అనుభూతి

-ఆత్రేయ కొండూరు

వలయంలా
చందన కాష్ఠాలను పేర్చుకుంటూ
వాటి మన-సు-గంధాలను
మనసారా ఆఘ్రాణిస్తూ

నుదుటినంటిన ఆకాశ
సిందూరాలను చెరుపుకుంటూ
ప్రజ్వలిత హిరణ్యగర్భుని
తలక్రింద ప్రేమగ పొదువుకుంటూ
నిష్కల్మషమైన నిప్పుకు
ప్రక్షాళిత నివురునవుతూ
నా గాథకు జ్ఞాపకమవుతూ

హవ్యవాహనుడి ఆలింగనాలలో
ప్రతికణమూ తనలో కలుపుకుంటూ
తనువు నీడుస్తూ, తపన చాలిస్తూ
చీకట్లు కాలుస్తూ భువిని గెలుస్తూ

చిటపటార్భాట పరిష్వంగాల్లో
ధూప విలయ నృత్య సాక్షాత్కారంతో
ముగిసిన కల అదో అవ్యక్తానుభూతి !!

—————————

బంధాలను సుదూర తీరాల్లో వదిలి,
అనుబంధాలను రంగు కాగితాల కోసం తాకట్టుపెట్టి,
ప్రవాసమో వనవాసమో తెలియని జీవనం గడుపుతున్న
మామూలు తెలుగువాడు

ఆత్రేయ కొండూరు. భావాలను భాషలోకి మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆత్రేయంటే చాలా అభిమానం.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

4 Responses to అనుభూతి

  1. radhika says:

    మీ కవితల్లో ఇంత బరువయిన.పెద్ద పెద్ద పదాలు వాడడం ఇప్పుడే చూస్తున్నాను.బాగుందండి.

  2. నాకు ప్రత్యేకంగా పెద్ద పదాలు వాడాలి చిన్నవి వాడాలి అని లేదండీ. తోచిన భావాన్ని వచ్చిన భాషలో రాశాను అంతే. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  3. నమస్తే. అనుభూతి లో చిక్కదనం పాలు ఎక్కువగా ఉంది. ఒక్కోసారి భాష చాటున భావం అందకుండా పోయే ప్రమాదం ఉంది. కవిత బాగుంది.. – భవాని

    [ఈ వ్యాఖ్య RTS నుంచి తెలుగులోనికి మార్చబడింది. -సం.]

  4. test tw says:

    test chestunna teluguloki ela translate avutundi ??

Comments are closed.