మృతజీవులు – 8

అతను అటు వెళ్ళగానే మానిలవ్, “ఇది మీరు అడుగుతున్న కారణం?” అన్నాడు.

ఈ ప్రశ్న అతిథిని తికమకపరిచింది; అతని ముఖం మానసిక శ్రమతో ఎర్రబారింది; సులువుగా వివరించడానికి లేనిదాన్ని వ్యక్తం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడ్డాడు. నిజానికి మానిలవ్ చెవినిబడిన మాటలు అత్యాశ్చర్యకరమైనవి, అపూర్వమైనవి, ఏ మనుషులూ అలాటిమాటలు విని ఉండరు.

“కారణం అడిగారు. కారణమేమంటే, కమతగాళ్ళను కొనుక్కుందామని నా ఉద్దేశ్యం…” చిచీకవ్ వాక్యం పూర్తిచేయక పస్తాయించాడు.

“ఒక్క విషయం తెలుసుకోనివ్వండి, కమతగాళ్లను భూమితో సహా కొందామనా, లేక కమతగాళ్లను మాత్రమే, భూమిలేకుండా, కొని వెంట తీసుకుపోదామనా?” అని మానిలవ్ అడిగాడు.

“నాకు కావలసింది నిజమైన కమతగాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళు…” అన్నాడు చిచీకవ్.

“ఏమిటీ? క్షమించాలి, నాకు సరిగా వినిపించదు. మీరేదో వింతగా మాట్లాడినట్టు వినబడింది…”

“మీ లెక్కల ప్రకారం బతికి ఉండీ నిజంగా చనిపోయిన కమతగాళ్ళను కొందామని నా తాత్పర్యం.” అన్నాడు చిచీకవ్.

మానిలవ్ పైపు చేతినుంచి జారి కిందపడింది, ఆయన చాలా నిమిషాలపాటు నోరు తెరుచుకు నిలబడ్డాడు. ఇంతకుముందు కూడా మైత్రి యొక్క మహిమను గురించి చర్చించుతూ ఉండిన మిత్రులిద్దరూ, అద్దాలకు అటూ ఇటూ ఉంచే బొమ్మల్లాగా ఒకరినొకరు చూస్తూ కదలక మెదలక ఉండిపోయారు. చిట్టచివరకు మానిలవ్ పైప్ ఎత్తుకుని తన అతిథి మొహంలోకి చూశాడు – ఆ మొహంలో ఏ మాత్రమైనా చిరునవ్వు ఉన్నదేమో, ఆయన హాస్యమాడుతున్నాడనుకుందామని; కాని అలాటిదేమీ లేదు, చిచీకవ్ మొహం మామూలుకన్నా కూడా గంభీరంగా ఉన్నది. ఇంతలో తన అతిథికి మతి చలించిందేమోనన్న సందేహం తగిలి, ఆయన భయపడుతూ అతనికేసి మళ్ళీ చూశాడు. కాని అతని కళ్ళలో పిచ్చిచూపులాటిదేమీ లేదు. ఆ కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. ఎంత ఆలోచించినా మానిలవ్ కు తాను ఏమనుకోవాలో, ఏం చేయాలో బోధపడలేదు; అందుచేత ఆయన తన నోట ఉన్న కొద్దిపొగను సన్నగా బయటికి వదిలాడు.

“కనక నేను కోరేదేమంటే, మీ జాబితాలో బతికున్నవారి కింద జమ అయిఉండి, వాస్తవంగా చనిపోయిన కమతగాళ్ళను మీ ఇష్టానుసారం నాకు రాసి ఇవ్వటమో, విక్రయించటమో చెయ్యగలరా?”

మానిలవ్ మటుకు కంగారుపడి ఏమీ అనలేక అతిథికేసి తేరిపార చూశాడు.

“మీకు అభ్యంతరాలేమైనా ఉండవచ్చు”, అన్నాడు చిచీకవ్.

“నాకా?…లేదు, అదేమీలేదు… కాని, మరేమీ అనుకోకుండా ఉంటే… నాకు సంగతి అంతుచిక్కలేదు… మీలో అడుగడుగునా కనిపించే విద్యాసంస్కారం దురదృష్టవశాత్తూ నాకు అలవడని మాట నిజమే మరి. నాకు సరిగా మాట్లాడటం కూడా చేతకాదు, మీరు ఇప్పుడు చెప్పిన మాటలో ఏదో నిగూఢమైన అర్థం ఉండవచ్చు. లేక మీరు అలంకారసదృశంగా మాట్లాడారేమో”, అన్నాడు మానిలవ్.

“లేదు, లేదు. చచ్చిపోయినవాళ్ళనే నా ఉద్దేశం”, అన్నాడు చిచీకవ్.

మానిలవ్ పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. తాను ఏదో చెయ్యాలనీ, ఏదైనా ఒక ప్రశ్న అడగాలనీ ఆయనకు తోచింది, కాని ఏమి అడగాలో చచ్చినా స్ఫురించలేదు. చివరకు ఆయన మళ్ళీ పొగ వదిలాడు- ఈసారి నోటినుంచి కాదు, ముక్కునుంచి.

“మరి ఏ అభ్యంతరమూ లేని పక్షంలో, దేవుడిపై భారం వేసి మనం వెంటనే ఒక విక్రయ దస్తావేజు రాసుకుందాం”, అన్నాడు చిచీకవ్.

“చచ్చినవాళ్ళ విక్రయమా?”

“అబ్బే… లెక్కల్లో ఉన్నప్రకారం బతికున్నవాళ్ళనే రాసుకుందాం. చట్టానికి ఏమాత్రం తభావతు రావటంకూడా నేను సహించను. అందువల్ల నేను నా ఉద్యోగంలో ఎంతో నష్టపోయాను. కాని నాకు ధర్మం పవిత్రమైనది. చట్టమంటే నాకు భక్తి.” అన్నాడు చిచీకవ్.

ఈ చివరి మాటలు మానిలవ్ కు చాలా నచ్చాయి, కాని చిచీకవ్ అభిప్రాయం ఏమిటో ఒక్క పిసరు కూడా అర్థం కాలేదు, అందుచేత ఆయన జవాబు చెప్పక, పెద్ద చప్పుడుతో పైపును పీల్చసాగాడు. ఈ సంఘటన యొక్క అంతరార్థాన్ని ఆయన పైపులో నుంచి లాగేలాగా కనిపించాడు. అయితే పైపు బుస్సుబుస్సుమన్నదే తప్ప మరేమీ జరగలేదు.

“మీరేదో సంకోచిస్తున్నట్టున్నారు?”

“ఎబ్బే, ఎంతమాత్రమూ లేదు! నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాననుకోకండీ, ఈ వ్యవహారం పౌరచట్టానికీ, కాలక్రమాన రష్యా భద్రతకూ వ్యతిరేకం ఉండదంటారా?”

ఈ మాటలంటూ మానిలవ్ చెయ్యి ఊపి, చిచీకవ్ మొహం లోకి సాభిప్రాయంగా చూశాడు. బిగపట్టిన ఆయన పెదవులలోనూ, ముఖంలోనూ కనిపించినంత గంభీరభావం ఏ మనిషి ముఖంలోనూ ఎన్నడు కనిపించదు – క్లిష్టసమస్యను ఎదుర్కొన్న కంటక పరిస్థితిలో వివేకంగల మంత్రుల ముఖాల మీద ఏమైనా కనిపిస్తుందేమో.

అయితే చిచీకవ్ ఈ వ్యవహారం ఏ విధంగానూ, పౌరచట్టాలకు గాని, రష్యా భద్రతకు గాని అననుకూలంగా ఉండదని అన్నాడు; ఒక్క క్షణం ఆగి, రిజిస్ట్రేషను ఖర్చులు గిట్టుతాయి గనక ప్రభుత్వానికి లాభం కూడా ఉంటుందన్నాడు.

“అదా మీ అభిప్రాయం!”

“నా అభిప్రాయం.. అంతా సవ్యంగానే ఉంటుందని.”

“సవ్యంగా ఉండే పక్షంలో నా అభ్యంతరం ఏమీ లేదు”, అన్నాడు మానిలవ్, అనుమానాలన్నీ రహితం చేసుకుని.

“అయితే మరి ధర ఇంతా అని అనుకుందామా?”

“ధరా?” అని మానిలవ్ అగాడు. “చచ్చిపోయిన వాళ్ళ కోసం నేను మీవద్ద డబ్బు పుచ్చుకుంటా ననుకుంటున్నారా? మీకు ఇలాటి వింత కోరిక కలగనే కలిగింది గనుక వాళ్ళను ఉచితంగా తీసుకోండి, దస్తావేజు ఖర్చులు కూడా నేనే భరించుకుంటాను.”

ఈ మాటలు విని అతిథి పరమానందభరితుడయాడన్న విషయం చెప్పకపోతే అది కథకుడిలో పెద్ద అపచారమవుతుంది. మమూలుగా నిండు మనిషీ, గంభీర స్వభావుడు అయినప్పటికీ అతను ఇప్పుడు మేకులాగా గెంతాలన్న ప్రేరణకు గురి అయి, దాన్ని అణచుకోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. అలాటి ప్రేరణ ఎంతో ఆనందం కలిగితేగాని ఏర్పడదని మనకందరికీ తెలిసిన విషయమే. అతను కుర్చీలో ఎంత బలంగా సంచరించాడంటే కుర్చీకి వేసిన పట్టుతొడుగు కాస్తా చినిగింది; మానిలవ్ అతనికేసి వింతగా చూశాడు. అతను కృతజ్ఞతను వ్యక్తం చెయ్యటం కోసం అదేపనిగా మాట్లాడనారంభించేసరికి మానిలవ్ కంగారుపడిపోయాడు, ఆయన ముఖం ఎర్రబారింది, అంతగా చెప్పనవసరం లేదన్నట్టు తల ఊపాడు, చిట్టచివరకు, ఇందులో విశేషం ఏమీ లేదనీ, తాను హృదయంలో అనుభవించే ఆకర్షణను, ఆత్మయొక్క ఆకర్షణశక్తిని, ఏదోవిధంగా వ్యక్తం చెయ్యటం తనకు ఆనందమేననీ ఒక విధంగా చూస్తే చచ్చిపోయిన వాళ్ళకు విలవేమీ లేదనీ అన్నాడు.

“విలవ లేకపోవడమేమిటి?” అన్నాడు చిచీకవ్ ఆయనచేతిని నొక్కుతూ.

ఈ మాటలు అంటూ అతను దీర్ఘనిశ్వాసం వదిలాడు; అతనికి తన మనస్సులో ఉన్నదంతా చెప్పుకోవాలని ఉన్నట్టున్నది.

—————

-కొడవటిగంటి కుటుంబరావు

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

2 Responses to మృతజీవులు – 8

  1. శేషాచలపతి says:

    ఇన్నాళ్ళూ మందంగా నడుస్తూ ఉన్న మృతజీవులు ఈసారి మలుపు తిరిగింది. కథ చిక్కబడుతోంది. రాబోయే భాగాల కోసం చూస్తాను.

  2. ఆహా! ఇప్పుడు కదా కథ రసకందాయంలో పడింది? ఇప్పటిదాకా రిలాక్స్‍డ్ గా వెనక్కివాలి చదువుతున్న పాఠకులు ఒక్కసారి ఉలిక్కిపడి నిటారుగా కూర్చుని, ఇకముందేం జరుగుతుందా అని ఉత్కంఠతో ఎదురుచూసేలా చేసింది.

Comments are closed.