ఎర్రకోట

– త్రివిక్రమ్

“భూమ్మీద స్వర్గమంటూ ఉంటే
అది ఇక్కడే అది ఇక్కడే అది ఇక్కడే!!!”

“If there is Heaven on the Earth,
It is this, It is this, It is this”

“అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్,
హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.”

అని అమీర్ ఖుస్రో పరవశించి పాడే నాటికి మొఘలులు భారతదేశంలోకి ఇంకా రాలేదు. ఎర్రకోట లాంటి బృహత్తర నిర్మాణమొకటి ఇక్కడ వెలుస్తుందని ఎవరూ ఊహించనైనా లేదు. ఐనా ఎర్రకోటలో షాజహాన్ ఆంతరంగిక సమాలోచనలు జరుపుతూ ఉండిన మందిరం దివాన్-ఇ-ఖాస్ గోడ మీద చెక్కబడి ఉన్న ఆ అమృతవాక్కులు ఆ కోట విశిష్టతను చాటడానికి సరిగ్గా సరిపోయాయి. ఎన్నో భవంతులుండగా ఎర్రకోటనే స్వర్గధామంగా భావించడానికి కారణం అది ఖురాన్ లో స్వర్గం గురించి ఉన్న వర్ణనకు అనుగుణంగా నిర్మించబడడమే!
800px-red_fort_delhi_by_alexfurr.jpg

ఖొరాన్ లో వర్ణించిన స్వర్గాన్ని తలపించే విధంగా అమృతవాహిని (నహర్-ఎ-బిహిష్ట్) తో సహా నిర్మించబడ్డ ఈ అద్భుతమైన కట్టడం World heritage site గా గుర్తింపు పొందడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టిందనేది ప్రశ్న.

నిజానికి పదహైదేళ్ల కిందటే ఎర్రకోటను ఆ జాబితాలో చేర్చడానికి UNESCO వాళ్ళు పరిశీలించారు. ఐతే అప్పుడు అది సైన్యం ఆధీనంలో ఉండేది. అప్పుడే కాదు, అంతకు నూటయాభయేళ్ల కిందటి నుంచి 2003 వరకు అది సైన్యం ఆధీనంలోనే ఉంది. ఎర్రకోట ప్రాభవం మనకళ్ళముందే మసకబారిపోతూండడాన్ని గమనించిన UNESCO ‘ఇంత గొప్పదైనా ఈ కట్టడం ఒకపక్కనుంచీ నాశనమైపోతుంటే పట్టించుకునే నాథుడే లేడే’ అని దాన్ని అప్పుడే ప్రపంచవారసత్వసంపదగా ప్రకటించడానికి నిరాకరించింది.
800px-red_fort_28-05-2005.jpg

కోట లోపలా, వెలుపలా అడ్డదిడ్డంగా వెలసిన 250 పైగా ఆధునిక కట్టడాలు ఎర్రకోటను భ్రష్టుపట్టించాయి. అలాంటి కట్టడాల్లో స్వాతంత్ర్య పూర్వకాలానికి చెందినవీ, స్వాతంత్ర్యానంతరం సైన్యం నిర్మించినవీ కూడా ఉన్నాయి. దాంట్లో ఆవాసాలున్న సైనికాధికారుల నేమ్ ప్లేట్లు కోటగోడల మీద వదిలిన గుర్తులు కోట అందాన్ని దెబ్బతీశాయి. సైన్యం నుంచి ఆ కట్టడాన్ని స్వాధీనం చేసుకున్న పురాతత్వశాఖ కోట ఆవరణలో అడ్డదిడ్డంగా వెలసిన కట్టడాలను తొలగించి, కోటగోడలను శుభ్రం చేసే పనిలో ఉంది.
d-i-khas.JPG
“అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్,
హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.”

అన్న అమీర్ ఖుస్రో పలుకులు ఈ కోటలో పాలరాతితో నిర్మించబడిన దివాన్-ఇ-ఖాస్ అనే భవనంలోని గోడలమీద చెక్కించాడు షా జహాన్ పెద్ద కొడుకైన దారా షిఖో. ఈ భవనంలోనే చరిత్రప్రసిద్ధి గాంచిన నెమలిసింహాసనం మీద కూర్చుని కొలువుదీరేవాడు షా జహాన్. ప్రస్తుతం ఆ నెమలి సింహాసనమూ లేదు, ఆ కొలువుదీరడాలూ లేవు. విశాలమైన కొలువుకూటం మాత్రం జరిగిన దారుణానికి సాక్షీభూతంగా నిలిచి ఉంది. ఆ భవంతిలోని అపురూపమైన జాలీ లు కొన్ని ధ్వంసమై జాలిగొలుపుతున్నాయి.
732px-jama_masjid_is_the_largest_mosque_in_india_delhi_india.jpg

భారతదేశంలోని మసీదులన్నిట్లోకీ అతిపెద్దదైన జామామసీదు ఈ కోటకెదురుగానే ఉంది.
యునెస్కో ఒక కట్టడాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన తర్వాత కేవలం ఆ కట్టడమొక్కటే కాకుండా ఆ కట్టడం లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల మెయింటెనెన్స్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందువల్ల కోట ఆవరణలోని మీనాబజారులో ఉన్న దుకాణసముదాయాల్లో అమ్మే వస్తువుల నాణ్యత మీదే కాకుండా, ఏయే రకాల వస్తువులు అక్కడ అమ్మొచ్చో, మరేయే రకాలు అమ్మకూడదో కూడా పురాతత్వశాఖ నిర్దేశించనుంది.
800px-fuerte_rojo_delhi_2.JPG
ఆర్కిటెక్చరు:
తైమూరు, పర్షియన్, హిందూ భవననిర్మాణశైలులు ఈ కోటనిర్మాణంలో కనిపిస్తాయి. ఈ భవన నిర్మాణ శైలి, ఇందులోని తోటల ప్రణాళికల ప్రభావం ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్, తదితర ప్రాంతాల్లోని కట్టడాలు, తోటల మీద స్పష్టంగా కనిపిస్తుంది.

చరిత్రలో ఎర్రకోట: ఆధునిక భారతదేశ చరిత్రతో ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధముంది.
800px-fuerte_rojo_delhi_1.JPG

1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి మహా సంగ్రామంగా రూపు దాల్చింది. తొలుత మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు ఆఘమేఘాల మీద ఢిల్లీకి వచ్చి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-II ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించిందీ, ఆయన (నామమాత్రపు) నాయకత్వం కిందే సమరయోధులంతా ఒక్కటై నడిచిందీ.

ఈ ఎర్రకోటలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ కు చెందిన ముగ్గురు వీరులు గురుభక్ష్ సింగ్ ధిల్లాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, సయ్యద్ షానవాజ్ ఖాన్ లపై రాజద్రోహనేరం మోపి సైనిక విచారణ (కోర్ట్ మార్షల్) జరిపిందీ. స్వాతంత్ర్య పోరాటాన్ని క్లైమక్స్ కు చేర్చిన మహోద్విగ్న ఘట్టాలవి. కోట లోపల విచారణ జరుగుతుండగా వెలుపల నుంచి అశేషప్రజానీకం
“లాల్ ఖిలే సే ఆయీ ఆవాజ్,
సెహగల్, ధిల్లాన్, షానవాజ్,
తీనోంకీ హో ఉమర్ దరాజ్”

అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసింది. ఈ నినాదాలే దేశమంతటా ప్రతిధ్వనించాయి. లా చదివినా అప్పటికి ఎన్నో యేళ్ళ కిందటే కోటు విప్పి కదనరంగంలోకి దూకిన హేమాహేమీలు -జవహర్లాల్ నెహ్రూ, అసఫ్ అలీ, భులాబాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, కైలాస్ నాథ్ కట్జు – మళ్ళీ లాయర్లుగా మారి ఈ యోధత్రయం తరపున వాదించింది ఇక్కడే.

ఇక స్వాతంత్ర్యానంతర చరిత్ర అందరికీ తెలిసిందే! ప్రతీ ఆగస్టు పదహైదు నాడు ఎర్రకోట బురుజులమీద మువ్వన్నెల పతాకావిష్కరణ తర్వాత ప్రధాని ఇచ్చే ప్రసంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

ఇక రిపబ్లిక్ దినోత్సవం రోజు ప్రపంచంలోనే అతి విశిష్టమైన రిపబ్లిక్ డే పెరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి మొదలై, ఇండియా గేటు, కనాట్ ప్లేసుల మీదుగా ఎర్రకోటకు చేరుతుంది. ఆ పెరేడ్ లో భాగంగా ఎర్రకోట ముందు విన్యాసాలు చెయ్యాలని ఉవ్విళ్ళూరని సైనికుడుండడు. ఏనుగుమీదెక్కి ఎర్రకోటకు వచ్చే అవకాశం తమకు దక్కినందుకు పులకించిపోయే సాహసబాలల ఉద్వేగానికి హద్దులుండవు. ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో తన విశిష్టతను అక్కడ ప్రదర్శించాలని పోటీ పడని రాష్ట్రముండదు. త్రివిధ దళాల పాటవప్రదర్శనకు అచ్చెరువొందని ప్రేక్షకులుండరు.

రిపబ్లిక్ డే పెరేడ్ ఏడాదికొక్కసారే జరిగితే అదే ఎర్రకోటలో ప్రతిరోజూ జరిగే అద్భుతమొకటుంది. అదే సౌండ్ అండ్ లైట్ షో. ప్రేక్షకులకు తాము కాలనాళికలో ప్రవేశించామా అని భ్రాంతి కలిగేలా కాలాన్ని వెనక్కి తిప్పి చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల కిందట షాజహాన్ మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కోట నిర్మాణం గురించి ఆయన మదిలో మెదిలిన ఆలోచన మొదలుకుని స్వాతంత్ర్య సాధన వరకు ఎర్రకోటతో సంబంధమున్న చారిత్రిక ఘట్టాలను వివరించే ఆ షో చూడడమొక మరపురాని అనుభూతి.
red_fort_night.jpg

భారతదేశంలోని యునెస్కో World Heritage Sites:

  1. ఆగ్రా కోట
  2. అజంతా గుహలు
  3. ఎల్లోరా గుహలు
  4. తాజ్ మహల్
  5. మహాబలిపురంలోని కట్టడాలు
  6. కోణార్క సూర్యదేవాలయం
  7. కజీరంగా నేషనల్ పార్క్
  8. కేవల్దేవ్ ఘనా నేషనల్ పార్క్
  9. మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ
  10. గోవాలోని చర్చ్ లు
  11. ఫతేపూర్ సిక్రీ
  12. హంపీ
  13. ఖజురహో
  14. ఎలిఫెంటా గుహలు
  15. చోళ దేవాలయాలు (తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం, దారసూరంలోని ఐరావతేశ్వరం)
  16. పట్టడకల్
  17. సుందర్ బన్స్
  18. నందాదేవి, వేలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కులు
  19. సాంచీ స్తూపం
  20. హుమయూన్ సమాధి
  21. కుతుబ్ మీనార్
  22. డార్జిలింగు, నీలగిరిల్లోని పర్వత రైల్వేలు
  23. బుద్ధ గయ
  24. భీంబేత్కా గుహలు
  25. చంపానేర్-పావగడ
  26. ఛత్రపతి శివాజీ టెర్మినస్
  27. ఎర్రకోట

(గమనిక: ఈ పేజీలో వాడిన ఫోటోలు వికీమీడియా కామన్స్ లోనివి)

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to ఎర్రకోట

  1. vidyasagaro says:

    idi adbutham

Comments are closed.