తామస విరోధి – ఆరవ భాగం

కిరణ్ కుమార్ చావా :

ఆ ఒడ్డు నుండి నువ్ నన్ను,
ఈ ఒడ్డు నుండి నే నిన్ను,
పరికిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ,
ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం.

ఎప్పుడో కుదుళ్లు వేరైపోయినా,
ఎప్పటికప్పుడు గాయాల కాలవలకు
పూడికలు తీస్తూ, గట్లు కడుతూ,
ఇన్ని వసంతాలూ రక్తం పారించాం.

నీ వైపు పూలు, నా వైపు ముళ్లు నువ్వూ,
నా వైపు పూలు, నీ వైపు ముళ్లు నేనూ,
లెక్కేస్తూ, ఎకసెక్కాలాడుతూ, వెక్కిరిస్తూ
ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం.

నడుమ దేవుని పాదాలపై మంత్రాక్షరాల్ని
ఎడమ నుండి కుడికి నేనూ,
కుడి నుండి ఎడమకు నువ్వు,
ఉచ్చరిస్తూ, మోక్షమాసిస్తు,
సింహ గర్జన చేస్తూ,
తొడలు చరుస్తూ,
బళ్లాలు నేలకు కొడుతూ,
ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం.

తమ్ముడా అని నోరారా అని
కౌగిలింతలోకి తీసుకొని
కొత్త వసంతాన్ని పిలవాలన్పిస్తుంది
కానీ, కానరాని పొరలేవో ఆపుతున్నాయి.

ఆ ఒడ్డు నుండి నువ్ నన్ను,
ఈ ఒడ్డు నుండి నే నిన్ను,
పరికిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ,
ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం.

—-
నెనర్లు,

కత్తి మహేష్ కుమార్: ఈ సారి దెబ్బ చాలా బలంగా తగిలింది. ప్రేమికుల పిరికివిరహం నుంచీ, కులమతాల మూర్ఖత్వపు పట్టుదల దాకా. భావజాలాల అతివాదాల నుంచీ, భారత్-పాక్ సరిహద్దు గొడవదాకా అన్నింటినీ కలిపి కొట్టారు…జైహో!

చావా కిరణ్ కుమార్: వీరిలో ప్రేమికుల గురించి మాత్రం నేనేమీ అనుకోలేదు. అది తప్ప మిగిల్న విషయాల్లో ఇద్దరం ఒకే రకంగా ఆలోచించాము. 🙂

బొల్లోజు బాబా: మంచి పోయెం. సన్నగామొదలుపెట్టి జూమ్ చేయాలన్న మీ ప్రయత్నం నూరు శాతం నెరవేరింది. మొదట ఏదో విరహగీతం అనిపించినా, పోయేకొద్దీ కవితా వస్తువు పరిధీ, లోతూ పెరుగుతూ సాగింది. మహేష్ గారి కామెంటు చదివేసరికి కవితపట్ల మదిలో ఏర్పడిన అవగాహనలోని అన్ని లాక్యునేలూ పూరింపబడినట్లనిపించింది. మంచి కూర్పు.

త.య.భూషణ్: ఈ కవితలో కొత్తదనం లేదు. పునరుక్తి ఎక్కువయింది. దానికి తోడు sentiment ఒకటి. ఇలా తిరగరాస్తే కొంచెం గుడ్డిలో మెల్ల.

ఆ ఒడ్డు నుండి నీవు
ఈ ఒడ్డు నుండి నేను
ఇన్ని వసంతాలు
ఇట్టే గడిపేశాం.

ఎప్పుడో వేరైపోయినా,
ఎప్పటికప్పుడు కాలవలకు
పూడికలు తీస్తూ, గట్లు కడుతూ,
ఇన్ని వసంతాలూ రక్తం పారించాం.

ఆ ఒడ్డు నుండి నీవు
ఈ ఒడ్డు నుండి నేను
ఇన్ని వసంతాలు
ఇట్టే గడిపేశాం.

బొల్లోజు బాబా: భూషణ్ గారికి..
నాకు చిన్న సందేహం. మీరు చేసిన దిద్దుబాటు బాగుంది. క్లుప్తంగా ఉంది. రక్తం పారించాము అనటం, అసలు కవితలో లేని/చెప్పలేకపోయిన స్ఫష్టతను, ఫోర్స్ ను గొప్పగా ఆవిష్కరిస్తోంది. అసలు కవితలోని కొన్ని ప్రతీకలను, విశేషణాలను, కొన్ని భావచిత్రాలను మీరు తొలగించారు.
ఉదా:
ఎప్పుడో కుదుళ్లు వేరైపొయినా, (ఎప్పుడో పార్టిషన్ జరిగినా)

నీ వైపు పూలు, నా వైపు ముళ్లు నువ్వూ,
…….(ఒకరితప్పులను మరొకరు ఎత్తిచూపుకొంటూ)

ఎడమ నుండి కుడికి నేనూ, …… (హిందూ మరియు ముస్లిం భాషా సాంప్రదాయాలను తెలియచేస్తుంది)

తమ్ముడా అని నోరారా అని …..(మనసులో నిన్ను దగ్గరకు తీసుకోవాలని నాకున్నా, నాచుట్టూ ఎన్నో అడ్డుగోడలు)

కవితలో మీరు ఆరోపించిన పునరుక్తి కనపడుతుంది. కొంత రిఫైన్ మెంట్ అవసరమే. కానీ దాన్ని ఒక కథన/శైలి ప్రక్రియలా ఎందుకు అనుకోరాదు? (అమాయకమైన ప్రశ్నే కావొచ్చు, నవ్వుకోవద్దు. ఎందుకంటే శ్రీ శ్రీ గంటలు కవితలో అన్నీ గంటలే కనిపిస్తూంటాయి నాకు)

ఇక అసలు ప్రశ్న..

మీరు తీసేసిన వాక్యాలు పైన చెప్పిన భావాలను సమర్థవంతంగానే వెలువరిస్తున్నాయిగా! అవి కవితకు ఒక విస్తృతమైన కాన్వాసును, వెడల్పును కలిగిస్తున్నాయిగా. అవి మరీ వాచ్యంలా ఏమీ లేవే! మరి వాటిని ఎందుకు తొలగించుకోవాలి? నిజానికి ఒక కవికి కలిగిన భావస్పందనను పదాలలో వాక్యాలలో పేర్చుకొన్నాక, వాటిని ఎడిట్ చేసుకొనే ప్రక్రియలో, ఇలా ఒక్కో పదమూ, వాక్యమూ తొలగించుకొంటూ పోయి, అసలు కవితను, మీరు ఎడిట్ చేసిన విధంగా తయారు చేసి, పాఠకునికి అందించినపుడు, ఆ చదువరి మనసులో అసలు(వరిజినల్) కవిత చదివినపుడు కలిగిన ఫీల్ కలుగుతుందా? నాకయితే సందేహంగానే ఉంది. మరి అలాంటప్పుడు, అసలు కవితను అల్లానే ఉంచుకోవటంలో అభ్యంతరమేమిటి? (ప్రస్తుత చర్చలోని కవితనైతే కొన్ని స్వల్ప మార్పులతో)

క్లుప్తత పేరుతో, కవితను చిక్కగా తయారు చేసి, అది ‘అర్థం చేసుకొన్నవారే చదువుకుంటారులే, అర్థంకాదు అనే వాళ్లను సుబ్బరంగా వచనం చదువుకోమనండి’ అని ఒక తెంపరి సమాధానం ఇవ్వటం సమంజసమా? చాలా సందర్భాలలో కొన్ని కవితలు, ఈ క్లుప్తత ప్రక్రియవలన, ఒక పొడుపుకథ స్థాయికి పడిపోయి, పాఠకునికి కనుక్కోండి చూద్దాం అంటూ సవాలు విసరటం
జరుగుతుంది. కవిత్వానికి క్లుప్తత అవసరమే. కవిత్వాన్ని న్యూస్ పేపరు చదివినట్లు చదవకూడదనేదికూడా ఒక ప్రాథమిక సూత్రమే. కాదనను కానీ ఈ ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన కవి హృదయాన్ని పాఠకుడు అర్థంచేసుకోవటంలో కొంత వెతుకులాట లేదా అన్వయం (కొన్నిసార్లైతే మరీ దారుణంగా ఏనుగు అయిదుగురు గుడ్డివాళ్ళ కథలోలా) అవసరమౌతున్నదన్న దానికి వివరణ మీనుంచి వినాలనుంది.

అన్యధా భావించరని భావిస్తూ

త.య.భూషణ్:
భావ విస్తృతి లేనప్పుడు పదవిస్తృతి వల్ల కలిగే ప్రయోజనం లేదు. పిండికొద్దీ రొట్టె. కేవలం మీరు ఇరుగు-పొరుగు దేశాల విభజనకు సంబంధించిన దృక్కోణంతో ఆలోచిస్తున్నారు. వేరుపడటం అన్నభావం ముఖ్యం నాకు; ఆ భావ విస్తృతిని రైలు కింద పెట్టిన
పావలాలా సాగదీస్తే చూడటానికి తమాషాగా ఉన్నా, దాని రూపం పోగొట్టుకుంది కవిత. కవిత్వం ఒక రూపం ద్వారా వ్యక్తమవుతుంది. కవితకు ఒక రూపం, సౌష్ఠవం చాలా అవసరం. (ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి).

ఇన్ని వసంతాలు రక్తం పారించాం.
అనడంతో వేర్పాటుభావం సుస్పష్టం.

ఎలా పారించాం అన్నదానికి మిగిలిన వాక్యాలు సమాధానం. అవి పాఠకులకు వదిలేస్తే మంచిదని నా అభిప్రాయం; అలాగే ఉంచుకోనూ వచ్చు.(అది కవి అపరిణత బుద్ధిని సూచిస్తుంది.)

T.S.Eliot -The Waste Land కావ్యాన్ని Ezra pound నిర్దాక్షిణ్యంగా edit చేసి సగానికి సగం కుదించాడు. మనం చదువుతున్నప్రతి అదే. మనకేమైనా ఇబ్బంది ఎదురవుతుందా అర్థం చేసుకోవటానికి. చాలామందికి అసలు ఒక చిత్తు ప్రతి ఉందని కూడా తెలియదు. ఇలియట్ తను రాసిన కావ్యాన్ని యథాప్రకారం ఉంచుకొని ఉండవచ్చు; తను స్వయానా పెద్ద కవి విమర్శకుడు. అయినా కూడా ఎందుకు ఎజ్రాపౌండ్ సవరణలను అంగీకరించాడు?? (అల్లా అంగీకరించడం వల్ల కావ్యానికి ఒక రూపం సిద్ధించి, నోబెల్ ప్రైజుకు అర్హమైందని చాలా మంది విజ్ఞులు అభిప్రాయ పడతారు).

అన్ని కవిత్వాలకు అందరూ పాఠకులు కారు. నాకు అర్థం కాని కవిత్వం ఇంకొకరికి బాగా అర్థం కావచ్చు. నాకు అర్థమైనవి ఎవరికీ అర్థం కాకపోవచ్చు. కాబట్టే ఇన్ని చర్చలు, వ్యాఖ్యానాలు. ఒక చైనీస్ కావ్యానికి నా దగ్గర ఒక వంద వ్యాఖ్యానాలు ఉన్నాయి. అర్థం కాదు అన్న గొడవ చాలా పాతది. అర్థం కావడానికి మన ప్రయత్నం ఎంత అన్నది ముఖ్యం. ఒక కవిత మీ జీవితాన్ని మార్చగలదు అని మీరు అనుకుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతదూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి.

క్లుప్తతను మన తెలుగు కవులు మరచిపోయి ఒక శతాబ్దమయింది. పొడుపుకథల స్థాయికి కవిత్వాన్ని ఎవరూ దించివేయలేరు, కారణం పొడుపుకథలు బుద్ధికి సంబంధించినవి, కవిత్వం హృదయానికి. వాటి పరిధులు వేరు. అప్రయత్నంగా కవిత్వాలు అర్థం కావాలనుకోవడం పెద్ద దురాశ (దురాశా దుఃఖము, చేటు అన్నది మనకు తెలిసినదే). ఆ దురాశ వల్లే మనకు అర్థం కాని కావ్యాలనన్నీ అటకెక్కించాము.

కవిత్వం సర్వ శ్రేష్ఠమైన కళ. దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు వెచ్చించిన సమయం వృధాకాదు. నిదానంగా దాని ఫలాలు అందుకోగలరు.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=21779&Categoryid=1&subcatid=3

ఇంత చర్చ తర్వాత ఒక చిన్న పరీక్ష: ఈ కవిత క్లుప్తతా ప్రమాణాలు ఏ పాటివో నిర్మొమొహమాటంగా రాయండి.

బొల్లోజు బాబా: భూషణ్ గారు, థాంక్యూ! మీ వాఖ్య ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిసినయ్.

మీరు సూచిస్తున్న ప్రమాణాలు కవిత్వాన్ని లోతుగా అధ్యయనం చేసేవారికొరకని అనిపిస్తోంది. మరి సాధారణ పాఠకుల సంగతి? అసలు సాధారణ పాఠకులంటే ఎవరో ఈ మాటలో బాబ్జీలు గారు సాధారణ పాఠకుని గురించి ఈ క్రింది వాఖ్య చేసారు.
“సాధారణ పాఠకుడు: చిన్న పిల్లల్లాటి వాడు. ఏది జరిగినా “శ్రీశ్రీ” కవితలో చెప్పినట్టు ఆకసమున హరివిల్లు విరిస్తే ఆశ్చర్యంతో, ఆనందంతో చప్పట్లు కొట్టేరకం. మాహాకవుల రచనకీ, మామూలువాళ్ళరచనకీ, ఆఖరుకి సినిమా పాటకీ తేడా పట్టించుకోకుండా “రసాత్మకవయిన వాక్యానికి” సాష్టాంగ పడిపోయే రకం. ఏ గ్రూపు వారు రాసేరో పట్టించుకోని రకం. అసాధారణ పాఠకులు “ఇలాటి దిగుడు ధరల సమయంలో, మబ్బూ, వానా, మల్లెల వాసనా.. లాటి వాక్యాలని ఆనందిస్తావా?” అని గదమాయిస్తే, సిగ్గుపడిపోయే రకం. సిగ్గు పడుతూనే “బాపూ బాగా రాసేడు కదా?” అని మెలికలు తిరిగే రకం. ఎవరైనా ఆంగ్ల రచయితల్ని గానీ, పాత తెలుగు కవుల/రచయితల ని గానీ “కోట్” చేస్తే గజగజలాడీ రకం.”

(ఇలా ఒక పారాగ్రాఫు ఎత్తుకు రావటం ఏవైనా కాపీరైటుల ఉల్లంఘన అయితే, అందుకు నన్ను దయచేసి క్షమించగలరు)

మరి అలాంటి సాధారణ పాఠకులకోసం కవి బాధ్యత ఏమీ లేదా? అసలు సాహిత్యానికి చదువరులు తరిగిపోతున్న ఈ తరుణంలో, కవిత్వాన్ని సంక్లిష్టపరచి (నేమాట్లాడుతున్నది క్లుప్తతపేరుతో ఒక విస్తృత అనుభవాన్ని చదువరికి దూరం చేసే ప్రక్రియగురించి మాత్రమే) ఉన్న కొద్దిపాటి పాఠకులను చేజార్చుకోవటం అవసరమా?

ఇక ఈ కవిత క్లుప్తత పై నా అభిప్రాయాలు. ఈ క్రింది పదబంధాలను సంక్షిప్త పరచవలసిన అవసరముందనిపిస్తుంది.

బళ్లాలు నేలకు కొడుతూ, (ఇది అనవసరం)
పరికిస్తూ, పరిశీలిస్తూ, పరిక్షిస్తూ, (ఇన్ని క్రియలు అవసరం లేదేమో)

నీ వైపు పూలు, నా వైపు ముళ్లు నువ్వూ,
నా వైపు పూలు, నీ వైపు ముళ్లు నేనూ,
(భావం బాగుంది కానీ ఇంకొంచెం క్లుప్తంగా చెప్పచ్చుననిపిస్తుంది)

ఉచ్చరిస్తూ, మోక్షమాసిస్తు, (వాచ్యంలా అనిపిస్తున్నాయి)

మీ లింకు చదువుతున్నాను. ధన్యవాదములు.

త.య.భూషణ్:

మొట్టమొదట మనకు ఒక విషయంలో స్పష్టత ఉండాలి. పాఠకుల్లో సామాన్యులనీ, గంధర్వులనీ రెండు జాతులు లేవు. ఎవరైనా అతితెలివి ఉపయోగించి ఒక నిర్వచనం వెలిగించినా దాని వల్ల ప్రయోజనం సున్న. అన్ని కవితలు అందరికీ ఒకేలా అర్థం కావు. మీకు తేలికగా అర్థమైన కవిత నాకు ఒక పట్టాన కొరుకుడు పడక పోవచ్చు. అతి దుష్కరమైన కవిత్వం కొందరికి అవలీలగా తలకెక్కవచ్చు. ప్రముఖ రచయితకు అర్థం కాని కవిత ప్రెస్సులో ప్రూఫులు దిద్దేవాడికి ఓస్ ఇంతేనా అనిపించవచ్చు. అసలు కవిత్వం సాహిత్యం ఈ గొడవలేమీ తెలియని పేకాట రాయుడు ఇచ్చిన పదికవితల్లో ఏది ఉత్తమమో సవిమర్శకంగా చెప్పవచ్చు. వీరిలో ఎవడు సాధారణ పాఠకుడు?? ఎవడు రెక్కలున్న గంధర్వుడు??

నేను సూచిస్తున్న ప్రమాణాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఏ కాలంలో (తెలుగు) కవిత్వానికి ఎక్కువమంది పాఠకులున్నారు??
తరిగిపోవడం, పెరిగిపోవడమన్నది ఉట్టిమాట. కవిత్వం పట్ల కవికి బాధ్యత ఉంటే చాలు. తతిమ్మావన్నీ వాటంతటవే దారిలోకి వస్తాయి.
ఏ కాలంలోనైనా కవిశబ్ద వాచ్యుడికి కవిత్వాన్ని సంక్లిష్ట పరిచే అవసరం లేదు; అలాగని చెప్పి అరటిపండు వలచిపెట్టే అవసరమూ లేదు. పాఠకుల మీద ఊరికే జాలిపడిపోయే కవులు స్వయానా ఎదగలేరు, పైపెచ్చు పాఠకులను ఎదగనివ్వరు. క్లుప్తత కవిత్వాన్ని సంక్లిష్టపరచదు, అలాగని చెప్పి తేలిక చేయదు; అది కవిత్వానికి అతి సహజగుణం. ఈ విషయంలో ఇంతకన్నా చర్చ అవసరం లేదని నా అభిప్రాయం.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

One Response to తామస విరోధి – ఆరవ భాగం

  1. భూషణ్ గారు కవిని ఎడిటోరియల్ కళ్ళతో చూడ్డం చాలా బాగుంది. ఎంతైనా సాధారణ పాఠకుడికీ సంపాదకులకూ ఆమాత్రం తేడా ఉండాలి.

Comments are closed.