మృతజీవులు – 22

-కొడవటిగంటి కుటుంబరావు

గ్రామం చూడగా కొంచెం పెద్దదిలాగే ఉన్నది. దానికి రెండు ప్రక్కలా రెక్కల్లాగా రెండు తోపులున్నాయి; ఒకదానిలో పైన్ చెట్లూ రెండో దానిలో బర్చ్ చెట్లూ ఉన్నాయి; ఒకటి కాస్త తేలిక రంగూ, రెండవది ముదురురంగూ. మధ్యగా కలపతో కట్టిన ఇల్లున్నది. దాని కప్పు ఎర్రగానూ, గోడలు గచ్చకాయ రంగులోను ఉన్నాయి – అంటే, వాటికి వేరే రంగు వేయలేదు. రష్యాలో మిలిటరీ సెటిల్మెంట్లూ, జర్మను వలసదార్లు కట్టే ఇళ్ళూ ఒకే విధంగా ఉంటాయి. ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో కట్టినవాడికీ, ఇంటివాడికీ సామరస్యం కుదరనట్టు స్పష్టమవుతున్నది. ఇల్లు కట్టిన ఇంజనీరు శాస్త్రప్రకారం వెళ్ళాలనే రకం. ఇంటి యజమాని సౌకర్యం కోరే రకం. అందుచేత ఆయన ఒక పక్కనుండే కిటికీలన్నీ చెక్కలు కొట్టి మూసేసి, వాటికి బదులుగా గోడలో ఒక చిన్న కంత – ఏ చీకటి అటకమీదో వెలుతురు పడటానికి – ఏర్పాటు చేశాడు. ఇల్లు కట్టినవాడు ఇంట్లో ముందుభాగాన్ని సమంగా ఉంచేట్టు చూడటానికి విశ్వప్రయత్నం చేసి విఫలుడైనాడు. ఎందుకంటే ఇంటి యజమాని ముందు స్తంభాలలో ఒక పక్కది ఎత్తిపారెయ్యాలని పట్టుపట్టాడు. దాని ఫలితంగా స్తంభాలు నాలుగుండవలసింది మూడే ఉన్నాయి. ఆవరణ చుట్టూతా దృఢంగానూ, అమిత బలంగానూ ఉన్న కొయ్యల కంచె అమర్చబడింది. అసలు సబాకవిచ్‌కి గట్టితనం ఇష్టమని తెలుస్తూనే ఉన్నది. గుర్రాల కొట్టాలకూ, ధాన్యపు కొట్లకూ, వంటశాలలకూ మంచి భారీ అయిన దూలాలు, ఒక శతాబ్దం పాటు చలనం లేనివి ఉపయోగించబడ్డాయి. గ్రామంలో వ్యవసాయకుల ఇళ్ళు కూడా గట్టి కలపతో కట్టినవే. చిట్టచివరకు బావికి కూడా మరలకూ పడవలకూ ఉపయోగించే బలమైన ఓక్ దుంగలు వాడారు. ఎటు చూసినా ప్రతిదీ దృఢంగానూ, బలంగానూ, మొరటుగానూ కనిపించిందన్నమాట. అతను బండిలో మెట్లను చేరవచ్చే సమయానికి, ఒకదాని వెంబడి ఒకటిగా రెండుముఖాలు కిటికీ వద్దకు వచ్చి బయటికి చూశాయి. వాటిలో ఒకటి ఆడముఖం, ఆవిడ నెత్తిన దోసకాయ ఆకారంలో ఒక కుళాయి ఉన్నది; రెండవది మగముఖం. “గొర్ల్యాంకా” అనే మోల్టావియా గుమ్మడికాయలాగా ఉన్నది. వాటి బుర్రలను రష్యనులు ‘బలలాయ్‌క’ అనే రెండు తీగల వాద్యాలకు ఉపయోగిస్తారు. వాటిని కాపు యువకులు ఉత్సాహంతో వాయిస్తూ, తమ పాట వినటానికి మూగే అమ్మాయిల తెల్లని రొమ్ములనూ, మెడలనూ చూసి కళ్లు గీటుతూ ఈలలు వేస్తారు. కిటికీలోంచి రెండు ముఖాలూ ఒక్కసారే మాయమయాయి, ఉద్యోగపు దుస్తులు ధరించిన బంట్రోతు ఒకడు మెట్లమీదికి వచ్చి చిచీకవ్‌ను హాలులోకి తీసుకుపోయాడు. అక్కడ అప్పటికే నిలబడియున్న ఇంటి యజమాని తన అతిథిని చూసి, ముక్తసరిగా “దయచేసి” అంటూ లోపలికి తీసుకుపోయాడు.

‘ఇతడికీ వాళ్ళకూ పడదులాగుంది. పోలీసు అధిపతిని గురించి మాట్లాడదాం, ఆయనతో స్నేహం ఉండవచ్చు’ అనుకుని “ఆ మాటకు వస్తే అందరికన్నా బాగా నచ్చినవాడు పోలీసు అధిపతి. ఎలాటి కపటమూ ఎరగని బోళామనిషి; ఆయన మొహంలో స్నేహభావం ఉట్టిపడుతుంది” అన్నాడు.

సబాకవిచ్ తాపీగా “పరమ లుచ్ఛా! నిన్ను మోసగించి నీతోనే విందులు కుడుస్తాడు. వాళ్ళందరినీ ఎరుగుదును: అందరూ లుచ్ఛాలే. పట్నమంతా ఇదే సజ్జు. లుచ్ఛాలే లుచ్ఛాలను విచారిస్తారు, లుచ్ఛాలకు శిక్షలు విధిస్తారు, అందరూ నమ్మకద్రోహులే. వాళ్ళలో ఒకడే కాస్త మంచివాడున్నాడు -ప్రాసిక్యూటరు. నిజం చెప్పాలంటే వాడు పందిముండాకొడుకే” అన్నాడు.

చిచీకవ్ సబాకవిచ్ కేసి ఒకసారి పక్కచూపుచూసి ఈసారి ఆయన ఎలుగుబంటి లాగా ఉండటం గమనించాడు. దీనికి తగ్గట్టుగానే ఆయన ధరించిన డ్రెస్‌కోటు ఎలుగుబంటి రంగులో ఉన్నది, దాని చేతులు పొడవుగా ఉన్నాయి. ఆయన ధరించిన లాగు కూడా పొడవే; ఆయన అటూ ఇటూ ఒరుగుతూ నడిచాడు. నడిచేటప్పుడు పక్కనున్నవాళ్ళ కాళ్లు తొక్కటం ఆయనకు అలవాటు. ఆయన ముఖం రాగి ఎరుపు. ప్రకృతి నిర్లక్ష్యంగా, సున్నితమైన పరికరాలను ఉపయోగించకుండా, గొడ్డలితో ఒక్క చెక్కు చెక్కి ముక్కు తయారుచేసి, బర్మాతో రెండు బొక్కలు పొడిచి కళ్లు చేసి, ఏమాత్రమూ మెరుగులు దిద్దకుండా, ఈ మొహాలకు “ఈపాటి చాల్లే” అన్న ధోరణిలో తయారుచేసిన మొహాలు అనేకం ప్రపంచం నిండా ఉన్నాయి. సబాకవిచ్‌ది వింతగా చెక్కిన అలాంటి మొహం. ఆయన ఆ మొహాన్ని ఎప్పుడూ నిటారుగా ఉంచక వాలి ఉండనిచ్చేవాడు. ఆయనకు మెడ తిరిగేది కాదు. అందుచేత సాధారణంగా, మాట్లాడుతుండే మనిషికేసి చూడక ఏ మూలకేసో, తలుపుకేసో చూసేవాడు. వాళ్ళు భోజనశాలలో ప్రవేశించేటప్పుడు చిచీకవ్ మరొకసారి ఆయనకేసి ఒక ఓరచూపు చూశాడు; ఆయన అచ్చు ఎలుగుగొడ్డే. ఈ పోలికకు తోడు ఆయన పేరుకూడా మిఖాయిల్ సిమ్యోనీవిచ్… ఆయనకు ఇతరుల కాళ్లు తొక్కే అలవాటున్నదని తెలిసి చిచీకవ్ కొంచెం ఎడంగా జరిగి తన కాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటూ ఆయననే ముందు నడవనిచ్చాడు. తనకున్న దురలవాటు గురించి సబాకవిచ్ కూడా ఎరుగు లాగుంది. ఆయన వెంటనే తనవల్ల ఇబ్బంది ఏమీ కలగలేదు గద అని అడిగాడు. ఇంతవరకూ ఏమీ కలగలేదని చిచీకవ్ కృతజ్ఞతా పూర్వకంగా చెప్పాడు.

వారు డ్రాయింగ్‌రూమ్‌లో ప్రవేశించాక సబాకవిచ్ ఒక ఖాళీ కుర్చీ చూపిస్తూ ‘దయచేసి’ అన్నాడు. చిచీకవ్ కూచుని గోడలకున్న పటాలను చూశాడు. అవి వీరులైన గ్రీకు సేనానుల చిత్తరువులు, ఆపాదమస్తకం చిత్రించినవి. వాటిలో ఎర్రని లాగూ, యూనిఫారము, కళ్ళద్దాలూ ధరించిన మావ్రొకోర్టాటో, మియేలిస్, కనారిస్ ఉన్నారు. ఈ వీరులందరికీ బలిష్ఠమైన పిక్కలు, భయంకరమైన మీసాలూ ఉండి చూస్తేనే దడ పుట్టిస్తున్నాయి. ఈ గ్రీకువీరుల మధ్య ఎందుకో అర్థం కాకుండా బగ్రాతియోన్ చిత్తరువున్నది; ఇరుకైన చట్రంలో అమిత సన్నగా ఉన్న ఆయన ఆకృతీ, చిన్నచిన్న జెండాలూ, కిందుగా ఫిరంగులూ ఉన్నాయి. తరువాత వీరనారీమణి అయిన బోబెలీనా చిత్తరువు ఉన్నది. అవతల ఉన్న షోకిలా పురుషుడు ఈ వీరనారీమణి కాలున్నంత లావు లేడు – ఈ కాలంలో ఈ షోకిలా పురుషుల బొమ్మలు ప్రతి డ్రాయింగ్‌రూమ్ లోనూ ఉంటున్నాయి. ఇల్లుగలాయన మంచి ఒడ్డూ పొడుగూగల మనిషి కావడంతో తన గోడల నిండా తనలాంటివాళ్ళ బొమ్మలే ఉంచటానికి ప్రయత్నించాడా అనిపిస్తున్నది. బోబెలీనా సమీపంలో కిటికీలో ఒక పంజరం వేళ్ళాడుతున్నది. అందులో తెల్లచుక్కలు గల నల్లపక్షి ఒకటి ఉన్నది. అదికూడా సబాకవిచ్ లాగే ఉన్నది. ఇంటాయనా, అతిథీ రెండు నిముషాలు మౌనంగా కూచున్నారో లేదో తలుపు తెరుచుకుని ఇంటావిడ వచ్చింది. ఆవిడ చాలా ఎత్తయిన మనిషి, నెత్తిన రంగు రిబ్బనులు గల కుళాయి పెట్టుకున్నది. ఆవిడ తాటిచెట్టులాగా ఎత్తిపెట్టుకుని చాలా హుందాగా ప్రవేశించింది.

ఈమె “మా ఫియొదూలియ ఇవానవ్నా” అనాడు సబాకవిచ్.

చిచీకవ్ వంగి ఫియొదూలియ ఇవనవ్నా చేతిని ముద్దుపెట్టుకునేటప్పుడు ఆమె తనచేతిని అతని మూతికేసి తోసింది. అతనికామె చెయ్యి దోసకాయ వాసన కొట్టింది.

“వీరు పావెల్ ఇవానవిచ్ చిచీకవ్: గవర్నరు గారి ఇంటివద్దా, పోలీసు అధిపతి ఇంటివద్దా నాకు వీరి పరిచయ భాగ్యం కలిగింది” అన్నాడు సబాకవిచ్.

ఫియొదూలియ ఇవానవ్నా తన భర్తలాగే ముక్తసరిగా “దయచేసి” అనిన రాణీపాత్ర ధరించిన నటిలాగా తల ఆడించి, చిచీకవ్‌ను కూచోమన్నది. తరవాత ఆవిడ గొర్రెబొచ్చు శాలువను కప్పుకొంటూ సోఫాలో చేరి, కంటిరెప్పలుగాని, కనుబొమలుగాని ఆడించకుండా నిశ్చలంగా కూచున్నది.

చిచీకవ్ మళ్లీ ఒకసారి కనారిస్‌కు గల లావైన పిక్కలనూ అంతులేని మీసాలనూ, బోబెలీనానూ, పంజరంలోని పక్షినీ చూశాడు. పంజరం అడుగున ఉన్న గింజలను ఏరుకుతింటూ పక్షి చేసే టకటక తప్ప అంతా నిశ్శబ్దం. చిచీకవ్ మరొకసారి గది అంతా కలయజూశాడు, ఏ వస్తువు చూసినా లావుగానూ, మొరటుగానూ, ఇంటి యజమానిలాగే ఉన్నది. గదికి ఒక మూల గుండ్రని బీరువా ఒకటి ఎలుగుబంటిలాగా ఉన్నది. దానికి నాలుగు అర్థం లేని కోళ్లున్నాయి. బల్లా, చిన్న కుర్చీలూ, అన్నీ అమిత బరువుగానూ, సౌఖ్యహీనంగానూ ఉన్నాయి. ప్రతి కుర్చీ, ప్రతి వస్తువూ కూడా “నేను సబాకవిచ్‌నే” అనో, “నేను కూడా సబాకవిచ్ లాటిదాన్నే!” అనో ప్రకటిస్తున్నట్టుగా ఉన్నదన్నమాట.

ఎవరూ ప్రసంగించే ప్రయత్నంలో లేరని గ్రహించిన చిచీకవ్, “కిందటి గురువారం ఇవాన్ గ్రిగొయెవిచ్, అంటే న్యాయస్థానాధ్యక్షుడు గారి ఇంటివద్ద మిమ్మల్ని గురించే అనుకున్నాం. మంచి వినోదంగా గడిచింది.” అన్నాడు.

“అవును, ఆరోజు నేను అధ్యక్షుడు గారింటికి రాలేదు” అన్నాడు సబాకవిచ్.

“అద్భుతమైన మనిషి!”

“ఎవరూ?” అన్నాడు సబాకవిచ్ స్టవ్ మూలకేసి చూస్తూ.

“అధ్యక్షుడు”

“మీకలా కనిపించింది గామాలు. కావటానికి ఫ్రీమేజనేగాని, అంత బుద్ధితక్కువవాడు ప్రపంచంలో మరి ఉండడు.”

ఈ ఘాటైన విమర్శకు చిచీకవ్ అదురుకున్నాడు. అయితే వెంటనే కోలుకొని, “అందరికీ ఏదో ఒక లోపం ఉండనే ఉంటుంది మరి. కాని గవర్నరుగారిని చూడండి, ఎంత సరదా అయిన మనిషో” అన్నాడు.

“గవర్నరా సరదా యైన మనిషి?””

“కాదూ?”

“ప్రపంచంలో అంతటి దురాత్ముడుండబోడు”

“ఏమిటీ? గవర్నరు దురాత్ముడా?” అన్నాడు చిచీకవ్, గవర్నరు ఎలా దురాత్ముడవుతాడో ఊహించలేక బిత్తరపోయి. “నాకు నేను అలా ఎన్నడూ అనుకోగలిగి ఉండనని చెప్పాలి. ఆయన ప్రవర్తన అలాటి భావాన్ని కలిగించదని తమరు ఒప్పుకోవాలి. మీదుమిక్కిలి ఆయనలో ఎంతో మార్దవం ఉన్నది”. ఇందుకు తార్కాణంగా గవర్నరుగారి స్వహస్తాలతో ఎంబ్రాయిడరీ చేసిన సంచీలనూ, ఆయన ముఖాన తాండవించే సౌమ్యాన్నీ పేర్కొన్నాడు.

“వాడిది దొంగ మొహం! వాడి చేతిలో కత్తిపెట్టి రహదారి పైన వదిలితే రాగిదమ్మిడీ కోసం గొంతులు కోసేస్తాడు, తప్పకుండా! వాడొకడూ, వైస్ గవర్నరొకడూ, ఇద్దరూ ఇద్దరే -అహి మహిరావణులు” అన్నాడు సబాకవిచ్.

‘ఇతడికీ వాళ్ళకూ పడదులాగుంది. పోలీసు అధిపతిని గురించి మాట్లాడదాం, ఆయనతో స్నేహం ఉండవచ్చు’ అనుకుని “ఆ మాటకు వస్తే అందరికన్నా బాగా నచ్చినవాడు పోలీసు అధిపతి. ఎలాటి కపటమూ ఎరగని బోళామనిషి; ఆయన మొహంలో స్నేహభావం ఉట్టిపడుతుంది” అన్నాడు.

సబాకవిచ్ తాపీగా “పరమ లుచ్ఛా! నిన్ను మోసగించి నీతోనే విందులు కుడుస్తాడు. వాళ్ళందరినీ ఎరుగుదును: అందరూ లుచ్ఛాలే. పట్నమంతా ఇదే సజ్జు. లుచ్ఛాలే లుచ్ఛాలను విచారిస్తారు, లుచ్ఛాలకు శిక్షలు విధిస్తారు, అందరూ నమ్మకద్రోహులే. వాళ్ళలో ఒకడే కాస్త మంచివాడున్నాడు -ప్రాసిక్యూటరు. నిజం చెప్పాలంటే వాడు పందిముండాకొడుకే” అన్నాడు.

ఇంతమందినీ ఈవిధంగా వర్ణించినాక ఇక ఇతర అధికారులను గురించి మాట్లాడి ప్రయోజనం లేదనీ, ఎవరిని మెచ్చుకున్నా సబాకవిచ్ సహించడనీ చిచీకవ్ గ్రహించాడు.

“భోజనానికి లేద్దామా?” అని సబాకవిచ్ భార్య భర్తతో అన్నది.

“దయచేసి!” అన్నాడు సబాకవిచ్. ఇద్దరు పెద్దమనుషులూ వంటకాలు పెట్టివున్న బల్లవద్దకు వెళ్ళి, చెరొక గ్లాసూ వోడ్కా తాగారు. వాళ్ళు వంటకాలను ముందుగా రుచి చూశారు; విశాలమైన రష్యా దేశంలోని ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ ఇలా వంటకాలను రుచి చూడటం ఆచారంగా ఉన్నది. తరవాత అందరూ కలిసి భోజనాల గదిలోకి వెళ్ళారు, ఈదుతున్న బాతులాగా ఇంటావిడ ముందు నడిచింది. భోజనాల బల్లమీద నలుగురి కోసం పళ్లేలు పెట్టి ఉన్నాయి. నాలుగో స్థానంలో కొద్దిసేపటికల్లా ఒక ముప్ఫై ఏళ్ళ వయసుగల యువతి, రంగు రుమాలుతో సహా వచ్చి కూచున్నది; ఆవిడకు పెళ్ళి అయిందో లేక ఇంకా కన్యో, చుట్టమో, ఇంట్లో పనికి సహాయం చేసే మనిషో, కేవలం ఆ ఇంట్లో నివసిస్తున్న మనిషో స్పష్టంగా నిర్ణయించటానికి లేకపోయింది. కొందరు వ్యక్తులు ఈ ప్రపంచంలోగల ప్రధాన వస్తువుల కింద జమగాక, ఆ వస్తువులపై ఆశ్రయం సంపాదించిన మరకల్లాగానూ, నలకల్లాగానూ ఉంటారు. వీళ్ళెప్పుడూ ఒకేచోట కూచుంటారు. తల అటూ ఇటూ తిప్పరు. వాళ్ళను ఇంట్లో ఉండే చెక్కసామాను కింద పరిగణించేస్తాం, వాళ్ళ నోటివెంట ఎప్పుడైనా మాట వస్తుందని కూడా అనుకోలేం. కాని ఇంటి మారుమూలల ఏ దాసీలుండే భాగంలోనో, సామాన్ల గదిలోనో విచారించినట్టయితే మనమనుకునేదంతా తారుమారవుతుంది.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 22

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 3

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

రాయలసీమ లోని గ్రామ పార్టీల గురించి ‘పాండవబీడు‘, కనుమరుగైపోతున్న సాంప్రదాయక కళల గురించి ‘తోలుబొమ్మలాట‘, గ్రామీణ జీవితాల్లో వ్యవసాయరంగంలో వస్తోన్న మార్పుల గురించి ‘కాడి‘, మగ విద్వేషానికి బలయిన చారిత్రక వీరవనిత గురించి ‘పాలెగత్తె‘, శ్రమైక జీవన సౌందర్యాన్ని గురించి ‘చినుకుల సవ్వడి‘ నవలలు రాసారు. తదుపరి ప్రణాళిక ఏమిటి?

పల్లె జీవితంలో విపరీతమైన మార్పులొస్తున్నాయి. ప్రపంచీకరణ వల్లా, సరళీకృత ఆర్థిక విధానాల వల్లా, మార్కెటీకరణ వల్లా పల్లె మనుగడలో పెనుమార్పులు సంభవిస్తూ వున్నాయి. రైతులిప్పుడు వ్యవసాయం చేసి బతికే పరిస్థితుల్లో లేరు. అలాగని సెంటు భూమి కూడా బంజరుగా లేదు. తరాల తరబడి బీళ్ళుగా పడి వున్న భూములన్నిట్నీ ఎక్కడెక్కడి ప్రాంతాలవాళ్ళో వచ్చి, కొని, కంచెలు నాటుతున్నారు. ‘పొరుగూరి చాకిరి, పొరుగూరి సేద్యం తనను తినేవేగాని తను తినేవి కావు’ అనే సామెతకు అర్థం లేకుండా పోయింది. పొరుగూరి సేద్యానికే రైతు భయపడుతూ వున్న కాలాన్నించి వేల మైళ్ళ దూరాన్నించి వచ్చి ఇక్కడ భూములు కొని అక్కణ్నించే సేద్దెం చేయించే పరిస్థితి ఒకటి కొత్తగా వచ్చింది. దీన్ని ఎట్లా అర్థం చేసికోవాలో తెలీకుండా వుంది. ఈ మార్పులన్నింటికీ మూలాలేవో వెదకే దశలో నేనింకా సాహిత్య సృజన చేయాల్సిన అవసరం వుంది.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.

సాహితీ వ్యవసాయంలో మీరింకా పండించదలచినవేమిటి?

ఇన్నేళ్ల నా సాహితీ వ్యవసాయంలో నేను పండించింది తక్కువే. ఒకటి రెండు మంచి పంటలు పండించొచ్చుగాక, పరిపూర్ణమైన పంట నానుంచి ఇంకా రాలేదనే నా అభిప్రాయం. నా చుట్టూ వున్న జీవితాన్ని నేను చూడాల్సిన కోణాలు ఇంకా చాలా మిగిలి వున్నాయి. వాటి గురించిన స్పష్టత నాకింకా రావలసి వుంది. నేను రోజూ చూస్తూనే వున్నా, మాట్లాడుతూనే వున్నా కొని జీవితాల్ని నేనింకా అర్థం చేసికోలేకపోతున్నాను. కూచుని దృష్టిని సంధించాల్సిన కోణమేదో అందీ అందనట్లుగా వుంది. నా తరంతోనే అంతరించిపోతూవున్న అచ్చ తెలుగు వాడుక పదాలూ, వ్యవహారాలూ, పలుకుబళ్ళూ, సామెతల్ని సాహిత్యంలో నిక్షిప్తం చేయవలసి వుంది. భవిష్యత్తులో నా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వాళ్లకు రాయలసీమ వ్యావసాయక పల్లెదనం ఒక తరంలో పొందిన పరిణామం స్పష్టంగా కంపించాలి. అందుకై నేనింకా కవితలూ, కథలూ, నవలల్ని విస్తృతంగా రాయవలసి వుంది.

దిగంబరం‘ కథా కథనం చాలా బలంగా వచ్చింది. ఆ కథలోని కుటుంబ యజమానిలాంటి బతికి చెడిన రైతులు రాయలసీమలో చాలా మందే కనపడతారు. కానీ-ఆ రైతు చెల్లెలు, కూతుర్ల అవసరాలను, సంఘర్షణలను అంత దగ్గరగా ఎలా చూపించగలిగారు? కథలోని యీ పాత్రల నేపధ్యం మీ జీవితానుభవాల్లోనిదేనా? దాని గురించి చెప్పండి.

దిగంబరం‘ లోని పాత్రలు నేనెరిగినవే. మా యింటి పక్కవే. నేనే కాదు-రాయలసీమలో చాలా వూర్లలో ఇలాంటి పాత్రలు కోకొల్లలుగా దొరుకుతాయి. అయితే ఇందులోని చెల్లెలు, కూతుర్ల పాత్రలు కూడా నాకు తెలిసినవే కావటం విశేషం. వాళ్ల మానసిక సంఘర్షణకు దగ్గరగా వెళ్లి రాయటం నాకున్న పాత్రల అవగాహనవల్ల, పరిశీలన వల్ల సాధ్యమయింది. అయితే కొన్ని కొన్ని సంఘటనలు నేను కథలో చెప్పినట్లే ఏకకాలంలో ఒకే వేదిక మీద జరగాల్సిన పని లేదు. కథ, పాత్రలు, వాతావరణం ఆ యింటి నుంచే తీసికొన్నా, కథ చివరిలో ముసలోడి ఆవేదన మరో యింటినుంచి తీసికొని వుండొచ్చు. ఏక కాలంలో ఒకేచోట జరిగినట్లుగా చిత్రించిన సంఘటనలు వివిధ కాలాల్లో, వివిధ ప్రదేశాల్లో, వివిధ పాత్రల మధ్య వివిధ సంఘటనలుగా జరిగి ఉండొచ్చు. వాటిని కూర్చుకొనే నేర్పు రచయితకు ఉండాలి.

తోలుబొమ్మలాట‘ నవలలో తల్లీ కూతుళ్ల విషయం. యవ్వనం సంతరించుకొంటోన్న రోజుల్లో తల్లి అనుభవాలు మధుర జ్ఞాపకాలు కాగా, కూతురి అనుభవాలు బాధాకరమైనవి, భయం గొలిపేవి. ఆ వూర్లోని యువత ఒక తరం మారేలోగా ఎందుకలా తయారయిందోననే ఆలోచన రేకెత్తించే చిత్రణ ఆ నవల్లో వుంది. ఆ విషయమై మీ ఆలోచనలు చెప్పండి.

గతంలో ఏదయినా సమస్య తలెత్తితే గ్రామమంతా ఒకచోట సమావేశమై చర్చించుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనేవారు. తాగుడు ఒక చెడు అలవాటుగా భావించేవారు. పెద్దల్ని ఎదిరించటం తప్పుగా నమ్మేవారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా గ్రామ అవసరాల కోసం సర్దుబాటయ్యేవారు. ఏవో పార్టీలున్న గ్రామాల్లో తప్ప అన్ని గ్రామాల పరిస్థితి అలాగే వుండేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పార్టీలంటూ పెద్దగా లేకున్నా ప్రతి గ్రామం రెండుగా విడిపోయి ఒక వర్గం వారంటే మరొక వర్గం వారికి గౌరవాలు నశించాయి. ఆప్యాయతలూ, అనురాగాలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్దల మాట ఎవరూ వినట్లేదు. ప్రభుత్వం వారు అదేపనిగా ప్రచారం చేసి మరీ మద్యం తాపుతుండటంతో ఇప్పుడు తాగటానికి ఎవడూ సిగ్గుపడటం లేదు. దాంతో విచక్షణ కోల్పోతున్నారు. గ్రామ పెద్దల అజమాయిషీ పోయింది. ఎవనికి వాడే స్వతంత్రుడై మద్యానికి బానిస అవుతున్నాడు. సమస్యలొస్తే పోలీస్టేషన్లో మాత్రమే పరిష్కారమవుతున్నాయి తప్ప గ్రామపెద్దల సమక్షంలో కాదు. రాజకీయ పార్టీల కొమ్ము కాసేవాళ్ళే ఇప్పుడు గ్రామ పెద్దలవుతున్నారు. తమ వర్గంలోని మనిషి చేజారిపోకుండేందుకు వాళ్లు తప్పు చేసినా సమర్థించుకొని కొమ్ముకాసే దశకు గ్రామపెద్దలు దిగజారిపోయారు. ఈ నేపథ్యంలో యువత అలా తయారైంది.

పదేళ్ళనాటికి, ఈ నాటికీ ‘పల్లె’ చిత్రం మారింది. బతుకుతెరువులు మారిపోయాయి. రాజకీయంగా, సామాజికంగా పల్లె నాగరికతలో వేగంగా చోటుచేసికొంటోన్న కొన్ని అనివార్యమైన మార్పులను మీరు తప్పనిసరిగా గమనించే ఉంటారు. ఈ మార్పు మీ రచనల ఇతివృత్తాల్లో ఎలా ప్రతిబింబించి ఉంటుందో మీ మాటల్లో వినాలనుంది. చెబ్తారా?

తోలుబొమ్మలాట‘ నవలలో మీరు చెప్పిన మార్పులన్నీ చాలావరకు ప్రస్తావించాను. పల్లెచిత్రం తనొక్కటే ఒంటరిగా మారలేదు. నగరాలు, పట్టణాల్లో జరిగే విపరీత మార్పులకు పల్లె కూడా స్పందిస్తోంది. ఆ మార్పులకు తన ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా కొన్ని అవసరాల్ని పణంగా పెట్టి అయినా నగరాల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తోంది. ‘తోలుబొమ్మలాట‘లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాను. పట్టణాల్నించి వచ్చిన కళాకారులు ఇరవై యేళ్ళ కిందటి పల్లెను పోల్చుకొని తెగ బాధపడిపోతారు. పల్లె మారిందని చింతపడతారు. కానీ చివరకు యథార్థ భావనకు మారతారు. పట్టణాల్లోని తమ జీవితాల్లో కూడా ఊహించనన్ని మార్పులొచ్చాయి గదా! ఇళ్లల్లోకి టీవీలొచ్చాయి. వంటింట్లోకి మిక్సీలు, కుక్కర్లొచ్చాయి. చేతుల్లోకి సెల్‌ఫోన్లొచ్చాయి. పల్లెలు మాత్రం ఆ సౌకర్యాల్ని ఎందుకు అనుభవించకూడదు? అంటే వాళ్ల దృష్టిలో పల్లెలింకా దశాబ్దాల నాటి పల్లెల్లాగే ఉండాలి. ఇంకా విసరుతూ, దంచుతూ, రుబ్బుతూ, ఎంత దూరమైనా నడుస్తూ, మైళ్ల దూరాన్నుంచి నీళ్లు మోస్తూ, గోచిపంచెలు బిగించి పూరి గుడిసెల్లో ఉంటూ, ఏ వృత్తి కళాకారుడు ఆ వృత్తికి సంబంధించిన పనులే చేస్తూ, బైటి ప్రపంచం వాళ్లకి పల్లె ఒక అందమైన ఫోటో లాగా కన్పించాలా? ఇది స్వార్థపూరిత ఆలోచన కదా! వాళ్లు మాత్రం మారకూడదా? కొత్తనీరు ఉధృత ప్రవాహమైనపుడు ఇరుదరులు కోసుకుపోవడం సహజం. మార్పుకు గురవుతోన్న సమాజంలో కొన్ని అవాంఛనీయమైన ధోరణులు చోటు చేసికోవటం కూడా అంతే సహజం. సమర్థనీయం కాని పరిణామాలు కూడా చోటు చేసికోవచ్చు. అంతమాత్రాన మార్పును వ్యతిరేకించాలా?

కాడి నవలలో కూడా పల్లె వ్యవసాయ జీవితంలోని మార్పుల్ని విస్తృతంగానే చర్చించాను.

వ్యవసాయం పరిస్థితి చాలా మారింది. ఉపాధి హామీ వగైరా పథకాల వల్ల, వ్యవసాయ పనుల కాలంలో ఈ పథకాలు ప్రవేశపెట్టటం వల్ల వందరూపాయలిచ్చినా పత్తి విరుపులు వగైరా పనులకు కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడి, వ్యవసాయం దిక్కుతోచని స్థితిలో పడింది. గ్రామంలో ఒకటి రెండు కుటుంబాలు తప్ప మిగతా రైతులంతా జాబ్‌కార్డ్‌లు సంపాదించుకొని ఉపాధి హామీ పనులకు వెళుతున్నారంటే వ్యవసాయ పరిస్థితిని అర్థం చేసికోవచ్చు.

తెలుగు మీడియమ్ స్థానంలో ఇంగ్లీష్ మీడియమ్ ప్రవేశపెడుతున్నారు. దాని ప్రభావం తెలుగు సాహిత్యంపై ఎలా ఉండొచ్చు?

ఇంగ్లీషు మీడియమ్ వల్ల తెలుగు సాహిత్యానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని నేననుకోవటం లేదు. విద్యార్థుల వల్ల కంటే తల్లిదండ్రుల వల్లే తెలుగు భాషకు నష్టం జరుగుతూ ఉంది. తెలుగును నిర్లక్ష్యం చేసేది, ఇంగ్లీషును అరువు తెచ్చుకొనేదీ వాళ్లే. తమ తీరిక సమయాల్ని పఠనం నుంచి దృశ్యం వైపుకు మళ్లించటమే భాషా వినాశనానికి నాంది ఐంది. సంభాషణల్లో ఇంగ్లీషు పదాల్ని ఉపయోగించాలనే కృతక నాగరికత కూడా ఇందుకు తోడైంది. పల్లెల దృష్టికోణం నించే నేను మాట్లాడుతోన్నా – రెండు దశాబ్దాల క్రితమే, ఇంగ్లీషు వ్యామోహం పల్లె చదువుల మీద బలంగా వాలనప్పుడే – ఇంగ్లీషు పదాల్ని తమ సంభాషణల్లో చొప్పించేందుకు చాలామంది ఉబలాటపడటం నేను గమనించాను. మాట్లాడేదంతా తెలుగే అయినా ఊత పదాలుగా సో, బట్ లాంటి ఇంగ్లీషు పదాలు వాడటం నాకయితే అత్యంత కృతకంగా అనిపించేది.

ఆ పరిస్థితికి కూడా కొన్ని కారణాలున్నాయి. టౌనుకు వెళ్లివచ్చినపుడల్లా ఓ ఇంగ్లీషు పదాన్ని మోసుకురావాల్సిన దుస్థితి. హోటల్‌కు పోతే బువ్వ, కూర అనడం అనాగరికం. రైస్, కర్రీస్ అనాలి. బస్సెక్కినపుడు తావు అనకూడదు. సీటు అనాలి. ఏ షాపు చూసినా అక్షరాలు తెలుగులోనే ఉన్నా భాష మాత్రం ఇంగ్లీషు. అన్నపూర్ణా మిలిటరీ హోటల్, సుబ్బయ్య అండ్ సన్స్ జనరల్ మర్చంట్స్, వాణి ఫ్యాన్సీ షాపు, బ్రహ్మం మెడికల్ షాపు, శ్రీదేవి క్లాత్ ఎంపోరియమ్, శివ ఫర్టిలైజర్స్, వినాయక బ్రాంది షాపు వగైరా వగైరా అన్ని అంగళ్లూ – చివరకు టీస్టాల్, పాన్ మసాలా, కూల్‌డ్రింక్స్- చచ్చినట్లు ఇంగ్లీషు పదాల్ని అలవాటు చేసికోవలసిందే. దానికితోడు సినిమాల్లో కూడా సగం ఇంగ్లీషు పదాల వాడకం. ఏ ఆఫీసుకు వెళ్లినా.., కేవలం పల్లెజనాల కోసమే నడిచే సహకార బ్యాంకుల్లో సైతం, లావాదేవీలకు సంబంధించిన పేపర్లన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. చదువుకొన్నవాళ్లు, రాజకీయ నాయకులు వగైరాలంతా ఇంగ్లీషు పదాల్ని విరివిగా ఉపయోగించటం కూడా ఒక కారణం. ఇంగ్లీషు అనేది నాగరికతకు చిహ్నంగా జనాలు అర్థం చేసికోవటం వల్ల ఈ చిక్కు వచ్చింది. ఇంగ్లీషు పదాల్ని ఇప్పుడు ఇంట్లో కూడా వాడటం వల్లనే ఇబ్బంది వచ్చిపడింది. ఇంగ్లీషు వంటింట్లోకి కూడా చొరబడింది. మనం తినే ఆహారానికి కూడా ఇంగ్లీషు వాసనలు అద్దబడ్డాయి. ఇంగ్లీషు మీడియమ్ చదివే పిల్లలకి ఇంట్లో కూడా ఇంగ్లీషు భాషావాతావరణాన్ని కల్పించటం వల్ల ఆంగ్లభాషలో నిష్ణాతులవుతారనే కుహనా సంస్కృతి ఒకటి చాలామంది చదువుకొన్న తల్లిదండ్రుల్లో ఏర్పడింది. దీనివల్ల తెలుగు భాషకు తీవ్రమైన నష్టమే జరుగుతోంది.

పిల్లలకు ఇంగ్లీషు మీడియమ్‌లో చదువు చెప్పించినా ఇంటిని ఇంగ్లీషు మీడియమ్ చేయకుంటే చాలు. ఇంట్లో తెలుగు మాట్లాడుతూ, తెలుగు కథల పుస్తకాల్ని పిల్లలకు అందుబాటులో ఉండేలా చేస్తూ, వాళ్లని తెలుగులో కూడా నిష్ణాతులని చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మన వేషము, భాష మొరటైనవిగా, మన సంస్కృతి సంప్రదాయాలు పాత చింతకాయ పచ్చళ్లుగా పిల్లల మనసుల్లో ముద్ర పడేలా చేసి, విదేశీ వేషభాషలు, సంస్కృతీసంప్రదాయాలే గొప్పవిగా, అవి ఆచరిస్తేనే నాగరికతగా చిన్నప్పటి నుంచీ నూరిపోస్తే వాళ్లు పెద్దయింతర్వాత, విదేశాల్లో జీవనం మొదలెట్టింతర్వాత, మన భాషా, సంస్కృతుల్ని ఎట్లా పట్టించుకోకుండా వదిలేస్తారో వాటి మధ్య బతికే తల్లిదండ్రుల ఉనికినీ సంబంధాల్నీ అట్లాగే వదిలేస్తారు, తప్పదు. అందులో పిల్లల తప్పుకూడా లేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా విశ్లేషించుకొని మరీ గమనించాలి.

ఇప్పుడు ఇంగ్లీషు చదువుల ప్రభావం సాహిత్యం మీద పడి తెలుగు పాఠకుల సంఖ్య బాగా తగ్గిందనటానికి – మొదట్నుంచీ సీరియస్ సాహిత్యానికి పాఠకుల సంఖ్య తక్కువే. ఆ మధ్యలో ఓ మూడు దశాబ్దాల కాలం కాలక్షేపపు కాల్పనిక సాహిత్యం తెలుగు భాషలో అడుగుపెట్టి పాఠకుల సంఖ్యను విపరీతంగా పెంచింది. అయితే ఆ పాఠకుల్ని సీరియస్ సాహిత్యం కేసి మరల్చుకోలేకపోవటం తెలుగు సాహిత్యం చేసికొన్న దౌర్భాగ్యం. టీవీ మాధ్యమం వచ్చింతర్వాత కాలక్షేపం రూపం మారింది. కాలక్షేపపు పాఠకులు కాస్తా టీవీ వీక్షకులయ్యారు. ఆ మూడు దశాబ్దాల పాఠకుల సంఖ్యతో పోల్చుకొంటే ఇప్పుడు సాహిత్యాన్ని చదివే వాళ్లు తక్కువే.

———————-

రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

Posted in వ్యాసం | Tagged | 5 Comments

అనుభూతి

-ఆత్రేయ కొండూరు

వలయంలా
చందన కాష్ఠాలను పేర్చుకుంటూ
వాటి మన-సు-గంధాలను
మనసారా ఆఘ్రాణిస్తూ

నుదుటినంటిన ఆకాశ
సిందూరాలను చెరుపుకుంటూ
ప్రజ్వలిత హిరణ్యగర్భుని
తలక్రింద ప్రేమగ పొదువుకుంటూ
నిష్కల్మషమైన నిప్పుకు
ప్రక్షాళిత నివురునవుతూ
నా గాథకు జ్ఞాపకమవుతూ

హవ్యవాహనుడి ఆలింగనాలలో
ప్రతికణమూ తనలో కలుపుకుంటూ
తనువు నీడుస్తూ, తపన చాలిస్తూ
చీకట్లు కాలుస్తూ భువిని గెలుస్తూ

చిటపటార్భాట పరిష్వంగాల్లో
ధూప విలయ నృత్య సాక్షాత్కారంతో
ముగిసిన కల అదో అవ్యక్తానుభూతి !!

—————————

బంధాలను సుదూర తీరాల్లో వదిలి,
అనుబంధాలను రంగు కాగితాల కోసం తాకట్టుపెట్టి,
ప్రవాసమో వనవాసమో తెలియని జీవనం గడుపుతున్న
మామూలు తెలుగువాడు

ఆత్రేయ కొండూరు. భావాలను భాషలోకి మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆత్రేయంటే చాలా అభిమానం.

Posted in కవిత్వం | 4 Comments

సెప్టెంబరు మెరుపు గడి సమాధానాలు

సెప్టెంబరు మెరుపు గడికి సమాధానాలు:
– కొవ్వలి సత్యసాయి

1 తె

లు

2 గు

వా

డి

ని

X

X

3 ప

4 ర్ణ

శా

లు

X

లు

X

X

X

5 అం

6 దం

X

హా

X

X

7 గు

లు

తె

తూ

లి

X

వే

X

8 మ

ని

షి

X

నే

X

X

X

X

X

9 రా

వం

X

X

థం

X

స్త

X

X

X

10 స

త్యం

X

X

11 వా

సు

X

X

12 మా

గో

13 దా

రి

X

14 నే

ర్పు

X

X

X

15 వి

X

X

X

X

X

X

16 ఊ

17

18 సి

రి

వె

న్నె

X

19

ది

లో

నా

X

X

హా

X

X

X

X

X

X

X

X

X

గూ

20 సు

X

21 రెం

22 డు

రె

ళ్ళు

రు

X

23

ల్హా

24 రు

చి

X

బు

X

X

X

X

25 చె

X

X

గం

చి

X

26 జో

కు

లా

ష్ట

మి

X

27 త్త

కొ

ళీ

పా

ఆధారాలు – అడ్డం

1. వేడివేడిగా పదునుగా ఎండగట్టే బ్లాగు
3. సేదతీరుదామని ఈబ్లాగుకొస్తే -రోజుకో టపా గారంటీ కానీ – వేడీ, వాదం తప్పవు- సీతారాములెలా ఉండేవారో పాపం
5. కందం తెలిసిన బ్యూటిఫుల్ బ్లాగు
7. తెలుగు వెనక్కి తూలితే … ఈచుట్టుపక్కలంతా తెలుగే తెలుగు
8. బ్లాగరే మనిషైతే .. బ్లాగు జంతువవదుకదా
9. శబ్దం, కానీ కృష్ణుడూదేది – ఐదులో పుట్టినది
10. నిజం బ్లాగు అబద్ధాలు చెప్తోందని నిజాలు చెప్పడానికి ఈబ్లాగు వచ్చింది. నిజాలూ, అబద్ధాలూ కలిసే పోయాయి.
11. ‘ – – ‘ లోకానికి స్వాగతం చెప్పే బ్లాగు
12. ఈవిడ మాది అనిచెప్పేది మాదికూడానూ.. అక్కడ ఎక్కడ చూసినా వరే.
14. స్కిల్
16. పేరులో హస్కింగు – టపాల్లో పౌండింగు
18. శాస్త్రిని కాదని ఆయన ఇంటి పేరును వాడుకున్న బ్లాగు
19. ఇన్మై దిల్లని చెప్పే నాన్-టేక్కీల హృదయానికి కూడా హత్తుకునే బ్లాగు – ఒకేపేరుతో రెండు బ్లాగులున్నాయి – ఒకటి 3-డాట్, ఇంకోటి 5-డాట్ బ్లాగు – అవునూ, ఇంతకీ – దిల్మేనా?
21. లెక్కల్లో పూరేమో గానీ, హాస్యంలో ఘుమఘుమలాడే మరిగే నీళ్ళలాంటివాడు
23. పుస్తకాలు చదువుతారా బార్బేరియస్ – ఈవిడ బ్లాగు చదివితే పోలే
24. వంటల బ్లాగు గురూ అని గుర్తు చేసే బ్లాగు
26. ఈ జోకులు మనదేశానివేనట – ఇంకో రెండురోజుల్లో విజయదశమి పెట్టుకుని మీతో అబద్ధమా
27. న్యూనిబ్ – ఓల్డ్సిరా – అందుకే ఎడాపెడా రాతలు

ఆధారాలు – నిలువు

1. గుర్రాలతో నడిచేబండి, ఎన్టీఆర్ తెచ్చిన చైతన్యంతో రానాల బండిగా మారింది. నాటి -నేటి విషయాలందించే తెలుగున్న ప్రతిభావంత బ్లాగు
2. తలకిందులైనా తెలుగు తెలుగే – మిత్రుడు తిన్నంగా ఉంటే చాలుగా
4. కవితల మహా బ్లాగు – కిందనించి పైకి – నాల్గో అక్షరం సరియైన ప్లేసే – మేఘసందేశాలు పంపడం తెలియక పోయినా బ్లాగడం తెలిసిన ముగ్ధ మనోహర బ్లాగు.
6. కింద పెట్టినా పైకి రాగలిగేది – బాదరాయణుడి భిక్ష – ఒక పండితుడి బ్లాగు
10. ప్రథమా విభక్తి ప్రత్యయం తో బహువచనం చేయండి – మంచి స్వరభరితమైన బ్లాగొస్తుంది
13. తెలుగు ఆచార్యుల వారి బ్లాగింటి పేరే సాగదీస్తేఎలా..
15. ఆస్సిన్ ఫోటోలనే భ్రాంతి కలిగించి మభ్యపెట్టే శీర్షిక తో టపా రాసిన బ్లాగ్ట్రావెలర్ – అవుడియా కింగు
17. ‘ do not put all your eggs in the same basket’ అని విని తన కూరల్ని వేర్వేరు బుట్టల్లో సర్దిన బ్లాగా ? ఎక్కడ సర్దినా ఈయన కూరల రుచి అనితర సాధ్యం
20. మంచిరుచైన టపాలందించే జ్ఞానమయ బ్లాగు
22. ఈపిల్లాడు తెలుగు గడుగ్గాయి – తికమక పెట్టేస్తాడు – గ్రామర్ నేర్చుకుంటున్నాడట బడాయి- గజడదబల్ని కచటతపలు చేస్తున్నాడు -గోపాళానికి చెప్తే సరి.
25. మునిసిపాలిటీ బండిలో వేస్తారా – ఇంకా నయం. ఇది కథల బ్లాగండీ బాబూ

Posted in గడి | Tagged | Comments Off on సెప్టెంబరు మెరుపు గడి సమాధానాలు

అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలు

అక్టోబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు
2. 2008 ఆగస్టు గడి, సమాధానాలు
3. 2008 జూలై గడి, సమాధానాలు
4. 2008 జూన్ గడి, సమాధానాలు
5. 2008 మే గడి, సమాధానాలు
6. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
7. 2008 మార్చి గడి, సమాధానాలు
8. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
9. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
10. 2007 నవంబరు గడి, సమాధానాలు
11. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
12. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
13. 2007 జూలై గడి, సమాధానాలు
14. 2007 జూన్ గడి, సమాధానాలు
15. 2007 మే గడి, సమాధానాలు 4
16. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
17. 2007 మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 6 Comments

విజయదశమి పద్యకవితా సమ్మేళనం – చివరిభాగం

– రానారె

[గతభాగం]

{రాయలు}: భట్టుమూర్తీ, మీకో చక్కని చిక్కని సన్నివేశం చెబుతా
{భట్టుమూర్తి} చెప్పండి ప్రభూ
{రాయలు}: ఒక అయిదేళ్ళ పిల్లవాడు. వాళ్ళింటి పెరట్లో చెట్టు మీద పక్షి ఒకటి గూడు పెట్టింది. ఒకరోజు వీడు నిద్ర లేచేప్పటికి ఆ గూట్లోంచి రాత్రి పొదిగి బయటికొచ్చిన పిల్లల కీచు గొంతులు వినిపిస్తున్నై. ఆ సన్నివేశాన్ని కళ్ళకి కట్టినట్టు మీ అలతి పదాలతో లేత కవిత…
{భట్టుమూర్తి} చిత్తం. అదంతా ఆ బాలుడు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడయ్యా అంటే…

ఉ||

చక్కని చుక్కలో, మిసిమి |చంద్రుని చెక్కిలి తున్క లౌనొ యీ
చొక్కపు కూనలంచుఁ కడు |సుందరతన్‌ నిలువెల్ల కన్నులై
తక్కిన లోకమున్ మఱచి |తన్మయుఁడై గనుచుండె బాలుఁ డా
పక్కి సహోదరుల్ కల ర |వమ్ములు జేయుచు సందడించగన్

అంతలో ఇంట్లో నుంచి అమ్మ పిలుపు – ‘ఏఁరా చిన్నోడా, దీపావళి సద్దే లేదు! పటాకులు (టపాసులు) కాల్చలేదేఁ?’

ఊసులఁ జెప్పగ రమ్మని
ఆసగ నను బిలిచి రమ్మ నా సరి మిత్రుల్

అమ్మ – ‘బాగుంది. ఆ గువ్వ పిల్లల నెంత సేపు చూస్తావు? ముఖం కడుక్కొని దోసెలు తిందువు రా’.

దోసెలు నాకొద్దమ్మా
చూసెదనీపిచ్చుకలనె చూడగనిమ్మా

{విశ్వామిత్ర} తక్కిన లోకమున్ మఱచి |తన్మయుఁడై గనుచుండె బాలుఁ డా – బాగుంది. పక్కి సహోదరుల్ – మంచి ప్రయోగం
{గిరి} భట్టుమూర్తీ, భేష్భేష్
{పూర్ణిమ} ఆహా!
{రామకృష్ణారావు}: చాలా బాగున్నాయి.
{పెద్దన} సెబాసో!
{రాయలు}: ఉత్పలమాల అద్భుతంగా కూర్చారు. చొక్కపు కూనలు .. మురిసి ముక్కలయ్యా ననుకోండి.
{చదువరి} సన్నివేశం లాగే చక్కగా లలితంగా ఉంది!
{దైవానిక} భట్టుమూర్తి పిల్లల్లో పిల్లోడు..
{గిరి} అవును, కడు చక్కగా కూర్చబడిన ఉత్పలమాల పద్యము
{పెద్దన} ఉత్పలమాలలో ప్రాసపదాలు అద్భుతం!
{చంద్రమోహన్} ఏవీ మిగిలిన రెండు పాదాలు?
{భట్టుమూర్తి} చంద్రమోహన్ గారూ, చిన్నోడు కాబట్టి సగంసగం కందాల్లో మాట్లాడుతున్నాడన్నమాట 🙂

{రాయలు}: RK గారు .. మీది?
{రామకృష్ణారావు}: ఒక ఐదేళ్ళ పిల్లాడు మొదటి సారిగా వాళ్ళింటి చెట్లో ఒక పక్షి గూడు పెట్టడం చూశాడు..

ఉ:

పుల్లల గూడదెట్లొదవె ? ముచ్చటనా విహగంబు లచ్చటే
యిల్లును కట్టె నెట్లు ? మరి యెప్పుడు వచ్చెను క్రొత్తవైన యా
పిల్లలు ? రెక్కలేవి ? మురిపించుచు నోగిరమందియిచ్చు నా
తల్లి.. యిదేమి వింత ? మన తాతకు తెల్సును చెప్పమందునోయ్.

{గిరి} అంతా ఒకే పద్యంలో భలే ఇమిడ్చేసారండీ
{రాయలు}: అంతే కాదు, తాతా మనవళ్ళ బంధాన్ని కూడ ముడి వేశారు దాంట్లోనే
{పెద్దన} అవును అదే ఆ పద్యానికి కొసమెరుపు!
{రామకృష్ణారావు}: అల్పాక్షరంబుల అనల్పార్థ రచన చెయ్యాలన్నారు మా గురువుగారు
{దైవానిక} బాగు బాగు 🙂
{రామకృష్ణారావు}: ధన్యవాదాలు

{రాయలు}: నా అధ్యక్షతలో ఇదింక చివరి పద్యం .. విశ్వామిత్రా .. ఈ సమస్య మీకు. “నాట్యము జేసె భామ తన నాధుడు తయ్యని తాళమేయగన్”‌.
{విశ్వామిత్ర} మ్, చెప్పండి ప్రభూ

నాట్యము, నాటకమ్ములును నాతికకృత్యము లైనకాలమున్
నాట్యము నందెధ్యాసనిడి, నైష్టిక రీతుల నేర్చినట్టిదై,
నాట్యమయూరమై,తెనుగు నాటను, “అంజలి” నాయికా మణై,
నాట్యము జేస భామ,తన నాధుడు తయ్యని తాళమేయగన్

{గిరి} అంజలి దేవిని, ఆదినారాయణరావుని భలే లాగారండీ పద్యంలోకి
{విశ్వామిత్ర} గిరి, తమరునేర్పిన విద్యయే
{దైవానిక} ఇది కొంపదీసి అంజలీ దేవి కాదు కదా!
{చదువరి} కొంపదీయకుండానే! మంచి చమత్కారం.
{విశ్వామిత్ర} దైవానిక, ఆవిడ ఇంటిపేరు నాకు తెలీదు 🙂
{దైవానిక} 🙂 😀
{రామకృష్ణారావు}: చమత్కరించాలంటే మీ తరువాతే.
{సాలభంజికలు} విశ్వామిత్రా – చమత్కారం అదిరించారు. అంజలి భర్త సంగీత దర్శకుడు కదా?
{భట్టుమూర్తి} సాలభంజికలు – ఔను. భక్తతుకారాం పాటలు, రాజశేఖరా నీపై మోజు తీరలేదురా… పాట ఆయనవే.
{విశ్వామిత్ర} అవునండీ
{పెద్దన} ప్రాసకోసం పాట్లుపడక్కరలేకుండా పదాన్ని నాట్యమయం చేసారు, బావుంది!
{విశ్వామిత్ర} ప్రాసకోసం పాట్లు పడే, చివర్కి ఈ దారి తొక్కాను
{భట్టుమూర్తి} విశ్వామిత్రా, మీ చమత్కారం ఎప్పటికప్పుడు కొత్తగా వుంటూ ఆశ్చర్యపరుస్తుంది
{విశ్వామిత్ర} భట్టుమూర్తి మేనక అందం లాగానా
{భట్టుమూర్తి} విశ్వామిత్రా అలాగే అనుకోండి. మేనక అందాలు తాగినవారు తమరు. మేక పాలు తప్ప ఏమీ ఎరగనివాణ్ణి నేను. 🙂

{పెద్దన} డిశెంబరులో మొక్కుకుని మే నెల్లో తిరపతికెళ్ళి మొక్కు తీర్చుకున్న వాడి సుఖదుఃఖాలు … వర్ణన విందాం. గిరిగారూ, గుండు మొక్కుని తీర్చేసుకోండి మరి!
{గిరి} వినండి

వ. ‘పుష్యమి మాసంలో మొక్కు’

మ.కో.

నా డిశంబరు మొక్కు వేంకటనాథుడేలనొ వెంటనే
రూడి సేసెను చేసి క్లేశములూడ బెర్కెను బెర్కి నా
బోడి గుండుకి హక్కుదారయి పోయె, జుట్టును పెంచి కా
పాడి జూటము జేయు భారము పడ్డదట్టుల నా తలన్

వ. ‘పెరిగిన జుట్టు’

కం.

ఎంతటి శీతల వీచిక
లెంతటి చల్లని తొలకరు లెంతవి గానీ
కుంతల యూధపు శిరమున
కొంతయి తోచును కటకట కొరవడె సుఖమే

వ. ‘ఎండా కాలము’

కం.

మార్చేప్రిలు మే మాసపు
దోర్చేసెడి వేడిసెగల దుఃఖపు టిడుముల్
కార్చిచ్చులు పుట్టించెను
మూర్ఛాలుడనైతి నేను, మూర్ధము మాడెన్

వ. ‘జ్యేష్ఠ మాసంలో కల్యాణ కట్ట దగ్గర ముండనము’

కం.

గుండు ముఖపుటందానికి
ముండనమను తొండి మాట మొండిగ మోసే
దుండగులకు నా నుడువిది
“గుండందము, గుండు ముదము, గుండే సుఖమోయ్”

అదీ గుండు పురాణం

{దైవానిక} గిరి గారు, మత్తకోకిల వ్రాసింది మీరొక్కరే అనుకుంటా గుండందము, గుండు ముదము, గుండే సుఖమోయ్ 🙂
{పూర్ణిమ} గుండందము, గుండు ముదము, గుండే సుఖమోయ్ – భలే! 🙂
{పెద్దన} “గుండందము, గుండు ముదము, గుండే సుఖమోయ్” – ఇది గుండున్నంత కాలం నిలిచిపోయే మాట! 🙂

[గిరిగారి ఈ పద్యాలతో సభంతా నవ్వులమయమైపోయింది]

{రాయలు}: తెలుగు భారతికి నమస్కారం. సభనలంకరించి మమ్మల్ని అలరించిన కవిపుంగవులకు నమస్కారం. అభిమానంతో విచ్చేసిన అతిథులకి నమస్కారం. కవివర్యులారా, అతిథులారా, నేనిక శలవు తీసుకుంటాను. మీరు కవితాగోష్ఠియో ఇష్టాగోష్ఠియో కొనసాగించవచ్చు.
{పెద్దన} సభని రక్తిగట్టించిన రాయలవారికి అభివందనం! ఇక స్వస్తి వాక్యం పలికేద్దాము.

“శ్రీ” రాజత్ హృదయారవింద! వర రాశీభూత ధర్మావతా
“రా”! రక్షోగళ నిర్దళాస్థ శరధీ! ప్రాచేతసావిష్కృతా!
“మా”రాకార మనోహరా! హరమనో మందార పుష్పార్చితా!
“శ్రీరామా”! గుణధామ! సామనిగమా! సీతాసమేతా! హరే!

{గిరి} {చంద్రమోహన్} {విశ్వామిత్ర} అద్భుతం
{దైవానిక} జై శ్రీరామ చంద్ర ప్రభుకీ జై
{విశ్వామిత్ర} {చదువరి} {పెద్దన} జై శ్రీమద్రమారమణ గోవిందో హరి!
{గిరి} ప్రాసపూర్వాక్షరాలలో శ్రీరాముని బాగా కీర్తించారు
{చంద్రమోహన్} అసలెన్ని అలంకారాలు కూర్చారా అని లెక్క పెడుతున్నాను. శ్రీకారం చుట్టి సభను ముగిస్తున్నారు. 🙂
{దైవానిక} ఉద్యమము జేసినవివీ,|| పద్యములా కాదు కాదు , పగడాల్, ముత్యాల్,
{గిరి} సభలో పాల్దొన్న అందరికీ ధన్యవాదాలు
{పెద్దన} Chandra_Mohan: మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని అన్నారు కదా!
{విశ్వామిత్ర} మరో సభకి శ్రీకారం అన్నమాట
{పెద్దన} విశ్వామిత్రా, బాగా చెప్పారు!

[ఈ అభినవాంతర్జాలభువనవిజయంలో వినిపించబడిన మరికొన్ని పద్యాల కోసం కవిపుంగవుల ( ఈ పదంలో కవి శబ్దం పునరుక్తిగా ధ్వనిస్తే నా తప్పేం లేదు 🙂 ) బ్లాగులను సందర్శించండి.]

{చంద్రమోహన్} సమయం ఎలా గడిచిందో తెలియలేదు
{దైవానిక} అవును .. దాదాపు ౫ గంటలు
{అందరూ} అందరికీ నెనరులు, వందనాలు!
{పెద్దన} సర్వే జనాస్సుఖినో భవంతు!
{దైవానిక} జై తెలుగు తల్లి.

**************

కృతజ్ఞతలు

ముందుగా అతిథులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

పొద్దు సంపాదకులు సిముర్గ్ సూచనమేరకు విజయదశమి సందర్భంగా మరో భువనవిజయసభను నిర్వహించాలనే తలంపుతో బ్లాగులోక పద్యకవులకు నెల రోజుల క్రితం ఆహ్వానం పలికాము:


నమస్కారమ్. గత ఉగాది పద్య సమ్మేళనం బహు రంజుగా సాగిన సంగతి మీకు అనుభవమే. ఈమారు విజయదశమి సందర్భంగా మరోమారు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. వేదిక – ‘పొద్దు’లో ఒక కబుర్ల గది. ఈ సారి కూడా మన బ్లాగు కవుల పద్య సమ్మేళనానికి అధ్యక్షత వహించవలసిందని మన రాయలవారిని సంప్రదించాను. సంతోషంగా ఒప్పుకున్నారు. మరీ సంతోషకరమైన విషయమేమిటంటే – ఈసారి భైరవభట్ల కామేశ్వర రావు గారు మనలో ఒకరు. ఇంకా బ్లాగులోక నవ కవిత్రయము రామకృష్ణగారు, చంద్రమోహన్ గారు, దైవానికగారు సభనలంకరించబోతున్నారు. ఈమారు సభలో తాడేపల్లిగారిని, శ్రీరామ్ గారి పద్యాలను కూడా చూడగలమని ఆశిద్దాము.

ఈ రెండవ భువనవిజయాన్ని సాహిత్య, సాకేంతికాంశాలలో మరింత ఆసక్తికరంగా, సౌకర్యవంతంగా జరుపడానికి సర్వం సిద్ధమయినట్లే వుంది. త్వరలో ‘సమస్యలు’ మనల్ని చుట్టుముట్టి ఆహ్లాదపరచబోతున్నాయి. బ్లాగులోక వర్తమానంలో కందమకరందానందపరీరంభులై వున్న మీరంతా “సై”యంటారనుకుంటాను.

నెనరులు,
— రానారె

రానారే రా రమ్మని || తానే స్వాగత కవనపు దారులు పరిచే …” అంటూ ముందుగా లంక గిరిధర్ గారు స్పందించారు.

ఆ వెంటనే భైరవభట్ల కామేశ్వరరావుగారు (మా పెద్దన) …

దసరా సరదా మొదలయె
పసందయిన కందపద్య బ్లాగ్ఝరితోడన్!
ఎసకమెసగ నీ పిలుపుకు
రసికులు సయ్యనకపోదురా, రానారే!
భువన విజయ దశమికి బ్లా
క్కవులకు కవయిత్రులకును(?) ఘన రాయలకున్
సవినయ వందన మిదియే
చవిచూచె(పె)దమింక పద్య సరసామృతమున్!

మా ప్రయత్నాన్ని బలపరుస్తూ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు …

కం||

సరవిన్ బ్రతి ఋతువును వ
త్సరమున కొక్కటియె, పెక్కు | సారులు రా, దీ
వర కవితా ఋతువన్ననొ
అరుదెంచును రెండు మారు | లానందమై.

తెలుగు పండితులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు …

ఆ:-

రామ నాధ రెడ్డి రమ్మని పిలిచిన
భువనవిజయమునకు సవినయముగ
రాక యెట్టులుందు?  రంజిల్లు మనముతో
సై యటంచు వత్తు.  సరస మతిరొ!

గీ:-

భువన విజయాన నిలుచుట పుణ్య ఫలము.
దశమినాడది జరుగును.  ధన్యులమయ.
కవన శరదిందు చంద్రికల్ క్రమ్ము కొనగ,
ఆత్మలానంద మగ్నమై యలరు నయ్య!

ఈ మాటలతో ఉత్తేజితుడైన నవ పద్యకారుడు పాలడుగు శ్రీకాంత్ (దైవానిక) గారి స్పందన: “ఈ భువన విజయం తలుచుకుంటేనే ముచ్చమటలు పడుతున్నాయి. ప్రశ్నపత్రం చూసాక మిడిల్ డ్రాప్ ఉంటది కదా! నాకెందుకో కాస్త భయంగా, కాస్త ధైర్యంగా ఉంది :)”

ఎప్పటిలాగే మాలో స్థైర్యాన్ని నింపుతూ తాడేపల్లివారు:

కం॥

మనకున్ మనమే కవులము,
మనకున్ మనమే చెవులము, మఱి । భయమేలా ?
వెనుకైనను ముందైనను
మనలను గని నవ్వువారు । మనలో లేరే !

కం||

వచియింతు నొక్క వాక్యము,
రుచిరంబుగ వినుఁడు, మనకు రుచి యగు శైలిన్
రచియింతము పద్యములను
వచనమొ, ఛందంబొ, మనకు వలనైనటులన్.

సాధనమున పనులు సమకూరు ధరలోన … అన్నట్లుగా నిర్విరామంగా పద్యాలల్లడాన్ని సాధన చేసి ‘విజయుడైన గిరిధరుని’కీ ప్రశంస కూడా …

కం||

గిరిగారూ ! మీ కవితా
విరచన దినదినమునకును | విస్మయకరమై
సరసమగుచున్నదండీ !
సరాళముగ సాఁగిపొండు | సత్కవి వర్త్మన్

“పొద్దు వారి కొత్త ఉపాయం బాగుంది” అంటూ ఆచంట రాకేశ్వరరావుగారు, “వెంబడి నా పద్యకుసుమం సమర్పించుకొనగల వాడను” అంటూ వికటకవి గారు వర్తమానం పంపించారు.

అంతలో చింతా రామకృష్ణారావుగారి నుండి ఈ పద్యధార …

క||

ఆహ్వానంబందినదయ.
జిహ్వాగ్రమునుండి కవిత  చిందగ,  సభకే
నాహ్వానింతును వాణిని
వాహ్వా యని మెచ్చ జనులు .వరలించెదగా !

శా||

అమ్మా! శాంభవి! నీదు పాద యుగమున్ బ్రార్థించు భాగ్యమ్ము నా
కిమ్మా! యిమ్మహి నెల్ల రూపముల నిన్నెన్నంగ, సేవింపగా
నిమ్మా జ్ఞానము.నా మనంబున సతం బిష్టంబుతో నుండుమో
యమ్మా! మాకు మనోజ్ఞ భవమౌ యాంధ్రామృతం బీయుమా!

క||

అమ్మా! ప్రార్థన వినుమా!
సమ్మానము తోడ మమ్ము సరగున గనుమా!
యిమ్ముగ నాంధ్రామృతమును
సమ్మతి గన జేయుమమ్మ! సజ్జన తతిచేన్.

ఇంకా శ్రీయుతులు తుమ్మల‌శిరీష్‌కుమార్ (చదువరి), చంద్ర మోహన్ (చంద్రిమ), చెణుకుల నిపుణులు విశ్వామిత్ర (ఊకదంపుడు) పాల్గొన్నారు. ఈ-భువనవిజయాధినేత రాయలవారిగా కొత్తపాళీగారు ఎంతో శ్రమనూ సమయాన్నీ వెచ్చించి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ అందరికీ మేమెంతో ఋణపడి వున్నాం. సభాభవన నిర్మాణ శిల్పి మరియు పర్యవేక్షకులు వీవెన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Posted in కవిత్వం | Tagged | Comments Off on విజయదశమి పద్యకవితా సమ్మేళనం – చివరిభాగం

విజయదశమి పద్య కవితా సమ్మేళనం – రెండవ భాగం

[మొదటిభాగం]

{రాయలు}: పెద్దన కవీంద్రా, అలనాడు వరూధిని ప్రేమ నివేదనని ఛాందసుడైన ప్రవరుడు నిరాకరించినట్లు చిత్రించారు.
{పెద్దన} చెప్పండి రాయా!
{రమణి}: ఆనతివ్వండి అనాలి పెద్దనగారూ.
{పెద్దన} రమణిగారు, కవులు నిరంకుశులండీ!
{రమణి}: పెద్దన గారు: హ హ నిజమే
{రాయలు}: మా కోరిక చిత్తగించండి … వెండి కొండమీద శివుడు ధ్యానమగ్నుడై యున్నాడు. ఎదుట నిండు జవ్వని పర్వత రాజపుత్రి అతడే తన పతి కావాలని భక్తితో పూజ చేస్తోంది. సమయం చూసి చాటు నుండి చెరకు వింటి రేడు బాణాలు దూశాడు. శివునికి ధ్యానభంగమైంది. ఈ ఉత్కంఠభరితమైన ఘట్టానికి మీ వర్ణనలో న్యాయం చెయ్యండి.
{చదువరి} శివుడనగానే నాగరాజు ప్రత్యక్షం!
{రాయలు}: నాగరాజు గారూ, మంచి రసవత్తరమైన సమయానికి విచ్చేశారు
{సాలభంజికలు} అందరికీ నమస్కారం.
{విశ్వామిత్ర} సాలభంజికలస్వామికి నమస్కారం
{సాలభంజికలు} విశ్వామిత్రా నన్ను స్వామిని చేసారేవిటీ? నేనింకా రాజునే, మీలా స్వామిని కాలేదింకా 🙂
{విశ్వామిత్ర} గడ్డంపెంచటం మొదలు పెట్టినట్టున్నారుగా స్వామీ .. ఇంకెంత దూరం
{సాలభంజికలు} విశ్వామిత్రా – గెడ్డంతో వైరాగ్యంరాదు సార్, మీకు తెలియందేముందీ, దానికి మేనక కావాలి. 🙂
{పెద్దన} అద్భుతమైన సన్నివేశాన్ని ఇచ్చారండీ! నాగరాజా స్వాగతం! ఇదిగో మరి అవధరించండి!

గిరిసుత చరణ కింకిణుల నిక్వాణమ్ము
ప్రణవమై ప్రభువు కర్ణముల దాకె
శైలజ ధమ్మిల్ల సహజ సుగంధమ్ము
భూతేశు నాసికాపుటము సోకె
అవనతగాత్రయౌ అగజ నిశ్వాసమ్ము
భస్మాంగు దేహ సంస్పర్శ జేసె
కనులెత్తి చూడగా కల్యాణి చూపులు
మరుతూపులై మదిన్ హరుని గ్రుచ్చె


జడుని మేనెల్ల దిగ్గున సంచలించె
స్థాణు వంతట దివ్యచైతన్య మందె
మరులు చెలిపైన, క్రోధమా మరుని పైన
కారె నిరుకన్నులందు శృంగార రసము
క్రాగె మూడవ కంట నంగార విషము
ద్వంద్వములు పుట్టె నంత నద్వైతమందు
సృష్టి కార్యమునందు నాకృష్టులైరి
ఆదిదంపతులిర్వురు “నైక్య” మంది!

{రాయలు}: హబ్బ .. ఏమి పద్యం చెప్పారండీ .. కుడికాలు ఈ ఆసనం మీద ఉంచండి .. గండ పెండేరము మీదే.
{పెద్దన} అంతమాట అన్నారు, అదే పదివేల గండపెండేరాల యెత్తు! నెనరులు!
{భట్టుమూర్తి} అదే కుడికాలికి మా నమస్కారం.
{చదువరి} నా నమస్కారం కూడా!
{గిరి} అమోఘం!
{రామకృష్ణారావు}: ప్రవాహం అంటే అలాగుండాలి.

పెద్దన పలుకులు బహుధా
సుద్దులు. నిజమయ్య! మనకు చూడగ యిక నా
వ్పెద్దకు పెద్దన యోగ్యము
సుద్దులు విని మురియుచుంటి సుజన విధేయా

{విశ్వామిత్ర} బహు బాగు. నా నమస్కారం కూడా!
{దైవానిక} కారె నిరుకన్నులందు శృంగార రసము ॥ క్రాగె మూడవ కంట నంగార విషము …. అబ్బ ఆ లైన్లు అదిరాయి
{చంద్రమోహన్} అద్భుతమైన వర్ణన. నావీ అందుకోండి ప్రణామాలు.
{రమణి}: మా ప్రణామములు కూడా.
{తాడేపల్లి} సన్న్యాసుల్ని సైతం సంసారులుగా మార్చేలా ఉందీ పద్యం
{రాయలు}: జడుని మేను సంచలింపు ఏమో గానీ, పద్యం ప్రతి పాదమూ గుండెని కదిలి పోయేట్టు తంతోంది అనుకోండి. అవునూ .. శైలజ ధమ్మిల్ల సహజ సుగంధమ్ము .. మీ ధూర్జటి తమ్ముణ్ణి తోడు తెచ్చుకున్నట్టు ఉన్నారే?
{పెద్దన} రాయలవారు బాగానే కనిపెట్టారు! మెచ్చిన పెద్దలందరికీ నమస్సులు
{దైవానిక} పిన్నలకు ఆశీస్సులు కూడా ఇవ్వండి 🙂
{పెద్దన} పిన్నలకు ఆ పలుకులమ్మ ఆశీసులు ఎప్పుడో అడిగాను కదా!
{తాడేపల్లి}

పెద్దన యను బిరుదము గల |
యుద్దండుడితండెవండొ యురుకవితా వి
ద్వద్దిగ్గజమనబోలిన
సద్దీప్తిని వెలుఁగువాఁడు సత్కవులందున్

{పెద్దన} ధన్యవాదాలు తాడేపల్లివారు! మీరు నా రెండో కాలికికూడా గండపెండేరం తొడిగినంత ఆనందంగా ఉంది! విద్వత్తులో మాత్రం నేను మీకో గజం తక్కువే 🙂
{సాలభంజికలు} పెద్దనంటే రాఘవేనా?
{గిరి} నాగరాజా, భైరవభట్ల గారే పెద్దన.

{రాయలు}: విద్వద్దిగ్గజమనబోలిన .. భలే భలే తాడేపల్లి వారూ!! …రామకృష్ణ కవీంద్రా .. మీ వర్ణన
{రామకృష్ణారావు}: మీ అనుజ్ఞమేరకు …

ఉ|| ధ్యానము నందు నున్న నను,ధర్మము గాంచగ చేయ, వచ్చెనీ
మానవతీ లలామ.. యట మన్మధుడాతని వాడి బాణముల్
మానసమందు గ్రుచ్చ, ననుమానముతో దహియింప జూచితిన్.
కానని కన్ను మూడవది.కాల్చక నిల్చె, నదెంత భాగ్యమో!

{రాయలు}: ఆహా .. మీ శుభచింతనతో పురాణాన్నే మార్చేసి మన్మథుడి ప్రాణాలు దక్కించారే 🙂 ఎంతైనా .. “చింతా ” రామకృష్ణులు గదా
{పెద్దన} చింతవారి చింత బాగుబాగు!
**********

{రాయలు}: చదువరి మహాశయా
{చదువరి} అయ్యా!
{రాయలు}: స్థాణు ప్రశంస జరిగింది .. మిమ్మల్ని అణు విమర్శకి పురిగొల్పుతున్నాము
{చదువరి} చిత్తం!

పణముగ నేమి బెట్టిరొ, స్వపక్ష విపక్ష సతర్క శంకలన్
తృణముగ నెంచి కూర్చిరి స్వతంత్ర మొసంగు నటంచు బంధమున్
కణికుడి ధర్మ మౌనొకొ, అఖండ సుశక్తి ప్రదాత యౌనొకో
అణువున దాగియుండిన రహస్యములెన్నొ వచింప శక్యమే!

{భట్టుమూర్తి} స్వతంత్ర మొసంగునటంచు బంధమున్ … అంతేనంటారా! 🙂
{పెద్దన} “స్వతంత్ర మొసంగునటంచు బంధమున్” నడక అద్భుతం!
{చంద్రమోహన్} పణముగ నేమిబెట్టిరొ!… అందరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న.
{రాయలు}: కణికుడు ??
{చదువరి} కణికుడు – కూటనీతి విశారదుడు – ధృతరాష్ట్రుని మంత్రుల్లో ఒకడు
{గిరి} జగణంతో జగడాన్ని బాగా చిత్రించారు
{రాయలు}: గిరీ, చంపకమాల అంటేనే జగణంతో జగడం కదా
{తాడేపల్లి} ఇప్పుడు బాధపడుతున్నాం గానీ భవిష్యత్తులో ఈ ఒప్పందం మేలే చెయ్యొచ్చు
{రామకృష్ణారావు}: ఆహా! అనుస్వరాలు ఎంత అందాన్నిచ్చాయి!!?
{సాలభంజికలు} చదువరీ – పద్యం అదిరింది.

{రాయలు}: ఆహా .. బావుంది. తాడేపల్లి గారూ .. మీ పూరణ?
{తాడేపల్లి} అవధరించండి మహాప్రభూ !

చ॥ రణమున కాణవాస్త్రములు । రావిఁక విద్యు దుపార్జననం బసల్
గణనకు రాదు కాని దొర । గారలదే మనకాయువంచు తా
మణిఁగి మణింగి శ్వేతభవ । నానుచరత్వము నేల పూనిరో ?
అణువున దాగియుండిన ర । హస్యములెన్నొ వచింప శక్యమే ?

{రాయలు}: శ్వేతభవ । నానుచరత్వము .. భలే భలే
{భట్టుమూర్తి} ఈ పదం తళుక్కుమంది
{రాయలు}: servility to white house
{పెద్దన} “అణిగిమణింగి” చాలా చక్కగా మణిగింది చంపకంలో! “దొరగారలదే” అన్న ప్రయోగంలోని వ్యంగ్యం కూడా చాలా బావుంది!
{విశ్వామిత్ర} ఒహో, నాగరాజు గారి వ్యాసాన్ని పద్య్న నిక్షిప్తం చేసినట్టుంది
{గిరి} శ్వేతభవనానుచరణత్వ ప్రయోగం చాల బావుంది
{చదువరి} వచ్చే విద్యుత్తు కాస్తో కూస్తో నని మీ భావన! బాగుంది!
{తాడేపల్లి} అవునట. మన దేశమంతా అణువిద్యుత్ కర్మాగారాలు పెట్టినా అది మొత్తం విద్యుదుత్పత్తిలో 24 శాతం కూడా ఉండదట.
{సాలభంజికలు} 6% శాతమేనండీ – 24 కూడా కాదు 🙂
{తాడేపల్లి} 6 శాతం ప్రస్తుతం ఉన్నదేమో
{విశ్వామిత్ర} ఆరునూరయ్యే సూచనే లేదు కాబట్టి, ఆరుని అక్కడే విడచి ముందుకెళ్దాం.
{సాలభంజికలు} ప్రస్తుతం 3%.
{పెద్దన} నాగరాజుగారు రాగానే సమయోచితంగా సంస్యనిచ్చారు రాయలవారు!
{సాలభంజికలు} పెద్దనగారు – నెనర్లు.
{సాలభంజికలు} 2034 కి 20% అవుతుందట..
{రాయలు}: విశ్వామిత్రా, సెబాసు. సభ్యులారా, మనం సాహిత్య చర్చకి పూనుకుని ఉన్నాము

**********

{రాయలు}: చంద్ర మోహన కవీంద్రా .. ఈ సమస్యకి మీరే తగుదురు అని ఎందుకో అనిపిస్తిన్నది … “దారము లేని హారము నితంబిని నీకెవడిచ్చె చెప్పవే”
{చంద్రమోహన్} చిత్తం. అవధరించండి నా పూరణ

వారము రోజులన్ గడచి వచ్చిన నాధుడు జూచె నాలిపై
హారము, శంకతో నడిగె నామె, ‘నొసే! మన తోటలోన మం
దారము దక్క యే ఇతర దామము లిప్పుడు లేవు, ముద్ద మం
దారము లేని హారము నితంబిని నీకెవడిచ్చె చెప్పవే!’

{రాయలు}: రామ రామా, వీడూ ఒహ అనుమానప్పక్షే నన్న మాట
{చంద్రమోహన్} పక్షి కనుకనే తోటను విహంగవీక్షణం గావించి వేరే పూవులు లేవని నిర్ధారించుకొన్నాడు
{దైవానిక} వట్టి అనుమానప్పీనుగులా ఉన్నాడే
{భట్టుమూర్తి} … ఆ తరువాతేమయిందో చెబుతారేమోనని చూస్తున్నాను 🙂
{రాయలు}: ఏవయ్యుంటుందీ, ఆ నితంబిని కొంగు ఝాడించి ఉంటుందీ, అయ్యవారు రాత్రికి కౌచిని ఆశ్రయించి ఉంటాడు 🙂
{విశ్వామిత్ర} భట్టుమూర్తీ… కారముగొట్టిపొయె సతి
{చదువరి} ఆహారము లేక నరుడు అలమటించున్
{దైవానిక} ఆ తరువాత మందు గొట్టి మగువ మంచమెక్కె 🙂
{సాలభంజికలు} దారములేని హారము ఒకటుందండోయ్ … సుదతి పలువరసే. 🙂

{రాయలు}: విశ్వామిత్ర: మీ నాయికకి కళ్ళు ఎర్రబడుతున్నట్లున్నాయి .. ఈ నితంబినిని కూడా ప్రవేశ పెట్టండి

{విశ్వామిత్ర}

జీరలు వారెనే కనులు, జెప్పక జెప్పవె నిద్రలేమినే?
భారపు గుబ్బలం బడిన బంగరు పూసల ముద్రదాచునే?
మారశరాగ్నితాళకయె మాధవు జెంతకు బోవకున్నచో
దారము లేని హారమునితంబిని, నీకెవడిచ్చె జెప్పవే?

{చంద్రమోహన్} మంచిహారమే ధరింపజేశారు!
{చదువరి} గోపకుడి ఆవేదనా ఇది!
{విశ్వామిత్ర} కలయిక కలగని గోపిక ఈర్ష్య అనుకొండి
{రాయలు}: బాగు బాగు .. సమస్యలో ఉన్న శృంగార రస భంగం కాకుండా అంగీకృతంగా పూరించారు
{విశ్వామిత్ర} తోటి గోపిక /గోపకుడి ఆవేదనా
{చంద్రమోహన్} మాధవుడు కొంచెము మెల్లగా కౌగిలించవలసింది.
{పెద్దన} అయితే ఇంతకీ దారమేవయ్యింది విశ్వామిత్రా 🙂
{సాలభంజికలు} పెద్దనా, ఆ దారమే ప్రేమబంధమయ్యిందమో..
{దైవానిక} అంతా విష్ణుమాయనుకుంటా??
{తాడేపల్లి} ఔరా ! ప్రాక్టికల్సు తెలియకపోతే ఇలాంటి థియరీలు పద్యాల్లోకి ఎక్కించలేరు సుమా !
{పెద్దన} ప్రాక్టికల్సులో విశ్వామిత్రులకి మించినవారెవరు చెప్పండి 🙂
{రాయలు}: తాడేపల్లిగారు, హ హ హ బాగా కనిపెట్టారు

{సాలభంజికలు} అధ్యక్షా – సుదతి పలువరసే అన్నానిందాక …
{రాయలు}: సాలభంజికలు, ఐతే అదిచ్చిన వాడు ఆర్థోడాంటిష్టయి ఉంటాడు .. ఎవడిచ్చె చెప్పవే అని కదా సమస్య 🙂
{సాలభంజికలు} అయ్యా – అట్లాంటివి క్లోజప్ వారి కానుకలట, మీరు టి.వి. చూడటంలేదా 🙂
{పెద్దన} అవునండీ, కొందరి పలువరుస ముత్యాల హారం, కొందరివి రత్నాల హరం 🙂

{రాయలు}: వేగుల్లో ఈ సమస్య గురించి కొంచెం చర్చ జరిగినప్పుడు దారము లేని హారం .. కవి యైన ప్రియుడు పద్యహారం ఇచ్చాడని పూరించవచ్చు అని సూచన ఇచ్చాను నేను. దానికి మన విశ్వామిత్రుడు .. “అదంతా రాయలవారి కాలంలో! ఇప్పుడింకా పద్య హారాలకి పడతారా నితంబినులు” అని అడిగాడు 🙂
{చంద్రమోహన్} ఔను. ఈ రోజుల్లో పద్యహారాన్ని పుచ్చుకొని సంతోషించే నితంబిని ఎక్కడ దొరుకుతుందని ఎవరో శంకించారు కూడా!
{రాయలు}: నాయనా, పడేయించే శక్తి పద్య హారంలో కాదు, అది కట్టి వేసే “వాడి”లో ఉంటుంది అని సందేహ నివృత్తి చేశాను 🙂
{తాడేపల్లి} అప్పుడు మాత్రం పద్యహారాలకు ఏ నితంబిని పడింది ? పడి ఉంటే “మిక్కిలి రొక్కములియ్యక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ” అని ఎందుకు మొత్తుకుంటాడు?
{చంద్రమోహన్} నిజమే
{సాలభంజికలు} రాయలవారు సరిగ్గా చెప్పారు. పడింతర్వాతే ఈ కానుకలు పన్చేసేది?
{రాయలు}: తాడేపల్లిగారు, ఆవిడొక్కత్తీ మరీ ప్రాక్టికల్ మనిషి అయ్యుంటుంది
{పెద్దన} సుమతి చెప్పింది వారకాంతలు గురించి కదండీ, రాయల వా రా కాంతల గురించి చెప్పటం లేదు.
{చదువరి} వారకాంత – హారము కావాలిగానీ పద్యహారమెందుకంటుంది.
**********

{రాయలు}: భట్టు కవి వర్యా
{భట్టుమూర్తి} ప్రభూ
{రాయలు}: జట్టు పట్టు కట్టు బొట్టు .. అదే వరుసలో, కంద పద్యంలో పాద ప్రథమ గణంలో
{భట్టుమూర్తి} పూరణ: కందము

జట్టుగ గెలిచిన జగడము
పట్టుగ పండించుకొన్న పలమెడు మెతుకుల్
కట్టువ గలిగిన బిడ్డలు
బొట్టుగ రాలిన చెమటయుఁ బొల్పగు నిలలో

{రాయలు}: పొల్పగు?
{భట్టుమూర్తి} పొలుపు (= సొంపు, వైఖరి, స్థైర్యము, agreeableness) + అగు = పొల్పగు
{సాలభంజికలు} వావ్.. భట్టుమూర్తి, సూపర్. ఒరిజినాటిలీ ఉట్టిపడుతోంది ఈ పద్యంలో.
{తాడేపల్లి} మీరే పూర్వజన్మలో సుమతీశతక కర్త కారు గదా ?
{రాయలు}: మళ్ళీ శ్రమైక జీవన సౌందర్యం
{పెద్దన} సుమతిని తలవగానే సుమతీ పద్యంలాటి పద్యమే చెప్పారు! భట్టుమూర్తీ భేష్! “పలమెడు” చక్కని పదం!
{రామకృష్ణారావు}: భట్టుమూర్తిగారి జట్టూ పట్టూ భలే!
{చదువరి} బ్రహ్మాండం! చాలా మంచి పద్యం!
{చంద్రమోహన్} చెమట బొట్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి పద్యంలో
{విశ్వామిత్ర} భట్టుమూర్తీ భేష్!
{గిరి} పట్టుతొ పండించినారు పద్యము మూర్తీ
{భట్టుమూర్తి} ధన్యోస్మి

{రాయలు}: రామకృష్ణ కవీంద్రా? మీ పూరణ
{రామకృష్ణారావు}:

క: జట్టుగ నడచిన మనకొక
పట్టుండును. బలము పెరుగు పరికింపగ నా
కట్టుల తోచెడిని నిజం
బొట్టు మనల కైక్యమొదవ నొనరును జయముల్.

{రాయలు}: ఐకమత్యమే మహా బలము .. బాగా చెప్పారు
{చంద్రమోహన్} ఒట్టుపెట్టి మరీ చెప్పాక కాదంటామా!
{పెద్దన} “బొట్టు”తో “ఒట్టు” పెట్టించారు. బావుంది!
{తాడేపల్లి} రామకృష్ణారావుగారు జానుతెనుఁగు స్పెషలిస్టు
{భట్టుమూర్తి} జట్టుగ నడచిన మనకొక పట్టుండును … బ్రహ్మాండం!
{చదువరి} బొట్టు పెట్టి మరీ.. చెప్పారు కూడాను!
{రామకృష్ణారావు}: రసజ్ఞులకు ధన్యవాదములు.

{రాయలు}: మన సభలో వెన్నెలలు విరియించడానికి శరత్పూర్ణిమ వేంచేసింది. స్వాగతం
{పూర్ణిమ} అందరికీ నమస్కారాలు!
{రాయలు}: తాడేపల్లి వారూ ఈ సమస్య మీ వంతు
{తాడేపల్లి} చిత్తం
{రాయలు}: ఆకలి వేళనే జరుగు నాకుల గోలయు వీధి వీధిలో
{తాడేపల్లి} సిద్ధం ప్రభూ ! అవధరించండి

ఉ॥ ప్రాకట వేద కర్మముల । బ్రాహ్మణులప్పుడు విస్మరింత్రు ; వై
శ్యాకరమెల్ల వాసవిని । సంస్మరియించుట మాను ; దొంగలై
సాకెద రుర్వి రాజు ; లిటు । సర్వులు స్వీయ పథాపసర్పులౌ .
ఆకలి వేళనే జరుగు నాకుల గోలయు వీధి వీధిలో

{రాయలు}: స్వధర్మే నిధనం శ్రేయః
{రామకృష్ణారావు}: సూపర్
{పెద్దన} బావుంది! మీ “ముద్ర” కనిపించింది!
{చంద్రమోహన్} ఘోర కలిని ఆవిష్కరించారు.
{రాయలు}: ఏమైనా కృష్ణ వచనం స్మరణీయం, శిరోధార్యం
{తాడేపల్లి} ఎవరూ కులధర్మాలు పాటించరు కానీ కులాల గుఱించి కొ్ట్టుకు చస్తూంటారని అర్థం చేసుకోవడమైనది.
{పెద్దన} అసలు కులాలు పోయి కులగోలే మిగిలింది!
{గిరి} పెద్దన గారు సరిగా చెప్పారు

{రాయలు}: రామకృష్ణ కవీంద్రా .. మీ పూరణ
{రామకృష్ణారావు}: ఆర్యా, చిత్తం

ఉ||ఆ “కలి” దుష్ ప్రభావమిల నందరిపై పడ, వర్గపోరులున్,
భీకరమైన వర్ణముల భేదములున్ జెలరేగు నిత్యమున్.
మా “కవి” గుండె మంటలయి, మాకవితా కు, “సుమాలు వాడె”నే!
యా ” కలి ” వేళలన్ జరుగు నా ” కుల” గోలయు వీధి వీధిలోన్.

{దైవానిక} మాకవితా కు, “సుమాలు” చాలా బాగుంది వాడకం
{రాయలు}: భావ కవిత లాంటి సుకుమారమైన పద్యం చెప్పారు
{తాడేపల్లి} మా “కవి” గుండె మంటలయి, మాకవితా కు, “సుమాలు వాడె”నే!
{చంద్రమోహన్} మంచి శ్లేష
{పెద్దన} వాడిపోయి “కు” సుమాలయ్యాయి! “మా కవి” – “మాకు అవి”. చాలా బావుంది!
{తాడేపల్లి} ఇటువంటి వాక్యాలు రాయగలవారు సామాన్యులై ఉండరు.

**********

{రాయలు}: గిరిధరా .. రాముడు సీతని ఏదో అంటున్నాడట .. మన బ్లాగ్లోకం మండి పడుతోంది. ఈ సమస్యని ఆలకించండి .. సీతా రామునికిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహమిల్లాలవై!
{గిరి} చిత్తం రాయల వారూ, సిధ్ధం. ఆలకించండి

ప్రాతన్నొక్క రణంబునందు కయికా, ప్రాణాలు కాపాడినా
వే, తత్కృత్య ఫలంబులైన వరముల్ ప్రేరించి నా ప్రాణముల్
ఘాతించం బనికొంటివో కటకటా గారంపు నా ప్రాణమౌ
సీతారామున కిట్లొనర్చెదవె యిస్సీ ద్రోహమిల్లాలవై

{పెద్దన} చాలా బావుంది పూరణ! “సీత”ని “రాముని” విడదీస్తేనే సమస్య. కలిపేస్తే సమస్యే తీరిపోతుంది!
{సాలభంజికలు} గిరిధరా – చాలా బావుంది మీ పూరణ.
{తాడేపల్లి} దశరథుడంటున్నాడా ఈ మాటలు ! బాగు బాగు ! గిరిగారు గత ఆర్నెలల్లో చాలా ముందుకెళ్ళిపోయారు. ఇకాయన్ని పట్టశక్యం కాదు.
{విశ్వామిత్ర} అందుకే, వరమైనా , ఇంకోటైనా అప్పటికఫ్పుడు “శెటిల్” చేసుకోవాలి
{రాయలు}: మంచి ప్రౌఢమైన పూరణ
{చంద్రమోహన్} శార్దూలంలా లంఘించాడు మీ దశరథుడు కైక పైన
{పూర్ణిమ} అవును.. భలే!
{గిరి} ధన్యుణ్ణి, తాడేపల్లి గారు – అవును దశరథుని మాటలే
{భట్టుమూర్తి} చంద్రమోహన్ గారి వ్యాఖ్యకు జోహార్

{రాయలు}: తాడేపల్లి వారు ఈ సమస్యని వేరే కోణంలోంచి చూశారు .. కానివ్వండి
{తాడేపల్లి} అదిగో మహారాజా !

శా॥ ప్రాతర్వంద్య విరించి వంశ జలధిన్ । బ్రాదుర్భవంబంది లో
కాతీత స్థిర రూప యౌవన విలా । సారూఢి గర్వించి యా
శీతాంశున్ బతిశిష్యుఁ బుత్త్ర సమునిం । జేపట్టినావెట్టు లో
సీ ! తారా ! మునికిట్లొనర్చెదవె యి । స్సీ ద్రోహ మిల్లాలవై.

{విశ్వామిత్ర} లో కాతీత స్థిర రూప యౌవన విలా । సారూఢి గర్వించి – పౌర్ణమి నాడు పుట్టిందేమో దుర్భుద్ధి
{చంద్రమోహన్} రామాయణం లో తారాశశాంకమా!
{తాడేపల్లి} ఇది వేఱే సందర్భం.
{గిరి} విరుపంటే మీదే – విరగొట్టి విరగదీసారు కదా
{దైవానిక} మీ ఈ పద్యానికి టోపీలు తీసేసాం
{విశ్వామిత్ర} ఏరండీ మీ సీతారాములు, కనబడరే
{రాయలు}: విశ్వామిత్రా, కనికట్టు
{సాలభంజికలు} ఆయన బృహస్పతి భార్య తారని గూర్చి చెప్తున్నారల్లే ఉంది.
{భట్టుమూర్తి} సాలభంజికలు – ఔననుకుంటాను. సీ అన్నారు, యిస్సీ అన్నారు … ఛీత్కరించేశారు…
{పెద్దన} “ప్రాతర్వంద్య విరించి వంశ జలధిన్”, అహా ఏఁవెత్తుకున్నారండీ పద్యాన్ని!
{రాయలు}: పొద్దున్నే దణ్ణం పెట్టుకో దగిన వాడైన బ్రహ్మమానస పుత్రుడైన ప్రజాపతి కూతురవై అని …
{రామకృష్ణారావు}: సీతారాముని .. ఇస్సీ, తారా, మునులుగా మార్చారు. శహభాష్!
{విశ్వామిత్ర} స్థిర రూప మేనా , బింబ రూపమా
{తాడేపల్లి} రాయలవారు సీతారాముల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఇవ్వలేదని నాకు మనసులో ఒక మూఢనమ్మకం. అందుకని మందుజాగ్రత్తగా నేను వేఱే సందర్భాన్ని ప్రయత్నించాను
{చదువరి} మంచి కల్పన
{రామకృష్ణారావు}: ఇదండీ సమస్య అంటే!
{రాయలు}: ఈ సమస్య మన పెద్దన గారి చేతి చలవ 🙂
{పెద్దన} నా హృదయాన్ని పట్టుకొన్నారు తాడేపల్లివారు. నా అంచనాలకి మించిపోయారు గిరిగారు!
{విశ్వామిత్ర} వారికి తారాశాసాంకం ఈష్టమ్నుకుంటా – లోగదా నా సమస్యని ఆ బాటే బట్టింఛారు
{సాలభంజికలు} పెద్దనగారూ – సీతారాములని కవి విడగొట్టినా సమస్యలేదు. కవికానివాళ్ళు విడగొడితేనే సమస్య… 🙂
{చదువరి} కకావికలౌతుందప్పుడు!
{విశ్వామిత్ర} సాలభంజికలు, ఔనండీ.
{రాయలు}: సాలభంజికలు, సెబాసు
{గిరి} చదువరీ 🙂
{భట్టుమూర్తి} చదువరి!! 🙂

{రాయలు}: గిరిధరా .. ముందీ సమస్యను పూరించండి “మానవతీ లలామ కభిమానమె చాలును చీర యేటికిన్”
{గిరి} చిత్తం. ఇది మన సనీ తారల గురించి చెప్పి పూరించాను

వానకు ముద్దగా తడిసి వల్వల నొల్చు తళుక్కు తార మా
రాణి కిలాడిలాడి అలరారును కామిని అర్ధనగ్నయై
లేని బిడెమ్ములే పొటమరింప నటించు సినీ సుహాసినీ
మానవతీ లలామ కభిమానమె చాలును చీర యేటికిన్

{దైవానిక} అభిమానులే అన్న మాట కావలసింది ??
{గిరి} దైవానిక, అభిమానంతో కప్పేయడానికి సిధ్ధపడుతున్నారా
{పెద్దన} బావుంది! మొదటిపాదంలో తడిపేసారు, రెండవ పాదంలో ఆరబెట్టేసారు!
{విశ్వామిత్ర} రాయల వారి శాఖాపోషణ బావుంది – ఒకరికి రాజకీయ శాఖా, ఒకరికి సినీ శాఖ
{చంద్రమోహన్} ‘కిలాడిలాడి ‘ అల్లల్లడించారు గదా తార మారాణిని 🙂
{రాయలు}: గిరిగారు దర్శకేంద్రుడి శిష్యరికమేవైనా చేశరేమో సీక్రెట్టుగా? 🙂
{విశ్వామిత్ర} పొటమరించేదెవ్వరికి? వానకా
{చదువరి} విశ్వామిత్ర 🙂
{రాయలు}: ఎపూడు తడపాలి, ఎప్పుడు ఆరెయ్యాలి అని
{పెద్దన} అంతా బానే ఉంది కాని మధ్యలో “సుహాసిని”ని తేవడం బావులేదు. నాకు సుహాసిననగానే ముక్కుపొడకలో ముందు సుహాసినే గుర్తుకువస్తుంది 🙂
{రాయలు}: అదీ నిజవేఁ .. సుహాసిని ఇలాంటి స్థితిలో ఎప్పుడూ నటించలేదే అని నేనూ అనుకున్నా. యంతైనా అయ్యంగార్ల అమ్మాయి కదా!
{చదువరి} సుహాసిని ముక్కునటి యని రాజేంద్ర చెప్పారు గతంలో!
{విశ్వామిత్ర} ఈవిడ కొత్త సుహాసినేమో – గిరిగారి వయసుని కూడ దృష్టిలో పెట్టుకోండి
{చదువరి} కొత్తావిడ ఉత్త హాసినే!
{భట్టుమూర్తి} కొత్త సుహాసిని వుంది. ఆవిడ కూడా అలా ఎప్పుడూ చెయ్యలేదు .. గిరిగారి సినీసుహాసిని వేరే వున్నట్టుంది.
{సాలభంజికలు} నాకో సందేహం ఈ పూరణపై – అడగవచ్చా?
{గిరి} నాగరాజా అడగండి
{సాలభంజికలు} ఈ పూరణలో ‘మానవతీ’ అన్న ప్రయోగం ఇమిడిందా అని ??
{గిరి} నాగరాజా ఆవిడ సినీమావవతీ, సినీసుహాసినీ నండీ
{భట్టుమూర్తి} మానవ-తీ అనుకుంటే ఏమన్నా ఇముడుతుందేమో పెద్దలు చెప్పాలి
{రాయలు}: తమిళంలో “తీ” అంటే నిప్పు

{రాయలు}: పెద్దన కవీంద్రా .. మీకు మరో రసవత్తరమైన సమస్య .. “సరసుని వైపు వీపు నల చాన మొగం బటు గోడ వైపునన్”
{పెద్దన} చిత్తగించండి!

అరవిరి సిగ్గుతోడ తన అందెలు ఘల్లన మెల్లమెల్లగా
నిరుపహతిస్థలంబునకు నెచ్చెలి దా తొలిరేయి జేరె, నా
వరుని ముఖమ్మునుండి పొగవాసన గుప్పున వచ్చె, నాయెపో!
సరసుని వైపు వీపు నల చాన మొగంబటు గోడవైపునన్!

{భట్టుమూర్తి} ఆయె పో! .. నుడికారం!!
{దైవానిక} పాపం వీళ్ళని ఉద్దరించడానికే అన్బుమణి పూనుకున్నాడు..
{విశ్వామిత్ర} ఆందుకే గామోసు ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది
{సాలభంజికలు} పెద్దనాగారు – చాలా బావుంది. నిన్నటి నుంచీ మరి పడకటింటిలోనే కాల్చుకోవాలి మరి – ఏం చేస్తాం?
{విశ్వామిత్ర} తాంబూలం అలవాటు చేసుకోండి, అవసరానికి ఆదుకుంటుంది
{తాడేపల్లి} మానవతులు కూడా ధూమవతులైతే అన్బుమణులు ఎన్ని ఉన్నా ఉపయోగం ఏముంది ?
{పెద్దన} అలాటివాళ్ళకేనండీ ఈ హెచ్చరిక 🙂 అయినా ఆ కొత్తంతా “తొలిరేయి”నాడే, తర్వాత అలవాటైపోతుంది!
{భట్టుమూర్తి} వధూవరులు త్వరలో ధూమవతీపతులౌతారన్నమాట
{రామకృష్ణారావు}: క్రియాపదంతో పాదం పూరించివుంటే ఇంకా బాగుంటుండునేమో
{గిరి} తొలిరేయైతే ఆ పొగ సెగ వేరేదేమో
{రాయలు}: giri: fantastic
{పెద్దన} పొగ వేరేదైతే, వాళ్ళు వేరవ్వాల్సిన అవసరమే లేదు 🙂
{చంద్రమోహన్} పొమ్మనలేక పెట్టిన పొగ గాదు కదా!
{సాలభంజికలు} చంద్రమోహన్ – ఆహా, ఏం చెప్పారండీ.. శభాష్
{తాడేపల్లి}

పొగవారలసలు సిసలగు
మగవారని నమ్ము వెఱ్ఱి మగువలు గలరే
వెగటైనది నేటికి మఱి
సగటైనది లోకమందు సర్వస్థలులన్

{భట్టుమూర్తి} తాడేపల్లిగారూ, అలా నమ్మబట్టే కదా పొగవారసులను చూస్తున్నాం 🙂

{రాయలు}: ఈ సమస్యతో ఒక తమాషా ఉంది
{విశ్వామిత్ర} చెప్పండి
{రాయలు}: గంగ కద్దరి మేలు నిద్దరి కీడు నుంగలదె, యుద్య్ద్రాజ బింబాననా! అని పూర్తయ్యే చాటువు ఒకటి ప్రముఖంగా ఉంది. ఆ పద్యంలో మధ్య పాదం ఇది 🙂
{పెద్దన} ఇది తిరుపతివేంకటకవులు పూరించిన సమస్య. వారి పూరణ వేరనుకోండి.
{గిరి} తిరుపతివేంకట కవుల పూరణ నిన్ననే చదివాను. అదిరింది.
**********

{రాయలు}: చదువరి మహాశయా
{చదువరి} అయ్యా!
{రాయలు}: రాజకీయ చతురులు గాన … తెలుగు వారికి అతి పరిచయమైన రాజకీయ పద్యం .. జెండాపై కపి రాజు .. దీనితో మొదలు పెట్టి ప్రస్తుత ఆంధ్ర రాజకీయ వాతావరణం మీద ఒక మంచి పద్యం చెప్పండి
{చదువరి} చిత్తం!

జెండాపై కపిరాజు యున్నను రిపున్ చెండాడునే క్రీడి తా
గాండీవమ్ము ధరింపకన్? మరిక లేకన్ యే విధానాస్త్రముల్
మెండౌ యీ యభిమాను లీయనుజు లీ మిత్రాది మిత్రాదులే
యండైయుండిన చాలదండి! అనియం దావశ్యక మ్మస్త్రముల్

{రాయలు}: భలే
{తాడేపల్లి} ప్రజలే నిర్ణయిస్తారని వాళ్ళంటూంటే….
{భట్టుమూర్తి} మిత్రాదిమిత్రాదులు 🙂 🙂
{విశ్వామిత్ర} యభిమాను లీయనుజు లీ మిత్రాది మిత్రాదులే – వచ్చి వరసగా కూచున్నారంతే పద్యంలో.
{రామకృష్ణారావు}: ఎంతైనా చదువరి చదువరే!
{భట్టుమూర్తి} చదువరి గనుకనే ఇంత బాగా రాయగలుగుతున్నారంటారా!?
{రాయలు}: రామకృష్ణారావుగారు, పొరపడ్డారు, ఎంతైనా, చదువరి రాజకీయ కవే
{దైవానిక} రాజకీయం మీద పద్యాలంటే చదువరి తరువాతే!!
{పెద్దన} నడక చాలా బావుంది. మొత్తానికి మీ “చిరు” అభిమానాన్ని మళ్ళీ ప్రకటించుకున్నారు 🙂
{చంద్రమోహన్} అద్భుతమైన పూరణ
{తాడేపల్లి} స్వభావోక్తి
{చదువరి} ధన్యుణ్ణి!

{రాయలు}: విశ్వామిత్రా, మీ పూరణ?
{విశ్వామిత్ర}

జెండాపైకపిరాజే?
గుండాల్,దుండగులు జేర గుంపై. లేకన్
జెండా, పైకపురాజులు
తొండిగ గెలిచెడు యుగమిది, దోచగ జనతన్.

{దైవానిక} పైకపురాజులు 🙂
{భట్టుమూర్తి} తొండిగ గెలి’చెడు’యుగమిది 🙂
{చదువరి} పై కపిరాజు పైకపురాజులు – భలే!
{పెద్దన} మీరు పన్నుల సంపన్నులు విశ్వామిత్రా!
{రాయలు}: భలే భలే. అందుకే కదా పైకపు రాజుల్ని చేశారు!
{విశ్వామిత్ర} ధన్యుణ్ణి. గట్టిగా అనకండి, దానిమీద కూడ “పన్ను”గట్టమంటారు ప్రభుత్వం.
{రాయలు}: హ హ హ .. పాతాళ భైరవి లో లాగా
{చంద్రమోహన్} పన్నుల మీద పన్ను కట్టగల సమర్థులే మీరు!

{రాయలు}: శ్రికాంత కవీ .. మీ పూరణ .. మీ కపి రాజుని కూడ జెండా పైకెక్కించండి
{దైవానిక} చిత్తం,

కం. జండాపై కపిరాజే
యుండిన నంతనె రణమున నొడ్డి గెలువడె
వ్వండును, పేరునె హనుమం
తుండిన విజయము వరించదు చిరంజీవిన్

{గిరి} తప్పు తప్పు 🙂
{రాయలు}: హ హ .. పేరులో నేమి పెన్నిధి ఉన్నది అంటారు
{చదువరి} పేరుంటే చాలదని శ్రీకాంత్ భావన! – బావుంది
{భట్టుమూర్తి} దైవానిక భలే పోలిక తీశారు!

{రామకృష్ణారావు}: నమ్మిన నిజాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు.

{రాయలు}: ఇంకొక పదిహేను నిమిషాలలో సభని ముగింతాము. అటుపైన సమయము ఉన్న వారు ఉండి సంభాషణ కొనసాగించ వచ్చును. ఒక్క నిమిషం .. రాకేశ్వరుడు మంచి పద్యం (ఈ సభకి ఆయన రాసింది ఇదొక్కటే) రాశాడు

జండాపై కపిరాజు నుంచి రణమున్ – చండాడెఁ కర్ణాదులన్
పాండుశ్రేష్టుడు! రామలక్ష్మణులకున్ – భండంబునన్ తోడుగా
యుండెన్! ప్రైమరులన్ని నెగ్గెను బరా – కోబామ నమ్మీతనిన్!
డంబెట్టిన రామదూతకు ధరా – ధ్యక్షం బొసంగున్ గదే!

{రాయలు}: ఈయన అమెరికను రాజకీయమ్మీద దృష్టి నిలిపినాడు
{చంద్రమోహన్} కపిరాజుని క్రౌంచద్వీపానికి తీసుకెళ్ళిపోయారన్నమాట.
{పెద్దన} ఏకంగా “ధరాధ్యక్షంబే”!
{విశ్వామిత్ర} కపిరాజుకి అదెంతపని

{తాడేపల్లి} రాయలవారికి విన్నపం. మిత్రులకు మనవి. నేనింక సెలవు తీసుకోవచ్చునా ?
{రాయలు}: మీ మంగళాశాసనం పద్యాలు అందుబాటులో ఉన్నాయా? వినిపించండి .. తదుపరి విరమిద్దురు గాని
{తాడేపల్లి} సరే ప్రభూ !

శా॥ ఏరీ సత్కవితా సభన్ దమదిగా।నే లోన భావించి స్వా
హారస్వాపములుజ్జగించి మఱియున్ । హంకార హుంకార ఢం
కారావంబుల తోడఁ బాలుగొనిరో । యవ్వారికెల్లన్ గృపన్
శ్రీరుద్రాణి యనుగ్రహించుత సదా । శ్రీ ఆయురారోగ్యముల్.

{విశ్వామిత్ర} అస్తు
{భట్టుమూర్తి} తథాస్తు
{గిరి} అది చాలు
{రాయలు}: శ్రీ రుద్రాణి .. ఆయన సాంబుడు .. ఈమె రుద్రాణి .. బాగా పలికించారు
{చదువరి} ధన్యోస్మి… తథాస్తు!
{రామకృష్ణారావు}: ఆహా! ఏమి దీవించారండీ!
{దైవానిక} ఆ రుద్రాణి మీ పద్యం వింటే తప్పక కరుణించగలదు 🙂
{తాడేపల్లి}

స్వస్తి: ప్రజాభ్య: పరిపాలయంతామ్
న్యాయ్యేన మార్గేన మహీమ్ మహీశా:
రాజప్రజాభ్య శ్శుభమస్తు నిత్యమ్
లోకాస్సమస్తఅస్సుఖినో భవన్తు ||

{రాయలు}: అస్తు
{పెద్దన} అస్తు! అస్తు!
{రాయలు}: ధన్యవాదాలు లలిత కవి లలితా బాలసుబ్రహ్మణ్యం గారూ. ఉగాది సభ మీరు లేక చిన్న బోయింది. ఈ రోజు మీ రాకతో నిండుతన మొచ్చింది మా కవితా కన్యకి.
{భట్టుమూర్తి} తాడేపల్లిగారూ, ధన్యవాదాలు.
{చంద్రమోహన్} తాడేపల్లి గారూ, గొప్ప ఆశ్వాసనం. కృతజ్ఞతలు.
{సాలభంజికలు} చాలా బావుంది.

అలా సభను ఆశీర్వదిస్తూ తాడేపల్లిగారు నిష్క్రమించిన తరువాత …

{రామకృష్ణారావు}: మేమూ విరమించవచ్చా?
{రాయలు}: మీకు వీలుంటే కాసేపు ఉండండి, మిగతా మిత్రులు ఉంటారు.
{రామకృష్ణారావు}: అలాగే!

(సశేషమ్)

Posted in వ్యాసం | Tagged , , , , | 10 Comments

అభినవ భువనవిజయ దశమి

ప్రియమైన పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు.

గడచిన ఉగాది సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి రసజ్ఞులు మాకందించిన ప్రోత్సాహంతో ఈ విజయదశమి నాడు మరో రసవత్తరమైన కవిసమ్మేళన అంతర్జాలసభా విశేషాలను విజయవంతంగా మీకు సమర్పిచ గలుగుతున్నందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం. ఈ శుభ కార్యాన్ని సుసాధ్యం చేసిన కవివర్యులు, సాంకేతిక నిపుణులు, సారధులు, అతిథులూ మీకు చిర పరిచితులే. పరిచయాలు త్వరలో…

ఈలోపున ఈ అభినవ భువనవిజయ సభా విశేషాలను ఆస్వాదించండి …

{రాయలు}: విఘ్నేశ్వర ప్రార్ధనతో మొదలు పెట్టమని విశ్వామిత్రులను కోరుతున్నాను
{విశ్వామిత్ర}: ధన్యోస్మి

అగరాజసుతాసుతునకు
నిగమాగమపెన్నిధికిని, నేమ్రొక్కెద, వి
ఘ్నగణాధిపునకు, జాలపు
జగతి, నవభువనవిజయము జరుగుట వేడ్కన్.

{రాయలు}: బాగు బాగు. పాదపు అంచున విఘ్నం నడుము విరిచారు
{పెద్దన}: విఘ్నాలు విరిగినట్టే, భేష్!
{చదువరి}: పద్యం బావుంది, విఘ్నాన్ని విరిచారన్న ప్రశంస కూడా బావుంది.
{విశ్వామిత్ర}: సామవేదం షణ్ముఖ శర్మ గారు ” అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ ” అన్నారు .. అదే అర్ధం స్పురింపించటానికి ప్రయత్నించాను

{రాయలు}: తాడేపల్లి లలిత కవీశ్వరా .. సింహాసనస్థ యై కిరీట ధారిణియైన రాజరాజేశ్వరిని మా మనసుల్లో ప్రతిష్ఠించండి
{తాడేపల్లి}:
ఉ॥

శ్రీ విలసన్మనోజ్ఞ నిజ । శీర్షమునన్ బహురూప చిత్ర ర
త్నావళి గుంఫితాగ్ర మకు।టంబు సెలంగ వెలుంగుచున్
సహృద్ భావ విధాయకోజ్జ్వల శు।భాక్షులఁ జూచు జగజ్జనిత్రి యా
దేవి మతల్లి దుర్గ మముఁ । దేల్చుత దివ్య కటాక్ష వారిధిన్.

{రాయలు}: సెబాసు. తల్లి ఠీవికి తగిన పదజాలంతో పొగిడారు
{పెద్దన}: “శుభాక్షులతో” చూసే తల్లి “కటాక్షాన్ని” కోరడం సమంజసంగా ఉంది!
{రాయలు}: ఇక్కడ విలసన్మనోజ్ఞ అంటే …? విలసత్ + మనోజ్ఞ అని పదఛ్ఛేదం చేసుకున్నాను.
{తాడేపల్లి}: విలసత్ అనే విశేషణాన్ని దానికి ముందున్న శ్రీతో కలిపి చదువుకోవాలి. శ్రీ అనగా ఐశ్వర్యము, వైభవము. దానితో విరాజిల్లు మనోహరమైన నిజ (తన) శిరస్సునందు.. అని. అంటే లక్ష్మీ విలాసం లాగా ..
{వికటకవి}: దేల్చు”త” కూడా కాస్త వివరిస్తారా
{తాడేపల్లి}: ఇది తేల్చుతన్. దీన్ని దివ్యకటాక్ష వారిదితో కలిపి చదువుకోవాలి
{వికటకవి}: ఓ అదా సంగతి,
{తాడేపల్లి}: దివ్యమైన = పవిత్రమైన ; కటాక్ష = ఓరచూపులు అనే ; వారిధి = సముద్రమునందు తేల్చవమ్మా ముంచకు అని అర్థం
{పెద్దన}: దేవి కటాక్షవారిధిలో మునిగిపోయినా పరవాలేదు!
{రాయలు}: పెద్దన: బాగా సెలవిచ్చారు
{తాడేపల్లి}: మునిగిపోతే ఆవిడలో లీనమైపోతాం. ఆవిడ గొప్పతనం తెలుసుకునే అవకాశం ఉండదుగా

{రాయలు}: ఆ నోటితోనే తెలుగు భారతిని కీర్తించండి పెద్దనార్యా
{పెద్దన}: చిత్తం, సిద్ధం

ఉయ్యాలనూపు తాతయ్య జోలలలోన
తొలిసారి నిను వింటి పలుకులమ్మ
ఆకలో! అర్మిలో! “అమ్మా” అనిననాడు
తొలిసారి నిను నంటి పలుకులమ్మ
ఒడిబెట్టి నాన్నారు ఓనమాల్ దిద్దింప
తొలిసారి నిను రాస్తి పలుకులమ్మ
బడిలోన పాఠాలు పంతులమ్మలు నేర్ప
తొలిసారి నిను చూస్తి పలుకులమ్మ
ఎన్ని పద్యాలు వినిపిస్తి వెన్ని తీపి
పాటలను పాడితివి యెన్ని బతుకు కతలు
చెప్పితివి అమ్మరో, నన్ను చేర దీసి!
ఎన్ని నేర్చినగాని నే నెన్నటికిని
చంటిపాపాయినే నీకు చదువులమ్మ!
నన్ను, నావంటి తెలుగింటి చిన్నవాళ్ళ
దెలుగు పాలిచ్చి పెంచవే పలుకులమ్మ!

{రాయలు}: భలే భలే

{చంద్రమోహన్}: హమ్మయ్య! ఇప్పటికైనా పాలు మాకూ ఇప్పించారు, మీరొక్కరే తాగెయ్యకుండా 😉
{వికటకవి}: వింటి,నంటి,రాస్తి,చూస్తి….బాగుంది, సరళంగా
{దైవానిక}: ఆకలో! అర్మిలో .. ఇది కాస్త వివరిస్తారా??
{పెద్దన}: అర్మిలి అంటే ప్రేమ, అనురాగం.
{రాయలు}: పెద్దన: ఈ పదం బహు సుందరంగా ఉంది
{చదువరి}: సంస్కృతమేమీ లేకుండా అచ్చ తెలుగు పదాలే కదా!?
{గిరి}: బహు బాగ చెప్పారు పద్యాన్ని పెద్దన, …. వినినంత మరికొంత వీను లడిగె
{చివుకుల}: ఈనాటి తెలుగింటి చిన్నవాళ్ళకు డబ్బాపాలే ప్రాప్తం.
{రాయలు}: చదువరి: అసలే “చంటి” వాడు కదా కవి!
{దైవానిక}: అచ్చ తెలుగులో అందంగా చాలా బాగుందండి
{పెద్దన}: నెనరులు
{రాయలు}: చివుకుల: అందుకే ఆ తెలుగు భారతిని కోరుకోవడం
{చివుకుల}: పెద్దన చిన్నపదాలలో చెప్పడం …
{పెద్దన}: సంగీతమపి సాహిత్యం…అన్నారు కదా!
{చదువరి}: నాకెంతో నచ్చిందీ పద్యం పెద్దనార్యా
{రామకృష్ణారావు}:

చదువుప్పాయి పెద్దన చవినిజూపె.
పలుకులమ్మను మనముందు నిలిపినారు
పలుకు పలుకున ముత్యాలు వొలుకు నటుల
పలుక నేర్చిరి మీరు పల్కులుకుజూపి

{రాయలు}: భలే రామకృష్ణగారూ
ఉ.

అమ్మల గన్న యమ్మ, సులభమ్ముగ దీర్తువు కోర్కెలెల్ల సా
రమ్ముగ మాకు నేడు జన రంజకమౌ కవితా ఝరీ స్వరా
లిమ్ము సరస్వతీ, పలుకు లింపుగ సొంపుగ జాలు వార, మా
యమ్మవు నీవె, నీకును ముదమ్ముగ బల్కెదమీ సభాస్థలిన్!

{తాడేపల్లి}: చాలా బావుంది
{రాయలు}: మిగతా ప్రార్ధనలన్నీ మనం సభ నడుస్తుండగా మధ్య మధ్యలో విందాము.

{పెద్దన}: భేషో!
{చదువరి}: రాయలవారూ, భేష్!
{చంద్రమోహన్}: చప్పట్లు కూడా!
{రాయలు}: వినమ్రంగా తల వంచుతునాను

{రామకృష్ణారావు}: రాయలవారి పల్కులవి రంజిలజేయుచ్నుడెనీడ
{గిరి}: రాయల వారి రాజసం వల్ల తల సరిగా వంగలేదు (వంచు తునాను అన్నారు కాబట్టి)
{చదువరి}: గిరి 🙂
{రాయలు}: గిరి: లేదండీ, కిరీట భారం వల్ల తల మరీ వంగి పోయి, వొత్తు సరిగ్గా బయటికి రాలేదు
{విశ్వామిత్ర}: నమ్రతా శిరోద్కర్ ఒప్పుకోదేమోనని ఆగి ఉంటారు
{పెద్దన}: విశ్వామిత్రా మీకెప్పుడు కాంతలమీదా, చుక్కలమీదనే దృష్టి 🙂
{దైవానిక}: విశ్వామిత్ర, మహేశ్ కూడా ఒప్పుకోడు 🙂
{రాయలు}: దైవానిక: విశ్వామిత్ర .. సభ్యులు కొంచెం ఓపిక పట్టాలి .. మహేశ్ బాబు ప్రేమాయణం ఈ సభలోనే ఆవిష్కృతమవుతుంది త్వరలో
{తాడేపల్లి}:
కమ్రముగాఁ గవనించియు
నమ్రముగా శిరము వంప నక్కఱ కలదే ?
{రామకృష్ణారావు}:
పద్యము రాసిరి మీరలు
హృద్యంబుగ వ్రాసినారు హృదయాంజలులోయ్
{గిరి}: తాడేపల్ల గారు, రామకృష్ణ గారు – ఆశుపద్య ధారలు కురిపిస్తున్నారు
{రాయలు}: గిరి: మీరూ పక్కన ఒక పలక తెరిచి ఉంచండి .. సందర్భోచితంగా ఆశుధార అదే ఊరుతుంది
{దైవానిక}: రాయలు గారు, అయితే ఒక పద్యహారం వేద్దామని ఉంది, కాని పలుకులు రావట్లేదు
{వికటకవి}: పలుకులమ్మని కీర్తించే పలుకులన్నీ బాగున్నాయ్
{రాయలు}: మిమ్మల్నందర్నీ సమస్యల్తో, ప్రశ్నల్తో సవాలు చెయ్యడమే ఈ సభకి నాపని అనుకున్నాను గానీ, నేనే పద్యం రాస్తానని అనుకోను కూడా లేదు
{రాయలు}: రామకృష్ణగారూ తయారుగా ఉండండి .. మొదటి సమస్య మీకే. సరసిజ నాభుడే కుసుమ సాయక బాధితుడయ్యె చూడగన్ … ప్రారంభించండి.
{రామకృష్ణారావు}:
చ||

తిరుమల వాసుడైన మన దేవుడు వేంకట నాయకుండు తా
తిరుగుచు నొక్క చోట నట దీపిత నా యలమేలుమంగనే
మరులుకొనంగ చూచెనయ. మానవ లోక మహాత్మ్యమేమొ? యా
సరసిజ నాభుడే కుసుమ సాయక బాధితుడయ్యె చూడగన్.

{విశ్వామిత్ర}: అయ్యా పెద్దనామాత్య, ఇప్పుడు తెలిసిందా, నాదృష్టి తప్పుకాదు, ఆ సరసిజ నాభునికే తప్పలేదని
{రాయలు}: అవును మరి .. అలకల కులుకుల యలమేల్మంగ కదా
{విశ్వామిత్ర}: నట దీపిత అంటే ఎవరినా హీరోయిన్నా లెక హృదయేశ్వరేనా
{గిరి}: రామకృష్ణ గారు, చాల బావుంది.
{పెద్దన}: విశ్వామిత్రా సరసిజ నాభుడే కాదు, ఆ శంకరుడుకూడా మీ కోవకు చెందినవాడే లెండి 🙂
{రాయలు}: పెద్దన: అది కూడ వస్తోంది త్వరలో
{విశ్వామిత్ర}:రామకృష్ణ గారు, చాల బావుంది.బ్రహ్మోత్సవాలలో ఆ స్వామిని తలంపుకు తేవటం.
{రాయలు}: విశ్వామిత్ర: సందర్భోచితమైన మెచ్చుకోలు. సెబాసు.
{చంద్రమోహన్}: పుత్రాధిచ్చేత్ పరాజయం
{రాయలు}: చంద్రమోహన్: బాగా చెప్పారు
{తాడేపల్లి}: సరసిజ నాభుడంతటివాడు కుమారుడి చేతనే బాధించబడడం, కలికాల మహిమ !.
{రాయలు}: ఇంకో సందర్భంలో ఆ చక్రి కొడుకు చేత దెబ్బలు తినడం చూద్దాము తాడేపల్లి వారి పద్యంలో. తాడేపల్లి వారూ ..
{తాడేపల్లి}: చిత్తం రాయా !
చం॥

సురలసురుల్ సుధార్థమయి । సుస్థిర మైత్రిని క్షీరసింధువున్
వరమగు పాత్రగా మఱియు । వాసుకి త్రాడుగ మందరాచలం
బురు మథికాష్ఠగాఁ దఱువ । నుద్భవమందిన లక్ష్మిఁ గాంచి యా
సరసిజ నాభుడే కుసుమ । సాయక బాధితుడయ్యె చూడగన్.

{పెద్దన}: లోటులేకుండా రెండో ఆవిడనికూడా కట్టబెట్టేసారా సరసిజనాభునికి, బావుంది! నారీ నారీ నడుమ మురారి!
{విశ్వామిత్ర}: రకార పునరుక్తి ఆ మధనాన్ని కళ్లకు కట్టిస్తోంది
{గిరి}: తాడేపల్లి గారు, సుస్థిర మైత్రి ఏమిటో కాస్త వివరించండి
{తాడేపల్లి}: సురల్ అసురుల్ – వీరిద్దఱికీ మైత్రి లేనేలేదు. కానీ అమృతం కోసం సుస్థిర మైత్రిని అభినయించారన్నమాట.
{పెద్దన}: ఇప్పుడు తెరాసా, సీపీయమ్మూ కలిసినట్టన్నమాట!
{విశ్వామిత్ర}: ఎంతైనా దాయాదులు కదా – అభినయించారన్నమాట
{తాడేపల్లి}: అవకాశవాద పొత్తులు కృతయుగం నుంచి ఉన్నాయి
{చంద్రమోహన్}: సుస్థిరంగానే ఉండేదేమో, మీ సరసిజ నాభుడు అస్థిర పరచక పోయి ఉంటే
{దైవానిక}: పెద్దన గారి పన్ను బాగుంది 🙂
{తాడేపల్లి}: అంత విసత జరగ్గా లేనిది సరసిజనాభుడు మన్మథబాధకు లోనుకావడం ఏమాశ్చర్యం ?
{రాయలు}: బ్రహ్మాండంగా ఉంది లలితకవీశ్వరా
{రామకృష్ణారావు}:

క్షీర సాగర మదనంబు దృష్టి నిలిపి
పలికినారయ మీరలు ప్రస్ఫుటముగ
భావ గాంభీర్య మొప్పుచు పద్యమ్ముననె
పూరణంబును చేసిరి పుణ్య పురుష.

{తాడేపల్లి}:

సహృదయ రసిక వరేణ్యులు
సహనముతోఁ బ్రోత్సహింప సంకోచంబుల్
విహతములై చనుఁ గాదే ?
అహమహమికలు చెలరేఁగు నద్భుతరీతిన్

{రాయలు}: అందుకే .. అన్ణాడు ఆనాటి పెద్దన అర్ధం తెలిసి మెచ్చే పాఠకులు కావాలని
{వికటకవి}: వాగ్దేవి మీ నాలుకలపై చేస్తున్న నాట్యం ఇక్కణ్ణించే చూస్తున్నాం, ఆనందిస్తున్నాం
{చంద్రమోహన్}: గహనమగుమీదుప్రౌఢిమ
{విశ్వామిత్ర}: సహకవులెల్లరు మిముగని సంభ్రమ మొందన్
{చదువరి}: విశ్వామిత్ర – మంచి చేర్పు
{చంద్రమోహన్}: సరిగ్గా పూరించారు

{రాయలు}: సరే ముందుకి సాగుదాం. ఇక్కడ ఒక యువ కవిమిత్రుణ్ణి పరిచయం చేస్తాను. దైవానిక పేరుతో సభకేతించిన పాలడుగు శ్రీకాంతుడు, ఇటీవలే, బ్లాగుల్లో రాకేశ్వరుడు, రానారె ఇత్యాదులు చేస్తున్న పద్యచాలనం చూసి సమ్మోహితుడై తానూ గంటం చేతబట్టాడు.
{రాయలు}: శ్రీకాంతా, మీరు రాసిన మంగళ గౌరి ప్రార్ధన పద్యాన్ని వినిపించమని కోరిక
{దైవానిక}: సరే
కం.

వందనములందుకొని మ
మ్మందరినీ కావవమ్మ మంగళ గౌరీ,
సుందరమగు పదములతో
కందపు నైవేద్యమిదిగొ కానుక నీకున్

{చివుకుల}: పాలడుగు వారు పాలనైవేద్యం అందించారు.
{రాయలు}: సీసాలతో వృత్తాలతో దేవికి అజీర్తి చేస్తుందని ముచ్చటగా కందపు నైవేద్యం పెట్టారు
{పెద్దన}: కందనైవేద్యం కడు పసందుగా ఉంది!
{వికటకవి}: నైవేద్యం బాగా ఇచ్చారు, మరి మా ప్రసాదమో?
{రాయలు}: వికటకవి: సభ పూర్తయినాక
{తాడేపల్లి}: కంద నైవేద్యం – దురద ప్రసాదం
{గిరి}: తాడేపల్లి గారు 🙂

{రాయలు}: కందం ఎలాగూ వచ్చింది కాబట్టి .. ఒక చిన్న కంద సమస్య వేసుకుందాం .. శనివారం కూడానూ ..
{రాయలు}: శనికిన్ భయమందనట్టి చతురుండితడే .. చంద్రమోహన్ కవివర్యా .. మీ వంతు

**********
{చంద్రమోహన్}: చిత్తం

వినికిడి లోపము గలదని
వనితా నీ మగని మీద వగపెందులకే
విన భీతి గొల్పునట్టి, య
శనికిన్ భయమందనట్టి చతురుండితడే!

{తాడేపల్లి}: అదిరింది
{వికటకవి}: భళీ
{రాయలు}: భలే భలే
{పెద్దన}: బలే చెప్పారండీ, భర్తలకి చెవుడే పెద్ద వరం!
{రాయలు}: peddana: హ హ హ

{చదువరి}: ఓహో, చెవుడు వల ఉపయోగం కూడా ఉంణ్దన్నమాట!
{దైవానిక}: చెవిటివాడిముందు శంఖమూదితే, “అది కొరికి విరగ్గొట్టడానికి నీ తాతలు దిగిరావాల”న్నాడంట ఇలాంటి ‘చెతురుడే’!
{చదువరి}: దైవానిక 🙂 🙂 🙂
{రాయలు}: daivAnika: హ హ హ
{తాడేపల్లి}:

చెవిలేనివానికెప్పుడు
కవుల వలన కవిత వలన కష్టము సున్నా

{భట్టుమూర్తి}: తాడేపల్లిగారూ పద్యానికి మీ పైపద్యం భలేవుంది!
{రాయలు}: తాడేపల్లి, నేనూ సరిగ్గా అదే అనబోతున్నా
{రాయలు}: భట్టుమూర్తి కవిరాయా .. మీ పూరణ ఉన్నట్లుంది?
{భట్టుమూర్తి}: ఔనండి వుంది వినిపిస్తా

అనిమిషుడు గాడు మనుజుడె
పనికిని వెరువంగ నట్టి పథికుం డితడే
కునుకున శిశువుల పోలిక
శనికిన్ భయ మందనట్టి చతురుండితడే

{రాయలు}: బాగుంది .. శ్రమ ని నమ్ముకున్న వాడు శనికైన బెదరనక్కర్లేదని మంచి సూత్రం చెప్పారు
{చదువరి}: చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి – అవును ఇక శనికి చోటెక్కడ? బావుంది, భట్టుమూర్తీ!
{పెద్దన}: సత్యం చెప్పారు భట్టుమూర్తి!
{గిరి}: వెరు వంగ నట్టి – భయపడి వంగడన్న మాట
{తాడేపల్లి}: పని – నిద్ర – ఇవి శని లక్షణాలే. ఇప్పటికే శనికింద ఉన్నవాడికి మఱింక శని గుఱించి భయమేంటని ఈ పద్యభావంలా ఉంది
{చంద్రమోహన్}: భట్టుమూర్తిగారి కవితలన్నీ శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంటాయి.
{భట్టుమూర్తి}: ధన్యవాదాలు.

{రామకృష్ణారావు}: రాయల వారు అనుమతిస్తే నేనూ పూరిస్తా.
{రాయలు}: RK గారూ కానివ్వండి
{రామకృష్ణారావు}: కం||

శని వారము నాడితనికి
శనికని తిల దాన మీయ చక్కగ గొనునోయ్.
శనియే భయపడు నితనికి
శనికిన్ భయమందనట్టి చతురుం డితడే.

{రాయలు}: హ హ హ బాగుంది
{విశ్వామిత్ర}:
అహరహరముకృషి సలిపిన
మహినిట్టికవనము వ్రాయ మాకును సులువే
{రామకృష్ణారావు}: అహరహము”ను” కృషి సలిపిన అంటె సరిపోతుంది.
{రాయలు}: సులువే! ఎందుకంటే .. మీరూ మంచి పద్యాలు వ్రాశారు!!
{చివుకుల}: స్వర్గాన్నే సృష్టించినవారికి పద్యాలొక లెక్కా?
{రాయలు}: ఈ శని భయం సమస్య మీద మీ అభిప్రాయం వెల్లడించండి
{రాయలు}: తరువాతి వంతు విశ్వామిత్రులది
{విశ్వామిత్ర}:

ఘనయోగపుజాతకుడవు,
గనగా చెడునది వివాహ కారణమన, “కే
తు”నిలచె తోడని సప్తమ
శనికిన్ భయమందనట్టి చతురుండితడే!!!

{తాడేపల్లి}: బహుజనమునకందునటుల, రహించు | కవనముల జెప్ప నదియే మహిమౌన్
{చంద్రమోహన్}: వారు అహాన్ని వదిలేసి రహాన్నే కృషి చేస్తారేమో 🙂
{దైవానిక}: విశ్వామిత్రా, సూపరు
{విశ్వామిత్ర}:సప్తమం కళత్ర స్థానంట.
{విశ్వామిత్ర}:అక్కడ శని కూచుంటే ఏమౌతుందో చెప్పక్కర్లేదనుకుంటాను
{చదువరి}: ఓహో సప్తమకు అర్థం అదన్నమాట! బాగుంది పద్యం!!
{రామకృష్ణారావు}: సృష్టికి ప్రతి సృష్టి చే య సమర్ధులు.
{రాయలు}: విశ్వామిత్రుల పద్యలోనూ, పైన తాడేపల్లి ఘారి వ్యాఖ్యలోనూ చక్కని జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం కనబడుతోంది
{విశ్వామిత్ర}:ఆ శనికి తోడు కేతువు జేరితే బ్రహ్మచర్య యోగం
**********

{రాయలు}: కాసేపు మహేశుని ఆట పట్టిద్దాము. అష్టాచమ్మా సినిమా గురించి వినో చదివో ఉంటారు గదా
{దైవానిక}: చూసాం తరించాం.. మహేశ్ ని చూసి కుళ్ళుకున్నాం కూడా
{రాయలు}: లావణ్యకి మహేశ్ బాబు నించి ప్రేమ లేఖ అందితే పరిస్థితి ఎలా ఉంటుంది?
{విశ్వామిత్ర}:దంసప్పు సీసా గిరాటేస్థారా ఏమి
{భట్టుమూర్తి}: ఆయనకి పెళ్లైపోయిందిగా … ఇంకా రాస్తున్నాడా లేఖలు?
{గిరి}: పెళ్ళైయ్యాక లేఖలు వ్రాయకూడదా ఏం
{చదువరి}: మహేశు పార్టీ మార్చాడట!
{చివుకుల}: పెళ్ళీ, ప్రేమా వేరు – కావాలంటే ఈ మహేషుని అడగండి.
{గిరి}: పెళ్ళానికి కాకపోతేనే కష్టం
{రాయలు}: గిరిధర కవిని ప్రారంభించమని కోరుతున్నాను
{గిరి}: చిత్తం
{గిరి}:
వ. “మేడం, మహేశ్ బాబు నుండి మీకో ఉత్తరం”

సీ.

ప్రియమైన లవ్వుకి ప్రేమతో వ్రాయుచు
న్నానని నాకు పంపేను లేఖ
ముద్దుగా లవ్వని మొదలు పెట్టినవాడు
నడుమ నపుడపుడు ‘నమ్మి’ యనెను
పేరులో నేముంది ప్రేమ ముఖ్యముగాని
అంతటి ఘనుడునా కందునపుడు
మేకప్పు కీసారి బాకప్పు నైనుప్డు
కనుగొందు నెందుకట్లనెనొ నన్ను

తే.గీ.

జాతి నక్కని త్రొక్కి వచ్చాను నేను
ప్రిన్సుడంతటి వాడు నా ప్రియుడు కాద?
చలన చిత్రాల ప్రేమలు కలలె యనుచు
నూరి పోసెడి వారికి నోటి మూత

వ. “ఓ మేకప్పుసానులూ, ఇక్కడికి రండే”

ఉ.

రాజకుమారుడే , అతిథిలాగ మనస్సున జొచ్చినాడె, యువ్
రాజును, నాని (బాబి), పోకిరి మురారియు నాతడె, నన్ను గెల్చినా
డా జయుడొక్కడే చిలిపి టక్కరి దొంగ నిజమ్ము నమ్ముడీ
రాజసమొల్కు వాడు మరులాడుచు నా వరడౌను చూడుడీ

వ. “మేడం, ఆ ఉత్తరం మీది కాదు, సారీ.”

వ. ఢామ్మని ఓ గుండె పగిలింది, ఛెళ్ళుమని ఓ చెంప పేలింది.

{చివుకుల}: మళ్ళీ మాట్లాడకుండా రెండుసార్లు మూతవేసారు గిరిధర కవిగారు…
{గిరి}: నమ్మి అంటే నమ్రత అయిఉండవచ్చు
{రాయలు}: గిరీ 🙂
{పెద్దన}: గిరిగారు, అది “నమ్మి” కాకుండా “అమ్మి” కూడా అవ్వొచ్చు, ఏ అమ్మికైనా అవ్వొచ్చు!
{గిరి}: లవ్వు అంటే లావణ్య కాకపోయి ఉండవచ్చు
{రాయలు}: వరుడౌను చూడుడీ
{విశ్వామిత్ర}:ప్రేమలో ఉండగానే “కందు”, యుగ ధర్మం
{దైవానిక}: జాతి నక్క, వాడుక బాగుంది 🙂
{రాయలు}: వరడు అంటే .. అదో రకం గుంట నక్క 🙂
{చంద్రమోహన్}: వరు’డౌను’ ఐతే గుండె ఢామ్మనదా మరి!
{చివుకుల}: దక్కితే వరుడు – దక్కకపోతే వరడు..
{రాయలు}: చివుకుల, హ హ హ
{చదువరి}: చివుకుల, 🙂
{గిరి}: వరు డౌను’ చూడుడీ
{తాడేపల్లి}: ఇది బావుంది
{పెద్దన}: ఇంతకీ ఆ లేఖ ఎవరికో?
{గిరి}: పెద్దన గారు, మహేశ్ నమ్రతకి వ్రాసిన లేఖ లావణ్య అనబడే మేకప్పార్టిస్టు చేతబడింది – లవ్వు ని ఆ అమ్మాయి లావణ్య అనుకుంది

{రాయలు}: రామకృష్ణారావుగారూ, మీ లావణ్యని ప్రవేశ పెట్టండి
{రామకృష్ణారావు}: ఈ విషయంలో ఆ లావణ్య మాటలనే విందాం మనం .
“ఇదిగో నాయనా! నేను లావణ్యని. అసలేంజరిగిందోతెలుసామీకు? వినండి.

శా:-

బ్యూటీ పార్లరు నుండి వచ్చితి. ననున్ ముద్దాడగా జూచె.నా
వాటంబున్ గని కన్య నౌదునని తా భావించె కాబోలు. నీ
యేటన్ నాకగు షష్టి పూర్తి . యకటా! యేమందు మాహేషునిన్.
మాటల్ లేఖగ వ్రాశి ప్రేమ తెలిపెన్. మామ్మ్మ్మ్మన్ ననున్ గోరె నో…..చ్..

చూచారా ఈ వయసులో నా కెంతటి అదృష్టం కలిగిందో!

{రాయలు}: హ హ హ .. బ్యూటీ పార్లరు మహిమా? లేక మందు మహిమా? “మందు” మహేషునిన్! హ హ హ… విశ్వామిత్రా వింటున్నారా? ఇక్కడక్కూడా ఒక తూగులయ్య వచ్చేశాడు
{విశ్వామిత్ర}:డోసు కూడా కాస్త ఎక్కువైనట్టే ఉంది 🙂
{పెద్దన}: అది కృష్ణనుంచి వచ్చిందేమో, సరిగా చూసుకోండి లావణ్యగారు 🙂
{దైవానిక}: నిజమయిన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది అన్న సినీ ప్రేమా ఏంటి?
{భట్టుమూర్తి}: బ్యూటీపార్లరు అనే పదంతో ఒక శార్దూలం మొదలౌతుందని, ఇంత చక్కగా సాగుతుందనీ నా ఊహకు అందేది కాదు మీరీ పద్యం చెప్పకపోయుంటే!
{చదువరి}:

పర్ణశాల యందు పరగు మహేశుడు
ఇచటె నుండి నాడు ఇంతులార
పలుక డేమి యతడు పరమ యోగి వలెను
పలుక రాలునేమొ ముత్య రాశి!

{భట్టుమూర్తి}: చదువరి గారూ భేష్!!
{రామకృష్ణారావు}: పలుక రాలునేమొ ముత్య రాశి లో అచ్ సామ్యం సరిపోతే ఇంకా బాగుండేది.
{చదువరి}: అవునండి
{రాయలు}: చదువరి, ఎటుపోయి నోరు తెరిస్తే ఎటు పీక మీదికొస్తుందేమోనని కావచ్చు .. Mahesh, any statement? 🙂
{మహేశ్}: హమ్మో..నేనే…!! పద్యాలతోనే నేను తెలుగునుంచీ పారిపోయానండీ..ఇప్పుడిక్కడ చదువుతుంటే, నాకు తెలుగు అంత ఛండాలంగా చెప్పిన మా టీచర్ని కసితీరా తిట్టుకోవాలనుంది.
{రామకృష్ణారావు}: ధన్యవాదాలు.. మీ వ్యాఖ్యలకి.
{తాడేపల్లి}: ఇటువంటి తాజాకరణలు లేకపోతే ఈ ఇంగ్లీషు మాధ్యమపు తరానికి తెలుగు పద్యాల మీద రుచి పుట్టదేమో !
{గిరి}: తాడేపల్లి గారు, ఒప్పుకుంటాను
{రాయలు}: ముందుకి వెళ్దాం

**********

{రాయలు}: పెద్దనగారూ, మీ పేరు సార్ధకం చేసుకునే సమయం వచ్చింది. ఇది మీరే పూరించాలి
{పెద్దన}: చెప్పండి రాయా!
{రాయలు}: నిన్న రాత్రి కలలో ఏవేవో వింత ధ్వనులు వినిపించినాయి. సల్మాన్, అమీర్, సచిన్, సెహ్వాగ్ .. నాకైతే ఏమీ అర్ధం కాలేదు. ఈ శబ్దాలని అర్ధవంతంగా ఒక శార్దూలంలో ప్రయోగించండి చూద్దాం!
{పెద్దన}: రాయలవారికి మహేశ్ తెలుసుకాని, సల్మాను తెలీదా 🙂
{చివుకుల}: పెద్దనా – అదిరింది.
{చదువరి}: తెలుగు విభుడు కదా!
{చివుకుల}: చదువరి – ఇదింకా సూపరు.
{రాయలు}: చదువరి, బాగా కనిపెట్టారు .. నేను నిజంగానే బాలీవుడ్ సినిమాలు చూడను
{గిరి}: రాయల వారి దృష్టి సల్మా ల మీదే కాని సల్మాను మీద కాదు
{పెద్దన}: అవధరించండి!

హింసల్ మానుట యెన్నడోయి మనిషీ? యీ యుద్ధముల్ ద్వేషముల్
ధ్వంసోన్మత్త జిఘంస, యీ విలయ మీ రక్తౌఘముల్! మానవో
త్తంసా! నీకుచితంబె? శాంతిరస చింతన్ బూనరావే! ధరా
హంసన్ దుస్సహ వాగురవ్యధిత సిద్ధార్థుండవై కావవే!

{చివుకుల}: పెద్దనగారు పెద్దపదాలు వాడారు – అదిరింది.
{తాడేపల్లి}: చాలా బాగా చెప్పారు. ఇంత కష్టమైన సమాసాలతో హింసించాక వాడు హింస మానకుండా ఉంటాడా?
{భట్టుమూర్తి}: సెహవాగు సహవాగైతేనేమి, మంచి భావమున్న పద్యం. కరుణశ్రీ పద్యాలను భావస్ఫోరకంగా పాడేందుకు వీలుగా ఛందస్సునే ఒకింత కాదన్నారు కదా ఘంటసాల! అభినవ భువన విజయపు పెద్దనామాత్యులకు అభివాదాలు.
{గిరి}: పెద్దన గారు, భలె బాగా ఇరికించారు నలుగురినీ మీ పద్యంలో – సల్మాన్ని కనీసం మన న్యాయస్థానాలు బంధించలేక పోయినా మీరు పద్యంలో బంధించారు చాలు
{చంద్రమోహన్}: అమోఘమైన శబ్దధార!
{రాయలు}: పెద్దను బోలు సత్కవీంద్రులు లేరనిపించారు
{భట్టుమూర్తి}: నరవర నినుబోలు లలనామణినెందును గానమీ యిలన్ — గుర్తొచ్చింది — రాయలవారి మాట వినగానే

{రాయలు}: మోహన్ గారూ .. అమ్మవారి మీద మీ ప్రార్ధనా పద్యం వినిపించండి.
{చంద్రమోహన్}: చెప్పండి రాయలవారూ
{చంద్రమోహన్}: చిత్తం. అవధరించండి
సీ.

ఆదికవి తొలుత యావాహనము సేయ ||
తెలుగు తల్లిగ నీవు వెలసినావు
‘వాణి నారాణ’న్న పినవీర భద్రుని ||
కరుణతో క్షమియించి గాచినావు
సింగ భూపాలుని సాంగత్యమిప్పించి ||
శ్రీనాధు కవిరాజు జేసినావు
నినునమ్మ నేనమ్మ ననునమ్మమని యన్న ||
పోతనామాత్యుని బ్రోచినావు

తే.గీ.

అమ్మ! వారందరిని బ్రోచినట్లు గానె
నిను గొలుచు చిఱుకవులమేము నడిపించు
భువన విజయపు సభ నీవు గావుమమ్మ
తెలుగు భారతి వందనమ్ములివె నీకు

{విశ్వామిత్ర}:నినునమ్మ నేనమ్మ ననునమ్మమని యన్న— చాలా బావుంది
{చివుకుల}: చంద్రకవిగారు చిరుకవులమంటూనే మెగాపద్యం చెప్పేసారు…
{దైవానిక}: పోతరాజుని శ్రీనాథుని మొత్తానికి తలుచుకున్నాము..
{గిరి}: పోతనామాత్యుని గురించి చెప్పిన ‘నిను నమ్మ” పాదం చాల బావుందండీ
{దైవానిక}: అచ్చ తెలుగు స్వచ్చతని చూపారండి. వేసుకోండి వీరతాళ్ళు
{రాయలు}: ఇంకా నాక్కూడ ఒక జ్ఞాన పీట వెయ్యమని అడుగుతున్నారేమో ననుకున్నా 🙂
{తాడేపల్లి}: అద్భుతం ! నంది తిమ్మన చెప్పిన “మనమున ననుమానము నూనను” అనే ద్వ్యక్షర పద్యం గుర్తుకొస్తోంది
{చదువరి}: నినునమ్మ నేనమ్మ ననునమ్మమని యన్న – గొప్పగా ఉంది!
{భట్టుమూర్తి}: అద్భుతమైన పద్యం. నాకు చాలా చాలా చాలా నచ్చింది.
{వికటకవి}: చంద్ర గారు. చాలా బాగుంది
{రామకృష్ణారావు}: చంద్రంగారూ చాలా చక్కగా వుందండీ.
{చంద్రమోహన్}: ధన్యోస్మి!

**********

{రాయలు}: తాడే పల్లి గారూ .. మీకో సమస్య
{తాడేపల్లి}: చిత్తం సార్వభౌమా !
{రాయలు}: కందకు లేనట్టి దురద కత్తికి ఏలా?
{తాడేపల్లి}: ధన్యోస్మి
కం॥

ఎందఱు టిబెట్టుఁ గూఱిచి
నిందించినఁ జైన కదల।నిది, వామస్థుల్
కొందఱిట కొందలపడిరి
కందకు లేనట్టి దురద । కత్తికి నేలా?

{గిరి}: బావుంది తాడేపల్లిగారు
{రామకృష్ణారావు}: ఇది ప్రేక్షకులకే సమస్యలా వుంది.
{తాడేపల్లి}: క్లిష్టప్రాసలాగా ఇది క్లిష్టసమస్య అనిపించింది మొదట !
{పెద్దన}: మంచి “సామాజిక స్పృహ” ఉన్న పూరణ 🙂
{గిరి}: చైనాని జైనులకి ముడిపెట్టినంత పనిచేసారు
{చదువరి}: పూరణ బాగుంది!
{చంద్రమోహన్}: కొందలపడని వారిని దక్షిణస్థులనొచ్చా మరి? 🙂
{తాడేపల్లి}: టిబెట్టు చైనా యొక్క అంతర్గత సమస్య అని కొందఱు లెఫ్టిస్టులు అనడం దగ్గఱ నాకు బాధ కలిగింది
{రాయలు}: Beautiful
{రాయలు}: చైనా, వామస్థులు పొదిగిన తీరు అద్భుతం
{రమణి}: రాయలవారు ఆంగ్ల భాష??
{భట్టుమూర్తి}: రమణిగారూ, దేశభాషలందు … అన్నారు కదా రాయలు … అంటే ఆయనకు అన్నీ వచ్చని అర్థం
{రాయలు}: భట్టుమూర్తీ, బాగా చెప్పారు .. ఎల్లనృపులు గొల్వ నెరుగవే బాసాడి .. 🙂
{రమణి}: భట్టుమూర్తి గారు, హ్హ హ్హ హ్హ

{విశ్వామిత్ర}:రాకేశుడేడీ
{దైవానిక}: రాకేశుడింటికాడ వంటలు చేయుచున్నాడు 🙂
{భట్టుమూర్తి}: దైవానిక మీరుచెప్పిన మాట ఏదో పద్యపాదంలాగుంది
{రమణి}: రాకేశు పాకమా?? దైవానికగారు
{చివుకుల}: రాకేశుడు – రాక, ఈశుడైనాడు.
{దైవానిక}: చివుకుల, మీ పన్ను బాగుంది 🙂
{రమణి}: చివుకుల గారు: ఆమెన్ 🙂

{రాయలు}: చివుకుల, హ హ హ
{పెద్దన}: రా “కేశుడౌతాడా” మరి 🙂
{చివుకుల}: ఏసుడు కాకుంటే చాలు.
{విశ్వామిత్ర}:ఏ సుడి ఉందో వారికి, ఎవరికి తెలుసు
{రాయలు}: కేశుడే మరి .. ప్రొఫైలు బొమ్మలో ఐతే గడ్డం మీసం ఉన్నాయి!
{గిరి}: విశ్వామిత్ర, మీ నుడి బావుంది
{భట్టుమూర్తి}: పన్ను’లు తళతళలాడుతున్నాయి … ఆపన్నుడేమో రాకేశుడు.
{దైవానిక}: ఇవన్ని రాసుకొని ఇంటికి వెళ్ళి వినిపించాలి .. ఎంత మిస్సయ్యాడో తెలుస్తుంది
**********

{రాయలు}: మీ అందరి శ్రద్ధ వేడుతున్నాను. ఈ తరువాతి సమస్యకి చాలా పూరణలు వచ్చాయి .. దీని ప్రసిద్ధి దృష్ట్యా, అన్ని పూరణలూ వినిపించాలి అనుకున్నాను. అంచేత మధ్యలో సరస సంభాషణకి కాస్సేపు కళ్ళెం వేసి చకచకా పద్యాల్ని నడిపిద్దాము
{చివుకుల}: రాయలవారు వేడడమా…డిమాండాలిగాని.
{రాయలు}: Chivukula: వేడికోలులోని వేడిని గమనించాలి 🙂
{రామకృష్ణారావు}: రాయలవారూ, ఇంతకీ సభలో నేనున్నట్టా లేనట్టా?
{విశ్వామిత్ర}:రామకృష్ణులు లేకపోతే, రాయలవారికి ఆనందమెక్కాడ? మీరు ఇక్కడే ఉన్నారు
{రాయలు}: “చిరు”తరు వింక పూచి వికసించి ఫలమ్ములనిచ్చి కాచునా? ఇదీ మేమిస్తున్న సమస్య. పూరణ – రాజకీయాల్లోకి చిరంజీవి ప్రవేశానికి సంబంధించి ఉండాలి. పూరించండి రామకృష్ణారావుగారూ!
{చివుకుల}: పూచేది ఎవరికో..కాచేది ఎవరికో…ఫలమ్ములెవరికో…
{రామకృష్ణారావు}:
చ:-

చిరు తరు వెట్టి గాలికిని తృళ్ళదు.నిశ్చల భక్తు పోలికన్.
తరువుల కల్పకమ్మనుచు దానిని నిల్పిరి. చూచు చుండుడా
చిరు తరు వింక పూచి వికశించి ఫలంబుల నిచ్చి గాచు, నా
చిరు ఫలముల్ కనుంగొనగ చేరువనే కలదయ్య కాలమున్.

{చివుకుల}: ఇదేదో అల్లువారు చెప్పిన పద్యంలాగుంది.
{గిరి}: కాస్తుంది అని నిర్ణయించేసారు, రామకృష్ణ గారు
{భట్టుమూర్తి}: చూచుచుండుడు …!! వచ్చినవాడు ఫల్గుణుడు అన్నట్టుంది.
{పెద్దన}: రామకృష్ణగారు చాఆఆ..లాఆఆ… ఆశావాది 🙂
{తాడేపల్లి}: “కాచునా ?” అని ప్రశ్నించడం వారికి రుచించలేదులా ఉంది. అందుకనే అంత ఖచ్చతంగా తేల్చారు.
{రాయలు}: హ హ్హ హ్హ
{రామకృష్ణారావు}: ఆశయా బధ్యతే లోకః కదండీ?
{గిరి}: మీ ఓటు ఎవరికో తెలిసింది లెండి 🙂
{చంద్రమోహన్}: ఇందులో కూడా పూరణ వాక్యాన్ని మూడవపాదంలో ఉంచి చమత్కారం చేశారు.
{చదువరి}: చిరు తరువు కాదది వటవృక్షం!

{రాయలు}: గిరి గారూ .. తరులకు రాజభోగముల .. ప్రారంభించండి
{గిరి}: చిత్తం

తరులకు రాజభోగముల తంతుల జూచిన విత్తనంబు తొం
దరపడి వచ్చివాలెను స్వధర్మము వీడి యెడారి బీడులన్
పరుగిడి పాలుత్రావ నెగ బ్రాకిన బీజము మొక్కపోవునా?
చిరు తరువింక పూచి వికసించి ఫలమ్ములనిచ్చి కాచునా?

{భట్టుమూర్తి}: గిరిగారు “పరధర్మో భయావహః” అంటున్నారు 🙂
{తాడేపల్లి}: చిరంజీవికది తగిన రంగము కాదంటున్నారు
{పెద్దన}: భేష్!
{రామకృష్ణారావు}: వ్వహవా!
{రాయలు}: తొందర పడిందంటారా .. ఇప్పటికే రైలు బోలెడు ఆలస్యం అయిదని అందరూ అనుకుంటుంటే
{చదువరి}: తొందరపడి.. 🙂 రాయలవారూ, నా ఉద్దేశ్యమూ అదే!
{రాయలు}: కానీ సరైన పునాది వేళ్ళు పాతుకోకుండా ఎదగ జూస్తోందని మాత్రం అనిపిస్తోంది
{గిరి}: తొందరపాటు రాజసమందుకోవడం కోసం – దాని అమలు ఆలస్యం
{వికటకవి}: ఇది నాకు చాలా నచ్చింది గిరి గారు

{చంద్రమోహన్}: ఒకటి నిశ్చయాత్మకం. మరొకటి సంశయాత్మకం. మరి మూడవదేమిటో!
{రాయలు}: మూడవది తాడేపల్లి గారిది
{తాడేపల్లి}: చిత్తం ! ఈ సమస్య వాస్తవ జీవితంలో కూడా సమస్యే . ఎందుకంటే చిరుతరువు చుట్టూ పెను-చీడలున్నాయని నా అనుమానం. అయినా అవకాశం లేకపోలేదు.
{దైవానిక}: అవునో కాదో ఈ సారి విజయదశమికి తేలుతుంది
{తాడేపల్లి}: ప్రారంభిస్తున్నాను.

చం॥

సురుచిర గౌతమీ తట వి । శుద్ధ వసుంధర నంకురించె, దు
ర్భర విలయ ప్రవాతక ని । భంబగు నైక విపత్పరంపరన్
సరవిని దాఁటి నిల్చె, బహు । శాఖల నెల్లెడ విస్తరించె, నీ
“చిరు”తరు వింక పూఁచి విక । సించి ఫలమ్ముల నిచ్చి కాచునా?

{గిరి}: మూడవది కూడా సంశయాత్మకంగానే ఉన్నది
{రాయలు}: పాత విజయాల్ని స్మరించుతూ ఈ కొత్త ప్రయత్నం జరుగుతుందా అంటున్నారు
{తాడేపల్లి}: పూర్వవిజయాల్ని బట్టి జరగాల్సి ఉందని ధ్వని
{గిరి}: తాడేపల్లి వారు, చిరంజీవి పూర్వ వైభవం తెలుపారు మీ పదాలలో
{పెద్దన}: బావుంది. ఈ చిరుతరువు “ఫేను” గాలికి ఎంతవరకూ వికసితుందో వేచి చూడాలి.
{చివుకుల}: చిరుతరువు వికసించకపోతే – అల్లువారు అల్లనల్లన ఏడవరూ?
{భట్టుమూర్తి}: తాడేపల్లిగారి పద్యంలో ఆశావాదం వుంది
{వికటకవి}: ఎంతైనా చిరు గారి గూర్చి ఎన్నో టపాలు వ్రాసిన వారు కదా! ఈ పద్యం వారికి అలవోకగా వచ్చి ఉండాలి.
{చంద్రమోహన్}: విస్తరణ పూర్తయింది. ఇక పూచి వికసించి ఫలమ్ములనీయడమే మిగిలిందన్నమాట.
{రామకృష్ణారావు}: తాడేపల్లివారికి తాడేపల్లివారే సాటి.

{రాయలు}: దైవానిక, మీ పూరణ ఉన్నట్లుంది ..
{దైవానిక}: చిత్తం, నేను కాస్త మార్చి సీసం చేసాను .. యువకవిని, వృత్తాలు వ్రాయుట నేర్వలేదింకా
ఆ:

ఓడిపోదువన్న వాడిని వురికించి,
ఫ్యానులమని జెప్పి పరువు దీసె
దత్తకూతురనగ దండెత్తి వచ్చి మా
పిల్లనివ్వమనుచు లొల్లి బెట్టె

సీ:

పేరుబెట్టను జూస్తె పేరింకొకడదయ్యె
బ్రతిమాలి వొప్పించి బయట పడెను
మొదలుపెట్టక ముందె మొదలాయె కష్టాలు
ఊరకున్ననుగాని యుడుగు లేదు
సర్వపార్టీలు విగుర్వించి దుమ్మెత్తి
పోస్తుండగా యెదురస్తు నిలచి
చిరుతరువింక పూచి వికసించి ఫలమ్ము
లనుయిచ్చి కాచునా! రంది లేక!

ఆ:

విషయముంది గనుక విరసములిన్నియు
బాధలెన్నియున్న భయపడకను
యిట్టి కష్టములను యెదురొడ్డి నిలచిన
ముఖ్యమంత్రి పదవి ముందరుండు

{రామకృష్ణారావు}: వాహ్ వాహ్ దైవానికా! చాలా బాగుంది.
{భట్టుమూర్తి}: దైవానిక పద్యం ఒక ఆశీర్వాదంలా లేదూ!
{వికటకవి}: అవునవును
{గిరి}: ఉంది
{చదువరి}: భట్టుకవీ.. అలా అనిపించిందా!?
{తాడేపల్లి}: లక్షలాదిమంది ఆశీర్వాదాలు చిరంజీవిగారికున్నాయి.
{దైవానిక}: కొంచెం సందేహం .. కొంచెం హోప్
{రమణి}: వీరాభిమాని ఆశీర్వాదంలా ఉంది
{చివుకుల}: ట్రైలేద్దాం కొండ కొనకు – పోయేదేముంది మనకు – ఆఫ్ట్రాలో వెంట్రుక మన స్టేకు…
{రాయలు}: చివుకుల, ఇది కూడా ఏదో సీస పాదంలా ఉందే!
{వికటకవి}: కానీ అయ్యవారు బోల్తాపడ్డా నేనాశ్చర్యపోను
{తాడేపల్లి}: కానీ ఆయన కోరికోరి అనేక అపశకునాలతో పార్టీని ప్రారంభించడమే బాధగా ఉంది
{చదువరి}: ఆది లోనే హంసపాదు అని చెబుతున్నారు.
{దైవానిక}: అవును .. ఈ ఆడ్డులన్ని ఎదుర్కోంటే, విజయం చిరుదే

{రాయలు}: భట్టుమూర్తి, మీ పూరణ …
{భట్టుమూర్తి}: నా పూరణ ఒక చంపకమాల … అవధరించండి

పరువును మాసి శాసన స|భాంతరమందు వృధా ప్రసంగులై
కరతలు జేయు నాయకుల|కాలము యింతటితో సమాప్తమై,
చరితలు మారగా, ప్రజలె |చల్లగ రాజ్యము చేయునట్లుగా
చిరు తరువింక పూచి విక|సించి ఫలమ్ముల నిచ్చి కాచునా!

{చదువరి}: ఇదీ.. ఆశావాదం!
{వికటకవి}: మరో ఆశావాదం భట్టుమూర్తి గారిది కూడాను
{పెద్దన}: మీదీ మంగళాశాసనం లానే ధ్వనిస్తోంది భట్టుమూర్తీ!
{భట్టుమూర్తి}: ఔనండీ పెద్దనగారూ, నేను ఆశావాదినే
{చంద్రమోహన్}: నిజంగా ప్రజలే రాజ్యం చేస్తారంటారా?
{చదువరి}: ప్రజారాజ్యం చేస్తుంది!
{రమణి}: భట్టుమూర్తి గారు కూడ ఆశపడ్తున్నట్లే ఉంది
{దైవానిక}: ఆశలేని బ్రతుకు బ్రతకగనేల??
{రాయలు}: ఎంతైనా “భట్టు కవి కదా 🙂
{రామకృష్ణారావు}: భట్టుకవి తెల్పె మరి కాస్త గుట్టు మనకు

{రాయలు}: అరె, జ్యోతి గారు కూడ వచ్చారే .. అందుకే సభలో ఇంత వెల్గు ఒక్కసారిగా
{జ్యోతి}: అనువుగాని చోట కాస్త అణకువగా ఉండాలని ఊరుకున్నాను
{తాడేపల్లి}: పద్యరచనని అందఱికీ అనువుగా చెయ్యాలనే మా తాపత్రయం జ్యోతిగారూ.
**********

[సశేషమ్]

Posted in కవిత్వం | Tagged | 8 Comments

ఉపజాతి పద్యాలు – ౩

సీసము

–ముక్కు శ్రీరాఘవకిరణ్

సీసపద్యం ఉపజాతులో దొడ్డది, ముఖ్యమైనది, అందమైనది, గంభీరమైనది. శతకాలని ప్రక్కన పెడితే అసలు అసంఖ్యాకంగా సీసపద్యాల్లేని కావ్యమే లేదంటే అతిశయోక్తి కాదేమో.

      మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు

      కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

      ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ గనకాంబర ప్రభఁ గ్రందుకొనఁగఁ

      శ్రవణరంధ్రముల నీ సత్కథల్ పొగడంగ లేశ మానందంబు లేని వాఁడు.

      పరిచయానుద్రిక్త పరిరంభ సమయానఁ ప్రియురాలి యెద చెమరిచినంత

ఇవి మచ్చుకి కొన్ని సీసపద్యాల ప్రారంభాలు. మొదటి రెండూ పోతన భాగవతంలోనివి, తరువాతి పద్యం ఆంధ్రనాయక శతకంలోనిది, తరువాతిది నరసింహ శతకంలోనిది, చివరది విశ్వనాథవారి తెలుఁగు ఋతువులు కావ్యంలోనిది.

ఇప్పుడు సీసపద్యానికి సంబంధించిన లక్షణం చూద్దామా?

తే.గీ.

ఆరు ఇంద్రులపై సూర్యగణపు జంట
ఒకటి మూడు గణములకు మొదటి యతిని
ఐదు నేడు గణములకు మరొక యతిని
పాదపాదమునకు చెప్పవలయు మరియు

తే.గీ.

ప్రాస లే దుపజాతి కాబట్టి యట్లె
ప్రాసయతి యతికి బదులు వాడవచ్చు
నాల్గు పాదముల నిటుల నడుపవలయు
సీస పద్యపు లక్షణ చిత్రణ మిది

ఆ.వె.

తేటగీతి కాని ఆటవెలది కాని
సీసము వెనువెంట చెప్పవలయు
ఉన్నతంబు సీస ముపజాతి పద్యంబు
లందు దానిఁ నేర్చుకొంద మిటుల

సీసపద్య లక్షణం –

(అ) సీస పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదంలోనూ ఆరు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలూ ఉంటాయి.
(ఆ) ప్రాస నియమం లేదు.
(ఇ) ప్రతి పాదంలోనూ మొదటి మూడవ గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లించాలి. అలాగే మొదటి యతితో సంబంధం లేకుండా ఐదవ ఏడవ గణాల మొదటి అక్షరాలకి తిరిగి యతి చెల్లించాలి. అంటే ప్రతి పాదానికీ రెండు సార్లు యతి చెల్లించాలన్నమాట!
      “మలాక్షు నర్చించు రములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ”
అన్నచోట మొదటి మూడవ గణాల మొదటి అక్షరాలు క-క యతి చెల్లింది. అలాగే ఐదు ఏడు అక్షరాలు శ్రీ-జి లకి కూడ యతి చెల్లింది.
(ఈ) ఉపజాతి కాబట్టి యతికి బదులుగా ప్రాసయతి చెల్లించవచ్చు.
(ఉ) సీసపద్యం చెప్పాక విధిగా ఒక ఆటవెలదిని కానీ, ఒక తేటగీతిని కానీ చెప్పాలి. అప్పుడే సీసం పూర్తయినట్టు.

సీసాలు గాంభీర్యంగా ఉండడానికి కారణం వాటిల్లో ప్రతీపాదానికీ ఉన్న ఆరు ఇంద్రగణాలు. వాటిల్లో ప్రత్యేకంగా సగ, నల, ర, త అనే ఐదు మాత్రల గణాలు సీసానికి క్రొత్త అందాన్నీ, మంచి గతినీ, గాంభీర్యాన్నీ ఇస్తాయి. ఇప్పుడు పైన ఉదహరించినవాటిని మరొకసారి చదవండి, మీకే తెలుస్తుంది.

ఇప్పుడు ఒక సీసపద్యం వ్రాయడానికి ప్రయత్నిద్దామా? విషయమేం తీసుకుందాం? వానల్ని వస్తువుగా తీసుకుంటే… నీలిమేఘాలు, ఉరుములు మెరుపులు, గాలి, వాన, జలధార, నిండిన చెరువులు, తడిసిన చెట్లు గుట్టలు, సంతోషించిన బీళ్లు, రైతుల సంబడం, చిన్నపిల్లల కాగితం పడవలు, గుంటల్లో నిలిచిన వర్షపు నీరు, ఇలా అనేకం గుర్తుకు వస్తాయి.

ఇక పద్యం ప్రారంభిద్దామా? నీలి మేఘాలు అనే మొదలుపెట్టొచ్చు. అప్పుడు నీ కి యతి సరిపోయే పదాలు… నిర్మల, నీరజ, నింగి ఇలా వీటిలో మనం చెప్పదల్చుకున్న భావానికి సరిపోయేలా పదాన్ని ఎంచుకోవాలి. నిర్మల అని ఎంచుకున్నామనుకోండి. నిర్మల ఆకాశంలో నీలిమేఘాలు అని చెప్పచ్చు కదా. అప్పుడు నిర్మల+ఆకాశంలో=నిర్మలాకాశంలో ఉఁహుఁ గణాలు సరిపోవు. నిర్మలాకాశాన అంటే సరిపోతుంది. నిర్మలాకాశాన నీలిమేఘాలు వచ్చాయి. నిర్మలాకాశాన నీలిమేఘాలొచ్చె అని ఒక నాలుగు ఇంద్రగణాలు. ఆ నీలిమేఘాలేం చేశాయి? వాటితో ఉరుములు మెరుపులూ తీసుకొచ్చాయి. ఉరుములూ మెరుపులూ అంటే రెండు ఇంద్రగణాలు. ఇపుడు కి యతి సరిపోయేలా రెండు సూర్యగణాలు కావాలి. ఉ-ఊ-ఒ-ఓ సరిపోతాయి కాబట్టి తోడు, దూరము, తుమ్ము, తూనీగ, తూర్పు, తొలగు… వీటిలో తోడు తీసుకుంటే తోడు వచ్చె అనచ్చు. అప్పుడు మొదటి పాదం నిర్మలాకాశాన నీలిమేఘాలొచ్చె ఉరుములూ మెరుపులూ తోడు వచ్చె. ఇప్పుడు వ్యాకరణం. నీలిమేఘాలొచ్చెన్+ఉరుములూ=నీలిమేఘాలొచ్చె నురుములూ మెరుపులూ తోడు వచ్చె. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు మీకు. ను కి తో కి యతి సరిపోదు కదా అని. ఇక్కడే ఒక చిన్న సూత్రం ఉంది యతి విషయంలో. సంధి జరిగితే ఆ పరపదం (సంధిలో రెండవ పదం, ఇక్కడైతే ఉరుములూ) మొదటి అక్షరాన్ని తీసుకోవచ్చు యతికి అని. కాబట్టి భేషుగ్గా యతి సరిపోతుంది. హమ్మయ్య! మొదటి పాదం పూర్తయ్యింది:

      నిర్మలాకాశాన నీలిమేఘాలొచ్చె నురుములూ మెరుపులూ తోడు వచ్చె.

ఇప్పుడు రెండవ పాదం. సూర్యుణ్ణి కాసేపు పక్కకు నెట్టి చక్కగా ఆకాశాన్ని ఆక్రమించుకుని ధారగా వర్షం కురిసింది అని రెండవ పాదంలో చెబుదామా? సూర్యుణ్ణి కాసేపు అంటేనే రెండు ఇంద్రగణాలు. సూ కి యతి సరిపోయే పదాలు (చ-ఛ-జ-ఝ-శ-ష-స) చూపులు, చోద్యం, చురుకు, జోల, శూర్పము, సుఖము, సూక్తి లాంటివి. అదే కాసేపు సూర్యుణ్ణి అన్నామనుకోండి అప్పుడు కా తో యతి సరిపోయే పదాలు కాంతి, కైత, కౌమారం, గది, గమనిక, గాంధారం లాంటివి వేసుకోవాలి. మనకీ రెండిటిలో ఏది ఎక్కువ సౌకర్యంగా ఉంటుందో ఆ క్రమంలో సూర్యుణ్ణి, కాసేపు పదాలని పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు సూర్యుణ్ణి అనడం సౌకర్యంగా ఉంటుందనుకుంటే అపుడు కా తో యతి సరిపోయే పదాలలో గగనాన నెట్టేసి అనొచ్చు. గగనమని ఇక్కడ ఆకాశానికి పర్యాయపదం వాడుకున్నాం అంతే. కాబట్టి మొదటి నాలుగు ఇంద్రగణాలూ కాసేపు, సూర్యుణ్ణి, గగనాన, నెట్టేసి. గగనాన నెట్టేసి కంటే గగనాన దాచేసి అంటే బాగుంటుందేమో అంటారా. సరే, అలాగే కానిద్దాం.

దాచేసి మేఘాలేం చేస్తున్నాయి? గాలితో దోబూచులాడుతున్నాయి. తర్వాత వర్షిస్తున్నాయి. దోబూచులాడితో ప్రారంభించచ్చు లేదా దోబూచులాడి అని పాదం చివరకి తోసేయొచ్చు. చివరకి తోసేసాం అనుకోండి. అప్పుడు బూ తో యతి కుదిరే పదాలు… గాలికి పర్యాయపదాలు… సమీరం, మారుతం, పవనం, వాతం… అబ్బే, సరిగా కుదరట్లేదు. సరే దోబూచులాడి ని సైయాటలాడి గా మారిస్తే? అప్పుడు యా () కి యతి సరిపోయేలా హాయిగా గాలితో అనచ్చు. ఇప్పుడేమైంది? హాయిగా గాలితో సైయాటలాడి – ఒక అక్షరం ఎక్కువైంది. సై ని సైడ్ చేస్తే? హాయిగా గాలితో ఆటలాడి. చక్కగా ఉంది. ఇప్పుడు రెండవ పాదం పూర్తయ్యింది:

      కాసేపు సూర్యుణ్ణి గగనాన దాచేసి హాయిగా గాలితో నాట లాడి. (సంధులు గట్రా వస్తాయి కదా!)

ఇలాగే మూడు నాలుగు పాదాలని పూరించవచ్చు. తర్వాత మనకి బాగా సుళువైన పనే. ఆటవెలదో తేటగీతో చెప్పడం, అంతే! చిన్న చిన్న పదాలతో భారీ సమాసాలు లేకుండా చెప్పాలని ఉబలాటపడితే ప్రస్తుతానికి నాకు ఇలా తోచింది…

సీ.

నిర్మలాకాశాన నీలిమేఘాలొచ్చె
      రుములూ మెరుపులూ తోడు తెచ్చె

కాసేపు సూర్యుణ్ణి గనాన దాచేసి
      హాయిగా గాలితో టలాడి

మేఘాలు గర్జించె మింటిలో చిత్రంగ
      సుధపై కురియంగ వానజల్లు

పూర్తిగా తనయొక్క పురివిప్పి వానలో
      నిలువునా తడియుచూ నెమలి యాడె

తే.గీ.

వానతో పాటు హరివిల్లు చ్చి నిలచె
లకమాడ నిలచు చెట్లు స్నానమాడె
వాన నీటితో బాగుగా వాగు నిండె
పిల్లలందరూ పడవలు విడుచు కొఱకు

ప్రస్తుతానికి నేను వ్యాకరణాన్ని కొంచెం పక్కన పెట్టాను విశదీకరించడం కోసం. కానీ పద్యాలు వ్రాసేప్పుడు వ్యాకరణం తప్పకుండా చూసుకోవాలి.

తర్వాత, సీసాలతో కలిపి మనం ఇప్పటికి మూడు రకాల ఉపజాతుల గురించి (ఆటవెలది, తేటగీతి, సీసం) ఎలా వ్రాయాలో చెప్పుకున్నాం. ఈ మూడూ కాక మరొకటి ఉంది – మంజరీ ద్విపద అని. దాని గురించి ద్విపదలు చెప్పుకున్నపుడు మాట్లాడుకుందాం. ఇంతటితో ఉపజాతులు నేర్వడం పూర్తయినట్లే. దీని తరువాత జాతులు – ముఖ్యంగా కందపద్యం గురించి మాట్లాడుకుందాం.

ఇప్పుడు మీకు నేనిచ్చే అభ్యాసం:

(1) మీకు నచ్చిన ఏదో ఒక (అందమైన లేదా గంభీరమైన) అంశం మీద సీసం, దానిపై ఆటవెలది వ్రాయడం.

(2) ఈ మూడు పద్యాలకీ సంబంధించిన పాఠాల మీద మీ అభిప్రాయాన్ని తేటగీతిలో తెలపడం.

(3) వీలు చూసుకుని నరసింహ శతకమో, ఆంధ్రనాయక శతకమో చదవడం. నాకు తెలిసిన రెండు సీసపద్య శతకాలివి. (ఈ అభ్యాసం నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేనూ చదవలేదు కాబట్టి!)

—————————————————-

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.

Posted in వ్యాసం | Tagged | 4 Comments

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 2

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

(ఇంటర్వ్యూ మొదటి భాగం)
మీ రచనల్లో నాకు తెలిసిన వాటిలో ‘నేను-తను’ కథగానూ, కవితగానూ రెండు రూపాల్లో వుంది. వాటిల్లో మీరు ముందు కథ రాశారా? లేక కవితా? ఇంకే కథనైనా కవితగా గానీ, కవితను కథగా గానీ రాశారా? ఆ ఉద్దేశ్యమేమైనా ఉందా?

కవితగా రాసినప్పుడే దాన్ని కథగా పునర్నిర్మించాల్సిన అవసరం కలగొచ్చు గాని, కథగా రాసింతర్వాత కవితగా మార్చాల్సిన అవసరం రాదు. ‘నేను-తను’ ముందు కవితగా రాశాను. తర్వాతనే కథగా మలిచాను. దీని కంటే ముందు ‘ఒక్క వాన చాలు’ కవితను కథగా రాశాను. దీనికి కథల పోటీలో ద్వితీయ బహుమతి కూడా వచ్చింది. ‘కొడుకు-కూతురు’ కథ కూడా ముందు కవితే. నా కథల్లో ఎక్కువ పాళ్ళు కవితాంశాలు ఉండటానికి కారణం బహుశా కవిత్వం, కథ పెనవేసుకు వచ్చిన పురాతన కావ్యాలతో దగ్గరి పరిచయం ఉండటం వల్ల కావొచ్చు.

నేను-తను‘ కవిత చదివి ఫణీంద్ర ‘సరిహద్దుకిరువైపులా‘ అనే కథ రాశారు. ఆ కవితకు అంతర్జాలంలో వచ్చిన స్పందన తెలిశాక మీరెలా ఫీలవుతున్నారు?

‘నేను-తను’ కవిత మొదట ఆంధ్రజ్యోతి వీక్లీలో ఈ వారం కవితగా వచ్చినప్పుడు ప్రసిద్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు స్పందించి అభినందిస్తూ ఉత్తరం రాశారు. అంతర్జాలంలో ఫణీంద్ర గారు ఏకంగా కథే రాశారు. నా కవిత పుట్టుకకు ఇంతకన్నా సార్థకత ఏముంటుంది. సుమతీ శతకకారుడు చెప్పిన ‘పుత్రోత్సాహం’ భావన నాకు పరిపూర్ణంగా అందినట్లుగా భావిస్తున్నాను.

పత్రికల్లో యీ రకమైన స్పందనకు అవకాశం లేదుగదా! మీ రచనల్ని అంతర్జాలంలోకి తీసుకు రావాలనుకుంటున్నారా?

మీరు చెప్పింది వాస్తవమే. మూల రచన వద్దే స్పందనలు కనిపించేలా చేయటం పత్రికల్లో కష్టమే. మీరు.. మీరు చెబుతున్నట్లు పుస్తకాలు చదవటం కన్నా అంతర్జాలం చూసి స్పందించటానికే పాఠకులు ఇష్టపడుతున్నారనే విషయం నాకు తెలీదు. నిజమే కాబోలు. నాకా అంతర్జాలం అందుబాటులో లేదు. అంతర్జాలంలో ఇలాంటి తక్షణ స్పందనలు వస్తాయనీ, ఆ స్పందనలు ఇంత అపురూపంగా వుంటాయనీ నాకు రుచి చూపించిన మిమ్మల్ని నేను మరిచిపోలేను. నా రచనల మీది స్పందనల్ని అంతర్జాలం లోంచి ప్రింటవుట్ తీసి ఎక్కడో మారుమూల పల్లెలో ఉంటోన్న నాకు పంపి, ఒక అద్భుతమైన అనుభూతినిచ్చినందుకు మీకు ఋణపడి వుంటాను. ఎక్కడయితే పాఠకులు స్పందిస్తారో, ఆ వేదిక మీదే రచనలు కూడా ఉండటం సముచితం. నా రచనల్ని అంతర్జాలంలోకి ప్రవేశపెట్టటం నాకిష్టమే.

ఇతరుల రచనలు చదివి ఉత్తేజితులై ప్రేరణ పొంది మీరు రచన చేసిన సందర్భాలేమైనా వున్నాయా?

సన్నపురెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డితో (కుడివైపున)
సన్నపురెడ్డి. ఫోటో సౌజన్యం: స్వాతీ శ్రీపాద

ఇతరుల రచనలు చదివి ప్రేరణ పొంది తక్షణమే వాటిని అనుకరిస్తూ రచనలు చేసిన సందర్భం నా రచనా జీవితంలో ఏర్పడినట్లుగా నాకు గుర్తులేదు. అలాగని ప్రేరణ లేకుండా నేనేమీ రాయలేదు. పద్య సాహిత్యం చదివి చదివి, ప్రేరణ పొందే పద్యాలు రాశాను. అలాగే కవితలు, కథలు, నవలలు. నేను కథలు రాసే తొలి నాళ్ళలో సింగమనేని నారాయణ, కేతు విశ్వనాథరెడ్డి, పి.రామక్రిష్ణారెడ్డి లాంటి కథకుల కథలు చదివి కథా వస్తువు గురించిన సరైన స్పృహ ఏర్పరుచుకొన్నాను. నా చుట్టూ వున్న, నాకు తెలిసిన, నా అనుభవానికి వచ్చిన జీవితాల్నే కథలుగా ఎలా మలుచుకోవచ్చో వాళ్ళనుంచి ప్రేరణ పొందాను. వాళ్ళను చదివింతర్వాత వస్తువు కోసం గాల్లోకి చూడకుండా, ఎక్కడో వెతుక్కోకుండా నా చుట్టూ ఉన్న వ్యవసాయ జీవితాల్లోంచే ఎలా స్వీకరించవచ్చో తెలిసికొన్నాను. అంతేగాని ఒక కవిత, కథ, నవల చదివి అలాంటి కవితే, కథే, నవలే రాయాలని, వాటిని అనుకరించాలని నేనెప్పుడూ ప్రేరణ పొందలేదు. నాలో పాఠకుడు వేరు-రచయిత వేరు. ప్రపంచంలోని అందరి రచయితల అనుభవాల్ని తనవిగా అనుభూతించే తత్వం నాలోని పాఠకుడికి వుంటే, తనదైన ప్రత్యేకత కలిగిన అనుభవాల పరంపరల్ని పాఠకుల అనుభూతికి తెచ్చేందుకు నాలోని రచయిత తాపత్రయ పడుతుంటాడు. పాఠకుడిగా బైట్నించి ఎంత కొత్త జీవితానుభవాల్ని తను తీసికొంటున్నాడో, రచయితగా అంతే నూతనత్వాన్ని ప్రపంచానికి అందించాలనే కసి నాకుంది. నేను జీవించే సమాజం అలాంటి శక్తిని నాకిస్తోంది. నా చుట్టూ సమాజంలో మార్పును పసిగట్ట గలుగుతున్నాను కాబట్టి నాకు కథలకు గాని, నవలలకు గాని వస్తువు కొదవలేదు.

ఒక మారుమూల పల్లెటూళ్ళో ఉండటం ఒక రచయితగా మీకు లాభించిందా? లేక సాహితీ మిత్రుల సాంగత్యంలో ఉన్నట్లయితే మరింత బాగా రచనలు చేసేవాణ్నని భావిస్తున్నారా?

నిబద్ధత కలిగిన రచయితకు ఏ ప్రాంతమైనా ఒకటే. పల్లెటూర్లో కథావస్తువులు ఎక్కువగా దొరుకుతాయని, నగర జీవితంలో దొరకవనీ అనుకోవటం పొరబాటు. జనజీవనం లోని మార్పుల్ని పసిగట్టే దృష్టికోణం ఒకటి ఉంటే, మానవ సంబంధాల పట్ల ఆర్తివుంటే, జీవితాంతం రాసుకున్నా తరిగిపోని కథల నిధి తన చుట్టూనే వుంటుంది. పల్లెలకంటే కూడా పట్టణాలలోనే మనిషి జీవితం తీవ్ర వేగంగా మారిపోతూవుంది. ఆ జీవితాల్లోకి చొచ్చుకుపోయి, ఆ మార్పుల్ని పట్టుకోగలిగితే కుప్పలు తెప్పలుగా వచ్చిపడే కథావస్తువుల్ని చూసి రచయితే ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి వస్తుంది. తనచుట్టూ తాను గిరిగీసికొని, ఆ గిరిలోకి వచ్చిన విషయాల్ని మాత్రమే కథలుగా రాయటం వల్ల కథావస్తువుల కొరత ఉంటుందేమోగాని, గిరి దాటుకుని ఎదుటి జీవితాల్లోకి చొరబడగలిగిన వాళ్ళకి ఏం తక్కువ? ఏ రచయిత అయినా తను జీవిస్తోన్న పరిసరాల్లోంచే కథా వస్తువుల్ని తయారు చేసికోవాలి. నా వరకైతే నేను ఎక్కడున్నా ఇదే విధంగా సాహిత్య సృజన చేయగలను.

సన్నపురెడ్డి రాసిన ఛందోబద్ధ పద్యాల్లో కొన్ని.
భారతి మాసపత్రిక 1988 ఏప్రిల్ సంచికలో వచ్చాయి.

మగబుద్ధి

“తరణి తరుణ కిరణ సరణి తెమ్మెరదేలి
వచ్చి తనువుదాక వణకి భీతి
దండమిడెదు కలువ రెండు చేతులు మోడ్చి
ఎంత వెఱ్ఱి నీకు? యినుడు ప్రభువె?

బెదరి పదరి యదరి భీతిల్లి కుంచించు
కొనెదు తనువు. నెత్తికొనవదేమి
భూమిగన్నదలను యా మిహిరుడు రాగ.
పోషితుండె? భర్తె? పూజ్యమేల?

ఎర్రమంటల మీ తనువెల్ల గాల్చి
కొల్లగొట్టిన సౌందర్యమెల్లగూర్చి
తన సతులకిచ్చునట గదా తరణి. యట్టి
ధూర్తునకు దండమిడెదేల తొలగి తొలగి?”

“అతడు హితుడో… అహితుడౌనో… ధూర్తహృదియొ
సత్ హృదియొ… ప్రభువౌను యీ సమయమునకు.
వందనమిడుట మాబోంట్ల వర్తనమ్ము
కాదనెదె యనుభవశూన్య! కవికుమార!

గురు విభూతి వెలుగు పరపురుషుని గన
నుచితమే కులకాంతకు? నువిద దలను
వంచ శుభమౌనెగాని దుష్టులమదెద్ది?
అడ్డుపడువాడు యేడి యేదైన జరుగ?

ఒక్క భాస్కరుడేమి? యీ యుర్వి పురుష
వర్గమెల్లను… నీవొ… నీవొక్కరుడవు
మంచివాడవె? మా తనూ మహిత విభవ
మెల్ల కొల్లలాడెదు సందొకింత నబ్బ.”

దీర్ఘకాలంగా ఒక మారుమూల పల్లెలో ఉంటున్నారు, రాయడం కొనసాగిస్తున్నారు. ఇంతకాలంగా మిమ్ముల్ని యీ వ్యాసంగంలోనే నిలబెట్టి వుంచిన కారకాలేమిటి?

చదవటం రాయటమనే యీ అలవాటు బాల్యం నించి నాతోనే పయనమై వస్తోంది. ఈ రెండు క్రియలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లా నా జీవితం నిండా పెనవేసుకుపోయి సాహిత్యపు వూపిరి ఐంది. ఇప్పుడు నిజంగా చదవకుండా రాయకుండా బతకలేని పరిస్థితి. శ్వాసలేకుండా బతకలేం గదా! చిన్నతనాన మొదలైన యీ సాహిత్యపు సహవాస బంధం రాను రాను బలపడుతోందే తప్ప పలుచనవటం లేదు. ఈ సహవాసం వల్ల నేను సంస్కరించబడుతున్నాను. నేను రాసే ప్రతి కథా నన్ను పుటం పెట్టి కాల్చి ప్రక్షాళన చేసింతర్వాతే బైటకొస్తూ వుంది. కర్షకులు, కార్మికులు, దళితులు, స్త్రీల విషయంలో, కులాలు మతాల విషయంలో నా రక్తంలో జీర్ణమై ఉన్న పాత వాసనలెన్నింటినో నేను సృష్టించే సాహిత్యం సంస్కరిస్తూ వుంది. ఉదాహరణకు – స్త్రీల విషయంలో తరతరాలుగా ఆనువంశికంగా వస్తోన్న మగ అహంకారపు అవలక్షణాలు నాలోనూ వున్నాయి. వాటి ఉనికిని గురించిన స్పృహ సాహిత్యమే నాకిచ్చింది. నన్ను నేను సంస్కరించుకునే క్రమంలోనే నా చుట్టూ వున్న సమాజంలోంచి మహిళలకు సంబంధించిన ఎన్నో సంఘటనలు అర్థమై కథలుగా తయారయ్యాయి. అలాగే దళితులూ, వ్యవసాయ కూలీలూ, బడుగు బలహీన వర్గాలూ… యీ కథలన్నీ నన్ను సంస్కరిస్తూ బైటకొచ్చినవే.

బేసిగ్గా మిమ్ముల్ని మీరు కవిగా భావిస్తారా? కథా రచయితగానా? నవలా రచయితగానా?

బేసిగ్గా నేను కవినే, సందేహం లేదు. అయితే నేనిక్కడ ఓ విషయం చెప్పాల్సి వుంది. నామీద ఎంతో కొంత ప్రాచీన సాహిత్య ప్రభావం వుంది. వాళ్ళు కవిత్వపు చట్రంలో కథను ఇమిడిస్తారు. ఛందోబద్ధ పద్యాల లయాన్విత కదలికల మద్య కథనీ, వచనాన్నీ నడిపిస్తారు. నేను వచనం మధ్య కవిత్వాన్ని పలికిస్తాను. అది లయాన్విత శబ్దాలతో కూడినది కాకపోవచ్చు. కథకు అనుగుణంగా, పాత్రోచితంగా, లయాన్విత భావాలతో కూడిన కవిత్వాన్ని వచనం సందుగొందుల్లో అందంగా అమర్చటం నాకిష్టం -అందుకే నేను బేసిగ్గా కవినే.

మీ దృష్టిలో సాహిత్య ప్రయోజనం ఏమిటి? ఇప్పటిదాకా మీ రచనల ద్వారా మీరు ఆ లక్ష్య సాధనలో ఎంతవరకు పురోగతి సాధించగలిగారని భావిస్తున్నారు?

సాహిత్యం మనిషిని సంస్కారవంతున్ని చేయగలిగితే చాలు. ముందుగా తను సంస్కరించబడిన తరువాతే రచయిత మంచి సాహిత్యాన్ని సృష్టించగలడు. సాహిత్య సృష్టి కోసం నన్ను నేను సంస్కరించుకోవటమే నా సాహిత్యం వల్ల కలిగిన మొదటి ప్రయోజనంగా నేను భావిస్తున్నాను. ప్రయోజనాన్ని గురించి పక్కన పడితే – నా కథలు, కవితలు, నవలలు చదివి చాలామంది పాఠకులు అందులోని పాత్రలతో తమను పోల్చుకుంటూ మమేకమౌతూ నాకా విషయాన్ని చెప్పినప్పుడు -సాహిత్యకారునిగా మరింత సాహిత్య సృజనకు ప్రేరణ పొందుతాను.
మీరు రాసిన వాటిలో మీకు బాగా తృప్తి నిచ్చిన కథ ఏది? ఎందుకు?

కొత్త దుప్పటి కథాసంపుటి ఆవిష్కరణ

కొత్త దుప్పటి కథాసంపుటి ఆవిష్కరణ సభలో పాలగిరి విశ్వప్రసాద్, సింగమనేని నారాయణ, ఆవిష్కర్త కోట పురుషోత్తం, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, చిల్లర భవానీదేవి, డా. మల్లెమాల వేణుగోపాల రెడ్డి

నాకు బాగా నచ్చిన కథ ‘కొత్త దుప్పటి’. నిలువెత్తు ప్రేమరాహిత్యానికి అచ్చమైన ప్రేమతత్వం ఎదురుపడి ప్రశ్నార్థకమై సంధించినప్పుడు, ప్రేమరాహిత్యం కాస్తా చిట్లి, పగుళ్ళుబారే సవ్వడులు యీ కథలో స్పష్టంగా వినిపిస్తాయి. మానవ సంబంధాల తడి కథనిండా అలుముకొని వుంటుంది. పల్లెటూరి పంట కళ్లాల్లో ఒక చీకటి రాత్రి జరిగిన సంఘటన అత్యంత సహజంగా చిత్రీకరించబడింది. పల్లె సంస్కృతి, వ్యావసాయిక జీవన చిత్రణ, మానవసంబంధాల స్పర్శ, జానపద భావన, చిన్నచిన్న అవసరాల్ని కూడా తీర్చుకోలేనితనం పట్ల మనిషి అసంతృప్తి, ఆవేదన, ముసలివాళ్ళ పట్ల పెరుగుతోన్న అనాదరణ, ప్రేమరాహిత్యం వగైరా భావాలన్నీ కథలో అంతర్లీనంగా వస్తూ, ఇవన్నీ తను వ్యక్తీకరిస్తున్నాననే విషయం రచయితకు తెలీకుండానే -కథ, కథలోని పాత్రల, పరిసరాల వాతావరణం యొక్క అవసరాల మేరకు ఆవిష్కరించబడిన వైనం యీ కథలోని ప్రత్యేకత.

మీకు నచ్చిన మీ కవిత ఏది? ఎందుకు?
నాకు నచ్చిన నా కవిత ‘బడి పిల్లలు’. ఉపాధ్యాయునిగా నా తాత్వికతకు ప్రతిరూపం అది.

మీకు బాగా నచ్చిన మీ నవల ఏది? ఎందుకు?
నాకు బాగా నచ్చిన నా నవల ‘కాడి’. దీన్ని గురించి పూర్తిగా చెప్పాలంటే చాలా పేజీలే ఖర్చవుతాయి. ‘కాడి ‘ అనగానే రెండెడ్లు పూన్చిన రైతు దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. యాభై యేళ్ల రాయలసీమ మెట్ట వ్యవసాయం లోని స్థితిగతుల్ని చర్చించిన నవల ఇది.

‘కోపుయాస’ లేని ఎద్దుల్ని పూన్చినప్పుడే ‘కాడి’ రమ్యంగా వుంటుంది. కొంత కోపుయాస వున్నా, బలమైన ఎద్దు తన మీద పర్రేసుకొని (భారం తనమీద పడేలా నాగల్ని తనవైపు సర్ది కాడి కట్టటం) అయినా యీడ్చే మానసిక ఉన్నతి ఉన్నప్పుడే కాడి సత్ఫలితాలనిస్తుంది.

కాడికి కోపుయాస లేని ఎద్దులు ఎలాగో-
వ్యవసాయ జీవనానికి రైతులు, దళితులు కూడా అలాగే-
వైవాహిక జీవితానికి ఆలుమగలు అంతే-
వ్యక్తిగత జీవితానికి చదువూ శారీరక శ్రమా అంతే-
వృత్తుల్ని బట్టి కులాలేర్పడ్డాయి. వృత్తులు మాసిపోతున్నాయి గాని, కులాలు మాత్రం బలపడుతున్నాయి.

కాడి నవల ప్రధాన ఆశయమేమంటే –
– కులాలు పోయి వృత్తులే మిగలాలని.
– పనిమానుకొని సుఖ జీవనం కోసం అన్వేషించే బదులు పనిలోనే సుఖాన్వేషణ చేయాలని.
– ప్రతి తండ్రి తన సంతానాన్ని సోమరిగా బతికేందుకు దారులు వెదకే బదులు, బతికేందుకు తనకు తెలిసిన వృత్తిని వారసత్వంగా అందివ్వాలని.
– శ్రమచేయని చేతులకు అన్నం కలిపి ముద్ద జేసికొనే హక్కు లేదనే విషయం వంశపారంపర్యపు నీతి సూత్రంగా అందివ్వాలని.

పల్లెల ఆత్మ స్వరూపాన్ని పట్టుకున్న నవలగా ‘కాడి’ నాకు నచ్చిన నవల.

మీరు చదివిన ఇతరుల రచనల్లో మీకు బాగా నచ్చిన రచన ఏది?

మహాభారతం. పాఠకుడిగా చాలాకాలం మహాభారతాన్ని చదివి ఆనందపడ్డమాట వాస్తవమే కాని, రచయితగా మారింతర్వాత భారతం నన్ను అడుగడుగునా ఆశ్చర్యానికి గురిజేస్తూవుంది. అసంఖ్యాకమైన పాత్రలు, విలక్షణమైన మానసిక చిత్రణలూ, విభిన్న జీవన ధోరణులూ, వేనవేల జీవిత దృశ్యాలూ.. సృజనాత్మకతకు పరాకాష్ట మహాభారతం -సందేహమే లేదు.

———————-

రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

Posted in వ్యాసం | Tagged | 1 Comment