సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ

చిన్న వయసులోనే సాహితీప్రస్థానం ప్రారంభించిన ఆయన తన సుదీర్ఘ ప్రయాణంలో మలుపులెన్నో తిరిగినవాడు, మెట్లెన్నో ఎక్కిన వాడు.
ఎన్ని సాహితీప్రక్రియలు చేపట్టినా అన్నిటిలో తన విశిష్టతను విస్పష్టంగా చాటినవాడు.
కరువు పల్లెల బడుగుజీవుల వెతల్ని తన కళ్లలో నింపుకొన్నవాడు,
“మట్టి రుచి తెలిసిన జీవితాల సారాంశమే నా సాహిత్యంగా రూపుదిద్దుకొంద”న్నవాడు,
కవిత మర్మం తెలిసినవాడు,
తెలుగు కథాసాహిత్యానికి ఒక సరి”కొత్త దుప్పటి“ని కానుకగా ఇచ్చిన కథల నేతగాడు,
ఒక్క వాన చాలునంటూ చినుకుల సవ్వడితో నవలాసేద్యానికి కాడి పట్టి పాండవబీడులో సజీవపాత్రల తోలుబొమ్మలాటను రక్తికట్టించినవాడు, పాలెగాండ్రసీమలో పాలెగత్తెల, వీరనారుల గుండెగొంతుకలను ఆలకించినవాడు,
ప్రసిద్ధుల చేత “మన కాలపు మహారచయిత” అనిపించుకున్నవాడు – ఆయన పేరు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

కొత్త దుప్పటి పుస్తకం ఆవిష్కరణ సమయంలో నందలూరులో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఆర్.కే.నారాయణ్ రచనలకు కేంద్రం మాల్గుడి అనే ఒక కల్పిత గ్రామమైతే దాదాపు వెంకట్రామిరెడ్డి రచనలన్నిటికీ కేంద్రం కడప జిల్లాలోని బాలరాజుపల్లె అనే ఒక మారుమూల గ్రామం. ఆయన రచనలు చదివినవాళ్ళకు వెంటనే ఒకసారి ఆ బాలరాజుపల్లెకు వెళ్ళాలనీ, అక్కడి “కొండలూ కోనలూ, వాగులూ వంకలూ, చెరువులూ కుంటలూ, కాలువలూ గుండాలూ, చెట్లూ చేమలూ, మెరకలూ బరకలూ, గడ్డీ గాదమూ, గొడ్డూ గోదా, పిట్టతలూ గిట్టలూ, పైర్లూ, పచ్చలూ, వానా వంగిడీ, తిండీ తిప్పలూ, కులాలూ గిలాలూ, కరువులూ కాటకాలూ, కక్షలూ కార్పణ్యాలూ, మంచీ చెడూ, ఆటలూ పాటలూ” కనులారా చూడాలనీ, “భాషా యాసా” చెవులారా వినాలనీ, అక్కడి వంటలు తినాలనీ, ఆ ఊరి పక్కనే ఉన్న జ్యోతివాగు జేడెల్లో కలియదిరగాలని, ఆ మనుషులను, ఆ గొడ్డూగోదాను, పాడీ పంటలను ఒక్కసారి పలకరించి రావాలనీ, పరవశించి పోవాలనీ బలంగా అనిపిస్తుంది. జిల్లా కేంద్రం నుంచి ఆ ఉరికి పోవాలంటే మూడు బస్సులు మారాలని, దూరం కంటే భారం జాస్తి అని తెలిసి ఆశ్చర్యమేస్తుంది.

రైతాంగానికి సంబంధించి బాధాకరమైన కఠోర వాస్తవాన్ని రచనల ద్వారా తెలపాలన్నదే తన ఆశయంగా సాహితీసేద్యం చేస్తున్న విశిష్ట రచయిత వెంకట రామిరెడ్డి.
అలాగని “బాధలు, కష్టాలు, కన్నీళ్లు సాహిత్యంగా మలవడం తన అభిమతం కాద”ని ప్రకటించినవాడు,
వృత్తి పరమైన బాధలు సున్నితమైన అనుబంధాలు, మమకారాలు, ఆత్మీయతలు ఎలా బీటలువారేలా చేస్తున్నాయో తన రచనల ద్వారా తెలియజేయాలనే సంకల్పమున్నవాడు,
రైతు బతుకు బాధల నేపథ్యంలో మానవ సంబంధాల చిత్రీకరణే ధ్యేయంగా గలవాడు.

రైతాంగ పరిణామక్రమాన్ని, మనిషి లోపలి విధ్వంసాన్ని, మార్పులను, తడబాట్లను పరిశీలిస్తూ వాటన్నిటినీ జాగ్రత్తగా ఏరుకుని తన రచనల్లో పదిలపరుస్తున్నవాడు,
పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని – వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి – ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్నవాడు,
తెలుగు భాషపై పెరుగుతోన్న ఇంగ్లీషు ప్రభావం గురించి, కనుమరుగైపోతోన్న తెలుగు పదాల గురించి, తెలుగు సామెతల గురించి, ఆవేదన చెందుతూ సంఘర్షిస్తున్న వాడు,
కట్టు కథలు, పెట్టు కథలు కాకుండా జీవితం కడుపును చీల్చుకుని వచ్చి జీవితం మీద ఉండే ఆపేక్ష నుంచి పుట్టిన పుట్టు కథలు మాత్రమే రాసే అచ్చమైన, అరుదైన, నిఖార్సైన గ్రామీణ కథకుడు,
గ్రామీణ జీవితంలోని ప్రతి పాయనూ ఒడుపుగా పట్టుకుని నేర్పుగా విశ్లేషించగల సమర్థుడైన కథకుడు,
జీవితం పట్ల ఏ భ్రమలూ కలిగించకుండా పాఠకుడిలో వాస్తవిక, సామాజిక దృక్పథాన్ని రగిలించగలిగినవాడు.

“ఎండిపోతున్న బతుకులకు” స్పందించే రవిగాంచని “చెమ్మగిల్లిన గుండెలను” తన కథల్లో చూపిన కవి.
ఇంతకాలం తన రచనల ద్వారానే మాట్లాడుతూ వచ్చిన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి అంతరంగ ఆవిష్కరణ తొలిసారిగా పొద్దులో ఇంటర్వ్యూ రూపంలో ఈ గురువారం నుండి ధారావాహికంగా రానుంది. తెలుగు భాష భవిష్యత్తు గురించి, తెలుగు సాహిత్యం గురించి ఆయన ఆలోచనలు చదివి మీ సందేహాలు, అభిప్రాయాలు, ఆలోచనలు తెలపండి.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.