మృతజీవులు – 5

బండీ ఇంటిముందు ఆవరణలో ప్రవేశించేసరికి ఇల్లుగలాయన వాకిటనే నిలిచి ఉండటం చిచీకవ్ కంటపడింది. ఆయన పలుచని ఆకుపచ్చకోటు ధరించి, ఎండకు చెయ్యి అడ్డం పెట్టుకుని, సమీపించే బండిని పరికిస్తున్నాడు. బండీ దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయన ముఖం వికసించసాగింది, చిరునవ్వు విస్తరించింది.

చిచీకవ్ బండి దిగుతూండగా ఆయన “పావెల్ ఇవానొవిచ్ గారే! ఇంతకాలానికి మేం జ్ఞాపకం వచ్చామన్నమాట!” అన్నాడు.

ఇద్దరు మిత్రులూ ఆప్యాయంగా ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నాక, మానిలవ్ అతిథిని లోపలికి తీసుకుపోయాడు. వారు ముందు వసారాను, హాలునూ, భోజనశాలనూ దాటడానికి ఎక్కువసేపు పట్టకపోయినా యీ అవకాశం తీసుకుని యీ గృహస్తు గురించి కొన్ని మాటలు చెప్పాలి; అది అంత సులువైన పని కాదని కథకుడు ముందే మనవి చేసుకోవటం మంచిది. భారీ ఎత్తున వ్యక్తులను చిత్రించడం సులువు; రంగులను గుప్పిళ్ళతో తీసి చల్లవచ్చు – నల్లగా నిగనిగలాడే కళ్లూ, ముందుకు పొడుచుకువచ్చే కనుబొమలూ, ముఖాన చింతమూలాన ఏర్పడిన ముడతలూ, భుజం మీదుగా ఒక నల్లని, లేక రక్తవర్ణంగల పటమూ చిత్రించితే చాలు చిత్తరువు పూర్తయిపోతుంది. కాని మామూలు మనుషులను వర్ణించడం అమిత కష్టం, ప్రపంచంలో అసంఖ్యాకులుగా వున్నవాళ్ళు చప్పున చూస్తే ఒకటిగానే వుంటారు, కాని పరిశీలించి చూస్తే సులువుగా గ్రహించరాని ప్రత్యేక లక్షణాలుంటాయి. కనబడీ కనబడని ఈ ప్రత్యేక లక్షణాలను పైకి తీసుకురావడానికి తల పగలగొట్టుకోవాలి; ఇందుకుగాను ఎంతో సునిశితమైన పరిశీలనానుభవం అవసరం.

మానిలవ్ మనస్తత్వం ఎటువంటిదో ఈశ్వరునికే తెలియాలి. “అదోరకం” అని వర్ణించదగిన మనుషులున్నారు; వారు అటూ ఇటూ కాకుండా ఉంటారు, గొర్రెలలోనూ చేరరు, మేకలలోనూ చేరరు, మానిలవ్ ను ఈ జాతిలో చేర్చవచ్చు. చూడటానికి ఆయన అందమైన మనిషి. ఆయన ముఖం చూడముచ్చటగా ఉంటుంది, అయితే అందులో తీపి జాస్తి. ఆయన ప్రవర్తనలో అవతలివాణ్ణి మంచి చేసుకుందామనే ఆదుర్దా కనిపిస్తోంది. ఆయన చిరునవ్వు సమ్మోహనకరంగా ఉంటుంది. జుట్టు తేలికరంగుగానూ, కళ్లు నీలంగానూ వుంటాయి. ఆయనతో మాట్లాడ నారంభించగానే ఎవరికైనా, “ఆహా, ఎంత మంచివాడు, సహృదయుడు” అనిపిస్తుంది,. మరునిమిషం ఏ భావమూ లేకుండా పోతుంది, మూడో నిమిషంలో “ఈయన ధోరణి ఏమిటయినట్టా?” అనిపిస్తుంది: అప్పుడు మనం సెలవు పుచ్చుకుంటాం, వెళ్లిపోలేని పరిస్థితిలో మనకు చెడ్డ విసుగు పుట్టుకొస్తుంది. మనం అవతలి మనిషికి అప్రియమైన ప్రస్తావన తెచ్చినట్టయితే వాడు తొట్రుపడటమో, తూలి మాట్లాడటమో సాధారణంగా జరుగుతుంది; మానిలవ్ అలా ఎన్నడూ చేయడు. ప్రతి మనిషికీ ఒక వ్యసనం ఉంటుంది: ఒకడికి వేటకుక్కల పిచ్చి; మరొకడికి సంగీతం పిచ్చి, సంగీతపు లోతులను తాను అద్భుతంగా తరచగలననుకుంటాడు; మూడోవాడు భోజనం దగ్గర తన నైపుణ్యం అద్భుతమనుకుంటాడు; నాలుగోవాడు తనకు విధి ప్రసాదించిన పాత్ర కన్న కనీసం ఒక్కపిసరు గొప్పగా అభినయించాలని తహతహలాడతాడు; అయిదోవాడు ఆట్టే పెద్ద ఆశలకు పోక, యే కోర్టు అధికారితోనో పచార్లు చేస్తూ తన మిత్రులకూ, పరిచితులకూ, ఆ మాటకు వస్తే ఎరుగనివాళ్లకున్నూ కనపడి వారి మెప్పు సంపాదించాలని అహోరాత్రాలు కలవరిస్తాడు; ఆరోవాడి చేతికి ఏ డైమను ఆసుముక్క కొసనో, రెండుబంతి ముక్క కొసనో మడపాలన్న ప్రేరణ దైవికంగా కలుగుతూ ఉంటుంది; ఏడోవాడికి సర్వత్రా నియమాలు అమలు చేయాలనీ, స్టేషను మాస్టర్లూ, బండి తోలేవాళ్లూ తన ఆజ్ఞానుసారం నడుచుకునేలాగా చేయాలనీ ఉంటుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రతివాడికీ ఏదో ఒక “కళ” ఉంటుంది.

కాని మానిలవ్ కు ఏ ఒకటీ లేదు. ఆయన ఇంటివద్ద ఆట్టే మాట్లాడేవాడు కాడు, ధ్యానం లోనూ, ఆలోచనలోనూ జాస్తిగా గడిపేవాడు, కాని దేన్ని గురించి ఆలోచించేవాడో అదీ ఈశ్వరునికే ఎరుక. ఆయనకు పొలాలను చూచుకోవడంతో సరిపోయేదనటానికి లేదు, ఆయన ఏనాడూ తన పొలాలకేసి వెళ్ళి ఎరగడు; ఆయన ఎస్టేటు తన మానాన తాను నడిచేది. నిగామాను తనతో, ఇలాచేస్తే బాగుంటుంది, అలాచేస్తే బాగుంటుంది అంటే, ఆయన పైపు కాలుస్తూ “అవును అందువల్ల చిక్కులేదు” అని సాధారణంగా జవాబిచ్చేవాడు. (ఈ పైపు కాల్చే అలవాటు ఆయనకు సేనలో పని చేసేటప్పుడు పట్టుబడింది; ఆయన సేనలో అధికారిగా ఉండగా చాలా నిరాడంబరుడనీ, నాగరికుడనీ, మంచి సంస్కారం గలవాడనీ అనుకునేవారు). “అవును, అందువల్ల చిక్కేమీలేదు” అనేవాడాయన మళ్ళీ. రైతు ఎవరన్నా తన దగ్గరికి వచ్చి, తల వెనకభాగం గోక్కుంటూ, “యజమానీ, నకు సెలవు దయచేయించాలి. నేను పన్నులు కట్టడానికి డబ్బు సంపాదించి తెచ్చుకుంటాను”, అంటే, “అలాగే వెళ్లు” అనేవాడు పైపు కాలుస్తూ. ఆ రైతు కొంత కాలం తప్పతాగటానికి పోతున్నాడని ఆయన బుర్రకు తట్టేది కాదు. ఒక్కొక్కసారి ఆయన బయట మెట్లమ్నీద నిలబడి తన ఆవరణలోకి గాని, కొలనుకేసిగాని చూసి, ఇంటినుంచి నేల సొరంగం తవ్వినా, కొలనుమీదుగా ఒక వంతెనకట్టి, దానికి అటూ, ఇటూ దుకాణాలు ఏర్పాటు చేసి, వాటిలో రైతులకు కావలసిన వస్తువులన్నీ అమ్మే ఏర్పాటు చేసినా ఎంతో బాగుంటుందనేవాడు. ఈ మాటలనేటప్పుడు ఆయన కళ్లు చక్కెరపాకంలాగా అయేవి, ఆయన మొహంలో ఎంతో సంతృప్తి గోచరించేది. అయితే ఆ ఆలోచనలు మాటలరూపాన్ని దాటి ఎన్నడూ కార్యరూపాన్ని దాల్చేవికావు.

ఆయన చదువుకునే గదిలో ఆయన రెండేళ్లనుంచీ చదువుతున్న ఒక పుస్తకంలో పధ్నాలుగో పేజీవద్ద గుర్తు ఉంచి ఉన్నది. ఆయన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి వెలితిగా ఉంటూనే ఉంటుంది: డ్రాయింగు రూములో మేలురకం చెక్కసామగ్రి ఉన్నది, దానికి ఎంతో మంచి పట్టుతొడుగులు అమర్చారు, ఆ పట్టు చాలా ఖరీదై ఉండాలి, కాని అది చాలని కారణంచేత రెండు వాలుకుర్చీలకు గోతం తొడుగులు మాత్రమే వేశారు. ఇంటి యజమాని కొన్ని సంవత్సరాలుగా తన అతిథులతో “వాటిమీద కూచోకండి, అవి ఇంకా పూర్తికాలేదు”, అంటూ వస్తున్నాడు. పెళ్లయిన కొత్తలో ఆయన తన భార్యతో, “మన ఖాళీగదుల్లో చెక్కసామగ్రి కొంతకాలంపాటైనా అమర్చాలి, దాని విషయం రేపు చూద్దాం” అన్నాడు, కాని ఆ గదుల్లో ఈనాటికీ చెక్కసామగ్రి అమరలేదు. పొద్దూకగానే బల్లమీద చాలా అందమైన నల్లని కంచు కొవ్వొత్తిస్టాండు తెచ్చి పెట్టారు, దానిపైన మూడు “గ్రేసుల” బొమ్మలున్నాయి, అందమైన ముత్యపుచిప్పతో చేసిన కప్పున్నది. దాని సరసనే మైనంకప్పిన పురాతన రాగివస్తువొకటి కూడా పెట్టారు – ఈ సంగతి ఇంటి యజమాని గాని, యజమానురాలుగాని, నౌకర్లుగాని గమనించనేలేదు.

ఇక ఆయన భార్య – ఏమైనప్పటికీ వారు ఒకరి కొకరు పూర్తిగా అతికిపోయారు. వారికి పెళ్లి అయి ఎనిమిదేళ్లు దాటినప్పటికీ, ఎంతో ప్రేమగా “ఏదీ నోరుతెరూ!” అంటూ ఒకరికొకరు యాపిల్ ముక్కలూ, చక్కెరబిళ్ళలూ, పప్పులూ పెట్టుకుంటారు. ఒకరు నోరు తెరవమనగానే రెండోవారు ముద్దుగా తెరుస్తారని వేరే చెప్పనవసరం లేదు. పుట్టినరోజు పండగలకు ఒకరికొకరు బహుమానాలు – టూత్ బ్రష్ పెట్టుకునేందుకు పూసలుకుట్టిన తొడుగులాటివి – ఇచ్చుకునేవారు. తరుచు వారు సోఫాలో కూచుని ఉన్న సమయంలో, అకస్మాత్తుగా, ఎలాటి కారణమూ లేకుండా, ఆయన తన పైపుతీసి పక్కన పెట్టేవాడు, ఆమె ఆ సమయానికి కుట్టుపని చేస్తూన్న పక్షంలో దాన్ని పక్కన పెట్టేసేది, ఆ తరవాత ఇద్దరూ ఎంత దీర్ఘంగా, ఎంత నీరసం పుట్టేలాగా చుంబించుకునేవారంటే ఈ లోపుగా ఒక చిన్నచుట్ట కాల్చి పారెయ్యవచ్చు. మొత్తంమీద వాళ్ళు సుఖంగా ఉన్నారు. చూశారో లేదో, ఇల్లన్న తరవాత దీర్ఘంగా చుంబించటాలూ, బహుమానా లిచ్చుకోవటాలూగాక ఇంకా ఎన్నో పనులు చెయ్యవలసి ఉంటుంది. ఎన్నో సంశయాలు తల ఎత్తుతాయి. మాటవరసకు, వంట అలా అఘోరిస్తుందేం? ఇల్లుచూసే మనిషి అలా చేతివాట్లు వేస్తుందేం? సామాను గది ఖాళీగా ఉంటుందేం? ఇంటి నౌకర్లు తమ చిత్తం వచ్చినప్పుడు నిద్రలు లేచి, మిగిలిన సమయాల్లో అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తారేం?

అయితే ఇవన్నీ హీనవిషయాలు, మానిలవ్ భార్యేమో బాగా చదువుకున్న మనిషి. వసతి పాఠశాలల్లో ఉండి చదివితేగాని ఉన్నతవిద్య లభించదని అందరికీ తెలిసిన విషయమే గదా. వసతి పాఠశాలల్లో మానవత్వానికి పునాదులుగా ఉండగల విషయాలు మూడు గట్టిగా అబ్బుతాయి: కుటుంబజీవితం సుఖవంతంగా సాగగలందులకు ఫ్రెంచి భాషా, విశ్రాంతి తీసుకునేటప్పుడు వారిని రంజింపజేయటానికి పియానో వాయించటం, ఇంకా ముఖ్యమైన శిక్షణ, అనగా సంచీ వగైరా బహుకృతులు అల్లటం. ఇటీవల ఇంకా కొత్త పద్ధతులూ, అభివృద్ధికరమైన మార్పులూ జరుగుతున్నాయనుకోండి. ఈ సంస్థలను నడిపే ఆడ ప్రిన్సిపాల్ ల వివేక వికాసాలపైన అంతా ఆధారపడుతుంది. ఉదాహరణకి, కొన్ని వసతి పాఠశాలల్లో పియానోకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఫ్రెంచి భాషకూ గృహశిక్షణకూ తక్కువ ఇస్తారు. మరి కొన్నింట గృహశిక్షణ అంటే సంచుల్లాంటివి అల్లడం ప్రధానంగా ఉండి, ఫ్రెంచీ, పియానో తక్కువ స్థానం ఆక్రమిస్తాయి. అన్నిరకాలూ ఉన్నాయన్న మాట. మానిలవ్ భార్య విషయంలో మనం తెలుసుకోదగినది… క్షమించండి, నాకు స్త్రీల గురించి మాట్లాడటమంటే చెడ్డభయం. అదీగాక మన ముఖ్య పాత్రధారులు డ్రాయింగురూము వాకిలివద్ద ఇప్పటికే చాలా నిమిషాలుగా నిలబడి ఒకరినొకరు ముందు వెళ్ళమని వేడుకుంటున్నారు.

“దయచేసి నాకోసం తమరు కించకాకండి. నేను మీ వెనక వస్తాను”, అంటున్నాడు చిచీకవ్.

“అలాకాదు, పావెల్ ఇవానొవిచ్, మీరు అతిథి”, అంటూ మానిలవ్ గదికేసి చెయ్యి ఊపాడు.

“మీరిలాంటి పట్టింపులేవీ పెట్టుకోక ముందు నడవండి, చెబుతాను”, అన్నాడు చిచీకవ్.

“మీరు నన్ను క్షమించవలసిందేను. మీవంటి యోగ్యులూ, సంస్కారులూ నా వెనకగా రావటం ఏమాత్రమూ భావ్యం కాదు.”

“ఏమిటా సంస్కారం?.. పదండి.”

“వీల్లేదు, మీరే పదండి.”

“ఎందుకూ?”

“ఎందుకంటే అందుకే!”

అంటూ మానిలవ్ ముచ్చటగా మందహాసం చేశాడు.

చిట్టచివరకు మిత్రులిద్దరూ అడ్డంగా తిరిగి, ఒకరినొకరు కొంచెంగా ఒరుసుకుంటూ, ఏక కాలమందే లోపలికి వెళ్లారు.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.