సెప్టెంబరు మెరుపు గడిపై మీ అభిప్రాయాలు

సెప్టెంబరు మెరుపు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 ఆగస్టు గడి, సమాధానాలు
2. 2008 జూలై గడి, సమాధానాలు
3. 2008 జూన్ గడి, సమాధానాలు
4. 2008 మే గడి, సమాధానాలు
5. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
6. 2008 మార్చి గడి, సమాధానాలు
7. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
8. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
9. 2007 నవంబరు గడి, సమాధానాలు
10. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
11. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
12. 2007 జూలై గడి, సమాధానాలు
13. 2007 జూన్ గడి, సమాధానాలు
14. 2007 మే గడి, సమాధానాలు 4
15. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
16. 2007 మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | Comments Off on సెప్టెంబరు మెరుపు గడిపై మీ అభిప్రాయాలు

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 1

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

మీకు పురాణ సాహిత్య పరిచయం కలిగించిన మీ నాన్న లక్ష్మి రెడ్డి గారి గురించి, అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా?

మా నాన్న అచ్చమైన మెట్టరైతు. వాన చినుకుల్ని నమ్ముకొని మెరకో బరకో దున్నుకు బతికే సన్నరైతు. మట్టిలో విత్తి, మొలకల్ని పైరుజేసి, పంటను ఇంటికి తెచ్చుకునేందుకు ఆయన దారుణమైన శారీరక శ్రమ చేసేవాడు. ఒక ఏడాది వానలు కురిస్తే, మరో మూడేళ్లు కరువులు తాండవమాడే సీమ గడ్డ మీద కేవలం వానను నమ్ముకొని భూమిని దున్నుకొని బతికేందుకు ఎన్ని అగచాట్లు పడాలో మెట్టరైతుకు మాత్రమే తెలుసు. మా అమ్మ కూడా మా నాన్నతోటి రెక్కలు ముక్కలు చేసికొని కష్టపడేది. తన కోపు ఏమాత్రం వెనకబడకుండా లాగేది. పొలంపని, ఇంటిపని, పిల్లల్ని సాకేపని.. ఒకటేమిటి?… ఆమె జీవితమంతా తీరిక లేకుండానే గడిపింది.

ఎంతలావు శారీరక కష్టం జేస్తోన్నా నాన్న తత్వం ప్రత్యేకం. పనికి పనికి మధ్య ఏమాత్రం విరామం దొరికినా అందరిలా వీధరుగులెక్కి పులిజూదాలూ, బారాకట్టలూ, పొద్దుబోని కబుర్లతో గడిపేవాడు కాదు. రంగనాథ రామాయణాన్ని చేతబట్టుకొనేవాడు. శ్రావ్యంగా చదువుతూ తనచుట్టూ కూచున్నవాళ్లకు అర్థం చెప్పేవాడు. నేను పుట్టక ముందునుంచి కూడా మాయింట్లో వ్యావసాయిక జీవితం నేపథ్యంగా యీ సాహిత్య వాతావరణం కూడా వుండేది. అక్షరజ్ఞానం వున్న చాలామంది రాయలసీమ రైతుల ఇళ్లల్లో లాగే మా యింట్లో కూడా పురాణ గ్రంథాలు వుండేవి.

అలాగని మానాన్న పాఠశాల చదువులేమీ చదువుకోలేదు. గొర్రెల వెంట, బర్రెల వెంట, పొలాల గట్ల వెంట ఆయన బాల్యం నలిగిపోయింది. భట్రాజుల వద్ద ఇసకలో వేళ్లు దిద్ది చదువుకొనే తోటి పిల్లల సహవాసం, చదువుపట్ల ఆయనలో ఏదో ఆసక్తిని రేపింది. తీరిక సమయాన్ని వాళ్లు ఆటలు పాటలుగా మలచుకొంటున్నపుడు తను అక్షరాల్ని గురించి తెలిసికొనేందుకు ప్రయత్నించాడు. నేర్చుకొన్న అక్షరాల్ని గొర్రెలవెంట వెళ్లినపుడు కొండబండల్ని పలకలుగా దిద్దుకొన్నాడు. బొట్టెకట్టెని బలపంగా మార్చి దుమ్ము నేలల మీద గుణింతాల్ని అధ్యయనం చేశాడు. దమ్మిడి దమ్మిడిగా కూడుకొన్న ఆయన శ్రమఫలం రంగనాథ రామాయణమై వచ్చి ఆయన చేతుల్లో కుదురుకొంది. పొలాలెంట, కొండలెంట గొర్ల కాపరిదనం రామాయణ పారాయణమై సాగింది. రంగనాథ రామాయణం కంఠతా వచ్చేసరికి ఆయనకు తెలుగు భాషాస్వరూపం కూడా తెలిసి వచ్చింది.

పెళ్లి ఆయన జీవితాన్ని బాలరాజుపల్లెకు చేర్చి వ్యవసాయదారునిగా మార్చినపుడు జానెడు కడుపు నింపుకొనేందుకు కరవులతో పోరాడుతూనే రంగనాథ రామాయణాన్ని జనం మధ్యకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. తిండిగింజలు తప్ప అక్షరాల్ని పండించుకోవటం తెలీని గ్రామస్తుల్ని రాత్రిళ్లు దేవాలయం లోకి చేర్చి గ్రంథపఠనం ప్రారంభించాడు. రమారమి యాభై సంవత్సరాల పాటు గ్రామస్తుల్నంతా ఒకచోట చేర్చి, వాళ్ల హృదయాలన్నిట్నీ ఒకే విషయం మీద లగ్నం చేయించటం ఒక అపురూప దృశ్యం. కావ్యభాష లోని రామాయణాన్ని మా పల్లె మాటల్లోకి తెచ్చి, రామునినోటా సీతనోటా మావూరి పలుకుబళ్లనే పలికించటం మాకు ముచ్చటగా అనిపించేది. పురాణ పాత్రలు కూడా మాలాగే మాట్లాడటం, ఆవేశపడటం, ఏడ్వటం వల్ల ఆ పాత్రలు మాకు బాగా మచ్చికయ్యాయి.

నేను బడిలో అడుగుపెట్టి అక్షరాలు కలబలుక్కొని గుణింతం సాధన చేస్తున్నపుడే మానాన్న రంగనాథ రామాయణాన్ని నా చేతబెట్టాడు. రామాయణం ద్వారానే నేను అక్షరాల్ని, పదాల్ని, వాక్యాల్ని చదవటానికి అలవాటు పడ్డాను. ఐదవ తరగతి దాటేసరికి ఆ ద్విపద కావ్యాన్ని స్వంతంగా చదివి చాలావరకు అర్థం చేసికొనేవాణ్ని. ఆ క్రమంలో నన్ను కూడా దేవాలయం ఎక్కించేవాడు నాన్న. నేను చదువుతూ వుంటే ఆయన అర్థం చెప్పేవాడు.

నన్నెప్పుడూ చదువుకొమ్మని పోరుతుండేవాడు ఆయన. వ్యవసాయ పనులు చెప్పేవాడు కాదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా బడికే పొమ్మనేవాడు. ఆయన కళ్లెదుట నేనెప్పుడూ పుస్తకం చేతబట్టుకొని వుండాలి. పాఠ్యపుస్తకాలు ఎంతసేపని చదవాలి? అందుకే కథల పుస్తకాలు, నవలలు తోడయ్యాయి. క్రమేణా నా ప్రపంచం అదే అయ్యింది. విపరీతంగా చదవటం అనేది రాయటానికి దారితీసింది. మొదట పద్యాలు రాశాను. తర్వాత కవితలు.. కథలు… నవలలూ….

1987 లో సాహితీ సృజన మొదలుపెట్టక ముందు సాహిత్యంలో మీకుగల పరిచయమెట్టిది? మొదటగా మీరు కవిత్వాన్నెందుకు ఎంచుకున్నారు? తర్వాత ఏ పరిస్థితుల్లో కథలవైపు, ఆ తర్వాత నవలల వైపు మీ దృష్టిని సారించారు?

రాయటం అనే ప్రక్రియ నన్ను చిన్నతనంలోనే ఆకర్షించింది. ఆరు ఏడు తరగతులు చదివేటపుడే రాత్రిళ్లు గుడి ముంగిట పిచ్చిగుంట్లు చెప్పిన అల్లిరాణికథ వగైరాల్ని పగలంతా కూచుని నాదైన భాషలో కథగా రాసేవాణ్ని. అప్పటికే నాకు చందమామ, బొమ్మరిల్లు లాంటి కథల పత్రికలతో పరిచయం ఉండేది. అపూర్వ చింతామణి, భట్టి విక్రమార్క లాంటి పుస్తకాల్ని అంతులేని ఆపేక్షతో చదివి వున్నాను. జయరామిరెడ్డి అనే ఓ మిత్రుడు తెచ్చే డిటెక్టివ్ నవలల్ని క్లాసు పుస్తకాల మధ్య పెట్టుకొని దొంగతనంగా చదువుతుండేవాణ్ని. అందువల్ల మౌఖిక కథల్ని అక్షరాల్లోకి అనువదించాలనే తపన కలిగేది. రామాయణ భారతాలు చదివి చదివి పద్యాల నడక ఏదో నాకు అర్థమై, ఏడవతరగతి పరీక్షలు రాసిన తదుపరి వేసవి సెలవుల్లో సీసపు నడకలతో ఓ పద్యం కూర్చాను. సంసార విషయాలు పట్టించుకోకుండా పోరంబోకుగా తిరిగే మా బావను గురించిన పద్యం అది. ఎనిమిదవ తరగతి ప్రారంభంలోనే ఛందస్సు గురించి తెలిసికొన్న తర్వాత నేను రాసిన పద్యాన్ని సరిజూసికొంటే – నడక సరిపోయిందిగాని యతి ప్రాసల నియమాలు కుదరలేదు. తర్వాత పట్టుదల పెరిగి పదవ తరగతి దాటే లోపే ఐదొందలకు పైగా పద్యాలు రాశాను. వాటిలో కొన్ని పద్యాలు భారతిలో కూడా అచ్చయ్యాయి.

పల్లె వదిలి దగ్గరలోని పోరుమామిళ్లలో ఇంటర్మీడియెట్ చదివేటపుడు బాడుగపుస్తకాల షాపుల్లోని డిటెక్టివ్ నవలా సాహిత్యం నన్నాకర్షించింది. విపరీతంగా చదివాను. ఆ సమయంలోనే లైబ్రరీల్లో వారపత్రికలు కూడా పరిచయమయ్యాయి. పోటీల్లో బహుమతులు పొందిన కథలు నన్నాకట్టుకొన్నాయిగాని కథలేమీ రాయలేదు. ఎందుకంటే – ఆ కథల గురించీ, వాటి ప్రాశస్త్యాన్ని గురించీ నాకు వివరించిన వాళ్లు లేరు.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - దాదా హయత్

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - దాదా హయత్


నెల్లూరు వి.ఆర్ కళాశాలలో డిగ్రీ చదివే మూడేళ్లు యద్దనపూడి, యండమూరి, మధుబాబు లాంటి వాళ్ల సాహిత్యంతో బాటు వెంకట్రామ అండ్‌కోలో దొరికే తెలుగు ప్రబంధాలన్నీ చదివాను. డిగ్రీ తర్వాత దొరికిన తీరిక సమయం నన్ను ఆధునిక సాహిత్యం కేసి మరల్చింది. పోరుమామిళ్ల సాహితీ మిత్రులతో కలిసి చలం, శేషేంద్ర, సినారె, నగ్నముని, శ్రీశ్రీ, ఆరుద్ర, వడ్డెర చండీదాస్, శివారెడ్డి, గాలి నాసరరెడ్డి వగైరాల సాహిత్యాన్ని పరిచయం చేసికొన్నాం. ముఖ్యంగా చలం కథలు, మ్యూజింగ్స్, ఉత్తరాలు, అమరావతి కథలు, తెన్నేటి సూరి ఛంఘిజ్ ఖాన్, టాం మామ ఇల్లు, జమీల్యా, తల్లి భూదేవి వగైరాలు నన్ను వెంటాడి వేధించాయి. వెరయిటీ మాసపత్రిక అనుకొంటాను.. అందులో మపాసా గారి అనువాద నవల ‘దిబ్బ కొవ్వు’ నన్నెంతో ప్రభావితం చేసింది. అప్పుడే కొకు ను, శ్రీపాదను కూడా కొంతవరకు పరిచయం చేసికొన్నట్టు గుర్తు. ఆ సమయంలోనే నాకు వివిధ వార, మాస పత్రికల పరిచయం జరిగింది. అందులో కథల పోటీల్లో గెలుపొందిన కథలు నన్ను బాగా ఆకర్షించాయి. అవి మా జీవితాలకు దగ్గరగా ఉన్నవిగా అన్పించాయి. అలాంటి కథల్ని నేను కూడా రాయగలనేమో అన్పించింది.

కానీ నేను మొదట సమకాలీన కవిత్వం కేసే మొగ్గాను. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ వారం కవితగా ప్రచురణ కావటం కవికి ఒక సర్టిఫికెట్‌లా ఉండేది. నేను ఒకటి రెండు కవితలకే ఈ లక్ష్యాన్ని సాధించాను. చిన్నప్పట్నుంచి ఛందోబద్ధ పద్యాల్లో నలిగినవాణ్ని కాబట్టి కవిత్వాన్నే నా వాహికగా చేసికొన్నాను. బడి, నేను తను, మౌనఘోష, బడి పిల్లలు వగైరా కవితలతో కవుల లోకంలో పడ్డాను.

మంచి కవిత్వం రాస్తూ ఉన్నా, నాలో ఏదో అసంతృప్తి. నాకు తెలిసిన జీవితాన్ని అందులో సమగ్రంగా చెప్పలేక పోతున్నాననే లోటు. మొదట్నుంచి పురాణాలతో పరిచయం ఉన్నవాణ్ని. కథ, కవిత్వం కలగలిసిన ప్రక్రియ ఆ కావ్యాలు. నేను కవిత్వమే చెబుతున్నానుగాని కథ చెప్పలేక పోతున్నాననే అసంతృప్తి. అదిగో… ఆ వేదనే నాచేత కథ రాయించింది. నాకు తెలిసిన సంఘటనల్నే కథలుగా మలిచాను. కవిత్వంలో చెప్పలేని ఎన్నో విషయాల్ని కథలో చెప్పగలిగాను. కథలో చెప్పలేని జీవితాల్ని నవలల్లో చెప్పేందుకు ప్రయత్నించాను.

మీకు ఆధునిక సాహిత్యంతో పరిచయం ఎప్పుడు, ఎలా కలిగింది?

కనిపించిన పుస్తకాన్నంతా చదవటం అనే అలవాటులో నాకు తెలీకుండానే ఆధునిక సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. అది నా ఇంటర్మీడియెట్ రోజుల్లోనే అయి ఉండొచ్చు. అంతేగాని ఎవ్వరూ నాకు పనిగట్టుకొని ప్రత్యేకంగా చెప్పిన వాళ్లు లేరు. రోజూ చూస్తోన్న పత్రికల్లోంచి నేను గుర్తుంచుకోవటం వల్ల ఆ సన్నివేశం జరిగి వుండొచ్చు.

మీరు ఎటువంటి అంశాలను కవితలుగా రాస్తారు? ఎలాంటి అంశాలను కథలుగా రాస్తారు?

కవితలకూ కథలకూ ప్రత్యేక అంశాలంటూ ఎమీ వుండవు. హృదయాన్ని స్పందింపజేసిన అంశం, పదిమందికీ దాన్ని గురించి తెలియజెప్పాల్సిన ప్రత్యేకత కలిగిన అంశాన్ని మన స్పందన స్థాయిలోనే పాఠకుడు కూడా స్పందించేలా రాసే క్రమంలో అది కవితగానో, కథగానో రూపుదిద్దికొంటుంది.

———————-

రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

Posted in వ్యాసం | Tagged | 4 Comments

అగష్టు గడి ఫలితాలు, వివరణ.

– కొవ్వలి సత్యసాయి

భైరవభట్ల కామేశ్వరరావు. 1 తప్పుతో,
శ్రీరాఘవ కిరణ్ 2 తప్పులతో,
ఆదిత్య 4 తప్పులతో,
మల్లంపల్లి 6 తప్పులతో పూరించారు. ఆరు కంటే ఎక్కువ తప్పులతో నలుగురు పూరించారు.

వివరణలు

1 విం 2 జా 3 మ 4 రా X 5 డి 6 గ X 7 ది X X 8 ని
9 శ ను గం 10 గా X X 11 ము ప్పు
తి X 12 న రా నా X జు X X 13 ని
X X 14 కా X X 15 ఎ క్షన్ 16 ప్ర మా ణం
17 అ X 18 మ భూ X 19 బృ X కృ X 20 మ ణి X
X 21 రా X 22 హ రే ష్ణ 23 కృ X 24 క్యం 25 ఐ
26 డు 27 అ జు ణు X న్నా X 28 య్య 29 ద X దు
30 ఆ ది డా X 31 ర వి X X గు X
మె X 32 అ X 33 బం దీ X 34 తం 35 ర ణిం గు X
X 36 చ 37 కం X 38 యం 39 త్ర పా తి తం X 40 నం
41 గో X 42 ర చె X X యో సా X
43 న ల్ల ర్ల రో డ్డు X 44 ప్రా రం భం X 45 స

ఆధారాలు – అడ్డం

1.వింజామరా. విసనకర్రా అని దీర్ఘం తీయడం వల్ల పూరణలో దీర్ఘం పెట్టాలి.
5.డిగ. డిం డిం డిగా డిగ – మీరు ఇప్పుడు చేస్తున్నదేమిటో వ్రాయండి. తికమకయిపోండి. మీరు చేస్తున్నది గడి కదా.తిరగేయండి.
7.ది. తేదీ ముందు ది. అని వ్రాస్తాం కదా.తెలుగులో తేదీ ముందు రాసే అక్షరం. 39 తో కలిస్తే ఒక రోజు అవుతుంది.
9.శమదమమనుగంగ. దమశమమనుగంగ స్నానము సుఖమాఅని కదా త్యాగయ్య పాడింది.దశ ల స్థానాలు మార్చాం.అయినా ఇలాంటి నదిలో స్నానం బెటరా రాముని సన్నిధి బెటరా అని త్యాగయ్య గారికి డౌటే డౌటు. కాబట్టి శమదమ అని రాసాం.
11.ముప్పు.ఆపద. ముంపు లాగా వస్తే ఆగదు. సూచనగా ముంపు అని వాడాం.
12.నజరానా. అంటే కానుక. హే రాజనాలానాకొచ్చిన కానుక మీద నీ నజర్ X న రఖ్.
13.నిక.సలీం, అనార్కలి (ముస్లింల) పెళ్ళి నిశ్చయతాంబూలాన్ని ఇలాగే అంటారు.
14.కాజ. కాకినాడ దీనికే కదా ప్రసిద్ధి.
15.ఎలక్షన్ ప్రమాణం. ఈ ప్రామిస్సు కేవలం గెలవడం కోసమే- తీర్చడంకోసం కాదుకదా.
18.మభూ. భూమా ఆళ్ళగడ్డ ఫాక్షన్ లీడరింటి పేరు కదా. భయం తో అటూ ఇటూ అయిపోవాలా అంటే తిరగేయడమే కదా.
20.మణి. దేవీభాగవతంలో మణి ద్వీపవర్ణన ఉంది.
21.రాష. షరా = అనుబంధం అని. షరా మామూలే అంటాం కదా..
22.హరేష్ణకృ.ప్రభుపాదుల మతం హరేకృష్ణమతం కదా.పరదేశీయుల నోట్లో ప్రభువు నామం అటూ యిటూ అయిపోయింది – అంటే అక్షరాలు తారుమారయాయని.
24.క్యంఐ. ఒకటైపోవాలంటే ఐక్యం అవాలి కదా. అటువాళ్ళిటూ, ఇటువాళ్ళటూ అయిపోవాలి అంటే తిరగేయడం.
26.డుఅజుణు.తమ్ముడంటే అనుజుడు. .ఆటమిక్ శక్తి వల్ల చెల్లాచెదురై పోయాడు అంటే ను బదులు ణు పెట్టి అక్షరక్రమం మార్చమని..
28.య్యపద. గాజుల కృష్ణయ్య చేతులు పట్టుకుని గాజులెయేయాలికానీ పయ్యద కాదుగా.
30.ఆది. అంజలీదేవి మొగుడు ఆదినారాయణ కదా.
31.రవి. సూర్యుడు. విరహంలో ఉన్నాడు.
33.బందీ అంటే నిర్బంధం కదా.
34.తంరణింగు.– రరారిరీ క్రమం తప్పి రీ, ర, రి, రా అయినట్లు రగుణింతం కూడామారింది.
36.చమకం. నమకానికి ద్వంద్వం. చమక్ అంటే మెరవడమేకదా.
42.యంత్రపాతితం.జంతికలగొట్టం యంత్రమేకదా. దాంట్లోంచి పడేది పాతితం
43.రచె. చెరఅటూఇటూ అయింది కదా. 37 నిలువాయన రామదాసు
43.నల్లజర్ల రోడ్డు తిలక్ కథలో అడవి ప్రయాణంలో జరిగిన సంఘటన వర్ణించేడు కదా.
44.ప్రారంభం అంటేమొదలు కదా.అందులో రంభ లేదా

ఆధారాలు – నిలువు

1.వింశతి అంటే ఇరవై.
2.జామ. వింజామరలో ఉన్న పండు అదే కదా
3.మదన కామరాజు. మన్మధుడి రెండు పేర్లు తనలోనే ఉన్న రాజు – కమల్ హసన్ చాలా ఏళ్ళక్రితం
4.రామరాజభూషణుడా. అష్టదిగ్గజాల్లో ఆయన కూడా ఒకడు. ఆయనకిసంగీతరహస్యాలు తెలుసు.
5.డినునా. వెనక్కి చదవండి. నుడి అంటే పలుకు, నానుడి అంటే సామెత.
6.గగం.గంగ ని కిందనుండి పైకిరాసాం. 9 అడ్డంలో కూడా గంగ ఉంది.
8.నిప్పుకణం. నిప్పుకి చెద పట్టదనికదా నానుడి. అగ్ని సర్వభక్షకం.
10.గాజుల కృష్ణయ్య. మలారం మోసుకుంటూ వీధుల్లో వచ్చే కిట్టయ్య.చదువుకున్న వాడిలాగే కృష్ణయ్య అని రాసుకున్నాడు.
11. మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కధల గురించి చెప్పేదేముంది..
16.ప్రమ. భ్రమలా ఉంది కదా. అర్ధం – యదార్ధజ్ఞానం అని.
17.అతడూ, ఆమె.హీ, షి. సాహెబ్, బీబీ అంటే అదేకదా.
19.బృహన్నారదీయం. పొగతాగని వాడు దున్నపోతై పుడతాడని ఒక ఆశ్వాశంలో చెప్పబడిందని వెంకటేశ్వర్లు గురువు గిరీశం కన్యాశుల్కం లో చెప్పాడు కదా
23.కృప. ద్రోణుడి బావమరిది కృపాచార్యడిలో ఉండే సుగుణం కృప.
25.ఐదువ. మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు అని ఐదు ఉన్న స్త్రీ.
27.అది. ఇది కాదే. అంటే అదేకదా
29.దగుణింతం. ద, దా, ది, దీ, దు, దూ,……………… దో …….
32. అమరజ. గాణ్గాపూరులో భీమా నదితో కలుస్తుంది
34.తంపా. . పాతకం అంటే పాతం. తిరగబడడమే పతనం.
35.రతిసారం. జయదేవుడి అష్టపది రతి సుఖ సారే – గతమభిసారే …..గుర్తుకొచ్చిందిగా.
37.కంచెర్ల. పాహి రామాప్రభో అని ప్రాధేయపడిన రామదాసు గారి ఇంటిపేరు ఇదే.
39.త్రయోదశి. తిధుల్లో వరుసగా వచ్చే 3వ దశి.
40.నం. 7 ది కూడితే నంది. శివుడి వాహనం.
41.గోనగన్నారెడ్డి ఇంటిపేరుతో సహా ప్రసిద్ధుడు కదా.
45..సప్తస్వరాల్లో మొదటిది షడ్జం

Posted in గడి | Tagged | Comments Off on అగష్టు గడి ఫలితాలు, వివరణ.

కైవల్యం

– టి. శ్రీవల్లీ రాధిక

సగం సగం ఆత్మల్ని
సంపూర్ణ శరీరాలలో నింపి
దేవుడు వేడుక చూస్తుంటాడు

మనుషుల్ని ఒకచోట
మనసుల్ని మరోచోట విసిరేసి
మరణించేలోపల వెతుక్కోమంటాడు.

పున్నమి రోజునా సగం చంద్రుడే
కనిపిస్తూన్నపుడూ
యుగళగీతాలలోనూ ఒక్క స్వరమే
వినిపిస్తూన్నపుడూ
ఆ విషయం మనకి అర్ధమవుతుంది

మనదైన మరోసగం కోసం
వయో లింగ బేధాలూ
జాతిమత వైరుధ్యాలూ లెక్కచేయని
అన్వేషణ మొదలవుతుంది.

భూగోళం మొత్తాన్నీ
ఓ అరచేతిలో నిలిపి
భూతద్దం మరో చేతికి యిచ్చినా
కనులతో దానిని కనిపెట్టలేమని
త్వరలోనే తెలుస్తుంది

భూమ్యాకాశాలని
చాపలా చుట్టే సామర్ధ్యం సాధించినా
చేతులతో దానిని అందుకోలేమని
క్రమంగా అవగతమవుతుంది.

ఆతర్వాతే అసలు నరకం
మొదలవుతుంది
రొజురోజుకీ దగ్గరవుతున్న ప్రపంచం
మనకుమాత్రం అనంత శూన్యంగా
అగుపిస్తుంది

అన్నీ తెలిసిన భాషలే
అయినా మాటలు అర్ధం కావు
మళ్ళీ మళ్ళీ చూసిన మొహాలే
అయినా మనసులో నిలబడవు

రోజు తర్వాత రోజు గడుస్తూ వుంటుంది
మనసు చుట్టూ గోడ మరింత గట్టిపడుతుంది
కళ్ళనుంచి అపుడో చుక్క అపుడో చుక్క
తడబడుతూ రాలుతుంటుంది

కళ్ళు మూసే లోపల కలుసుకోలేని నేస్తం కో్సం
గుండె గుక్క పడుతుంది
మరెవరికీ కనబడని ఈ వైకల్యం
మనల్ని నిర్వీర్యం చేస్తుంటుంది

మనం అసహాయంగా చూస్తుండగానే అది
మెల్లమెల్లగా మనల్ని కబళిస్తుంది

—————————-

టి. శ్రీవల్లీ రాధిక హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. “రేవు చూడని నావ” అనే కవితాసంపుటి, “మహార్ణవం”, “ఆలోచన అమృతం” అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువాదమై “మిత్‌వా” అనే పుస్తకంగా వచ్చాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలోకి అనువదింపబడ్డాయి. “నా స్నేహితుడు” అనే కథకు 1994 లో “కథ” అవార్డు అందుకున్నారు. మహార్ణవం అనే పేరుతో బ్లాగు రాస్తూంటారు.

Posted in కవిత్వం | Tagged | 22 Comments

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ

చిన్న వయసులోనే సాహితీప్రస్థానం ప్రారంభించిన ఆయన తన సుదీర్ఘ ప్రయాణంలో మలుపులెన్నో తిరిగినవాడు, మెట్లెన్నో ఎక్కిన వాడు.
ఎన్ని సాహితీప్రక్రియలు చేపట్టినా అన్నిటిలో తన విశిష్టతను విస్పష్టంగా చాటినవాడు.
కరువు పల్లెల బడుగుజీవుల వెతల్ని తన కళ్లలో నింపుకొన్నవాడు,
“మట్టి రుచి తెలిసిన జీవితాల సారాంశమే నా సాహిత్యంగా రూపుదిద్దుకొంద”న్నవాడు,
కవిత మర్మం తెలిసినవాడు,
తెలుగు కథాసాహిత్యానికి ఒక సరి”కొత్త దుప్పటి“ని కానుకగా ఇచ్చిన కథల నేతగాడు,
ఒక్క వాన చాలునంటూ చినుకుల సవ్వడితో నవలాసేద్యానికి కాడి పట్టి పాండవబీడులో సజీవపాత్రల తోలుబొమ్మలాటను రక్తికట్టించినవాడు, పాలెగాండ్రసీమలో పాలెగత్తెల, వీరనారుల గుండెగొంతుకలను ఆలకించినవాడు,
ప్రసిద్ధుల చేత “మన కాలపు మహారచయిత” అనిపించుకున్నవాడు – ఆయన పేరు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

కొత్త దుప్పటి పుస్తకం ఆవిష్కరణ సమయంలో నందలూరులో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఆర్.కే.నారాయణ్ రచనలకు కేంద్రం మాల్గుడి అనే ఒక కల్పిత గ్రామమైతే దాదాపు వెంకట్రామిరెడ్డి రచనలన్నిటికీ కేంద్రం కడప జిల్లాలోని బాలరాజుపల్లె అనే ఒక మారుమూల గ్రామం. ఆయన రచనలు చదివినవాళ్ళకు వెంటనే ఒకసారి ఆ బాలరాజుపల్లెకు వెళ్ళాలనీ, అక్కడి “కొండలూ కోనలూ, వాగులూ వంకలూ, చెరువులూ కుంటలూ, కాలువలూ గుండాలూ, చెట్లూ చేమలూ, మెరకలూ బరకలూ, గడ్డీ గాదమూ, గొడ్డూ గోదా, పిట్టతలూ గిట్టలూ, పైర్లూ, పచ్చలూ, వానా వంగిడీ, తిండీ తిప్పలూ, కులాలూ గిలాలూ, కరువులూ కాటకాలూ, కక్షలూ కార్పణ్యాలూ, మంచీ చెడూ, ఆటలూ పాటలూ” కనులారా చూడాలనీ, “భాషా యాసా” చెవులారా వినాలనీ, అక్కడి వంటలు తినాలనీ, ఆ ఊరి పక్కనే ఉన్న జ్యోతివాగు జేడెల్లో కలియదిరగాలని, ఆ మనుషులను, ఆ గొడ్డూగోదాను, పాడీ పంటలను ఒక్కసారి పలకరించి రావాలనీ, పరవశించి పోవాలనీ బలంగా అనిపిస్తుంది. జిల్లా కేంద్రం నుంచి ఆ ఉరికి పోవాలంటే మూడు బస్సులు మారాలని, దూరం కంటే భారం జాస్తి అని తెలిసి ఆశ్చర్యమేస్తుంది.

రైతాంగానికి సంబంధించి బాధాకరమైన కఠోర వాస్తవాన్ని రచనల ద్వారా తెలపాలన్నదే తన ఆశయంగా సాహితీసేద్యం చేస్తున్న విశిష్ట రచయిత వెంకట రామిరెడ్డి.
అలాగని “బాధలు, కష్టాలు, కన్నీళ్లు సాహిత్యంగా మలవడం తన అభిమతం కాద”ని ప్రకటించినవాడు,
వృత్తి పరమైన బాధలు సున్నితమైన అనుబంధాలు, మమకారాలు, ఆత్మీయతలు ఎలా బీటలువారేలా చేస్తున్నాయో తన రచనల ద్వారా తెలియజేయాలనే సంకల్పమున్నవాడు,
రైతు బతుకు బాధల నేపథ్యంలో మానవ సంబంధాల చిత్రీకరణే ధ్యేయంగా గలవాడు.

రైతాంగ పరిణామక్రమాన్ని, మనిషి లోపలి విధ్వంసాన్ని, మార్పులను, తడబాట్లను పరిశీలిస్తూ వాటన్నిటినీ జాగ్రత్తగా ఏరుకుని తన రచనల్లో పదిలపరుస్తున్నవాడు,
పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని – వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి – ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్నవాడు,
తెలుగు భాషపై పెరుగుతోన్న ఇంగ్లీషు ప్రభావం గురించి, కనుమరుగైపోతోన్న తెలుగు పదాల గురించి, తెలుగు సామెతల గురించి, ఆవేదన చెందుతూ సంఘర్షిస్తున్న వాడు,
కట్టు కథలు, పెట్టు కథలు కాకుండా జీవితం కడుపును చీల్చుకుని వచ్చి జీవితం మీద ఉండే ఆపేక్ష నుంచి పుట్టిన పుట్టు కథలు మాత్రమే రాసే అచ్చమైన, అరుదైన, నిఖార్సైన గ్రామీణ కథకుడు,
గ్రామీణ జీవితంలోని ప్రతి పాయనూ ఒడుపుగా పట్టుకుని నేర్పుగా విశ్లేషించగల సమర్థుడైన కథకుడు,
జీవితం పట్ల ఏ భ్రమలూ కలిగించకుండా పాఠకుడిలో వాస్తవిక, సామాజిక దృక్పథాన్ని రగిలించగలిగినవాడు.

“ఎండిపోతున్న బతుకులకు” స్పందించే రవిగాంచని “చెమ్మగిల్లిన గుండెలను” తన కథల్లో చూపిన కవి.
ఇంతకాలం తన రచనల ద్వారానే మాట్లాడుతూ వచ్చిన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి అంతరంగ ఆవిష్కరణ తొలిసారిగా పొద్దులో ఇంటర్వ్యూ రూపంలో ఈ గురువారం నుండి ధారావాహికంగా రానుంది. తెలుగు భాష భవిష్యత్తు గురించి, తెలుగు సాహిత్యం గురించి ఆయన ఆలోచనలు చదివి మీ సందేహాలు, అభిప్రాయాలు, ఆలోచనలు తెలపండి.

Posted in వ్యాసం | Tagged | Comments Off on సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ

ఉపజాతి పద్యాలు – ౨

తేటగీతి

— ముక్కు శ్రీరాఘవకిరణ్

మొన్నటి వ్యాసంలో ఆటవెలదులు ఎలా వ్రాయాలో చర్చించుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆటవెలదుల్లోనే మాట్లాడుకుంటూ చర్చని కొనసాగిద్దామా? పూర్తిగా పద్యాల్లోనే ఎందుకు… నాకు గద్యం కూడా తెలుసంటారా? గద్యం కూడా వాడదాం. Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

మృతజీవులు – 21

కొడవటిగంటి కుటుంబరావు

అయిదవ ప్రకరణం

అయితే తన తప్పు ఒప్పుకోవటం రష్యనుకు ఏమాత్రమూ సరిపడదు గనక, దర్పంగా, “మరి నువో? అంత దూకుడుగా రావటం దేనికీ? నీ కళ్ళేమయాయీ? సారా దుకాణంలో కుదువబెట్టి వచ్చావా?” అని అడిగాడు.

మన కథానాయకునికి మటుకు ఇంకా దడగానేవున్నది. బండి మంచి వేగంతో పోతున్నది, త్వరలోనే అది నజ్‌ద్ర్యోవ్ ఎస్టేటు దాటింది. ఆ ఎస్టేటు పొలాలచాటునా, దారియొక్క ఎగుడు దిగుళ్ళ చాటునా మాయమైపోయింది కూడా. అయినా అతను, ఏ క్షణాన ఎవరు తనను తరుముకుంటూ వచ్చి పట్టుకుంటారోనని హడలిఫోయేవాడిలాగా వెనక్కు తిరిగి బెదురుతూ చూస్తూ వచ్చాడు. అతనికి శ్వాస యెంతో కష్టంగా ఆడుతున్నది. గుండెపైన చెయ్యి వేసుకుంటే అది పంజరంలో పక్షిలాగా దడదడలాడటం తెలియవచ్చింది. “మొత్తంమీద నాకు భలేగా చేశాడు! ఎలాటివాడంట!” ఆ తరవాత నజ్‌ద్ర్యోవ్ గురించి కోపంతో కూడిన తిట్లూ, శాపనార్థాలూ, ఆ మాటకు వస్తే కొన్ని అశ్లీలాలు కూడా వెలువడ్డాయి. లేకపోతే ఏమిటి? అసలే అతను రష్యను, పైన కోపంలో వున్నాడు. అదీగాక జరిగినది అల్లాటప్పా విషయం కాదు. “ఎంతైనా చెప్పు, సరిగా సమయానికి ఆ పోలీసుకాప్టనే రాకపోతే నాదీపం ఆరి ఉండేదే. నేను నీటిబుడగలాగా రూపుమాసిపోయి ఉండేవాణ్ణి, నాకు సంతతి లేకుండా పోయేది. నా ఆస్తీ, మర్యాదా పంచుకునేటందుకు పిల్లలు లేకుండా పొయ్యేవారు” అనుకున్నాడతను. మన కథానాయకుడికి తన సంతతిని గురించిన చింత జాస్తి.

సేలిఫాన్ కూడా, “ఆయన ఎంత దుష్టుడో! ఇంతకుముందు అలాటి పెద్దమనిషిని ఎన్నడూ చూడలేదు. మీద ఊసినా పాపం లేదు. మనిషినైనా మాడ్చుగాని గుర్రాలను మాడుస్తావా? గుర్రానికి గింజలిష్టం. అవి దానికి విందు, మనకు విందు చేసుకుంటే ఎంత ఆనందమో దానికీ అంతే” అనుకున్నాడు.

నజ్‌ద్ర్యోవ్‌ను గురించి గుర్రాలకు కూడా తేలిక భావమే ఏర్పడ్డట్టున్నది. ఎర్ర గుర్రమూ, అసిసరూ మాత్రమేగాక మచ్చల గుర్రానికి కూడా అసంతృప్తి కలిగినట్టున్నది. తన వంతుకు ఎప్పుడూ చచ్చుగింజలే వచ్చేవి, వాటిని కూడా సేలిఫాన్ ‘నీ దుంప తెగ ‘ అనకుండా వేసేవాడు, అయినా గింజలు గింజలేగాని ఎండుగడ్డి కాదుగా; అది వాటిని తృప్తిగా తిని, తన ప్రక్కనున్న గుర్రం దాణాలోకి మూతిపెట్టి చూసేది – ముఖ్యంగా సేలిఫాన్ గుర్రపుశాలలో లేనప్పుడు. కాని ఈసారి ఎండుగడ్డి తప్ప ఇంకేమీ లేదు, అన్యాయం! ఎవరికీ తృప్తి కలగలేదు.

అకస్మాత్తుగానూ, అనుకోకుండానూ అందరి అసంతృప్తి ఆలోచనలకూ అవాంతరం కలిగింది. ఆరు గుర్రాలు కట్టిన మరొక బండీ వచ్చి కొట్టుకున్నదాకా, ఆ బండీలోని ఆడంగులు కెవ్వుమని అరచటమూ, బండివాడి తిట్లూ, బెదిరింపులూ వినబడేదాకా ఎవరికీ – సేలిఫాన్‌కు కూడా – ఏమి జరిగినదీ తెలియనే తెలియదు. “ఛండాలుడా ‘కుడిపక్కకు పోరా పక్షీ ‘ అని గొంతు చించుకుని అరుస్తూంటినిగదా! తాగి ఉన్నావా?” అని రెండోబండివాడు అడిగాడు, తప్పు తనదేనని సేలిఫాన్ గ్రహించాడు. అయితే తన తప్పు ఒప్పుకోవటం రష్యనుకు ఏమాత్రమూ సరిపడదు గనక, దర్పంగా, “మరి నువో? అంత దూకుడుగా రావటం దేనికీ? నీ కళ్ళేమయాయీ? సారా దుకాణంలో కుదువబెట్టి వచ్చావా?” అని అడిగాడు. తరవాత వాడు తన గుర్రాలను వెనక్కు నడిపి విడిపించటానికి యత్నించాడు. కాని అది సాధ్యం కాలేదు – చిక్కు బాగా పడిపోయింది. మచ్చల గుర్రం తనకు రెండుపక్కలా నిలబడిన కొత్త నేస్తాలను మూచూసింది.

రెండో బండిలో వున్న స్త్రీలు భయపడుతూ జరిగేదంతా చూస్తున్నారు. వారిలో ఒకావిడ వృద్ధురాలు. రెండవది పదహారేళ్ళపిల్ల; బంగారం లాగా మెరిసే జుట్టు యెంతో అందంగా, యెంతో నేర్పుగా ఆమె తల చుట్టూ చుట్టి వున్నది. అందమైన ఆమె ముఖం కోడిగుడ్డులాంటి వంపులు కలిగివుండటమేగాక, అప్పుడే పెట్టిన గుడ్డును ఎండకు యెత్తి పట్టుకుని చూస్తే ఎలా కాంతివంతంగా కనిపిస్తుందో అలా కాంతివంతంగా కూడా వున్నది. ఆమె చెవుల వెనుక భాగాన పడి అవి కూడా ఎర్రగానూ, సుకుమారంగానూ కనిపిస్తున్నాయి. భయంతో తెరుచుకుని ఉన్న ఆమె పెదవులూ, భయంతో చెమర్చిన ఆమె కళ్ళూ ఎంత ఆక్ర్షణీయంగా ఉన్నాయంటే మన కథానాయకుడు చాలాసేపు ఆమెకేసి తేరిపారజూస్తూ గుర్రాలమధ్యా బండివాళ్ళమధ్యా జరిగే గల్లంతుకూడా గమనించలేదు. “వెనక్కు పోరా, నీఝ్నినొవొగొరోద్ పక్షీ” అని రెండో బండీ వాడు కేక పెట్టాడు. సేలిఫాన్ పగ్గాలను పట్టుకుని సత్తువకొద్దీ లాగాడు. రెండో బండివాడు కూడా అలాగే చేశాడు. గుర్రాలు ఒక్క అడుగు వెనక్కు వేశాయి. అవి పగ్గాల మీదుగా అడుగువేసేసరికి మళ్ళీ చిక్కుపడింది. ఒకవంక ఇదంతా జరుగుతూంటే మచ్చల గుర్రం తన కొత్త స్నేహితులను చూచి ఎంత సంతోషించిందంటే, దైవికంగా ఏర్పడిన ఈ తగలాటం నుంచి తన నేస్తం మెడకు ఆనించి దానితో ఏమీ అర్థం లేని రహస్యాలు చెప్పిందో ఏమో, ఆ రెండో గుర్రం తన చెవులు ఆపకుండా అటూ ఇటూ తిప్పసాగింది.

పిల్ల చాలా బాగుంది. కాని ఆమెలో ఉన్న బాగేమిటి? ఉన్న బాగల్లా ఏమిటంటే ఇప్పుడే స్కూలు నుంచో, కాలేజినుంచో బయటపడినట్టున్నది, ఇంకా ఆమెలో ఆడతనం అన్నది తలయెత్తలేదు, వాళ్లలో సహించరానిదల్లా అదే. ఇంకా అమాయకురాలు; ఆమెలో అంతా అమాయకత్వమే;

అదృష్టవశాత్తూ సమీపంలోనే గ్రామం ఉండటం చేత అక్కడి రైతులంతా సాయం వచ్చారు. జర్మనులకు పత్రికలూ క్లబ్బూ లాగే ఈ గ్రామస్తులకు ఇలాటి సంఘటనలు అన్నప్పుడల్లా దొరకవు. అందుచేత గ్రామంలో ముసలమ్మలనూ చిన్న పిల్లలనూ మాత్రమే వదిలి మిగిలినవాళ్ళంతా చక్కా వచ్చి బళ్ళ చుట్టూ మూగారు. పగ్గాలు విడిపించారు. ముక్కుమీద రెండుపోట్లు పొడిచాక మచ్చలగుర్రం వెనక్కు వెళ్ళింది. ఎలాగైతేనేం ఏ గుర్రాలకా గుర్రాలు వేరుపడిపోయాయి. కాని అవి, తమ మిత్రులనుంచి వేరుచేసినందుకు కోపం వచ్చో, బుద్ధి తక్కువచేతనోగాని, బండివాడు ఎంత కొట్టినా కదలక శిలల్లాగా నిలబడిపోయాయి. పల్లెటూరిజనం సానుభూతి వర్ణనాతీతం! ప్రతి ఒకడూ ఏదో ఒక సలహా ఇవ్వటం మొదలుపెట్టాడు. “ఆంద్ర్యూష్క, నువ్వ పగ్గపు గుర్రాన్ని కాస్త చూడరా, ఆ కుడిపక్కది, మీత్య మామను మధ్య గుర్రం మీద ఎక్కనీ! ఎక్కు మీత్య మామా!” మీత్యమామ, ఎర్రని గడ్డంగల సన్నటి, పొడుగుపాటివాడు మధ్య గుర్రంమీద ఎక్కి కూచుని ధ్వజస్థంభంలాగా ఉన్నాడు. బండివాడు గుర్రాలను కొట్టాడు, కాని ప్రయోజనం లేకపోయింది. మీత్యమామ వల్ల ఏమీ కాలేదు. “ఉండుండు నువు పగ్గపుగుర్రం మీదికో మీత్యమామా, మధ్య గుర్రం మీద మిన్యాయ్ మామను ఎక్కనీ” అని జనం అరిచారు. మిన్యాయ్ మామ భుజాలు విశాలంగా ఉన్నాయి, గడ్డం నల్లగా ఉన్నది, సంతల్లో చలికి వణికే జనం కోసం వేడి పానీయాలు కాచే బ్రహ్మాండమైన సమవార్ లాటి పొట్ట వేసుకుని వాడు మధ్య గుర్రం మీద ఎగిరి కూచునేసరికి అది కుంగిపోయి నేలను అంటుకున్నంతపని అయింది. “ఇహ ఫరవాలేదు, చురక తగిలించు. చురక తగిలించు. ఆ ఎర్రగుర్రాన్ని ఒకటి వెయ్యి. అది గజ్జెల గుర్రంలాగా ఆడిపోవాలి”. కాని ఎంత కొట్టి కూడా ప్రయోజనం లేకపోయేసరికి, మీత్య మామా, మన్యాయ్ మామ కూడా మధ్య గుర్రం మీద కూర్చుని, ఆంద్ర్యూష్కను పగ్గపు గుర్రం ఎక్కించారు. చిట్టచివరకు బండివాడు ప్రాణం విసిగి మామలందర్నీ తరిమేశాడు. ఇదీ మేలే అయింది, ఎందుకంటే గుర్రాలు ఒక మజిలీ నుంచి ఇంకో మజిలీకి ఒక్క గుక్కన పరుగెత్తి వచ్చినట్టుగా ముచ్చెమటలు పోసి ఉన్నాయి. ఒక్క నిముషం వాటికి విశ్రాంతి యిచ్చేసరికి అవి తమంతట తామే బయలుదేరాయి.

ఒక చెంప యిదంతా జరుగుతూంటే, చిచీకవ్ రెండోబండిలో ఉన్న అమ్మాయికేసి తదేకదీక్షతో చూశాడు. ఆమెతో మాట్లాడాలని యెన్నోసార్లు అనిపించింది, కాని ఎందుకో అతనికది సాధ్యం కాలేదు. అంతలోనే ఆ స్త్రీలు బండిలో వెళ్ళిపోయారు. ఆ అందమైన తలా, ముఖమూ, ఆ సన్నని నడుమూ చూస్తూండగానే అదృశ్యమై రోడ్డూ, బండీ, పాఠకుడికి పరిచితమైన మూడు గుర్రాలూ, సేలిఫానూ, చిచీకవూ బల్లపరుపుగా పరుచుకున్న పొలాలూ మిగిలాయి. జీవితంలో అంతటా -మొరటుగానూ, దుర్భర దారిద్ర్యంలోనూ, మురికి జీవితాలు గడిపే తక్కువవారిలోనైతేనేం, ఎక్కడికక్కడ బిగుసుకుపోయి, ఒకేరకం మానమర్యాదలు పాటించే ఎక్కువవారిలో నైతేనేం – ప్రతి తరగతిలోనూ మనిషికి జీవితంలో ఒకేసారి ఒక దివ్యమైన దృశ్యం అంతకు నుందెన్నడూ అనుభవంలోకి రానటువంటిది, కనిపించి ఒక్కసారిగా ఒక భావాన్ని రేకెత్తించేస్తుంది; ఆ భావం జీవితాంతందాకా నిలిచి ఉంటుంది. మోటుబళ్ళు తప్ప ఎరగని ఒక కుగ్రామం మీదుగా ఉన్నట్టుండి ఒక అందమైన బండి, తళతళా మెరిసే జీనుతో, అందమైన గుర్రాలతో, అద్దాల కిటికీలతో వేగంగా వెళ్ళిపోతుంది. ఆ తరవాత పల్లెటూరి బైతులు టోపీలు చేతుల్లోకి తీసుకుని, బండి కనుపించకుండా పోయిన తరవాత ఎంతోసేపు నోళ్ళు తెరుచుకుని చూస్తూ నిలబడతారు; అదేవిధంగా కష్టాలు అల్లిబిల్లిగా పెనవేసుకుని ఉండే ప్రతివాడి జీవితంలోనూ ఆనందం ఒక్కసారిగా తళుక్కున మెరుస్తుంది. మన కథలోకి ఈ పిల్ల అనుకోకుండా వచ్చి మాయమైపోవటం కూడా అలాటిదే. చిచీకవ్ స్థానంలో ఎవడన్నా ఇరవై ఏళ్ళ యువకుడు – ఒక అశ్వికదళ సైనికుడో, విద్యార్థో లేక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సాధారణ యువకుడో – ఉన్నట్టైతే వాడిలో ఎలాటి ఉద్దీపనం, ఎలాటి చైతన్యం, ఎలాటి హృదయ ఉద్బోధనం కలిగేది! తన మార్గాన్నీ, జాప్యం చేసినందుకు తనకు కలిగే చివాట్లనూ మరిచి, తనను తానే మరిచి, తన కర్తవ్యాన్ని, ప్రపంచాన్నీ, సమస్తాన్నీ మరిచి, దూరం కేసి శూన్యంగా చూస్తూ; బిత్తరపోయి చాలా నిమిషాలపాటు నిలబడిపోయేవాడు.

కాని మన కథానాయకుడు వయస్సులో కాస్త ముదిరినవాడూ, తాపీగా ఆలోచించే స్వభావం కలవాడూను. అతను కూడా ఆలోచనా నిమగ్నుడయాడు, అయితే అతని ఆలోచనలు బాధ్యతారహితంగా లేవు. వాస్తవికంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అతను పొడుం డబ్బా తీసి ఒక్క చిటికెడు పీలుస్తూ ఇలా అనుకున్నాడు: “పిల్ల చాలా బాగుంది. కాని ఆమెలో ఉన్న బాగేమిటి? ఉన్న బాగల్లా ఏమిటంటే ఇప్పుడే స్కూలు నుంచో, కాలేజినుంచో బయటపడినట్టున్నది, ఇంకా ఆమెలో ఆడతనం అన్నది తలయెత్తలేదు, వాళ్లలో సహించరానిదల్లా అదే. ఇంకా అమాయకురాలు; ఆమెలో అంతా అమాయకత్వమే; నోటికి వచ్చినదల్లా మాట్లాడేస్తుంది, నవ్వాలనిపిస్తే నవ్వేస్తుంది; అటువంటిదాన్నిఎలాగైనా మలుచుకోవచ్చు, అద్భుతమైన మనిషిగా తయారు కావచ్చు, వట్టి పనికిమాలినది కూడా అయిపోవచ్చు – పనికిమాలినదే అయిపోతుంది కూడాను! బామ్మలూ, అత్తయ్యలూ ఆమెను ఏంచేస్తారో చూడు. ఒక్క ఏడాది లోపల ఆమెకు ఎన్ని ఆడపోకిళ్ళు నేర్పేస్తారంటే ఆమెను సొంత తండ్రి కూడా గుర్తించలేడు. కపటమూ నటనా అలవడతాయి; తాను నేర్చుకున్న విషయాలకు అనుగుణంగా ప్రవర్తించటమూ, మసలటమూ చేస్తుంది; ఎవరితో మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి, ఎవరివంక చూడాలి, ఎలా చూడాలి అన్న సమస్యలను గురించి తల పగలగొట్టుకుంటుంది; హద్దుమీరి మాట్లాడానా అని అనుక్షణమూ భయపడుతూ ఉంటుంది; తాను పన్నిన ఉచ్చులలో తానే చిక్కుకుని చివరకు బతుకంతా అబద్ధాలాడేస్తుంది. ఎలా పరిణమిస్తుందో సైతాను చెప్పవలసిందే!” అతను ఒక్క నిమిషం ఆగి మళ్ళా ఇలా ఆలోచించాడు: “కాని, ఆమె ఎవరో, అమె తండ్రి ఎవరో, ఆయన ధనికుడూ, పరువు మర్యాదలూ గలవాడూ అయిన భూస్వామో, లేక సైనిక వృత్తిలో బాగా డబ్బు గడించుకున్న కపటం ఎరుగని బుద్ధిమంతుడో తెలిస్తే బాగుండును. ఆ పిల్లవెంట ఒకవేళ ఏ రెండు లక్షలో కట్నం కూడా వచ్చేట్టుంటే నోరూరించే భక్ష్యమన్నమాటే. సరి అయినవాడి పాలపడితే సుఖపెట్టగలుగుతుంది”. రెండు లక్షలు ఎంత వాంఛనీయంగా కనబడ్డాయంటే గుర్రాల మనిషినో, అ బండీవాణ్ణో అడిగి ఆ స్త్రీలెవరో తెలుసుకోనందుకు అతను తనను తానే నిందించుకున్నాడు. అయితే ఇంతలోనే దూరాన సబాకవిచ్ ఉండే గ్రామం కనిపించేసరికి అతని ఆలోచనలు చెదిరిపోయి అసలు విషయం పైకి మళ్ళాయి.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 21

ఉపజాతి పద్యాలు – ౧

ఆటవెలది

— ముక్కు శ్రీరాఘవకిరణ్

నిరుడు నన్ను నేను పరిచయం చేసుకున్నాను కదా. పద్యరచనపై ప్రస్తుత వ్యాసం క్రొత్తగా వ్రాస్తున్నవారి మార్గాన్ని కొంతైనా కంటకరహితం చేసేలా, లోగడ ప్రయత్నించి విరమించినవారికి తిరిగి ప్రయత్నించడానికి తగినంత ఊతమిచ్చేలా ఉంటుందని ఆకాంక్షిస్తూ…

మొదటే ఒక ముఖ్య ప్రకటన. నేను కేవలం పద్యాల గురించే చెప్పదలుచుకున్నానీ వ్యాసంలో. కాబట్టి వ్యాకరణశాస్త్రాన్నీ అలంకారశాస్త్రాన్నీ పెద్దగా స్పృశించడంలేదు. నేను చెప్పే విషయాలన్నీ నేనెలా నేర్చానో [1], నాకెలా తోచాయో అలానే చెప్తాను. తప్పులుంటే దొడ్డమనస్సుతో మన్నించాలి.

ఎక్కడ మొదలుపెట్టాలి?

నా అనుభవంలో ఆటవెలదులో తేటగీతులో అయితే పద్యరచన ప్రారంభించడానికి మంచిది. దీనికి కనీసం మూడు కారణాలున్నై.

  • మొట్ఠమొదటి కారణం – ఆటవెలది తేటగీతుల్లో ఫలానా అక్షరం గురువవ్వాలనో ఫలానా అక్షరం లఘువవ్వాలనో (పద్యగతిని నిర్దేశించే నియమాలు) లేకపోవడం. ఇల్లాంటి నియమాలుంటే వాటిని వృత్తాలంటారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం లాంటివన్నమాట. తెలుగులో వృత్తాలన్నిటికీ యతి, ప్రాస నియమాలు పాటిస్తారు[2].
  • రెండు – ప్రాస నియమం లేకపోవటం. ప్రాస నియమం ఉండి, వృత్తాలు కానివాటిని జాతులంటారు. దీనికి కందం మంచి ఉదాహరణ.
  • మూడు – వీటిల్లో యతికి బదులు ప్రాసయతి చెల్లించుకోవచ్చు. ఇల్లాగ ప్రాసయతి చెల్లించుకోగలిగిన సౌలభ్యం ఉండి, ప్రాస నియమం లేకుండా ఉండి, వృత్తాలు కాని పద్యాలని ఉపజాతులుగా చెప్పుకోవచ్చు. ఆటవెలదులు, తేటగీతులు, సీసాలూ ఉదాహరణలు.

సీసాలు పెద్ద పద్యాలు, కాబట్టి ప్రస్తుతానికి ఆటవెలదులమీదా తేటగీతులమీదా ప్రయోగాలు చేద్దాం.

ఇక్కడ యతి గురించి చెప్పుకోదగ్గ విషయాలు కొన్ని ఉన్నాయ్.

  • ఏ రకం పద్యమైనా సరే యతి నియమం తప్పనిసరిగా పాటించి తీరాలి. ఉపజాతులలో మాత్రం యతికి బదులుగా ప్రాసయతి వేసుకోవచ్చు.
  • యతి అంటే స్థూలంగా చెప్పాలంటే చదువుకోవడానికి వీలుగా ఉండేలా చిన్న విరామం ఇవ్వడమన్నమాట (ఎక్కడ విరామం ఇస్తామో దాన్ని యతిస్థానం అంటారు). విరామం ఇస్తున్నాం కాబట్టి మళ్లీ చదవడం ప్రారంభించేటప్పుడు ఆ పాదం మొదటి అక్షరంలాగానే పలకబడే అక్షరంతో ప్రారంభించాలన్నది నియమం. ఒకలా పలకబడాలంటే ఒకే రకమైన అచ్చై (లేదా గుణింతమై) ఉండాలి కదా. అంటే ఉదాహరణకి ఇ లాగా పలకబడే అచ్చులు ఇ-ఈ-ఎ-ఏ-ఋ-ౠ కాబట్టి ఇ తో ఇ-ఈ-ఎ-ఏ-ఋ-ౠ లకి ‘యతిమైత్రి’ చెల్లుతుంది. అలాగే అ-ఆ-ఐ-ఔ లకీ ఉ-ఊ-ఒ-ఓ లకీ యతిమైత్రి చెల్లుతుంది. అదే హల్లులైతే క-ఖ-గ-ఘ లకి, చ-ఛ-జ-ఝ-శ-ష-స లకి, ట-ఠ-డ-ఢ లకి, త-థ-ద-ధ లకి, ప-ఫ-బ-భ-వ లకి చెల్లుతుంది. అలాగే ల-ళ-డ లకీ, ర-ఱ-ల-ళ లకీ, ద-డ లకీ, అ-ఆ-ఐ-ఔ-హ-య లకీ, న-ణ లకీ యతి చెల్లుతుంది.
  • వర్గాక్షరాలలో మొదటి నాలుగు వర్ణాలకీ చివరి అనునాసిక వర్ణానికీ యతి చెల్లదు. ఉదాహరణకి ఙ కి క-ఖ-గ-ఘ లకి యతి చెల్లదు. కానీ వర్గాక్షరాలు బిందుసంయుక్తమైతే అనునాసికంతో యతి చెల్లుతుంది. అంటే సంతతి లో ంత కి నాకములో నా కి యతి చెల్లుతుంది.
  • హల్లులకి హల్‌మైత్రే కాక అచ్‌మైత్రి కూడా ఉండాలి. అంటే కి-కు యతి చెల్లదు.
  • సంయుక్తాక్షరాలైతే ఏ హల్లుకైనా యతి చెల్లించవచ్చు. ఉదాహరణకి శ్రీ (శ్+ర్+ఈ) క్షీ (క్+ష్+ఈ) లలో శకారానికీ షకారానికీ యతి చెల్లుతుంది. అలాగే శ్రీ-క్రీ లకి శ్రీ-చే లకి శ్రీ-జృ లకి యతులు చెల్లుతాయి. కానీ క్షు-సృ యతి చెల్లదు (అచ్‌మైత్రి ఉండాలి కనుక).
  • సంయుక్తాక్షరాలతో ఒకటి కంటే ఎక్కువ సార్లు యతి చెల్లించాల్సివస్తే[3] అన్నిసార్లూ ఒకే వర్ణానికి యతి చెల్లించాలి. అంటే శ్రీసతి – శీకర – రీతిని అన్నచోట యతి చెల్లినట్టుగాదు. అలాగే శ్రీధర – సిత – శీతాంబు అన్నచోట యతి చెల్లినట్టు.

అలాగే ప్రాస గురించి చెప్పుకోవాలంటే

  1. పాదంలోని రెండవ హల్లుకి ప్రాస అని పేరు. ఇంకా సరిగ్గా నిక్కచ్చిగా చెప్పాలంటే పాదంలోని మొదటి అచ్చుకీ రెండవ అచ్చుకీ మధ్యనున్న అక్షర సముదాయానికి ప్రాస అని పేరు. ప్రాస నియమం పాటించడమంటే ప్రతీ పాదంలోను ప్రథమద్వితీయాచ్చులకి మధ్యలో ఉన్న అక్షరసముదాయం ఒకటే అయ్యేలా చూసుకోవడం. ఉదాహరణకి శ్రీఘురామ … – గాగుణాభిరామ … – ర్వా కబంధ రాక్షస … – త్తాకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
  2. ప్రాసనియమంలో హల్లు మాత్రమే ప్రధానం కాబట్టి ప్రాసనియమం పాటించాల్సిన అక్షరసముదాయం ఒకే గుణింతంలో ఉన్నా ఒప్పే. అలాగే అక్షరసముదాయం[4] అన్నాం కాబట్టి అది సంయుక్తాక్షరం ఐతే దాన్ని అలాగే కొనసాగించాలి. దుష్టేతర – ఇష్టులు – అష్టమి – కష్టాలు అన్నప్పుడు ప్రాస సరిపోతుంది.
  3. పలకడం ఒకేలా ఉన్నంతమాత్రాన ప్రాస సరిపోతుందనుకోవడం పొరబాటు. కాబట్టి అమ్మా – మామా కి ప్రాస చెల్లదు.
  4. అనుస్వారం వస్తే? అంటే కండలు – వాడిని ప్రాస సరిపోతుందా? చెల్లదు. ఎందుకు చెల్లదు? కండలులో ప్రాసాక్షరసముదాయం ఏమౌతుంది? 0+డ్ కదా. ఇంకా తేలికగా అర్థమవ్వాలంటే… కండలు ని కణ్డలు అనే గదా చదువుతాం. ఇప్పుడు చెప్పండి ప్రాసాక్షరం ఏమిటో. ణ్+డ్ అంటే 0+డ్ అవునా?
  5. ఇవి కాక ల-ళ-డ లకి ప్రాస సరిపోతుంది. అలాగే శ-స లకీ, న-ణ లకీ, స-ష లకీ కూడా సరిపోతుంది.
    ఉదాహరణకి కములబోలిన పలుకులఁ రురుసలాడినను చెలువ రూపే స్మృతియై వమాయెను నా మనమని శధరబింబసమముఖినిఁ జనువునఁ దలచెన్[5].
  6. ర-ఱ లకి ప్రాస చెల్లించడం కుదరదు. కానీ పూర్వకవులు ర-ఱ ప్రాస చెల్లించిన ప్రయోగాలూ లేకపోలేదు(ట).

ఇక ప్రాసయతి:

  1. ప్రాసయతి అంటే యతి చెల్లించాల్సిన చోట ప్రాస చెల్లించడం. ఉదాహరణకి అచ్చు తప్పులుంటె – మెచ్చబోరు అన్నామనుకోండి… అందులో యతి చెల్లాల్సిన చోట అ కి మె కి యతి చెల్లట్లేదు. కానీ ప్రాసాక్షరసమూహమైన చ్+చ్ ని తీసుకుని యతి చెల్లాల్సిన చోట అచ్చు – మెచ్చ ప్రాస చెల్లించామిక్కడ. కాబట్టి ప్రాసయతి చెల్లించామన్నమాట.
  2. ప్రాసకి చెప్పిన నియమాలన్నీ ప్రాసయతికి వర్తిస్తాయ్. అంటే మండుటెండ లోన – మూడు రాదు అన్నచోట యతి ఎలాగూ చెల్లట్లేదు. ప్రాసయతి కూడా చెల్లదు.

ఇక ఆటవెలది, తేటగీతుల్లోకి వచ్చేద్దాం. అసలే పద్యమైనా వ్రాయాలంటే ముందు ఏదో ఒక విషయం కావాలి కదా. విషయాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నామో అది మన ఇష్టం (ఎంత చెప్పామో ఎలా చెప్పామో అన్నదాన్నిబట్టి వ్రాసినదాన్ని కావ్యమనో ఖండకావ్యమనో మహాకావ్యమనో ప్రబంధమనో మరొహటనో పిలుస్తారు). ఉదాహరణకి ఇప్పుడు మనం భారతదేశం గురించి నాలుగు ముక్కలు చెబుదామనుకున్నాం అనుకోండి. విషయం ఎంచుకున్నాక ఏ ఛందస్సులో వ్రాయాలో కూడా నిర్ణయించుకోవాలి కదా. ప్రస్తుతానికి ఆటవెలదిలో వ్రాద్దామనుకుంటే… మొదట తెలియవలసినది ఆటవెలది లక్షణం.

ఆటవెలది లక్షణాలు

  1. బేసి పాదాలలో 3 సూర్య గణాలు 2 ఇంద్ర గణాలు ఉంటాయ్.
  2. సరి పాదాలలో 5 సూర్య గణాలు ఉంటాయ్.
  3. ప్రాస నియమం లేదు.
  4. యతి గానీ ప్రాసయతి గానీ చెల్లించాలి (ఉపజాతి పద్యం కాబట్టి).

బేసి పాదాలంటే 1, 3 పాదాలు. సరి పాదాలంటే 2, 4 పాదాలు. (రెండు, నాలుగు పాదాలు కాబట్టి మనుష్యులూ జంతువులూను!)

అసలీ గణాలేమిటి?

సరి. మళ్లీ మొదటికొచ్చాం. హ్రస్వాక్షరాన్ని (ఒక మాత్ర) పలకడానికి పట్టే కాలంలో పలకబడే అక్షరాలు లఘువులు, లఘువులు కానివన్నీ గురువులు. ఇకమీద గురువుని U తోనూ లఘువుని I తోనూ సూచిద్దాం. ఏది లఘువో ఏది గురువో గుర్తించడంలో పలకడం ప్రధానం. కాబట్టి సంయుక్తద్విత్వాక్షరాల విషయంలో వచ్చే కొన్ని విశేషాంశాలు కూడా చెప్పుకోవాలి. సంయుక్తాక్షరమంటే రెండు వేర్వేరు హల్లుల కలయిక వల్ల పుట్టేది. క్ష లాగ. ద్విత్వాక్షరమంటే అదే హల్లు రెండు సార్లు రావడం వల్ల పుట్టేది. ల్ల లాగ.

(1) సంయుక్తద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం ఒకే పదంలోదయితే అది గురువే. “అక్షరం” లో అ గురువు. క్ష లఘువు.

(2) సమాసం జరిగితే ఈ నియమం కొంచెం మారుతుంది.

ముందు సమాసాల రకాలు చూద్దాం. రెండు సంస్కృత పదాల సమాసానికి సిద్ధ సమాసమని పేరు. రెండు సంస్కృత సమాన పదాల (తద్భవాలు) మధ్య సమాసానికి సాధ్య సమాసం అని పేరు. అచ్చ తెలుగు పదాల సమాసానికి ఆచ్ఛిక సమాసమని పేరు. ఒక సంస్కృత సంబంధి పదానికీ (తత్సమ,తద్భవాలు) ఒక అచ్చ తెలుగు పదానికీ (ఆచ్ఛికం) సమాసమైతే దాన్ని మిశ్ర సమాసం అంటారు.

సమాసపదంలో ఉత్తరపదంలోని మొదటి అక్షరం సంయుక్తాక్షరంగానీ ద్విత్వాక్షరంగానీ అయితే పూర్వపదంలోని చివరి అక్షరం (అ) సిద్ధ సమాసమైతే గురువు (ఆ) సాధ్య మిశ్ర సమాసాలైతే మనం పలకడాన్ని బట్టి గురువుగానైనా లఘువుగానైనా తీసుకోవచ్చు (ఇ) ఆచ్చికమైతే లఘువే. ఉదాహరణలు: “విఫలప్రేరణ”లో ల గురువు, “విష్ణుధ్యానము” లో ష్ణు గురువు లేదా లఘువు, “ముసలివ్యాఘ్రము”లో లి గురువు లేదా లఘువు, “సీత ప్రక్కన”లో త లఘువు.

(3) సమాసం లేకపోతే ముందుపదంలోని చివరి అక్షరమెప్పుడూ లఘువే. ఉదాహరణకి “మధువును గ్రోలు” లో ను లఘువు.
(4) పలకడం చేత సంయుక్తాక్షరమున్నా లఘువులైన పదాలు తెలుగులో కొన్ని ఉన్నాయి. అద్రు, ఎద్రుచు, చిద్రుప మొదలైనవి.

సూర్య ఇంద్ర చంద్ర గణాలుగా వర్గీకరించడం సుళువుగా గుర్తుండేలా నేను వాడుకునే ఒక్క చిన్న టెక్నిక్ చెప్పమంటారూ?

* రెండు ‘మాత్ర’ల కాలంలో పలకబడేవి U – గ, II – లల.
* వీటికి గురులఘువులు చేరిస్తే UU – గగ, UI – గల లేదా హ, IIU – స, III – న లు వస్తాయి. ఈ గణాలలో మూడు మాత్రల గణాలైన హ, న లను “సూర్య గణాలు” అంటారు.
* అలాగే గ-లల లకి రెండేసి గురులఘువులు చేరిస్తే వచ్చేవి UUU – మ, UUI – త, UIU – ర, UII – భ, IIUU – సగ, IIUI – సల, IIIU – నగ, IIII – నల. వీటిల్లో నాల్గు ఐదు మాత్రల త, ర, భ, సల, నగ, నల లని “ఇంద్ర గణా”లంటారు.
* గ-లల లకి మూడేసి గురులఘువులు చోరిస్తే వచ్చే UUUU – మగ, UUUI – మలఘు, UUIU – తగ, UUII – తల, UIUU -రగ, UIUI – రల, UIIU – భగురు, UIII – భల, IIUUU – సగగ, IIUUI – సగల, IIUIU – సలగ, IIUII – సలల, IIIUU – నగగ, IIIUI – నగల, IIIIU – నలగ, IIIII -నలల ల్లో ఐదు, ఆరు, ఏడు మాత్రల మలఘు, తగ, తల, రగ, రల, భగురు, భల, సగల, సలగ, సలల, నగగ, నగల, నలగ, నలల అనే గణాలని “చంద్ర గణా”లంటారు.
* కాబట్టి సూర్య గణాలు (3 మాత్రలు) రెండు. అవి న, హ. ఇంద్ర గణాలు (4, 5 మాత్రలు) ఆరు. అవి నగ, నల, సల, భ, ర, త. పధ్నాలుగు చంద్ర గణాలూ మనకి ప్రస్తుతానికి అనవసరం. అసలు ఛందస్సులో వాటి వాడకమే చాలా తక్కువ.

ఆటవెలది లక్షణం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రయత్నిద్దాం. మొదటి పద్యం అమ్మపై వ్రాద్దామా? భావనలు మనకి కోకొల్లలు. ఇక పద్యం వ్రాసే పద్ధతి –

అమ్మ సూర్యగణం. అమ్మ అనగానే గుర్తొచ్చేవి… చేతి వంట, మాట, చూపు, లాలి పాట గట్రా. అమ్మ చేతివంట అంటే మొదటి మూడు సూర్యగణాలూ వచ్చేసాయ్. వంట అనటంకన్నా చేతి ముద్ద అంటే ఇంకా అర్థవంతంగా ఉంటుందేమో కదా. అమ్మ చేతిముద్ద అన్నాం, బాగానే ఉంది. తర్వాత? రెండు ఇంద్రగణాలు కావాలి. ఆపై మరో మూడు పాదాలు కావాలి. ఏం చెప్పాలిప్పుడు? అమ్మ చేతిముద్ద అందరికీ అమృతమే. అమ్మ ఏం పెట్టినా అందులో తన అమ్మప్రేమని కలిపి పెడుతుంది, అమ్మప్రేమతో పెడుతుంది. అటువంటి అమ్మచేతిముద్ద తినడం కోసం అమృతమైనా సరే వదులుకోవచ్చు.

ఇక్కడ గమనించవలసినది… అమృతములో అ గురువు కాదు. పలకడంలో అవకరాలు వచ్చి మనకిప్పుడు తేడా పెద్దగా తెలీడంలేదంతే.

సరే. అమృతాన్నికూడ వదులుకోవచ్చునన్నాం కదా. దానిని కొంచెం పదాలు మారిస్తే “అమృతమైన కూడ వదులుకోవచ్చులే“. అదృష్టం బాగుండి యతి సరిపోయింది. ఎంతైనా అమ్మ గురించి కదా! ఇది ఒక పాదం.

అమ్మచేతి ముద్ద అమ్మ ప్రేమతో కలిసి ఉంటుంది. అలా కలవడం వల్ల అమృతాన్ని మించిపోతుంది. మొదటి వాక్యాన్ని కొంచెం అటూ ఇటూ చేస్తే… అమ్మ చేతి ముద్ద అమ్మ ప్రేమ కలిసి.

అమృతాన్ని మించిపోతుంది. ఇక్కడ అమృతాన్ని అనడంవల్ల ఇంద్రగణం వస్తోంది. మనకి కావలసింది సూర్యగణం. కాబట్టి అమృతం అన్నదానికి పర్యాయపదం వాడదాం… అమృతం, సుధ, పీయూషం. సుధను మించిపోవు అన్నామనుకోండి. అప్పుడు మరో మూడు సూర్య గణాలు పూర్తయినట్టు. ఇక్కడ పూర్తిచేయడానికి మళ్ళీ యతి చూసుకోవాలి. చ-ఛ-జ-ఝ-శ-ష-స లకి ఉ-ఊ-ఒ-ఓ లకి యతి సరిపోతుంది. కాబట్టి మూడో పాదంతో కలిసిపోయేలా రెండు సూర్యగణాలు రావాలి. ఇప్పుడు ఆ రెండూ చూడబోతె ఐతే, అమృతమైన కూడ వదులుకోవచ్చులే అన్నపాదానికి కలపడానికి బాగుంటుంది.

ఇప్పుటిదాకా పూర్తయిన పద్యం…

అమ్మ చేతిముద్ద అమ్మ ప్రేమకలిసి
సుధను మించిపోవు చూడబోతె
అమృతమైన కూడ వదులుకోవచ్చులే

ఇప్పుడు పద్యంలో ఏది లోపించిందో తేలికగా తెలుస్తోంది. ప్రేమతో కూడిన అమ్మ చేతి ముద్ద కోసం అని స్ఫురించేలా ఓ వాక్యం ఉంటే సరిపోతుంది. అమ్మచేతిముద్ద అని మళ్ళీ వాడేస్తే… అమ్మచేతిముద్ద అనే అమృతం కోసం. మధువు కొరకు అని అంటే ఐపోతుంది.

పద్యం-

ఆ.వె.

అమ్మ చేతిముద్ద అమ్మప్రేమ కలిసి
సుధను మించిపోవు చూడబోతె
అమృతమైన కూడ వదులుకోవచ్చులే
అమ్మ చేతిముద్ద మధువు కొరకు

ఇప్పుడు మరొకటి ప్రయత్నిద్దామా? ముందు అనుకున్నట్టుగా భారతదేశంమీద వ్రాద్దామా?

భావనలు (మనం చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞే ఇది) –

(1) నా భారతదేశం గొప్ప సంస్కృతి కలిగినది.
(2) నేను దానికి గర్విస్తున్నాను.
(3) అటువంటి నా దేశానికి నమస్కారం.

వ్రాసే పద్ధతి –

సంస్కృతి గురించి చెప్పాలి. సంస్కృతి అన్న పదాన్ని యథాతథంగా పద్యంలో వాడేద్దాం. సంస్కృతి ఇంద్రగణం. కాబట్టి “సంస్కృతి కలిగిన” అని రెండు ఇంద్రగణాలు వాడచ్చు. ఇవి వచ్చాయ్ కాబట్టి వీటి ముందు మూడు సూర్య గణాలు రావాలి. “ంస్క” తో ప్రాసయతి కన్నా స తో యతే నయ్యం. కాబట్టి స తో యతిమైత్రి ఉన్న చ-ఛ-జ-ఝ-శ-ష-స లలో ఏదో ఒకదానితో ప్రారంభించాలి. “చక్కనైన” సరిపోతుందే… హమ్మయ్య. “చక్కనైన … సంస్కృతి కలిగిన”. ఒక సూర్య గణంతో ఖాళీ పూరించాలి. “గొప్ప” సూర్య గణమే కదా. “చక్కనైన గొప్ప సంస్కృతి కలిగిన” అని మొదటి పాదం పూర్తి చేసేసాం.

విశేషణాలు వేసేసాం సరే. మరి దేనిమీద వాడాం ఆ విశేషణాలు అన్నది కూడా చెప్పాలి కదా. ఇంకా దేని మీద? మన భారతదేశం మీదే. భారత అంటే ఇంద్ర గణం. అంటే మూడో పాదంలో మాత్రమే వాడగలం. మరి రెండో గణంలోనే వాడాలంటే ఎలా? పర్యాయపదం వెతుక్కుందాం. భారతదేశాన్ని మనం భరతమాత అని కూడా అంటాం కదా. భరతమాత అంటే రెండు సూర్య గణాలు. భలే. “భరతమాత”… తర్వాతో? నమస్కారం చెప్పాలి. నమస్కారానికి పర్యాయపదాలు వందనాలు, దండాలు, ప్రణామాలు, మొదలైనవి. వందనాలు ప్రణామాలు యతికి చక్కగా సరిపోతాయి. కానీ “ప్రణామాలు” ఐతే గణాలు సరిపోవు. కాబట్టి “వందనాలు” తీసుకుందాం. మళ్లీ “భరతమాత … వందనాలు” లో ఖాళీ సూర్యగణంతో పూరించాలి. “నీకు” తో పూరిస్తే “భరతమాత నీకు వందనాలు”. అలా ఆటవెలది మొదటి రెండు పాదాలూ ఇవిగో.

ఆ.వె.

చక్కనైన గొప్ప సంస్కృతి కలిగిన
భరతమాత నీకు వందనాలు

మిగతా రెండు పాదాలూ మీరు ప్రయత్నిస్తారా?

నియమాలన్నీ తెలియడం కన్నా ముఖ్యమైన విషయం మరోటుంది. అది చదవడం. మీకు తెలుసున్న ఆటవెలది పద్యాలన్నీ పరిశీలించండి. తర్వాత మీరే స్వంతంగా ఒక పద్యం వ్రాయడానికి ప్రయత్నించండి. పైగా ఆటవెలదిలో వేమన శతకం, తెలుగుబాల శతకం లాంటి శతకాలే ఉన్నాయ్. కావ్యాలలోనూ ఆటవెలదులు బాగానే కనిపిస్తాయ్.

నాకొక ఆటవెలది గుర్తొస్తోంది. భావకవులమని చెప్పుకునేవారిపై దేవులపల్లివారి ఛలోక్తి ఇది –

ఆ.వె.

మెరుగు కళ్లజోళ్లు గిరజాలు సరదాలు
భావకవికి లేనివేవి లేవు
కవితయందు తప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ వినురవేమ.

ఇందులో చమత్కారం చివర్న చెప్పడానికి వేరే విషయమింకేమీలేక, విశ్వదాభిరామ వినురవేమ అని వాడేయడం! అలాగే ఇందులో రెండు చోట్ల ప్రాసయతి వాడారాయన, గమనించండి.

అలాగే నేనూ దేవులపల్లివారి దారిలో చెప్పేదేంటంటే…

ఆ.వె.

ఆటవెలది బాగ అభ్యాసమును చేసి
పద్యమొక్కటైన వ్రాయమనుచు
చెప్పి పాఠమాపి సెలవు తీసుకొనెదఁ
విశ్వదాభిరామ వినురవేమ.

ఆటవెలది పాఠమింతటితో సమాప్తం. అన్నట్టు భరతమాత పద్యంలో చివరి రెండు పాదాలూ పూర్తిచేయడం మర్చిపోకండేం. తర్వాత ఈ పాఠంమీద మీ అభిప్రాయాన్ని, ఉన్న అనుమానాలనీ కూడా ఆటవెలదిలోనే చెప్పడానికి ప్రయత్నించండి. తేటగీతులు సీసాలు కందాలు మొదలైనవి తర్వాత నేర్చుకుందాం.

*** *** *** ***

పాద పీఠిక

[1] నేను ఛందస్సుని ఎవరి వద్దా కూడా శాస్త్రీయంగా నేర్వలేదనీ, అక్కడా ఇక్కడా చదివడం ద్వారా నాకు అర్థమైన నాకు తోచిన ఛందోజ్ఞానసంచయమనీ, దాన్నే నేను అర్థంచేసుకున్నట్లుగా మీ ముందుంచబోతున్నాననీ గమనించగలరు.

[2] పాటిస్తారు అంటే నేను లోగడ చదివిన సాహిత్యంలో పూర్వ కవులందరూ అందరూ విధిగా పాటించారనీ, వారి మార్గాన్ని అనుసరించడం మంచిదనీ అర్థం.

[3] స్రగ్ధర, తరువోజల్లాంటి పేద్ధ పద్యాలలో

[4] మళ్లీ మళ్లీ ప్రథమద్వితీయాచ్చులకి మధ్యలో ఉన్న అక్షరసముదాయం అనేం అంటాం గానీ క్లుప్తంగా ప్రాసాక్షరసముదాయం అని పిలుద్దాం

[5] ఉదాహరణకోసం వ్యాసకర్త వ్రాసినదిది

—————————————————-

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.

Posted in వ్యాసం | Tagged | 9 Comments

ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం

-వీవెన్, సిముర్గ్, త్రివిక్రమ్, చదువరి

కాశ్మీరు, దేశభక్తి, కులం, మతం, చిరంజీవి ప్రజారాజ్యం -ఇవీ ఈ నెల బ్లాగరులు ఎక్కువగా స్పందించిన అంశాలు. వేడిగా వాడిగా చర్చలూ జరిగాయి. కొన్ని సందర్భాల్లో చర్చలు వ్యక్తిగతంగా కూడా మారాయి. లైంగికతపై కూడా చర్చ జరిగింది. చాలామంది బ్లాగరులు హుందాగా స్పందించినప్పటికీ, ఒకటిరెండు చోట్ల ఇది బూతు స్థాయికి దిగజారింది. అసహజ లైంగికాచారాల గురించిన చర్చ, అక్కడ వచ్చిన కొన్ని హేయమైన వ్యాఖ్యలు ఏవగింపు కలిగించాయి. ఎవరి బ్లాగుకు వారే సుమన్ అన్న బ్లాగోక్తి నిజమేగానీ, సుమన్ని ఎంతగా ఆటపట్టించారో, చివరికి సుమన్ పరిస్థితి ఏమయిందో కూడా బ్లాగరులకు బాగా తెలుసు.

~~~~ ~~~~ ~~~~

సాలభంజికలు బ్లాగు తాత్కాలికంగా సుషుప్తిలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. బ్లాగరులు ఈ విషయమై అసంతృప్తి వెల్లడించి ఉన్నారు. త్వరలో ఈ బ్లాగు తిరిగి ఉదయిస్తుందనీ, జాబులు పూయిస్తుందనీ ఆశిద్దాం.

ఇక వివరాల్లోకి వెళితే..

రాజకీయాలు, సామాజికాంశాలు

  • జేసీ దివాకరరెడ్డి ఆర్టీయే అధికారులపై చేసిన దాడిపై బ్లాగరుల స్పందన
    1. కడలితరగలో నెల్లుట్ల వేణుగోపాల్ రాసిన జాబు.
    2. అసలే కోతి అంటూ దూర్వాసుల పద్మనాభం రాసారు.
  • కులమతాలపై ఈ నెల బ్లాగుల్లో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలు వ్యక్తిగతమైన ఆరోపణలకూ దారితీసాయి. కొన్ని బ్లాగులు.
  1. కులమా కులమా నీకు మరణం లేదా అంటూ మనసులో మాట సుజాత ఆవేదనగా అడిగారు.
  2. కులమతాలు నేరమా?! అంటూ శంఖారావంలో సరస్వతీ కుమార్ చర్చించారు.
  3. ఈ వివాదాల నేపథ్యంలో మాగంటి వంశీ అసలు ఏమవుతోంది ఈ మధ్య మన తెలుగు బ్లాగు ప్రపంచంలో? అంటూ ఆవేదన వెలిబుచ్చారు.
  4. ఇవి కాక, వివాదాస్పదమైన చర్చకు దారితీసిన జాబులు, వ్యాఖ్యలను తరువాత తొలగించిన ఘటనలూ జరిగాయి.

ఒలింపిక్స్ లో భారత బోణీ: ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టడం బ్లాగరులకు సంతోషాన్నిచ్చింది. జాబుల పండగ చేసుకున్నారు. మచ్చుకు ఇవి చూడండి:

  1. అవీ-ఇవీ లో త్రివిక్రమ్ ఒలింపిక్స్ లో స్వర్ణంతో భారత్ బోణీ కొట్టిందని అని రాసారు.
  2. వచ్చిన వాడు అభినవ్ బింద్రా అంటూ తేటగీతిలో మురళి రాసారు.
  3. ఈ వార్తను మధు తన బ్లాగులో ప్రకటించారు
  4. ఐతే ఓకే అంటూ కిరణ్ కూడా తన బ్లాగులో రాసారు.
  5. స్మృతిలో ప్రవీణ్ తన హర్షం వెలిబుచ్చుతూ, గుర్తింపు వచ్చిన వాళ్ళకే మనం మరింత గుర్తింపు ఇస్తాము అంటూ బాధపడ్డారు.
  6. ఒక చిత్రమేంటంటే.. ఈ తొలి స్వర్ణ దినానికి కేవలం రెండు రోజుల ముందు బండారు శివ ఒలంపిక్స్ లో మనదేశం అనామకంగా ఉండటాని కి ప్రదాన కారణం ఏమిటి ? – క్రికెట్ అంటూ ఒక జాబు రాసారు. ఒలింపిక్స్‌లో భారత్ అనామకంగా ఉండటానికి కారణం క్రికెట్టేనంటూ సాగిందీ జాబు.
  7. పై జాబుకు స్పందనగా పూర్ణిమ నిఝంగా క్రికెట్టేనా?? అంటూ ఒక జాబు రాసారు. మిగతా ఆటలు ప్రాచుర్యం పొందకపోవడానికి క్రికెట్టు కారణం కాదంటూ ఆమె వాదన సాగింది.
  8. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించని మన ప్రభుత్వాలు అంతర్జాతీయ పోటీల్లో గెలిచాక మాత్రం విచక్షణారహితంగా వరాలు ప్రకటించడాన్ని వికటకవి “ఎవడబ్బ సొమ్మని తేరగ పంచేరు…” అని ప్రశ్నించారు.


సాహిత్యం
ఈ నెల సాహితీ విభాగంలో పద్యాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి.

  1. కందపద్యపు ఛందాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ రాకేశ్వరరావు అందములోఁ పోతరాజుల కందములోః బొమ్మల చందములోఁ అని ఒక జాబు రాసారు. ఛందస్సును అర్థం చేసుకోగల సాఫ్టువేరును తయారుచేసే పనిపై గతంలో ఆసక్తి వెలిబుచ్చిన నేపథ్యంలో, రాకేశ్వరరావు ఈ పనిపై నిష్ఠతో ఉన్నారనీ, ఆ పని ప్రగతి సాధిస్తున్నదనీ ఈ జాబు ద్వారా తెలుస్తూంది.
  2. చంద్రమోహన్ కందపద్యపు సొగసును, ఛందాన్ని తెలియజేస్తూ ఓ జాబు రాసారు. ఇక్కడా, పై జాబులోనూ గిరి, రాఘవ, రానారె, భైరవభట్ల, చంద్రమోహన్, ఊకదంపుడు, రాకేశ్వరరావు వంటి పద్యబ్లాగరులు తమతమ వ్యాఖ్యలలో ఆశువుగా కందాలను సంధించి పాఠకులకు విందులు చేసారు.
  3. తెలుగు బ్లాగుల్లో వస్తున్న కొన్ని కవితలపై చెణుకులు విసురుతూ రానారె ఒక సర్వలఘు కందం రాసారు.
  4. గిరి ఒక సీసపద్యం, ఆటవెలది, ఒక ఉత్పలమాలల్లో తనకు నచ్చిన బ్లాగులు జాబితా తయారుచేసారు.
  5. చదువరి తానూ కందానికో నూలుపోగు సమర్పించారు
  6. ఒక్కో పాదాన్నీ ఒక్కో భాషలో రచించిన కందపద్యాన్ని పరిచయం చేసారు భైరవభట్ల కామేశ్వరరావు.
  7. నీటిలో వెన్నెల బిందువులు కలిసి, నీళ్ళు ఎంగిలైన వైనం బొల్లోజు బాబా చెప్పారు, తెలుసుకున్నారా?
  8. కథల వెనక కథల గురించి నిడదవోలు మాలతి ఒక జాబు రాసారు.
  9. ఫణీంద్ర, తాత్విక మీమాంస రాసారు.

సాంకేతికాంశాలు

  1. తెలుగు బ్లాగరులు ముద్దుగా పిలుచుకునే మంటనక్కకు కొత్తగా అమరిన యుబీక్విటీ అనే పొడిగింత గురించి ప్రవీణ్ రాసారు.
  2. సాఫ్టువేరు తెలుగీకరణంలో ఉపయోగపడగల అనువాదాంశాల గురించిన విశేషాలను ఫ్యూయల్ తెలుగు: పరిచయంలో వీవెన్ రాసారు.

హాస్యం, వ్యంగ్యం

  1. తానెంత గొప్ప చిత్రకారిణో చెబుతున్నారు శ్రీవిద్య
  2. వేణ్ణీళ్ళు, చన్నీళ్ళు – మీది పోస్ట్‌పెయిడా, ప్రీపెయిడా?
  3. పందికి బ్లాగు గౌరవం కలిగించారు అబ్రకదబ్ర తన బ్లాగులో.
  4. రాత్రికి రాత్రి పాపులర్ బ్లాగరైపోవాలంటే ఏం చెయ్యాలో గోసుకొండ అరుణ చెప్పారు, విన్నారా?
  5. చాన్నాళ్ళ తరువాత తోటరాముడు నవ్వులు పూయించాడు
  6. అక్క చెల్లెళ్ళు చెప్పే సుందోపసుందుల కథ విన్నారా?

ఇంద్రధనుస్సు

  1. పిల్లలకి ఎత్తు మప్పడం, పేర్లు పెట్టడం అనే విషయంపై రామ, శాంతి ఓ జాబు రాసారు.
  2. ఏకాంతవేళ ఓ కాంత సేవ అంటూ ప్రసాదం శృంగార రసాత్మక టపా ఒకటి రాసారు.
  3. ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి, జరిగాక మొసలికన్నీరు కారుస్తారంటూ చరసాల ప్రసాద్ ఆవేదన చెందారు. గౌతమీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తరువాత రాసిన టపా ఇది.
  4. తాను చిన్ననాట చేసిన అల్లరి గురించి చెబుతున్నారు, కల.
  5. అరవయ్యొక్కేళ్ళ పండు ముత్తైదువా మా తల్లి .. మహాసముద్రపు అలల నురుగులు ఆమె పాదాల మంజీరాలు.” – స్వాతంత్ర్య దినోత్సవాన, భారతమాతకు కొత్తపాళీ చేసిన అక్షర నీరాజనం. అమ్మ గురించి ఆయన రాసిన మూడు టపాల వరుసలో ఇది మొదటిది.
  6. నారిసెట్టి ఇన్నయ్య రాస్తున్న నా ప్రపంచం బ్లాగులో హేతు విరుద్ధమైన ఆచారాల గురించి రాస్తూ వాటిలోని మర్మాల గురించి తెలియజేస్తూంటారు. ఇతర విషయాలతో పాటు ఈనెల పక్షితీర్థంలో క్రమం తప్పకుండా ఒకే వేళకు వచ్చే గద్దల గురించి, క్రీస్తు మహిమల గురించి కూడా రాసారు
  7. హైదరాబాదీయులు రాస్తున్న బ్లాగుల్లోకెల్లా జ్యోతి షడ్రుచులు ఉత్తమమైనదిగా ఎంపికైంది.
  8. పాముకు ఇస్పాట్ పెట్టిన సంగతి రాసారు భాస్కర్ రామరాజు.
  9. క్రాంతి ముంబై మేరీ జాన్ సినిమా సమీక్ష రాసారు
  10. ధ్యానం యొక్క పరిమితుల గురించి నారాయణ మూర్తి వివరిస్తున్నారు.
  11. వ్యూహాత్మక నీటి నిల్వల గురించి తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం 7 టపాల వరుస రాసారు.
  12. సీబీరావు గారి జ్ఞాపకాలు, ఆలోచనలు విశేషాలను తెలుసుకుంటున్నారా?
  13. హేతువాదిగా పేరుపొందిన సీబీరావు నా ప్రపంచపు పదివేలవ సందర్శకుణ్ణి అదృష్టవంతునిగా చెప్పడాన్ని శ్రీకాంత్ సరదాగా ఎత్తిచూపారు. దానికి రావుగారు చాలా హుందాగా స్పందించారు.

కొత్త బ్లాగులు

  1. ఆగస్టులో ఓ తుంటరి బ్లాగు లోకంలోకి ప్రవేశించాడు
  2. తన కార్టూన్లతో తెలుగు బ్లాగర్లను అలరించడానికి కొవ్వూరి భగవాన్ రెడ్డి వచ్చేసారు.
  3. ఆంధ్రామృతం అందించడానికి ఓ తెలుగు మాష్టారు బ్లాగులోకం లోనికి వచ్చేసారు.
  4. ఉత్సాహంగా… ఉల్లాసంగా… కృష్ణాతీరం నుండి అరుణాంక్ వస్తున్నారు.

తెలుగు సేవకుడు

మాగంటి వంశీ మోహన్ పరిచయం చెయ్యనవసరం లేని వ్యక్తి. మాగంటి.ఆర్గ్ వెబ్‌సైటు కర్తగా ఆయన నెజ్జనులకు సుపరిచితుడే. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులకు సంబంధించిన ఎన్నో విశేషాలను సేకరించి, ఆ సైటులో ఉంచారాయన. సాంస్కృతికంగా విలువైన పది తెలుగు సైట్లను ఎంచి ఓ జాబితాగా చేస్తే ఆ సైటు తప్పక ఆ జాబితాలో ఉంటుంది. మాగంటి వంశీ, శ్రీదేవి దంపతుల శ్రమ ఫలితమీ సైటు. ఈ మధ్య ఆ సైటులో రేడియో ప్రసారాలను కూడా మొదలుపెట్టారు. అమూల్యమైన విషయాలను ఒకచోట చేర్చి అందిస్తున్న మాగంటి వంశీ అభినందనీయులు.

వంశీ జానుతెనుగు సొగసులు పేరుతో బ్లాగు రాస్తూంటారు. ఈ బ్లాగులో ఇతర సంగతులతో పాటు, సుప్రసిద్ధుల జీవితాల్లో జరిగిన విశేషాలను కూడా రాస్తూంటారు.

—————————

-వీవెన్, సిముర్గ్, త్రివిక్రమ్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు

Posted in జాలవీక్షణం | Tagged , , | 17 Comments

జగదీష్-జ్యోతిలక్ష్మి

-అశ్విన్ బూదరాజు

“అప్పటికీ నేను చెపుతూనే ఉన్నాను తాతగారూ, జగదీషే ఏం పర్లేదని చుట్ట తాగాడు” అని జ్యోతిలక్ష్మి మా తాతగారితో చెప్పటం నాకు వినపడింది. అంతే, మా తాతగారు…

ఎప్పటిలాగే మెయిల్ చెక్ చేసుకుంటుంటే, జ్యోతిలక్ష్మి అనే పేరుతో మెయిల్ కనబడి మొదట కొంచెం భయం వేసింది. అయినా గుండె రాయి చేసుకుని ప్రింటౌట్ తీయించుకుని మరీ చదివా. ఇంతకూ మీకు జ్యోతిలక్ష్మి తెలియదు కదా! నన్ను జగదీష్, జగ్గూ అని పిలిచే జ్యోతిలక్ష్మి గురించి మీకు చెప్పే తీరాలి.

అవి బ్లాక్ అండ్ వైట్ రోజులు. నేను గుడివాడలో 6వ తరగతి చదువుతున్నాను. మేము శేషగిరిరావు గారింట్లో అద్దెకుండేవాళ్ళం. మా ఇంటి పక్కవాటాలో ఉండేది జ్యోతిలక్ష్మి. ఇద్దరం ఒకే బడి, ఒకే తరగతి. బొద్దుగా, నల్లగా, యమలోకంలో చిన్న యమభటురాలు లాగా ఉంటుంది. తనంటే నాకు చచ్చేంత భయం. అప్పట్లో తను పెట్టే హింసలకు మింగలేక కక్కలేక నానా యాతనా అనుభవించాను.

ఓ రోజు.. బడికి టైమైపోయింది. నేను అసలే హడావిడి మనిషిని. రాత్రి పైజమాకు బొందు ఎక్కించుకోవటం మరచిపోయా! బొందు కోసం హడావిడిగా తిరుగుతుంటే పెరట్లో జ్యోతిలక్ష్మి రిబ్బన్ కనపడింది. అలా దాన్ని మాయం చేసి ఇలా నా బొందుకు కట్టుకున్నా. మేమిద్దరం ఒకే సైకిల్ మీద బడికెళ్ళేవాళ్ళం. ఆరోజు ఎందుకో జ్యోతిలక్ష్మి నా మీద అనుమానపడుతూనే ఉంది. తీరా, తరగతిలో నేను చేసిన హోమ్ వర్క్ ను తనే చేసానని చూపించటం వల్ల నేను గోడకుర్చీ వేయవలసి వచ్చింది. గోడకుర్చీ వేయగానే తన బొందు బయట పడింది. అంతే, “నా రిబ్బన్ నాకిచ్చెయ్” అంటూ ఏడుపు మొదలు పెట్టింది. బొందు తీస్తే పైజమా ఊడిపోతుంది, తీయకపోతే అది ఏడుపు ఆపేటట్టులేదు. ఇంతయ్, గోరంతయ్, కొండంతయ్ అన్నట్టు ఏడుస్తూనే ఉంది. నాకు కాళ్ళూ, చేతులూ ఆడటం లేదు. ఎవరూ చూడకుండా వెంటనే రిబ్బన్ తీసి, తనకిచ్చి ఎడం చేత్తో పైజమా పట్టుకుని ఏడుస్తూ ఇంటికి పరుగుతీసా. ఇక నేను ఆ వారం మిగతా పిల్లలు ఏడిపిస్తారని బడికి వెళ్ళలేదు.

*****

ఓ సారి మా చింతాతయ్యగారు ఉగాది నాడు మా ఇద్దరికీ కన్యాశుల్కం కొనిచ్చారు. తనిలాంటి పుస్తకాలు చదవటంలో దిట్ట. ఓరోజు తను

ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్.
పొగచెట్టై జన్మించెన్
పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్!

అని ఈ పద్యం చదివి వినిపించి, “రేయ్ జగ్గూ, మనకీ దున్నపోతు జన్మెందుక”ని నన్ను శతవిధాలా ప్రోత్సహించి, మా పెత్తాతయ్య సుబ్బారావు గారి దగ్గర చుట్ట దొంగిలించి మా పెరటి అరటి పొదల్లోకి తీసుకెళ్ళింది. తనే చేతులారా చుట్టను నానోటిలో పెట్టి నిప్పంటించింది. తరువాత తెలిసింది తను అంటించిన నిప్పు నా కొంపకని. గట్టిగా ఓ మారు చుట్టామృతాన్ని పీల్చొదిలా. మరుక్షణం ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ కళ్ళు తెరచి చూసేటప్పటికి మా బంధువర్గ ముఖ్యులందరూ నా చుట్టూ గుమిగూడి ఉన్నారు. పక్క గదిలో నుండి “అప్పటికీ నేను చెపుతూనే ఉన్నాను తాతగారూ, జగదీషే ఏం పర్లేదని చుట్ట తాగాడు” అని జ్యోతిలక్ష్మి మా తాతగారితో చెప్పటం నాకు వినపడింది. అంతే, మా తాతగారు ప్రళయ తాండవం చేసి నా తొడ మీద వాతపెట్టారు.

ఇంతే కాదు, బడికి వెళ్ళేటప్పుడు సైకిలు నేనే తొక్కుతానంటూ, ప్రతీరోజు నన్ను క్రిందపడేయటమే. నవీన్ గాడి క్యారేజ్ తినేసి నా మీద నెట్టెయ్యడం, బడిలో నా హోంవర్కు చూపించటం.. ఛా, ప్రతీ రోజు నాకు గోడ కుర్చీనే. మళ్ళీ మార్కుల్లో నాకన్నా ఓ రెండు మార్కులు ముందుండేది. ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకోవటానికి సిగ్గేసేన్నిసార్లు నన్ను చిత్ర, విచిత్రంగా ఏడిపించేది. మా ఏడవ తరగతిలో మా నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ అవ్వటంతో ఎంతో ఆనందంగా వైజాగ్ వెళ్ళిపోయాను. తరువాత ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్ చేరుకున్నాను.

ఇంతకీ ఈమెయిల్ సారాంశం ఏమిటంటే “నేను బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్నాను. నన్ను రిసీవ్ చేసుకో. లేకపోతే నిన్ను మీ ఆఫీస్ లోనే చంపేస్తా, ఆఫీస్‌లో పనులున్నాయి అని యధవ సాకులు చెప్పకు. గుర్తు పెట్టుకో మే 9, ఎయిర్ పోర్ట్‌కు రా. ఒకవేళ నువ్వు రాకపోతే నేను సరాసరి మీ ఆఫీస్‌కే వచ్చి అందరి ముందు నీ పాడె కట్టేస్తా, నాగురించి తెలుసు కదా!” అవును, దీని గురించి నాకు బాగా తెలుసు. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత మెయిల్ చేస్తోంది గదా.. ఇలానా రాసేది? ఒకవేళ నేను కనుక వెళ్ళకపోతే పాడె కట్టటమే కాదు, ఇక్కడున్న అందరి చేత ‘క్యూ’ పద్ధతిలో దండలు కూడా వేయిస్తుంది. ‘అమ్మో!’ అనుకుని లీవ్ కోసం అప్లై చెయ్యటానికి లెటర్ తీసుకున్నా.

ఇంతలో మా బాస్ బాధేశ్వరరావు “ఏమయ్యా, ఏది ఏమైనా నీకు సుడుందోయ్” అంటూ రాని నవ్వు ఒకటి నవ్వుతూ నా దగ్గరకు వచ్చాడు. ఈయన ఏలాంటి వ్యక్తో ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఒకవేళ జ్యోతిలక్ష్మి కనుక ఆఫీస్‌లో నిజంగానే నన్ను చంపి పాడె కడితే ముందుగా దండేసేది ఈయనే. అయినా, ఓ పక్కన సుడిగుండం దగ్గర కొస్తూ ఉంటే నాకు సుడుందంటాడేంటి? ఎంత లేదన్నా మన బాస్ అన్న విషయం గుర్తుకొచ్చి లేచి నించోబోతుంటే “ఏం పర్లేదు లేవోయ్, నీకు తెలుసు కదా బెంగుళూరులో మన హెడ్ ఆఫీస్ ఉందని? నన్ను అక్కడికి ట్రాన్ఫర్ చేశారు. ఓ రెండు మూడు వేలు పెరగనుంది. ఏదో మనవాడివని చెపుతున్నా, నాకు మే 12వ తారీఖు నాడు బెంగుళూరులో రిపోర్టింగ్. నాలుగు రోజుల ముందు, అంటే రేపే, నేను హైదరాబాద్ వదిలి బెంగుళూరుకు వెళుతున్నా. ఇక్కడకు మే 10వ తారీఖు నాడు కొత్త బాస్ వస్తున్నారు. నా లాగా కాదులే. వద్దన్నా లీవ్‌లు, అడక్కుండా బోనస్‌లు, -మీ ఇష్టం అనుకో. ఇంతకీ సుడి గురించి వస్తే నీ ప్రమోషన్ గురించి కూడా ఓ మాటేసుంచా. రికార్డులు చూసి ‘ఓహ్ యస్’ అంటానని మాటిచ్చారు. ఈ కంపెనీకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా నువ్వే కొత్త బాస్‌ని రిసీవ్ చేసుకోవాలి, ఏమంటావ్”, అని అన్నాడు. ఇదేదో ఇరుక్కుపోయే సమస్యలా ఉంది అనుకుంటూ, “ఇంతకీ ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి?” అని అడిగా. “ఎప్పుడంటావేంటి మే 9. అంటే ఎల్లుండే!” అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు.

*****

అయిపోయింది, అంతా అయిపోయింది. ఉద్యోగంలో చేరేటప్పుడు బామ్మ ‘వినాయకుడికి దణ్ణం పెట్టుకోరా’ అంటే పెడచెవిని పెట్టా. చివరకు ప్రమోషన్ వచ్చే సమయానికి ఆపద ముంచుకొచ్చింది. అయినా ఇప్పుడు తెలిసొచ్చి ఏం లాభం? అటొచ్చి ఇటొచ్చి చివరకు నా ఉద్యోగం మీద కొచ్చింది. బాస్‌ను రిసీవ్ చేసుకోకపోతే బాస్ దగ్గర మంచి మార్కులు పడవు. ప్రమోషన్ కు ముప్పు, అదే.. జ్యోతిలక్ష్మిని పక్కన పెడితే? అమ్మో, ఇంకేమన్నా ఉందా? తిరుగుతున్న ఫానుకే ఉరేసి చంపేస్తుంది. అఫీసుకొచ్చి అన్నంత పనీ చేస్తుంది, పరువు తీస్తుంది, పరువు పోయిన చోట అసలు పని చెయ్యలేం. మళ్ళీ అసలీ ఉద్యోగానికే ఎసరొచ్చినా వస్తుంది. అయినా ఇన్నాళ్ళ తరువాత వస్తోంది కదా ‘జగదీష్, ఎలా ఉన్నావ్, పెళ్ళైందా? చిన్నప్పుడు నిన్ను ఏడిపించినందుకు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదామనుకుంటున్నాను.’ అనొచ్చు కదా? అబ్బే, ఏం లేదు. ‘వస్తావా లేకపోతే పొడిచెయ్యమంటావా?’ అంటుందా? అయినా, చిన్నప్పుడే జ్యోతిలక్ష్మికి కమ్యూనిష్టు కళలుండేవి. ఇప్పుడు ఏ ఫూలన్ దేవో, ఏ నక్సలైటు నాయకురాలో అయ్యుంటుంది, ఇక్కడేదో బాంబు పెట్టడానికి నన్ను ఓ బలిపశువుగా వాడుకోటానికి రమ్మనుంటుంది. ఇవన్నీ ఆలోచిస్తూంటే కాళ్ళొణికిపోతున్నాయి. చేతులు తడిసిపోతున్నాయి. ప్రమోషన్ ఈ రోజు కాకపోతే రేపొస్తుంది. ముందు ఈ ఉద్యోగం కాపాడుకోవాలి అనుకుని బాధేశ్వరరావు దగ్గరకు వెళ్ళి నా బాధంతా చెప్పా. బాధేశ్వరరావ్ ముందుగా బాధపడ్డాడు, తరువాత భయపడ్డాడు, తరువాత నా పరిస్థితి చూసి జాలిపడ్డాడు. ఓ పది నిమిషాలు పాటు ఆలోచించి, “సరే, నేను చూసుకుంటాలే. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నువ్వు మే 10వ తారీఖు నాడు ఉదయం 8:30 అయ్యేటప్పటికి ఇక్కడుండాలి” అని సల సల కాగుతున్న నూనె బాండీలో నుంచి నన్ను బయట పడేశాడు. ఆ మరుసటి రోజు జ్యోతిలక్ష్మికి మెయిల్ పెట్టా, రెండు ముక్కల్లో “వస్తున్నాను -జగదీష్ ” అని.

అయినా ఒక ఆడది చెట్టంత మగవాడిని ఇలా వణికిస్తుందా? ఆడది ఏడిస్తే “ఎందుకురా ఆడదాన్ని ఏడిపిస్తావ్?” అంటారు, అదే మగవాడు నిజంగా బాధల్లోనే ఏడిస్తే ఆడదానిలా ఏడవద్దంటారు. నా బాధేంటంటే చివరకు ఈ మాటనే వాడూ మగవాడే. అదీ ఆడదంటే. అయినా అందరూ ఒకలానే ఉంటారా ఏమిటి నాలాగా మగాడు మూగోడైతే ఆడది ఆడిస్తూనే ఉంటుంది. ఆవకాయ కూడా గట్టిగా రెండు ముద్దలు తినలేని వాడిని అల్ ఖైదాలో ఇరికించేటట్టు ఉంది. ఏ టివి ఛానెల్ క్రింద స్క్రోలింగ్‌లోనో నా పేరు చూడాల్సొస్తుందని భయంతో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా.

*******

“ఏరా, జ్యోతిలక్ష్మి వస్తుందని చెప్పలేదే? తను ఫోన్ చేసింది. ఓ ఇరవై నిమిషాలలో ఫైట్ దిగుతుందట…”, అని అమ్మ చెప్పగానే ఒక్కసారిగా మెళుకువ వచ్చింది. అయిదు నిమిషాలలో రెడీ అయ్యి పది నిమిషాలలో ఎయిర్ పోర్ట్ చేరుకున్నా. మూలెక్కడో భయంగా ఉన్నా, తను చెప్పినట్టుగానే ఎరుపు చొక్కా మీద బ్లూ పాంట్ వేసుకుని మెయిన్ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నా. అలా ఓ 15 నిమిషాల తరువాత..

“హాయ్ జగ్గూ !” అంటూ వెనుకనుండి పిలుపు వినపడటంతో వెనక్కి తిరిగా.

అయినా ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో? అయినా హైదరాబాద్ లో దిగీ దిగంగానే నన్నెందుకు చూడాలనుకోవటం. చూద్దాం, రేపాదివారం వస్తానందిగా. ఇలా రకరకాల ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నా.

బాపూ బొమ్మకు ప్రాణం పోసినట్టుంది ఆ అమ్మాయి. “ఏంటి అలా ఉన్నావ్? నన్ను గుర్తుపట్టలేదా?” అ నడిగింది. జ్యోతిలక్ష్మి అని అర్థమైంది గానీ, నా నోట మాట రావట్లేదు. ఓ అందమైన కల కదిలొచ్చినట్టుంది. చాలాసేపు ఏం మాట్లాడలేక పోయాను. తన అందం నన్ను మాట్లాడనివ్వలేదు. తన అందమైన కళ్ళతో నన్ను కట్టిపడేసింది. ఇంతలో తనే “ఎలా ఉన్నావ్?” అని అనడిగింది. “నేను బానే ఉన్నాను, ఇంతకీ నువ్వెలా ఉన్నావ్ జ్యో” అన్నాను.

“బానే ఉన్నాను గానీ, కొత్తగా ఆ జ్యో ఏమిటి?”

“చిన్నప్పుడు నువ్వే చెప్పావ్‌గా శేషగిరిరావు గొడ్లపాక వెనకాల, నిన్ను జ్యో అని పిలవమని, మరచిపోయావా?”

“ఓహ్, నీకింకా గుర్తుందే!”

“ఎలా మరచిపోతాను చెప్పు, అవన్నీ…”

“ఇంతకీ ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు?”

“అందరూ బానే ఉన్నారు. ముందు ఇంటికి పద.”

“వెయిట్, లగేజ్ ఎక్కువగా ఉంది. ఎవరన్నా కూలీని పిలవచ్చు కదా…”

“ఛా, కూలీలెందుకు? నేనున్నానుగా, ఎందుకు డబ్బుల దండగా?” అని ఆ క్షణాన కూలీనయ్యా.

రెండడుగులు వెయ్యగానే “అయ్యో, నాకు ఆ బాగ్ ఇవ్వులే, నేను మోస్తాను” అని బలవంతంగా నా చేతిలోనుండి బాగ్ లాక్కుంది.

“ఓ మంచి కాఫీ తాగుదామా? నాకు కొంచం టైడ్ గా ఉంది.”

“ఓ షూర్” అని పక్కనే ఉన్న కాఫీడేకి వెళ్ళాం.

వెళ్ళి కూర్చోగానే “జగ్గూ, నాకీరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆఫీస్‌లో రిపోర్టింగ్ ఉంది, నా ఫ్రెండ్ రమ్య వస్తానంది, ఎందుకో దిగీ దిగగానే నిన్ను చూడాలనిపించింది. మీ ఇంటికి నేను ఎల్లుండి ఆదివారం వస్తా, నన్నీ విషయంలో ఇబ్బంది పెట్టకు” అంది. నేను కూడా తనని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక “సరే” ఆన్నాను. ఇంతలో తన స్నేహితురాలు రమ్య వచ్చింది. తను నా మొబైల్ నంబర్ తీసుకుంది. ఓ అరగంట సేపు మాట్లాడిన తర్వాత, నేనే దగ్గరుండి ఆటో ఎక్కించాను.

******

తన గురించే ఆలోచిస్తూ రాత్రి మంచం మీద వాలాను. చిన్నప్పటిలా లేదు తను, ఎంతో మారింది. తనతో ఉన్న అరగంటలోనే అది అర్థమైంది. నేను మోస్తుంటే తను కూడ తనవంతుగా బ్యాగ్ తీసుకుంది. కెఫేలో కూడా బిల్ తనే ఇచ్చింది. తెలిసినమ్మాయి, వీటన్నిటికీ మించి ఆ అందం. అయినా ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో? అయినా హైదరాబాద్ లో దిగీ దిగంగానే నన్నెందుకు చూడాలనుకోవటం. చూద్దాం, రేపాదివారం వస్తానందిగా. ఇలా రకరకాల ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నా.

******

“…కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నువ్వు మే 10వ తారీఖు నాడు ఉదయం 8:30 అయ్యేసరికి ఇక్కడుండాలి.” అన్న మాటలు గుర్తొచ్చి ఒక్కసారి ఉలిక్కి పడి లేచా. టైమ్ చూస్తే 9:30 అయ్యింది, ‘ఛచ్చాన్రా దేవుడా’ అనుకుంటూ 9:45 అయ్యేసరికి ఆఫీస్ లిఫ్ట్ లో ఉన్నాను. అసలే కొత్త బాస్. ఆఫీస్ అంతా ఒక్కరోజులో చాలా మారిపోయింది. Work is worship, There is no wrong time to do the right thing. వంటి వాల్ పోస్టర్స్ అతికించున్నాయి. మార్కెట్‌లా ఉండే మా ఆఫీసంతా నీట్ గా ఉంది. అందరూ ఫార్మల్స్ లో ఉన్నారు. నేను లోపలికి రాగానే అందరూ నన్ను జాలిగా చూశారు. ఇంతలో మా ప్యూన్ పరంధామం వచ్చి మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు అన్నాడు. వెంటనే అందరూ తలదించి పనిచేసుకోవడం మొదలు పెట్టారు. ‘అయినా బాధేశ్వరరావు అన్నీ చెప్పే ఉంటాడులే’ అనుకున్నా. “మే అయ్ కమిన్” అంటూ లోపలకు ఆడుగుపెట్టా.

“రండి సార్, మీ రికార్డ్సే చూస్తున్నా. ఒకరోజు ఆఫీస్ మానేటప్పుడు లీవ్ లెటర్ ఇవ్వాలని కూడా తెలియదా? అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా? మీరసలు చూడటానికి AGM లా ఉన్నారా? మీరే ఇలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటారు? మీ డ్రస్ కోడ్ ఏది? ఎలా పడితే అలానే వస్తారా? అయినా అసలెన్నింటికి రావటం? ప్రతి రోజూ ఇంతేనా? మీ గురించి మీరేమనుకుంటున్నారు? మిమ్మల్ని అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారా?” నా పరిస్థితి వర్ణనాతీతం. ఆ బాధేశ్వర్రావ్ గాడు నాకు పెద్ద హాండే ఇచ్చాడు. అడగకుండా లీవ్ లంటూ ఏవో వెధవమాటలు చెప్పాడు. ఇక్కడ పరిస్థితి చూస్తే అంతా తలకిందులుగా ఉంది. ఇంతలో నా పరిస్థితి మరీ విషమం అయ్యింది. పాత పెండింగ్ ఫైల్స్ అన్నీ బయటకు తీసి అన్నీ చెక్ చెయ్యటం, వాటి గురించి తిట్టడం, ఏడిస్తే బాగోదని ఏడవట్లేదంతే. అయినా ఆగట్లేదు. ఆగకుండా వచ్చే ఏడుపును ఎలా ఆపుకోవాలో అర్థమౌవట్లేదు. అప్పటివరకూ ఉన్న ‘మీరు’ కాస్త ‘నువ్వు’ గా మారింది. ఓ రెండు గంటల తరువాత, “ఈ ఫైల్స్ అన్నీ కంప్లీట్ అయ్యేదాకా నాకు నీ మొహం చూపించద్దు పో…” అన్న ఈ చివరి మాట తరువాత బయటకు వెళ్ళటానికి ఏదో విధంగా అవకాశం వచ్చింది. అడుగులో అడుగేసుకుంటూ బాధను మింగుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగా.

బయటకు వచ్చా. అందరూ నా వంకే చూస్తున్నారు. “ఒసేయ్ జ్యోతిలక్ష్మి! నా పాలిటి శని. మళ్ళీ ఇక్కడ G.M రూపంలో తగలడ్డావా !! ” అని నల్దిక్కులూ దద్దరిల్లేలా అరిచా.

————-

బూదరాజు అశ్విన్

బూదరాజు అశ్విన్

బూదరాజు అశ్విన్ ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ బ్లాగు ద్వారా బ్లాగు ప్రపంచానికి సుపరిచితులు. పుట్టిందీ, పెరిగిందీ బెజవాడలో. సినిమాలన్నా, సిరివెన్నెల పాటన్నా, కామెడీ అన్నా చాలా ఇష్టమని చెప్పే అశ్విన్ సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేస్తున్నారు.

Posted in కథ | Tagged | 46 Comments