కథా మాలతీయం – 4

స్వాతి:

కాలేజీ రోజుల్లోనూ, ఆ తర్వాతా మీ సాహిత్య ప్రస్థానం ఎలా సాగింది. మీ కథల ద్వారా మీకు పరిచయమైన సాహితీ వేత్తలెవరు, వారితో స్నేహం వల్ల మీరు నేర్చుకున్న విషయాలు వ్యక్తిగా, కథకురాలిగా మీకెలా ఉపయోగపడ్డాయి?

మాలతి:

నా ఢిల్లీ చదువు, లైబ్రరీసైన్సులో మాస్టర్సుచదువూ అయినతరవాత, విజయనగరం మహారాజావారి వుమెన్సు కాలేజీలోలో ఒక యాడాదిపాటు లైబ్రేరియనుగా పనిచేసేను. మహారాజావారి భవనంలో కాలేజీ, ఆవెనక గుర్రాలశాలలో పొరుగూరినుండివచ్చిన నాలాటి స్టాఫుకి వసతి.

అక్కడున్నప్పుడే పైడిరాజుగారిని కలుసుకున్నాను బొమ్మలేయడం నేర్చుకుందాం అని. అట్టే రోజులు సాగలేదులెండి. తరవాత ఒకరోజు ద్వారం వెంకటస్వామి నాయుడిగారి కచేరికీ వెళ్లేను, హిస్టరీ లెక్చరరు నిర్మల లాక్కెళ్తే. మొదట నేను ఇష్టం పడలేదు. నువ్వు పాడుతుంటే నన్ను శృతిపెట్టె అయినా వాయించనివ్వవు అని తనతో పోట్లాడుతుండేదాన్ని. మరోసారి చూద్దాంలే అన్నాను ఆరోజు. దానికి నిర్మల, ఆయన పెద్దాయన. మళ్లీ ఎప్పుడో కచేరీ. ఇప్పుడే రా. అంది. సరేనని వెళ్లేను. అదే ఆయన ఆఖరికచేరి. ఇలాటి సంఘటనలవల్లే అనిపించేది నా జీవితాన్ని నేను కాక మరెవరో ప్లాను చేస్తున్నట్టు. అంచేత కూడా ఏవిషయంలో గానీ నాకు నేనయి చేసుకునే ప్రయత్నాలు తక్కువ.

మీరు గుర్తించేరో లేదో పై సంభాషణలో మరో చిన్న విషయం. మేం ఆరోజుల్లో హాయిగా నువ్వు అని తేలిగ్గానే అనుకునేవారం కొత్తా పాతా, చీకూ చింతా ఏమీ పట్టించుకోకుండా. బాగా పెద్దవారయితేనే మీరు అనడం. మీరులూ, ప్రతిచిన్నవిషయానికీ తప్పు పట్టడాలూ మనకి నవనాగరీకం పెట్టిన ప్రసాదం. దాంతోనే మనిషికీ మనిషీకీ మధ్య ఎడం కూడాను.

విజయనగరంలో వున్నరోజుల్లోనే, ఒకసారి జువాలజీ లెక్చరరు రేణుకకి భువనేశ్వర్‌లో ఇంటర్వ్యూ వచ్చింది. నన్నూ, మరో లెక్చరరు సీతారామంనీ కూడా రమ్మంది సరదాగా తిరిగి వద్దాం అని. సరే అని ముగ్గురం వెళ్లేం భువనేశ్వర్ చూడ్డానికి. బాగా జ్ఞాపకం రావడంలేదు అలా బయల్దేరేముందు పద్ధతిగా శలవు అడిగి శాంక్షను చేయించుకోడంలాటిది చెయ్యలేదనుకుండాను. నాకేమిటో ఈ ఆఫీసు పద్ధతులు అట్టే తలకెక్కవు. నాపనులు నేను పద్ధతిగానే, అంటే నేను ఏర్పరుచుకున్న పద్దతిలో చేసుకుంటాను కానీ వేరేవాళ్లు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటూ రూళ్లు పెడితే నేనొప్పను.

విజయనగరంనించి విశాఖపట్నం యెంతదూరం కనక. బస్సులో గంట ప్రయాణం. ఆదివారాలు ఇంటికొస్తూ వుండేదాన్ని. అలాగే భువనేశ్వరంనించి తిరిగొచ్చేక, ఆదివారం ఇంటికొచ్చేను.

మాఅమ్మతో కబుర్లకి వచ్చిన ఒకావిడ, పెళ్లి కావలసిన పిల్ల. కట్నంకోసం డబ్బు దాచుకోమని చెప్పాలి కానీ అలా ఊళ్లు తిరిగి తగలేస్తుంటే ఊరుకుంటారా? అంది.

మాఅమ్మ జవాబు, వెళ్లి దేశాలు చూడు అంటూ ఇవ్వడానికి నాదగ్గర డబ్బు లేదు. దాని డబ్బుతో అది వెళ్తోంది. దానిష్టం అని. వెనక్కి తిరిగి చూస్తే నాకు మాఅమ్మ ఎంత స్వేచ్ఛనిచ్చిందో ఇప్పుడు తెలుస్తోంది. ఆరోజుల్లో అది చాలా తేలిగ్గా తీసుకున్నాను. మాఅమ్మ ఋణం తీర్చుకోలేకపోయేనే అని ఇప్పుడు బాధపడతాను.

నా డబ్బూ, మాఅమ్మా శీర్షికతో నేను మురిసిపోతూ చెప్పుకునే మరో కథ వుంది. ఇదివరకు ఎక్కడో చెప్పేను నాకు ట్రాన్సిస్టర్ పిచ్చి చాలా వుండేది. తిరపతిలో ఉద్యోగం మొదలెట్టేక ఒకటి కాదు మళ్లీ మళ్లీ కొనేస్తుండేదాన్ని ఆ ట్రాన్సిస్టర్లు (ఈనాటి టేప్ రికార్డర్లు). మాఅమ్మ ఒకసారి అంది, ఎందుకు అలా ఆ ప్లాస్టిక్ మీద తగలేస్తావు డబ్బు. బంగారం అయితే శాశ్వతం అని. మాఅమ్మ వాదన నేనేదో నగలు దిగేసుకోవాలని కాదు. నగలు స్త్రీధనం. ఆడవారికి ఆపత్సమయంలో ఆదుకునే ఆస్తి అని ఆవిడ అనేది. ఆవాదన నిరూపించడానికేనేమో అన్నట్టుగా ఒకసారి పూర్ణయాత్రాస్పెషల్ రైల్లో యాత్రలకి వెళ్లి వస్తుంటే, గోదావరి బ్రిడ్జి కూలి, రైలు గోదావరినదిలో కూలిపోయింది. మాఅదృష్టం బాగుండి, మాఅమ్మకి ప్రమాదం ఏమీ జరగలేదు. ఆసమయంలో ఆవూరి గుడిపూజారి అక్కడికి వచ్చి మాఅమ్మని చూసి, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టేరుట. మాఅమ్మ వారిఋణం ఉంచుకోరాదని చేతిబంగారపుగాజు ఒకటి తీసి హుండీలో వేసింది. ఆతరవాత, చాలాదూరపుచుట్టం అబ్బాయి ఒకతను ఆదుస్సంఘటన చూడ్డానికి వచ్చి, మాఅమ్మని చూసి ఇంటికి తీసుకెళ్లి తరవాత నెమ్మదిగా మరో రైలు ఎక్కించేడుట. ఆప్రమాదంలో కొన్నివేలమంది వున్నారు. ఆగుడిపూజారికి మాఅమ్మకే సాయం చెయ్యాలని ఎందుకు అనిపించింది? అంటే చెప్పలేం. అందుకే మాఅమ్మ దైవాన్ని నమ్మేది. నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం తరిగిపోతోంది. అది తరవాత చెప్తాను. ఇంతకీ చెప్పొచ్చేది మాఅమ్మ నగలు అవసరానికి ఆదుకునే స్త్రీధనం అని నమ్మింది. ఈకథ తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఈనాడు నేనున్న లోకంలో సర్వం ప్లాస్టిక్మయం. ఇప్పుడు మాఅమ్మ వుంటే ఇంకెంత బాధ పడేదో! అని. ఇలాటి అనుభవాలూ, ఆలోచనలే నాచేత అక్షరం పరమం పదంలాటి కథలు రాయించేది.

అక్టోబరు 1964లో తిరుపతి యూనివర్సిటీ లైబ్రరీలో అసిస్టెంటు లైబ్రేరియనుగా చేరేను. మొదటి యేడు హాస్టల్లో వున్నాను. తరవాత మాఅమ్మ వచ్చి, ఇల్లు చూసి, పనిమనిషినీ, వంటమనిషినీ, బజారుపనులకి మరో మనిషినీ, రిక్షావాడినీ మాట్లాడి, సకల ఏర్పాట్లూ చేసి పెట్టింది. నాగురించి నేను పట్టించుకోనని తరుచూ అందరితో చెప్తూండేది. ఆరోజుల్లో నాకు ఆరువందలరూపాయలు జీతం. ఆజీతంలోనే అన్ని సౌకర్యాలు అనుభవించేను. ఈనాడు అమెరికాలో నాబతుకుకీ ఆనాటిబతుకుకీ పోలికేలేదు. అంత నిష్పూచీగా జరిగిపోయేయి ఆరోజులు.

ఆరోజుల్లో లైబ్రరీలో మాసెక్షనులోనే పనిచేసే ప్రభావతీ నేనూ అచిరకాలంలోనే బాగా స్నేహితులం అయిపోయాం. ఇద్దరం సినిమాలు తెగ చూసేవాళ్లం. మాయింటివేపు థియేటరయితే మాఇంట్లో, వాళ్లింటివేపు థియేటరు అయితే వాళ్లింట్లో పడుకునేవాళ్లం.

అలా ఒకరోజు మేం వాళ్లింటివేపు సినిమాకి వెళ్లి, వాళ్లింట్లో పడుకున్నాం. మర్నాడు ఉదయం ఇంటికొచ్చి, తలుపు తీసి చూస్తే ఇంట్లో దొంగతనం జరిగినట్టు అర్థం అయింది. అయిదువందలరూపాయలు ముందురోజు బాంకునించి తెచ్చుకున్నాను. ఆరోజుల్లోనే చేతివాచికీ బంగారుగొలుసు చేయించుకున్నాను. అవీ, మరో గొలుసూ పోయేయి. పోలీసు రిపోర్టు ఇచ్చేను. సంగతి తెలిసి మాఅమ్మ విశాఖపట్నంనించి వచ్చింది. దేవుడే నీకు వాళ్లింట్లో పడుకోవాలన్న బుద్ధి పుట్టించాడు. నువ్వు ఇంట్లోనే వుంటే ఏం ప్రమాదం జరిగి వుండునో అంది కన్నీళ్లతో.

ఆమాట మాఅమ్మ చెప్పేవరకూ నాకు తోచలేదు. అంటే నాకు నమ్మకం వుందా, లేదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. ఒకే సంఘటనకి ఒకొక్కరు ఒకొక్కవిధంగా అన్వయం చెప్పుకుంటారు అని అర్థం అయింది అప్పుడు. అయ్యో నావస్తువులు పోయేయి అని విచారించవచ్చు. హమ్మయ్య, నాకు హాని జరగలేదు అని సంతోషించవచ్చు. ఇలాటి వూహలు కథలు రాస్తున్నపుడు బాగా ఉపయోగపడతాయి.

తిరుపతిలో వున్నప్పుడే పులికంటి కృష్టారెడ్డితోనూ, ఆయనద్వారా మధురాంతకం రాజారాంగారితోనూ పరిచయం అయింది. వారిని అప్పుడప్పుడు కలుసుకుంటూ వుండేదాన్ని. ఆరోజుల్లోనే కృష్ణారెడ్డి స్వంత ప్రింటింగ్ ప్రెస్ పెట్టి, కామధేను అని ఒక ద్వైవార పత్రిక నడుపుతూండేవాడు.

మీరు కొన్ని మంచికథలు ఎంపిక చెయ్యండి. ఒక సంకలనంగా వేధ్దాం అన్నాడు. సరేనని నేను ఓ పదికథలు ఎంపిక చేసి, రచయితల అనుమతులు తీసుకున్నాను. పురాణం సుబ్రహ్మణ్యశర్మగారిని ముందుమాట రాయమని అడిగితే, ఆయన వెంటనే రాసి ఇచ్చేరు కూడాను. కానీ కృష్ణారెడ్డి పుస్తకం వెయ్యనేలేదు. రెండు దశాబ్దాలు అయిన తరవాత కూడా ఆసంకలనం గురించి నన్ను అడిగిన రచయితలు వున్నారు. ఇలాటివి జరిగినప్పుడు నన్ను బాధించేవిషయం నానిర్లక్ష్యంవల్ల కాక, మరొకరి నిర్లక్ష్యంవల్ల మాట నిలబెట్టుకోలేదన్న మాట నాకు వచ్చింది కదా అని. సుబ్రహ్మణ్యశర్మగారు మంచి ముందుమాట రాశారు. నేను తూలిక.నెట్ మొదలుపెట్టినతరవాత, ఆయన ముందుమాట అనువదించి తూలికలో ప్రచురించాను.

మరో విషయం,  ఆరోజుల్లో నాకు భాష అంటే వుండే పిచ్చి. ఆ సంకలనానికి ఎక్కడో విన్న వ్యాసఘట్టాలు అన్న పేరు పెట్టేను, నా పాండిత్యప్రకర్ష ప్రకటించుకోడానికే అనుకుంటాను. నిజంగా ఆమాటకి నాకు అర్థం తెలిసే పెట్టానా అంటే అనుమానమే. శర్మగారు తన ముందుమాటలో వివరణ ఇచ్చేరు. అది తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది.

ఆరోజుల్లోనే ఆచంట జానకిరాంగారితో పరిచయమయింది. ఆయన మాఇంటికి వస్తూ వుండేవారు. ఒకసారి నాకథ మంచుదెబ్బ, రచన పత్రికలోంచి తీసిన టేర్‌షీట్స్ ఆయనకి చూపించాను. ఆయన ఇంటికి తీసుకెళ్లి, ఆరెంజికలరు అట్టతో చక్కగా బైండు చేసి తీసుకొచ్చేరు. దాంతోపాటు రెండు దోసిళ్లనిండా ఓపెధ్దకాయితప్పొట్లాంలో ఎర్రగులాబీలూ తీసుకొచ్చేరు. ఆతరవాత ఒకసారి నేను వాళ్లింటికెళ్లేను, శారదాదేవిగారు అట్టే మాటాడలేదు. ఆవిడ అలా ముభావంగా వుండడం చూసి, నాకు ప్రాణం చివుక్కుమంది. మళ్లీ ఎప్పుడూ వెళ్లలేదు. ఆవిడ మంచి పొడగరి. చక్కని ఛాయ. తనకథల్లో పాత్రల్లాగే గుంభనగా, గంభీరంగా వుండే వ్యక్తి.

మద్రాసులో రామలక్ష్మి, ఆరుద్రగారి ఇంటికి కూడా రెండుసార్లు వెళ్లేను. ఎందుకు వెళ్లేనో జ్ఞాపకం లేదు కానీ ఇద్దరూ ఎంతో మర్యాదగా నాతో మాట్లాడడం నామనసులో అలాగే వుంది. రామలక్ష్మిగారు చలాకీగా మాట్లాడితే, ఆరుద్రగారు నెమ్మదిగా మాట్లాడతారు.

1968లో రామలక్ష్మిగారు ఆంధ్రరచయిత్రుల సమాచారసూచిక సంకలనం ప్రచురించారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ కోరినందున. ఆసంకలనంలో నాగురించిన వివరాలలో చిన్నకథలు రాయడంలో అందెవేసిన చెయ్యి అని ఓ వాక్యం జోడించారు. దానిమీద. నా స్నేహితురాలూ, రచయిత్రీ, అయిన మీరా సుబ్రహ్మణ్యం (అప్పట్లో కె. మీరాబాయి) నన్ను దెప్పుతుండేది, రామలక్ష్మిగారికి నువ్వంటే ఇష్టం అని. ఎందుకంటే 68మంది రచయిత్రులున్న ఆసంకలనంలో రామలక్ష్మిగారు రచనలమీద వ్యక్తిగతమయిన అభిప్రాయం వెలిబుచ్చింది ఒక్క నాకథలమీదే!

ఆరోజుల్లోనే ఆంధ్రరచయిత్రుల సభల్లో 1968, 1969లో సత్కారం పొందేను. కనుపర్తి వరలక్ష్మమ్మగారూ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారూ, ఎల్లాప్రగడ సీతాకుమారిగారూ, నాయని కృష్ణకుమారిగారూఅటువంటి విద్వన్మణులూ, సరస్వతీస్వరూపులూ అయినవారిసరసన నిలిచినక్షణాలు తలుచుకుంటే ఆమాలతినేనా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇంచుమించు అదే సమయంలో రెండు కథలు బహుమతులకి నోచుకున్నాయి. (ఈనాటికీ బహుమతులు పొందినకథలు నాకు ఆరెండే. ఆరోజుల్లోనే ఆంధ్రజ్యోతివారు సమీక్షలకి నాకు పుస్తకాలు పంపుతుండేవారు.

ఇవన్నీ తలుచుకుంటుంటే, నాసాహిత్యచరిత్రకి మంచికాలం సిద్ధించింది నేను తిరపతిలో వున్నరోజుల్లోనే, అంటే 1964 నించి 1973 వరకూ అనుకుంటాను.

తిరపతిలో వున్న తొమ్మిదేళ్లూ నాకు గొప్ప తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చేయి. లైబ్రరీలోనే కాక వూళ్లో కూడా నేను ఎక్కడికి వెళ్లినా ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా పలకరించేవారు. ఆమెరికా వచ్చేక ఆనాడు నేను పొందిన గౌరవంవిలువ మరింతగా ఘనంగా కనిపిస్తోంది. మళ్లీ అలాటి తృప్తీ, ఆనందం నాకు కలిగిందీ, కలుగుతున్నదీ బ్లాగులోకంలో తెలుగు తూలిక ప్రారంభించిననతరవాతనే.

అమెరికా వచ్చినతరవాత నేను గ్రహించిన విశేషాలూ, తెలుగుతూలికద్వారా పొందిన అనుభవాలూ, పెంపొందిన ఆత్మీయతలూ ఈవిషయాలమీద స్వాతికుమారి చాలా ప్రశ్నలే వేస్తున్నారు. అవన్నీ బాగా ఆలోచించి మళ్లీ రాస్తాను.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

11 Responses to కథా మాలతీయం – 4

  1. Vaidehi Sasidhar says:

    ఎదురుగా కూర్చుని కధ చెప్తున్నట్లు ఆసక్తికరంగా వ్రాస్తున్నారు.
    బావుంది.

  2. Sowmya says:

    మీరు లివింగ్ ఆదిత్య 369. అదే..టైం మెషీన్ అనమాట 😉

  3. వైదేహీ, నీకు బాగుందంటే నాకు సంతోషం.
    సౌమ్యా, ఆదిత్య 369 అంచే ఏమిటో కాస్త చెబుదూ. టైం మెషీన్ ..నాతరంవాళ్లతో మాటాడితే ఇలాగే వుంటుంది మరి.

  4. parimalam says:

    ఆదిత్య 369 అనే సినిమాలో టైం మెషీన్ ద్వారా ఏకాలం లోకైనా వేగంగా చేరుకోవచ్చు .మీ జ్ఞాపక శక్తిని అలా పోల్చారనుకుంటా సౌమ్య గారు … అంతేనాండీ ?

  5. Sowmya says:

    @parimalam: అంతే, అంతే.

  6. ఓ అలాగా. ఇక్కడ Back to future అని ఓ సినిమా వచ్చింది. అదే కాబోలు.

  7. మాలతిగారూ, అదే.. ఆ సినిమానే! 🙂

    మీ కధల్లానే మీ జీవితానికి సంబంధించిన సంగతులు కూడా మలయమారుతంలా సున్నితంగా స్పృశిస్తున్నాయి..
    చిన్నప్పుడు అమ్మ ‘అనగనగా..’ అని మొదలుపెట్టగానే పరిశరాలన్నీ మర్చిపోయి, ఆమెవంకే కళ్ళు విప్పార్చుకుని చూస్తూ, కధ వినే రోజులు గుర్తుకొస్తున్నాయి!!

  8. మాలతి says:

    నిషిగంధ, మీరు మరీను. ఎంతయినా కవయిత్రికదా, మీ వాక్యాలు చూస్తుంటే, మీయింటికొచ్చేసి కబుర్లు చెప్పాలని వుంది 🙂

  9. మాలతి says:

    పొరపాటున వేరే చోట పెట్టేను. క్షమించాలి. ఇది ఇక్కడ పెట్టడం సమంజసం అనుకుంటాను.
    పొద్దు సంపాదకులకు,
    నా ఇంటర్వూ విషయంలో రెండు మాటలుః
    “పాఠకులకి నా భావన ఒకేసారి తెలియకపోతే ఎట్టా” – ఈరోజు పొద్దున్నే నామినివారు పతంజలిగారిగురించి రాసినవ్యాసంమీద వచ్చినచర్చలో నామిని ఇలా అన్నారని చదివిన తరవాత నాకు ధైర్యం వచ్చింది మీకు రాయడానికి. (http://chaduvu.wordpress.com/2009/04/22/naamini-on-patanjali/).
    ఇంటర్వూద్వారా రచయత తనని తాను పరిచయం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కనక పాఠకులకి పూర్తిపాఠం ఒకేసారి అందితేనే సమగ్రమయిన అవగాహనకి అవకాశం. కనీసం ఒక క్రమపద్ధతిలో (వారానికోసారి) అందించినా పాఠకులు తదనుగుణంగా ఆలోచించుకోడానికి సిద్ధమవుతారు (అదేలెండి ఆసక్తి వున్నవారు).
    నేను మీకు 25 పేజీలు ఇచ్చేను. ఇప్పటికి సగం ప్రచురించి, మిగతాభాగం వదిలేశారు రెండువారాలయి. ఈసందర్భంలో నాకు కలిగిన ఆలోచనలు – అందులో కొన్ని భాగాలు మీకు అభ్యంతరకరమయి, ప్రచురించడం మానుకుని వుండాలి. లేదా, పాఠకులనుండి, ఆదరణ అనుకున్నంతగా లేదని, పక్కన పెట్టేసి వుండాలి.
    ఏకారణమయినా, మీరు ప్రచురించకపోతే నాకు అభ్యంతరం లేదు. మీ నిర్ణయమేమిటో నాకు స్పష్టంగా తెలిస్తే, నేను మొత్తం ఇంటర్వూ నా తెలుగుతూలికలో ప్రచురించుకోడానికి వీలుంటుంది.
    నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వాతిగారికీ, పొద్దు వారికీ సదా కృతజ్ఞురాలిని.

    నిడదవోలు మాలతి

  10. seela subhadra devi says:

    maalathi gaaru
    1968-69 lo ap saahitya ekaadami tarupuna raamalakshmigaaru aandhra rachayitrula soochika vesaarani telipaaru,adi ekkadainaa dorikE avakaasam undaa?
    nEnu vijajanagaram M.R.mahilaa kaalEj lOnE 69-72 lO chadivaanu.meeru konta kaalam akkada pani chesaarani cheptE aanandam kaligindi

  11. malathi says:

    సుభద్రాదేవిగారూ, ఆలస్యానికి క్షమించాలి. ఇండియానించి నిన్ననే వచ్చేను. రచయిత్రులసమాచారసూచిక ఎ.పి. సాహిత్య ఎకాడమీ ప్రచురణ. వుంటే వాళ్లదగ్గరే వుండాలి. అందులో మీపేరు కూడా వుంది. మీకు వాళ్లు కాపీ పంపలేదా? నావి – ఏనుగులూ, గుర్రాలూ – ఎన్నో కాలగతిలో కొట్టుకుపోయేయి కానీ ఈపుస్తకం మాత్రం జాగ్రత్తగా వుంది!

Comments are closed.