వర్డ్‌ క్యాన్సర్‌

– అరుణ పప్పు

‘మీకు క్యాన్సర్‌’ అన్నాడు డాక్టర్‌.
నా కాళ్లకింది భూమేమీ కదిలిపోలేదు.. నా కళ్లేమీ గిర్రున తిరగలేదు.. తూలిపడబోతున్నట్టు అసలే అనిపించలేదు.. అయినవాళ్లని తలుచుకుని అశ్రువులేమీ కిందికి జారలేదు.. అర్ధాంతరంగా, అదీ నిండా ముప్ఫై నిండకుండా పలకరిస్తున్న మృత్యువును తలచుకుని నాకేమీ భయమనిపించలేదు.. వణుకు అసలే పుట్టుకురాలేదు.
మరేం జరిగిందయ్యా అంటే –

సూర్యుడు ప్రతిదినమ్మూ తూర్పునే ఉదయించునన్న సత్యాన్ని స్కానింగులు చేసీ, బయాప్సీలు తీసీ.. వారం తర్వాత మనమేమనుకుంటామేమోనని భయంభయంగా చూస్తూ ఎవరైనా చెబుతున్నారనుకోండి.. పక్కుమని నవ్వురాక ఏం చేస్తుంది? అందుకే నాకు నవ్వొచ్చింది.

సహజాతిసహజంగా నాకు తెలిసిన నిజాన్ని మరొకరి నోటంట విన్న భావన కలిగింది. ‘హేయ్‌ ఇది విన్నావా.. సూర్యుడు తూర్పున ఉదయించును..’ అని పొద్దున్నే మనం వాకింగ్‌కు వెళుతుంటే ఎవరయినా ఎదురుపడి చెబితే ఎలాగుంటుంది? నాకలాగనిపించింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఆనాడు ఎదురయినట్టయింది. క్యాన్సర్‌ అవునో కాదోనన్న సందేహాన్ని పారద్రోలడం కాదు అతను చేసింది.. అవునన్న నా లోలోపలి అభిప్రాయానికి వాస్తవాల ఋజువులతో వత్తాసు పలికాడా డాక్టరు ఆ ముక్క నాకు చెప్పినప్పుడు. ఇంకా చెప్పాలంటే సూర్యుడు ప్రతిదినమ్మూ తూర్పునే ఉదయించునన్న సత్యాన్ని స్కానింగులు చేసీ, బయాప్సీలు తీసీ.. వారం తర్వాత మనమేమనుకుంటామేమోనని భయంభయంగా చూస్తూ ఎవరైనా చెబుతున్నారనుకోండి.. పక్కుమని నవ్వురాక ఏం చేస్తుంది? అందుకే నాకు నవ్వొచ్చింది.

‘అయ్‌ డోంట్నో వాట్టూ టెల్యూ. అండ్‌ అ య్‌ డోంట్నో వాట్టూడూ.. అయినా మీకు చెప్పే తీరాలి..’ అంటున్నాడా అంకాలజిస్ట్‌.

అబ్బా.. సినిమాలు చూసి ఎంత పాడయిపోతారో జనాలు. సమస్య ఉన్నదేమో నాకు.. ఉన్నదున్నట్టు చెప్పాల్సింది ఆయన. దానికింత తాత్సారం, శషభిషలూ ఎందుకు?

‘సీ.. దిసీజ్‌ ఫస్టైమ్‌ ఇన్దవాల్డ్‌..’

హా… వాటే ఫన్‌.. బాగా పేరుందని ఈయనదగ్గరకొచ్చేను చూడూ.. నాకు బుద్ధుండాలి.. పదిమందిలో ఒకరికున్న క్యాన్సర్‌ను పట్టుకుని ప్రపంచంలో మొదటిసారి అంటాడేమిటో.
‘క్యాన్సరంటే తెలియని చిన్నపిల్లలు కూడా ఉండరు.. ఈయనేమిటి ఇలాగంటాడని ఆశ్చర్యపోకండి..’

అబ్బా.. మనవాడికి మైండ్‌ రీడింగ్‌ కూడా తెలిసినట్టుంది. సరే కానీ. ఎంతమందిని చూళ్లేదూ?

‘యువర్‌ కేసీజ్‌ డిఫరెంట్‌..’

పసిపాపగా ఉన్నప్పట్నుంచీ పాలకి బదులు పదాల్ని తాగినందుకిదా పర్యవసానం?
ఊహ తెలియక ముందు నుంచీ అక్షరాల్ని నమిలి మింగిన ఫలితం ఈ రూపం ధరించిందా?
వాక్యాల్ని పట్టుకుని ఉయ్యాలలూగిన వైనమిలా వికటించిందా?
కుర్యాత్కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ.. సరస్వతీ నమస్తుభ్యమని ఉపాసించినందుకీరీతి వశమైందా అమ్మ? వచ్చెయ్యమని పిలుస్తోందా..
అక్షరాల్ని ఒక్కటొక్కటిగా చెక్కుకుంటూ, వాక్యాల్ని పేర్చుకుంటూ బతుకును నెట్టుకొస్తున్నదాన్ని.. తిన్నా తాగినా ఏడ్చినా నవ్వినా సుమించినా రమించినా అన్నీ వర్ణమాల వర్గ సంచయంతో కాదూ!

కార్పొరేట్‌ హాస్పత్రుల్లో ఈ మాట ప్రతి డాక్టరూ జలుబని వెళ్లినవాడిక్కూడా చెప్తారని నాకు తెలీదా?
‘వాట్వీ డిటెక్టెడ్‌ ఈజ్‌.. మీ ఒంటినిండా పదాల పుట్టలు.. రక్తం నిండా అవే. మెదడులోనైతే గుట్టల్గుట్టలు.. వర్డ్‌ క్లాట్స్‌.. ప్రిసైస్లీ.. మీకు వర్డ్‌ క్యాన్సర్‌..’
‘అంటే మాలిగ్నంట్‌ సెమాంటిక్‌ లింఫోమానా డాక్టర్‌..’ అంటూండగానే చిన్న నవ్వు మొలిచింది నా పెదాల పైన. ఎందుకో అది శుక్ల విదియ నెలబాలుడిలా వెలసిన కొద్దిసేపటికే వెలిసిపోయినట్టు తెలుస్తూనే ఉంది.
డాక్టర్‌ నావైపు భయంగా చూశాడు. ‘యస్‌, క్లినికల్‌ లక్షణాలివే..’ అంటూ గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.

పసిపాపగా ఉన్నప్పట్నుంచీ పాలకి బదులు పదాల్ని తాగినందుకిదా పర్యవసానం?
ఊహ తెలియక ముందు నుంచీ అక్షరాల్ని నమిలి మింగిన ఫలితం ఈ రూపం ధరించిందా?
వాక్యాల్ని పట్టుకుని ఉయ్యాలలూగిన వైనమిలా వికటించిందా?
కుర్యాత్కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ.. సరస్వతీ నమస్తుభ్యమని ఉపాసించినందుకీరీతి వశమైందా అమ్మ? వచ్చెయ్యమని పిలుస్తోందా..
అక్షరాల్ని ఒక్కటొక్కటిగా చెక్కుకుంటూ, వాక్యాల్ని పేర్చుకుంటూ బతుకును నెట్టుకొస్తున్నదాన్ని.. తిన్నా తాగినా ఏడ్చినా నవ్వినా సుమించినా రమించినా అన్నీ వర్ణమాల వర్గ సంచయంతో కాదూ!

ఇంతకీ వర్డ్‌ క్యాన్సర్‌.. పదం బావుంది.
ఇదొచ్చినందుకు బాధపడుతున్నానా.. విచారిస్తున్నానా.. అనుమానం ధ్రువపడినందుకు ఆనందిస్తున్నానా?
‘ఇంతగా విస్తరించిన క్యాన్సర్‌ సెల్స్‌ను తొలగించడం ఎలాగన్నదే మన ముందున్న ప్రశ్న. మీరు మరికొంచెం ముందొచ్చుంటే బావుండేది. ఇట్స్‌ టూ లేట్‌.. ఇప్పుడు వీటిని నిర్మూలిస్తే మీ ప్రాణానికే ప్రమాదం..’
ఇంతసేపటికీ డాక్టరుకు అసలు విషయం అర్థమయింది. కాని విషయమూ ఒకటుంది.
ఎవడిక్కావాలండీ బోడి ప్రాణం…?

కుమ్మరి పురుగు దొర్లించుకున్నా తొలుచుకున్నా తిన్నా మట్టే. నేనో కుమ్మరిపురుగును. నిర్మించినా, విసర్జించినా అన్నీ వాక్యాలే. పదాల దృక్చిత్రమాలికలే. అవే లేకపోయాక నేనుండీ ఏం లాభం? అప్పుడు నేను శవప్రాయాన్ని కానూ!!
ఇప్పటిదాకా చెప్పలేకపోయిన వాక్యాలే నన్నీ వర్డ్‌ క్యాన్సర్‌ బారిన పడేశాయా..
ఎప్పటికప్పుడు పొందిగ్గా పేరుస్తూనే ఉన్నానే..! మరింతగా ఒళ్లంతా ఎలా చెల్లాచెదురయ్యాయబ్బా..

కుమ్మరి పురుగు దొర్లించుకున్నా తొలుచుకున్నా తిన్నా మట్టే. నేనో కుమ్మరిపురుగును. నిర్మించినా, విసర్జించినా అన్నీ వాక్యాలే. పదాల దృక్చిత్రమాలికలే. అవే లేకపోయాక నేనుండీ ఏం లాభం? అప్పుడు నేను శవప్రాయాన్ని కానూ!!
అంతకన్న పదాల క్యాన్సర్‌తో శవం కావడమే నయం.

“నాకు తెలుసు.. అయస్కాంతానికి ఇనుప రజను అంటుకున్నట్టు నా వేళ్ల చివరన పదాలు అతుక్కుంటున్నాయి.. నేనే గనక కీబోర్డు మీద వేళ్లు టకటకలాడించి వాటిని విదుల్చుకోకుంటే అవి వెనక్కి తిరిగెళ్లిపోయి నా హృదయం చుట్టూ వర్డ్‌ క్లాట్స్‌ను ఏర్పరుస్తాయి. నెత్తురు గడ్డకట్టడం కన్నా పదాలు గడ్డకట్టడం మరీ ప్రమాదం. ఎందుకంటారా, రక్తం గడ్డలు కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పడితే వెంటనే చంపేస్తాయి. వర్డ్‌ క్లాట్స్‌ అలా కాదే.. అవి ఎక్కడివక్కడే ఉండిపోతాయి. చెప్పదల్చుకున్నవీ, చెప్పలేకపోయినవీ భావాలతో నిండిన పదాలు… అప్పుడప్పుడూ గుండె నొప్పిని తెప్పిస్తుంటాయి.. ”

ఎంత బాగా చెప్పిందో మీనాక్షి రెడ్డి తన పుస్తకంలో.
మరి నేను? ఇప్పటిదాకా చెప్పలేకపోయిన వాక్యాలే నన్నీ వర్డ్‌ క్యాన్సర్‌ బారిన పడేశాయా..
ఎప్పటికప్పుడు పొందిగ్గా పేరుస్తూనే ఉన్నానే..! మరింతగా ఒళ్లంతా ఎలా చెల్లాచెదురయ్యాయబ్బా..
చిన్నప్పుడు టీచర్లు చెప్పిన డిక్టేషన్‌ రాశాను.. అమ్మానాన్నా చెప్పినవన్నీ రాశాను.. పెళ్లయ్యాక గ్రామరదికాదు ఇదంటే నేర్చుకున్నాను.. ఒళ్లోని చంటిపిల్లాడితో కలిసి కొత్త అనుభూతుల్ని ఉంగాలు కొట్టాను.. పాత్రికేయంలో పాఠకులకు నచ్చేలా రాశాను.. ఎడిటరేదంటే అది రాశాను.. ఎవరేది చెప్పమంటే అది చెప్పాను కదా. ఎప్పటికప్పుడు వర్డ్స్‌ క్లాటయిపోకుండా విదుల్చుకున్నానే. మరిదేం క్యాన్సరో. ఇంకేదో ఉండిపోయిందా..

ఆ.. తెలిసింది.
అస్తమానం సిగరెట్లు కాల్చేవారికి ఊపిరితిత్తుల క్యాన్సరూ, కడుపునిండా తాగేవాళ్లకి లివర్‌ క్యాన్సరూ వచ్చినట్టన్నమాట. అస్తమానం అదే పనిగా పదాల్ని పీలుస్తూ గడిపినందుకిది.
కీమోథెరపీ చేస్తే, రేడియేషనిస్తే రా…లి, పో.. వడానికివేమైనా నెత్తిమీద వెంట్రుకలా..
దానికీ భాషుంది తల్లీ.. వాటిని శిరోజాలు అనాలి. శరీరమ్మీదైతే రోమాలు.. మీసంగడ్డం కలిసి శ్మశ్రువు… శష్పమంటే.. ఛా.. ఒద్దు.. బాతోబాతోంమే ఎన్ని పాఠాలు వినలేదు..
అయినా ఒంట్లోంచి పదాలలా రాలిపోతే ఎలా?
మళ్లీ కొత్తవి వస్తాయా?
అభినందనలూ నిరసనలూ సరసాలూ విరసాలూ పదాల పునాదుల మీద కాదూ నిలబడింది? వాక్యాల ప్రహరీగోడలే లేకపోతే మనమంతా ఓ కుటుంబంలా ఉండగలుగుదుమా?

డాక్టర్‌ దగ్గర సెలవుపుచ్చుకుని ఇంటికెళదామని బైటకొచ్చి నిలుచున్నా.
అకస్మాత్తుగా ఆకాశం మబ్బు పట్టింది. తల పై కెత్తి చూస్తే మేఘాలు. ఏనుగుల్లా ఎలా కమ్ముకొస్తున్నాయో. ఈ ఉపమను ముందు వాడిందెవరో, వాల్మీకా వ్యాసుడా భాసుడా! తల పైకెత్తి చూస్తుంటే ఠప్‌మని వానచుక్క సూటిగా ముక్కుమీద గుద్దే సూటి మాటలా వచ్చి తాకింది.
మేఘమథనం చేస్తున్నామన్న వార్త నిన్నే చదివాను.
ఇంతకీ పదమథనం చేస్తే ఏమొస్తుంది? మురిపించడానికి ముందేదో ఒక స్పెల్‌బీ అవార్డూ, కొన్ని ఆహాఓహోలూ, ఆక్స్‌ఫర్డ్‌ సర్టిఫికెట్టూ రావొచ్చు. తర్వాత మింగాల్సిన గరళం వర్డ్‌ క్యాన్సర్‌. పట్టుకుందంటే మరొదల్దు. భాషాసాగరమథనంలో అదే అంత్యాన మనల్ని వరించే మహాలక్ష్మి. ఈమాట ఉద్యోగంలో చేరిన కొత్తలోనే మా పతంజలి దగ్గర కూచోబెట్టుకుని మరీ చెప్పేవాడు. “తల్లీ, అక్షరాలు రక్కుతాయి. రక్తాలొచ్చేట్టు కొరుకుతాయి. మీదపడి కరిచేస్తాయి. దోమల్నీ పాముల్నీ మీదకు దూకేసిన పులినీ విదిలించుకోలేనట్లు తప్పించుకోలేనట్లు, అక్షరాల నుంచి కూడా తప్పించుకోలేరెవ్వరూ. అటువంటి అక్షరాలు వార్తాపత్రికల్లో కూడా పుడుతుంటాయి.”
నేనలాంటి అక్షరాల శిల్పిని కావాలని ఎంతో అనుకున్నాడాయన. ఏం లాభం? వర్డ్‌ క్యాన్సరంటూ వచ్చి పడి, నన్ను అర్ధాంతరంగా లాక్కుపోతుందని ఆయనకు తెలీదుగా!

ఇంతకీ దొహరాయిస్తున్నదేమంటే నేను ప్రపంచంలో ప్రప్రథమ వర్డ్‌ క్యాన్సర్‌ రోగిని.
ఈ వార్తకు మా పాత్రికేయప్రపంచమెలా స్పందిస్తుందో! ఎవరే మాటలతో హెడ్డింగులు పెడతారో, ఎవరెంత అందంగా వార్త రాస్తారో వ్యాఖ్యానిస్తారో చూడాలి. రేప్పొద్దునే పేపర్లు. నాకో గంటన్నర భోజనం. అప్పటివరకూ ఆగుతారా టీవీల వాళ్లు? స్క్రోలింగులేమని ఇస్తారో! నాక్కుతూహలం పెరుగుతోంది. వర్డ్‌ క్యాన్సర్‌ సోకిన తొలి వ్యక్తిగా నేను చరిత్రలో నిలిచిపోతాను!! ఎంత బావుందో ఈ ఆలోచన. ఆలోచన అనాలా.. ఊహ అనాలా.. వద్దు.. ఇలా చేసే ఇంత వరకూ తెచ్చుకున్నాను.
అవునూ ఇప్పుడిలా అర్ధాంతరంగా చచ్చిపోతే ఇప్పుడిప్పుడే స్పెల్లింగులు నేర్చుకుంటున్న కొడుకేమవుతాడు? హెలికాప్టర్‌ స్పెల్లింగేటమ్మా.. అనడుగుతూనే చేతుల్ని రెక్కల్లా విప్పి ఝామ్మని దూసుకెళ్లే నా చిన్ని కృష్ణుడేమవుతాడు?
వాన పెద్దదయింది. చూస్తుండగానే మహోధృత రూపం దాల్చింది. నటరాజ నర్తనంలా. ఉరుములు, మెరుపులు.

జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింపనిర్ఘరీ విలోల వీచివల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్జ్వలల్లాటపట్టపావకే కిశోర చంద్ర శేఖరేరతిః ప్రతిక్షణం మమ..

నిల్చున్న దగ్గర తుంపర పడి తడి అనుకున్నది కాస్తా పిల్ల కాలువలాగా మారింది.
జల్లుమంటు సిరివానా చందనాలు కురిసేనా.. సిరివెన్నెలా, నాకీ మోహమెలా పోతుందో చెప్పవూ..
ఎగువనెవరో కాగితప్పడవలు చేసి వదుల్తున్నారు..
వాగనుశాసనుడు, శబ్ద శాసనుడు నన్నయ నుంచీనా, పెద్దన వరకూనా శ్రీశ్రీ శ్రీపాదా మల్లాదీ కూడానా.. వాళ్లకన్నా ఎగువనెవరో ఇంకెవరో ఉన్నారే..
అన్నీ దిగువకు ప్రవహిస్తున్నాయి.. టీవీలూ నేరాలూఘోరాలూ తప్ప మరేం పట్టని లోకంలోకి వీళ్లిలా ప్రవహించడం ఆకాశంబుననుండి అందుండి ఉండుండి వివేకభ్రష్టసంపాతమా.. ఏమో అవునేమో.. కాదేమో.

బాగా తడిసయినా ఇంటికి తొరగా వెళ్లాలని పూర్తిగా వర్షంలోకి వచ్చేశాను. నడుస్తున్నాను..
అరె.. ఎన్ని వాక్యాలు వర్షిస్తున్నాయో.. ఎన్ని పదాలు పడుతున్నాయో..
హ్యాండ్‌బ్యాగేదీ.. కొన్నిటిని పట్టుకుంటా.. ఈ ఎడారి జీవితంలో మళ్లీ దాహం తీర్చుకోవడానికి కావాల్సినన్ని ఎప్పుడు దొరుకుతాయో. బోల్డన్నిటిని అందుకోవాలి.. సందర్భానుసారం వాడుకోవాలంటే పదప్రజ్ఞ అవసరం. నా దాహం వెర్రిగా పెరిగిపోతోంది.
ఇప్పటికిప్పుడు కొన్నిటిని నింపుకొందామని బుర్రను ఓపెన్చేశా..
చేతుల్తో దేవులాడి మరికొన్నిటిని పోగుచేశా.. అబ్బే ఎక్కడ.. అన్నీ రావటం లేదే.
అదిగో వచ్చేశాడు అమరసింహుడు. ప్రౌఢతరభాషాతిప్రగల్భుండు.. పెద్ద గోనెసంచులు తీసుకొచ్చాడు.. అన్నీ ఏరేసుకుంటున్నాడు.. అయ్యో నాకేమీ మిగలవుగాబోలు… ఇప్పటికే అతన్దగ్గర చాలా ఉన్నాయి.. అమరకోశం రాశాడుగా మరి. మళ్లీ నాతో పోటీకొస్తాడేమిటో.. ఇదేమిటి… ఇటు తిరిగి చూస్తే ఈ తెల్లవాడెవడు? రోజెట్స్‌!! థెసారస్‌ రాసిందీయనే కదా? వీళ్లిద్దరికీ ఎంత పదసంపద ఉందో…

నిశ్శబ్దం, మౌనం బావుంటాయని చాలా సార్లే చదివాను. లేనివాటిని దొరకనివాటిని రొమాంటిసైజ్‌ చెయ్యడం రచయితలకు పెద్ద జబ్బు. నా క్యాన్సర్‌ను మించిన పెద్దజబ్బు. నాకు మాత్రం మాటలే బావుంటాయి. వాటితో అల్లే బంధాల అల్లిక బావుంటుంది. పదాలే లేకుంటే ప్రపంచంలో ఇన్ని భావాలు బట్వాడా అయ్యేనా? మౌనాన్నీ చూపునూ ఒక దేహచలనాన్నీ అన్నిటినీ పదాల్లోకి తర్జుమా చేసే భాషంటే నాకు భలే ఇష్టం.

వీళ్లనేం చెయ్యాలి..? ఇక్కణ్నుంచి పొమ్మని తరిమేస్తే..!
ఈ వాన మరో కోనలో కురవదా..? వీళ్లు అక్కడికెళ్లి పట్టుకోరనే గ్యారెంటీ ఏమిటి..!
పోనీ నేనే బజార్లో కొనుక్కుని ఇన్‌స్టెంట్‌గా ఒంటపట్టించుకోనా? పదాల మాలికలు అంగట్లో అమ్మేవీ, కొనేవీనా? కష్టపడకుండా సంచి తీసుకెళ్లి తెచ్చుకోవడానికి!! అమ్మేవారెవరు.. పోతన అమ్మనన్నాడు కదా!

ఆడపిల్లగా కన్నా అడవిలో మానయి పుడితే మేలని రోజుకి వందసార్లంటుంది అమ్మమ్మ.
నాకు మాత్రం అడవికెళ్లినా ఈ బాధ పోయేట్టులేదు. సన్నజాజి తీగలుగా కొన్ని, మోదుగు పూలల్లా కొన్ని.. వాక్యాలు. కొమ్మకొమ్మకో సన్నాయి.. అన్నీ ఆలపించాలి, వాక్యమో సంగీత స్వరంలా అనిపించాలి.. దాన్లో రాగాల తూగుండాలి.. ఉండొద్దు మరీ..?
చదువుతున్నప్పుడది ఉయ్యాలలూపాలి.. తమిబూదీగెల తరహాలో ఆకాశానికంటిన కాళ్లతో కన్నెపిల్లలుయ్యాలూగుతున్నంత.. ధూర్జటి వర్ణనంత తూగుండాలి. ఆయనకీ వర్డ్‌ క్యాన్సర్‌ రాలేదా..? వారవనితా జనితా ఘనతాపహార సంతత మధురోధర సుధారస ధారలలా లైను కట్టేయికానీ క్యాన్సరొచ్చిందా..! వాక్యమంటే రారా చిన్నన్నా.. రారోరి చిన్నవాడ.. అని ముద్దుగా అన్నమయ్య వేణుగోపాలుణ్ని పిలిచినంత మార్దవంగా ఉండాలి. నీలం రంగు నిప్పు పువ్వయి ప్రకాశించాలి. సర్వమూ తానే అయిన వాడిలా వాడిగా లాలించి పాలించాలి. వానవిల్లుమీద నడిచి మేఘాల్లో తేలినట్టుండాలి. కాలిగ్రఫీ చిత్రాల్లా కళ్లకు కట్టాలి. కందర్ప హేతువై ఘనధూమ కేతువై చుట్టుముట్టాలి. యూనిఫామేసుకుని అప్పుడే స్కూలుకొచ్చిన పిల్లలు ప్రభాత వేళ ప్రార్థన సమయంలో లైనుకట్టి నిల్చున్నట్టుండాలి. అప్పుడప్పుడూ భావాలు ఎర్రకోట ముందు సైనికుల్లా కవాతుచెయ్యాలి. మాటలు ఈటెలూ కత్తులూ. అవే చురుక్కుమనిపించే చమక్కులు. మనసుల్ని ముడివేసే మంత్రాలు.
పదాల్ని నేర్చుకోమంటూ ఎన్ని పుస్తకాలో. వర్డ్‌ పవర్‌ మేడీజీ..
వెన్‌ ఇటీజ్‌..?
నెవర్‌. అట్లీస్ట్‌ నెవర్‌ ఇన్మై లైఫ్‌టైం!
ఎప్పటికప్పుడు ఎన్ని డిక్షనరీ డాట్కామ్‌లు తీసి చూసుకున్నా తీరని మోహం.
ఆలోచనల్లో పడి చూసుకోనేలేదు.. ఏరీ అమరసింహుడూ, రోజెట్సూ, నన్నయతిక్కనాది కవులూ? అందరూ గోతాలెత్తుకొని మాయమైపోయారు.

వాన వెలిసి పోయింది.
దోసెడు కూడా రాలేదు నాకు పదాలు.
చుట్టూ పరచుకున్న నిశ్శబ్దం. అదంటే నాకు భయం.
నిశ్శబ్దం, మౌనం బావుంటాయని చాలా సార్లే చదివాను. లేనివాటిని దొరకనివాటిని రొమాంటిసైజ్‌ చెయ్యడం రచయితలకు పెద్ద జబ్బు. నా క్యాన్సర్‌ను మించిన పెద్దజబ్బు. నాకు మాత్రం మాటలే బావుంటాయి. వాటితో అల్లే బంధాల అల్లిక బావుంటుంది. పదాలే లేకుంటే ప్రపంచంలో ఇన్ని భావాలు బట్వాడా అయ్యేనా? మౌనాన్నీ చూపునూ ఒక దేహచలనాన్నీ అన్నిటినీ పదాల్లోకి తర్జుమా చేసే భాషంటే నాకు భలే ఇష్టం.
అంత మంచి మాటలతో ఆటలెన్ని ఆడుకోవచ్చనీ. అదికూడా అందరికీ తెలిసేడిస్తేగా.
కొంచెం తెలిసే నాపనిలాగయింది. నేన్చచ్చిపోతున్నాను.. ఒక్క కొత్త మాటనూ సృజించకుండా. గొడ్రాలిగా.
సరే, పోతున్నానన్నది ఖాయం.
తస్యాశ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితా.. అవున్నేనాయన దగ్గరకే.

ఇప్పుడొక మనవి. ఇది నా విన్నపం.
మై డియర్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ ఎనిమీస్‌
రెలెటివ్స్‌ అండ్‌ ఇర్రెలిటివ్స్‌,

దయచేసి నన్ను పదాల పల్లకీ కట్టి చివరిసారి ఊరేగించండి. అక్షరాల నిప్పులో చివరికంటా చితిని చితికిపోనివ్వండి. ఇంత బూడిదను భరిణలో పెట్టి పవిత్ర పుస్తక ప్రవాహంలో కలిపేయండి. పేపర్లో స్మృత్యంజలి వేయిస్తే శాడ్డిమైజ్‌, ఆబిట్యురీ, నిర్యాణం, కన్నుమూత, అనురాగదేవత అస్తమయం, దశదినకర్మ, వైకుంఠసమారాధన, పెద్దకర్మ.. వంటి రొడ్డకొట్టుడుకు బదులు, మరో అందమైన పదబంధమేదైనా దొరుకుతుందేమో వెతకండి.. ఆ నాలుగు వాక్యాల్లోనూ అచ్చుతప్పులూ అడ్డదిడ్డమైన విరామచిహ్నాలూ లేకుండా ఒక్కసారి జాగ్రత్తగా ప్రూఫులు పట్టిపట్టి చూడండి. నేను తీసుకుంటున్న సుదీర్ఘ విరామానికి వాటితో శరాఘాతాలేమీ తగలకుండా జాగ్రత్తపడండి. నా తులసికోటమీద అఖండమైన అక్షర దీపాన్ని వెలిగించండి. వారసత్వంగా ఒక్క కొత్త పదాన్నీ, ఒక్క సృజనాత్మక వాక్యాన్నీ వదిలెళ్లని నన్ను మన్నించండి. ఒక్క వాక్యాన్నీ నిర్మించని నా అశక్తతను అర్థం చేసుకోండి. ఎందుకలా జరిగిందో విచారించండి. నలుగురు కూచొని చదివేవేళల నాపేరొకపరి తలవండి.

—————–

పప్పు అరుణ పుట్టింది విజయనగరం జిల్లా చల్లపేట అగ్రహారంలో 1979 డిసెంబర్ 9న. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండ. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివినా పాత్రికేయం అంటే ప్రాణం కనుక వృత్తిగా దాన్నే ఎంచుకున్నారు. ఈనాడు ‘ఈతరం’లో ఐదేళ్లు పనిచేసి, ఏడాదిన్నర క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో చేరారు. ‘చదువొక వ్యసనం. అక్షరం కనిపించడమే ఆలస్యం, చదువుతుంటాను. మంచి వచనానికి, కవితాత్మకమైన పంక్తులకూ త్వరగా ఆకర్షితమవుతాను’ అని అంటారామె. పాత్రికేయ జీవితంలోని మానవీయ కోణాల్ని ఆవిష్కరించాలని కథలు రాయడం ప్రారంభించారు. ఆమె భావాల మాలిక ‘అరుణమ్’ బ్లాగు.

This entry was posted in కథ. Bookmark the permalink.

24 Responses to వర్డ్‌ క్యాన్సర్‌

  1. naresh says:

    If I say this short story – a silent onomatopoeia, my comment must be a subtle conceit. How can a humming bee, a whizzing arrow, and a cackling hen remain silent? How can the intermittent beeps, hiccups, bangs be quiet?
    Thus, the insinuating splash of the short story- Word Cancer- is definitely a Conceit!
    This wordy explosion (which ended with writer’s confession that she failed to create even a single creative line- which is again a paradoxical conceit) has developed closely reasoned arguments, or propositions that rely heavily on the use of the conceit. Aruna Pappu, tactically used concealed metaphors, probably to her self-referential account, and agreeably drew an ingenious parallel between apparently dissimilar situations or objects. Aruna’s work is a blend of emotion and intellectual ingenuity.
    As a humble reader, inevitably and invariably becoming her fan, I am startled out of my complacency and forced to think through the argument of the story, filled with ideas, eclipsed by feelings.
    I thank Poddu and Pappu for giving me this conceited experience!

  2. Existential magic realism అంటే ఇదేనా!!!!! ఇదొక అద్భుతమైన ప్రయోగం. రచనాశైలిలో ఒక విన్నూత్న ఒరవడి. పదికాలాలు నిలిచిపోయే కథ. పొద్దు స్థాయి పెరిగింది.

  3. Chilakapati Srinivas says:

    ఆశగొలుపుతూ మొదలైన కథ అక్కడే ముగిసింది. ఒక మాటల కుప్పగా మిగిలి కథగా పూర్తిగా వికసించలేకపోయింది.

  4. “నాకు మాత్రం అడవికెళ్లినా ఈ బాధ పోయేట్టులేదు. సన్నజాజి తీగలుగా కొన్ని, మోదుగు పూలల్లా కొన్ని.. వాక్యాలు. కొమ్మకొమ్మకో సన్నాయి.. అన్నీ ఆలపించాలి, వాక్యమో సంగీత స్వరంలా అనిపించాలి.. దాన్లో రాగాల తూగుండాలి.. ఉండొద్దు మరీ..? చదువుతున్నప్పుడది ఉయ్యాలలూపాలి.. తమిబూదీగెల తరహాలో ఆకాశానికంటిన కాళ్లతో కన్నెపిల్లలుయ్యాలూగుతున్నంత.. ధూర్జటి వర్ణనంత తూగుండాలి. ”

    ఎందుకో తెలీదు, చదువుతుంటే శరీరం చిన్నగా వణికినట్లనిపించింది.. బహుశా ఇంత ‘బాగుండడాన్ని ‘ తట్టుకోలేకేమో!!

  5. excellent narration, theme and presentation. spell bound.

  6. chaalaa baavundanDee !!

  7. Aruna says:

    పదాలు మన వూహలని ప్రభావుతం చేస్తాయి. మీ వ్యాసం ఆదిలోనే నాకొక వికృత వూహని చూపెట్టింది. బహుశా నేను మిగిలిన వారి అంత ధైర్యవంతురాలిని కాదేమో అందుకే, పూర్తిగా చదివే సాహసం చెయ్యలేకపోయాను. అక్కడక్కడా చదివాను. పదాల్లో ఏదో అర్ధం అవ్వని తీవ్రత. భావనలని వ్యక్త పరచి రసరమ్య జీవిత పునాదులు వేస్కోవచ్చే మరి అలాంటీ పదాలు రక్తం గడ్డల్లాగా క్లాట్ కట్టడం ఏమిటి. మేధావిలా వుండాలి అంటే ఒక అందమైన భావాన్ని తునాతునకలు చేసి పునాదులని ఇంత భయానకం గా చేసుకోవాలి అనేట్టైతే నాకొద్దీ మేధావితనం.

  8. ramani says:

    ఒక్కొ పదం ఒక్కో పదం కూర్చుకొని, పేర్చుకొని వాక్యాన్ని నిర్మించి, దానికి వర్డ్ క్యాన్సర్ అని పేరు పెట్టుకొని ఒక వినూత్న ప్రయోగం చేశారు. కాని నిజంగా చెప్పాలంటే లేని పిరికితనం దరిచేరిందో , ఉన్న ధైర్యం పారిపోయిందో తెలీదు కాని వణుకు పుట్టింది. మీరింత మేధావులేంటండి బాబు. ఈ అక్షరమాలని ప్రస్థుతించాలంటే నాకు పదాలు దొరకడం లేదు. నిజమే అన్ని మీరు సూటిగా ముక్కుమీద పడినప్పుడల్లా బ్యాగ్ తెరిచేసి దాచేసుకొంటే ఇహ మాకెక్కడండి, పదాలతో మీ అనుబంధం బాగుంది. కాని మరీ క్యాన్సర్‌తో పోల్చేసారు అది కొంచం భయమేసింది.

  9. Sreenivas Pappu says:

    అసలు ఈ పోస్ట్ కి వ్యాఖ్య రాయాలంటే ఈ పోస్టంత రాయాలి.కానీ ఇంత అధ్బుతంగా రాసిన దానికి వ్యాఖ్యరాయగలిగే సత్త నాకు లేదేమో?అలా సరితూగగలిగే వ్యాఖ్యని రాయలేని నా అసమర్ధతనే(మీరు చెప్పినదే”ఒక్క వాక్యాన్ని నిర్మించలేని నా అసమర్ధతని అర్ధం చేసుకోండి”) సమర్ధత అనుకుని సరిపెట్టుకోగలరు.

    ఇకపోతే అప్పుడెప్పుడో యండమూరి రాసిన “వెన్నెల్లో ఆడపిల్ల” చదివాను ఇలా వెనక్కి ముందుకీ ఒక్కో పేజీ తిరగేస్తూ(అలా ఎన్ని సార్లు చదివానో లెఖ్ఖలేదు కానీ),ఇదిగో మళ్ళీ ఇప్పుడు చాన్నాళ్ళ తర్వాత ఈ పోస్ట్ చదివాను.అంతే అదీ నా అనుభూతి.

  10. కేన్సరొచ్చి మనిషిపోతే పునర్జన్మ ఉంటుందో లేదో తెలియదు. కాని వర్డ్ కేన్సరొచ్చి మనిషి పోయినప్పుడు తిరిగి కవిగా పునర్జన్మ ఉంటుంది. అది చావులేని జన్మ – అని ఈ కథ నిరూపించింది.
    అంత మాత్రాన ఆ వర్డ్ కేన్సరు మనిషికి “సుఖాన్ని” ఇస్తుందనుకుంటే అది పొరపాటే – అని ఈ కథ గుర్తుచేస్తోంది.

  11. vinay chakravarthi says:

    edo artham ayyi avanattu vundi…………….

  12. చదివి అభిమానించి వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.

    చిలకపాటి గారూ, వికసించి ఉంటే మరింత అబ్ స్ట్రాక్ట్ కథగా తయారయ్యాదేమో. నాక్కూడా ఊహకు అందడం లేదు. మొగ్గలోనూ అందముంది. 🙂

    అరుణగారూ, నిజమే, కొన్ని ఊహలు భయంకరంగా ఉంటాయి. ఇది ఉత్తి కల్పనే అయినా, వాస్తవంలో అక్షరాలు అప్పుడప్పుడూ గడ్డకట్టుకుపోతాయి. అప్పుడు ‘గుండెగొంతుకలోన’ కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని పంచిచ్చే అక్షరాలు (అరుదుగానయినా) రక్కుతాయి. ఇబ్బంది పెడతాయి లోపల్లోపల.

  13. అరుణ గారూ,

    పది కాలాల పాటు తెలుగు పాఠకుల మదిలో నిలిచి పోయే కథ రాశారు. భాషపై మీకున్న పట్టు అపూర్వం.

    కొణతం దిలీప్

  14. రవికిరణ్ says:

    అరుణ గారు,

    చాలా బాగా వ్రాశారండి. పదాల జలపాతం క్రింద తడుస్తున్న అనుభవం. అరుణ గారు, ఆ పద వ్రణవేదో నాక్కూడా వస్తే బాగుండు కదా! నేను మీ కథని తలకెత్తుకుంటుంటే, మా మాంగాడు మాత్రం “ఒరే కిరణా, ఆ అరుణమ్మ కథ బాగ రాసిందిగానొరె, కథలో పసుందని నాకనిపీలేదురా” అనేసేడు. సరె, అదేందో నువ్వే ఒకభిప్రాయం రాయకూడదురా అంటే, నువ్వు రాస్కోరా మనకంత ఓపికలేదులే అనేసేడు. అందుకని వాడు వాగిందేదో నేనే వ్రాస్తున్నాను.

    ఒరే కిరణా, మనకొచ్చిన తెలుగెంతరా? మనం సదివింది ఇంటరు వరకు, ఆడ కూడా కొత్త సినిమా వస్తే తెలుగు క్లాసు ఫట్టు. మనకెన్ని తెలుగు పదాలు తెలుసురా. మనూర్లో మనం మాట్లాడే భాష, అందులో మనం ఉపయోగించే పదాలు ఎన్నుంటాయిరా. ఇంకా మనవే నయం కదా, మనకన్నా కనాకష్టవైనోళ్ళే ఎక్కువ కదా ఈ దేశంలో. ఎక్కెడెక్కడి పదాలన్నీ ఏరేసుకుని, నేర్చేసుకుని, కూర్చేసుకోని కవితలు, కథలు రాసేస్తే బాగుండవని కాదునేననేది. బాగుంటాయేవో, కథకులకి, కవులకి, విమర్సకులకి. కానీ రే కిరణా, ఆ ముగ్గురూ కాకుండా మనలాటి నాలుగో తరగతోళ్ళే ఎక్కువరా దేశంలో. ఆ ఆరొందలో, ఏడొందల పదాల తెలుగుతెలిసినోళ్ళేరా ఊర్ల నిండా. పొద్దనలేసి రేత్రిదాకా ఆరుగాలం కష్టవంతా కడుపు నింపుకోడానికి సరిపోతే, ఇంకేం పదాలేరుకుంటార్రా వాళ్ళు. ఆ లెక్కన ఆ పదాలు గుది గుచ్చిన పూలచెండ్ల కొసం ఈ పల్లెటూర్ల అడవుల్లో ఎక్కడని ఎతకతార్రా? ఒకేళ ఏడన్నా, ఎవరికన్నా నచ్చినా, అది ఆ పూలోసనే తప్ప, ఆ పూలకర్థం ఎవరికి తెలుసుద్దిరా?

    ఒరే, మనం సిన్నప్పుడు పాడిండే పాడరా పసిపళ్ళ దాసరని, రాసిందే రాశాం కదా పెతిపదార్థాలు, పెద్దనలకి, తిక్కనలకి, ఇంకా శ్రీనాధులు మొదలయినోళ్ళకంతా. మన బుర్రలో ఏడుండార్రా వోళ్ళంతా ఇప్పుడ? గురూ గారు శ్రీశ్రీ రాసిన కవితలు మనకిష్టవే కదా. ఆయన కవితల్లో కూడా ఆ ప్రతిపదార్థాల లాగానే అర్థం కాని సంస్కృత పదాలెన్నిరా, అయ్యే కాదు అర్థంకాని తెలుగు పదాలెన్నుంటాయిరా? అయినాగాని ఎందుకని ఆయన మనలాటి మామూలు జానాల్లోకి కూడా చొచ్చుకపొయాడు? మనూర్లో పోలేరమ్మ గుడికాడ ఎలిగారే లయిట్లు పరిగిత్తినట్టు మనకవుపిస్తుల్లా. అయ్యేంది, నిజంగా ఎలగటం ఆరటవే కదా. అట్టనే శ్రీశ్రీ కవితలుకూడా మద్దెలో అర్థంకాని, ఆరిపోయిన పదాలున్నా, మనకా వడి తెలస్తది, ఆయన మనకోసం పడిన బాధ తెలస్తది, మన బాధ మనకి తెలస్తది. అదీ కావాల్సింది, ఇప్పుడు శ్రీశ్రీ వుండుంటే, ఆ పదాల్ని ఏ ఏట్లోకో ఇసిరేసి, గద్దరులాగా మనం మాట్లాడుకునే భాషలో, మనకు తెలిసిన మన గడ్డి పూల మాలనే కట్టుండేవాడు. శ్రీశ్రీ ఏవిరా, పెద్దాయన అన్నమయ్య, సరే ఆ కాలపు పదాల్ని కొన్నొదిలెయ్యి, అయ్యిప్పుడు ఎవరూ వాడరు, మిగిలిన పాటంతా మన బాషే కదా. అందులో భక్తిలో తడిసి విచ్చుకున్న గడ్డి పూలే కదా, ఏడన్నా రోజాలు కనపడతాయా?

    ఇయ్యన్నీ ఎందుకురే, నామినో, ఖాదీరు బాబో రాసిన కథల్లో మనలాంటోళ్లకే కాదు, ఆరో తరగతి సదివిన మీ అక్కకి, ఎద్దు తోక తిప్పుకునే మీ నాయనకి, సాకలి పద్దు రాయటం మాత్రవే వచ్చిన మీ అమ్మకి అర్థం కాని పదాలేవుందాయిరా? ఆ కథలు సదివి, ఈళ్ళు నవ్వుకోలా, ఆ కథలు సదివి ఈళ్ళు కన్నీల్లు పెట్టుకోలా, ఆ కథలు ఈళ్ళ గుండెల్లోకి గుచ్చుకోలా.

    సివరాకరికి మందలేందంటే కిరణా, పదాలు కథల్ని సెప్పవురా, పదాలు కవితల్ని వ్రాయవురా, అనుభవాలు వ్రాస్తాయివాటిని. మన బతుకులోంచే ఒక నిమిషాన్ని తీసి మనకి తిరిగి సూపించటవే కథగానీ, కవితగాని. అయ్యోరు మన జవాబులకి రెడ్డింకుతో గీతగీసినట్టు. దానికోసం పాత తెలుగు, సంస్కృత పుస్తకాల్లోకి పదాల వేటకి పోబల్లే. పద వ్రణాల్ని ఎద మీదకు తెచ్చుకోబళ్ళే.

  15. himabindu says:

    Aruna garu,
    I fell in love with your story. mee rachana chadavatam idey modati sari…kaani mee flow aascharya parichindi. ee madya kalamlo ( of course! nenu chaduvutunnadi kooda takkuvey nanukondi…mukhyamga blogula joliki povadam ledu)intha chakkati rachana chadavaney ledu. chadavamani pranahitha ki pampina Dilip gariku dhanyavadalu. alagey thanks to poddu.

    pl keep writing.

    With best wishes,
    Himabindu.S

  16. కథ బావుంది. అంతకంటే కథకి మూలమైన కాన్సెప్ట్ ఇంకా బావుంది. ఎప్పుడో హఠాత్తుగా మనసులో మెదిలే భావాలకి అక్షరరూపం ఇవ్వడం ఇంత కష్టమో, పదాలతో వాక్యాలల్లి ఆటాడుకోడం కూడా అంతే కష్టం. ఆద్యంతం చదివించిన చక్కని పద ప్రయోగం. రచయిత్రికి, పొద్దుకు అభినందనలు.

  17. ఎన్ వేణుగోపాల్ says:

    అరుణ పప్పు గారూ,

    చాల ఉద్వేగభరితమైన, ఉద్వేగ ప్రేరకమైన రచన చేశారు. ధన్యవాదాలు.

    నా కళ్లకు (పాడు కళ్లకు అందామని ఉంది గాని రెండో వర్డ్ కాన్సర్ రోగినవుతానేమోనని భయం!) కనబడిన ఒక పొరపాతు చెప్పనా? రోజెట్స్ అని రాశారు. మొదటిసారి నేనే పొరపాటు చదివానేమోనని అనుకున్నా గాని, రెండోసారి కూడ అలాగే రాశారు. ఆయన పేరు రోజెట్ మాత్రమే, పీటర్ మార్క్ రోజెట్. అక్కడ ఎస్ అపాస్టఫీ ఎస్. క్షమించండి, మీకు తెలియదని కాదు, ఇంత మంచి రచనలో ఒక్క చిన్న స్ఖాలిత్యమైనా ఉండగూడదని. అంతే.

    మీ రచన చదివాక నాకు ఒక పాత సంగతి గుర్తుకొచ్చింది. ప్రితిష్ నందీ ఇలస్ట్రేటెడ్ వీక్లీ నడుపుతున్న రోజుల్లో 1980ల్లో ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ అని ఒక ప్రత్యేక సంచిక తెచ్చాడు. చాలమంది ప్రముఖుల అభిప్రాయాలు వేశాడు. బెంగాలీ కవి, ఫ్రాంటియర్ సంపాదకుడు సమర్ సేన్ అభిప్రాయం కూడ ఉండింది. I don’t have any dreams. I lost the capacity to dream. Perhaps it is cancer. Cancer of the mind లాంటి రెండో మూడో వాక్యాలన్నాడాయన. శబ్ద కాన్సర్ వినగానే ఆ మనో కాన్సర్ గుర్తొచ్చింది.

    అభినందనలతో
    ఎన్ వేణుగోపాల్

  18. కథ చదివాక అరుణ పప్పు గారూ ఇంకా ఏమేం రాశారో వెతుక్కుంటూ వెళితే ఈ లంకె దొరికింది. అందులో మరికొన్ని మంచి రచనలూ ఉన్నాయి. తప్పక చదవండి:

    http://www.andhrajyothy.com/AJSearchFinal1.asp?QS=Aruna%20Pappu&QP=Eauthor

    కొణతం దిలీప్

  19. వేణు says:

    ప్రధానాంశం నుంచి కొంచెం పక్కకి…

    వేణుగోపాల్ గారూ ! ‘ రోజెట్’ కూడా సరైన ఉచ్చారణ కాదండీ. ఇక్కడ ‘t’ సైలెంట్ అవుతుంది. ‘రోజే’ అని పలకొచ్చు. ‘జే’ని కూడా యథాతథంగా కాదు; ఆ శబ్దం ‘ప్లెజర్’, ‘మెజర్’, ‘ట్రెజర్’ లో వినిపించే ‘జ’ (కొంత ‘ష’-లా అన్పిస్తుంది) ఎలా పలుకుతామో అలా. Roget’s Thesaurus ని ‘రోజే స్ థిసారస్’ అని ఉచ్చరించొచ్చు.

  20. bvr babu says:

    మేము డిగ్రీ లో ఉన్నప్పుడు ఒక పద్యం ఉండేది. ఒక సారి క్రిష్ణ దేవరాయలు అల్లసాని పెద్దనను అడిగాడట. మంచి కవిత్వం అంటే ఎలా ఉండాలి అని. దానికి పెద్దన ఇలా చెప్పాడట.

    ఘన తర ఘూర్జ్జరీ కుచ యుగ క్రియ యుగ గూఢము గాక ద్రావిడీ
    స్తన గతి తేట గాక అరచాటగు ఆంధ్ర వధూటి చొక్కపుం
    చనుగవ వోలె ఇంచుక గూధమొకింతయు తేట గాక యట్లుం
    డిన యది వో కవిత్వమనిపించు నగించటుగాక యుండినన్.

    మీ కథ కూడా అలాగే ఉంది. దీనికి ఇంత కంటే వ్యాఖ్యలు అవసరం లేదు.

  21. kalasapudi Srinivasa Rao says:

    ఏ రచన కళ్ళని అక్షరాల వెంట పరిగెత్తించి, పరిసరాల్ని మైమరిపించి, కాళ్ళు వెళ్ళలేని దూరాలని దగ్గరకు రప్పించి, కళ్ళు చూడలేని ప్రపంచాలని చూపించి చదవరి ఆలోచన పరిధిని పెంచుతుందో అది మంచి రచన.
    ‘వర్డ్ కాన్సర్’ ఆ పని చేసింది.
    అందుకే మంచి రచన అయ్యింది.
    భాష చాలా బాగుంది. ఈ రచన ఎన్నో పదాలను పాఠకుడి లో నాటుతుంది. సారం ఉన్న చోట పూదోట.
    పదే పదే చదివితే పాఠకుడికి కూడా రావచ్చు ‘వర్డ్ కాన్సర్’ !
    రచయిత్రికి అభినందనలు !!
    – కలశపూడి శ్రీనివాస రావు

  22. Vaidehi Sasidhar says:

    Beautiful!!
    ప్రవాహంలా ఉక్కిరిబిక్కిరి చేసిన రచన!!

    అభినందనలు!! మీరు ఇంకా తరచుగా రాయాలి.

  23. రఘు రాముడు says:

    అరుణమ్మా,
    ఓ మిత్రుడు చెబితే ఈ కథ చదివాను. కాసేపు బుర్ర తిరిగింది. పుస్తకాలు చదవరా బడుద్ధాయి అని బూదరాజు మాష్టారు చెప్పేవారు. అప్పట్లో బ్లాగ్లు లేవు కాబట్టి ఆయన అలా చెప్పి ఉంటారు. పాపం పైన ఎక్కడ ఉన్నారో గానీ, మళ్ళీ పుడితే ఆయన బ్లాగ్లు చూడమని తప్పకుండా అనేవారు. ఏది ఏమైనా నేను కూడా మీ కులం (పాత్రికేయం) లోనే పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము మర్చిపోయిన భావాలు మళ్ళీ వెలికి తీస్తున్నందుకు రొంబ థాంక్స్.

  24. naresh says:

    kothaga anipinchindi

Comments are closed.