ & చెన్నా రామ్మూర్తి), ‘జీవసమాధి’ (ఇబ్రహీం), ‘కడుపాత్రం’ (తవ్వా ఓబుల్ రెడ్డి), ఒక భయానకమైన అనుభవాన్ని వివరించే ‘సిన్నిగాడి సికారి’ (బత్తుల ప్రసాద్), ‘వీడా నా కొడుకటంచు..’ అన్న మాటలను గుర్తుకుతెచ్చే ‘కుక్కకు కోపమొచ్చింది’ (రాణీ పులోమజాదేవి), ఒకే ఘటన గురించి మూడు కోణాల నుంచి చెప్పే ‘ఆ ముగ్గురూ!’ (డి.కె.చదువులబాబు), రియల్ ఎస్టేట్ ప్రభంజనంలో కొత్త భవంతుల నిర్మాణం కోసం ఉన్న కొంపలు కూల్చేస్తుంటే వాటితోబాటే కనీస మానవత్వం, అనుబంధాలు కూడా కూలిపోయి నిలువనీడ కోల్పోతున్న వారి కథ ‘కాసింత నీడ’ (ఎస్.పి.మహమూద్), విభిన్న ప్రణయకథ ‘యంగముని వ్యవసాయం’ (డా. ఎన్.రామచంద్ర) – ఇలా గొప్ప వస్తువైవిధ్యంతో అలరారే ఈ కథలన్నీ విలువైనవే. తప్పక చదవాల్సినవే.

ఐతే ఈ కథల్లో లోపాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు కేశవగోపాల్ రాసిన ‘సంస్కరణ’ కథలో చెప్పదలచుకున్న విషయం మంచిదే అయినా పార్వతమ్మ కొడుకైన సీతాపతికి గతం తెలియనంతమాత్రాన నీతి, అవినీతి పట్ల అంత కరడుగట్టిన భావాలుండడం, గతం తెలిసినప్పుడు అతడు అంత తీవ్రంగా స్పందించడం అసహజంగా ఉంది.అలాగే ‘పొగ(రు) మంచు’ (కేతు బుచ్చిరెడ్డి) కథ కూడా వాస్తవానికి దూరంగా ఉంది.

కథనంలో గొప్ప చమక్కులున్న కథలు పొగ(రు) మంచు, చమత్కారం ఆధారంగా నడచిన కథలు ‘మావూరి దేవర’ (గుండం రామచంద్రారెడ్డి), ‘మార్జాలోపాఖ్యానం’ (కొమ్మిశెట్టి మోహన్) లాంటివి ఉన్నాయి. ఇవేగాక ‘అబల’ (ఆచార్య పి. నరసింహారెడ్డి) చివరికి నవ్వు తెప్పించినా ఈ సంకలనంలో పూర్తిస్థాయి హాస్యకథలు లేవు.

రారా, కేతు విశ్వనాథరెడ్డి, సొదుం జయరాం, చక్రవేణు, దాదా హయత్, పాలగిరి విశ్వప్రసాద్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, లాంటి గొప్ప కథకులు రాసినవాటిలోంచి ఒక్కొక్కటే ఎంచుకోవలసిరావడం ఏ సంకలనకర్తలకైనా కష్టమే. ఐనా కడప జిల్లాకు చెందిన కథా రచయితల గురించి, వారి రచనల గురించి, కడప జిల్లావాసుల జీవితాల గురించి తెలుసుకోవడానికి అద్భుతంగా ఉపకరించే గ్రంథం ఈ కడప కథ. అంతే కాదు, మంచి తెలుగుకథలు చదవాలనుకునేవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం కూడా.

ఈ పుస్తకంలో అచ్చుతప్పులు పెద్దగా లేనప్పటికీ మాండలిక పదాలు, పదబంధాలు ఉన్నచోట్ల – యారముట్లను యూరముట్లని, “సంకలు ఎగేస్చండ్రు” అనడాన్ని “వంకలు ఎగేస్చిండ్రు” అని ఉండకుండా – మరింత జాగ్రత్తగా ప్రూఫులు చూసిఉండవలసింది.ఏమైనా ఇంత మంచి కథాసంకలనాన్ని పాఠకులకందించిన సంకలనకర్త తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణకర్త “నందలూరు కథానిలయం ” రాజేంద్రప్రసాద్ అభినందనీయులు.

కడపకథ సంకలనకర్త తవ్వా ఓబుళరెడ్డి కడప.ఇన్ఫో (http://kadapa.info) వెబ్సైటుకు గౌరవ సంపాదకులు. (బ్లాగు: http://kadapainfo.blogspot.com) ఇంటర్నెట్ ప్రభావశీలతను సరిగ్గా గుర్తించిన ఈయన ఇక మీదట ఇలాంటి సంకలనాల్లోగానీ, లేదా దీంట్లోనే “మా మాట”లో చెప్పినట్లు మలికూర్పులో గానీ మరింత సమగ్రత కోసం ఇంటర్నెట్ లో వచ్చే కథలను (ఉదాహరణకు రానారె రాసిన “నత్వం శోచితుమర్హసి”) కూడా పరిగణిస్తారని ఆశించవచ్చు.

ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలలో లభిస్తుంది. http://kadapa.info ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. లేదా నేరుగా నందలూరు కథానిలయం, నందలూరు-516150, (కడప జిల్లా) నుంచి తెప్పించుకోవచ్చు. 419 పేజీలు గల ఈ పుస్తకం సాదా ప్రతి వెల 200/-, లైబ్రరీ ఎడిషన్ 250/-.

Posted in వ్యాసం | Tagged | 2 Comments

మన జాతీయ కళారూపాల సంరక్షణ

-తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం(http://kalagooragampa.blogspot.com/)

tbs.bmp
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎయిర్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ముంబాయి నుంచి న్యూయార్క్ వెళ్ళే విమానం మీద Andhra Pradesh అని రాస్తారు. విమానం లోపల కూడా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్యాటక స్థలాల ఛాయాచిత్రాలూ సమాచార పొత్తాలూ (booklets) లభ్యమౌతాయి. మన రాష్ట్రాన్ని సందర్శించడానికి విదేశీయులు (విరాష్ట్రీయులైన భారతీయులు కూడా) దీని మూలంగా ఉత్సుకత చూపుతారని మన ప్రభుత్వం ఆశిస్తోంది.

ప్రచారపర్వంలో ఇదో కొత్త పోకడ (trend) : ఇదో కొత్త చిట్కా (technique). సందేహం లేదు. కాని పర్యాటకమంటే కేవలం స్థలాల సందర్శనేనా ? మఱింకేమీ కాదా ? అయినా తెల్లవాళ్ళని ఆకర్షించేంత ప్రత్యేక ప్రదేశాలూ, వేరే రాష్ట్రాల్లోను దేశాల్లోను లేనంత విశిష్ట స్థలాలూ మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి, ఎంత ప్రచారం చేసుకున్నా ? అని సామాన్య మానవుడి సందేహం. మన పర్యాటక శాఖ ప్రచురించే సమాచార పొత్తాలు (booklets) గాని మీరు చూస్తే వాళ్ళు మన తెలుగు మెట్రో (హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి )లకు మాత్రమే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని గమనిస్తారు. మిగతా ప్రదేశాల్ని ఒక బొమ్మతోను ఒక గద్య (పేరాగ్రాఫ్) తోను సరిపెడతారు.

విదేశీ పర్యాటకులు ఇక్కడికొచ్చేది కేవలం మన కట్టడాల్ని చూసి మురిసిపోవడానికే నని ఎందుకనుకుంటున్నారో తెలియదు. వాస్తవం చెప్పాలంటే యుద్ధాల వల్ల కావచ్చు, మనవాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, మన పురావస్తు కట్టడాలు చాలావరకు అదృశ్యమయ్యాయి. ఉన్న ఆ కొన్ని కూడా సంపూర్ణ శిథిలావస్థకు చేరుకున్నాయి. యూరప్‌లో చాలా మధ్యయుగాల నాటి భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా సంరక్షించబడుతూ ఉన్న కారణం చేత అవి మన కొత్త భవనాల కన్నా కూడా లెస్సగా బావున్నాయంటే అతిశయోక్తి కాదు. వాటిని చూసిన కళ్ళతో విదేశీయులు మనవాటిని చూడ్డం మనకు సిగ్గుచేటే తప్ప గౌరవప్రదం కాదు. అదీ గాక, వాళ్ళ నగరాల్నే మనం అనుకరిస్తూ భవనాల్నీ వీధుల్నీ రూపొందించుకుంటున్నప్పుడు వాళ్ళు మన హైదరాబాదునీ విశాఖనీ చూసి “హుర్రే” అనుకునేందుకేముంది ?

మన దేశం పట్ల ఎక్కువమంది విదేశీయులకున్న ఆకర్షణ వేరే కోణంలో ప్రసరిస్తుంది. వారిలో ఎక్కువమంది ఇండియాని చైనాతో కలిపి ద్వంద్వసమాసం చేస్తారు. అందుచేత చైనాకున్నంత ప్రాచీన నాగరికత ఇండియాక్కూడా ఉందని అందుచేత ఇండియాని కూడా ఒకసారి సందర్శించాలని వారిలో కొందరనుకుంటారు. కాని వారు ఇక్కడికొచ్చాక ఆ ప్రాచీన నాగరికత ఏమీ కనపడదు. మన గ్రామాలు కూడా నగరాలకున్న సౌకర్యాలతోను అలాంటి వేషభాషలతోనే విరాజిల్లుతున్నాయి గనుక. మన నగరాల్లో అవే కార్లు, అవే భవనాలు, అదే ఇంగ్లీషు, అవే రోడ్లు – తమ పర్యాటకంలో తాము నేర్చుకోదగిందేదీ వారికి కనపడదు. మీరు కుతూహలంతో వారిలో ఒకరిని పట్టుకుని “ఎలా ఉంది ఇండియా ?” అని అడిగితే “ఇండియానా ? ఓ, చాలా బావుంది. ఈమధ్యకాలంలో బాగా అభివృద్ధి చెందింది” అనేస్తాడు ఆ తెల్లవాడు, ఇంకేమనాలో అర్థంకాక. మనం దిగంబరంగా గంతులెయ్యడానికి ఆ మాత్రం మెచ్చుకోలు ఒకటి చాలు.

etikoppaka_fullhydcom_by_kishore_kadiyala.jpg
[రెండు ఏటికొప్పాక బొమ్మలు
ఫోటో: కడియాల కిషోర్ గారు
(http://www.fullhyd.com)]

మన దేశాన్ని ఇతరులు చూడరావాలంటే మన దగ్గర ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అదృష్టవశాత్తు మనకు అలాంటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. మనదంటూ మనకో వాస్తు శిల్ప కళ ఉంది. మన సొంత వేషభాషలున్నాయి. మన సొంత మతం ఉంది. మన సొంత వైద్యశాస్త్రముంది. మనవంటూ ఎన్నో విద్వత్‌కళలూ జానపద కళలూ ఉన్నాయి. చాలా దేశాల్లాగా అమెరికాకి ఎనిమిదో నెంబరు కార్బన్ కాపీగా బతికే అవసరం మనకు లేదు. మన కళల్ని మనం కాపాడుకుంటేనే మన పర్యాటక రంగానిక్కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాని మనం విపరీత ధోరణిలో వెళుతున్నామనిపిస్తోంది.

మన సంస్కృతే మనకు అన్నం పెడుతుంది : కళలూ, మతమూ కూడు పెడతాయా ? గుడ్డ పెడతాయా ? అని అడిగేవారున్నారు. సంస్కృతిని వంటవండే మైక్రో ఓవెన్ లా భావించడం సరైన దృక్పథం కాదు. సంస్కృతి అనేది వేలాది సంవత్సరాల జీవితానుభవంతో పరస్పర విరుద్ధ అవసరాల్ని పరిణతితో సమన్వయించుకుంటూ బ్రతకగలిగిన ఒక జీవన కళ. సంస్కృతిని వదిలిపెడితే తెలివితేటలు వికసించవు. మన దేశంలో కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చిన ప్రాంతాలూ వర్గాలూ అనాదిగా మంచి సంస్కృతి గలవి. మన సంస్కృతి విశిష్టమైనదైనప్పుడు దానికి తప్పకుండా ఏదో ఒకరోజు అంతర్జాతీయ విపణి (interational market) ఏర్పడుతుంది.

సంస్కృతి మనందరిదీ : సంస్కృతి అంటే కేవలం పండితలోకపు అభిరుచులకు సంబంధించినదనే అపోహ ఒకటి ప్రబలింది. మన దేశంలో తమదంటూ ఒక ప్రత్యేక సంస్కృతి లేని వర్గమే లేదు. సంస్కృతి అంటె బాపు, విశ్వనాథ్,జంధ్యాల సినిమాలు మాత్రమే కావు. మన రాష్ట్రంలో తెలుగు కావ్య ప్రబంధాలకు భిన్నమైన జానపద గేయ ఇతిహాసాలున్నాయి. కాటమరాజు కథ, పల్నాటి వీరగాథ, దేశింగురాజు కథ, సన్యాసమ్మ కథ, బాలనాగమ్మ కథ మొదలైనవి. ఇవే మన ప్రజావేదాలు. ఇవే మన శ్రుతులు. ఇవి జనం నోట్లో శతాబ్దాలుగా నానుతూ మనదాకా వచ్చాయి. వీటిని పాడే పద్ధతులున్నాయి. అవి కర్ణాటక సంగీతంకంటే భిన్నమైనవి. వీటిల్లో కాటమరాజు కథ చాలా పెద్దది. అచ్చువేస్తే వెయ్యి పుటలవుతుంది. ఇది యాదవుల కుల-ఇతిహాసం. ఇప్పుడు దీన్ని పాడేవారే కరువయ్యారు.

అతిడబ్బు కళకు శత్రువు : ఎప్పుడైనా సరే, పేదవారే సంస్కృతినిర్మాతలు. ధనికులు కొత్త నాగరికతని కొత్త సాంకేతికత ద్వారా పరిచయం చెయ్యగలరు. కాని సంస్కృతిని మాత్రం నిర్మించజాలరు. మహా అయితే తమ ధనబలంతో ఉన్న సంస్కృతికి కొంతవరకు కాపలాకాయగలరు. కుటుంబం, బాధ్యత,వారసత్వం, ప్రేమ, నీతి, కృతజ్ఞత మొదలైన విలువలన్నీ పేదరికంలోంచే పుడతాయి. ఆ విధంగా సంస్కృతి కిందినుంచి పైకి ప్రవహిస్తుంది. నాగరికత పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. ఈ రోజుల్లో అయినా పేద మేస్త్రీల మురికి చేతుల్లోని పనితనమే ధనికుల ఇళ్ళకు సొగసులు దిద్ది వారి హోదాని ప్రకాశింపజేస్తోంది. పేద కళాకారులు వేసిన/చేసిన బొమ్మల్ని గోడలకు తగిలించుకుని ఊహల ఉయ్యాలలో తేలుతున్నారు ధనికులు. ఆ ఊహలు వారివికావు, వాటిని చేసిన/వేసిన పేదవాడివి.

burrakatha-_photo_wikipedia.jpg
[బుర్రకథ – వికిపీడియా నుంచి]

యక్షగానాలూ, తోలుబొమ్మలాటలూ, కలంకారీ అద్దకాలూ, కొండపల్లి బొమ్మలూ,హరికథలూ ఏటికొప్పాక బొమ్మలూ ధింసా నృత్యాలూ, మొదలైన కళారూపాలు క్రమంగా నశిస్తూండడానికి అనేక కారణాలున్నాయి. వీటిల్లో ప్రధానమైనది బాధ్యతా రహితమైన విద్యావిధానం. అందరూ చదువుకోవాలి. బాగానే ఉంది. కాని ఆ చదువులో మనపట్ల మనకు గౌరవం కలిగించే అంశాలేవీ లేవు. పనికొచ్చే చదువు పేరుతో కెరీర్ అంటూ కేవలం డబ్బువిలువల్ని నేర్పిస్తున్నారు. ఆయా కళారూపాల మీద ఆధారపడి జీవనం సాగించే కులాలున్నాయి. చదువుకున్నవారితో పోల్చుకుంటే తమ కళ తమకే అవమానకరంగా తోస్తోంది వారికి. వారికి ఆ భావన కలక్కుండా చూడ్డంకోసం మనమేమీ ప్రయత్నిచలేదు. వారి పిల్లల్లో చాలామంది ఇప్పుడు ఇంగ్లీషు చదువులకు వెళుతున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వమే వారిని బలవంతంగా చేరుస్తోంది. తమ కుటుంబకళ తమకు పట్టుబడే అవకాశం పోతోంది.

సంస్కృత నాటకాల కంటే భిన్నమైన వీథినాటకమనే ప్రక్రియ తెలుగువారిలో ఉంది. అది దాదాపుగా మరుగున పడింది. ఎన్.టి.రామారావుగారు జీవించి ఉన్న కాలంలో రాజకీయ సభల ద్వారా ఇలాంటి ప్రదర్శనాత్మక కళల (performing arts) కి ప్రాచుర్యం కలిగించాలని ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలు ఆయనతోనే ఆగిపోయాయి.

మన కళలు ఉపయోగం లేక చనిపోవడంలేదు. ఉపయోగించుకోకపోవడం చేత చనిపోతున్నాయి. మనం దేన్నీ ఉపయోగించుకోకుండా ప్రతి విషయానికీ ఒక “dead brand” కొట్టి చేతులు దులుపుకుంటున్నాం. ఇంగ్లీషు చదువులమోజులో మన సాంస్కృతిక పరిజ్ఞానం అష్ట వంకర్లు తిరుగుతోంది. కళలు వర్ధిల్లాలి. కళాకారులు మాత్రం నశించాలి. భాష వర్ధిల్లాలి. భాషాపండితులు మాత్రం నశించాలి. మతం, తత్వశాస్త్రం బతకాలి. మతగురువులు మాత్రం నశించాలి. ఇలాంటి ఒక విచిత్రమైన ఆలోచనా ధోరణిలో మనం జీవిస్తున్నాం. అయా సాంస్కృతికాంశాలు బతికి బట్ట కట్టాలంటే వాటిని నమ్ముకున్నవాళ్ళకు గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించక తప్పదని మర్చిపోతున్నాం. అందరూ మనలాగే ఇంగ్లీషు చదవాలని ఆశించడం చాలా తప్పు, ప్రమాదకరం కూడా !

kondapalli_fullhydcom_by_kishore_kadiyala.jpg
[కొండపల్లి బొమ్మల కొలువు
– ఫోటో: కడియాల కిషోర్ గారు
(http://www.fullhyd.com).]

ఒక కార్యాచరణ ప్రణాళిక : మన కళల్ని ప్రోత్సహించడం కోసం ప్రస్తుతం కొన్ని ప్రభుత్వసంస్థలు లేకపోలేదు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల్ని విస్తృతంగా అమ్మిపెట్టడం కోసం హస్తకళల అభివృద్ధి సంస్థ ఒకటి ఉంది. ప్రదర్శనాత్మక కళలు (performing arts) నేర్పడం కోసం ప్రతి విశ్వవిద్యాలయంలోను ఒక విభాగం ఉంది. కాని ఇవి సరిపోవు. ఈ ఏర్పాట్లు కళని కొనవూపిరితో బతకనివ్వడానికి మాత్రమే తోడ్పడతాయి. ఉదాహరణకు, హస్తకళల సంస్థ కళాకారులకు ఇచ్చేదెంతో తెలీదు కాని ఒక్కొక్క బొమ్మ మీద తాను మాత్రం వందలూ వేలూ సంపాదించుకుంటోంది. అందుకే లేపాక్షి షోరూముల ఉత్పత్తులు కొందరు ధనికుల సౌధాల్లో మత్రమే మనకు దర్శనమిస్తాయి. అవి కొంచెం చౌకగా లభించి అందరికీ అందుబాటులోకి వచ్చిన రోజు కళాకారులే ధనికులవుతారు. అప్పుడు వారికి మనమిచ్చే చంకకఱ్ఱలతో పని ఉండదు.

కళల్ని సోమరితనానికి చిహ్నంగా భావించే ఔరంగజేబులు ఇప్పటికీ ఉన్నారు. కళలు కష్టజీవనానికి మరో పార్శ్వం మాత్రమే. ఒక వృత్తిని అవిచ్ఛిన్నంగా చేస్తూచేస్తూ ఉండగా అలవడిన నైపుణ్యం ఫలితంగా కళ ఉద్భవిస్తుది. కమ్మరులూ, కుమ్మరులూ, వడ్రంగులూ, సాలీలూ, కంసాలులూ – వీరందరూ ఏకకాలంలో వృత్తికారులూ, కళాకారులూ కూడా ! అయితే వృత్తి చెయ్యాలంటే అందుకు వలసిన ముడిసరుకు ప్రకృతివనర్ల ద్వారా రావాలి. మన కళాకారులకు ముడిసరుకులు అందించే వనర్లు ధనికవర్గాల దోపిడీకి గురవుతున్నాయి. కొండపల్లి బొమ్మలు చెయ్యడానికి అవసరమైన చెక్క దొరకడం ఇప్పుడు కష్టమౌతోంది. కారణం-కొండపల్లి సమీప ప్రాంతాల అడవుల్ని విచక్షణా రహితంగా కొట్టివెయ్యడం. మన కళల్ని కాపాడుకోవాలంటే మన పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలి. ఎందుకంటే సంస్కృతి నేరుగా ప్రకృతి బిడ్డ.

మరీ ప్రమాదంలో పడ్డ కళల్ని బళ్ళలోను కళాశాలల్లోను drawing class లాంటివాటిల్లో నిర్బంధ ఐచ్ఛికాలుగా ప్రవేశపెట్టి సార్వజనీకరించాలి. క్రీడలతో పాటు కళను సైతం పై తరగతులకూ ఉద్యోగాలకూ అదనపు అర్హతగా పరిగణించాలి.

ప్రతి కళకూ జిల్లా స్థాయిలోఒక అకాడమీని ఏర్పరచి తగినన్ని నిధులు కేటాయించాలి. అందులో జిల్లాలోని కళాకారులందరూ సభ్యులుగా ఉండాలి. కళాప్రదర్శన/ఉత్పత్తి దగ్గరి నుంచి అమ్మకాలు వేతనాలు, పింఛన్లు, ఇళ్ళ స్థలాలు, శిక్షణా కార్యక్రమాలూ – అన్నీ ఆ అకాడెమీయే చూసుకోవాలి. కళాకారుల పిల్లలు కళను అభ్యసించడం తప్పనిసరి చెయ్యాలి. వీలయితే అందుకొక ప్రోత్సాహకాన్ని ప్రకటించాలి.

-తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం(http://kalagooragampa.blogspot.com/)

(“నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ఆయన విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు. మన భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం చాలా గొప్పవి. తెలుగు సాహిత్యం బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు. ఇవేగాక ఆయన చాలా రచనలు చేశారు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలు. వాటిని త్వరలో తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురాబోతున్నారు.)

Posted in వ్యాసం | Tagged | 7 Comments

నార్మన్ బోర్లాగ్, మంచి సినిమా, మృతజీవులు

హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ కు అమెరికా ప్రభుత్వం కాంగ్రెషనల్ బంగారుపతకం ఇచ్చిన సందర్భంగా బోర్లాగ్ పై వ్యవసాయార్థికరంగ ఆచార్యులు ప్రొఫెసర్ సత్యసాయి కొవ్వలి గారి ప్రత్యేక వ్యాసం “అన్నదాత బోర్లాగ్” అందిస్తున్నాం.

సినిమా శీర్షికలో వెంకట్ గారు సినిమాలకు సంబంధించి ఎడిటింగ్, స్టేజింగ్ లాంటి సాంకేతిక అంశాలను అర్థవంతంగా, సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రపంచ ప్రసిద్ధి పొందిన సినిమాల గురించి సోదాహరణంగా వివరిస్తూ, మంచి సినిమాలు తీయడంలో పాటించవలసిన మెళకువలను తెలియజేస్తున్నారు.

ఈ నెల రచనలు:

ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా… – 1 (అతిథి)
ఏ నాడైనా అనుకున్నానా కల్లో ఐనా…- 2 (అతిథి)
మృతజీవులు – 2 (మృతజీవులు)
మృతజీవులు – 3 (మృతజీవులు)
అన్నదాత బోర్లాగ్ (వ్యాసం)
మంచి సినిమా (సినిమా)

తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (వికీ)
నేను చదివిన నవీన్ (వ్యాసం)
ఎర్రకోట (వ్యాసం)
గడి (గడి)
సారంగపాణికి సామెతల సుమ మాల (సరదా)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

మృతజీవులు-1 (మృతజీవులు) న్యూవేవ్ సినిమా (సినిమా) చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి) నవతరంగం (సినిమా) గడి (గడి) పుస్తక సమీక్ష (వ్యాసం) ‘గ్యాస్’ సిలిండర్ (సరదా) అంకెలతో పద్య సంకెలలు (వ్యాసం) మరో వనాన్ని స్వప్నిస్తాను (కవిత)

Posted in ఇతరత్రా | Comments Off on నార్మన్ బోర్లాగ్, మంచి సినిమా, మృతజీవులు

మంచి సినిమా

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

సినిమా అంటే ఏంటి ?

• దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా?
• ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా?
• మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా?

సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం. మొన్నీ మధ్య వచ్చిన Pirates of the Caribbean సినిమా తీసుకోండి. లేదా స్పైడర్మ్యాన్ (Spiderman 3) సినిమా తీసుకోండి. అందులో జరిగేవేవీ నిజం కాదని మనకు తెలుసు. అయినా సరే సినిమా హాల్లో చీకట్లో కూర్చుని ఒక స్వప్నలోకంలోకి వెళ్ళిపోయి స్పైడర్మ్యాన్ అమాంతం గాల్లో ఎగురుతుంటే నమ్మేస్తాం. సినిమా హాల్లో లైట్లారిపోగానే మరో లోకానికెళ్ళి పోవడానికి సిధ్ధమైపోతాం. కానీ అన్ని సినిమాలు మనల్ని ఇలా కొత్తలోకాలకి పయనింప చేయడానికి ఉద్దేశించినవి కావు. ఈ మధ్యనే తనికెళ్ల భరణి గారు తీసిన సిరా (Ink) అనే లఘు చిత్రం మనల్ని అద్భుత లోకాల్లోకి కాకుండా ఒక రచయిత హృదయపు లోతుల్లోకి తీసుకెళ్ళి అక్కడ జరిగే సంఘర్షణలను, ఆలోచనావేశాల్ని మనకు సాక్షాత్కరింప చేస్తుంది. ఇదంతా కాకుండా మన రొటీన్ జీవితాలనుంచి విరామం కలిగించి ఆనందం పండించే ఉద్దేశంతో నవరసాలను కలగలిపి నిర్మించే సినిమాలు మరో రకం.

ఒక కళా రూపంగా సినిమాను మిగిలిన కళలతో పోలిస్తే చాలా వ్యత్యాసాలున్నాయి. అందుకు కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది సినిమా అనే ప్రక్రియ వికసించిన సందర్భం. సినిమా సాంకేతిక విప్లవం కారణంగా సాధ్యమైన ఒక సాధనం. మిగతా కళారూపాలయిన సాహిత్యం, చిత్రలేఖనం, సంగీతం, శిల్పకళల లాగా సినిమాని మొదట్లో ఒక కళారూపంగా గుర్తించలేకపోయారు. సాధారణంగా కళ ఎప్పుడూ కళాకారుని సృష్టిపైనే ఆధారపడి వుంటుంది. మోనాలిసా (Mona Lisa) చిత్రాన్ని తీసుకున్నా, గీతాంజలి (Gitanjali) కావ్యాన్ని తీసుకున్నా వాటి ఉద్దేశం కేవలం కళ మాత్రమే. అంతే కాకుండా ఒక కళాఖండం సృష్టించడానికి కావలసిన వాటిల్లో ముఖ్యమైంది మనిషి మేథస్సు మాత్రమే. చిత్రలేఖనం చేయడానికి కావలసిన రంగులు, కథ లేదా కవిత రాయడానికి కావలిసిన పేపరు మరియు పెన్ను కళాకారుని సృష్టికి కావలిసిన సాధనాలు మాత్రమే. పెన్నూ పేపరూ లేనంత మాత్రాన ఒక కవిని కవిత్వం రాయకుండా ఆపలేవు. తన హృదయమనే పుస్తకంపై ఎప్పుడూ తన ఆలోచనలను లిఖించగలుగుతాడు. అలాగే చిత్రకారుడు కూడా! ఒక చిత్రాన్ని చిత్రించడానికి అతనికి కాన్వాసు, camel పెయింటులు అవసరం లేదు. సముద్రపుటొడ్డున బీచ్ లో ఇసుకపై కూడా తన చిత్రాలను సృష్టించగలడు. కానీ సినిమా అలా కాదు. సినిమా తీయడానికి ఫిల్ము ఎంత అవసరమో, అలాగే ఒక మంచి కథ, నటీనటులు, నిర్మాత, దర్శకుడు, అన్నిటికంటే ముఖ్యంగా సినిమాను డబ్బులిచ్చి చూసి ఆదరించే ప్రేక్షకులు అవసరం. మిగిలిన కళలలా కాకుండా సినిమాని సృష్టించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే కాకుండా చాలామంది కళాకారుల సహకారంతో మాత్రమే సాధ్యమయ్యే ఒక కళ(ల)!

సినిమాకి కావల్సిన మనుషుల సంగతి ఒక వైపైతే సినిమా అనే ప్రక్రియకు అవసరమైన యంత్రసముదాయాలు మరోవైపు. సినిమాలోని దృశ్యాలను చిత్రీకరించడానికి అవసరమైన కెమెరా తోపాటు, ఫిల్ముని డెవలప్ చేసే సామాగ్రి, రసాయనం, ఫిల్ముపై చిత్రీకరించిన దృశ్యాలను ప్రదర్శించడానికి ప్రొజెక్టర్లు, నటీనటుల సంభాషణలను మనకి వినిపించి, కనిపించేలా చేసే దృశ్యశ్రవణ ఉపకరణాలు లాంటి సరంజామా లేకుండా సినిమా అనే ప్రక్రియను ప్రేక్షకులు సంపూర్తిగా అనుభవించడానికి సాధ్యం కాదు. అందుకే సినిమా ఒక ఆర్టా? క్రాఫ్టా? అనేది ఎవరూ తేల్చలేకపోయారు. ఇప్పటికీ ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది .
“The aim of every artist is to arrest motion, which is life, by artificial means and hold it fixed so that a hundred years later, when a stranger looks at it, it moves again since it is life. Since man is mortal, the only immortality possible for him is to leave something behind him that is immortal since it will always move. This is the artist’s way of scribbling ‘Kilroy was here’ on the wall of the final and irrevocable oblivion through which he must someday pass.” అని కళ మరియు కళాకారుని బాధ్యతను వివరిస్తారు William Faulkner. ఆయనన్నట్టు ప్రతి కళాకారుడు జీవితాన్ని తన కళారూపాల్లో బంధించాలన్నది ముమ్మాటికీ నిజం. మిగిలిన కళల్లో ఈ విధంగా చేయడం కాస్తా కష్టంతో కూడుకున్న పనే!కానీ సినిమా అనే కళకు ఇలాంటి సానుకూలత స్వాభావికంగానే వస్తుంది.అందుకే “Cinema is Truth 24 frames per second” అంటారు Jean-Luc Godard. అలాగే “The Cinema is essentially the observation of a phenomenon passing through time” అంటారు Andrei Tarkovsky. వీరన్నట్టుగా సినిమా ద్వారా మన జీవితంలోని వివిధ ఘట్టాలను చిత్రరూపంలో బంధించి క్షణకాలంలో కరిగిపోయే అనుభవాలను శాశ్వతం చేసి నిత్యానందం పొందవచ్చు. ఒక్క సినిమాకి తప్పితే మరే కళకూ ఇలా చేయడం సాధ్యం కాదు. అందుకే సినిమా మిగిలిన కళలకంటే ఒక మెట్టు పైనుంది. కానీ మన వాళ్ళు తీసే సినిమా లను కళారూపాలని పిలవచ్చా? అంటే అనుమానమే! సినిమాకున్న సత్తాని మన వాళ్ళు ఇంకా తెలుసుకోకపోవడం ఇందుకు ఒక కారణం. ఒక వేళ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు రూపొందిద్దామని ప్రయత్నించినా అందుకు కావలసిన ప్రజ్ఞా పాటవాలు మన వాళ్ళు కనబరచడం లేదు.

మనం చాలా సార్లు వింటూనే వుంటాము మన సినిమాలు అంతర్జాతీయ సినిమాల స్థాయిలో లేవని. అసలు మన సినిమాలకు, ఆస్కార్ అవార్డులు పొందుతున్న ఇతర దేశాల సినిమాలకు వున్న తేడా ఏంటి? ఎందుకు ఆ సినిమాలను మంచి సినిమాలంటారు? మన సినిమాలు చేసిన పాపమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా అనే ప్రక్రియలో వున్న వివిధ అంశాలను చర్చించడం ద్వారా మరియు సినిమా తీయడానికి అవసరమైన భాష మరియు వ్యాకరణాలను తెలుసుకోవడం ద్వారా మాత్రమే అవగతమౌతుంది.

ఎవరు అవునన్న కాదన్నా సాగరసంగమం ఒక మంచి సినిమా. అలాగే ఒక శివ అయినా, ఒక అన్వేషణ అయినా! అలాగే ప్రతి వారం విడుదల అవుతున్న సినిమాల్లో దాదాపు 90 శాతం చెత్త సినిమాలే! మరి కొన్ని సినిమాలు మంచి సినిమాలుగా ప్రజల ఆమోదం ఎందుకు పొందుతాయి, మరి కొన్ని సినిమాలు ఎందుకు పొందవు అన్న దానికి సమాధానం కష్టమే. అలాగే మన సినిమాలు అంతర్జాతీయ స్థాయికి ఎందుకు చేరలేకపోతున్నాయి అన్న దానికీ ఒక్క మాటలో సమాధానం చెప్పడం కష్టం. కళాత్మక దృష్టితో తీసిన సినిమాలు వ్యాపార పరంగా లాభాలు గడించకపోయినప్పటికీ కళాహృదయం కలిగిన వారి మన్ననలు పొందుతాయన్నది నిజం. అంత మాత్రాన కేవలం కళ మీదే దృష్టి పెడితే నిర్మాత పెట్టుబడులు వెనక్కి రాకపోవచ్చు. నిజానికి ప్రపంచంలోని వివిధ దేశాల దర్శకులయిన Jean-Luc Godard, Stanley Kubrick, Krystzof Kieslowski, Andrej Wajda, Satyajit Ray, Mrinal Sen, Francis Ford Coppola లాంటి దర్శకులు తమ సినిమాలను కళాత్మకంగా రూపొందిస్తూనే కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించారు. మరి వారిలాంటి విజయాలు ఎలా సాధించారు? మనమెందుకు సాధించలేకపోతున్నాము? అని మనల్ని ప్రశ్నించుకుంటే ఒకటే సమాధానం దొరుకుతుంది. వాళ్ళు తమ సినిమాలను బాగా తీశారు. మన వాళ్ళు తీయటంలేదు.

ఇలా తీస్తే మంచి సినిమా, ఇలా తీస్తే చెడ్డ సినిమా అని చెప్పడానికి నియమాలేవీ లేనప్పటికీ మన సినిమాలు చూసి, ఒక అకీరా కురసావా (Akira Kurosawa) సినిమానో, ఒక ఇంగ్మర్ బెర్గ్మన్ (Ingmar Bergman) సినిమానో చూస్తే ఇట్టే తెలిసిపోతుంది, మన సినిమాలు వాటితో పోల్చలేనంత దీన స్థితిలో వున్నాయని. అసలు మన సినిమాలను వాళ్ళ సినిమాలతో పోల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటే ఈ చర్చను ఇంతటితో ఆపెయ్యొచ్చు. అలా కాకుండా మన సినిమాల్లో నాణ్యత లోపించిందని అభిప్రాయపడి అందుకు కారణాలేంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం సినిమా అనే ప్రక్రియలోని వివిధ అంశాలను పరిగణించి విశ్లేషిస్తే పరిష్కారం దొరక్కపోవచ్చుగానీ సమాధానం దొరకొచ్చు.

నిశ్చల చిత్రాలను క్షణానికి 24ఫ్రేములను ప్రొజెక్టర్ ద్వారా తెరపై ప్రదర్శించడం ద్వారా చిత్రాలకు చలనాన్ని సృష్టిస్తాము కాబట్టే సినిమాని చలనచిత్రమంటాము. చిత్రకారులు చిత్రంలోని వివిధ అంశాలను ద్విమాత్రీయ అంతరాళంలో కూర్చి నిశ్చల చిత్రాన్ని సృష్టించినట్టే, సినిమాలో కూడా, కెమెరా చూడగలిగన అంతరాళంలో నటులను, వస్తువులను, వివిధ రకాలుగా కూర్చవచ్చు, పేర్చవచ్చు. సినిమాకి డ్రామాకు వున్న తేడా ఇదే! డ్రామాలో నాలుగు గోడలమధ్యనే ఏంచేసినా చెయ్యాలి. నిజానికి నాలుగు కాదు మూడు గోడలే; నాలుగో గోడ ప్రేక్షకులు కాబట్టి. అదే సినిమాకు ఈ పరిమితులు లేవు. సినిమాకు వున్న ఒకే ఒక పరిమితి ఏంటంటే నిజజీవితంలోని త్రిమాత్రీయ అంతరాళమును ద్విమాత్రీయ అంతరాళం పై చిత్రీకరించాల్సి రావడం. కానీ 3D టెక్నాలజీ సహాయంతో ఈ పరిమితులు కూడా తొలిగిపోయాయి. కానీ 3D టెక్నాలజీతో వున్న ఇబ్బందులు, వ్యయ ప్రయాసల దృష్ట్యా చాలా మంది 3D టెక్నాలజీ ని దూరంగా వుంచారు. అందుకే సినిమా అనే ప్రక్రియ మొదలయి వందేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ 2D సినిమాలదే పై చేయి. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని నా అంచనా.

సాధారణంగా సినిమాలో ఉండేది ద్విమాత్రీయ అంతరాళం పై చిత్రీకరించిన నిశ్చల చిత్రాలే కనుక చిత్రకారుడు చిత్రాలను సృష్టించేటప్పుడు అనుసరించే సూత్రాలనే సినిమా తీసే దర్శకుడు కూడా పాటించినప్పుడే సినిమాకున్న నిజమైన సామర్థ్యాన్ని వుపయోగించినట్టవుతుంది.ఇంతకు ముందు చెప్పినట్టు తెరపై ప్రదర్శించే సినిమాకు, స్టేజిపై ప్రదర్శించే నాటకానికి చాలా తేడా వుంది. రెండింటి వుద్దేశం ఒక్కటే – కథ చెప్పడం. కానీ ఈ రెండు కళ ల మధ్య తేడా వాటి వాటి సంవిధానంలో వుంది.

ఒక స్టేజిపై జరుగుతున్న డ్రామాను వున్నదున్నట్టు కెమెరాలో చిత్రీకరించి తెరపై ప్రదర్శిస్తే సినిమా అవుతుందా? ఖచ్చితంగా కాదు. కెమెరా అనేది చిత్రాలను రికార్డు చేయగల ఒక పరికరం మాత్రమే! అంత మాత్రాన కెమెరా లో చిత్రీకరించిన ప్రతి విషయం సినిమా అని పిలవబడడానికి అర్హత కలిగి వుండదనేది నా అభిప్రాయం. ఎలా అయితే కార్బన్ కాపీ పెట్టి కాపీ చేసిన మోనాలిసా బొమ్మను చిత్రలేఖనం అనలేమో అలాగే కెమెరా లో చిత్రీకరించిన ప్రతి విషయం సినిమా కాదు. ఒక వేళ స్టేజి దాటి స్టూడియోలో సెట్టింగ్ లోనో, నిజమైన ప్రదేశాలలోనో చిత్రీకరించిన ఒక కథను సినిమాగా పరిగణించినప్పటికీ ఆ సినిమాను మంచి సినిమా అని పేర్కొనాలంటే కుదరదు.

సినిమా అనే ప్రక్రియలో ఒక ముఖ్య అంశం ఎడిటింగ్. సినిమాలోని వివిధ అంశాలయిన నటన, Shot Composition, లైటింగ్, ధ్వని, సంగీతం, సెట్ అలంకరణ, Staging, Mis-en-Scene లాంటి అంశాలన్నీ ఏదో ఒక కళ నుంచి అరువుతెచ్చుకున్న అంశాలే కానీ కేవలం ఎడిటింగ్ (Film Editing) మాత్రమే సినిమాకి సంబంధించిన ఏకైక నవ కల్పన.

మన సినిమాల్లో ఎడిటింగ్ చాలావరకు దర్శకుడు ఎన్నుకున్న షాట్లను వరుస క్రమంలో కూర్చడం వరకే పరిమితమయ్యింది. ఎడిటింగ్ అనే ప్రక్రియను మన వాళ్ళు యాంత్రికంగా చూడడమే ఇందుకు కారణం కావచ్చు. ఎడిటింగ్ అనే ప్రక్రియను కళాత్మకంగా రూపుదిద్దిన వారిలో ముందుగా మనకు గుర్తొచ్చే పేర్లు Lev Kuleshov, Sergei Eisenstein, D.W. Griffith, Walter Murch. వీరితో పాటు Edward Dmytryk, Jean Luc Godard, Luis Buñuel, Andy Warhol, John Cassavetes, René Clair లాంటి సినీ ప్రముఖులు కూడా ఎడిటింగ్ ఒక కళగా అభివృధ్ధి చెందడానికి దోహదం చేసారు.

సినిమాలో ఎడిటింగ్ యొక్క పాత్రను తెలుసుకోవాలంటే Lev Kuleshov చేసిన ప్రయోగం గురించి మనం తెలుసుకోవాలి. ముందు ఒక పాత్రలో వుంచిన వంటకాని చూపించి ఆ తర్వాత ఒక వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి ఆకలి గొన్న వాడిగా బాగా నటించాడని చె ప్పా రట. ఆ తర్వాత ఒక అందమైన అమాయి చిత్రం చూపించి ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి కాంక్ష కలిగిన వాడిగా బాగా నటించాడని చె ప్పా రట. అలాగే ఒక చనిపోయిన వృధ్ధ స్త్రీ శవపేటిక చూపించి ఆ తర్వాత ఆ వ్యక్తి మొహాన్ని క్లోజ్-అప్ లో చూపించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఆ వ్యక్తి శోకం కలిగిన వాడిగా బాగా నటించాడని చె ప్పా రట. నిజానికి పైన ఉదహరించిన మూడు దృశ్యాలలోనూ చూపిన వ్యక్తి మొహంలో ఎటువంటి హావభావాలు లేనప్పటికీ అంతకు ముందు చూసిన దృశ్యానితో అనుసంధానించి చూడబట్టే ప్రేక్షకులు ఒకే దృశ్యాన్ని మూడు రకాలుగా అనువదించుకునారని Lev Kuleshov తన ప్రయోగం ద్వారా నిర్ధారించారు. అలాగే The Battleship Potemkin సినిమాలో Sergei Eisenstein ఎడిటింగ్ ద్వారా The Odessa Steps sequence లో సినిమా చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే దృశ్యాలను మనకందించారు.

A Clockwork Orange, 2001:A Space Odyssey లాంటి అత్యద్భుత సినిమాలు రూపొందించిన Stanley Kubrick ఇలా అంటారు: “నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. సినిమా అనే ప్రక్రియలోని వివిధ అంశాలలో నాకు ఎడిటింగ్ అంటేనే అత్యంత ఇష్టం. ఎడిటింగ్ ముందు చేసే ఇతర కార్యకలాపాలన్నీ చివరిగా ఎడిటింగ్ చేయడానికి మాత్రమే”. ఒక్క Stanley Kubrick మాత్రమే కాదు Alfred Hitchcock కూడా ఎడిటింగ్ ద్వారా కొత్త కోణాలను ఆవిష్కరించాడు. ఈ విధంగా ప్రపంచంలోని వివిధ దర్శకులు, ఎడిటర్లు ఎడిటింగ్ అనే సాంకేతిక ప్రక్రియ ద్వారా తమ సినిమాలకు కొత్త మెరుగులు దిద్దడమే కాకుండా తద్వారా సినిమా చూసే ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందించగలిగారు. ఇలాంటి ప్రయత్నమే మనవాళ్ళూ చేస్తే మన సినిమాల నాణ్యత పెరగొచ్చు.

ఎడిటింగ్ లాగే సినిమాలో ముఖ్యపాత్ర పోషించే మరో విషయం స్టేజింగ్. సినిమా తెరను మూడు అక్షాలుగా విభజించి, తెరకు నిలువుగా వుండే భాగాన్ని X-అక్షముగానూ, తెరకు అడ్డంగా వుండే భాగాన్ని Y-అక్షముగానూ, తెర పై ప్రదర్శించే దృశ్యములోని దఘ్నతను Z-అక్షములుగా అంగీకరిస్తే ఈ మూడు అక్షముల చుట్టూ సినిమాలోని పాత్రధారులు, మరియు కెమెరా జరిపే కదలికలను స్టేజింగ్‌గా నిర్వచించవచ్చు.ఈ విధంగా జరిపే కదలికల ద్వారా ప్రేక్షకులలో భావోద్వేగాలను కలుగచేసి సినిమాలో తాదాత్మ్యం అయ్యేలా చేయవచ్చు. మన సినిమాల్లో ఈ విషయం లోపిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మధ్యనే వచ్చిన బొమ్మరిల్లు సినిమా తీసుకున్నా, లేదా పాత తెలుగు సినిమా ఏదైనా తీసుకున్నా, వీటిలోని పాత్రధారులు సాధారణంగా కెమెరా ముందుకు వచ్చి తమ సంభాషణలను చేస్తారు. అందుకే బొమ్మరిల్లు సినిమా పెద్ద హిట్టయినప్పటికీ ఆ సినిమాను అంతర్జాతీయ సినిమాలతో పోల్చలేము. అలా అని కెమెరాను అటు ఇటు తిప్పేసి, క్రేన్‌లెక్కించేసి నానా హడావుడి చేసినంత మాత్రాన అది గొప్ప సినిమా అయిపోదు. సినిమా లో ఎటువంటి కెమెరా కదలికకు ఆస్కారముందో, దాని ద్వారా సీను ఎలా గొప్పపరచబడుతుందో తెలుసుకోవాలంటే Kryzsztof Kieslowski తీసిన Red సినిమాలోని మొదటి సీను చూస్తే అర్థమవుతుంది. అలా అని ప్రతి సినిమాలోనూ కెమెరా మరియు పాత్రధారులు చైతన్యం కలిగి వుండాల్సిన అవసరం లేదు. ఎందరో విమర్శకుల మన్ననలు పొందిన తైవానీస్ సినిమా What time is it there? లో దర్శకుడు Tsai Ming-Liang దాదాపు సినిమా మొత్తం నిశ్చలం గానే చిత్రీకరించారు. కానీ ఈ సినిమాను ఒక అద్భుత కళాఖండంగా వర్ణించారు చాలా మంది. ఈ సినిమాలో పాత్రధారులను, కెమెరాని స్థిరంగా వుంచడం ద్వారా తైవానీస్ ప్రజల నిశ్చల జీవితాలను మన కళ్ళముందుంచుతాడు దర్శకుడు.

మనం రూపొందిస్తున్న సినిమా యొక్క స్వభావాన్ని బట్టి ఈ స్టేజింగ్ అనే అంశం దర్శకుడు నిర్ణయించినప్పటికీ కొన్ని సూచనలను పాటించడం ద్వారా మరియు వివిధ దర్శకుల శైలిని తెలుసుకోవడం ద్వారా స్టేజింగ్ గురించి తెలుసుకోవచ్చు. వుదాహరణకు, Jennifer Van Sijll తన పుస్తకం Cinematic Storytelling లో ఇలా చెప్తారు. “సాధారణంగా మనం చదవడం, రాయడం ఎడమవైపు నుంచి కుడివైపుకి చేస్తాము కాబట్టి, తల తిప్పి ఎడమవైపుకి చూడడం కంటే కుడివైపుకి చూడడం సుళువు. అలాగే గురుత్వాకర్షణ శక్తి కారణంగా తల ఎత్తి పైకి చూడడం కంటే కిందికి చూడడం సుళువు. అందువల్ల సినిమాలో మంచిని పోషించే పాత్రధారులు తెరపై ఎడమవైపు నుంచి కుడివైపుగా కదులుతున్నట్టుగానూ, చెడును పోషించే విలన్ పాత్రధారులు కుడినుంచి ఎడమవైపుగా కదులుతున్నట్టుగానూ చిత్రీకరిస్తే ప్రత్యక్షంగా చెప్పకుండానే పరోక్షంగానే మంచిని పోషించే పాత్రధారులపై సానుభూతిని, విలన్ పాత్రధారులపై ఏహ్యభావాన్ని ప్రేక్షకుల మనోభావాల్లో కలిగించవచ్చు”

ఇదే విధంగా మంచి చెడుల మధ్య సంఘర్షణలను చిత్రీకరించడానికి కూడా ఈ పధ్ధతి వుపయోగపడుతుందని Jennifer Van Sijll అభిప్రాయ పడతారు. Alfred Hitchcock తన సినిమా Strangers on a train లో ఈ సిధ్ధాంతాలను వుపయోగించే మంచి చెడుల మధ్య సంఘర్షణలను చిత్రీకరించారు. అలాగే మిగిలిన అక్షాల దృష్ట్యా పాత్రధారులు జరిపే కదలికల ద్వారా మరిన్ని భావోద్వేగాలను ప్రేక్షకులలో కలిగించవచ్చు. ఈ సిధ్ధాంతాలను అవలంబించాలా వద్దా అనేది దర్శకుని వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఈ విధంగా విభిన్నంగా ఆలోచించడం ద్వారా తమ సినిమాలకు కొత్త కోణాలను ఆవిష్కరించవచ్చన్నది మాత్రం నిజం. ఒక వేళ Jennifer Van Sijll సిధ్ధాంత పరిచిన అంశాలే నిజమైతే కిందనుంచి పైకి మరియు కుడి నుంచి ఎడమవైపుకి రాసే జపాన్, మరియు ఇరాన్ దేశస్థుల సినిమాల సంగతేంటి? వీళ్ళ సినిమాల్లో పైన చెప్పిన అంశాలు వ్యతిరేక క్రమంలో జరగాలి. ఈ సారి ఏదన్న జపనీస్ లేదా ఇరానియన్ సినిమా చూస్తున్నప్పుడు ఈ విషయాలను గమనించి చూడండి.

పైన పేర్కొన్న అంశాల లాగానే సినిమాలోని వివిధ అంశాలు వేటికవే ప్రత్యేకతలను కలిగివుంటాయి. ఉదాహరణకు కథాగమనం అనే అంశాన్ని తీసుకోండి. కథ ఎలా వున్నప్పటికీ కథాగమనంలో వ్యత్యాసం ద్వారా అంతకుముందు వేరే సినిమాలో చెప్పిన కథనే వైవిధ్యంగా మలచవచ్చు. కథాగమనంలో వైవిధ్యాన్ని చేకూర్చిన వారిలో మొదటివాడు Orson Wells. ఈయన రూపొందించిన Citizen Kane చిత్రం ద్వారా కథాగమనంలోనే కాకుండా సినిమా అనే ప్రక్రియలోని వివిధ విభాగాల్లోనూ ఈయన చూపిన ప్రతిభ మరియు వైవిధ్యం నేటికీ ఎవ్వరికీ సాధ్యం కాలేదన్నది నిజం. మనలో చాలా మందికి తెలిసినంత వరకూ కథాగమనంలో వైవిధ్యం చూపించిన సినిమా అంటే మొదటిగా గుర్తొచ్చేది Quentin Tarantino సినిమా అయిన Pulp Fiction. కానీ Quentin Tarantino మాత్రమే కాదు ప్రపంచంలోని ఎంతో మంది దర్శకులు కథా గమనంలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఈ మధ్యనే వచ్చిన కొరియన్ సినిమా Sad Movie అయినా, Akira Kurosawa రూపొందించిన Rashoman అయినా లేదా Quentin Tarantino ఒకప్పటి మిత్రుడైన Roger Avery దర్శకత్వం వహించిన The Rules of Attraction సినిమా అయినా చూసినవారు ఈ వైవిధ్యాన్ని కళ్ళారా చూడవచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో ప్రపంచ దర్శకులు వినూత్న ప్రయోగాలతో తమ సినిమాలను ఎప్పటికప్పుడు కొత్త రీతిలో రూపొందిస్తున్నారు. అలా అని వీరి దర్శకత్వ శైలిని, సాంకేతికతను కాపీ కొట్టి సినిమాలు తీయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. పైన పేర్కొన్న విధంగా మనం కూడా మన సినిమాల్లో వినూత్న పధ్ధతులకు స్వాగతం పలకాలని నా ఆకాంక్ష. ఇవాళ కాకపోతే రేపైనా ఈ మార్పు వస్తుందని, మన సినిమాలు కూడా Cannes, Berlin లాంటి సినిమా వుత్సవాలలో ప్రదర్శింపబడతాయని ఆశ.

వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in)

(నానాటికీ దిగజారిపోతున్న తెలుగు సినిమాకు పునరుజ్జీవం కల్పించాలని ప్రేక్షకులకు మంచి సినిమాల గురించి పరిజ్ఞానం కలుగచేసే ప్రయత్నంలో వ్యాసాలు రాస్తూ, తెలుగు సాహితీ ప్రపంచంలోని ఆణిముత్యాలను సినిమాలుగా తీసి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో, మంచి సినిమా తీయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు గంటూ తన కలలను త్వరలో తెరకెక్కించే ప్రయత్నంలో వున్న వెంకట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తూ మరియు తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో కూడా సినిమాల గురించి రాస్తున్నారు.)

Posted in వ్యాసం | Tagged | 9 Comments

అన్నదాత బోర్లాగ్

– సత్యసాయి కొవ్వలి (http://satyasodhana.blogspot.com/)

కొవ్వలి సత్యసాయి
“Norman Borlaug is the living embodiment of the human quest for a hunger free world. His life is his message.”

– Professor M. S. Swaminathan, M.S. Swaminathan Research Foundation (India)

అన్నం తినేటప్పుడు ఆ అన్నం మీ కంచంలోకి ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా ఆ ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మన జేబులో డబ్బులుంటే చాలు, బజారుకు పోయి మనకి కావలసిన ఆహారపదార్ధాలు కొనుక్కోవచ్చు. మన దేశంలో పండే దినుసులే కాకుండా, కేవలం ఇతర దేశాల్లో మాత్రమే పండే దినుసులు కూడా మనకి కావలసినంత కొనచ్చు. మనలో చాలా ఎక్కువమందికి ఆకలి ఒక సమస్య అని తెలియదంటే అతిశయోక్తి కాదు. కానీ సుమారు 50 -60 సంవత్సరాల క్రితం వరకు, మనదేశంతో సహా అనేక దేశాల్లో, పండే పంటల ఉత్పత్తి ప్రజల ఆకలి తీర్చడానికి సరిపోయేది కాదంటే నమ్మగలమా? వ్యవసాయ రంగ ఉత్పాదకత (productivity) తక్కువగా ఉండడమూ, తినే నోళ్ళు అతి వేగంగా పెరిగపోవడమూ, కరువు కాటకాలు, సరుకుల కోసం రేషను షాపుల ముందు బారులు తీరి నిలబడడం, తీరా తమ వంతు వచ్చే సరికి ‘నో స్టాక్’ బోర్డు, తీరని ఆకలి, అస్థి పంజరాలలాంటి మనుషులు, – చాలా ఏళ్ళపాటు ప్రపంచ దేశాల్ని కుదిపేసాయి. ఈ ఆహారసమస్య ఇప్పటికీ కొన్ని ఆఫ్రికా దేశాల్ని పట్టి పీడిస్తోంది.

ఇలాంటి భయంకరమైన ప్రపంచ ఆహార సమస్య తీర్చి, అత్యధిక జనాభా ఆకలిని తీర్చగలిగిన మార్గం హరితవిప్లవం (Green Revolution) ద్వారా సాధ్యపడింది. మేలురకపు వంగడాలని, రసాయన ఎరువుల బలంతో సాగు చేసి ఆధికదిగుబడులు సాధించే ప్రక్రియ వివిధ దేశాల్లో ఒక విప్లవవేగంతో వ్యాపించింది. దాన్నే హరితవిప్లవం అన్నారు. మెక్సికోలో గోధుమ పరిశోధనలో 20 ఏళ్ళపైబడి పనిచేసి అనేక అధికదిగుబడులిచ్చే వంగడాలను ఆవిష్కరించిన మహామనిషీ , ఋషీ అయిన శ్రీమాన్ నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ (Norman Ernest Borlaug) ఆధునిక వ్యవసాయానికీ, ఈ హరిత విప్లవానికీ పితృతుల్యుడు. ఈయన పరిశోధనల ఫలితంగా పంటదిగుబడులు స్వల్పకాలంలో రెండు మూడు రెట్లు పెరిగాయి. అనేకదేశాలు కరువు కోరల్లోంచి బయట పడ్డాయి. ఈయనకి తన కృషికి గుర్తింపుగా వివిధదేశాలనుండి అనేక అవార్డులు, పతకాలు, గౌరవ డాక్టరేటులు లభించాయి. మనదేశం నుండి భారతీయ వ్యవసాయ అనుసంధాన పరిషత్తు (ICAR), భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) లాంటి వ్యవసాయ సంబంధిత సంస్థలూ, కొన్ని విశ్వవిద్యాలయాలూ ఆయనకి డాక్టరేటులు, అవార్డులు ఇచ్చాయి. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఇరవయ్యవ శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత ఖ్యాతిగడించిన 100 మంది అమెరికా పౌరులలో ఒకరిగా కీర్తించబడిన బోర్లాగ్ కి ఈమధ్య 2006 సంవత్సరానికిగాను అమెరికా కాంగ్రెస్సనల్ బంగారుపతకం ఇవ్వడం అత్యంత సముచితం. ఒక రకంగా ఆలస్యంగా లభించిన గౌరవం. ఆయనకి లభించిన గౌరవాలలో అత్యుత్తమ గుర్తింపు 1970 లో వచ్చిన నోబుల్ శాంతి బహుమతి. వ్యవసాయ శాస్త్రానికి నోబుల్ బహుమతి లేకపోవడం వల్ల ఈయనకి శాంతి బహుమతి ఇచ్చారు. ఆయనే ఎక్కడో అన్నట్లు ఖాళీ కడుపులా, కష్టజీవితాలా ఆలంబనతో శాంతియుత ప్రపంచాన్ని నిర్మించలేము (“hunger and poverty and misery are very fertile soils into which to plant all kinds of ‘isms’ including terrorism.” -Norman Borlaug). కాబట్టి ఆయన హరితవిప్లవసారధిగా ప్రపంచశాంతికి దోహదం చేసినందువల్ల ఇంకోవిధంగా చూస్తే ఆయనకి శాంతిబహుమతి రావడం కూడా సముచితమే.

బోర్లాగ్ కి ఆసియా దేశాలతో, ముఖ్యంగా భారతదేశంతో, గాఢానుబంధం ఉంది. మన దేశంతో సహా అనేక దేశాలలో వ్యవసాయోత్పత్తి పెంచే పరిశోధనా కార్యక్రమాలకు ఈయన స్ఫూర్తిని, సహకారాన్నీ అందించాడు. అది అంత తేలికైన పని కాదు. నూతన వ్యవసాయపద్ధతులని అవలంబించేలా భారత, పాకిస్థాన్ ప్రభుత్వాధినేతలని ఒప్పించడం కన్నా గోదాలో కుస్తీ పట్టడం తేలిక అని ఆయన ఒకసారి అభివర్ణించాడు. అన్నట్లు, ఆయన గొప్ప కుస్తీవీరుడు. అంత క్లిష్టకార్యాన్ని సాధించి ఆహారోత్పత్తిలో ఈదేశాలు స్వయంసమృద్ధి సాధించడానికి దోహదం చేసాడు. ఆయన గోధుమపంటపై చేసిన పరిశోధనలను అన్వయించడం వల్ల మేలురకం వరి వంగడాలని ఆవిష్కరించగలిగారు. పంట దిగుబడి పెంచడం సాధ్యమైంది. ఇది మనరాష్ట్రం అన్నపూర్ణగా పేరొందడానికి దోహదం అయింది. సర్ ఆర్థర్ కాటన్ లాగే ఈయన కూడా మనకి ప్రాతఃస్మరణీయుడు.

నోబుల్ బహుమతి కాక ఆయనకి అనేక బహుమతులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. అది ఆయా బహుమతులకే వన్నెతెచ్చిందనడం నిస్సందేహం. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. వ్యవసాయరంగానికి నోబుల్ బహుమతి లేని లోటుతీర్చడానికి నడుంకట్టి World Food Prize ని స్థాపించి ప్రతి ఏటా ఆహారసమస్య తీర్చడానికి కృషిచేసే వ్యక్తులకి ఆయన బహుమతి ప్రదానం చేస్తున్నారు. ఈ బహుమతిని పొందిన ప్రముఖులలో మన దేశంలో హరితవిప్లవానికి సారథ్యం వహించిన డా. M.S.స్వామినాథన్ (M.S.Swaminathan), క్షీరవిప్లవ (White Revolution) సారథి వర్గీస్ కురియన్ (Dr. Verghese Kurien), విత్తనోత్పత్తి సంస్థ మహికో (MAHYCO) స్థాపకుడు శ్రీ బి.ఆర్. బర్వాలే (B.R.Barwale), బంగ్లాదేశ్ లో గ్రామీణ బ్యాంకు ద్వారా పేదరిక నిర్మూలనకి సూత్రధారుడైన ప్రొ. మహమ్మద్ యూనస్ (Muhammad Yunus – ఈయన కూడా బోర్లాగ్ లా నోబుల్ శాంతి బహుమతి గ్రహీత) లున్నారు. తన గుర్తింపు కోసమే తపనపడే శాస్త్రవేత్తగా కాకుండా తన తర్వాతి తరాలకి స్ఫూర్తినీ, సాంకేతికనైపుణ్యాన్నీ అందజేసే దిశలో ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. ఈ కృషిలో భాగంగా జాన్ రువాన్ (John Ruan) తో కలిసి The World Food Prize Youth Institute ను స్థాపించాడు. దాని ద్వారా ఆయన ఎందరో యువకులకి స్ఫూర్తినందిస్తున్నాడు. వ్యవసాయరంగానికి పూర్తిగా దూరమైపోయిన అమెరికన్ యువతకి ఈసంస్థద్వారా ఆహారసరఫరా, ఆహారోత్పత్తుల మధ్యనున్న సంబంధాన్ని గుర్తుచేయడానికి ఈయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. కొంతమంది ఉన్నతపాఠశాల విద్యార్ధులని వివిధ అభివృద్ధిచెందుతున్న దేశాలకు స్వల్పవ్యవధి శిక్షణకై పంపడం ద్వారా తాను పొందిన ఉత్తేజం భావితర నిర్మాతలు కూడా పొందగల అవకాశాన్ని కల్పిస్తున్న దార్శనికుడీయన. నిజంగా ఆయన జీవితమే ఒక గొప్ప సందేశం.

ఆసియా దేశాలకు తనవంతు సహాయ, సహకారాలందించిన బోర్లాగ్ ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఆహారభద్రత చేకూర్చడానికి తన శక్తియుక్తులు ఉపయోగిస్తున్నారు. విత్తనం, రోడ్ల ద్వారానే ఆహారసమస్య తీర్చడం సాధ్యపడుతుందని నమ్మిన బోర్లాగ్ ముందు ముందు బయోటెక్నాలజీయే వ్యవసాయాభివృద్ధికి పట్టుకొమ్మవుతుందని విశ్వసిస్తున్నారు. ఆహారోత్పత్తి పెంచడానికి, జనాభా పెరుగుదలనరికట్టడానికి పనిచేసే సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఆకలిని జయించగలమని ధృఢంగా నమ్మారు. అంతేకాక, వ్యవసాయాభివృద్ధికోసం చేసే పరిశోధనలకై విశ్వవ్యాప్తంగా ప్రభుత్వపరంగా చేసే ఖర్చు కాలక్రమేణా తక్కువవడం పట్ల నిరశన వ్యక్తపరిచారు. ఈఅంశం వేలాది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకొంటున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకొంటుంది. వ్యవసాయపరిశోధనలపై చిన్నచూపు, ఆకలి సమస్య పై హ్రస్వదృష్టి, ప్రభుత్వాల నిర్లిప్తత, సంబంధిత వ్యక్తుల చిత్తశుద్ధిలోపం, వ్యవసాయ దినుసుల (inputs) కల్తీ వంటి కారణాలనేకం ఉన్నాయి. ఈరకమైన కారణాలవల్ల ఎంత సాంకేతిక ప్రగతైనా సరే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాక, ఒక బిలియన్ పైబడి ఉన్న జనాభాగల దేశానికి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ఒక పెనుబాధ్యత.

బోర్లాగ్ పరిశోధనలవల్ల చేకూరిన ఫలాలు ఇప్పటిదాకా ఆహారభద్రతని అందించడంలో తోడ్పడ్డాయి. కానీ ఆఫలాలు పూర్తిగా మొత్తమందరికీ అందుబాటులోకి రాలేదు. అంతేకాకుండా పెరిగిన జనాభా, తగ్గిన ప్రభుత్వ ఆదరణ, తరిగిన వనరుల దృష్ట్యా మున్ముందు ఆకలి సమస్య మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ప్రజలందరి ఆకలీ తీర్చగలగడం మనం బోర్లాగ్ కి ఇవ్వగల ఉత్తమబహుమతి.

– సత్యసాయి కొవ్వలి (http://satyasodhana.blogspot.com/)

(వ్యవసాయార్థికరంగ ప్రాచార్యులు (ప్రొఫెసర్) సత్యసాయి కొవ్వలి తెలుగు బ్లాగరుల్లో ప్రముఖులు. చక్కటి భాష, భావ ప్రకటనా శక్తి కొవ్వలి సొత్తు. బ్లాగు రాసే వారు బ్లాగరి అయితే, శ్రేష్ఠమైన బ్లాగరులను బ్లాగ్వరులు అని, సుదీర్ఘకాలం నుంచి బ్లాగుతున్నవారిని బ్లాగ్భీష్ములు అని కొత్త పదబంధాలను ప్రయోగించారు. హాస్యాన్ని బాగా పండించగల చమత్కారప్రియులు. గళ్లనుడికట్టును వాయువేగంతో నింపడంలోను, జనరంజకమైన గళ్లనుడికట్టును రూపొందించడంలోను నేర్పరులు. )

Posted in వ్యాసం | 2 Comments