కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు. మానవ ప్రస్థానంపై రోహిణీప్రసాదు గారు రాసిన వ్యాసాన్ని అతిథి శీర్షికన అందిస్తున్నాం.
—————–
ప్రాణులన్నీ ఒకే కుదుటినుంచి పుట్టాయని మనకు తెలుసు. వీటిలో మనను ఏమాత్రమూ పోలనివీ, మనతో కొంత పోల్చదగినవీ, మనకు దగ్గర బంధువులనిపించే వానరాలూ ఇలా అనేకం ఉన్నాయి. ప్రపంచంలో 300 కోట్ల ఏళ్ళ క్రితమే మొదట ఏకకణజీవులు పుట్టాయనీ, ఆ తరవాత 53 కోట్ల ఏళ్ళ క్రితం వరకూ బహుకణజీవులే ఆవిర్భవించలేదనీ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఏవో భౌతిక కారణాల వల్ల పెద్దపెట్టున బహుకణజీవులు పుట్టుకురావడం మొదలుపెట్టాక మొదటగా జలచరాలూ, తరవాత ఉభయచరాలూ ఆవిర్భవించాయనీ రాక్షసిబల్లులకు ముందూ, తరవాతా చిత్ర విచిత్రమైన ఆకారాల్లో వివిధ జాతులు భూమి మీద తిరిగాయనీ సాక్ష్యాలు లభించాయి. కాలవ్యవధిలో ఈ తేడాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. నిర్జీవమైన భూతలం మీద మొదటి వంద కోటి సంవత్సరాల దాకా జీవకణాలే పుట్టలేదు. ఆ తరవాత ఎంతో కాలంపాటు ఏకకణ జీవులే ఉండేవి. 53 కోట్ల సంవత్సరాల కిందట రకరకాల బహుకణప్రాణులు ఆవిర్భవించిన నాటికి భూమీ, సూర్యుడూ పుట్టి 400 కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ప్రాణుల్లో వెన్నెముక కలిగినవి కొన్ని మాత్రమే ఉండేవి. వాటిలో కొన్ని నీటినుంచి పొడి నేల మీదికి పాకటం, సరీసృపాలూ, క్షీరదాలూ అంటూ తేడాలు ఏర్పడటం, క్షీరదాల్లో ప్రైమేట్ జాతి ఆవిర్భవించి అందులో నుంచి మనుషులు పుట్టుకు రావడం, ఇవన్నీ ప్రకృతిలో సహజంగా జరుగుతూ వచ్చిన మార్పులననుసరించి జరిగిన పరిణామాలు. ఈ లెక్కన చూస్తే మనిషి ఆవిర్భావం “ఇటీవలనే” జరిగినట్టు అనుకోవాలి.
మనిషి ఆవిర్భావం జరగడమే యాదృచ్ఛికం. ఆరున్నర కోట్ల ఏళ్ళ క్రితం పెద్ద ఉల్కవంటిదేదో భూమిమీద వచ్చిపడగా రాక్షసిబల్లుల ప్రాబల్యం తగ్గిందనీ, క్షీరదాల ప్రాచుర్యం పెరిగిందనీ తెలుస్తోంది. పాలిచ్చి పిల్లలని పెంచే క్షీరదాల్లో ఎన్నెన్నో రకాలు తలెత్తాక చెట్లను అంటిపెట్టుకుని, తక్కిన ఇంద్రియాలతో పోలిస్తే కళ్ళమీదనే ఎక్కువగా ఆధారపడి బతికే మర్కట జాతులు ఆవిర్భవించాయి. జీవపరిణామ దశల్లో వీటి తరవాత మనిషిజాతికి దగ్గరగా ఉండేవి వాలిడి కోతులు. కోతుల గుంపులు సామాన్యంగా పోట్లాడుకుంటూ, సంఘర్షణకు లోనవుతాయి. హోమినాయిడ్ జాతి ప్రాణులు అలా కాకుండా పరస్పరం సహాయం చేసుకుంటూ, సముదాయాలుగా జీవించసాగాయి. వాటి దేహాలు బలిష్ఠంగా, చేతులు కాళ్ళకన్నా పొడుగ్గా, సున్నితమైన పనులు చెయ్యగలిగినవిగా రూపొందసాగాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మార్పులవల్ల మెదడులో కలిగిన అభివృద్ధి. ఈనాటికీ చింపాంజీలూ, గొరిల్లాలూ ప్రవర్తనలో కోతుల కంటే మనుషులకు దగ్గరగా అనిపిస్తాయి. ఇవి కోతుల్లాగా శాకాహారానికి పరిమితం కావు. భాష లేకపోయినా రకరకాల శబ్దాలతో సంకేతాలు పంపగలవు.
మనకూ, కోతులకూ, తోకలులేని గొరిల్లాలవంటి వాలిడి కోతుల పుట్టుకకు దారితీసిన ఆంత్రోపాయిడ్ ప్రైమేట్‌లు సుమారు 5 కోట్ల సంవత్సరాల కిందట తమ శారీరక లక్షణాల్లో ప్రత్యేకత సంతరించుకున్నాయి. చెట్లమీదనే జీవించే ఈ క్షీరదాలు తక్కినవాటికి భిన్నంగా, మెరుగైన చూపునూ, లాఘవంగా కదలగలిగిన అవయవాలనూ సాధించుకున్నాయి. వీటన్నిటికీ సంబంధించిన మెదడు భాగాలుకూడా అభివృద్ధి అవుతూవచ్చాయి. కొన్ని పరిస్థితుల్లో తప్ప ఈ లక్షణాలు మారవలసిన అవసరం ఏర్పడకపోవడంతో రకరకాల కోతులూ, వానరాలూ తామున్న స్థితిలోనే విజయవంతంగా కొనసాగాయి. ప్రతికూల వాతావరణమో, మరొక ఒత్తిడో ఎదురైనప్పుడే జీవ పరిణామానికి ప్రేరణ కలుగుతుంది. అటువంటి కారణాలవల్ల కోతులకు భిన్నమైన హోమినాయిడ్ జాతి 25-50 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది.
కోతులూ, వానరాల్లో ముక్కు కింది వైపుకు వంగి ఉండే ఒక జాతి ఏర్పడింది. వాసనపై తక్కువగా ఆధారపడిన ఈ జాతి నిశ్చయంగా మానవుల పుట్టుకకు కారణమైంది. ఈ ప్రాణుల శరీరభాగాల శిలాజాలు దొరికాయి. ఈ ఫాసిల్ శకలాలని బట్టి చూస్తే నరవానర (ఏప్), మనిషి లక్షణాలు రెండూ ఉన్నట్టు అనిపిస్తోంది. వారి చర్మం ఏ రంగులో ఉండేదో, ఎన్ని వెంట్రుకలు ఉండేవో, ఆహార సేకరణ ఎలా జరిగేదో, సము దాయాలు ఎలా బతికేవో వగైరా వివరాలు తెలియవు కాని ఈనాడు కనబడే చింపాంజీల వంటివాటిని గమనించి శాస్త్రవేత్తలు అనేక విషయాలు ఊహించగలుగుతున్నారు. ముఖాల ఆకారంలోనూ, ప్రవర్తనలోనూ, మెదడు పరిణామంలోనూ, ఒంటిమీద రోమాల విషయంలోనూ వారు చింపాంజీలను పోలి ఉండవచ్చు.
జన్యుపరంగా చింపాంజీలకూ, మనకీ 98.5 శాతం పోలికలున్నాయి. దీనర్థం మనకవి పూర్వీకులని కాదు. ఈ రెండు జాతులూ ఒకే కుదుటినుంచి పుట్టాయని. చింపాంజీలతో పోలిస్తే ఒరాంగుటాన్‌లు మనకు కాస్త దూరపు బంధువులే. ఇవన్నీ మనలాగే సముదాయాలుగా, గుంపులుగా, ఒకదాని కొకటి సహకరిస్తూ బతికే జీవులు. తక్కిన జంతువుల కన్నా తెలివైనవి. మెదడూ, నాడీమండలమూ అభివృద్ధి అయిన లక్షణాలు కలిగినవి. ఈ వాలిడికోతులు మునుపు ఎప్పుడో ఒక శాఖగా చీలిపోయి, మనుషులు సాధించిన జీవపరిణామాన్ని అందుకోలేకపోయాయి. జీవపరిణామం అనేది అప్పుడెప్పుడో జరిగి ఆగిపోయిందా? ఈనాడు కోతులు వాలిడికోతులుగానూ, వాలిడికోతులు మనుషులుగానూ మారటం లేదేం? అని కొందరికి అనుమానాలు కలుగుతాయి. ఒక్కొక్క జీవావరణం, లేక బయోస్ఫియర్‌లో తమ లక్షణాలను మార్చుకోకుండా బతకగలిగిన ప్రాణులు యథాస్థితిలో కొనసాగుతూ ఉంటాయి. అందుచేతనే మనకు దగ్గరివీ, కానివీ అనిపించే రకరకాల జంతువులు ఈనాటికీ కనిపిస్తూనే ఉంటాయి.
సుమారు 60 లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక మానవజాతికి పూర్వీకులనదగిన ప్రాణులు నరవానరాలవంటి జంతువుల నుంచి వేరుపడ్డట్టు తెలుస్తోంది. రెండు కాళ్ళతో నడవడం, చేతులతో ఇతర పనులు చేసుకోవడం, రకరకాల ఆహారం తినడం, లైంగిక కార్యకలాపాలకు కేవలం వాసనలపైన కాకుండా మెదడూ, సామాజిక నియంత్రణలపై ఆధారపడడం మొదలైనవి మానవుల పూర్వీకుల లక్షణాలు. తొలిరోజుల్లో వీటిలో అనేక జాతులు ఏర్పడ్డాయి. వీటిలో అతి ప్రాచీనమైన ఆస్ట్రలో పితెకస్ జాతికి చెందినవి తూర్పు, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉన్నట్టు సాక్ష్యాలున్నాయి. అప్పటి ప్రాణుల ఎముకలూ, అవి, లేదా వారు తయారు చేసుకున్న పనిముట్లే అందుకు దాఖలాలు. 40 లక్షల సంవత్సరాలకు మునుపే ఈ ప్రాణులు మనలాగా కాస్త నిటారుగా నిలబడి రెండుకాళ్ళ మీద నడిచేవి.

నిటారుగా నిలవడంలో మానవజాతి పరిణామం
ఇందుకు అవసరమైన శారీరక మార్పులు జరిగాయి. కటి ఎముక వాలిడికోతులకన్నా పొట్టిగా, వెడల్పుగా తయారైంది. అందువల్ల జఘనభాగపు కండరాలు నడుస్తున్న శరీరాన్ని అదుపులో ఉంచగలిగాయి. కటి భాగం గిన్నెలాగా ఉండడంతో నిటారుగా నిలుచున్నప్పుడు కడుపు లోపలి భాగాలకు తగిన ఆధారం ఏర్పడింది. నడుముకు కింద కాళ్ళు లోపలి వైపుకు వంపు తిరిగాయి. ఇందువల్ల నిలువుగా నడుస్తున్నప్పుడు మోకాళ్ళు తగిన ఆధారాన్నిస్తాయి. చింపాంజీలవంటి వాలిడికోతులకు నడుము నుంచి కాళ్ళు తిన్నగా దిగుతాయి. అందుచేత అవి రెండు కాళ్ళ మీద నడిచినప్పుడు శరీరం పక్కలకు ఊగుతుంది. ఆస్ట్రలో పితెకస్ జాతివారికి కాలి వేళ్ళు పొట్టివిగా తయారై, నడిచేటప్పుడు నేలను వెనక్కి నెట్టడానికి పనికొచ్చాయి. ఇదంతా నడవగా, నడవగా కండరాలు పెరిగినట్టుగా జరగలేదు. ఒక్కొక్క తరంలోనూ యాదృచ్ఛికంగా జరిగిన ఈ రకమైన జన్యు పరిణామాలు బలపడేందుకు ఆస్కారం క్రమంగా పెరిగింది.
ప్రాచీనయుగంలో ఆస్ట్రలో పితెకస్ జాతి తక్కిన నరవానరాలనుంచి వేరు పడటానికి పర్యావరణంలో కలిగిన మార్పులే ముఖ్యకారణమని ఊహిస్తున్నారు. 80నుంచి 50 లక్షల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా వాతావరణం చల్లబడి పొడిగా మారింది. తూర్పు ఆఫ్రికాలో అడవులు అక్కడక్కడా పలచబడటంతో కొన్ని ఏప్ (నరవానర) జాతులు పశ్చిమాన దట్టమైన అడవుల్లో ఉంటున్న తమ జాతినుంచి వేరయాయి. పెద్ద మైదాన ప్రాంతాల్లో ఉండవలసివచ్చిన ఈ ప్రాణులకు మార్పు తప్పనిసరి అయింది. చెట్ల రక్షణ కరువైన పరిస్థితిలో ఇవి పెద్ద సముదాయాలుగా ఏర్పడి, మైదానాల్లో ఆహారసేకరణకూ, క్రూరమృగాల వాతబడకుండా ఉండేందుకూ పాటుపడవలసివచ్చింది. వీటికి రెండు కాళ్ళమీద నడవడం, పరిగెత్తడం, ముందుకాళ్ళను చేతులుగా ఉపయోగించుకోవడం లాభించింది. ఇక్కడ “లాభం” అంటే ప్రాణాలు దక్కడం, తమ లక్షణాలను కలిగిన సంతానాన్ని పొందడం అనుకోవాలి. “నష్టం” అంటే మరణం, తమ లక్షణాలు కలిగిన సంతానం రూపు మాసిపోవడమే.
మొత్తం మీద చెట్లనుంచి దూరమైన పరిస్థితిలో తప్పనిసరి అయిన రెండుకాళ్ళ నడక మానవ లక్షణం అయింది. దీనివల్ల ఆలోచనాశక్తీ, పరస్పరం సమాచారం అందించుకునే సామర్య్థమూ పెరిగాయి. ఒకవేళ ఏదైనా ఒక ప్రాణికి ఈ నేర్పు కొరవడితే అది చచ్చిపోయి, దాని లక్షణాలు ఉన్న సంతానం సోదిలోకి లేకుండా పోయింది. జీవపరిణామం ఇటువంటి ఒత్తిడి ఉన్నంతకాలమూ ఒకే దిశగా సాగుతుంది కనక మనిషిజాతి లక్షణాలుకొన్ని ప్రాణుల్లో బలపడుతూ వచ్చాయి. “భగవంతుడి లీల” ఎటువంటిదో కాని మనిషి ఆవిర్భావానికి తోడ్పడినవి అప్పట్లో ఎండిపోతున్న అరణ్యాలు మాత్రమేనని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ “లీల” పౌరాణిక సినిమాల్లో చూపినట్టుగా అకస్మాత్తుగా కాకుండా లక్షల సంవత్సరాలపాటు అతి నెమ్మదిగా జరిగింది.
తొలి మానవులు చెట్లనుంచి పూర్తిగా దూరం కాలేదనీ, రకరకాల ప్రకృతి వైపరీత్యాలకు గురి అవుతూ రకరకాల ప్రాంతాల్లో తలదాచుకున్నారనీ ఒక ప్రతిపాదన ఉంది. ఆ కారణంగా ఆస్ట్రలో పితెకస్ జాతివారు రెండు కాళ్ళ నడకతోబాటు చెట్లు కూడా ఎక్కగలిగేవారని ఈ సిద్ధాంతం చెపుతుంది. చేతులు ఖాళీ అవడంతో ఆహారాన్నీ, పనిముట్లనూ మోసుకెళ్ళే వీలు కలిగింది. ఈ రాతి పనిముట్లు వేటాడటానికి ఉపయోగించలేదు. పెద్ద మృగాలు చంపి తినగా మిగిలిన మాంసాన్ని గిల్లుకు తినేందుకు ఈ జీవులు పనిముట్లు తయారు చేసుకున్నారు. ఇది అప్పటిదాకా ఏ ప్రాణీ చెయ్యనటువంటి పని. ఇందుకు తగినట్టుగా వారి మెదడు పెరగసాగింది.

1. చింపాంజీ, 2. ఆస్ట్రలో పితెకస్, 3. ఆధునిక మానవుడు ఎ. తొడ ఎముక, బి. మోకాలి ఎముక, సి. బరువు పడే లంబం
(చింపాంజీ కటి భాగం పొడవుగా, ఇరుకుగా ఉంటుంది)
నిటారుగా నిలుచోగలిగిన ఈ జీవులు ఎత్తుగా పెరిగిన రెల్లు దుబ్బుల పైనుంచి కూడా క్రూరమృగాల రాకను గుర్తించగలిగారు. చేతులతో ఆయుధాలను పట్టుకోవడం, నేలమీదా, చెట్ల కొమ్మలమీదా లభించే ఆహారాన్ని అందుకోవడం వీలయింది. చింపాంజీలు కూడా రెండు కాళ్ళమీద నడవగలవు కాని ఎక్కువ దూరం పోలేవు. ఎంత దూరమైనా నడవడం, అవసరమైనప్పుడు చెట్ల చాటుకు పరిగెత్తి, చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకోవడం ఇవన్నీ ఆస్ట్రలో పితెకస్ జాతివారు నేర్చారు. తమ మనుగడ పూర్తిగా ఇలాంటి సామర్య్థంపైనే ఆధారపడటంతో ఈ మార్పులు అతి వేగంగా, విజయవంతంగా జరిగాయి. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ మానవజాతి పురోగతికి మార్గం కలిగించారు.
ఈ విధంగా సుమారు 60 లక్షల సంవత్సరాల కిందట మానవజాతి ఆవిర్భావానికి దారితీసిన జాతి ఒకటి దక్షిణాఫ్రికా ప్రాంతంలో రూపొందింది. ఈ ప్రాణుల ముఖ్య లక్షణాలు రెండు కాళ్ళ నడకా, చిన్నచిన్న కోరపళ్ళూను. తరవాత ఈ జాతి ఆఫ్రికాలోని తక్కిన ప్రాంతాలకు వ్యాపించింది. ఈ పరిణామాల కారణంగా 40 నుంచి 20 లక్షల సంవత్సరాల కిందట మనుషులకు పూర్వీకులైన ఆస్ట్రలో పితెకస్ జాతి ప్రాణులు జీవించినట్టు శిలాజాలు తెలుపుతున్నాయి.


ఆస్ట్రలో పితెకస్ జాతి
చాలా విషయాల్లో ఆస్ట్రలో పితెకస్ జాతి ప్రాణులు వానర లక్షణాలు కలిగిఉండేవారు. కురచైన నుదురూ, పొడుచుకొచ్చిన ముఖమూ, చింపాంజీలతో సమానమైన నాలుగైదు వందల ఘన సెంటిమీటర్లకు మించని మెదడు పరిణామమూ, ఇలా చూస్తే బహుశా కాస్త ఉన్నతజాతి వానరాల్లాగే కనబడేవారేమో. శరీరపు బరువు కూడా యాభై కిలోలకు మించకుండా, ఎత్తు అయిదడుగులలోపే ఉండేది. కొన్ని జాతుల్లో గొరిల్లాలూ, ఒరాంగుటాన్‌లలాగే మగ ప్రాణులు ఆడవాటికన్నా భారీగా ఉండేవి. చేతి వేళ్ళు నరవానరాల కన్నా కాస్త పొట్టిగానూ, బొటనవేళ్ళు మాత్రం పొడుగ్గా అటూ ఇటూ తిరగ గలిగేవిగా ఉండేవి. వారిలో అప్పటిదాకా మరే ప్రాణిలోనూ కానరాని మార్పు రెండుకాళ్ళ మీద నడవడమే. ఈ ఒక్కటే ఎన్నెన్నో పరిణామాలకు కారణమైంది. మనకీనాడు అలాంటి ప్రాణి కనబడితే అదేదో తెలివైన వాలిడికోతి అనుకుంటామేమో.
నరవానరాల్లాగా తిన్నగా ఉండక వెన్నెముక “క” అక్షరంలాగా వంపు తిరగడంతో ఆస్ట్రలో పితెకస్ జాతి ప్రాణుల మొండెం కురచగా తయారైంది. శరీరాలు దృఢంగా, నిలువుగా తిరగటానికి వీలుగా ఉండేవి. నిలుచున్న తీరుకు అనుగుణంగా వెన్నుపాము పుర్రెలోకి చొరబడే స్థలం కూడా నరవానరాలకు భిన్నంగా ఉండేది. ఏప్ నరవానరాలకు కొరకడానికీ, భయపెట్టడానికీ పెద్ద పెద్ద కోరపళ్ళుంటాయి. ఆధునిక మానవులకన్నా పెద్దవే అయినా, 40 లక్షల సంవత్సరాలనాటి ఆస్ట్రలో పితెకస్ జాతికి కోరపళ్ళు చిన్నవిగా మారాయి. సముదాయాలుగా పరస్పరం సహకరిస్తూ బతికిన మగ జంతువులకు ఒకదాన్నొకటి భయపెట్టవలసిన అవసరం తగ్గింది.
క్రమంగా వీటిలో ఏడెనిమిది జాతులు ఏర్పడ్డాయి. 12 లక్షల సంవత్సరాల కిందట దృఢకాయంతో ఒక ఆస్ట్రలో పితెకస్ జాతి తయారైంది. ఈ జాతివారికి శాకాహారాన్ని బాగా నమిలి తినే పెద్ద దంతాలుండేవి. అప్పట్లో పుష్కలంగా లభించే ఆహారం తినడానికి అటువంటి “అభివృద్ధి” జరిగి ఉంటుంది కాని అది ఆధునిక మానవులు రూపొందేందుకు పనికిరాలేదు. మానవజాతికి తరవాతి యుగంలో ముఖ్యలక్షణాలైన అవగాహనా, ముందాలోచనా, ఊహాశక్తీ మొదలైనవి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో అబ్బిన గుణాలు.
ఉన్న పరిస్థితులకు అనువుగా రూపొందిన లక్షణాలన్నీ భవిష్యత్తులో ఉత్తమ జీవ పరిణామానికి దారితీస్తాయనే నమ్మకం ఏమీ లేదు. జీవపరిణామంలోని విచిత్రమైన అంశం అదే. ఏ ఒక్క యుగంలోనైనా ఉన్నంతలో జన్యుపరంగా బాగా బలపడి, సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికే ప్రాణులన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో వాటి ప్రభావం ఇతర జీవరాశి మీదా, ఇతర జీవాల ప్రభావం వాటిమీదా పడుతూ ఉంటుంది. మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు ఉన్న పరిస్థితులని తారుమారు చేసి ఉపద్రవాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. పరిణామాన్ని ముందుకు నెట్టేవి అవే. ఆపదలని అధిగమించడానికి కొత్త శరీరలక్షణాలు బలపడక తప్పదు. వాటిలో ఏది నిలుస్తుందో, ఏది పనికిరానిదో ప్రకృతే నిర్ణయిస్తుంది. ఈ మార్పులకు ఒక నిర్దిష్టమైన “ప్రణాళిక” అంటూ ఉండదు కనక జీవపరిణామం ఎప్పటికప్పుడు అనుకోని మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతుంది.
కారణాలు ఏవైనప్పటికీ కొన్ని లక్షలఏళ్ళు ఆఫ్రికా అంతా పెరిగిన ఆస్ట్రలో పితెకస్ జాతి ఆ తరవాత అంతరించిపోయింది. వీరికన్నా పెద్ద మెదడుతో ఆవిర్భవించిన హోమో ఎరెక్టస్ జాతి ప్రజలది పైచెయ్యి అయింది. సుమారు 18 లక్షల సంవత్సరాల కిందట ఆవిర్భవించిన ఈ కొత్త జాతి 30 వేల సంవత్సరాల కిందటిదాకా బతికింది.


హోమో ఎరెక్టస్ జాతి
నరవానరం స్థాయినుంచి ఆధునిక మానవజాతి ఆవిర్భావం దాకా జరిగిన సంఘటనలను గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒక యుగమో, ఒక జాతి ప్రజలో అంతరించగానే అందులోనుంచి కొత్త జాతి పుట్టుకొచ్చిందని భావించకూడదు. ఒక్కొక్క ప్రాంతంలో పరిస్థితులని అనుసరించి మనిషిజాతులు అనేక మార్పులు సంతరించుకుంటూ వచ్చాయి. తరవాతి కాలంలో అంతరించనున్న ప్రజలు ఇతర “మెరుగైన” ప్రజలకు సమకాలికులుగా వేల ఏళ్ళపాటు జీవిస్తూనే ఉండేవారు. విశాలమైన ప్రపంచంలో అప్పుడప్పుడూ అరుదుగా తారసపడి పరస్పరం సంఘర్షించినప్పటికీ ఒక జాతి మరొకజాతిని రూపు మాపేసిందనడానికి రుజువులేమీ కనబడవు. అంతకంతకూ వనరుల కోసం పోటీ పెరిగిన మాట నిజమే అయినా ఒక జాతి అంతరించడానికీ, మరొకటి పెంపొందడానికీ ప్రకృతిలోని పరిస్థితులే కారణం అవుతూవచ్చాయి. ఇవి ఆధునిక యుగంలో ఆటవికజాతులు తమ అలవాట్లని మార్చుకుని నాగరికులైనట్టుగా జరిగిన మార్పులు కావు. ఆస్ట్రలో పితెకస్, హోమో ఎరెక్టస్ మొదలైనవి వేరువేరు జాతులు. నిన్న మొన్నటిదాకా శాస్త్రవేత్తలు హోమో ఎరెక్టస్ జాతినుంచి ఆధునిక మానవజాతి పుట్టిందని భావించేవారు కాని ఆధునిక మానవులు తూర్పు ఆఫ్రికాలో మరొక విడి పాయగా రూపొంది హోమో ఎరెక్టస్ జాతికి సమకాలికులుగా ఉన్నారని ఊహిస్తున్నారు.

హోమో ఎరెక్టస్ జాతి కాలినడకన తిరిగిన ప్రాంతాలు
జంతువులతో పోలిస్తే మనిషికి ప్రత్యేకత కలిగించే లక్షణాలు చాలానే ఉన్నాయి. మేధాశక్తిలోనూ, సాంఘిక పరిణామంలోనూ జంతువుల్లో మనిషికి సాటి రాగలిగినవి చాలా తక్కువ. జీవపరిణామ క్రమంలో మనిషికి అబ్బిన ప్రత్యేకతలన్నీ దాదాపు ఒకేసారి రూపొందాయి. రెండు కాళ్ళమీద నడవగలగడం, పనిముట్లు చేసుకోవడం, ముందాలోచనతో వ్యవహరించడం మొదలైన విశేషశక్తులన్నీ కలిసి ఏర్పడ్డాయి. దీనివల్ల కొన్ని అనుకోని మార్పులు జరిగాయి.
వీటన్నిటికీ కారణం ఒకటే; లక్షలాది సంవత్సరాల క్రితం భౌగోళిక పరిస్థితుల్లో కలిగిన మార్పులవల్ల నాలుగుకాళ్ళతో పరిగెత్తే నరవానరజాతుల్లో కొన్నిటికి రెండుకాళ్ళ నడక తప్పనిసరి అయింది. ముందుకాళ్ళు చేతులుగా మారడంతో వాటికి కొత్త నైపుణ్యం అలవడింది. చేతులూ, వేళ్ళ కదలికలను శాసించే మెదడులోని భాగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి.
పనిముట్లద్వారా ఆహారం మరింత బాగా సంపాదించుకోవడంతో రానురాను సున్నితమైన పనులకు చేతులు అలవాటు పడడం, దానికి అనుగుణంగా మెదడు పెరగడం జరిగింది. ఏరుకు తినే దశనుంచి వేటాడే దశకు చేరుకోవడంతో ముందుగా ఆలోచించుకోవడం మొదలైంది. దీనికి తగినట్టే మెదడు విపరీతంగా పెరిగింది. అందువల్ల మనిషి తల పెద్దదయింది. వానరాల్లా కాకుండా నిటారుగా నిలబడ్డ మనిషికి ముఖం అంతకంతకూ విశాలమవుతున్న మెదడుకు కింది భాగాన అమరింది.
క్షీరదప్రాణుల పిల్లలలో రెండు రకాలుంటాయి. మొదటి రకానికి చెందిన ఎలుకలూ, పిల్లుల వంటివి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనేస్తాయి. అవన్నీ చిన్న మెదళ్ళతో నిస్సహాయంగా ఉంటాయి కనక తల్లులు వాటిని కాపాడి సాకుతాయి. పెద్దయాక వాటి మెదడు రెండింతలవుతుంది. రెండో రకానికి చెందిన గుర్రాలవంటివాటిలో పిల్లలు దాదాపు పూర్తి పరిమాణానికి ఎదిగిన మెదళ్ళతో పుడతాయి. అందుకని అవి పుట్టీ పుట్టగానే నేల మీద పడి చకచకా నడవడం, తల్లివెంట పరిగెత్తడం చేస్తాయి. అందులో “పురుటినొప్పులు” కూడా ఉండవు. పిల్లలు త్వరగా పెద్దవై యుక్తవయసుకు వచ్చేస్తాయి. మనుషుల్లో అలాకాదు. మనిషి మెదడు ప్రత్యేకం. పుట్టిన తరవాతకూడా ఒక ఏడాది పాటు అది పిండదశలో ఎదిగినంత త్వరగానూ ఎదుగుతూనే ఉంటుంది. మనుషుల పిల్లలు నిస్సహాయులై పుట్టడమే కాదు, తమ జీవితకాలంలో నాలుగోవంతు పెరుగుదలలోనే గడుపుతారు. ఈ సుదీర్ఘవ్యవధిలో వారి మెదడు అంతులేని అభివృద్ధి సాధిస్తుంది. పుట్టినప్పుడు మాత్రం వారి మెదడు ‘అసంపూర్తి’గా కనిపిస్తుంది. మనుషులలో ఏడాది గడిచేసరికి పిల్లల ‘శిశు’ మస్తిష్కం పూర్తిగా ఎదగడం, వారు కాస్త నిటారుగా నిలవగలగడం, మాటలు నేర్వడం అన్నీ ఒకేసారిగా జరుగుతాయి.
తక్కిన వానరజాతి జంతువులతో పోలిస్తే మనుష్యులు పుట్టే పద్ధతి చాలా విషయాల్లో ప్రత్యేకమనే చెప్పాలి. ప్రసూతి సమయంలో స్త్రీలు నిస్సహాయతకు లోనైనంతగా మరే వానరజాతి ప్రాణి విషయంలోనూ జరగదు. మనిషి సామాజికజీవితానికీ, రెండుకాళ్ళ నడకకూ దీనితో సంబంధం ఉందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. జంతువుల్లాగ కాకుండా మరొక మనిషి మంత్రసానిగా సాయం చెయ్యవలసిరావడం సామాజిక అంశమే. డార్విన్ సిద్ధాంతం ప్రకారం చూస్తే ప్రసూతిలో ఇతరుల సహాయం పొందిన తల్లులు పొందనివారికన్నా బాగా మనగలిగారన్నమాట. వానరాల్లా సహజమైన పద్ధతి అవలంబించిన స్త్రీలలో మరణం ఎక్కువగా సంభవించి ఉండాలి. అందువల్ల ఆ శరీర లక్షణాలు అంతరించిపోయాయి.
రెండుకాళ్ళ నడక కారణంగా మనుష్యుల కటి భాగపు వెడల్పు తక్కిన వానరజాతి జంతువుల కన్నా తక్కువగా ఉంటుంది. యోనిమార్గం ఇరుకవడంవల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. తల్లికి ప్రసూతి బాధ కూడా ఎక్కువౌతుంది. మనిషి మెదడు పరిమాణం పుట్టినప్పటితో పోలిస్తే పెద్దయాక మూడింతలు పెరుగుతుంది. కోతుల్లో ఇది రెండింతలే. ఈ పెరుగుదల గర్భంలో ఉన్నప్పుడే సజావుగా జరగాలంటే తల్లి బిడ్డను 21 నెలలు మొయ్యాలి. అలా జరిగితే పుట్టేనాటికి శిశువు తల విపరీతంగా పెరిగిపోయి బిడ్డ బైటకు రావడం అసాధ్యమౌతుంది. నెలలు నిండడం చింపాంజీల్లో మనిషిలాగే జరుగుతుంది కాని శిశువు మెదడులో మనిషికన్నా చాలా ఎదుగుదల కనిపిస్తుంది. పుట్టినప్పుడు కోతి పిల్లలు మనుష్యులంత నిస్సహాయంగా ఉండవు.
ఆధునిక విజ్ఞానం వీటికి సంబంధించిన అనేక విషయాలను వివరిస్తుంది. వానరజాతుల్లో పెద్దయాక మెదడు రెండింతలు పెరిగితే మానవ శిశువుల మెదడు మూడింతలవుతుంది. మన మెదడు ఎదిగే చివరి 12 నెలలపాటు మనం తల్లి గర్భంనుంచి బైటపడతాం. గర్భంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా పుట్టిన మనిషి బిడ్డకు నిత్యమూ అనేక ఇంద్రియపరమైన ప్రేరణలు అందడం, స్పందనలు కలగడం వగైరాలన్నీ మొదలవుతాయి. ఆ కారణంగా మనిషి మెదడులోని నాడీకణాల మధ్య అనేక కొత్త లంకెలు అతివేగంగా ఏర్పడతాయి. నిస్సహాయంగా మొదలైన మానవశిశువు జీవితానికి తల్లినుంచి లభించే రక్షణా, పోషణా, భావభరిత ప్రేమానురాగాలూ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఏ చింపాంజీ పిల్లల పద్ధతిలోనో మానవశిశువులు తల్లి శరీరాన్ని పట్టుకుని వేలాడనైనాలేరు. ఎందుకంటే స్వేదం ఎక్కువగా స్రవించే మనిషి శరీరానికి చింపాంజీల్లాగా రోమా లుండవు సరికదా, మన పిల్లల చేతులకు అంతటి పట్టు కూడా ఉండదు. అసలు ఇంతటి పెద్ద మెదడు ఉండడంవల్లనే మనకు స్వేదం ఎక్కువ. పెద్ద మెదడు ప్రసూతికి ఇబ్బంది కనకనే మనం అసంపూర్ణ దశలో జన్మిస్తాం. తల్లితో తప్పనిసరిగా ఏర్పడే అనుబంధం మనకు ‘మానవ’ స్వభావాలనిస్తుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు.
మనిషికి జీవపరిణామం మందగించి సాంఘికజీవితం మొదలవడంతో దానికి అనుగుణంగా శరీరంలో, ముఖ్యంగా మెదడులోనూ, ఇతర లక్షణాల్లోనూ మార్పులు అనివార్యం అయాయి. నోటి నిర్మాణంలోనూ, నాలుక కండరాల్లోనూ జరిగిన అభివృద్ధి మాట్లాడడనికీ, భాష పెరుగుదలకూ దోహదం చేసింది. చిన్న చిన్న తెగలుగా సమాజజీవితం ప్రారంభించిన ఆదిమమానవులకు భాషా, తద్వారా ఇతరులతో సంపర్కమూ కలిగించిన లాభాలు ఇంతా అంతా కాదు.
మనిషి వ్యవసాయం మొదలుపెట్టి, స్థిరనివాసాల్లో జీవించడంతో తినే ఆహారంలో వైవిధ్యం పెరిగింది. కార్బోహైడ్రేట్ల రూపంలో అనేక ధాన్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యం మెరుగుపడింది. పిల్లలకు పాలు మాన్పి ఇతర ఆహారం అలవాటు చెయ్యడం వీలయింది. తల్లులు మంచి పోషక ఆహారం తినడంవల్ల పది, పదిహేను నెలలలో మలి కాన్పుకు సిద్ధం అవసాగారు. ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా మనుషులు తమను తాము కాపాడుకోగలిగారు. పుట్టినప్పుడు బలహీనంగా ఉన్నప్పటికీ మనుషులు ఒకరికొకరు తోడ్పడే సమాజ జీవితం ద్వారాఇతర ప్రాణులకన్నా అభివృద్ధి సాధించగలిగారు.
ఈ పరిణామాలవల్ల ఏమౌతుంది? మనుష్యుల తలలు పుట్టినప్పుడు అంతకంతకూ పెద్దవౌతాయి. సహజ ప్రసూతిలో శిశువు తల నొక్కుకుపోయి భరించరాని బాధ కలుగుతుంది. మునుపటి కన్నా ఈ రోజుల్లో సిజేరియన్ పద్ధతిలో పిల్లలు పుట్టడం ఎక్కువైంది. శస్త్రచికిత్సలో జరిగిన అభివృద్ధి దీనికి కొంత కారణం కావచ్చు కాని పిల్లల తలలు అంతకంతకూ పెద్దవి కావడం కూడా ఇందుకు కారణమేమో. ఈనాటి పోటీ ప్రపంచంలో తెలివితేటలు లేకుండా పెరగడం అసంభవం కనక ఇది ప్రకృతిలో జరిగిన ఏర్పాటేమో.
పిల్లలు పుట్టి పెరగడానికీ, మనుషులు సమాజాలుగా ఏర్పడడానికీ కూడా గట్టి సంబంధం ఉందని కొందరు శాస్త్రవేత్త లంటారు. సమిష్టిగా పెంచిన పిల్లలు బతికి బట్టకట్టే అవకాశం ఎక్కువ. అందరు ఆడవాళ్ళకూ కాన్పు ఒకేసారి రాదు గనక సాటివారికి తోడ్పడడం, ఒకరినుంచి మరొకరు నేర్చుకుని పిల్లల్నికాపాడడం వీలవుతుంది. ఐకమత్యమే మహాబలంగా పెరిగిన ఆదిమానవుల తెగలకు పిల్లల పెంపకంలోని ప్రాముఖ్యత అర్థమై ఉంటుంది. ఇవన్నీ ఆధునిక శారీరక లక్షణాలు బలపడడానికి దోహదం చేసి ఉండాలి.
నడక అనేది మానవుల ప్రాథమిక లక్షణం. నడవలేని జాతులు వానరాలుగా చెట్ల మీదే ఉండిపోయాయి. రెండు కాళ్ళమీద వేల మైళ్ళు ప్రయాణించగలిగిన ఆదిమానవులు అన్ని విధాలా వానరాలనుంచి వేరుపడి ప్రగతిని సాధించారు. ఈనాటికీ ప్రయాణాలు చెయ్యడం మెదడుకు లాభిస్తుందనే అభిప్రాయం ఉంది. ఇందుకు ఉదాహరణగా చాలాకాలంపాటు ఉన్నచోటనే పాతుకుపోయిన నియాండర్తాల్ జాతి క్రమంగా అంతరించిపోయినట్టుగా తెలుస్తోంది. కొత్త చోట్లకి వెళ్ళడం, కొత్త వాతావరణానికీ, లభ్యమౌతున్న ఆహారానికీ అలవాటు పడడం మొదలైనవన్నీ ఆదిమానవుల బుద్ధిని పదునెక్కించాయి. ఇతర రవాణా సౌకర్యాలు లేని యుగంలో ప్రయాణాలకు పనికొచ్చిన నడక శారీరకంగా ఇప్పటికీ మనకెంతో సహజమైనది. నడక అనేది ఒకప్పుడు మనుగడకు పనికొచ్చిన చర్య. రోజువారీ జీవితాల్లో అదొక భాగంగా ఉండేది. ఈ రోజుల్లో అది తగ్గిపోయి మనుషులు కదలనవసరం లేని జీవితాలకు అలవాటు పడుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనం నడుస్తున్నప్పుడు మెదడుకు ప్రాణవాయువును అందిస్తాం. ఊపిరి తీసే ప్రక్రియ మెరుగవుతుంది. గుండె వేగం హెచ్చుతుంది; మెదడులోని రక్తనాళాలు పెద్దవవుతాయి. శక్తి పెరిగి, వ్యర్థాలు ఎక్కువగా విసర్జించబడతాయి. ఈ రోజుల్లో మనుష్యుల ఆరోగ్యం అవగాహన బాగా మెరుగుపడింది. టెస్ట్‌ట్యూబుల్లో శిశువులు రూపొందే రోజులొచ్చాయి. మనిషి శరీరనిర్మాణం మాత్రం ఆనాటి ప్రత్యేక పరిస్థితుల్లో రూపుదిద్దుకుందనేది మరిచిపోరాదు.
మొత్తంమీద ఆధునిక మానవులకు పూర్వీకులుగా మొదట ఆస్ట్రలో పితెకస్ జాతీ, ఆ తరవాత హోమో ఎరెక్టస్ జాతీ నడక అనేది అలవరుచుకున్నారు. హోమో ఎరెక్టస్ ప్రజలు 15, 20 లక్షల ఏళ్ళ క్రితమే ఆఫ్రికానుంచి మహాప్రస్థానం చేసి ప్రపంచంలో నలుమూలలకీ వెళ్ళి స్థిరపడ్డారు. వీరి పనిముట్లూ, అవశేషాలూ ఎన్నెన్నో లభిస్తాయి. ఆ తరవాత సుమారు లక్ష ఏళ్ళ కిందట ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి కాలినడకన మరో ప్రస్థానం చేసి తమ పూర్వీకులందరూ అంతరించడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమయారు. మనం వారికే వారసులం. అందుచేతనే నడక ఎంత ముఖ్యమైనదో మనం గుర్తుంచుకోవాలి.
-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్