ఉపజాతి పద్యాలు – ౩

సీసము

–ముక్కు శ్రీరాఘవకిరణ్

సీసపద్యం ఉపజాతులో దొడ్డది, ముఖ్యమైనది, అందమైనది, గంభీరమైనది. శతకాలని ప్రక్కన పెడితే అసలు అసంఖ్యాకంగా సీసపద్యాల్లేని కావ్యమే లేదంటే అతిశయోక్తి కాదేమో.

      మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు

      కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

      ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ గనకాంబర ప్రభఁ గ్రందుకొనఁగఁ

      శ్రవణరంధ్రముల నీ సత్కథల్ పొగడంగ లేశ మానందంబు లేని వాఁడు.

      పరిచయానుద్రిక్త పరిరంభ సమయానఁ ప్రియురాలి యెద చెమరిచినంత

ఇవి మచ్చుకి కొన్ని సీసపద్యాల ప్రారంభాలు. మొదటి రెండూ పోతన భాగవతంలోనివి, తరువాతి పద్యం ఆంధ్రనాయక శతకంలోనిది, తరువాతిది నరసింహ శతకంలోనిది, చివరది విశ్వనాథవారి తెలుఁగు ఋతువులు కావ్యంలోనిది.

ఇప్పుడు సీసపద్యానికి సంబంధించిన లక్షణం చూద్దామా?

తే.గీ.

ఆరు ఇంద్రులపై సూర్యగణపు జంట
ఒకటి మూడు గణములకు మొదటి యతిని
ఐదు నేడు గణములకు మరొక యతిని
పాదపాదమునకు చెప్పవలయు మరియు

తే.గీ.

ప్రాస లే దుపజాతి కాబట్టి యట్లె
ప్రాసయతి యతికి బదులు వాడవచ్చు
నాల్గు పాదముల నిటుల నడుపవలయు
సీస పద్యపు లక్షణ చిత్రణ మిది

ఆ.వె.

తేటగీతి కాని ఆటవెలది కాని
సీసము వెనువెంట చెప్పవలయు
ఉన్నతంబు సీస ముపజాతి పద్యంబు
లందు దానిఁ నేర్చుకొంద మిటుల

సీసపద్య లక్షణం –

(అ) సీస పద్యంలో నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదంలోనూ ఆరు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలూ ఉంటాయి.
(ఆ) ప్రాస నియమం లేదు.
(ఇ) ప్రతి పాదంలోనూ మొదటి మూడవ గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లించాలి. అలాగే మొదటి యతితో సంబంధం లేకుండా ఐదవ ఏడవ గణాల మొదటి అక్షరాలకి తిరిగి యతి చెల్లించాలి. అంటే ప్రతి పాదానికీ రెండు సార్లు యతి చెల్లించాలన్నమాట!
      “మలాక్షు నర్చించు రములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ”
అన్నచోట మొదటి మూడవ గణాల మొదటి అక్షరాలు క-క యతి చెల్లింది. అలాగే ఐదు ఏడు అక్షరాలు శ్రీ-జి లకి కూడ యతి చెల్లింది.
(ఈ) ఉపజాతి కాబట్టి యతికి బదులుగా ప్రాసయతి చెల్లించవచ్చు.
(ఉ) సీసపద్యం చెప్పాక విధిగా ఒక ఆటవెలదిని కానీ, ఒక తేటగీతిని కానీ చెప్పాలి. అప్పుడే సీసం పూర్తయినట్టు.

సీసాలు గాంభీర్యంగా ఉండడానికి కారణం వాటిల్లో ప్రతీపాదానికీ ఉన్న ఆరు ఇంద్రగణాలు. వాటిల్లో ప్రత్యేకంగా సగ, నల, ర, త అనే ఐదు మాత్రల గణాలు సీసానికి క్రొత్త అందాన్నీ, మంచి గతినీ, గాంభీర్యాన్నీ ఇస్తాయి. ఇప్పుడు పైన ఉదహరించినవాటిని మరొకసారి చదవండి, మీకే తెలుస్తుంది.

ఇప్పుడు ఒక సీసపద్యం వ్రాయడానికి ప్రయత్నిద్దామా? విషయమేం తీసుకుందాం? వానల్ని వస్తువుగా తీసుకుంటే… నీలిమేఘాలు, ఉరుములు మెరుపులు, గాలి, వాన, జలధార, నిండిన చెరువులు, తడిసిన చెట్లు గుట్టలు, సంతోషించిన బీళ్లు, రైతుల సంబడం, చిన్నపిల్లల కాగితం పడవలు, గుంటల్లో నిలిచిన వర్షపు నీరు, ఇలా అనేకం గుర్తుకు వస్తాయి.

ఇక పద్యం ప్రారంభిద్దామా? నీలి మేఘాలు అనే మొదలుపెట్టొచ్చు. అప్పుడు నీ కి యతి సరిపోయే పదాలు… నిర్మల, నీరజ, నింగి ఇలా వీటిలో మనం చెప్పదల్చుకున్న భావానికి సరిపోయేలా పదాన్ని ఎంచుకోవాలి. నిర్మల అని ఎంచుకున్నామనుకోండి. నిర్మల ఆకాశంలో నీలిమేఘాలు అని చెప్పచ్చు కదా. అప్పుడు నిర్మల+ఆకాశంలో=నిర్మలాకాశంలో ఉఁహుఁ గణాలు సరిపోవు. నిర్మలాకాశాన అంటే సరిపోతుంది. నిర్మలాకాశాన నీలిమేఘాలు వచ్చాయి. నిర్మలాకాశాన నీలిమేఘాలొచ్చె అని ఒక నాలుగు ఇంద్రగణాలు. ఆ నీలిమేఘాలేం చేశాయి? వాటితో ఉరుములు మెరుపులూ తీసుకొచ్చాయి. ఉరుములూ మెరుపులూ అంటే రెండు ఇంద్రగణాలు. ఇపుడు కి యతి సరిపోయేలా రెండు సూర్యగణాలు కావాలి. ఉ-ఊ-ఒ-ఓ సరిపోతాయి కాబట్టి తోడు, దూరము, తుమ్ము, తూనీగ, తూర్పు, తొలగు… వీటిలో తోడు తీసుకుంటే తోడు వచ్చె అనచ్చు. అప్పుడు మొదటి పాదం నిర్మలాకాశాన నీలిమేఘాలొచ్చె ఉరుములూ మెరుపులూ తోడు వచ్చె. ఇప్పుడు వ్యాకరణం. నీలిమేఘాలొచ్చెన్+ఉరుములూ=నీలిమేఘాలొచ్చె నురుములూ మెరుపులూ తోడు వచ్చె. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు మీకు. ను కి తో కి యతి సరిపోదు కదా అని. ఇక్కడే ఒక చిన్న సూత్రం ఉంది యతి విషయంలో. సంధి జరిగితే ఆ పరపదం (సంధిలో రెండవ పదం, ఇక్కడైతే ఉరుములూ) మొదటి అక్షరాన్ని తీసుకోవచ్చు యతికి అని. కాబట్టి భేషుగ్గా యతి సరిపోతుంది. హమ్మయ్య! మొదటి పాదం పూర్తయ్యింది:

      నిర్మలాకాశాన నీలిమేఘాలొచ్చె నురుములూ మెరుపులూ తోడు వచ్చె.

ఇప్పుడు రెండవ పాదం. సూర్యుణ్ణి కాసేపు పక్కకు నెట్టి చక్కగా ఆకాశాన్ని ఆక్రమించుకుని ధారగా వర్షం కురిసింది అని రెండవ పాదంలో చెబుదామా? సూర్యుణ్ణి కాసేపు అంటేనే రెండు ఇంద్రగణాలు. సూ కి యతి సరిపోయే పదాలు (చ-ఛ-జ-ఝ-శ-ష-స) చూపులు, చోద్యం, చురుకు, జోల, శూర్పము, సుఖము, సూక్తి లాంటివి. అదే కాసేపు సూర్యుణ్ణి అన్నామనుకోండి అప్పుడు కా తో యతి సరిపోయే పదాలు కాంతి, కైత, కౌమారం, గది, గమనిక, గాంధారం లాంటివి వేసుకోవాలి. మనకీ రెండిటిలో ఏది ఎక్కువ సౌకర్యంగా ఉంటుందో ఆ క్రమంలో సూర్యుణ్ణి, కాసేపు పదాలని పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు సూర్యుణ్ణి అనడం సౌకర్యంగా ఉంటుందనుకుంటే అపుడు కా తో యతి సరిపోయే పదాలలో గగనాన నెట్టేసి అనొచ్చు. గగనమని ఇక్కడ ఆకాశానికి పర్యాయపదం వాడుకున్నాం అంతే. కాబట్టి మొదటి నాలుగు ఇంద్రగణాలూ కాసేపు, సూర్యుణ్ణి, గగనాన, నెట్టేసి. గగనాన నెట్టేసి కంటే గగనాన దాచేసి అంటే బాగుంటుందేమో అంటారా. సరే, అలాగే కానిద్దాం.

దాచేసి మేఘాలేం చేస్తున్నాయి? గాలితో దోబూచులాడుతున్నాయి. తర్వాత వర్షిస్తున్నాయి. దోబూచులాడితో ప్రారంభించచ్చు లేదా దోబూచులాడి అని పాదం చివరకి తోసేయొచ్చు. చివరకి తోసేసాం అనుకోండి. అప్పుడు బూ తో యతి కుదిరే పదాలు… గాలికి పర్యాయపదాలు… సమీరం, మారుతం, పవనం, వాతం… అబ్బే, సరిగా కుదరట్లేదు. సరే దోబూచులాడి ని సైయాటలాడి గా మారిస్తే? అప్పుడు యా () కి యతి సరిపోయేలా హాయిగా గాలితో అనచ్చు. ఇప్పుడేమైంది? హాయిగా గాలితో సైయాటలాడి – ఒక అక్షరం ఎక్కువైంది. సై ని సైడ్ చేస్తే? హాయిగా గాలితో ఆటలాడి. చక్కగా ఉంది. ఇప్పుడు రెండవ పాదం పూర్తయ్యింది:

      కాసేపు సూర్యుణ్ణి గగనాన దాచేసి హాయిగా గాలితో నాట లాడి. (సంధులు గట్రా వస్తాయి కదా!)

ఇలాగే మూడు నాలుగు పాదాలని పూరించవచ్చు. తర్వాత మనకి బాగా సుళువైన పనే. ఆటవెలదో తేటగీతో చెప్పడం, అంతే! చిన్న చిన్న పదాలతో భారీ సమాసాలు లేకుండా చెప్పాలని ఉబలాటపడితే ప్రస్తుతానికి నాకు ఇలా తోచింది…

సీ.

నిర్మలాకాశాన నీలిమేఘాలొచ్చె
      రుములూ మెరుపులూ తోడు తెచ్చె

కాసేపు సూర్యుణ్ణి గనాన దాచేసి
      హాయిగా గాలితో టలాడి

మేఘాలు గర్జించె మింటిలో చిత్రంగ
      సుధపై కురియంగ వానజల్లు

పూర్తిగా తనయొక్క పురివిప్పి వానలో
      నిలువునా తడియుచూ నెమలి యాడె

తే.గీ.

వానతో పాటు హరివిల్లు చ్చి నిలచె
లకమాడ నిలచు చెట్లు స్నానమాడె
వాన నీటితో బాగుగా వాగు నిండె
పిల్లలందరూ పడవలు విడుచు కొఱకు

ప్రస్తుతానికి నేను వ్యాకరణాన్ని కొంచెం పక్కన పెట్టాను విశదీకరించడం కోసం. కానీ పద్యాలు వ్రాసేప్పుడు వ్యాకరణం తప్పకుండా చూసుకోవాలి.

తర్వాత, సీసాలతో కలిపి మనం ఇప్పటికి మూడు రకాల ఉపజాతుల గురించి (ఆటవెలది, తేటగీతి, సీసం) ఎలా వ్రాయాలో చెప్పుకున్నాం. ఈ మూడూ కాక మరొకటి ఉంది – మంజరీ ద్విపద అని. దాని గురించి ద్విపదలు చెప్పుకున్నపుడు మాట్లాడుకుందాం. ఇంతటితో ఉపజాతులు నేర్వడం పూర్తయినట్లే. దీని తరువాత జాతులు – ముఖ్యంగా కందపద్యం గురించి మాట్లాడుకుందాం.

ఇప్పుడు మీకు నేనిచ్చే అభ్యాసం:

(1) మీకు నచ్చిన ఏదో ఒక (అందమైన లేదా గంభీరమైన) అంశం మీద సీసం, దానిపై ఆటవెలది వ్రాయడం.

(2) ఈ మూడు పద్యాలకీ సంబంధించిన పాఠాల మీద మీ అభిప్రాయాన్ని తేటగీతిలో తెలపడం.

(3) వీలు చూసుకుని నరసింహ శతకమో, ఆంధ్రనాయక శతకమో చదవడం. నాకు తెలిసిన రెండు సీసపద్య శతకాలివి. (ఈ అభ్యాసం నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేనూ చదవలేదు కాబట్టి!)

—————————————————-

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

4 Responses to ఉపజాతి పద్యాలు – ౩

  1. చంద్రమోహన్ says:

    రాఘవ గారూ,

    “ఉరుములూ మెరుపులూ తోడు తెచ్చె” అన్న పాదంలో ‘ఉ’-‘తో’ లకు యతి కుదరదు. అచ్చుల మైత్రితో బాటు హల్లుల మైత్రి కూడా ఉండాలి. ఒక అచ్చుకూ మరో హల్లుకూ యతి మైత్రి కుదరదు.

    అభినందనలతో,
    చంద్ర మోహన్

  2. “ఉరుములు మెరుపులున్ తోడు తెచ్చె”అంటే సరిపోతుంది

  3. కిరణ్ గారూ ! ఉపజాతులను గూర్చి చెప్పే సందర్భంలో మీరు ఉప జాతులను గూర్చి వివరిస్తూ సీస పద్య లక్షణాన్ని తేట గీతి పద్యంలో వివరించే ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.ఐతే మొదటి మూడు పాదాలలోనూ యతి సరిపడివుంటే బాగుండేది. ఆంధ్రామృతం బ్లాగులో యతులను గూర్చి కొంచెం వివరించడం జరిగింది.అవి మీకేమైనా ఉపయోగ పడతాయేమో చూడండి.

  4. రాఘవ says:

    చంద్రమోహన్ గారూ, బాలకృష్ణమూర్తి గారూ, రామకృష్ణారావు గారూ,
    మీరు పై వ్యాసంలోని దోషాలను ఇక్కడే సరిదిద్దడం (వ్యాసాన్ని చదివేవారికి) ఉపయోగకరంగా ఉంది. కృతజ్ఞుణ్ణి.

    నేను ఈ నాలుగు వ్యాసాలూ వ్రాసి ప్రొద్దుకు పంపే సమయానికి నాకు మీరు చెప్పిన యతి నియమాలు అన్నీ తెలియవు. యతులు నాకు ఎలా అర్థమైయాయో అలానే వ్రాసి ఇచ్చాను. ఆటవెలది వ్యాసం ప్రచురించాక మా కామేశ్వరరావు మాస్టారు చెప్పాక పై యతి నియమం తెలిసింది. కాని వ్యాసాలను అప్పటికే ప్రొద్దుకు పంపియుండటం చేత యతులు సరిపోయేలా మార్చడం కుదరలేదు. నేనూ సరైన శ్రద్ధ చూపలేదు.

    యతులకు సంబంధించి ఇన్ని విషయాలు ఉన్నాయని నాకు ఇప్పటివరకూ తెలియదు. ఎందుకంటే… నేను ఛందస్సు నేర్చుకోవడానికి ఎవరివద్దకూ వెళ్లకపోవడంవలన, కనీసం ఏ ఛందస్సుకి సంబంధించిన చక్కటి పుస్తకమూ చూడకపోవడంవలన, నేర్చుకున్న కొన్ని విషయాలు కూడ నేను పూర్వుల పద్యాలు చదివి గ్రహించడంవలన, అందులోనూ నేను చదివినవే చాల తక్కువకావటం వలన.

    రామకృష్ణారావుగారి పుణ్యమా అని ఆయన బ్లాగుద్వారా ఇన్ని రకాల యతులూ ప్రాసలూ ఉన్నాయని తెలిసింది. ఏదో ఒక యువ ఇంజినీరు పద్యాలు వ్రాయడం చూసి వ్రాయని వారికి కొందరికైనా ప్రోత్సాహాన్నందించినట్టుగా ఉంటుందని నన్నడిగితే ఇన్ని లోతుపాతులు ఉన్నాయని తెలియకుండానే జబ్బలు చరిచేసుకుని నా ఇష్టం వచ్చినట్లు వ్రాసి ఇచ్చినందుకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అందువల్ల ప్రొద్దువారికి, ఈ వ్యాసాలు చదివినవారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా దోషాలని ఎత్తి చూపి సరిదిద్దినవారికి, అలా సరిదిద్దడం ద్వారా నాకు నేర్చుకోవడానికి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

Comments are closed.