మూగ ప్రేమ

– ఆత్రేయ

ఆవలి ప్రపంచంలో నువ్వు
అమాయకంగా అద్దాన్ని ముద్దెట్టే..
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..

అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..

నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
ఆ మునివేలికోసం ఎదురు చూస్తూ…

—————

బంధాలను సుదూర తీరాల్లో వదిలి, అనుబంధాలను రంగు కాగితాల కోసం తాకట్టుపెట్టి, ప్రవాసమో వనవాసమో తెలియని జీవనం గడుపుతున్న మామూలు తెలుగువాడు ఆత్రేయ కొండూరు. భావాలను భాషలోకి మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆచార్య ఆత్రేయంటే చాలా అభిమానం.

Posted in కవిత్వం | Tagged , | 5 Comments

సృష్టి ప్రతిపాదనలు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

ఈజిప్ట్ నాగరికతలో ఒక ఆదిదేవత వమనంనుంచీ, లాలాజలంనుంచీ లోకం సృష్టి అవుతుంది. ఆఫ్రికాలోని బకూబా ధోరణి ప్రకారం మొదట్లో అంధకారంతో జలమయంగా ఉన్న లోకాన్ని ఊహించారు. ఒక పెద్దరాక్షసుడు తన కడుపునొప్పి కారణంగా సూర్యచంద్రులనూ, నక్షత్రాలనూ వమనం చేసుకున్నాడట.

మానవుల సామాజికజీవితం నిరక్షరాస్యదశలో మొదలైనటువంటిది. ఇప్పుడు మనకది అజ్ఞానంతో కూడుకున్నదిగా అనిపించవచ్చుగాని తమ జీవితాలకు అవసరమైన వ్యవహారిక ప్రపంచజ్ఞానాన్ని పొందటానికి అప్పటివారికి చదువు రాకపోవటం ఏమీ ప్రతిబంధకం అనిపించి ఉండదు. లిపీ, పుస్తకాలూ వగైరాలేవీ సృష్టికాని ఆ దశలోని పరిస్థితులే వేరు. 50ఏళ్ళ కిందటి ఆఫీసుల్లో కంప్యూటర్లు లేకపోవడం ప్రతిబంధకం అనిపించనట్టే ఆనాటి ప్రజలు ప్రకృతిని గమనించి, పెద్దవారినుంచి విషయాలు నేర్చుకుంటూ జీవితపు సమస్యలను ఎదుర్కునే ప్రయత్నం చేశారు. మనకన్నా ప్రకృతికి సన్నిహితంగా ఉండిన వారి జీవితాల్లో జంతువులకు భిన్నమైన పద్ధతిలో మానవనైజం అనేదొకటి ఏర్పడటానికి ముఖ్యకారణం వారి మేధోపరిణామమే.

పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మనుగడను కొనసాగించేందుకు మనుషులకు పనికొచ్చినవి వారి ఆలోచనలే. మెదడు ముందుభాగంలోని లలాటికలంబిక ముందాలోచనకూ, ఊహాశక్తికీ ఆధారం. తక్కిన నరవానరజాతులలో కనబడనంత అభివృద్ధి మనుషులకు ఈ భాగంలో జరిగింది. దీని పనితనం నానాటికీ పెరుగుతూపోయింది. ప్రకృతిలో నిత్యమూ పునరావృతం అయే పేటర్న్‌లను కనిపెట్టడం ఇందులో ముఖ్యంగా ఉండేది. ఇటువంటి ఊహాశక్తి మనుషులకు చాలా లాభించింది. ఊహలూ, కల్పనలూ, భావనలూ లేకుండా అప్పటి మానవసముదాయాలు రోజువారీ కష్టాలను ఎదుర్కోగలిగి ఉండేవికావు. ఎటొచ్చీ ఊహాశక్తి అనేది రెండంచుల కత్తివంటిది. చీకటి గుహలోకి ప్రవేశిస్తున్నప్పుడు అందులో ఏదైనా క్రూరమృగం పొంచి ఉందేమోనన్న అనుమానం మనుషుల ప్రాణాలు కాపాడే ఉంటుందిగాని ఆ గుహలోనే, కంటికి కనబడని అతీతశక్తులేవో కూడా ఉండవచ్చనే సందేహం అపోహలకే దారితీస్తుంది. ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉండవు.
నిత్యావసరాలైన ఆకలిదప్పులూ, తలదాచుకునే చోటూ, ప్రాణభయమూ మొదలైన ఈతి బాధలుకాక, దీర్ఘకాలిక పద్ధతిలో తమకూ, తమసాటివారికీ పనికొచ్చే తాత్వికచింతనకూడా తొలి మానవసముదాయాల్లో మొదలయింది. సృష్టిని గురించిన జిజ్ఞాసకూడా అందులోని భాగమే. చేతులతో పనిచెయ్యడం జంతువులకు సాధ్యంకాదు. మనుషుల కార్యాచరణ గిజిగాడు గూడు కట్టినట్టుగా జరగదు. పనులవెనక ఉద్దేశాలూ, ఆలోచనలూ ఉండితీరుతాయి. తమ చేతులతో పని చెయ్యడం, ఆ పని తాలూకు ఫలితాలూ మనుషులకు కొట్టవచ్చినట్టుగా తెలుస్తూ ఉండేవి. చిన్న జంతువులను పట్టుకోవటానికి ఉచ్చులు బిగించినా, ఒక రాతిగదనో, వాడిములికిగల బాణాన్నో తయారుచేసినా ఆ పనులయొక్క కార్యకారణసంబంధం వారికి స్పష్టంగా గోచరించేది.

ఎవరైనా మట్టి పిసికి కుండను తయారుచేస్తే తప్ప దానంతట అది తయారవదు. మరి మనచుట్టూ ఉన్న ప్రపంచం ఎలా తయారయింది? కొండలనిగాని, చెట్లనిగాని, జంతువులనిగాని, మనుషులనిగాని ఎవరు తయారుచేస్తున్నారు? అలాంటిదేదీ కనబడదే? ఎవరో తయారుచేస్తే తప్ప ఏదీ దానంతట అదే తయారుకాజాలదనే గట్టినమ్మకం మనుషులకు ఆటవికదశలో ఏర్పడి, ఇప్పటికీ భావజాలంగా కొనసాగుతోంది. సృష్టికర్తను ఊహించుకోకుండా ప్రపంచపు ఉనికిని చాలామంది ఈ నాటికీ గుర్తించలేకపోవటానికి కారణం అదే. అణువుల్లోనూ, జీవకణాల్లోనూ తలెత్తే భౌతిక, రసాయనిక ప్రక్రియలను వివరిస్తున్నప్పుడుకూడా “దాన్నే మనవాళ్ళు భగవంతుడని భావించారు” అంటూ చటుక్కున అడ్డొచ్చేవారు చాలామంది కనిపిస్తారు. కర్తృత్వం (లేదా ఎవడో ఒక సృష్టికర్త) లేకుండా ఏదీ జరగదనే నమ్మకమే అందుకు కారణం. ఇదొక ఆదిమభావన అనీ, అనుభవంద్వారా రూపొంది నటువంటి సహజమైన అపోహ అనీ వారు ఒప్పుకోరు.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంత అమాయకంగా, కొంత పరిమిత ఊహాశక్తితో, కొంత గుడ్డినమ్మకాలతో మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ అప్పటివారు తమ సమాజం ఒకటిగా ఉండి బాగుపడాలనే ఉద్దేశంతోనే అవలంబించి ఉంటారనేది గుర్తించాలి.

లోకసృష్టిని గురించిన తొలి తాత్వికభావనలు చాలా ప్రాచీనమైనవి. ఇవి ప్రపంచంలో ప్రతిచోటా పుట్టుకొచ్చాయి. స్థానిక నాగరికతలనుబట్టి వివిధప్రతిపాదనలు వివిధప్రాంతాల్లో వ్యాప్తి చెందాయి. బేబిలోనియాలో ఒకానొక సముద్రదేవత దేవగణాలపై సాగించిన కుట్రను భగ్నం చేసేందుకని మార్దుక్ అనేవాణ్ణి సృష్టించినట్టుగా నమ్మకం ఉండేది. అందుకు ప్రతిఫలంగా మార్దుక్ తనకు అంతులేని శక్తులు ప్రసాదించమని కోరుకుంటాడు. ఆ తరవాత అతని ఆధ్వర్యంలో జరగవలసినవన్నీ జరుగుతాయి. ఈజిప్ట్ నాగరికతలో ఒక ఆదిదేవత వమనంనుంచీ, లాలాజలంనుంచీ లోకం సృష్టి అవుతుంది. ఆఫ్రికాలోని బకూబా ధోరణి ప్రకారం మొదట్లో అంధకారంతో జలమయంగా ఉన్న లోకాన్ని ఊహించారు. ఒక పెద్దరాక్షసుడు తన కడుపునొప్పి కారణంగా సూర్యచంద్రులనూ, నక్షత్రాలనూ వమనం చేసుకున్నాడట. వాటి వేడిమివల్ల తేమ అంతా ఇగిరిపోయిందట. మరొకసారి వాంతి చేసుకున్నాక ప్రపంచమూ, స్త్రీ పురుషులూ, జంతువులూ అంతా ఉద్భవించారట.

ఆఫ్రికాలోనిదే అయిన మాసాయి తాత్వికచింతనలో ప్రపంచం తొలిసారిగా ఒక చెట్టుబోదె నుంచి రూపొందింది. ఆసియా సంస్కృతుల్లో ఎక్కువగా తొలి ప్రపంచాన్ని జలమయంగా భావించారు. కొందరు చీకటితోనో, రూపరహితంగానో, ఒక అండం, లేదా బీజరూపంలోనో విశ్వం మొదలయిందని నమ్మారు. ఫిన్లండ్ ప్రజలు ఒక ఆదిమపక్షి గుడ్డునుంచి లోకమంతా బైటికొచ్చిందని అనుకున్నారు. నార్వేవారు ఉత్తరాన ఉన్న మంచుకూ, దక్షిణాన ఉన్న నిప్పుకూమధ్య తలెత్తిన ప్రక్రియలే సృష్టికి కారణమని భావించారు. తక్కిన ప్రపంచంతో సంబంధం లేకుండా పెంపొందిన అమెరికా ఆదిమతెగల్లో సృష్టిని గురించిన భావనల్లో సర్పాల పరికిణీవంటిది ధరించిన ఆదిమాత ప్రస్తావన కనిపిస్తుంది. కొన్ని తెగల్లో పురుష అంశ కలిగిన ఆకాశానికీ, స్త్రీ అంశ కలిగిన భూమికీమధ్య సంపర్కం మొదలయిందనే నమ్మకం ఉండేది.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంత అమాయకంగా, కొంత పరిమిత ఊహాశక్తితో, కొంత గుడ్డినమ్మకాలతో మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ అప్పటివారు తమ సమాజం ఒకటిగా ఉండి బాగుపడాలనే ఉద్దేశంతోనే అవలంబించి ఉంటారనేది గుర్తించాలి. ఈ రోజుల్లో ఒక్క మాత్రతో నయంచెయ్యగలిగే రోగాల చికిత్సకు ఏ పంతొమ్మిదో శతాబ్దంలోనో మేటివైద్యులు ఎంతో కష్ట పడేవారని మనం గుర్తించినట్టే ఏ యుగానికా యుగంలో ప్రజలు తమకు అర్థమైనంతమేరకు లోకంలో తమకు కనబడుతున్న, కనబడనటువంటి వింతలకు వివరణలిచ్చే ప్రయత్నాలు చేశారనేది మరిచి పోకూడదు. అంతమాత్రాన ప్రాచీనసంస్కృతిని గౌరవించడానికి ప్రతి పురాతన తత్వధోరణినీ నెత్తిన పెట్టుకోనవసరంలేదు. అటువంటివాటి చారిత్రక, సామాజిక నేపథ్యాలను అర్థం చేసుకోవాలి.

జుడాయిజం, జొరాస్ట్రియన్, క్రైస్తవ, ఇస్లాం మతాలన్నీ ఆవిర్భవించినది తొలి నాగరికతలకు పుట్టినిల్లయిన పశ్చిమాసియాలోనే. అందుకే వాటి మూలాల్లో కొంత సామ్యం కనిపిస్తుంది. తొలిసారిగా పర్వతమెక్కి పది ఈశ్వరాజ్ఞలని సంపాదించుకొచ్చిన మోసెస్ తన తెగలలోని ప్రజలు సాగిస్తున్న విగ్రహారాధనను ఈసడించుకున్నాడు. బంగారు లేగదూడవంటివాటిని ఆరాధించే సంస్కృతి అప్పట్లో ఉండేది. అలాకాకుండా అగ్నినో, రూపరహితుడైన ఒక ఈశ్వరుణ్ణో ఆరాధించాలనే వైఖరి మొదల యింది. తొలి ఆరాధన అంతా చెట్లకూ, జంతువుల విగ్రహాలకూ జరిగేది. ఇటువంటి ఆదిమభావనల స్థానంలో కొంత ఉన్నతమైన తాత్వికచింతన ప్రతి ప్రాంతంలోనూ తలెత్తడానికి ఒక కారణం ఒక్కొక్క తెగలోనూ ఒక్కొక్క బొమ్మను పూజిస్తూ ఇతర తెగలతో కయ్యాలకు దిగడమే. అందరికీ వర్తించే తాత్వికధోరణులను ప్రతిపాదిస్తున్నప్పుడు కొంత నైరూప్యభావనలు చోటుచేసుకోలేక తప్పలేదు.

బేబిలోనియాలో క్రీ.పూ. 2000 ప్రాంతాల్లోనే వ్యాప్తిలో ఉన్న మతభావనలు అప్పటికే ఎన్ని వేల సంవత్సరాలనుంచీ కొనసాగుతూ వచ్చాయో తెలియదు. ఇవన్నీ తరవాత రూపొందినటువంటి మతాల్లో భాగాలైపోయాయి. వీటిని ప్రశ్నించ సాహసించినవారిని సవాలు చేసేందుకు వీటి ప్రాచీనతనే కారణంగా చూపుతారు. ప్రాచీనకాలం అనేది జ్ఞానసంపద పరిపక్వం కానటువంటి దశ అని వారు ఒప్పుకోరు. ప్రాచీనయుగాల్లో దేవుళ్ళూ, దేవతలూ మనుషులతో సంభాషిస్తూ, వారితో ఎక్కువ సంబంధబాంధవ్యాలు నెరిపేవారనే భావన గ్రీక్ పురాణాల్లోకూడా కనిపిస్తుంది. అవన్నీ ఎప్పుడు మొదలై, ఎప్పుడు నిలిచిపోయాయో ఎవరూ చెప్పరు. మనుషులు ఆటవిక, అనాగరిక, బర్బరదశలన్నీ దాటి ముందుకు వచ్చారని ఆమోదించేవారు మధ్యలో ఈ స్వర్ణయుగం ఎప్పుడొచ్చి అంతమయిందో వివరించరు.

—————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.

Posted in వ్యాసం | Tagged | Comments Off on సృష్టి ప్రతిపాదనలు

విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – మూడవ అంకము

{కొత్తపాళీ}: ఈ తడవ, మామూలుగా అవధానాల్లో ఉండే సమస్య, వర్ణన, దత్తపదులే కాక, ఒక కొత్త అంశాన్ని చవి చూద్దాం .. అది అనువాదం. రెండు సంస్కృత పద్యాలు, రెండు ఆంగ్ల పద్యాలూ ఇచ్చాను అనువాదానికి. మొదటిది, తెలుగు వారికి అత్యంత పరిచయమైన శ్లోకం, పెళ్ళి శుభలేఖల్లో తరచూ ప్రచురిస్తుంటారు. వాల్మీకి రామాయణంలో జనక మహారాజు సీతని రామునికి కన్యాధార పోస్తూ చెప్పే వాక్కులుగా ఈ శ్లోకం.

ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ|
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా
||

తిన్నగా అర్ధం చెప్పుకోవాలంటే .. చాలా సులువు. ఐతే, అందులో ఎన్నో ధ్వనులు ధ్వనిస్తుంటాయి. ఆ ధ్వనుల్ని పట్టుకోవడం ఒక యెత్తైతే, మూలంలో ఉన్న క్లుప్తతని సాధించడం ఇంకో యెత్తు.
{రామకృష్ణ}:
కావ్యస్యాత్మా ధ్వనిః
{కామేశ్వరరావు}: ఇందులో “ప్రతీచ్ఛ చ ఏనాం” మరీ లోతైనది!
{కొత్తపాళీ}: ఈ అనువాదాన్ని చాలా మంది ప్రయత్నించారు. సమయం దృష్ట్యా నేను కొద్ది మందిని మాత్రమే ఎంపిక చేశాను ఇవ్వాళ్ళ ఇక్కడ వినిపించడానికి. జిగురు సత్యనారాయణ గారు, మీ పద్యం అందుబాటులో ఉన్నదా?
{సత్యనారాయణ}:
ఆ||

నా కుమార్తె సీత మట్టికి పట్టి యీ
కాంత కరము కొనుము కాంక్ష తోడ!
నిన్ను కూడి నిలుపు నీదు ధర్మంబును
నీకు భద్రమగును నీల వర్ణ!!

{కొత్తపాళీ}: మట్టికి పట్టి .. తొలకరిలో తడిసిన మట్టి వాసన చూపించారు
{రాఘవ}: నిన్ను కూడి నిలుపు నీదు ధర్మంబును… తేలిక పదాలలో ఎంత బాగా చెప్పారండీ. నమోవాకం.
{చదువరి}: మట్టికి పట్టి… భలే -ఔను బావుంది!
{పుష్యం}: తేట తెలుగులో తేలికగ ఉంది.. బాగు బాగు..
{రామకృష్ణ}: జిగురు సత్యనార్యు సొగసుగా చెప్పిరి. తేట తేట తెలుగు తేనె లొలికె.
{సత్యనారాయణ}: ధన్యవాదాలు

{కొత్తపాళీ}: భావకుడన్ గారూ మీ పద్యము?
{భావకుడన్}: అయ్యా.
సీ.||
రామా నిను త్రికరణనుసరణ సేయ
మత్పుత్రికారత్నమె దగు, సీత

యను నా కుమార్తె యున్యిదియె వేడ్కన్గను

మా సకలంబులు మీకు శుభము

లౌను కైగొనుమా యిలన్సకలావస్థ

ల సహచర్యము సేయ లలన కరము
పాణిగ్రహణమున పల్కెన్జనక మహి

పతియని వాల్మీక పరిచయమను

తే || సుగతి ప్రాప్తము కలిగె నే స్తోత్రమెవరి
సేయవలెమరి వాగర్ధ సిరుల వెల్గు

శారదాంబనా చిక్కనౌ సాహితీ కృ

షి నలుదిశలన్ప్రసరణంబు సే తలంప?

ఇదండీ నా ప్రయత్న పిపీలకము.
{కొత్తపాళీ}: పనిలో పనిగా శారదాంబకి నమస్సులు కూడా కానిచ్చేశారు?
{కామేశ్వరరావు}: “వాగర్ధ సిరుల వెలుగు” అన్న పదం చాలాబావుంది.
{రాఘవ}: ఆదికవికి పలుకులిచ్చిన వాగర్థ సిరుల తల్లి అందరికీ పలుకులివ్వడం… బావుందండీ.
{భావకుడన్}: నెనర్లు.

{కొత్తపాళీ}: కృష్ణాత్రేయా, ఆత్రేయ కృష్ణా? మీ పద్యం?
{కృష్ణ}: చిత్తమ్
కం||
ఈడగు సీతిది నా సుత
పాడియె నీపత్నిగ జని పాలన జేయన్‌

తోడుగ చేకొను రామా (రాఘవ )

నీడగ నీతోడు నడచు నీకనుచరిగా !!

{రాఘవ}: నన్నెవరైనా పిలిచారా? 😉
{పుష్యం}: రాఘవా.. మీరు ఇక సీత అనె అమ్మాయిని వెతుక్కొవాలి. అష్టా చెమ్మాలోలా 🙂
{భావకుడన్}: “నల్ల చీర కట్టుకున్న వారందరూ…..” అంటే ప్రమాదమేమో రాఘవగారూ? 🙂
{సత్యనారాయణ}: రాఘవా గారు మిమ్మలని కాదు, ఇన కుల రఘు రామున్ని
{రాఘవ}: బావుందండీ… పాలన… సీతని రాజ్యలక్ష్మి చేసేసారు. పాడి… ధర్మం. భలే.
{కామేశ్వరరావు}: తోడుగ “చే”కొను రామా – అనడంలో “పాణిం గృహ్ణీష్వ” బాగా ఒదిగిపోయింది.
{కొత్తపాళీ}: సీత ఈడైంది అనడం బాగా నప్పింది
{కృష్ణ}: ధన్యవాదాలు.

{కొత్తపాళీ}: సభాసదులారా, నరసింహారావు గారు కూడా చక్కని కంద పద్యంలో అనువదించారు. వారి కందపద్యాన్ని మళ్ళి వినిపించమని కోరుతున్నాను.
{నరసింహ}:
కం||
సీత యిది , నాదు పుత్రిక
చేతిని నీ చేత నునుతు, చేకొను రామా
నాతిగ చేకొను మీమెను
ప్రీతిన్ కడు శుభము లగుత ప్రేమతొ మీకున్.

{కొత్తపాళీ}: చేతిని నీ చేతనుంతు .. బాగుంది.
{రాఘవ}: క్లుప్తంగా చక్కగా ఉందండీ నరసింహారావుగారూ
{రానారె}: మిగతా పద్యాల్లాగానే ఇందులో కూడా వివరమంతా లేదు. చేతిని నీచేత నునుతు చేకొను రామా – అనడంలో చేతులు మూడయ్యాయి. సీతారాములవి, జనకునిదీ అనుకోవచ్చు. సరిగ్గా సన్నివేశాన్ని క్లోజప్ లో చూపిస్తున్న పద్యం.
{రామకృష్ణ}: అభినందన నరసింహా
{నరసింహ}: అందరికీ నా ధన్యవాదాలు. అలాగైనా ఫరవాలేదు. నునుతు అని ఉంచాలన్పించి ఉంచాను. గణభంగాలేమీ లేవుగా.కొత్తగా పద్యం వ్రాయటం మొదలు పెట్టిన వాడిని.

{కొత్తపాళీ}: చివరిగా భైరవభట్ల వారి అనువాదం విందాము.

{కామేశ్వరరావు}:
తే||
ఈమెయే సీత నాతల్లి! యెల్ల ధర్మ
ములను నీ తోడు గ్రహియింపుమోయి రామ
భద్రమగుగాక మీకు సర్వత్ర సతత
మిదిగొ నీ చేతనందుకో యీమె చేయి

పెద్దగా తృప్తి లేకపోయినా, ఏదో అయ్యిందనిపించాను. “ప్రతీచ్ఛ చ ఏనాం” సరిగా అనువదించలేకపోయాను.
{చదువరి}: నాతల్లి! – హృద్యంగా ఉంది.
{రామకృష్ణ}: చాలా అందంగా వుంది
{గిరిధర్}: అందరూ, నా పిల్ల అంటే మీరు నా తల్లి అని భలే చెప్పారు
{రానారె}: రామభద్రునికీ ఆయన సహధర్మచారిణికీ భద్రమగుగాక అని జనకుడనడం భలేగా నప్పింది.
{రాఘవ}: సర్వత్ర సతతము … బావుందండీ 🙂

{కొత్తపాళీ}: ఇక్కడ ఛందస్సులో ఛాయిస్ గురించి ఒక ప్రశ్న. ముఖ్యంగా భైరవభట్ల వారికీ, చింతా వారికీనూ. ఔత్సాహిక కవులం పద్యం రాసేటప్పుడు ఏదో గణాలు కిట్టించుకోవడమూ, యతిప్రాసలు జారిపోకుండా చూసుకోవడమే లక్ష్యంగా ఉంటుంది.
ఇప్పుడు ఈ అనువాదం లాంటి సందర్భంలో .. ఈ భావం చెప్పేందుకు ఈ ఛందస్సు బాగా నప్పుతుంది అనిపిస్తుందంటారా?
{కామేశ్వరరావు}: అనుష్టుప్ ఛందస్సులో చాలా క్లుప్తత సాధించారు మహర్షులు. దాన్ని అనువదించడానికి తేటగీతి లాంటి చిన్న పద్యం కూడా పెద్దదే అయిపోతుంది!
{రానారె}: కామేశ్వరరావు మాస్టారూ, వింటున్నాం, ఇంకా చెప్పండి
{గిరిధర్}: అవునవును, చెప్పండి చెప్పండి
{కామేశ్వరరావు}: పద్యంలో ప్రధానం క్లుప్తతా, లేక భావావేశమా అన్నదాన్ని బట్టి చిన్న పద్యమా పెద్ద పద్యమా అన్నది నిర్ణయించవచ్చు.
{కొత్తపాళీ}: కందం కూడా ఇంచుమించు అలాంటిదే కదా! పైన కృష్ణగారు మంచి కంద పద్యం రాశారు ఈ విషయమై.
{కామేశ్వరరావు}: ఇందులో మరో తమాషా ఏమిటంటే, ఆటవెలది కందము చిన్న పద్యాలే అయినా, వాటికి ప్రత్యేకమైన తూగు ఉంది. గంభీరమైన భావం చెప్పాలనుకున్నప్పుడు ఆ తూగు కొంత distract చేసే ప్రమాదం ఉంది.
{రామకృష్ణ}: ముక్కస్య ముక్కార్థః అని అనువదించాలంటే చిన్నపద్యంలో వ్రాయవచ్చు. ఐతే మనో వేగాన్నాపుకోలేని మహనీయులు స్వేచ్ఛగా వ్రాయడం కలదు
{కామేశ్వరరావు}: అవును అన్ని సమయాల్లోనూ “ముక్కస్య…” అనువాదాలు కుదరవు. అయినా నా ఉద్దేశంలో చిన్న కవితల్లో అది తప్పదేమో.
{కొత్తపాళీ}: మీరిద్దరు చెప్పిందీ బాగుంది. ఇక్కడ సభవారు అనుమతిస్తే ఒక పద్యం ఉదాహరణ ఇస్తాను
{గిరిధర్}: భర్తృహరి సుభాషితాలకి యేనుగు లక్ష్మణకవి తెలుగు పద్యాలు చదివినప్పుడు నాకు ఈ అనుమానం మెదులుతూనే ఉండేది. కొత్తపాళీ గారు, మీరే సభాపతి, మీకు అనుమతులేల?
{కొత్తపాళీ}: నేను సభాపతినైనా, సభలో ఉన్నది కవులూ, వారు నిరంకుశులూ కద! అనుమతి తీసుకోవడమే న్యాయం!!
{చదువరి}: కవులు కేవలం నిర్ అంకుశులు, సభాపతి అంకుశుడు.

{కొత్తపాళీ}: ఇక్కడ మా స్థానిక దేవాలయంలో ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ జానకిరామ శాస్త్రిగారు, సంస్కృతాంధ్ర పందితులు, అవధానులు. మన చిరుప్రయత్నం గురించి వారితో ముచ్చటించినప్పుడు వారు కూడా పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు.
వారు రాసిన పద్యమిది

ఉ||
ఈమె కుమార్తె మాకు, జగదేక సుపావని, భూమిజాత, నీ
వీమెకు జన్మజన్మ పతివేకద, భూవర, రామచంద్ర, మా
సేమము కోరి మోక్షమిడ చేకొను పాణిని, లోక రక్షణా
కాముడవై హరీ! జనకులాశిసులంది సుఖింపు మీధరన్!

ఎందుకింత పెద్ద పద్యం రాశారు అని అడిగాను. అంటే .. గమనించండి .. మొదటి పాదంలో జగదేక సుపావని, రెండో పాదంలో నీవీమెకు జన్మ జన్మ పతివే .. , మూడో పాదంలో మా సేమము కోరి .. లోక రక్షణా కాముడవై .. ఇత్యాది వాడుకలన్నీ మూల శ్లోకంలో అప్రకటితంగా ఉండిపోయిన భావాల్ని ప్రకటితం చేస్తున్నాయి. ఇయం సీతా మమ సుతా .. అనడంలో .. ఈకాలపు ఇంట్రొడక్షన్లలాగా .. This is Sita అని కాదు అర్ధం. “రామా, గమనించావా? ఈమె ఎవరో కాదు .. సీతయే .. నీ భార్యయే .. నీకోసమే పుట్టినది. ఈమెను నువు పెళ్ళాడితే తప్ప తరవాత జరగవలసిన లోకకళ్యాణం జరగదు …” అనే ధ్వని అంతా అందులో ఉందన్న మాట.
{కామేశ్వరరావు}: అవునండి, అది ముమ్మాటికీ నిజం. మనకోసం హాయిగా విప్పి చెప్పారన్నమాట!
{రానారె}: అంచేత మూలంలో ఉన్న ఆ భావాన్నంతా అనువాదంలో చెప్పడం అవసరం – అంటారు?!
{కామేశ్వరరావు}: అంతే కాదు “ఇయం సీత” అన్న అక్షరాలలో “సత్యం” అన్న పదాన్ని కూడా వాల్మీకి గర్భితం చేసి ఇది పరమ సత్యమన్న విషయాన్ని ధ్వనించాడట!
{గిరిధర్}: కొత్తపాళీ గారు, చక్కటి సమస్య, దానికి గొప్ప అనువాదాలు – ఇప్పుడు తొనలు వొలిచి చేతిలో పెట్టినట్టు వివరణలు..చాల బావుందండీ
{రానారె}: జానకీ రామ శాస్త్రిగారి అనువాదంలో భూమి జాత అంటూ సీతనిచ్చారు, భూవర అంటూ రాముని పిలిచారు! 🙂

{కొత్తపాళీ}: ఇప్పుడు వర్ణనాంశాన్ని స్పృశిద్దాం. మన పురాణాల్లో గొప్ప, దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాలు అంటే గంగావతరణాన్ని చెప్పుకోవాలి. మన భావకుడన్ గారు తన భావుకత్వమంతా చూపించారు. మొదలు పెట్టమని కోరుతున్నాను
{భావకుడన్}:
ఆ||
పద్మనాభు పాదపద్మములవిరిసి
పద్మభవు కమండు భవము భాసి
సురపురినలరు సురగంగ వెతలేమి!
సగర వంశజు కల సాఫలమని
తే||
పావనిన్నధః పాతాళ పరము జేసి
చెడి వడిన్జను జాహ్నవి జెటినిడి చిరు
పాయన కవాటమిడి నగున్పేడి వాని
కశ్త్రమొసగి మురియు బుధ్ధిఘనము మెఱయ!
తే||
ధూర్జటి ఘనమెట్టిదొ తెలియదె నిజము
మును మనువొనరింపు మోహనునునురి
మెన్మరుగుకునొసగు మూషికంబు
రౌతు సేసి మతిమెఱయగ కంటె.

చేసిన కొన్ని ప్రయత్నాల్లో నాకు సంతృప్తినిచ్చిన ప్రయత్నమిది.. 🙂 ముందరి కాళ్ళ బంధం కాదండి….విమర్శ సదా స్వాగతమే.
{రామకృష్ణ}: భావకులు – కారు అహంభావకులు. అద్భుతంగా వ్రాయగలిగారు.
{భావకుడన్}: అందుకనే భావకుడన్ అనే ఉంచానండి
{పుష్యం}: కళ్ళకు కట్టినట్టు వర్ణించారు..
{రాఘవ}: జెటినిడి?
{భావకుడన్}: జటా జూటముకు సగము…
{రాఘవ}: జటన్ … ఓహో. చివరి పద్యం భలే చెప్పారు.
{భావకుడన్}: నగున్ + పేడివాడు = అర్జునుడు అన్నట్టు రాసాను.
{గిరిధర్}: పద్మభవు కమండు భవము భాసి – అంటే వివరిస్తారా
{భావకుడన్}: గంగా దేవిని బ్రహ్మ విష్ణు పాదాలనుంచి తీసుకుని తన కమండలంలో ఉంచాడని చదివాను ఎక్కడో…
{భావకుడన్}: అలాటి గొప్ప నివాసమున విలసిల్లి అంటూ వర్ణించాను

{కొత్తపాళీ}: రాఘవా మీ వర్ణన?
{రాఘవ}: ఇక, నేను చేసిన ప్రయత్నం… అవధరించండి
కం||
శ్రీవల్లీవల్లభ గ
ర్భావాసంబై సురతతిపతిమాతృకయై
పావకుచేఁ బావక దృ
క్పావనరేతోవహమగు పావని తొల్తన్ ౧
సీ||
తుహినాత్మనగరాజు తొలిచూలు బిడ్డయై దేవకార్యంబుకై దివికి నేగి
శ్రీవిష్ణుపాదముల్ చేరి గంగ వసించె వైకుంఠధామానఁ బరవశమున
సగరరాజొకనాడు సల్పి యశ్వమఖంబు విడువ యాగాశ్వమున్ వేల్పుఱేఁడ
పహరించె దాచె నా వాజిరాజముఁ దాని జాడకై చనిరంత సగరసుతులు
ఆ||
భూమిఁ దిరిగిదిరిగి భూమిఁ ద్రవ్విరి వారు
గోతులఁ గనఁబడె రసాతలంబు
కపిలమునికిఁ జెంతఁ గనిపెట్టి గుఱ్ఱంబు
దాడి చేయబోయి బూడిదైరి ౨
తే||
అంశుమంతుండు చనెనంత నాసమంజి
భస్మరాశులం గనుగొని విస్మయమున
వైనతేయుని మాటపై వడసె తపము
పుత్రుఁడు దిలీపుఁడు పుణికిపుచ్చుకొనెను ౩

వచనము|| కాని వీరు సేసినవన్నియు శూన్యఫలితముల నివ్వ నంత దిలీపుని కొమరుఁడైన

పఞ్చచామరము||
భగీరథుండు చేసె చాల బ్రహ్మకై తపంబు లం
త గీర్వరుండు వచ్చియిచ్చె దైవవాహినిం గృపన్
ప్రగాఢవాహవేగమోర్వరాదటంచు పృథ్వికై
యగేశజాధవప్రమోదహాటకేచ్ఛఁ గొల్వగా ౪
ఉ||
ధర్మ్యమధర్మ్యమున్ వివిధతర్కము లందఁగలేని గొప్ప నై
ష్కర్మ్యమహాస్థితిన్ శివము సచ్చిదనంతవిరాడ్స్వరూపుడై
సోర్మ్యఝరిన్ ధరించ నది జూచుచు తన్మయయై శివార్చనా
హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితోన్ ౫
సీ||
బిందునామక్షేత్రమందు ప్రాక్పశ్చిమంబులకేగె నారుపాయలుగ గంగ
భాగీరథీ గంగ ప్రవహించి జాహ్నవై జలజలా గలగలా శిలలనడుమఁ
బాతాళముంజేరి పరలోకములనిచ్చె సగరసూనులఁ జేర్చె స్వర్గగతిని
మూడు దిక్కులఁ బారె ముల్లోకములఁ బారెఁ ద్రిపథగయై గంగ తెలసె నటుల
తే||
ధన్యజీవులు గంగావతరణకథనుఁ
జదువువారలు వినువారు సకలసుఖము
లంది భూలోకవాసంపుటంతిమమున
మోక్షలక్ష్మిఁ గచ్చితముగాఁ బొందగలరు ౬

{కొత్తపాళీ}:
ఇక్కడ మధ్యలో ర్మ్య చేరింది గమనించండి సభాసదులు
{గిరిధర్}: పూర్తి కథని చక్కగా చెప్పారు
{నరసింహ}: దాడి చేయబోయి బూడిదైరి -బాగుంది
{రామకృష్ణ}: గంగావతరణ వృత్తము – రంగుగ వివరించిచెప్పె రంజుగ నుండెన్. – పొంగితి మీ రచననుగని – మింగుడు పడనట్టియదియు మీకు సులభమే.
{పుష్యం}: శ్రీవల్లీవల్లభగర్భావాసంబై అంటూ వే’గంగా’ ప్రారంభమై..నెమ్మదిగా గీతాలతో plainsలోకి వచ్చినట్టుగా ఉంది..
{సత్యనారాయణ}: సంస్కృతము మీద మీ పట్టు అద్భుతము
{కొత్తపాళీ}: పుష్యం.. excellent observation. ఈ వర్ణనలో నాకు నచ్చిందేవిటంటే, నిజంగా పురాణం చెప్పినట్టే చివరికి ఫలశ్రుతితో సహా చెప్పేశారు. శెభాష్ రాఘవా.
{చదువరి}: మొత్తం కథంతా చెప్పేసారు! బ్రహ్మాండం!! మాకూ మోక్షాన్ని ఖాయం జేసారు! మూడు దిక్కులఁ బారె ముల్లోకములఁ బారెఁ -!!
{రాఘవ}: మూడు దిక్కులు…. పశ్చిమం, తూర్పు రెండు. మూడు భగీరథుడు తీసుకువెళ్లిన దారి.
{నరసింహ}: బాగున్నాయండి చాలాచాలా.
{కామేశ్వరరావు}: అద్భుతం! చిరు రుచిర కావ్యాన్ని వినిపించారు కదా! ప్రౌఢ నిర్భరంగా ఉంది! ఇంతకీ గంగ హిమవంతునికి కూతురయ్యింది కుమారస్వామి జననాంతరమా?
{కొత్తపాళీ}: కామేశ్వరా, మీరిలాంటి లిటిగేషనులు పెట్టకూడదు. 🙂
{రాఘవ}: కామేశ్వరరావుగారూ, జననానంతరమేనండీ. దేవకార్యం … ఈ దేవసేనాపతిని మోయడం. శ్రీకారంతో మొదలుపెడుతూ, గాంగేయుని తలచుకొని ఆయన గాంగేయుడెలా అయ్యాడో చెప్పి ప్రారంభించాను.
{గిరిధర్}: రాఘవా, అత్యద్భుతం
{రాఘవ}: అమ్మో. ఎంత మాట. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.
{భావకుడన్}: వర్ణననలోనే సమస్యా పూరణ… అద్భుతమైన ఆలోచన.
{కామేశ్వరరావు}: ఈ కావ్యాన్ని గురించి ఎప్పుడైనా తీరుబాటుగా వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తాను, నా బ్లాగులో.
{చదువరి}: కామేశ్వరరావు గారూ, మీ బ్లాగులో “పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్” లోని ఔచిత్యాన్ని కూడా వివరిస్తారని ఆశిస్తున్నా.

{కొత్తపాళీ}: సభాసదులారా, మనం మొదలు పెట్టి మూడు గంటలు దాటింది. ఇంకో నాలుగ్గంటలు కూర్చున్నా ఈ కావ్య మథన ప్రయత్నములో జనించిన అమృతబిందువల్ల్నిటినీ రుచి చూడ్డం సాధ్యం కాదు. అందుచేత, ఇంకొక్క రసవత్తరమైన ఘట్టాని
స్పృశించి ఇంక ఇవ్వాళ్టికి సభ చాలిద్దాము అనుకుంటున్నాను.
{రామకృష్ణ}: ఆంధ్రామృత బిందువులు కదా
{రాఘవ}: రామకృష్ణారావుగారూ… 🙂
{గిరిధర్}: పలు సమస్యలని ఒకే పూరణలో సాధించడం రాఘవ ఇది వరకే చేసిన చక్కటి ప్రయోగము


{రాఘవ}:
పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్సులు.
{రానారె}: ద్రిపథగ అన్నారు?
{గిరిధర్}: రానారె, గంగ త్రిపథగే కదా
{రాఘవ}: మూడు దారులు… త్రిపథగ
{రామకృష్ణ}: ఆకాశము భూమి పాతాళము త్రిపథములందూ సంచరించేది.
{రామకృష్ణ}: తప్పకుండా అలాగే చేయండి.
{గిరిధర్}: రాఘవా, నువ్వు రేపు పెద్ద కవివై నప్పుడు – నీతో మేము ఇలా సభలలో పాల్గొన్నామని చంకలు గుద్దుకోవచ్చు
{రామకృష్ణ}: పెద్ద కవి అయినప్పుడు పలకక పీతే ముక్కు పట్టి నిలతీద్దామ్.
{రానారె}: మరీ ఎత్తేయకండి, చిన్నవాడు. 🙂
{గిరిధర్}: ఎత్తులు లేవు, జిత్తులు లేవు 🙂

{కొత్తపాళీ}: ఆంగ్ల కవులలో పీబీ షెల్లీది ఒక విలక్షణమైన గళం, శైలి. అందులోనూ ఈ ఒజిమాండియాస్ అనే చిన్న సానెట్ చాలా ప్రసిద్ధి చెందినది. నేను బళ్ళొ చదువుకునేప్పుడు, ఏ తరగతిలోనో గుర్తు లేదు గానీ, పాఠ్యాంశంగా ఉండేది ఈ పద్యం
{చదువరి}: కొత్తపాళీ గారూ అది ఇంటరు రెండో యేట ఉండేది
{కొత్తపాళీ}: మా మేష్టారు బహు బాగా చెప్పిన గుర్తు. Half sunk, a shattered visage lies, whose frown And wrinkled lip, and sneer of
cold command,అంటూ ఆయన అభినయం చేసి మరీ ఆ ఒజిమేండియాస్ విగ్రహ ముఖం ఎంత భీకరంగా ఉందో చూపేవారు. మన వారు చాలా మంది దీన్ని అనువదించడానికి ఒకరిని మించిన ప్రయత్నాలు ఒకరు చేశారు.

{పుష్యం}: ఈ Ozamaandiasని మా ఇంగ్లీషు మాష్టారు చెప్పడానికి పడుతున్న కష్టాలు చూసి..మా తెలుగు మాష్టారు ఒకసారి వివరించారు.. అది చూసి మా ఇంగ్లీషు మాష్టారు ఆయన కాళ్ళమీద పడ్డారు..
{రానారె}: అబ్బో! అంత ఘనత ఉందన్నమాట ఓజిమాండియాస్ సానెట్ కు.
{కొత్తపాళీ}: ముందుగా, కృష్ణాత్రేయ అనువాదం.
{కృష్ణ}: చిత్తమ్ సిద్దం

కం||
కలిసితి నేపద చారిని
పలికెను అతనీ విధమున పరికించండీ
“కలిసితి నొకబొంది విరిగి
నిలకడగ శిలన మలవగ నిలిచిన కాళ్ళన్‌
కం||
సగ భాగమిసుక తినగా
పగిలిన శిల్పపు పలుకులు పలు తావులలో
తెగిపడిన తలన ఇంకను
అగుపడె గర్వము పగిలిన అధరపు ముఖమున్‌
కం||
ప్రక్కన్ నిలిచిన ఫలకము
వ్రక్కలు గాకయె మిగిలెను వచించ చరితన్
అక్కడ రాసిన రాతలు
గ్రక్కుతు నిలిచె స్థిరముగ గర్వము నంతన్

కం||
“నే రాజుల్లో రాజును
నే రా జొజిమానుడియసు నేజేసినవే
రారాజూ చేసెరుగడు
తారాధిపుని వలె జగతి తా జూచునులే “

కం||
అటునిటు నేమియు లేదే ?
కటువగు కాలము, పగిలిన కఠినపు శిలలూ
ఎటు చూసిననూ తరగని
తటమెరు గని ఇసు కదిబ్బ తపనన కంటే !!

ధన్యవాదాలు.
{రాఘవ}: ప్రక్కన నిలచిన ఫలకము పద్యం భలే బావుంది. అటునిటు నేమియు లేదే… భలే.
{కొత్తపాళీ}: బాగు బాగు. ఓజిమాండియాస్ పలికిన గర్వపు పలుకులుగా చెప్పిన పద్యం చాలా సహజంగా కుదిరింది
{పుష్యం}: కటువగు కాలము, పగిలిన కఠినపు శిలలూ .. very nice..
{రామకృష్ణ}: చక్కని తేట తేట తెలుగులో వ్రాసినమీ కభినందనలు.
{రాకేశ్వర}: చాలా బాగుంది కృష్ణ గారు
{కామేశ్వరరావు}: బావుందండి!

{కొత్తపాళీ}: అటుపైన కామేశ్వర్రావు గారూ, మీ అనువాదం
{కామేశ్వరరావు}: షెల్లీ … ఛందస్సు లోతులెరిగిన గొప్ప కవి! అతనీ పద్యంలో భాషనీ ఛందస్సుని వాడుకున్న తీరు అమోఘం. దాన్ని అనువాదంలో తెచ్చే ప్రయత్నంలోనే నా తాతలు దిగివచ్చారు. 🙂

తేటగీతి మాలిక||
ఒక పురాతనదేశ యాత్రికుడు వచ్చి చెప్పిపోయెను నాకొక చిత్ర కథను:
అది ఒక యెడారి, మధ్యలో కదలలేని మొండెమూడిన పెను రాతిబండ కాళ్ళు;
ఇసుకలో కూరుకొని ప్రక్కనే పడున్న శకలిత ప్రతిమ ; మోముపై వికట భృకుటి,
పెదవి చిటిలింపు, తడిలేని మదపు చూపు బ్రతికియున్నవి నిర్జీవ వస్తుతతితిని
అచ్చు గ్రుద్దిన రీతి నాహాహ! గుండె లోతులెంతగ చదివెనో! చేతితో వి
డంబనము జేసె మనసార దాని శిల్పి. చప్రముపయి నిటుల శిలాక్షరములుండె,
“రాజ రాజాధిరాజ, మార్తాండ తేజ ఓజిమాండియస్ నామధేయుండ నేను
దిక్సమాశ్లిష్ట మద్భుజాదిష్ట సృష్టి ఇదియె చూడుడు గుండెలు చెదరిపోవ”
చుట్టుప్రక్కల ఏముంది చూచుటకు ? శి థిలములయిన ఆ జీర్ణరాశులను జుట్టి
ఒక మహాశూన్య నిర్జనానంత సుసమ సైకతస్థలి దూరాల దాక పరచి…
{గిరిధర్}: ‘బ్రతికి యున్నవి నిర్డీవ వస్తుతతిని’ బాగు బాగు
{రానారె}: ఎత్తుగడ “అది ఒక యెడారి, మధ్యలో …” వినగానే, “అదియొక రమణీయ పుష్పవన మా వనమందొక మేడ” పద్యము గుర్తొచ్చింది
{రాఘవ}: రాజరాజాధిరాజ మార్తాండతేజ ఓజిమాండియస్ నామధేయుండ… నాకు కైకాల సత్యనారాయణ “యముండ” గుర్తొచ్చిందండీ :)మీరు తాతలు దిగొచ్చారంటూ అనకూడదు కామేశ్వరరావుగారూ 🙂 వికట భ్రుకుటి, పెదవి చిటిలింపు, తడిలేని మదపు చూపు… ఇంత చక్కటి పదాలు వాడాక కూడానా!
{కొత్తపాళీ}: మొండెమూడిన పెను రాతిబండ కాళ్ళు .. ఇది కూడా. తడిలేని మదపు చూపు .. భలె భలె. దిక్సమాశ్లిష్ట మద్భుజాదిష్ట సృష్టి .. పద్యం శైలి అంటే యిది.
{గిరిధర్}: కామేశ్వరరావుగారు, మీరు తాతలు దిగొచ్చారని చెప్పడమే కానీ, పద్యాన్ని భలే లాగించేసారు – మీరు చెప్తే కానీ మాకు తెలియని కష్టాలు మీవి
{కామేశ్వరరావు}: ఈ అనువాదం చాలా రోజులు పట్టిందండీ! చాలా రాత్రులు అనడం ఇంకా సరైనది 🙂 ఔత్సాహికులు తీరిగ్గా ఇందులో ఛందస్సు లోపాలేమైనా ఉన్నాయేమో గమనించండి.

{రామకృష్ణ}:
తేట గీతులు కామేశు మాటలేను
వర్ణనంబది చెప్పగా వలను పడదు.
రచన చూచిన బాగని పలుకవలయు
వందనంబయ మీకభి వందనంబు.

{కొత్తపాళీ}: రాకేశ్వరా, రాకెదవా?
{రాకేశ్వర}: గురాజ్ఞ. … సీసమాలకించండి.
సీ||
ప్రాచీన దేశముఁ జూచి వచ్చినవాడు, వినిపించె మనకొక వింత వినుడి.
ముఖశిల్ప మొక్కటి యొక యెడారిని నిల్చె. చిత్తరువుగద యా శిల్పి నేర్పు
ధీరముగ దెలిపెఁ రారాజు బింకము. ఫలక మొకటి జెప్పె ప్రభువు ఘనత –
“రాజాది రాజును, ఓజిమాండిసనేను, ఘనులల్పు లెల్లరుఁ గట్టడములి
ఆ||
వన్ని నావి గాంచి, భంగపాటుఁ బడుడి”
శిధిలమైన యతని శిల్పముకడఁ
గాంచ నాతురతను కనుపించు మనలకు
కన్ను జూపు మేర కారెడారె!

{రాఘవ}: శిల్పి నేర్పు. ప్రభువు ఘనత. భంగపాటు. కారెడారి. భలే.
{కొత్తపాళీ}: ఇవన్ని నావి గాంచి, భంగపాటుఁ బడుడి” .. బగుంది
{కామేశ్వరరావు}: “చిత్తరువుగద యా శిల్పి నేర్పు” బావుంది!
{పుష్యం}: చాలా బాగుందండీ.
{గిరిధర్}: రాకేశ్వరా ప్రయత్నం అభినందనీయం.
{చదువరి}: కారెడారె – ఇసుక కారిడారె. పద్యం బాగుంది రాకేశ్వరా.
{రానారె}: కారెడారి … వట్టిపోయిన ఎడారిని సూచించడానికి కారెడారి అనే పదం భలే వాడారు 🙂
{రామకృష్ణ}:
రాకేశుని రచన మిగుల
ప్రాకటముగనొప్పి యుండె. ప్రస్ఫుటమగుచున్
లోకుల మెప్పులు తప్పవు
రాకేశా రక్ష నీకు రాకేశుండే.

{కొత్తపాళీ}: రాఘవా, మీ అనువాదం
{రాఘవ}: నేను ఒక రోజులో వ్రాసాను. అందువల్ల అంత బాగుండకపోవచ్చు. ఏదో ప్రయత్నిద్దామనిపించింది. ఇక అవధరించండి.
సీ||
ప్రాక్కాలదేశాలబాటసారి నొకనిఁ గలసితి నతఁడిట్లు తెలిపె నాకు—
ఖండితోర్ధ్వార్ధమై ఘనవిశాలంబైన పదమాత్రమౌ శిల్పభాగ మొకటి
నిలచె నెడారిలో నికటోర్విపై భిన్నమస్తకం బిసుకచే న్యస్త మొకటి
కర్కశామర్షంపు కర్కమౌ యపహాస భంగాధరభ్రూనివాసమైన
తే||
కవళిక లమరము లగుచుఁ గరుగకుండఁ
జెక్కఁబడిన ముఖపు రీతి సెప్పె శిల్పి
రాగభావానుభావానురాగతతుల
గతుల మనసులో మనసుతోఁ గనిన విధము ౧
సీ||
“ఓజిమాండీయాసు రాజాధిరాజును కనుడు నా కార్యాలఁ ఘనతరములఁ
గని విభ్రమముతోడఁ గనులు పెద్దవి చేసి యాశ్చర్యపడకుంటె నడుగుడయ్య”
యని నమ్మకము గర్వమును తొణికిసలాడఁ పల్కెనా యనినట్లు ఫలకమందుఁ
జెక్కఁబడ్డట్టివై శిలపుటక్కరములు స్పష్టీకరించును ప్రౌఢిమలను
తే||
మనిషి కాలప్రకృతిఁ దాటి మసలడనుచుఁ
గేవలానంతసైకతఖిలతలములు
కప్పి కబళించి వేయఁగ ఖ్యాతులన్ని
కాలశైథిల్యగతినొంది కానఁబడవు ౨

{రామకృష్ణ}: రాఘవా! అసదృశ కవితా పాటవము నీకమరింది.
{పుష్యం}: రాగభావానుభావానురాగతతుల — మంచి అలంకారం.
{గిరిధర్}: రాగభావానుభావానురాగతతుల – బావుంది.
{కామేశ్వరరావు}: “ప్రాక్కాల దేశల” “భంగాధర భ్రూ నివాసము” ఇలాటి పదాలు మీదొక ప్రత్యేకమైన ముద్రలా అనిపిస్తున్నాయి! “ఖండితోర్ధ్వార్థమై” కూడా!
{రాఘవ}: ఏం చెయ్యమంటారు చెప్పండి… అలా వచ్చేసింది అంతే.
{రానారె}: సీసంలో కూడా సంస్కృతం దట్టించేస్తాడయ్యా ఈ రాఘవుడు. … ఖ్యాతి కూడా కాలశైధిల్యపు బారిన పడాల్సిందేనా? 🙂
{కొత్తపాళీ}: విశ్వామిత్రులు లోకకార్యములన్నీ పరిష్కరించి ఆలస్యముగా వేంచేసినారు. వారిది మంచి చమత్కార పూరణము దత్తపది విందాము. ఇవ్వాళ్టికి ఇది చివరి పద్యము సభలో.
{పుష్యం}: king of kingsకి ఎవరూ శార్ధూలమో, మత్తేభమో ఎందుకు వాడలేదో??
{రాకేశ్వర}: {పుష్యం}: – నాకు కూడా వృత్తాలైతే గంభీరతను ఇంకా బాగా తెలపగలవనిపించింది కానీ నాకు అవి వ్రాయడం చేతగాదు.
{రాఘవ}: రాగభావానుభావానురాగతతుల… నాక్కూడా నచ్చిందండీ ఈ ప్రయోగం.

{గిరిధర్}: దీన్ని బట్టి ఈ పద్యాన్ని చదివిన ప్రతి తెలుగు వాడికి, ‘రాజాధి రాజ’ తళుక్కుమంటుందని తెలిసిపోయింది. షెల్లి ప్రభావమెంతో, మన పాత సినిమాల ప్రభావమూ అంతే అనుకుంటా.
{కామేశ్వరరావు}: “రాజాధిరాజ” అనే సంస్కృత ప్రయోగం నుండే “King of Kings” అనే ఇంగ్లీషు పదం తయారయ్యిందని అంటారు.
{గిరిధర్}: కామేశ్వరరావు గారు, తెలియజెప్పినందుకు ధన్యవాదాలు

{కొత్తపాళీ}: విశ్వామిత్ర మహర్షీ .. వారేవా, తూరేతూ, పీరేపీ, జారేజా .. ఈ పదాలతో ప్రస్తుత రాజకీయుల సంభాషణా చతురత
{విశ్వామిత్ర}:
శా||
వారేవారికిసాటితిట్టుకొనగావాగ్యుద్ధముల్బూనియే
తూరే,తూరటువారిదేయనకనేదూరేటిగుర్విందలే
జారే,జాతికిగారవమ్ము,సభకున్,చాలీయపఖ్యాతి,బం
పీ,రేపీఘననేతలందఱను,క్ష్మా,పేర్మీంగొనౌ,మీరలే.

{కామేశ్వరరావు}: విశ్వామిత్రా మీ పూరణ “వారేవా”!
{రానారె}: వారేవా
{రాఘవ}: ఇదిగోనండీ శార్దూలం… వాహ్.
{చదువరి}: వారేవా!
{రామకృష్ణ}: విశ్వామిత్రులు చక్కగా పూరించారు
{కామేశ్వరరావు}: దత్తపదాలు విరచడంలో ఉన్న అందమంతా చూపించారు!
{రాకేశ్వర}:
కం||
వారేవా మీ చక్కని
పూరణ మాకు గలిగించె పూర్త్యానందం
తూరేతూ పీరేపీ
జారేజాలను మా సొబగుగ జార్చిరి కవితన్.

{విశ్వామిత్ర}: నెనరులండీ
{రాఘవ}: భలే రాకేశ్వరా.
{కామేశ్వరరావు}: రాకేశులీ రోజున ఆశ్వేశులైపోయారు!
{కొత్తపాళీ}: కందేశుడైనాడనుకున్నానే? 🙂
{రాకేశ్వర}: రామకృష్ణమాస్టారి చలవ. మొన్నరోజు నాచే ఆశుగా చెప్పించారు, అప్పటినుండి కాస్త ధైర్యం వచ్చింది 🙂

{నరసింహ}: అందరికీ ధన్యవాదాలు.కృతజ్ఞతలు.ఉంటాను మరి.కొత్తపాళీ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు.

{రామకృష్ణ}:
కం||
మంగళకరమగు కవులకు
మంగళకరమగుత భువికి మంగళములు. సన్ –
మంగళకరుడగు హరికిని
మంగళములు కొత్తపాళి మహనీయునకున్.

అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.
స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ|
మహిం మహీశాః. లోకాః సమస్తాః సుఖినో భవంతు||
స్వస్తి.

{పుష్యం}: కొత్తపాళీ గారూ.. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ.. సమస్యను ఎవరూ ముట్టలేదా.. అందరూ నాలాగే పెళ్ళయివాళ్ళనుకుంటా 🙂
{కొత్తపాళీ}: లేదు లేదు
{విశ్వామిత్ర}: మిగతా ముగ్గిర్తో కలిపితే మేనక ఒప్పుకోదని నే ముట్టుకోలేదు
{భావకుడన్}: హ హ్హ హ్హ 🙂
{చదువరి}: విశ్వామిత్ర: 🙂 🙂
{పుష్యం}: విశ్వామిత్రా 🙂
{రానారె}: విశ్వామిత్రుల ముద్ర ఇంకా పడలేదేమా అనుకుంటున్నాను. మొత్తానికి మేనకను హర్మ్యవిహారానికి తీసుకుపోతున్నారు తమతో. 🙂
{కొత్తపాళీ}: విశ్వామిత్ర, అవు గదా, అట్లాంటి పన్లు జేస్తే త్రిశంకు స్వర్గమే గతి! 🙂
{విశ్వామిత్ర}: 🙂
{చదువరి}: చివర్లో నవ్వులు వెల్లివిరుస్తున్నాయి!
{కామేశ్వరరావు}: 🙂
{రామకృష్ణ}:
కం||

మంగళకరమగు కవులకు
మంగళకరమగుత భువికి మంగళములు సన్
మంగళకరుడగు హరికిని
మంగళములు కొత్తపాళి మహనీయునకున్.

{కొత్తపాళీ}: చెయ్యి తిరిగిన, తిరగని, తిరిగించుకుంటున్న కవులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్దలు రామకృష్ణారావుగారికి, ఎంతో అనుభవజ్ఞులై ఉండి, మా ఈ చిన్న ప్రయత్నంలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా
యువకవులందిరినీ ఉత్సాహపరుస్తూ … వారి చొరవ మాకు ఎప్పుడూ స్ఫూర్తి.
{రామకృష్ణ}: 🙂
{కామేశ్వరరావు}: సభని రక్తికట్టించిన అందరికీ హృదయపూర్వక అభివందనాలు.
{రానారె}: ఈసారి పద్యాల్లో నాణ్యం చాలా పెరిగింది.
{కొత్తపాళీ}: ఇది మూడవ కవి సమ్మేళనం. రెండవ ఉగాది సమ్మేళనం. ఇది ఒక సంప్రదాయం కావాలని నా ఆశ, కోరికానూ
{భావకుడన్}: మాలాటి ఔత్సాహికులను కూడా ఆహ్వానించి ఆదరించినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు….
{కామేశ్వరరావు}: ఇంతమంది పద్యాల అభిమానులతో యిలా యిన్ని గంటలు ముచ్చటించడం ఎంతో సంతోషంగా ఉంది.
{నరసింహ}: అందరికీ ధన్యవాదాలు.కృతజ్ఞతలు.ఉంటాను మరి.కొత్తపాళీ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు
{కొత్తపాళీ}: నా సామర్ధ్యమ్మీద నమ్మకముంచి మరోసారి ఈ బాధ్యత నాకప్పగించి ఈ అవకాశం ఇచ్చిన పొద్దు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు

{రాఘవ}:
తే||
ప్రజకును ప్రజలం బాలించే ప్రభువులకును
గోవిదులగు విప్రులకును గోవులకును
కవిగణములకును శుభము గలుగుఁగాత
స్వస్తి యీ భువనవిజయ సభకు జయము

{కొత్తపాళీ}:
రాఘవ, భలే!
{పుష్యం}: అందరికీ ముఖ్యంగా కొత్తపాళీకి నెనరులతో…
{కృష్ణ}: మాలాంటి వారిని ఆహ్వానించి.. అవకాశమిచ్చినందుకు కొ.పా. గారికి ధన్యవాదాలు

{కొత్తపాళీ}: వేదిక నిర్వహించిన వీవెనునకు ప్రత్యేక హార్దికాభినందనలు
{కొత్తపాళీ}: నా స్వస్తి వచనం (ఐ మీన్ పద్యం)
ఆ||
అంతరంగమందు ఆలోచనలు నింపి
మేలు సేయ మనల మేలు కొలుపు
నూత్న వత్సరమ్ము నూర్లు వేలుగ నిచ్చు
శుభము శాంతి మీకు సుఖము జయము
{కొత్తపాళీ}: ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. శెలవు.
(సమాప్తం)

Posted in కవిత్వం | Tagged | 5 Comments

మంచినీళ్ళ బావి

-అరిపిరాల సత్యప్రసాద్

తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గడ గడా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి గట్టు మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎవరైనా మర్చిపోయినా అక్కడే పెద్ద బాడిసె పెట్టుకొని కూర్చున్న సాంబయ్యో, గట్టు పక్కన బండపైన పులి జూదం ఆడుతున్న బసవయ్యో ఒక చురకేసేవాళ్ళు –

“ఏరా.. ఇంకొకళ్ళు తోడిన నీళ్ళు తాగినోడివి.. నీ తరవాత వచ్చేవాళ్ళకి ఒక చేద తోడి పెట్లేవంట్రా.. ఒక్క చేదకేమైనా నీ ఒళ్ళు అరిగిపోతుందా” అనేవాళ్ళు.

ఎన్నో ఏళ్ళ క్రిందటి మాట. మా వూరిమధ్యలో శివాలయాన్ని ఆనుకోని ఒక పెద్ద మంచినీళ్ళ బావి ఉండేది. ఎప్పుడో రాజుల హయాంలో కట్టించిన ఆ బావి దాదాపు వూరు మొత్తానికి నీళ్ళు అందించేది. నాలుగు వైపులా నాలుగు గిలకలు రోజంతా కిలకిలమంటూ కళకళలాడుతుండేది. తెల్లవారుఝామున ఏ నాలుగింటికో శివాలయం పూజారి దక్షిణామూర్తిగారు బావిని నిద్రలేపి చన్నీళ్ళ స్నానం చేసి, తడిగుడ్డతో నాలుగు బిందెలు మడినీళ్ళు పట్టుకోని రుద్రం నమకం చదువుకుంటూ గుళ్ళోకి నీళ్ళు మోసుకెళ్ళేవారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బ్రాహ్మణవీధి ఆడంగులంతా దక్షిణామూర్తిగారి స్నానం అయ్యేదాక ఆగి, ఆ తరువాత ఏ వచనరామాయణమో పాడుకుంటూ బావికి పసుపు అద్ది, బొట్లు పెట్టి, గిలకలమీద చేదలేసేవారు. ఇక అక్కడినించి ఆ బావి చలివేంద్రంలా రోజంతా జలదానం చేస్తూనే వుండేది.

కొంచెం తెలవారుతుండగా ఆడవాళ్ళ వరస మొదలయ్యేది. కులం ప్రాతిపదికన వేళల్లో మార్పులుండేవిగాని ఫలానా కులం వాళ్ళు నీళ్ళు పట్టుకోకూడదని ఎవ్వరూ అనేవారు కాదు. అప్పుడే నిఖా అయ్యి మా వూరు వచ్చిన నూర్‌జహాన్, బిందెతో అక్కడికి వచ్చి నీళ్ళు తోడుకోడానికి వెనకా ముందు ఆడుతుంటే సెట్టెమ్మగారు చూసి –

“ఏమ్మా కొత్త కోడలా.. అట్టా ఒక అడుగు ముందుకి రెండడుగులు వెనక్కి వేస్తే ఇంక ఇంటికి నీళ్ళు చేర్చినట్టే.. రా, నేను తోడి పెడతాను..” అంటూ వద్దన్నా వినకుండా బిందె నిండా తను తోడుకున్న నీళ్ళు పోసి పంపేది. “కొత్త కోడలుకదా నీళ్ళబావి దగ్గర ఎక్కువసేపు వుంటే ఆ అత్తగారు ఏం సాధిస్తుందో.. పోనీలే పాపం ఒక్క బిందె నీళ్ళిస్తే మాత్రం ఏం పోతుంది” అనేది మిగతా ఆడంగులతో. బావిలో నీళ్ళు నవ్వుతూ సుడులు తిరిగేవి.

తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే, అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గటగటా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి, గట్టు మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎవరైనా మర్చిపోయినా అక్కడే పెద్ద బాడిసె పెట్టుకొని కూర్చున్న సాంబయ్యో, గట్టు పక్కన బండపైన పులి జూదం ఆడుతున్న బసవయ్యో ఒక చురకేసేవాళ్ళు –

“ఏరా.. ఇంకొకళ్ళు తోడిన నీళ్ళు తాగినోడివి.. నీ తరవాత వచ్చేవాళ్ళకి ఒక చేద తోడి పెట్లేవంట్రా.. ఒక్క చేదకేమైనా నీ ఒళ్ళు అరిగిపోతుందా” అనేవాళ్ళు.

చాలాకాలం ఇలాగే ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ వుండే వూరిజనం మధ్య, నెమ్మదిగా గొడవలు మొదలయ్యాయి. అప్పటిదాకా అక్కచెల్లెళ్ళలా కలిసి నీళ్ళు తోడుకునే ఆడవాళ్ళు ఆడపడుచుల్లా గిల్లి కజ్జాలు పెట్టుకోసాగారు. తెల్లవారుఝామునే వచ్చే ఆడవాళ్ళు ఎప్పుడన్నా ఆలస్యంగా వచ్చి మణ్ణీళ్ళు తోడుకోవాలంటే మిగిలిన వాళ్ళు అడ్డు తప్పుకునేవాళ్ళు కారు.

“నీ వేళలో నువ్వు రాకుండా మమ్మల్ని తప్పుకోమంటావేంది?” అనేవారు.

నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నారు. మాట మాటా పెరిగినాయి.

“ఇది శివాలయం బావి.. బ్రాహ్మల బజారులో వుంది.. మిగిలిన వాళ్ళు ఎవరూ ఇక్కడ నీళ్ళు తీసుకోను వీల్లేద”ని తీర్మానం చేశారు.

“బావులు, నీళ్ళు ఒకళ్ళ సొత్తవడానికి వీల్లేద”ని మిగిలిన జనం తిరగబడ్డారు. ఆ తరువాత కొంత గొడవ జరిగి ఇట్లా తేలేది కాదని వూరికి మరో పక్క పోలేరమ్మ చెట్టు దగ్గర ఇంకో బావి తొవ్వించారు. మిగిలిన కులస్తులంతా అక్కడికి వెళ్ళి నీళ్ళుతోడుకోవడం మొదలెట్టారు. ఆ తరువాత చిత్రంగా శివాలయం బావి నీళ్ళ రుచి మారటం మొదలైంది. చెరకు రసంలా తియ్యగా వుండే నీళ్ళు చప్పంగా మారిపోయాయి… కొంచెం కొంచెంగా ఉప్పెక్కడం మొదలైంది. అయినా అక్కడి పెద్ద కులాల ఆడంగులంతా అవే నీళ్ళతో కాలం గడుపుతున్నారు. అక్కడి నీళ్ళు తాగడానికి చాలా మంది వెనకాడటంతో నీళ్ళు తోడిపెట్టే పని తప్పింది జనానికి. పెద్ద బాడిసెతో పెద్ద పని జరగట్లేదని సాంబయ్య అక్కడే ఒక సోడా కొట్టు పెట్టుకున్నాడు. ఆ బావి మాత్రం పెద్ద బొట్టు పెట్టుకున్న ముత్తైదువులా చేతనైనంతవరకు జలదానం చేసేది.

ఇక్కడ పోలేరమ్మ చెట్టు దగ్గర కొత్తగా కట్టిన వొరల బావేమో అప్పుడే చీరకట్టడం నేర్చిన కుర్ర పిల్లలా వుండేది. అక్కడ నీళ్ళు చెరకురసంలా కాకపోయినా చక్కెరనీళ్ళలాగా బాగుండేవి. బావి గట్టున చెట్టు మీద కొన్ని పావురాళ్ళు కాపురం వుండేవి. ఆడంగులు నీళ్ళు తోడుకోని వెళ్ళిపోయాక అవి చిన్నగా దిగి వచ్చి, గట్టు మీద బిందెలు పెట్టి పెట్టి పడ్డ గుంటల్లో నీళ్ళు నిలిస్తే ఆ నీళ్ళు తాగుతూ కువ కువ కబుర్లు చెప్పుకునేవి. కొంతకాలం అట్లా గడిచింది.

ఒకరోజు పోలేరమ్మ బావిదగ్గరా ముసలం పుట్టింది. “నేను ముందు నీళ్ళు తోడుకుంటుంటే కోపంతో నీళ్ళలో చెన్నమ్మ వుమ్మేసింది” అని నూకాలు అన్నది.

“ముందొచ్చింది నేను.. నువ్వెట్టా తోడుకుంటాయే.. నీళ్ళు..” అని చెన్నమ్మ అరిచింది.

నూకాలుకి మా చెడ్డ కోపంవచ్చింది. చెన్నమ్మ జుట్టు పట్టుకోని వంచి బిందెతో బాదింది. ఇద్దరూ కిందపడి దొర్లారు.. బూతులు తిట్టుకున్నారు, దుమ్మెత్తి పోసుకున్నారు. విషయం తెలుసుకోని ఆ ఇద్దరి మొగుళ్ళు కర్రలతో కొట్టుకున్నారు. ఇద్దరి రక్తం బావి గట్టుమీది గుంటల్లో పడింది. అది చూసిన పావురాళ్ళు ఆ వూరు వదిలి వలసెళ్ళిపోయాయి. చాలామంది ఆ రోజు నీళ్ళు తోడుకోకుండానే ఇంటికెళ్ళిపోయారు.

వలసలెళ్ళిన పావురాళ్ళు తిరిగిరాలేదు. కొన్ని రోజులకి ఏదో మంత్రం వేసినట్టు పోలేరమ్మ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు ఎండిపోయిన నాలుగు రోజులకే ఆ బావిలో పురుగు పడింది. గుర్రపు డెక్క ఆకు వేస్తే నీళ్ళు బాగుపడతాయని ఎవరో అంటే అందులో ఆ ఆకు వేశారు. అది పెరిగి పెరిగి బావంతా పాకింది. బావి ఒరల గోడలకి నాచు పట్టింది. ఆ నీళ్ళు కూడా తాగడానికి పనికిరాకుండా పోయాయి.

దాంతో వూరంతటికి మంచినీళ్ళ బావి లేకుండాపోయింది. వూర్లో ఆడవాళ్ళంతా బిందెలు చంకన పెట్టుకోని నాలుగు మైళ్ళు నడిచివెళ్ళి వాగులో నీళ్ళు నింపుకొచ్చేవాళ్ళు. సోడా కొట్టు సాంబయ్య తమ్ముడు రాములు కావిడి కట్టి వూర్లోకి నీళ్ళు మోసుకొచ్చేవాడు. బిందెకు రూపాయి చొప్పున తీసుకునేవాడు. సాంబయ్య వ్యాపారం కూడా వూపందుకుంది. అప్పుడే బస్సు దిగిన పొరుగూరోళ్ళు, శివాలయం చూడటానికి వచ్చే భక్తులు బావిలో వుప్పు నీళ్ళు తాగలేక సాంబడి సోడాలతోనే సెదతీరేవారు. కొంతకాలానికి సాంబయ్య సోడా మిషను కూడా పెట్టాడు.

కొన్నేళ్ళు ఇలాగే గడిచాయి. వూర్లో డబ్బున్నవాళ్ళు మంచినీటి ఎద్దడి తట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించారు. బావులు తొవ్విస్తే బండలు అడ్డంపడుతున్నాయే కానీ నీళ్ళు పడటంలేదు. పట్నం నించి బోరు లారీలని పిలిపించి ఇళ్ళలో బోర్లు వేయించాలని కూడా చూశారు. ఎక్కడ వేసినా ఉప్పు నీళ్ళేకాని మంచి నీళ్ళు తగలట్లేదు.

శివాలయంలో శివుడికి వుప్పునీళ్ళ అభిషేకమే చేసేవారు దక్షిణామూర్తిగారు.

“శివుడి ఆజ్ఞ లేదు.. ఆ గంగమ్మను వదలటంలేదు.. ఏ భగీరథుడో మళ్ళీ రావాలి..” అనుకునేవాడు ఆయన.

***

తెల్లవారేసరికి బావిలో నీళ్ళు..!! నీళ్ళంటే నీళ్ళుకాదు.. లేత కొబ్బరిపాలు వున్నట్టున్నాయి..!! వూరంతా వరదలా పరుగెత్తుకొచ్చారు. ఆ నీళ్ళు తాగారు.. ఒకరి మీద ఒకరు చల్లుకున్నారు.. ఆ వూరికి జలదానం చేసిన గోపాలయ్యకు, జానకమ్మకు దణ్ణాలు పెట్టారు. అప్పటి నుంచి అది జానకమ్మగారి బావి అయ్యింది.

గోపాలయ్య అనీ, శివాలయం పక్కవీధిలోనే వుండేవాడు. వూరిలో వచ్చిన మంచినీటి కరువు చూసి చాలా బాధపడ్డాడు. శివాలయంలో శివుడికి దణ్ణం పెట్టి –

“పరమేశ్వరా ఏదైనా మార్గం చూపించు స్వామీ..” అంటూ మొక్కాడు.

ఇంటికి తిరిగి వస్తూ దారిలో నీళ్ళ బిందెలు మోస్తున్న ఆడవాళ్ళని చూసి వుస్సురని నిట్టూర్చాడు. ఆయన ఇంట్లోకి రాగానే జానకమ్మగారు ఎదురొచ్చి చేతిలో సంచీ, భుజం మీద కండువా అందుకుంది. తీరిగ్గా కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చాక చెప్పుకొచ్చింది-

“మన ఇంటికి ఎలాగూ ప్రహరీ కట్టించాలని అనుకుంటున్నాము కదా.. ఆ ఆగ్నేయం మూల, స్థలం ఎట్లాగూ వదిలిపెట్టాలి.. ప్రహరీ అవతల, పోనీ ఒక బావి తొవ్వించే ప్రయత్నం చెయ్యకూడదూ.. నీళ్ళు పడితే వూరికి మంచి చేసినవాళ్ళమౌతాము.. పది మందికి మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం ఎన్ని దేవుళ్ళకు మొక్కితే వస్తుంది చెప్పండి..” అంది.

జానకమ్మగారి ఆలోచన వినగానే సంతోషంతో ఆయన ముఖం వెలిగిపోయింది. చటుక్కున లేచి.. ఆమె చేతిని గట్టిగా పట్టుకోని, చిన్నగా నొక్కి, ఒక చిరునవ్వు నవ్వాడు. ఆమె కండువా చేతికిచ్చింది. అంత ఎండనూ లెక్కచెయ్యకుండా గోపాలయ్య కరణంగారింటికి బయలుదేరాడు.

ప్రహరీ సంగతి పక్కన పెట్టి, ముందు బావి తొవ్వించాలని సంకల్పించాడు గోపాలయ్య. మంచినీళ్ళు ఎక్కడపడతాయో మంత్రం వేసి చెప్పగలిగిన కేశవాచార్యులు పెదవి విరిచి,

“లాభం లేదయ్యా.. వుత్త బండ తప్ప అసలు నీళ్ళు పడే మార్గమే లేదు” అంటూ తేల్చేశాడు. దాంతో పంచాయితీ పెద్దలు డబ్బు సాయం చెయ్యమన్నారు. గోపాలయ్య నీరసపడి ఇంటికొచ్చాడు.

ఆ రాత్రి జరిగింది విని జానకమ్మ ఎంతో నొచ్చుకుంది. “బండే పడుతుందో.. గంగే పడుతుందో.. ప్రయత్నిస్తే తప్పేముంది..? వాళ్ళేమనుకుంటే మనకెందుకు, మన స్థలం అది. మనం అనుకున్నట్టే చేద్దాం” అని ప్రహరీ ఖర్చుకి తీసిపెట్టిన డబ్బులు గోపాలం చేతిలో పోసింది.

మర్నాడే పని ప్రారంభమైంది. జానకమ్మ, గోపాలయ్య అందరు దేవుళ్ళకి మొక్కుకోని నలుగురు కూలీలతో తొవ్వడం మొదలు పెట్టారు. వూర్లో జనమంతా గోపాలయ్యని పిచ్చివాడన్నారు.

“మన కేశవాచారి నీళ్ళు పడవంటుంటే.. ఎందుకురా నీకీ పిచ్చి ఆరాటం..” అని ఎద్దేవా చేశారు.

వాళ్ళిద్దరు మాత్రం ఏ మాత్రం వెరవలేదు. ఒక కూలి ఖర్చు మిగిలినా మిగిలినట్టే అని గోపాలయ్య కూడా ఒక పలుగు పట్టాడు. జానకమ్మ కూలివాళ్ళందరికి అన్నం వండి వార్చేది. చల్లటి మజ్జిగ ఇచ్చేది.. ధనియాల కాఫీ పెట్టేది. ఖాళీ వుంటే మట్టి తట్టలు అందుకునేది. పది రోజులు తొవ్వారు. ఎక్కడా నీటి జాడ కనపడలేదు.

ఆ రోజు రాత్రి గోపాలయ్య చాలా మథనపడ్డాడు.

“పరమేశ్వరా.. ఇంక నా చేతిలో చిల్లిగవ్వలేదు.. ఊరికి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇక నీదే భారం” అనుకున్నాడు. జానకమ్మ నవ్వుతూ తన నగలు తెచ్చి ఇచ్చింది.

మరి జానకమ్మ మంచితనం చూసి కరిగాడో, గోపాలయ్య మొరనే విన్నాడో, ఆ పరమేశ్వరుడు గంగను వదిలిపెట్టాడు. తెల్లవారేసరికి బావిలో నీళ్ళు..!! నీళ్ళంటే నీళ్ళుకాదు.. లేత కొబ్బరిపాలు వున్నట్టున్నాయి..!! వూరంతా వరదలా పరుగెత్తుకొచ్చారు. ఆ నీళ్ళు తాగారు.. ఒకరి మీద ఒకరు చల్లుకున్నారు.. ఆ వూరికి జలదానం చేసిన గోపాలయ్యకు, జానకమ్మకు దణ్ణాలు పెట్టారు. అప్పటి నుంచి అది జానకమ్మగారి బావి అయ్యింది.

వూరి జనమంతా మళ్ళీ ఒక బావిలో నీళ్ళు తోడుకోవడం మొదలు పెట్టారు. కావడి రాములు ఈ బావి నీళ్ళే తీసుకోని వూరిలో పెద్దవాళ్ళకి పోసేవాడు. రూపాయికి రూపాయి ఎక్కువడిగినా కాదనేవాళ్ళు కాదు. గోపాలయ్య ఇంట్లోకి వస్తూ పోతూ గిలక చప్పుడు విని వేదమంత్రం విన్నట్లు తలవూపేవాడు. జానకమ్మ బావి పక్కనే తులసి చెట్టు నాటింది.. ఆ పక్కనే ఒక వేపచెట్టు, రావి చెట్టు కలిసి పుట్టుకొచ్చాయి. ఆ చెట్లకు నీళ్ళు తోడి పోసి బిడ్డల్లా పెంచుకుంది.

కాలం తిరిగింది. జానకమ్మ పురుడు పోసుకోడానికి పుట్టింటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ వూరందరికీ తులసి కోటలో చెంబెడు నీళ్ళు పొయ్యమని చెప్పింది. పండంటి మగబిడ్డని కన్న తరువాత, చూడవచ్చిన గోపాలయ్యతో “బారసాల మనింట్లోనే జరగా” లని పట్టుబట్టింది. అన్నట్టుగానే ఇరవై రోజుల పిల్లాడిని తీసుకోని ఎడ్లబండి కట్టించుకోని తిరిగివచ్చింది. రామచంద్రుడని పేరు పెట్టుకున్నారు. సాయంత్రం వుయ్యాలలో వేసేముందు బావికి పూజ చేసింది. ప్రేమగా ఆ బావి నెమిరింది. పసుపుతో గుండ్రంగా రాసి, కుంకుమ బొట్లు పెట్టింది. రావి, వేప చెట్ల చుట్టూ తిరిగింది. తులసి చెట్టు పాదులో నీళ్ళుపోసి “అమ్మా నా పసుపు కుంకుమలు పదికాలాలపాటు నిలుపు తల్లీ” అంటూ మొక్కుకుంది.

ఆ మర్నాడు గోపాలయ్య చెట్లపాదులు సవరిస్తూ పైకి చూస్తే రావి చెట్టు మీద రెండు పావురాలు కనిపించాయి. ఆయన జానకమ్మను కేకేస్తే ఆమె బయటకు వచ్చి వాటిని చూసి, బావి దగ్గరకు వెళ్ళి ఒక చేదడు నీళ్ళు తోడి అక్కడ పెట్టింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళినట్లే వెళ్ళి తలుపు చాటు నించి తొంగి చూసారు. రెండు పావురాళ్ళు బావి గట్టు చేరి ఆ నీళ్ళు తాగి కువ కువల కబుర్లు మొదలు పెట్టాయి. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోని తృప్తిగా నవ్వుకున్నారు.

***

రామచంద్రుడు పెరిగి పెద్దవాడౌతున్న కొద్దీ ఆ వూరు నీటి ఎద్దడి సంగతి మర్చిపోయింది. జానకమ్మగారి బావి మినహాయించి ఆ వూరిలో ఏ బావిలోనూ మంచి నీళ్ళు పడనేలేదు. ఒకవేళ పడ్డా ఆ రుచి మరిగినవాళ్ళు తాగడానికి మాత్రం జానకమ్మగారి బావినుంచే నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఎండకాలం వస్తే నాలుగు మైళ్ళ అవతలున్న వాగుతో సహా అన్నిచోట్లా నీళ్ళు ఎండిపోయేవి. శివాలాయం బావికూడా అందుకు మినహాయింపు కాదు. దక్షిణామూర్తిగారు తూర్పు వాకిలి నుంచి నీళ్ళు తేవడం మానేసి వుత్తర గోపురం గుండా వెళ్ళి జానకమ్మగారి బావి నుంచే నీళ్ళు తెచ్చేవాడు. సోడా కొట్టు సాంబడు వయసు మీదపడ్డాక కొట్టు మూసేసి పట్నంలో తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు. కావిడి రాములు ముసలివాడై నీళ్ళు మొయ్యలేక ఇంటి పట్టునే వుంటున్నాడు. కొన్నేళ్ళు అలా గడిచాయి.

రామచంద్రుడికి పన్నెండేళ్ళ వయసులో జానకమ్మగారికి జబ్బుచేసింది. గోపాలయ్య అహర్నిశలు దగ్గరుండి ఆమెకు సపర్యలు చేసాడు. అయినా ఫలితం లేకపోయింది. మరో రెండేళ్ళకి ఆమె కన్నుమూసింది. ఉన్నా లేకపోయినా ఆమెను వూరంతా దేవతలానే చూసింది. ఆఖరి చూపులకి కులం మతం తేడాలేకుండా అందరు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. బావి గట్టునే ఆమెకు స్నానం చేయించి, నిండు ముత్తైదువలా అలంకరించి సాగనంపారు. గోపాలయ్యకు మరో పదేళ్ళ వయసు మీదపడ్డట్టైంది. అయినా బాధను దిగమింగుకోని రామచంద్రుణ్ణి పెద్దవాడిని చేశాడు. రామచంద్రుడు అదే వూర్లో డైరీలో వుద్యోగంలో చేరి గోపాలయ్య కళ్ళెదుటే వున్నాడు.

ఒకరోజు పట్నంలో వ్యాపారం చేసుకుంటున్న సోడా సాంబయ్య కొడుకు కుమారస్వామి ఆ వూర్లో దిగబడ్డాడు. నేరుగా డైరీకి వెళ్ళి రామచంద్రుడితో మంతనాలు జరిపాడు. ఇద్దరి మధ్యా ఏం మాటలు జరిగాయో తెలియదుగాని మరో రెండురోజులకి రామచంద్రుడు జానకమ్మ బావిలో మోటరు బిగించాడు.

“నాయనా రాముడూ..ఎందుకురా ఈ మోటరు అదీ.. బావి ఎప్పుడో వూరికిచ్చేశాము.. వాళ్ళే చూసుకుంటారు” అన్నాడు గోపాలయ్య.

“ఈ బావి వూరిదికాదు.. ఆ స్థలం మనది, బావి మనది.. మీరు అనవసరంగా కల్పించుకోవద్దు..” అన్నడు రాముడు దురుసుగా. అంతేకాని అసలు సంగతి చెప్పనేలేదు.

మర్నాడు తెల్లవారుఝామునే పట్నం నుంచి నాలుగు ట్యాంకరు లారీలు వచ్చాయి. వాటి హారను మోతలకి వూరంతా వులిక్కిపడి లేచింది. గిర్రున తిరిగింది.. వచ్చిన నీళ్ళను ట్యాంకర్లకు పట్టుకున్నారు. ఆ మోటారు చప్పుడుకి రావిచెట్టుమీద వున్న పావురాలు చప్పుడు చేసుకుంటూ ఎగిరిపోయాయి. నీళ్ళు నింపుకున్న ట్యాంకర్లు చల్లగా వూరుదాటాయి.

విరిగిన గిలకని, ఆయన చేతిలో వున్న చేదను చూస్తే అందరి మనసు చివుక్కుమంది. చేదతీయబోతే అందులో మురికి నీళ్ళు కనపడ్డాయి. బావిలోకి తొంగి చూశారు –

“బావిలో నీళ్ళు లేవు..” ఎవరో అరిచారు..

గోపాలయ్య ఎంతో బాధపడ్డాడు. వూరంతా ఇంటి ముందు చేరి రాముడికి నచ్చ చెప్పాలని చూశారు. వాడు ససేమిరా అన్నాడు..

“ఏమిటండీ మీ అజమాయిషీ.. ఇది మా బావి.. మా ఇష్టం.. ఒక్కొక్క ట్యాంకరుకి ఆరొందలు ఇస్తారు.. ఎంత లేదన్నా నెలకి వేలల్లో లాభం.. వూరకొచ్చే డబ్బు.. నేనొదులుకోను” అన్నాడు.

“మోటర్లతో లాగితే నీళ్ళు తగ్గుతాయి.. వూర్లోవారందరికీ కరువొస్తుంది” అన్నాడోక పెద్దమనిషి.

“అసలు మా బావిలో మీరు నీళ్ళు తోడుకోవడం ఏమిటి.. పట్నంలో నీళ్ళతో ఇంత వ్యాపారం జరుగుతుంటే వూరందరికీ వూరకే నీళ్ళు ఇవ్వడానికి నేనేమైనా పిచ్చోడినా? అసలు మీరెవ్వరూ రేపటినుంచి నీళ్ళు తోడుకోవడానికి లేదు. ఈ రోజే బావిపైన ఇనపగేటు వేయించి తాళం వేస్తాను..” అన్నాడు. అన్నంత పనీ చేశాడు వాడు.

గోపాలయ్య ఎంతో మథనపడ్డాడు.

“పది మందికి మంచినీళ్ళు ఇస్తే ఆ పుణ్యం ఎన్ని దేవుళ్ళకు మొక్కినా రాదురా.. ఆ బావి తొవ్వడానికి మీ అమ్మ తన నగ నట్రా కూడా ఇవ్వడానికి సిద్ధపడింది..” అంటూ బ్రతిమాలాడు.

“ఇప్పుడుమాత్రం ఏమైంది.. పట్నంలో ఎంతోమందికి మన నీళ్ళు వుపయోగపడుతున్నాయి.. వాళ్ళు ఇవ్వగలరు కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాము.. ఇందులో మాత్రం పుణ్యం రాదని ఎవరన్నారు..” అంటూ వితండవాదం చేశాడు రాముడు.

ఆ రోజునించి ట్యాంకర్లు వస్తూనే వున్నాయి. వూరి జనమంతా మళ్ళీ వాగు వైపు నడకసాగించారు. ఏ అమ్మలక్కలు ఒక చోట చేరినా “జానకమ్మ మనసుకి ఇట్టాటి కొడుకు పుట్టాడే” అని చెప్పుకున్నారు. ఎక్కడ నలుగు మొగవాళ్ళు చేరినా “నలుగురి మంచి ఆలోచించే గోపాలయ్య ఎక్కడ ఈ రామచంద్రుడు ఎక్కడ” అని తిట్టుకున్నారు.

గోపాలయ్య చెవిన ఇవన్నీపడ్డాయి. బాధతో కుమిలిపోయాడు.. మంచాన పడ్డాడు.. నిద్రలోను, మెలకువలోనూ జానకమ్మను పలవరించాడు. ఒకరాత్రి వోపిక చేసుకోని బావి దగ్గరకు వెళ్ళాడు. బావి చుట్టూ తిరిగాడు, రావి చెట్టును నెమిరాడు. తులసి చెట్టుకు నీళ్ళు పోద్దామంటే బావి దగ్గర చేదలేదు. చేద వేసేందుకు అవకాశంలేకుండా ఇనప వూచలు అడ్డంపెట్టివున్నాయి. తన బలమంతా వుపయోగించి లాగాడు. కొద్దిగా కదిలింది. ఇంట్లో రాముడు దాచిపెట్టిన తాళంచెవి తెచ్చి తెరిచాడు. కష్టపడి చేద దించాడు. నీళ్ళు తోడాడు.. తులసి మొదట్లో నీళ్ళు పోసాడు. నీళ్ళు బురద బురదగా వున్నాయి. రుచి చూసాడు.. మునుపటి రుచి లేదు. ఇంతలో చేద గిలక మీదనించి జారింది. ఆయనా కూలబడ్డాడు. ఇరుసు విరిగి గిలక ఒక పక్కకి వొరిగిపోయి చెరిగిన తిలకంలా వుండిపోఇంది. గోపాలయ్య కూడా అలాగే వొరిగిపోయాడు…మళ్ళీ లేవలేదు.

తెల్లవారాక ట్యాంకర్లు వచ్చాయి. నీళ్ళు పట్టాలని మోటరెయ్యడానికి లేచిన రాముడు గోపాలయ్యను చూశాడు. వూరంతా వార్త గుప్పుమంది. అందరూ వచ్చారు..

“ఆయన కూడా పోయాడు.. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో..” అంటూ నిష్టూరమాడారు.

విరిగిన గిలకని, ఆయన చేతిలో వున్న చేదను చూస్తే అందరి మనసు చివుక్కుమంది. చేదతీయబోతే అందులో మురికి నీళ్ళు కనపడ్డాయి. బావిలోకి తొంగి చూశారు –

“బావిలో నీళ్ళు లేవు..” ఎవరో అరిచారు..

“జానకమ్మగారి బావి ఇంకిపోయింది..” వూరంతా చెప్పుకున్నారు.

“ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం.. ఎంతటి ఎండలొచ్చినా ఏ నాడైనా ఇంకిపోయిందా?” అన్నారెవరో శివాలయంలో

“ఇంకిపోయింది నీళ్ళుకాదు.. పదిమందికి సాయంచేసే మంచితనం..” అంటూ శివాలయంలోకి వెళ్ళిపోయారు దక్షిణామూర్తిగారు.

——————-

అరిపిరాల-సత్యప్రసాద్

మంచి సంగీతం, మంచి సాహిత్యం అంటే అభిమానం.. తెలుగు భాషంటే మమకారం గల అరిపిరాల సత్యప్రసాద్ గుంటూరులో జన్మించారు. చదువు, తొలి వుద్యోగం రాష్ట్రంలో అనేక వూర్లు చూపించాయి. గుజరాత్‌లో ఎం.బీ.యే తరువాత, కార్పొరేట్ వుద్యోగం దేశమంతా చూపిస్తోంది. ఉద్యోగరీత్యా అనేక రకాల వ్యక్తులను, రకరకాల సంస్కృతులను చూసేందుకు అవకాశం కలుగుతూ వుంటుంది. అలా కలసిన వ్యక్తులు, ఎదురైన సంఘటనలే ఆయనకు కథా వస్తువులు.

రచయితగా 1995 ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం వారి దీపావళి కథలపోటీలో సాధారణ ప్రచురణతో తొలి అడుగులు వేసారు. తరువాత పది దాకా కథలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. ఒక పదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత కింది బ్లాగుల ద్వారా రచనా ప్రస్థానాన్ని పునఃప్రారంభించారు.

1. హాస్య దర్బారు
2. పలకా బలపం

Posted in కథ | 30 Comments

తామస విరోధి – ఆరవ భాగం

కిరణ్ కుమార్ చావా :

ఆ ఒడ్డు నుండి నువ్ నన్ను,
ఈ ఒడ్డు నుండి నే నిన్ను,
పరికిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ,
ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం.

ఎప్పుడో కుదుళ్లు వేరైపోయినా,
ఎప్పటికప్పుడు గాయాల కాలవలకు
పూడికలు తీస్తూ, గట్లు కడుతూ,
ఇన్ని వసంతాలూ రక్తం పారించాం.

నీ వైపు పూలు, నా వైపు ముళ్లు నువ్వూ,
నా వైపు పూలు, నీ వైపు ముళ్లు నేనూ,
లెక్కేస్తూ, ఎకసెక్కాలాడుతూ, వెక్కిరిస్తూ
ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం.

నడుమ దేవుని పాదాలపై మంత్రాక్షరాల్ని
ఎడమ నుండి కుడికి నేనూ,
కుడి నుండి ఎడమకు నువ్వు,
ఉచ్చరిస్తూ, మోక్షమాసిస్తు,
సింహ గర్జన చేస్తూ,
తొడలు చరుస్తూ,
బళ్లాలు నేలకు కొడుతూ,
ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం.

తమ్ముడా అని నోరారా అని
కౌగిలింతలోకి తీసుకొని
కొత్త వసంతాన్ని పిలవాలన్పిస్తుంది
కానీ, కానరాని పొరలేవో ఆపుతున్నాయి.

ఆ ఒడ్డు నుండి నువ్ నన్ను,
ఈ ఒడ్డు నుండి నే నిన్ను,
పరికిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ,
ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం.

—-
నెనర్లు,

కత్తి మహేష్ కుమార్: ఈ సారి దెబ్బ చాలా బలంగా తగిలింది. ప్రేమికుల పిరికివిరహం నుంచీ, కులమతాల మూర్ఖత్వపు పట్టుదల దాకా. భావజాలాల అతివాదాల నుంచీ, భారత్-పాక్ సరిహద్దు గొడవదాకా అన్నింటినీ కలిపి కొట్టారు…జైహో!

చావా కిరణ్ కుమార్: వీరిలో ప్రేమికుల గురించి మాత్రం నేనేమీ అనుకోలేదు. అది తప్ప మిగిల్న విషయాల్లో ఇద్దరం ఒకే రకంగా ఆలోచించాము. 🙂

బొల్లోజు బాబా: మంచి పోయెం. సన్నగామొదలుపెట్టి జూమ్ చేయాలన్న మీ ప్రయత్నం నూరు శాతం నెరవేరింది. మొదట ఏదో విరహగీతం అనిపించినా, పోయేకొద్దీ కవితా వస్తువు పరిధీ, లోతూ పెరుగుతూ సాగింది. మహేష్ గారి కామెంటు చదివేసరికి కవితపట్ల మదిలో ఏర్పడిన అవగాహనలోని అన్ని లాక్యునేలూ పూరింపబడినట్లనిపించింది. మంచి కూర్పు.

త.య.భూషణ్: ఈ కవితలో కొత్తదనం లేదు. పునరుక్తి ఎక్కువయింది. దానికి తోడు sentiment ఒకటి. ఇలా తిరగరాస్తే కొంచెం గుడ్డిలో మెల్ల.

ఆ ఒడ్డు నుండి నీవు
ఈ ఒడ్డు నుండి నేను
ఇన్ని వసంతాలు
ఇట్టే గడిపేశాం.

ఎప్పుడో వేరైపోయినా,
ఎప్పటికప్పుడు కాలవలకు
పూడికలు తీస్తూ, గట్లు కడుతూ,
ఇన్ని వసంతాలూ రక్తం పారించాం.

ఆ ఒడ్డు నుండి నీవు
ఈ ఒడ్డు నుండి నేను
ఇన్ని వసంతాలు
ఇట్టే గడిపేశాం.

బొల్లోజు బాబా: భూషణ్ గారికి..
నాకు చిన్న సందేహం. మీరు చేసిన దిద్దుబాటు బాగుంది. క్లుప్తంగా ఉంది. రక్తం పారించాము అనటం, అసలు కవితలో లేని/చెప్పలేకపోయిన స్ఫష్టతను, ఫోర్స్ ను గొప్పగా ఆవిష్కరిస్తోంది. అసలు కవితలోని కొన్ని ప్రతీకలను, విశేషణాలను, కొన్ని భావచిత్రాలను మీరు తొలగించారు.
ఉదా:
ఎప్పుడో కుదుళ్లు వేరైపొయినా, (ఎప్పుడో పార్టిషన్ జరిగినా)

నీ వైపు పూలు, నా వైపు ముళ్లు నువ్వూ,
…….(ఒకరితప్పులను మరొకరు ఎత్తిచూపుకొంటూ)

ఎడమ నుండి కుడికి నేనూ, …… (హిందూ మరియు ముస్లిం భాషా సాంప్రదాయాలను తెలియచేస్తుంది)

తమ్ముడా అని నోరారా అని …..(మనసులో నిన్ను దగ్గరకు తీసుకోవాలని నాకున్నా, నాచుట్టూ ఎన్నో అడ్డుగోడలు)

కవితలో మీరు ఆరోపించిన పునరుక్తి కనపడుతుంది. కొంత రిఫైన్ మెంట్ అవసరమే. కానీ దాన్ని ఒక కథన/శైలి ప్రక్రియలా ఎందుకు అనుకోరాదు? (అమాయకమైన ప్రశ్నే కావొచ్చు, నవ్వుకోవద్దు. ఎందుకంటే శ్రీ శ్రీ గంటలు కవితలో అన్నీ గంటలే కనిపిస్తూంటాయి నాకు)

ఇక అసలు ప్రశ్న..

మీరు తీసేసిన వాక్యాలు పైన చెప్పిన భావాలను సమర్థవంతంగానే వెలువరిస్తున్నాయిగా! అవి కవితకు ఒక విస్తృతమైన కాన్వాసును, వెడల్పును కలిగిస్తున్నాయిగా. అవి మరీ వాచ్యంలా ఏమీ లేవే! మరి వాటిని ఎందుకు తొలగించుకోవాలి? నిజానికి ఒక కవికి కలిగిన భావస్పందనను పదాలలో వాక్యాలలో పేర్చుకొన్నాక, వాటిని ఎడిట్ చేసుకొనే ప్రక్రియలో, ఇలా ఒక్కో పదమూ, వాక్యమూ తొలగించుకొంటూ పోయి, అసలు కవితను, మీరు ఎడిట్ చేసిన విధంగా తయారు చేసి, పాఠకునికి అందించినపుడు, ఆ చదువరి మనసులో అసలు(వరిజినల్) కవిత చదివినపుడు కలిగిన ఫీల్ కలుగుతుందా? నాకయితే సందేహంగానే ఉంది. మరి అలాంటప్పుడు, అసలు కవితను అల్లానే ఉంచుకోవటంలో అభ్యంతరమేమిటి? (ప్రస్తుత చర్చలోని కవితనైతే కొన్ని స్వల్ప మార్పులతో)

క్లుప్తత పేరుతో, కవితను చిక్కగా తయారు చేసి, అది ‘అర్థం చేసుకొన్నవారే చదువుకుంటారులే, అర్థంకాదు అనే వాళ్లను సుబ్బరంగా వచనం చదువుకోమనండి’ అని ఒక తెంపరి సమాధానం ఇవ్వటం సమంజసమా? చాలా సందర్భాలలో కొన్ని కవితలు, ఈ క్లుప్తత ప్రక్రియవలన, ఒక పొడుపుకథ స్థాయికి పడిపోయి, పాఠకునికి కనుక్కోండి చూద్దాం అంటూ సవాలు విసరటం
జరుగుతుంది. కవిత్వానికి క్లుప్తత అవసరమే. కవిత్వాన్ని న్యూస్ పేపరు చదివినట్లు చదవకూడదనేదికూడా ఒక ప్రాథమిక సూత్రమే. కాదనను కానీ ఈ ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన కవి హృదయాన్ని పాఠకుడు అర్థంచేసుకోవటంలో కొంత వెతుకులాట లేదా అన్వయం (కొన్నిసార్లైతే మరీ దారుణంగా ఏనుగు అయిదుగురు గుడ్డివాళ్ళ కథలోలా) అవసరమౌతున్నదన్న దానికి వివరణ మీనుంచి వినాలనుంది.

అన్యధా భావించరని భావిస్తూ

త.య.భూషణ్:
భావ విస్తృతి లేనప్పుడు పదవిస్తృతి వల్ల కలిగే ప్రయోజనం లేదు. పిండికొద్దీ రొట్టె. కేవలం మీరు ఇరుగు-పొరుగు దేశాల విభజనకు సంబంధించిన దృక్కోణంతో ఆలోచిస్తున్నారు. వేరుపడటం అన్నభావం ముఖ్యం నాకు; ఆ భావ విస్తృతిని రైలు కింద పెట్టిన
పావలాలా సాగదీస్తే చూడటానికి తమాషాగా ఉన్నా, దాని రూపం పోగొట్టుకుంది కవిత. కవిత్వం ఒక రూపం ద్వారా వ్యక్తమవుతుంది. కవితకు ఒక రూపం, సౌష్ఠవం చాలా అవసరం. (ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి).

ఇన్ని వసంతాలు రక్తం పారించాం.
అనడంతో వేర్పాటుభావం సుస్పష్టం.

ఎలా పారించాం అన్నదానికి మిగిలిన వాక్యాలు సమాధానం. అవి పాఠకులకు వదిలేస్తే మంచిదని నా అభిప్రాయం; అలాగే ఉంచుకోనూ వచ్చు.(అది కవి అపరిణత బుద్ధిని సూచిస్తుంది.)

T.S.Eliot -The Waste Land కావ్యాన్ని Ezra pound నిర్దాక్షిణ్యంగా edit చేసి సగానికి సగం కుదించాడు. మనం చదువుతున్నప్రతి అదే. మనకేమైనా ఇబ్బంది ఎదురవుతుందా అర్థం చేసుకోవటానికి. చాలామందికి అసలు ఒక చిత్తు ప్రతి ఉందని కూడా తెలియదు. ఇలియట్ తను రాసిన కావ్యాన్ని యథాప్రకారం ఉంచుకొని ఉండవచ్చు; తను స్వయానా పెద్ద కవి విమర్శకుడు. అయినా కూడా ఎందుకు ఎజ్రాపౌండ్ సవరణలను అంగీకరించాడు?? (అల్లా అంగీకరించడం వల్ల కావ్యానికి ఒక రూపం సిద్ధించి, నోబెల్ ప్రైజుకు అర్హమైందని చాలా మంది విజ్ఞులు అభిప్రాయ పడతారు).

అన్ని కవిత్వాలకు అందరూ పాఠకులు కారు. నాకు అర్థం కాని కవిత్వం ఇంకొకరికి బాగా అర్థం కావచ్చు. నాకు అర్థమైనవి ఎవరికీ అర్థం కాకపోవచ్చు. కాబట్టే ఇన్ని చర్చలు, వ్యాఖ్యానాలు. ఒక చైనీస్ కావ్యానికి నా దగ్గర ఒక వంద వ్యాఖ్యానాలు ఉన్నాయి. అర్థం కాదు అన్న గొడవ చాలా పాతది. అర్థం కావడానికి మన ప్రయత్నం ఎంత అన్నది ముఖ్యం. ఒక కవిత మీ జీవితాన్ని మార్చగలదు అని మీరు అనుకుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతదూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి.

క్లుప్తతను మన తెలుగు కవులు మరచిపోయి ఒక శతాబ్దమయింది. పొడుపుకథల స్థాయికి కవిత్వాన్ని ఎవరూ దించివేయలేరు, కారణం పొడుపుకథలు బుద్ధికి సంబంధించినవి, కవిత్వం హృదయానికి. వాటి పరిధులు వేరు. అప్రయత్నంగా కవిత్వాలు అర్థం కావాలనుకోవడం పెద్ద దురాశ (దురాశా దుఃఖము, చేటు అన్నది మనకు తెలిసినదే). ఆ దురాశ వల్లే మనకు అర్థం కాని కావ్యాలనన్నీ అటకెక్కించాము.

కవిత్వం సర్వ శ్రేష్ఠమైన కళ. దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు వెచ్చించిన సమయం వృధాకాదు. నిదానంగా దాని ఫలాలు అందుకోగలరు.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=21779&Categoryid=1&subcatid=3

ఇంత చర్చ తర్వాత ఒక చిన్న పరీక్ష: ఈ కవిత క్లుప్తతా ప్రమాణాలు ఏ పాటివో నిర్మొమొహమాటంగా రాయండి.

బొల్లోజు బాబా: భూషణ్ గారు, థాంక్యూ! మీ వాఖ్య ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిసినయ్.

మీరు సూచిస్తున్న ప్రమాణాలు కవిత్వాన్ని లోతుగా అధ్యయనం చేసేవారికొరకని అనిపిస్తోంది. మరి సాధారణ పాఠకుల సంగతి? అసలు సాధారణ పాఠకులంటే ఎవరో ఈ మాటలో బాబ్జీలు గారు సాధారణ పాఠకుని గురించి ఈ క్రింది వాఖ్య చేసారు.
“సాధారణ పాఠకుడు: చిన్న పిల్లల్లాటి వాడు. ఏది జరిగినా “శ్రీశ్రీ” కవితలో చెప్పినట్టు ఆకసమున హరివిల్లు విరిస్తే ఆశ్చర్యంతో, ఆనందంతో చప్పట్లు కొట్టేరకం. మాహాకవుల రచనకీ, మామూలువాళ్ళరచనకీ, ఆఖరుకి సినిమా పాటకీ తేడా పట్టించుకోకుండా “రసాత్మకవయిన వాక్యానికి” సాష్టాంగ పడిపోయే రకం. ఏ గ్రూపు వారు రాసేరో పట్టించుకోని రకం. అసాధారణ పాఠకులు “ఇలాటి దిగుడు ధరల సమయంలో, మబ్బూ, వానా, మల్లెల వాసనా.. లాటి వాక్యాలని ఆనందిస్తావా?” అని గదమాయిస్తే, సిగ్గుపడిపోయే రకం. సిగ్గు పడుతూనే “బాపూ బాగా రాసేడు కదా?” అని మెలికలు తిరిగే రకం. ఎవరైనా ఆంగ్ల రచయితల్ని గానీ, పాత తెలుగు కవుల/రచయితల ని గానీ “కోట్” చేస్తే గజగజలాడీ రకం.”

(ఇలా ఒక పారాగ్రాఫు ఎత్తుకు రావటం ఏవైనా కాపీరైటుల ఉల్లంఘన అయితే, అందుకు నన్ను దయచేసి క్షమించగలరు)

మరి అలాంటి సాధారణ పాఠకులకోసం కవి బాధ్యత ఏమీ లేదా? అసలు సాహిత్యానికి చదువరులు తరిగిపోతున్న ఈ తరుణంలో, కవిత్వాన్ని సంక్లిష్టపరచి (నేమాట్లాడుతున్నది క్లుప్తతపేరుతో ఒక విస్తృత అనుభవాన్ని చదువరికి దూరం చేసే ప్రక్రియగురించి మాత్రమే) ఉన్న కొద్దిపాటి పాఠకులను చేజార్చుకోవటం అవసరమా?

ఇక ఈ కవిత క్లుప్తత పై నా అభిప్రాయాలు. ఈ క్రింది పదబంధాలను సంక్షిప్త పరచవలసిన అవసరముందనిపిస్తుంది.

బళ్లాలు నేలకు కొడుతూ, (ఇది అనవసరం)
పరికిస్తూ, పరిశీలిస్తూ, పరిక్షిస్తూ, (ఇన్ని క్రియలు అవసరం లేదేమో)

నీ వైపు పూలు, నా వైపు ముళ్లు నువ్వూ,
నా వైపు పూలు, నీ వైపు ముళ్లు నేనూ,
(భావం బాగుంది కానీ ఇంకొంచెం క్లుప్తంగా చెప్పచ్చుననిపిస్తుంది)

ఉచ్చరిస్తూ, మోక్షమాసిస్తు, (వాచ్యంలా అనిపిస్తున్నాయి)

మీ లింకు చదువుతున్నాను. ధన్యవాదములు.

త.య.భూషణ్:

మొట్టమొదట మనకు ఒక విషయంలో స్పష్టత ఉండాలి. పాఠకుల్లో సామాన్యులనీ, గంధర్వులనీ రెండు జాతులు లేవు. ఎవరైనా అతితెలివి ఉపయోగించి ఒక నిర్వచనం వెలిగించినా దాని వల్ల ప్రయోజనం సున్న. అన్ని కవితలు అందరికీ ఒకేలా అర్థం కావు. మీకు తేలికగా అర్థమైన కవిత నాకు ఒక పట్టాన కొరుకుడు పడక పోవచ్చు. అతి దుష్కరమైన కవిత్వం కొందరికి అవలీలగా తలకెక్కవచ్చు. ప్రముఖ రచయితకు అర్థం కాని కవిత ప్రెస్సులో ప్రూఫులు దిద్దేవాడికి ఓస్ ఇంతేనా అనిపించవచ్చు. అసలు కవిత్వం సాహిత్యం ఈ గొడవలేమీ తెలియని పేకాట రాయుడు ఇచ్చిన పదికవితల్లో ఏది ఉత్తమమో సవిమర్శకంగా చెప్పవచ్చు. వీరిలో ఎవడు సాధారణ పాఠకుడు?? ఎవడు రెక్కలున్న గంధర్వుడు??

నేను సూచిస్తున్న ప్రమాణాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఏ కాలంలో (తెలుగు) కవిత్వానికి ఎక్కువమంది పాఠకులున్నారు??
తరిగిపోవడం, పెరిగిపోవడమన్నది ఉట్టిమాట. కవిత్వం పట్ల కవికి బాధ్యత ఉంటే చాలు. తతిమ్మావన్నీ వాటంతటవే దారిలోకి వస్తాయి.
ఏ కాలంలోనైనా కవిశబ్ద వాచ్యుడికి కవిత్వాన్ని సంక్లిష్ట పరిచే అవసరం లేదు; అలాగని చెప్పి అరటిపండు వలచిపెట్టే అవసరమూ లేదు. పాఠకుల మీద ఊరికే జాలిపడిపోయే కవులు స్వయానా ఎదగలేరు, పైపెచ్చు పాఠకులను ఎదగనివ్వరు. క్లుప్తత కవిత్వాన్ని సంక్లిష్టపరచదు, అలాగని చెప్పి తేలిక చేయదు; అది కవిత్వానికి అతి సహజగుణం. ఈ విషయంలో ఇంతకన్నా చర్చ అవసరం లేదని నా అభిప్రాయం.

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

వర్డ్‌ క్యాన్సర్‌

– అరుణ పప్పు

‘మీకు క్యాన్సర్‌’ అన్నాడు డాక్టర్‌.
నా కాళ్లకింది భూమేమీ కదిలిపోలేదు.. నా కళ్లేమీ గిర్రున తిరగలేదు.. తూలిపడబోతున్నట్టు అసలే అనిపించలేదు.. అయినవాళ్లని తలుచుకుని అశ్రువులేమీ కిందికి జారలేదు.. అర్ధాంతరంగా, అదీ నిండా ముప్ఫై నిండకుండా పలకరిస్తున్న మృత్యువును తలచుకుని నాకేమీ భయమనిపించలేదు.. వణుకు అసలే పుట్టుకురాలేదు.
మరేం జరిగిందయ్యా అంటే –

సూర్యుడు ప్రతిదినమ్మూ తూర్పునే ఉదయించునన్న సత్యాన్ని స్కానింగులు చేసీ, బయాప్సీలు తీసీ.. వారం తర్వాత మనమేమనుకుంటామేమోనని భయంభయంగా చూస్తూ ఎవరైనా చెబుతున్నారనుకోండి.. పక్కుమని నవ్వురాక ఏం చేస్తుంది? అందుకే నాకు నవ్వొచ్చింది.

సహజాతిసహజంగా నాకు తెలిసిన నిజాన్ని మరొకరి నోటంట విన్న భావన కలిగింది. ‘హేయ్‌ ఇది విన్నావా.. సూర్యుడు తూర్పున ఉదయించును..’ అని పొద్దున్నే మనం వాకింగ్‌కు వెళుతుంటే ఎవరయినా ఎదురుపడి చెబితే ఎలాగుంటుంది? నాకలాగనిపించింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఆనాడు ఎదురయినట్టయింది. క్యాన్సర్‌ అవునో కాదోనన్న సందేహాన్ని పారద్రోలడం కాదు అతను చేసింది.. అవునన్న నా లోలోపలి అభిప్రాయానికి వాస్తవాల ఋజువులతో వత్తాసు పలికాడా డాక్టరు ఆ ముక్క నాకు చెప్పినప్పుడు. ఇంకా చెప్పాలంటే సూర్యుడు ప్రతిదినమ్మూ తూర్పునే ఉదయించునన్న సత్యాన్ని స్కానింగులు చేసీ, బయాప్సీలు తీసీ.. వారం తర్వాత మనమేమనుకుంటామేమోనని భయంభయంగా చూస్తూ ఎవరైనా చెబుతున్నారనుకోండి.. పక్కుమని నవ్వురాక ఏం చేస్తుంది? అందుకే నాకు నవ్వొచ్చింది.

‘అయ్‌ డోంట్నో వాట్టూ టెల్యూ. అండ్‌ అ య్‌ డోంట్నో వాట్టూడూ.. అయినా మీకు చెప్పే తీరాలి..’ అంటున్నాడా అంకాలజిస్ట్‌.

అబ్బా.. సినిమాలు చూసి ఎంత పాడయిపోతారో జనాలు. సమస్య ఉన్నదేమో నాకు.. ఉన్నదున్నట్టు చెప్పాల్సింది ఆయన. దానికింత తాత్సారం, శషభిషలూ ఎందుకు?

‘సీ.. దిసీజ్‌ ఫస్టైమ్‌ ఇన్దవాల్డ్‌..’

హా… వాటే ఫన్‌.. బాగా పేరుందని ఈయనదగ్గరకొచ్చేను చూడూ.. నాకు బుద్ధుండాలి.. పదిమందిలో ఒకరికున్న క్యాన్సర్‌ను పట్టుకుని ప్రపంచంలో మొదటిసారి అంటాడేమిటో.
‘క్యాన్సరంటే తెలియని చిన్నపిల్లలు కూడా ఉండరు.. ఈయనేమిటి ఇలాగంటాడని ఆశ్చర్యపోకండి..’

అబ్బా.. మనవాడికి మైండ్‌ రీడింగ్‌ కూడా తెలిసినట్టుంది. సరే కానీ. ఎంతమందిని చూళ్లేదూ?

‘యువర్‌ కేసీజ్‌ డిఫరెంట్‌..’

పసిపాపగా ఉన్నప్పట్నుంచీ పాలకి బదులు పదాల్ని తాగినందుకిదా పర్యవసానం?
ఊహ తెలియక ముందు నుంచీ అక్షరాల్ని నమిలి మింగిన ఫలితం ఈ రూపం ధరించిందా?
వాక్యాల్ని పట్టుకుని ఉయ్యాలలూగిన వైనమిలా వికటించిందా?
కుర్యాత్కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ.. సరస్వతీ నమస్తుభ్యమని ఉపాసించినందుకీరీతి వశమైందా అమ్మ? వచ్చెయ్యమని పిలుస్తోందా..
అక్షరాల్ని ఒక్కటొక్కటిగా చెక్కుకుంటూ, వాక్యాల్ని పేర్చుకుంటూ బతుకును నెట్టుకొస్తున్నదాన్ని.. తిన్నా తాగినా ఏడ్చినా నవ్వినా సుమించినా రమించినా అన్నీ వర్ణమాల వర్గ సంచయంతో కాదూ!

కార్పొరేట్‌ హాస్పత్రుల్లో ఈ మాట ప్రతి డాక్టరూ జలుబని వెళ్లినవాడిక్కూడా చెప్తారని నాకు తెలీదా?
‘వాట్వీ డిటెక్టెడ్‌ ఈజ్‌.. మీ ఒంటినిండా పదాల పుట్టలు.. రక్తం నిండా అవే. మెదడులోనైతే గుట్టల్గుట్టలు.. వర్డ్‌ క్లాట్స్‌.. ప్రిసైస్లీ.. మీకు వర్డ్‌ క్యాన్సర్‌..’
‘అంటే మాలిగ్నంట్‌ సెమాంటిక్‌ లింఫోమానా డాక్టర్‌..’ అంటూండగానే చిన్న నవ్వు మొలిచింది నా పెదాల పైన. ఎందుకో అది శుక్ల విదియ నెలబాలుడిలా వెలసిన కొద్దిసేపటికే వెలిసిపోయినట్టు తెలుస్తూనే ఉంది.
డాక్టర్‌ నావైపు భయంగా చూశాడు. ‘యస్‌, క్లినికల్‌ లక్షణాలివే..’ అంటూ గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.

పసిపాపగా ఉన్నప్పట్నుంచీ పాలకి బదులు పదాల్ని తాగినందుకిదా పర్యవసానం?
ఊహ తెలియక ముందు నుంచీ అక్షరాల్ని నమిలి మింగిన ఫలితం ఈ రూపం ధరించిందా?
వాక్యాల్ని పట్టుకుని ఉయ్యాలలూగిన వైనమిలా వికటించిందా?
కుర్యాత్కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ.. సరస్వతీ నమస్తుభ్యమని ఉపాసించినందుకీరీతి వశమైందా అమ్మ? వచ్చెయ్యమని పిలుస్తోందా..
అక్షరాల్ని ఒక్కటొక్కటిగా చెక్కుకుంటూ, వాక్యాల్ని పేర్చుకుంటూ బతుకును నెట్టుకొస్తున్నదాన్ని.. తిన్నా తాగినా ఏడ్చినా నవ్వినా సుమించినా రమించినా అన్నీ వర్ణమాల వర్గ సంచయంతో కాదూ!

ఇంతకీ వర్డ్‌ క్యాన్సర్‌.. పదం బావుంది.
ఇదొచ్చినందుకు బాధపడుతున్నానా.. విచారిస్తున్నానా.. అనుమానం ధ్రువపడినందుకు ఆనందిస్తున్నానా?
‘ఇంతగా విస్తరించిన క్యాన్సర్‌ సెల్స్‌ను తొలగించడం ఎలాగన్నదే మన ముందున్న ప్రశ్న. మీరు మరికొంచెం ముందొచ్చుంటే బావుండేది. ఇట్స్‌ టూ లేట్‌.. ఇప్పుడు వీటిని నిర్మూలిస్తే మీ ప్రాణానికే ప్రమాదం..’
ఇంతసేపటికీ డాక్టరుకు అసలు విషయం అర్థమయింది. కాని విషయమూ ఒకటుంది.
ఎవడిక్కావాలండీ బోడి ప్రాణం…?

కుమ్మరి పురుగు దొర్లించుకున్నా తొలుచుకున్నా తిన్నా మట్టే. నేనో కుమ్మరిపురుగును. నిర్మించినా, విసర్జించినా అన్నీ వాక్యాలే. పదాల దృక్చిత్రమాలికలే. అవే లేకపోయాక నేనుండీ ఏం లాభం? అప్పుడు నేను శవప్రాయాన్ని కానూ!!
ఇప్పటిదాకా చెప్పలేకపోయిన వాక్యాలే నన్నీ వర్డ్‌ క్యాన్సర్‌ బారిన పడేశాయా..
ఎప్పటికప్పుడు పొందిగ్గా పేరుస్తూనే ఉన్నానే..! మరింతగా ఒళ్లంతా ఎలా చెల్లాచెదురయ్యాయబ్బా..

కుమ్మరి పురుగు దొర్లించుకున్నా తొలుచుకున్నా తిన్నా మట్టే. నేనో కుమ్మరిపురుగును. నిర్మించినా, విసర్జించినా అన్నీ వాక్యాలే. పదాల దృక్చిత్రమాలికలే. అవే లేకపోయాక నేనుండీ ఏం లాభం? అప్పుడు నేను శవప్రాయాన్ని కానూ!!
అంతకన్న పదాల క్యాన్సర్‌తో శవం కావడమే నయం.

“నాకు తెలుసు.. అయస్కాంతానికి ఇనుప రజను అంటుకున్నట్టు నా వేళ్ల చివరన పదాలు అతుక్కుంటున్నాయి.. నేనే గనక కీబోర్డు మీద వేళ్లు టకటకలాడించి వాటిని విదుల్చుకోకుంటే అవి వెనక్కి తిరిగెళ్లిపోయి నా హృదయం చుట్టూ వర్డ్‌ క్లాట్స్‌ను ఏర్పరుస్తాయి. నెత్తురు గడ్డకట్టడం కన్నా పదాలు గడ్డకట్టడం మరీ ప్రమాదం. ఎందుకంటారా, రక్తం గడ్డలు కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పడితే వెంటనే చంపేస్తాయి. వర్డ్‌ క్లాట్స్‌ అలా కాదే.. అవి ఎక్కడివక్కడే ఉండిపోతాయి. చెప్పదల్చుకున్నవీ, చెప్పలేకపోయినవీ భావాలతో నిండిన పదాలు… అప్పుడప్పుడూ గుండె నొప్పిని తెప్పిస్తుంటాయి.. ”

ఎంత బాగా చెప్పిందో మీనాక్షి రెడ్డి తన పుస్తకంలో.
మరి నేను? ఇప్పటిదాకా చెప్పలేకపోయిన వాక్యాలే నన్నీ వర్డ్‌ క్యాన్సర్‌ బారిన పడేశాయా..
ఎప్పటికప్పుడు పొందిగ్గా పేరుస్తూనే ఉన్నానే..! మరింతగా ఒళ్లంతా ఎలా చెల్లాచెదురయ్యాయబ్బా..
చిన్నప్పుడు టీచర్లు చెప్పిన డిక్టేషన్‌ రాశాను.. అమ్మానాన్నా చెప్పినవన్నీ రాశాను.. పెళ్లయ్యాక గ్రామరదికాదు ఇదంటే నేర్చుకున్నాను.. ఒళ్లోని చంటిపిల్లాడితో కలిసి కొత్త అనుభూతుల్ని ఉంగాలు కొట్టాను.. పాత్రికేయంలో పాఠకులకు నచ్చేలా రాశాను.. ఎడిటరేదంటే అది రాశాను.. ఎవరేది చెప్పమంటే అది చెప్పాను కదా. ఎప్పటికప్పుడు వర్డ్స్‌ క్లాటయిపోకుండా విదుల్చుకున్నానే. మరిదేం క్యాన్సరో. ఇంకేదో ఉండిపోయిందా..

ఆ.. తెలిసింది.
అస్తమానం సిగరెట్లు కాల్చేవారికి ఊపిరితిత్తుల క్యాన్సరూ, కడుపునిండా తాగేవాళ్లకి లివర్‌ క్యాన్సరూ వచ్చినట్టన్నమాట. అస్తమానం అదే పనిగా పదాల్ని పీలుస్తూ గడిపినందుకిది.
కీమోథెరపీ చేస్తే, రేడియేషనిస్తే రా…లి, పో.. వడానికివేమైనా నెత్తిమీద వెంట్రుకలా..
దానికీ భాషుంది తల్లీ.. వాటిని శిరోజాలు అనాలి. శరీరమ్మీదైతే రోమాలు.. మీసంగడ్డం కలిసి శ్మశ్రువు… శష్పమంటే.. ఛా.. ఒద్దు.. బాతోబాతోంమే ఎన్ని పాఠాలు వినలేదు..
అయినా ఒంట్లోంచి పదాలలా రాలిపోతే ఎలా?
మళ్లీ కొత్తవి వస్తాయా?
అభినందనలూ నిరసనలూ సరసాలూ విరసాలూ పదాల పునాదుల మీద కాదూ నిలబడింది? వాక్యాల ప్రహరీగోడలే లేకపోతే మనమంతా ఓ కుటుంబంలా ఉండగలుగుదుమా?

డాక్టర్‌ దగ్గర సెలవుపుచ్చుకుని ఇంటికెళదామని బైటకొచ్చి నిలుచున్నా.
అకస్మాత్తుగా ఆకాశం మబ్బు పట్టింది. తల పై కెత్తి చూస్తే మేఘాలు. ఏనుగుల్లా ఎలా కమ్ముకొస్తున్నాయో. ఈ ఉపమను ముందు వాడిందెవరో, వాల్మీకా వ్యాసుడా భాసుడా! తల పైకెత్తి చూస్తుంటే ఠప్‌మని వానచుక్క సూటిగా ముక్కుమీద గుద్దే సూటి మాటలా వచ్చి తాకింది.
మేఘమథనం చేస్తున్నామన్న వార్త నిన్నే చదివాను.
ఇంతకీ పదమథనం చేస్తే ఏమొస్తుంది? మురిపించడానికి ముందేదో ఒక స్పెల్‌బీ అవార్డూ, కొన్ని ఆహాఓహోలూ, ఆక్స్‌ఫర్డ్‌ సర్టిఫికెట్టూ రావొచ్చు. తర్వాత మింగాల్సిన గరళం వర్డ్‌ క్యాన్సర్‌. పట్టుకుందంటే మరొదల్దు. భాషాసాగరమథనంలో అదే అంత్యాన మనల్ని వరించే మహాలక్ష్మి. ఈమాట ఉద్యోగంలో చేరిన కొత్తలోనే మా పతంజలి దగ్గర కూచోబెట్టుకుని మరీ చెప్పేవాడు. “తల్లీ, అక్షరాలు రక్కుతాయి. రక్తాలొచ్చేట్టు కొరుకుతాయి. మీదపడి కరిచేస్తాయి. దోమల్నీ పాముల్నీ మీదకు దూకేసిన పులినీ విదిలించుకోలేనట్లు తప్పించుకోలేనట్లు, అక్షరాల నుంచి కూడా తప్పించుకోలేరెవ్వరూ. అటువంటి అక్షరాలు వార్తాపత్రికల్లో కూడా పుడుతుంటాయి.”
నేనలాంటి అక్షరాల శిల్పిని కావాలని ఎంతో అనుకున్నాడాయన. ఏం లాభం? వర్డ్‌ క్యాన్సరంటూ వచ్చి పడి, నన్ను అర్ధాంతరంగా లాక్కుపోతుందని ఆయనకు తెలీదుగా!

ఇంతకీ దొహరాయిస్తున్నదేమంటే నేను ప్రపంచంలో ప్రప్రథమ వర్డ్‌ క్యాన్సర్‌ రోగిని.
ఈ వార్తకు మా పాత్రికేయప్రపంచమెలా స్పందిస్తుందో! ఎవరే మాటలతో హెడ్డింగులు పెడతారో, ఎవరెంత అందంగా వార్త రాస్తారో వ్యాఖ్యానిస్తారో చూడాలి. రేప్పొద్దునే పేపర్లు. నాకో గంటన్నర భోజనం. అప్పటివరకూ ఆగుతారా టీవీల వాళ్లు? స్క్రోలింగులేమని ఇస్తారో! నాక్కుతూహలం పెరుగుతోంది. వర్డ్‌ క్యాన్సర్‌ సోకిన తొలి వ్యక్తిగా నేను చరిత్రలో నిలిచిపోతాను!! ఎంత బావుందో ఈ ఆలోచన. ఆలోచన అనాలా.. ఊహ అనాలా.. వద్దు.. ఇలా చేసే ఇంత వరకూ తెచ్చుకున్నాను.
అవునూ ఇప్పుడిలా అర్ధాంతరంగా చచ్చిపోతే ఇప్పుడిప్పుడే స్పెల్లింగులు నేర్చుకుంటున్న కొడుకేమవుతాడు? హెలికాప్టర్‌ స్పెల్లింగేటమ్మా.. అనడుగుతూనే చేతుల్ని రెక్కల్లా విప్పి ఝామ్మని దూసుకెళ్లే నా చిన్ని కృష్ణుడేమవుతాడు?
వాన పెద్దదయింది. చూస్తుండగానే మహోధృత రూపం దాల్చింది. నటరాజ నర్తనంలా. ఉరుములు, మెరుపులు.

జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింపనిర్ఘరీ విలోల వీచివల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్జ్వలల్లాటపట్టపావకే కిశోర చంద్ర శేఖరేరతిః ప్రతిక్షణం మమ..

నిల్చున్న దగ్గర తుంపర పడి తడి అనుకున్నది కాస్తా పిల్ల కాలువలాగా మారింది.
జల్లుమంటు సిరివానా చందనాలు కురిసేనా.. సిరివెన్నెలా, నాకీ మోహమెలా పోతుందో చెప్పవూ..
ఎగువనెవరో కాగితప్పడవలు చేసి వదుల్తున్నారు..
వాగనుశాసనుడు, శబ్ద శాసనుడు నన్నయ నుంచీనా, పెద్దన వరకూనా శ్రీశ్రీ శ్రీపాదా మల్లాదీ కూడానా.. వాళ్లకన్నా ఎగువనెవరో ఇంకెవరో ఉన్నారే..
అన్నీ దిగువకు ప్రవహిస్తున్నాయి.. టీవీలూ నేరాలూఘోరాలూ తప్ప మరేం పట్టని లోకంలోకి వీళ్లిలా ప్రవహించడం ఆకాశంబుననుండి అందుండి ఉండుండి వివేకభ్రష్టసంపాతమా.. ఏమో అవునేమో.. కాదేమో.

బాగా తడిసయినా ఇంటికి తొరగా వెళ్లాలని పూర్తిగా వర్షంలోకి వచ్చేశాను. నడుస్తున్నాను..
అరె.. ఎన్ని వాక్యాలు వర్షిస్తున్నాయో.. ఎన్ని పదాలు పడుతున్నాయో..
హ్యాండ్‌బ్యాగేదీ.. కొన్నిటిని పట్టుకుంటా.. ఈ ఎడారి జీవితంలో మళ్లీ దాహం తీర్చుకోవడానికి కావాల్సినన్ని ఎప్పుడు దొరుకుతాయో. బోల్డన్నిటిని అందుకోవాలి.. సందర్భానుసారం వాడుకోవాలంటే పదప్రజ్ఞ అవసరం. నా దాహం వెర్రిగా పెరిగిపోతోంది.
ఇప్పటికిప్పుడు కొన్నిటిని నింపుకొందామని బుర్రను ఓపెన్చేశా..
చేతుల్తో దేవులాడి మరికొన్నిటిని పోగుచేశా.. అబ్బే ఎక్కడ.. అన్నీ రావటం లేదే.
అదిగో వచ్చేశాడు అమరసింహుడు. ప్రౌఢతరభాషాతిప్రగల్భుండు.. పెద్ద గోనెసంచులు తీసుకొచ్చాడు.. అన్నీ ఏరేసుకుంటున్నాడు.. అయ్యో నాకేమీ మిగలవుగాబోలు… ఇప్పటికే అతన్దగ్గర చాలా ఉన్నాయి.. అమరకోశం రాశాడుగా మరి. మళ్లీ నాతో పోటీకొస్తాడేమిటో.. ఇదేమిటి… ఇటు తిరిగి చూస్తే ఈ తెల్లవాడెవడు? రోజెట్స్‌!! థెసారస్‌ రాసిందీయనే కదా? వీళ్లిద్దరికీ ఎంత పదసంపద ఉందో…

నిశ్శబ్దం, మౌనం బావుంటాయని చాలా సార్లే చదివాను. లేనివాటిని దొరకనివాటిని రొమాంటిసైజ్‌ చెయ్యడం రచయితలకు పెద్ద జబ్బు. నా క్యాన్సర్‌ను మించిన పెద్దజబ్బు. నాకు మాత్రం మాటలే బావుంటాయి. వాటితో అల్లే బంధాల అల్లిక బావుంటుంది. పదాలే లేకుంటే ప్రపంచంలో ఇన్ని భావాలు బట్వాడా అయ్యేనా? మౌనాన్నీ చూపునూ ఒక దేహచలనాన్నీ అన్నిటినీ పదాల్లోకి తర్జుమా చేసే భాషంటే నాకు భలే ఇష్టం.

వీళ్లనేం చెయ్యాలి..? ఇక్కణ్నుంచి పొమ్మని తరిమేస్తే..!
ఈ వాన మరో కోనలో కురవదా..? వీళ్లు అక్కడికెళ్లి పట్టుకోరనే గ్యారెంటీ ఏమిటి..!
పోనీ నేనే బజార్లో కొనుక్కుని ఇన్‌స్టెంట్‌గా ఒంటపట్టించుకోనా? పదాల మాలికలు అంగట్లో అమ్మేవీ, కొనేవీనా? కష్టపడకుండా సంచి తీసుకెళ్లి తెచ్చుకోవడానికి!! అమ్మేవారెవరు.. పోతన అమ్మనన్నాడు కదా!

ఆడపిల్లగా కన్నా అడవిలో మానయి పుడితే మేలని రోజుకి వందసార్లంటుంది అమ్మమ్మ.
నాకు మాత్రం అడవికెళ్లినా ఈ బాధ పోయేట్టులేదు. సన్నజాజి తీగలుగా కొన్ని, మోదుగు పూలల్లా కొన్ని.. వాక్యాలు. కొమ్మకొమ్మకో సన్నాయి.. అన్నీ ఆలపించాలి, వాక్యమో సంగీత స్వరంలా అనిపించాలి.. దాన్లో రాగాల తూగుండాలి.. ఉండొద్దు మరీ..?
చదువుతున్నప్పుడది ఉయ్యాలలూపాలి.. తమిబూదీగెల తరహాలో ఆకాశానికంటిన కాళ్లతో కన్నెపిల్లలుయ్యాలూగుతున్నంత.. ధూర్జటి వర్ణనంత తూగుండాలి. ఆయనకీ వర్డ్‌ క్యాన్సర్‌ రాలేదా..? వారవనితా జనితా ఘనతాపహార సంతత మధురోధర సుధారస ధారలలా లైను కట్టేయికానీ క్యాన్సరొచ్చిందా..! వాక్యమంటే రారా చిన్నన్నా.. రారోరి చిన్నవాడ.. అని ముద్దుగా అన్నమయ్య వేణుగోపాలుణ్ని పిలిచినంత మార్దవంగా ఉండాలి. నీలం రంగు నిప్పు పువ్వయి ప్రకాశించాలి. సర్వమూ తానే అయిన వాడిలా వాడిగా లాలించి పాలించాలి. వానవిల్లుమీద నడిచి మేఘాల్లో తేలినట్టుండాలి. కాలిగ్రఫీ చిత్రాల్లా కళ్లకు కట్టాలి. కందర్ప హేతువై ఘనధూమ కేతువై చుట్టుముట్టాలి. యూనిఫామేసుకుని అప్పుడే స్కూలుకొచ్చిన పిల్లలు ప్రభాత వేళ ప్రార్థన సమయంలో లైనుకట్టి నిల్చున్నట్టుండాలి. అప్పుడప్పుడూ భావాలు ఎర్రకోట ముందు సైనికుల్లా కవాతుచెయ్యాలి. మాటలు ఈటెలూ కత్తులూ. అవే చురుక్కుమనిపించే చమక్కులు. మనసుల్ని ముడివేసే మంత్రాలు.
పదాల్ని నేర్చుకోమంటూ ఎన్ని పుస్తకాలో. వర్డ్‌ పవర్‌ మేడీజీ..
వెన్‌ ఇటీజ్‌..?
నెవర్‌. అట్లీస్ట్‌ నెవర్‌ ఇన్మై లైఫ్‌టైం!
ఎప్పటికప్పుడు ఎన్ని డిక్షనరీ డాట్కామ్‌లు తీసి చూసుకున్నా తీరని మోహం.
ఆలోచనల్లో పడి చూసుకోనేలేదు.. ఏరీ అమరసింహుడూ, రోజెట్సూ, నన్నయతిక్కనాది కవులూ? అందరూ గోతాలెత్తుకొని మాయమైపోయారు.

వాన వెలిసి పోయింది.
దోసెడు కూడా రాలేదు నాకు పదాలు.
చుట్టూ పరచుకున్న నిశ్శబ్దం. అదంటే నాకు భయం.
నిశ్శబ్దం, మౌనం బావుంటాయని చాలా సార్లే చదివాను. లేనివాటిని దొరకనివాటిని రొమాంటిసైజ్‌ చెయ్యడం రచయితలకు పెద్ద జబ్బు. నా క్యాన్సర్‌ను మించిన పెద్దజబ్బు. నాకు మాత్రం మాటలే బావుంటాయి. వాటితో అల్లే బంధాల అల్లిక బావుంటుంది. పదాలే లేకుంటే ప్రపంచంలో ఇన్ని భావాలు బట్వాడా అయ్యేనా? మౌనాన్నీ చూపునూ ఒక దేహచలనాన్నీ అన్నిటినీ పదాల్లోకి తర్జుమా చేసే భాషంటే నాకు భలే ఇష్టం.
అంత మంచి మాటలతో ఆటలెన్ని ఆడుకోవచ్చనీ. అదికూడా అందరికీ తెలిసేడిస్తేగా.
కొంచెం తెలిసే నాపనిలాగయింది. నేన్చచ్చిపోతున్నాను.. ఒక్క కొత్త మాటనూ సృజించకుండా. గొడ్రాలిగా.
సరే, పోతున్నానన్నది ఖాయం.
తస్యాశ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితా.. అవున్నేనాయన దగ్గరకే.

ఇప్పుడొక మనవి. ఇది నా విన్నపం.
మై డియర్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ ఎనిమీస్‌
రెలెటివ్స్‌ అండ్‌ ఇర్రెలిటివ్స్‌,

దయచేసి నన్ను పదాల పల్లకీ కట్టి చివరిసారి ఊరేగించండి. అక్షరాల నిప్పులో చివరికంటా చితిని చితికిపోనివ్వండి. ఇంత బూడిదను భరిణలో పెట్టి పవిత్ర పుస్తక ప్రవాహంలో కలిపేయండి. పేపర్లో స్మృత్యంజలి వేయిస్తే శాడ్డిమైజ్‌, ఆబిట్యురీ, నిర్యాణం, కన్నుమూత, అనురాగదేవత అస్తమయం, దశదినకర్మ, వైకుంఠసమారాధన, పెద్దకర్మ.. వంటి రొడ్డకొట్టుడుకు బదులు, మరో అందమైన పదబంధమేదైనా దొరుకుతుందేమో వెతకండి.. ఆ నాలుగు వాక్యాల్లోనూ అచ్చుతప్పులూ అడ్డదిడ్డమైన విరామచిహ్నాలూ లేకుండా ఒక్కసారి జాగ్రత్తగా ప్రూఫులు పట్టిపట్టి చూడండి. నేను తీసుకుంటున్న సుదీర్ఘ విరామానికి వాటితో శరాఘాతాలేమీ తగలకుండా జాగ్రత్తపడండి. నా తులసికోటమీద అఖండమైన అక్షర దీపాన్ని వెలిగించండి. వారసత్వంగా ఒక్క కొత్త పదాన్నీ, ఒక్క సృజనాత్మక వాక్యాన్నీ వదిలెళ్లని నన్ను మన్నించండి. ఒక్క వాక్యాన్నీ నిర్మించని నా అశక్తతను అర్థం చేసుకోండి. ఎందుకలా జరిగిందో విచారించండి. నలుగురు కూచొని చదివేవేళల నాపేరొకపరి తలవండి.

—————–

పప్పు అరుణ పుట్టింది విజయనగరం జిల్లా చల్లపేట అగ్రహారంలో 1979 డిసెంబర్ 9న. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండ. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివినా పాత్రికేయం అంటే ప్రాణం కనుక వృత్తిగా దాన్నే ఎంచుకున్నారు. ఈనాడు ‘ఈతరం’లో ఐదేళ్లు పనిచేసి, ఏడాదిన్నర క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో చేరారు. ‘చదువొక వ్యసనం. అక్షరం కనిపించడమే ఆలస్యం, చదువుతుంటాను. మంచి వచనానికి, కవితాత్మకమైన పంక్తులకూ త్వరగా ఆకర్షితమవుతాను’ అని అంటారామె. పాత్రికేయ జీవితంలోని మానవీయ కోణాల్ని ఆవిష్కరించాలని కథలు రాయడం ప్రారంభించారు. ఆమె భావాల మాలిక ‘అరుణమ్’ బ్లాగు.

Posted in కథ | 24 Comments

ఈ తరానికి ప్రశ్నలు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

ఒక సంగతి చెప్పాలి. మీరిది చదువుతున్నారంటే మీకు ప్రత్యేకత ఉన్నట్టే. మొదటి విషయం మీకు తెలుగు చదవడం వచ్చు. రెండోది వెబ్ పత్రిక చదివేంత సాహిత్యాభిమానం ఉంది. మూడోది ఇదేమీ కథా కాకరకాయా, కవిత్వమూ కాదని తెలిసికూడా చదువుతున్నారంటే మీ ఆసక్తి చెప్పుకోదగినదే. అయితే ఏమిటట? ఆ విషయానికే వస్తున్నా…

తెలుగు భాష, సంస్కారం, సాహిత్యం, రాజకీయాలు, సమాజసేవ ఇలాంటి సవాలక్ష విషయాలను గురించి కాస్తయినా పరిచయం పెరగడానికి పిల్లలకు ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయి? అసలు వారికి తల్లిదండ్రులతో ముచ్చటించేంత వ్యవధి ఉంటోందా? తిండీ, బట్టలూ, చదువూ, ఆరోగ్యం వగైరాలన్నిటి గురించీ బాధ్యతగా ప్రవర్తిస్తూ పిల్లలని పెంచే తల్లిదండ్రులు ఈ ‘అదనపు’ విషయాలను గురించి ఆలోచిస్తారా? పిల్లలు మానసికంగా ఎలా ఎదుగుతున్నారో గమనిస్తారా? వీటి గురించి పిల్లలకు నేర్పగలిగిన సామర్థ్యం తల్లిదండ్రులకు ఉందా?

ఈ ఏడాది నాకు 60 నిండుతాయి. జీవితమంతా ప్రవాసాంధ్రుడుగానే జీవిస్తున్న నాకు గత 4 దశాబ్దాలుగా అనేక తెలుగు కుటుంబాలను కలుసుకునే అవకాశాలు లభించాయి. వారి సాంస్కృతిక నేపథ్యాన్ని గమనించే సందర్భాలు తటస్థించాయి. అందరు మధ్యతరగతివారిలాగే తెలుగువారుకూడా సంసారసాగరంలో తలమునకలవుతూ, కిందామీదా పడుతూ, హడావిడీ హైరానాల జీవితాలు గడుపుతున్నారు. ముఖ్యంగా పెద్దసిటీల్లో పిల్లలకు కిండర్‌ గార్టెన్ వయసు రాకముందే చదువుల హడావిడి మొదలవుతుంది. స్కూళ్ళ గొడవతోబాటు కొన్ని కుటుంబాల్లో ట్యూషన్లూ, రకరకాల లలితకళలు నేర్పే క్లాసులూ వగైరాలతో సమయం గడిచిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో ఆటలూ, టీవీ ప్రోగ్రాములతో కొంత సమయం పోతుంది. పన్నెండోక్లాసు జీవన్మరణ సమస్యగా పరిగణించబడుతుంది. ఆ తరవాత ‘గధా, ఘోడా’ తేడాలు మొదలవుతాయి. డాక్టర్లూ, ఐఐటీలూ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులూ ఇలా జీవనమార్గాన్ని నిర్దేశించే చదువుల్లో పడిపోతారు.

ఇవన్నీకాక పొట్టపోసుకునేందుకు అవసరం అనిపించని విషయాల మాటేమిటి? తెలుగు భాష, సంస్కారం, సాహిత్యం, రాజకీయాలు, సమాజసేవ ఇలాంటి సవాలక్ష విషయాలను గురించి కాస్తయినా పరిచయం పెరగడానికి పిల్లలకు ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయి? అసలు వారికి తల్లిదండ్రులతో ముచ్చటించేంత వ్యవధి ఉంటోందా? ఒకే ఇంట్లో ఉంటూ, తిని తిరుగుతున్నంత మాత్రాన, పక్కపక్కనే మౌనంగా కూర్చుని టీవీ చూసినంతమాత్రాన పిల్లలకు తల్లిదండ్రులతో సరైన కమ్యూనికేషన్ ఉన్నట్టుగా అనుకోలేము. తిండీ, బట్టలూ, చదువూ, ఆరోగ్యం వగైరాలన్నిటి గురించీ బాధ్యతగా ప్రవర్తిస్తూ పిల్లలని పెంచే తల్లిదండ్రులు ఈ ‘అదనపు’ విషయాలను గురించి ఆలోచిస్తారా? పిల్లలు మానసికంగా ఎలా ఎదుగుతున్నారో గమనిస్తారా? మరొక సంగతి. వీటి గురించి పిల్లలకు నేర్పగలిగిన సామర్థ్యం తల్లిదండ్రులకు ఉందా?
పాత తరాలతో పోలిస్తే ఇప్పటివన్నీ న్యూక్లియర్ కుటుంబాలయిపోతున్నాయి. అమ్మమ్మలూ, తాతయ్యలూ, మేనత్తలూ, మేనమామలూ, కజిన్సూ వగైరా బంధువుల రాకపోకలూ, కుటుంబాల్లో కొంతైనా మిగిలి ఉన్న తెలుగు సంస్కారం గురించి తెలుసుకునే అవకాశాలూ పిల్లలకు బాగా తగ్గిపోతున్నాయి. నాకు ప్రత్యేకంగా అభిమానం ఉన్న సంగీతం విషయం గమనించినప్పుడు పిల్లలకు గాత్రమో, వీణో, పియానో వగైరాలో నేర్పిస్తున్న తల్లిదండ్రులుకూడా అదో మొక్కుబడిగా చేస్తున్నారు గాని సంగీతం గురించిన నేపథ్యాన్ని పిల్లలకు వివరించడం, ఇంట్లో అటువంటి సంగీతాన్ని అస్తమానం వినిపించడం, పిల్లలను కచేరీలకు వెంటపెట్టుకు వెళ్ళడం వగైరాలేమీ చెయ్యరని తెలిసింది. పెద్దవారికే లేని అవగాహన పిల్లలకెలా వస్తుంది? తండ్రి ఉద్యోగంతోనూ, తల్లి (ఉద్యోగం ప్లస్) ఇంటిపనితోనూ సతమతం అయిపోయి ఓపిక కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నారు. కాస్త అటూఇటూగా మీరు పెరిగిన వాతావరణం కూడా ఇటువంటిదేనా? మరి మీకు మొదట ప్రస్తావించిన ప్రత్యేకత ఎలా అబ్బింది?

అతను 30 ఏళ్ళ తెలుగు యువకుడు. తెలుగు బాగానే మాట్లాడతాడు. అయితే చదవడం సరిగా రాదట. అతను ఏ ఝార్ఖండ్‌లోనో పెరగలేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్‌దాకా చదువుకున్నాడట. మద్రాసులో పుట్టి పెరిగి బొంబాయిలో 34 ఏళ్ళు గడిపిన నాలాగా కాదు. ఈ సంగతి మిత్రులకు చెపితే అతని పరిస్థితి ప్రత్యేకమేమీ కాదనీ, ఈ తరంవారు చాలామంది అటువంటివారేననీ చెప్పారు.

ఈ చొప్పదంటు ప్రశ్నలు వెయ్యడానికి కారణం ఉంది. ఈ మధ్య కొత్తగా చేరిన నా సహోద్యోగి ఒకతనితో ముచ్చటిస్తున్నప్పుడు కొన్ని విషయాలు బైటపడ్డాయి. అతను 30 ఏళ్ళ తెలుగు యువకుడు. తెలుగు బాగానే మాట్లాడతాడు. అయితే చదవడం సరిగా రాదట. అతను ఏ ఝార్ఖండ్‌లోనో పెరగలేదు. విశాఖపట్నంలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్‌దాకా చదువుకున్నాడట. మద్రాసులో పుట్టి పెరిగి బొంబాయిలో 34 ఏళ్ళు గడిపిన నాలాగా కాదు. ఈ సంగతి మిత్రులకు చెపితే అతని పరిస్థితి ప్రత్యేకమేమీ కాదనీ, ఈ తరంవారు చాలామంది అటువంటివారేననీ చెప్పారు.
అందుచేత ఇది చదువుతున్న యువపాఠకులను కొన్ని ప్రశ్నలు అడగబుద్ధి అవుతోంది.
• మీకు తెలుగు నేర్చుకునే అవకాశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిగింది?
• అందుకోసం మీరు ప్రత్యేకంగా కృషి చెయ్యవలసి వచ్చిందా?
• చిన్నతనంలో మీ సాటి పిల్లలకు లభించని ప్రత్యేక సదుపాయాలు మీకేమైనా లభించాయా?
• మీ ప్రేరణ ఎక్కణ్ణుంచి వచ్చింది? తల్లిదండ్రులా, టీచర్లా, బంధువులా, స్నేహితులా, లైబ్రరీలా, మీ భార్య/భర్త కలిగించిన ఉత్సాహమా?
• ఈ విషయాల్లో మీ అనుభవాలూ, సలహాలూ ఏమిటి?
పత్రికాముఖంగా మీరిచ్చే జవాబులు చాలా విలువైన స్పందనలవుతాయని నా ఉద్దేశం. ఇవి కేవలం నా వ్యక్తిగతసందేహాలు కావనీ, ప్రస్తుతకాలంలో తెలుగువారందరికీ సంబంధించినవేననీ మీకు తెలుసు. ఈ జవాబులు చదివినవారు వాటిని తమతమ వ్యక్తిగతఅనుభవాలతో పోల్చుకోగలుగుతారు.
వీటికి అనుబంధంగా మరికొన్ని విషయాలున్నాయి. మీకు వివిధ కారణాలవల్ల తెలుగుమీద ఆసక్తి పెరిగింది కనక మీ పిల్లలకు (లేదా మీకన్నా చిన్నవారికి) అటువంటి అవకాశాలు ఎలా కలుగుతాయో, ఏ ప్రయత్నాలద్వారా కలిగించవచ్చో చెప్పగలరా? ఏ తరానికాతరం జాగ్రత్త పడకపోతే పిల్లలు తెలుగు విషయంలో వెనకపడి పోతారు. తన సంస్కృతిమీద గౌరవం లేని వ్యక్తి ఏ సంస్కృతినీ గౌరవించలేకపోయే ప్రమాదం ఉందని పెద్దలంటారు. తెలుగు నేర్చుకోవడం అంటే కేవలం భాష, లిపి, చదవడం, రాయడం వగైరాలే కాదని వేరే చెప్పనక్కర్లేదు. ‘ఇంత ఆందోళన పడాల్సిన అవసరంలేదు. తెలుగుభాష సుబ్భరంగా ఉంది, బతికే ఉంది’ అంటున్నవారూ లేకపోలేదు. అది నిజమైతే మనమంతా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అలా కాకుండా మీవంటివారు నిజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులవల్ల లాభాలు పొంది ఉంటే ఆ విషయాలు అందరితో పంచుకోవడం అవసరమని నా ఉద్దేశం. దీన్ని ప్రచురించడంద్వారా తెలుగును ప్రోత్సహిస్తున్న సంపాదకవర్గానికి ధన్యవాదాలు.

Posted in వ్యాసం | Tagged | 40 Comments

రాజశేఖర విజయం

-త్రివిక్రమ్

ప్రజలకు తీరవలసిన కనీస అవసరాలు – కూడు, గూడు, గుడ్డ. కూడు, గుడ్డ సమకూరాలంటే సరైన జీవనోపాధి ఉండాలి. ఇది సవ్యమైన ఆలోచనా తీరు. సంవత్సరానికి 100 పనిదినాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలుచెయ్యడంతో బాటు నిరుద్యోగ యువకులకు యువశక్తి పథకం, మహిళలకు పావలా వడ్డీ ఋణాలు, వృద్ధులకు అభయహస్తం పెన్షన్లు, ఋణభారం కింద నలిగిపోతున్న రైతులకు ఋణాల మాఫీ, ఉచిత విద్యుత్తు, వీటితోబాటు ఊరూరా పేదలకు సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ గృహాలు – ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు కాబట్టే రాజశేఖరుడికి మొదటి నుంచీ గెలుపు మీద అంత ధీమా. ప్రజల అవసరాలను సరిగా గుర్తించి ఆ అవసరాలను తీర్చే విధంగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను నిర్దేశించుకున్న ప్రజానాయకుడు కాబట్టే తన విజయం మీద ఆయనకు అంత భరోసా. Continue reading

Posted in సంపాదకీయం | 6 Comments

2009 ఏప్రిల్ గడి ఫలితాలు

గడి సులువుగా ఉందో లేకపోతే స్లిప్పుల ప్రభావమోగానీ.. ఈసారి చాలామంది మొత్తం సరైన సమాధానాలు పంపారు.
మొత్తం పంపినవారు పదహారు మంది. అందులో అన్నీ సరిగ్గా పంపినవారు వెన్నెల_డిబి, రాజు పావులూరి, ఆదిత్య, వెంకట్ దశిక, ఊకదంపుడు, కంది శంకరయ్య, రాధిక, రాఘవ, పింగళి విజయ కుమార లక్ష్మీనారాయణ రావు. వీరిలో కొంతమంది సమాధానాల్లో కొంత తేడా ఉన్నా అవి సరైనవిగానే పరిగణించాను. ఉదాహరణకి “కదంబ” – “కదంబం”, “సున్న” – “సున్నా”, “తాటిముంజెలు” – “తాటిముంజలు”, “శలభము” – “శలభమే”, “ఖనిజం” – “ఖనిజ” వగైరా.

స్వరూప కృష్ణ గారు కూడా అన్నీ సరిగ్గానే రాసారు కాని “డుబుక్కు”కి “డుబుక్” అనీ, “టిక్కు”కి “టిక్” అనీ రాసారు. పొల్లు “క” ఒక అక్షరం కాదు. అంచేత గడిలో ఎప్పుడూ అది దాని ముందు అక్షరంలో భాగంగానే ఉంటుంది. ఇది గమనించగలరు.

ఒక్క తప్పుతో పంపినవారు శ్రీలు. రెండు తప్పులతో పంపినవారు జ్యోతి. గడిని పంపిన ఇతరులు – వెన్నెల, రవి కిరణ్, మల్లిన నరసిసింహావు, కోడీహళ్లి మురళీమోహన్.

అందరికీ అభినందనలు.

-కామేశ్వర రావు
————————–

శ్రీ

కై

ల్య

దం

బు

జే

రు

కు

నై

1

2దం

3

4

5మా

6కొ

త్త

7వా

8

ని

9న్న

ను

డు

సా

10డు

మ్మా

జం

సు

11కు

12

13కి

14తా

బు

15ర్ణ

16భే

17

18కో

ము

19టి

క్కు

20శా

21

రా

త్రు

లు

22దు

ముం

23

ము

క్ష

24దం

ఝె

25

గా

ని

కం

26తా

27

ళు

28రీ

రం

29బొ

మ్మ

లు

30మా

రా

రి

31

క్ష

32

ల్లి

33శ్రీ

34కో

కో

35

తి

36అం

37చు

38పా

శాం

39

దె

బ్బ

40చిం

తా

కు

కం

కీలక పదానికి ఆధారం:

భక్త కవిరాజు చింతించింది కేవలం దీనికోసమా! – భక్తకవిరాజు పోతన భాగవతం మొదటి పద్యం, “శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్” అని మొదలవుతుంది.

అడ్డం

======

1. పూర్వం రేడియోలో కొన్ని కార్యక్రమాలు కదంతొక్కుతూ ప్రసారమయ్యేవి. – రేడియోలో “కదంబ” కార్యక్రమాలు ప్రసారమయ్యేవి (ఇప్పటికీ అవుతున్నాయి!)

3. గాడిద రాక్షసుడు – ఖర అంటే గాడిద అని కూడా అర్థం. రాముడు చంపిన ఒక రాక్షసుని పేరు.

6. 38 నిలువుకి వ్యతిరేకం – 38 నిలువు ‘పాత’కి వ్యతిరేకం కొత్త.

7. విజయం వెంట వస్తే, దుర్గమ్మ సాక్షాత్కారం అవ్వదూ మరి! – వాడ. విజయవాడ వెళితే దుర్గమ్మ కనిపిస్తుంది కదా.

8. ఆచంట మల్లన్న ఎవరు? – “అతనికన్నఘనుడు” ఆచంట మల్లన్న అని నానుడి.

10. క్లాసుకి మళ్ళీ కొట్టావా అమ్మడు? – డుమ్మా

11. పెళ్ళికాని ప్రసాదుల దోషం ఇదా? – కుజ

13. మంచిపని చేసిన వాళ్ళకి హిందీ పుస్తకం ఇవ్వాలా? – కితాబు

17. అట్నుంచి నరుక్కురమ్మన్నారు పంటని – కోత వెనకనుంచి

19. నిమిష నిమిషానికీ గిర్రున తిరిగే ముల్లు ఇలానే ధ్వనిస్తుంది – టిక్కు

20. తారక హార పంక్తులతో చారు తరములైనవి – “శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులన్ జారుతరమ్ములయ్యె” ఇది నన్నయ్యగారి చివరి పద్యం అంటారు.

22. ముసళ్ళ పండగున్నది వెనకనుంచా? – వెనకనుంచి “ముందు”

23. మిడతంభొట్లు అదృష్టదేవత ఎవరో తెలుసుకోడం సులభమే! – శలభము అంటే మిడత. అదే కదా మిడతంభొట్లు అదృష్టదేవత!

25 పొలాలనన్నీ హలాల దున్నే కర్షక వీరుల ప్రతిజ్ఞ ఎవరి సౌఖ్యం కోసం? – “పొలాలనన్నీ హలాల దున్నీ ఇలాతలంలో హేమంపండగ, జగానికంతా సౌఖ్యం నిండగ” అని శ్రీశ్రీ “ప్రతిజ్ఞ” కవితలోని పంక్తులు

27. ఆహా ! ఈ కల్పనలకీ, ఆలోచనలకీ మొదలేదీ? – “ఊహలు” అంటే కల్పనలూ, ఆలోచనలూ. మొదలు లేక “హలు” అయ్యింది.

28. తల తెగిన దేహం రమ్మంటోంది చూడు – “శరీరం” తల తెగి “రీరం” అయ్యింది “రం” అంటోంది కదా!

29. బాపు, కొండపల్లి, కొప్పాక – బొమ్మలు

30. మాట“కు మారా”డకు పుత్రా! – కీలకపదంలో “కు” కలుపుకొని “కుమారా” అవుతుంది.

31. వాత పాతాల ముందుండేది – పక్ష (పక్షవాతం, పక్షపాతం)

32. దేవ సేనానికి దేవ సేన కాక వేరెవ్వరున్నారు చెప్మా? – వల్లి

33. ఒకటైతే మంగళం, రెండైతే విప్లవం – “శ్రీ” అంటే మంగళకరం. “శ్రీశ్రీ” ఎవరో అందరికీ తెలుసు

34. ఆద్యంతాలు ఏకమయ్యేలా అడుక్కో ! – కోరుకో. మొదలూ కొసా ఒకటే.

35. విడిచిపెట్టాల్సింది ఎప్పుడూ ఎక్కువే – అతి. “అతి సర్వత్త్ర వర్జయెత్” అని కదా.

36. తెల్లచీరకి నల్లగా ఉండేది యండమూరికి తెలుసు – అంచు

38. పుండ్రేక్షు_కుశ పుష్పబాణ హస్తే – పాశాం. కాళిదాసు శ్లోకం

39. ఈ కాలపు సూర్యారావిచ్చే స్ట్రోకు – కీలకపదంలోని అక్షరం కలుపుకొని “వడదెబ్బ”.

40. ఆలోచనా పత్రంతో గొలుసుచేయిస్తే ఆనాలోచితమైన ఖైదు తప్పదు – చింతాకుపతకం. ఆలోచన – చింత, పత్రం – ఆకు

నిలువు

=====.

1. జపాను బండిని ముందుండి నడిపేవాడు పోయెట్టా? – కవాసాకి

2. హిడింబి బంగార్రాజుని కోరుకున్న కౌగిలింత – కీలక పదంలోని అక్షరం కలుపుకొని “కైదండ”. “ఛాంగురే బంగారు రాజా” పాటలో వస్తుంది.

3. మైనింగు చేస్తే బయటపడే సత్యం – ఖ“నిజం”.

4. చివర కాస్త పొట్టైనా, బుర్రని కప్పిందికదా అది చాలు – కీలకపదంలోని అక్షరంతో కలుపుకొని “బురక”. బురకా చివర కాస్త పొత్తైంది.

5. ఎప్పుడొస్తుందో అని లైలా ఎదురుచూసిన మాసం – మాఘ

6. కొడవటిగంటి కుటుంబరావు మధ్యలో ఒకడు చేరితే పుట్టేవాడు – కొకు మధ్యలో ఒక“డు” చేరితే కొడుకు.

8. సంగీతం శాస్త్రిగారు దాసు మేస్టారికి చెప్పిన పిలుపు గురించి నీకేమైనా అర్థమయ్యిందా తల్లీ? – శంకరాభరణం శాస్త్రిగారు “ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు…” గుర్తుకొచ్చిందా!

9. దీన్ని తిరగేస్తే వచ్చేది అనిర్వచనీయం కదా, మరి ఎందుకు తిరగేసావ్? – సున్న. గణితంలో సున్నకి విలోమం (అంటే ఒకటి బై సున్న) “undefined” అంటే నిర్వచించలేము.

10. గుమ్మడికాయ మేకమీద ఎలా పడింది? – డుబుక్కు (పుటుక్కు జర జర డుబుక్కు మే!)

12. మొదట్లోనే కాదనడం అతని స్వభావం మరి – కీలకపదంలోని అక్షరంతో కలిపి “నైజము”. నై అంటే కాదనే కదా.

14. వేసవికాలపు అమృతగుటికలు. తిన్నవారు పాం అరులు కాలేరు – తాటిముంజెలు. ఇంగ్లీషు “పాం” అంటే తాటి.

15. పూరి గుడిసె సాలా బావుంటుంది – కీలకపదంలోని అక్షరంతో కలిపి పర్ణశాల

16. ఈ ఉపాయం చాలా తేడాగా ఉందే! – భేదం. సామ, దాన, భేద, దండోపాయాలలో ఒకటి. దీనికి తేడా అని కూడా అర్థం.

17. గాయపడిన శరీరాలతో చెల్లాచెదరై పడున్నారు – క్షతగాత్రులు చెల్లాచెదరయ్యారు

18. మాటలు దాటేందుకా మారాజులు కట్టేరు – కీలకపదంలోని అక్షరంతో కలిపి కోటలు

21. ఆద్యంతం రసవంతమే అయినా యీ గోలని భరించడం కష్టమే – రభస. మొదటి చివరి అక్షరాలు కలిపితే “రస”వంతమే కదా.

23. కర్ణసారథి పెట్టే ఎగ్జాం చాలా కష్టం బాబూ! – కీలకపదంలోని అక్షరంతో కలిపి శల్యపరీక్ష

24. మామిడి చెట్టు తిరగబడ్డా మాకెంతో అందంగానే కనిపిస్తుంది – మాకందం (మాకు+అందం) అంటే మామిడి.

25. అరుంధతే – కీలకపదంలోని అక్షరంతో కలిపి జేజమ్మ

26. చుక్కేమో తెలుగులో రమ్మంది, చంద్రుడేమో ఇంగ్లీషులో రమ్మన్నాడు. ఇద్దరూ కలిస్తే ? – తా“రా”శసాం“కం” ఒక కావ్యం.

27. అంతరిషానికి విష్ణుదుర్గమే కేంద్రం కదా – కీలకపదంలోని అక్షరంతో కలిపి శ్రీహరికోట.

29. అబధపు కబుర్లు చెప్పావంటే మచ్చలొస్తాయి జాగ్రత్త – బొల్లి. కల్లబొల్లి కబుర్లు అంటే అబద్ధాలు.

31. కోడికాని కోడికున్న గుడిని హిందీవాళ్ళు పీకేసారు – కోడి కాని కోడి పకోడి. అది హిందీవాళ్ళు పకోడ అంటారు.

32. కారు కాని కారే ఏనుగు కాని ఏనుగు కూడాను – కీలకపదంలోని అక్షరంతో కలిపి వదంతి. కారు కాని కారు పుకారు. దంతి అంటే ఏనుగు కాబట్టి దంతి కాని దంతి వదంతి అంటే పుకారనే కదా అర్థం.

35. 40 అడ్డంలోని భక్తుడు భగవంతుణ్ణి ఏలా తిట్టాడో తెలుసా? పైగా ఆయాసపడొద్దని సముదాయింపొకటీ! – 40 అడ్డంలోని భక్తుడు రామదాసు.“అబ్బ తిట్టితినంచు ఆయాసపడబోకు రామచంద్రా” అన్నాడు కదా.

36. లేని లేని అనంతా, నువ్వొక భ్రాంతివేనా? – అనంతా లో “అన్” అంటే లేని అని అర్థం. అది తీసేస్తే ఉండేది “అంతా”.

37. పదునైన వేడి తగిలింది – కీలకపదంలోని అక్షరంతో కలిపి చురుకు. చురుకు అంటే పదుననీ అని అర్థం, అలాగే చురకడం అంటే వేడి తగలడం.

38. 6 అడ్డానికి వ్యతిరేకం – 6 అడ్డం కొత్తకి వ్యతిరేకం పాత.

Posted in గడి | Tagged | 1 Comment

2009 మే గడిపై మీమాట

2009 మే గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి

పాత గడులు

———————————-

Posted in గడి | Tagged | 16 Comments