ఈ సంచికలో

పొద్దులో గడికోసం ఆసక్తిగా ఎదురుచూసే పాఠకులు ఈసారి ఎక్కువరోజులు వేచి ఉండవలసి వచ్చినా ఈనెల గడి వారిని సంతృప్తిపరచగలదని ఆశిస్తున్నాం. గళ్లనుడికట్లంటే విపరీతమైన ఆసక్తిచూపే ప్రముఖ రచయిత్రి లలితాముఖర్జీ గారు సంగీతంతో ముడిపడి ఉన్న ఆధారాలు కొన్నింటిని పొద్దుకు పంపారు. వాటిని ఈ గడిలో ఉపయోగించడం జరిగింది. వీలువెంబడి బ్లాగు గడి, వికీ గడి, సినిమా గడి లాంటి థీమ్ బేస్డ్ గళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.

వివిధ శీర్షికలో క్రెడిట్ కార్డుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సుధాకర్ వివరిస్తున్నారు. ఇంకా ఈ సంచికలో మృతజీవులు-8వ భాగంతోబాటు వి.బి.సౌమ్య రాసిన “చిన్ని చిన్ని బాధలు” కథ, వైజాసత్య చెప్తున్న “సెప్టెంబరు వికీపీడియా విశేషాలు” మిమ్మల్ని అలరిస్తాయని ఆశిస్తున్నాం.

ఈ నెల రచనలు:

నెజ్జనులకు సూచనలు (అతిథి)
గడి (గడి)
ఆగస్టు గడి సమాధానాలు (గడి)
అక్టోబరు గడిపై మీమాట (గడి)
చిన్ని చిన్ని బాధలు (కథ)
క్రెడిట్ కార్డులు (వివిధ)
మృతజీవులు – 8 (మృతజీవులు)
సెప్టెంబరు వికీపీడియా విశేషాలు (వికీ)

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం (అతిథి)
నుడికారము – మరికొన్ని కోణాలు (వ్యాసం)
మృతజీవులు – 6 (మృతజీవులు)
తెవికీ ప్రగతి నివేదిక (వికీ)
అక్షర పద్య విన్యాసాలు (వ్యాసం)
పల్ప్ ఫిక్షన్ (సినిమా)
మృతజీవులు – 7 (మృతజీవులు)

Posted in ఇతరత్రా | Comments Off on ఈ సంచికలో

చిన్ని చిన్ని బాధలు

vbsowmya.JPG

లైబ్రరీ …. నిశ్శబ్దం తాండవమాడుతోంది. ఎవరి పనుల్లో వారు మునిగినట్లు ఉన్నారు. చదువుకునే వాళ్ళు చదువుతున్నారు. ఏసీ ని కావలించుకుని నిద్దరోయేవాళ్ళు నిద్రలో ఉన్నారు. కలలు కూడా కంటున్నారో ఏమిటో. నెట్ చూసే వారు అది… కళ్ళతో కబుర్లాడుకునే ప్రేమికులు వాళ్ళ పనిలో. లైబ్రరియన్ కంప్యూటర్ స్క్ర్రీను పై బిజీ. సెక్యూరిటీ వాచ్‌మెన్ ఓ కన్ను తలుపు వైపు, ఓ కన్ను తన కన్ను చూడగలిగినంత మేర పిల్లల వైపు వేసి ఎదురుగా సంతకం పెడుతున్న పిల్లాడ్ని ఏ కన్నుతో చూడాలో తేల్చుకోలేక తంటాలు పడుతున్నాడు. అప్పుడప్పుడు పేజీలు తిప్పే శబ్దం తప్ప ఇంకేమీ వినబడ్డం లేదు. ఇంతలో హాచ్ అంటూ ఓ తుమ్ము వినిపించింది. లైబ్రరీయన్ తన పనిలో నుంచి తల ఎత్తకపోయినా కూడా తక్కిన వారంతా వెంటనే తమ పనులాపి, కాస్త చిరాగ్గానూ, కాస్త ఆతృత తో నూ చూసారు…ఎవరా ఆ తుమ్ముడుకాయ? అని.

తుమ్మి అలవాటు కొద్దీ “ఎక్స్‌క్యూజ్ మీ” అనబోయిన రాజేశ్ అది లైబ్రరీ అని గుర్తువచ్చి తనలో తానే మెల్లిగా అనుకుని, చుట్టూ పరికించి చూసాడు. అతను తమని చూడ్డం చూసిన మిగితా వారంతా వెంటనే అతని మీద నుంచి దృష్టి మరల్చి మళ్ళీ తమ పనుల్లో పడ్డారు. ఎవర్నన్నా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని చూస్తే మనలో దొరికిపోయామన్న భావన కలుగుతుంది. అందువల్లనే వెంటనే దృష్టి మరల్చేది. మళ్ళీ అందరూ తమ పనుల్లోకి దిగాక – “ఛీ, వెధవ జలుబు” – నూట తొంభైయ్యో సారి అనుకున్నాడు. చదువుతున్న రీడర్స్ డైజెస్ట్ వంక మళ్ళీ దృష్టి సారించాడు. ఎవరో “లాంగ్ లాంగ్” అనే చైనా పియానిస్ట్ కథ.

“పియానో! ఎంత బాగుండేది నాకూ పియానో వచ్చుంటే? ఈ చదువులు మానేసి అలా ఏదన్నా చేసి ఉండాల్సింది. అనవసరంగా ఎందుకొచ్చిన ఇంజినీరింగ్ చదువు?”
“ఏం? దీన్నే గా పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటావు అందరికీ? ఈ కాలేజీ లో చదువుకుంటున్నా అని?” – మనసు ప్రశ్న.
“ఇక్కడ చదివితే ఇక్కడని కాక పక్క కాలేజీ అని చెప్పనా మరి? గొప్పగా కాక-ఎవరన్నా అడిగితే ఏడుస్తూ చెప్పనా ఇక్కడే చదువుతున్నా అని?”
– రాజేశ్ కి నిన్నటి కేంపస్ ఇంటర్వ్యూ గుర్తు వచ్చింది.
“ఈ ఇంటర్వ్యూ కోసం ఎంత కష్టపడ్డాను? ఈ కంపెనీ లో రావాలి అని మొన్నో కంపెనీ వస్తే దానిక్కూడా కూర్చోలేదు. రావాలే కానీ, జీవితాంతం ఇక్కడే పని చేయాలనుకున్నాను… మనసులో బాధ గా ఉంది. ఎవర్ని చూసినా వెక్కిరిస్తున్నట్లే అనిపిస్తున్నది. రవి గాడు… నాకంటే ఎందులో ఎక్కువ? వాడికొచ్చింది. వాడు నాతో మాట్లాడినంత సేపు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోంది.”
ఇందాక ఆ చందు – “నీకు రాలేదా? నమ్మలేకపోతున్నానంటే నమ్ము” అన్నాడు. అంటే వ్యంగ్యమా? జాలా? ఆశ్చర్యమా? వ్యంగ్యం లాగే ఉంది ఆ వ్యాఖ్య. నమ్మలేకపోతున్నానంటే చాలదూ? మళ్ళీ “నమ్ము” అంటాడేమిటి? అంటే నేను నమ్మనని ఎందుకు అనిపించింది వాడికి? నమ్మలేకపోతున్నాడంట వెధవ. నాకు మాత్రం ఏదో మా గొప్ప నమ్మకంగా అనిపిస్తున్నట్లు ఇక్కడ. అసలు….”
ఇంతలో టేబుల్ ఊగుతున్న భావన. ఫోను. ఆలోచన ఆపి ఫోను వంక చూసాడు. ఏదో కొత్త నంబరు. వెంటనే దాన్ని పట్టుకుని శబ్దం చేయకుండా తలుపు వద్దకు వచ్చాడు. అంత వేగం లోనూ సెక్యూరిటాసురుడు తనను నఖశిఖపర్యంతం చూట్టం గమనించాడు. “ఇంతలో ఏమి ఎత్తుకుపోతాను రా వెధవా?” మనసులోనే తిట్టుకుని తలుపు తోస్తూ – “హలో…” అన్నాడు. వెంటనే మొహం లో రంగులు మారాయి. ఏమీ మాట్లాడకుండానే కట్ చేసాడు. వెధవ కాల్స్. ఈ హచ్ వాళ్ళకి పనీ పాటా లేదు. కసిగా తిట్టుకుంటూ మళ్ళీ ఆ తోసి మూసిన తలుపుని తోస్తూ లోపలికొచ్చాడు. వెళ్ళి ఇందాకటి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ రీడర్స్ డైజెస్ట్ తీసాడు మళ్ళీ.

ఇదివరలో మొదటి సారి మందు రుచి తెలిసే వయసు 28 సంవత్సరాలు ఉండేదట. ఇప్పుడది 20 ఏళ్ళైందట. ఏదో సర్వే చేసారులా ఉంది. “ఈ సర్వేలెందుకు చేస్తారో అసలు? పనికిమాలిన సర్వేలు…” చిరాకు పడ్డాడోసారి దాన్ని చూసి. “మరి ఎప్పుడూ నన్నెవరూ అభిప్రాయమడగలేదే? ఎవర్ని అడుగుతారో వీళ్ళ్దు… పీపుల్స్ సర్వే అని రాస్తారు పైగా అందరూనూ.” “ఇరవై సగటు వయసా అయితే? ఇంకా నేను తాగలేదే మరి? ఓ సారి తాగి చూద్దామా??” తాగుడనగానే రాజేశ్ కి తన నేస్తం కిశోర్ గుర్తువచ్చాడు. “ఏం చేస్తున్నాడో వాడు… వారమైంది మాట్లాడి. ఉండేది ఒకే కాలేజీ. చదివేది ఒకటే క్లాసు. ఒకే బెంచీ. హాస్టల్లో పక్క పక్క గదుల్ల్లో. అంతే. తెలుసుకోవాలనుకుంటే ఎంతలో పని? అంతలో అయ్యే పనే ఇప్పుడు ఇంత కష్టమై కూర్చుంది. ఎందుకు మాట్లాడ్డం మానేశాడో అర్థం కాదు. తిక్క వెధవ. మనం హలో అంటే హలో అనడమే కానీ, మునుపటి చనువేదీ? ఏం జరిగిందంటే చెప్పడు. వీడు తాగితే నాకేం, తిరిగితే నాకేం? అసలు ఆ రోజు – “ఎందుకు రా తాగుతావ్?” అన్నందుకే మాట్లాడ్డం మానేసి ఉంటాడా? అమ్మాయిల్లాగా ప్రతి చిన్నదానికి ఆ అలక ఏమిటి? అసలు వాడేం మారలేదు ఏమో! నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? అడిగితే ఏం లేదంటాడు కానీ, మునుపటిలా ఉండలేకపోతున్నా వాడితో. వాడి విషయాలేమీ తెలీడం లేదు నాకు. నేనే మారానేమో ఒక వేళ?” …. మళ్ళీ తుమ్ము!

“ఏమి జలుబో ఏమో కానీ…. ఏమీ చేయలేకపోతున్నాను. క్లాసు పుస్తకం ముందేస్తే కళ్ళు మామూలుగానే మూసుకుపోతాయి. ఇప్పుడైతే మరీనూ. పోనీ మొన్నటి నవల కొనసాగిద్దాం అంటే రెండు పేజీలు చదివే సరికి తుమ్ములు, దగ్గులు మళ్ళీ మొదలు. కంప్యూటర్ ముందు కూర్చుంటే చాట్ చేస్తూ రెండు ఎంటర్లు కొట్టగానే తలనొప్పి. కిటికీ తెరిచి దిక్కులు చూద్దామంటే బయట చలి గాలి. కాసేపు ఆడుతూ ఉంటే కాస్త పర్వాలేదనిపించింది కానీ … ప్చ్! ఇలా అయితే ఎలా? అంతా అయిపోయి, భోజనం తినీతినగానే వచ్చి ఈ లైబ్రరీ లో కూర్చున్నాను! ఖర్మ. ఇది కాస్తా వెకేషనై కూర్చుంది. లేకుంటే మిగితా నేస్తాలన్నా ఉండేవారు. అసలా కిశోర్ గాడితో టాకింగ్ టర్మ్స్ లో ఉంటే బాగుండేది. నేనే ఎన్ని సార్లు కదిలించినా ముక్తసరిగా జవాబు ఇచ్చినట్లు అనిపిస్తుంది. వాడుగా ఏమీ అనడు. అరే! నిన్న ఇంటర్వ్యూ పోయిందే…ఓ సారొచ్చి పరామర్శించొచ్చు కదా?? ఇందాకే ఎదురుగ్గా కూర్చుని లంచ్ చేస్తూ నవ్వాడు. అంతే. అదేమి విచిత్రమో గానీ, ఆ క్షణం లో నాకు కూడా ఏమీ తోచలేదు మాట్లాడ్డానికి వాడితో. గంటలగ్గంటలు కబుర్లు చెప్పుకునే వాడితో కూడా నాకేమీ మాటల్లేకపోడం ఏమిటో! తప్పు నాదేనేమో! వాడి గురించి పొరబడ్డానేమో!”

డైజెస్ట్ ని ఇక జీర్ణించుకోలేక మూసేసాడు. “500 మస్ట్ సీ మూవీస్” – ఎదురుగ్గా ఎవరో వదిలి వెళ్ళిన లావుపాటి పుస్తకం చూసాడు. “ఈ సినిమాలు చూసి తీరాలా? తీరకపోతే?” అనుకున్నాడు. “ఏమిటి ఇంత తిక్కగా తయారయాను? రేపట్నుంచి తిక్క రాజేశ్ అన్నా అంటారేమో ఇక!” అనుకున్నాడు. ఓ సారి అటూ, ఇటూ చూసాడు. షరా మామూలే, ఎవరి పనుల్లో వారు. “నాకు మాత్రమే ఎందుకు బోరు కొడుతోంది ప్రతీదీ? ” అనుకున్నాడు. మెల్లగా లేచి, పిల్లిలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. తలుపు దాటగానే, స్వేచ్ఛగా ఊపిరి పీల్చాడు. “ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్ద ప్రపంచం నుండి బయటకొచ్చేసా. ఇక మళ్ళీ నేను నేనే!” అనుకున్నాడు. ఎదురుగుండా మైదానం లో ఎవరో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. కాసేపు చూస్తున్నాడు. “కిశోర్ గాడు కూడా ఉంటే బాగుండేది… ఆ కంపెనీ లో వచ్చుంటే బాగుండేది…. ఈ జలుబు రాకుంటే బాగుండేది…. చా! నేను మరీ ఏడుపుగొట్టు పెస్సిమిస్ట్ అయిపోతున్నా ఈ మధ్య!” – తన ఆశల్లోని నిరాశావాదాన్ని బాగా పట్టుకున్న రాజేశ్ తన్ను తానే ఓ సారి తిట్టుకుని, నవ్వుకున్నాడు. ఇంతలో మళ్ళీ ఫోను.

“రాజేశ్ కాలింగ్” అని వచ్చింది. ఉలిక్కిపడ్డాడు. కళ్ళు నులుముకుని మళ్ళీ చూసుకున్నాడు. అదే. అప్పుడెప్పుడో దయ్యాలు చేసే ఫోన్లంటూ, దయ్యం సెల్ నంబరంటూ ఓ ఫార్వర్డ్ రావడం గుర్తు వచ్చింది. ఇది అటువంటిదే కాబోలు అని అనుకుని, వెంటనే తిట్టుకుని, ఆ వెంటనే నవ్వుకుని, ఫోను ఎత్తాలా వద్దా అని ఆలోచించి – మొత్తానికి ఎత్తేశాడు. “ఎరా సోదిమొహం వెధవా! ఎవరి ఫోను తీస్కపొతున్నవో తెల్వదురా బయ్ నీకు?” – అవతలి వైపు నుంచి గొంతుక. వెంటనే గుర్తు పట్టాడు రాజేశ్. అది కిశోర్ ది. వెంటనే ఓ సారి ఆ ఫోను పరికించి చూసాడు. నిజమే, వాడి ఫోనుకి, తన ఫోనుకి ఆట్టే తేడా లేదు. పరికించి చూస్తే తప్ప తెలీదు. నవ్వొచ్చింది అతనికి. మళ్ళీ ఫోనుకి చెవిని ఇచ్చాడు. “ఏం రా? అడుగుతూంటే సమజైత లేదా? ఫోన్ ఎప్పుడిస్తావ్?” – అదే అభిమానం తో కూడిన చిరు కోపం. “ఏం బే! ఇప్పుడా చూస్కునేది? ఐదు నిముషాలాగు…తెచ్చిస్తా. క్యాంటీన్ లో కాఫీ కి రా…అక్కడ ఇస్తాను..” అన్నాడు. అవతల వైపు నుండి సరేనన్న జవాబు తో ఫోను కట్టయింది. రాజేశ్ మొహంలో ఎంత వద్దనుకున్నా ఓ నవ్వు. “వాడు మనసులో ఏమీ పెట్టుకోలేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించినట్లు ఉన్నా నేనే. అసలు వాడి గురించి నేనిలా ఆలోచిస్తున్నా అని వాడికేమీ అనిపించనట్లే ఉంది..అలాగే ఉండనీ!” అనుకున్నాడు. ఆ క్షణం లో మరి పోయిన ఉద్యోగమూ, ప్రాణం తోడుతున్న జలుబూ – రెండూ గుర్తొచ్చినా కూడా ఈ ఒక్క కాల్ వల్ల కలిగిన ఉత్సాహం వాటివల్ల కలిగిన నిరుత్సాహాన్ని బైటకి పంపేసినట్లు ఉంది. ఓసారి ఫోను ని చూసి, నవ్వుకుంటూ క్యాంటీన్ వైపు కి వెళ్ళిపోయాడు.

—————
తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.

Posted in కథ | Tagged , | 15 Comments

క్రెడిట్ కార్డులు

Sudhakar
[సుధాకర్]

అప్పిచ్చువాడు, వైద్యుడు…అంటూ ఎప్పుడో చెప్పిన సుమతీ శతక కర్త ఇప్పుడు వుంటే కనక ఆ “అప్పిచ్చువాడు” అనే పదాన్ని పీకి పారేసేవాడు. లేకపోతే “అప్పంటగట్టే వాడు లేని” అని ఒక కొత్త పదాన్ని చేర్చేవాడు. అప్పు చెయ్యటం ఒక బలహీనత, ఒక ఆనందం. తీర్చటం ఒక చేదు అనుభవం, ఒక భారం. ఇది ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. అయితే ఆనందాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. అందువల్లనే అప్పు ఇప్పుడు సర్వాంతర్యామి. సరిగ్గా దీనినే ఇపుడో అద్భుతమైన వ్యాపారంగా మలచుకున్నాయి, చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు. జీవిత కాలపు ఉచిత క్రెడిట్ కార్డులు ఇస్తాం అని వెంటపడి మరీ అప్పుల్లో జనాలను మత్తుగా మునిగేటట్లు చేస్తున్నాయి. అందువల్లన ఇవి లేకుండా గడపటం పట్టణ ప్రజలకు సాధ్యమయ్యే పని కాదు. కాక పోతే కొన్ని జాగ్రత్తలు మాత్రం అవసరం.

ముఖ్యంగా మనం క్రెడిట్ కార్డులు వాడే అవసరాలు చూద్దాం..

1. ఖరీదయిన వస్తువులు కొనేచోట
2. అంతర్జాలంలో (ఇంటర్నెట్) వస్తువులు కొనాల్సి వచ్చినపుడు
3. వివిధ రకాల బిల్లులు చెల్లించాల్సివచ్చినపుడు
4. రికరింగ్ డెబిట్ (నెలసరి బిల్లులకు) చెల్లించాల్సి వచ్చినపుడు
5. టెలిఫోన్ ద్వారా హోటల్ బుకింగులు
6. పెట్రోలు బంకులు

ఇలా చాలా చోట్ల మనం ఈ క్రెడిట్ కార్డులను వాడేస్తూ వుంటాం. అయితే ఈ అలవాటు కొన్ని సార్లు చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం వుంది. ఎందువల్లనంటే కేవలం క్రెడిట్ కార్డుల మీద వుండే అతి కొద్ది అంకెలు తెలిస్తే చాలు, మీ బదులు ఎవరైనా మీ కార్డుని దుర్వినియోగ పరచవచ్చు. మీకు ఎన్ని ఎక్కువ కార్డులుంటే అంత జాగ్రత్తగా వాడాల్సి వుంటుంది. క్రెడిట్ కార్డుల వలన మీ జీవితంలో ఆర్ధిక ప్రమాదాలు ఈ క్రింద పేర్కొన్న రకాలుగా జరగవచ్చు.

1. మీ అజాగ్రత్త, బద్ధకం
2. క్రెడిట్ కార్డు కంపెనీలు
3. ఆర్ధిక నేరగాళ్లు

ముందుగా ఈ ఆర్ధిక ప్రమాదాల గురించి, వాటి నివారణ గురించి తెల్సుకుందాం. ఇవి తెలుసుకునే ముందర ఒక సారి క్రెడిట్ కార్డులో ముఖ్యాంశాలు చూడాలి.

క్రెడిట్ కార్డులు ముఖ్యంగా రెండు అంకెల మీద ఆధారపడి వుంటాయి. ఒకటి మీ క్రెడిట్ కార్డు నంబరు. రెండవది CVV నంబరు. (దీని గురించి చాలా మందికి తెలియదు).

క్రెడిట్ కార్డు నంబరు గూర్చి అందరికీ తెలిసిందే…ఇక CVV నంబరు గూర్చి చూద్దాం. క్రింద ఇవ్వబడిన బొమ్మలు గమనించండి.

Credit Card image - 1 Credit Card image - 2

ఈ నంబరు చాలా ముఖ్యమైనది. మీ క్రెడిట్ కార్డు నంబరు, ఎక్స్పయరీ తేది, ఈ నంబరు ఎవరికైనా ఇచ్చారంటే చాలు. ఇక మీ కార్డు వారి కార్డు అయినట్లే. కాబట్టి, క్రెడిట్ కార్డులు వాడేవారు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని వున్నాయి.

అంతర్జాలం (ఇంటర్నెట్) లో వాడేటప్పుడు

  • మీరు ఏ సైటు నుంచి కొనుగోలు జరుపుతున్నారో ఆ సైటు తప్పని సరిగా https:// ని లంకెలో కలిగి వుండాలి. అంతే కాక ఆ సైటు ఒక ప్రామాణిక డిజిటల్ సర్టిఫికెట్ కలిగివుండాలి. మీరు ఈ విషయాన్ని ఇప్పుడు వున్న కొత్త బ్రౌజర్లలో ఈ క్రింద చూపిన విధంగా గమనించవచ్చు.
  • ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఫైర్ ఫాక్సులో
    మంచి సైటు Good card in IE

    —-
    ప్రామాణికత లేనిది

    Bad card in IE

    Bad card in FF

  • కొన్ని సైట్లు, కేవలం మీ వయస్సు నిర్ధారణ కోసమే క్రెడిట్ కార్డు సమాచారం కావాలని అడుగుతాయి. ఇచ్చారో ఇక పప్పులో కాలేసినట్లే. సదా జాగ్రత్త!
  • మీకు కొన్ని సార్లు మీ క్రెడిట్ కార్డు కంపనీ నుంచి వచ్చినట్లుగా ఈ-మెయిల్ రావచ్చు. అందులో మీకొక లంకె ఇచ్చి, మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చెయ్యమని అడుగుతారు. వారు మీ బ్యాంక్ సైటును మక్కీకి మక్కీ దింపేసి మీకు ఏ మాత్రం అనుమానం కూడా రానివ్వరు. కాబట్టి మీరు ఉపయోగించే సైటు లంకెను జాగ్రత్తగా పరిశీలించండి. లేకపోతే ఇక అంతే సంగతులు.
  • కొంత మంది వ్యక్తులు ఈ మధ్య మీకు కొత్త క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి, మీ పాత క్రెడిట్ కార్డు వివరాలన్నీ రాసుకుంటున్నారు. అది ఎందుకని అడిగితే మీకు ఎక్కువ క్రెడిట్ వస్తుందని చెప్తారు. ఇది పక్కా మోసం, అంతే కాక మీరు వాడుతున్న క్రెడిట్ కార్డు కంపెనీతో మీరు సంతకం చేసిన ఒప్పందం రద్దు అయిపోతుంది. మీకు ఎలాంటి ఆర్థిక ప్రమాదం జరిగినా క్రెడిట్ కార్డు కంపెనీ భరోసా ఇవ్వదు, పూచీ వుండదు.
  • కొన్ని సార్లు, మీరు హోటల్ బుకింగులు గట్రా ఏజంట్ల ద్వారా చేసేటప్పుడు, వాళ్ళు మీ క్రెడిట్ కార్డు వివరాలు అడుగుతారు. ఇచ్చారా అంతే….వాళ్లు ఆ వివరాలను ఎలా అయినా వాడుకోవచ్చు.

అందరూ పాటించాల్సిన క్రెడిట్ కార్డు జాగ్రత్తలు కొన్ని వున్నాయి…

  • మీ కార్డుపై ఒక కన్నేసి వుంచండి. అది ఎంత తొందరగా మీ చేతికి వస్తే అంత మంచిది. లేక పోతే మీరే కౌంటర్ దగ్గరకు వెళ్లి తీసుకోండి.
  • ఏ బాధ్యతాయుతమైన కంపెనీ కూడా మిమ్మల్ని క్రెడిట్ కార్డు వివరాలు ఫోన్లో అడగదు. కాబట్టి ఎప్పుడూ ఈ వివరాలు ఇవ్వకండి.
  • మీ కార్డు వివరాలు చాలా అర్జంటుగా కావాలి, లేకపోతే మీ కార్డుకు ఫైన్ పడుతుందనే ఈ-మెయిళ్ళను నమ్మవద్దు. ఎప్పుడూ ఈ-మెయిళ్ళలో ఈ వివరాలు ఇవ్వకూడదు.
  • మీకు కార్డు రాగానే, దాని వెనకాతల స్పష్టంగా సంతకం చెయ్యండి. ఫోటో వున్న కార్డయితే మరీ మంచిది.
  • ఎప్పుడూ మీ పిన్ నంబరును ఎక్కడా రాయవద్దు, క్రెడిట్ కార్డుపై కానీ, పేపరు మీద కానీ. కొంతమంది పిన్ వివరాలున్న మెయిల్ కూడా పర్సులో పెట్టుకుని తిరుగుతారు. ఇది ప్రమాదకరం.
  • మీ కార్డులు, రసీదులు ఎక్కడ పడితే అక్కడ (చెత్త బుట్టలో) పడెయ్యవద్దు.
  • క్రెడిట్ కార్డులను అందరికీ కనిపించేలా ఎక్కువసేపు పట్టుకోవటం మంచిది కాదు. సెల్ ఫోన్ కెమెరాలకు దూరంగా వుంచటం మంచిది.
  • అన్ని రకాల అకౌంటు నంబర్లు, కార్డు నంబర్లూ, వాటి బ్యాంకు తాలుకా సర్వీస్ ఫోన్ నంబర్లు ఒక డైరీలో రాసి భద్రంగా పెట్టుకుంటే, కార్డు పోయిన సందర్భాలలో వెంటనే వారికి తెలియచెయ్యవచ్చు.
  • మీకు అవసరం అయిన కార్డులు మాత్రమే దగ్గర వుంచుకోవటం మంచిది.
  • ప్రతీ సారి కూడా మీకు వచ్చిన క్రెడిట్ కార్డు బిల్లులను తప్పనిసరిగా చదవండి. కొన్ని సార్లు మీకు బోగస్ బిల్లింగ్ జరగవచ్చు. మీకు చెప్పకుండా సాంవత్సరిక రుసుమును పెంచివెయ్యవచ్చు. ఇది మన దేశంలో తరచుగా చేస్తున్నారు.
  • మీ క్రెడిట్ కార్డు నంబరు, వివరాలు ఎక్కడ పడితే అక్కడ రాయటం, పెద్దగా ఫోన్ లో ఇంకొకరికి చెప్పటం అస్సలు చెయ్యవద్దు.
  • క్రెడిట్ కార్డులని వేరే ఒక చిన్న కవర్లో పెట్టి వుంచటం మంచిది. జేబు పర్సులో పెట్టటం అంత మంచిది కాదు.
  • ఎప్పుడూ, ఎవ్వరికీ మీ కార్డు నంబరు, వివరాలు వారి కొనుగోలుకు గానీ, బ్యాంకులకు పూచీకత్తుగా గానీ ఇవ్వవద్దు.
  • మీ బ్యాంక్ నంబర్లు ఎప్పుడూ దగ్గర వుంచుకోవటం మర్చిపోవద్దు.

పైన చెప్పిన జాగ్రత్తలన్నీ చాలా ఎక్కువగా కనిపించినా, నిజానికి చాలా చిన్నవి. మీరు ఇప్పటికే కొద్దిగా జాగ్రత్తపరులైతే ఇవన్నీ చాలా సులువు. ఇవన్నీ మీకు కొత్త అయితే, ఒక్క సారి జాగ్రత్తగా ఇవన్నీ చదివి ఏవైనా తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి. అవన్నీ సరి చేసుకోవటానికి ప్రయత్నించండి.

అప్పు పుట్టటం ఇప్పుడు సులువే, కానీ తీర్చటం మనసుకు కష్టం, దానికి తోడు పైన చెప్పిన ఆర్థిక ప్రమాదాలలో ఒక్కటి జరిగినా మీరు కోలుకోవటం కష్టం.

—————————

సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ.

Posted in వ్యాసం | Tagged | 3 Comments

మృతజీవులు – 8

అతను అటు వెళ్ళగానే మానిలవ్, “ఇది మీరు అడుగుతున్న కారణం?” అన్నాడు.

ఈ ప్రశ్న అతిథిని తికమకపరిచింది; అతని ముఖం మానసిక శ్రమతో ఎర్రబారింది; సులువుగా వివరించడానికి లేనిదాన్ని వ్యక్తం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడ్డాడు. నిజానికి మానిలవ్ చెవినిబడిన మాటలు అత్యాశ్చర్యకరమైనవి, అపూర్వమైనవి, ఏ మనుషులూ అలాటిమాటలు విని ఉండరు.

“కారణం అడిగారు. కారణమేమంటే, కమతగాళ్ళను కొనుక్కుందామని నా ఉద్దేశ్యం…” చిచీకవ్ వాక్యం పూర్తిచేయక పస్తాయించాడు.

“ఒక్క విషయం తెలుసుకోనివ్వండి, కమతగాళ్లను భూమితో సహా కొందామనా, లేక కమతగాళ్లను మాత్రమే, భూమిలేకుండా, కొని వెంట తీసుకుపోదామనా?” అని మానిలవ్ అడిగాడు.

“నాకు కావలసింది నిజమైన కమతగాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళు…” అన్నాడు చిచీకవ్.

“ఏమిటీ? క్షమించాలి, నాకు సరిగా వినిపించదు. మీరేదో వింతగా మాట్లాడినట్టు వినబడింది…”

“మీ లెక్కల ప్రకారం బతికి ఉండీ నిజంగా చనిపోయిన కమతగాళ్ళను కొందామని నా తాత్పర్యం.” అన్నాడు చిచీకవ్.

మానిలవ్ పైపు చేతినుంచి జారి కిందపడింది, ఆయన చాలా నిమిషాలపాటు నోరు తెరుచుకు నిలబడ్డాడు. ఇంతకుముందు కూడా మైత్రి యొక్క మహిమను గురించి చర్చించుతూ ఉండిన మిత్రులిద్దరూ, అద్దాలకు అటూ ఇటూ ఉంచే బొమ్మల్లాగా ఒకరినొకరు చూస్తూ కదలక మెదలక ఉండిపోయారు. చిట్టచివరకు మానిలవ్ పైప్ ఎత్తుకుని తన అతిథి మొహంలోకి చూశాడు – ఆ మొహంలో ఏ మాత్రమైనా చిరునవ్వు ఉన్నదేమో, ఆయన హాస్యమాడుతున్నాడనుకుందామని; కాని అలాటిదేమీ లేదు, చిచీకవ్ మొహం మామూలుకన్నా కూడా గంభీరంగా ఉన్నది. ఇంతలో తన అతిథికి మతి చలించిందేమోనన్న సందేహం తగిలి, ఆయన భయపడుతూ అతనికేసి మళ్ళీ చూశాడు. కాని అతని కళ్ళలో పిచ్చిచూపులాటిదేమీ లేదు. ఆ కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. ఎంత ఆలోచించినా మానిలవ్ కు తాను ఏమనుకోవాలో, ఏం చేయాలో బోధపడలేదు; అందుచేత ఆయన తన నోట ఉన్న కొద్దిపొగను సన్నగా బయటికి వదిలాడు.

“కనక నేను కోరేదేమంటే, మీ జాబితాలో బతికున్నవారి కింద జమ అయిఉండి, వాస్తవంగా చనిపోయిన కమతగాళ్ళను మీ ఇష్టానుసారం నాకు రాసి ఇవ్వటమో, విక్రయించటమో చెయ్యగలరా?”

మానిలవ్ మటుకు కంగారుపడి ఏమీ అనలేక అతిథికేసి తేరిపార చూశాడు.

“మీకు అభ్యంతరాలేమైనా ఉండవచ్చు”, అన్నాడు చిచీకవ్.

“నాకా?…లేదు, అదేమీలేదు… కాని, మరేమీ అనుకోకుండా ఉంటే… నాకు సంగతి అంతుచిక్కలేదు… మీలో అడుగడుగునా కనిపించే విద్యాసంస్కారం దురదృష్టవశాత్తూ నాకు అలవడని మాట నిజమే మరి. నాకు సరిగా మాట్లాడటం కూడా చేతకాదు, మీరు ఇప్పుడు చెప్పిన మాటలో ఏదో నిగూఢమైన అర్థం ఉండవచ్చు. లేక మీరు అలంకారసదృశంగా మాట్లాడారేమో”, అన్నాడు మానిలవ్.

“లేదు, లేదు. చచ్చిపోయినవాళ్ళనే నా ఉద్దేశం”, అన్నాడు చిచీకవ్.

మానిలవ్ పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. తాను ఏదో చెయ్యాలనీ, ఏదైనా ఒక ప్రశ్న అడగాలనీ ఆయనకు తోచింది, కాని ఏమి అడగాలో చచ్చినా స్ఫురించలేదు. చివరకు ఆయన మళ్ళీ పొగ వదిలాడు- ఈసారి నోటినుంచి కాదు, ముక్కునుంచి.

“మరి ఏ అభ్యంతరమూ లేని పక్షంలో, దేవుడిపై భారం వేసి మనం వెంటనే ఒక విక్రయ దస్తావేజు రాసుకుందాం”, అన్నాడు చిచీకవ్.

“చచ్చినవాళ్ళ విక్రయమా?”

“అబ్బే… లెక్కల్లో ఉన్నప్రకారం బతికున్నవాళ్ళనే రాసుకుందాం. చట్టానికి ఏమాత్రం తభావతు రావటంకూడా నేను సహించను. అందువల్ల నేను నా ఉద్యోగంలో ఎంతో నష్టపోయాను. కాని నాకు ధర్మం పవిత్రమైనది. చట్టమంటే నాకు భక్తి.” అన్నాడు చిచీకవ్.

ఈ చివరి మాటలు మానిలవ్ కు చాలా నచ్చాయి, కాని చిచీకవ్ అభిప్రాయం ఏమిటో ఒక్క పిసరు కూడా అర్థం కాలేదు, అందుచేత ఆయన జవాబు చెప్పక, పెద్ద చప్పుడుతో పైపును పీల్చసాగాడు. ఈ సంఘటన యొక్క అంతరార్థాన్ని ఆయన పైపులో నుంచి లాగేలాగా కనిపించాడు. అయితే పైపు బుస్సుబుస్సుమన్నదే తప్ప మరేమీ జరగలేదు.

“మీరేదో సంకోచిస్తున్నట్టున్నారు?”

“ఎబ్బే, ఎంతమాత్రమూ లేదు! నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాననుకోకండీ, ఈ వ్యవహారం పౌరచట్టానికీ, కాలక్రమాన రష్యా భద్రతకూ వ్యతిరేకం ఉండదంటారా?”

ఈ మాటలంటూ మానిలవ్ చెయ్యి ఊపి, చిచీకవ్ మొహం లోకి సాభిప్రాయంగా చూశాడు. బిగపట్టిన ఆయన పెదవులలోనూ, ముఖంలోనూ కనిపించినంత గంభీరభావం ఏ మనిషి ముఖంలోనూ ఎన్నడు కనిపించదు – క్లిష్టసమస్యను ఎదుర్కొన్న కంటక పరిస్థితిలో వివేకంగల మంత్రుల ముఖాల మీద ఏమైనా కనిపిస్తుందేమో.

అయితే చిచీకవ్ ఈ వ్యవహారం ఏ విధంగానూ, పౌరచట్టాలకు గాని, రష్యా భద్రతకు గాని అననుకూలంగా ఉండదని అన్నాడు; ఒక్క క్షణం ఆగి, రిజిస్ట్రేషను ఖర్చులు గిట్టుతాయి గనక ప్రభుత్వానికి లాభం కూడా ఉంటుందన్నాడు.

“అదా మీ అభిప్రాయం!”

“నా అభిప్రాయం.. అంతా సవ్యంగానే ఉంటుందని.”

“సవ్యంగా ఉండే పక్షంలో నా అభ్యంతరం ఏమీ లేదు”, అన్నాడు మానిలవ్, అనుమానాలన్నీ రహితం చేసుకుని.

“అయితే మరి ధర ఇంతా అని అనుకుందామా?”

“ధరా?” అని మానిలవ్ అగాడు. “చచ్చిపోయిన వాళ్ళ కోసం నేను మీవద్ద డబ్బు పుచ్చుకుంటా ననుకుంటున్నారా? మీకు ఇలాటి వింత కోరిక కలగనే కలిగింది గనుక వాళ్ళను ఉచితంగా తీసుకోండి, దస్తావేజు ఖర్చులు కూడా నేనే భరించుకుంటాను.”

ఈ మాటలు విని అతిథి పరమానందభరితుడయాడన్న విషయం చెప్పకపోతే అది కథకుడిలో పెద్ద అపచారమవుతుంది. మమూలుగా నిండు మనిషీ, గంభీర స్వభావుడు అయినప్పటికీ అతను ఇప్పుడు మేకులాగా గెంతాలన్న ప్రేరణకు గురి అయి, దాన్ని అణచుకోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. అలాటి ప్రేరణ ఎంతో ఆనందం కలిగితేగాని ఏర్పడదని మనకందరికీ తెలిసిన విషయమే. అతను కుర్చీలో ఎంత బలంగా సంచరించాడంటే కుర్చీకి వేసిన పట్టుతొడుగు కాస్తా చినిగింది; మానిలవ్ అతనికేసి వింతగా చూశాడు. అతను కృతజ్ఞతను వ్యక్తం చెయ్యటం కోసం అదేపనిగా మాట్లాడనారంభించేసరికి మానిలవ్ కంగారుపడిపోయాడు, ఆయన ముఖం ఎర్రబారింది, అంతగా చెప్పనవసరం లేదన్నట్టు తల ఊపాడు, చిట్టచివరకు, ఇందులో విశేషం ఏమీ లేదనీ, తాను హృదయంలో అనుభవించే ఆకర్షణను, ఆత్మయొక్క ఆకర్షణశక్తిని, ఏదోవిధంగా వ్యక్తం చెయ్యటం తనకు ఆనందమేననీ ఒక విధంగా చూస్తే చచ్చిపోయిన వాళ్ళకు విలవేమీ లేదనీ అన్నాడు.

“విలవ లేకపోవడమేమిటి?” అన్నాడు చిచీకవ్ ఆయనచేతిని నొక్కుతూ.

ఈ మాటలు అంటూ అతను దీర్ఘనిశ్వాసం వదిలాడు; అతనికి తన మనస్సులో ఉన్నదంతా చెప్పుకోవాలని ఉన్నట్టున్నది.

—————

-కొడవటిగంటి కుటుంబరావు

Posted in కథ | Tagged | 2 Comments

సెప్టెంబరు వికీపీడియా విశేషాలు

రవి వైజాసత్య
[రవి వైజాసత్య]

తెవికీలో నిర్వహిస్తున్న ప్రాజెక్టులు మరియు నిర్వహణా దళాలు

తెలుగు వికీపీడియాలో వివిధ విషయాలకు చెందిన వ్యాసాలను అభివృద్ధి చేసి, విస్తృతపరచటానికి, ఆ వ్యాసాలను నిర్వహించడానికీ కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రాజెక్టులలో, ఒక విషయానికి చెందిన ఉన్న వ్యాసాలన్నీ ఒక ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. (ఉదాహరణకు, రామాయణము, గరుత్మంతుడు, క్షీరసాగర మథనం, ఆది శంకరాచార్యుడు, తైత్తిరీయోపనిషత్తు వ్యాసాలు హిందూమత ప్రాజెక్టుకు చెందుతాయి)

ఆయా ప్రాజెక్టులలో ఆసక్తి ఉన్న సభ్యులు ప్రాజెక్టు పేజీలో తమ పేరు నమోదు చేసుకొని ప్రాజెక్టు పరిధిలోని వ్యాసాలను అభివృద్ధి చేస్తుంటారు. ఈసారి పొద్దు వికీ శీర్షికలో ప్రస్తుతము తెలుగు వికీపీడియాలో క్రియాశీలకముగా నడుస్తున్న కొన్ని ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు బాటులు రాసి, మూసలు తయారుచేసి, వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే వివిధ సాధనాలను తయారు చేసి పనులను సులభతరం చేసిన ప్రదీపుకు ప్రత్యేకంగా నెనర్లు

ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు ప్రాజెక్టు

తెలుగు వికీపీడియాలో ఇప్పటివరకు చేపట్టిన ప్రాజెక్టులలో ఇదే పెద్దది. ఈ ప్రాజెక్టులో అనేకమంది వికీజనులు వందల కొలది గంటల సమయాన్ని వెచ్చించారు.

ధరితిలోని ప్రతి తెలుగు వాడ గురించి
చరితలోని ప్రతి తెలుగు వాడి గురించి
ధరణిపైనున్న ప్రతి పశుపక్షి వృక్షముల గురించి
మరుగుకాని మేటి తెలుగు కథల గురించీ
చరణమైనా వ్రాద్దాం తెలుగు వికీ పై
కరములు కలపుదాం, కల నిజం చేద్దాం.

అంటూ చావా కిరణ్ స్వప్నంగా మొదలైన ఈ ప్రాజెక్టు, వీవెన్ సూచనతో కార్యరూపం దాల్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 25000 పైగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్లోని పంచాయితీ గ్రామాలన్నింటికీ మొలకలు వేసాం. త్వరలోనే వీటన్నింటికీ గణాంకాలు (జనాభా, వైశాల్యం, ఆక్షరాస్యత వగైరా వివరాలు) చేర్చబోతున్నాం. అయితే వాటన్నింటికంటే ముఖ్యమైనది ప్రతి గ్రామం గురించి సవివరంగా రాయటం. ఇలాంటి సమాచారం ఇప్పటివరకూ ఎక్కడా లభ్యమవకపోవటం వల్ల కష్టతరమవుతుంది. ఫ్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల గురించి సమాచారం పొందుపరిస్తే తెలుగు వికీని విన్నూత విజ్ఞానసర్వస్వముగా తీర్చిదిద్దవచ్చు. మన గ్రామం గురించి మనకంటే మిన్నగా రాయగలవారెవ్వరు?

తెలుగు సినిమాల ప్రాజెక్టు

ఈ ప్రాజెక్టులో భాగంగా 3600 తెలుగు సినిమాల సమాచారాన్ని పొందుపరచాం. ఈ సినిమా వ్యాసాలన్నీ వివిధ స్థాయిలలో, చాలా చక్కని వ్యాసాల దగ్గరి నుండి ఒకటి రెండు లైన్లతో ఉన్న మొలకల దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో సినిమాలతో పాటు అనేక సినీనటులు, నటీమణులు, దర్శకులు, సినీగీతరచయితలపై వ్యాసాలను సమకూర్చటానికి నవీన్, శ్రీనివాసరాజు, కాసుబాబు, కామేష్ గార్లు విశేష కృషి చేశారు. మీరేదైనా సినిమా చూసినప్పుడు ఒక పది నిమిషాలు సమయం తీసుకొని ఆ సినిమా సమాచారాన్ని తెలుగు వికీలో చేర్చగలిగితే ఇంటర్నెట్టు మూవీ డేటాబేసు కంటే ధీటైన తెలుగు సినిమాల సమాచార గనిగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దవచ్చు.

ప్రపంచదేశాల ప్రాజెక్టు

ప్రపంచదేశాల ప్రాజెక్టులో భాగంగా ప్రపంచములోని అన్ని దేశాలకు సంబంధించిన వ్యాసాలు రాయటమే కాకుండా ఈ ప్రాజెక్టు రూపశిల్పి కాసుబాబు గారు అనేక ప్రపంచ దేశాలకు చెందిన జాబితాలను తయారు చేస్తున్నారు. ఈ జాబితాలు ఎలాంటివంటే ప్రపంచ దేశాలు జనాభా వారీగా, వైశాల్యము వారీగా అమర్చిన సాధారణ జాబితాలనుండి తలసరి కాఫీ, టీల వినియోగము, కార్బన్ డై ఆక్సైడ్ విసర్జన వారీగా ప్రపంచదేశాల జాబితాలు అనేకం ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల ప్రాజెక్టు

ఈ ప్రాజెక్టులో తెలుగుగంగ, నాగార్జున సాగర్, పోతిరెడ్డిపాడు. శ్రీశైలం వగైరా నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు, ఆంధ్ర ప్రదేశ్లోని నదులు, చెరువుల గురించిన సమాచారమున్నది. ప్రత్యేకంగా ఇందులోని నీటిపారుదల ప్రాజెక్టుల వ్యాసాలను ఈ ప్రాజెక్టును ప్రారంభించిన చదువరి గారు ఏ పత్రికలకీ తీసిపోని విధంగా రాశారు.

జీవశాస్త్రపు ప్రాజెక్టు.

తెలుగు వికీ క్రియాశీలక సభ్యులలో ఒకరైన డా.రాజశేఖర్ గారు ఈ ప్రాజెక్టులో భాగంగా అతి స్వల్పకాలములోని చాలా జీవశాస్త్ర వ్యాసాలు అందించారు. ఇటీవల తెలుగు వికీపీడియాలో అనేకమంది వైద్యులు సభ్యులుగా చేరటంతో అనేక వైద్యశాస్త్ర సంబంధ వ్యాసాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి.

పుస్తకాల ప్రాజెక్టు.

ఇటీవల ప్రారంభమైన ఈ ప్రాజెక్టు సాహిత్య సంబంధమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా పుస్తకాలు, రచనలకు సంబంధించిన సమాచారము పొందుపరుస్తున్నారు. దీని పరిధి, ప్రపంచములోని అన్ని ప్రముఖ పుస్తకాలైనా ప్రస్తుతము తెలుగు రచనలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

హిందూమత ప్రాజెక్టు

మాటలబాబు, విశ్వనాథ్, కంపశాస్త్రి గార్లు ఇప్పటికే అనేక హిందూమత సబంధ వ్యాసాలు అభివృద్ధి చేయటంతో, వీటిని మరింత వృద్ధి చేయటానికి ఒక ప్రాజెక్టుగా రూపొందించాము. దీనికి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ఒక చిన్న అనుబంధ ప్రాజెక్టు కూడా ఉన్నది.

ఇవేకాక ప్రస్తుతం కొంచెం స్తబ్దుగా ఉన్న, ఆంధ్ర ప్రదేశ్ మండలాలు, భారతదేశ చరిత్ర, కంప్యూటర్ విజ్ఞానము, లినక్సు ప్రాజెక్టులు కూడా తెలుగు వికీలో ఉన్నాయి.

వీటన్నింటిలో మీ ఆసక్తికి తగిన ప్రాజెక్టు కనిపించలేదా? అయితే మీరే ఒక ప్రాజెక్టును ప్రతిపాదించండి. అలాంటి ప్రతిపాదనలను సమాలోచన చేసి ప్రారంభిస్తాము.

వికీ వ్యాసాల నాణ్యతను పెంచటానికి తెలుగు వికీలో అచ్చుతప్పులు దిద్దటానికి, భాషను మెరుగుపరచటానికి అక్షరదోష నిర్మూలన దళం మరియు శుద్ధి దళం అనే రెండు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేయటం జరిగింది. అక్షరదోష నిర్మూలన దళం సభ్యులు వికీవ్యాసాలలోని అక్షరదోషాలను దిద్దుతుంటారు. శుద్ధి దళం సభ్యులు వ్యాసాలను వికీకి అనుగుణంగా మార్చి, లింకులు చేర్చి, వ్యాసాన్ని వర్గీకరించి, మెరుగుపరుస్తుంటారు. ప్రాజెక్టులతో పాటు, ఈ దళాలలో కూడా ఆసక్తి ఉన్నవారెవరైనా చేరి తెలుగు వికీకి తగు సహాయం చెయ్యవచ్చు.

మీరింత వరకూ ఈ వారపు వ్యాసాలను చూచి ఉండకపోతే, గత నెలలో ఈ వారపు వ్యాసాలుగా ప్రదర్శించబడినవి ఇవి: కె.వి.రెడ్డి, నర్తనశాల, రుక్మిణీదేవి అరండేల్, ఖర్జూరం.

నా సిఫారుసులు

టెన్నిసన్, ఆళ్వారులు, వైరస్, ప్రోగ్రామింగు భాష, తట్టు, కోనేరు రంగారావు కమిటీ, మైదాన హాకీ

రవి వైజాసత్య(http://saintpal.freehostia.com/)

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

Posted in జాలవీక్షణం | Tagged | 7 Comments

అక్టోబరు గడిపై మీమాట

అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. ఆగష్టు గడి, సమాధానాలు
2. జూలై గడి, సమాధానాలు
3. జూన్ గడి, సమాధానాలు
4. మే గడి, సమాధానాలు
5. ఏప్రిల్ గడి, సమాధానాలు
6. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 1 Comment

ఆగస్టు గడి సమాధానాలు

గతనెల అనివార్య కారణాల వల్ల గడిని వెలువరించలేకపోయాం. ఐతే ఆ కారణం వల్లే గడి పరిష్కారాలు పూరించి పంపుతున్నవారే కాకుండా మరికొందరు పాఠకులు కూడా గడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలియవచ్చింది. 🙂

ఈసారి గడి పూరించి పంపింది కొత్తపాళీ గారొక్కరే! మొదట్నుంచి ఎక్కువమంది పాఠకులకు కష్టసాధ్యంగా అనిపించిన గడిని సుబోధకం చెయ్యడానికి ఆయన తన బ్లాగులో “గడి పాఠాలు” కూడా చెప్పారు. కొత్తపాళీగారికి అభినందనలు.

1 కీ

2 ర్తి

కాం

3 క

4 న

5 కం

*

6 బ

హు

7 మ

8 తి

9 చ

*

*

10 ప

టి

11 క

*

12 గ్గు 

ను

కు

*

13  

లా 

*

*

14 రా 

ము

15 డు 

*

బం

16 డు

17 పా

*

*

18 నా

గా

19 వ

ళి

*

20  

 

డా

*

*

*

  *

*

*

 

*

రం

*

22 గు

23   రి

*

24 క

25 ర

వా

26 ల

కాం

తు

27 లు

*

28   తి

మ్మి

రి 

*

29 సూ

 

సం

తు 

*

*

30 లి 

  31 మ

32

పు  

 

త్ర

*

*

33  

34 శు

*

*

*

35 ద్మ    

పు

*

36 ధా

*

ద్ధో

*

37 

38   

రా

*

39 హ

రి

*

*

*

40 ధ

41 ర 

హా 

సం

42

జు

43డు 

ను

*

  44 సు

45యో 

46 

ను

డు 

*

క్రాం

  రం  

*

  47రే

వు

*

48 స

రు

డు

*

49 

తి

గడి వివరణలు:

అడ్డం:

1. కకారాలతో కూడిన ‘తాప -త్రయాలు’ (2-2-3) కీర్తి -కాంత-కనకం

6. మతి ఉందని తెలుస్తూనే ఉంది. మరి బహువచనం ఇలాగేనా రాసేది? (4) (బహుమతి)

9. ద్రవిడ ప్రాణాయామ పద్ధతిలో అన్నగారు (2) (చఆ ) ద్రవిడ ప్రాణాయామమంటే, ముక్కెక్కడంటే , చెవులచుట్టూ తిప్పి చూపడం.

10. ఊహల్లో తేలితే కటి పగలక ఏమౌతుంది? (3+2) ( పగటి కల) ఎనాగ్రామ్

12. జగన్నాథరథచక్రాల కింద పడితే ఎవరైనా అంతే… ఎట్నుంచి పడ్డారో కూడా తెలియదు (2) (గ్గును)

13. ఫలకంమీద కస్తూరితిలకం (లలాట )

14. భూమాతకు జామాత? (3) (రాముడు)

16. పాడమని అలాగేనా అడగడం? (2) ( డుపా)

18. ఈ నది పాముల పుట్టా? (4) (నాగావళి)

20. ఉత్తరదేశం వాళ్ళతో గొడవపడకుండా తినండి (3) (రగడా )

21. నాటకాలు ఆడీ ఆడీ పాపం కాలు పోయింది (2) ( నాట) – ’నాటకాలు’లో కాలు పోతే మిగిలింది నాట.

22. నలుగురిమధ్య దృష్టి పెట్టండి (2) (గురి)

24. తురకల వాలకం మారితే మిరుమిట్లు గొలపడం ఖాయం (4+3) ( కరవాల కాంతులు ). – ఎనాగ్రామ్

28. మొద్దుబారిన పిల్ల గాలి (3) (తిమ్మిరి )

29. కర్ణుడు ఇందులో ఒకడిగా పెరిగాడు (4) (సూతసంతు )

30. శ్రీశ్రీ చమత్కారానికి మాత్రలైనా, పాదాలైనా ఐదెక్కువ. రెండు చాలు. (2) లిమరిక్కులు శ్రీశ్రీ చమత్కార రచనలు

32. గాలికి చెల్లాచెదురైంది ఆయన కొడుకే (5) ( నపపువత్ర)

33. వెనుదిరిగిన ఈ మహర్షి వ్యాసపుత్రుడు (2) (కశు)

35. తలాతోకా లేని పద్మపురాణం (2) (ద్మపు)

36. రక్త ధారలతో తడిసిన రణ భూమిని గుర్తుంచుకోండి (3) (ధారణ ) ధారణమంటే జ్ఞాపకముంచుకోవడం.

37. తిరుగుడుచీల (2) (మర)

38. ఆసరా కోసం చేసే వాకబు (2) ఆరా

39. కోతి దేవుడు (2) హరి

40. బేహారులు ఈ రోజుల్లో చిరునవ్వులో సైతం పైకాన్ని చూస్తారు (5) (ధరహాసం )

42. వరస తప్పిన రాక్షసుడు (4) (దజుడును)

44. అభిమాన ధనుడు, అసహాయ శూరుడు (5) (సుయోధనుడు )

47. పాపం బావురుమంటోందట. నావకు చెప్పారో లేదో!! ( రేవు)

48. సరుగుడు చెట్లలో తిరుగుడు చక్రవర్తి (4) (సగరుడు )

49. తెలుగులో ఇంగ్లీషు… ‘కొంత’ సంగతి ఎవడిక్కావాలి ? (2) (సం)గతి (సం అంటే ఆగ్లంలో కొంత).

నిలువు:

1. వనితకు కీడు చెయ్యొద్దన్నా వినడు (4) (కీచకుడు )

2. అట్నుంచి పడే బాధ (2) (ర్తిఆ)

3. టక్కరి సూకట పత్ర నాధా! నీ భాగోతం చాలించు (3+3+4) (కపట నాటక సూత్రధారి) ఎనాగ్రామ్

4. పర్వత హారం నవ్వగ! (2) ( నగ) నగ(ం)=పర్వత(ం), నగ=హారం, న(వ్వ)గ

5. “…శుక్రవారము గడియలేడింట” అన్నమయ్య (2) (కంటి)

6. అబలలము అనుకోకండి . మాలో ఇది చూసి అల కూడా అణగి తీరుతుంది (3) (బలము) – అలపోతే మిగిలింది బలము.

7. నుగ్గు చేయబూనిన వానిపై మ ‘మ’కారం చూపిస్తే ఇదే అవుద్ది (2) (మగ్గు)

8. బంతినూరడం చూస్తే నోరూరుతుందా ? (5) ( తినుబండారం) – ఎనాగ్రామ్

11. వరాళి అనుకుని పొరబడకండి. ఇది భయంకరమైనది (3) (కరాళి)

15. తికమకపడ్డ రామానుజుడు (4) (డురభతు ) రామానుజుడు అంటే రాముడి తమ్ముడు

17. క్షీరంకుమ్మి సూర్యుడు పెద్ద కథకుడయ్యేడు (4+4) ( పాలగుమ్మి పద్మరాజు)

19. వసనంబొక్కటి వాగొని ఈ కష్టమేల? (4) (వనవాసం)

23. తికమక పెట్టకుండా ఉంటే శత్రునగరాన్ని ఎటునుండైనా చేరుకోగలిగే వాళ్ళమే. (4) (రిరిపుపు) రిపుపురి = శత్రు నగరం

25. వ్యవసాయదారుడు బైతైతే గుణింతాలెలా వస్తాయి ? (2) (రత)

26. కరిగిన లక్కను నొక్కకండి. అతుక్కుంటే కష్టం (3) (లతుక) కరిగిన లక్క = లత్తుక

27. లకారాలు లోటెక్కువై తల్లకిందులైనాయి (2) (లిలు) లులి అంటే లోటు

28. అసలే నత్తి, పైగా తిరగేసి పలకాలట. ఇక వత్తులేం పలుకుతాయి? (2) ( తిన)

31. మొసలి తిరుగుడు పండగ (3+3) (మకరసంక్రాంతి)

34. సిద్ధార్థా -మాయాదేవి మొగుడెవరో తెలుసుకోవాలంటే డబ్బుని బాగా శుద్ధి చెయ్యి (5) ( శుద్దోధనుడు)

37. గొప్ప మాయ అంటే ఏమిటో అనుకున్నాను . ఇది కనబడని మాయన్నమాట ! (2) ( మహా)

38. రం సేవించిన శరీరానికి అందిన మన్నన (3) (ఆద+రం )

39. హ.. నువ్వలా చెంప చెళ్ళు మనిపిస్తావా? (3) ( హనువు)

41. పో -గొట్టుకున్న తెలంగాణ గుంటడు (2) ( రడు)

43. ఉదయించే కువలయానందకరుడు (2) (డురే )

44. గుణింతంలో వరస మారినా రెండక్షరాలూ మంచి ఒద్దికతో ఉండేవే (2) ( సుస)

45. షడ్దర్శనాల్లో ఒకటి: మానవాళికి మనమిచ్చిన కానుక (2) ( యోగ)

46. ఆ యుగం పోయినా ఆ మంత్రి నేటికీ స్మరణీయుడే (2) (ధరు) యుగంధరుడు

Posted in గడి | Tagged | 1 Comment

ఈనెల రచనలు

ప్రసిద్ధ పాత్రికేయుడు, నెల్లుట్ల వేణుగోపాలరావు ఈనెల పొద్దు అతిథి. సమకాలీన సామాజిక రాజకీయ విషయాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాసే వేణుగోపాల్, నెజ్జనులు చెయ్యగలిగిన పనులను సూచిస్తున్నారు. ఆయన కడలితరగ పేరుతో బ్లాగును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో “వర్తమానం” శీర్షికన వ్యాసాలు రాస్తున్నారు.

అతిథి వ్యాసం రాసేందుకు పొద్దు అభ్యర్ధనను మన్నించి ఈ వ్యాసాన్ని రాసి ఇచ్చినందుకు వేణుగోపాల్ గారికి పొద్దు కృతజ్ఞతలు తెలుపుతోంది!

ఈ నెల రచనలు:

నెజ్జనులకు సూచనలు

Posted in ఇతరత్రా | Comments Off on ఈనెల రచనలు

నెజ్జనులకు సూచనలు

nelluTla vENugOpaalaraavu [నెల్లుట్ల వేణుగోపాలరావు]

తెలుగు సమాజానికీ సాహిత్యానికీ నెజ్జనులు చేయదగ్గ సేవలు

సృష్టికి ప్రతిసృష్టి లాంటి అంతర్జాల మొకటి తయారవుతున్నదని మొదటిసారి విని ఇంకా నిండా పది సంవత్సరాలు కాలేదు. సత్యం కంప్యూటర్స్ లో మిత్రులు వ్యాసమూర్తి గారు ఇంటర్నెట్ అంటే ఏమిటి, యాహూ మెయిల్ అంటే ఏమిటి అని కొందరు సత్యం ఉద్యోగులకు చెప్పిన పాఠాన్ని అప్పటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటు చూస్తున్న ఎకనమిక్ టైమ్స్ విలేకరిగా నేను కూడ విన్న అనుభవం నిన్నమొన్నటిదిలానే ఉంది. ఇదంతా మయసభలాగ ఉందే అని అనుకున్న ఆ అనుభవం నుంచి పది సంవత్సరాలు తిరగకుండానే ఆ మయసభ మహాసభ లాగ మారిపోయినట్టు కనబడుతున్నది. ఈ అంతర్జాలం ఎందరికందుతుందిలే అనుకుంటే ఆ లోలోపలి వలలో ఒక్కొక్కరమూ అందరమూ చిక్కుతున్నట్టే అనిపిస్తున్నది. ఎంత అసంబద్ధ పదబంధమది అని వేళాకోళంచేసిన వర్చువల్ రియాలిటీ కనీసం కొందరి జీవితాలలోనైనా వాస్తవికతగానే మారినట్టున్నది.

మనమధ్యనుంచే, మనకళ్లముందే పుట్టిన నెట్ సమాజం ఒకటి ఊహాతీతమైన వేగంతో, కళ్లు మిరుమిట్లు గొలిపేలా విస్తరిస్తున్నది. కొన్ని వేలమందో, లక్షలమందో తెలుగు నెజ్జనులు ఈ కొత్త సమాజంలోనే తమ జీవితం గడుపుతున్నారు. ఈ నవసమాజంలోనే తమ మానవసంబంధాలన్నిటినీ పెంచుకుంటున్నారు. పాత మానవప్రపంచానికీ కొత్త నెట్ ప్రపంచానికీ పోలికలూ ఉన్నాయి, చెప్పుకోదగిన తేడాలూ ఉన్నాయి. అసలు ఈ రెండు ప్రపంచాలూ ఇప్పటికైతే ఒకదానితో ఒకటి కలిసే ఉన్నాయి కూడ. ఒకదానితో ఒకటి కొంతవరకు అనుసంధానం లో ఉన్న వృత్తాలలాగ ఈ ప్రపంచాలలో కలిసిన భాగమూ ఉంది, కలియని భాగమూ ఉంది. ఈ రెండు వృత్తాలూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి అద్వైతం సిద్ధించడం గాని, ఒకదానినుంచి ఒకటి విడిపోయి స్వతంత్ర అస్తిత్వం సంతరించుకోవడం గాని సమీపభవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చు కూడ.

పాశ్చాత్య దేశాలలో ఏమోగాని, ఇంకా సగం జనాభా నిరక్షరాస్యతలోనూ, సగం కన్న ఎక్కువే పేదరికంలోనూ మునిగిఉన్న మన సమాజంలో నెట్ ప్రపంచం ఆ మిగిలిన సగానికయినా చేరడం ఎప్పటికి సాధ్యమవుతుందో తెలియదు. మన వృద్ధిరేటు గణాంకాలూ, తలసరి ఆదాయం పెరిగిందనే ప్రభుత్వాల సగటు భాగహారాలూ, రోజురోజుకూ పెరిగిపోతున్న టెలిడెన్సిటీ, తలసరి కంప్యూటర్ వినియోగం లెక్కలూ ఏమి చెప్పినప్పటికీ మనకు తెలిసిన నెట్ ప్రపంచం, మనకు తెలియని మానవప్రపంచం కన్న చిన్నదేనని ఒప్పుకోక తప్పదు. తెలుగు సమాజం విషయానికే వస్తే ఎనిమిదికోట్ల తెలుగువారిలో నెట్ ప్రపంచంతో పరిచయం ఉన్నవారు బహుశా పదిలక్షలకు మించుతారనుకోను. ఆ పదిలక్షల నెట్ ప్రపంచ వాసులలో క్రియాశీలంగా ఇతరులతో సంబంధాలు పెట్టుకుని తమ ఆలోచనలు పంచుకుంటున్న నెజ్జనుల సంఖ్య ఇంకా తక్కువ కావచ్చును. అంటే మహాజనవ్యవస్థలో నెజ్జనవ్యవస్థ ఇంకా ఒక్కశాతానికయినా చేరిందా అనేది అనుమానమే.

అయితే ఈ జనాభాశాతాన్ని బట్టి నెజ్జనుల ప్రాధాన్యతను తక్కువగా అంచనా కట్టడానికి వీలులేదు. వారి జనాభా శాతం ఎంత తక్కువైనప్పటికీ వారికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల, ఇతరులతో అత్యంత వేగంగా సంభాషించడానికి ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న అపారమైన శక్తిసామర్థ్యాలవల్ల, వారు దేశదేశాంతరాలలో పొందుతున్న విలువైన, అరుదైన అనుభవాలవల్ల, వారికి మాత్రమే తెలిసివస్తున్న అవగాహనలవల్ల, వారికి ప్రస్తుత సమాజంలో ఉన్న గౌరవ ప్రతిపత్తుల వల్ల వారి ఆలోచనలకూ మాటలకూ చేతలకూ చాల విలువ ఉంటుంది.

మరి మన నెజ్జనులు ఈ వాతావరణంలో చేయగల పనులేమిటి? తమ చుట్టూ ఉన్న, తాము పుట్టి పెరిగిన, తమ తల్లిదండ్రులూ రక్తబంధువులూ, బాల్యం గడిచిన పుట్టినూళ్ళూ, చెరగని జ్ఞాపకాల చిన్ననాటి సావాసగాళ్లూ, తమ బాల్య కౌమార తొలి యవ్వన దశల్లో వాళ్లు భాగస్తులైన విలువలూ సామూహిక ఆలోచనలూ ఆచరణలూ ఉన్న సమాజానికి మన నెజ్జనులు ఏమయినా చేయగలరా? భాషద్వారానూ, రక్తపాశంద్వారానూ తమను కట్టిపడేస్తున్న సమాజం కొరకు నెజ్జనులు ఏమయినా చేయగలరా?

సమాజం ఒక పెద్ద నిరక్షరాస్య, నిరుద్యోగ, దారిద్ర్య, అసమాన, దౌర్జన్యపూరిత, దగాకోరు సముద్రంగా ఉన్నప్పుడు ఈ నెట్ ప్రపంచం అక్కడక్కడా మెరుస్తున్న ఒంటరి జ్ఞాన ద్వీపంగా, ఉన్నతాదాయ వర్గ ద్వీపంగా, పాలూ తేనే నిండిన ఆనంద జీవనద్వీపంగా వెలుగుతున్నది. అలా వెలుగుతున్న మన నెజ్జన బృందం, కింద విస్తరిస్తున్న నీడను చూడడం, ఆ వెలుగునీడల సంబంధాన్ని చూడడం, తమకు వీలయిన పరిధిలో ఆ నీడలను పోగొట్టే పనిలో పాలు పంచుకోవడం నైతిక బాధ్యత అనుకుంటాను.

నెజ్జన బృందం తమకు తెలిసో తెలియకో అరుదైన జీవన అవకాశాల, సమ్మోహక సాంకేతిక పరిజ్ఞానాల, మహా అనుభవాల పరిధిలోకి ప్రవేశించింది. ఆ జీవనం ఇచ్చే అనూహ్య అవకాశాల గురించి, ఆ సాంకేతిక పరిజ్ఞానం మనిషికి తొడిగే రెక్కల గురించి, ఆ మహా అనుభవాల నుంచి ఒక మామూలు మనిషి నేర్చుకోగల పాఠాల గురించి తోటి వారందరితోనూ పంచుకోవడం నెజ్జనుల బాధ్యత అని నేననుకుంటాను. నెజ్జనులు ఒక కొత్త సాంస్కృతిక వాతావరణం లోకి ప్రవేశించారు. ఆ వాతావరణానికి మైమరచి దాన్ని తలకెత్తుకోవడమూ వద్దు, దాన్ని తెలుసుకోకుండానే తిరస్కరించడమూ వద్దు. మొదట అది ఏమిటో అర్థం చేసుకోవలసి ఉంది. తాము అర్థం చేసుకున్న పద్ధతి సరయినదా కాదా నలుగురితో సంభాషణలో తేల్చుకోవలసి ఉంది. అటువంటి సమాచారపూర్వక సంభాషణకు నెట్ ఒక మంచి వాహిక అవుతుంది. ఆ వాహికవల్లనే ఈ కొత్త సమాజంలో ప్రవేశించిన నెజ్జనులు తప్పనిసరిగా అటువంటి సంభాషణ జరపవలసి ఉంటుంది. ఇప్పటికే ఏర్పడిన అనేక బృందాలలో, సొంత రచనావేదికలలో మన నెజ్జనులు పెద్దఎత్తున సంభాషించడం చూస్తూనే ఉన్నాం. కాని ఆ సంభాషణలలో ఎంతభాగం సమాజానికి ఉపయోగకరమైన పద్ధతిలో నడుస్తున్నదో మనం ఒకసారి పునరాలోచించుకోవలసే ఉన్నది.

ఇక్కడ అప్రస్తుతమనుకోకపోతే ఆధునిక సాహిత్యంలో జరిగిన పరిణామాలతో మన నెట్ ప్రపంచ పరిణామాలను పోల్చడానికి సాహసిస్తాను. తెలుగు ఆధునిక సాహిత్యంలోకి కొత్తవర్గాలు, కొత్త కులాలు, కొత్త సమూహాలు ప్రవేశించినకొద్దీ ఆ సాహిత్య భాషలో, వస్తువులలో, కథన పద్ధతులలో, శైలీశిల్పాలలో, పదచిత్రాలలో, పాత్రలలో, చివరికి పాత్రల హావభావాలలో కొత్త అనుభవాలు, కొత్త సమాచారం, కొత్త దృష్టికోణాలు ప్రవేశించాయి. అంతకుముందు తెలుగుభాషాసాహిత్యాలకు, సంస్కృతికి తెలిసిఉండని కొత్త జీవన పార్శ్వాలు తెలిసి వచ్చాయి. అంటే కనుక్కున్న ఒక్కొక్క ద్వీపమూ, ఒక్కొక్క ఖండమూ మన ఈ ప్రపంచం ఎంత విశాలమైనదో మనకు తెలియజెప్పి మన అనుభవాన్నీ, దృక్పథాన్నీ సుసంపన్నమూ విశాలమూ చేసింది. ఆ వరుసలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతులు కనుక్కున్న కొత్త ఖండం నెట్ ప్రపంచం. ఈ అన్వేషణను సాగించి విజయం సాధించిన నెజ్జనులు ఈ ఖండం గురించి రాయడం ద్వారా మన భాషా సాహిత్యాలకు కొత్త మేలు జరుగుతుంది. ఒక కొత్త సాంస్కృతిక బృందంతో సంపర్కంలోకి వచ్చిన క్రమంలో తమ కొత్త అనుభవాలు, కొత్త ఆలోచనలు ఏమిటి, అవి తమ పాత ఆలోచనల కన్న ఎట్లా భిన్నమైనవి, వాటిమధ్య సామ్యాలేమిటి, భేదాలేమిటి, ఒక స్థానిక సంఘటననో పరిణామాన్నో తమకు తెలిసిన అంతర్జాతీయ చారిత్రక నేపథ్యంలో ఎట్లా అర్థం చేసుకోవచ్చును వంటి అంశాలను చర్చకుపెట్టడం ద్వారా నెజ్జనులు తెలుగు సామాజిక సంస్కృతిని తప్పనిసరిగా ఉన్నతీకరించగలరు.

తమకు తోచిన భావాలను వ్యక్తీకరించడం, దాన్ని నలుగురిలో చర్చకు పెట్టడం నెజ్జనులకు చాల సులభం. బహుశా శిలా, తామ్రశాసనాలమీద తొలి అక్షరాలు చెక్కిన నాటినుంచీ, తాళపత్రాలమీద గంటం కదలాడినప్పటినుంచీ, కాగితాలమీద కలాలతో రాసినప్పటినుంచీ, తాము రాసిన అక్షరాలను అచ్చులో చూసుకున్ననాటివరకూ రచయితలెవ్వరికీ దొరకని అవకాశం నెజ్జనులకు దొరుకుతున్నది. ఆ రచయితలందరికీ రచన సులభమే అయిందేమో గాని, ఆ రచనను పాఠకులకు చేరవేయడం నెజ్జనులకు అయినంత సులభం కాలేదు. రచన చేయడానికి, పాఠకులకు చేరవేయడానికి మధ్య గతంలో ఉండిన అంతరం సమయంలోనూ, వాహికలలోనూ చాల పెద్దది. ఆ అంతరం నెజ్జనులకు లేకుండాపోయింది. లేదా గణనీయంగా తగ్గింది. ఈ సద్యోరచన, సద్యోముద్రణ, సద్యోపఠనం మంచిదేనా, దీనివల్ల సాహిత్య ప్రమాణాలు పడిపోవా అని ప్రశ్నించేవారుండవచ్చుగాని, నావరకు నేను ఇదంతా గొప్ప సృజన వికాసానికి దారితీస్తుందని, మన భావనాప్రపంచంలోకి ఒక్కసారిగా కొన్నివేల, లక్షల కొత్త మెదళ్ల, కలాల ప్రవేశం జరుగుతుందని అనుకుంటున్నాను. మౌలికంగా ప్రతిమేధా సృజనాత్మకమైనదే, ప్రతిమేధా రచన చేయగలదు అనే విశ్వాసానికి నెట్ ప్రపంచం రుజువులు చూపుతున్నదనుకుంటాను. ఈ నెట్ ప్రపంచాన్ని వాడుకుని తమ రచనాపాటవాన్ని నిరూపిస్తున్న నెజ్జనులు ఆ రచనాశక్తిని ఉపయోగకరంగా, సమాజ హితానికి వాడాలని నేననుకుంటాను.

ఇదంతా సాహిత్యానికీ, సంస్కృతికీ, భాషకూ సంబంధించిన వ్యవహారమనీ, నెజ్జనులలో చాలమంది అవేవీ పట్టించుకోని, తెలియని ఉత్తి సాంకేతిక నిపుణులనీ అనుకుంటే, ఉత్తి సాంకేతిక నిపుణులయిన నెజ్జనులు కూడ తెలుగు సమాజానికీ, సాహిత్యానికీ, సంస్కృతికీ అందించదగిన కానుకలున్నాయి. అసలు భాషా సాహిత్య సంస్కృతులు తమకు సంబంధంలేనివారెవరూ ఉండరని వాదించవచ్చుగాని, ఇప్పటికి ఆవాదనను పక్కన పెడతాను. అట్లాగే ఇవాళ చాలమంది నెజ్జనులు గుంపు సంభాషణలలోను, తమ సొంత బ్లాగులలోను రాస్తున్న విషయాలు చూస్తుంటే వాళ్లు రచయితలు కారని, వారికి సాహిత్యంతో సంబంధలేదని నేనయితే అంగీకరించలేను. వాళ్ల రచనా శక్తిలో, అభివ్యక్తిలో ఇంకా మెరుగుపరచుకోవలసినది చాల ఉండవచ్చును. కొండొకచో ఆ అభివ్యక్తిలో అనుచితమయిన వ్యక్తీకరణలూ, అసంపూర్ణ భావాలూ కూడ వస్తూ ఉండవచ్చును. కాని ఆ అభ్యంతరాలను మించి చూడవలసిన విషయమేమంటే, ఇంతకుముందువరకూ రచన తమకు సంబంధలేని వ్యవహారమని అనుకున్న వర్గాల నుంచి హఠాత్తుగా రచయితలు పుట్టుకొస్తున్నారు. అవి పూర్తి రచనలు కాకపోవచ్చును, కాని రచనా ప్రయత్నాలు. తమ భావప్రకటనాశక్తిని నిరూపించుకునే ప్రయత్నాలు. తమ దగ్గర తోటి మనుషులతో పంచుకోవలసినది ఏదో ఉందని గుర్తించిన ఉదాహరణలు.

తెలుగు సమాజానికీ, సాహిత్యానికి నెజ్జనులకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఏమి చేయవచ్చునో ఉదాహరణ ప్రాయమైన పనులు మాత్రం ప్రస్తావించి ముగిస్తాను. నా ఈ ప్రస్తావనలను సంపూర్ణంగా విస్తరించగల శక్తి నెజ్జనులకు ఉన్నదనే నా విశ్వాసం.

ప్రస్తుతం తెలుగు సమాజం అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నది. సమాజం తనముందు తాను పెట్టుకున్న ఆదర్శాలు — స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సహకారం, చట్టబద్ధమైన పాలన, మనిషి పట్ల గౌరవం, అభాగ్యులపట్ల దయ, సామాజిక ఘర్షణలకు అహింసాయుత పరిష్కారాలు – వంటి ఆదర్శాలు వెల్లివిరియ వలసి ఉండగా అంతకంతకూ ఆ ఆదర్శాలన్నీ లుప్తమయిపోతున్నాయి, రద్దయిపోతున్నాయి. ఆ అదర్శాలను స్వయంగా పాలకులే కాలరాస్తున్నారు. ఏ సామాజిక దురన్యాయాలకు వలసపాలకులను కారణంగా చూపి వారిని వెళ్లగొట్టే మహా ఉద్యమం నడిపి విజయం సాధించామనుకున్నామో, ఆ వలసపాలన ముగిసిపోయి ఆరు దశాబ్దాలు గడిచినా అవే దురన్యాయాలు, బహుశా అంతకన్న ఎక్కువ దురన్యాయాలు సాగుతున్నాయి. ఆ దురన్యాయాలను స్వయంగా పాలకులే సాగిస్తున్నారు. పాలకులు చూపిన దారే రాజమార్గమని ప్రజలు ఒంటరిగానూ, సామూహికంగానూ నమ్ముతున్నారు. ఈ సామాజిక అవ్యవస్థను ఏదో ఒక రూపంలో నెజ్జనుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడ అనుభవిస్తూనే ఉన్నారు. ఆ అనుభవాల గురించి నెజ్జనుల దృష్టికి వస్తూనే ఉన్నది. నెజ్జనులు తాము ఏమీ చేయలేమనే నిస్సహాయతలోకో, తాము ఇదంతా పట్టించుకోనక్కరలేదనే నిర్లిప్తతలోకో జారుకుంటున్నారు. కాని మిగిలిన సమాజం కన్నా మెరుగైన విజ్ఞానవివేకాలు, కొత్త అనుభవాలు, కొత్త జీవనశైలి తెలిసిన నెజ్జనులకు ఈ నిస్సహాయత, నిర్లిప్తత ఉచితమైనవి కావు. తెలుగు సమాజంలో ఏమి జరుగుతున్నదో నిత్యం తెలుసుకుంటూ, ఈ అవ్యవస్థపై తమ నిరసనను ప్రకటించడం, ఆ అవ్యవస్థకు ఎవరు కారణమో వారిని నిలదీయడం, సమాజంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వెలుగురేఖ కనబడితే దాన్ని ఎత్తిపట్టడం, మొత్తంమీద సమాజం తన ఆదర్శాల దిశగా నడిచేట్టుగా అంకుశంతో పొడవడం నెజ్జనులు తమ బాధ్యతగా స్వీకరించవలసిఉంది. ఇందులో వ్యక్తిగత స్థాయిలో తమ గ్రామాల విద్యా వైద్య అవకాశాల మెరుగుదల కొరకు పనిచేయడం దగ్గర ప్రారంభించి మొత్తంగా సామాజిక రుగ్మతలకు వైద్యం చేయగల పనులదాకా నెజ్జనులు తమ ఆలోచనలు, ఆచరణ పంచుకోవలసిన సందర్భాలెన్నో ఉన్నాయి.

తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకే చూస్తే నెజ్జనులు చేయగల పనులు ఎన్నో ఉన్నాయి. అత్యద్భుతమైన వారసత్వం ఉన్న మన సాహిత్యం ఇతర భాషా సమూహాలకు తెలియకపోవడం గురించి, కనీసం మన సాహిత్య వారసత్వం ఏమిటో మన వారికే తెలియకపోవడం గురించి ఎందరో ఎన్నో సార్లు వాపోవడం నెజ్జనులు వినే ఉంటారు. అట్లాగే గత శతాబ్దంలో అతి ఎక్కువగా ఇతరభాషలనుంచి మనభాషలోకి భాషాంతరీకరణం చేసుకున్న మనం, నెట్ ప్రపంచం ఏర్పడి సమాచారవనరులు ఎంతగానో పెరిగిన తర్వాత ఆదానప్రదానాలలో బాగా వెనుకబడుతున్నాం. బహుశా నెజ్జనులు ఈ పనులన్నీ ఇతరులకన్న మెరుగ్గా చేయగలరనుకుంటాను. వారు తెలుగు నుంచి ఇతర భాషలలోకి, ఇతరభాషలనుంచి తెలుగులోకి అనువాదం చేయగలరు. మన భాషలోని విలువైన రచనలను నెట్ ప్రపంచం మీదికి ఎక్కించి మరింత ఎక్కువమందికి పరిచయం చేయగలరు. ఆ రచనలను, అనువాదాలను గత రచయితలకన్న ఎక్కువ వేగంగా ఎక్కువమంది దృష్టికి తీసుకువచ్చి పరిపుష్టం చేయగలరు. అట్లాగే ఇప్పటివరకూ వెలువడిన తెలుగు సాహిత్యగ్రంథాలన్నిటినీ ప్రోది చేసుకున్న గరిష్ఠ ప్రమాణాల గ్రంథాలయం ఒకటి భౌతికంగా నిర్మాణం కాలేదు. కనీసం అటువంటి గ్రంథాలయాన్ని డిజిటల్ రూపంలోనైనా నిర్మించడం సాధ్యం అవుతుందేమో ప్రయత్నించవలసి ఉంది. ఆ పని నెజ్జనులే చేయగలరు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు కలిసి తెలుగులో బహుశా రెండు లక్షల పుస్తకాలు వెలువడి ఉంటాయి. ఒక ప్రణాళిక వేసుకుని, నెజ్జనులు స్వచ్ఛందంగా భాగస్వామ్యం తీసుకుని ఒక్కొక్కరూ తలాకొంత పని చేస్తూ పోయినా ఒకటి రెండు సంవత్సరాలలో ముఖ్యమైన పుస్తకాల డిజిటల్ గ్రంథాలయం అయినా తయారవుతుంది. తెలుగు భాషాసాహిత్యాల ఔన్నత్యాన్ని తమ పరిధిలోకి వచ్చిన వారందరికీ తెలియజేయడానికి ఇతరుల కన్న నెజ్జనులకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆ అవకాశాలను ఎట్లా వాడుకోవచ్చునో మరిన్ని ఆలోచనలు చేసి ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు తయారుచేయవలసిందిగా నెజ్జనులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

— ఎన్ వేణుగోపాల్ (kadalitaraga.wordpress.com)

——————————————————–

నెల్లుట్ల వేణుగోపాలరావు గారు ప్రసిద్ధ పాత్రికేయుడు. సమకాలీన సామాజిక రాజకీయ విషయాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాస్తూ ఉంటారు. 1986 నుంచి 89 వరకు ఆంధ్ర పత్రికలో పని చేశారు. 1989-90 లలో సాహిత్య, కళా, సాంస్కృతిక అంశాలమీద వారంవారం “కడలి తరగ” పేరుతో శీర్షిక రాశారు. 2000 లో వాటిలో కొన్నిటిని ఒక పుస్తకంగా కూడా వేశారు. ప్రజాతంత్ర వారపత్రికలో నాలుగు సంవత్సరాలపాటు “ఆఖరిపేజీ” అనే రాజకీయ శీర్షికను నిర్వహించారు. కడలితరగ పేరుతో బ్లాగును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో “వర్తమానం” శీర్షికన వ్యాసాలు రాస్తున్నారు. మేనేజింగ్ ఎడిటరుగా వీక్షణం అనే పక్ష పత్రికను నిర్వహిస్తున్నారు. గతంలో కొన్నాళ్ళు తెలుగుపీపుల్.కామ్ లో కూడా ఒక శీర్షికను నిర్వహించారు.

Posted in వ్యాసం | Tagged | 2 Comments

ఈ నెల వ్యాసాలు

కొద్ది వ్యవధి తరువాత సినిమా వ్యాసాన్ని మళ్ళీ ప్రచురిస్తున్నాం. ఈసారి వెంకట్ పల్ప్ ఫిక్షన్ సినిమా గురించి తన శైలిలో వివరిస్తున్నారు.
జ్యోతి గారి అక్షర పద్య విన్యాసాలు తిలకించండి.
మృతజీవులు ఏడో భాగాన్ని కూడా చదవండి.

-పొద్దు

ఈ నెల రచనలు:

రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం
నుడికారము – మరికొన్ని కోణాలు
మృతజీవులు – 6
తెవికీ ప్రగతి నివేదిక
అక్షర పద్య విన్యాసాలు
పల్ప్ ఫిక్షన్
మృతజీవులు – 7

మరిన్ని విశేషాలు త్వరలో…

గత నెల రచనలు:

మన జాతీయ కళారూపాల సంరక్షణ (అతిథి)
డిటో, డిటో (కవిత)
కడప కథ (సమీక్ష)
టైమ్ మెషిన్ (సరదా)
నిత్యాన్వేషణే జీవితం (కవిత)
గతనెలలో తెలుగువికీపీడియా (వికీ)
గడి (గడి)
జూలై గడి ఫలితాలు (గడి)
మృతజీవులు – 4
ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలు (వ్యాసం)
కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు (వ్యాసం)
శ్రోత, గాయకుడు – కుటుంబరావు (వ్యాసం)
కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం (వ్యాసం)
మృతజీవులు – 5 (వ్యాసం)
తప్పుకో ఇక ఆడలేనని….. (వ్యాసం)

Posted in ఇతరత్రా | 5 Comments