మట్టి వాసన కలిగిన మంచి కథల సంపుటి

సమీక్షకులు: స్వాతి కుమారి

నాగుమణి నవ్వింది కథాసంపుటి
రచయిత – డి. రామచంద్ర రాజు

ఈ సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికల్లో ప్రచురించబడినవే. ఈ కథల్లో, సగటు మనిషి బలహీనతలు, మధ్యతరగతి జీవితంలోని కష్టనష్టాలు, వానలు కురవక, బ్రతకటానికి చావటానికీ దిక్కు తోచని రైతుల దుస్థితి.. ఇలా చాలా వరకూ వాస్తవ జీవిత చిత్రణలే ఉన్నాయి. కథ చివర్లో అద్భుతమైన మలుపు తిరిగి కష్టాలు గట్టెక్కటం, మనుషుల్లో అకస్మాత్తుగా మార్పు రావటం లాంటి ప్రయోగాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక ఒక్కో కథనూ విడిగా పరిచయం చెయ్యాల్సి వస్తే..

“ఈ ప్రపంచంలో మనిషి బ్రతకాలంటే పవరు గావాల. ధైర్యమనుకో, బలమనుకో, తెలివనుకో!” ఒక గొప్ప జీవిత సత్యాన్ని చాలా సులువైన రీతిలో చెప్పారు “పవర్” అనే కథలో. డబ్బు, తెలివితేటలు ఏమీ లేని తల్లిదండ్రులు అడుగడుగునా మోసపోవటం చూసి కొడుకు దొంగగా మారే కథ ఇది.

“కన్నీటి వాసన” కథలో వానలు కురవక, వేరే దారి లేకా నీరు పోసి పెంచిన చెట్లను కట్టెలుగా మార్చి అమ్మాల్సిన పరిస్థితిలో రైతు పడే ఆవేదన, ఆ పరిస్థితులతో ఏ మాత్రం సంబంధం ఉన్నవాళ్ళకైనా కంట తడి పెట్టిస్తుంది.

“తృప్తి” అనే కథలో ముసలి తాతని నిర్లక్ష్యం చేస్తున్న తల్లిదండ్రులకి చదువుకున్న కొడుకు బుద్ధి చెప్పడం మనం కొన్ని చోట్ల విన్న కథల్లాంటిదే ఐనా, తాతా మనవళ్ళ మధ్య అనుబంధం, చివర్లో మనవడు ఆవేశంగా స్పందించటం లాంటి అంశాలు కథలో జీవాన్ని నింపాయి. కాకపోతే ఇతివృత్తానికీ కథ పేరుకీ ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాలేదు.

“చీకటి సవ్వడి” అనే కథలో కువైట్‌లో పని చేసి, కుటుంబాన్ని గట్టెక్కించాలని వెళ్ళిన వారి వెతలు, ఎండమావులను నమ్మినవాళ్ళ జీవితాల్లో ఎదురైన దుష్పరిణామాలు అతి సహజమైన సన్నివేశాలతో చిత్రీకరించిన విధానం చూస్తే, ఇదే నేపథ్యంలోని కొన్ని వాస్తవ గాథలు రచయితని ఈ కథ రాయటానికి పురిగొల్పి ఉంటాయేమో ననిపిస్తుంది.

ఫ్యాక్షనిజాన్ని హీరోయిజంగా చూపించే సినిమాలకి అలవాటు పడిపోయాం మనం. కానీ ఒక ఫ్యాక్షన్ నాయకుడి వద్ద విశ్వాసపాత్రులైన అనుచరులుగా పనిచేస్తూ దాని విషపు కోరల్లో బలైపోయిన బడుగు జీవులు తమ నాయకుణ్ణే అంతం చేసే కథ, “ఏటిదరి మాను”. తాము నాశనమవుతూ వినాశనాన్ని సృష్టిస్తున్నామని కనువిప్పు పొందటం ఈ కథ లోని మంచి అంశం. అసలు ఫ్యాక్షన్ ఆధారిత కథలతో సినిమాలు రావడం మొదలవకముందే ఫాక్షన్ సమస్యకు వినూత్న పరిష్కారాన్ని చూపిన ఈ కథకు 1997లో న్యూజెర్సీ తెలుగు కళాసమితి, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి లభించింది.

“చెమట చిత్తరువు” కథలో తాము ఉన్న వాస్తవ పరిస్థితులు మనవడికి వివరించి చెబ్తాడు తాత. అప్పటిదాకా కులాసాగా చదువు, కథల్లో మునిగి ఉన్న కుర్రవాడికి తను పని చేసి కుటుంబాన్ని ఆదుకోవలసిన అవసరం గుర్తింపుకు వస్తుంది. తమకు ఉన్న ఆఖరి అవకాశంగా పొలంలో చెట్లను కొట్టి పట్నంలో అమ్మబోతారు ఇద్దరూ. అప్పుడు వారికి అడుగడుగునా ఎదురైన మోసాలు మనవడ్ని అవేశానికి గురిచెయ్యటం ఈ కథలోని విషయం. ఈ కథ సాహిత్య నేత్రం ప్రథమ జన్మదిన ప్రత్యేక సంచిక (ఏప్రిల్ – జూన్ 1996), చీరాల సాహితీ వేదిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందింది.

ఇక పుస్తకం పేరుగా ఉన్న కథ “నాగుమణి నవ్వింది” కథ.. తాను ప్రేమించి, ధైర్యం లేక పెళ్ళి చేసుకోలేకపోయిన అమ్మాయి అత్తవారింట కట్నం కోసం ఇబ్బంది పడుతోందని తెలుసుకుంటాడు అతను. ఆ డబ్బు సంపాదన కోసం ఆమె ఎంచుకున్న మార్గం తెలుసుకుని నివ్వెర పోతాడు. ఈ కథలో నాటకీయత పాలు కొంచం ఎక్కువగా కనిపించింది. తన సమస్యకి నాగుమణి ఎంచుకున్న పరిష్కారం, సామాజిక విలువల్ని ధిక్కరించిన తర్వాత కూడా తిరిగి ఆమె అత్తవారింటికి వెళ్ళి కష్టాలు పడటానికి సిద్ధమవటం ఒకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తాయి.

“ద వెయిట్” అనే కథ కూడా పరోక్షంగా వరకట్నం గురించే. అందమైన ఒక పేద అమ్మాయితో ప్రేమ సాగించి ఆమెకి తెలియకుండానే మరో పెళ్ళి చేసుకునే పాత్ర శశికాంత్‌ది. తనకి తెలిసిన ఒకమ్మాయి డబ్బున్న అబ్బాయిని వల్లో వేసుకుంది అని భావించే హిమ తను మాత్రం శశిని నిజంగానే ప్రేమించాననుకోవటం, అతని బైక్ అలవాటయ్యాక బస్ ఎక్కటం విసుగ్గా ఉందనుకోవటం బహుశా ఆమె లోని ద్వంద్వ ప్రవృత్తిని చిత్రీకరించటానికి రచయిత చేసిన ప్రయత్నం కావచ్చు.

“గుండె చప్పుళ్ళు” అనే కథలో గయ్యాళి నాగమ్మ తోటలో మామిడి కాయలు దొంగతనం చేసిన చిన్నారి అక్కాతమ్ముళ్ళు ఆమెకి దొరక్కూడదని చేసే ప్రయత్నాలు ఉత్కంఠను రేపగా చివర్లో అంతటి గయ్యాళిలోనూ మరుగున పడ్డ మానవత్వాన్ని, ఆర్తిని రచయిత విజయవంతంగా ఆవిష్కరించగలిగారు.

“ఇదిగో ఇక్కడిదాకా” – ఇది కథనం పరంగా మంచి కథ అని చెప్పవచ్చు. శ్రీలక్ష్మి, తిరపతి మద్రాసు నుంచి పారిపోయి నందలూరు వస్తారు. ఆమె దగ్గరున్న బంగారమంతా పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలో నష్టపోతారు. తిరిగి మద్రాసు వెళ్ళిపోదామనే అతని ప్రతిపాదన ఆమెకి నచ్చదు. వేరే చోటికెక్కడికైనా వెళ్దామని ఆమెని నమ్మించి రైల్వే స్టేషనులో వదిలి వెళ్తాడు తిరపతి. అప్పట్నుంచి ఆమె పిచ్చిదై అక్కడే కాలం గడుపుతుంటుంది. చివరికి అతని మరణ వార్త వినగానే ఆమె కూడా చనిపోతుంది.

మొత్తమ్మీద ఈ కథల్లో సహజత్వం ఉంది. అనుభవాల్లోంచి నేర్చుకున్న సత్యాలు, ప్రకృతితో మనిషి అవసరం, అనుబంధం పల్లె జీవితంలోని మట్టి వాసన కథలకి చదివించే గుణాన్ని చేకూర్చాయి. ఆదర్శవంతులైన హీరోలు, కర్కోటకులైన ప్రతినాయకులు, సమస్యలకి ఐడియల్ సొల్యూషన్లు లాంటి టెక్నిక్‌లు లేకుండా, రచయిత నిజాయితీగా తనకు తెలిసిన జీవితాలను ఆవిష్కరించడం కనిపిస్తుంది. “ఆశ అరవైనాళ్ళు, మోహం ముప్ఫైనాళ్ళు” లాంటి రాయలసీమ నుడికారము, ఆ ప్రాంతానికి చెందిన మాండలికం ఈయన కథల్లో విరివిగా కనిపించి రచయితకి తన నేలతో పెనవేసుకుపోయిన అనుబంధాన్ని తేటతెల్లం చేస్తాయి.

ఈ పుస్తకం వెల ఎంతో నేరుగా చెప్పకుండా “చదివి కట్టండి చూద్దాం.” అని ప్రకటించడంలో తన కథల మీద ఆయనకున్న ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.
నాగుమణి నవ్వింది కథాసంపుటి
రచయిత: డి. రామచంద్ర రాజు
ప్రతులకు: శ్రీమతి డి. సుజాత
డోర్ నంబర్: 4-6-25, మిద్దె మీద,
రిజర్వాయర్ కాలనీ,
తిరుపతి.
ఫోన్: 9849904514

వెల: చదివి కట్టండి చూద్దాం.

తీరిక లేదా? పెట్టండి ఓ వంద… థ్యాంక్స్!

—————————-

స్వాతి కుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యులు

Posted in వ్యాసం | Tagged | 2 Comments

నవంబరు బ్లాగుల ప్రస్థానం

-చదువరి

ముంబైలో ఉగ్రవాదులు జరిపిన పాశవికమైన మారణకాండపై బ్లాగరులు చాలా విస్తృతంగా స్పందించారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువగా బ్లాగరులు స్పందించిన అంశం మరొకటి లేదేమో! ఈ సంఘటన ప్రజల్లో కలిగించిన కలవరపు తీవ్రతను, దీనిపై స్పందిస్తూ వచ్చిన టపాల సంఖ్య తెలుపుతోంది. కొన్ని బ్లాగుల్లో ఒకటి కంటే ఎక్కువ స్పందనలు కూడా వచ్చాయి.

  1. దారుణం, సిగ్గుచేటు అన్నారు సన్నజాజి
  2. కొత్తపాళీ మనం ఎప్పటికి నేర్చుకుంటాం అని ఆవేదన వెలిబుచ్చారు
  3. లక్ష్మి మళ్ళీ క్షమించేద్దామా అంటున్నారు.
  4. కళ్ళముందు కటిక నిజం అన్నారు నాలోనేను
  5. మన ముంబై కోసం అని కవిత రాసారు, శ్రీఅరుణం
  6. ఉగ్రవాదులకు మన ప్రభుత్వాల మీద ఎంత నమ్మకం అని నిట్టూర్చారు తెలుగోడు
  7. ఏమిటీ వైపరీత్యం అన్నారు మధురవాణి
  8. పదమ్ములు కూడా ఈ ఘటనను నిరసించారు. ఈ నెల మొదలైన కొత్త బ్లాగుల్లో ఇదొకటి.
  9. నువ్వేదిక్కని భగవంతుడిని ప్రార్థించారు, జ్యోతి
  10. మన కర్తవ్యం ఇదీ అని ఉద్బోధించారు శ్రీదీపికలో
  11. మృత్యుక్రీడ అని సిరిసిరిమువ్వ అన్నారు
  12. దాడిని ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయిన వీరుడికి అశ్రునివాళి అర్పించారు బొల్లోజు బాబా
  13. పాపం పోలీసులు అంటూ కొవ్వలి సత్యసాయి రాసారు.
  14. ఎన్ని వెన్నుపోట్లు, ఎన్ని కత్తిగాట్లు అని విశాఖతీరం నుండి ప్రశ్నిస్తున్నారు.
  15. దైవానిక ఆక్రోశం వెలిబుచ్చారు
  16. టెర్రరిస్టులకు విజ్ఞప్తి చేసారు బుజ్జి
  17. దిగులుగా ఉందన్నారు చదువరి
  18. పురుషోత్తమరెడ్డి తన మదిలో సంగతులను పంచుకున్నారు.
  19. పౌరుషం లేని పాలకులు అంటున్నారు కోవెల సంతోష్ కుమార్
  20. గార్లపాటి ప్రవీణ్ఎన్నాళ్ళిలా అని ప్రశ్నిస్తున్నారు
  21. విహారి ఈ దుశ్చర్యను ఖండించాలా అని అడుగుతున్నారు.
  22. ఈ దురంతంపై ఆత్రేయ రాసిన కవిత చదవండి
  23. లీలామోహనంలో అశ్రునివాళి ప్రకటించారు
  24. రమణి తన మనసులోని మాట చెబుతున్నారు
  25. దిగులు, భయం కాదు.. కోపం రావాలంటున్నారు, పర్ణశాల మహేష్
  26. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు ఎల్లుండికి గుర్తుంటారా అని అడుగుతున్నారు, రవిగారు
  27. సిగ్గులేని ప్రభుత్వాలు అని అన్నారు అంతర్యానంలో
  28. భరతమాతసేవలో మృత్యువును ముద్దుపెట్టుకున్న కర్మవీరులకు నివాళి అర్పించారు దుర్గేశ్వర
  29. ఏకచక్రపురం, బకాసురుడు – సామ్యాన్ని సూచించారు కొత్తబంగారులోకంలో
  30. యథాప్రజా తథారాజా అంటున్నారు రానారె
  31. పోరాటం ముగిసింది, ఇక పోరాడాల్సింది కుళ్ళు రాజకీయనాయకులతో అంటున్నారు పెదరాయ్డు
  32. ఉగ్రవాదులు నిమ్న హృదాంతర రక్తదాహ పైశాచిక వీచికల్ అన్నారు జిగురు సత్యనారాయణ తన ఉత్పలమాలలో
  33. ముంబై ఘాతుకంలో మన పాత్ర ఎంత అని తర్కిస్తున్నారు, నా అనుభవాలు న్లాగులో. ఈ బ్లాగు ముంబై ఘటన తరవాతే కొత్తగా వెలిసింది.
  34. పిరికివాళ్ళెవరు, ఉగ్రవాదులా ప్రభుత్వాలా అని అడుగుతున్నారు, శ్రీకాంత్. ఈ బ్లాగు కూడా నవంబరులోనే జన్మించింది.
  35. మన స్నేహం బ్లాగులో శృతి ప్రతిస్పందన చూడండి. ఇది కూడా నవంబరులో పూచిన పువ్వే
  36. ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలర్పించిన యోధులకు నివాళి అర్పించారు ఇస్మాయిల్
  37. సురుచి అమరవీరులకు నివాళి అర్పించింది.
  38. మతం మానవత్వాన్ని కోరుకుంటుంది, మానవ రక్తాన్ని కాదు అంటున్నారు ఫన్‌కౌంటర్లో
  39. ఈ దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాతలకు వాతలు పెట్టారు గడ్డిపూలు సుజాత
  40. మీరూ ఓ కమాండో కండి అంటున్నారు మగవాడు

ఒక బ్లాగులోని జాబులను విమర్శిస్తూ మరో బ్లాగు రూపుదిద్దుకోవడం గతంలో జరిగాయి. ఓ సందర్భంలో అది పూర్తి వ్యక్తిగత దాడి. నాలుగైదు టపాల తరువాత, ఆ బ్లాగు మూతబడలేదుగానీ, ఆగిపోయింది. మరో సందర్భంలో అసలూ కొసరూ -రెండు బ్లాగులు కూడా మూతబడ్డాయి. ఈ నెల మూడో సంఘటన జరిగింది. పర్ణశాల వంటి చురుకైన బ్లాగులో వచ్చే టపాలకు నిరసనగా ఆ శైలిని అనుకరిస్తూ, ఆ టపాలకు పేరడీగా పానశాల అనే బ్లాగు ఉద్భవించింది. బ్లాగరి పేరును, బ్లాగు రూపురేఖలనూ కూడా అనుకరిస్తూ వచ్చిన పానశాల, బ్లాగులోకంలో సంచలనం సృష్టించడమే కాక, కొందరు బ్లాగరుల అభిమానానికి కూడా పాత్రమైంది. తీవ్రమైన చర్చలూ జరిగాయి. లైంగికతపై పర్ణశాలలో వచ్చిన జాబుకు ప్రతిగా పానశాలలో వచ్చిన జాబుతో ఈ విమర్శలు మొదలయ్యాయి. విమర్శ వ్యక్తిగత దాడిగా పరిణమించడంతో పానశాల బ్లాగరుల విమర్శలు ఎదుర్కొంది. బ్లాగు గుంపులో కూడా చర్చ జరిగింది. చివరికి పానశాలలో పర్ణశాలపై విమర్శలను ఆపడంతో విమర్శల సద్దు మణిగింది.

సాక్షి పత్రికలో సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ పట్ల బ్లాగరులు బాగా స్పందించారు. గతంలో సుమన్ పట్ల బ్లాగరులకు ఎగతాళి ఉండేది; నవ్వులాటగా మాట్టాడేవాళ్ళు. ఈసారి మాత్రం విమర్శలు సీరియస్సుగా, పదునుగా ఉన్నాయి. కొన్ని జాబులను చూడండి:

  1. సుమనూ, నీకిది తగునా అంటూ లలిత స్పందించారు.
  2. సాక్షి డబుల్ ధమాకా అంటూ తిరుపతి ఈస్టు రైల్వేస్టేషన్లో చెప్పారు.
  3. జిందాబాద్ రామోజీ అంటూ అజయ్ రాసారు.
  4. ఛీ ఛీ సాక్షి అంటూ శీర్షిక తోటే సరిపెట్టారు తెలుగోడు.
  5. ఎవరికి లాభం అని అడిగారు గుంపులో గోవిందం. ఈ బ్లాగు ఈ నెలలోనే కొత్తగా ప్రవేశీంచింది.
  6. జసుగమన్ రామాయణం అంటూ మగవాడు రాసారు.
  7. సాక్షి రామాయణం అంటూ ఏడుకొండలు రాసారు.
  8. సుమనోహరాలు అంటూ బుజ్జి రాసారు.
  9. బళ్ళ సుధీర్ చౌదరి సాక్షి అనే జాబు రాసారు.
  10. అసలేం జరుగుతోంది ఆరెఫ్సీలో అంటూ యడ్ల ఆదిలక్ష్మి రాసారు. ఈ బ్లాగు ఈ నెలే కొత్తగా రంగ ప్రవేశం చేసింది.

బ్లాగుల్లో రాతలే కాకుండా గీతలు కూడా కనిపిస్తూ బ్లాగులకు వైవిధ్యాన్ని అద్దుతున్నాయి. అలాంటి బ్లాగులు రెండు:

  1. ఓదెల వెంకటేశ్వర్లు వెంకటూన్స్ పేరుతోఈ కార్టూన్లు ప్రచురిస్తున్నారు. వీరు టీవీ9లోని వికటకవి కార్యక్రమ కర్తల్లో ఒకరు.
  2. ప్రసిద్ధ కార్టూనిస్టు భగవాన్ కూడా భగవాన్ కార్టూన్స్ పేరిట బ్లాగు వెలయిస్తున్నారు. కార్టూను వేసి చదువరుల నుండి వ్యాఖ్యలను ఆహ్వానించడం వీరి ప్రత్యేకత.

స్వగతాలు, స్వ గతాలు

  1. మాటే మంత్రం అంటూ తనకెదురైన ఓ సంఘటనకు సంబంధించి తన మనోభావాలను పంచుకున్నారు రమణి.
  2. తన బాల్యం గురించి చెబుతున్నారు వేద.
  3. పచ్చదనం, తొలికిరణాల వెచ్చదనం, ఏడురంగుల హరివిల్లు, ఉదయపు హాయైన ప్రశాంతత ఇవన్నీ నాతో ఉంటే నేను ఒంటరిగా నడవడమేంటి అంటున్నారు సత్యవతి.

సినిమా

  1. ఎవరికోసమీ సినిమా టిక్కెట్టు ధరల పెంపు అంటూ నిరంజన్ పులిపాటి రాసారు.
  2. సినిమా సమీక్షల్లో కాలాస్‌త్రిది విలక్షణ వైఖరి. ఆవకాయ్ బిర్యానీ రుచెలా ఉందో చెబుతున్నారు, చూడండి.

హాస్యం, వ్యంగ్యం

  1. ఆ రాత్రి ఏం జరిగిందంటే అంటూ చేగోడీల్లో వచ్చిన ఈ బీభత్స, భయానక కథనాన్ని చదివారా?
  2. పాపులర్ బ్లాగులు రాయడమెలాగో తెలుసా మీకు?
  3. శ్రీకాంత్ రోజుకోజోకు కార్యక్రమంలో వచ్చిన జోకొకటిది
  4. విహారి సిద్ధ, బుద్ధలు మళ్ళీ మన ముందుకు వచ్చారు
  5. బట్టతల వచ్చేసిందే బాలా.. కొనసాగుతోంది.
  6. రాజకీయ పాఠాలు చెబుతానంటున్నారు దేవన హరిప్రసాద్ రెడ్డి

ఇంద్ర ధనుస్సు

  1. మహాభారతంలో భీష్ముని పాత్రపై విశ్లేషణ సిరివెన్నెలలో చదవండి.
  2. కాఫీ గురించి భాస్కర్ రామరాజు మంచి కాఫీలాంటి జాబు రాసారు.
  3. అలనాటి హైదరాబాదు చిత్రాలు చూడండి అంటూ కొణతం దిలీప్ విలువైన, వెలలేని చిత్రాలను తన బ్లాగులో పెట్టారు.
  4. కొల్లూరి సోమశంకర్ రాసిన కిటికీ అనే ఈ జాబు చక్కటి సందేశాన్నందిస్తోంది.
  5. హాస్య దర్బారు తీర్చే అరిపిరాల సత్యప్రసాద్ కార్పొరేట్ కాశీమజిలీ కథలు పేరుతో మరో శృంఖలను మొదలుపెట్టారు.
  6. దుప్పల రవికుమార్ “మీరు చదివారా” అంటూ పుస్తక సమీక్షల బ్లాగు రాస్తూంటారు. ఇప్పుడు ప్రముఖ బ్లాగరులతో ఫటాఫట్ అంటూ ప్రశ్నలు జవాబుల శృంఖల మొదలుపెట్టారు. వారానికో బ్లాగరితో ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. మచ్చుకు కొణతం దిలీప్‌తో ఈ ఫటాఫట్!
  7. మహిళా బ్లాగరులు కొందరు కలిసి, ఆడపిల్లలను ఆదుకునే ఓ స్వచ్ఛంద సంస్థకు పుస్తకాలు, స్టేషనరీ రూపేణా సహాయం చేసారు. ఆ వివరాలు మనసులోమాటలో చూడవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ హార్దిక అభినందనలు.
  8. సిద్ధాంతం – నమ్మకం అంటూ రవి బ్లాగాడించారు.
  9. అమెరికాలో ఆంధ్రుల హత్యలపై తన ఆవేదనను చింతా రామకృష్ణారావు ఆంధ్రామృతంలో వెలిబుచ్చారు.
  10. అమెరికా వనభోజనాల గురించి వేణుశ్రీకాంత్ రాసారు.
  11. సీబీరావు అమెరికా నుండి ఉత్తరం రాసారు.
  12. బహిరంగ ప్రదేశాల్లో క్యూ పద్ధతిని పాటించని వారికి రమణ వినతి చూడండి.
  13. ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధ చట్టం ఆ వర్గాలకు కూడా ఉపయోగపడటం లేదంటున్నారు, ప్రక్షాళనలో

కొత్త బ్లాగులు

  1. నల్లమోతు శ్రీధర్ సాంకేతికాంశాల బ్లాగరిగా బ్లాగులోకంలో చిరపరిచితులే. ఇప్పుడాయన మనసులో అనే బ్లాగు పుస్తకంలోతన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు.
  2. మనఃస్పందన తెలియజేస్తున్నారు
  3. నవకవిత
  4. ఆనందో బ్రహ్మ అంటూ జోకుల మీద జోకులు చెప్పేస్తున్నారీ బ్లాగులో
  5. మగవాడినంటూ ఒక బ్లాగొచ్చేసింది. కానీ, ఇది మరో మగవాడి బ్లాగు కాదంటున్నారీ బ్లాగరి.
  6. కవితా పరిమళాలు వెదజల్లుతూ వచ్చిందో బ్లాగు.
  7. తోలుబొమ్మలాట వచ్చేసింది, చూడండి.
  8. ఆయుష్మాన్‌భవ పేరుతో తమ్మిన అమరవాణి బ్లాగు మొదలుపెట్టారు. నిజానికిది కొత్త బ్లాగు కాదు; తమ పాత బ్లాగులోని జాబులన్నిటినీ తీసివేసి కొత్త జాబులతో కొనసాగిస్తున్నారు.
  9. సముద్రం బ్లాగును మొదలుపెట్టారు కర్ణ.
  10. తెలుగు వెలుగు అంటూ చెన్నకేశవస్వామి కొత్త బ్లాగు మొదలుపెట్టారు.
  11. తెలుగు చలనచిత్రాల జాబితా తయారు చేస్తున్నారు, చాణక్య
  12. సహ చట్టం గురించి చెబుతున్నారీ బ్లాగులో
  13. అంతరంగ కెరటాలు పేరుతో వచ్చారు మరో కిరణ్ – యార్లగడ్డ కిరణ్ కుమార్
  14. ఆహా! ఓహో అంటూ వచ్చేసిందో బ్లాగు. వీరికి రాతలే గాక, గీతలూ వచ్చినట్లు తెలుస్తోంది.
  15. నాగొడవ అనే కవితల బ్లాగుతో పవన్ కుమార్ రంగంలోకి దిగారు.
  16. బ్లాగంటే ఇదేరా అంటున్నారు జయభారత్


ఈనెల జాబు:
పగవాడిక్కూడా రాకూడదు అనుకునేంతటి కష్టం వచ్చినపుడు ధీరోదాత్తులెలా తట్టుకుంటారో, చూస్తే తప్ప తెలీదు. వెన్నెముకను నమిలేసేంతటి నొప్పిని అనితర సాధ్యమైన రీతిలో ఎదుర్కొన్న గడ్డిపూలు సుజాత, అటువంటి శైలిలోనే – ఉద్వేగ రహితంగా, ఎవరికో సంబంధించిన విషయంలా – తన వీరగాథను వివరించిన మూడు టపాలు మా ఈ నెల జాబు (లు).

పాత మధురాలు
మన పత్రికల్లో దిస్ డే దట్ ఏజ్ లాంటి పాత వార్తల శీర్షికలు వస్తూంటాయి. అలాటిదే ఈ నాటి బ్లాగు – నిన్నగాక మొన్న మొదలైన తెలుగు బ్లాగుల్లో కూడా నా…టి బ్లాగా అని సాగదియ్యకండి. 2005లో వచ్చిన ఈ బ్లాగు ఒకే ఒక్క జాబుతో ఆగిపోయింది. అంత సీన్ లేదు అనే పేరుగల ఈ బ్లాగులో ఉన్న ఒకే ఒక్క జాబు పేరు ఇచ్చట నిద్ర అమ్మబడును. నిద్ర అమ్మే ఆ కంపెనీ పేరు కూడా చూడండి, ఎంత చమత్కారంగా ఉందో! ఇంతకీ ఆ బ్లాగు రాసింది కశ్యప్, ఆయన తమ్ముడూను. ప్రస్తుతం http://kaburlu.wordpress.com అనే బ్లాగు రాస్తున్నారు.

—————————-

చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు

Posted in జాలవీక్షణం | Tagged , , | 13 Comments

దూరం

పింగళి శశిధర్

ఆలోచనా తరంగిణి కా
ఒడ్డులో నీవు – ఈ
ఒడ్డులో నేను –
అలల అలజడిలో
వెనుకడుగే ఇద్దరిదీ !

కానీ –

కాళ్ళ క్రింది ఇసుకొకటే
కాలంలా కరిగిపోతూ
కలిపే ప్రయత్నం చేస్తోంది
ఇద్దర్నీ !?

Posted in కవిత్వం | Tagged | 10 Comments

నవంబరు గడిపై మీ అభిప్రాయాలు

నవంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 అక్టోబరు గడి, సమాధానాలు
2. 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు
3. 2008 ఆగస్టు గడి, సమాధానాలు
4. 2008 జూలై గడి, సమాధానాలు
5. 2008 జూన్ గడి, సమాధానాలు
6. 2008 మే గడి, సమాధానాలు
7. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
8. 2008 మార్చి గడి, సమాధానాలు
9. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
10. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
11. 2007 నవంబరు గడి, సమాధానాలు
12. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
13. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
14. 2007 జూలై గడి, సమాధానాలు
15. 2007 జూన్ గడి, సమాధానాలు
16. 2007 మే గడి, సమాధానాలు 4
17. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
18. 2007 మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 22 Comments

అక్టోబరు గడి సమాధానాలు

-భైరవభట్ల కామేశ్వరరావు

అక్టోబరు గడి పరిష్కారం పంపిన వారు మొత్తం తొమ్మిది మంది.
ఈసారి అన్నీ సరైన సమాధానాలు పంపినవారు ఒకరుండడం విశేషం! అన్ని సమాధానాలు సరిగ్గా పంపినవారు: “మహార్ణవం” రాధిక. వారికి అభినందనలు.

మూడు తప్పులతో రాసిన వారు:
1. సుజాత (మనసులో మాట),
2. దైవానిక. (దైవానిక, “కత్తి” సమాధానం తప్పు రాయడం క్షమార్హం కాదు 🙂 )

మూడు కన్నా ఎక్కువ తప్పులతో పంపినవారు:
1. ఆదిత్య
2. ఈ.భాస్కర నాయుడు
3. శ్రీలు
4. జ్యోతి
5. స్వరూప కృష్ణ
6. స్నేహ

ప్రయత్నించిన వారందరికీ మా అభినందనలు

———————-

1 సా

2 యం

కా

3 ల

మైం

4 ది

5 ప్ర

జా

6 రా

జ్యం

7 రం

గు

కు

8 వా

తా

పి

మా

9 భ్ర

10 గ

11 మ

త్కు

తా

ను

12 ధ

ని

13 ము

14 ని

15 అ

16 గ

17 రౌ

ద్రి

18 గ

19 జల్

20 జా

కీ

21 చ

లి

22 వేం

ద్రం

23 ఆ

24 కా

25 రే

రి

26 చి

27 రా

28 గ

ళం

29 తి

30 త్ర

31 ప

32 ము

వ్వ

33 ల

వ్వ

డి

రి

షీ

34 వ

కీ

35 వి

న్న

కో

36 ట

37 లు

సూ

38 వ

రా

39 జా

40 యా

41 వ

త్తు

ంకు

42 చి

ట్టి

బా

బు

43 లు

లు

44 క

లు

45 స్థ

46 దు

లు

పు

47 ల్తా

త్తి

48 లం

అడ్డం

1. పొద్దుకొచ్చి పొద్దుపోయిందంటారేమిటి గొల్లపూడి గిరీశం గారు! (6) – సాయంకాలమైంది – కన్యాశుల్కంలో గిరీశం మొదటి డైలాగు. గొల్లపూడి నవల పేరు.

5. అంజి kingdom పేరు ఒక oxymoronలా లేదూ? (2, 2) – “అంజి” సినిమా హీరో చిరంజీవి. అతని రాజ్యం “ప్రజా రాజ్యం”. రాజ్యం అంటే రాజులు పాలించేది అని అర్థం. అంచేత “ప్రజా రాజ్యం” అన్నది oxymoron అనుకోవచ్చు.

7. ఇది పడుద్దనడం అతనికో తుత్తి (2) – “రంగు పడుద్ది” ఏ.వి.ఏస్ డైలాగు

8. తిన్నది తాపీగా అరిగించుకోండి (3) – తిన్నది అరగడానికి “వాతాపి జీర్ణం” అంటారు కదా.

10. బుద్ధాజీ వెళ్ళిపోయాడు! (2) – బుద్ధుడు వెళ్ళింది గయకి. “గయ” అంటే హిందీలో వెళ్ళిపోయాడని అర్థం వస్తుంది.

11. దంతంలేని ఏనుగు బాధ సూర్యచంద్రులు కూడా తట్టుకోలేరట! (3) – “శివుడద్రిని శయనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుండవిరళముగ శేషునిపై శయనించుట నల్లి బాధ పడలేక జుమీ!” అన్న పద్యం ఒక ఆధారం. నల్లికి సంస్కృత పదం “మత్కుణం”. దంతం లేని ఏనుగుని కూడా మత్కుణమంటారు. ఈ అర్థం బ్రౌణ్యంలో కనపడక కాస్త తికమక పడ్డట్టున్నారు.

12. స్వరముల నరమిదే (3) – ధమని ఒక రకమైన నరం (ఇంగ్లీషులో artery అనుకుంటాను). “ధ మ ని” స్వరాలే కదా!

13. కామునిలో దాగిన మోక్షగామి (2) – ముని

15. అరగజం దూరంలో, అదిగో పెద్ద కొండచిలువ! (4) – అజగర (“అరగజ” anagraM) అంటే కొండచిలువ

17. ఆరుద్ర కుమార్తె కలం పేరు కూడా సార్థకమే! (2) – ఆరుద్ర కుమార్తె లలిత గారు బ్లాగర్లకి పరిచితులే. ఆమె కలం పేరు “రౌద్రి” అంటే రుద్రుని కూతురు అని అర్థం వస్తుంది.

18. జల్లుమనిపించే షాయరీ (2) – గ”జల్”

20. పేకముక్క రౌతు (2) – జాకీ

21. శీతల పానీయాల ఉచిత పంపిణీ కేంద్రం (4) – చలివేంద్రం

24. స్రవించే రాజులు రాజ్యముల్ కలుగవే! (2) –పోతనగారి పద్యం “కారే రాజులు రాజ్యముల్ కలుగవే!” కారే అంటే స్రవించే అని కూడా అర్థం వస్తుంది కదా.

28. గంగాళం కాదు. సన్నని గొంతుగల తేనీటి చెంబు (4) – గళంతిక (ఇంగ్లీషులో kettleకి అందమైన తెలుగు పదం!)

30. శతపత్ర సుందరిలో ఎంత సిగ్గు దాగుందో! (2) – త్రప అంటే సిగ్గు

32. అచ్చ తెలుగు మంజీర నాదాన్ని వినాలంటే సప్తగిరులని దర్శించాలి (3, 3) – “మంజీర నాదం” అచ్చ తెలుగులో “మువ్వల సవ్వడి”. ఇది సప్తగిరి దూరదర్శన్లో వచ్చే ఒక మంచి కార్యక్రమం, శాస్త్రీయ నృత్యంలో పోటీ.

34. పాపమీ లాయరుగారికి ఒకటే తాళంచెవి మిగిలింది (2) – వకీ. వకీలు అంటే లాయరు. “కీలు” – తాళంచెవులు. ఒకటే ఉంటే “కీ”.

35. వేసవి వాన కురిపించినవాడే నేటి కవిత్వానికి పెట్టనికోట (4) – విన్నకోట. విన్నకోట రవిశంకర్ కవితల సంపుటి వేసవి వాన.

37. కమల్ దాదా భాయ్ డబ్బులు లాగడంలో కాస్త తడబడ్డాడేమిటి? (3, 2) – తెలుగులో శంకర్ “దాదా”, హిందీలో మున్నా “భాయి”, తమిళంలో కమల్ హాసన్ నటించిన “వసూల్ రాజా”. వసూల్ తడబడింది.

40. సమస్త్యములో ఎక్కువైనదిదే (3) – సమస్తము సరైనపదం, అందులో ఎక్కువైనది “య వత్తు”. “య వత్తు” పదాన్ని మనం “యా వత్తు” అని పలుకుతాం. “యావత్తు” అంటే అర్థం సమస్తము.

42. వైణిక బాబు గట్టివాడే! (4) – చిట్టిబాబు. ప్రముఖ వీణ విద్వాంసుడు.

43. అబ్బా! ఎటు చూసినా ఈ పురుగుల గోల తొలిచేస్తోంది! (5) – లుకలుకలు. ఇది పురుగుల ధ్వనిని సూచించే పదం. ఎటునుంచి చూసినా అదే వస్తుంది.

45. 48 తో కలిస్తే చోటు దొరుకుతుంది (2) – స్థ. 48 అడ్డంలోని అక్షరం “లం” తో కలిస్తే “స్థలం” అంటే చోటే కదా.

46. భానుమతి మన లారెల్ ఎండ్ హార్డీ ని చెయ్యమన్న పని (3) – దులుపు. రమణా రెడ్డి, రేలంగి మన “లారెల్ ఎండ్ హార్డీ”. వాళ్ళతో భానుమతి పాట “దులపర బుల్లోడో”.

నిలువు

1. “రాజొకడూరలేడ”ని చెప్పినా వినని రాకుమారుని గాథ (5, 3) – సారంగధర చరిత్ర. ఈ కథ ప్రసిద్ధమైనదే. చేమకూర వేంకట కవి దీన్ని కావ్యంగా రచించాడు. అందులో సారంగధరుని మిత్రుడు తన సవతి తల్లివద్దకు పోవద్దని వారిస్తూ చెప్పే పద్యం – “రాజొకడూరలేడు, చెలి ప్రాయపు బిత్తరి” అంటూ మొదలవుతుంది. అతని మాట వినకుండా సారంగధరుడు వెళతాడు.

2. మోహనుబాబు యముడైతే మరి ఎన్.టీ.ఆరు? (2, 2) – యంగు యమ. ఇది పై కథకన్నా కూడా ప్రసిద్ధమైనదే కదా

3. కర్పూరవసంతరాయలి ప్రేయసిదే కులమయితే నేమి? (3) – లకుమ (కులమ anagram)

4. దివ్యమైన నిర్వాణముతో సమానమీ ప్రభుత్వ కొలువు (4) – దివాణము. అంటే ప్రభుత్వ కొలువు.

5. మహత్వాన్ని కోల్పోయిన ముత్తాత (3) – పితామహుడు అంటే తాత. ప్రపితా”మహుడు” అంటే ముత్తాత. “మహ”త్వాన్ని కోల్పోతే మిగిలేది “ప్రపితా”.

6. అద్వైతం లక్ష్మణుడికి విశిష్టంగా తెలుసునే! (4) – రామానుజుడు విశిష్టాద్వైత మత ప్రచారకుడు. రామానుజుడంటే లక్ష్మణుడు కూడా కదా.

9. నువ్వేం తలుచుకుంటే అదైపోవాలా! ఇదేం న్యాయం? (3, 3) – “భ్రమర కీటక”. సంస్కృతంలో కొన్ని ప్రసిద్ధమైన analogiesని “న్యాయాలు” అంటారు. అలాటి న్యాయాల్లో ఇదో న్యాయం పేరు. దీన్నే “భ్రమర కీట” న్యాయం అని కూడా అంటారు. పురుగులు తాము తేనెటీగగా మారాలని తీవ్రంగా తలుచుకుంటూ తపస్సు చేస్తే అవి తేనెటీగగా మారిపోతాయట. అలాగే జీవుడు “అహం బ్రహ్మాస్మి” అని తలుచుకొని తపస్సు చేస్తే బ్రహ్మత్వాన్ని పొందుతాడు అని అంటారు.

14. ఇది రెండింతలైతే మేను మెఱుపు గనిగా మారదూ! (2) – నిగ. శరీరం మెఱుస్తూంటే, “నిగ నిగ”లాడుతోందంటారు. “గనిగా”లో నిగ దాగుంది.

16. లావొక్కింతయు లేని ఎన్.టి.ఆర్ తొలి ప్రేయసి (2) – ఎన్. టి. ఆర్ అంటే ఇక్కడ జూనియర్ ఎన్. టి. ఆర్. అతను హీరోగా వేసిన తొలి చిత్రంలో హీరోయిన్ గజాలా. “లా” ఒక్కింతయూ లేకపోతే మిగిలేది “గజా”.

17. 17 అడ్డంలో పేరుకి మాత్రం కనిపించే రసం (2) – రౌద్రికి సంబంధించిన రసం “రౌద్రం”.

19. ఈ నాయిక కాటుక తిరగేసి పెట్టుకుందేవిటి దేవా? (2) – కాజల్ అంటే కాటుక. అదో హిందీ హీరోయిన్ (నటుడు అజయ్ దేవగన్ భార్య) పేరు.

22. వద్దని తెలుగులో చెప్పొచ్చు కదా తంబీ! (2) – వద్దు తమిళంలో “వేండ”.

23. 45 తో కలిసే గొప్ప ప్రయత్నం చెయ్యి (2) – “ఆ”. 45 అడ్డంలోని అక్షరం “స్థ” కలిస్తే “ఆస్థ” అంటే గొప్ప ప్రయత్నం అని అర్థం.

25. చంద్రలత సాహితీ క్షేత్రంలో జల్లిన వాటి మధ్యలో మీరు చూస్తున్నది ఇరుక్కుపోయింది (3, 3) – రేగడి విత్తులు

26. చిల్లిగవ్వ, ఆద్యంతం యుద్ధాలకి కారణం! (2) – “చి”ల్లిగ”వ్వ” మొదలు చివరా కలిపితే “చివ్వ”, అంటే యుద్ధం.

27. రాజులు చేసేవి పోలిటిక్సయితే మరి రసికులు చేసేవి? (5) – “రాజకీయాలు” అంటే రాజులు చేసే పనులు. రసికులు చేసే పనులు “రాసకీయాలు”.

29. అడిగానంటున్నావు సరే. అదేదో తిన్నగా చెయ్యొచ్చుగా (3) – కోరితి అంటే అడిగాను అని అర్థం. అది తిరగబడింది.

31. ఇండెక్సు (4) దీనికి చక్కని తెలుగు పదం “పద సూచి” (పుస్తకాలకి సంబంధించి వాడేటప్పుడు)

32. ఈ మధ్యనే ఈ బాదు కాంగ్రెస్సుకి మణిమయంగా మారింది (5) – ముషీరాబాదు. ఆ మధ్య ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మణెమ్మ గెలిచింది.

33. వేయికళ్ళ వయ్యారి తిరగబడింది (2) – ఇదొక పొడుపుకథ. వెయ్యి కళ్ళ వయ్యారంటే వల.

36. చాటాలంటే వెయ్యాల్సింది (2) – టంకు

38. పనికిరానట్టు కనిపించినా, వేళ్ళూనుకుంటే ఎంత చల్లదనమిస్తాయో! (2) – వట్టి వేళ్ళు వేసంకాలంలో వేడి తగ్గడానికి ఇంట్లో కడతారు. “వట్టి” అంటే పనికిరాని అనికూడా అర్థం.

39. ప్రత్యుత్తరాలలో ఉత్తరాలు వెతికి పట్టుకోడమే ఇక మీ ఉద్యోగాలు, ఓకే? (3) – జాబులు. ప్రత్యుత్తరానికి మరో పదం “జవాబు”. అందులో ఉన్న “జాబు” అంటే ఉత్తరం అనే అర్థం ఉంది తెలుగులో. ఇంగ్లీషులో “జాబ్” అంటే ఉద్యోగం కదా.

41. మధ్యలో కాస్త సాగదీస్తే, 34 అడ్డంలో వాళ్ళు పుచ్చుకొనేదే (3) – 34 అడ్డంలో వాళ్ళు లాయర్లు. వాళ్ళు “వకాల్తా” పుచ్చుకుంటారు కదా.

44. దీని పదును తెలియాలంటే బ్లాగ్వనంలో కుటీరాన్ని దర్శించాల్సిందే! (2) – కత్తి పదును తెలియనివాళ్ళు బ్లాగ్లోకంలో లేరంటే అతిశయోక్తి కాదు.

48. 23 ని ముందు పెట్టుకుని యుద్ధం చెయ్యి (2) – 23లో అక్షరం “ఆ”. దానికి “లం” కలిస్తే “ఆలం” అంటే యుద్ధం.

Posted in గడి | Tagged | 5 Comments

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 4

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

మీ అభిమాన రచయిత ఎవరు? ‘చనుబాలు’ కథలో ప్రస్తావించినట్లు ‘కళాపూర్ణోదయం’ మీకు బాగా నచ్చిందనుకుంటాను, కారణాలు చెబ్తారా?
‘కళాపూర్ణోదయం’ నచ్చినమాట వాస్తవమే, ఉత్కంఠ కలిగించేలా కళాత్మకంగా ఎలా రచన చేయవచ్చో ‘కళాపూర్ణోదయాన్ని’ చూస్తే తెలుస్తుంది. కానీ, నాకు బాగా నచ్చిన రచయిత తిక్కన సోమయాజి. సంభాషణలుగానీ, సన్నివేశాల చిత్రీకరణలోగానీ ఎంతో నైపుణ్యాన్ని కనబరచిన రచయిత ఆయన. సమాజంలోని అన్ని రకాల వ్యక్తుల మనస్తత్వ పరిశీలన ఆయన రచనల్లో కనిపిస్తుంది. ప్రగతిశీల భావాలతో కూడిన ఎన్నో పద్యాలు భారతం నిండా దర్శనమిస్తాయి.

మీరు రోజుకు/వారానికి సగటున ఎంతసేపు టి.వి. చూస్తారు? ఎలాంటి ప్రోగ్రాములని ఇష్టపడతారు?
టి.వి చూట్టం తక్కువే. సీరియల్సు అసలు చూడను. నెలకో, రెండు నెలలకో ఇంట్లో అందరితో కలిసి సినిమా చూస్తాను. ప్రతిరోజూ తప్పకుండా అర్థగంటకు తక్కువ కాకుండా వార్తలు చూస్తాను. చర్చాకార్యక్రమాలు, కళలు సంస్కృతులకు సంబంధించిన మంచి కార్యక్రమాల గురించి తెలిస్తే తప్పనిసరిగా చూస్తాను.

మీరు బోధనా రంగాన్ని ఎందుకు ఎంచుకొన్నారు? సాహితీ సృజనకు అవసరమైన వెసులుబాటు ఇతర రంగాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటుందా?
నేను చదివిన చదువు నాకీ బతుకుదెరువు ఇచ్చిందే గాని ఒక వ్యూహంతో నేను ఉపాధ్యాయున్ని కాలేదు. అయితే ఉపాధ్యాయుణ్నయిన తర్వాత వృత్తిని ప్రేమించాను, అందులో మమేకమయ్యాను. ప్రవృత్తిగా వున్న రచనా రంగానికి యీ వృత్తి సహకరిస్తోందే తప్ప వెనక్కి లాగటం లేదు.

సన్నపురెడ్డి

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

పేరు: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
పుట్టింది: 1963 ఫిబ్రవరి 16 న
కన్నవాళ్ళు: సన్నపురెడ్డి లక్ష్మిరెడ్డి, చెన్నమ్మ
చదువు: బి.యస్‌సి., బి.ఇడి.
వృత్తి: 1989 నుండి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా
రచనలు: దాదాపు 60 కవితలు, 45 కథలు, 5 నవలలు
నవలలు: కాడి, పాండవబీడు, తోలుబొమ్మలాట, చినుకుల సవ్వడి, పాలెగత్తె.
అర్ధాంగి: ఇంద్రావతి
పిల్లలు: పావని, శ్రావణి, శ్రీనాథ్
నివాసం: పుట్టిందీ, పెరిగిందీ, ప్రస్తుతం ఉండేదీ బాలరాజుపల్లెలోనే.
చిరునామా: బాలరాజుపల్లె గ్రామం, నరసాపురం పోస్ట్,
కాశినాయన (మం) – 516 217, కడప జిల్లా.

ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వం టీచర్లను బోధనేతర పనులకు ఎక్కువగా వినియోగిస్తోంది. దీనివల్ల పిల్లల చదువులు కుంటుపడటం లేదా?
ఒకప్పుడు పల్లెటూరి ఉపాధ్యాయుడంటే కేవలం పిల్లలకు చదువు చెప్పేవాడు మాత్రమే కాదు, గ్రామస్తులకు బహుళ ఉపయోగకారిగా ఉండేవాడు. ప్రోనోట్లు తేల్చేవాడు, దస్తావేజులు చూసేవాడు, జాబులు రాసేవాడు, చదివి వినిపించేవాడు, లెక్కలు తేల్చేవాడు. ఒకటేమిటి-చదువు అవసరమయ్యే ప్రతిచోటా ఆయన ఉండవలసిందే, అవసరాలు తీర్చవలసిందే. అలాగని పిల్లలకు చదువు చెప్పటం మానేది లేదు, అక్కడా న్యాయం చేసేవాడు. వృత్తి పట్ల అంకిత భావంతో పన్జేసేవాడు. నా ఉద్దేశ్యమేమంటే-పిల్లలకూ, పిల్లల తల్లిదండ్రులకూ, ఆ గ్రామానికి సంబంధించిన విషయాలయితే బోధనేతర పనులు చేయటం సబబే. అందువల్ల పిల్లల గురించీ, వాళ్ల ఆర్థిక, సామాజిక విషయాల గురించీ ఉపాధ్యాయుడు తెలుసుకున్నట్లవుతుంది. గ్రామస్థులందరితో సన్నిహితంగా మెలిగినట్లవుతుంది. ఎలక్షన్ డ్యూటీల లాంటి పిల్లలతో సంబంధం లేని పనుల్నించి ఉపాధ్యాయుల్ని తప్పించాలి. ఉపాధ్యాయునికి కొంత ఇబ్బందికరమైనా తను పనిచేసే వూరిలోనే సంసారం ఉండటం వలన వృత్తికి సరైన న్యాయం చేయగలుగుతాడు. బడికి అతను చుట్టంలా కాకుండా గృహయజమానిగా ఉన్నప్పుడే పిల్లల నడవడికలన్నీ తెలుసుకోగలుగుతాడు. బడి సమయం తర్వాత కూడా పిల్లలు ఉపాధ్యాయుని ఎరుకలో ఉంటే వృత్తికి న్యాయం చేయగలుగుతాడు. అట్లా ఉండాలంటే ఆ వూరిలోనే నివసించగలగాలి. తొంభై శాతం పైగా ఉపాధ్యాయులు అట్లా నివసించటం లేదు, బడికి చుట్టాలుగానే వున్నారు. అందుకే యీ అస్తవ్యస్తమంతా.

విద్యారంగంలో చోటు చేసుకుంటోన్న మార్పుల గురించి National Policy on Education లోని నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం విద్యావ్యవస్థలో రావలసిన మార్పుల గురించి నవల రాసే ఉద్దేశమేమైనా వుందా?
ఉంది, రాబోయే రోజులలో తప్పకుండా రాస్తాను.

‘పగటికల’ లో గిజూభాయి బగేకా చేసినటువంటి ప్రయోగాలు చిత్తశుద్ధితో చేపట్టగల ఉపాధ్యాయులు గానీ, అందుకు అనువైన పరిస్థితులు గానీ ఇప్పుడున్నాయా?
చిత్తశుద్ధి గలిగిన ఉపాధ్యాయులు అప్పుడే గాదు ఇప్పటికీ వున్నారు, వాళ్ల శాతం పడిపోయిందంటే ఒప్పుకుంటాను. ప్రయోగాలకు అనువైన పరిస్థితులు కూడా వున్నాయి.

మీ బడిలో మీరుగానీ, మీ తోటి ఉపాధ్యాయులుగానీ బెత్తాన్ని ఎంత తరుచుగా వాడుతుంటారు?
మాది పూర్తిస్థాయి గ్రామీణ వాతావరణంతో కూడిన పాఠశాల. సగం మంది మహమ్మదీయులు, సగం మంది యాదవులున్న చిన్న గ్రామానికి సంబంధించింది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. పిల్లలు చాలా వరకు మొదటి తరం విద్యార్థులు. మేం వాళ్లని కొట్టటం, భయపెట్టటం లాంటి పనులు చేయం. వాళ్ల ఇళ్లల్లో, కళ్లాల్లో, పొలాల్లోని వాతావరణం బడిలో కల్పిస్తాం. వాళ్ల మనసుల్లోని భావాల్ని అత్యంత సహజంగా మాముందు వ్యక్తపరిచేంత చనువయ్యాం. చిన్న పిల్లలయితే మరీ మామీద ఎక్కి తొక్కుతుంటారు. అందుకే సాయంత్రం బడి వదిలేసరికి మా బట్టలు మట్టిగొట్టుకుపోయి మళ్లీరోజు తొడుక్కొనేందుకు పనికిరావు.

మీ పిల్లలు ఏ బడిలో చదువుతున్నారు? ఏ మీడియం?
పెద్దపాప డిగ్రీ చివరి సంవత్సరం. ఎం.ఇ. కంప్యూటర్స్ సబ్జక్టులతో. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. డిగ్రీలో పై సబ్జక్టులు తెలుగు మాధ్యమంలో లేవు కాబట్టి ఇంగ్లీషు తప్పనిసరైంది. రెండవ పాప తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో తెలుగులో ప్రి డిగ్రీ పూర్తయ్యి ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అబ్బాయి మాత్రం తొమ్మిదవ తరగతి ఇంగ్లీషు మీడియంలో. అమ్మాయిలిద్దరూ సెలవుల్లో తెలుగు కథానికలు, నవలలు బాగానే చదువుతారు. ఆబ్బాయి సెలవులంతా తెలుగు కథలకే సమయాన్ని ఖర్చుజేస్తాడు. బాల సాహిత్యంతో వాడో స్వంత లైబ్రరీ కూడా తయారు చేసుకొన్నాడు.

రచనలు చేయటంలో మీ శ్రీమతి సహకారం ఎలాంటిది?
ఆమెకు చదువు రాదు. నా కథలు రేడియోలో ప్రసారమయితే విని ఆనందిస్తుంది. పిల్లలు చదివి చెపితే సంతోషిస్తుంది. గ్రామస్థులు ప్రస్తావిస్తే ఎంతో కుశాలగా ముచ్చటిస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు ఆమెకు బాగా తెలుసు. నాకు గుర్తుండని సంగతులు కూడా ఆమె వివరిస్తుంది. నా రచనల్లో వ్యవసాయ సంబంధ వాతావరణం, పైరుపచ్చల విషయాలు చిత్రించే సందర్భంలో ఆమె సహాయం తీసికొంటాను.

మీ రచనల మొదటి పాఠకులు ఎవరు?
బహుశా పత్రికల్లో కథల్ని చూసే సబ్ ఎడిటర్లయి వుంటారు. కథల్ని రాసింతర్వాత నేను నేరుగా పత్రికలకే పంపుతాను. ప్రచురించబడిన తర్వాత మిగతా వాళ్లు చదువుతారు.

వాతావరణంలో వచ్చే మార్పునుబట్టి కూరగాయల రుచిలో వచ్చే మార్పులను సైతం ఎంతో నిశితంగా గమనించి మీ రచనల్లో రాస్తారు. మీకు బాగా నచ్చే వంటకాలేవి?
నూనెలు ఎక్కువగా వాడని, మసాలాలు బాగా దట్టించని, సహజరుచుల్ని అందించే పల్లె వంటకాలు చాలా రకాలు నచ్చుతాయి. ముఖ్యంగా కాయలు, ఆకులతో దంచే రోటి పచ్చళ్లు నేనిష్టపడతాను. పచ్చిమిరప, టమోట, ఉల్లిగడ్డల్ని వాడ్చి, దంచి, తిరగమోత పెట్టిన పచ్చడి పళ్లెంలో వేసికొని, వేడి వేడి అన్నాన్ని వడ్డించుకొని, అప్పుడే నిప్పుల మీంచి తీసిన గిన్నెలోని నేతిని పచ్చడి మీద వంచినప్పుడు ‘చుంయ్‘ మని వచ్చే శబ్దాన్ని వింటూ, అన్నం పొగలు వూదుకొంటూ కలుపుకు తినటం నాకెంతో ఇష్టం. అలాగే పెసరబేళ్లు, వరిబియ్యం కలిపి వండిన పులగమన్నంలో, రెండు చుక్కలు నేయి అంటించిన చింతపండూరిమిండి కలుపుకు తింటే ఎంతో తృప్తిగా వుంటుంది. చింతచివురో, మామిడి ముక్కలో వేసి ఉడికించి ఎనిపిన కందిబేళ్ల పప్పుతో అన్నం కలుపుకు తినటం పసందుగా వుంటుంది. వేడి వేడి రాగి సంగటి ముద్దమీద కుదురు చేసి, కుదుట్లో పచ్చిమిరపల పచ్చడి వేసి, దానికి ఎర్రగా కాగిన వేడిపాల మీది మీగడని కలిపి అద్దుకు తింటే మహారుచిగా వుంటుంది. వట్టిచేపా, వంకాయా, వట్టి మిరపల్ని నిప్పుల మీద కాల్చి, ఉప్పు కలిపి బొటనవేలి దరువేసి, ఉడుకుడుకు సంగట్లో అద్దుకు తింటే రుచి చచ్చిన నాలుక మళ్లీ బతుకుతుంది. పొట్లి మాంసం వేపుడు తునకలన్నా, నాటు కోడి సియ్యల చారన్నా, కుంటముక్కలు, జల్లల పులుసన్నా, ఎండ్రకాయల చారన్నా ఎంతో ఇష్టం. ఇట్ట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇష్టాలే వున్నాయి. ముఖ్యంగా – మా వూరి గొల్లలు ఎండాకాలం గొర్లకు మేపు దొరక్క నల్లమల కొండలకు తోలుకు పోయేటప్పుడు వాళ్ల ఆడాళ్లు సజ్జ రొట్టెలు కాల్చి బత్తెం కడ్తారు. కుండ పెంకుల మీద పల్చగా ఫెళఫెళ విరిగిపోయేట్లుగా కాల్చిన సజ్జ రొట్టెల్ని అడుక్కొని మరీ మేం తినేవాళ్లం. ఆ రొట్టెల్ని తేనెలో అద్దుకు తిన్నా, లేబాకు బెల్లంలో నెయ్యి కలిపి పూసుకు తిన్నా స్వర్గం కనిపిస్తుంది. ఇంకో రహస్యం – మా ఇందిర ఎన్ని వంటలు చేసినా మా అమ్మ నూరిన ఊరిమిండి ముందు బలాదూరు కావలసిందే.

వంటల గురించి చివరగా ముక్తాయింపు – నేనెప్పుడైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు నూనె, మసాలాలతో కూడిన బరువైన ఆహార పదార్థాలు నాలుగు రోజులు తిన్నాననుకోండి-నోరు సవ్వబడుతుంది. కడుపు మందగిస్తుంది. పేగులకు ఏదో జిడ్డులా అంటుకొన్న భావన ఒకటి ఉంటుంది. దానికి విరుగుడు ఏమంటే-ఇంటికి చేరుకోగానే రెండురోజులపాటు రోటి పచ్చళ్లతో ఉడుకుడుకు అన్నాన్ని తినటమే. అప్పటికిగాని నా నాలుక యథాస్థితికి రాదు, కడుపు తేలిక పడదు.

ఒక నవల రాసేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని అనిపిస్తుంది. ఈ సమాచారాన్ని మీరెలా సేకరిస్తారు? తోలుబొమ్మలాట నవలలో తోలుబొమ్మలు ఆడించేవాళ్ల నోట వచ్చే మాటలు రావటమే సహజంగా ద్విపద రూపంలో వచ్చేస్తాయని రాసారు. ఈ సాహిత్యంతో మీకు పరిచయం ఎట్లా కలిగింది? వాళ్ల మాటలు మౌఖికము, శ్రవణమే గాని గ్రంథస్థం కాదేమో కదా! ఈ సాహిత్యాన్ని మీరెలా సేకరించారు? ఊర్లోని పెద్దల నోళ్ల ద్వారానా? పుస్తకాల ద్వారానా?
కథగానీ, కవితగానీ, నవలగానీ నేను రాసే ఏ రచన అయినా దాన్ని గురించిన సమగ్రమైన సమాచారం పిడికిట్లో వుంటేనే రాస్తాను. అది నాకు పూర్తిగా అనుభవానికి వస్తేనే రాస్తాను. కథగా రాయాలనుకున్న ఓ విషయం అది కథయ్యేసరికి ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ‘తోలుబొమ్మలాట’ నవల కూడా అంతే. 1999 నవంబరులో దాన్ని కథగా రాయాలని నోట్సు తయారుచేసికొన్నా. 2006 కు గాని అది నవలగా రాలేకపోయింది.

తోలుబొమ్మలాటతో నాకు మంచి సంబంధాలే వున్నాయి. ఊర్లోకి కళాకారులు వస్తే మా యింటికి వచ్చి మా నాన్నతో ఎక్కువ సమయం గడపవలసిందే, పురాణపారాయణంలో పాలు పంచుకోవలసిందే. వాళ్ల మాటలు, హావభావ విన్యాసాలు చిన్నతనాన్నించి నాకు ఎరుకే. నేను కథలు రాసే సమయానికంతా బొమ్మలాట ప్రదర్శన మీద జనాలకు మోజు తగ్గింది. అయినా గ్రామాన్ని ఒప్పించి ఆటాడిపోయేవాళ్లు. కథ రాద్దామనుకొన్న సంవత్సరం వూర్లో ఆటాడించాం గాని చివరివరకూ చూసింది కొద్దిమందే. వాళ్లు కూడా వృద్ధులే, వాళ్లతోటి నేనూ. తర్వాత కళాకారులు వూర్లోకి వచ్చినా ఆటాడించేందుకు గ్రామస్తులు సుముఖత చూపించలేదు. అంతో యింతో డబ్బులిచ్చి పంపుతున్నారు. అయితే 2005లో అతికష్టం మీద ఆటాడించాం. తెల్లారి పొద్దు పొడిచేదాకా ఆడే ఆటను కొన్ని గంటలకు కుదించాం. అయినా జనాలు చూడలేకపోయారు. ఆ అనుభవాల నేపథ్యంగా నేను తోలుబొమ్మలాట నవల రాశాను. నవల గురించిన సమాచారం సేకరించేందుకూ, అది రచనగా మనస్సులో ఓ రూపు దిద్దుకొనేందుకూ అంతకాలం పట్టినా, నవల రాసేందుకు మాత్రం నెలరోజుల లోపే పట్టింది.

సింగమనేని నారాయణ మిమ్ముల్ని ‘మనకాలపు మహారచయిత’ గా పేర్కొన్నారు. దానికి మీరెలా ఫీలవుతున్నారు?
ఇప్పటిదాకా నేను సింగమనేని నారాయణ గారిని గురించి చెప్పవలసిన ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నాను. ఆయన్ను గురించి మాట్లాడకుండా యీ ఇంటర్వ్యూ సమగ్రం కాదు.

కథారచనలో నాకాయన మార్గదర్శకులు. వ్యవసాయం, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, వ్యవసాయ కూలీలు, పంటల గిట్టుబాటు, ఆధునిక పద్ధతులు, ప్రపంచీకరణ ఫలితాలు—–వీటన్నిటినీ అర్థం చేసికొనేందుకు ఆయన నాకు నిఘంటువులా నిలిచాడు. దృశ్యీకరణ చేసి మరీ చూపించేవాడు. నేనొక ప్రశ్న అయి ఆయనకు ఎదురుపడితే చాలు ఆయన మహా ఆనందపరవశుడయి జవాబుగా మారతాడు. అలాంటివాడు ఇప్పుడు నన్నిలా వ్యాఖ్యానించాడంటే నాకు భయమేస్తావుంది. మోయలేనంత బరువును తలకెత్తినట్లుగా వుంది. భవిష్యత్తునిండా ఆయన హెచ్చరికలే వినిపిస్తున్నాయి. నేను రాయవలసిన దానిపట్ల మరింత నిబద్ధత, అంకితభావం కలిగి ఉండవలసిన అవసరాన్ని సూచిస్తోంది. అయన నన్ను గురించి చేసిన వ్యాఖ్యలకు నాదైన అర్థం నాకుంది. నేనింకా విస్తృతం కావాలి. జీవన మూలాల్లోకి చొచ్చుకు పోయి మానవ సంబంధాల మాధుర్యాన్ని అందరికీ చాటాలి. మానవ సంబంధాల్ని మహోన్నతంగా ఆవిష్కరించాలి. ధనికులు, దరిద్రులు, భూస్వాములు, కూలీలు, అగ్రవర్ణాలు, దళితులు, ఆరోగ్యవంతులు, రోగిష్టులు—మనుషుల మద్య యీ అంతరాలన్నీ చెరిగిపోవాలంటే మానవీయత వృద్ధి కావాలి, దాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. ఆయనకు నా పట్ల వున్న నమ్మకాన్ని, ఆశల్ని నేను వమ్ము చేయను. జీవనపర్యంతం అంకితభావంతో, ప్రగతిశీల దృక్ఫథంతో రాస్తూనే ఉంటాను.

వృత్తిరీత్యా మీరు దాదాపు రోజంతా గడిపేది చిన్నపిల్లల మధ్య, ఇంకోవైపు మీ ప్రవృత్తి సాహితీసృజన, మరి పిల్లల కోసం మీరేదైనా రాశారా?
పిల్లల కోసం నేను పాటలు ఎక్కువగా వ్రాశాను. రోజూ ఒక పాటైనా రాసి, పాడి వినిపిస్తుంటాను. అలాగే కథలు కూడా చెప్తాను, కానీ వాటిని ఎక్కడా ప్రచురించలేదు.

———————-
రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

Posted in వ్యాసం | Tagged | 10 Comments

తేటి రాజకీయం

-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

తేటినాయకమణి తమిదీర నైదు
ఋతువులకు విరిజన విదుర మధువు
గ్రోలి పదవెక్కి ,… కరువుల గూలిపోవు
వారినీనాడు జూడగా వచ్చి బలికె.

“కమ్మతావుల తెరల బుక్కాము పరుపు
మృదులకేసర తల్పాన యదుక బరచి
రంగురేకుల స్వాగతాల్ రాసి నాకు
నై యెదురుగనియెడి పూల యతివలేరి?

కరకు కరమును చిరుమృదు కంఠదారి
హృదయ కుహరాన జొనిపి తన్మధుర మధు
రసము నేకొల్లగొట్ట, పరవశులగుచు
సోలి నానందపడు విరి సుదతులేరి?

జుమ్మురని మేము పాడిన విమలగాన
వీచి నురగలు తెమ్మెర వీధి గదలి
వచ్చుటను గాంచి సంతోష వార్ధి మునుగు
పరువములు వెల్గు చిరుపూలపడతులేరి?

నలువగు పూలకన్నె సదనంబుకు నే బరువెత్తువేళ, రె
ప్పల కొనయంచులందడవి, కమ్మని తావుల గుప్పి, శీతలాం
బలముల సేదదీర్చి, పరువాలకు పానకమిచ్చి, వేడియై
దొలగెడి చల్లగాలుల మృదూక్తుల సవ్వడులేల లేవొకో?

విరి తరుణి పైన వ్రాలేటివేళ మా స్వ
పక్షముల గాలి తాకిడి బెదరి చెదరి
సుడివడుచు లేచి మమ్మేచి చుట్టుముట్టు
కమ్మతావుల పసమించు దుమ్ములేవి?

పరువముల మాదుకౌగిలి బరచి ముదము
గనెడి సఖులను పరికించి గంపమంద
మేను, తమిహెచ్చ, తరుణము మించునంచు
కన్నెలుగ మారు మొగ్గల చిన్నెలేవి?

వెలుగు బుట్టెడి చల్లని వేళ పూవు
కన్నె కౌగిలి చిరువేడి గరగు మేము
వదలు వూపిరి పొగమంచు విధము తపను
కరములను బట్టి నిలిపేటి కాలమేది?

ఎన్నియో పూల దొరసాను లెవరిచెంత
జేరగలవాడ? రమ్మని చెరగు పరచి
యన్ని దలలూపు. స్మృతివెల్గునట్టి నాటి
గుండె బొంగెడి కాలపు గురుతులేవి?

నా కొరకు, నన్ను తమ ప్రియ నాథు జేయు
కొరకునై ఘర్షణలు బడి కోరి వొకరి
నొకరు రాసుక రాలు ప్రేమైక మూర్తు
లేరి? యేమైనవారొ? ఎందేగినారొ?

ఏరి? నా యీ పథమునకు సిరి పదవికి
కారకులు, లేతబుగ్గల కంగిసపడు
సిగ్గునిధులున్న సుమబాల శ్రేణులంత.
యెచట వెదకిన కనరారె? ఎదురురారె?

పలుకరేం? మాదు గాన స్రవంతి వీచి
యెగసిపడి గాలి భుజములనెక్కి పర్వి
వారి గుండెలోతుల దిగి స్పందనలను
కలుగజేయదె! సంతోష కలితలైరె!

పక్షములజొచ్చి తడబడి పడుచులేచి
సుడివడుచు పర్వులిడి శిరస్సులను దాకి
భుజముదట్టుచు మా రాక పూలకన్నె
చెవిని జెప్పదె చిరుగాలి? చెలులు రారె?

ఏమిటిది? అయ్యొదేవుడా! ఏమిటీ క
రాళ మృత్యు విహార సరాగలీల
రంగురంగుల మా పూల రాణులంత
కాలి కమిలి కాఠిన్యమై రాలినారె?

మధుర భావమిచ్చు మా స్పర్శ గనినంత
పొంగి పొరలి నవ్వు పూలకన్నె
తగలి తగలనంత తావు బోకార్చియు
మంటి చెలిమిజేసె మాట విడిచి.

పొరబడితినేమొ! నేను మా పూల సతుల
ముళ్ల ముంగిళ్ల కొస్తినా యెరిగి? .. లేక
దారి తప్పితినేమి? .. యీ దారులన్ని
నిప్పుకణికల మయములై నెగడుచుండె.

ఎక్కడ నా నును బుగ్గలు?
ఎక్కడ నా తరుణకాంతు లేవీ మధువుల్?
చిక్కని గాటపు కౌగిలి
దక్కెడి చిరుగాలి యెచట దాగెనొ? లేదే!”

***********************

మీ చిరుగుండె లోపొరల మిట్టల సందులనిండి కంపనల్
రాచిన మేని తేనియల రాశులపై బడి గిచ్చి గుచ్చి దా
తోచిన రీతి ద్రావి తమిదూలెడి సోలెడి మాదు జిహ్వకిం
కే చెలి దిక్కు? కోరికల నేవిధి దాచుట? నెందు దోచుటల్?

కరువు రక్కసి కోరల విరుగునపుడె
క్షణము ముందుగ మా చెవి పనవి వుంటె
అర్హతలు లేని భూతానికందకుండ
మీకు గుర్తుగా మధువును లాగుకొననె!

నా కలిమి జీవితమున మరొక్కసారి
మీకు మాత్రమె సాధ్యమై మెరయు నూర్ధ్వ
పథము నిర్మించుకొని మిమ్ము ముదము నొంద
జేయనైతినెంత వెధవ జీవినొక్కొ!

రాళ్లసీమ కరవు బీళ్లలో బుట్టిన
మెరుపుతీగలార! మేని పసల
పరుపు పరవకుండ పారినారెచటికి?
విందులిత్తురెవరు పిలిచి నాకు?

మధురమౌ మీ స్మృతిని నేను మరవలేను
గురుప్రబంధము నిర్మించి గూర్తు మీకు
కడు శిలావేదికల్ నేడె గట్టజేతు
యిచటి రాళ్లనె వీటికై యెత్తుకెళుదు.

ఏమిటీ? ఎక్కడా మూల్గు? … ఎవరు? … అయ్యొ..
నీవటే విరికన్నెకా?… నేలవాలు
చివరి ఘడియల నిలిపితే జీవమకట!
నాకునై యెంత గుందితో… యాగుమాగు…

చెప్పు చెలి! యేమి వలయునో… చేసిపెడుదు.
నవ్య రసవత్ప్రబంధమా?… నల్లరాతి
వేదికా?… రమ్యగీతమా?… యేది?… నీవు
కోరుకో. యిత్తునిప్పుడే కోర్కెదీర…”

*******************

కరకరలాడిన రేకుల రాపిడి
మరగిన గుండెల మంటల వెలినిడి
అరగిన కంఠస్వరమున చిరుసడి
మెరయగ బలికెను విరిసతి సిరిజెడి

*******************

“రసవిహీనత వడలి, శిరస్సువాలి
చెవులు హోరెత్త, కన్నుల చెలిమలెండ
మరణ శయ్యలో బడుకొను మాకు నీవు
యేదిజేసిన మిత్రమా! యేమి ఫలము?

ఇంతసేపు నువ్వేడ్చిన యేడ్పుఝరులె
అమృతధారలయ్యె సఖుడ! అంత్యఘడియ
లందు నీ గాన జలనిధి యలల నూగు
భాగ్యమబ్బెను మాకు. నేపాటి వరమొ?

ఏమనుచు యేడ్చితోయి? నీకింపుగూర్చు
మధువిడు సఖులు లేరనా? మధువు నీకు
గావలయుగాని మా చావు కథలు గాదు.
నిక్కమేగద? ఎంతగా నేర్చినావు?

ఇన్నిరోజులు మానుండి యెన్నరాని
లబ్దిబొందితివేగాని లవము మాకు
నై పరిశ్రమించితె? బ్రతుకాశ హెచ్చ
నాసరానిచ్చి నిలిపితె? యకటనీవు.

క్రమముదప్పని శబ్దాల రవళిమించు
నీ యరుపులతో మాకుక్షి నింపజూసి
నావె! మమ్ము మైమరపించి నటనమాడి
మా రసముబీల్చి యీ పాటి మగడవైతె!

దప్పిబెరిగి గొంతెండుతూ దవిలి యెన్ని
సార్లు కేకేసితిమి నీళ్లు నీళ్లటంచు.
ఒక్కసారైన చూపు మాదిక్కు విసరి
యార్తికేకలొ జేజేలొ యరసినావె?

కరకుటాకలి దప్పుల గాలుమమ్ము
గనుటకై నుత్తచేతుల గదలనీకు
సిగ్గులేదొక్కొ? యారెక్క చివరినొక్క
నీటిచుక్కను దెచ్చుటకేటి బరువు?

ఇంతసేపును మావల్ల నెనయు సౌఖ్య
పథములను యేడ్చితివిగాని, వలసి మమ్ము
లాదుకొను యేడ్పులొకటైన నీదునోట
వెడలనే? ఎంత స్వార్థపు యెడద యకట?

మరులుగొన్నది మాలోని మధువుపైన
నేగదా నీవు! త్రావుము… ఇగురలేదు
చివరి బొట్టింక… తృప్తిగా చీకివెళ్లు
గగన పథములబడి – మమ్ముగాతుననుచు.

సఖుడ! ఇంకెప్పుడీ నీచ సరణి జనుల
మోసగించకుమోయి. నీ ముందు యెల్ల
వేళలొకరీతినుండవు. వెళ్లు మిచటి
నుండి వేవేగ చిరుగాలి బండినెక్కి.

***************

రాజకీయాల గడిదేరి రాళ్లపిండు
పూలచెండ్లని, తెగడిన పొగడిరనుచు
నర్థలబ్ధికి, పదవికై యాసపడెడి
తేటి నాయకమణి నవ్వు దెలియ బలికె.

*****************

“మీకునై,… మీదు తృప్తికై, … మీ యెడంద
నిలిచి… నాపేర వెలుగు తేనియలగ్రోలి
దైవతార్పణ తృప్తితో దనియు భక్త
వరుల వలె మిమ్ము సంతోషపరులజేతు.

మీ చివరి కోర్కె దీర్చుతూ.. మీరు తిరిగి
నాకునై.. నా పథముల నిల్ప .. నవ్య మధుర
మధువునందించ .. జన్మించి మనుదురనెడి
యాసతో .. వత్తు .. సఖులార! .. ఆగిపోండి..

ఐదు ఋతువులకొకసారి యెదురుజూచు
మీ దరికి వచ్చు నను మెచ్చి మీ ధవునిగ
యెన్నుకొనుచున్న, జీవితమున్నవరకు
మీకు సౌఖ్యాలనందింతు మిగుల.. వత్తు..

Posted in కవిత్వం | Comments Off on తేటి రాజకీయం

అప్పుడూ ఇప్పుడూ

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

చూస్తూండగానే ప్రపంచం మారిపోతోంది. ఒకటి రెండు దశాబ్దాల కిందట తెలుగువాళ్ళింటికి ఎప్పుడైనా వెళితే పిల్లలు తలుపు తీసి లోపలికెళ్ళి తల్లిదండ్రుల్ని పిలుచుకొచ్చేవాళ్ళు. ఆ తరవాత పిల్లలు కనబడేవాళ్ళు కాదు. టీవీలో తెలుగు ప్రోగ్రాం పెట్టినా, తెలుగుకి సంబంధించిన ఏ విషయాన్నయినా సీదా స్థాయిలో చర్చించినా పిల్లలు కూర్చోవడంగాని, వినడంగాని చేసేవారు కాదు. ‘వాళ్ళ ఇంట్రస్టులు వేరులెండి’ అని తల్లిదండ్రులు ముద్దుగా, కాస్త గొప్పగా చెప్పేవారు. నిజమే. ఏ తరాని కాతరం మారిపోతుంది. అయితే ఆ పద్ధతిలో మాతృభాషతో ఏ విధమైన సంపర్కమూ లేకుండా పెరిగిన (లేదా పెంచిన) పిల్లలు ప్రస్తుతం పెద్దవాళ్ళయిపోయారు. వారు కోల్పోయిన సంస్కారం ఎటువంటి మార్పులు తెస్తోందో ప్రతిచోటా కనిపిస్తోంది. ఇది తెలుగువాళ్ళ విషయంలోనే కాదు. అన్ని భాషలకూ వర్తిస్తుంది.

అసలీ సొదంతా ఎందుకు? పోయినవాళ్ళ గురించి ఇన్నేళ్ళ తరవాత వ్యక్తిపూజ చెయ్యడం అవసరమా?

తెలుగు మరుగున పడడానికి ఇంగ్లీషును మాత్రమే తప్పుపట్టి లాభం లేదు. మనతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం తక్కువే. ఆ కారణంగా అక్కడివారు సాప్ట్‌వేర్ తదితర ఉద్యోగాలకు పోటీ పడలేకపోతున్నారనే ఫిర్యాదుకూడా ఉంది. అయితే అక్కడివారికి జాతీయ, ప్రాంతీయ సంస్కారం పెరిగిందా అంటే అవునని చెప్పలేం. ఇంగ్లీషు మానేస్తే సరిపోదు; మాతృభాష గురించీ, సంస్కృతి గురించీ పిల్లలకు నేర్పడం తప్పనిసరి. మీడియా ఆ పని సవ్యంగా చెయ్యటంలేదు కనక తల్లిదండ్రులే అందుకు పూనుకోవాలి.

స్కూలు, కాలేజీల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకుని కాస్త పెద్దయాక పశ్చాత్తాపంతో తెలుగును గురించి తెలుసుకుందామనుకునేవారూ, కోల్పోయిన సంపర్కాన్ని మెరుగుపరుచుకుందా మనుకునేవారూ కనిపిస్తారు. వీరికి మంచి విషయాలను సులభపరిచయం ద్వారా తెలియజెయ్యడం ఒక బాధ్యతగా పెద్దవారు తీసుకోవాలి. ఆసక్తి లేనివారు ‘ఇదంతా అనవసరపు సుత్తి’ అనుకున్నా సరే. తమకు తెలిసిన విషయాలనూ, అనుభవాలనూ ఏదో ఒక విధంగా యువతరంతో పంచుకోవాలి. ఈ సందర్భంలో నేను గమనించిన ఒకటి రెండు విషయాలను ప్రస్తావిస్తాను.

చాలా ఏళ్ళ క్రితం మానాన్న కొడవటిగంటి కుటుంబరావుగారు (ఆయన శతసంవత్సర జయంతి అక్టోబర్ 28న మొదలయింది) ఒక ఇంటర్వ్యూలో తన ఆత్మకథ రాసే ఉద్దేశం లేదని చెపుతూ, తనకు తెనాలిలో చిన్నతనంలో పరిచయస్థులందరూ తరవాత ప్రసిద్ధికెక్కారనీ, ఆత్మకథ రాస్తే అదంతా నేమ్ డ్రాపింగ్‌లాగా ఉంటుందనీ అన్నారు. చక్రపాణి, సినీదర్శకుడు పి.పుల్లయ్య, ప్రముఖ నటుడు స్థానం నరసింహారావు, సినీనటులు సి.ఎస్.ఆర్ (మాయాబజార్ శకుని)., లింగమూర్తి, నటగాయకుడు రఘురామయ్య, ‘ఆంధ్రగంధర్వ’ గా ఆరోజుల్లో పేరు మోసిన జొన్నవిత్తుల శేషగిరిరావు (ఈ తరం సినీ రచయిత తాతగారు), షావుకారు సినిమాలో షావుకారు పాత్రధారి గోవిందరాజు సుబ్బారావు, డజన్ల కొద్దీ రచయితలు, మహాకవులు, సాహితీపరులు ఇలా అందరితోనూ ఆయనకు పరిచయాలుండేవి. ఆ రోజుల్లో వారెలా ఉండేవారో, ఎలా ఎదిగారో ఆ వివరాలన్నీ ఆయన ఎక్కడో అక్కడ చెప్పిఉంటే తరవాతి తరాలకు ఎంతో ఆసక్తికరంగా పరిణమించేది. కొన్ని వ్యాసాల్లో అరుదుగా తప్ప ఆయన ఆ పని చెయ్యలేదు. మహాకవి గురజాడకు శిష్యుడైన బుర్రా శేషగిరిరావు మా నాన్నకు ఉపాధ్యాయుడు. ఆయన గురించి కొంత తెలియజేశారు. విజయనగరంలో చదువుకున్నప్పటికీ ఆదిభట్ల నారాయణదాసును గురించి ఒక్క ముక్క రాయలేదు; నెగెటివ్‌గానైనా సరే! తరవాత గొప్ప సంగీతదర్శకుడైన సాలూరు రాజేశ్వరరావు ఏడో ఏట కచేరీ చెయ్యడం గురించి చెప్పారు. అంతే.

‘చందమామ’లో తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుత సీరియల్ రచనలు చేసిన దాసరి సుబ్రహ్మణ్యంగారిని ఈ మధ్య విజయవాడలో కలుసుకున్నప్పుడు ఆయన చక్రపాణిగారి గురించి వివరంగా రాయడానికి తాను నిరాకరించినట్టుగా చెప్పారు. ఎందుకు? అదంతా ‘రిఫ్లెక్టెడ్ గ్లోరీ’ అని! చక్రపాణిగారితో ఆయనకు రెండున్నర దశాబ్దాల పరిచయం ఉంది. ఇప్పుడు మన మధ్య లేని నాగిరెడ్డి, చక్రపాణి తదితరుల గురించిన స్మృతులన్నీ పంచుకోదగినవే అని ఇప్పటివారు అనుకోవచ్చు. 83 ఏళ్ళ వయసున్న సుబ్రహ్మణ్యంగారిని ఒప్పించడమే కష్టం!

ఈ పై ఉదాహరణలు రెండూ నిరాశ కలిగించేవే. గత తరం అనుభవాలను గురించి రాసే రచయిత ఎవరైనా సరే, వాటిని తన గొప్పలు చెప్పుకోకుండా వర్ణించినట్టయితే అవెంతో విలువైనవిగా తయారవుతాయి. ఇటువంటివాటిని నేమ్ డ్రాపింగ్‌ అనిగాని, రిఫ్లెక్టెడ్ గ్లోరీ అనిగాని అనుకోకూడదు. అలా అనుకుంటే మనకే నష్టం. ఇదొక రకమైన జర్నలిజం అనుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో రచయిత విలేకరిగా మాత్రమే పనిచెయ్యాలి. విషయం చెప్పేవాడి గురించికాక ప్రసిద్ధవ్యక్తిని గురించినదై ఉండాలి. చెపుతున్న విషయానికి ఇప్పటి సందర్భంలో ఎటువంటి ప్రాముఖ్యత ఉందో వివరించాలి.

అసలీ సొదంతా ఎందుకు? పోయినవాళ్ళ గురించి ఇన్నేళ్ళ తరవాత వ్యక్తిపూజ చెయ్యడం అవసరమా? కొంతవరకూ అవసరమే. వివిధ రంగాల్లో చెప్పుకోదగ్గ కృషి చేసినవారు మన సంస్కృతికి కాస్తకాస్తగా తోడ్పడినవారు. వారిని పూజించనక్కర్లేదుగాని సాంస్కృతిక విలువలు పెరగడానికీ, నిలదొక్కుకోవడానికీ వారేమేం చేశారో తెలుసుకుంటే ఒక జాతిగా మనం ఆ వారసత్వాన్ని మరింత బాగా కొనసాగించగలుగుతాం. ఎక్కణ్ణుంచి వచ్చామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో మరింత బాగా తెలుస్తుంది.

చాలా ఏళ్ళ క్రితం నేనొకసారి మా మిత్రుడి తండ్రిగారిని ఒకాయనని కలుసుకున్నాను. అప్పటికే ఆయనకు 85 ఏళ్ళు. ఆయనది విజయనగరమని చెప్పగానే నేనాయన్ని ‘మీకు గురజాడ అప్పారావుగారు తెలుసా?‘ అనడిగాను. ‘అయ్యో మేమంతా చిన్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాం‘ అని ఆయన చెప్పడం నాకు అద్భుతం అనిపించింది. ఎందుకంటే అప్పారావుగారు 1915లోనే మరణించారు. ఆయనను చూడలేకపోయినా ఆయనను బతికుండగా చూసినాయనను చూడగలిగాను! అదే గొప్ప. అంతకు ముందు అప్పారావుగారి మనుమడు ఒకాయన బొంబాయిలో తగిలాడు కాని ఆయన తన తాతయ్యను ఎన్నడూ చూడలేదట.

బ్లాగ్ రచయితలు పెరుగుతున్నారు. వారిలో కొందరికి తెలుగు స్పెల్లింగులు కూడా సరిగ్గా రాని మాట నిజమేగాని తెలుగులో రాయాలనే వారి ఉత్సాహం, తపన మెచ్చుకోదగ్గవి.

నేనీమధ్య చదివిన గొల్లపూడి మారుతీరావుగారి ఆత్మకథ ‘అమ్మ కడుపు చల్లగా‘ అనే ఆసక్తికరమైన పుస్తకంలో ఆయన తాను కలుసుకున్న ప్రసిద్ధులు అనేకుల గురించి క్లుప్తంగా, చక్కగా వర్ణించారు. వారిలో ప్రముఖ నటుడు, నాటక ప్రయోక్త కె.వెంకటేశ్వరరావు గురించి కూడా ఉంది. ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం 1960లలో ప్రసారం చేసిన కన్యాశుల్కం నాటకంలో వెంకటేశ్వరరావు దర్శకుడుగా, గిరీశంగా పోషించిన పాత్ర అద్భుతం. నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదివినప్పుడు ఆయన థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్‌గా ఉండేవారు. ఆయనతో గిరీశం పాత్రను గురించి ముచ్చటించడం, ఆయన దర్శకత్వం వహించిన రావిశాస్త్రి నాటకం ‘విషాదం’ చూడడం, ఆయన స్వయంగా నటించిన కనకపుష్యరాగం తిలకించడం ఎన్నటికీ మరిచిపోలేను. నటన గురించి ఆయన తరుచుగా ఇచ్చిన ఉపన్యాసాలు వినేవాళ్ళం. 1969లో గాంధీ శతజయంతికి ఆయన అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖలో నిర్వహించిన షాడోప్లే నోళ్ళు తెరుచుకు చూశాం. గొల్లపూడివారి పుస్తకం చదువుతూంటే ఆ అనుభవాలన్నీ గుర్తుకొచ్చాయి. మారుతిరావుగారికి ఇలా ఎందరితో మధురమైన స్మృతులున్నాయో కదా అనిపించింది.

పాతదంతా గొప్ప అని ఎందుకనుకోవాలి? దీనికి స్పష్టమైన సమాధానం లేదు. రాజకీయాలతో సహా ఏ రంగంలోనైనా రానురాను నిజాయితీ లోపించడం కనబడుతుంది. సినిమాల విషయం తీసుకుంటే సినీ గోయర్ డాట్‌కామ్ వంటి సైట్లలో నిర్మాతలతోనూ, డిస్ట్రిబ్యూటర్లతోనూ ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు కనబడతాయి. నేను గమనించినంతవరకూ 1970, 80ల తరవాత వచ్చినవారంతా ‘ఫలానా సినిమాలు తీశాం, ఫలానాది బాగా పోయింది, ఫలానాది ఫెయిలైయింది’ అని చెప్పడం మినహా మరేమీ కనబడదు. అదే ఏ బి.ఎన్.రెడ్డిగారో అయితే తమ సినిమాల కథ గురించో, ఇతివృత్తం గురించో చెప్పకుండా మానరు. సినిమాల్లో కళ వాసనలు పోయి వ్యాపారం మాత్రమే మిగిలిందని కొన్ని ఇంటర్వ్యూల్లో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది.

రాజకీయాలైనా, సినిమాలైనా, సాహిత్యమైనా వ్యాపారదృష్టి ప్రతి తరంలోనూ తప్పనిసరిగా కనిపిస్తుంది. అయితే దానితో బాటు ‘గ్రాఫు’ నిరంతరం కిందికే జారుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. కాలమహిమ అనాలేమోగాని 1960ల ‘మాస్’ సినిమాలు కూడా ఇప్పుడు క్లాసిక్స్‌లాగా అనిపిస్తాయి. అయితే బురదలోంచి పంకజం పుట్టినట్టు నవతరంగాలు లేస్తూనే ఉంటాయి. గత వైభవాన్ని తలుచుకున్న కొందరైనా పరిస్థితిని మార్చడానికి పూనుకుంటారు. ప్రస్తుతం మనకు కావలసినది అదే. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా స్ఫుర్తిని పొందే మార్గం అదేనేమో.

సాహిత్యానికి సంబంధించినంతవరకూ వ్యాపారదృష్టి లేని వెబ్ పత్రికలు ఔత్సాహిక రచయితలని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా విడేశాల్లో స్థిరపడ్డవాళ్ళు తెలుగును మరిచిపోకుండా ఉండడానికి ఇవి తోడ్పడుతున్నాయి. రాసే విషయాల్లో వైవిధ్యం పెరుగుతోంది. (నాకు తెలిసిన ఒక తెలుగు మిత్రుడు అమెరికాలో స్థిరపడే ముందు నార్వేలో నేవల్ ఇంజనీరింగ్ చదివి కెనడా ఉత్తర ప్రాంతాల్లో మంచులో దుర్భరపరిస్థితుల్లో నౌకలు నడిపాడట. తన అనుభవాలను వచ్చీరాని తెలుగులోనైనా సరే రాయమని నేను చాలా సార్లు అడిగాను కాని అతనింకా పూనుకోలేదు) బ్లాగ్ రచయితలు పెరుగుతున్నారు. వారిలో కొందరికి తెలుగు స్పెల్లింగులు కూడా సరిగ్గా రాని మాట నిజమేగాని తెలుగులో రాయాలనే వారి ఉత్సాహం, తపన మెచ్చుకోదగ్గవి.

ఒకప్పుడు సాహిత్యం పండితుల చేతుల్లో ఉండేది. 1930లలో మాసపత్రికలూ, వారపత్రికలూ రావడంతో ‘కాలక్షేపం’ కథలూ, కొత్త రచయితలూ పుట్టుకొచ్చారు. 1950, 60లు పత్రికలకు స్వర్ణయుగమే. ఆ తరవాత తెలుగువారికి ‘జనరల్’గా సాహిత్యంలో ఆసక్తి తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉండగా ఉద్యమసాహిత్యం ఊపందుకుంది. విప్లవరచనలూ, స్త్రీవాదం, దళితవాదం, ముస్లిం రచయితలూ, తెలంగాణా రచయితలూ పెరిగారు. కాలక్షేపానికి పుస్తకాలకు ప్రత్యామ్నాయంగా ముందు సినిమాలూ, తరవాత టీవీ వచ్చాయి. ఆ కారణంగా ఉద్యమాల్లో ఆసక్తిలేనివారితో కూడిన చదువుకున్న నిరక్షరాస్య సమాజం ఒకటి తయారయింది. ఈ రోజుల్లో ఏ ప్రోగ్రామింగో నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదించకుండా సాహిత్యం, భాష, సంస్కృతి అని మథనపడేవాళ్ళు వెర్రివాళ్లలా కనిపిస్తున్నారు. తెలుగు రాయడం, చదవడం వచ్చినవారి సంఖ్య తగ్గుతోంది కనక అవి రెండూ చెయ్యగలిగిన ‘వెర్రివాళ్ల’ మీదున్న బాధ్యత మరింత పెరుగుతోంది. భాషని బతికించవలసినది వాళ్ళే.

————————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) నుండి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త. తెలుగులో http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) అనే బ్లాగులు రాస్తూంటారు.

Posted in వ్యాసం | Tagged | 19 Comments

అక్టోబరు బ్లాగుల విశేషాలు

-చదువరి

తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల విప్లవం వస్తున్నట్టుంది. “అబ్బో.. నలభై యాభై దాటి వ్యాఖ్యలు వచ్చేస్తున్నాయం”టూ మేం ఆశ్చర్యపడిపోయి నిండా రెణ్ణెల్లు కాలేదు, ఇప్పుడవి వందకు చేరాయి. మనసులోమాట సుజాత రాసిన మీ చదువులు మా చావులు టపాకు వ్యాఖ్యలు వందకు చేరిన సందర్భంగా తెలుగు బ్లాగులు ఒక మైలురాయిని చేరుకున్నాయి.

తెలుగు మాధ్యమాలు బ్లాగులపై దృష్టి సారించాయి. బ్లాగులంటే ఏమిటో, ఎలా రాయాలో చెప్పే వ్యాసాలతో పాటు, వారం వారం ఒక బ్లాగును పరిచయం చేసే వ్యాసాలూ వస్తున్నాయి. వీటి ప్రభావం కూడలిలోనూ, బ్లాగు పాఠకుల సంఖ్యలోనూ తెలుస్తోంది. బ్లాగులు నిదానంగా జాలజనజీవనస్రవంతి లోకి జొరబడుతున్న సూచనలు కనబడుతున్నాయి.

రాజకీయాలు, చర్చలు
అక్టోబరు రాజకీయ బ్లాగులు మతము, మతఘర్షణల చుట్టూ ఎక్కువగా తిరిగాయి. చర్చలు కూడా ఎక్కువగా రాజకీయ బ్లాగుల్లోనే జరిగాయి. ఒరిస్సాలో జరిగిన హింసాకాండ నేపథ్యంలో మతమార్పిడులను చదువరి రక్తపాత రహిత కుట్రగా వర్ణించారు. అక్కడ జరిగిన చర్చ మహేష్ పర్ణశాలలో రాసిన టపాలో కొనసాగింది. అసలు వీటికి మూలం నాగప్రసాద్ రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే టపా! ఈ లోగా వాసిలి సురేష్ ఒరిస్సాలో జరిగిన దాడులకు మూలాలను వెతికారు. ఇదిలా ఉండగా అబ్రకదబ్ర అభి-మతం అనే టపాలో తన అబిప్రాయం రాసారు. క్రైస్తవం గురించి జాన్ హైడ్ కొన్ని టపాలు వేసారు. రామాయణం మీద వస్తూ ఉన్న టపాల వరుసలో మరొక టపా దుర్గేశ్వర రాసారు. ఇతర టపాల లాగానే ఇది కూడా చర్చకు వేదికయింది.

జ్ఞానపీఠానికి తెలుగువారిలో అర్హులెవ్వరు అంటూ ఒక చర్చ జరిగిందీ నెల. పూలదండను పట్టుకుని చంద్రమోహన్ జ్ఞానపీఠార్హులెవరంటూ వెదకబోయారు. కొత్తపాళీ కూడా ఈ పీటముడిని విప్ప ప్రయత్నించారు. త్రివిక్రమ్ అందుకుని జ్ఞానపీఠపు మర్మాన్ని కనుగొన ప్రయత్నించారు.

సాహిత్యం, సంగీతం

స్వగతాలు, స్వ గతాలు

సినిమా

హాస్యం, వ్యంగ్యం

ఇంద్రధనుస్సు

  • తిండి మీద దృష్టి సారించారు బ్లాగరులు. పప్పును మించిన పాకము కలదా అంటూ పప్పుసుద్ద శ్రేష్టత గురించి మాకినేని ప్రదీప్ రాస్తే, పప్పుల్లో మహాపప్పు కందిపప్పు అంటూ వ్యాఖ్యాతలు రాసారు.
  • వాసన పట్టేసిన భాస్కరరామరాజు ముద్దపప్పు గురించి ఓ టపా వేసారు. వివిధ రకాలైన పప్పులను తయారుచేసే ప్రోగ్రాములను అందరికీ అర్థమయ్యే రీతిలో రాసారు కూడా.
  • బాపు అనగానే రమణ గుర్తొచ్చినట్టు, పప్పనగానే ఆవకాయ గుర్తుకు రావడం ఆంధ్రుడి లక్షణం. తల్లక్షణ ఫలితమే విరజాజి పూయించిన ఆవకాయ పురాణం టపా!ఈ విధంగా పప్పావకాయతో అక్టోబరు బ్లాగులు రుచులూరిపోయాయి.
  • భోజనాలకి పిలిచి వేళకి భోజనం పెట్టకపోతే కలిగే బాధను తాడేపల్లి తన ఆఱు నూఱైనా…. లో వివరించారు.
  • గార్లపాటి ప్రవీణ్ ఓ సాయంత్రం – ఆఫీసు నుంచి ఇంటికి … అంటూ తన ఆలోచనాస్రవంతిని బ్లాగులో ప్రవహింపజేసాడు.
  • వివిధ బ్లాగులు, బ్లాగరుల పేర్లను స్పృశిస్తూ, గతంలో కొల్లూరి సోమశంకర్ పొద్దులో ఒక లేఖ రాసారు. ఇప్పుడు వివిధ బ్లాగరులను పలకరిస్తూ లీలామోహనంలో ఒక జాబు వచ్చింది. బ్లాగు పేర్లకు తగిన బొమ్మలు పెట్టడం ఈ టపా ప్రత్యేకత.
  • కురులను సంరక్షించుకోవటం ఎలా అనే విషయంపై శ్రీసత్య వరసగా టపాలు వేస్తున్నారు. వాటిలో ఈమధ్య వచ్చిన టపా ఇది.
  • నేను హార్లిక్సు తాగను, తింటాను అన్నట్టు, టీవీలో యాడ్లే చూస్తాను అంటూ చెబుతున్నారు పసిగుడ్డు.
  • శివుడాజ్ఞ అంటూ నిడదవోలు మాలతి ఒక కథ రాసారు. విశిష్టత ఏంటంటే.. రెండు ముగింపులను ఇచ్చి ఏది నచ్చిందో చెప్పండని పాఠకులను అడగడం.
  • భయం భయం అంటూ లచ్చిమి రాసిన టపా ఆకట్టుకుంది. తన అసలు పేరు రష్మి (చిన్నపిల్ల కావడంతో ర ను ‘ల’ గానూ, ‘ష్మి’ని ‘చ్చిమి’గానూ పలుకుతున్నదని అనిపిస్తోంది) అని ఎప్పటికి చెప్పగలుగుతుందో.
  • మహాత్ముడి పుట్టినరోజు మాటున మరుగునపడిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజును మననం చేసుకున్నారు సురేష్.
  • పొద్దులో ప్రచురింపబడి ప్రాచుర్యం పొందిన కైవల్యం కవితపై తన అభిప్రాయాన్ని రాసారు అరుణాంక్

కొత్త బ్లాగులు

ప్రత్యేక ప్రస్తావన
సుప్రసిద్ధులైన తెలుగువారి గురించి మనకు తెలీని ఎన్నో విషయాలను చెబుతూ సాగిపోయే బ్లాగు తెలుగురథం. మనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన మహామహుల జీవితాల గురించి, ప్రసిద్ధ సంఘటనల గురించి, పండుగల గురించి ఈ బ్లాగులో టపాలు వస్తూంటాయి. సందర్భోచితంగా – మహానుభావుల జయంతి లేదా వర్ధంతి రోజునగానీ, పండుగల రోజునగానీ, సంఘటనల వార్షికానగానీ – వ్యాసాలను వెలువరించడం ఈ బ్లాగు ప్రత్యేకత. పాత వ్యాసాలను చదువుకునేందుకు వీలుగా నెలవారీగా టపాలకు లింకులు ఇస్తే బాగుంటుంది.

తెలుగురథం చోదకులు కొంపెల్ల శర్మకు అభినందనలు

————————————-

చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

Posted in జాలవీక్షణం | Tagged , , | 23 Comments

ఉపజాతి పద్యాలు – ౪

కందం

— ముక్కు శ్రీరాఘవకిరణ్

మూడు ముఖ్యమైన ఉపజాతులు నేర్చుకున్నా మిప్పటి వరకూ, జాతులలో ముఖ్యమైన కందాన్ని నేర్చుకుందా మీ సారి. మామూలు మాటలు కూడా కందాల్లోనే చెప్తే బాగుంటుందేమోనని అనిపించేంతటి[1] నా కందానుబంధం ఈ వ్యాసపాఠానికి ఊపిరి పోయగలదని ఆశపడుతున్నాను.

కందపద్యలక్షణం

1. కందపద్యాల్లో కేవలం చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడుతారు. అంటే (ముందు చెప్పుకున్నట్టుగా) భ, జ, స, నల, గగ లు మాత్రమే ఉపయుక్తాలన్నమాట.
2. బేసి (1,3) పాదాలలో మూడేసి గణాలూ, సరి (2,4) పాదాలలో ఐదేసి గణాలూ ఉంటాయి (రెండు పాదాలకి మొత్తం ఎనిమిది గణాలు చొప్పున).
3. ఈ (రెండు పాదాలకీ కలిపి లెక్కబెడితే వచ్చే) ఎనిమిది గణాలలోనూ బేసి గణం జగణం కాకూడదు (లేదంటే కందంతో జగడం వస్తుంది). ఇలా ఎందుకు కాకూడదు అని తర్కించే కన్నా ఇలాంటి నియమముండడం వల్ల అందం పెరిగిందని కందపద్య గతినీ స్వరూపాన్నీ చూస్తే అర్థమౌతాయి.
4. అలాగే ఈ ఎనిమిది గణాలలోనూ ఆరవ గణం జగణం కానీ నలం కానీ అవ్వాలి. అంటే రెండవ పాదంలో మూడో గణం జ కానీ నల కానీ కావాలి. ఈ నియమం వల్ల కందంలో పొందిక (symmetry) పెరుగుతుంది.
5. తర్వాత ఈ ఎనిమిదో గణం చివర్న దీర్ఘం రావాలి (చదువుకోవడానికి అనువుగా). అంటే ఎనిమిదవ గణం గగ కానీ స కానీ అవ్వాలి.
6. కందపద్యం జాతుల కోవలోకి వస్తుంది కాబట్టి ప్రాస నియమం పాటించాలి (ప్రాసనియమం పాటిస్తున్నాం కాబట్టి జాతి అయ్యింది అని కూడా అనుకోవచ్చు).
7. ఏ పద్యమైనా యతి తప్పనిసరి. ఐతే కందపద్యాల్లోని బేసిపాదాలు చిన్నవి కాబట్టి ఆ బేసి పాదాలలో యతి చెల్లించకుండా, సరి పాదాలలో మాత్రం మొదటి నాల్గవ గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లిస్తాము.

కందమా… ఎందుకూ?

అందం కావాలన్నా
పొందిక క్లుప్తత సరళత పొందాలన్నా
కందమె తప్పనిసరి యని
ఛందోపాఠం నడుమన చక్కగ చెప్తా.

పైకిన్ని నియమాలు కనబడ్డా ఈ నియమాల ఉండడం వల్లే కందానికి మాత్రమే పరిమితమైన ఒక వింత అనుభవైకవేద్యమైన సోయగం అబ్బుతుంది. లేకపోతే కందంలో ఉన్న(న్ని) చాటువులు వేరేవాటిల్లోనూ ఉండేవే కదా?

చిన్న పదాలతో తయారైయ్యే చిన్న చిన్న పద్యాలు కందాలు. వస్తువు చిన్నగా ఉన్నప్పుడు కందాన్ని ఎంచుకోవడం వల్ల వచ్చే అందం ఒక రకమైతే, గహనమైన లేదా కష్టమైన విషయాలని చెప్పేటప్పుడూ కందాన్నే తీసుకోవడం వల్ల వచ్చే శోభ వేరొక రకం. కష్టమైన విషయాలేముంటాయీ అంటారా… మన సమస్యాపూరణాలే తీసుకోండి ఉదాహరణకి. బలరాముడు సీతఁ జూచి ఫక్కున నగియెన్ అన్న సమస్య చాలు విషయాన్ని ఎంతైనా జటిలం చేయచ్చు కందంలో అని నిరూపించడానికి.

ఇప్పుడు కందమొకటి వ్రాద్దామా?

వస్తువేం తీసుకుందాం? పూర్వకవులకి అందరికీ కంద-నమస్కారం చేద్దామా? నన్నయ తిక్కన ఎఱ్ఱన పోతన శ్రీనాథుడు పెద్దన తిమ్మన ధూర్జటి మొల్ల … ఇత్యాదులు, అందరికీ వందనములు.

గమనించే ఉంటారు, అందరికీ వందనములు అన్నప్పుడు మూడవ గణం (అదే ద-న-ము-లు) నలం ఔతోంది. కాబట్టి దానిని యథాతథంగా చక్కగా ఒక సరి పాదం ప్రారంభంలో వాడుకోవచ్చు. అప్పుడు అం తో యతి సరిపోయేలా (నాలుగైదు గణాలకి) పదాలు ఎంచుకోవాలి. యతి సరిపోతోంది కాబట్టి వందనములు అన్న పదాన్నే వాడెయ్యొచ్చు. ఐతే అందరికీ కి వందనములు కి మధ్యలో ఏం చెప్పాలో గణాలు సరిపోయేలా చెప్పాలి. శతసహస్ర అనచ్చు, వేలవేల అనచ్చు, భక్తియుక్త అనచ్చు, వినయసహిత అనచ్చు… ఇలా మన ఇష్టం. మూడో గణం జగణమో నలమో అయ్యేలా చూసుకోవాలి అంతే. అలాగే వందనములు తరవాత ఓ గురువు రావాలి కదా… అప్పుడే పాదం పూర్తయినట్టు. వందనములు తర్వాత గురువేం చెప్తాం? బాగోదేమో? కాబట్టి, అందరికీ వందనములు అన్నదాన్ని అలగే వదిలేసి యతి సరిపోయేలా పదాలు వెతుక్కోవడమో లేదా అందరికీ వందనములు ప్రయోగాన్ని బేసి పాదంలో వాడుకోవడమో చెయ్యాలి.

ఇప్పుడు ఈ ఆలోచనలు అన్నీ కాసేపు పక్కన పెట్టి అసలు ప్రాస సరిపోయేలా పదాలు ఏం వాడాలో చూద్దామా? ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు[2], కంద వందనం. మరి నాలుగో ప్రాసకి ఏం చేయాలి? సందర్భం, నందనం, అందలం, సుందరం, మంది, సందు, సందడి, వంద, చందము, ఛందస్సు, జందెము, చిందులు, కందువ, తుందురు, తొందర, చిందర వందర, పంది, ఇందు, కందులు, కుందె, నింద. చూసాం కదా, ంద ప్రాసాక్షరం కుదిరేలా పదాలు కో…కొల్లలు[3]. ఇప్పుడు వీటిలో ఏరుకుందాం మనకి కావల్సినవాటిని, ఎంత సులభం! సుందర అని మొదలు పెడదామా పద్యాన్ని? సుందర, అందమైన. ఏది అందమైనది? తెలుగు కవుల గురించి చెప్పదలుచుకున్నాం కాబట్టి తెలుగు సుందరమైనది, మన కవుల కవితలు సుందరమైనవి. సుందరమైన కవిత్వము అని చెప్పచ్చు. మొదటి పాదం ఐపోయింది! సుందరమైన కవిత్వము.

అటువంటి కవిత్వాన్ని మనకి ఇచ్చిన కవులకి నమస్కారం అని కదా చెప్పాలి. ఇప్పుడు సుందరమైన కవిత్వము అనేశాం కాబట్టి అందించిన అనచ్చు. ప్రాస కూడా సరిపోతోంది. సుందరమైన కవిత్వము నందించిన. ఇప్పుడు కనీసం ఒక్కరి పేరైనా చెప్పాలి కదా. పోతన లేదా ఆదికవి నన్నయ గారిని పేరు చొప్పిద్దాం. అందించిన అన్న తర్వాత ఇంకా రెండు మాత్రలు రావచ్చు, జగణమో నలమో వచ్చే ముందు. పోతన లేదా నన్నయ అన్నప్పుడు రెండూ భగణాలే కాబట్టి పోతన లేదా నన్నయ అని ఇక్కడే వెంటనే చెప్పచ్చు. ఇప్పుడు మొదలైన అని చెప్పాలి. మొదలైన. లై కి అం కి యతి సరిపోయినా అంత అందంగా లేదు. పోనీ మొదలైనకి బదులు ఏమైనా (పర్యాయ) పదాలు వాడగలమా? ఆది అనచ్చు. పోతనాది లేదా నన్నయాది. ఇప్పుడు మాటల క్లుప్తతా పెరిగింది, మొదలైన ఉన్నంత ఎబ్బెట్టుగానూ లేదు. తర్వాత? వీరంతా ఎవరు? కవులు. కవులు యతి కూడా సరిపోతుంది. కవులు అందరికీ నమస్కారం. కవులందరికీ నమస్కారం. కవులందరికీ నాలుగైదు గణాలకి సరీగ్గా అతికినట్టు సరిపోతుంది. ఇప్పుడు రెండో పాదం పూరించాం అందించిన నన్నయాది (పోతనాది) కవులందరికీ అని.

ఇప్పుడు మనం వాళ్లకి నమస్కారం ఎందుకు చేద్దావఁనుకున్నాం? ఏదో కందాలు వ్రాయడం నేర్చుకుంటున్నాం. ఆ కందాలు నేర్చుకుంటూ వందనాలు చేస్తున్నాం. పెద్దవాళ్ళకి నమస్కరిస్తే వాళ్ల ఆశీర్వాదం మనకుంటుంది. మనకన్నా పద్యంలో పైన చెప్పుకున్నట్టుగా పోతనాది కవులంతా గొప్పవారే కాబట్టి మరీ మంచిది. అ…య్యొ! కందాలు నేర్చుకుంటూ అన్నది మూడో పాదంగా వాడేసుకోవచ్చునే. ఐతే మనకిప్పుడు చివరి పాదం మాత్రమే మిగిలింది వ్రాయడానికి. వందనములు అని మొదలుపెడదాం. వందనములు చేస్తున్నాం. వందనాల ద్వారా మన గౌరవాన్ని చూపిస్తున్నాం. వందనాలు అనే పుష్పాలు సమర్పిస్తున్నాం. వందనాలనే నందనవనంలో విరబూసిన పూలని అందిస్తున్నాం. వందన నందన పుష్పాలు. పుష్పాలు అంటే గణాలు సరిపోవు కాబట్టి సుమములు అందామిక్కడ. ఆ పూలని ఏం చేస్తున్నాం? అర్పిస్తున్నాం. అర్పిస్తున్నాం అని అలాగే వాడేసుకోవచ్చు. అప్పుడు నాలుగో పాదం… వందన నందన సుమములు అర్పిస్తున్నాం. వందన నందన సుమముల నర్పిస్తున్నాం.

పద్యం పూర్తయ్యింది:

సుందరమైన కవిత్వము
నందించిన నన్నయాది (పోతనాది) కవులందరికీ
కందాలు నేర్చుకుంటూ
వందన నందన సుమముల నర్పిస్తున్నాం.

కందం వ్రాసినవారే కవి

ఇది బాగా ప్రసిద్ధిచెందిన నానుడి. కందానికి నియమాలెక్కువ కాబట్టి ఇలా అన్నారని తెలుస్తున్నా నేను దీనితో పూర్తిగా ఏకీభవించలేను. కవిత్వాన్ని కందంలో చెప్పగలవాడే (గొప్ప) కవి అనాలి అంటాను. లేకపోతే కవిత్వం కాని మామూలు మాటలు కూడా కందాల్లో చెప్పాలని ఉవ్విళ్లూరే నాలాంటివాళ్లందరూ కవులమైపోమూ!

అభ్యాసం

కందం ఎలా వ్రాయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చేయవలసినవి.

(అ) చంకలు గుద్దుకోవడం… కందం ఒకటి వ్రాసాం కాబట్టి 😉

(ఆ) బద్దెన గారి సుమతీ (కంద-పద్య) శతకాన్ని తలచుకోవడం

(ఇ) మరో కందం వ్రాయడం (మీకు తోచిన వస్తువు తీసుకోండి).

(ఈ) ఈ కందపద్య సమస్యకి పూరణ చెయ్యడం: మొగుడు పడతి కాలు పట్టె ముదమున సభలోన్.


[1]

శ్రీరాఘవకిరణని నా
పేరు గృహాహ్వయము ముక్కు వేంగీనాట్లం
శ్రీరాముడు కులదైవత
మూ రమలాపురము కందములు నా కిష్టం.

[2] ప్రస్తుతానికి ఈ ప్రయోగపు కాపీహక్కులు కాకర్ల కులోద్భవుడైన త్యాగరాజు గారి దగ్గర కొనుక్కున్నాం అనుకుందాం…

[3] బిందు సహిత దకారానికి ప్రాస సరిపెట్టడం సుళువే. కానీ ఇలా కాకుండా కొన్ని ప్రాసాక్షరాలకి పదాలు వెతుక్కోవడం చాల కష్టం. అలాంటప్పుడు దానిని దుష్కర ప్రాస అని వ్యవహరిస్తారు. విశ్వనాథవారి కల్పవృక్షంలో ఇలాంటి ప్రయోగాలు బోలెడు. ఉదాహరణకి ఓ పద్యంలో ఆయన క్ష్ణ అన్న పదంతో ప్రాస సరిపెట్టారు!

—————————————————-

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.

Posted in వ్యాసం | Tagged | 10 Comments