మతవిశ్వాసాల పునాదులు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

ప్రపంచమంతటా మనుషులు నమ్మే రకరకాల మతాలు ఎప్పటినుంచీ మొదలయాయో ఊహించాలే గాని ఖచ్చితంగా చెప్పలేము. సుమారు 5 లక్షల ఏళ్ళ క్రితం నుంచి పది, పన్నెండు వేల ఏళ్ళ క్రితం వరకూ పాతరాతియుగం కొనసాగింది. ఆ కాలపు అవశేషాలనూ, రాతి వస్తువులనూ, చెక్కడాలనూ బట్టి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. కొన్ని విశేషాలు ఇతరత్రా లభిస్తాయి. ఈనాటికీ నాగరికత సోకకుండా తమకు ప్రత్యేకమనిపించే తంతులు నిర్వహిస్తూ బతికే ఆదిమతెగలు ప్రపంచమంతటా కనిపిస్తారు. వారి ఆచారాలూ, నమ్మకాలూ మనకు విచిత్రంగా, అనాగరికంగా అనిపించినప్పటికీ ఆధునిక ముసుగులు తగిలించుకున్న నేటి మతవిశ్వాసాల పునాదులన్నీ వాటిలో కనిపిస్తాయి. వీటిలో కొన్ని వివరాలు కొందరికి జుగుప్సనూ, కొందరికి కోపాన్నీ కలిగించవచ్చు. అయినా కాస్త ఆలోచిస్తే మనుషులకు మొదటినుంచీ ఉన్న కొన్ని మానసిక బలహీనతలే ఈ విషయంలో పని చేశాయని స్పష్టమౌతుంది.

పాతరాతియుగపు సమాధి

పాతరాతియుగపు సమాధి

అనాగరికదశలో ఉన్నప్పుడు మనుషులకు ఒక అస్పష్టమైన తాత్వికచింతన ఏర్పడడానికి చావు అనేదే ముఖ్యకారణమని పాత అవశేషాలనుబట్టి తెలుస్తుంది. 5 లక్షల ఏళ్ళనాటి పీకింగ్ గుహల్లోనూ, 70 వేల సంవత్సరాలనాటి యూరప్ గుహల్లోనూ చనిపోయినవారి తలలను కోసి పాతిపెట్టడం, అంతకు ముందుగా చనిపోయినవారి జ్ఞాపకార్థమో, వారి శక్తిని పొందేందుకో ఆ తలల అంతర్భాగాలను తినడం వగైరా తంతులు అప్పటివారు జరిపినట్టు తెలుస్తోంది.
ఫ్రాన్స్‌లో దొరికిన కొన్ని అవశేషాల్లో అలాంటి పుర్రెలను పానపాత్రలుగా తయారుచేసి ఉపయో గించారని తెలిసింది. ఇవన్నీ జాగ్రత్తగా దాచిన వస్తువులు కనక వీటికి ఏవో ఆటవిక పూజాసామగ్రి వంటి ప్రాముఖ్యత ఉండేదని అనుకోవచ్చు. శవాలు పాతిన చోట్లలో తంతులు జరిగిన దాఖలాలు కనిపిస్తాయి. కొన్ని స్థలాల్లో కుంకుమవంటి ఎర్రని పొడి కనిపించింది. ఎర్రని పొడి వాడకం చాలా ప్రాచీనమైనది. మనవాళ్ళు పూజల్లో విరివిగా ఉపయోగించే కుంకుమ రక్తానికి ప్రత్యామ్నాయమైన సంకేతమని ఈనాడు చాలామందికి తెలియదు. బలులివ్వడం ఆచరణలో కష్టమౌతున్నకొద్దీ పురాతన ఆచారాలను సూచనప్రాయంగా ద్యోతకం చేసే సంకేతాలు మాత్రమే మిగిలాయి. సున్నమూ, పసుపూ కలిపితే సులువుగా, చవకలో తయారయే కుంకుమ ఇందుకు ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా కట్టిన ఇళ్ళ గుమ్మాలకు పుచ్చకాయను (అది అన్నిచోట్లా, ఎల్లకాలమూ దొరకదు కనక గుమ్మడి పండును) వేలాడగట్టడం, దానిమీద మనిషి ముఖంలా గీతలు గీయడం, నరబలికి సంకేతం. ఎర్రగా, రక్తం ఓడుతున్నట్టు కనబడే పుచ్చకాయ బలి అయినవాడి తలకు “న్యాయబద్ధమైన” సంకేతం అన్నమాట.

శిశువుల అవశేషాలు

ఎర్రనిపొడితో 27 వేల ఏళ్ళనాటి శిశువుల అవశేషాలు

ఈ ఎర్రని రంగుపొడి ప్రపంచంలో అనేకచోట్ల మానవులు నివసించిన అతిప్రాచీనమైన గుహల్లో శవాలను పాతిపెట్టిన చోట కనబడింది. ఆస్ట్రియాలోని ఒక గుహలో 5 మీటర్ల లోతున పాతిన ఇద్దరు కవల శిశువుల అవశేషాలు దొరికాయి. 27 వేల ఏళ్ళనాటి ఈ పిల్లలను జాగ్రత్తగా చర్మంలో చుట్టి, మేమత్ ఏనుగు దంతాల చాటున ఖననం చేశారు. వారి శరీరాలకు ఎర్రనిపొడి పూశారు. ఏదో పెద్ద తంతు జరిపి ఉంటారని ఈ ఏర్పాటునుబట్టి తెలుస్తోంది. రక్తం అనేది జీవానికీ, ప్రాణానికీ ప్రతీక. ఋతుస్రావం జరగడం స్త్రీల సంతానోత్పత్తికి సంకేతం. ఇటువంటి విషయాలు ఆదిమానవుల మేధస్సును చాలా ప్రభావితం చేసి ఉంటాయి కనకనే ఇప్పటికీ మన పూజల్లో కుంకుమ లేకుండా జరగదు. బలి ఇచ్చిన మేక రక్తాన్ని ముఖానికి ‘రక్ష’గా పూసుకునే అలవాటు పశ్చిమాసియా తెగల్లో ఉందట. మన దేశంలో జంతువు (లేదా మనిషి) రక్తాన్ని ముఖానికో, నుదుటికో పూసుకునే అలవాటు కొనసాగి ప్రస్తుతం ఎర్రని తిలకాలూ, బొట్లూ మిగిలాయి. దీనికి మరేదో వివరణ ఇవ్వడానికి అష్టవంకర్లు తిరగనవసరంలేదు. ఇప్పుడు మనకేలా అనిపించినా ప్రాచీనుల తంతులన్నీ సమాజశ్రేయస్సు కోసం ఏర్పాటైనవే అని గుర్తుంచుకోవాలి.
ప్రాచీనులు శవాలను పాతిపెట్టడంలో పద్ధతి ఉండేది. కొన్నిచోట్ల పడమటి దిక్కుకేసి అమర్చిన 27 పుర్రెలు కనబడ్డాయి. ఈ తలలన్నీ శరీరాలనుంచి నరకబడ్డాయి. ఫ్రాన్స్‌లోని ఒక స్థలంలో ఒక యువకుడి శవాన్ని కుడివేపుకు తిప్పి, మోచేతిని తలకింద అమర్చి పాతారు. దగ్గరలోనే రాతి ఆయుధాలు ఉంచారు. ఆ పక్కనే ఆ కాలపు ఎద్దును కాల్చిన అవశేషాలున్నాయి. అంటే ఏదో విందు కూడా జరిగిందన్నమాట. మరొకచోట ఒక నియాండర్తాల్ మానవుడి శవాన్ని ఇలాగే పడమటివేపుకు తిప్పి, రాతి పనిముట్లతో సహా జాగ్రత్తగా బండల మధ్యన పాతిపెట్టారు. కొన్నిచోట్ల శవం తలచుట్టూ వలయాకారంలో అమర్చిన రాళ్ళు కనిపిస్తాయి. ఇవన్నీ మనం ప్రాచీనం అనుకునే ఈజిప్ట్ నాగరికత వగైరాలకన్న ఎంతో పాత సంఘటనలు. ఏది ఏమైనా అంతటి ప్రాచీనయుగంలోనే మనుషులు చనిపోయిన సాటివారి గురించీ, చావును గురించీ ఎంతో ఆలోచించేవారని స్పష్టంగా తెలుస్తోంది.

నియాండర్తాల్ శవం

70 వేల ఏళ్ళ క్రితం పాతిపెట్టిన నియాండర్తాల్ శవం

చచ్చిపోవడమనేది తప్పనిసరి అని తెలిశాక ప్రాచీనులు చావును గురించి ఎంతగా బెదిరి ఉంటారో మనకు తెలియదు. కష్టాలమయంగా గడిచిన అప్పటి కాలంలో ప్రాణానికి ఇప్పటికన్నా చాలా ఎక్కువ విలువ ఉండేదని ఊహించవచ్చు. అసలే సగటు ఆయుఃప్రమాణం చాలా తక్కువగా ఉండి, రోగాలూ, గాయాలూ, ప్రమాదాలూ బలి తీసుకున్నప్పుడల్లా అప్పటి జనాభా తగ్గుతూ ఉండేది. నలుగురూ కలిసి ఐకమత్యంతో బతికితేగాని పూట గడవని ఆ కాలంలో చావు అనేది చాలా అవాంఛనీయం అనిపించి ఉండాలి. ఈ కారణలవల్ల చావు అనేది ఎంతో తాత్వికచింతనకూ, తొలి మతపరమైన తంతులకూ దారితీసి ఉండాలి. చనిపోయిన తరవాత ఏమవుతుందోననే అనుమానాలూ, అపోహలూ, చనిపోయినవారి శక్తిని నిలిపి ఉంచే ప్రయత్నాలూ, వేరే రూపంలో వారు కొనసాగుతారేమోననే ఆశతో రకరకాల సంకేతాల అన్వేషణలూ, ఇలా ఆలోచించడం కేవలం పొట్ట పోసుకునేందుకు పాటుపడే జీవితాలకు సంబంధించని దిశలో మనుషుల మానసికజీవితాన్ని మలుపు తిప్పి ఉంటుంది. ఇప్పటికీ ‘పరలోకం’ గురించి ఆలోచించడానికి మనని పురికొల్పడంలో దేవుడికన్నా మరణం గురించిన ఆలోచనలే బలంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.
మనిషి ఏనాడైనా తనకు తెలిసిన విషయాలను గురించి నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తాడు. తెలియనివే కలవరపెట్టి బాధిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది చావు. తెలియని వాటి గురించే బాధంతా. జబ్బు చేస్తే మందులు తీసుకుంటాం కాని పూర్తి నమ్మకం ఉండదు. చావు భయంతో మొక్కుకోవడం, జ్యోతిష్కులదగ్గరికి వెళ్ళడం వగైరాలు చూస్తాం. మనస్సు బలహీన పడినప్పుడల్లా మతాలు కావలసివస్తాయి. అయితే ఒకసారి వచ్చి తిష్ఠ వేసిన మతాలు మనను వదిలి పెట్టకుండా బాధిస్తూ, అప్పుడప్పుడూ రక్తపాతానికీ, హింసకూ కూడా కారణమవుతూ ఉంటాయి.

—————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు (http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

Posted in వ్యాసం | Tagged | 36 Comments

తనెళ్ళిపోయింది..

— కొండూరు ఆత్రేయ

తనెళ్ళిపోయింది..

ఐనా ఈ రాత్రి… అవే ఊసుల్ని
చీకటి పొదల్లో.. ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది.

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది.

కాసేపు అలా
నేను, రాత్రి, ఏకాంతం.

అసంకల్పితంగా
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది
నిశ్శబ్దం ఆవరించింది.

—————————

బంధాలను సుదూర తీరాల్లో వదిలి, అనుబంధాలను రంగు కాగితాల కోసం తాకట్టుపెట్టి, ప్రవాసమో వనవాసమో తెలియని జీవనం గడుపుతున్న మామూలు తెలుగువాడు ఆత్రేయ కొండూరు. భావాలను భాషలోకి మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆచార్య ఆత్రేయంటే చాలా అభిమానం.

Posted in కవిత్వం | Tagged | 15 Comments

మృతజీవులు – 24

-కొడవటిగంటి కుటుంబరావు

ఆరవ ప్రకరణం

చాలా కాలం క్రితం నేను చిన్న వాడినై ఉండగా, శాశ్వతంగా గతించిపోయిన యౌవనపు రోజులలో, కొత్త చోటికి మొదటిసారిగా వెళుతుంటే సరదాగా ఉండేది. అది గ్రామమైనా సరే, పేదరికంలో ఓలలాడే బస్తీ అయినా సరే, పాలెమైనా సరే, పేట అయినా సరే నాకు ఒకటి గానే ఉండేది, నా కళ్ళను ఆకర్షించేవి ఎన్నో కనిపించేవి. ప్రతి కట్టడమూ, విలక్షణంగా ఉన్న ప్రతిదీ నేను గమనించి జ్ఞాపకం ఉంచుకునేవాణ్ణి, సర్కారు భవనాలు ఇటుకలతో కట్టిఉండేవి, వాటి కిటికీల్లో సగం వట్టి కంతలే, అవి ఈదురోమంటూ పనివాళ్ళ కొయ్య గుడిసెల మధ్య ఎత్తుగా నిలబడి ఉండేవి. సున్నం కొట్టిన కొత్త చర్చీల శిఖరాలు గుండ్రంగా ఉండి తెల్లనిరేకులు కప్పి ఉండేవి. దుకాణాలుండే మార్కెట్లుండేవి. గ్రామాల నుండి బస్తీకి వచ్చిన శృంగాల పురుషులుండేవారు–నేను బండిలోనుండి బయటికి తొంగిచూస్తూ ఎంతో శ్రద్ధగా ఇవన్నీ గమనించేవాణ్ణి. కొత్తరకంగా కుట్టిన ప్రతి కోటునూ చూసేవాణ్ణి. ఏ దుకాణంలోనో ఉంచిన కొయ్య తొట్టెలలో మేకులూ, గంధకమూ, ఎండుద్రాక్షలూ, సబ్బులూ, చాలా కాలం క్రిందటి మాస్కో చక్కెర బిళ్ళలూ కనిపించేవి.

ఏ మారుమూల ప్రాంతం నుంచో దైవికంగా ఈ ప్రాంతానికి వచ్చిపడిన ఒక సైనికాధికారినిగానీ, పొడుగుపాటి కోటు వేసుకొని తన బండీలో అతి వేగంగా ప్రయాణించే వ్యాపారస్తుణ్ణి గానీ చూడగానే నా మనసు వాళ్ళ వెంబడే పరిగెత్తి పోయేది. ఎవడైనా ఉద్యోగస్తుడు నా ప్రక్కగాపోతే వెంటనే నేను ఊహలు అల్లేవాణ్ణి: ఈ మనిషి ఎక్కడికి పోతున్నాడు, ఇంకో ఉద్యోగస్తుడి ఇంటికా లేక నేరుగా ఇంటికేపోయి చీకటిపడేదాకా ఒక అరగంట సేపు మెట్లవద్దనే తారట్లాడి, తన తల్లీ, భార్యా, మరదలూ, ఇతర కుటుంబీకులూ పంక్తిని కూచుని పెండలాడే భోంచేస్తుంటే, దాసీదిగాని, మందమైన పొట్టిచొక్కా తొడుక్కున్న నౌకరు కుర్రాడుగాని, అనాదిగా ఇంట్లోఉన్న కొవ్వొత్తి స్టాండులో కొవ్వొత్తి వెలిగించి, సూప్ తాగటం పూర్తి కానిచ్చి మరీ తీసుకొస్తారా? ఎవరైనా భూస్వామి ఉండే గ్రామానికి బండిలోపోతూ, కొయ్యతో సన్నగా, ఎత్తుగా తయారుచేసి ఉన్న గంట గోపురాన్నీ, నల్లని చెక్కతో చేసిన విశాలమైన చర్చినీ వింతగా చూసేవాణ్ణి, ఆకుపచ్చని చెట్ల మధ్యగా భూస్వామి ఇల్లు తాలూకు ఎర్రని కప్పూ, తెల్లని పొగగొట్టాలూ దూరాన ఆకర్షవంతంగా కనిపించేవి; దానికి రెండువైపులా దడికట్టినట్టుగా ఉన్న తోటలు ఎక్కడన్నా తెరిపిఇస్తాయా, ఇల్లంతా చూద్దామని తహతహలాడిపోయేవాణ్ణి. ఆ రోజుల్లో ఈ ఇళ్ళ ముందు భాగాలు అంత మరీ అనాగరికంగా ఉండేవి కావు మరి; వాటిని బట్టి ఇంటి యజమాని ఎలా ఉంటాడో, లావుపాటి మనిషై ఉంటాడా, ఆయనకు కొడుకులున్నారా లేక ముచ్చటగా ఆరుగురు కూతుళ్ళు, కిలకిలా నవ్వుతూ కేరింతలు కొట్టేవాళ్ళున్నారా, వారిలో కడగొట్టు కుమార్తె అత్యంత సౌందర్యవతి అయిఉండదా, వాళ్ళవి కాటుకకళ్ళా. ఇంటి ఆసామీ సరదా అయినవాడా, లేక తుమ్మల్లో పొద్దూకిన మొహం వేసుకుని, చుట్టూ చిన్నవాళ్ళు కూచుని విసుక్కునేలాగ కాలెండరు కేసి చూస్తూ గోధుమలను గురించీ, రాగులను గురించీ మాట్లాడేరకమా అని ఆలోచించేవాణ్ణి.

ఇప్పుడు నేను ఏ గ్రామానికైనా వెళ్లేటప్పుడు నిర్వికారంగా ఉంటాను. అసహ్యంగా ఉండే గ్రామంకేసి నిర్వికారంగా చూస్తాను. ఉత్సాహరహితమైన నా కళ్ళకు నాకా గ్రామంలో ఒక ఆకర్షణ గాని, వినోదం గాని కనపడదు.

లోపల చీకటి చీకటిగానూ, నేలమాళిగలాగ చల్లగానూ ఉన్నది. హాలుదాటి ఒక గదిలోకి వెళ్ళాడు, అక్కడా చీకటిగానే ఉన్నది. తలుపు కింది భాగంలో ఉండే పగులులోనుంటి అస్పష్టంగా వెలుతురు వస్తున్నది. ఈ తలుపు తెరిచి అతను వెలుగులోకి అడుగుపెట్టాడు. అక్కడ అతను చూసిన గందరగోళానికి కంగారు పుట్టింది.

ఒకప్పుడు నా ముఖానికి వెలుగు తెప్పించి, నా చేత తెగ వాగించినవన్నీ ఇప్పుడు నన్ను కదిలించకుండా పక్కగా వెళ్ళిపోతాయి. నేను నోరు మెదపను, పట్టించుకోను. ఆ నా యౌవనం! ఆ ఉత్సాహం!

ఆ రైతు ప్ల్యూష్కిన్‌కు పెట్టిన పేరు తలచుకుని ఆలోచిస్తూ, తనలో తాను ఆనందించుకుంటున్న చిచీకవ్ తాను ఒక పెద్ద గ్రామం ప్రవేశించినట్టుగాని, అక్కడ అనేక రైతు గుడిసెలూ, వీధులూ ఉన్నట్టు గాని గమనించనేలేదు. అయితే అతని బండి ఒక దుంగలవంతెన మీదుగా పోతూ బీభత్సంగా కుదిపేసరికి అతనికి స్ఫురణ కలిగింది; ఈ వంతెన ముందు మన మామూలురాళ్ళు పరిచిన వంతెనలెందుకూ పనికిరావు, బండి నడిచేటప్పుడు దుంగలు పియానో మెట్లలాగా పైకీ, కిందికీ ఆడిపోవడమున్నూ, ప్రయాణీకుడి తల వెనక నొప్పి కట్టటమో, నుదురు గాయం కావటమో, ప్రయాణీకుడు నాలుక గట్టిగా కరుచుకోవటమున్నూ జరుగుతుంది. అతని కళ్ళకు ప్రతి ఇల్లూ వృద్ధాప్యం వచ్చి శిధిలావస్థలో ఉన్నట్టు కనిపించింది. ఆ గుడిసెలను కట్టటానికి ఉపయోగించిన దుంగలు చీకి; నలుపెక్కి ఉన్నాయి. చాలా కప్పులు కంతలు పడి జల్లెడల్లాగా ఉన్నాయి; కొన్నింటిమీద దూలమూ, అడ్డకర్ర అస్థిపంజరంవంతుగా మిగిలి ఉన్నాయి. ఇళ్ళవాళ్ళే కప్పుమీది చెక్కలనూ, కర్రలనూ తీసేసినట్టు కనిపించింది. వారేమనుకుని ఉంటారంటే: వానాకాలం కప్పటం సాధ్యంకాదు గనకనూ, వానలు లేనప్పుడు ఇళ్లు కప్పనవసరమేలేదు కనకనూ, సారా అంగడిలోనూ, రహదాని పైనా, ఎక్కడ కావాలంటే అక్కడ బోలెడంత జాగా ఉంటూండగా మనుషులు ఇళ్ళలోనే ఉండాలని ఏమిటి? ఈ వాదనలో కొంత అర్థం లేకపోలేదు మరి. గుడిసెల కిటికీల రెక్కడలకు అద్దాలు లేవు, కొన్నింట చింకి గుడ్డలూ, కోట్లూ కుక్కి ఉన్నాయి. రష్యాలో గుడిసెలకు ఎందుకో చూరుకు దిగువగా బాల్కనీలు కట్టి, వాటికి అడ్డకమ్ములు పెడతారు, ఇవి వాలిపోయి నల్లగా వుండడంవల్ల, నిరుపయోగం కావటానికితోడు, చూడటానికైనా అందంగా లేవు. గుడిసెలకు వెనకగా చాలచోట్ల పెద్ద పెద్ద ధాన్యం మేట్లు బారుగా వేసి ఉన్నాయి; అవి ఏళ్ళతరబడి అలాగే ఉన్నాయిలాగుంది. సరిగా కాలని ఇటుకల రంగులో ఉన్నాయి.వాటి పైభాగాన ఏవో పిచ్చి మొక్కలు కూడా మొలిచాయి, కిందిభాగంలో పొదలు పెరిగాయి. ఆ ధాన్యం భూస్వామిది లాగుంది. ఈ ధాన్యపు మేట్ల వెనకగా, శిధిలమైన కప్పుల అవతల, పక్కపక్కగా రెండు చర్చీలున్నాయి;ఒకటి కర్రతో చేసినది,ఉపయోగంలో లేదు. రెండోది ఇటుకలతో కట్టినది. దానిగోడలు పచ్చగా ఉన్నాయి, వాటిమీద మరకలూ బీటలూ ఉన్నాయి. బండి ఇటూ అటూ తిరుగుతూ పోతుంటే అవి ఒకసారి ఎడమచేతి వైపునా, మరొకసారి కుడిచేతి వైపునా కనిపించుతూ, మాయమవుతూ వచ్చాయి. భూస్వామి భవంతిభాగాలు కనపడి చివరకు గుడిసెలమధ్య ఖాళీరాగానే ఒక్కసారి ఇల్లంతా కనపడింది.ఖాళీజాగాలో కూరమళ్లూ,కాబేజీ మొక్కలూ వేసి చుట్టూ కంచెలు కట్టారు, ఆ కంచెలు అక్కడక్కడా పడిపోయి వున్నాయి. అమిత నిడుపుగావున్న ఈ దేవిడీ, మంచానపడి తీసుకునే రోగిలాగా ఉన్నది. దీనికి కొన్నిచోట్ల ఒక అంతస్తే వున్నది, మరి కొన్ని చోట్ల రెండున్నాయి. దాని కప్పు నల్లబారివున్నది. అక్కడక్కడా శిధిలమైకూడా ఉన్నది. ఆ కప్పులో పక్కపక్కనే రెండు బురుజుల లాటివి ఉన్నాయి. రెండూ అసనాటుగానే ఉన్నాయి, వాటికి వేసిన రంగు కూడా కొంతమేర పోయివున్నది. గోడల లోపలికర్ర అక్కడక్కడా బయటపడింది. అది వానలూ, తుఫానులూ, రుతువుల మార్పులూ మొదలైనవాటికి బాగా దెబ్బతిన్నది. కిటికీలలో రెండు మాత్రమే తెరిచివున్నాయి, మిగిలినవి మూసివున్నాయి, కొన్నింటికి శాశ్వతంగా చెక్కలుకొట్టేశారు. తెరిచిఉన్న రెండు కిటికీలు కూడా సగం “గుడ్డివి”. ఒక దానిమీద చక్కెర పొట్లం కాగితం, నీలరంగూ, ముక్కోణాకారమూ గలది అంటింటి ఉన్నది.

ఇంటి వెనకగా ఉన్న పాతతోట గ్రామాన్ని దాటి చాలా దూరం వెళ్ళిపోయింది. దానికి ఆలనా పాలనా వున్నట్టు లేదు. ఇంత పెద్ద గ్రామంలోనూ కాస్త కనుల పండువుగావున్నది ఇది ఒకటే. ఎవరూ కత్తిరించని చెట్లతలలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని, ఆకుల మబ్బుల్లాగా, ఆకాశానికి కట్టిన చాందినీల్లాగా కదిలే ఆకులతో అంతంగా వున్నాయి. ఒక బ్రహ్మాండమైన బర్చ్ చెట్టు ఆ ఆకుపచ్చ చాందినీల మధ్యగా పాలరాతి స్తంభంలాగా నిగనిగలాడుతూ నిలబడివున్నది. ఏ గాలికో ఏ తుఫానుకో దాని తల విరిగిపోయింది. తెల్లని కాండంమీద ఏటవాలుగా ఉన్న విరిగినభాగం నల్లగా టోపీ పెట్టినట్టు, లేక ఏదో పక్షి వాలినట్టు కనిపిస్తున్నది. ఒక లత ఎన్నో పొదలను కప్పేసి, ఒక అలవ అంతటా పాకుకుంటూ వచ్చి ఈ బర్చ్ కాండాన్ని పట్టుకుని సగందాకా ఎగబాకి, మళ్ళీ దిగివచ్చి ఇతర చెట్ల తలలను అందుకుంటూ తోరణాలు కట్టింది; అవి పిల్లగాలికి అల్లల్లాడుతున్నాయి. దట్టమైన పొదలమీద సూర్యకాంతి పడుతున్నది, ఆ పొదల మధ్య ఎడంఉన్న చోట లోపలి భాగాలు చీకటిగా, గుహల్లాగా ఉన్నాయి. ఆ చీకటి మధ్యను ఒక సన్నని కాలిబాటా, విరిగిపోయిన కంచె కర్రలూ, ఎండిపోతున్న విల్లో చెట్టు మొండెమూ, దానినిండా కంతలూ, దాని వెనకనుంచి దట్టంగా పెరుగుకుంటూ వచ్చిన బూడిదరంగు ఆకులపొదా, దాని ప్రక్కనుంచి తోసుకువచ్చిన లేత యేపిల్ కొమ్మా, పక్షి గోళ్ళలాటి దాని ఆకులూ అస్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్యకిరణాలు ఎలాగో ఈ యేపిల్ ఆకుల వెనకపడి ఎర్రని చెయ్యిలాగా ఆ చీకటిలో ధగధగా మెరిశాయి. ఒక ప్రక్కగా, తోటకు ఒక చివర కొన్ని ఆస్పెన్ చెట్టు మిగిలిన చెట్ల కంటే ఎత్తుగా పెరిగాయి. ఎత్తిపట్టిఉన్న వాటి కొమ్మల చివరలఉన్న కాకి గూళ్ళున్నాయి. వాటి కొమ్మలు కొన్ని విరిగి ఎండిపోయిన ఆకులతో వేళ్ళాడుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ అందం ఆచ్చగా ప్రకృతిలోగాని, అచ్చగా మానవసృష్టిలోగాని లభ్యమయేది కాదు, రెండూ కలిసినప్పుడే లభ్యమవుతుంది; మనిషి చాతకాకుండా చేసిన పనికి ప్రకృతి మెరుగులు దిద్దుతుంది, మనిషి నిర్ణయించిన సమమితులన్నిటినీ వంకరపోగొట్టి, పధకాలన్నిటినీ తుడిచిపెట్టి, తూచాలన్నిటినీ తోసిపుచ్చి హృదయస్పందనం చేకూర్చుతుంది.

రెండు మూడు మలుపులు తిరిగినాక మన కథానాయకుడు ఇంటి ముందు భాగాన్ని చేరుకున్నాడు. అది దగ్గిరనుంచి చూస్తే మరింత దిగులు పుట్టిస్తున్నది. గేటుకూ, కంచెకూ ఉపయోగించిన పాతకర్రలు పాకుడుపట్టి ఆకుపచ్చగా ఉన్నాయి. ఆవరణనిండా ఉన్న పనివాళ్ళ ఇళ్ళూ, ధాన్యపుకొట్లూ, సామాన్ల ఇళ్ళూ శిథిలావస్థలో ఉన్నట్టున్నాయి. కుడివైపునా, ఎడమవైపునా ఇతర ఆవరణలుండి వాటికి గేట్లున్నాయి. ఒక్కప్పుడిదంతా వైభవోపేతంగా ఉండేదని తెలియవస్తున్నా ఇప్పుడు మటుకు నిర్జీవంగా వున్నది. ఈ దృశ్యాన్ని చైతన్యవంతం చేస్తూ ఒక తలుపు తెరుచుకోవటంగాని, నౌకర్లు బయటికి రావటంగాని, ఇంటిపనులు సాగుతున్న సందడి ఎలాటిదీ లేదు. పెద్ద గేటు మాత్రం బార్లా తెరిచి ఉన్నది. అది కూడా ఎందుకంటే, అంతకుముందే ఒక రైతు ఒక బండి మీద ఏదో వేసుకుని, పైన గోతాలు కప్పి, లోపలికి తోలుకుంటూ వచ్చాడు. ఈ నిర్జీవ ప్రదేశానికి కాస్త చైతన్యం కలిగించే ఉద్దేశంతో మాత్రమే వాడు వచ్చినట్టున్నది. ఇతర సమయాల్లో గేటు మూసివుంటుంది లాగున్నది, ఎందుకంటే దాని కొక్కెంలో పెద్ద తాళం వేళ్ళాడుతున్నది. ఒక ఇంటి వద్ద ఎవరో రైతుతో పేచీపడుతూండటం చిచీకవ్ త్వరలోనే పసికట్టాడు. చాలాసేపు ఆ మనిషి మగవాడో, ఆడదో తెలియరాలేదు. దుస్తులు అంత స్ఫుటంగా లేక ఆడదాని డ్రెసింగ్ గౌనులా గున్నాయి. నెత్తిపైన పల్లెటూరి స్త్రీలు ధరించే కుళాయి ఉన్నది. కాని గొంతు మటుకు ఆడవాళ్ళ గొంతు కన్న బొంగురుగా ఉన్నది. “ఆడదే”, అనుకుని అంతలోనే, “ఎబ్బే, కాదు!” అనుకున్నాడు. చిట్టచివరకు పరిశీలనగా చూసి, “ఆడది కాకేం!” అనుకున్నాడు. ఆ వ్యక్తి కూడా అతనికేసి పరిశీలనగానే చూసింది, కొత్త మనిషి రావటం పరిపాటి కాదులాగుంది. ఎందుకంటే ఆ మనిషి సేలిఫాన్‌నూ, గుర్రాలనూ కూడా నఖశిఖపర్యంతం పరిశీలించింది. ఆమె నడుముకు వేళ్ళాడే తాళపు చెవులను బట్టీ, ఆమె రైతు మీద నోరు పారేసుకోవటాన్ని బట్టీ ఇల్లు చూసుకునే ఆమె అయిఉంటుందని చిచీకవ్ ఊహించాడు.

“ఇదుగో, ఏమమ్మా, షావుకారుగారు…” అని అతడు బండి దిగుతూ ప్రారంభించాడు.

“ఇంటో లేరు” అన్నదామె అతని ప్రశ్న పూర్తికానివ్వకుండానే, తరవాత క్షణం ఆగి “మీకేం పని?” అని అడిగింది.

“ఒక వ్యవహారం ఉన్నది”

“లోపలికి వెళ్ళండి,” అంటూ ఆమె వెనక్కు తిరిగి, వీపుకు అంటుకునిఉన్న పిండీ, పావడాలో ఉన్న చిరుగూ ప్రదర్శించింది.

అతను ఒక పెద్ద హాలులోకి అడుగుపెట్టాడు. లోపల చీకటి చీకటిగానూ, నేలమాళిగలాగ చల్లగానూ ఉన్నది. హాలుదాటి ఒక గదిలోకి వెళ్ళాడు, అక్కడా చీకటిగానే ఉన్నది. తలుపు కింది భాగంలో ఉండే పగులులోనుంటి అస్పష్టంగా వెలుతురు వస్తున్నది. ఈ తలుపు తెరిచి అతను వెలుగులోకి అడుగుపెట్టాడు. అక్కడ అతను చూసిన గందరగోళానికి కంగారు పుట్టింది. అది చూస్తే ఇల్లు బాగుచేస్తున్నారా అనిపించింది. చెక్క సామానంతా ఈ గదిలో కుప్పవేసి ఉన్నది. ఒక బల్ల మీద విరిగిపోయిన కుర్చీ నిలబెట్టి వున్నది. సమీపంలోనే ఒక గడియారం ఉన్నది. దాని లోలకం ఆడటం లేదు, దాని మీద సాలీడు అప్పుడే గూడుకూడా అల్లింది. ఆ ప్రక్కనే ఒక చెక్కల అర గోడకు చేలగిలపెట్టి వున్నది, అందులో వెండిసామాన్లూ పింగాణీ సామాన్లూ ఉన్నాయి. ఒక బీరువా లోపలిభాగంలో ముత్యపు చిప్ప ముక్కలు పొదిగారు, వాటిలో కొన్ని రాలిపోయి జిగురుతో కూడిన పసుపుపచ్చని మరకలు కనిపిస్తున్నాయి. ఈ బీరువాలో రకరకాల వస్తువులు ఎన్నోవున్నాయి, జిలుగురాతతో నిండిన కాగితాల బొత్తీ, వాటి పైన బరువుకు వుంచిన కోడిగుడ్డు ఆకారం గల పాలరాతి గుండూ, తోలు బైండుగల ఒక పాతకాలపు పుస్తకమూ, ఎండి ముడుచుకుపోయిన నిమ్మకాయా, విరిగిపోయిన వాలుకుర్చీ చెయ్యీ, ఒక వైన్ గ్లాసులో ఏదో ద్రవమూ, మూడు ఈగలూ, దానిపైన ఒక మూతా, సీలులక్కా, ఎక్కడో దొరికిన ఒక గుడ్డపీలికా, సీరా అట్టగట్టుకుపోయిన రెండు కలాలూ, ఫ్రెంచి వాళ్ళు రష్యాపైకి దండెత్తిరాక పూర్వం ఇంటి యజమాని పళ్ళలో పీచు తీసుకోడానికి ఉపయోగించి కాలక్రమాన పసుపురంగుకు తిరిగిన ఒక పుల్లా వున్నాయి.

గోడలమీద పటాలు ఒక దానిలో ఒకటి ఇరికించి, ఎలాపడితే అలా తగిలించి ఉన్నాయి. వాటిలో ఒక పొడుగుపాటి శిల్పచిత్రం ఉన్నది, చాలా పాతది, పచ్చబడిపోయింది. దానికి అద్దం కూడా లేదు. అందులో ఒకరకమైన యుద్ధం చిత్రించి ఉన్నది. పెద్ద పెద్ద రండోళ్ళున్నాయి, ముక్కోణపు టోపీలు ధరించి కేకలు పెట్టే సైనికులున్నారు, నీటిలో మునిగిపోయే గుర్రాలున్నాయి. ఈ బొమ్మకు ఒక కొయ్యచట్రం ఉన్నది. అంచుల వెంబడి కంచు రేకులూ, కోణాలలో కంచుబిళ్ళలూ పొదిగారు. దాని ప్రక్కనే, గోడలో సగం ఆక్రమించుకుని ఒక పెద్ద తైలవర్ణ చిత్రం చాలా పెద్దది, మాసిపోయి ఉన్నది. ఆచిత్రంలో పూలూ, పళ్ళూ, కోసిన పుచ్చకాయా, ఒక పదింతలా, తల వేళ్ళాడవేసిన బాతూ చిత్రించి ఉన్నాయి. కప్పు మధ్యనుంచి ఒక షాండిలియర్ వేళ్ళాడుతున్నది. దానికి తొడిగిన కవరునిండా దుమ్ముండి చూడటానికి పట్టుపురుగు కోశంలాగా ఉన్నది.బల్లమీద ఉంచడానికి యోగ్యంకాని మొరటు వస్తువులన్నీ నేలమీద పోగువేసి ఉన్నాయి. ఆ కుప్పలో ఏమున్నదీ చెప్పటం చాలా కష్టం, ఎందుకంటే వాటినిండా దుమ్ము ఎంత మందంగా ఉన్నదంటే ఏదన్నా వస్తువు పైకితీయడానికి ప్రయత్నిస్తే చేతికి దుమ్ము తొడుగు అంటుకుంటుంది. ఆ కుప్పలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నవల్లా విరిగిన కొయ్య పారముక్కా, ఒక పాతబూటు అడుగు భాగమూనూ. బల్లమీద నెత్తికి తగిలించుకునే కుళాయే లేకపోతే ఆ గదినిఎవరైనా ఉపయోగిస్తున్నారని ఊహించటం అసంభవమై ఉండును. చిచీకవ్ ఈ వింత ప్రదేశాన్ని పరిశీలిస్తూండగా పక్కవాకిలి తెరుచుకుని, బయటి ఆవరణలో కనిపించిన గృహనిర్వాహకురాలే లోపలికి వచ్చింది. అయితే ఈ మనిషి గృహనిర్వాహకురాలల్లే కనిపించటం మానేసి ఇంటి పనిపెత్తందారల్లే కనిపించసాగాడు. ఎందుకంటే గృహనిర్వాహకురాళ్లు గడ్డం చేసుకోరు, కాని ఈ మనిషి చేసుకోనేలాగా కనబడ్డాడు. తరచు కాదు, ఎప్పుడన్నా; అందుకే ఆ మనిషి గడ్డమూ, కింది దవడలూ గుర్రాలకు ఉపయోగించే తీగ బ్రషులలాగా ఉన్నాయి. చిచీకవ్ ప్రశ్నార్థకంగా చూస్తూ పని పెత్తందారు ఏమంటాడో అని ఎదురుచూశాడు. పని పెత్తందారు కూడా చిచీకవ్ ఏమంటాడో అని చూడసాగాడు, చిచీకవ్ ఆ మనిషి పస్తాయింపు చూసి ఆశ్చర్యపడుతూ చిట్టచివరకు ఒక నిశ్చయానికి వచ్చి,”మీ యజమాని ఎక్కడ? ఇంటో ఉన్నారా?”అని అడిగాడు.

“యజమాని ఇక్కడే ఉన్నాడు” అన్నాడు పెత్తందారు.

“ఏరీ?” అన్నాడు చిచీకవ్.

“మీకు కళ్లుకూడా లేవుటండీ? నేనే యజమానిని!”అన్నాడు పెత్తందారు.

ఈమాట విని మన కధానాయకుడు ఒక్క అడుగు వెనక్కు వేసి గుడ్లు పెట్టుకుని ఆ మనిషి కేసి చూశాడు. మీరూ, నేనూ ఎన్నడూ చూడని ఎన్నో రకాల మనుషులను అతను చూశాడు. కాని ఇలాంటి మనిషిని ఎన్నాడూ చూడలేదు. ఆయన ముఖంలో వింత ఏమీలేదు, సన్నగా, పొడూగ్గా ఉండే ముసలివాళ్ల ముఖమేఅది;అయితే ఆయన గడ్డం ఎలా పొడుచుకు వచ్చిందంటే ఉమ్మేసేటప్పుడు గడ్డంమీద పడకుండ చేతి రుమాలు గడ్డానికి అడ్దం పెట్టుకోవలసి వచ్చేది. ఆయన చిన్నకళ్లు వయసుతో కాంతిహీనం కాలేదు;ఏదైనా పిల్లిగాని, కొంటెపిల్లకాయలుగానీ ఉన్నారేమో చూడటానికి తమ కలుగుల్లో నుంచి మూతులు బయటికి పెట్టి చెవులు రిక్కించి ఆలకిస్తూ, గాలిమూచూసే చిట్టెలుకల్లాగా ఆయన కళ్ళు చూరుల్లాంటి కనుబొమలకింది నుంచి అటూ ఇటూ తారట్లాడాయి. ఆయన దుస్తులే ఇంకా వింతగా ఉన్నాయి. ఆయన వేసుకున్న డ్రసింగ్ గౌన్ దేనితో తయారయిందో కనిపెట్టటానికి ఎంత కృషి చేసీ, పనిశోధనలు జరిపీ ఫలితం ఉండదు. ఆయన చొక్కా చేతులూ, అంచూలూ బాగా జిడ్డుపట్టి నిగనిగలాడుతూ ఎత్తుబూట్లు తయారుచేసే తోళ్ళలాగా ఉన్నాయి. వెనకపక్క రెండు “తోక”లుండటానికి బదులు నాలుగున్నాయి. వాటినుంచి పత్తి వెళ్ళుకొస్తున్నది. ఆయన మెడకు చుట్టుకున్న పదార్థం కూడా పోల్చటానికి వీలులేనిదే, అది స్టాకింగు అయి ఉండవచ్చు. కట్టపీలిక కావచ్చు, నడుముకు పెట్టుకునే బెల్టు కావచ్చు మెడకు చుట్టుకు నేరుమాలు మాత్రం కావటానికి వీల్లేదు. చిచీకవ్ ఈ మనిషిని ఇదే వేషంలో ఏ చర్చి వెలపలగాని చూసిఉంటే బహుశా ఒక రాగి డబ్బు ధర్మం చేసి ఉండేవాడన్నమాట. ఎందుకంటే మన కధానాయకుడు దయార్ద్రహృదయుడు, పేదవాళ్ళు కనిపిస్తే ఒక తృణం ఇవ్వకుండా ఎన్నడూ ఊరుకునేవాడు కాడు. కాని ఈ మనిషి బిచ్చగాడు కాడు, భూస్వామి. ఈ భూస్వామి కింద వెయ్యిమందికి పైగా కమతం చేసే రైతులున్నారు; ఈయనకున్నంత ధాన్యమూ, పిండీ మూలుగుతూ, ధాన్యపుకొట్లనిండా, సామాన్ల ఇళ్ళ నిండా వస్త్రాలూ, గొర్రెతోళ్ళూ, ఎండుచేపలూ, తోటలోపండే పళ్ళూ అడవుల్లో దొరికే కుక్కగొడుగులూ సమృద్ధిగా గలవాడు మరొక భూస్వామి కనిపించటం కష్టం. ఆయనను దొడ్డిలో ఉన్న రకరకాల కలపా, ఎన్నడూ వాడని పాత్ర సామాగ్రీ మధ్య ఉండగా చూసినవాళ్ళు చప్పున మాస్కో సంతలో ఉన్నామనుకునే పనే; ఆ సంతకు అత్తగార్లు వంట మనుషులను వెంటబెట్టుకొని అడావుడిగా వచ్చి తమకు కావల్సిన సామాన్లన్నీ కొంటారు; అక్కడ సమస్త విధాల చెక్క సామగ్రీ-మేకులు కొట్టి బిగించినవీ, తరువణి పట్టినవీ, జాయింట్లు వేసినవీ-తెల్లగా కుప్పలు పోసి ఉంటాయి. తొట్టెలూ, తురుముడు పీటలూ, బాల్చీలూ, పీపాలూ, కొమ్ములున్నవీ లేనివీ కొయ్యలోటాలూ, కప్పులూ, తట్టలూ, బుట్టలూ, రష్యాలోని ధనికులూ, పేదసాదలూ వాడే వస్తువులన్నీ ఉంటాయి. ప్ల్యూష్కిన్ ఈ సామాన్లన్నీ ఏం చేసుకుంటాడా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. తన ఎస్టేటు ఇంతకు రెండింతలున్నప్పటికీ ఆయన తన జీవితకాలంలో వాటన్నిటినీ వాడుక చెయ్యలేడు, అయినా ఆయనకివి చాలలేదు. వీటితో తృప్తికలగక ఆయన ప్రతిరోజూ గ్రామంలోని వీధులన్నీ తిరిగి, వంతెనల కిందా, చెక్కలకిందా చూసి, తనకు కనిపించినదల్లా -పాతతోలుముక్కయేది, రైతుస్త్రీలు పారేసిన గుడ్డపీలిక అయేది, ఇనప మేకయేది, పలిగిన కుండపెంకు అయేది, ఇంటికి తెచ్చి, చిచీకవ్ గదిమూల చూసిన కుప్పలో చేర్చుతూ ఉండేవాడు. “అడుగోరోయ్, చేపలు పట్టేవాడు వేటాడుతున్నాడు!” అని రైతులు ఆయనను చూడగానే అనుకునేవారు. నిజంగా కూడా ఆయన వచ్చి వెళ్ళాక వీధులు ఊడ్చవలసిన అవసరం ఉండేదికాదు. దారివెంబడి ఎవరైనా అధికారి గుర్రంమీద సవారీ అయిపోయేటప్పుడు ఆరె, జారిపడిపోతే అది కాస్తా ఆయన ఇంటికి చేరేది. బావి దగ్గిర ఎవరైనా ఆడమనిషి బిందె మరిచి పోతే దాన్ని కూడా ఆయన పట్టుకువచ్చేసేవాడు. ఇలాటప్పుడు ఎవరన్నా రైతు తనను పట్టుకుంటేమటుకు పేచీ పెట్టకుండా వస్తువు ఇచ్చేసేవాడు. అయితే వస్తువు కుప్పలోకి చేరిందో ఇక దాని గతి అంతే; దాన్ని ఎప్పుడో ఎవరివద్దో కొన్నానని ప్రమాణాలు చేసేవాడు, లేకపోతే తన తాతగారి నాటినుంచి ఆ వస్తువు వస్తున్నదనేవాడు, తన గదిలో కూడా నేల మీద లక్కముక్క గాని, కాగితం తుంపుగాని, ఈకలు గాని కనిపిస్తే ఏరి బీరువామీదనో, కిటికీలోనో పెట్టేవాడు.

(సశేషం)

Posted in కథ | Tagged , , | Comments Off on మృతజీవులు – 24

కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం!

– రంగనాయకమ్మ

‘పొద్దు.నెట్’ పత్రికలో వచ్చిన నిడదవోలు మాలతి గారితో ఇంటర్వ్యూ చూశాను. దానిలో, “రంగనాయకమ్మ రాసిన పుస్తకంలో నా కధని వాడుకున్న తీరుకి నా అభ్యంతరాలు” అన్న ఉపశీర్షిక కింద మాలతి గారు నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. వాటికి నా సమాధానం ఇదీ:
—————————-
మాలతి గారు తన ఇంటర్వ్యూలో, తను రాసిన కధ పేరు ప్రస్తావించారు (“నిజానికీ ఫెమినిజానికీ మధ్య”). కానీ ఆమె కధని ఏ పుస్తకంలో నేను వాడుకున్నానని ఆమె అన్నారో, ఆ పుస్తకం పేరు చెప్పలేదు. ఆ పుస్తకం పేరు: “అసమానత్వంలోనించి, అసమానత్వంలోకే! [స్త్రీ-పురుష సంబంధాల గురించి బూర్జువా ఫెమినిస్టులు చేసే వాదనలను మోర్గాన్, ఏంగెల్స్, లెనిన్‌ల సూత్రీకరణల ఆధారంగా విమర్శించిన వ్యాసాలు!]” 1989 సెప్టెంబర్‌లో మొదటిసారి వచ్చిన ఈ పుస్తకం, ఇప్పటికి 4 ముద్రణలు పడింది.

ఇప్పుడు వరసగా ఆమె ఆరోపణలూ, నా జవాబులూ!

మాలతి గారి మొదటి ఆరోపణ: “అసలు ఆ పుస్తకం మంచి రచయితకి వుండ వలసిన సంయమనంతో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేదిగా కాక, తనకి మరెవరి మీదో వున్న కక్ష తీర్చుకోడానికి రాసింది. నా కధని ఒక ఆయుధంగా వాడుకున్నట్టు కనిపిస్తుంది.”

ఆ పుస్తకాన్ని ఎందుకు, ఏ సందర్భంలో రాశానో మొదటి ముద్రణకు రాసిన ముందు మాటలోనే చాలా వివరంగా చెప్పాను. మాలతి గారి మొదటి ఆరోపణకు, ఆ ముందు మాటే జవాబు చెబుతుంది. దాన్ని ‘పొద్దు’ పాఠకుల కోసం ఇక్కడ తిరిగి ఇస్తున్నాను.

ముందు మాట
(మొదటి ముద్రణకు రాసినది)

” ‘మూడు తరాలు’ అని ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, మీరు చూశారా? దాని మీద మీరు తప్పకుండా ఏదన్నా రాయాలి” అనీ, “ఏమన్నా రాస్తున్నారా?” అనీ, ఆ పుస్తకం వచ్చిన కొత్తలో నాకు కొన్ని ఉత్తరాలు వచ్చాయి.
ఆ ఉత్తరాలన్నిటికీ నేను ఒకటే సమాధానం రాశాను – “ఆ పుస్తకం బాగోలేదని మీరంటున్నారు కదా? ఆ మాటే ఏదన్నా పత్రిక్కి మీరే ఎందుకు రాయరూ? ఏం బాగో లేదో మీకెలా అనిపిస్తే అలా మీరే రాయండి. కావాలంటే, మీరు రాసింది ఒకసారి నాకు పంపించండి. నా అభిప్రాయం చెపుతాను” అని.
ఆ తర్వాత కొన్నాళ్ళకి హైదరాబాదులోనే కొందరు కాలేజీ అమ్మాయిలు ఏడెనిమిది పేజీల వ్యాసం ఒకటి రాసి పట్టుకొచ్చారు. కొన్ని పాయింట్లు రాశారు గానీ, అది చాలా తక్కువ. కనీసంగా చెప్పవలసిన దాంట్లో పదోవంతు కూడా రాలేదు అందులో. పైగా, చెప్పిన విషయాలు ఒక వరసలో లేవు.
“సరే, నేను ఇంకా కొన్ని పాయింట్లు చేర్చి అన్నీ ఒక వరసలో పెట్టి ఇస్తాను. తర్వాత మీరు మళ్ళీ రాయండి” అన్నాను.
ఆ రోజే నేను, అదే విషయం మీద, ఇంకొకరికి కూడా టైము ఇచ్చి ఉండడం వల్ల, ఇద్దరు ‘లా’ కాలేజీ అబ్బాయిలు కూడా ఒక వ్యాసం తీసుకొచ్చారు. కొంతమంది స్టూడెంట్సు కలిసి డిస్కస్ చేసుకుని అది రాశామని చెప్పారు. అందరం కలిసి ఆ వ్యాసం కూడా చదివాము. దాన్ని ఇంకా సరిచేసి మళ్ళీ రాసి ఏదన్నా పత్రిక్కి పంపిస్తామని ఆ స్టూడెంట్సు అన్నారు.

అమ్మాయిల వ్యాసం గురించి, ‘రెండు రోజుల్లో కొంచెం మార్చి, కొన్ని పాయింట్లు చేర్చి ఇస్తాన’ని అమ్మాయిలతో చెప్పాను. ఆ వ్యాసానికి ఇంకో 50 పాయింట్ల దాకా చేర్చాను. ప్రారంభం మార్చి, అన్నీ ఒక వరసలో పెట్టి, దాన్ని తర్వాత ఆ అమ్మాయిలకు చూపించాను. వాళ్ళు దాన్ని చూసి, “ఇదంతా మేము రాయడం కష్టం, మీరే రాయండి” అని దాన్ని వదిలేసి వెళ్ళారు. తర్వాత నేనే దాని పని చేశాను.

‘మూడు తరాలు’ కధ చాలా చిన్న కధే. లెనిన్ కాలం నాటి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, ‘స్త్రీ పురుష సంబంధాల’ గురించి మార్క్సిస్టు దృష్టితో చెపుతున్నానంటూ రాసిన కధ కావడమే ఈ కధ ప్రత్యేకత. ‘ఈ కధ, స్త్రీలకు గొప్పగా ఉపకరిస్తుందని ఇప్పుడు ఒక ‘స్త్రీల సంఘం’ ఈ కధని పూర్తిగా సమర్థించడం ఇంకో ప్రత్యేకత. (ఈ వివరాలన్నీ వ్యాసంలో ఉన్నాయి.)

‘స్త్రీ పురుష సంబంధాల’ గురించి అనేక హేతు విరుద్ధ మార్గాలు గతంలో కన్నా విజృంభించి, మారిన రూపాలతో ప్రచారమవుతోన్న ఈనాడు ఇది తేలిగ్గా వదిలి వెయ్య వలసిన విషయం కాదు.

వ్యాపార పత్రికల్లో లక్ష రకాల తప్పుడు సాహిత్యం వస్తూ ఉంటుంది. కానీ, అది “అభ్యుదయం”గానో, “విప్లవం”గానో పోజు పెట్టదు. అది ‘వ్యాపార’ సాహిత్యం’ అని రాసే వాళ్ళకీ, వేసే వాళ్ళకీ, చదివే వాళ్ళకీ, తెలుస్తూనే ఉంటుంది. దాని ప్రభావంలో పడే పాఠకులు కూడా ‘అభ్యుదయ మార్గం’లో సాగిపోతున్నామని తాము భావించడం గానీ, ఇతరులకు బోధించడం గానీ, చెయ్యరు. తాగుళ్ళూ, మత్తు మందులూ అలవాటైపోతూ ఉన్నట్టే, వ్యాపార సాహిత్యం కూడా ఒక వ్యసనంలా అలవాటైపోతూ ఉంటుంది. అది తెలిసిపోతూనే ఉంటుంది.
కానీ, ఈ ‘నూతన ఉద్యమాల’ పోజుతో వచ్చే సాహిత్యంతోనే పాఠకులు గందరగోళ పడతారు. ఆ ఉద్యమంలోకి ‘మార్క్సిజం’ అనే మాట కలిస్తే ఆ గందరగోళం వెయ్యి రెట్లవుతుంది.

‘మార్క్సిజం’ అనే సిద్ధాంతానికి, సహజంగానే బలం ఉంది. సత్యానికీ, న్యాయానికీ ఉండే బలం అది! అయితే, దాన్ని గ్రహించడంలో ఉండే అనేక అస్పష్టతల వల్లా, దాన్ని ఆచరించవలసిన నాయకులే దానికి విరుద్ధమైన బూర్జువా భావజాలంలో పడి కొట్టు కుంటూ ఉండడం వల్లా, మార్క్సిజం ఇంకా ఇంకా పెద్ద పెద్ద అపజయాల మీదుగా సాగుతోంది. అది ఎన్ని అపజయాలు పొందినా, ఆ సిద్ధాంతంలో అంతర్గతంగా ఉన్న శక్తి వల్ల, ఒక బూర్జువా సిద్ధాంతం కూడా ‘మార్క్సిజం’ ముసుగు వేసుకోగానే, ఆ మాటతోనే, అది అనేక భ్రమలు కల్పిస్తుంది.
‘మూడు తరాలు’ కధ రాసింది ఒకప్పటి రష్యన్ కమ్యూనిస్టు నాయకురాలు కాబట్టి, ఆ కధలో ఏదో ‘నూతన మార్గం’ ఉన్నట్టుగా కొందరు పాఠకులైనా భావిస్తారు. అయితే, ఆ రకం భావాల్ని లెనిన్ లాంటి మార్క్సిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారనే విషయం మాత్రం ఆ పుస్తకం ద్వారా తెలీదు.

అలాగే, ఒక “స్త్రీల సంఘం” అనేది, స్త్రీల గురించి ఏమైనా చెప్పగానే, “స్త్రీల గురించి స్త్రీలే చెపుతున్నారు కాబట్టి ఇది కరక్టే అయివుంటుంది” అనిపిస్తుంది. కానీ, ఒక ‘స్త్రీల సంఘం’ చెప్పేదే స్త్రీలందరి అభిప్రాయం కాదనీ; స్త్రీలలో కూడా బూర్జువా వర్గ స్త్రీలూ, శ్రామిక వర్గ స్త్రీలూ ఉన్నారనీ; శ్రామిక వర్గ స్త్రీలలో కూడా బూర్జువా వర్గ భావాలతో కొట్టుకుపోయే వాళ్ళు ఉన్నారనీ – చాలామంది పాఠకులకు తెలీదు.
పాఠకుల్లోనే రెండు వర్గాలూ ఉన్నారు!

‘వర్గ సమాజం’లో సంఘాలూ, ఉద్యమాలూ వర్గాతీతమైనవి కావు. ‘స్త్రీల సంఘాలు’ అనగానే అవి తప్పని సరిగా స్త్రీలకు మేలు చేస్తాయనీ, ‘కార్మిక సంఘాలు’ అనగానే అవి తప్పని సరిగా కార్మికులకు మేలు చేస్తాయనీ, ‘జాతీయ పార్టీలు’ అనగానే అవి తప్పని సరిగా ‘జాతి’కి మేలు చేస్తాయనీ – ఇలా, భావిస్తూ పోతే, అంతకన్నా పెద్ద భ్రమ ఏదీ ఉండదు.

కాబట్టి, సంఘాలకీ, ఉద్యమాలకీ ఉండే ‘పేర్లు’ ముఖ్యం కాదు. వాటి ‘సారాంశం’ ముఖ్యం! ఒక వ్యక్తి గానీ, ఒక సంఘం గానీ, ఒక ఉద్యమం గానీ, ఏం చెప్పినా, దాన్ని “హేతుబద్ధతగల తర్కం”తో విమర్శించి చూడాలి. ఆ పరీక్షలో నిలబడినదాన్నే సరైనదాన్నిగా గ్రహించి తీసుకోవాలి.
‘మూడు తరాలు’ కధ మీద నేను రాసిన వ్యాసం ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో 10-2-89 సంచిక నించీ, 14-4-89 సంచిక వరకూ 10 వారాల పాటు వచ్చింది.

ఆ తర్వాత 8 వారాల పాటు దాని మీద అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కొన్ని ఉత్తరాలు కూడా వచ్చాయి. ఆ ఉత్తరాల్లో అనుకూలమైన వాటి గురించి చెప్పవలసిందేమీ లేదు కాబట్టి, వ్యతిరేకమైన 5 ఉత్తరాల్నీ, ఉత్తరం కాని ఇంకో విమర్శనీ ఎంచుకుని, వాటికి జవాబులు రాశాను. ఆ జవాబులన్నీ ఈ పుస్తకంలోనే “వ్యాసం తర్వాత …” అనే చాప్టరులో ఉన్నాయి.
ఆ రకం ధోరణుల్లో మరింత ప్రత్యేకత గల ధోరణి “అతడి బిడ్డ సిద్ధాంతం!” ఇదేమిటో అక్కడే చూడండి.
తర్వాత, ముగింపు సూచనలు!

– రంగనాయకమ్మ
4-9-1989

ఆ వ్యాసం రాసిన సందర్భాన్ని ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా, “మరెవరి మీదో కక్ష తీర్చుకోడానికి” రాసినట్టూ, తన కధని నేను “ఒక ఆయుధంగా వాడుకున్న”ట్టూ మాలతి గారు అంటే, ఇక దానికి మళ్ళీ చెప్పవలసిందేమీ లేదు.

మాలతి గారిని నేను అడగగలిగేది ఒకటే. “మరెవరి మీదో కక్ష తీర్చుకోడానికి” మీ కధని “ఒక ఆయుధంగా వాడుకున్న” నన్ను, నేను రాసిన “ఆర్తనాదం” కధని ఇంగ్లీషులోకి అనువదించుకోడానికి అనుమతి ఎందుకు అడిగారు? ఎందుకు అనువదించారు? అనువదించాక, మరి కొన్ని కధలతో, ఒక సంకలనంలో నా కధని కూడా చేర్చుకోడానికి మళ్ళీ అనుమతి ఎందుకు అడిగారు?

సంకలనంలో వేసుకోడానికి అనుమతి ఇస్తూ, ఇతరుల రచనల అనువాదాల సంకలనాన్ని సంకలన కర్తలు, తమవారికి అంకితాలివ్వడం చూశాననీ, అలా అంకితాలిచ్చే వుద్దేశం వుంటే మాత్రం, నా కధని చేర్చవద్దనీ నేను అన్నాను. అలాంటి అనుమతి మీకు ఇవ్వనందుకే, మీరు “కక్ష” గట్టి, ఈ ఇంటర్వ్యూ సందర్బాన్ని “ఒక ఆయుధంగా” వాడుకున్నారని, నేను అంటే ఎలా వుంటుంది? కాబట్టి, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం ఎవరికీ మంచిది కాదు. ‘కాలు జారితే తీసుకోవచ్చు గానీ, నోరు జారితే తీసుకోలేం’ అనే సామెత తెలుగులో వున్నదే!

ఇక, మాలతి గారి రెండో ఆరోపణ. “నా రెండో అభ్యంతరం – నా కధలో ఒక వాక్యాన్ని తీసుకుని “మార్చి” వాడుకున్నానని చెప్పడం. నిజానికి నా దృష్టిలో అది సామాన్యంగా అలాంటి సందర్భంలో తేలిగ్గా ఎవరయినా అనగలిగిన వాక్యం. దాన్ని ఆవిడ “మార్చడం”లో నేనేదో అసభ్యకరమయిన మాట రాసినట్టు, తాను దాన్ని శిష్టజన వ్యావహారికం చేసినట్టు ధ్వని వుంది. నా కధలో వాక్యం భార్యకీ, వెలయాలికీ గల తారతమ్యం ఎత్తి చూపుతుంది. రంగనాయకమ్మ వాక్యానికి (మీ ప్రేయసులలో ఒక ప్రేయసిగా వుండను) ఆ అర్థం రాదు. అంచేత అది పూర్తిగా ఆవిడ వాక్యమే. అక్కడ నా వాక్యమేదో తాను వాడుకున్నాననడం అనవసరం.”

మాలతి గారి ఈ ఆరోపణ ఎంత నిరాధారమో తెలియాలంటే, నా పుస్తకంలో, ఆమె కధని ప్రస్తావిస్తూ నేను ఇచ్చిన పెద్ద ఫుట్ నోట్‌ని, ‘పొద్దు’ పాఠకుల కోసం, తిరిగి ఇక్కడ ఇవ్వక తప్పదు.

“నీ ప్రియుల్లో ఒక ప్రియుడిగా నేను ఉండదల్చుకోలేదు” – అనే మాటల్ని నేను ‘నిడదవోలు మాలతి’ అనే రచయిత్రి రాసిన ఒక కధ ఆధారంతో తయారు చేశాను. మాలతి, (23.9.1987 ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో) “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” అనే కధ రాసింది. ఆ కధ ఏమిటంటే: ఇద్దరు తెలుగు భార్యాభర్తలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. భర్త, ప్రొఫెసరు. ఇతను సరిగ్గా ‘మూడు తరాలు’ కధలో ‘యం’ లాంటి తిరుగుబోతు. పైకి మాత్రం ‘స్త్రీల హక్కులూ స్వేచ్చలూ సమస్యలు’ అని మాట్లాడుతూ ఉంటాడు. (‘యం’ కైతే ఈ ‘స్త్రీల హక్కుల’ పోజు లేదు). ఈ భర్త ‘విజిటింగ్ ప్రొఫెసరు’గా ఇండియాకి వచ్చి పోతూ ఉంటాడు. ఇతను ఇండియాలో ఉన్న (హైదరాబాదులోనో ఎక్కడో, కధలో వివరాలు లేవు) తెలుగు ప్రియురాళ్లతో తిరిగే సంఘటనలే కధలో ప్రధానంగా ఉంటాయి. ఈ ప్రియురాళ్ళు కూడా భర్తలూ, బిడ్డలూ ఉన్నవాళ్ళే. అందులో ఒకామె కవయిత్రి కూడానట! ఈ ప్రియురాళ్ళు అమెరికాలో ఉన్న ప్రొఫెసర్ ప్రియుడికి ప్రేమలేఖలు మిడుకుతూ ఉంటారు. “34 నెంబరు బ్రాలు తీసుకురండి. బంగారం తీసుకురండి. కెమేరా తీసుకురండి. నైలాన్ కోకలు తీసుకురండి” ఇదీ ప్రేమలేఖల్లో భాగోతం! ఇదంతా ‘నిజమైన ప్రేమ’ అనీ, దేనికీ ఆశించి చేసే వ్యభిచారం కాదనీ, ఈ బాపతు వాళ్ళు అంటారనుకోండీ! సంఘంలో మర్యాదల కోసం వెనకాల భార్యలూ, భర్తలూ ఉండవలసిందే. కానీ వాళ్ళు పాతబడిపోతూ ఉంటారు. భార్యలూ, భర్తలూ నచ్చకపోతే వాళ్ళతో విడిపోకుండా వాళ్ళని అలా ‘రిజర్వ్’లో ఉంచి, బయట వ్యవహారాలు నడుపుతూ ఉంటారు.

ప్రొఫెసర్ గారికి ప్రియురాళ్ళు మిడికే ప్రేమలేఖలు అతని భార్య చేతుల్లో పడతాయి. ఆ ఇంట్లో ఆ బాపతు ఉత్తరాలు, పుస్తకాల్లోనూ, అలమార్లలోనూ, టేబుళ్ళ మీదా కుర్చీలకిందా ఎక్కడికక్కడే దొర్లుతూ ఉంటాయి. ఆ ఉత్తరాలు చూసిన భార్య, చాలా బాధపడుతూ భర్తని అడుగుతుంది. భర్త, తన నైజానికి తగ్గట్టుగా చాలా సహజంగానే, అబద్ధాలు చెప్పుకొస్తాడు. ‘శోభ రచయిత్రి. తెలుగు రచయిత్రులు ఏవేవో ఊహల్లో తేలుతూ ఉత్తరాల్లో అలాగే రాస్తారు కదా? అంతకన్నా ఏం లేదు’ అని ఒకామె గురించి చెబుతాడు. ఇంకో ఆమె గురించి, ‘గాయత్రి ఈమధ్య కొంచెం మానసికంగా అనారోగ్యంగా ఉంది. ఆమెకి ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఆమె మీద సానుభూతితో స్నేహంగా రాస్తున్నాను. అంతే’ అని చెపుతాడు. ఇవన్నీ అబద్ధాలని భార్యకీ తెలుసు. కానీ, తెగించే ధైర్యం లేక ‘ఏమో, నేను అనవసరంగా అపోహలు పడుతున్నానేమో. అతను చెప్పేదంతా నిజమేనేమో’ అని ఆత్మవంచన చేసుకుంటూ కొంతకాలం గడుపుతుంది. భర్తకి ఇండియా నించి వచ్చే ప్రేమలేఖలు ఆగవు. పైగా టెలిగ్రాములూ, ఫోను సంభాషణలూ కూడా సాగుతూ ఉంటాయి. భార్య ఇక సహించలేక ఒక రోజు తన సామానంతా సర్దేసుకుని, అతను ఇంటికి రాగానే, “నేను వేరే ఎపార్టుమెంటులోకి వెళ్ళిపోతాను’ అని చెప్పేస్తుంది.

‘మీలాంటి మేధావులు బృహత్ గ్రంథాలు రాసీ, చదివీ, అవే వల్లె వేసి కాలం గడుపుతారు. మరో పక్క శోభలూ, గాయత్రులూ అనుభూతులూ, సానుభూతులూ అంటూ ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటారు. వాళ్ళు ఆర్తులు. మీరు ఆర్తత్రాణ పరాయణులు! మీకు వాళ్ళూ, వాళ్ళకి మీరూ చాలా అవసరం. మీ జాతికీ, వాళ్ళ జాతికీ చెందని నూటికి తొంభై తొమ్మిది మందిలో నేనొక దాన్ని. నేను నెమ్మదిగా సావకాశంగా నాటు బండిలో రోజులూ వారాలూ గడుపుకుంటూ బతుకుతాను… మీ ముండల్లో ఒక ముండగా నేనుండదల్చుకోలేదు” అని చెప్పేస్తుంది. (ఈ భార్య, భర్త నించి విడిపోయే క్షణాల్లో కూడా అతన్ని ‘మీరు’ అనడం బాగా లేదు గానీ, అది పాత అలవాటు. ఆ మాట కన్నా, ఆత్మ గౌరవంతో ఆమె చేసిన పనే ముఖ్యం.)

కొన్నాళ్ళ కిందట చదివిన ఈ కధలో ఆ చివరి మాటలు బాగా నచ్చడం వల్ల, అవి నాకు బాగా గుర్తున్నాయి. ఈ వ్యాసంలో, కాన్‌స్టాన్‌టిన్ పాత్రని విమర్శించేటప్పుడు, ఆ మాటలే కొంచెం మార్చి ‘నీ ప్రియుల్లో, ఒక ప్రియుడిగా నేనుండ దల్చుకోలేదు‘ అని వాడాను. స్త్రీ అయినా పురుషుడైనా, భర్తనించో, భార్యనించో అవమానం ఎదురైనప్పుడు తక్షణం అనవలసిన మాటలు అవి.”

మాలతి గారి కధని ప్రస్తావించిన సందర్భంలో, ఎక్కడైనా “మీ ప్రేయసులలో ఒక ప్రేయసిగా వుండను” అనే వాక్యం వుందా? నేను రాయని వాక్యాన్ని తీసుకొచ్చి, నాకు అంటగట్టడాన్ని ఏమనాలి? మాలతి గారి మాటలే వాడాలంటే, దాన్ని “కక్ష” అనాలా? “విశ్లేషణా లోపం” అనాలా? “ఆత్మవంచన” అనాలా?

తన కధలో భార్య చేత మాలతి గారు చెప్పించిన వాక్యం ఏమిటి? “మీ ముండల్లో ఒక ముండగా నేనుండ దల్చుకోలేదు” అని. ఈ వాక్యాన్ని నేను యధాతథంగానే వుంచాను. అది ఎంతో నచ్చింది నాకు.

ఈ పద్ధతిలోనే, నేను విమర్శించిన ‘మూడు తరాలు’ కధలో ఒక భర్త పాత్ర అలా అనవల్సిందనీ, కానీ అలా అనలేదనీ అంటూ నేను రాసిన వాక్యం ఏమిటి? “నీ ప్రియుల్లో, ఒక ప్రియుడిగా నేనుండదల్చుకోలేదు” అని. ఇక్కడ నేను మాలతి గారి వాక్యాన్ని వక్రీకరించినది గానీ, ‘శిష్ట జన వ్యావహారికం’ చేసినది గానీ ఏమిటి?

ఎవరి మీదైనా విమర్శ చేసేటప్పుడు, “మంచి రచయిత” ఎలా వుండాలని మాలతి గారు ఉద్బోధించారో, ఆ “సంయమనమూ”, ఆ బాధ్యతా ఆమెకి వుండొద్దూ?

—————–

ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి పొద్దుకు ఇచ్చిన ఇంటర్వ్యూ

Posted in వ్యాసం | 38 Comments

మృత్యువు నుంచీ అమృతత్వానికి

రవి

గ్రీష్మం.

హేమంతం, శిశిరం, వసంతం, వర్షర్తువు, శరత్తు – ఈ మిగిలిన ఋతువులన్నీ ఎందరో కవులను ఆకర్షించాయి. వసంతంలో కోకిల కూజితం ఓ కవికి ప్రణవమై, కవితా గానాన్ని ప్రేరేపిస్తే, శరజ్జ్యోత్స్నలు మరో కవిలో ప్రణయభావాలను మేల్కొలుపుతాయి. హేమంతం నీహారికలను అందిస్తే, ప్రావృష మేఘమాలలు మరోకవి, ప్రియురాలికి సందేశాన్నంపడానికి ప్రేరేపిస్తాయి.

మరి గ్రీష్మం?

గ్రీష్మానికి అచ్చట్లు ముచ్చట్లు లేవా? అలా ఎండుతూ, మండుతూ కూర్చోవలసిందేనా?

బహుశా గ్రీష్మానికి ఆ కొరత తీరడానికనేనేమో.. ప్రకృతి, గ్రీష్మంలో – వైశాఖ మాసం – కొందరు గొప్ప కవులను, గాయకులను, మానవజాతి ఉన్నంతకాలమూ గుర్తుంచుకోడానికన్నట్లు కొందరు మహానుభావులను సృజించింది.

ఓ బుద్ధుడు,
ఓ కబీరు,
ఓ శంకరాచార్యుడు,
ఓ కృష్ణయ్య,
ఓ అన్నమయ్య,
ఓ రామతీర్థుడు,
ఓ కృష్ణమూర్తి…….. ఓ రవీంద్రుడు….

రవీంద్రుణ్ణి అంతంత పెద్ద పేర్ల సరసన చేర్చడం న్యాయమా అంటారా? వేటూరి ప్రభాకర శాస్త్రి గారింట్లో బుద్ధుడు, గాంధీ ఇలా రకరకాల చిత్రపటాలుండేవట. ఆ పటాల చివర్లో ఆయన పటమూ. ఎవరో ఆయన్ను, వాళ్ళందరి సరసన మీ పటం ఉంచేసుకున్నారేమని అడిగితే, ఇట్నుంచీ చూసుకోండి, నేనే ఫస్టు అన్నారట ఆయన.

రవీంద్రుడు కేవలం రచయితో, కవో, వ్యాసకర్తో, చిత్రకారుడో, ఓ సంగీతకారుడో, ఓ కళాశాల సంస్థాపకుడో, ఓ నోబుల్ బహుమతి గ్రహీతో, రెండు దేశాలకు జాతీయగీత రూపకర్తో మాత్రమే కాదు. ఆయన ఓ యోగి. మార్మికుడు, మహాత్ముడు, మహానుభావుడూనూ. మధురభక్తి అన్నది భక్తి పరంపరలో ఓ ముఖ్యమైన విధానం. మధురభక్తిలో భక్తుడు తనను తాను దేవుడి మిత్రుడిగా, అనుంగు చెలికత్తెగా, ఇలా రకరకాలుగా మనసులో భావిస్తూ, ఆ భావనలలో తాదాత్మ్యం చెందుతాడు.

రవీంద్ర కవీంద్రుడు మధురకవి. భగవంతుని ఉనికిని సన్యాస వైరాగ్యాలలో కాక, ప్రకృతిలో, జీవితంలో, జీవితంలో చిన్న చిన్న మధురానుభూతుల వెల్లువలలో అన్వేషిస్తూ, ఆ అన్వేషణలోనే తాదాత్మ్యత చెందుతాడు కవి. భగవంతుడి ప్రసాదమైన జీవితాన్ని, జీవితంలోని ఆనందాలనూ కవి నిరసించడు. పైగా అవి భగవత్ ప్రసాదాలుగా భావిస్తూ, వాటిని ప్రసాదించిన ప్రభువుకు కృతజ్ఞుడై ఉంటాడు.

మురళి.

నన్ను నీవు చిరంజీవిని చేశావు. అదే నీకు ఆనందదాయకం.
ఈ విశీర్ణ పాత్రను ఎప్పటికప్పుడు నవజీవనంతో నింపుతావు.
ఈ మురళిని, కొండకోనల మీదుగా తీసుకుపోయి
నవ్య నూతన రాగాలను సృజిస్తావు.
నీ అమృత కర స్పర్శతో, నా ఎద పట్టరాని ఆనందాలను నింపుకుని,
పలుకలేని శబ్దాలను పలికిస్తుంది.
లెక్కలేనన్ని కానుకలు నా చిన్ని చేతులకు అందిస్తావు.
యుగాలు గడుస్తాయి. అయినా నీ కరుణరసం నాపై కురిపిస్తూనే ఉంటావు.
అయినా ఈ పాత్ర నిండనే నిండదు.

(గీతాంజలి)

భౌతిక సుఖాల పట్ల విరక్తి చెంది, వాటి అశాశ్వతను గుర్తించి, శాశ్వత ఆనంద ప్రాప్తికై వెతకడం వైరాగ్యమైతే, భగవంతుని సృష్టిని, సృష్టిలో వైవిధ్యాన్ని, అందాలను, భగవత్ ప్రసాదితమైన జీవితం సహాయంతో కనుగొంటూ, ఆ ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం ప్రార్థన.

ఇంద్రియాలు.

విముక్తి నా వరకు సన్యాసంలో లేదు.
స్వేచ్చా పరిష్వంగాలను వేల ప్రమోదాల శృంఖలాల్లో నేను కనుగొంటాను.
ప్రభువు వివిధ వర్ణాల, వివిధ సౌరభాల ద్రాక్షాసవాన్ని
ఈ మృణ్మయ పాత్రికలో నిరంతరం నింపుతునే ఉంటాడు.
నా ప్రపంచపు వందల దీపాలు ప్రభువు జ్వాలతో ప్రజ్వలితమై
ప్రభువు పూజా మందిరంలో వెలుగులీనుతాయి.
లేదు. నా ఇంద్రియ ద్వారాలను నేనెప్పటికీ మూయలేను.
ఈ దృశ్య, శ్రవణ, స్పర్శోల్లాసాలు ప్రభువు ఆనందాన్ని మోస్తూనే ఉంటాయి.
నా భ్రమలు హర్షోల్లాసాల దీప్తులతో భస్మితమవుతాయి.
ఆ ఆశలు ప్రేమ ఫలాలై పరిపక్వమవుతాయి.

(గీతాంజలి)

*****************************************************

గ్రీష్మం ప్రస్తావన ఇందాక వచ్చింది కాబట్టి – ఇందాకటి గ్రీష్మం రవీంద్రుడి కలంలో కరిగితే ఇలా కవిత (అనే రసానుభూతి) జాలువారుతుంది.

గ్రీష్మం.

దినభారాన్ని ఉధృతం చేస్తున్న దినకరుడి ప్రచండతేజం.
దాహంతో అంగలార్చిన ధరిత్రి.
నదివైపు నుండీ, “ప్రియతమా! రమ్మ”ని ఓ పిలుపు.
పుస్తకం మూసి, కిటికీ తెరిచి చూశాను.
మట్టి మరకలతో, నది ఒడ్డున తన వెడల్పాటి కళ్ళతో-
అచ్చెరువుతో నుంచున్నదో గేదె.
ఆ గేదెను స్నానానికి రమ్మంటూ,
మొలలోతు నీళ్ళలో ఓ కుర్రాడు.

ఓ దిగ్భ్రమ దరహాసమై, ఓ మధురిమ హృదయాన్ని స్పర్శించింది.

(తోటమాలి – 78)

*****************************************************

రామకృష్ణ పరమహంస గురించిన ఓ చిన్న ఉదంతం. ఎంతవరకు నిజమో తెలియదు. ఆయన చివరి రోజుల్లో ఉదరకోశ వ్యాధి (కాన్సర్) వచ్చింది. అప్పుడు ఆయన శిష్యులలో ఎవరో అడిగారుట. ” స్వామీ, మీరు కాళీమాత వర ప్రసాదులు కదా. కాళీమాత, మీరు పిలుస్తే పలుకుతుంది. ఇప్పుడు ఆ మాత అనుగ్రహంతో ఈ భయంకర వ్యాధి బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా?” అని. అప్పుడాయన, ” ఈ వ్యాధి, మృత్యువూ కూడా ఆ తల్లి అనుగ్రహమే నాయనా” అన్నాడుట.

మృత్యువును ఓ అందమైన మజిలీగా, ఓ అతిథిలా ఆదరిస్తూ, ఆహ్వానించినవారు చాలా అరుదు. సోక్రటీసు మహోన్నత మరణ సన్నివేశం అందుకు ఓ ఉదాహరణ. మన దేశం వరకు వస్తే, కృష్ణమూర్తి, మృత్యువు గురించి అందమైన అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడు.

అయితే, మృత్యువును నవనూతన వరుడిలా భావిస్తూ, జీవితాన్ని శోభనరాత్రి వధువులా కల్పన చేయటం అనుభూతికి పరాకాష్ట.

మరణం.

జీవితపు ఆఖరు మజిలీ,
ఓ నా మృత్యువా, వచ్చి నాతో ఊసులాడు.
ప్రతిదినం నేను నీ రాకకై ఎదురుచూస్తున్నా ప్రభూ,
నా జీవితపు ప్రమోదాలను జీవింపజేస్తూ.
నేను, నా సర్వస్వం, బహుశా నా ప్రేమ
రహస్య అగాధాల వరకు నీ వైపు ప్రవహించాయి.
ఒక్క నీ ఆఖరు వాలుచూపు..
నా జీవితం అంతా నీది.

సుమాలు, సుమమాలలు వధువు కోసం సిద్ధం.
వివాహం తరువాత వధువు ఇంటిని విడిచి పయనం
తన ప్రభువును ఏకాంతపు రాత్రులలో కలవడం కోసం.

-(గీతాంజలి)

మరణాన్ని అంత ప్రేమించాడు కనుకనే, రవీంద్రుడు జీవితం పట్ల అంతే గాఢంగా అనురక్తి చెందాడు.

ఓ ప్రభాతం,
పూదోటలో ఓ అంధబాలిక.
తామరాకుల దొప్పెలో అర్పించిందో పూమాలిక.
మెడలో అలంకరించుకోగానే,
కనుల నుండీ జాలువారిన అశ్రువులు.

బాలికను ముద్దాడి చెప్పాను.
“ఈ కుసుమాల వలెనే నీవు అంధురాలవు.
నీ ఈ కానుక ఎంత అందమైనదని నీకు తెలియదు.”

-(తోటమాలి – 58)

ఓ ప్రభాత కుసుమం,
ఓ పసిపాప నవ్వు,
ఓ పిల్లతెమ్మెర,
ఓ పడవవాడిపాట,
ఓ ప్రభువుకై విన్నపం,
ఓ పశుపాలకుడి మురళీరవం,
ఓ పడవ కాగితం,
ఓ పక్షుల గుంపు,
………..
………..
అనుభూతి పేరేదేయితేనేం?

అనుభూతికి ఆధారం మనసు. రవి నిశ్చయంగా మనసుకవి.

సంస్కృత సాహిత్యంలో బాణకవిని గురించి చెబుతూ, “బాణోచ్చిష్టం జగత్సర్వమ్” (ఈ జగత్తులో ప్రతి విషయం, బాణకవి నమిలి వేసినదే) అని ఉదహరిస్తారు. విశ్వకవి రవీంద్రుడు చూ(ప)డని అనుభూతులు గానీ కొలవని గాఢమైన అనురక్తులు కానీ లేవని చెప్పడం అతిశయోక్తి కాదు. ఓ పాశ్చాత్య కవి యేట్స్, గీతాంజలి గురించి చెబుతూ, “ఎన్నోసార్లు ఈ పుస్తకం చదువుతూ, కళ్ళు తుడుచుకుంటూ, పక్కన ఎవరైనా నా కన్నీళ్ళను గమనిస్తున్నారేమో అని సంకోచపడవలసి వచ్చింది” అంటారు. అలాగే పోలండ్‌లో విప్లవం రగులుతున్న రోజుల్లో, వీధి నాటకాల్లో రవీంద్రుడి “పోస్ట్ మాస్టర్” కథను నాటకంగా ప్రదర్శించే వారుట. రవీంద్రుడిని “విశ్వకవి” అనడం నజరానానో, బహుమతో కాదు. అది ఓ సూచిక మాత్రమే.

రవి (సూర్యుడికి) అస్తమయం తప్ప విరామమూ, విముక్తీ లేవు.

రవీంద్రుడి (సూర్యులలో శ్రేష్టుడు) శరీరానికి భౌతికమైన మృతి తప్ప ఆయన అందించిన అనుభూతుల వెల్లువలకు మరణం లేదు. మరణమే కాదు, వార్ధక్యమూ లేదు.

కవి అజరామరుడు.

ఆయన ఏ మురళిగానంలోనో, ఏ పసిపాప నవ్వులోనో, ఇంకే అనుభూతుల రహస్యాలవెనుకనో దాక్కునే ఉంటాడు. వెతికితే కనబడకపోడు!

(వ్యాసంలో ఉటంకించిన విశ్వకవి వచన కవితలు, వ్యాసకర్త స్వేచ్చానువాదాలు)

——————

కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన రవి, ప్రస్తుతం ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసముంటున్నారు. 2007 సెప్టెంబరు నుండి బ్లాగాడిస్తూ ఉన్నారు.
గతంలో ఇతర వెబ్‌సైట్లలో సమీక్షలు పేరడీలూ రాసేవారు.

తెలుగు మీద మమకారంతో పాటు, వీరికి సంస్కృత భాషతో పరిచయమూ ఉంది.

Posted in వ్యాసం | Tagged | 4 Comments

కథా మాలతీయం – 6

నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి మాత్రమే కాక, ప్రసిద్ధ బ్లాగరి కూడా. ఆమె తన బ్లాగానుభవాలను ఇక్కడ వివరిస్తున్నారు. అలాగే రచయితలు, సంపాదకుల హక్కులపై తన అభిప్రాయాలను కూడా తెలియజేసారు. పొద్దు సంపాదకవర్గ సభ్యురాలైన స్వాతికుమారి నిర్వహిచిన ఈ ఇంటర్వ్యూ ఈ భాగంతో ముగుస్తున్నది.

తెలుగుబ్లాగుల్లో నన్ను ఆకట్టుకున్న అంశాలు

తెలుగుబ్లాగులు నన్ను ఆకర్షించడానికి మరొక కారణం తెలుగు నుడికారం. నాకు చిన్నప్పట్నుంచీ తెలుగంటే అభిమానమే. అమెరికా వచ్చేక తెలుగు మాట్లాడే అవకాశం బాగా తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చేక జీవనసరళి మూలంగానూ వాతావరణం మూలంగానూ తెలుగువాళ్లం కూడా తెలుగులో మాట్లాడం. తెలుగులో మొదలు పెట్టినా, ఇంగ్లీషు వాక్యాలకి వాక్యాలే దొర్లిపోతాయి మాటల్లో. “వెదరెలా వుంది” అంటాం కానీ “వాతావరణం ఎలా వుంది” అనం కదా. తెలుగులో మనకి వర్ణనాత్మకంగా చెప్పుకోడం అలవాటు. “ఎండలు మండిపోతున్నాయి”. “చలి ఎముకలు కొరికేస్తోంది” అంటాం కానీ “ఈరోజు యాభై డిగ్రీలుంది” అనం, ఆలిండియా రేడియోవారు తప్పిస్తే. అదే సాంస్కృతికపరమైన తేడా.

తెలుగుబ్లాగులు చూసేక దాహార్తునికి నీటిచెలమ ఎదురైనట్టు అనిపించింది నా ప్రాణానికి. అంతవరకూ ఈనాటి యువతకి తెలుగురాదన్న ఘోష మాత్రమే వినిపించింది నాకు. నిజానికి నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ తెలుగుబ్లాగుల్లో మంచి తెలుగునుడికారం చూశాను. తెలుగు సాహిత్యంతో మంచి పరిచయం వున్న రచయితలని చూశాను. తెలుగుని నిలుపుకోవాలన్న తాపత్రయం చూశాను, ఈనాటి యువతీయువకుల్లో. నామనసు ఆనందంతో పొంగిపోయింది.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే. ఇక్కడ మాడసన్‌లో తెలుగు మాటాడేవారు లేకపోవడం నాలో చాలా వేదన కలిగించింది. తెలుగువాళ్లు వున్నారు కానీ, తెలుగులో మాట్లాడేవాళ్లు లేరు. నిజానికి ఇక్కడ నావాళ్లెవరూ లేరన్న విషయంకంటే కూడా ఎక్కువగా బాధించింది తెలుగుమాట వినిపించకపోవడమే. కొంతకాలం అయేక, ఎందుకో నాకథలే తీసి చూసినప్పుడు నాకు అర్థమయింది, నేను తెలుగు ఎంతగా మర్చిపోయానో. ఆమధ్య చాతకపక్షులు రాస్తున్నప్పుడు “పెళ్లి ఎరేంజిమెంట్లు” అని రాసేను. “ఎరేంజిమెంట్లు”కి తెలుగు “ఏర్పాట్లు” అన్నమాట గుర్తు తెచ్చుకోడానికి నాకు మూడు వారాలు పట్టింది. వాడుతుంటేనే భాష జ్ఞాపకం వుంటుంది.

ఇక్కడ మాకు లైబ్రరీలో తెలుగుపుస్తకాలు చాలా వున్నాయి. కానీ చదవబోతే కాగితంమీద దృష్టి నిలిచేది కాదు, వ్యక్తిగతకారణాలవల్ల. తూలిక మొదలు పెట్టడానికి అది కూడా ఒక కారణం. అనువాదాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతివాక్యంమీద దృష్టి పెట్టాలి. అంతేకాక, అనువాదానికి ఒక ధ్యేయం వుంది కనక వుత్సాహం కూడా వుంటుంది.

ఇంగ్లీషు అనువాదాలు చేస్తున్నాను కానీ, నాతెలుగుని నిలుపుకోవాలంటే నేను తెలుగులోనే రాయాలి అన్న తపన కూడా బాధిస్తూ వచ్చింది. అంచేత నా పాతకథలు తీసి నా ఇంగ్లీషుతూలికలోనే ప్రచురిస్తూ వచ్చేను.

అప్పుడు కొందరు నా తెలుగుకథలు బాగున్నాయంటూ ఉత్తరాలు రాసేరు. కొందరు పాఠకులు కేవలం తెలుగు కథలకోసమే నాసైటు చూస్తున్నారని కూడా అర్థమయింది, దాంతో తెలుగుతూలిక వేరుగా పెట్టాలన్నకోరిక కలిగింది. కొత్తగా పరిచయమయిన సౌమ్య తన బ్లాగు చూడమని చెప్పిన తరవాత చూశాను తెలుగు బ్లాగులు. అప్పటివరకూ నాకు తెలుగు బ్లాగులున్నాయనే తెలీదు.

తెలుగుబ్లాగులు చూసేక దాహార్తునికి నీటిచెలమ ఎదురైనట్టు అనిపించింది నా ప్రాణానికి. అంతవరకూ ఈనాటి యువతకి తెలుగురాదన్న ఘోష మాత్రమే వినిపించింది నాకు. నిజానికి నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ తెలుగుబ్లాగుల్లో మంచి తెలుగునుడికారం చూశాను. తెలుగు సాహిత్యంతో మంచి పరిచయం వున్న రచయితలని చూశాను. తెలుగుని నిలుపుకోవాలన్న తాపత్రయం చూశాను, ఈనాటి యువతీయువకుల్లో. నామనసు ఆనందంతో పొంగిపోయింది.

ఎటొచ్చీ బ్లాగరులందరూ అలా రాయడం లేదు. కొందరు ఈరోజుల్లో ఇలాగే మాట్లాడుకుంటున్నాం అంటూ సగానికి సగం ఇంగ్లీషే వాడుతున్నారు. నేను తెలుగు బ్లాగులు చూసేది నాకు ఇక్కడ మావూళ్లో వినిపించని తెలుగుకోసం. “సండే రండి. మండే పొండి” అంటే రెండవ అక్షరం యతి కుదిరిందేమో కానీ “ఆదివారం రండి, ఓపూట వుండి, కబుర్లు చెప్పుకుని సోంవారం వెళ్లిపోదురు గానీ” అన్న మాటల్లో వున్న తీపి లేదు. అంచేత సాధారణంగా నేను మంచి తెలుగులో రాసిన టపాలు మాత్రమే చూస్తాను.

బ్లాగులూ, బ్లాగరులనుండి నేను కోరేది ఏమిటి..

నిత్యజీవితంలో ఇంగ్లీషులో మాట్లాడితే మాట్లాడుకోండి. కానీ తెలుగుటపాలో తెలుగులో రాయడానికి ప్రయత్నించండి. పైన చెప్పినట్టు ఒకొకసారి మాటలు వెంటనే స్ఫురించవు. కాస్త కాలం వెచ్చించి అయినా తెలుగులో చెప్పడానికి ప్రయత్నించండి.

ఇక్కడే మరొక సంగతి కూడా ప్రస్తావిస్తాను. ఈమధ్య బ్లాగులలో దుర్భాషలగురించి ఉధృతంగానే చర్చ జరిగింది కనక. నా అభిప్రాయం – అసభ్యకరమయిన భాషణలన్నీ స్త్రీలని అవమానించేవే. తల్లితోనూ, పిల్లలతోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం కలుపుతూ ఆడిన మాటలు ఎవరిని కానీ, సత్కార్యాలవేపు మళ్లించవనే నా అభిప్రాయం. మరింత రెచ్చగొట్టి మరిన్ని దుర్భాషలకే దారి తీస్తాయి.

బ్లాగులంటే సొంత డైరీలు అనే ప్రతీతి అయినా తెలుగు బ్లాగులు ఆస్థాయి దాటి విశిష్టమయిన సాహిత్యవిలువలని సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో బ్లాగులు చక్కని కథలూ, కవితలూ, వ్యాసాలూ – ఏ సాహిత్యపత్రికకీ తీసిపోని స్థాయిలో అందిస్తున్నాయి. సంగీతం, రాజకీయాలు, సినిమాలు మీద వ్యాసాలు, చర్చలూ వస్తున్నాయి. తెలుగుభాషని పటిష్టం చేసి, మళ్లీ నిజమయిన వాడుకభాషగా చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్లాగరులు ఈవిషయాలు దృష్టిలో పెట్టుకుని తమబ్లాగులని ప్రయోజనకరంగా నడపడం అలవర్చుకుంటే బాగుంటుంది. స్వంత ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా పక్కన ఎవరున్నారో చూసుకుని పదాలు వాడతాం. అలాగే బ్లాగుల్లోనూ. బ్లాగరులు తలుచుకుంటే సంయమనం అలవర్చుకుని ఈ తెలుగులోకాన్ని సుభిక్షం చెయ్యగలరు. నన్నడిగితే, ఈ “బ్లాగు” అన్న పదం కూడా వదిలేసి మరొక పదం ఈసృజనాత్మక లోకానికి తగినట్టు తయారు చేస్తే బాగుంటుందేమో కూడా.

సంపాదకులూ, వ్యాఖ్యాతలు – అప్పుడూ -ఇప్పుడూ

జాలంలో సంపాదకులు, పాఠకులు సాహిత్యంగురించి అవగాహన వున్నవారు – అని మీరంటున్నారు. కొందరివిషయంలో అది నిజమే అనుకుంటాను. కానీ అవగాహనపేరుతో కొందరు “అతి” చేస్తున్నారేమో అనిపిస్తోంది ఒకొకప్పుడు.

సంపాదకులవిషయం తీసుకుంటే పూర్వపురోజులకీ ఇప్పటికీ బాగనే కనిపిస్తోంది. అప్పట్లో చెప్పేను కదా ప్రోత్సాహం ప్రధానంగా వుండేది. ఇప్పుడు ప్రశ్నించడం ప్రధానమయిపోయింది. కథలో రచయిత “ఏం చెప్తున్నాడు” అన్న ప్రశ్న కంటే ముందు “ఏం చెప్పలేదు” అన్నదృష్టితో కథ చదువుతున్నట్టు కనిపిస్తోంది, కొన్ని వ్యాఖ్యానాలు చూస్తే. వెనకటిరోజుల్లో నీతి -పరస్పరగౌరవం. ఈనాటి నీతి -పృచ్ఛ. దీనికి కొంతవరకూ కారణం పాశ్యాత్య సాంప్రదాయం. ‘ప్రశ్నించడం తప్పు’ అని కాదు నా ఉద్దేశ్యం. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే నాకు కనిపించిన అంశాలు – మీరు ఉదాహరణలతో సహా, ప్రత్యేకించి నాఅనుభవాలు చెప్పమంటున్నారు కనక చెప్పడానికి ప్రయత్నిస్తాను.

ముందు సంపాదకుల విషయం చూద్దాం. పూర్వంలాగే ఇప్పుడు కూడా చాలామటుకు ప్రింటు పత్రికలు అంగీకరించడమో, తిరస్కరించడమో చేస్తున్నారు కానీ ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెప్పడంలేదు. అందుకు ముఖ్యకారణం అనాదిగా వస్తున్న సాంప్రదాయం కావచ్చు. వ్యవధి లేకపోవడం కావచ్చు. ప్రముఖ పత్రికలకి వందలకొద్దీ కథలూ, కవితలూ వస్తుంటే వాటన్నిటికీ జవాబులు రాస్తూ కూర్చోడం కష్టం అని కావచ్చు.

అందుకు భిన్నంగా, అంతర్జాల పత్రికలు కొత్త నిబంధనలు ప్రవేశ పెడుతున్నారు. అయితే ఆ నిబంధనలవెనక కారణాలు ఏమిటి, వాటివల్ల వారు అధికంగా సాధించింది ఏమిటి అంటే నాకు కొంచెం అయోమయంగానే వుంది.

అసలు అంతర్జాలపత్రికలు తెలుగులో పట్టుమని పది కూడా లేవు. ఇందులో బాగా ప్రాముఖ్యత సంతరించుకున్నవి మూడో నాలుగో. వీటికి వచ్చే రచనలు ఎన్ని వుంటాయో నాకు తెలీదు కానీ సుమారుగా ఇరవయ్యో ముప్ఫయ్యో అనుకుందాం.

ముందు హక్కులూ నిబంధనలూ చూద్దాం.

తొలిసారిగా నేను గమనించిన కొత్త నిబంధన సౌమ్య పుస్తకం.నెట్‌కి నన్ను రాయమని అడిగినప్పుడు. నిబంధనలలో “ప్రచురించిన రచనలమీద హక్కులు పూర్తిగా పుస్తకం.నెట్‌కే చెందుతాయి” అన్న వాక్యం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఆతరవాత సౌమ్యతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవరకూ నాకు తెలీదు, పొద్దువారి నిబంధన కూడా అదేనని. నాకృషి మూలంగా ఉద్బవించిన రచన నేను వేరే చోట ప్రచురించడానికి వారి అనుమతి కోరాలనడం న్యాయంగా నాకు తోచలేదు. ప్రతిఫలం ఇచ్చినప్పుడు “మావే హక్కులన్నీ” అనడానికి కొంత బలం వుంది. కానీ తెలుగు పత్రికలూ, ప్రచురణకర్తలూ కూడా ఆ ప్రతిఫలం ఒకసారి ప్రచురించుకోడానికే అనీ, “సర్వస్వామ్య సంకలితములు” అనీ అన్నా, రచయితలు సంపూర్ణంగా హక్కులు వదులుకోడం ఎప్పుడూ జరగలేదు.

ఇంతకీ నా అభ్యంతరం మూలంగానో మరోకారణంచేతో కానీ పుస్తకం.నెట్ తమ నిబంధనని తొలగించినట్టు సౌమ్య నాకు తెలియజేసింది. అప్పుడే పొద్దు సైటులో హక్కులమీద వారు ప్రచురించిన కాయితం మరోసారి చూసుకున్నాను. హక్కులు రచయితలవే అని వారు అంగీకరించారు.

నేను నిన్ననే పూర్తి చేసిన వ్యాసం ICFAI university journal of English studies విషయంలో కూడా హక్కుల ప్రస్తావన వచ్చింది. వారు కూడా హక్కులన్నీ యూనివర్సిటీవారివే అనడం, నేను ఒప్పుకోకపోవడం, దాంతో వారు తమ పాలసీ మార్చుకోడం జరిగింది. ఇది ఎలా మొదలయిందో నాకు తెలీదు కానీ రచయితలందరూ గమనించవలసిన అంశం.

పొద్దు వివరణలు
* ఇది కనీసం రెండు రకాలుగా జరగొచ్చు:
1. ఒక జాలపత్రికలో/ వెబ్సైటులో వచ్చిన వ్యాసాన్ని ఇంకో వెబ్సైటులో పరిచయం చెయ్యడం. ఉదా: పొద్దులో వచ్చిన ఒక వ్యాసాన్ని నవతరంగంలో 2008 జనవరిలో పరిచయం చేశారు.
2. ఏదైనా ఒక అంశం గురించి వ్యాసం రాస్తున్నప్పుడు ‘ఇదే అంశాన్ని గురించి ఫలానా వ్యాసంలో ఫలానా రచయిత ఇలా అన్నారు.’ అని రెండు మూడు వాక్యాలు ఉటంకించి (పేరాలకు పేరాలే ఎత్తి రాయకుండా) పూర్తి వ్యాసానికి లింకు ఇవ్వొచ్చు. (స్థలాభావం అన్నది వెబ్సైట్లకు, జాలపత్రికలకు వర్తించదు.)

** లింకు ప్రింటుపత్రికలో ఇస్తే ఎంతమందికి వీలవుతుంది అంతర్జాలంలో చూసుకోడానికి.” అని మాలతి గారు ఇంటర్వ్యూలో అన్నారు. ఆమె పొరపాటు పడ్డారు. జాలపత్రికలలో పునఃప్రచురణ చేసేటపుడు మాత్రమే పూర్తి వ్యాసాన్ని ప్రచురించకుండా ఉటంకింపులు చేస్తూ, పొద్దు వ్యాసానికి లింకు ఇవ్వాలి అని చెప్పాము. ప్రింటు పత్రికల విషయంలో కాదు. మరిన్ని వివరాలకు పొద్దు కాపీహక్కుల విధానం చూడవచ్చు.

*** సమీప భవిష్యత్తులో కంప్యూటరులో పత్రికలు, సాహిత్యం చదివేవారి సంఖ్య ఇతోధికంగా పెరగనుంది. -సం.

సందర్భం వచ్చింది కనక పొద్దులోనూ (ఈమాట.కాంలో కూడా వుంది) వున్న మరోనిబంధన గురించి కూడా ప్రస్తావిస్తాను. “ఇతర సైటులో కానీ పత్రికలో కానీ ప్రచురిస్తే పూర్తి పాఠం ప్రచురించకుండా, కొంత భాగం ప్రచురించి, మాపత్రికకి లింకు ఇవ్వాలి” అన్నది. వాస్తవిక దృష్టితో చూస్తే, ఇది ఎలా ఆచరణీయమో నాకు అర్థం కావడంలేదు. ఎంచేతంటే మరో పత్రిక నాకథో వ్యాసమో ప్రచురించాలనుకుంటే పూర్తి పాఠం అడుగుతారు కానీ, నాలుగు వాక్యాలు వేసి మీకు లింకు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటారు? దానివల్ల ఆ సైటువారికి కానీ పత్రికవారికి గానీ ఏం లాభం? మరొకవ్యాసంలో ఎలాగా పూర్తిపాఠం ఇవ్వరు ఎవరూ స్థలాభావం చేత.* ఉదహరించినప్పుడు అయితే లింకు చాలు, నాలుగు వాక్యాలు కూడా అక్కర్లేదు. పైగా లింకు ప్రింటుపత్రికలో ఇస్తే ఎంతమందికి వీలవుతుంది అంతర్జాలంలో చూసుకోడానికి.** ఇండియాలో సాఫ్టువేరు ఇంజినీర్లు కానివారు ఎంతమంది కంప్యూటరులో సాహిత్యం చదువుతున్నారు?*** (చుక్క గుర్తులు గల అంశాలకు పొద్దు సంపాదకుని వివరణలను పక్కనున్న పెట్టెలో చూడవచ్చు)

సంపాదకులు ఆలోచించవలసిన రెండోవిషయం – ఈనిబంధనలు నిజంగా అమలులో పెట్టడం ఎంతవరకూ సాధ్యం? అసలు కాపీరైటు నిబంధనలు మనదేశంలో ఎంతమంది పాటిస్తున్నారు? కొంతకాలం క్రితం ప్రముఖ యూనివర్సిటీ ప్రొఫెసరుగారి సంపాదకత్వంలో ప్రచురించిన సంకలనం “స్త్రీవాదకథలు”. అందులో నన్ను అడక్కుండా నాకథ వేసుకున్నారు. హైదరాబాదులోనే వున్న రచయిత్రులకి కూడా అలాటిగౌరవమే జరిగిందని తరవాత తెలిసింది నాకు. అలాగే యద్దనపూడి సులోచనారాణి నవలలు – ఒకటీ, రెండూ కాదు, పదిహేడు నవలలు మరొక ప్రముఖ రచయిత తనపేరు మీదుగా తమిళంలోకి అనువదించి ప్రచురించుకున్నారని విన్నాను. సులోచనారాణి వూరుకున్నారుట మరి.

ఇంతకీ నేను అడిగేది ఈ నిబంధనలు (అన్ని నిబంధనలూ కాదు) ఎందుకు అన్నది మొదటిప్రశ్న. ఎలా అమలు జరుపుతారు అన్నది రెండో ప్రశ్న.

నాకు మరో కొత్త అనుభవం పీర్ రెవ్యూ. నాఅనుభవాలూ, అభిప్రాయాలూ చాలావరకూ నా బ్లాగులో రాసాను “కలం బలం అంటే నవ్విపోయే రోజు వచ్చెనా?” అన్న టపాలో. నిజానికి అది రాస్తున్నప్పుడు హాస్యానికే రాసేను కానీ పాఠకులు దాన్ని సీరియస్‌గానే తీసుకుని స్పందించేరు.

నాకు తెలిసినంతవరకూ ఈమాట.కాం వారు ఒక్కరే పీర్ రెవ్యూ చేస్తున్నది. నేను దాదాపుగా నాలుగేళ్లనుండీ ఈమాట.కామ్ వారికీ, కౌముది.నెట్. వారికీ కథలు పంపిస్తున్నాను. ఈమాట.కాం సంపాదకవర్గంలో ఒకరైన వేలూరి వేంకటేశ్వరరావుగారితో నాకు చాలాకాలంగా పరిచయం వుంది. అంచేత వారు నన్ను కథ అడగడం, నేను పంపడం, ఆయన “అందింది, రెవ్యూయర్‌కి పంపేను” అని సూచనప్రాయంగా నాకు తెలియజేయడం జరుగుతూ వచ్చింది. అలాగే కౌముది సంపాదకులు కిరణ్‌ప్రభగారితో నాకు పరిచయం లేకపోయినా కానీ, వారు అడిగినప్పుడు కూడా నేను కథలు పంపుతూ వచ్చేను. వారూ, వీరూ కూడా ఒకటో రెండో చిన్న మార్పులు సూచిస్తే, అవి సమంజసమే అనుకున్నప్పుడు మార్చాను లేకపోతే నేను ఏకోణం మనసులో పెట్టుకుని రాసేనో వివరించేను. అంతే.

ఈమధ్య అంటే నాలుగు నెలలక్రితం ఈమాట.కాంకి నాకథ “పెంపకం” పంపినప్పుడు ఈ పీర్ రెవ్యూ పేరుతో ఒకపేజీడు సూచనలు వచ్చాయి నాకు. ఒకవిధంగా చెప్పాలంటే మొత్తం కథ అంతా తిరగరాయమని సలహా ఇచ్చారు. నా ఒక్కకథమీద ఇంత విస్తృతమయిన రెవ్యూ రావడం నాకు ఇదే మొదటిసారి. “రచయిత కథలో చెప్పింది ఏమిటి, అని కాక ఈకథని సాన పెట్టడం ఎలా, నేను ఏం సూచనలు చేయ్యాలి” అని ఆలోచిస్తూ కథ చదివినట్టు అనిపించింది నాకు అది చూస్తే.

దరిమిలా వేలూరి వేంకటేశ్వరరావుగారు తమ సంపాదకీయంలో (ఈమాట.కాం. జనవరి 2009) విపులంగా ఈ పీర్ రెవ్యూ పాలసీ చర్చించారు.

సంపాదకులు ప్రధానంగా గమనించవలసినది ఏరచయితకి అయినా తనదయిన ఆలోచనా, శైలీ వుంటాయన్నది. విమర్శనాత్మం, పరిశీలనాత్మకం అయిన వ్యాసాలకి భిన్నంగా సృజనాత్మకంగా చేసే కథలూ, కవితల్లో రచయిత తనకే ప్రత్యేకమయిన ఆలోచనలను తనదైన శైలిలో చెప్తాడు. అలా చెప్పగల స్వేచ్ఛ వున్నప్పుడే అతడి ప్రతిభావ్యుత్పత్తులు ద్యోతకం అవుతాయి. అంతే గానీ, సంపాదకుల, వ్యాఖ్యాతలమనసులో వున్నకథ కాదు కదా రచయిత రాస్తున్నది. అలా రాయలేరు. అలా రాయడమే జరిగితే, మూసకథలే వస్తాయి కానీ రచయిత ప్రత్యేకతని ఎత్తిచూపేకథలు రావు. ఈవిషయమే నా “కలం బలం” టపాలో వివరంగా చర్చించేను.

పరుచూరి శ్రీనివాస్ నా టపామీద వ్యాఖ్యలో తప్పంతా రచయితలదే అన్నారు. అలాటివారు కూడా వుండొచ్చు. నేను కాదనలేను. సంపాదకులకి సుమారుగా ఏరచయిత ప్రవృత్తి ఎలాటిది అన్నది తెలియొచ్చు. తదనుగుణంగా కూడా వారు ఆయా రచయితలతో సంప్రదింపులు జరపొచ్చునేమో. స్థూలంగా చూస్తే అటూ ఇటూ కూడా ఎవరికి వారు తమంతవారం తాము అని అనుకోవడంవల్లే వస్తున్నాయి ఈ విబేధాలు అనుకుంటాను.

ఈసందర్భంలోనే మరోమాట కూడా చెప్తాను. పైన చెప్పినవిధంగా సూచనలు అందుకున్న ఒక వర్థమాన రచయిత తాను కథలు రాయలేనేమోనని నిరుత్సాహపడినట్టు రాసారు నాకు. సంపాదకులు ఈవిషయం కూడా గమనించాలి.

వ్యాఖ్యానాలవిషయానికొస్తే, రచయితలు పొగడ్తలని ఆహ్వానించినట్టు సద్విమర్శలని అంటే లోపాలు ఎత్తిచూపేవి ఆదరించడంలేదని కొందరివాదన. సద్విమర్శ అంటే కథలోగానీ, వ్యాసంలోగానీ గుణాలూ, దోషాలూ కూడా సమతుల్యంగా ఎత్తిచూపడం. అది తప్పులేదు. నామటుకు నేను నా కథలు సౌమ్యకో వైదేహికో పంపి అభిప్రాయాలు అడిగిన సందర్భాలున్నాయి. మళ్లీ ఇక్కడ కూడా సంపాదకుల సూచనలలాగే వాళ్ల వాళ్లసూచనలు కూడా సమంజసం అనుకుంటే గ్రహిస్తాను. లేకపోతే లేదు.

అలాగే ఈమధ్యనే ACFAI Journal of English Studiesకోసం ప్రొఫెసర్, ప్రభాకరరావుగారు అనువాదకృషిలో నా అనుభవాలను సవిస్తరంగా వ్యాసం (7500 మాటలు) రాయమంటే ఈ మధ్య పూర్తిచేసి వారికి పంపేను. నేను పెట్టిన పేరు Translating From Telugu into English: My experiences in transcultural translation. దానికి ఆయన Dynamics of Transcultural Transference: Translating from Telugu to English అని మార్చమని సూచించారు. నా abstractలో కూడా చెప్పుకోదగ్గ మార్పులు చేసి నాకు సమ్మతమేనా అని అడిగేరు. ఇక్కడ మీకు తేడా తెలిసిందనుకుంటాను. వారిది ఎకడమిక్ జర్నల్. వారి శీర్షిక తదనుగుణంగా వుంది. అంచేత సంతోషంగా ఒప్పుకున్నాను.

సమీక్ష, విమర్శ, పరిశీలన, వ్యాఖ్య.. ఈపదాలన్నిటికీ సూక్ష్మంగా పరిశీలిస్తే తేడాలు వుండొచ్చు. సమీక్ష అంటే సమ్యక్ ఈక్షతి అంటే చక్కగా పరిశీలించినది అని కొడవళ్ల హనుమంతరావుగారు ఈమాట.కాంలో వేలూరి నా పుస్తకంమీద చేసిన సమీక్ష మీద వ్యాఖ్యానించారు. (జనవరి 2009). కానీ స్థూలంగా వాడుకలో స్థిరపడిన అర్థాలు నాకు తెలిసినంతవరకూ – సమీక్ష అంటే కథలో ఏముందో సూక్ష్మంగా చెప్పడంతో సరిపోతుంది. సమీక్ష ధ్యేయం పాఠకులలో ఆ కథో పుస్తకమో చదవాలన్నఆసక్తి కలిగించడమే. విమర్శ తులనాత్మకంగా – అందులో గుణదోషాలు – ఎత్తి చూపుతుంది. కదాచితుగా విమర్శకుడు మరొక మెట్టు పైకి వెళ్లి, ఆ దోషాలు తొలగించే మార్గాలు కూడా సూచించవచ్చు.

పత్రిక లేక సైటు సంపాదకులు ఒక కథని పరిశీలించినప్పుడు మాత్రం వారి పోలసీ పరిధిలో ఆకథ ఇముడుతుందా, తమ పాఠకులు ఈకథని ఆదరిస్తారా, అన్నవే ప్రధానంగా చూసుకుంటారు. అంతటితో ఆగిపోవాలని రూలేం లేదు కానీ అంతకుమించిన భారం ఎత్తుకుంటే, దానివల్ల నిజంగా ఎవరికి లాభం అన్నది పరీక్షగా చూసుకోవాలి అనుకుంటాను. అలాగే రచయితలు కూడా ఆ సూచనలు ఎంతవరకూ తమకి వర్తిస్తాయి, తాను రాయాలనుకున్న కథకి అవి అనుగుణంగా వున్నాయా అని చూసుకుంటారు. ఆ సూచనలు తనకి నప్పవు అని నిర్ణయించుకునే అధికారం రచయితకి ఎప్పుడూ వుంటుంది. అలాగే ఈమార్పులు చెయ్యకపోతే మేం వేసుకోం అనే అధికారం సంపాదకులకీ వుంటుంది.

నా “పెంపకం” కథకి వచ్చిన రెవ్యూప్రకారం నేను తిరగరాస్తే, అది మొత్తం మరొక కథగా తయారయివుండేది అని నాకనిపించింది. ఒకే విషయాన్ని చిన్న చిన్న మార్పులతో మరో కథగా రాయొచ్చు అన్న నా వాదనకి నిదర్శనం నేను రాసిన రెండు కథలు “శివుడాజ్ఞ” శీర్షికతో.

నాకథ “పెంపకం” సంపాదకులు సూచించినమేరకు, నాకు తోచినంతవరకూ చివర్లో మాత్రం కొంత మార్చి తిరిగి సమర్పించుకున్నాను. వారు అది అంగీకరించి ప్రచురించారు. చెప్పొచ్చేదేమిటంటే ప్రతికథకీ ఇంత సీను అవసరమా అన్నది.

వ్యాఖ్యలు: సాధారణంగా పాఠకులు తమకి కథలో నచ్చిన లేదా నచ్చని అంశాలు సూక్ష్మంగా రెండు మూడు వాక్యాల్లో చెప్తారు. ఆ వ్యాఖ్య వస్తువూ, శైలీ, పాత్ర చిత్రణా, లేదా ఒకపాత్ర, ఒక వాక్యం – దేనిమీదయినా కావచ్చు. కానీ కథ సరిగ్గా చదవకుండానూ, పూర్తిగా చదవకుండానూ చేసే వ్యాఖ్యలు వస్తున్నాయి. అవి చూసినప్పుడు మాత్రం ఆ వ్యాఖ్యాతలు కేవలం తమ తెలివితేటలు ప్రదర్శించుకోడానికే వ్యాఖ్యానాలు చేస్తున్నట్టు కనిపిస్తాయి. తప్పు ఎత్తి చూపినప్పుడు కూడా సాహిత్యమర్యాదలు పాటించి, స్వాతిశయంతో కూడిన హేళనలూ అవహేళనలూ లేకుండా చేసిన వ్యాఖ్యలని రచయితలు ఎప్పుడూ గౌరవిస్తూనే వున్నారు. అవే నిజంగా రచయితకి ఉపయోగపడేవి కూడాను. అయితే, వెకిలిగానో స్వాతిశయంతోనో కూడుకున్న వ్యాఖ్యలూ వస్తున్నాయి. వీటికి నేను ఉదాహరణలు ఇవ్వక్కర్లేదు.

సృజనాత్మక సాహిత్యాన్ని సమీక్షించినా, విమర్శించినా ముఖ్యంగా కావలిసినవి, మొదటిది వస్తునిష్ఠ, రెండోది రచయిత ‘స్వకీయమయిన ప్రతిభావ్యుత్పత్తులు ఆవిష్కరించడానికి యత్నం చేస్తున్నాడు’ అన్న స్పృహ. కథలు చెప్పడంలో వివిధరీతులు. అందరూ ఒక్కలాగే మూసలోంచి తీసిన అచ్చుల్లా రాసేట్లయితే ఇన్నికథలక్కరేలేదు. ప్రతివారికీ తమదైన ముద్ర వుంటుంది. పెద్దరచయితలలో స్ఫుటంగా కనిపిస్తే, కొత్తగా కలం పుచ్చుకున్నవారిలో ఛాయామాత్రంగా కనిపించొచ్చు.

మీరు ఈనాటి సంపాదకులూ, పాఠకులూ సాహిత్యంలో అవగాహన వున్నవారు అంటున్నారు. సామూహికంగా అనుకోడానికి బాగానే వుంది కానీ విడివిడిగా, ఒకొక వ్యాఖ్యా తీసుకుని చూసినప్పుడు స్వాతిశయం ప్రకటించే వ్యాఖ్యాతల సంఖ్య కూడా తక్కువేం కాదు అనిపిస్తోంది నాకు. ఇది తప్పు అని మీకు అనిపిస్తే చెప్పండి. దిద్దుకుంటాను.

సంపాదకుల సూచనలూ, వ్యాఖ్యాతల అభిప్రాయాలూ కూడా రచయితలకి ప్రతిబంధకాలూ, నిరుత్సాహపరిచేవీ అవనంతకాలం రాణిస్తాయి.

నా ఈ-పుస్తకంగురించి మీరు అడిగారు. అంటే మీ అభిప్రాయం నా చాతకపక్షులగురించి అనుకుంటాను. అది పిడియఫ్ పైలు మాత్రమే కదా. సంపూర్ణంగా పుస్తకరూపంలో ఎమెస్కోవారి పరిశీలనలో వుంది. పైగా జాన్ హైడ్, అరిపిరాల -ఇద్దరూ ఈ-పుస్తకాలు ప్రచురించారు కనక నాది మొదటి ప్రచురణ కాదు.

కథల పట్ల నాదృక్పథం – నేను ముందే చెప్పినట్టు ప్రతి చిన్నవిషయం నాలో అనేక ఆలోచనలు రేపుతుంది. కథకి తగును అనుకున్నప్పుడు, తగినంత ఆవరణ ఏర్పడినప్పుడు కథగా మలుస్తాను. నా శైలీ, నేను ఎంచుకున్న ఇతివృత్తంలో ఆసక్తి గలవారు చదువుతారు. కొందరయినా చదువుతున్నారు అని తెలిసినప్పుడు నాకు సంతృప్తిగా వుంటుంది. అంతకంటె నాకథలు సాధించే ప్రయోజనం ఏమీ వుందనుకోను. కథలలో సందేశం చూసి మనుషులు మారిపోతారన్న నమ్మకంలేదు నాకు. నాజీవితకాలంలో నేను చూడలేదు. మహా అయితే కథలో నాప్రతిపాదనతో ఏకీభవించవచ్చు, మంచి జాతీయాలూ. చమత్కారం వున్న కథలు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. సిద్ధాంతచర్చలు చేసే రచనలలో నాకు ఆసక్తిలేదు. అందుకే రావిశాస్త్రిగారు ఇజాలకి లోబడి రాసిన నవలలు – రాజూ మహిషీ, గోవులొస్తున్నాయి జాగ్రత్త వంటి నవలలు నేను చదవలేదు. ఇప్పటికీ నేను చదివితే, ఆయన తొలిదశలో రాసినవే మళ్లీ చదువుతాను. సిద్ధాంతాలు దృష్టిలో పెట్టుకురాసినవి సృజనాత్మకరచనలుగా రాణించడం చాలా కష్టం. పాత్రలని ఉదాహరణలకి వాడుకుంటూ రాసిన సైద్ధాంతిక వ్యాసాల్లా కనిపిస్తాయి అవి నాకు. ఆయన మేధావి. కథలు కూడా విశ్లేషణాత్మకంగా రాస్తారు. కాని, పాత్రలు మాత్రం 2-డైమెన్షనల్. ఆయనకథల్లో నాకు నచ్చినవి చాలా తక్కువ.

మీరు “మా మే స్త్రీత్వమ్”గురించి ప్రశ్నించారు. నేను ప్రతీకాత్మకంగా రాసిన కొద్ది కథల్లో ఇది ఒకటి. స్త్రీ రాగద్వేషాలకి ప్రతీక. చైతన్యానికి ప్రతీక. చైతన్యం రాగద్వేషాలతో, కోపతాపాలతో కూడుకున్నది. నాకథలో వూరు స్థబ్ధంగా – అంటే రాగద్వేషరహితంగా వుంది. ఆమె వచ్చి ప్రేమ చూపడంతో ద్వేషానికి కూడా స్థానం ఏర్పడింది. కథలో ఒక మధ్యవయస్కుడు ఒక పసివాడిని తీసుకువచ్చాడు. మధ్యవయస్కుడు అనడంవల్ల ఆమెకంటె చిన్నవాడు అని తెలుస్తుంది. పసివాడు మనవడు అనుకోవచ్చు, ఆవూరికి (స్థబ్ధతలోనికి) ఆమె తీసుకొచ్చిన ప్రేమతోపాటు ద్వేషం కూడా వచ్చింది. ఆమె చేరదీసిన అబ్బాయి ఈర్ష్యతో కొత్తగా వచ్చిన అబ్బాయిని కొట్టిస్తాడు. ఆకొట్టినవాళ్లు మళ్లీ ఆమెని క్షమించమని వేడుకుంటారు. ఈ చిన్నకథలో మనకి నిత్యజీవితాల్లో తటస్థపడే కోపాలూ, తాపాలూ, అభిమానాలూ, ఈర్ష్యలూ – అన్నీ భాగాలే, ఇష్టాలతో అయిష్టాలూ, రాగాలతో ద్వేషాలూ పెనవేసుకుని వుంటాయి అని చెప్పడానికి ప్రయత్నించాను. ఈకథకి ప్రేరణ చివరలో ఉటంకించిన శ్లోకం. ఎక్కడ చూసేనో గుర్తులేదు. మా మే స్త్రీత్వమ్ – నాకు స్త్రీత్వమ్ (అంటే రాగద్వేషాలవంటి గుణాలే కానీ. స్త్రీ దేహం అని కాదు) వద్దు. మా మూర్ఖత్వమ్. – మూర్ఖత్వం వద్దు. మిధ్యాదృష్టిర్మా – చక్కని విచక్షణాజ్ఞానం లేనిదృష్టి వద్దు జాతౌ, జాతౌ – జన్మ జన్మలా (ఏజన్మలోనూ వద్దు) అని. 1966లో కృష్ణవేణి మాసపత్రికలో ఇది ప్రచురించుకున్నారు. ఇప్పటి సంపాదకులయితే తిరిగి చూడకుండా పారేసేవారేమో స్పష్టత లేదని 🙂 కథాకాలం చూస్తే అప్పటికి నాకు నిండా 30 ఏళ్లు కూడా లేవు.

నాకు మొదట్నుంచీ జీవితాన్ని గూర్చిన మీమాంస, సదసత్సంశయాలూ వుండేవి. రకరకాల ఇతివృత్తాలు తీసుకుని, ఇతివృత్తానికి తగినశైలిలో ఆవిష్కరించడం నాకు ఇష్టం. ఒకే అంశాన్ని భిన్నదృక్కోణాలలో ఆవిష్కరించగలగడం, ఇతివృత్తాలలో వైవిధ్యం చూపడం మంచి కథకుడి లక్షణంగా భావిస్తాను. చివరిమాటగా, నాకథల్లో ఇది మంచికథ అని నేను ఎంచి చెప్పలేను. నేను రాసిన ప్రతికథకీ వెనక ఏదో ఒకకారణం వుంది. లేకపోతే రాసేదాన్ని కాదు. అంచేత మీకు నచ్చినకథలేవో మీరు చెప్తే నేను ఏదృష్టితో ఆకథ రాసేనో చెప్పగలను. అమెరికా వచ్చేక, ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని నా జీవనసరళి ఏమిటో అర్థం చేసుకోడానికి చాలాకాలం పట్టింది. చూస్తూన్నకొద్దీ, మనకీ మౌలికమయిన మానవవిలువలలో అమెరినులకీ మనకీ వ్యత్యాసం లేదనిపించింది. పెద్దలయందు గౌరవం, సాటిమనిషిని మనిషిగా ఆదరించడం, స్వలాభం కొంత మానుకు ఎదటివారికి తోడ్పడడం – ఇవన్నీ ఇక్కడా వున్నాయి. ఆత్మగౌరవం పేరున స్వోత్కర్షా, సాంఘికవిజయం పేరున తమదారిలో వున్న వారందరిమీదా కాలేసి పైమెట్టుకి ఎగబాకడం – ఈమధ్య వచ్చిన విలువలుగా కనిపిస్తున్నాయి.

నేను అమెరికా వచ్చేక రాసినకథలన్నీ ఈ రెండు సంస్కృతులలోనూ గల తారతమ్యాలను పరిశీలిస్తూ రాసినవే. మొట్టమొదట రాసిన కథ “కొనేమనిషి”. కథలో ప్రధానాంశం – ప్రధానపాత్ర చిన్నప్ప మేనల్లుడిని తనఇంట్లో పెట్టుకు చదివిస్తాననడమే అయినా అతనిమాటతీరులో ఈమధ్యనే సర్వసాధారణమయిన వ్యాపారసరళి ద్యోతకమవుతుంది. కుటుంబంలోవారికి సాయం మన సంస్కృతిలో వుంది. అలా చేసినప్పుడు దానిలో ఏదో “లాభం” కూడా చూసుకోవడం జరగడం కొత్తగా వచ్చినవిలువ. అలాగే మన దృక్కోణాలలో మార్పు రావడం మరింత ప్రస్ఫుటంగా చూపిన కథ “డాలరుకో గుప్పెడు రూకలు”. మొదటికథ అమెరికాలో జరిగితే, రెండోకథ అమెరికాలోవున్న ఎన్నారయ్య కుటుంబం ఇండియా చుట్టపుచూపుగా వచ్చినప్పుడు జరిగినకథ.

కథని విమర్శించినపుడు కథని కథగా చూడడం నేర్చుకోవాలి మన రచయితలూ, విమర్శకులూ. కథలో పాత్రలని ఫలానా ఆయన, ఫలానా ఆవిడ అని గుర్తులు పెట్టి, కథలని జీవితచరిత్రలలాగ వ్యాఖ్యానాలు చెయ్యడం మనతెలుగుదేశంలోనే వుందేమో అనిపిస్తోంది. రచయిత తనకుతాను ఆత్మకథ రాస్తున్నానని ప్రకటించుకున్నప్పుడు మాత్రమే అలా చెయ్యడం న్యాయం.

కథను విశ్లేషించినప్పుడు మీరు ఏం చూస్తారు? కథకుడు ఆవిష్కరించిన అంశం ఏమిటి? ఏం చెప్పదల్చుకున్నాడు? శక్తివంతంగా చెప్పగలిగాడా? అన్నది నాకు ప్రధానాశం. రెండోది, నిజానికి అంతగానూ ముఖ్యమయిన అంశం శైలి. ఏరచయితనయినా వేరుగా నిలబెట్టేది శైలే. ముందు ఆవిష్కరించిన అంశం అంటే ఇతివృత్తం గురించి చెప్తాను. ఇది ప్రస్తుతం నేను రాస్తున్న డయాస్పోరా కథల విషయంలో ఇది ఇంకా ముఖ్యం. దాదాపు అనువాదాలలాగే ఇందులోనూ అపార్థాలకి చాలా తావుంది. మామూలుగానే చిన్నకథల్లో రచయిత వాచ్యం చేసేది తక్కువ -కథకి వస్త్వైక్యత ముఖ్యం కనక. పాఠకుల ఊహకి చాలా వదిలిపెట్టడం జరుగుతుంది చిన్నకథలో. అంచేత ఇతర సంస్కృతిగురించి రాసేటప్పుడు ఆ సంస్కృతిగురించి వున్న స్టీరియోటైపులని మరింత పటిష్టం చెయ్యకుండా జాగ్రత్త పడాలి.

ఈ సందర్భంలో నాకథ “నిజానికీ, ఫెమినిజానికీ మధ్య” కథనిగురించి రెండు మాటలు చెప్తాను. ఆకథలో నేను అమెరికా వచ్చిన కొత్తలో గమనించిన తెలుగువాళ్ల మానసిక ప్రవృత్తినీ, ప్రవర్తనలనీ – ఒక అయోమయస్థితిని ఆవిష్కరించడానికి ప్రయత్నించేను. ఆదశకంలో మగవారికి ఉద్యోగాలలో నిలదొక్కుకోడం ఎంత కష్టమయిందో, ఇంట్లో ఆడవారికి అలవాటులేని చాకిరీ, ఎల్లవేళలా మూసుకున్న తలుపులవెనక జైలుజీవితం, పనిగట్టుకు వీధిలోకెళ్తే తప్ప కనిపించని మొహాలూ అంతా కటకటగా వుంటుంది. “కప్పు కాఫీ పెట్టుకోవాలంటే మూడు గిన్నెలు కడుక్కోవాలని కాఫీ మానేసిన రోజులున్నాయి” అంటుంది సీత. ఆనాటి పరిస్థితి అది. ఇప్పుడయితే బయటికి వెళ్లి తాగుతారు. ఇంట్లో భర్తలు కాఫీ పెట్టివ్వడానికి వెనకాడరు. భార్యాభర్తలమధ్య ఎడం పెరిగిపోవడానికి కారణాలు అనేకం. వాటిలో తేలిగ్గా ఉపయోగించగలిగిందీ, కథకి బలం చేకూర్చేదీ, ఆనాడు ఆంధ్రాలో చురుగ్గా సాగుతున్నదీ – ఒకరకమయిన చాపల్యంతోనే వాడుకున్నాను. అప్పట్లో అది కథకి బలాన్నిచ్చేదిగా తోచింది.

రంగనాయకమ్మ రాసిన పుస్తకంలో నాకథని వాడుకున్న తీరుకి నాఅభ్యంతరాలు: అసలు ఆ పుస్తకం మంచిరచయితకి వుండవలసిన సంయమనంతో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేదిగా కాక, తనకి మరెవరిమీదో వున్న కక్ష తీర్చుకోడానికి రాసింది. నా కథని ఒక ఆయుధంగా వాడుకున్నట్టు కనిపిస్తుంది. ఏ రచయితకి గానీ అది గర్వపడదగ్గ విషయం కాదు. సాహిత్యపరంగా ఆమె విశ్లేషణలో లోపం – “సీత అలా ఆత్మవంచన చేసుకుంటూ కొన్నాళ్లుండి …” అన్న వాక్యం. రంగనాయకమ్మవంటి మహా మేధావికి ఆత్మవంచన అంటే ఏమిటో తెలీదని అనుకోలేం కానీ నేను మరోసారి చెప్పకుండా వుండలేను. లేనిదాన్ని వున్నట్టు తన్ను తాను నమ్మించుకోడం ఆత్మవంచన. ఒక సమస్యని గుర్తించడం, దానికి కారణాలు వెతుక్కోడం, ఎదుటివ్యక్తిని ప్రశ్నించడం, పరిష్కారం, నిర్ణయం – ఇవి ఆత్మవంచన కాదు. నా రెండో అభ్యంతరం – నాకథలో ఒక వాక్యాన్ని తీసుకుని “మార్చి” వాడుకున్నానని చెప్పడం. నిజానికి నాదృష్టిలో అది సామాన్యంగా అలాటి సందర్భంలో తేలిగ్గా ఎవరయినా అనగలిగిన వాక్యం. దాన్ని ఆవిడ “మార్చడం”లో నేనేదో అసభ్యకరమయిన మాట రాసినట్టు, తాను దాన్ని శిష్టజన వ్యావహారికం చేసినట్టు ధ్వని వుంది. నాకథలో వాక్యం భార్యకీ, వెలయాలికీ గల తారతమ్యం ఎత్తి చూపుతుంది. రంగనాయకమ్మ వాక్యానికి (మీ ప్రేయసులలో ఒక ప్రేయసిగా వుండను) ఆ అర్థం రాదు. అంచేత అది పూర్తిగా ఆవిడవాక్యమే. అక్కడ నావాక్యమేదో తాను వాడుకున్నాననడం అనవసరం.

నేను విశ్లేషించినప్పుడు శైలి కూడా ప్రత్యేకంగా చూస్తాను. శైలి భాషకి సంబంధించినది. నాకు తెలుగుభాష అంటే అభిమానం కనక మంచి తెలుగు వాడిన కథలు నాకు బాగుంటాయి. ఈరోజుల్లో చాలామంది వస్తువుకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు. కథని విమర్శించినపుడు కథని కథగా చూడడం నేర్చుకోవాలి మన రచయితలూ, విమర్శకులూ. కథలో పాత్రలని ఫలానా ఆయన, ఫలానా ఆవిడ అని గుర్తులు పెట్టి, కథలని జీవితచరిత్రలలాగ వ్యాఖ్యానాలు చెయ్యడం మనతెలుగుదేశంలోనే వుందేమో అనిపిస్తోంది. రచయిత తనకుతాను ఆత్మకథ రాస్తున్నానని ప్రకటించుకున్నప్పుడు మాత్రమే అలా చెయ్యడం న్యాయం. నిజానికి అలా రాసినప్పుడు కూడా కొంతమార్పులూ, చేర్పులూవుండడానికి అవకాశం వుంది. రచయిత తన అక్రమప్రవర్తన గురించి రాస్తున్నప్పుడు కూడా ఒకవిధమయిన స్వాతిశయంతోనే రాస్తాడు. (నాకు మరో సందేహం కూడా ఇప్పుడే కలుగుతోంది. రంగనాయకమ్మ స్వీయచరిత్ర రాసిందా అని. ఎవరైనా తెలిస్తే చెప్పగలరు).

నాజీవన దృక్పథం. నాకు జీవితంలోనూ సాహిత్యంలోనూ కూడా ఒకే విలువలు. చిత్తశుద్ధీ, ఆత్మవివేచనా, ఉన్నదానితోనే తృప్తిపడడం నాకు చిన్నప్పట్నుండీ ముఖ్యమయిన విలువలుగా వుంటూ వచ్చేయి. నేను సాధారణంగా ఎవరికీ మాట ఇవ్వను, చెయ్యగలనని గట్టిగా నమ్మితే తప్ప. చేస్తానని చెప్పి, ఏదో మొక్కుబడిగా చెయ్యటం కూడా లేదు. నాలో లోపం, అందరూ అలాగే వుంటారనుకోడం. ముఖ్యంగా నా స్నేహితులమని చెప్పి, ఇది చేస్తాం, అది చేస్తాం అని వాళ్లు చెప్పడం, నేను నమ్మి, తరవాత బాధ పడడం జరిగింది. అందరూ అలా వుండరని తెలుసుకునేసరికి నాజీవితంలో ముక్కాలువాసి అయిపోయింది., 🙂 ముందెక్కడో చెప్పేననుకుంటాను.. నాచుట్టూ వున్నజనాలకీ నాకూ మధ్యన ఎప్పుడూ బెత్తెడు ఎడం వుంటున్నట్టు నేను సదా ఫీలవుతానని. అమెరికా వచ్చేక ఆ ఎడం బారెడయింది. ఇప్పటికీ “నేను ఇక్కడిప్రజలలో ఒకమనినిషిని” అని నాకు అనిపించదు. దీనివల్ల లాభమూ, నష్టమూ కూడా వున్నాయి. లాభం ఏమిటంటే నాజీవితానికి నేను కూడా ఒక ప్రేక్షకురాలిని అయినట్టు దూరంనుంచి నా జీవితాన్ని పరిశీలించుకోగలగడం. నష్టం అమెరికాలో జీవితంతో రాజీ పడలేకపోవడం. అంచేతే నా సాహితీలోకమే నాలోకం. ఇది ఊహాజగత్ కావచ్చు.

మహిళగా నా ఆలోచనలు. చెప్పేను కదా, మాయింట్లో నన్ను ఆడపిల్ల వేరు అన్నట్టుగా పెంచలేదు కనక నాకు మొదట్నుంచీ ఆ దృష్టి లేదు. అంచేత నా ఆలోచనలు మహిళని అన్న పరిమితిలో కాక నేనొక మనిషిని అన్న విస్తృతపరిధిలో అంటే నేనొక మనిషిని అన్న దృష్టితో ఆలోచిస్తాను. హింస – మగాళ్లు ఆడవాళ్లని హింసించడంతో ఆగిపోలేదు. నాఅభిప్రాయంలో హింసకి మూలం బలం. అర్థబలం కావచ్చు, అంగబలం కావచ్చు. మనిషికి ఆ బలం నిరూపించుకోవాలన్న కోరిక కలిగించేది అహంకారం. ప్రతి ఒక్కరూ ఎదుటివారిమీద తన ఆధిక్యత చూపించుకోడానికే బలం ప్రదర్శిస్తారు. అంచేత ముందు రావలసింది వైయక్తిక విలువలలో, సామాజికవిలువలలో మార్పు. ఎదటివారిని గౌరవించడం నేర్చుకున్నవారు ఏ జండరువారినయినా గౌరవిస్తారు. అందుకే నాకథల్లో బాధలు అనుభవించిన స్త్రీలు వున్నారు కానీ కేవలం అదే అన్నికథలకీ ప్రాతిపదిక కాదు. అనేక వస్తువులలో అదొక వస్తువు అంతే. ఉదాహరణకి, మంచుదెబ్బ కథలో వకుళ మౌనాన్ని ఆయుధంగా వాడుకుంది. దీన్ని passive aggressive అంటారు. “నవ్వరాదు” కథలో కమలిని హాస్యాన్ని థెరపీగా వాడుకుంది. అంటే నేననడం ప్రతివ్యక్తీ తనకి అనువైన మార్గాన్ని వెదుక్కుంటుంది ఆపత్సమయంలో. ఈకథల్లో కేవలం బాధల్ని మాత్రమే గుర్తించి, ఆ పాత్రల వ్యక్తిత్వాలని గుర్తించకపోతే కథ సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాటే. ఏ పత్రికలో చూసేనో గుర్తులేదు కానీ ఒక పత్రికవారు నా ”నిజానికీ ఫెమినిజానికీ మధ్య” కథకి, ఓ స్త్రీ బొమ్మ నెత్తిన చెంగుతో, పెద్ద కన్నీటిబొట్టుతో వేశారు. నా దృష్టిలో ఆ పత్రికవారూ, ఆ చిత్రకారుడూ కూడా కథని సరిగ్గా చదవలేదనే.

స్త్రీలు తమ అనుబంధాల్ని, ఆత్మ గౌరవాన్ని ఏకకాలంలో నిలబెట్టుకోగలరా? జీవితంలో ఏ విలువల కోసం తపించాలి, దేనీ కోసం దేన్ని వదలుకోవటానికి సిద్ధపడాలి.
ఇది క్లిష్టమైన ప్రశ్న. అవి చర్చించేంత సాంఘికశాస్త్ర పరిజ్ఞానం నాకు లేదండీ. అంతేకాదు. నేను చెప్పలేకపోవడానికి మరో కారణం కూడా వుంది. మనకి చెప్పేవారు ఎక్కువయిపోవడంవల్లే సగం బాధలు వస్తున్నాయి. వారు చెప్పేదొకటీ, చేసేదొకటీ – అలాటివారికి మిగిలిన సగంమంది – ఏ బాధలూ లేనివాళ్లు బ్రహ్మరథాలు పడుతున్నారు. నాకు తెలిసిందల్లా ప్రతి ఒక్కరి జీవితం తమచుట్టూ వున్న మనుషులూ, సంఘటనలూ, అనుభవాలూ – ఇన్నిటితో ముడిపడి వుంటుంది. వీటి ప్రభావం వ్యక్తులు తమజీవితంలో తీసుకునే ప్రతి అడుగుమీదా వుంటుంది. అంచేత ఎవరికి వారే తమ జీవితాన్ని దిద్దుకోడానికి సమర్థులు. ఎవరినైనా అనుసరించాలనుకుంటే వారు తమమాటలు ఆచరణలో పెడుతున్నారో లేదో కూడా చూసుకోండి. లేకపోతే మాఅమ్మ మాటల్లో “వాళ్ల బోధగురువులు కారు, బాధగురువులు.” ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి నేను స్త్రీలకి వేరే సాహిత్యం అనాదిగా వుంటూనే వుంది అన్నాను. అదేమాట ఇక్కడ కూడా చెప్తాను. స్త్రీగా అనుభవం, వ్యక్తిగా అనుభవం – ఇవి వేరు కావచ్చు, ఒకటే కావచ్చు. రచయితలు ఏ దృష్టితో ఆ అనుభవం ఆవిష్కరిస్తున్నారు అన్నది, పాఠకులు సూక్ష్మదృష్టితో పరిశీలించుకోవాలి. ఉదాహరణకి, ఈనాటి దంపతులలో పరస్పర గౌరవం పూర్వంకంటే మెరుగ్గా వుంది. మళ్లీ నేను మొదటికే వస్తున్నాను. స్థూలంగా ఆడవాళ్లు ఇలా చెయ్యాలి, మొగవాళ్లు అలా చెయ్యాలి అని సిద్ధాంతాలు చెయ్యడం కాదు ఇప్పుడు కావలసింది. ప్రతివారూ ఎవరికి వారు ఆలోచించుకుని నిర్ణయాలు చేసుకోవాలి. ఈనాటి విద్య పిల్లలకి నేర్పవలసింది అదే.

అమెరికా ఇండియా సంస్కృతుల మధ్య తేడా చూసిన వారు కాబట్టి మన సమాజం లోని కట్టుబాట్లు, వ్యక్తిస్వేచ్ఛపై పరిమితులు, వీటి వల్ల మనం నష్టపోతున్నామా?
దీనికి కూడా పైప్రశ్నలాగే నాలుగుమాటల్లో చెప్పగల సమాధానం లేదు. మనదేశంలో వున్నలాటి కట్టుబాట్లు అమెరికాలో కూడా వున్నాయి. మన సినిమాల్లో పతివ్రతాధర్మాల్లాగే మీడియా “అతి” చేస్తోంది, అమెరికాలో స్వేచ్ఛని. నిజంగా దైనందిక జీవితాలు పరీక్షగా చూస్తే, అమెరికాలోనూ ఇండియాలోనూ కూడా రెండూ – కట్టుబాట్లూ, స్వేచ్ఛా కూడా కనిపిస్తాయి. ముందు చెప్పేను కదా.. మాయింట్లో నాకు స్వేచ్ఛ బాగానే వుండేది. నేను మా అమ్మాయిని అమెరికాలో పెంచేను కనక అదే అమెరికన్ ధర్మంలా కనిపిస్తుంది. కాని నిత్యజీవితంలో కొన్ని విషయాల్లో సూక్ష్మదృష్టికి తేడాలు కనిపిస్తాయి. నా కథల్లో ఇలాటివిషయాలు సందర్భానుసారం చొప్పిస్తుంటాను. (అయిపోయింది)
———————

Posted in వ్యాసం | Tagged | 17 Comments

తామస విరోధి- ఐదవ భాగం

సాహితీ మిత్రులకు నమస్కారం!
తామస విరోధి కి ఒక కవిత పంపుతున్నాను..
చూడండి.
-తవ్వా ఓబుల్ రెడ్డి

ప్రభాతవేళ …..!
పున్నమి వెన్నెలలో తడిచి,తడిచి
ముద్దగా ముడుచుకుని ఉంటుంది పల్లె
వేట కోసం లేచిన వేకువ పిట్టలు
వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ ఉంటాయి
తరతరాల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా
పల్లె నలు చెరుగులా కోడి కూతలు
రాత్రంతా మొరిగి మొరిగి ఏ అరుగుల కిందో
కునుకు తీస్తుంటాయి కుక్కలు
ఏమరు పాటే ఎరుగని ఏరువాక గువ్వ
ఎగిసి ఎగిసి కూస్తూ ఉంటుంది
ఎద్దుల మెడార్ల గంటలు
శ్రావ్యంగా తాళం వేస్తుంటాయి
వాటి గిట్టల చప్పుడు ముందర
తబలా వాద్యమైనా బలాదూరే అన్నట్లుంటుంది
తిరగేసిన నాగలి, బాటపై జీరాడుతూ
వాయులీనం మోగిస్తూ ఉంటుంది
మంచినీటి బోరు బొంగురు గొంతుతో
మూలుగు పాటను పాడుతూంటుంది
రాత్రంతా ఎక్కడ తిరిగాయో ఏమో
వేకువ జామున్నే పిల్లుల కాట్లాట
వామి దొడ్లోని చిటారుకొమ్మన
పక్షుల కువకువలు వినిపిస్తూ ఉంటాయి
పడమటి కోన నుంచీ సాగివచ్చే జాజిపూల గాలులు
వీధులకు సుగంధాలను అద్దుతూ
తూరుపు కొండల దిశగా సాగిపోతుండగా
చీకటి నుంచి వెలుతురులోకి
పల్లె సమాయత్తమవుతూ వుంటుంది

-తవ్వా ఓబుల్ రెడ్డి

బాబా: ఒక లాండ్ స్కేప్ పెయింటింగ్ లాగ ఉంది మీకవిత.

ఒక్కొక్క పదచిత్రాన్ని మదిలో ఆవిష్కరించుకుంటూంటే, ఒక గొప్ప పల్లె చిత్రం, మల్లీశ్వరిచిత్రంలోని పాటలా ” మనసున మల్లెల మాలలూగెనే” అన్న రీతిలో తారాడుతుంది. నాస్టాల్జిక్ కవితలన్నీ చాలా చాలా లోతుగా గుచ్చుకుంటాయి. (పల్లెలనేవి, ఇలా తెరపై అక్షరాలు చదువుకునేవారికందరికీ ఒక నాస్టాల్జియానే) మీ కవిత కూడా.

కొన్ని పదచిత్రాలు ఎన్నో జ్ఞాపకాలని రేకెత్తిస్తుంది. నాకు నచ్చిన కొన్ని ప్రయోగాలు:

వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ ఉంటాయి

ఇక్కడ ఈదుతూ అన్న ప్రయోగమే ఈ వాక్యానికి అందాన్నిచ్చింది.

పల్లె నలుచెరుగులా కోడి కూతలు శభాష్ నలుచెరగులా అనటం మంచి ఊహ.

తిరగేసిన నాగలి, బాటపై జీరాడుతూ
వాయులీనం మోగిస్తూ ఉంటుంది

పై వాక్యం వద్ద చూపు చాలాసేపు నిలిచిపోయింది. ఫక్తు గ్రామీణ పదచిత్రం. ఎంతగొప్పగా ఉందంటే, గోరటి వెంకన్న ఒక చోట అంటాడు -”ఎద్దుల కాలి గిట్టలు చేసిన గుంటలలో చేరిన నీటిని పిట్టలు ముక్కులతో తాగుతున్నాయి” అని.
– ఈ వర్ణన కూడా అంతే గొప్ప చిత్రం.

మంచినీటి బోరు బొంగురు గొంతుతో : అవును మరి, ఆ టైములోనే కదా ఉచిత విద్యుత్ ఇచ్చేది. 🙂
పిల్లుల కాట్లాట పక్షుల కువకువలు – కువకువలు కంటే కలకలం అని ఉంటే ఆ రెంటి దృశ్యాల మధ్య సమన్వయం బాగుండేది. మొత్తంమీద కవితలో మరికొంత క్లుప్తత ఉంటే బాగుండేదనిపించింది. మంచి కవిత.

భూషణ్:
మంచి భావుకత ఉంది.ఇంకా బాగా రాయగలరు మీరు. విశేషణాల విషయంలో ఇబ్బంది లేదు
(ఈ విషయం బాగా తెలియాలంటే శివారెడ్డి కవిత్వం చదవాలి;తెలుగులో విశేషణాల వాడుక తెలియని కవుల్లో శివారెడ్డిది అగ్రస్థానం)

పేరు మార్పు: తెల్లవారింది
కలం పేరు : అవసరం.

———————————————————————————————————————-
ప్రభాతవేళ
పున్నమి వెన్నెలలో తడిచి,తడిచి
ముద్దగా ముడుచుకుని [ఉంటుంది] పల్లె
వేట కోసం లేచిన వేకువ పిట్టలు
వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ [ఉంటాయి ]
{ తరతరాల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా }
పల్లె నలు చెరుగులా కోడి కూతలు
రాత్రంతా మొరిగి మొరిగి ఏ అరుగుల కిందో
కునుకు తీ [స్తుంటాయి}1 కుక్కలు
ఏమరు పాటే ఎరుగని ఏరువాక గువ్వ
^ఎగిసి ఎగిసి కూ[స్తూ}3 [ఉంటుంది ]
ఎద్దుల మెడార్ల గంటలు
^(శ్రావ్యంగా) తాళం వే[స్తుంటాయి }2
వాటి గిట్టల చప్పుడు {ముందర
తబలా వాద్యమైనా బలాదూరే అన్నట్లుంటుంది }
తిరగేసిన నాగలి, బాటపై జీరాడుతూ
^వాయులీనం మో[గిస్తూ }4 [ఉంటుంది ]
మంచినీటి బోరు బొంగురు గొంతుతో
మూలుగు పాట[ను పాడుతూంటుంది ]
రాత్రంతా ఎక్కడ తిరిగాయో ఏమో
వేకువ జామున్నే పిల్లుల కాట్లాట
వామి దొడ్లోని చిటారుకొమ్మన
పక్షుల కువకువలు [వినిపిస్తూ ఉంటాయి ]
పడమటి కోన నుంచీ సాగివచ్చే జాజిపూల గాలులు
వీధులకు సుగంధాలను అద్దుతూ
తూరుపు కొండల దిశగా సాగిపోతుం[డగా }5
చీకటి నుంచి వెలుతురులోకి
పల్లె సమాయత్తమవు[తూ వుంటుంది}6
——————————————

విశ్లేషణ
——————————–
() బ్రాకెట్లో ఉన్నవి అమూర్త విశేషణాలు:ఇవి ఎంత తగ్గితే అంత
చిక్కబడుతుంది కవిత్వం.
[] బ్రాకెట్లో ఉన్నవి ద్రుత పదబంధాలు:ఇవి తొలగిస్తే పాఠకుల ఊహకు పదును
కలుగుతుంది.
{}బ్రాకెట్లో ఉన్నవి వ్యాఖ్యానాలు :కథ చివరలో నీతి,కవితలో వ్యాఖ్య
వర్జ్యం.
[}బ్రాకెట్లో ఉన్నవి ప్రతిక్షేపాలు :క్రియలు మార్చాలి (ఉదా:
[స్తుంటాయి}1,2 –>[ సే }
[స్తూ}3 —> [ సే }
[గిస్తూ} —>[ గించే}
[డగా}5 —> [ టే }
[తూ వుంటుంది}6 —> [ తుంది}

వాక్య క్రమం
————————————–
^ ఈ వాక్యం పైకి

మూలా సుబ్రహ్మణ్యం:
మంచి కవితలతో, అద్భుతమైన విశ్లేషణలతో సాగుతున్న కవితా ఝరిలో నావి కొన్ని
హైకూలు/పదచిత్రాలు.

1.

కొలనులో చంద్రుడు
తుళ్ళి పడ్డాడు
తూనీగ రెక్క తగిలి

2.

ఒకే తోటలో చెట్లు
కొన్ని పొట్టి
కొన్ని పొడుగు

3.

తట్టలో చూసే కాయలు
చెట్టుకే చూడ్డం
ఎంత బావుంది!

4.

పిల్ల కాలువని
మీటుతున్నాయి
మర్రి ఊడలు

5.

తామరాకుల కింద
దాక్కుంది
కొలను.

6.

దట్టమైన అడవి
ఒకటో రెండో
సూర్య కిరణాలు

7.

ఈ సెలయేరు
క్షణం క్రితం
జలపాతం!

8.

పావురాళ్ళకి మేత
వాటి కడుపు నిండుతుంటే
నా గుండె నిండుతోంది

9.

ఖాళీ బాల్చీ
నిండుతున్న సవ్వడి
ఏదో చెప్తోంది

10.

జలపాతానికి
రంగుల ముఖద్వారం
ఇంద్రధనస్సు!

రాకేశ్వర రావు:

చాలా బాగున్నాయండి. మొదటిది చదవగానే, నేను ఒక్క క్షణం స్తంభించిపోయాను. అదే హైకూల లక్ష్యం అనుకుంట కదా.

ఆపై, నేను చేసిన పొరపాటు ఏంటంటే, మొదటిదాని మాయలోనుండి బయటపడకుండానే రెండవది చదివేయడం. అలా అన్ని అనుభూతులూ కలగాపులగం అయ్యిపోయాయి. కాబట్టి మీరు తరువాతిసారి నుండి ఇలాంటి అద్భుతమైన హైకులు పంపేటప్పుడు రోజుకొక్కటిగా పంపగలరు 🙂

Jokes apart, అన్నీ, చాలా బాగున్నాయి. అదీను నేనీమధ్యన చేలమ్మట చెఱువులమ్మట బాగా తిరగడం వలన ఇంకా బాగున్నాయి. నేనూ కొన్ని హైకూలు వ్రాస్తే పోతుందేమో అని నిన్నటి వరకూ అనుకున్నాను కానీ, మీవి చూసిన తరువాత నేను నా ప్రయత్నం విరమించుకున్నాను. హైకులు అనుభవించగలిగితే అదే మహాభాగ్యం కదా.

మీరు బెంగుళూరిలాంటి పంకపల్లెలోనుంటూ ఇలాంటి పంకజాలు పుట్టించడం అద్భుతం. ఎనిమిదోనెంబరుది కాస్త odd గా తట్టింది నాకు. మీ ఆత్మప్రస్థావన వలన అనుకుంట. నాకంటే పెద్దల అభిప్రాయం పొందగలరు.

రవిశంకర్:
పదచిత్రాలు చాలావరకు చక్కగా కుదిరాయి. ఒక మూడు మాత్రం (7,8,9) తొలగించి ఉండవచ్చుననిపించింది. పదాలతో పటం కట్టటంలో కవికున్న అనుభవం తెలుస్తోంది.

భై. కామేశ్వర రావు:
పదచిత్ర కవితల గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. వీటి గురించి మీ ఆలోచనలని కోరుతున్నాను. దీని కోసం సుబ్రహ్మణ్యంగారి కవితలని ఉదహరణలుగా తీసుకుంటున్నాను, అతను మన్నిస్తారన్న ధీమాతో.
1. కేవలం పదచిత్రాలు కవిత్వం అవుతాయా?
ఉదాహరణకి “కొలనులో…” అన్న మొదటి కవిత, “ఒకే తోటలో…” అనే రెండో కవిత. ఇందులో మొదటి దాన్లో సాధారణంగా మనిషి చూడని, చూసినా పట్టించుకోని, పట్టించుకున్నా అలా అన్వయించుకోని ఒక పద చిత్రం. ఇది దృశ్యాన్ని చూపించి
అనుభవించమని ఊరుకుంటుంది. అదే రెండో దాన్లో ఎప్పుడూ చూసే దృశ్యమే, ఎప్పుడూ చూస్తున్నట్టే ఉంది. కాని అందులోంచి కవికి ఏదో అర్థం స్ఫురించి ఉండాలి. అందుకే దాన్ని కవితకి అర్హమైనదిగా భావించాడు. అదేమిటో పాఠకుల ఊహకి వదిలేశాడు. ఒకోరు ఒకోలా ఊహించుకోవచ్చు.
ఈ రెండిటిలో నాకు మొదటిది మాత్రమే కవిత్వం అనిపిస్తోంది. రెండోది సాధారణ పదచిత్రం (ఒక దృశ్యాన్ని మనకి చూపించే పద సమూహం అని దీనికి నేనర్థం చెప్పుకున్నాను). నేనకున్నది సరా కాదా? అలా అనుకుంటే, పదచిత్ర కవితలు (మొదటి తరహాకి చెందినవి) చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి. అలా కాకపోతే, మామూలు దృశ్యాల చిత్రణ నుంచి కవిత్వాన్ని ఎలా వేరు చెయ్యడం?
2. ఈ రెండో అనుమానం పదచిత్ర కవిత ప్రయోజనం గురించి. దీని గురించి ఆలోచిస్తే, అసలు కవిత్వం ప్రయోజనమేమిటన్న ప్రశ్న వస్తుంది. నా ఉద్దేశంలో అన్ని “రకాల” కవిత్వాలకీ ఒకటే ప్రయోజనం ఉండాల్సిన అవసరం లేదు. కవిత్వాన్ని రకాలుగా విభజించడం కొందరికి నచ్చదు. కాని విశ్లేషణకి, విమర్శకి అది అవసరమని నా ఉద్దేశం. పదచిత్ర కవిత్వం విషయానికొస్తే, అలాంటి ఒక కవిత ప్రభావం పాఠకుని మీద ఎంత సేపు, ఎంత తీవ్రంగా ఉంటుంది? ఇది ఖచ్చితంగా పాఠకుల మీద కూడా ఆధారపడి
ఉంటుంది. అయితే వీటిని ఆనందించాలంటే పాఠకునికి ఎలాంటి నేపథ్యం కావాలి?

త.య.భూషణ్:

1. కేవలం పదచిత్రాలు కవిత్వం అవుతాయా?
అద్భుతమైన ప్రశ్న;కావనే సమాధానం.

పదచిత్రాల సమూహం కవిత్వం కాబోదు.అది కవిత్వాన్ని దసరా బొమ్మలకొలువు స్థాయికి దించి వేస్తుంది.తనలో కదిలిన ఉద్వేగానికి తగిన పదచిత్రాలు ఎన్నుకొనడంలోనే ఉంది కవి ప్రతిభ.ప్రతి పదచిత్రం హైకూ కాదు,అలాగే ప్రతి పదచిత్రాల సముదాయం కవిత్వం కాదు. కవిత్వం డిజిటల్ ఫొటోగ్రఫీ స్థాయికి దిగజారి పోరాదు.నీలోని ఉద్వేగాన్ని పదచిత్రం పట్టుకురాలేక పోతే అది వృధా. పదచిత్రాలను బంధించే అంతస్సూత్రం కవిలోని ఉద్వేగం.

2.మీ రెండవ ప్రశ్న నాకు అర్థమైనంత మేరకు సమాధానమిస్తాను. పదచిత్రాల కవిత్వం అధికంగా తూర్పు దేశాల నుండి బయల్దేరింది.
చైనీస్  కవిత్వాన్ని ఎజ్రా పౌండ్ అనువాదం చేసేదాకా పడమటి దేశాల్లో ఎక్కువ మందికి తెలియదు. అన్ని భాషలు ఒకే స్థాయిలో లేవు.ఆంగ్లంతో పోలిస్తే చైనీస్ ఎంతో నాగరకమైన భాష (ఇదే కోవలోకి వస్తాయి మన సంస్కృతం,గ్రీకు ; నేను ఈ విషయం మీద ప్రత్యేక వ్యాసం రాసి ఉన్నాను,కావలసిన వారికి పంపించ గలను ;కాబట్టి ఎక్కువ వివరాల్లోకి పోవడం లేదు)

ఈ ప్రత్యేకమైన పదచిత్ర కవిత్వాలు వారి భాషల్లో ఒదిగినంత అందంగా ఇతరభాషల్లో ఒదగవు.ప్రాచీన జపనీస్ కవులు విధిగా చైనీస్ కావ్యాలు చదువుకున్నారు,మన ప్రాచీన తెలుగు కవుల సంస్కృత కావ్యాలు పఠించినట్టే.అక్కడితో ఆగకుండా ,పదచిత్ర కవిత్వాలకు పరాకాష్ట అనదగ్గ హైకూ కవిత్వం సృష్టించారు. హైకూ ( హైకూలు అనడం తప్పు) చాలా కష్టమైన ప్రక్రియ. హైకూ రచనకు జపనీయ కవిసమయాలు చాలా గొడవ ఉంది.

నీ అనుభవాన్ని పదచిత్రంలో ఒడిసి పట్టుకోవాలి. ఝటితిస్ఫూర్తి చెడకుండా ,భాషా మర్యాదలను అతిక్రమించకుండా ఆ అనుభవాన్ని అందివ్వాలి. అది నీ అనుభవమే అయిఉండాలి,వెఱ్ఱి ఊహ కానే కాదు.చమత్కారానికి స్థానం లేదక్కడ.

ప్రకృతితో మమేకమైతే గాని అటువంటి సిద్ధి కలగదు.ప్రకృతిలో ప్రతి కదలిక నీకు తెలియాలి. మారే ఋతువులు రంగులు జీవజాలంపై వాటి ప్రభావం ప్రతి సూక్ష్మ విషయం నీకు తెలియాలి.

అప్పుడుగాని నిక్కమైన నీలం లాంటి హైకూ నీ హృదయంలో వెలగదు; అదే కాంతిని ఇతరుల హృదయాల్లో వెలిగించదు.

అనుభవాన్ని అనుభవంగా అందించడమే కవిత్వ పరమ ప్రయోజనం. బుద్ధిమార్గంలో తెలుసుకున్నవి నీ అనుభవాల్లో కలిసిపోలేవు.అతి
తేలికగా మరపుదారిలోకి జారిపోతాయి.కాబట్టే,మనం కవిత్వానికి అంత విలువ ఇచ్చుకుంటాం.

హైకూ కవిత్వాన్ని లేదా పదచిత్ర కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సూక్ష్మ విషయాలన్నీతెలిసి ఉండాలి.ముఖ్యంగా మన కవిత్వ
సంప్రదాయం స్పష్టంగా తెలిసి ఉండాలి.దానికి తోడు మన ధ్వని / రస సిద్ధాంతం (భావం /స్థాయీభావం/సంచారీ భావాలు/రసం- వీటి చర్చ) ఉపకరిస్తుంది. చాలామంది ఆధునికులు ప్రాచీన కావ్యాలు చదవకపోవడం ఒక యోగ్యతగా భావిస్తారు.పాతకు ,కొత్తకు
మధ్య ఎటువంటి  వ్యతిరేకత లేదు.పాతకవిత్వాల మీద మనకున్న అవగాహన కొత్త కవిత్వాలను అర్థం చేసుకోవడానికి చాలా సహాయకారి.

ఇక అసలు విషయానికొస్తే :మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.

1.
కొలనులో చంద్రుడు
తుళ్ళి పడ్డాడు
తూనీగ రెక్క తగిలి
2.
ఒకే తోటలో చెట్లు
కొన్ని పొట్టి
కొన్ని పొడుగు

1. ఎన్నదగినది  2.విడువదగినది.
(ఒకటవ దాని విషయంలో కూడా నాకు కొన్ని సందేహాలు: తూనీగలు రాత్రి వేళ తిరగవు.ఏ చెట్టు మీదో పడుకుంటాయి.
లేదా తూనీగలాంటి వేరే కీటకమా ?? )

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

అత్తెసరు – పచ్చిపులుసు

– వెంపటి హేమ

“అమ్మా” అని ఆర్తనాదం లాంటి కేక పెట్టాడు ఆదిత్య. పాపం! చేతకాని పనేమో, కూర తరుగుతూంటే చెయ్యి తెగింది. కాని అదేమీ పట్టించుకోకుండా, హాల్లో సోఫాలో పడుకుని సీరియస్సుగా నవలేదో చదువుతున్న బాలాజీ హాస్య సన్నివేశం వచ్చింది కాబోలు పడీ పడీ నవ్వుతున్నాడు. పైపనంతా చేసి, వంటకన్నీ అమర్చిన తరువాత ఆదిత్య వెళ్లి చెపితే అప్పుడొచ్చి వంట మొదలుపెడతాడు బాలాజీ. అది వాళ్లిద్దరి మధ్యా జరిగిన ఒప్పందం. తనకు వంట చేతకానందుకు తనని తానే తిట్టుకున్నాడు ఆదిత్య. వెంటనే అతనికి తల్లి మాటలు గుర్తు వచ్చాయి….

ఆమె ఎప్పుడూ పోరేది, ” ఎప్పుడైనా అవసరం రావచ్చు, కాస్త అత్తెసరు పడేసి, పచ్చిపులుసు చేసు కోడమైనా నేర్చుకోరా నాయనా ” అని. కాని తాను ఆ మాటలు పెడచెవిని పెట్టాడు. ఏ రోజునా “రేపు”, ” రేపు” అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలం గడిపేశాడు కాని, ఆ పని కాస్తా నేర్చుకున్న పాపాన పోలేదు. దాని ఫలితమే ఈ వెట్టిచాకిరీ.

ఎలక్ట్రానిక్ బూమ్ వచ్చిన తొలి రోజుల్లో గాలిలో (విమానం ఎక్కి) ఎగిరి వచ్చిన వాళ్లలో మన ఆదిత్య కూడా ఒకడు. అమెరికా నైసర్గిక స్వరూపాన్ని మాప్‌లో చూశాడే తప్ప, దాని నిజ స్వరూపాన్ని ఏమీ ఎరిగున్న వాడు కాదు అతడు. రాగానే తిండికి గొప్ప ఇబ్బంది వచ్చి పడింది, పాపం! అతడు, పూర్తి శాకాహారి కావడమే కాదు, బొత్తిగా అమ్మచేతి వంటకి అలవాటు పడిన వాడు కూడా కావడంతో గొప్ప చిక్కే వచ్చింది. ఆవూరిలో అప్పటిలో ఉన్న ఒకే ఒక్క ఇండియన్ హోటల్ అతని ఆఫీసు ఉన్న చోటికి చాలా చాలా దూరం. ఆదిత్య డైలమాలో పడ్డాడు…. ఆఫీసుకి దగ్గరలో ఉంటే బాగుంటుంది గాని తిండికి ఇబ్బంది పడాలిసొస్తుంది. అలాగని హోటల్‌కి దగ్గరైతే వేళకి ఆఫీసు చేరుకోడం కష్టమౌతుంది……. ఏంచెయ్యాలి ?
హండ్రెడ్ డాలర్ల కొశ్చన్ అయ్యిందది! ప్రస్తుతం ఆఫీసుకి దగ్గరలో ఉంది తన తాత్కాలిక నివాసం. అందుకని తను చాలా వరకు బ్రెడ్డూ, జాంల మీద ఆధార పడవలసి వస్తోంది. త్వరలోనే ఇక్కడనుండి వెళ్లి పోవలసి ఉంది. తను ఏ దిక్కున చేరాలన్నది తోచక ఆదిత్య జుట్టు పీక్కుంటున్న సమయంలో, అదే ఆఫీసులో తనకంటే ముందుగానే వచ్చి చేరి, స్థిరపడిన క్లాస్‌మేట్ బాలాజీ కనిపించాడు. సాక్షాత్తు ఆ భగవంతుడే కనిపించినంత ఆనందం వచ్చింది ఆదిత్యకు. ఆప్యాయంగా పలకరించుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఇద్దరూ.

స్నేహితు లిద్దరూ పాతవీ కొత్తవీ ఎన్నోకబుర్లు చెప్పుకున్నారు. పనిలోపనిగా తన ఇబ్బందిని వెళ్లబోశాడు ఆదిత్య. వెంటనే స్పందించాడు బాలాజీ. తనుండే అపార్టుమెంటులోనే ఇద్దరూ కలిసి ఉండవచ్చునని చెప్పాడు.
“ఇంత వరకు ఒకతను ఉండేవాడు నాతో. ఇద్దరం కలిసి వండుకునే వాళ్లం. ఒక వారం అతను వండితే, నేను పైపని చేసేవాడిని. మరుసటి వారం నేను వండితే, అతడు పైపని చేసేవాడు. అన్ని ఖర్చులూ చెరిసగంగా పంచుకునే వాళ్లం. మనమూ అలాగే చేద్దాం” అన్నాడు బాలాజీ.

ఆదిత్య సిగ్గుపడ్డాడు. “నాకు వండడం రాదు. కనుక, పైపని నేను చేస్తా, వంట నువ్వు చెయ్యి” అన్నాడు, పైపని అంటే ఏమిటో అసలు తెలియని ఆదిత్య. బాలాజీ చాలా సంతోషించాడు. “సై” అంటే “సై” అనేసుకున్నారు ఇద్దరూ.

త్వరలోనే బాలాజీ ఉన్న అపార్టుమెంటుకి మారిపోయాడు ఆదిత్య, ఇకనుండీ షడ్రుచోపేతమైన ఆంధ్రా భోజనం దొరుకుతుందన్న ఆనందం తలమునకలౌతూండగా.

బాలాజీకి వంట ఒక హాబీ కావడంతో రకరకాల వంటలు చేసేవాడు, అది భోజన ప్రియుడైన ఆదిత్యకు బాగా నచ్చింది. అదిత్య లొసుగుల్ని కనిపెట్టిన బాలాజీ, కనికరమన్నది లేకుండా ఇంటిని శుభ్రం చెయ్యడం, బాత్రూమ్సు క్లీన్ చెయ్యడం, డిష్‌ వాషర్ లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ వగైరా పనులన్నీ ఆదిత్యకే వదిలెయ్యడం కాకుండా, వంటకు కూడా అన్నీ అమర్చి పెట్టాకే వచ్చి గరిట విలాసంగా అటూ ఇటూ తిప్పేసి, ఇట్టే వంటచేసి పడేసే వాడు. అమెరికా సాంప్రదాయం ప్రకారం వంట అన్నది రాత్రి ఒఖ్ఖ పూటే చేయాలి కనుక, ఆపైన అంతా తీరుబడే కావడంతో బాలాజీ సోఫాలో వయ్యారంగా పడుకుని ఏదో నవలను చదువుతూ కాలక్షేపం చేసేవాడు. బాలాజీ కున్న మరో దుర్గుణం అతి శుభ్రం. ఎంతో కష్టపడి ఆదిత్య పనంతా చేశాక, “ఇక్కడ పాల మరకంటింది,” “అక్కడ కూర మరక పడింది” అంటూ వంకలు పెట్టి అదేపనిని మళ్లీ చేయించేవాడు.

అది చూస్తే ఆదిత్యకి ఒళ్లు మండిపోయేది. ఆఫీసు వేళలు మినహాయించి తక్కిన రోజంతా చేసినా, అసలే పని చేతకాకపోడంతో, ఆదిత్యకు పని తెమిలేది కాదు. అప్పుడప్పుడు, ఆదిత్యకు బాలాజీని కూరకింద తరిగిపారెయ్యాలన్న ఆలోచన వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాని బాలాజీ వంట మొదలెట్టగానే ఆ మాట మరిచిపోయేవాడు. “హబ్బా! ఏమి ఘుమ ఘుమలు” అనుకునేవాడు, ఆవంట తిని “ఆహా!! ఏమి రుచి” అని లొట్టలు వేయడంతో ఆదిత్య బాధంతా ” జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం” ఐపోయి. అక్కడితో సమస్య సమసిపోయేది. మళ్లీ ఎప్పటి ఆటే మొదలయ్యేది.

* * * * *

ఛాప్టర్ అయ్యిపోడంతో పేజీ తిరగేస్తూ తలెత్తి చూసిన బాలాజీ, గడియారం ముల్లు బెదిరించడంతో “కెవ్వు” మన్నాడు. “ఒరేయ్, ఆదీ! ఏంచేస్తున్నావురా! టైం ఎంతో తెలుసా? ఎప్పుడు వండాలి, ఎప్పుడు తిని నిద్రపోవాలి? మళ్లీ పొద్దున్నే లేవొద్దా ?”

వంటింట్లోంచి జవాబేమీ రాలేదు… ఆదిత్య అక్కడే ఉన్న దానికి గుర్తుగా ఒక నిట్టూర్పు శబ్దం మాత్రం వినిపించింది. బాలాజీ పుస్తకం మూసి లేచి వంట గదిలోకి వెళ్లాడు. అతనికి అక్కడ టాప్ క్రింద చెయ్యి పెట్టి రక్తం కడుక్కుంటున్న ఆదిత్య కనిపించాడు.

“చెయ్యి తెగిందా? ఇవన్నీ కొత్తలో మామూలే లేరా. ‘సింపుల్ ఆక్యుపేషనల్ హెజార్డ్సు’, తప్పవు” అన్నాడు.
“సారీ” అన్న చిన్న మాటైనా లేకుండా బాలాజీ అలా తేలికచేసి మాట్లాడడం ఆదిత్యకు చాలా కోపం తెప్పించింది. ”నీకేమిరా బాలూ ! అనుభవిస్తున్నది నేనుగా, పొద్దున్న మొదలు రాత్రి దాకా చాకిరీ చేసి చస్తున్నది నేను కదా! నీకేం, మహరాజువి! నువ్వు ఎన్నైనా చెపుతావు. అసలు హాయిగా సోఫాలో పడుకుని చదువుకోక ఇలా వచ్చావెందుకు” అన్నాడు నిష్టూరంగా.

“ఇది నువ్వు పెట్టిన షరతేకదా! తీరుబడి ఉన్నప్పుడు ఏదైనా చదువుకోడం కూడా తప్పేనా ఏమిటి” అన్నాడు బాలాజీ.

“రేపటినుండి నేనూ వంట చేస్తా. వెనకటిలాగే ఒక రోజు నువ్వూ, ఒక రోజు నేనూ చేద్దాం” అన్నాడు ఆదిత్య..

బాలాజీ, మాంత్రికుడు మంత్ర దండాన్ని తిప్పినట్లుగా సునాయాసంగా గరిట తిప్పేసి, వంటలూ, పిండివంటలూ చేసెయ్యడం చూస్తున్న ఆదిత్యకు, అది మరీ అంత కష్టమైన పని కాదేమో ననిపించింది.
బలాజీ పక్కలదిరేలా పడీ పడీ నవ్వడం మొదలుపెట్టాడు. నవ్వి నవ్వి నవ్వాపుకుని, “బండపనే చేయ్యలేక ఛస్తున్నాననే నువ్వు ఇక వంటపనేం చెయ్యగలవురా. ఒక్క రోజున నువ్వు కాఫీ సరిగా కలిపిన పాపాన పోయావా, చెప్పు? రుచిగల చిక్కని కాఫీ చెయ్యాలంటే, ఫిల్టర్‌లో ఎంత కాఫీపొడి వెయ్యాలి, కప్పు కాఫీకి ఎంత చక్కెర వెయ్యాలి అన్నదైనా ఒంటపట్ట లేదు గాని… వంట జరిగేది పొయ్యిమీద కాదురా, తలలో! ఏ వంట రుచిగా రావాలన్నా పడవలసిన పదార్థాలన్నీ సరైన పాళ్లలో పడాలి తెలుసా! ఈ పద్ధతి నీకు నచ్చకపోతే, నువ్విక్కడనుండి ఎప్పుడైనా వెళ్లిపోవచ్చు. అది నీ ఇష్టం, గుర్తుపెట్టుకో” అన్నాడు బాలాజీ ఖరాఖండీగా.

ఆరాత్రి ఆదిత్యకు చాలా సేపటివరకు నిద్ర పట్టలేదు. తండ్రి, తల్లి, చెల్లి…. అంతా గుర్తువచ్చారు. తండ్రి తనను పైచదువులకు పంపుతూ చెప్పాడు, “బాబూ, ఆదిత్యా! చదువు బాగా వస్తోందని ఉన్నదంతా పెట్టి నీకు చదువు చెప్పిస్తున్నా. నీ చెల్లెలి పెళ్లి నీ బాధ్యత సుమీ, గుర్తుంచుకో. మనవి “చాపంత పెద్దవీ, చదరమంత చిన్నవీ” కాని మధ్యతరగతి జీవితాలు” అంటూ హెచ్చరించాడు.

చెల్లెలు చిత్ర తెలివైనది. అందంగా, ముద్దొస్తూ చలాకీగా ఉంటుంది. దానికి మంచి మొగుణ్ణి తెచ్చి పెళ్లి చెయ్యాలంటే తను డబ్బు కూడబెట్టాలి. ఈ వేళ బాలాజీ మీద కోపం తెచ్చుకుని తను ఇక్కడ నుండి వేరే ఇంటికి మారితే వచ్చే లాభం ఏమీ ఉండదు. అక్కడ వంటపనీ, పైపనీ… రెండూ తనే చచ్చినట్లు చేసుకోవలసిరావడమే కాకుండా, భాగస్వాము లెవరూ లేక ఖర్చు మొత్తం తనే భరించాల్సి వస్తుంది. ఇక్కడ తనకు వంట రాకపోయినా రుచైన భోజనం పెడుతున్నాడు బాలాజీ. ఏమాట కామాటే చెప్పుకోడం బాగుంటుంది. అనుకున్నాడు ఆదిత్య.

ఆదిత్య మనసులో వివేకం చోటుచేసుకుంది. తల్లిని తలుచుకున్నాడు, “అమ్మ చేసిన హెచ్చరికను పట్టించుకోనందుకు నాకీ శిక్ష తప్పదు” అనుకుని మనసు సరిపెట్టేసుకున్నాడు. మళ్లీ ఎప్పుడూ ఆ విషయం అతడు బాలాజీ దగ్గర ఎత్తకపోయినా మనసులో మాత్రం అనుకునేవాడు, ‘ఏదో ఒక రోజు చెల్లాయి పెళ్లి ఔతుందనీ, ఆ వెనువెంటనే తన పెళ్లీ జరిగిపోతుందనీ, అక్కడితో కష్టాలు గట్టెక్కిపోతాయనీ’ ఊహించుకుంటూ, ఆ రోజుకోసం ఎదురుచూస్తూ తలవంచుకుని తన వంతు పని చేసుకుపోతూ కాలం గడపడం సాగించాడు ఆదిత్య. అలా ఓ సంవత్సరం గడిచింది.

ఒక రోజు ఆదిత్యకి తండ్రి ఫోన్‌చేసి, చిత్రకి ఒక మంచి సంబంధం వచ్చిందనీ, అబ్బాయి చాలా మంచివాడనీ, వాళ్ల స్వంత బిజినెస్సునే తండ్రి తో పాటుగా మేనేజిమెంటు తనూ చూసుకుంటున్నాడనీ చెప్పి, ఒక చిన్న మెలిక ఉందనీ, వాళ్లు కుండ మార్పిడి అడుగుతున్నారనీ అన్నారు. “కుండ మార్పిడి” అంటే అదేదో పెళ్ళిలో అన్నం కుండల్లో వార్చి వడ్డించే షరతేమో అనుకున్న ఆదిత్యకు అవిరేణి కుండల గురించి, కుండ మార్పిడి గురించి ఓపిగ్గా వివరించారు ఆయన. “నీ చెల్లిని వాళ్ల అబ్బాయికిచ్చి పెళ్లి చేసి, అతడి చెల్లెల్ని నువ్వు పెళ్లిచేసుకోడం అన్నమాట. మనకు ఇంత చక్కని సంబంధం మళ్లీ దొరకదు. నువ్వు సెలవు పెట్టి రా. పిల్ల నీకు నచ్చితే వెంటనే పెళ్లి జరిపించెయ్యడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇది పెళ్లిళ్ల సీజనే కనుక దగ్గరలోనే ఏదో ఒక ముహూర్తం దొరక్కపోదు. నువ్వు రావడమే ఆలస్యం.”

వెంటనే ఆ విషయం బాలాజీకి చెప్పి, ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టేశాడు ఆదిత్య. బాలాజీ మీద సొడ్డేస్తున్నందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది. ఆ రాత్రి ఆదిత్యకు కల కూడా వచ్చింది…
సాయంకాలం తను ఆఫీసు నుండి వచ్చేసరికి, ఎంతో నీటుగా సర్దబడిన ఇంటిలో, పులు కడిగిన ముత్యంలా పరిశుభ్రంగా ముస్తాబై ఎదురొచ్చి తన భార్య ఘుమఘుమ లాడే ఫిల్టర్ కాఫీ ఉన్న కప్పు చేతికిచ్చి, తానది తాగుతూ సోఫాలో కూర్చుంటే, ఆమె వచ్చి తన కాలి బూట్లు విప్పుతూండగా, పలుకరించి పోదామని వచ్చిన బాలాజీకి, తన వైభోగం చూడగానే అసూయతో కళ్ల నీళ్లు దొడ దొడా కారిపోయినట్లుగా!
* * * * * *

ఆ పిల్ల, చిత్రంత అందగత్తె కాకపోయినా, ఫరవాలేదు బాగుంది అన్నారు అందరూ. సంసారపక్షంగా ఉంది, ముఖ్యంగా ఆదిత్యకు నచ్చింది. రెండు పెళ్లిళ్లకీ దగ్గరలోనే ముహూర్తాలు దొరికాయి కూడా. కుండమార్పిడి కావడంతో అలకలూ, ఆడంబరాలూ లాంటి గందరగోళాలేమీ లేకుండా పెళ్లిళ్లు సాఫీగా జరిగిపోయాయి. చిత్ర అటు, రవళి ఇటు గృహప్రవేశం చేసేశారు. గృహప్రవేశానికి, సత్యనారాయణ వ్రతానికీ ముహూర్తం పెట్టిన రోజునే నూతన వధూవరుల తొలి సమాగమానికి కూడా ముహూర్తం పెట్టేసారు.

ఆ రోజే తొలిసారిగా ఆదిత్య, రవళి ఏకాంతంలో కలుసుకున్నారు. ఆదిత్యకు ” తిష్ట కుదిరితేనేగాని నిష్ఠ కుదరదు” అన్న మాట గుర్తొచ్చింది. ముందుగా తన మనసులో ఉన్న సందేహం తీర్చేసుకుంటే మంచిది – అనుకున్నాడు. రవళిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, “డార్లింగ్ ! నీకు వంటపని, ఇంటిపని వచ్చుకదూ” అంటూ అడిగాడు.

రవళి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “పనా! పనంటే ఏమిటీ?” అని అడిగింది. మంచి అనుభవం ఉన్నవాడేమో.. ఆదిత్య అదేమిటో వివరించి చెప్పాడు ఆమెకు. రవళి కళ్లు రెప రెప లాడిస్తూ చెప్పింది. ”ఇలాంటివేం నేనే కాదు, మా అమ్మ కూడా చెయ్యదు. మా ఇంట్లో వంటపని సుబ్బమ్మ గారు చేస్తారు. అంట్ల గిన్నెలు నర్సమ్మ తోముతుంది. పైపని రత్తాలు చేస్తుంది. తోటపనికి రాములు ఉన్నాడు. కారు పని డ్రైవరు చూసుకుంటాడు. సరుకులు తేడానికి అబ్బులు వస్తాడు. అసలు ఇప్పుడు మీరు చెప్పేవరకూ వాటిని పనులంటారనిగానీ, ప్రతివాళ్ళూ చెయ్యాలిసొస్తుందని గానీ నాకు తెలియనే తెలియదు ! సారీ” అంది ఆమె.

తెల్లబోయాడు ఆదిత్య. కొంచెం కోపం కూడా వచ్చింది. “కోరుకున్నవన్నీ వచ్చి ఒళ్లో పడిపోతుంటే రోజు ఎలా గడుస్తోందో తెలియకుండానే గడిచిపోతుంది. ఏపనీ చేతకాని నువ్వు అమెరికాలో ఉండే వాడిని తప్ప పెళ్లాడనని పట్టు పట్టావుట, అక్కడకి వచ్చి ఏం చేద్దామని నీ ఉద్దేశం” అని అడిగాడు.

“ముగ్గురో, నలుగురో పనివాళ్లని పెట్టుకుందాం” అంది రవళి ముద్దు ముద్దుగా.

“అయితే నీకు అమెరికా గురించి ఏమీ తెలిసినట్లు లేదు” అన్నాడు ఆదిత్య.

“తెలుసు. నా ఫ్రెండ్ సంహిత అక్క అక్కడే ఉంటుంది. నా ఫ్రెండు నా కంతా చెప్పింది. అది చాలా గొప్ప దేశమనీ, గాలి చల్లగా హాయిగా ఉంటుందనీ, అందరికీ కార్లు ఉంటాయనీ, అక్కడి వాళ్లకు అన్నీ మిషన్లే అమర్చి పెడతాయనీ చెప్పింది. అక్కడ పసిపిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడుతారుట! … ఎన్నో చెప్పింది. ఇక్కడ మనం ఒక్క డాలరు మార్చితే దోసిలి నిండా రూపాయిలు వస్తాయి కదా! అంతేనా… అక్కడ నుండి వచ్చిన వాళ్లను ఇక్కడి వాళ్లు ఎంతో గౌరవంగా, ప్రత్యేకంగా చూస్తారు! నా కదంతా చాలా నచ్చింది. అవన్నీ తెలుసు కనుకే నేను ఆ దేశంలో బ్రతకాలని కోరుకున్నా, తప్పా?”

అమాయకంగా, చిన్న పిల్లలా మాట్లాడుతున్న రవళిని చూస్తూంటే చిరాకొచ్చింది ఆదిత్యకు. “నాణానికి ఒక పక్క మాత్రమే చూశావు. రెండో వైపున ఏముందో నీకు తెలియదన్నమాట! ఇక్కడలా అక్కడ ప్రతిదానికీ పనివాళ్లను పెట్టుకోలేము. చిన్న పనికి కూడా పెద్ద మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రోజుకి ఇంతని కాకుండా అక్కడ, గంటకు ఇంత అని ఇవ్వాలి. ఆ లెక్క కూడా చాలా ఎక్కువ. అందుకే, అక్కడ ఎవరి పనిని వాళ్లే చేసుకుంటారు. రిపేర్లూ చాలా వరకూ స్వంతంగానే చేసుకుంటారు, తెలుసా. డాలర్ని ఇక్కడకు తెస్తే దోసెడు రూపాయి లౌతుందేమోగాని, అక్కడ ఒక డాలరుకి ఏమీ రావు. ఎక్కడి డబ్బులు అక్కడి ఖర్చులకే సరి. దిగాక గానీ లోతు తెలియదు – అంటారు అందుకే.

అమెరికా రావాలనుకున్న వాళ్లు ముందుగా తమ పనులు తామే చేసుకోడం నేర్చుకోవాలి. అసలు ఈ పెద్దాళ్లని అనాలి…….. పిల్లనిచ్చే ముందు కులం – గోత్రం, డబ్బు – దస్కం చూస్తారే తప్ప, రేపు మన పిల్ల అక్కడ సద్దుబాటు చేసుకుని బ్రతకగలదా – లేక, ఇబ్బందులతో అల్లాడి పోతుందా – అన్నది మాత్రం ఆలోచించరు కదా ” అన్నాడు ఆదిత్య, ఆశాభంగంతో వచ్చిన చిరాకుతో.

రవళి అతని వైపు పులుకూ పులుకూ చూసింది. ”మా వాళ్లు తెలివి తక్కువవాళ్లేం కారు. అంత దూరం పిల్లని పంపించే టప్పుడు, అక్కడ, వాళ్లపిల్లకి ఎటువంటి తిప్పలూ ఉండ కూడదనే మీ చెల్లెల్ని మా ఇంటి కోడల్ని చేసుకున్నారు, తెలుసా?” అంది రవళి.

ఆదిత్య బుర్ర తిరిగిపోయింది. “అమ్మ దీనిల్లు బంగారం కానూ! “కుండ మార్పిడి” అంతరార్థం ఇదన్నమాట” – అనుకున్నాడు బాధగా. తన సత్ప్రవర్తనకు గ్యారంటీగా ఉందన్నమాట తన చెల్లెలి కాపురం! వెంటనే ఆదిత్య మనసు నీరు కారిపోయింది. నోరు సంబాళించుకుని, “రవళీ! నామాట సరిగా అర్థం చేసుకో. ఇది నీకే కాదు నాకూ వర్తిస్తుంది. ఈ ఏణ్ణర్థం నుండి నేను నానా తిప్పలూ పడ్డాకే వచ్చి నీకు చెపుతున్నా. అమెరికాలో “డిగ్నిటీ ఆఫ్ లేబర్” ఉంది. అక్కడ ఇక్కడిలా చవక పనీ, చవకబారు పనీ కూడా ఉండవు. అక్కడ బాగా బ్రతకాలంటే మన పనులు మనమే చేసుకో గలిగి ఉండాలి. “సెల్ఫు సఫిషియన్సీ” అన్నది అమెరికా వాళ్ల సుఖజీవనానికి మూల సూత్రం. “రోమ్ వెళితే, రోమన్లా ఉండాలి” అంటారు కదా, అలాగే అమెరికా వెళ్తే మనమూ అమెరికన్ పద్ధతిలోనే బ్రతకాల్సి వస్తుంది. మన కోసం అక్కడి చలిగానీ, అక్కడి పద్ధతులుగానీ మారవు. వాటితో సద్దుకుపోయి బ్రతుకుతూనే, అక్కడి మంచిని గ్రహిస్తూ, చెడుని విడిచిపెడుతూ, మన సంస్కృతిని చెడగొట్టుకోకుండా మనం మనంగా బ్రతకాలి ” అంటూ భార్యకు హితోపదేశం చేశాడు ఆదిత్య.

“మరైతే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి?” అంది రవళి అతనికి దగ్గరగా జరుగుతూ.

“ఏం చెయ్యాలో నేను చెపుతా. నువ్వు నా మాట ప్రకారం చేస్తే చాలు, మనకు మంచి జరుగుతుంది” అన్నాడు ఆదిత్య ఆమెను దగ్గరకు తీసుకుంటూ.

* * * * * *

ఆదిత్య తల్లి అన్నపూర్ణ, కొడుక్కి ఇష్టమని ఆరోజున, “బ్రేక్‌ఫాస్టు”గా, ఆంధ్రా స్పెషల్ ”పెసరట్టు – ఉప్మా” చేస్తూ వంటగదిలో ఉంది. చిత్ర అత్తవారింటికి వెళ్లిపోడంతో, మొత్తం పనంతా ఆమే చేసుకుంటోంది. పని హడావిడిలో ఉండడంతో, హఠాత్తుగా కొడుకూ కోడలూ వచ్చి కాళ్ల మీద పడేసరికి కంగారు పడుతూ, వాళ్లని తడి చేతులతోనే లేవదీసింది. ఇద్దరూ వినయంగా చేతులు జోడించి ఆమెకు ఎదురుగా నిలబడ్డారు.

ఆదిత్య ”భోజనం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ! నువ్వు కనీసం అత్తెసరూ, పచ్చిపులుసూ చెయ్యడమైనా మాకు నేర్పితేగాని, అమెరికాలో మా బ్రతుకు బాగుండదు. అమ్మా ! కరుణించు” అన్నాడు దీనమైన కంఠస్వరంతో.

అన్నపూర్ణకి నవ్వొచ్చింది, “ఒక్క అత్తెసరూ, పచ్చిపులుసూ మాత్రమేనా, మీరు కావాలంటే బొబ్బట్లూ, పులిహోరా, ఇంకా ఇంకా ఎన్నెన్నో వంటలూ, పనులూ కూడా చిటికలో నేర్పించనూ” అంది ఆమె ఆనందంగా.

—————-

వెంపటి హేమ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నారు. కలికి అన్న కలం పేరుతో ఆమె రాసిన కథలు ఆంద్రప్రభ, యువ వంటి పత్రికలలో 1970 వ దశకంలో ప్రచురించబడ్డాయి. కారణాంతరాలవల్ల రాయడం మానేసినా, మళ్ళీ 2006 నుండి రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

Posted in కథ | Tagged | 10 Comments

నేనెఱిగిన విశ్వనాథ

– భైరవభట్ల కామేశ్వర రావు

“చిరుత తొలకరివానగా… చిన్ని సొనగ…పొంగి పొరలెడు కాల్వగా… నింగి కెగయు
కడలిగా… పిల్లగ్రోవిని వెడలు వింత తీయదనముల లీనమై పోయె నెడద”

విశ్వనాథ సత్యనారాయణ

ఇది కృష్ణశాస్త్రి పద్యం. కృష్ణుని మురళీగానం చిన్న తొలకరివానగా మొదలై, క్రమక్రమంగా పెరుగుతూ పోయి, నింగి కెగసే కడలిలాగ ఎలా ముంచెత్తిందో వర్ణించే పద్యం.

విశ్వనాథ కవిత్వం నన్ను ముంచెత్తింది కూడా సరిగ్గా ఇలాగే! ఎప్పుడో మొదటిసారి, ఎవరి గొంతులోనో, కొండవీటి పొగమబ్బుల పద్యాన్ని విన్నప్పుడు నా మనసు కూడా ఒక పొగమబ్బై కొండవీటి బురుజులపైన తేలిపోయిన అనుభూతి. విశ్వనాథతో అదే నా తొలిపరిచయం. అలా మొదలైన ఆ పరిచయం ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి, తెలుగు ఋతువులు, ఇలా ఇలా పెరిగి పెరిగి రామాయణ కల్పవృక్ష పరిచయంతో ఒక గాఢమైన అనుబంధంగా మారింది. తీరా చూస్తే విశ్వనాథ సాహిత్యంలో నేను చదివినది మొత్తం కలిపి ఒక పావువంతు కూడా ఉండదు! మరి ఇంతటి అభిమానానికి కారణమేమిటి?

నాకు తెలుగు పద్యమంటే, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తెలుగు పద్య కవిత్వమంటే చాలా ప్రీతి. నన్ను విశ్వనాథకి దగ్గర చేసినవి ముమ్మాటికీ ఈ మూడు మాటలే! “తెలుగు”, “పద్యం”, “కవిత్వం”. తెలుగుదనం, పద్య రచనా వైదుష్యం, గాఢమైన కవిత్వం. విశ్వనాథ సాహిత్యానికున్న వేయిపడగలలో తక్కిన పడగల మాట నేను చెప్పలేను కాని, ఈ మూడు పడగలూ మాత్రం అచ్చమైన అమృతాన్నే చిందిస్తాయి. ఆ అమృత సాగరంలోనే నా మనసు లీనమైపోయింది.

దాన్ని ఒక చిన్న చెంచాలో మీకందించే ప్రయత్నమే యీ వ్యాసం.

తెలుగుదనం

ఇమ్ముగ కాకుళమ్ము మొదలీ వఱకుంగల యాంధ్ర పూర్వ రా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతర మేలొ చలించిపోవు నా
ర్ద్రమ్ముగ చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేని నెన్ని జ
న్మమ్ములుగాగ నీ తనువునన్ బ్రవహించునొ యాంధ్ర రక్తముల్

“పూర్వాంధ్ర రాజ్యవైభవం గురించి విన్నప్పుడల్లా ఎందుకో మనసంతా ఆర్ద్రమైన భావాతిరేకంతో సంచలించిపోతుంది. బహుశా ఎన్నో జన్మలుగా నా యీ శరీరంలో ఆంధ్ర రక్తాలు ప్రవహిస్తూ ఉన్నాయి కాబోలు!”

కనులెత్తి చూడాలనే ఆకాంక్ష. కాని దాన్ని అడ్డుతున్న సిగ్గు బరువుతో ఱెప్పలని ఎత్తలేక పోతున్నారు. కనులెత్తకుండానే, కంటి చివళ్ళ సందుల్లోంచి పక్కచూపులు చూస్తున్నారు. ఒక్కసారి ఆ అందమైన దృశ్యాన్ని ఊహించుకోండి (లేదా గుర్తు తెచ్చుకోండి!).

ఒంట్లో తెలుగు రక్తం ప్రవహించే ఎవ్వరికైనా ఇలాటి పద్యాలు చదినప్పుడు అది ఉరకలెత్తక మానుతుందా చెప్పండి!

ఆంధ్రప్రశస్తి కావ్యం నిండా ఇలాటి తెలుగుదనమే. గుండెలని పొంగించే తెలుగుదనం. “ఇంతకు ముందెప్పుడో – ఇక్కడ, యీ ఆంధ్రదేశంలో, గడ్డిపోచలు కూడా వాడి కత్తులై శత్రువుల కుత్తుకలను ఉత్తరించిన కాలంలో, నువ్వూ నేనూ తోడి సైనికులమై చేసిన స్నేహం కాబోలు మన ఈ అనుబంధం” అని ఆంధ్రప్రశస్తిని అంకితం చేస్తూ మల్లంపల్లి సోమశేఖరశర్మగారితో అన్న విశ్వనాథలో అణువణువూ ఆంధ్ర పౌరుషం ఉరకలు వేసి, మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటి చాలామందికి తెలియని ఆంధ్రుల పూర్వ ప్రశస్తిని పద్యాలలో మధురంగా గానం చేసారు విశ్వనాథ. ఆంధ్ర మహావిష్ణువుతో మొదలుపెట్టి, శాతవాహనుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, మాధవవర్మ, వేంగీ క్షేత్రము, ముఖలింగము, నన్నయ భట్టు, ప్రోలరాజు, కొండవీటి పొగమబ్బులు, చంద్రవంక యుద్ధము, అళియరామరాయల వరకూ తెలుగు చరిత్రలోని ముఖ్య సన్నివేశాలని, ముఖ్య ప్రదేశాలని, వ్యక్తులని కథలు కథలుగా కవితాత్మకంగా మనకి పరిచయం చేసే కావ్య మాల ఆంధ్ర ప్రశస్తి.

కల్పవృక్షం

కొందరికిది “మా తాతలు నేతులు తాగారు, మా మూతులు నాకండి” అన్నట్టుగా అనిపించవచ్చు. కాని “మన” అనే భావనలోంచి అసంకల్పితంగా పొంగుకొచ్చే ఆనందాతిశయం యిది. ఈ మధ్యనే మన రహమాన్ ఆస్కారు అవార్డులు గెలిస్తే భారతదేశమంతా “జై హో” అన్నది ఎందుకు? ఈ “మన” అనే భావం వల్లనే కదా. అలాగే మన పూర్వ చరిత్రను, దాని వైభవాన్నీ కీర్తించి “జయహో” అన్నారు విశ్వనాథ. “ఆంధ్రప్రశస్తి”లో చారిత్రక దృష్టి కనిపిస్తే, “ఆంధ్రపౌరుషము” కావ్యంలో తెలుగువాళ్ళ పౌరుషం ఉరకలు వేస్తుంది. ఆ పౌరుషమంతా యిప్పుడేమైపోయిందీ అన్న ఆర్తి ప్రతి అక్షరంలోనూ ధ్వనిస్తుంది.

నేటి ఆంధ్రులు గుడ్డకు గూటి కున్న
చాలు ననువారలైనారు, చచ్చిపోయె
నేమొ జాతీయ సత్వంబు, కోమలంబు
మల్లికకు నీరులేకున్న మాడిపోదె!

జాతీయ భావన అనే శక్తి లేకపోతే నీరులేని మల్లికలాగా జాతి మాడిపోదా అని ఆక్రోశించారు విశ్వనాథ. అయినా అతనికి ఆంధ్ర పౌరుషం మీద, ఆంధ్ర జాతి మీద ఉన్న నమ్మకం అపారం. ఎదో పొరపాటున ఇలా ఉంది కాని, నిజానికి “తెనుగు చురకత్తి పదునుకు తిరుగులేదు” అంటారు.

విశ్వనాథలోని తెలుగుదనం “ఆంధ్రపౌరుషం”, “ఆంధ్రపశస్తి” కావ్యాలలో మాత్రమే కాదు, అతని ప్రతి రచనలోనూ ఉట్టిపడుతుంది. ఆరు ఋతువులని వర్ణించినప్పుడు కూడా, ఆయా ఋతువుల్లో తెలుగుదేశంలోని వాతావరణం మన కళ్ళకి కట్టిస్తారు. అందుకే అవి “తెలుగు ఋతువులు” అయ్యాయి.

“పేరంటమున కేగు పిన్న బాలిక వాలు
జడ మల్లెమొగ్గ కన్పడినయంత” వసంతం వచ్చిందని తెలుస్తుందిట! ఎంత చక్కని ఊహ!

తెలుగుదనంలో మునకలేసిన విశ్వనాథ, తన రామాయణ కల్పవృక్షంలో, మరీ ముఖ్యంగా బాలకాండ అంతటా కూడా తెలుగుదనం రాశులు పోసారు. తెలుగువారి ఇళ్ళల్లో ఉండే మమకారాలు, తల్లిదండ్రులకి పిల్లలకీ మధ్యనుండే వాత్సల్యాలు, తెలుగు పండుగలు, తెలుగువారి ఆచారాలు ఇవన్నీ మనకి బాలకాండలో కనిపిస్తాయి.

రాముడు పుట్టినప్పుడు, పుట్టిన శిశువుపై మంత్రసాని కలినీళ్ళు చల్లి కుదిలించడం, బొడ్డు కోయడం, గోధుమలు పోసి దానిపై చీర పఱచి శిశువుని పడుకోబెట్టడం ఇలా తెలుగిళ్ళల్లో తన కాలంలో జరిగే ఆచారాలన్నిటినీ వర్ణించారు.

బాల రాముణ్ణి ఉయ్యాలలో వేసే సన్నివేశం అది. పేరంటానికి చాలామంది ఆడవాళ్ళు వచ్చారు. రాముణ్ణి ఉయ్యాలలో పెట్టి ఊపుతున్నారు. ఉయ్యాల ఊపేటప్పుడు మరి పాటలు పాడొద్దూ. దానికెవరూ ముందుకు రావడం లేదు. ఆ సందర్భంలో ఒకరినొకరు పాడమంటూ ఎలా మాట్లాడుకుంటున్నారో వినండి:

నోరు పెగలదటే నీకు? నూరక తెగ
రాలిపోవుదు కూనిరాగాలతోడ!

బిఱ్ఱబిగిసెదు తొట్టెను బెట్టు స్వామి
నేలగా పాడగా నొక్క జోలపాట

అనరమ్మ యొక్కపాటను,
వనితామణులెల్ల నిటకు వాయనములకై

చనుదెంచిరొ? యెల్లరకును
నినుమడి దాళాలు పడెనటే నోళులకున్!

“ఏవిటీ ఒక్కళ్ళకీ నోరు పెగలదు? ఉట్టినే ఓ తెగ కూనిరాగలు తీస్తారే! తొట్టెలో పెట్టిన స్వామిని లాలిస్తూ ఇప్పుడొక్క జోలపాటకూడా పాడరేం? ఒక్క పాటైనా పాడండర్రా! ఇక్కడికందరూ వాయనాలు పుచ్చుకోడానికే వచ్చారా ఏమిటి? అందరికీ నోటికి పెద్ద పెద్ద ఇనప తాళాలు పడ్డట్టున్నాయే!” – ఇదీ వరస. తెలుగుదనం యింకా కాస్తైనా మిగిలున్న ఇళ్ళల్లో ఇప్పటికీ ఇలాటివప్పుడప్పుడూ కనిపిస్తాయి.

ఇలా ఒకటేమిటి, రాముడు పుట్టినదాదిగా సీతా కల్యాణం వరకూ జరిగిన వేడుకలన్నిటిలోనూ మన తెలుగువారి ఆచార వ్యవహారాలే కనిపిస్తాయి. దశరథ పుత్రులు నలుగురినీ పెళ్ళి కొడుకులని చెయ్యడం, కల్యాణ మండపం తీర్చిదిద్దడం, సీతనీ ఆమె ముగ్గురు చెల్లెళ్ళనీ బుట్టల్లో తీసుకురావడం, జీలకఱ్ఱ బెల్లం, తాళి కట్టడం, తలంబ్రాలు, మంగళహారతులు, స్థాలీపాకం, అరుంధతి దర్శనం, అప్పగింతలు ఇలా తెలుగువాళ్ళ పెళ్ళివేడుకలు సమస్తమూ దర్శనమిస్తాయి! వధూవరులు పక్క పక్కన కూర్చుని ఉన్నప్పుడు, ఒకరి వంక ఒకరు చూసుకోవాలన్న ఆకాంక్ష, నేరుగా చూసుకోవడానికి సిగ్గు – ఇలాటి అవస్థ చాలామంది కొత్త దంపతులకి ఉండేదే కదా! దాన్ని ఎంత అందంగా కవిత్వీకరించారో విశ్వనాథ, చూడండి:

ఎదురుబళ్ళైన లజ్జచే నెత్తరాని
ఱెప్పలవి యెత్తబడకుండ గ్రేవలందు
బ్రక్క గూర్చున్న యప్పటి ప్రసరణంబు
ప్రసవబాణుండు నేర్పిన ప్రథమ విద్య

“ఎదురు బళ్ళు” కావడం తెలుగు నుడికారం. కనులెత్తి చూడాలనే ఆకాంక్ష. కాని దాన్ని అడ్డుతున్న సిగ్గు బరువుతో ఱెప్పలని ఎత్తలేక పోతున్నారు. కనులెత్తకుండానే, కంటి చివళ్ళ సందుల్లోంచి పక్కచూపులు చూస్తున్నారు. ఒక్కసారి ఆ అందమైన దృశ్యాన్ని ఊహించుకోండి (లేదా గుర్తు తెచ్చుకోండి!). అలా చూడడం మన్మథుడు ఆ వధూవరులకి నేర్పే మొదటి విద్యట!

విశ్వనాథ కన్నా అందంగా పద్యాన్ని రాయగల కవులున్నారు. అతనికన్నా మధురంగా రాయగలవారున్నారు. అతనికన్నా ప్రౌఢంగా రాయగల కవులూ ఉన్నారు. అతనికన్నా వాడిగా పద్యాన్ని నడిపించగలవారు కూడా ఉన్నారు. కాని యిన్ని రకాలుగానూ పద్యాన్ని నడిపించగల సమర్థులు మరొక్కరెవ్వరూ లేరు!

ఈ వాతావరణం, యీ ఆచారాలు, యీ సంస్కృతీ వీటన్నిటినీ యిలా కావ్యంలో సంతరించడం వల్ల ఏమిటి ప్రయోజనం? అంటే, ఒకటి మనం మరిచిపోతున్న మనదైన సంస్కృతిని మనకి గుర్తు చెయ్యడం. అంత కన్నా ముఖ్యంగా గత కాలపు సంస్కృతిని ముందు తరాలకి తెలియజెయ్యడం. ఒక రకంగా యిది సాంస్కృతిక చరిత్ర.

ఇంక భాష విషయానికి వస్తే, విశ్వనాథ సంస్కృత భూయిష్టమైన కవిత్వాన్ని రాస్తాడనీ, అది ఎవరికీ అర్థం కాదనీ ఒక ప్రచారం ఉంది. ఇందులో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. విశ్వనాథ కవిత్వంలో ప్రౌఢ సంస్కృత భాషా ప్రయోగం ఎంతగా కనిపిస్తుందో, అచ్చమైన తెలుగు నుడికారం, పలుకుబడి అంతగానే కనిపిస్తాయి, చూసే కళ్ళుండాలే గాని.

తొలినాళ్ళలో రాసిన కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు లాంటి కావ్యాల్లో జాను తెలుగు సౌందర్యం చాలామందికి తెలిసినదే. అయితే తర్వాత రాసిన చాలా కావ్యాలలో కూడా వాడుక తెలుగు వయ్యారాలు మనసులని ఉయ్యాలలూగిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రశస్తి కావ్యాన్ని మల్లంపల్లివారికి అంకితం చేస్తూ,

“నీవనుకోను లేదు మరి నేనది చెప్పను లేదు కాని, అ
న్నా! వినవయ్య నేటికిది నా చిఱుపొత్తము నీకు నంకితం
బై వెలయింపజేతు”

అన్నప్పుడు ఆ తెలుగు పలుకుబడిలో ఎంతటి ఆత్మీయత నిండి ఉన్నదో గమనించండి!

శృంగారవీథిలో, మేలుకొలుపు అనే ఖండిక ఒకటుంది. చిన్ని కృష్ణుని నిద్రలేపే సన్నివేశం. ఆ సందర్భంలో యశోద పలుకులివి:

పక్క అంతయు జిమ్మితి పద్మనాభ!
అన్న చూడుము, పుస్తకమ్మట్లు పండు
కొనును, నీవేమొ పక్కంత కుమ్మి కుమ్మి
పక్క యటులుండ నీవిట్లు పండుకొందు

ఆ పలుకుబడి, ఆ వాక్యవిన్యాసం అచ్చమైన తెలుగు వాడుక భాష కాదూ!

ఇలా విశ్వనాథ కావ్యాలన్నిటా తెలుగు పలుకుబడి, వ్యవహార భాష మనకి దర్శనమిస్తుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ సంగీతము, విశ్వనాథ మధ్యాక్కరలలో ఉన్న తెలుగు వ్యావహారిక భాషా సౌందర్యం అనన్యం! వాటిని ఇక్కడ ఉదహరించడం కన్నా ఎవరికివారు స్వయంగా చదువుకొని, అనుభవించడమే ఉత్తమం.

విశ్వనాథ కవితా వైదుష్యమంతా రాశీభూతమైన రామాయణ కల్పవృక్షంలో కూడా, తెలుగు పద సంపద, నుడికారం అడుగడుగునా కనిపిస్తాయి.

అగస్త్యుని గురించి అతని అన్నదమ్ముడు (పేరులేని అగస్త్యభ్రాత) చెప్పే కథలో ఈ పద్యాన్ని చూడండి:

అబ్బో అగస్త్యుడాతడు
సెబ్బర మానిసి! ధరిత్రి శిరసాన్చిన ఆ
గబ్బిరి గిరి తోడ నిట్లనె
అబ్బీ! మునిలోక భక్తుడై వర్ధిలుమీ!

“అబ్బో ఆ అగస్త్యుడున్నాడే, అతను మా చెడ్డ మనిషయ్యోవ్! భూమ్మీద తల ఆన్చిన గర్వాత్ముడైన ఆ పర్వతంతో అన్నాడూ, అబ్బీ! నువ్వు మునిలోక భక్తుడై వర్ధిల్లుదువుగాక”

ఇది తెలుగు పలుకుబడి పుణికిపుచ్చుకున్న సంభాషణా శైలి. సెబ్బర, గబ్బిరి మొదలైనవి తెలుగువాళ్ళు మరిచిపోయిన అచ్చ తెలుగు పదాలు.

విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకి కథ చెప్పే యీ సన్నివేశం చూడండి. గంగావతరణ కథ చెప్పమని రామలక్ష్మణులు అడుగుతారు. చెప్పడం మొదలుపెడతాడు విశ్వామిత్రుడు.

అసలు కథ జెప్పెదను వినుడంచు మౌని
“పుడమి పడతికి బెట్టిన పునుగుబొట్టు

కల దయోధ్య యటన్న చక్కని పురంబు
మీరెఱుంగుదురే” యన వారు నగుచు

“మే మెఱుంగుదు” మన మౌని “మేలు మేలు
మీ రెరింగిన గథలోని మేలి సగము

నెఱుగుదురె యంట! అప్పుర మేలు దొల్లి
యనగ ననగను సగరు డన్నట్టి రాజు”

సగరుడు రాముని వంశంలోని రాజే! అతను రాజ్యం చేసినదీ అయోధ్యే. అందుకే కథ మొదలుపెడుతూనే, “భూమి అనే స్త్రీకి పెట్టిన పునుగు బొట్టు లాంటిది, అయోధ్య అని, ఒక చక్కని నగరం ఉంది. మీకు తెలుసా?” అని విశ్వామిత్రుడు అడుగుతాడు. “ఓ మాకు తెలుసు!” అని నవ్వుతూ జవాబిస్తారు రామలక్ష్మణులు. “ఓహో మంచిది, మంచిది! అయితే కథలోని మేలు సగం మీకు తెలిసిపోయినట్టే! అనగ అనగ సగరుడనే రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు.” ఇలా మొదలవుతుంది. తెలుగువాళ్ళు కథ చెప్పడంలోని ఒడుపంతా ఇందులో ఒడిసిపట్టారు విశ్వనాథ. ఈ కాలంలో ఎంతమంది పెద్దవాళ్ళు పిల్లలకి యిలా కథలు చెప్తున్నారు?

ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో ఉద్గ్రంథమే అవుతుంది!

పద్యరచనా వైదుష్యం

తన గొంతులో ఊగిసలాడుతున్న నాదాలు అపూర్వమైన గానంగా బయటకి వచ్చి నిలిచినట్టుగా, తన గుండెలో దాగున్న మృదువైన స్థానాలు భావాల రూపాలు దాల్చి పైకి వచ్చినట్టుగా, తన సృష్టిలో నిండిన తీయని ప్రదేశాలన్నీ గంతులు వేస్తూ వచ్చి ఎదురుగా కనిపించినట్టుగా, ముందెప్పుడూ తెలియని పరమానందపు హద్దులని ఆత్మ తనకి తాను స్వయంగా తెలుసుకొన్నట్టుగా – ఇలాంటి అపూర్వమైన జలదరింపుతో, పులకరింపుతో కనుల చివరలనుండి కన్నీరు కారి, శరీరమంతా గొగుర్పొడిచింది.

విశ్వనాథ కన్నా అందంగా పద్యాన్ని రాయగల కవులున్నారు. అతనికన్నా మధురంగా రాయగలవారున్నారు. అతనికన్నా ప్రౌఢంగా రాయగల కవులూ ఉన్నారు. అతనికన్నా వాడిగా పద్యాన్ని నడిపించగలవారు కూడా ఉన్నారు. కాని యిన్ని రకాలుగానూ పద్యాన్ని నడిపించగల సమర్థులు మరొక్కరెవ్వరూ లేరు!

ఛందస్సు వేదపురుషుడి పాదాలంటారు. అంటే ఛందస్సు నడకనిస్తుందన్నమాట. వేదాలూ చాలావరకూ పూర్వ సంస్కృత కావ్యాలూ కూడా ఛందస్సుని నడకకి మాత్రమే ఉపయోగించుకున్నాయి. కావ్య కళ వృద్ధి చెందిన కొద్దీ, చెప్పే విషయానికి అనుగుణంగా ఛందస్సుని ఎన్నుకోవడం మొదలయ్యింది. దీనినే క్షేమేంద్రుడు వృత్తౌచిత్యం అన్నాడు. ఇక మన తెలుగు కవులు ఏంచేసేరయ్యా అంటే, యీ ఛందస్సుని కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేక అంశాలని ధ్వనించడానికి ఉపయోగించుకున్నారు. అంటే ఛందస్సుకి నడకతో పాటు గొంతు కూడా ఇచ్చారన్నమాట! పద్యపు టెత్తుగడ, పద్య నడకలో వివిధ గతులు, యతి ప్రాసలని అతకడంలో ప్రత్యేకత – వీటన్నిటి ద్వారా చెప్పే విషయాన్ని ధ్వనింప చెయ్యడం పద్య శిల్పం. ఇలాటి పద్య శిల్ప నైపుణ్యంలో విశ్వనాథ అసామాన్యుడు. ఉదాహరణకి యీ పద్యం చూడండి. ఇందులో రావణుడు సీత దగ్గర తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు:

ఓహో! మూడవవాని జూపుము సమస్తోర్వీభరంబున్ ఫణా
వ్యూహంబందు నటో యిటో యొరుగగా నూనంగ నైనట్టి శే
షాహిం దక్కగ వింశతి ప్రభుభుజాహంకార సంభార రే
ఖా హేలాధృత శైవ పర్వత భుజాస్కందున్ ననున్ దక్కగన్

“సమర్థమైన నా ఇరవై భుజాల శక్తీ ద్యోతకమయ్యేట్లుగా వట్టి ఆటగా కైలాసాన్నే ఎత్తిన వాడిని నేను. ఇంతటి కార్యాన్ని చేసినవాడు మరెవడున్నాడు? మహా చెప్పుకోవాలంటే ఆదిశేషుడున్నాడు. మొత్తం తన పడగలన్నిటితో అటో, ఇటో ఒరిగిపోయినట్టుగా భూమిని మోస్తున్నాడు. అతన్ని తప్ప, మరో మూడో వాడసలెవడినైనా ఉన్నాడేమో చూపించు!” ఇదీ రావణుడి అహంకారం. ఇందులో శేషుడు చేస్తున్న పనిని వర్ణించే రెండవపాదాన్ని, రావణుని ఔద్ధత్యాన్ని వర్ణించే చివరి రెండు పాదాలతో పోల్చి చూడండి. “అటో యిటో యొరుగగా నూనంగ నైనట్టి” ఇది ఆగి ఆగి వెళుతున్న నడక. అది ఒక పక్క శేషువు పడుతున్న శ్రమని, మరో వంక రావణుడికి అతని మీదున్న తిరస్కార భావాన్ని ధ్వనిస్తోంది. అదే రావణుడి విషయంలో, పద్యం ఏక సమాసంలో ధారగా సాగి, ఒకవైపు కైలాసాన్ని ఎత్తడంలోని సునాయాసాన్ని, మరో పక్క రావుణుడి అహంకారాన్ని ధ్వనిస్తోంది. పద్యం ఎత్తుకోవడంతోనే, “ఓహో మూడవ వాని జూపుము” అనడం రావణుని సంభాషణా పటిమని పట్టిస్తోంది. ఇదీ పద్య శిల్పం.

వేయిపడగలు

విశ్వనాథ ఒక్కొక్క కావ్యంలోనూ ఒక్కొక్క రకమైన పద్య శైలి కనిపిస్తుంది. కిన్నెరసాని పాటల్లో కిన్నెర నడకలలో ఉన్న వైవిధ్యాన్ని గతిభేదంతో ఎంత సుందరంగా ఆవిష్కరించారో చదివిన వాళ్ళకి తెలిసిన విషయమే. కిన్నెరసాని పరుగులు పెడితే, పాటల గతి కూడా పరుగులు పెడుతుంది. కిన్నెర నింపాదిగా, వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళేటప్పుడు, పాట కూడా కదలలేక కదలలేక కదులుతుంది. ఇవన్నీ విశ్వనాథ సొంత గొంతులో వింటే మరింత అద్భుతంగా అనిపిస్తాయి!

పూర్వ కవులెవ్వరూ పెద్దగా పట్టించుకోని మధ్యాక్కర ఛందస్సుని తీసుకొని ఏకంగా పది శతకాలు (అంటే వెయ్యి పద్యాలకి పైగా!) రాయడమన్నది విశ్వనాథకి ఛందస్సు మీదున్న పట్టుని నిరూపిస్తుంది. అతి సామాన్యమైన తెలుగు సంభాషణలకి మధ్యాక్కర ఛందస్సు చాలా అనువైనదని అతను గుర్తించారు. దానికి తగ్గట్టు పద్యరచన చేసారు.

“కోరి కబేలాకు మందగా దోలికొనిపోవుచుండ,
దారి ప్రక్కనయున్న పచ్చిగడ్డిపై దారాడు పసుల
తీరుగానున్నది, జనుల భోగాశ! తెలివి సర్వమ్ము
చూఱ పుచ్చెదవు శ్రీశైల మల్లికార్జున! మహాలింగ!”

ఇలా సాగుతుంది మధ్యాక్కర నడక!

విశ్వనాథ కల్పవృక్షంలో వాడినన్ని ఛందస్సులు మరెవ్వరూ ఎక్కడా నాకు తెలిసి వాడలేదు. ఛందస్సు పేరుకీ అందులో చెప్పే విషయానికీ సంబంధం ఉంటే, ఒక చమత్కారం కలుగుతుంది. ఉదాహరణకి మేఘాన్ని వర్ణించడానికి “జలదము” అనే వృత్తం, లేడిని వర్ణించడానికి “హరిణి” అనే వృత్తం వాడడం. ఇలాటివి కల్పవృక్షంలో చాలా కనిపిస్తాయి. అయితే ఇలాంటి రచన ఒక చమత్కారాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప, మరేమీ ధ్వనించదు. ఒకానొక విషయాన్ని ధ్వనించడానికి ఛందస్సుని వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ముక్కూచెవులు కోసేసినప్పుడు శూర్పణఖ కోపంతో బొబ్బలు పెడుతూ ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అలా అలా ఎగిరిపోతున్న శూర్పణఖ మాటలు ఒక నాలుగు పద్యాలలో రచించారు. అందులో మొదటి పద్యం లాటీవిటమనే ఛందస్సు, రెండవది అసంబాధము, మూడవది హలముఖి, నాలుగవది వ్రీడ. మొదటి పద్యంలో పాదానికి యిరవయ్యొక్క అక్షరాలు. రెండవ దానిలో పధ్నాలుగు, మూడవ దానిలో తొమ్మిది, చివరి దానిలో నాలుగు అక్షరాలు. ఇలా పద్య పరిమాణం క్రమేపీ తగ్గుతూ పోతుంది.

ఇదొక విచిత్రమైన పద్యశిల్పం. ఇలాంటిది తెలుగు సాహిత్యంలో మరెక్కడా నాకు కనిపించలేదు! ఇది రెండు విషయాలని ధ్వనిస్తోంది. ఒకటి, శూర్పణఖ పెద్దగా అరవడం మొదలుపెట్టి, క్రమంగా అలిసిపోయి, చివరకి మెల్లిగా అరిచింది అని అనుకోవచ్చు. లేదూ దూరంగా వెళిపోతున్న ఆమె గొంతు కిందనున్న రామలక్షణులకి, సీతకి క్రమేపి తగ్గుతూ వినిపించిందనీ అనుకోవచ్చు. ఇలా ఛందస్సులో గొంతుని వినిపించడం ఇక్కడ విశేషం.

ఆసక్తి ఉన్నవాళ్ళు విశ్వనాథ పద్య రచనలో చూపించిన వైవిధ్యాన్ని, వైదుష్యాన్ని మరింత లోతుగా పరిశీలించవచ్చు.

చెళ్ళపిళ్ళ వారు చెప్పిన, “నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్, నా తాత ముత్తాతలం దేమార్గమ్మును కాదు, వీని దెదియో ఈ మార్గ మట్లౌటచే సామాన్యుండనరాదు!” అన్న మాటలు విశ్వనాథ పద్య రచనా శైలి విషయంలో అక్షరాలా నిజమనిపిస్తుంది.

కవిత్వం

తన గొంతులోన నూగు నినాదము లపూర్వ

నినదితంబులు వచ్చి నిట్టవొడిచి

తన గుండెలోన డాగిన మెత్తనగు చోట్లు

భావరూపములంది పైకివచ్చి

తన సృష్టిలోన నుండిన క్రొత్త మాధుర్య

సీమలు క్రేళ్ళుగా జెంగలించి

తన ఆత్మ దా నెఱుంగని ఒక్క ఆనంద

పరిథి రేఖా స్వయంవ్యక్తి కలిగి

కను గొలుకులందు కన్నీళ్ళు గార్చి, మై గ

గుర్పొడవ…

తన గొంతులో ఊగిసలాడుతున్న నాదాలు అపూర్వమైన గానంగా బయటకి వచ్చి నిలిచినట్టుగా, తన గుండెలో దాగున్న మృదువైన స్థానాలు భావాల రూపాలు దాల్చి పైకి వచ్చినట్టుగా, తన సృష్టిలో నిండిన తీయని ప్రదేశాలన్నీ గంతులు వేస్తూ వచ్చి ఎదురుగా కనిపించినట్టుగా, ముందెప్పుడూ తెలియని పరమానందపు హద్దులని ఆత్మ తనకి తాను స్వయంగా తెలుసుకొన్నట్టుగా – ఇలాంటి అపూర్వమైన జలదరింపుతో, పులకరింపుతో కనుల చివరలనుండి కన్నీరు కారి, శరీరమంతా గొగుర్పొడిచింది.

గొప్ప కవులు, కవిత్వాన్ని గురించి కూడా కవిత్వం చెప్పడం పరిపాటి. విశ్వనాథ కూడా తన కావ్యాలలో చాలాచోట్ల ఆ పని చేసారు. ఆ చెప్పడం అన్యాపదేశంగా చెప్పారు, అంటే కవితాత్మకంగా చెప్పారన్న మాట. పైనున్న పద్యం అలాటి సందర్భాలలో ఒకటి.

ఋశ్యశృంగుడు లోకం తెలియకుండా పెరిగిన ముని కుమారుడు. అతను మొట్టమొదటిసారి మధుర గానాన్ని విన్నప్పుడు అతనిలో కలిగిన సంచలనాన్ని, స్పందననీ వర్ణించే పద్యమిది. కాని యిది కవిత్వానికి, ఆ మాటకొస్తే ఏ కళకైనా వర్తిస్తుంది. సహృదయుడైన ఒక రసజ్ఞునికి కళ ద్వారా కలిగే రస స్థితి యిలాగే ఉంటుందని విశ్వనాథ తీర్పు. అతను అలాంటి కవిత్వమే రాసారు.

తరువాతి పేజీ

Posted in వ్యాసం | Tagged | 14 Comments

కథా మాలతీయం – 5

అమెరికా వచ్చినతరవాత తాను గ్రహించిన విశేషాలూ, తన వెబ్‌సైటు, బ్లాగుల ద్వారా పొందిన అనుభవాలూ, పెంపొందిన ఆత్మీయతలూ.. ఈ విషయాలమీద పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతికుమారి అడిగిన ప్రశ్నలకు ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతి అంతరంగ కథనం చదవండి.

*పాఠకులతో ఏర్పడిన సాన్నిహిత్యం -బ్లాగు మొదలు పెట్టకముందూ, తరవాతా, తూలిక.నెట్ ద్వారా, రచయిత్రిగా..

ఇంగ్లీషు తూలిక.నెట్ ద్వారా పరిచయాలు: తెలుగుతూలికకి ముందే, పరిచయమయినవాళ్లు తూలిక.నెట్ ద్వారా సుజాత (మనసులోమాట), కల్పన రెంటాల. అంతేకాక తెలుగు చదవడం రాని తెలుగు అమ్మాయి రాధిక యేల్కూర్ (బెంగుళూరు), తూలిక మూలంగా తనకి తెలుగుకథలగురించి చాలా విషయాలు తెలుస్తున్నాయని సంతోషం వెలిబుచ్చుతూ ఈమెయిలిచ్చింది. మేం కొంతకాలం ఈమెయిళ్ళలో చర్చించుకుంటూ వుండేవాళ్లం కూడా. నేను 2003లో ఇండియా వచ్చినప్పుడు బెంగుళూరునించి నన్ను కలుసుకోడానికి హైదరాబాదు వచ్చింది ఆ అమ్మాయి.

అలాగే ప్రొఫెసర్ రాధిక గజ్జెల (అయొవా) కూడా ప్రోత్సాహకరంగా రాస్తూ వుండేవారు. అలాటి స్పందనలమూలంగా తూలిక.నెట్ సఫలం అని నాకు అర్థమయింది. అయితే అలాటి పరిచయాలు అట్టే కాలం నిలవలేదు. విజయనగరంలో వున్న సాయిపద్మ కూడా తూలికమూలంగానే పరిచయం. పూనుకుని నా తెలుగుకథలు సంకలనంగా ప్రచురించింది, వాళ్ల నాన్నగారి ఫౌండేషన్‌‌ద్వారా. ఉషారాణి (మరువం) – తూలిక.నెట్‌ద్వారానే పరిచయం. ఇంకా హైదరాబాదులో, మంచి స్నేహితులయిన వారిలో వాసా ప్రభావతిగారూ, నాయని కృష్ణకుమారిగారు, పోరంకి దక్షిణామూర్తిగారూ .. ఇలా చాలామంది వున్నారు.

అయితే తూలిక.నెట్ అమెరికాలో తెలుగు సంఘాలు గుర్తించకపోవడం మాత్రం నాకు అర్థం కాదు. ఒక్క వంగూరి పౌండేషన్ వారు తప్పిస్తే, మిగతా సంఘాలలో హేమాహేమీలు రాసే వ్యాసాల్లో ఎక్కడా తూలిక ప్రసక్తి వుండకపోవడానికి కారణాలు వారే చెప్పాలి.

నేను తూలిక మొదలుపెట్టేక. అలాటి వ్యాఖ్య నాకు రావడం అదే తొలిసారి. నిజానికి అదే ఆఖరు కూడాను. నా అనువాదాలు నచ్చనివారు చదవరు. అంతేకానీ పని కట్టుకుని నాకు రాయరు.

తూలికతో సంబంధం లేకుండా, నా రచనల మూలంగా పరిచయాలు: బ్లాగుమూలంగా కాక, నా రచనలమూలంగా పరిచయమయి, ఆప్తులు అయినవారు కల్పన రెంటాల, వైదేహీ శశిధర్. కల్పన మాడిసన్లో వున్నంతకాలం తరుచూ మాటాడుకుంటుండేవాళ్లం. తెలుగు రచయిత్రులమీద నేను రాసిన పుస్తకానికి మంచి ముందుమాట కూడా రాసింది తను. ఇప్పుడు టెక్సస్‌లో వుంది. అప్పుడప్పుడు మాటాడుకుంటుంటాం. వైదేహి ఈమాట.కాం లో నాకథ, “రంగుతోలు” చూసి, నచ్చడంచేత వాళ్ల తెలుగుజ్యోతికి కథ రాయమని అడగడంతో మొదలయింది మా పరిచయం. మావూళ్లో లేకపోయినా, దాదాపు ఒకేవూళ్లో వున్నంత స్నేహం. ఈనాడు వస్తున్న కథలూ, కవితలగురించి తరుచూ చర్చించుకుంటుంటాం.

అనువాదాలమూలంగా పరిచయమయినవాళ్లలో సౌమ్యతో నాస్నేహం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కథ. తన పరిచయం కూడా బ్లాగుకంటే ముందే సూచనప్రాయంగా జరిగింది. అంతకుముందు ప్రశాంతి నా కవిత ఒకటి చూసి, తెలుగపీపుల్.కాంకి రాయమని కోరడంతో ప్రారంభమయింది ప్రశాంతితో పరిచయం. తరవాత, 2006 ఏప్రిల్లో నేను హైదరాబాదు వచ్చినప్పుడు ఇద్దరూ – ప్రశాంతీ, సౌమ్యా – కలిసి వచ్చారు మాఇంటికి. కానీ ఆరోజు సౌమ్య ఏమంత మాటాడలేదు. ఆ తరవాత, నేను అమెరికా వచ్చేక, నా తూలిక.నెట్‌లో “మీ అనువాదాలు ఏం బాగులేవు” అంటూ ఈమెయిల్ ఇచ్చింది నాకు. అప్పటికి అయిదేళ్లయింది నేను తూలిక మొదలుపెట్టేక. అలాటి వ్యాఖ్య నాకు రావడం అదే తొలిసారి. నిజానికి అదే ఆఖరు కూడాను. నా అనువాదాలు నచ్చనివారు చదవరు. అంతేకానీ పని కట్టుకుని నాకు రాయరు. సరే, నేను నా అనువాదాలలో భాషకి కారణాలు వివరించడానికి ప్రయత్నించేను కొంతవరకూ. కానీ తను ఒప్పుకోలేదు. “ఏమో, నాకు మాత్రం బాగులేవు” అంటూ మెయిలిచ్చింది. సరే ఏంచేస్తాను. 🙂 నీఇష్టం, అలాగే కానీ అని జవాబిచ్చి వూరుకున్నాను :). ఆతరవాత మరో రెండు నెలలకి కాబోలు మళ్లీ తనే మరో ఈమెయిలిచ్చింది అనువాదాల గురించి వేరేవారి అభిప్రాయాలతో. కొంతకాలం అనువాదాలమీద చర్చించుకుంటూ వచ్చేం. క్రమంగా ఆత్మీయులం అయిపోయేం. ఎప్పుడు ఎలా జరిగిందో నేను చెప్పలేను. మరి తను చెప్పగలదేమో నాకు తెలీదు.

బ్లాగు మొదలుపెట్టేక నాయందు అభిమానం చూపినవారు చాలామందే వున్నారు. అందరిపేర్లూ రాయాలంటే అదే రెండు పేజీలవుతుంది. నాబ్లాగులో వ్యాఖ్యలు తరుచూ రాసేవారు రాజేంద్రకుమార్, రాధిక, సిరిసిరిమువ్వ, మధుర వాణి, కొత్తపాళీ, నిషిగంధ, మహేష్‌కుమార్, చదువరి, దీప్తిధార సిబిరావు – ఇలా కొందరయితే, “నేను మీ వీరాభిమానిని” అంటూ ఒక్క మెయిలుతో సరిపుచ్చినవారు మరి కొందరు. వీరందరి అభిమానమూ నాకు గణనీయమే. ఈవిషయాన్నే ఒకావిడ ఎంతో ఆర్ద్రంగా వాచ్యం చేసేరు, “ఎంతకని చెప్పను ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుందని. మీకథలన్నీ నాకు ఇష్టం” అన్నారు. మీరు కూడా అంతే కదా. నాతో తరుచూ ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినా జరపకపోయినా, రచయిత్రిగా నాకు ఒక ప్రత్యేకస్థానం ఇచ్చి గౌరవిస్తున్నవారు బ్లాగరుల్లో లెక్కకు మిక్కిలిగా వున్నారు అనుకుంటాను. తలుచుకుంటే నాకు కనులు చెమరుస్తాయి. నామటుకు నాకు ఈ ఆదరాభిమానాలే సత్యమయినవి అనిపిస్తుంది. ఎంచేతంటే ఇందులో “ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయినం” టైపు లేదు. నెట్వర్కింగు లేదు. వుంటే నాదాకా రాలేదు అంటే నాకు అలాటి అభిప్రాయాన్ని కలిగించలేదు ఎవరూ కూడా. ఏరచయితకి కానీ అంతకంటే ఏంకావాలి?

ఇక్కడే మరోమాట కూడా చెప్తాను. నేను అంతర్ముఖిని. త్వరగా ఎవరితోనూ స్నేహాలు చెయ్యను. అంచేత బ్లాగు మొదలుపెట్టకముందు ఎవరైనా నేను ఇంతటి అభిమానాలకి పాత్రురాలిని కాగలను అంటే నమ్మివుండేదాన్ని కాదు. ఇది నాకు ఒకవిధంగా కనువిప్పు అనే చెప్పాలి. ఈవిషయంలో సూక్ష్మదృష్టికి మరి కొన్ని తేడాలు కూడా కనిపిస్తాయి. రచయితలు అప్పడప్పుడు కలుసుకుని స్నేహాలు పెంచుకోడం వేరు, కేవలం రచనల ఆధారంగా ఒక రచయితని అభిమానించడం వేరు. కానీ ఇలా దేశ, కాలాలనీ (తరాలలో అంతరాలూ), అధిగమించిన స్నేహాలు ఏర్పడడమే నాకు విభ్రాంతి కలిగిస్తోంది.

శైలిలో పరిణతిలో మార్పు వచ్చిందని ఎందుకు అన్నానంటే.., ముందు శైలిమాట చెప్తాను. నేను కథలు రాయడం మొదలు పెట్టిన రోజుల్లో శైలి గురించిన ఆలోచన లేదు. నాకథలు పత్రికలలో ప్రచురణ మొదలయేవేళకి నాకు పదిహేనో పదహారో.. నేను చెప్పాలనుకున్నది నాకు వచ్చినభాషలో రాయడమే చేసాను అప్పట్లో. పత్రికలు, నేను పంపినవి పంపినట్టు వేసుకున్నాయి. ఈవిషయంలో మీరు చారిత్రిక నేపథ్యం కూడా గమనించాలి. ఆరోజుల్లో స్త్రీలని చదవమనీ, రాయమనీ ప్రోత్సహించడం పత్రికలు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాయి. శిల్పం, పాత్రచిత్రణ, శైలి వంటి విషయాలు నేను – నిజానికి ఆనాటి రచయిత్రులెవరూ – అంతగా పట్టించుకోలేదు. అంటే సంపాదకుల జోక్యం అస్సలు లేదని అనను. నేను నా “చిరుచక్రం” కథకి నేను పెట్టినపేరు “లోచక్రం” inner wheel అన్న అర్థంలో. సుబ్రహ్మణ్యశర్మగారే కావచ్చు దాన్ని చిరుచక్రంగా మార్చింది. సంపాదకులు ఇలాటి చిన్న మార్పులు చేసేరేమో కానీ, ఈనాడు కొందరు చెప్తున్నట్టు మొత్తం తిరగరాయండి అని ఎవరూ ఎప్పుడూ అనలేదు. వారికి నచ్చకపోతే ప్రచురించరు, అంతే. ఈవిషయంమీద వేరే మళ్లీ రాస్తాను.

బ్లాగు మొదలు పెట్టేక పాఠకులు స్పందించడమే కాక, ఏమాటకి, ఏవాక్యానికి స్పందిస్తున్నారో కూడా సత్వరమే తెలియడం మూలాన, ఈనాటి పాఠకుల ఆలోచనాధోరణి తెలుస్తోంది. అంచేత నేను ఎప్పటికప్పుడు నారచనలు తిరిగి చూసుకోడానికీ, కొత్తగా రాస్తున్నవి తదనుగుణంగా తీరిచి దిద్దుకోడానికీ పనికొస్తున్నాయి.

నేను 1972లో కథలసంకలనం ఒకటి వెయ్యాలనుకున్నప్పుడు, పురాణం సుబ్రహ్మణ్యశర్మగారిని ముందుమాట రాయమని అడిగాను. అందులో ఆయన “మాలతికి ఇంకా సొంతగొంతు ఏర్పడలేదు” అని రాసారు. అదే అనుకుంటాను మొదటిసారిగా ‘సొంతగొంతు’ అన్నమాట వినడం నేను. కానీ ఆనాటి నాకథలు చూసుకుంటే అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనిపించదు. మరొక మాట- అంతకుముందు, 1970, 71లలో వరసగా రెండుకథలకి బహుమతులు ఇచ్చింది కూడా ఆ ఆంధ్రజ్యోతివారే! మరి అప్పటికి ఆయన ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్.

పాఠకులస్పందన: నారచనల్లో పరిణతి పాఠకుల స్పందన విషయానికి వస్తే. ఆరోజుల్లో పత్రికల్లో పాఠకుల అభిప్రాయాలు పత్రికలో కనిపించడానికి మూడు నాలుగు వారాలు పట్టేది. అప్పుడయినా స్థలాభావం అనో, తమ పాలసీలకి అనుగుణం గాదనో రెండో మూడో అభిప్రాయాలు మాత్రమే ప్రచురించేవారు. ఇలా సంపాదకులు ఒకవంక ప్రోత్సాహం చూపుతూ, మరొకవంక తమకి అవి నప్పుతాయో లేదో కూడా చూసుకుంటూ వచ్చారు. వ్యక్తిగతంగా నాకు పాఠకులస్పందన గురించిన స్పృహ లేదు అప్పట్లో -అని మాత్రం చెప్పగలను. బ్లాగు మొదలు పెట్టేక పాఠకులు స్పందించడమే కాక, ఏమాటకి, ఏవాక్యానికి స్పందిస్తున్నారో కూడా సత్వరమే తెలియడం మూలాన, ఈనాటి పాఠకుల ఆలోచనాధోరణి తెలుస్తోంది. అంచేత నేను ఎప్పటికప్పుడు నారచనలు తిరిగి చూసుకోడానికీ, కొత్తగా రాస్తున్నవి తదనుగుణంగా తీరిచి దిద్దుకోడానికీ పనికొస్తున్నాయి. ఊసుపోక మొదలు పెట్టినప్పుడు ఇంతకాలం ఆ శీర్షికను పొడిగిస్తానని నేను అనుకోలేదు.

పరిణతి మాట.. తూలిక మొదలు పెట్టకముందే, 1980లో పి.హెచ్..డీ చెయ్యడానికి కొంత ప్రయత్నం చేసాను. అరవయ్యవ దశకంలో తెలుగురచయిత్రులకీ, 20వ శతాబ్దం పూర్వార్థంలో అమెరికన్ రచయిత్రులకీ మధ్యగల సామ్యాన్ని సామాజిక నేపథ్యంలో పరిశీలించాలనుకున్నాను. అది సాగలేదు. కానీ, అందుకోసం చదివిన పుస్తకాలు ఒకరకమయిన సాధారణ అవగాహనకి తోడ్పడ్డాయి. ఈమధ్య నేను తెలుగురచయిత్రులమీద ఇంగ్లీషులో ప్రచురించిన పుస్తకం ఆనాటి విఫలప్రయత్నమే! తూలిక.నెట్‌లో అనువాదాలవిషయంలో అమెరికనులతో పరిచయాలమూలంగా కూడా నాదృక్పథంలో కొంత స్పష్టత ఏర్పడింది.

రెండోది, నేను అమెరికా మెయిన్‌ స్ట్రీమ్‌లో కలవలేదు కానీ, టీవీలో న్యూస్ మేగజైనులు నిశితంగా పరిశీలించడంవల్ల నా ఆలోచనాధోరణి మెరుగు పడిందని అనుకుంటున్నాను. ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా రాబట్టాలీ అన్నది, ఏప్రశ్నకి సమాధానం ఎలా వుంటుంది లాటివి meet the press, 60-minutes లాటి న్యూస్ మేగజీన్స్‌‌ వల్ల తెలిశాయి నాకు. నన్ను అలరించిన మరొక విషయం – నేను పూర్వం, అంటే 1950, 60 దశకాల్లో, ప్రచురించిన కథలు మళ్లీ ఇప్పుడు తెలుగుతూలికలో పాఠకులని ఆకర్షించడం. అంటే ఆకథలు పాతబడిపోలేదు. వస్తువో, శైలో – ఏకారణంగానో నాకు తెలీదు కానీ ఆకథలు ఈనాటి పాఠకులదృష్టిని కూడా ఆకట్టుకున్నాయి. అది నేను చాలా గొప్పపడిపోయే విషయం. పాఠకులతో ప్రత్యక్షంగానూ (అంటే ఆన్లైనూ, ఫోనూ మాత్రమే) పరోక్షంగానూ కలిగిన సంబంధాలమూలంగా నాకు సాధకాలే కానీ బాధలేమీ కనిపించడంలేదు. బాగా ఆలోచిస్తే నాకు కలిగిన ఒక సందేహం – ఈ బ్లాగుల్లో ప్రచురణలు కాలానికి నిలుస్తాయా అన్నది. నేను నిజంగా తెలుగుతూలిక మొదలు పెట్టడానికి కారణం నారచనలు అన్నీ ఒకచోట వుంచుకుందాం అని మాత్రమే. పాఠకులస్పందన ఇలా వుంటుందని నాకు అప్పుడు తెలీదు. అయితే, ఒక రెండేళ్లు నాబ్లాగు అలా వదిలేస్తే ఏం అవుతుంది అన్నది నాకు తెలీడంలేదు.

Posted in వ్యాసం | Tagged | 12 Comments