సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 1

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

మీకు పురాణ సాహిత్య పరిచయం కలిగించిన మీ నాన్న లక్ష్మి రెడ్డి గారి గురించి, అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా?

మా నాన్న అచ్చమైన మెట్టరైతు. వాన చినుకుల్ని నమ్ముకొని మెరకో బరకో దున్నుకు బతికే సన్నరైతు. మట్టిలో విత్తి, మొలకల్ని పైరుజేసి, పంటను ఇంటికి తెచ్చుకునేందుకు ఆయన దారుణమైన శారీరక శ్రమ చేసేవాడు. ఒక ఏడాది వానలు కురిస్తే, మరో మూడేళ్లు కరువులు తాండవమాడే సీమ గడ్డ మీద కేవలం వానను నమ్ముకొని భూమిని దున్నుకొని బతికేందుకు ఎన్ని అగచాట్లు పడాలో మెట్టరైతుకు మాత్రమే తెలుసు. మా అమ్మ కూడా మా నాన్నతోటి రెక్కలు ముక్కలు చేసికొని కష్టపడేది. తన కోపు ఏమాత్రం వెనకబడకుండా లాగేది. పొలంపని, ఇంటిపని, పిల్లల్ని సాకేపని.. ఒకటేమిటి?… ఆమె జీవితమంతా తీరిక లేకుండానే గడిపింది.

ఎంతలావు శారీరక కష్టం జేస్తోన్నా నాన్న తత్వం ప్రత్యేకం. పనికి పనికి మధ్య ఏమాత్రం విరామం దొరికినా అందరిలా వీధరుగులెక్కి పులిజూదాలూ, బారాకట్టలూ, పొద్దుబోని కబుర్లతో గడిపేవాడు కాదు. రంగనాథ రామాయణాన్ని చేతబట్టుకొనేవాడు. శ్రావ్యంగా చదువుతూ తనచుట్టూ కూచున్నవాళ్లకు అర్థం చెప్పేవాడు. నేను పుట్టక ముందునుంచి కూడా మాయింట్లో వ్యావసాయిక జీవితం నేపథ్యంగా యీ సాహిత్య వాతావరణం కూడా వుండేది. అక్షరజ్ఞానం వున్న చాలామంది రాయలసీమ రైతుల ఇళ్లల్లో లాగే మా యింట్లో కూడా పురాణ గ్రంథాలు వుండేవి.

అలాగని మానాన్న పాఠశాల చదువులేమీ చదువుకోలేదు. గొర్రెల వెంట, బర్రెల వెంట, పొలాల గట్ల వెంట ఆయన బాల్యం నలిగిపోయింది. భట్రాజుల వద్ద ఇసకలో వేళ్లు దిద్ది చదువుకొనే తోటి పిల్లల సహవాసం, చదువుపట్ల ఆయనలో ఏదో ఆసక్తిని రేపింది. తీరిక సమయాన్ని వాళ్లు ఆటలు పాటలుగా మలచుకొంటున్నపుడు తను అక్షరాల్ని గురించి తెలిసికొనేందుకు ప్రయత్నించాడు. నేర్చుకొన్న అక్షరాల్ని గొర్రెలవెంట వెళ్లినపుడు కొండబండల్ని పలకలుగా దిద్దుకొన్నాడు. బొట్టెకట్టెని బలపంగా మార్చి దుమ్ము నేలల మీద గుణింతాల్ని అధ్యయనం చేశాడు. దమ్మిడి దమ్మిడిగా కూడుకొన్న ఆయన శ్రమఫలం రంగనాథ రామాయణమై వచ్చి ఆయన చేతుల్లో కుదురుకొంది. పొలాలెంట, కొండలెంట గొర్ల కాపరిదనం రామాయణ పారాయణమై సాగింది. రంగనాథ రామాయణం కంఠతా వచ్చేసరికి ఆయనకు తెలుగు భాషాస్వరూపం కూడా తెలిసి వచ్చింది.

పెళ్లి ఆయన జీవితాన్ని బాలరాజుపల్లెకు చేర్చి వ్యవసాయదారునిగా మార్చినపుడు జానెడు కడుపు నింపుకొనేందుకు కరవులతో పోరాడుతూనే రంగనాథ రామాయణాన్ని జనం మధ్యకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. తిండిగింజలు తప్ప అక్షరాల్ని పండించుకోవటం తెలీని గ్రామస్తుల్ని రాత్రిళ్లు దేవాలయం లోకి చేర్చి గ్రంథపఠనం ప్రారంభించాడు. రమారమి యాభై సంవత్సరాల పాటు గ్రామస్తుల్నంతా ఒకచోట చేర్చి, వాళ్ల హృదయాలన్నిట్నీ ఒకే విషయం మీద లగ్నం చేయించటం ఒక అపురూప దృశ్యం. కావ్యభాష లోని రామాయణాన్ని మా పల్లె మాటల్లోకి తెచ్చి, రామునినోటా సీతనోటా మావూరి పలుకుబళ్లనే పలికించటం మాకు ముచ్చటగా అనిపించేది. పురాణ పాత్రలు కూడా మాలాగే మాట్లాడటం, ఆవేశపడటం, ఏడ్వటం వల్ల ఆ పాత్రలు మాకు బాగా మచ్చికయ్యాయి.

నేను బడిలో అడుగుపెట్టి అక్షరాలు కలబలుక్కొని గుణింతం సాధన చేస్తున్నపుడే మానాన్న రంగనాథ రామాయణాన్ని నా చేతబెట్టాడు. రామాయణం ద్వారానే నేను అక్షరాల్ని, పదాల్ని, వాక్యాల్ని చదవటానికి అలవాటు పడ్డాను. ఐదవ తరగతి దాటేసరికి ఆ ద్విపద కావ్యాన్ని స్వంతంగా చదివి చాలావరకు అర్థం చేసికొనేవాణ్ని. ఆ క్రమంలో నన్ను కూడా దేవాలయం ఎక్కించేవాడు నాన్న. నేను చదువుతూ వుంటే ఆయన అర్థం చెప్పేవాడు.

నన్నెప్పుడూ చదువుకొమ్మని పోరుతుండేవాడు ఆయన. వ్యవసాయ పనులు చెప్పేవాడు కాదు. ఎన్ని ఇబ్బందులొచ్చినా బడికే పొమ్మనేవాడు. ఆయన కళ్లెదుట నేనెప్పుడూ పుస్తకం చేతబట్టుకొని వుండాలి. పాఠ్యపుస్తకాలు ఎంతసేపని చదవాలి? అందుకే కథల పుస్తకాలు, నవలలు తోడయ్యాయి. క్రమేణా నా ప్రపంచం అదే అయ్యింది. విపరీతంగా చదవటం అనేది రాయటానికి దారితీసింది. మొదట పద్యాలు రాశాను. తర్వాత కవితలు.. కథలు… నవలలూ….

1987 లో సాహితీ సృజన మొదలుపెట్టక ముందు సాహిత్యంలో మీకుగల పరిచయమెట్టిది? మొదటగా మీరు కవిత్వాన్నెందుకు ఎంచుకున్నారు? తర్వాత ఏ పరిస్థితుల్లో కథలవైపు, ఆ తర్వాత నవలల వైపు మీ దృష్టిని సారించారు?

రాయటం అనే ప్రక్రియ నన్ను చిన్నతనంలోనే ఆకర్షించింది. ఆరు ఏడు తరగతులు చదివేటపుడే రాత్రిళ్లు గుడి ముంగిట పిచ్చిగుంట్లు చెప్పిన అల్లిరాణికథ వగైరాల్ని పగలంతా కూచుని నాదైన భాషలో కథగా రాసేవాణ్ని. అప్పటికే నాకు చందమామ, బొమ్మరిల్లు లాంటి కథల పత్రికలతో పరిచయం ఉండేది. అపూర్వ చింతామణి, భట్టి విక్రమార్క లాంటి పుస్తకాల్ని అంతులేని ఆపేక్షతో చదివి వున్నాను. జయరామిరెడ్డి అనే ఓ మిత్రుడు తెచ్చే డిటెక్టివ్ నవలల్ని క్లాసు పుస్తకాల మధ్య పెట్టుకొని దొంగతనంగా చదువుతుండేవాణ్ని. అందువల్ల మౌఖిక కథల్ని అక్షరాల్లోకి అనువదించాలనే తపన కలిగేది. రామాయణ భారతాలు చదివి చదివి పద్యాల నడక ఏదో నాకు అర్థమై, ఏడవతరగతి పరీక్షలు రాసిన తదుపరి వేసవి సెలవుల్లో సీసపు నడకలతో ఓ పద్యం కూర్చాను. సంసార విషయాలు పట్టించుకోకుండా పోరంబోకుగా తిరిగే మా బావను గురించిన పద్యం అది. ఎనిమిదవ తరగతి ప్రారంభంలోనే ఛందస్సు గురించి తెలిసికొన్న తర్వాత నేను రాసిన పద్యాన్ని సరిజూసికొంటే – నడక సరిపోయిందిగాని యతి ప్రాసల నియమాలు కుదరలేదు. తర్వాత పట్టుదల పెరిగి పదవ తరగతి దాటే లోపే ఐదొందలకు పైగా పద్యాలు రాశాను. వాటిలో కొన్ని పద్యాలు భారతిలో కూడా అచ్చయ్యాయి.

పల్లె వదిలి దగ్గరలోని పోరుమామిళ్లలో ఇంటర్మీడియెట్ చదివేటపుడు బాడుగపుస్తకాల షాపుల్లోని డిటెక్టివ్ నవలా సాహిత్యం నన్నాకర్షించింది. విపరీతంగా చదివాను. ఆ సమయంలోనే లైబ్రరీల్లో వారపత్రికలు కూడా పరిచయమయ్యాయి. పోటీల్లో బహుమతులు పొందిన కథలు నన్నాకట్టుకొన్నాయిగాని కథలేమీ రాయలేదు. ఎందుకంటే – ఆ కథల గురించీ, వాటి ప్రాశస్త్యాన్ని గురించీ నాకు వివరించిన వాళ్లు లేరు.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - దాదా హయత్

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - దాదా హయత్


నెల్లూరు వి.ఆర్ కళాశాలలో డిగ్రీ చదివే మూడేళ్లు యద్దనపూడి, యండమూరి, మధుబాబు లాంటి వాళ్ల సాహిత్యంతో బాటు వెంకట్రామ అండ్‌కోలో దొరికే తెలుగు ప్రబంధాలన్నీ చదివాను. డిగ్రీ తర్వాత దొరికిన తీరిక సమయం నన్ను ఆధునిక సాహిత్యం కేసి మరల్చింది. పోరుమామిళ్ల సాహితీ మిత్రులతో కలిసి చలం, శేషేంద్ర, సినారె, నగ్నముని, శ్రీశ్రీ, ఆరుద్ర, వడ్డెర చండీదాస్, శివారెడ్డి, గాలి నాసరరెడ్డి వగైరాల సాహిత్యాన్ని పరిచయం చేసికొన్నాం. ముఖ్యంగా చలం కథలు, మ్యూజింగ్స్, ఉత్తరాలు, అమరావతి కథలు, తెన్నేటి సూరి ఛంఘిజ్ ఖాన్, టాం మామ ఇల్లు, జమీల్యా, తల్లి భూదేవి వగైరాలు నన్ను వెంటాడి వేధించాయి. వెరయిటీ మాసపత్రిక అనుకొంటాను.. అందులో మపాసా గారి అనువాద నవల ‘దిబ్బ కొవ్వు’ నన్నెంతో ప్రభావితం చేసింది. అప్పుడే కొకు ను, శ్రీపాదను కూడా కొంతవరకు పరిచయం చేసికొన్నట్టు గుర్తు. ఆ సమయంలోనే నాకు వివిధ వార, మాస పత్రికల పరిచయం జరిగింది. అందులో కథల పోటీల్లో గెలుపొందిన కథలు నన్ను బాగా ఆకర్షించాయి. అవి మా జీవితాలకు దగ్గరగా ఉన్నవిగా అన్పించాయి. అలాంటి కథల్ని నేను కూడా రాయగలనేమో అన్పించింది.

కానీ నేను మొదట సమకాలీన కవిత్వం కేసే మొగ్గాను. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ వారం కవితగా ప్రచురణ కావటం కవికి ఒక సర్టిఫికెట్‌లా ఉండేది. నేను ఒకటి రెండు కవితలకే ఈ లక్ష్యాన్ని సాధించాను. చిన్నప్పట్నుంచి ఛందోబద్ధ పద్యాల్లో నలిగినవాణ్ని కాబట్టి కవిత్వాన్నే నా వాహికగా చేసికొన్నాను. బడి, నేను తను, మౌనఘోష, బడి పిల్లలు వగైరా కవితలతో కవుల లోకంలో పడ్డాను.

మంచి కవిత్వం రాస్తూ ఉన్నా, నాలో ఏదో అసంతృప్తి. నాకు తెలిసిన జీవితాన్ని అందులో సమగ్రంగా చెప్పలేక పోతున్నాననే లోటు. మొదట్నుంచి పురాణాలతో పరిచయం ఉన్నవాణ్ని. కథ, కవిత్వం కలగలిసిన ప్రక్రియ ఆ కావ్యాలు. నేను కవిత్వమే చెబుతున్నానుగాని కథ చెప్పలేక పోతున్నాననే అసంతృప్తి. అదిగో… ఆ వేదనే నాచేత కథ రాయించింది. నాకు తెలిసిన సంఘటనల్నే కథలుగా మలిచాను. కవిత్వంలో చెప్పలేని ఎన్నో విషయాల్ని కథలో చెప్పగలిగాను. కథలో చెప్పలేని జీవితాల్ని నవలల్లో చెప్పేందుకు ప్రయత్నించాను.

మీకు ఆధునిక సాహిత్యంతో పరిచయం ఎప్పుడు, ఎలా కలిగింది?

కనిపించిన పుస్తకాన్నంతా చదవటం అనే అలవాటులో నాకు తెలీకుండానే ఆధునిక సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. అది నా ఇంటర్మీడియెట్ రోజుల్లోనే అయి ఉండొచ్చు. అంతేగాని ఎవ్వరూ నాకు పనిగట్టుకొని ప్రత్యేకంగా చెప్పిన వాళ్లు లేరు. రోజూ చూస్తోన్న పత్రికల్లోంచి నేను గుర్తుంచుకోవటం వల్ల ఆ సన్నివేశం జరిగి వుండొచ్చు.

మీరు ఎటువంటి అంశాలను కవితలుగా రాస్తారు? ఎలాంటి అంశాలను కథలుగా రాస్తారు?

కవితలకూ కథలకూ ప్రత్యేక అంశాలంటూ ఎమీ వుండవు. హృదయాన్ని స్పందింపజేసిన అంశం, పదిమందికీ దాన్ని గురించి తెలియజెప్పాల్సిన ప్రత్యేకత కలిగిన అంశాన్ని మన స్పందన స్థాయిలోనే పాఠకుడు కూడా స్పందించేలా రాసే క్రమంలో అది కవితగానో, కథగానో రూపుదిద్దికొంటుంది.

———————-

రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

4 Responses to సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 1

  1. గిరి says:

    మొదటి ప్రశ్నలో వెంకటరామిరెడ్డి గారు తమ తలిదండ్రుల గురంచి చెప్పినవి నన్ను కదిలించాయి

  2. రచయిత సన్నపు రెడ్డి తో ముఖాముఖి ని ప్రారంభించినందుకు అభినందనలు!
    సాహిత్య కారుల్ని సాహితీ లొకానికి పరిచయం చేసే బృహత్తర ప్రయత్నాన్ని కొనసాగించడానికి ‘ పొద్దు ‘ సంపాదకవర్గ సభ్యులు పూనుకోవడం హర్షనీయం !

  3. viswam says:

    sahitikarula parichayalu vardhamanakavulaku manchi spoorthini kaligisai.poddu sampadaka varganiki krutagnatalu

  4. B.Indra sena reddy says:

    all the best to sannapureddy vankatarami reddy to achieve many goals in future

Comments are closed.