చిట్టచివరి స్నేహితుడు

– మెహెర్

కూతురు ఆఫీసు పని ముగించుకుని యింటికి చేరేసరికి ముసలాయన వంటగది బాల్కనీలో వున్నాడు. పేము కుర్చీలో ముందుకు వంగి కూర్చుని, చేతులు రెయిలింగ్‌కు చాచి, వీధిలోకి ఏటవాలుగా తొంగి చూస్తున్నాడు. సాయంత్రపు ఎండలో ఆయన ముగ్గుబుట్ట జుట్టు అక్కడక్కడా పసుపు ఛాయతో మెరుస్తోంది. Continue reading

Posted in కథ | 30 Comments

విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – రెండవ అంకము

పాఠకమహాశయులకు నమస్కారం. విరోధి ఉగాది సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో పొద్దు తరఫున నిర్వహించబడిన కవిమ్మేళనము మొదటిభాగాన్ని ఆస్వాదించారని ఆశిస్తూ ఈ రెండవభాగాన్ని సమర్పిస్తున్నాం. ఇందులో ప్రతిభావంతమైన సమస్యాపూరణలు, ఆశువుగా దుష్కరప్రాసలతో చెప్పబడిన సరసమైన కందాలు, గిరిగారు చెప్పిన ఒక పిట్టకథ మీ కోసం …

{కొత్తపాళీ}: గిరిధరా! సమస్యా పూరణం మీతో మొదలు పెడదాం… కన్యను ధారబోయమన కాదని పొమ్మనె పుణ్యమూర్తి తా
{గిరిధర్}: ఈ సమస్య చదవగానే నాకు పోతనామాత్యుడే జ్ఞప్తికి వచ్చాడు. అందుకే, ఇలా పూరించాను

ఉ||“అన్యుల కీయ నమ్మవె మదంబ” యనెన్, కుటిలాత్ములై భువిన్
పుణ్యుల సాధుసంగతుల బ్రోచని రాజులు వచ్చి కావ్య శ్రీ
కన్యను ధారబోయమన, కాదని పొమ్మనె పుణ్యమూర్తి, తా
ధన్యుడు పూజ్యుడయ్యె, హరి దక్క మరెవ్వరికిన్ తలొగ్గడే

{కామేశ్వరరావు}: పృచ్ఛకుని మనోగతాన్ని అవగతం చేసుకున్నారు గిరిగారూ:-) చాలాబావుంది పూరణ!
{సత్యనారాయణ}: బాగుంది
{రాఘవ}: బావుందండీ. చక్కటి పూరణ.
{కృష్ణ}: ఆహా! కాటుక కంటినీరు .. పద్యాన్ని గుర్తు చేశారు.చాలా బాగుంది.
{గిరిధర్}: అందరికీ ధన్యవాదాలు. కృష్ణగారు, ఈ మధ్యనే భాగవతం చదవడం మొదలు పెట్టాను – అందువల్లనేమో

{కొత్తపాళీ}: చాలా సరసంగా ఉంది. రామకృష్ణ కవిరాయా .. మీ పూరణ
{రామకృష్ణ}: అలాగేనండి.

ఉ|| ధన్యత నొందగా పరమ ధార్మిక భాగవతాఖ్య కావ్యమన్
కన్యను దేవదేవునకు కానుకగా నిడ నున్న పోతనా
మాన్యుని రాజు మత్తుడయి మాకు సమర్పణఁ జేయ కావ్యమన్
కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా.

{కొత్తపాళీ}:
great minds think alike 🙂 లేక అది సమస్యలోనే ఉన్న మహిమో?
{కామేశ్వరరావు}: రామకృష్ణగారికి “రాజుల్ మత్తులు…” పద్యం గుర్తుకు వచ్చినట్టుంది. బావుంది!
{రామకృష్ణ}: నిజమేనండి
{రాఘవ}: అది పూరించేవాళ్ల ఆలోచనాసారూప్యఫలితం
{రానారె}: హహ్హహ్హ. సమస్యను చివరిపాదంలో ఉంచడం కూడా బాగుంది.
{గిరిధర్}: ఇది ఖచ్చితంగా సమస్య మహిమే, కామేశ్వరరావుగారు అన్నారు గానీ, పృఛ్ఛకుని మనోగతం అందిరికీ సులభంగానే అవగతమైపోయింది, కదా? రామకృష్ణగారు, రానారె చెప్పినట్టు పాదాన్ని చివరలో ఉంచడం విచిత్రంగా ఉంది..పూరణ బావుంది.

{కొత్తపాళీ}: పుష్య కవీశ్వరా వింటున్నారా?
{పుష్యం}: చెప్పండి
{కొత్తపాళీ}: ఈ సమస్య మీది .. తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై
{పుష్యం}: అవధరించండి

చ|| సరియగు చోటునిచ్చి నర జాతిని చల్లగ చూచు ధాత్రినిన్
కరుణతొ కాయగా వలయు కమ్మని తల్లిని కంటి పాపలా
“తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై,
కరువది తీర త్రవ్వవలె గ్యాసుకు నూనెవి బావు” లంచు ఈ
ధరణిని కాలదన్ను ధన దాహపు మూర్ఖుల జుట్టుపట్టి ఆ
కురులను నున్నగా గొరిగి గుండుకు సున్నపు బొట్లుపెట్టెదన్

{కొత్తపాళీ}:
పుష్యం గారు పచ్చ కంటితో చూశారు సమస్యని
{రాఘవ}: సున్నపుబొట్లు హిహ్హిహ్హీ
{చదువరి}: నిజంగానే జుట్టుపట్టుకు కొట్టినట్టే ఉంది
{కృష్ణమోహన్}: తరువులు కూలిస్తే… కురులు గొరుగుతా అంటారు… బాగుంది.
{గిరిధర్}: కాలదన్నే వాడి జుట్టుపట్టడం బావుంది
{కొత్తపాళీ}: సత్యాగ్రహం లాగా ఇది హరితాగ్రహం
{కామేశ్వరరావు}: బావుందండి! “నరులు తరులను కురులను నరికివేయ” అని నేనెప్పుడో రాసిన పద్యం గుర్తుకువచ్చింది. అదనంగా గుండుకి సున్నపుబొట్లు పెట్టడం భలే ఉంది!
{రాఘవ}: ఔనండీ కామేశ్వరరావుగారూ. నాకూ ఆ పద్యం గుర్తొచ్చింది
{రానారె}: పుష్యకవి పద్యం చదివి ఫక్కున నవ్వొచ్చింది.
{రామకృష్ణ}: చక్కని భావగుంభనతో హెచ్చరికతో చంపకమాలిక అహా.
{పుష్యం}: నెనరులు.

{కొత్తపాళీ}: రామకృష్ణ గారు దీన్నీ పొలిటికల్ ఏంగిల్లో చూశారు. రామకృష్ణ గారూ, మీ పద్యం
{రామకృష్ణ}: మీమధ్య చంపకోత్పల సమ్మిశ్రితమై—–!

కరుణను వోటువేసె ప్రజ. గౌరవ బాహ్య ప్రవృత్త మోర్ఖులై
తరుణ మిదే యటంచు కడు దారుణముల్ పచరించుచుండె. నా
ధరణికి భారమైన ధన దాహ మదోన్మద దుష్త చిత్తులే
తరువులు . కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై.

{రాఘవ}:
విరుపు భలే ఉందండీ. వాళ్లు కేవల తరువులు కాదు. విషతరువులు.
{కృష్ణ}: మెడలో వేయాల్సిన మాలలతో మెడలే తీస్తున్నారే !
{పుష్యం}: అద్భుతం.. చాలా బాగుంది మాష్టారూ
{చదువరి}: బాగుందండి
{రామకృష్ణ}: ధన్యవాదాలు
{కొత్తపాళీ}: ఇదే సమస్యని గిరిధరుడు సామాజిక సమస్యల కోణంలో చూశారు. గిరీ, మీ పద్యం?
{గిరిధర్}: మన్నించండి, ఓ చిన్న విన్నపం, ఈ పూరణ శాస్త్ర సమ్మతం కాదేమో కానీ పోతనగారే లఘ్వలఘు రేఫలకి పొంతన కుదిర్చారు కాబట్టి నేను అదే చేసేసాను. అవధరించండి.

చ|| కరుగవలెన్ కదోయ్ కరడుగట్టిన ఈ కులవాదమంతయున్
చెరుగవలెన్ మనల్ చెరుపు చీకటి తంతులు, రమ్ము రమ్ము, యం
తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృధ్ధికై
దరువుల వేయగా పెకలితంబగు శోకపు చెట్లు! ధన్ ధనా

{చదువరి}:
అంతరువులు కూల్చివేయవలే – భలే!
{పుష్యం}: ధనా ధన్ కూల్చేసారు.. బగుంది..
{కొత్తపాళీ}: గిరి, శకటరేఫతో ఉన్న ఆ మొదటి పాదం లేకపోయినా, పద్యం భావం బాగానే ఉంది.
{రాఘవ}: ధన్ ధనా… కరుగవలెన్ కదోయ్.. భలే గుప్పించారు వీటిని. అభినందనలండీ. పూరణ బావుంది.
{కామేశ్వరరావు}: “కరగవలెన్ కదోయ్!” చక్కని వాడుక ప్రయోగం.
{రామకృష్ణ}: అంతరువులు ఓహో! చాలా బాగుంది
{సత్యనారాయణ}: “ధన్ ధనా” బాగుంది 🙂
{కామేశ్వరరావు}: ఈసారి మటుకు మీరొక్కరే పృచ్ఛకుని మనసుని పసిగట్టారని ఘంటాపథంగా చెప్పగలను:-)
{గిరిధర్}: కామేశ్వరరావు గారు, పృఛ్చకులు మీరేనా?
{కామేశ్వరరావు}: అంతే కదండీ మరి
{రానారె}: అంతరువులు కొత్తపదం, గిరిగారి సృష్టేననుకుంటా.
{చదువరి}: అంతరువులు కొత్తపదం – కాదనుకుంటా, నిఘంటువులో ఉంది!
{రాఘవ}: అంతరువు అంటే తేడా
{గిరిధర్}: రానారె. అంతరువు అంటే తారతమ్యమని నిఘంటువులు చెపుతున్నాయి – ఉన్న పదాలే సరిగ్గా తెలియని నాకు కొత్తపదాల వీరతాళ్ళు అప్పుడే తొడగకండి
{రానారె}: బాగుంది. నెనర్లు.
{గిరిధర్}: ధన్యుణ్ణి

{కొత్తపాళీ}: రాఘవ కవీ, మాలికలల్లు భామ తన మావటి వానికి ప్రేమతో సదా .. ఈ సమస్య మీది
{రాఘవ}: నారాయణస్వామిగారూ

ఉ|| వేళకు పువ్వులమ్మి తన ప్రేమ మరింత మరింతయై హహా
కాలెడు మండుటెండలని కాసిని ముంజెలు చల్ల నీళ్లనూ
చాల వయారవైఖరిని చక్కగ కొట్టుకు పట్టుకెళ్లె నో
మాలిక లల్లు భామ తన మావ “టి” వానికి ప్రేమతో సదా

{పుష్యం}:
చర్చ మధ్యలో చక్కని టి బ్రేకిచ్చారు.. బాగుంది.
{కొత్తపాళీ}: హ హా కాలిందా? అనుభవంతో చెబుతున్నట్టున్నారే?
{రాఘవ}: హైదరాబాదులో ఎండలు మండిపోయాయండీ ఒక రెండు రోజులపాటు ఈ మధ్యన. అన్నట్టు కొట్టుకు పట్టుకెళ్లిందంటే చౌర్యం అంటగట్టకండి 😉 నాయకికి టీ కొట్టుకి పట్టుకెళ్ళిందని కవిహృదయం 😛
{గిరిధర్}: టీ వాణ్ణి పొట్టివాడిగా విరిచి బాగా పూరించారు
{కామేశ్వరరావు}: విరుపులు చాలా బావున్నాయి. “పువ్వులు+అమ్మి”, “పువ్వుల+అమ్మి”
{గిరిధర్}: కామేశ్వరరావు గారు, మీరు చెప్పేదాకా నేనా విరుపు గమనించలేదండీ – ఏదైనా ఇంతులని బానే వెదికి పట్టేస్తున్నారు మీరు
{కామేశ్వరరావు}: రాఘవగారి అంతరంగాన్ని నేను బహిర్గతం చేస్తున్నానంతే:-)
{రాఘవ}: చల్ల కూడా పట్టుకెళ్లింది చూసారో లేదో. చల్లనీళ్లూ… చల్లా నీళ్లూ.
{జ్యోతి}: రాఘవగారికి బుట్టెడు మల్లెపూలు నావంతుగా, ఈ వేసవి కానుకగా.
{రాఘవ}: జ్యోతిగారూ… మహద్భాగ్యం. మా రామయ్యతండ్రికి అర్పణం.

{కొత్తపాళీ}: శ్యాం, మీ పద్యం చెప్పండి ఈ సమస్యమీద
{పుష్యం}: చిత్తం
{కొత్తపాళీ}: కామేశ్వరరావుగారు, అదేలేండి, మీకు టీ ఇచ్చే భామ సెట్టై పోయారు గదా!
{పుష్యం}: నా నాయకికి ఇంకా టీ గురించి తెలీదు.. రాజుల కాలం కదా.. 🙂

|| పూలతొ రాణికోసమని పూజకు దండలు గ్రుచ్చు నారికిన్
ఏలెడివారి ఇంటికడ ఏనుగు కాచెడివాడు నచ్చె; ఆ
మాలికలల్లు భామ, తన మావటివానికి ప్రేమతో సదా
వాలుగ చూపులన్ విసిరె వాటముగా తన ప్రేమ తెల్పుచున్

{గిరిధర్}: వాటముగా – వేటూరి పాట వింటున్నట్టుంది
{కామేశ్వరరావు}: అయినా అమే గడుసరే, అప్పుడే అతన్ని “తన” మావటివానిగా చేసేసుకుంది 😉
{రాఘవ}: హహహ 😀 శ్యామ్ గారూ… నాకు విక్రమార్కచరిత్రమ్‌లో భర్తృహరి కథ గుర్తొచ్చిందండీ.
{రామకృష్ణ}: మీ నాయిక సరసం మాకర్థమైందిలెండి.
{రానారె}: ఆహా… మంచి ప్రేమకథ
{రాఘవ}: మావటి మాలిక… ఒక ప్రేమకథ 😉
{చదువరి}: 🙂 పద్యం చక్కగుంది
{పుష్యం}: ధన్యుణ్ణి

{కొత్తపాళీ}: మల్లిన నరసింహా రావు గారు విచ్చేశారు, స్వాగతం
{రాఘవ}: నమస్కారం నరసింహారావుగారు
{రామకృష్ణ}: స్వాగతము మల్లినాధా!
{నరసింహ}: నమస్కారాలండి అందరికీ.
{పుష్యం}: తమ పనులు వదలి వచ్చిరి | కమనీయపు కవితలివ్వ, కవివరులు, భలే!
{రామకృష్ణ}: సుమధుర పద్యములల్లగ
{కొత్తపాళీ}: పుష్యం, పొరబడ్డారు. కవివరులకి, కవితా వ్యసనం కంటే ఇష్టమైన పని ఇంకొకటేమున్నది? 🙂
{కొత్తపాళీ}: విరుపులందు గురుని విరుపులు వేరయా .. అన్నట్టు గిరి చేసే విరుపులు చూడండి. గిరిధరా, మీ పద్యం?
{గిరిధర్}: చిత్తగించండి. ఇది సరదాగా విరిచి వ్రాసాను.

ఉ|| “నాలుగు ప్రశ్నలేస్తి సుగుణాకర పూరణ లిమ్ము” “హారమ
న్నా లతికన్ననేమి? యదునాయకి ఎవ్వతె రబ్డి? వంగు నే
న్గే లులిపడ్డదై యెవనికీ? జయపెట్టె నితిన్నెవర్తెరా?”
మాలిక, లల్లు భామ, తన మావటి వానికి, ప్రేమతో సదా

{గిరిధర్}: ముందు నేనూ టీ వాణ్ణి రంగంలోకి దింపుదామనుకుని ఎందుకో మానుకున్నాను 🙂
{పుష్యం}: విరుపులందు ‘గిరి’వి విరుపులు వేరయా..
{రాఘవ}: లల్లు భామ… గొల్లభామేమోననుకున్నాను హిహ్హీహ్హీ 😀
{రాకేశ్వర}: గిరిధర్ గారు కాస్త వంగు నేన్గే లులిపడ్డదై యెవనికీ – అన్నదాన్ని వివరించగలరా
{గిరిధర్}: రాకేశ్వరా, ఏనుగు ఎవరికి భయబడ్డదై అణిగిమణిగి ఉంటుంది – అని అర్థం
{రాఘవ}: లులిపడ్డమంటే హీనమవ్వడం
{రాకేశ్వర}: నేన్గేలో నేన్గునే నేగన లేకపోతిని 🙁 నేన్గే లో నేనుగే నాకు కనఁబడకపోయినది. నెనర్లు.
{రామకృష్ణ}: 😀
{గిరిధర్}: రాకేశ్వరా – బావుంది
{రాఘవ}: నేన్గున్గనగాన్… 😀
{చదువరి}: జయపెట్టె నితిన్నెవర్తెరా? – ఆలోచన భలే ఉంది. గభాలున అర్థం కాలేదు.
{గిరిధర్}: చదువరిగారు, జయం చిత్రాన్ని ఇరికించడానికి ప్రయాస అది
{సత్యనారాయణ}: బాగుంది. “సదా” ను కూడ బాగా ఇరికించారు
{పుష్యం}: ‘లల్లు భామ’ విరుపదిరింది..
{రామకృష్ణ}: క్రమాలంకారం?
{రాఘవ}: ఒఠి క్రమాలంకారం కాదండీ రామకృష్ణారావుగారూ, విక్రమాలంకారమండీ
{రానారె}: అయ్యబాబోయ్… త్రివిక్రమాలంకారం అది. మూడు పాదాలు మోపి, నాలుగోపాదం సమస్యపైన మోపారు 🙂
{రాఘవ}: రామనాథులవారూ…భలే
{చదువరి}: రానారె.. 🙂 🙂 ఇంకా నయం సమస్య ఇచ్చినవారిపై మోపలేదు
{కొత్తపాళీ}: రానారె భలే భలే
{గిరిధర్}: క్రమ, విక్రమ, త్రివిక్రమ – ఆహా
{కొత్తపాళీ}: చదువరి .. ఇది మరీనూ హ హ హ
{రాఘవ}: చదువరిగారూ… ఈ రోజు పగలబడి నవ్వుకోవడంతో సరిపోతుందేమోనండీ… హిహ్హీహ్హీ
{రానారె}: గిరీ, ఇదీ మీ పరాక్రమం మరి! 🙂
{గిరిధర్}: చదువరి – ప్రచ్ఛకుడు బలియై పోయేవాడే
{చదువరి}: గిరి: బలియై – అదిరింది
{రానారె}: చదువరిగారు, భలే పట్టారు. 🙂
{రాఘవ}: బలైపోకుండా బలియైపోతారా… :O
{చదువరి}: బలియౌదురు!

{కొత్తపాళీ}: సరే, ఇంకొక్క సమస్య చూసుకుని మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఈ సమస్యా పూరణకి జనాల కళ్ళు బైర్లు కమ్మితే నా పూచీ ఏం లేదు. ముందే చెప్తున్నా, నల్లకళ్ళద్దాలు సిద్ధం చేసుకోండి
{పుష్యం}: నల్లని సులోచనములను మెల్లగ నే పెట్టుకొంటి మొదలెట్టండీ
{కొత్తపాళీ}: కామేశ్వర్రావు గారూ, మీరు మొదలెట్టండి దీన్ని .. హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో
{కామేశ్వరరావు}:

ఉ|| ధర్మ్య మనోజభావమె ప్రధానము దంపతి సౌఖ్యవృత్తికిన్,
భర్మ్య వినిర్మితమ్ములగు వాసములేల? మహేశుతో శిలా
హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి, విష్ణుమూర్తితో
నూర్మ్య మహోధదిన్ వెలసియుండెను లక్ష్మి మనోరమాకృతిన్

{నరసింహ}:
వాహ్వా
{కామేశ్వరరావు}: ఈ ప్రాసతో చాలా ఆయాసం వచ్చింది!
{పుష్యం}: ఆర్యా.. మీకు ఆయాసమే వచ్చింది. నాకు హార్టెటాకు వచ్చింది. 🙂
{గిరిధర్}: సునాయాసంగా లాగించేసి ఆయాసం అంటున్నారు – నాకు ఆలోచనలు ఉడిగిపోయాయి
{చదువరి}: కామేశ్వరరావుగారూ, పద్యం అద్భుతం!
{నరసింహ}: నూర్మ్య అంటే
{కొత్తపాళీ}: విష్ణుమూర్తితోన్ .. ఊర్మ్య మహోదధి
{కామేశ్వరరావు}: అది “ఊర్మ్య” – కెరటాల కదలికలతో నిండి ఉన్న అని అర్థం
{రాఘవ}: దుష్కరప్రాస… విశ్వనాథ సత్యనారాయణగారు గుర్తొచ్చారండీ
{రానారె}: మనోరమాకృతిన్ … సౌఖ్యం మనసులోఉండాలంటారు కామేశ్వరరావుగారు. వారి నామ’ధ్యేయం’ చూడండి. 🙂
{సత్యనారాయణ}: దుష్కర ప్రాస కూడ మీ చేతిలో సులభ తరమయినది
{రాఘవ}: మీకు ఒక ‘పె…ద్ద న’మస్కారం
{గిరిధర్}: శిలా హర్మ్యములు కొండలేనా? బావుంది పూరణ – నాకు మటుక్కు ఇది దుష్కరాతి దుష్కర ప్రాస
{చదువరి}: ధ్యేయం – అహో!

{రామకృష్ణ}:

క|| కామేశ్వరు పూరణమది
ప్రేమాద్భుతమగుచునుండె పేర్మిని వెలయన్
పూరణ చేసిరి వారికి
ప్రేమామృతమిచ్చి గాచు ప్రీతిని శివుడున్

{కామేశ్వరరావు}:
నెనరులు!
{రాకేశ్వర}: నాదో కందం త్వరగా ఆలకించగలరు –

క|| నేన్గే లోనేన్గుని యే
నేన్గన లేదే గిరివర, నేన్గును జూపీ
పీన్గును బ్రోచితిరయ్యా
గాన్గును ద్రిప్పి తమరప్పు గట్టెద నయ్యా

{కొత్తపాళీ}:
రాకేశ్వర, హ హ హ
{భావకుడన్}: అంతే కాని నల్లి బాధ పడలేక కాదంటారు? 🙂 చాలా బావుంది.
{కొత్తపాళీ}: ఏవిటిది, అకస్మాత్తుగా రావిశాస్త్రి కథలో ఏదో పాత్ర చేత మాట్లాడిస్తున్నట్టు ఉంది
{రాఘవ}: నల్లి పిల్లి గొడవలు చెంచాడు భవసాగరాలూ అమృతం చూసే మన కోసమండీ… అమృతం తాగేవాళ్లకి కాదు
{కొత్తపాళీ}: రాఘవ, సెబాసు
{చదువరి}: రాకేశ్వర – ఈ అప్పు గొడవేంటి!?
{గిరిధర్}: రాకేశ్వరా, ప్రాసకోసం గాన్గు దాకా వెళ్ళిపోవాలా 🙂
{రాఘవ}: గాన్గు… హిహ్హీ 😀 నిజమే… భవసాగరాలు చూపిస్తున్నారు మన రాకేశ్వరులవారు
{భావకుడన్}: ఇపుడు నేను మిమ్మల్ని శంకర శాస్త్రి గారిలా ఊహించుకుని “భవ సాగారాలంటే….?” అని అడగను లెండి. 🙂
{రాకేశ్వర}: న్గు ప్రాసకి గాన్గు తప్ప ఇంకేం తట్టలేదు. అప్పు – అనగా వివరించిన ఋణం

{కొత్తపాళీ}: ఓకే, కామేశ్వర్రావు గారి చమా చమక్ చమత్కృతులు చూశారు గదా, ఇక గిరిధరుడి చేతివాటం చూడండిప్పుడు. గిరీ, మీ పద్యం
{గిరిధర్}: ఇదిగో

ఉ|| హర్మ్యమనే పదమ్ము గనినంతనె వర్షమె నా పెరేడునన్
హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో
నా? ర్మ్యని ప్రాసగా నొసగి నవ్వుచు హాయిగ కొత్తపాళిగా
రూ, ర్మ్యము మాకు పద్యముల లోబడదంచు కదా మహాప్రభో,
‘ఖర్మ్యము’ మీది పొండనుచు ఘాటు సమస్యల నీయబోవుటల్?

{కొత్తపాళీ}:
it rained on your parade? Were you in NCC?
{రామకృష్ణ}: 😀
{సత్యనారాయణ}: 🙂
{భావకుడన్}: 🙂 🙂
{గిరిధర్}: కొత్తపాళీగారు, అమెరికా వదిలినా అమెరికనిజములను వదలలేక పోవడం వల్ల వచ్చిన తంటా అది
{రాఘవ}: గడసరి పూరణ… 🙂 శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలూ అన్నట్టు గరికపాటివారిని బాగానే పట్టారు.
{కొత్తపాళీ}: హహ్హహ్హ నిజానికి ఈ సమస్య ఇచ్చింది నేను గాదు. కానీ సభాధ్యక్షుణ్ణి కాబట్టి మీరేమన్నా పడతాను, కానివ్వండి.
{కామేశ్వరరావు}: ఎవరో త్వరగా చెప్పండి…
{రానారె}: గిరిగారిది నోటి దురుసు అనడానికి వీల్లేదు. ఇది చేతివాటం అన్నారు కోత్తపాళీగారు.
{రాకేశ్వర}: పెరేడుపై వర్షంలో వర్షం – కొత్త జాతీయమా 🙂
{రానారె}: గిరిగారూ ఇప్పుడు మీరు వీరతాళ్లు వేసుకోవలసిందే.
{చదువరి}: పెరడు – ఛందము కొరకయ్యె పెరేడు!
{కొత్తపాళీ}: చదువరి, కాదు, అది పెరేడే. parade!
{గిరిధర్}: చదువరిగారు, పెరడు అని నేను ఆలోచించలేదు – పెరేడు అనే ఇంగ్లీషు పదాన్ని వాడాను
{కొత్తపాళీ}: it rained on my parade is an American expression which means some event has ruined a person’s happiness, at least temporarily
{చదువరి}: కొత్తపాళీ నెనరులు! మన ‘పొంగు మీద నీళ్ళు జల్లినట్ట’న్నమాట!
{రాఘవ}: నేను ఇంకా కంగారు పడ్డాను… అమవసనిసి తలచుకొని. పాపం మా గిరిధరుణ్ణి ఎవరైనా వెక్కిరిస్తారేమో అని.
{కొత్తపాళీ}: రాఘవ, ఇది కులాభిమానము .. కవికులాభిమానము!!
{గిరిధర్}: కవికులాభిమానం :):)
{గిరిధర్}: అమెరికన్లు తరచూ ‘rained on parade’ వాడుతూంటారు – అదే విని, ఇక్కడ వాడాను
{పుష్యం}: NCC పెరేడయితే కష్టం కానీ, అమెరికా ఫుట్బాల్ పేరేడయితే పర్వాలేదు..వర్షంలో తడిసిన చీర్లీడర్లు.. తెలుగు సినిమా చూసిన ఫీలింగు 🙂
{కొత్తపాళీ}: హమ్మో పుష్యం గారు ఎక్కడికోఓఓ వెళ్ళిపోయారు
{రాఘవ}: కొత్తపాళీగారూ, మరి అంతే కదండీ
{భావకుడన్}: పుష్యం గారు, స్వర్గానికి అడుగు దూరంలో ఉన్నారా? 🙂
{రాఘవ}: అడుగు కాదు బెత్తెడు.
{పుష్యం}: కాదు త్రిశంకు స్వర్గంలో 🙂
{కామేశ్వరరావు}: గిరిగారు ఆంగ్ల పదాలతోనే కాక ఆంగ్ల జాతీయాలతో కూడా పద్యాలనల్లగల సమర్థులన్నమాట!
{రాఘవ}: గిరిగారూ మీకు జాతీయ జాతీయతర్జుమాప్రపూర్ణ అని బిరుదివ్వాలి
{రానారె}: రాఘవా, అంతర్జాతీయ జాతీయతర్జుమాప్రపూర్ణ అంటే మీకేమైనా అభ్యంతరమా? 🙂
{రాఘవ}: మళ్లీ… విక్రమ అంటే త్రివిక్రమ అన్నారు. జాతీయ అంటే అంతర్జాతీయ అంటున్నారు. నాకు సంతోషమే మా గిరిగార్కి ఇస్తున్నారంటే. 🙂
{గిరిధర్}: రాఘవా, అభిమానానికి ధన్యవాదాలు :))
{భావకుడన్}: రానారె గారు… “అం జా త ప్ర” అన్న మాట ….”పం బం బం” లాగా
{రాకేశ్వర}: గిరిధర్ గారికి ఇంకో దుష్టకందం అంకితం-

కం|| హర్మ్యపు పద్యపు ప్రాసము
గ ర్మ్యము వచ్చెను గిరీశ గమ్మత్తుగనూ
ఈ ర్మ్యపు ప్రాసను మీరు భ
లె ర్మ్యము తోనే తెగింతిరి చిత్తరువే

{కొత్తపాళీ}:
రాకేశ్వర, సెబాసు. ఇప్పుడు రామకృష్ణ కవీంద్రుల గడుసు తనం చూడండి. రామకృష్ణ గారూ, కానివ్వండి.
{రామకృష్ణ}: తమరి ఆజ్ఞ

ఉ|| హర్మ్యము లందు సంచరిలు హాయిగ మానవు లంచు, శంభుతో
హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి . విష్ణుమూర్తితో.
హర్మ్యము నందు సంచరిలె హాయిగ లక్ష్మి. మహత్వ బ్రహ్మతో
హర్మ్యమునందు సంచరిలె హాయిగ వాణి . అదెంత భాగ్యమో!

{రాకేశ్వర}:
ఈ పద్యాన్ని రామకృష్ణ మాస్టారి నోరారా విన్న భగ్యం నాదే 😉
{రానారె}: ఓకే స్టోరీలో అనేక హర్మ్యాలు. భలే.
{కామేశ్వరరావు}: అందరూ ఒకే “multi-storied” హర్మ్యంలో కాబోలు 🙂
{రాఘవ}: అపార్టుమెంటు. దుష్కరప్రాసలకి ఒక చక్కటి దారి చూపించారండీ రామకృష్ణగారూ. బావుంది.
{కొత్తపాళీ}: దేవతలక్కూడా హర్మ్యాలు కావాల్ట, అందుకే హైద్రాబాదు రియలెస్టేటు ఇలా మండి పోతోంది.
{చదువరి}: శివుడికి కూడా హర్మ్యాన్ని ఇచ్చారు మాస్టారు!
{సత్యనారాయణ}: బాగుంది. ఇది మరో అవధానపు కిటుకు అనుకుంటా! అన్ని పాదాలలోనూ ఒకే పదము వాడి మెప్పించటము.
{నరసింహ}: భావ భవ భోగ సత్కళాభావములను గుర్తుకు తెచ్చారండీ రామకృష్ళా రావు గారూ.
{కొత్తపాళీ}: నరసింహ .. హ్హ హ హ
{రాఘవ}: అపార్టుమెంట్లు ఎక్కువైనాయి కదా ఈ రోజులలో
{రాకేశ్వర}: ఆ హర్మ్యాన అపార్టుమెంటు ఖరీదు ఎంతుంటుందో మఱి 🙂
{కొత్తపాళీ}: కానీ, రామకృష్ణగారూ, మా వూళ్ళో (డెట్రాయిట్లో) బోల్డు హర్మ్యాలు ఖాళీగా ఉన్నాయండీ .. తమరేవన్నా లచ్చిందేవికి కాస్త సిఫార్సు చేయిస్తే …
{కృష్ణ}: వాలు స్ట్రీటు కు పాపం ఆమె భయపడి ఉంది. తప్పకుండా అటు వస్తుంది కోపా గారు..
{రామకృష్ణ}: ధనమున్నవారింటిలోనే త్రిమూర్తులూ, ముగురమ్మలూ వుంటారని నా అభిప్రాయం
{కామేశ్వరరావు}: అవును “సాధన”మున్న వారి యింటనే!
{గిరిధర్}: రామకృష్ణ గారు, సమస్య కొద్దీ పూరణ
{రామకృష్ణ}: ధన్యోస్మి
{గిరిధర్}: ఇది చదవగానే, చిన్నప్పుడు నా స్నేహితుడొకడు ‘వెకేషన్’ అనే పదం వాడి ఐదు వాక్యాలు వ్రాసుకురారా అంటే …
{రాఘవ}: అంటే…?
{గిరిధర్}: 1. During holidays we went to calcutta for vacation
2. During holidays we went to Delhi for vacation
..ఇలా వ్రాసేసాడు, ఐదూళ్ళు పేళ్ళు, అది గుర్తుకు వచ్చింది.
{రాఘవ}: హిహ్హ్హీహిహ్హీ 😀 పడి దొర్లడం ఔతోందండీ
{నరసింహ}: :D:D
{చదువరి}: గిరి: 🙂

{కొత్తపాళీ}: హహ్హహ్హ… కాసేపు వేరే విషయంలోకి వెల్దాం
{రాకేశ్వర}: ఈ దుష్టకందం రామకృష్ణ మాస్టారికి అంకితం-

కం||. హర్మ్యపు పద్యపు ప్రాసము
గ ర్మ్యము వచ్చెనుగ రామ గమ్మత్తుగనూ. ||
హర్మ్యపు ప్రాసను మీరును
హర్మ్యము తోనే తెగింతిరి చిత్తరువే||

{రాఘవ}: రాకేశ్వరా… భలే
{రామకృష్ణ}: కనీసం దుష్టకందమైనా అంకితంగా పొందిన ధన్యుణ్ణి.
{రాకేశ్వర}: మాస్టారు మీ దయతో నేను సైతం ర్మ్య ప్రాసగా గల ఒక పద్యాన్ని.. చెప్పాలంటే రెండనుకోండి .. వ్రాసేసాను . నెనరులు.
{రానారె}: రాకేశుని ఆశుకవిత లీ సారికి ప్రత్యేకము – అన్నమాట. 🙂
{రాఘవ}: ఉన్నమాటే
{గిరిధర్}: రాకేశా, వీకు స్టూడెంటువని రెండు వీకుల క్రితం బొంకులాడావు, కదా. ఏకుతున్నావు ఏగ్రేడు వాడిలా.
{రానారె}: వీకు గడిచింది కదా, వీకునెస్ పోయింది
{రాఘవ}: రానారె… భలే! గిరి … గ్రెనేడు లా పేలుతున్నాడు అనలేదు. నయం.
{రానారె}: కాసేపు వేరే విషయంలోకి వెళ్దామన్నారు అధ్యక్షులు. వెళ్దాం మరి.

(రెండవ అంకము సమాప్తం)

తరువాతి అంకములో మన అంతర్జాలకవుల అనువాదప్రతిభ, సందర్భానుసారంగా ఛందస్సునుపయోగించడం గురించి ఒక ఆసక్తికరమైన సంభాషణ …

Posted in కవిత్వం | Tagged | 4 Comments

2009 ఏప్రిల్ గడిపై మీమాట

కూర్పరి మాట:
ఈసారి(ఏప్రిల్ 2009) గడి కొంచెం వెరైటీగా ఇచ్చాను. ఇందులో ఒక కీలక పదం తక్కిన వాటితో సంబంధం లేనిది ఉంది. దానికి ఆధారం కూడా విడిగానే ఉంది. అది గడిలో మొదటి వరుసలో నింపవలసిన పన్నెండక్షరాల పదం. కాబట్టి అసలు గడి 11×12 అన్నమాట. కీలక పదంలో ఒకో అక్షరమూ, ఆ columnలో ఏదో ఒక నిలువులోనో అడ్డంలోనో ఉన్న పదంలో లోపించిన అక్షరం అవుతుంది. నిలువు పదంలో అక్షరం లోపిస్తే అది ఆ పదంలో ఎన్నో అక్షరమైనా అయ్యుండవచ్చు. అడ్డంలో లోపిస్తే మాత్రం అది మొదటి అక్షరమే అవుతుంది (కొంత సులువుగా ఉండేందుకు). ఉదాహరణకి కీలక పదం “గోరొంక గూటికే చేరావు చిలక” అయితే, మొదటి columnలో ఏదో ఒక నిలువులో క్లూకి “గోమేధికము” అనే పదం సమాధానం కావచ్చు. కాని అక్కడ నాలుగక్షరాలే ఉంటాయి. అంచేత “గో” అన్నది కీలక పదంలో మొదటి అక్షరంగా వేసుకొని, “మేధికము” అన్నది నిలువు పదంలో వేసుకోవాలి. అలాగే మిగతా అక్షరాలు.
– కామేశ్వర రావు
కీలక పదానికి ఆధారం:
భక్త కవిరాజు చింతించింది కేవలం దీనికోసమా!

2009 ఏప్రిల్ గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి

పాత గడులు

———————————-

Posted in గడి | Tagged | 26 Comments

2009 మార్చి గడి ఫలితాలు

సరిగా పూరించినవారు: కామేశ్వర రావు
ఒక్క తప్పుతో: కంది శంకరయ్య, వెన్నెల, స్వరూప కృష్ణ, గోకుల్
రెండు తప్పులతో: ఆదిత్య

వీరికి పొద్దు అభినందనలు తెలుపుతోంది.
Continue reading

Posted in గడి | Tagged | 3 Comments

తొలి మానవులు, ప్రకృతి

– కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మనుషులకూ, తక్కిన ప్రాణులకూ తమ గురించీ, పరిసరాలను గురించీ కొంత అవగాహన ఉంటుంది. ఏ జంతువైనా చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ, తన పిల్లలను ప్రమాదాల నుంచి కాపాడే ప్రయత్నంవంటిది చేస్తుంది. పక్షులు గుడ్లు పెట్టేముందు గూడు కట్టడం మొదలు పెడతాయి. వీటిలో కొన్ని చర్యలు సమయానుసారంగా యాంత్రికంగా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో కొంత ఆలోచన అవసరమౌతుంది. జంతువులుకూడా కొన్ని పరిస్థితుల్లో రెండు మూడు పద్ధతులో, మార్గాలో ఎదురైనప్పుడు వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవలసివస్తుంది. కానీ ఇవన్నీ అప్పటికప్పుడు జరిగే ప్రక్రియలు. ముందుగా ఆలోచించి ఆ ప్రకారంగా ప్రవర్తించడం మనుషులు మాత్రమే చెయ్యగలరు. ఉదాహరణకు రాబోయే చలికాలానికి అవసరమైన జంతువుల చర్మాలు సేకరించి ముందుగానే దాచుకోవడంవంటి పనులు మనుషులకే సాధ్యమయాయి. ఇటువంటి ప్రత్యేకత మనుషులకు శరీరధర్మాలవల్ల అబ్బలేదు. ప్రకృతి కలిగించే ఇబ్బందుల ఒత్తిడివల్ల కలిగింది. Continue reading

Posted in వ్యాసం | 4 Comments

తామస విరోధి – నాల్గవభాగం

ఈ భాగం లో నిషిగంధ గారి పుష్ప విలాసం పై చర్చను చదవండి.

నిషిగంధ:

*పుష్పవిలాసం*
**
రంగో రూపమో లోపమెక్కడుందో..

గుడిలోకి కాకున్నా
ఆమె జడలోకైనా
ఎంచుకోలేదు!

ఇక నీ లోకమిదేనని
సహచరులు వెక్కిరిస్తూ వెడలిపోయారు..

అస్పష్ట సందేహమేదో
ఒంటరిని చేస్తుంటే
ఏటవాలు కిరణమొకటి
వెచ్చగా హత్తుకుంది..
తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది..

స్థానభ్రంశం లేకున్నా
తల్లిపొదనే తనువు చాలించే
స్వేచ్ఛ నా సొంతమనే
కోయిల సందేశం చేరుతుండగానే
తుమ్మెద తొలిముద్దు పెట్టింది!

మహేష్:

మొదటి వాక్యం “రంగో రూపమో లోపమెక్కడుందో.. ” అవసరం లేదనిపిస్తోంది.

నూ. రాఘవేంద్రరావు:
నిషిగంధ గారికి,
మీ భావన అద్భుతం గా ఉంది.
మొదటి వాక్యం లో నాదో సలహా “రంగో రూపమో, గంధమో, వాసనో” అంటే ఎలా ఉంటుంది.
“గుడి లోకి కాకున్నా” అనే పదాన్ని “గుడికి కాకున్నా” అనీ; “ఆమె జడ లోకి” అనే వాక్యం లో ‘ఆమె ‘ అనే పదాన్ని తీసివేసినా  స్త్రీ అనే తెలుస్తుంది.
“ఇక నీ లోకమిదే” అనే వాక్యం లో “ఇక”అ నే పదం తీసేస్తే
గద్య రూపం నుంచి  కవితా రూపం చెందుతుందని నా భావన.

‘నీ లోకమిదే ని’ నీ బ్రతుకింతే గా మార్చి చూడండి. వెక్కిరిస్తూ *వెడలి పొయారు* బదులు వెళ్ళిపోయారు ఎలా వుంటుందంటారు?

“అస్పష్ట  సందేహమేదో”  లో సందేహమేదో అన్న పదం అతికి నట్లు లేదనిపించింది.
రవిశంకర్:

చివరి వాక్యం అలాగే ఉంచి, అంతకు ముందు వాక్యాలు కొంత మార్పుచేసుకుంటే మంచిది. కవిత ఫరవాలేదనిపించినా, ఇతివృత్తం నాకు కొంత పాతగా అనిపించింది. మరింత కొత్త ఊహల్ని,
అనుభవాల్ని అక్షరీకరించే ప్రయత్నం చెయ్యండి .

కామేశ్వర రావు:

నిషిగంధ గారు,

ఈ కవితలో మీ మార్కు కనీ కనిపించకుండా కనిపిస్తోందండి. కాస్త తొందరలో
రాసినట్టున్నారు. “ఏటవాలు కిరణమొకటి వెచ్చగా హత్తుకుంది” – చాలా బావుంది.
శీర్షిక మాత్రం నచ్చలేదు, పాతవాసన కోడుతోంది 🙂  “ఓ గడ్డిపూవు ఊసు” అంటే
బావుంటుందేమో.

నిషిగంధ:

రాఘవేంద్ర రావు గారు, మహేష్ గారు, రవిశంకర్ గారు, మరియు కామేశ్వరరావు గారు –
కవిత పై మీ అభిప్రాయాలు విశదీకరించినందుకు ధన్యవాదాలు..

*మహేష్,* మీరు చెప్పినట్టు మొదటి లైన్ పూర్తిగా తీసేయకుండా రెండవ చరణం తర్వాత
ఉంచితే ఎలా ఉంటుందంటారు?

“గుడిలోకి కాకున్నా
ఆమె జడలోకైనా
ఎంచుకోలేదు!

ఇక నీ లోకమిదేనని
సహచరులు వెక్కిరిస్తూ వెడలిపోయారు..
రంగో రూపమో లోపమెక్కడుందో!?

అస్పష్ట సందేహమేదో
ఒంటరిని చేస్తుంటే…..”

*రవిశంకర్ గారు,* తప్పకుండా మీ సలహాని ఆచరించడానికి ప్రయత్నిస్తాను.. మీరు
చెప్పింది నిజమే ఈ కవిత ఇతివృత్తం పాతదే! కానీ చెప్పేసిన విషయాన్నే నా కలం
ద్వారా కాస్త కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం..

*కామేశ్వరరావు గారు,* అయితే మీరన్నట్లు పేరు వలనే కవిత కూడా పాతది
అనిపిస్తుండొంచ్చు.. కానీ నేను ‘విలాపం’ విన్నాను కానీ ‘విలాసం’ గురించి
వినలేదు.. అందుకే ఆలోచించకుండా పెట్టేసాను..

-కృతజ్ఞతలతో
*నిషిగంధ*

Posted in కవిత్వం | Tagged , | 3 Comments

కథా మాలతీయం – 4

స్వాతి:

కాలేజీ రోజుల్లోనూ, ఆ తర్వాతా మీ సాహిత్య ప్రస్థానం ఎలా సాగింది. మీ కథల ద్వారా మీకు పరిచయమైన సాహితీ వేత్తలెవరు, వారితో స్నేహం వల్ల మీరు నేర్చుకున్న విషయాలు వ్యక్తిగా, కథకురాలిగా మీకెలా ఉపయోగపడ్డాయి?

మాలతి:

నా ఢిల్లీ చదువు, లైబ్రరీసైన్సులో మాస్టర్సుచదువూ అయినతరవాత, విజయనగరం మహారాజావారి వుమెన్సు కాలేజీలోలో ఒక యాడాదిపాటు లైబ్రేరియనుగా పనిచేసేను. మహారాజావారి భవనంలో కాలేజీ, ఆవెనక గుర్రాలశాలలో పొరుగూరినుండివచ్చిన నాలాటి స్టాఫుకి వసతి.

అక్కడున్నప్పుడే పైడిరాజుగారిని కలుసుకున్నాను బొమ్మలేయడం నేర్చుకుందాం అని. అట్టే రోజులు సాగలేదులెండి. తరవాత ఒకరోజు ద్వారం వెంకటస్వామి నాయుడిగారి కచేరికీ వెళ్లేను, హిస్టరీ లెక్చరరు నిర్మల లాక్కెళ్తే. మొదట నేను ఇష్టం పడలేదు. నువ్వు పాడుతుంటే నన్ను శృతిపెట్టె అయినా వాయించనివ్వవు అని తనతో పోట్లాడుతుండేదాన్ని. మరోసారి చూద్దాంలే అన్నాను ఆరోజు. దానికి నిర్మల, ఆయన పెద్దాయన. మళ్లీ ఎప్పుడో కచేరీ. ఇప్పుడే రా. అంది. సరేనని వెళ్లేను. అదే ఆయన ఆఖరికచేరి. ఇలాటి సంఘటనలవల్లే అనిపించేది నా జీవితాన్ని నేను కాక మరెవరో ప్లాను చేస్తున్నట్టు. అంచేత కూడా ఏవిషయంలో గానీ నాకు నేనయి చేసుకునే ప్రయత్నాలు తక్కువ.

మీరు గుర్తించేరో లేదో పై సంభాషణలో మరో చిన్న విషయం. మేం ఆరోజుల్లో హాయిగా నువ్వు అని తేలిగ్గానే అనుకునేవారం కొత్తా పాతా, చీకూ చింతా ఏమీ పట్టించుకోకుండా. బాగా పెద్దవారయితేనే మీరు అనడం. మీరులూ, ప్రతిచిన్నవిషయానికీ తప్పు పట్టడాలూ మనకి నవనాగరీకం పెట్టిన ప్రసాదం. దాంతోనే మనిషికీ మనిషీకీ మధ్య ఎడం కూడాను.

విజయనగరంలో వున్నరోజుల్లోనే, ఒకసారి జువాలజీ లెక్చరరు రేణుకకి భువనేశ్వర్‌లో ఇంటర్వ్యూ వచ్చింది. నన్నూ, మరో లెక్చరరు సీతారామంనీ కూడా రమ్మంది సరదాగా తిరిగి వద్దాం అని. సరే అని ముగ్గురం వెళ్లేం భువనేశ్వర్ చూడ్డానికి. బాగా జ్ఞాపకం రావడంలేదు అలా బయల్దేరేముందు పద్ధతిగా శలవు అడిగి శాంక్షను చేయించుకోడంలాటిది చెయ్యలేదనుకుండాను. నాకేమిటో ఈ ఆఫీసు పద్ధతులు అట్టే తలకెక్కవు. నాపనులు నేను పద్ధతిగానే, అంటే నేను ఏర్పరుచుకున్న పద్దతిలో చేసుకుంటాను కానీ వేరేవాళ్లు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటూ రూళ్లు పెడితే నేనొప్పను.

విజయనగరంనించి విశాఖపట్నం యెంతదూరం కనక. బస్సులో గంట ప్రయాణం. ఆదివారాలు ఇంటికొస్తూ వుండేదాన్ని. అలాగే భువనేశ్వరంనించి తిరిగొచ్చేక, ఆదివారం ఇంటికొచ్చేను.

మాఅమ్మతో కబుర్లకి వచ్చిన ఒకావిడ, పెళ్లి కావలసిన పిల్ల. కట్నంకోసం డబ్బు దాచుకోమని చెప్పాలి కానీ అలా ఊళ్లు తిరిగి తగలేస్తుంటే ఊరుకుంటారా? అంది.

మాఅమ్మ జవాబు, వెళ్లి దేశాలు చూడు అంటూ ఇవ్వడానికి నాదగ్గర డబ్బు లేదు. దాని డబ్బుతో అది వెళ్తోంది. దానిష్టం అని. వెనక్కి తిరిగి చూస్తే నాకు మాఅమ్మ ఎంత స్వేచ్ఛనిచ్చిందో ఇప్పుడు తెలుస్తోంది. ఆరోజుల్లో అది చాలా తేలిగ్గా తీసుకున్నాను. మాఅమ్మ ఋణం తీర్చుకోలేకపోయేనే అని ఇప్పుడు బాధపడతాను.

నా డబ్బూ, మాఅమ్మా శీర్షికతో నేను మురిసిపోతూ చెప్పుకునే మరో కథ వుంది. ఇదివరకు ఎక్కడో చెప్పేను నాకు ట్రాన్సిస్టర్ పిచ్చి చాలా వుండేది. తిరపతిలో ఉద్యోగం మొదలెట్టేక ఒకటి కాదు మళ్లీ మళ్లీ కొనేస్తుండేదాన్ని ఆ ట్రాన్సిస్టర్లు (ఈనాటి టేప్ రికార్డర్లు). మాఅమ్మ ఒకసారి అంది, ఎందుకు అలా ఆ ప్లాస్టిక్ మీద తగలేస్తావు డబ్బు. బంగారం అయితే శాశ్వతం అని. మాఅమ్మ వాదన నేనేదో నగలు దిగేసుకోవాలని కాదు. నగలు స్త్రీధనం. ఆడవారికి ఆపత్సమయంలో ఆదుకునే ఆస్తి అని ఆవిడ అనేది. ఆవాదన నిరూపించడానికేనేమో అన్నట్టుగా ఒకసారి పూర్ణయాత్రాస్పెషల్ రైల్లో యాత్రలకి వెళ్లి వస్తుంటే, గోదావరి బ్రిడ్జి కూలి, రైలు గోదావరినదిలో కూలిపోయింది. మాఅదృష్టం బాగుండి, మాఅమ్మకి ప్రమాదం ఏమీ జరగలేదు. ఆసమయంలో ఆవూరి గుడిపూజారి అక్కడికి వచ్చి మాఅమ్మని చూసి, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టేరుట. మాఅమ్మ వారిఋణం ఉంచుకోరాదని చేతిబంగారపుగాజు ఒకటి తీసి హుండీలో వేసింది. ఆతరవాత, చాలాదూరపుచుట్టం అబ్బాయి ఒకతను ఆదుస్సంఘటన చూడ్డానికి వచ్చి, మాఅమ్మని చూసి ఇంటికి తీసుకెళ్లి తరవాత నెమ్మదిగా మరో రైలు ఎక్కించేడుట. ఆప్రమాదంలో కొన్నివేలమంది వున్నారు. ఆగుడిపూజారికి మాఅమ్మకే సాయం చెయ్యాలని ఎందుకు అనిపించింది? అంటే చెప్పలేం. అందుకే మాఅమ్మ దైవాన్ని నమ్మేది. నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం తరిగిపోతోంది. అది తరవాత చెప్తాను. ఇంతకీ చెప్పొచ్చేది మాఅమ్మ నగలు అవసరానికి ఆదుకునే స్త్రీధనం అని నమ్మింది. ఈకథ తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఈనాడు నేనున్న లోకంలో సర్వం ప్లాస్టిక్మయం. ఇప్పుడు మాఅమ్మ వుంటే ఇంకెంత బాధ పడేదో! అని. ఇలాటి అనుభవాలూ, ఆలోచనలే నాచేత అక్షరం పరమం పదంలాటి కథలు రాయించేది.

అక్టోబరు 1964లో తిరుపతి యూనివర్సిటీ లైబ్రరీలో అసిస్టెంటు లైబ్రేరియనుగా చేరేను. మొదటి యేడు హాస్టల్లో వున్నాను. తరవాత మాఅమ్మ వచ్చి, ఇల్లు చూసి, పనిమనిషినీ, వంటమనిషినీ, బజారుపనులకి మరో మనిషినీ, రిక్షావాడినీ మాట్లాడి, సకల ఏర్పాట్లూ చేసి పెట్టింది. నాగురించి నేను పట్టించుకోనని తరుచూ అందరితో చెప్తూండేది. ఆరోజుల్లో నాకు ఆరువందలరూపాయలు జీతం. ఆజీతంలోనే అన్ని సౌకర్యాలు అనుభవించేను. ఈనాడు అమెరికాలో నాబతుకుకీ ఆనాటిబతుకుకీ పోలికేలేదు. అంత నిష్పూచీగా జరిగిపోయేయి ఆరోజులు.

ఆరోజుల్లో లైబ్రరీలో మాసెక్షనులోనే పనిచేసే ప్రభావతీ నేనూ అచిరకాలంలోనే బాగా స్నేహితులం అయిపోయాం. ఇద్దరం సినిమాలు తెగ చూసేవాళ్లం. మాయింటివేపు థియేటరయితే మాఇంట్లో, వాళ్లింటివేపు థియేటరు అయితే వాళ్లింట్లో పడుకునేవాళ్లం.

అలా ఒకరోజు మేం వాళ్లింటివేపు సినిమాకి వెళ్లి, వాళ్లింట్లో పడుకున్నాం. మర్నాడు ఉదయం ఇంటికొచ్చి, తలుపు తీసి చూస్తే ఇంట్లో దొంగతనం జరిగినట్టు అర్థం అయింది. అయిదువందలరూపాయలు ముందురోజు బాంకునించి తెచ్చుకున్నాను. ఆరోజుల్లోనే చేతివాచికీ బంగారుగొలుసు చేయించుకున్నాను. అవీ, మరో గొలుసూ పోయేయి. పోలీసు రిపోర్టు ఇచ్చేను. సంగతి తెలిసి మాఅమ్మ విశాఖపట్నంనించి వచ్చింది. దేవుడే నీకు వాళ్లింట్లో పడుకోవాలన్న బుద్ధి పుట్టించాడు. నువ్వు ఇంట్లోనే వుంటే ఏం ప్రమాదం జరిగి వుండునో అంది కన్నీళ్లతో.

ఆమాట మాఅమ్మ చెప్పేవరకూ నాకు తోచలేదు. అంటే నాకు నమ్మకం వుందా, లేదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. ఒకే సంఘటనకి ఒకొక్కరు ఒకొక్కవిధంగా అన్వయం చెప్పుకుంటారు అని అర్థం అయింది అప్పుడు. అయ్యో నావస్తువులు పోయేయి అని విచారించవచ్చు. హమ్మయ్య, నాకు హాని జరగలేదు అని సంతోషించవచ్చు. ఇలాటి వూహలు కథలు రాస్తున్నపుడు బాగా ఉపయోగపడతాయి.

తిరుపతిలో వున్నప్పుడే పులికంటి కృష్టారెడ్డితోనూ, ఆయనద్వారా మధురాంతకం రాజారాంగారితోనూ పరిచయం అయింది. వారిని అప్పుడప్పుడు కలుసుకుంటూ వుండేదాన్ని. ఆరోజుల్లోనే కృష్ణారెడ్డి స్వంత ప్రింటింగ్ ప్రెస్ పెట్టి, కామధేను అని ఒక ద్వైవార పత్రిక నడుపుతూండేవాడు.

మీరు కొన్ని మంచికథలు ఎంపిక చెయ్యండి. ఒక సంకలనంగా వేధ్దాం అన్నాడు. సరేనని నేను ఓ పదికథలు ఎంపిక చేసి, రచయితల అనుమతులు తీసుకున్నాను. పురాణం సుబ్రహ్మణ్యశర్మగారిని ముందుమాట రాయమని అడిగితే, ఆయన వెంటనే రాసి ఇచ్చేరు కూడాను. కానీ కృష్ణారెడ్డి పుస్తకం వెయ్యనేలేదు. రెండు దశాబ్దాలు అయిన తరవాత కూడా ఆసంకలనం గురించి నన్ను అడిగిన రచయితలు వున్నారు. ఇలాటివి జరిగినప్పుడు నన్ను బాధించేవిషయం నానిర్లక్ష్యంవల్ల కాక, మరొకరి నిర్లక్ష్యంవల్ల మాట నిలబెట్టుకోలేదన్న మాట నాకు వచ్చింది కదా అని. సుబ్రహ్మణ్యశర్మగారు మంచి ముందుమాట రాశారు. నేను తూలిక.నెట్ మొదలుపెట్టినతరవాత, ఆయన ముందుమాట అనువదించి తూలికలో ప్రచురించాను.

మరో విషయం,  ఆరోజుల్లో నాకు భాష అంటే వుండే పిచ్చి. ఆ సంకలనానికి ఎక్కడో విన్న వ్యాసఘట్టాలు అన్న పేరు పెట్టేను, నా పాండిత్యప్రకర్ష ప్రకటించుకోడానికే అనుకుంటాను. నిజంగా ఆమాటకి నాకు అర్థం తెలిసే పెట్టానా అంటే అనుమానమే. శర్మగారు తన ముందుమాటలో వివరణ ఇచ్చేరు. అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది.

ఆరోజుల్లోనే ఆచంట జానకిరాంగారితో పరిచయమయింది. ఆయన మాఇంటికి వస్తూ వుండేవారు. ఒకసారి నాకథ మంచుదెబ్బ, రచన పత్రికలోంచి తీసిన టేర్‌షీట్స్ ఆయనకి చూపించాను. ఆయన ఇంటికి తీసుకెళ్లి, ఆరెంజికలరు అట్టతో చక్కగా బైండు చేసి తీసుకొచ్చేరు. దాంతోపాటు రెండు దోసిళ్లనిండా ఓపెధ్దకాయితప్పొట్లాంలో ఎర్రగులాబీలూ తీసుకొచ్చేరు. ఆతరవాత ఒకసారి నేను వాళ్లింటికెళ్లేను, శారదాదేవిగారు అట్టే మాటాడలేదు. ఆవిడ అలా ముభావంగా వుండడం చూసి, నాకు ప్రాణం చివుక్కుమంది. మళ్లీ ఎప్పుడూ వెళ్లలేదు. ఆవిడ మంచి పొడగరి. చక్కని ఛాయ. తనకథల్లో పాత్రల్లాగే గుంభనగా, గంభీరంగా వుండే వ్యక్తి.

మద్రాసులో రామలక్ష్మి, ఆరుద్రగారి ఇంటికి కూడా రెండుసార్లు వెళ్లేను. ఎందుకు వెళ్లేనో జ్ఞాపకం లేదు కానీ ఇద్దరూ ఎంతో మర్యాదగా నాతో మాట్లాడడం నామనసులో అలాగే వుంది. రామలక్ష్మిగారు చలాకీగా మాట్లాడితే, ఆరుద్రగారు నెమ్మదిగా మాట్లాడతారు.

1968లో రామలక్ష్మిగారు ఆంధ్రరచయిత్రుల సమాచారసూచిక సంకలనం ప్రచురించారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ కోరినందున. ఆసంకలనంలో నాగురించిన వివరాలలో చిన్నకథలు రాయడంలో అందెవేసిన చెయ్యి అని ఓ వాక్యం జోడించారు. దానిమీద. నా స్నేహితురాలూ, రచయిత్రీ, అయిన మీరా సుబ్రహ్మణ్యం (అప్పట్లో కె. మీరాబాయి) నన్ను దెప్పుతుండేది, రామలక్ష్మిగారికి నువ్వంటే ఇష్టం అని. ఎందుకంటే 68మంది రచయిత్రులున్న ఆసంకలనంలో రామలక్ష్మిగారు రచనలమీద వ్యక్తిగతమయిన అభిప్రాయం వెలిబుచ్చింది ఒక్క నాకథలమీదే!

ఆరోజుల్లోనే ఆంధ్రరచయిత్రుల సభల్లో 1968, 1969లో సత్కారం పొందేను. కనుపర్తి వరలక్ష్మమ్మగారూ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారూ, ఎల్లాప్రగడ సీతాకుమారిగారూ, నాయని కృష్ణకుమారిగారూఅటువంటి విద్వన్మణులూ, సరస్వతీస్వరూపులూ అయినవారిసరసన నిలిచినక్షణాలు తలుచుకుంటే ఆమాలతినేనా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇంచుమించు అదే సమయంలో రెండు కథలు బహుమతులకి నోచుకున్నాయి. (ఈనాటికీ బహుమతులు పొందినకథలు నాకు ఆరెండే. ఆరోజుల్లోనే ఆంధ్రజ్యోతివారు సమీక్షలకి నాకు పుస్తకాలు పంపుతుండేవారు.

ఇవన్నీ తలుచుకుంటుంటే, నాసాహిత్యచరిత్రకి మంచికాలం సిద్ధించింది నేను తిరపతిలో వున్నరోజుల్లోనే, అంటే 1964 నించి 1973 వరకూ అనుకుంటాను.

తిరపతిలో వున్న తొమ్మిదేళ్లూ నాకు గొప్ప తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చేయి. లైబ్రరీలోనే కాక వూళ్లో కూడా నేను ఎక్కడికి వెళ్లినా ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా పలకరించేవారు. ఆమెరికా వచ్చేక ఆనాడు నేను పొందిన గౌరవంవిలువ మరింతగా ఘనంగా కనిపిస్తోంది. మళ్లీ అలాటి తృప్తీ, ఆనందం నాకు కలిగిందీ, కలుగుతున్నదీ బ్లాగులోకంలో తెలుగు తూలిక ప్రారంభించిననతరవాతనే.

అమెరికా వచ్చినతరవాత నేను గ్రహించిన విశేషాలూ, తెలుగుతూలికద్వారా పొందిన అనుభవాలూ, పెంపొందిన ఆత్మీయతలూ ఈవిషయాలమీద స్వాతికుమారి చాలా ప్రశ్నలే వేస్తున్నారు. అవన్నీ బాగా ఆలోచించి మళ్లీ రాస్తాను.

Posted in వ్యాసం | Tagged | 11 Comments

తామస విరోధి – మూడవ భాగం

ఈ భాగం లో మహేష్ గారిచ్చిన సమస్య కు రెండు భిన్న కోణాల్లోంచి వచ్చిన పూరణల్ని చదివి మీరు కూడా ప్రయత్నించగలరేమో చూడండి.

కత్తి మహేష్:

ఈ మధ్య తమిళ్ లో చేరన్ నటించిన ఒక సినిమా పేరు విని “భలే ఉందే”
అనుకున్నాను. అదే శీర్షికని తెనుగీకరించి సమస్యగా ఇస్తున్నాను. ఈ
శీర్షికకు కవిత రాయండి.

” సీత వెదకిన రాముడు”

మనందరికీ తెలిసిన కథలో రాముడు సీతను వెతుకుతాడు, కానీ ఇక్కడ సీత రాముణ్ణి
వెతికానంటోంది. అదేమిటో? ఎలాగో? కొంచెం ఆలోచించి చెప్పండి!

నూతక్కి రాఘవేంద్ర రావు:

రాముని తలచుచు సీతా మాత
విరహ తాపమున తల్లడిల్లి పడి
వున్న వేళలో సీతా ,సీతా
సీతా యటంచు రాము ని గాత్రం
వినిపించె నామెకు వీనుల విందుగ
కర్ణపేయముగ తలపో పిలుపో
రావణ మాయో సంభ్రమాన ఆ
అశోక  వనిలొ తత్తర పాటున
సీత వెదికె రాముని కొరకు .


కత్తి మహేష్:

చాలా బాగుంది.
తలుచుకున్న ఎడబాటులో, తలపుకొచ్చిన రాముని పిలుపు వినిపించిన ఆక్షణిక భ్రమలో,
అశొకవనమన్న స్పృహకూడా రాక రాముణ్ణి సీత వెదకటం అమోఘం.
అభినందనలు.

శ్రీవల్లీ రాధిక:

శీర్షిక చూడగానే కలిగిన మొదటి భావమిది. ఇంకా ఇంప్రూవ్ చేయచ్చు.

సీత వెదికింది

తానెరుగని రాకుమారుడెవరో తన మెడలో తాళి కడుతుంటే

తన కోసం శివధనుస్సు విరిచిన సామాన్యుడి కోసం

సీత వెదికింది

తొలిసారి పెళ్ళినాడు సీత వెదికింది


తండ్రికిచ్చిన మాట కోసం తపనపడే తనయుడిలో

శూర్పణఖని కాదన్న శ్రీరాముడి హృదయంలో

తనకున్న స్థానం కోసం సీత వెదికింది

నియమాలకూ నిగ్రహాలకూ

తనపైని ప్రేమ అతీతమనే భావన కోసం

సీత వెదికింది


అశోకవనాల్లో వేచేటపుడూ

అగ్నిపరీక్షలు దాటేటపుడూ

సీత వెదికింది

నీధర్మమూ నా ధర్మమూ

ఒకటేననగల నేస్తం కోసం

వేలసార్లు సీత వెదికింది


వంటరితనంలో వాల్మీకి శరణంలో

తనకోసం నడచిరాగల రాముడి కోసం

సీత వెదికింది

తనచేయి విడవని రూపం కోసం

కన్నబిడ్డల కళ్ళల్లో

సీత వెదికింది


ఆశలన్నీ ఆవిరయ్యాక

పుడమిగర్భంలో కనుమరుగవుతూ

కడసారి కన్నీళ్ళతో సీత వెదికింది

ఆశ్రితవత్సలుడు అయోధ్యాపతిలో

అచ్చంగా తనవాడైన రాముడి కోసం

సీత వెదికింది

బొల్లోజు బాబా:
తొలిసారి పెళ్ళినాడు సీత వెదికింది  ?????

కవిత కాన్సెప్టు ఇలా ఉంటే కొంచెం శక్తిమంతంగా ఉండేదేమో

రావణుడెత్తుకెళ్ళినపుడు,
బేలగా అడవంతా గాలిస్తూ రోదించినపుడూ,
అడవికి పంపిననాడు,
స్వర్ణ సీతను పెట్టుకొని యాగాదులు నిర్వహించినపుడు, అగ్నిప్రవేశం
చేయమన్నపుడూ,
అంటూ కొన్ని రాముని కేరక్టర్ లోని కొన్ని గ్రే ఏరియాస్ ని (పెద్దలకు కోపం
వస్తుందేమో) స్పృశిస్తూ ఆ యా సందర్భాలలో ” సీత వెతికింది తన రాముని
కొరకు”  అని ఉంటే బాగుండేదనిపించింది.

మీరు ముందే అన్నట్లు రిఫైన్ మెంటు చెయ్యచ్చనిపిస్తుంది.

కత్తి మహేష్:

మంచి కోణం నుంచి చెప్పిన పూరణ.
చెప్పాలనుకున్నది చెప్పేస్తే, ఎక్కడ గొడవలైపోతాయో! అనే సందిగ్ధత ఈ కవితలో
కనపడింది. ఎందుకో?!?

త.య.భూషణ్:

మంచి భావావేశం ఉంది మీలో.దానికి చక్కని భాష సైదోడు.
పూరణలకే పరిమితం కానవసరం లేదు.

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

తామస విరోధి – రెండవ భాగం

ఉగాది వచన కవి సమ్మేళనం రెండవ భాగంలో చావా కిరణ్ గారి కవితపై సరదా చర్చ, సీరియస్ విశ్లేషణ:

చావా కిరణ్:

విరబూసిన పూలన్నీ నిద్రోతున్నాయి.

సుగంధాలు మోసుకెళ్లాల్సిన గాలి –
చిగురుటాకుల మాటున దాచుకుంది.

యుద్ద సంధ్యలో నదీ స్నానానికెళ్లిన
ఎర్ర ఏనుగు భీకరంగా ఘర్జించింది.

ఒకటీ ఆరా పూలు ఉలిక్కిపడ్డాయి.
చిగురుటాకులు గడగడ వణకాయి.

————————-

Please let me know where does this stand in terms of poetry.
kiran:

Blossoms all are sleeping.

The air, dutiful carrier of fragrances
is hiding behind tender leaves.

Red elephant rored ferociously
during river bath at the dawn of war.

One or two flowers woke up,
tender leaves trembled.

(translation of above lines to English)

రవి శంకర్: కవిత గంభీరంగా ఉన్నా కొంత అసంపూర్తిగా ఉందేమో అనినాకనిపించింది. ఒక చిన్న టెక్నికల్ విషయం: సింహం గర్జిస్తుంది, ఏనుగు ఘీంకరిస్తుంది అని కదా వాడుక. అందువల్ల ఆ లైనులో తగిన సవరణ చేసుకుంటే బాగుంటుంది. అలాగే, చిగురుటాకుల వెనుక గాలి ‘దాగుంది ‘ అనాలనుకుంటాను. గాలి సుగంధాల్ని దాచిపెట్టిందని మీ భావమా? ఇంగ్లీషులో ఆ ఆర్థం ధ్వనించటం లేదు – రవిశంకర్

చావా కిరణ్: నెనర్లు. ఘీంకరించిందిగా మార్చాను. దాచుకుంది అంటే నా ఉద్దేశ్యం సుగంధాలు దాచుకుంది, మరియు తన్ను తాను దాచుకుంది అని. ఆంగ్లంలో ఆ భావం కోసం తీవ్రంగానే ఆలోచించి చివరకు
is hiding behind tender leaves.
Hiding what? Hiding himself and hiding the fragrances
అనుకొని అడ్జస్ట్ అయ్యాను.
కవిత అసంపూర్ణమే, ఎందుకంటే ఇంకా యుద్దం ముగియలేదు. కవితకు “విరహ చిత్రిక ” అని టైటిల్ ఎలా ఉంటుంది?

కామేశ్వర రావు: ఇంగ్లీషులో “hiding” అనే పదం ఇచ్చే రెండర్థాలు (దాస్తోంది, దాక్కుంది), తెలుగులో “దాచుకుంది” అన్న పదం ఇవ్వదు. మీరీ కవిత ఇంగ్లీషులో ముందు రాసి తర్వాత తెలుగులోకి అనువదించారేమో అనుకున్నాను చదవగానే. Red Elephant స్వదేశంలోని తెలుగువాళ్ళకి ఎంతవరకూ అర్థమవుతుందో అనుమానమే!
మొత్తానికి రవిశంకర్ గారు అన్నట్టు కవిత గంభీరంగా ఉంది.

శీర్షిక గురించి no comments :-)

చావా కిరణ్: దాచుకుంది ఇవ్వదు కాకుంటే చిత్తూరు వెళ్తే రెండు అర్ధాలు ఇస్తుంది అనుకుంటాను. రానారె ఉన్నావా? తప్పయితే స్వల్ప అడ్జస్ట్ మాడి.

ఉదాహరణకు మా వాడు నాయుడు తీసేస్తా అంటే కలుపుతా అని అర్థం. ఉభయభాషా సినిమా లాగా రెండు భాషల్లోను ఒకే సారి వ్రాసిన కవిత అనుకోవచ్చు. ముందు పెన్ను పెట్టింది మాత్రం తెలుగులోనే.

తమ్మినేని యదుకుల భూషణ్: సున్నితమైన వస్తువును జాగ్రత్తగా pack చేసి రవాణా చేయడం పరిపాటి. అందునా గాజు వస్తువు, దూర ప్రాంతాలకు రవాణా అవుతుంటే packing మరింత భద్రంగా ఉంటుంది. కవిత్వం అతి సున్నితమైనది, అంతరాంతరాల్లోచి బయటికి వెలువడే క్రమంలో దాని చుట్టూ అవసరంలేని నానా పదాలు వాక్యాలు చేరి ఉంటాయి. వాటన్నిటినీ ఓపికగా తొలగించి, నిజ వస్తువును దర్శించడంలోనే ఉంది అసలు కిటుకు.

ఇందులో బలమైన వాక్యాలు:
యుద్ద సంధ్యలో నదీ స్నానానికెళ్లిన
ఎర్ర ఏనుగు భీకరంగా ఘీంకరించింది.

మిగిలినవన్నీ పేలవంగా ఉన్నాయి. అడ్డదిడ్డంగా, అసౌష్ఠవంగా ఉన్న వాక్యాల కీకారణ్యాన్ని ఛేదిస్తే గాని ఘీంకారం చేసే కరి కనిపించదు.

PS: ముందు ఒక భాషలో సౌష్ఠవంగా రాసిన తరువాత రెండవ భాషలో తర్జుమాకు బయలుదేరవచ్చు. లేదంటే అంతా తబ్బిబ్బు వ్యవహారమవుతుంది. కవికి ఏకాగ్రత లేకుంటే ఎర్ర ఏగానిక్కూడా పనికి రాడు.

చావా కిరణ్: తమ్మినేని యదుకుల భూషణ్ గారూ, నెనర్లు. మీ జాబు నాకు చాలా పనికి వచ్చింది. ఈ
సారి ఇంకొంచెం చక్కగా వ్రాయ ప్రయత్నిస్తాను.

కత్తి మహేష్: ఈ కవిత ద్వారా నాకు స్ఫురించిన అర్థం ఏమిటనేది చెప్పాలంటే, కొంత తికమకగా ఉంది. ఒక స్థాయిలో ఈ కవిత పదచిత్రణే అయినా, “ఎర్ర ఏనుగు” అనే metaphor తో కొన్ని ఆలోచనలు ప్రాణం పోసుకున్నాయి. ఆ పదానికి ముందూ వెనుకనున్న పదచిత్రాలు మరో కోణాన్ని ఆవిష్కరింపజేసాయి. నావరకూ ఎర్రఏనుగు కమ్యూనిస్ట్ రష్యాకు ప్రతీక. ప్రపంచ ప్రగతి పథంలో, పూలన్నీ విరబూసినా చైతన్యం లేక నిదరోతూనే ఉన్న క్షణాన, ‘అభివృద్ధి’ గంధాల్ని అందరికీ అందించాల్సిన ప్రభుత కొన్ని ఆకుల మాటునే మిగిలి, మిగతా వారిని ఊపిరి సలపని స్థితిలో మిగిల్చిన వేళ, కమ్యూనిజం (ఎర్ర ఏనుగు) ఓల్గా నది సాక్షిగా ఘీంకరించింది. అంత ఘీంకారానికీ, విప్లవాత్మకమైన మార్పుకూ కూడా కేవలం కొన్నే దేశాలు స్పందించాయి. ప్రపంచ (ప్రభుత) విధానాల్లో కొన్నే మార్పులు జరిగాయి. ఇక్కడ జరిగిన మార్పు “విలువ” ఎంత అనేకన్నా ఎర్ర ఏనుగు ఘీంకారం యక్క ప్రాముఖ్యత చూడాలనే అర్థం స్పురించింది.

ఆంగ్లాన్ని చూడకుండా, మీ కవితను ఇలా చెబితే ఎలా ఉంటుందా! అని ప్రయత్నించాను. చిత్తగించగలరు.

విరబూసిన పూలన్నీ నిదరోతున్నాయి

మరులగంధాలు మోయాల్సిన చిరుగాలి –
చిగురుటాకుల మాటున చల్లగా చేరింది

యుద్ద సంధ్యలో నది లోతున
ఎర్ర ఏనుగు ఘీంకరించింది.

ఒకటో రెండో పూలు ఉలిక్కిపడి లేచాయి
చిగురుటాకులు కొన్ని లేతగా చెలించాయి

(చలించాయి! ఏది సరైతే అది ఎంచుకోవచ్చు)

తమ్మినేని యదుకుల భూషణ్: చక్కగా తిరగరాశారు !!

Posted in కవిత్వం | Tagged , | 7 Comments

2009 మార్చి బ్లాగువీక్షణం

-చదువరి


గతనెలలో చదువరుల అసంతృప్తిని చూసాక, అనుచితమైన రాతలపై బ్లాగరుల వ్యతిరేకత నిర్మాణాత్మక ధోరణిలోనే ఉంటుందన్న మా అంచనా నిజమేనని గ్రహించాము. అటువంటి రాతలపై మీమాటే మామాట అని విన్నవించుకుంటూ, బ్లాగువీక్షణమిక అప్రతిహతంగా కొనసాగుతుందని మనవి చేసుకుంటూ..

ఎన్నికల కారణంగా 2009 మార్చి బ్లాగుల్లో రాజకీయ విశేషాలు పెరిగాయి. ఉగాది పండుగ కూడా సందర్భంగా కూడా టపాలు బాగా వచ్చాయి.
తెలుగులో కొత్తపదాలను ఎందుకు అంగీకరించలేకున్నాము అని నాగప్రసాదు వెలిబుచ్చిన సందేహంపై పెద్ద చర్చ జరిగింది. ఇలాంటి అంశంపైనే తెలుగు చచ్చిపోతే తప్పేంటి అన్నారు రేరాజ్ రివ్యూస్‌లో. ఈ టపాకు కొనసాగింపుగా మరో టపా కూడా రాసారు.

రాజకీయం

  1. మూడో కూటమితో మళ్ళీ తప్పు చెయ్యొద్దంటున్నారు సూర్యుడు
  2. మనలోనే ఉన్న ఈ రకం మనుషుల గురించి మనలో మనిషి అడుగుతున్న ప్రశ్న చూడండి
  3. మనక్కావాల్సిందేమిటి అని అడుగుతున్నారు భావకుడన్
  4. చంద్రబాబు నిబద్ధత గురించి ఓ అభిమాని రాసిన టపా చూడండి.
  5. తెలుగుదేశపు డబ్బు పంచే కార్యక్రమంపై అశోక్ చావా అభిప్రాయం చదవండి
  6. వోట్లూ నోట్లతో రాజకీయులు కట్టే కోటలపై అసంఖ్య పేల్చిన తూటా. ఫిరంగులనూ ఆశించవచ్చు, ఈ బ్లాగులో
  7. ప్రజారాజ్యానికి రాజెవరు అంటున్నారు వేపాకులో
  8. వీళ్ళేనా మనం గౌరవిస్తున్న స్త్రీలు అని అడుగుతున్నారు నెటిజెన్
  9. పదికి పది – ఈ చెణుకు చూసారా?
  10. తెలుగుదేశాన్ని గౌరవిస్తున్న ప్రజారాజ్యం అంటున్నారు చాకిరేవులో
  11. రోజుకు 35 రూపాయలు ఇచ్చేవాడికే మనవోటు అని ఉద్యమిస్తున్నారు రానారె
  12. నిరుద్యోగం పురుష లక్షణం శృంఖలను కొనసాగిస్తున్నారు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
  13. బీజేపీ అంటే భయ్ హో అంటూ భాజపాను విమర్శించారు కత్తి మహేశ్ కుమార్
  14. ఇంతకీ నిశ్శబ్ద విప్లవం ఎవరిది అని అడుగుతున్నారు కలకలంలో
  15. రాజకీయ దుకాణాల్లో అన్నీ ఉచితమే నంటున్నారీ కార్టూన్లో

ఉగాది కోయిలలు:

  1. తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు బీటాను విడుదల చేసారు మిరియాల ప్రదీప్
  2. మరువం ఉష ఉగాది పాట పాడారు
  3. ఆత్రేయ పద్యాలతో విరోధిని పలకరించారు
  4. తెలుగు బ్లాగరి ఫణీంద్ర ఉగాది పురస్కారాన్ని పొందారు
  5. ఇది ఉగాది ప్రశంస కాదు బూరెల ప్రశంస
  6. విదేశాల్లో ఉగాది ఉత్సవాల సంగతులివి
  7. విరోధి పేరు అభాస కావాలని ఆకాంక్షించారు భైరవభట్ల కామేశ్వరరావు
  8. విరోధికే స్వాగతం పలుకుతున్నామే అంటూ ఆశ్చర్యపోయారు ఊకదంపుడు
  9. పక్కవాడి పండగ ఎందుకు దండగ మన పండగలు నెలకొకటి ఉండగ అంటున్నారు ఫన్‌కౌంటర్
  10. చిన్ననాటి ఉగాది సంగతులను నెమరు వేసుకున్నారు సుబ్బు
  11. ఉగాది నాడు నానో కవితల వేడుక
  12. ఉగాది పంచాంగ పఠనం చెయ్యవచ్చిక్కడ.
  13. రాకేశ్వర కూడా ఓ టపా రాసారు. అయితే ఇది సింహరాశి వారికి ప్రత్యేకం.
  14. ఈ ఉగాది తమ ఇంట్లో ఉంగాది అయిందంటున్నారు బ్లాగాడిస్తా రవి
  15. కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు మన హైదరాబాదులో
  16. ఉగాదికి ఛందోబద్ధ స్వాగతం పలికారు వేదుల బాల
  17. తన ఉగాది జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు నేస్తం

హాస్యం:

  1. వివిధ వృత్తుల్లో ఉన్నవారు, కొందరు ప్రసిద్ధ వ్యక్తులూ ప్రేమలేఖలు రాస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై గతంలో శ్రీరమణ పేరడీ రాసారు. పప్పు శ్రీనివాస్ దాన్ని గుర్తుకు తెచ్చేలా హెచ్చార్ మేనేజరు ప్రేమలేఖ రాసారు.
  2. యాపిలు పండు వలన కలిగిన జ్ఞానోదయాల గురించి చదివారా?
  3. కాఫీ వెనకున్న కుట్ర కథ తెలుసా మీకు?
  4. ఓ రౌడీ పెళ్ళి శుభలేఖ చూడండి. వ్యాఖ్యలూ బాగున్నాయిక్కడ
  5. పండగ ఆఫర్ల మీద ఈ టేకు చదివారా
  6. కుడిఎడమైతే పొరపాటేనంటున్నారు చైతన్య. ఇలాంటి వస్తువుతోటే మరో టపా వచ్చింది జంబలకిడిపంబలో

కలగూరగంప

  1. రామ్ములక్కాయ+పాలకూర=మూత్రపిండాల్లో రాళ్ళు? అని అడుగుతున్నారో సోదరి.
  2. అహం బ్రహ్మస్మి అంటున్నారు అబ్రకదబ్ర
  3. ప్రసిద్ధి గాంచిన పది ఆలయాల జాబితా చూడండి
  4. మంత్రాలయ యాత్రా విశేషాలు చూడండి.
  5. కె.ఎన్.వై పతంజలికి శ్రద్ధాంజలి ఘటించారు మురళి వీరబొబ్బిలితో
  6. రవి దుప్పల కూడా పతంజలికి శ్రద్ధాంజలి ఘటించారు
  7. కత్తి విరిగిపోయిందంటూ కాంతారావుకు శ్రద్ధాంజలి ఘటించారు గీతాచార్య
  8. ప్రమాదవనానికి యాభై రోజులు నిండాయి. మార్తాండవాదం అనే పదాన్ని కాయించారందులో!
  9. స్వర్ణసీమకు స్వాగతం నవలను సమీక్షించారు సుజాత.
  10. ఇజ్రాయిలుకు జై కొడదామంటున్నారు, జీడిపప్పు
  11. చిరంజీవి జాతకం చెప్పారు సత్య
  12. పెళ్ళి ముచ్చట్లులో వధువు ఎలా ఉండాలి అని చెబుతున్నారు
  13. బ్లాగులతో హౌసీ అనే వినూత్నమైన సంగతిని రాసారు పలకా బలపంలో
  14. తాను రంగులద్దిన చీరలను ప్రదర్శించారు లలిత
  15. వేదాంతం శ్రీపతి శర్మ ఫోటో క్విజ్‌లు చూస్తున్నారా?
  16. అదన్నమాట సంగతి అంటూ ప్రవీణ్ ఒక వైవిధ్యమైన అంశంతో టపా రాసారు.
  17. ఇక జీమెయిల్ తెలుగులోనూ రాసుకోవచ్చంటున్నారు వీవెన్!
  18. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు 8 బాగుందంటున్నారు నల్లమోతు శ్రీధర్
  19. మనసులో మాట చెప్పుకున్నారు నా లోకంలో

కవిత్వం, ఇతర సాహిత్యం

  1. తన మావకు తానెట్టుకున్న పేర్లు, మీ మావ కోసం కావాలంటే కొన్నట్టుకెళ్ళమంటోందీ యెంకి
  2. కవిసామ్రాట్టు భావుకత గురించి రాసారు చింతా రామకృష్ణారావు
  3. వేకువ వర్ణన చూడండి సాహితీయానంలో


కొత్త బ్లాగులు

  1. ఇదో మంచి స్నేహితుడి బ్లాగు
  2. యువశక్తి బ్లాగుల్లోకి ప్రవేశించింది.
  3. వికటకవి పేరుతో మరో బ్లాగు వచ్చింది.
  4. మాంధాత పేరుతో మరో బ్లాగు ప్రవేశించింది.
  5. వ్యాఖ్యల ద్వారా పరిచితులైన పిచ్చోడు బ్లాగు మొదలుపెట్టారు.

ఇంకా..

  1. మరోప్రపంచం సాధ్యమే నంటారు మార్తాండ. రోజుకు సగటున నాలుగు టపాల చొప్పున రాసుకుంటూ పోతున్నారు.
  2. ఇండియన్ పొలిటికల్ క్లోజప్ లో కూడా ఇబ్బడిముబ్బడిగా టపాలు వస్తూంటాయి
  3. ఎ2జెడ్ డ్రీమ్స్ లో కూడా టపాలు విరివిగా వస్తూంటాయి.
  4. భారత రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర సాగుతోంది.

—————————

-చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

Posted in జాలవీక్షణం | Tagged , , | 4 Comments