మృతజీవులు – 6

“నా భార్యను పరిచయం చేస్తాను. ఇదుగో, వీరే పావెల్ ఇవానొవిచ్” అన్నాడు మానిలవ్ భార్యతో.

చిచీకవ్ ఇప్పుడే ఆ యువతిని చూశాడు, ఆయన మానిలవ్ ముందు వంగి, కాళ్ళు నేలకేసి గౌరవంగా రాస్తున్నప్పుడు ఆమెను గమనించనేలేదు. ఆమె అనాకారి కాదు, అందమైన దుస్తులు ధరించి ఉన్నది. ఆమె వదులుగా ధరించిన తేలికరంగు జరీసిల్కుగౌను ఆమె శరీరానికి చక్కగా అమరింది. ఆమె చేతులు సుకుమారంగా ఉన్నాయి. ఆమె చేతిలో ఉన్నదేదో చప్పున బల్లమీద పడేసి, మూలల ఎంబ్రాయిడరు చేసిన కేంబ్రిక్ చేతిరుమాలును గుప్పిట్లో గట్టిగా పట్టుకున్నది. ఆమె తాను కూచుని ఉన్న సోఫా నుంచి లేచింది. చిచీకవ్ ఆమె చేతిని మనస్ఫూర్తిగానే ముద్దు పెట్టుకున్నాడు. మానిలవ్ సతి కొంచెం తొస్సుగా మాట్లాడుతూ, అతనిరాక తమకు ఆనందం కలిగించిందనీ, తన భర్త ప్రతిరోజూ అతని గురించే మాట్లాడతాడనీ అన్నది.

“అవును, ఆవిడ అస్తమానమూ, ‘మీ స్నేహితుడు రారేం?’ అని అడుగుతుంది. ‘వస్తారు, కొంచెం ఓపిక పట్టవోయ్,’ అన్నాను. ఇంకేం మీరు మాపై దయతో రానేవచ్చారు. మీ రాక మాకు నిజంగా ఎంతో గొప్ప సంగతి…పర్వదినం…హృదయానికి వేడుక”, అన్నాడు మానిలవ్.

వ్యవహారం హృదయం వేడుకదాకా వచ్చిందనేసరికి చిచీకవ్ కొంచెం తికమకపడి, తాను పేరు ప్రఖ్యాతులు కలవాణ్ణి కాననేశాడు.

మానిలవ్ ముచ్చటగా చిరునవ్వు నవ్వుతూ, “మీకు అన్నీ ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి కూడాను”, అన్నాడు.

“మా పట్నం ఎలా ఉన్నది? మీకిక్కడ సౌఖ్యంగా ఉన్నదా?” అని మానిలవ్ సతి అడిగింది.

“చాలా మంచి పట్నం, అందమైన పట్నం. నాకు చక్కగా కాలం గడుస్తున్నది, మంచి సాంగత్యం”, అని చిచీకవ్ జవాబు చెప్పాడు.

“మా గవర్నరు గారి గురించి మీ అభిప్రాయ మేమిటి?” అని మానిలవ్ సతి మళ్ళీ అడిగింది.

“ఆయన నిజంగా చాలా ఘనత గల మనిషి, సరదా అయిన వాడు కాదూ?” అన్నాడు మానిలవ్.

“అక్షరాలా నిజం. ఆయన చాలా గొప్పవాడు. తన బాధ్యతలను సమగ్రంగా గ్రహించగలడు, వాటిని ఎంత క్షుణ్ణంగా నిర్వర్తించగలడు! అలాటి మనుషులింకా ఉంటే ఎంత బాగుండును!” అన్నాడు చిచీకవ్.

“అన్ని రకాల వారికీ ఆతిథ్యం ఇవ్వడం ఆయనకెంత బాగా తెలుసో, చూశారా, ఆయన ప్రవర్తనలో ఏమి నాజూకు!” అని మానిలవ్ ఆనందం వ్యక్తం చేస్తూ, చెవులవెనక నిమిరితే పిల్లి పారవశ్యంతో కళ్ళు మూసుకున్నట్టుగా తన కళ్ళను దాదాపు మూసుకున్నాడు.

“అమిత మర్యాదస్తుడూ, వాంఛనీయుడూను. ఆయన తెలివి ఏమిటని! ఆయన ఆ ఎంబ్రాయిడరీలన్నీ ఎలా చేస్తారో నాకు బోధపడకుండా ఉంది. ఆయన చేసినది ఒక సంచీ చూపారు. ఎంతోమంది స్త్రీలు కూడా అంతబాగా ఎంబ్రాయిడరు చెయ్యలేరని తోస్తుంది,” అన్నాడు చిచీకవ్.

“డిప్టీ గవర్నరో? చాలా సరదా అయినవాడు కాదూ?” అన్నాడు మానిలవ్, మళ్ళీ కళ్ళు సగం మూస్తూ.

“బహు యోగ్యుడు, బహు యోగ్యుడు!” అన్నాడు చిచీకవ్.

“అవునుగానీ, ఇది చెప్పండి, పోలీసు అధిపతిని గురించి మీ అభిప్రాయమేమిటి?”

“మంచి రంజకత్వం కలవాడు. పైన, ఎంత తెలివి! ఎంత చదివిన వాడు! మేము పబ్లిక్ ప్రాసిక్యూటరుతోనూ, న్యాయస్థానాధ్యక్షుడి తోనూ కలిసి కోడి కూసినదాకా చీట్లాడాం!”

“పోలీసు అధిపతి భార్యగారి గురించి మీ అభిప్రాయమేమిటి?చాలా మంచి మనిషి కాదూ?” అన్నది మానిలవ్ భార్య.

ఆహ అలాంటి యోగ్యురాలిని నేనెన్నడు ఎరగను,” అన్నాడు చిచీకవ్.

ఆ తరువాత వారు న్యాయస్థానాధ్యక్షుణ్ణి గురించీ, పోస్టుమాస్టరును గురించీ మాట్లాడుకున్నారు. అటు పిమ్మట పట్నంలో ఉన్న ప్రతిఒక్క అధికారిని గురించీ మాట్లాడుకున్నారు. అందరికి అందరూ బహు దొడ్డ మనుషులే.

“మీ కాలమంతా పల్లెపట్టునే గడుపుతారా?” అని చిచీకవ్ తనవంతుగా ప్రశ్నించ సాహసించాడు.

“ఎక్కువ భాగం అంటే.” అన్నాడు మానిలవ్. “ఎప్పుడన్నా పట్నం పోతాం. అది కూడా నాగరిక సాంగత్యం కోసమే. అస్తమానం ఇక్కడే ఉంటే బొత్తిగా బూజు పట్టిపోతాం.”

“అవును నిజం. అవును నిజం” అన్నాడు చిచీకవ్.

“మాకు సంస్కారం గల పొరుగే ఉంటే ఈ చిక్కు లేకపోను. గొప్ప గొప్ప విషయాలను గురించి కొంతవరకు మాట్లాడటానికీ, ఆత్మను చైతన్యవంతం చేసే విషయాలు చర్చించటానికీ ఎవరైనా ఉంటే, ఒక విధంగా ఉత్తేజకరంగా ఉంటుంది మరి…” అన్నాడు మానిలవ్.

ఆయన ఈ ధోరణిలో ఇంకెంతసేపు మాట్లాడేవాడో గాని, తాను అసలు విషయం వదలి పెడగా వెళ్ళినట్లు అనిపించే సరికి, చేతి వేళ్ళు ఆడించి, “అలాంటి పరిస్థితులలో గ్రామ జీవితమూ, ఏకాంతవాసమూ ఆహ్లాదకరంగానే ఉంటాయి మరి. అయితే ఒక్కరయినా లేరు… ఒక్కొక్కప్పుడు ‘దేశమాత కన్నబిడ్డ’ చదవటం తప్ప చేసేది ఉండదు”, అన్నాడు.

చిచీకవ్ ఈ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ, ఏకాంతంగా జీవించడమూ, ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించటమూ, గ్రంథపఠనమూ కంటే వాంఛనీయం మరొకటి లేదన్నాడు.

“అవుననుకోండి. కాని మన భావాలు పంచుకోవడానికి తగిన మిత్రులెవరూ లేకపోతే…” అన్నాడు మానిలవ్.

“అందుకేమీ సందేహం లేదు, ఎంతమాత్రమూ లేదు”, అంటూ చిచీకవ్ అడ్డొచ్చి, “ప్రపంచంలో ఉన్న నిక్షేపాలేమిటి? జ్ఞానులు చెప్పినట్టు, డబ్బు కాదు, సజ్జన సాంగత్యం”, అన్నాడు.

“అన్నట్టు, పావెల్ ఇవానొవిచ్”, అని మానిలవ్ ప్రారంభించాడు. ఆయన ముఖభంగిమ కేవలం తియ్యగా ఉండటంతో చాలక, రోగిని తృప్తిపరచడానికి వైద్యుడు చక్కెరపాకం చేసే ఔషధం లాగా అయిపోయింది. “అప్పుడు మనిషికి నిజమైన ఆధ్యాత్మికానందం కలుగుతుంది… ఇప్పుడు ఈ ఉదాహరణ చూడరాదా? నేను మీతో ప్రసంగించి, దివ్యమైన మీ సంభాషణ వినే మహత్తర అవకాశం, మహద్భాగ్యం కూడా అనవచ్చు…”

“ఇంకా నయం! నా సంభాషణే చెప్పారూ? నేను కేవలం అనామకుణ్ణి తప్ప మరొకటి కాదు” అన్నాడు చిచీకవ్.

“పావెల్ ఇవానొవిచ్, నేను యదార్థం చెబుతున్నాను. మీ గుణగణాలలో ఏ కొంచం నాకు అబ్బినా నా ఆస్తిలో సగం ఇచ్చుకుంటాను!”

“మీరలా అంటున్నారు గాని, నామటుకు నేను అన్నిటికన్న కోరేదేమిటంటే…”

ఈ పరస్పరారాధన ఇలా ఎంత దూరం వెళ్ళేదో తెలీదు, నౌకరు వచ్చి భోజనం సిద్ధమయిందని చెప్పాడు.

“భోజనానికి లేవండి. మీరు గొప్ప పట్టణాలలో గొప్ప స్థలాలలో విందులు చేసిన వారు, మీకు మా భోజనం నచ్చకపోతే క్షమించాలి; మేం తాగేది కాబేజి సూపే అయినా దాన్ని ఆప్యాయంగా ఇస్తాం. దయచేసి లోపలికి పదండి.” అన్నాడు మానిలవ్.

ఎవరు ముందు వెళ్ళాలన్న విషయమై మళ్ళీ కాస్సేపు ఘర్షణ పడ్డాక చిచీకవ్ అడ్డంగా భోజనశాలలో ప్రవేశించాడు.

భోజనాల గదిలో అదివరకే ఇద్దరు పిల్లలున్నారు, వారు మానిలవ్ కొడుకులు. వాళ్ళకు బల్ల దగ్గర కూచుని తినదగిన ఈడు వచ్చినా ఎత్తుకుర్చీల మీద కూచోవలసిన అవసరం తప్పలేదు. వారి వెంట వారికి చదువు చెప్పే పంతులు కూడా ఉన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ మర్యాదగా వంగాడు. ఇంటి యజమానురాలు సూప్ ముందు పెట్టుకు కూచున్నది. అతిథిని భార్యాభర్తల మధ్య కూచోబెట్టారు, ఒక నౌకరు పిల్లల మెడకు నాప్కిన్లు కట్టాడు.

చిచీకవ్ పిల్లల కేసి చూస్తూ, “ఎంత ముచ్చటైన పిల్లలు! వీళ్ళ వయసెంత?”, అన్నాడు.

“పెద్దవాడికి ఎనిమిదేళ్ళు, రెండోవాడికి నిన్ననే ఆరు నిండాయి”, అన్నది మానిలవ్ సతి.

నౌకరు చూడక గడ్డం మీదగా కట్టిన నాప్కిన్ నుంచి గడ్డాన్ని బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న తన పెద్దకొడుకును మానిలవ్, “తెమిస్టోక్లస్” అని సంబోధించాడు. ఇలాటి గ్రీస్ నామధేయం – తెమిస్టోక్లిస్ అని ఉండవలసినదాన్ని మానిలవ్ తెమిస్టోక్లస్ గా మార్చాడు – చెవిని బడగానే చిచీకవ్ కనుబొమలు ఆశ్చర్యంతో పైకెత్తి వెంటనే మామూలు మొహం పెట్టటానికి ప్రయత్నించాడు.

“తెమిస్టోక్లస్! ఫ్రాన్సు దేశంలోకెల్లా అందమైన దేశం ఏది?”

ఈ ప్రశ్న వినగానే పంతులు తన శ్రద్ధనంతా తెమిస్టోక్లస్ పై కేంద్రీకరించి వాడి మొహంలోకి దూకబోయేవాడిలాగా కనిపించాడు, కాని తెమిస్టోక్లస్ “పారిస్” అని సమాధానం చెప్పినాక తృప్తిపడి తల ఆడించాడు.

“మన దేశంలోకల్లా అందమైన నగరం ఏది?” అని మానిలవ్ మళ్లీ అడిగాడు.

“పీటర్స్ బర్గు” అని తెమిస్టోక్లస్ సమాధానమిచ్చాడు.

“ఇంకేదైనా ఉన్నదా?”

“మాస్కో” అన్నాడు తెమిస్టోక్లస్.

“చురుకైనవాడు, చిట్టితండ్రి!” అన్నాడు చిచీకవ్. అతను మానిలవ్ దంపతులకేసి తిరిగి, ఆశ్చర్యం అభినయిస్తూ, “ఈ ఈడుకే ఈ విషయాలన్నీ తెలుసునే! ఈ కుర్రవాడు పైకి వస్తాడు, చూస్తూండండి” అన్నాడు.
—————

-కొడవటిగంటి కుటుంబరావు

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.