నిత్యాన్వేషణే జీవితం

జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/)

చూపులు వెతుకుతుంటాయి
కుత కుత మంటూ

గిన్నెలో వుడుకుతూనే వుంటుంది

పైకి కనిపించేదంతా

ఆవిరై అదృశ్యమౌతుంది

చూపులు వెతుకుతుంటాయి

నాల్గు రోడ్ల కూడలిలో

నాట్యమాడుతున్న నియాన్ కాంతిలో

జీవిత మాధుర్యమేదో

జుర్రేయాలని ఇటూ అటూ చూస్తుంటాయి

చూపులు వెతుకుతుంటాయి

ప్రయాణ సమయాలలో

ఎదురయ్యే

అనేకానేక భంగిమల ఆకృతుల్లో

సరికొత్త రసాన్వేషణ సాగిస్తాయి

చూపులు వెతుకుతుంటాయి

జీవన శంఖారావంలో

మనసు పొరల్నించి

జారిపోయిన వాస్తవాల మూలాలకోసం

తవ్వకాలుగా సాగిపోతాయి

చూపులు వెతుకుతుంటాయి

కవి హృదయాన్ని పిండి

అక్షరాలను విత్తనాలుగా నాటిపోతే

చిగురిస్తున్న ఆకుల మధ్య

లేనిమొగ్గల కోసం

తడుములాట మొదలౌతుంది

చూపులు వెతుకుతుంటాయి

ఎండకాస్తే నీడకోసం

వానవస్తే ఎండకోసం

చలివేస్తుంటే వెచ్చదనం కోసం

నిరంతరం

లేనిదేదో తలపోసుకుంటూ

జీవితాలు సాగిపోతుంటాయి

వెదికేది దొరుకుతుందా

?
దొరికింది వెదికేదేనా

?
తృప్తి అసంతృప్తుల మధ్య నిత్యాన్వేషణే
!

జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/)

(వీరు రాసిన ‘హృదయాంజలి’ కవితాసంపుటి మార్చి 2004 లో శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన ‘హసీనా’ గురజాడ రాసిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి ‘అలలపై కలలతీగ’ కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది. వీరి గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని వీరి బ్లాగులో చూడవచ్చు.)

About కనుమూరి జాన్ హైడ్

జాన్‌హైడ్ కనుమూరి రాసిన 'హృదయాంజలి' కవితాసంపుటి మార్చి 2004 లో శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన 'హసీనా' గురజాడ రాసిన 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి 'అలలపై కలలతీగ' కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది.జాన్‌హైడ్ గారి ర గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని ఈ బ్లాగులో చూడవచ్చు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

4 Responses to నిత్యాన్వేషణే జీవితం

  1. రామ్మోహన్ says:

    మనిషి ఏమి వెతుకుతుంటాడో బాగా చెప్పారు

  2. ఉషారాణి says:

    మానవునికున్న అవయవాలలో ముఖ్యమైనది నయనం. అటువంటి నయనం గురించి వాటి వెతుకులాట గురించి ఇంత చక్కగా చెప్పిన కవిగారికి నా హ్రుదయపూర్వక ధన్యవాద శుభాకాంక్షలు.
    “అక్షరాలను విత్తనాలుగా నాటిపోతే,చిగురిస్తున్న ఆకుల మధ్య, లేనిమొగ్గల కోసం,తడుములాట మొదలౌతుంది”. ఈ కవితలొ ఈ వాక్యం నాకు బాగా నచ్చింది.

  3. జాన్ హైడ్ కనుమూరి says:

    స్పందిచినవారికి పత్రికవారికి ధన్యవాదములు

    జాన్ హైడ్ కనుమూరి

  4. mohanraokotari says:

    anatha myna anweshan anuksanikamynappudu raalina xellent kavitha midi.vethikede jiivitham, dorakanidanike aaratamu, ani jiivana poraataani vyakthikarinchi, patithala manasu kollagotaaru, meeremi hide cheyaledu john gaaru.

Comments are closed.