మృతజీవులు – 21

కొడవటిగంటి కుటుంబరావు

అయిదవ ప్రకరణం

అయితే తన తప్పు ఒప్పుకోవటం రష్యనుకు ఏమాత్రమూ సరిపడదు గనక, దర్పంగా, “మరి నువో? అంత దూకుడుగా రావటం దేనికీ? నీ కళ్ళేమయాయీ? సారా దుకాణంలో కుదువబెట్టి వచ్చావా?” అని అడిగాడు.

మన కథానాయకునికి మటుకు ఇంకా దడగానేవున్నది. బండి మంచి వేగంతో పోతున్నది, త్వరలోనే అది నజ్‌ద్ర్యోవ్ ఎస్టేటు దాటింది. ఆ ఎస్టేటు పొలాలచాటునా, దారియొక్క ఎగుడు దిగుళ్ళ చాటునా మాయమైపోయింది కూడా. అయినా అతను, ఏ క్షణాన ఎవరు తనను తరుముకుంటూ వచ్చి పట్టుకుంటారోనని హడలిఫోయేవాడిలాగా వెనక్కు తిరిగి బెదురుతూ చూస్తూ వచ్చాడు. అతనికి శ్వాస యెంతో కష్టంగా ఆడుతున్నది. గుండెపైన చెయ్యి వేసుకుంటే అది పంజరంలో పక్షిలాగా దడదడలాడటం తెలియవచ్చింది. “మొత్తంమీద నాకు భలేగా చేశాడు! ఎలాటివాడంట!” ఆ తరవాత నజ్‌ద్ర్యోవ్ గురించి కోపంతో కూడిన తిట్లూ, శాపనార్థాలూ, ఆ మాటకు వస్తే కొన్ని అశ్లీలాలు కూడా వెలువడ్డాయి. లేకపోతే ఏమిటి? అసలే అతను రష్యను, పైన కోపంలో వున్నాడు. అదీగాక జరిగినది అల్లాటప్పా విషయం కాదు. “ఎంతైనా చెప్పు, సరిగా సమయానికి ఆ పోలీసుకాప్టనే రాకపోతే నాదీపం ఆరి ఉండేదే. నేను నీటిబుడగలాగా రూపుమాసిపోయి ఉండేవాణ్ణి, నాకు సంతతి లేకుండా పోయేది. నా ఆస్తీ, మర్యాదా పంచుకునేటందుకు పిల్లలు లేకుండా పొయ్యేవారు” అనుకున్నాడతను. మన కథానాయకుడికి తన సంతతిని గురించిన చింత జాస్తి.

సేలిఫాన్ కూడా, “ఆయన ఎంత దుష్టుడో! ఇంతకుముందు అలాటి పెద్దమనిషిని ఎన్నడూ చూడలేదు. మీద ఊసినా పాపం లేదు. మనిషినైనా మాడ్చుగాని గుర్రాలను మాడుస్తావా? గుర్రానికి గింజలిష్టం. అవి దానికి విందు, మనకు విందు చేసుకుంటే ఎంత ఆనందమో దానికీ అంతే” అనుకున్నాడు.

నజ్‌ద్ర్యోవ్‌ను గురించి గుర్రాలకు కూడా తేలిక భావమే ఏర్పడ్డట్టున్నది. ఎర్ర గుర్రమూ, అసిసరూ మాత్రమేగాక మచ్చల గుర్రానికి కూడా అసంతృప్తి కలిగినట్టున్నది. తన వంతుకు ఎప్పుడూ చచ్చుగింజలే వచ్చేవి, వాటిని కూడా సేలిఫాన్ ‘నీ దుంప తెగ ‘ అనకుండా వేసేవాడు, అయినా గింజలు గింజలేగాని ఎండుగడ్డి కాదుగా; అది వాటిని తృప్తిగా తిని, తన ప్రక్కనున్న గుర్రం దాణాలోకి మూతిపెట్టి చూసేది – ముఖ్యంగా సేలిఫాన్ గుర్రపుశాలలో లేనప్పుడు. కాని ఈసారి ఎండుగడ్డి తప్ప ఇంకేమీ లేదు, అన్యాయం! ఎవరికీ తృప్తి కలగలేదు.

అకస్మాత్తుగానూ, అనుకోకుండానూ అందరి అసంతృప్తి ఆలోచనలకూ అవాంతరం కలిగింది. ఆరు గుర్రాలు కట్టిన మరొక బండీ వచ్చి కొట్టుకున్నదాకా, ఆ బండీలోని ఆడంగులు కెవ్వుమని అరచటమూ, బండివాడి తిట్లూ, బెదిరింపులూ వినబడేదాకా ఎవరికీ – సేలిఫాన్‌కు కూడా – ఏమి జరిగినదీ తెలియనే తెలియదు. “ఛండాలుడా ‘కుడిపక్కకు పోరా పక్షీ ‘ అని గొంతు చించుకుని అరుస్తూంటినిగదా! తాగి ఉన్నావా?” అని రెండోబండివాడు అడిగాడు, తప్పు తనదేనని సేలిఫాన్ గ్రహించాడు. అయితే తన తప్పు ఒప్పుకోవటం రష్యనుకు ఏమాత్రమూ సరిపడదు గనక, దర్పంగా, “మరి నువో? అంత దూకుడుగా రావటం దేనికీ? నీ కళ్ళేమయాయీ? సారా దుకాణంలో కుదువబెట్టి వచ్చావా?” అని అడిగాడు. తరవాత వాడు తన గుర్రాలను వెనక్కు నడిపి విడిపించటానికి యత్నించాడు. కాని అది సాధ్యం కాలేదు – చిక్కు బాగా పడిపోయింది. మచ్చల గుర్రం తనకు రెండుపక్కలా నిలబడిన కొత్త నేస్తాలను మూచూసింది.

రెండో బండిలో వున్న స్త్రీలు భయపడుతూ జరిగేదంతా చూస్తున్నారు. వారిలో ఒకావిడ వృద్ధురాలు. రెండవది పదహారేళ్ళపిల్ల; బంగారం లాగా మెరిసే జుట్టు యెంతో అందంగా, యెంతో నేర్పుగా ఆమె తల చుట్టూ చుట్టి వున్నది. అందమైన ఆమె ముఖం కోడిగుడ్డులాంటి వంపులు కలిగివుండటమేగాక, అప్పుడే పెట్టిన గుడ్డును ఎండకు యెత్తి పట్టుకుని చూస్తే ఎలా కాంతివంతంగా కనిపిస్తుందో అలా కాంతివంతంగా కూడా వున్నది. ఆమె చెవుల వెనుక భాగాన పడి అవి కూడా ఎర్రగానూ, సుకుమారంగానూ కనిపిస్తున్నాయి. భయంతో తెరుచుకుని ఉన్న ఆమె పెదవులూ, భయంతో చెమర్చిన ఆమె కళ్ళూ ఎంత ఆక్ర్షణీయంగా ఉన్నాయంటే మన కథానాయకుడు చాలాసేపు ఆమెకేసి తేరిపారజూస్తూ గుర్రాలమధ్యా బండివాళ్ళమధ్యా జరిగే గల్లంతుకూడా గమనించలేదు. “వెనక్కు పోరా, నీఝ్నినొవొగొరోద్ పక్షీ” అని రెండో బండీ వాడు కేక పెట్టాడు. సేలిఫాన్ పగ్గాలను పట్టుకుని సత్తువకొద్దీ లాగాడు. రెండో బండివాడు కూడా అలాగే చేశాడు. గుర్రాలు ఒక్క అడుగు వెనక్కు వేశాయి. అవి పగ్గాల మీదుగా అడుగువేసేసరికి మళ్ళీ చిక్కుపడింది. ఒకవంక ఇదంతా జరుగుతూంటే మచ్చల గుర్రం తన కొత్త స్నేహితులను చూచి ఎంత సంతోషించిందంటే, దైవికంగా ఏర్పడిన ఈ తగలాటం నుంచి తన నేస్తం మెడకు ఆనించి దానితో ఏమీ అర్థం లేని రహస్యాలు చెప్పిందో ఏమో, ఆ రెండో గుర్రం తన చెవులు ఆపకుండా అటూ ఇటూ తిప్పసాగింది.

పిల్ల చాలా బాగుంది. కాని ఆమెలో ఉన్న బాగేమిటి? ఉన్న బాగల్లా ఏమిటంటే ఇప్పుడే స్కూలు నుంచో, కాలేజినుంచో బయటపడినట్టున్నది, ఇంకా ఆమెలో ఆడతనం అన్నది తలయెత్తలేదు, వాళ్లలో సహించరానిదల్లా అదే. ఇంకా అమాయకురాలు; ఆమెలో అంతా అమాయకత్వమే;

అదృష్టవశాత్తూ సమీపంలోనే గ్రామం ఉండటం చేత అక్కడి రైతులంతా సాయం వచ్చారు. జర్మనులకు పత్రికలూ క్లబ్బూ లాగే ఈ గ్రామస్తులకు ఇలాటి సంఘటనలు అన్నప్పుడల్లా దొరకవు. అందుచేత గ్రామంలో ముసలమ్మలనూ చిన్న పిల్లలనూ మాత్రమే వదిలి మిగిలినవాళ్ళంతా చక్కా వచ్చి బళ్ళ చుట్టూ మూగారు. పగ్గాలు విడిపించారు. ముక్కుమీద రెండుపోట్లు పొడిచాక మచ్చలగుర్రం వెనక్కు వెళ్ళింది. ఎలాగైతేనేం ఏ గుర్రాలకా గుర్రాలు వేరుపడిపోయాయి. కాని అవి, తమ మిత్రులనుంచి వేరుచేసినందుకు కోపం వచ్చో, బుద్ధి తక్కువచేతనోగాని, బండివాడు ఎంత కొట్టినా కదలక శిలల్లాగా నిలబడిపోయాయి. పల్లెటూరిజనం సానుభూతి వర్ణనాతీతం! ప్రతి ఒకడూ ఏదో ఒక సలహా ఇవ్వటం మొదలుపెట్టాడు. “ఆంద్ర్యూష్క, నువ్వ పగ్గపు గుర్రాన్ని కాస్త చూడరా, ఆ కుడిపక్కది, మీత్య మామను మధ్య గుర్రం మీద ఎక్కనీ! ఎక్కు మీత్య మామా!” మీత్యమామ, ఎర్రని గడ్డంగల సన్నటి, పొడుగుపాటివాడు మధ్య గుర్రంమీద ఎక్కి కూచుని ధ్వజస్థంభంలాగా ఉన్నాడు. బండివాడు గుర్రాలను కొట్టాడు, కాని ప్రయోజనం లేకపోయింది. మీత్యమామ వల్ల ఏమీ కాలేదు. “ఉండుండు నువు పగ్గపుగుర్రం మీదికో మీత్యమామా, మధ్య గుర్రం మీద మిన్యాయ్ మామను ఎక్కనీ” అని జనం అరిచారు. మిన్యాయ్ మామ భుజాలు విశాలంగా ఉన్నాయి, గడ్డం నల్లగా ఉన్నది, సంతల్లో చలికి వణికే జనం కోసం వేడి పానీయాలు కాచే బ్రహ్మాండమైన సమవార్ లాటి పొట్ట వేసుకుని వాడు మధ్య గుర్రం మీద ఎగిరి కూచునేసరికి అది కుంగిపోయి నేలను అంటుకున్నంతపని అయింది. “ఇహ ఫరవాలేదు, చురక తగిలించు. చురక తగిలించు. ఆ ఎర్రగుర్రాన్ని ఒకటి వెయ్యి. అది గజ్జెల గుర్రంలాగా ఆడిపోవాలి”. కాని ఎంత కొట్టి కూడా ప్రయోజనం లేకపోయేసరికి, మీత్య మామా, మన్యాయ్ మామ కూడా మధ్య గుర్రం మీద కూర్చుని, ఆంద్ర్యూష్కను పగ్గపు గుర్రం ఎక్కించారు. చిట్టచివరకు బండివాడు ప్రాణం విసిగి మామలందర్నీ తరిమేశాడు. ఇదీ మేలే అయింది, ఎందుకంటే గుర్రాలు ఒక మజిలీ నుంచి ఇంకో మజిలీకి ఒక్క గుక్కన పరుగెత్తి వచ్చినట్టుగా ముచ్చెమటలు పోసి ఉన్నాయి. ఒక్క నిముషం వాటికి విశ్రాంతి యిచ్చేసరికి అవి తమంతట తామే బయలుదేరాయి.

ఒక చెంప యిదంతా జరుగుతూంటే, చిచీకవ్ రెండోబండిలో ఉన్న అమ్మాయికేసి తదేకదీక్షతో చూశాడు. ఆమెతో మాట్లాడాలని యెన్నోసార్లు అనిపించింది, కాని ఎందుకో అతనికది సాధ్యం కాలేదు. అంతలోనే ఆ స్త్రీలు బండిలో వెళ్ళిపోయారు. ఆ అందమైన తలా, ముఖమూ, ఆ సన్నని నడుమూ చూస్తూండగానే అదృశ్యమై రోడ్డూ, బండీ, పాఠకుడికి పరిచితమైన మూడు గుర్రాలూ, సేలిఫానూ, చిచీకవూ బల్లపరుపుగా పరుచుకున్న పొలాలూ మిగిలాయి. జీవితంలో అంతటా -మొరటుగానూ, దుర్భర దారిద్ర్యంలోనూ, మురికి జీవితాలు గడిపే తక్కువవారిలోనైతేనేం, ఎక్కడికక్కడ బిగుసుకుపోయి, ఒకేరకం మానమర్యాదలు పాటించే ఎక్కువవారిలో నైతేనేం – ప్రతి తరగతిలోనూ మనిషికి జీవితంలో ఒకేసారి ఒక దివ్యమైన దృశ్యం అంతకు నుందెన్నడూ అనుభవంలోకి రానటువంటిది, కనిపించి ఒక్కసారిగా ఒక భావాన్ని రేకెత్తించేస్తుంది; ఆ భావం జీవితాంతందాకా నిలిచి ఉంటుంది. మోటుబళ్ళు తప్ప ఎరగని ఒక కుగ్రామం మీదుగా ఉన్నట్టుండి ఒక అందమైన బండి, తళతళా మెరిసే జీనుతో, అందమైన గుర్రాలతో, అద్దాల కిటికీలతో వేగంగా వెళ్ళిపోతుంది. ఆ తరవాత పల్లెటూరి బైతులు టోపీలు చేతుల్లోకి తీసుకుని, బండి కనుపించకుండా పోయిన తరవాత ఎంతోసేపు నోళ్ళు తెరుచుకుని చూస్తూ నిలబడతారు; అదేవిధంగా కష్టాలు అల్లిబిల్లిగా పెనవేసుకుని ఉండే ప్రతివాడి జీవితంలోనూ ఆనందం ఒక్కసారిగా తళుక్కున మెరుస్తుంది. మన కథలోకి ఈ పిల్ల అనుకోకుండా వచ్చి మాయమైపోవటం కూడా అలాటిదే. చిచీకవ్ స్థానంలో ఎవడన్నా ఇరవై ఏళ్ళ యువకుడు – ఒక అశ్వికదళ సైనికుడో, విద్యార్థో లేక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సాధారణ యువకుడో – ఉన్నట్టైతే వాడిలో ఎలాటి ఉద్దీపనం, ఎలాటి చైతన్యం, ఎలాటి హృదయ ఉద్బోధనం కలిగేది! తన మార్గాన్నీ, జాప్యం చేసినందుకు తనకు కలిగే చివాట్లనూ మరిచి, తనను తానే మరిచి, తన కర్తవ్యాన్ని, ప్రపంచాన్నీ, సమస్తాన్నీ మరిచి, దూరం కేసి శూన్యంగా చూస్తూ; బిత్తరపోయి చాలా నిమిషాలపాటు నిలబడిపోయేవాడు.

కాని మన కథానాయకుడు వయస్సులో కాస్త ముదిరినవాడూ, తాపీగా ఆలోచించే స్వభావం కలవాడూను. అతను కూడా ఆలోచనా నిమగ్నుడయాడు, అయితే అతని ఆలోచనలు బాధ్యతారహితంగా లేవు. వాస్తవికంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అతను పొడుం డబ్బా తీసి ఒక్క చిటికెడు పీలుస్తూ ఇలా అనుకున్నాడు: “పిల్ల చాలా బాగుంది. కాని ఆమెలో ఉన్న బాగేమిటి? ఉన్న బాగల్లా ఏమిటంటే ఇప్పుడే స్కూలు నుంచో, కాలేజినుంచో బయటపడినట్టున్నది, ఇంకా ఆమెలో ఆడతనం అన్నది తలయెత్తలేదు, వాళ్లలో సహించరానిదల్లా అదే. ఇంకా అమాయకురాలు; ఆమెలో అంతా అమాయకత్వమే; నోటికి వచ్చినదల్లా మాట్లాడేస్తుంది, నవ్వాలనిపిస్తే నవ్వేస్తుంది; అటువంటిదాన్నిఎలాగైనా మలుచుకోవచ్చు, అద్భుతమైన మనిషిగా తయారు కావచ్చు, వట్టి పనికిమాలినది కూడా అయిపోవచ్చు – పనికిమాలినదే అయిపోతుంది కూడాను! బామ్మలూ, అత్తయ్యలూ ఆమెను ఏంచేస్తారో చూడు. ఒక్క ఏడాది లోపల ఆమెకు ఎన్ని ఆడపోకిళ్ళు నేర్పేస్తారంటే ఆమెను సొంత తండ్రి కూడా గుర్తించలేడు. కపటమూ నటనా అలవడతాయి; తాను నేర్చుకున్న విషయాలకు అనుగుణంగా ప్రవర్తించటమూ, మసలటమూ చేస్తుంది; ఎవరితో మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి, ఎవరివంక చూడాలి, ఎలా చూడాలి అన్న సమస్యలను గురించి తల పగలగొట్టుకుంటుంది; హద్దుమీరి మాట్లాడానా అని అనుక్షణమూ భయపడుతూ ఉంటుంది; తాను పన్నిన ఉచ్చులలో తానే చిక్కుకుని చివరకు బతుకంతా అబద్ధాలాడేస్తుంది. ఎలా పరిణమిస్తుందో సైతాను చెప్పవలసిందే!” అతను ఒక్క నిమిషం ఆగి మళ్ళా ఇలా ఆలోచించాడు: “కాని, ఆమె ఎవరో, అమె తండ్రి ఎవరో, ఆయన ధనికుడూ, పరువు మర్యాదలూ గలవాడూ అయిన భూస్వామో, లేక సైనిక వృత్తిలో బాగా డబ్బు గడించుకున్న కపటం ఎరుగని బుద్ధిమంతుడో తెలిస్తే బాగుండును. ఆ పిల్లవెంట ఒకవేళ ఏ రెండు లక్షలో కట్నం కూడా వచ్చేట్టుంటే నోరూరించే భక్ష్యమన్నమాటే. సరి అయినవాడి పాలపడితే సుఖపెట్టగలుగుతుంది”. రెండు లక్షలు ఎంత వాంఛనీయంగా కనబడ్డాయంటే గుర్రాల మనిషినో, అ బండీవాణ్ణో అడిగి ఆ స్త్రీలెవరో తెలుసుకోనందుకు అతను తనను తానే నిందించుకున్నాడు. అయితే ఇంతలోనే దూరాన సబాకవిచ్ ఉండే గ్రామం కనిపించేసరికి అతని ఆలోచనలు చెదిరిపోయి అసలు విషయం పైకి మళ్ళాయి.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.