కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం!

– రంగనాయకమ్మ

‘పొద్దు.నెట్’ పత్రికలో వచ్చిన నిడదవోలు మాలతి గారితో ఇంటర్వ్యూ చూశాను. దానిలో, “రంగనాయకమ్మ రాసిన పుస్తకంలో నా కధని వాడుకున్న తీరుకి నా అభ్యంతరాలు” అన్న ఉపశీర్షిక కింద మాలతి గారు నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. వాటికి నా సమాధానం ఇదీ:
—————————-
మాలతి గారు తన ఇంటర్వ్యూలో, తను రాసిన కధ పేరు ప్రస్తావించారు (“నిజానికీ ఫెమినిజానికీ మధ్య”). కానీ ఆమె కధని ఏ పుస్తకంలో నేను వాడుకున్నానని ఆమె అన్నారో, ఆ పుస్తకం పేరు చెప్పలేదు. ఆ పుస్తకం పేరు: “అసమానత్వంలోనించి, అసమానత్వంలోకే! [స్త్రీ-పురుష సంబంధాల గురించి బూర్జువా ఫెమినిస్టులు చేసే వాదనలను మోర్గాన్, ఏంగెల్స్, లెనిన్‌ల సూత్రీకరణల ఆధారంగా విమర్శించిన వ్యాసాలు!]” 1989 సెప్టెంబర్‌లో మొదటిసారి వచ్చిన ఈ పుస్తకం, ఇప్పటికి 4 ముద్రణలు పడింది.

ఇప్పుడు వరసగా ఆమె ఆరోపణలూ, నా జవాబులూ!

మాలతి గారి మొదటి ఆరోపణ: “అసలు ఆ పుస్తకం మంచి రచయితకి వుండ వలసిన సంయమనంతో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేదిగా కాక, తనకి మరెవరి మీదో వున్న కక్ష తీర్చుకోడానికి రాసింది. నా కధని ఒక ఆయుధంగా వాడుకున్నట్టు కనిపిస్తుంది.”

ఆ పుస్తకాన్ని ఎందుకు, ఏ సందర్భంలో రాశానో మొదటి ముద్రణకు రాసిన ముందు మాటలోనే చాలా వివరంగా చెప్పాను. మాలతి గారి మొదటి ఆరోపణకు, ఆ ముందు మాటే జవాబు చెబుతుంది. దాన్ని ‘పొద్దు’ పాఠకుల కోసం ఇక్కడ తిరిగి ఇస్తున్నాను.

ముందు మాట
(మొదటి ముద్రణకు రాసినది)

” ‘మూడు తరాలు’ అని ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, మీరు చూశారా? దాని మీద మీరు తప్పకుండా ఏదన్నా రాయాలి” అనీ, “ఏమన్నా రాస్తున్నారా?” అనీ, ఆ పుస్తకం వచ్చిన కొత్తలో నాకు కొన్ని ఉత్తరాలు వచ్చాయి.
ఆ ఉత్తరాలన్నిటికీ నేను ఒకటే సమాధానం రాశాను – “ఆ పుస్తకం బాగోలేదని మీరంటున్నారు కదా? ఆ మాటే ఏదన్నా పత్రిక్కి మీరే ఎందుకు రాయరూ? ఏం బాగో లేదో మీకెలా అనిపిస్తే అలా మీరే రాయండి. కావాలంటే, మీరు రాసింది ఒకసారి నాకు పంపించండి. నా అభిప్రాయం చెపుతాను” అని.
ఆ తర్వాత కొన్నాళ్ళకి హైదరాబాదులోనే కొందరు కాలేజీ అమ్మాయిలు ఏడెనిమిది పేజీల వ్యాసం ఒకటి రాసి పట్టుకొచ్చారు. కొన్ని పాయింట్లు రాశారు గానీ, అది చాలా తక్కువ. కనీసంగా చెప్పవలసిన దాంట్లో పదోవంతు కూడా రాలేదు అందులో. పైగా, చెప్పిన విషయాలు ఒక వరసలో లేవు.
“సరే, నేను ఇంకా కొన్ని పాయింట్లు చేర్చి అన్నీ ఒక వరసలో పెట్టి ఇస్తాను. తర్వాత మీరు మళ్ళీ రాయండి” అన్నాను.
ఆ రోజే నేను, అదే విషయం మీద, ఇంకొకరికి కూడా టైము ఇచ్చి ఉండడం వల్ల, ఇద్దరు ‘లా’ కాలేజీ అబ్బాయిలు కూడా ఒక వ్యాసం తీసుకొచ్చారు. కొంతమంది స్టూడెంట్సు కలిసి డిస్కస్ చేసుకుని అది రాశామని చెప్పారు. అందరం కలిసి ఆ వ్యాసం కూడా చదివాము. దాన్ని ఇంకా సరిచేసి మళ్ళీ రాసి ఏదన్నా పత్రిక్కి పంపిస్తామని ఆ స్టూడెంట్సు అన్నారు.

అమ్మాయిల వ్యాసం గురించి, ‘రెండు రోజుల్లో కొంచెం మార్చి, కొన్ని పాయింట్లు చేర్చి ఇస్తాన’ని అమ్మాయిలతో చెప్పాను. ఆ వ్యాసానికి ఇంకో 50 పాయింట్ల దాకా చేర్చాను. ప్రారంభం మార్చి, అన్నీ ఒక వరసలో పెట్టి, దాన్ని తర్వాత ఆ అమ్మాయిలకు చూపించాను. వాళ్ళు దాన్ని చూసి, “ఇదంతా మేము రాయడం కష్టం, మీరే రాయండి” అని దాన్ని వదిలేసి వెళ్ళారు. తర్వాత నేనే దాని పని చేశాను.

‘మూడు తరాలు’ కధ చాలా చిన్న కధే. లెనిన్ కాలం నాటి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, ‘స్త్రీ పురుష సంబంధాల’ గురించి మార్క్సిస్టు దృష్టితో చెపుతున్నానంటూ రాసిన కధ కావడమే ఈ కధ ప్రత్యేకత. ‘ఈ కధ, స్త్రీలకు గొప్పగా ఉపకరిస్తుందని ఇప్పుడు ఒక ‘స్త్రీల సంఘం’ ఈ కధని పూర్తిగా సమర్థించడం ఇంకో ప్రత్యేకత. (ఈ వివరాలన్నీ వ్యాసంలో ఉన్నాయి.)

‘స్త్రీ పురుష సంబంధాల’ గురించి అనేక హేతు విరుద్ధ మార్గాలు గతంలో కన్నా విజృంభించి, మారిన రూపాలతో ప్రచారమవుతోన్న ఈనాడు ఇది తేలిగ్గా వదిలి వెయ్య వలసిన విషయం కాదు.

వ్యాపార పత్రికల్లో లక్ష రకాల తప్పుడు సాహిత్యం వస్తూ ఉంటుంది. కానీ, అది “అభ్యుదయం”గానో, “విప్లవం”గానో పోజు పెట్టదు. అది ‘వ్యాపార’ సాహిత్యం’ అని రాసే వాళ్ళకీ, వేసే వాళ్ళకీ, చదివే వాళ్ళకీ, తెలుస్తూనే ఉంటుంది. దాని ప్రభావంలో పడే పాఠకులు కూడా ‘అభ్యుదయ మార్గం’లో సాగిపోతున్నామని తాము భావించడం గానీ, ఇతరులకు బోధించడం గానీ, చెయ్యరు. తాగుళ్ళూ, మత్తు మందులూ అలవాటైపోతూ ఉన్నట్టే, వ్యాపార సాహిత్యం కూడా ఒక వ్యసనంలా అలవాటైపోతూ ఉంటుంది. అది తెలిసిపోతూనే ఉంటుంది.
కానీ, ఈ ‘నూతన ఉద్యమాల’ పోజుతో వచ్చే సాహిత్యంతోనే పాఠకులు గందరగోళ పడతారు. ఆ ఉద్యమంలోకి ‘మార్క్సిజం’ అనే మాట కలిస్తే ఆ గందరగోళం వెయ్యి రెట్లవుతుంది.

‘మార్క్సిజం’ అనే సిద్ధాంతానికి, సహజంగానే బలం ఉంది. సత్యానికీ, న్యాయానికీ ఉండే బలం అది! అయితే, దాన్ని గ్రహించడంలో ఉండే అనేక అస్పష్టతల వల్లా, దాన్ని ఆచరించవలసిన నాయకులే దానికి విరుద్ధమైన బూర్జువా భావజాలంలో పడి కొట్టు కుంటూ ఉండడం వల్లా, మార్క్సిజం ఇంకా ఇంకా పెద్ద పెద్ద అపజయాల మీదుగా సాగుతోంది. అది ఎన్ని అపజయాలు పొందినా, ఆ సిద్ధాంతంలో అంతర్గతంగా ఉన్న శక్తి వల్ల, ఒక బూర్జువా సిద్ధాంతం కూడా ‘మార్క్సిజం’ ముసుగు వేసుకోగానే, ఆ మాటతోనే, అది అనేక భ్రమలు కల్పిస్తుంది.
‘మూడు తరాలు’ కధ రాసింది ఒకప్పటి రష్యన్ కమ్యూనిస్టు నాయకురాలు కాబట్టి, ఆ కధలో ఏదో ‘నూతన మార్గం’ ఉన్నట్టుగా కొందరు పాఠకులైనా భావిస్తారు. అయితే, ఆ రకం భావాల్ని లెనిన్ లాంటి మార్క్సిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారనే విషయం మాత్రం ఆ పుస్తకం ద్వారా తెలీదు.

అలాగే, ఒక “స్త్రీల సంఘం” అనేది, స్త్రీల గురించి ఏమైనా చెప్పగానే, “స్త్రీల గురించి స్త్రీలే చెపుతున్నారు కాబట్టి ఇది కరక్టే అయివుంటుంది” అనిపిస్తుంది. కానీ, ఒక ‘స్త్రీల సంఘం’ చెప్పేదే స్త్రీలందరి అభిప్రాయం కాదనీ; స్త్రీలలో కూడా బూర్జువా వర్గ స్త్రీలూ, శ్రామిక వర్గ స్త్రీలూ ఉన్నారనీ; శ్రామిక వర్గ స్త్రీలలో కూడా బూర్జువా వర్గ భావాలతో కొట్టుకుపోయే వాళ్ళు ఉన్నారనీ – చాలామంది పాఠకులకు తెలీదు.
పాఠకుల్లోనే రెండు వర్గాలూ ఉన్నారు!

‘వర్గ సమాజం’లో సంఘాలూ, ఉద్యమాలూ వర్గాతీతమైనవి కావు. ‘స్త్రీల సంఘాలు’ అనగానే అవి తప్పని సరిగా స్త్రీలకు మేలు చేస్తాయనీ, ‘కార్మిక సంఘాలు’ అనగానే అవి తప్పని సరిగా కార్మికులకు మేలు చేస్తాయనీ, ‘జాతీయ పార్టీలు’ అనగానే అవి తప్పని సరిగా ‘జాతి’కి మేలు చేస్తాయనీ – ఇలా, భావిస్తూ పోతే, అంతకన్నా పెద్ద భ్రమ ఏదీ ఉండదు.

కాబట్టి, సంఘాలకీ, ఉద్యమాలకీ ఉండే ‘పేర్లు’ ముఖ్యం కాదు. వాటి ‘సారాంశం’ ముఖ్యం! ఒక వ్యక్తి గానీ, ఒక సంఘం గానీ, ఒక ఉద్యమం గానీ, ఏం చెప్పినా, దాన్ని “హేతుబద్ధతగల తర్కం”తో విమర్శించి చూడాలి. ఆ పరీక్షలో నిలబడినదాన్నే సరైనదాన్నిగా గ్రహించి తీసుకోవాలి.
‘మూడు తరాలు’ కధ మీద నేను రాసిన వ్యాసం ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో 10-2-89 సంచిక నించీ, 14-4-89 సంచిక వరకూ 10 వారాల పాటు వచ్చింది.

ఆ తర్వాత 8 వారాల పాటు దాని మీద అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కొన్ని ఉత్తరాలు కూడా వచ్చాయి. ఆ ఉత్తరాల్లో అనుకూలమైన వాటి గురించి చెప్పవలసిందేమీ లేదు కాబట్టి, వ్యతిరేకమైన 5 ఉత్తరాల్నీ, ఉత్తరం కాని ఇంకో విమర్శనీ ఎంచుకుని, వాటికి జవాబులు రాశాను. ఆ జవాబులన్నీ ఈ పుస్తకంలోనే “వ్యాసం తర్వాత …” అనే చాప్టరులో ఉన్నాయి.
ఆ రకం ధోరణుల్లో మరింత ప్రత్యేకత గల ధోరణి “అతడి బిడ్డ సిద్ధాంతం!” ఇదేమిటో అక్కడే చూడండి.
తర్వాత, ముగింపు సూచనలు!

– రంగనాయకమ్మ
4-9-1989

ఆ వ్యాసం రాసిన సందర్భాన్ని ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా, “మరెవరి మీదో కక్ష తీర్చుకోడానికి” రాసినట్టూ, తన కధని నేను “ఒక ఆయుధంగా వాడుకున్న”ట్టూ మాలతి గారు అంటే, ఇక దానికి మళ్ళీ చెప్పవలసిందేమీ లేదు.

మాలతి గారిని నేను అడగగలిగేది ఒకటే. “మరెవరి మీదో కక్ష తీర్చుకోడానికి” మీ కధని “ఒక ఆయుధంగా వాడుకున్న” నన్ను, నేను రాసిన “ఆర్తనాదం” కధని ఇంగ్లీషులోకి అనువదించుకోడానికి అనుమతి ఎందుకు అడిగారు? ఎందుకు అనువదించారు? అనువదించాక, మరి కొన్ని కధలతో, ఒక సంకలనంలో నా కధని కూడా చేర్చుకోడానికి మళ్ళీ అనుమతి ఎందుకు అడిగారు?

సంకలనంలో వేసుకోడానికి అనుమతి ఇస్తూ, ఇతరుల రచనల అనువాదాల సంకలనాన్ని సంకలన కర్తలు, తమవారికి అంకితాలివ్వడం చూశాననీ, అలా అంకితాలిచ్చే వుద్దేశం వుంటే మాత్రం, నా కధని చేర్చవద్దనీ నేను అన్నాను. అలాంటి అనుమతి మీకు ఇవ్వనందుకే, మీరు “కక్ష” గట్టి, ఈ ఇంటర్వ్యూ సందర్బాన్ని “ఒక ఆయుధంగా” వాడుకున్నారని, నేను అంటే ఎలా వుంటుంది? కాబట్టి, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం ఎవరికీ మంచిది కాదు. ‘కాలు జారితే తీసుకోవచ్చు గానీ, నోరు జారితే తీసుకోలేం’ అనే సామెత తెలుగులో వున్నదే!

ఇక, మాలతి గారి రెండో ఆరోపణ. “నా రెండో అభ్యంతరం – నా కధలో ఒక వాక్యాన్ని తీసుకుని “మార్చి” వాడుకున్నానని చెప్పడం. నిజానికి నా దృష్టిలో అది సామాన్యంగా అలాంటి సందర్భంలో తేలిగ్గా ఎవరయినా అనగలిగిన వాక్యం. దాన్ని ఆవిడ “మార్చడం”లో నేనేదో అసభ్యకరమయిన మాట రాసినట్టు, తాను దాన్ని శిష్టజన వ్యావహారికం చేసినట్టు ధ్వని వుంది. నా కధలో వాక్యం భార్యకీ, వెలయాలికీ గల తారతమ్యం ఎత్తి చూపుతుంది. రంగనాయకమ్మ వాక్యానికి (మీ ప్రేయసులలో ఒక ప్రేయసిగా వుండను) ఆ అర్థం రాదు. అంచేత అది పూర్తిగా ఆవిడ వాక్యమే. అక్కడ నా వాక్యమేదో తాను వాడుకున్నాననడం అనవసరం.”

మాలతి గారి ఈ ఆరోపణ ఎంత నిరాధారమో తెలియాలంటే, నా పుస్తకంలో, ఆమె కధని ప్రస్తావిస్తూ నేను ఇచ్చిన పెద్ద ఫుట్ నోట్‌ని, ‘పొద్దు’ పాఠకుల కోసం, తిరిగి ఇక్కడ ఇవ్వక తప్పదు.

“నీ ప్రియుల్లో ఒక ప్రియుడిగా నేను ఉండదల్చుకోలేదు” – అనే మాటల్ని నేను ‘నిడదవోలు మాలతి’ అనే రచయిత్రి రాసిన ఒక కధ ఆధారంతో తయారు చేశాను. మాలతి, (23.9.1987 ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో) “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” అనే కధ రాసింది. ఆ కధ ఏమిటంటే: ఇద్దరు తెలుగు భార్యాభర్తలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. భర్త, ప్రొఫెసరు. ఇతను సరిగ్గా ‘మూడు తరాలు’ కధలో ‘యం’ లాంటి తిరుగుబోతు. పైకి మాత్రం ‘స్త్రీల హక్కులూ స్వేచ్చలూ సమస్యలు’ అని మాట్లాడుతూ ఉంటాడు. (‘యం’ కైతే ఈ ‘స్త్రీల హక్కుల’ పోజు లేదు). ఈ భర్త ‘విజిటింగ్ ప్రొఫెసరు’గా ఇండియాకి వచ్చి పోతూ ఉంటాడు. ఇతను ఇండియాలో ఉన్న (హైదరాబాదులోనో ఎక్కడో, కధలో వివరాలు లేవు) తెలుగు ప్రియురాళ్లతో తిరిగే సంఘటనలే కధలో ప్రధానంగా ఉంటాయి. ఈ ప్రియురాళ్ళు కూడా భర్తలూ, బిడ్డలూ ఉన్నవాళ్ళే. అందులో ఒకామె కవయిత్రి కూడానట! ఈ ప్రియురాళ్ళు అమెరికాలో ఉన్న ప్రొఫెసర్ ప్రియుడికి ప్రేమలేఖలు మిడుకుతూ ఉంటారు. “34 నెంబరు బ్రాలు తీసుకురండి. బంగారం తీసుకురండి. కెమేరా తీసుకురండి. నైలాన్ కోకలు తీసుకురండి” ఇదీ ప్రేమలేఖల్లో భాగోతం! ఇదంతా ‘నిజమైన ప్రేమ’ అనీ, దేనికీ ఆశించి చేసే వ్యభిచారం కాదనీ, ఈ బాపతు వాళ్ళు అంటారనుకోండీ! సంఘంలో మర్యాదల కోసం వెనకాల భార్యలూ, భర్తలూ ఉండవలసిందే. కానీ వాళ్ళు పాతబడిపోతూ ఉంటారు. భార్యలూ, భర్తలూ నచ్చకపోతే వాళ్ళతో విడిపోకుండా వాళ్ళని అలా ‘రిజర్వ్’లో ఉంచి, బయట వ్యవహారాలు నడుపుతూ ఉంటారు.

ప్రొఫెసర్ గారికి ప్రియురాళ్ళు మిడికే ప్రేమలేఖలు అతని భార్య చేతుల్లో పడతాయి. ఆ ఇంట్లో ఆ బాపతు ఉత్తరాలు, పుస్తకాల్లోనూ, అలమార్లలోనూ, టేబుళ్ళ మీదా కుర్చీలకిందా ఎక్కడికక్కడే దొర్లుతూ ఉంటాయి. ఆ ఉత్తరాలు చూసిన భార్య, చాలా బాధపడుతూ భర్తని అడుగుతుంది. భర్త, తన నైజానికి తగ్గట్టుగా చాలా సహజంగానే, అబద్ధాలు చెప్పుకొస్తాడు. ‘శోభ రచయిత్రి. తెలుగు రచయిత్రులు ఏవేవో ఊహల్లో తేలుతూ ఉత్తరాల్లో అలాగే రాస్తారు కదా? అంతకన్నా ఏం లేదు’ అని ఒకామె గురించి చెబుతాడు. ఇంకో ఆమె గురించి, ‘గాయత్రి ఈమధ్య కొంచెం మానసికంగా అనారోగ్యంగా ఉంది. ఆమెకి ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఆమె మీద సానుభూతితో స్నేహంగా రాస్తున్నాను. అంతే’ అని చెపుతాడు. ఇవన్నీ అబద్ధాలని భార్యకీ తెలుసు. కానీ, తెగించే ధైర్యం లేక ‘ఏమో, నేను అనవసరంగా అపోహలు పడుతున్నానేమో. అతను చెప్పేదంతా నిజమేనేమో’ అని ఆత్మవంచన చేసుకుంటూ కొంతకాలం గడుపుతుంది. భర్తకి ఇండియా నించి వచ్చే ప్రేమలేఖలు ఆగవు. పైగా టెలిగ్రాములూ, ఫోను సంభాషణలూ కూడా సాగుతూ ఉంటాయి. భార్య ఇక సహించలేక ఒక రోజు తన సామానంతా సర్దేసుకుని, అతను ఇంటికి రాగానే, “నేను వేరే ఎపార్టుమెంటులోకి వెళ్ళిపోతాను’ అని చెప్పేస్తుంది.

‘మీలాంటి మేధావులు బృహత్ గ్రంథాలు రాసీ, చదివీ, అవే వల్లె వేసి కాలం గడుపుతారు. మరో పక్క శోభలూ, గాయత్రులూ అనుభూతులూ, సానుభూతులూ అంటూ ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటారు. వాళ్ళు ఆర్తులు. మీరు ఆర్తత్రాణ పరాయణులు! మీకు వాళ్ళూ, వాళ్ళకి మీరూ చాలా అవసరం. మీ జాతికీ, వాళ్ళ జాతికీ చెందని నూటికి తొంభై తొమ్మిది మందిలో నేనొక దాన్ని. నేను నెమ్మదిగా సావకాశంగా నాటు బండిలో రోజులూ వారాలూ గడుపుకుంటూ బతుకుతాను… మీ ముండల్లో ఒక ముండగా నేనుండదల్చుకోలేదు” అని చెప్పేస్తుంది. (ఈ భార్య, భర్త నించి విడిపోయే క్షణాల్లో కూడా అతన్ని ‘మీరు’ అనడం బాగా లేదు గానీ, అది పాత అలవాటు. ఆ మాట కన్నా, ఆత్మ గౌరవంతో ఆమె చేసిన పనే ముఖ్యం.)

కొన్నాళ్ళ కిందట చదివిన ఈ కధలో ఆ చివరి మాటలు బాగా నచ్చడం వల్ల, అవి నాకు బాగా గుర్తున్నాయి. ఈ వ్యాసంలో, కాన్‌స్టాన్‌టిన్ పాత్రని విమర్శించేటప్పుడు, ఆ మాటలే కొంచెం మార్చి ‘నీ ప్రియుల్లో, ఒక ప్రియుడిగా నేనుండ దల్చుకోలేదు‘ అని వాడాను. స్త్రీ అయినా పురుషుడైనా, భర్తనించో, భార్యనించో అవమానం ఎదురైనప్పుడు తక్షణం అనవలసిన మాటలు అవి.”

మాలతి గారి కధని ప్రస్తావించిన సందర్భంలో, ఎక్కడైనా “మీ ప్రేయసులలో ఒక ప్రేయసిగా వుండను” అనే వాక్యం వుందా? నేను రాయని వాక్యాన్ని తీసుకొచ్చి, నాకు అంటగట్టడాన్ని ఏమనాలి? మాలతి గారి మాటలే వాడాలంటే, దాన్ని “కక్ష” అనాలా? “విశ్లేషణా లోపం” అనాలా? “ఆత్మవంచన” అనాలా?

తన కధలో భార్య చేత మాలతి గారు చెప్పించిన వాక్యం ఏమిటి? “మీ ముండల్లో ఒక ముండగా నేనుండ దల్చుకోలేదు” అని. ఈ వాక్యాన్ని నేను యధాతథంగానే వుంచాను. అది ఎంతో నచ్చింది నాకు.

ఈ పద్ధతిలోనే, నేను విమర్శించిన ‘మూడు తరాలు’ కధలో ఒక భర్త పాత్ర అలా అనవల్సిందనీ, కానీ అలా అనలేదనీ అంటూ నేను రాసిన వాక్యం ఏమిటి? “నీ ప్రియుల్లో, ఒక ప్రియుడిగా నేనుండదల్చుకోలేదు” అని. ఇక్కడ నేను మాలతి గారి వాక్యాన్ని వక్రీకరించినది గానీ, ‘శిష్ట జన వ్యావహారికం’ చేసినది గానీ ఏమిటి?

ఎవరి మీదైనా విమర్శ చేసేటప్పుడు, “మంచి రచయిత” ఎలా వుండాలని మాలతి గారు ఉద్బోధించారో, ఆ “సంయమనమూ”, ఆ బాధ్యతా ఆమెకి వుండొద్దూ?

—————–

ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి పొద్దుకు ఇచ్చిన ఇంటర్వ్యూ

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

38 Responses to కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం!

Comments are closed.