2009 ఆగస్టు గడి పరిష్కారాలు – ఫలితాలు

-కొవ్వలి సత్యసాయి

అగస్టు 09 గడి … వివరణలు

ఈసారి గడిని 11 మంది నింపి పంపారు. వారు జ్యోతి, అలకనంద, హిమజా వేమూరి, కంది శంకరయ్య, కోడీహళ్ళి మురళీమోహన్, శ్రీలు, భమిడిపాటి సూర్యలక్ష్మి, మైత్రి, కల్పన, వల్లూరు శ్రీరామ ప్రసాదు మరియు పట్రాయని సుధారాణి గార్లు. వారందరికీ అభినందనలు. వీరిలో కంది శంకరయ్యగారు మరియు శ్రీలు అన్నీ సరిగ్గా వ్రాసారు. వీరికి వీరతాళ్ళు. చాలా పూరణలలో (శంకరయ్యగారితో సహా) కుర్మా, కుర అని నింపారు. కొద్దిగా దీర్ఘమిస్తే కూర రుచిగా ఉండుండేది. ఇది తప్పుగా పరిగణించలేదు. కందుకం (బంతి), మోద (తమలపాకుల కట్ట) దాదాపు అందరూ (శంకరయ్యగారు తప్పించి) తప్పుగా పూరించారు. రోమనులిపిలో వ్రాయదల్చుకున్న వాళ్ళు దీర్ఘాలూ, హ్రస్వాల విషయంలో జాగ్రత్తపడితే బాగుంటుంది.

1 ర 2 డా 3 పే టిస్ .. 4 ధ ర్మ 5 వ్యా ధు 6 డు
.. 7 బు ట్ట .. 8 కూ ర్మా ఘ్రం ము ..
ణా .. లు .. 9 ని ర్ధ 10 కం 11 బా వు లు
12 రె ట్ట .. 13 డ ప్పు .. 14 కా దు 15 లా లు ..
డ్డి .. 16 ల బ్బు .. 17 త కం .. .. .. 18 మి
.. 19 ఆ .. 20 ద మో .. 21 అ లి 22 పి రి
23 నీ లి బ్బు .. 24 రి క్షా వా లా 25 ల యా
.. .. 26 వా లు .. .. 27 కా లు
28 కం చం .. 29 నా రి .. .. 30 బు లా కి .. కా
ఠం .. 31 రు .. 32 జా వు లే .. 33 ఖీ రా
.. 34 అ క్కు 35 ప క్షి .. 36 నా 37 మా 38 లు .. లు
39 వ క్క .. క్కు .. 40 మం చం 41 డా మి నో ..

అడ్డం ఆధారాల వివరణ

1 ర గ డా పే టిస్ రగడా అంటే కొట్లాటా, పేటిస్ అంటే పెట్టెలు. ర గ డా పే టిస్ ఒక చాట్ ఐటెం
4 ధ ర్మ వ్యా ధు డు ధ ర్మ వ్యా ధు డు మాంసం కొట్టు నడిపే ఆయన. కౌశికుడికి ధర్మాలు చెప్పాడు.
7 బు ట్ట దీంట్లో 39 నిలువులో ఉన్న వాటిని (చేపలు) వేయచ్చు, అబ్బాయిల్నీ బుట్టలో పడేయొచ్చు, మత్స్యగంధీ అని చేపలని సూచించడం కోసం వాడాం
8 కూ ర్మా పూరీలో నంజుకు తినేది. నిలువులో ఉన్నది కూర. అన్నంలో కలుపుకు తినేది..
9 ని ర ర్ధ కం 11 అడ్డంలోవి బావులు. ఎండిపోతే అవి ని ర ర్ధ కమే కదా,
11 బా వు లు 26 అడ్డాలు అంటే వానలు లేక పోతే ఇవి ఎండతాయి కదా
12 రె ట్ట ఇది మీద పడడం వల్లేకదా కౌశికుడు దాన్ని శపిస్తాడు. తర్వాత పతివ్రత సలహా మీద ధర్మవ్యాధుడు (4 అడ్డం ఆయన) దగ్గరకెళ్ళి ధర్మసూక్ష్మాలు వింటాడు.
13 డ ప్పు స్వంత డబ్బా కొట్టుకోవడాన్ని డప్పుకొట్టుకోవడం అంటారు.
14 కా దు ఆడవాళ్ళు అవునంటే కాదు అనే కదా
15 లా లు ఇంతకు ముందు ఐదేళ్ళు రైల్వే మినిస్టరీయన. మమతా బెనర్జీ ఈయన తర్వాత రైల్వే మినిస్టర్
16 ల బ్బు డబ్ లేదుకాబట్టి సగం కొట్టుకుంటున్న గుండె అన్నాం
17 త మ కం ప్రేమలో కలిగేది తమకమే కదా
19 ఆ మ డ హనుమంతుడు నూరు ఆమడల దూరం దూకాడు కదా అందులో 1 శాతం ఒక ఆమడ
20 ద మో తమలపాకుల కట్టని మోద అంటాం. తిరగబడింద. సరిగా పెట్టి దాని మీద మోపెట్టండి అన్న వాక్యంలో అదే సూచించాం. .
21 అ లి పి రి అంటే తేలిక మనిషి అని అర్ధం. తిరుమల కొండ నడిచెక్కాలంటే నడక అ లి పి రి నుండే మొదలెట్టాలిగా.
23 నీ లి మ బ్బు మొయిలు అంటే మబ్బు అనికదా. వానకారు మబ్బులు నల్ల (నీలి) గా ఉంటాయి.
24 రి క్షా వా లా ఈయన ముందు బలాదూరేట …అది ఒకప్పుడు. ఈమధ్యలో హైదరాబాదులో కనిపిస్తేకదా .. ఆయనే బలాదూరయి పోయాడు. రింజిం రింజిం హైదరబాద్ రిక్షావాలా జిందాబాద్. మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటరుకారు బలాదూర్ అన్ని పాట గుర్తొస్తే ఈఆధారం వీజీ.
25 ల యా సంగీతానికి శ్రుతి తల్లి లయ తండ్రి కదా.
26 వా న లు బుల్లి పాపాయిలు బయటకెళ్ళి ఆడుకోకుండా చేసేవివే. రెయిన్ రెయిన్ గో అవే రైమ్ గుర్తుకు తెచ్చుకోండి
27 కా లు కాలు భాగం అంటే పావు (పాతిక) భాగం. కాలు లేక పోతే కుంటుకుంటూ వెళ్ళక తప్పుతుందా
28 కం చం ఒకే కంచం ఒకే మంచంలా ఉంటేనే కదా గాఢ స్నేహితులంటారు కదా. అలా కాకపోతే స్నేహితుల దినం చేసుకోవడానికి అనర్హులే
29 నా రి రాముడైనా, అర్జునుడైనా బాణం వేయాలంటే శత్రువులని చంపాలంటే వింటి నారి (ఆడది) ఆధారం
30 బు లా కి ఇది ముక్కుకి పెట్టే ఆభరణం. ఎటొచ్చీ దీనికిలా బుకింగు వెనుక తేదీపై చేసుకోవాలట. (లావక్షరాలు గమనించండి)
32 జా ణ వు లే తెలివైన ఆడదంటే ఉదయభానులే( జా ణ వు లే నెర జా ణ వు లే ఏంకర్)
33 ఖీ రా స్వయంగా పండగ సుందరి వెనకబడి (తిరగేసి రాయమని సూచన) వరమిస్తే మగవాళ్ళు చేయిచ్చి కట్టించుకుంటారా – రాఖీ సావంత్ స్వయంవరం స్ఫూర్తితో ఇచ్చిన ఆధారం
34 అ క్కు ప క్షి పిట్టంటే పిట్ట కాదు. తెలివి తక్కువ బక్కప్రాణి. వేరే వివరణ అవసరం లేదనుకుంటా.
36 నా మా లు పంగతో పెట్టగలిగేవివే …. పంగనామాలు అంటే తెలుసనుకుంటా
39 వ క్క ఆకుకి చక్కని జోడీ వక్క కాక ఇంకేముంటుంది
40 మం చం నవ్వారు లేకపోయినా పర్వాలేదు. చెక్కేసుకు పడుకోవచ్చు ..ఇప్పుడన్నీ చెక్కమంచాలే కదా
41 డా మి నో.. ఈజిట్ 3 డాట్ పిజ్జా షాప్ … మూడు చుక్కలున్న లోగో ఉన్న కంపనీ అని సూచన

నిలువు ఆధారాల వివరణ

1 ర మ ణా రె డ్డి రేలంగి మామగారు .. చాలా సినిమాల్లో రమణారెడ్డే. ఆయన మంచి మెజీషియన్
2 డా బు లు బాబులు చెప్పుకునే గొప్పలు .. గొప్పలంటే డాబులు
3 పే ట్ట ఆడకోడి ముఖమేంటి ఇలా పేద్దగా ఉంది? .. పే దీర్ఘంగా ఉండాలన్న సూచన ఆధారంలో ఉంది
4 ధ ర్మా ర్ధ కా మ మో క్షా లు చతుర్విధ ఫలాలు .. ఇవి అందరికీ తెలిసినవే
5 వ్యా ఘ్రం దీన్ని చంపితేకానీ శివుడు బట్ట కట్టలేడు .. పులి చర్మం ధరిస్తాడు కదా .. పులిని చంపితే కానీ చర్మం రాదుకదా
6 డు ము వు లు డుమువులు ప్రథమా విభక్తి కదా
8 కూ ర కూర్మా, కూర ఒక్కలాంటివే కదా
9 ని ప్పు నిప్పుకి చెదబట్టునా అనికదా నానుడి
10 కం దు కం అంటే బంతి కదా
11 బాలా పెళ్ళికళవచ్చేసిందే… బాలా అనికదా పాట
13 డ బ్బు డ బ్బు లుబ్ధావధాని గుండె ఇలాగే కొట్టుకుంటుందేమో .. పిసినారికి అంతేకదా
16 ల మ మ ల బాగా ఆకలైతే మనమన మాడాం అంటాం కదా- తిన్నగా నిలబడలేవా అంటే అక్షరాలు అటూఇటూఅయ్యాయని
17 త ద రి న రాగాలాపనలో వచ్చే అక్షరాలు ఇవేకదా
18 మి రి యా లు కా రా లు బాగా కోపం ప్రదర్శిస్తే కారాలూ మిరియాలూ నూరాడంటాం కదా …ముందర నూరినా పర్వాలేదు అంటే పదాలు అటూ ఇటా అయ్యాయని.
19 ఆ లి అంటే పెళ్ళాం అనికదా. అది ఓ కమెడియన్ పేరు కూడా పెళ్ళాం
21 అ లా అ లా ఆకాశంలో హంసలమై అన్న పాట దీనికాధారం.. .. కులాసాల తేలిపోవాలంటే హంసలో పక్షులో అవ్వాలా (4)
22 పి లకా గణపతి శాస్త్రి గారి ఇంటిపేరు కాదా. పేరుకు ముందే పెట్టుకునేదింటి పేరే కదా.
23 నీ ల కం ఠం విషం సోకిన గళం నీలకంఠం అనేకదా
26 వా రి జా క్షి వారిజాక్షలంది వైవాహికములందు … అనృతమాడవచ్చు అని కదా శాస్త్రం.
30 బు లే నా బుర్ర లేని నాయకులని పొట్టిగా మార్చేస్తే బలే ఉంటుంది కదా- బుధ్ధిలేని వాళ్ళని కూడా ఇలాగే పొట్టిగా రాయచ్చు కదా.
31 రుక్కు చిన్నభార్యని ముద్దుగా సత్యా అని పిలిచినట్లు రుక్మిణిని రుక్కు అని పిలవగలడు కదా
34 అ క్క వరంగల్ లో అక్కా అని పిలవకూడదుట అవ్వ అని పిలవాలని చెప్తారు
35 ప క్కు ముక్కులో ద్రవంగా కాక ఘనంగా ఊడేదిదే కదా
37 మాడా మాడా వేంకటేశ్వర్రావు కొజ్జా వేషాలు వేసి వేసి ఒక ఐకన్ అయిపోయాడు కదా
38 లు మి మీలు తలకిందులుగా రాయాలి.. కుఱచ అన్నాం కాబట్టి మిలు.

Posted in గడి | Tagged | 4 Comments

2009 సెప్టెంబరు గడిపై మీమాట

2009 సెప్టెంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

Posted in గడి | Tagged | 4 Comments

రెండు అరిచేతుల పుప్పొడి రాగం

-పసునూరు శ్రీధర్ బాబు

దేహంలో ధూపంలా వంకీలు తిరిగే పంచప్రాణాలు
ఆ అరిచేతుల్లో ఏకమై మంచు ఖండాలుగా మారి నను నిమిరినప్పుడు
నేను ఘనీభవించిన అగ్నికీలల పర్వతాన్నయ్యాను-

ఆ రెండు అరిచేతుల్లో పూసిన పుప్పొడిలో
కన్నీటి బిందువునై రాలి
నలుదిక్కులకూ ఎగిరిపోయాను-

ఆ రెండు అరిచేతులూ ఓ సాయం సంధ్య వేళ
నన్ను పావురంలా పొదివి పట్టుకుని అలా గాల్లోకి వదిలినప్పుడు
నేను అస్తమిస్తున్న సూర్యుడిని ముక్కుతో కరచి పట్టుకుని
కాలాన్ని కదలకుండా చేశాను-

కళ్ళల్లో మెత్తగా తడిసే మౌనలిపి
గట్టుతెగి ప్రవహించేది అరిచేతుల్లోంచే
ప్రేమతో నిండుగా నిశ్చలంగా ఉన్న దేహాన్ని తాకి
వలయాలు వలయాలుగా తల్లడిల్లే తటాకంగా మార్చేవి చేతులే-

చేతులే….
దేహం మీద మొదటి ప్రేమ గుర్తును ప్రతిష్ఠిస్తాయి
చేతులే రెండు దేహద్వీపాల మధ్య
తొలి వారథిగా విస్తరించి
సముద్రాల్ని గల్లంతు చేస్తాయి-

ఆ అరిచేతుల స్పర్శతో
దేహం రెండు ఆత్మల విశ్వాసంతో
అక్షరాలకు చిక్కని కవిత్వ వాక్యాల వెంట పరుగులు తీస్తుంది-

పొద్దుటి మేఘంలా ఆ అరిచేయి
నా ఎదను అదిమినప్పుడు
నేనొక ఉద్యానమై ఆ జలరాశిని ఆవాహనం చేసుకున్నాను…
ఆ కొత్త భారం నన్నెంతో తేలిక చేసింది-

ముత్యపు చిప్పలా విచ్చుకునే అరిచేతుల్లో
మిణుకు మిణుకుమనే వెన్నెల పూల ఆకాశం-
తాత్విక గ్రంథంలా తెరుచుకునే అరిచేతుల్లో
నాకు తెలియని నా ప్రపంచం-
నన్ను నాకు అందంగా చూపించే ఆ అపురూప హస్తాల్లో
నా ముఖం దాచుకుని ఎప్పుడూ ఓ కొత్త ముఖంతో గుబాళిస్తుంటాను-

ఆ అరిచేతులు నన్ను పిల్లాడ్ని చేసి ఆడిస్తుంటే
నేనీ భూమ్మీదకు ప్రేమ కోసం వచ్చిన అతిథినని గర్వపడుతుంటాను-
ఆ అరిచేతుల్లో నేను కర్పూరమై జ్వలించి
ప్రేమ ధూపమై అంతటా వ్యాపిస్తాను-
ఆ అరిచేతుల్లో నా అరిచేతులుంచి
ఇసుక తీరాల్లో కావ్యాలు గిలుకుతూ పోతుంటాను-

నా కన్నీళ్ళను తుడిచే అరిచేతులు
నా కలలను బతికించే అరిచేతులు
నా కవిత్వానికి అక్షరాలందించే అరిచేతులు
ముఖానికి ముద్దుగా సంగీతాన్ని అద్దే అరిచేతులు
పెదాల మీద జలపాతాల్ని మీటే అరిచేతులు-

ప్రేమతో ఉనికిని ప్రక్షాళన చేసే
ఆ అరిచేతుల భాషా రహస్యాన్ని విప్పడం కోసమే
నేను కవిత్వాన్ని ఆశ్రయిస్తున్నాను-
భూగోళాన్ని ప్రేమగా పొదివి పట్టుకునే అరిచేతుల్లాంటి కవిత్వం కోసమే
నేను పరితపిస్తున్నాను-

——————

పసునూరు శ్రీధర్ బాబు

నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన పసునూరు శ్రీధర్ బాబు హైదరాబాదులో డిగ్రీ, ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బి.ఎల్ పూర్తి చేశారు. హైకోర్టులో అడ్వకేట్ గా నమోదు చేయించుకుని… అది తన ప్రపంచం కాదని పాత్రికేయునిగా మారారు. పదిహేనేళ్ళు ఇండియా టుడే పత్రిక (మద్రాసు)లో పని చేసి 2008 లో మళ్ళీ హైదరాబాదుకు వచ్చి, హెచ్.ఎం.టి.వి లో చేరారు. శ్రీశ్రీ, తిలక్, కొడవటిగంటి, గురజాడ, జాషువా, ఇస్మాయిల్, చలం, చండీదాస్ తదితరుల రచనలను ఇష్టపడుతూ ఎదిగారు. 1999లో ఆధునిక కవితా మహావృక్షం ఇస్మాయిల్ ముందుమాటతో “అనేకవచనం” కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఆ తరువాత రాసిన కవితలనతో మరో సంకలనాన్ని ప్రచురించే ప్రయత్నంలో ఉన్నారు.

శ్రీధర్ బాబు అనేకవచనం బ్లాగు రాస్తున్నారు.

Posted in కవిత్వం | 9 Comments

మృతజీవులు – 27

-కొడవటిగంటి కుటుంబరావు

ఏడవ ప్రకరణం

ప్రయాసపడి దీర్ఘ ప్రయాణం చేసి; దారిలో చలీ, వానా, బురదా, మజిలీల్లో అధికార్లను నిద్రలేవగొట్టటమూ, మువ్వల మోతలూ, మరమ్మత్తులూ, తగాదాలూ, బళ్లు తోలేవాళ్లూ, కమ్మరులూ, ఇతర మోసగాళ్లూ వీటితో వేగిన ప్రయాణీకుడు చిట్టచివరకు స్వగృహాన్ని చేరవచ్చేటప్పుడు ఎంతైనా ఆనందం పొందుతాడు. అతని మనోనేత్రం ముందు ఇంటి లోపలిభాగాలూ, సంతోషంగా అరుస్తూ తన నౌకర్లు ఎదురు రావటమూ, పిల్లల కేకలూ, పరుగులూ, వారిని ముద్దాడి తియ్యని మాటలు వినటమూ కనిపించి, శ్రమయావత్తూ తుడిచిపెట్టుకు పోతూంది. ఒక ఇల్లూ, పిల్లా జెల్లా గలవాడు ధన్యుడు, బ్రహ్మచారివాడు దౌర్భాగ్యుడు!

అలాగే, విసుగెత్తించే పాత్రలనూ, జుగుప్స కలిగించే పాత్రలనూ వదిలేసి, ఉన్నతాదర్శాలను అంటిపెట్టుకునే పాత్రలను, నిత్య జీవితంలో కనిపించే అసంఖ్యాకులలో అతి అరుదుగా ఉండే బహుకొద్ది మందిని చిత్రిస్తూ, తక్కువైన విషయాలను ఎన్నడూ ప్రస్తావించక, హీనమానవకోటికి ఎంతో ఎత్తున ఉండి, నేలకు దిగిరాకుండా ఉండే రచయిత ధన్యుడు. వాడు ప్రజలకళ్లు సరిగా కనపడకుండా ధూపం వేసేస్తాడు, జీవితంలోని చెడును కప్పిపుచ్చి ప్రజలను అద్భుతంగా జోకొట్టి, ఆదర్శమానవులను ప్రదర్శిస్తాడు. అందరూ హర్షధ్వానాలు చేస్తూ, అతని వెంటబడి, అతని విజయరథం వెనక పరిగెడతారు. అతన్ని మేటి జగత్కవి అంటారు; మిగిలిన పక్షులకంటె ఎత్తుగా ఎగిరే గద్దలాగా ఇతర కవులకు అతీతంగా సంచారం చేసాడంటారు. అతని పేరు వినగానే లేత హృదయాలు అభిమానంతో స్పందిస్తాయి, కళ్ళు చెమ్మగిల్లుతాయి… అతనికి సాటిలేరు -అతను దేవత! కాని, ప్రజల ఎదుట ఎల్లప్పుడూ ఉంటూ, వారి అనాసక్తి కారణంగా ఎన్నడూ వారి కంటబడని విషయాలను – జీవితపు రొచ్చు నిండా ఉన్న భయంకరమైన అల్పవిషయాలూ, దుర్గమమైన మన మార్గంలో తగిలే సాధారణ వ్యక్తులలో దాగి ఉండే విషయాలూ – సాహసించి పైకి తీసుకువచ్చి, పట్టుదలతో మంచి చిత్రించి స్పష్టంగా అందరికీ కనపడేలాగా చేసే రచయిత యొక్క గతి మరొకలాగుంటుంది. అలాటివాడు ప్రజాభినందనకు నోచుకోడు. అతని మాటలకు హృదయాలు స్పందించవు, కళ్ళు చెమ్మగిల్లవు; అతన్ని ఒక గొప్ప వ్యక్తిగా భావించి ఆవేశంతో ఏ పదహారేళ్ళపిల్లా పరిగెత్తుకుంటూరాదు. తానే ప్రేరేపించిన ప్రియవచనాలను సంతోషంగా ఆలకించే భాగ్యం అతడికి ఉండదు. ఆఖరుకు వాడు సమకాలిక విమర్శకుణ్ణి కూడా తప్పించుకోలేడు. కపటమూ, నిర్దాక్షిణ్యమూ గల ఈ విమర్శకుడు అతడి రచనలు హీనమైనవనీ, అల్పమైనవనీ, ఈ రచయిత అధమకవులలో ప్రథముడనీ అంటాడు, అతడి కధానాయకుడి లక్షణాలన్నీ అతడికి అంటగడతాడు, అతడికి హృదయంగాని, ఆత్మగాని, రచనాశక్తిగాని కొంచెం కూడా లేవంటాడు.

ప్లీడరు గుమాస్తాల ఫీజులతో నిమిత్తం లేకుండా క్రయదస్తావేజు తానే రాసి, దాన్ని కాపీ చెయ్యటానికి అతను నిశ్చయించాడు. అతనికి ఆ మతలబులన్నీ తెలుసు, పైన పెద్ద అక్షరాలతో తేదీ వేసి, దానికింద చిన్న అక్షరాలతో ఫలానా భూస్వామి అని రాసి, మిగిలినదంతా రాయవలసిన తీరుగా రాసుకుపోయాడు.

మనం సూర్యుణ్ణి పరిశీలించటానికి ఉపయోగించే టెలిస్కోపూ, సూక్ష్మకణాలను పరిశీలించటానికి ఉపయోగించే మైక్రో స్కోపూ కూడా అద్భుతమైన పరికరాలన్నది ఈ సమకాలిక విమర్శకుడికి తెలీదు. హేయమైన జీవితాంశాలు సమంగానే తీసుకుని దానితో కావ్యరత్నాన్ని సృష్టించటానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి అవసరమని ఈ సమకాలిక విమర్శకుడెరుగడు. ఉత్తమ తరగతి హాస్యం శృంగార రసానికి ఏ మాత్రమూ తీసిపోదనీ, సంతలో హాస్యగాళ్ళు చూపించే వినోదానికీ, దీనికీ హస్తిమశకాంతరం ఉన్నదనీ సమకాలిక విమర్శకుడు ఒప్పుకోడు. ఈనాటి విమర్శకులిదంతా పట్టించుకోక అజ్ఞాత రచయితను ఖండించి అవమానిస్తారు. ఆ రచయిత సానుభూతీ, సహృదయతా, దాక్షిణ్యమూ సంపాదించలేక, రోడ్డుపక్క దిగబడిపోయిన బ్రహ్మచారి బాటసారిలాగా అయిపోతాడు. వాడు తన దురదృష్టానికీ, ఒంటరితనానికీ విచారిస్తాడు.

నా గ్రహచారంకొద్దీ నేను చాలా ఏళ్ళపాటు నా వింత కథానాయకులతో చెట్టపట్టాలు పట్టుకొని, విస్తృతమైన జీవిత చైతన్యాన్ని అవలోకిస్తూ, ప్రపంచానికి కనపడేలాగ నవ్వుతూ, ప్రపంచం చూడకుండా అశ్రువులు రాలుస్తూ తిరగవలసిన యోగం ఉన్నది. మళ్లీ ఎప్పటికో నాలో మళ్లీ ఆవేశం పొంగి తుఫానును రేగి, నా తల ఉరుములతోనూ, మెరుపులతోనూ నిండిపోయి, మరొక ప్రవాహం ఆవిర్భవించబోతుంది. అద్భుతమైన నా పదగర్జనకు మనుషులు మతులుపోయి గజగజలాడి పోతారు…చాలు, ముందుకు పోదాం! కనుబొమలు ముడి వెయ్యటమూ, కర్కశభావాలూ, నిరాశా కట్టిపెట్టి, జీవితంలోకి అడుగుపెట్టి చిచీకవ్ ఏం చేస్తున్నాడో చూద్దాం.

చిచీకవ్ నిద్రలేచి, కాళ్లూ చేతులూ చాచి, మంచినిద్ర పట్టిందనుకున్నాడు. రెండునిమిషాలపాటు వెల్లికిలా పడుకుని, చిటిక వేసి, తనకిప్పుడు దాదాపు నాలుగువందలమంది కమతగాళ్లున్నారని జ్ఞాపకంవచ్చి సంతోషంతో నవ్వుకున్నాడు. వెంటనే అతను పక్క మీదినుంచి లేచి అద్దంలో తన ముఖంకూడా చూసుకోలేదు. ఆ ముఖమంటే అతనికి చాలా ఇష్టం, తన గడ్డం అతనికి మహా సొంపుగా కనిపిస్తుంది లాగుంది. ఎందుకంటే ఎప్పుడన్నా స్నేహితుల దగ్గిర, ముఖ్యంగా తాను గడ్డం చేసుకోనేటప్పుడు ఎదురుగా ఉన్నవాళ్ల దగ్గిర దాన్ని మహా మెచ్చుకునేవాడు; తన గడ్డాన్ని చేత్తో నిమురుతూ, “నా గడ్డం ఎలా ఉంటుందో చూశారూ, గుండ్రంగా!” అనేవాడు. అయితే ఇప్పుడు తాను తన గడ్డాన్ని గాని, ముఖాన్ని గాని చూసుకొని, ఉన్న పళంగానే డ్రెసింగ్ గౌనూ, మొరాకో బూట్లూ వేసుకున్నాడు; వీటి పై భాగాలు అందంగా, అనేక రంగులు కలిగిఉంటాయి. తోర్ ఝోక్ పట్నంలో తయారయే ఈ బూట్లు, రష్యన్లు సుఖాలు మరిగినవాళ్ళు కావటాన, విరివిగా అమ్ముడవుతాయి. ఆ తరువాత అతను తన పరుపూ, నడివయస్సూ కూడా మరచిపోయి, స్కాట్లండువాడిలాగా గెంతులూ, ఎంతో నేర్పుగా తన మడమలతో వీపును కొట్టుకుంటూ, రెండు దూకుల్లో గది ఇటునుంచి అటు చేరాడు. తరువాత వెంటనే పనికి ఉపక్రమించాడు. నీతినియమం తప్పని జిల్లాజడ్జి మధ్యాహ్న భోజనానికి ఎంత ఆనందంగా బయలుదేరుతాడో అంత ఆనందంతో అతను చేతులు రుద్దుకుంటూ తన పెట్టెను సమీపించి అందులోనుంచి చప్పున కొన్ని కాగితాలు పైకితీశాడు. ఎంతమాత్రమూ జాప్యం లేకుండా ఈ వ్యవహారం పూర్తి చేయాలని అతని సంకల్పం. ప్లీడరు గుమాస్తాల ఫీజులతో నిమిత్తం లేకుండా క్రయదస్తావేజు తానే రాసి, దాన్ని కాపీ చెయ్యటానికి అతను నిశ్చయించాడు. అతనికి ఆ మతలబులన్నీ తెలుసు, పైన పెద్ద అక్షరాలతో తేదీ వేసి, దానికింద చిన్న అక్షరాలతో ఫలానా భూస్వామి అని రాసి, మిగిలినదంతా రాయవలసిన తీరుగా రాసుకుపోయాడు. రెండుగంటల్లో ఆ పని పూర్తి అయింది. తరువాత అతను కమతగాళ్ల జాబితాలకేసి చూసుకుంటే తనకే స్పష్టంగాని ఒక వింతభావం అతన్ని ఆవేశించింది. ఆ కమతగాళ్ళు ఒకప్పుడు నిజమైన పనివాళ్ళు, పనులు చేశారు, పొలాలు దున్నారు, తప్పతాగారు, బళ్లు తోలారు, యజమానులను మోసగించారు, లేదా మంచి కమతగాళ్ళు అయినా అయి ఉంటారు. ప్రతి జాబితాకూ ఒక ప్రత్యేకత వున్నది. కమతగాళ్లకు కూడా ఏదో వ్యక్తిత్వం ఉన్నట్టే ఉన్నది. కరబోచ్క సతి జాబితాలో వాళ్లందరి పేర్లూ పెట్టుడు పేర్లలాగా, వర్ణనల్లాగా ఉన్నాయి; ప్ల్యూష్కిన్ జాబితాలో అతి సంగ్రహంగా ఉండి, పేర్ల ముందు పొడి అక్షరాలు మాత్రమే ఉన్నాయి; సబాకివిచ్ జాబితా చాటభారతం, దానినిండా మనుషుల వర్ణనలూ, వివరాలూనూ; ఒకడు పెట్టెలు చెయ్యటంలో నిపుణుడట, మరొకడు తన పని చక్కగా గ్రహిస్తాడుట, సారా ముట్టడుట; వాళ్ల తల్లిదండ్రుల పేర్లూ, వాళ్ల ప్రవర్తనా కూడా వివరించి ఉన్నది; ఒక్క పిదోతన్ అనేవాణ్ణి గురించి మాత్రమే, “తండ్రి తెలియదు; కపితోలిన అనే దాసిపిల్లకు పుట్టినవాడు. అయితే బుద్ధిమంతుడు, దొంగ కాడు” అని రాసి ఉన్నది. ఈ వివరాలన్నీ చూస్తుంటే, వాళ్ళందరూ నిన్న కూడా బతికేవున్నట్టుగా ఉన్నది. ఈ పేర్లన్నిటినీ చాలాసేపు చూసుకున్నాక అతను “తస్సదియ్య, ఇందులో ఎంతమంది ఇరికివున్నారర్రా! మీ కాలంలో మీరంతా ఏంచేసేవాళ్ళు? ఎలా బ్రతికారు?” అన్నాడు. అప్రయత్నంగా అతని కన్ను ఒక పేరుపైన పడింది అది ప్యోతర్ సవిల్యేన్ (తొట్టెను లక్ష్య పెట్టనివాడు) అన్న పేరు. ఈ మనిషి ఒకప్పుడు కరబోచ్కసతి సొత్తని పాఠకులకు తెలుసు. అతను మళ్ళీ పైకి మాట్లాడుతూ “నీ దెంత పొడుగుపేరురా, పంక్తి అంతా నిండింది! నువు వృత్తి ఏదన్నా నేర్చినవాడివా, కూలిపనివాడివా? ఏం వచ్చి పోయావు? బీరు దుకాణం మూలాన పోయావా, లేక దారికి అడ్డంగా పడుకునివుంటే మీదుగా బండి వెళ్ళిందా? ‘ప్రోబ్కస్తిపాన్, వడ్రంగి, ఎన్నడూ తాగి ఎరగడు.’ ఒహో! వీడే, వీడే ప్రోబ్కస్తిపాన్. సైన్యంలో చేరదగిన ఆజానుబాహుడు! వాడు గొడ్డలి రొండిన పెట్టుకుని, బూట్లు భుజాన వేళ్లాడేసుకుని రొట్టెముక్కా, రెండు ఎండు చేపలూ తిని పొట్టనించుకుంటూ, దేశదేశాలూ తిరిగాడు. ప్రతిసారీ నూరు వెండిరూబుళ్ళ సంచితో ఇంటికి తిరిగివచ్చి వుంటాడు; సందేహం లేదు! ఇంతకూ నువ్వెక్కడ చచ్చిపోయావు! కూలిడబ్బులు బాగా ముట్టుతాయని చర్చి గోపురం మీద పని చెయ్యటానికి ఎక్కి శిలువ కూడా ఎగబాకి, అడ్డదూలం జారి దభాల్న కిందబడితే, పక్కనే నిలబడి ఉన్న మిల్హె మామ బుర్ర గోక్కుని, “అయ్యో, వాన్య. అనుకున్నంతా చేశావే!” అనుకుని, తాడు ఎగబాకి నీ స్థానంలో పని చెయ్యటానికి వెళ్ళి ఉంటాడు ‘మక్సీమ్ తిల్యాత్నికవ్, బూట్లు కుట్టేవాడు! బూట్లు కుట్టేవాళ్ళు బుడ్దికి దాసులని సామెత. నేను నిన్నెరుగుదునురా, అబ్బీ కావాలంటే నీ చరిత్ర అంతా చెప్పగలను. ఒక జర్మనుకింద నువు పనినేర్చుకున్నావు, వాడు మిమ్మల్నందరినీ కలిపి తిండిపెడుతూ, అజాగ్రత్తగా ఉన్నప్పుడల్లా తోలుపట్టాతో వీపులు పగలగొట్టేవాడు, మిమ్మల్ని వీధుల్లో బలాదూరు తిరుగనిచ్చేవాడు కాడు. నువు గొప్ప పనిమంతుడివి, మామూలుగా బూట్లుకుట్టే వాళ్ళలాటి మనిషివి కావు. జర్మను పెళ్లాం దగ్గిరా, తోటివాళ్ళదగ్గిరా నిన్ను తెగ మెచ్చుకునేవాడు. పని నేర్చుకోవటం అయాక నువు సొంతాన దుకాణం పెట్టాలనీ, జర్మనులాగా దమ్మిడీలు లాభంతియ్యకుండా, ఒక్కసారిగా ధనికుడై పోవాలనీ అనుకున్నావు. అందుకుగాను నువు నీ యజమానికి వెట్టికి బదులుగా పెద్దమొత్తంలో డబ్బిచ్చుకుని, ఆర్డర్లు పోగుచేసుకుని పనిసాగించావు. చీకిపోయిన తోలుముక్కలు సంపాదించి వాటితో బూట్లు తయారు చేసి, వాటి ఖర్చుకు ఇబ్బడిగా లాభం చేసుకున్నావు. ఒకటి రెండు వారాలకల్లా నీ బూట్లు పగిలిపోయేసరికి అందరూ నిన్ను బండబూతులు తిట్టారు.నీ దుకాణానికి రావటం మానేశారు.” నువు తాగుడు అలవాటు చేసుకుని, వీధుల వెంట తారట్లాడుతూ, “బతుకేమి బాగా లేదు. అడుగడుగునా జర్మనులు అడ్డం తగులుతుంటే రష్యనులు బతికేదెలా?” అనుకున్నావు. “అరె, ఇదేం కమతగాడు? ఎలిజవెత వరబేయ్! ఛీ. నీ తాడు తెగ, ఆడదానివా? ఇందులోకి ఇది ఎలా వచ్చింది? దొంగముండాకొడుకు సబాకివిచ్ చేసిన పనే!”

చిచీకవ్ పొరవడలేదు, ఆమె ఆడదే. ఆమె ఈ జాబితాలోకి ఎలా వచ్చిందో తెలియదు, కాని ఆమెను చాలా తెలివిగా, చప్పున చూస్తే మగవా డనిపించేలాగ ఇరికించారు. ఆమె పేరుకూడా ‘ఎలిజవెతా’ అని రాసి ఉండక ‘ఏలిజవెత్ ‘ అని రాసిఉంది. అతను ఆ పేరును వెంటనే కొట్టేశాడు. “గ్రిగోరీ ఎన్నటికీ చేరనివాడు! నువు ఎలాటి మనిషివి? నువు సరుకులు చేరవేసేవాడివా? నీకు మూడు గుర్రాలూ, గోతంకప్పిన బండీ ఉండేవా? నువు ఎన్నడూ ఇంటి మొహం చూడకుండా, వర్తకుల వెనకాడితే సంతలకు తిరుగుతుండే వాడివిగామాలు? నువు రోడ్దుమీదనే ప్రాణాలు వదిలి దైవసాన్నిధ్యం చెందావా లేక ఏ సిపాయి భార్యో అయిన ఎర్రబుగ్గల, బొద్దుపిల్ల కారణంగా నీ అనుచరులే నీ దీపం ఆర్పేశారా, లేక నీ తోలు చేతితొడుగుల మీదా, పొట్టికాళ్ల గట్టి గుర్రాలమీదా కన్నేసి ఏ అడవిలో ఉండే తిరుగుబోతో అంత పని చేశాడా, లేక నువే నీ చెక్కలమంచం మీద పడుకుని ఆటే ఆలోచించి ఉత్తపుణ్యానికి బీరు దుకాణానికి వెళ్ళి, అక్కడినుంచి తిన్నగా మంచంలో ఉండే కోంతకు నడిచి అందులోపడి మళ్లీ కనిపించకుండా పోయావా? ఆహా, ఈ రష్యను ప్రజలు! వీళ్లకు సహజంగా చావాలని ఉండదు గద! మరి మీ అందరి మాటా ఏమిట్రా, అబ్బాయిలూ?” అంటూ చిచీకవ్ పారిపోయిన ప్ల్యూష్కిన్ కమతగాళ్ళ జాబితాను పరిశీలించాడు. “మీరు బతికున్నారే గాని, ఏం ప్రయోజనం? చచ్చినవాళ్ళ లోపమే! మీ పిక్కబలం మిమ్మల్ని ఇప్పుడెక్కడికి చేర్చింది? ప్ల్యూష్కిన్ తో వేగ లేక పోయావా, లేక మీ అనందంకోసమే అడవుల్లో తిరుగుతూ, ప్రయాణీకులను దోచుకుంటున్నారా? మీరు ఖైదుల్లో పడ్డారా. లేక ఇతర యజమానుల అండచేరి వ్యవసాయం చేస్తున్నారా?” యెరేమి కర్యాకిన్, నికీట ఫ్లిట్టర్, వాడి కొడుకు అంతోన్ ఫ్లిట్టర్. వాళ్ళ పేర్లు చూస్తేనే పిక్కబలం గల వాళ్లని తెలుస్తున్నది . (‘కర్యేర్’ అంటే రష్యను భాషలో వేగమైన సవారి. ఫ్లిట్టర్ అనే మాట ఇంగ్లీషు అనువాదకుడి ప్రయోగంలాగా కనబడుతుంది, ఫ్లిట్ అంటే ఇంగ్లీషులో ఇంకొక చోటికి పోవడం, వేగంగా కదలటం అని అర్థం. — అనువాదకుడు) పపోన్, ఇంటి నౌకరు… చదవటమూ, రాయటమూ నేర్చినవాడై ఉండాలి. వాడెన్నడూ కత్తి చేతపట్టి ఉండడు, సందేహం లేదు, దొంగతనాలన్నీ పెద్దమనిషి తరహాగానే చేసిఉంటాడు. ఇంతలో నిన్ను పోలీసు అధికారి పట్టుకుని నీ దగ్గిర పాస్‌పోర్ట్ లేకపోవటం చూసి ఉంటాడు, వాళ్లు నిన్ను సోదా చేస్తుంటే నువు ధైర్యంగానే జవాబు చెప్పి ఉంటావు. పోలీసు అధికారి నీమీద సందర్భోచితమైన ఘాటుమాటలు కొన్ని ప్రయోగించి, ‘ఎవరి ఇలాకామనిషివి?’ అని అడిగి ఉంటాడు. ‘ఫలానా’. అని తడువుకోకుండా చెప్పి ఉంటావు. ‘ఇక్కడెందుకున్నావు?’ అంటాడు పోలీసు అధికారి, ‘సొమ్మిచ్చి సెలవుతీసుకుని వచ్చాను ‘ అని సంకోచించకుండా జవాబిస్తావు. ‘నీ పాస్‌పోర్ట్ ఏదీ?’ ‘నా యజమాని పిమేనీవ్ కిచ్చాను.’ ‘పిమేనీవ్ ను పిలు…’ మీరేనా పిమేనీవ్?’ ‘నేనే పిమేనీవ్ ను ‘. ‘వీడు తన పాస్‌పోర్ట్ మీ కిచ్చాడా?’ ‘లేదు, నా కివ్వనేలేదు ‘. ‘ఎందుకు అబద్ధమాడావు?’ అంటాడు పొలీసు అధికారి. నువు ధైర్యంగా, ‘నేను ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను, అందుచేత ఆయన కివ్వలేదు. గంటవాయించే అంతీప్ ప్రఖోరవ్ కిచ్చా, భద్రంగా ఉంచమన్నాను ‘. ‘గంట వాయించేవాణ్ణి పిలు… వీడు నీకు తన పాస్‌పోర్టిచ్చాడా?’ ‘లేదు, వాడు నాకు పాస్‌పోర్ట్ ఏమీ ఇవ్వలేదు.’

‘మళ్లీ అబద్ధమాడుతున్నావూ?’ అంటాడు పోలీసు అధికారి. మరికొన్ని ఘాటుమాటలు ప్రయోగించి, ‘నీ పాస్‌పోర్ట్ ప్రయోగించి, ‘నీ పాస్‌పోర్ట్ ఎక్కడ?’ ‘నాకు ఉండేదే. ఒకవేళ దారిలో ఎక్కడన్నా పడిపోయిందేమో?’ పోలీసు అధికారి మరికొన్ని ఘాటైన మాటలు విసిరి, ‘అయితే సిపాయి వాడి పైకోటూ, రాగిడబ్బులతో సహా ప్రీస్టు పెట్టే ఎందుకు దొంగిలించావు?’ అంటాడు. నువు తొణకకుండా, ‘ఇంతవరకెన్నడూ నేను కూడనిపని చేసి ఎరగను ‘, అంటావు ‘అయితే మరి ఆ పైకోటు నీ దగ్గిరి కేలా వచ్చింది?’ ‘నేను చెప్పలేను. ఇంకేవరన్నా తెచ్చారేమో’ పోలీసు అధికారి రొండిన చేతులు పెట్టుకునిలబడి, తల ఆడిస్తూ, ‘ఓరి పశువా!’ అని, ‘వాడి కాళ్లకు సంకెళ్లు తగిలించి ఖైదులో పడెయ్యండి ‘ అంటాడు. ‘మరీమంచిది. అలాగే పోతాను ‘ అంటావు. నువు పొడుం డబ్బీ తీసి, నీ కాళ్లకు సంకెళ్లు తగిలించే ముసలి పోలీసులకు ఇస్తూ, వారు సైన్యాన్ని వదిలిపెట్టి ఎంత కాలమయిందనీ, ఏమేమి యుద్ధాల్లో పోరాడారని అడుగుతావు. తరువాత నీ విచారణ ఆరంభమయేదాకా ఖైదులో గడుపుతావు. నిన్ను త్సరేవొ-కొక్షాయ్కిన్ జైలునుంచి మరొక పట్నంలోని జైలుకు మార్చమని జడ్జి ఉత్తరు విస్తాడు, అక్కడినుంచి న్యాయస్థానంవారు నిన్ను వెస్వేగాన్స్క్ కు బదిలీ చేస్తారు. ఇలా నువు ఒక ఖైదుంచి ఇంకొక ఖైదుకు మారతావు, కొత్తచోటికి రాగానే, ‘వెస్యేగాన్స్క్ జైలు ఇంకా బాగున్నది. అక్కడ స్కిటిల్స్ ఆడుకునేటందుక్కూడా జాగా ఉన్నది. తోడు చాలామంది ఉన్నారు అనుకుంటావు.

“అబాకుమ్ ఫీరవ్! నీ సంగతి ఏమిట్రా అబ్బీ? ఇప్పుడెక్కడ సంచారం చేస్తూన్నావు? వోల్గా తీరాన్ని చేరుకుని, స్వేచ్ఛాజీవితం రుచిమరిగి, లాగుడు మనుషుల్లో చేరిపోయావా?” చిచీకవ్ ఈ ధోరణి కట్టిపెట్టి ఏదో ఆలోచనలో పడిపోయాడు. అతను ఆలోచించేది దేన్ని గురించి? అబాకుమ్‌ఫీరవ్ గతినిగురించా? రష్యనులందరూ, తమ వయసుతోనూ, హోదాతోనూ, పరిస్థితులతోనూ ప్రమేయంలేకుండా సాహసోపేతమూ, ఉత్సాహజనకమూ అయిన జీవితం గురించి పగటికలలు కనేతీరుగా ఇతనుకూడా తనను గురించే పగటికలలు కంటున్నాడా? నిజంగా ఫీరవ్ ఇప్పుడెక్కడ ఉన్నాడు? వాడు ధాన్యపురేవులో వర్తకులతో బేరాలు చేస్తూ సుఖంగానూ, సంతోషంగానూ జీవిస్తున్నాడు. టోపీలలో రిబ్బన్లూ, పూలూ పెట్టుకుని లాగుడు మనుష్యులంతా పరమానందంలో ఉన్నారు. పూసలపేర్లూ, రిబ్బన్లూ ధరించి, ఒడ్డు పొడవుగాఉండే తమ భార్యలవద్దా, స్త్ర్రీల వద్దా వీడ్కోలు తీసుకుంటున్నారు. ఆ ప్రదేశమంతా చాలా సందడిగా ఉన్నది. ఒక వంక అరుపులూ, తిట్లూ, ప్రోత్సాహవచనాలూ సాగుతూండగా కూలీలు, పన్నెండు పదమూడేసి మణుగుల బరువుగల బస్తాలు వీపుల్నెత్తుకుని తెచ్చి, పడవలలో బటానీలూ, గోధుమలూ పోసేస్తున్నారు. సంచులలో ఓట్లూ, మొక్కజొన్నా తెచ్చి పేర్చుతున్నారు. సరుకుల రేవులో ఎక్కడ చూసినా ఈ సంచులు ఫిరంగి గుండ్లలాగా పేర్చి కనిపిస్తున్నాయి. పడవల్లోకి ఎక్కంచేదాకా ఈ రాసులిలాగే ఉంటాయి. వసంతకాలంలో మంచు కరగటం ప్రారంభమయాక అంతులేని పడవలబారు కదిలి ప్రయాణమైపోతుంది. అప్పుడు లాగుడు మనుషులకు పనిపడుతుంది! అదివరకు ఆనందించినట్టే ఇప్పుడు అందరూకలిసి శ్రమిస్తూ, చెమటోడ్చుతూ తాడుపట్టి లాగుతూ, పాటపాడతారు. రష్యాకులాగే ఆ పాటకూ అంతుండదు.

చిచీకవ్ చివరకు గడియారం చూసుకొని, “ఓహో, పన్నెండయిందే! నే నెందుకిలా కాలయాపన చేస్తున్నానూ? పోనీ ఏదన్నా పనిమీద ఉంటే అనుకోవచ్చు, వట్టినే కూచుని స్వాగతం చెప్పుకుని, పగటికలలు కంటూ కూచుంటినే. ఎంత మతిమాలినవాణ్ణి!” అనుకున్నాడు. ఇలా అనుకుంటూనే అతను స్కాట్లండు ఉడుపు తీసేసి యూరోపియన్ దుస్తులు ధరించాడు, తన గుండ్రని పొట్టమీద బెల్టు గట్టిగా బిగించాడు, మీద ఉడుకులాం చల్లుకున్నాడు, తన చలిటోపీ తీసుకొని, కాగితాలు చంకనబెట్టుకొని తన క్రయదస్తావేజు పని పూర్తి చేసుకునేటందుకు ప్రభుత్వకచేరీకి బయలుదేరాడు. అతను తొందరపడింది టైము మించిపోతుందని భయంవల్లకాదు-టైము మించిపోతుందన్న భయం అతనికి లేదు, ఎందుచేతనంటే అతను అధ్యక్షుణ్ణి ఎరుగును. హోమర్ మహాకవి కావ్యాలలో దేవతల పెద్ద అయిన జియస్ తన అభిమాన వీరుడికి యుద్ధంలో అనుకూలపడేలాగా పగటి కాలాన్ని తగ్గించటమూ, పొడిగించటమూ చేసినట్టుగా ఈ అధ్యక్షుడు తన ఇష్టంవచ్చినట్టు కచేరి పనిచేసే కాలాన్ని తగ్గించగలడు, పొడిగించగలడు-కాని ఈ వ్యవహారం సాధ్యమైనంత త్వరలో తెముల్చుకోవాలనిపించింది; ఈ పని పూర్తి అయితేగాని అతనికి మనస్థిమితం కలిగేటట్టు కనుపించలేదు, ఈ కమతగాళ్ళు వాస్తవ వ్యక్తులు కారన్న భావం అతన్ని వేధిస్తూనే ఉన్నది, అలాటి బరువును తనమీదనుంచి ఎంత త్వరగా దించెచేసుకుంటే అంతమంచిది. ఇలా అనుకుంటూ, గోధుమవర్ణం గుడ్డ కప్పిన ఎలుగుబంటిచర్మపు పైకోటు భుజాలమీద సరిచేసుకుంటూ అతను వీధుల్లోకి వెళ్లి, పక్క సందులోకి తిరిగాడోలేదో, అతనికి మరొక పెద్దమనిషి, గోధుమవర్ణం గుడ్డ కప్పిన ఎలుగుబంటి చర్మపు పైకోటూ, చెవులకు అడ్డంగా మూతలూ ధరించి ఎదురయాడు. ఆ పెద్దమనిషి గట్టిగా అరిచాడు-అతను మానిలవ్, వెంటనే ఇద్దరూ గాఢాలింగనం చేసుకుని నడివీధిలో అయిదునిమిషాలపాటు అలాగే ఉండిపోయారు. వారిద్దరూ ఒకరి నొకరు ఎంత అప్యాయతతో ముద్దు పెట్టుకున్నారంటే ఆ రోజల్లా ఇద్దరి ముందుపళ్లూ సలుపుతూనే ఉన్నాయి. మానిలవ్ పొందిన ఆనందంలో అతని కళ్లు కాస్తా అదృశ్యమైపోయి, ఆయన ముఖంలో ముక్కూ, మూతీ మాత్రమే మిగిలాయి. ఒక పావుగంటసేపు ఆయన చిచీకవ్ చేతిని తన రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకొని విపరీతంగా వేడి ఎక్కించేశాడు. ఆయన అతినాగరీకంగా మాట్లాడుతూ చిచీకవ్‌ను ఆలింగనం చేసుకోవటానికి తాను ఎలా వేగంగా వచ్చి వాలాడో వర్ణించి, నృత్యాల సమయంలో యువతులను ప్రశంసించటానికి పనికివచ్చే మాటలతో అతన్ని ప్రశంసించాడు. ఆయనకు తన కృతజ్ఞత తెలుపుదామని చిచీకవ్ నోరు తెరిచాడుగాని ఏమనాలో అతనికి తెలియలేదు. అంతలోనే మానిలవ్ తన కోటు కిందనుంచి గులాబిరంగు రిబ్బను కట్టిన కాగితాల చుట్ట ఒకటి పైకి తీశాడు.

ఈ గుమాస్తాలకు అందరు గుమాస్తాల్లాగే ప్రతిదీ కావాలనీ, వారు తాము చేసేపనికి అధిక ప్రాముఖ్యం ఆపాదించుకుంటున్నారనీ చిచీకవ్ గ్రహించాడు.

“చూడండి, బాబులూ, కమతగాళ్ల అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ, ధరలతో నిమిత్తం లేకుండా, ఒక చోటే చూస్తారని నాకు తెలుసు. కనక ఆది ఏ బల్లవద్దో చూపించండి. మీ అఫీసులో ఏం జరిగేది మీకే తెలియకపోతే మరొకర్ని అడిగి కనుక్కుంటాను,” అన్నాడతను.

“ఏమిటది?”

“కమతగాళ్లు,”

“ఓహో!” అంటూ అతను చుట్టవిప్పి చూసుకుని, దస్తూరి అందాన్ని మెచ్చుకుంటూ, “చాలా బాగుంది, దీన్ని తిరగరాయను కూడా అక్కర్లేదు. అన్ని వైపులా మార్జిన్ల నిమిత్తం రూబుళ్ళున్నాయి. ఈ రూళ్ళను ఇంతచక్కగా వేసినది ఎవరు?”

“మీరలా అడగగూడదు” అన్నాడు మానిలవ్.

“మీరేనా ఏమిటి?”

“నా భార్య”

“అరెరే, ఎంత శ్రమ ఇచ్చానూ!”

“పావెల్ ఇవానవిచ్ కోసం ఎంత శ్రమ అయినా ఫరవాలేదు.”

చిచీకవ్ ఈ ఆదరణలను తలవంచి స్వీకరించాడు. క్రయంపని పూర్తిచేసుకునేటందుకు అతను కచేరీకి వెళుతున్నట్టు తెలుసుకొని మానిలవ్ తానుకూడా వెంటవస్తానన్నాడు. ఇద్దరూ చేతులుపట్టుకుని నడవసాగారు. గట్టయేది, మెట్టయేది, రోడ్డులు కొంచెం ఎత్తువచ్చినప్పుడల్లా మానిలవ్ చిచీకవ్‌కు ఊత ఇచ్చి, దాదాపు మనిషినే ఎత్తేసినంతపనిచేసి, తియ్యగా నవ్వుతూ పావెల్ ఇవానవిచ్ గారి బంగారుపాదాలు కందిపోరాదన్నాడు. చిచీకవ్‌కు చచ్చేసిగ్గేసిపోయింది, తన కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలీదాయె, తాను తక్కువ బరువు మనిషి కాడాయె. ఈవిధంగా ఒకరునొకరు సంబాళించుకుంటూ వారు చివరకు ప్రభుత్వ కచేరీలుండే కూడలి చేరారు. కచేరీలు పెద్ద మూడంతస్తుల ఇటుకల భవంతిలో ఉన్నాయి. లోపలి కచేరీల హృదయం నిర్మలంగా ఉంటుందిసుమా, అని చెప్పటానికి కాబోలు భవంతికి తెల్లని తెలుపురంగు వేశారు. ఆ వీధిలో ఉన్న ఇతర కట్టడాలు ఈ ఇటుకల భవంతికి ఈడు వచ్చేవికావు. వాటిలో ఒకటి కాపలా వాడు నిలబడే గూడు, అందులో ఒక సిపాయి తుపాకితో సహా నిలిచి ఉన్నాడు. మరొకటి బళ్లు నిలిచే చోటు. ఆ తరవాత ఒక నిడుపైన ప్రహరీగోడ; ప్రహరీగోడల మీద విధిగా కనిపించే బొగ్గుతో రాసిన అక్షరాలూ, బొమ్మలూ దీని మీద కూడా ఉన్నాయి. ఈ నిర్జన ప్రదేశంలో – కొందరు దీన్నే రమణీయ ప్రదేశం అంటారు – మరేదీలేదు. పై అంతస్తుల కిటికీల వద్ద న్యాయ దేవతార్చకుల నీతికి కట్టుబడిన తలలు కనిపించినట్టే కనిపించి మాయమయాయి. అప్పుడే పై అధికారి వారి గదిలోకి వచ్చాడు కాబోలు. స్నేహితులు మెట్లను ఎక్కారనటం కంటే ఎగపరిగెత్తారనటం భావ్యంగా ఉంటుంది. ఎందుకంటే, మానిలవ్ తనకు ఊతం ఇవ్వబోతాడేమోననే భయంతో చిచీకవ్ మెట్లను వేగంగా ఎక్కాడు. ఎలాగైనా చిచీకవ్‌కు ఊతం ఇద్దామనే సంకల్పంతో మానిలవ్ తరుముకుంటూ వచ్చాడు. ఇద్దరూ పైకి వచ్చి రొప్పసాగారు. పైనగల కారిడార్ గాని, గదులుగాని శుభ్రంగా ఉన్న సంగతి కొట్టవచ్చినట్టు కనిపించటం లేదు. అయితే ఆ రోజుల్లో దాన్ని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అసహ్యంగా ఉన్నదాన్ని అసహ్యంగా ఉండనిచ్చారే తప్ప, పై మెరుగుల కోసం ఎవరూ ప్రయత్నించలేదు. అందుచేత న్యాయదేవత వారికి సాదా దుస్తులతోనే ఎదురువచ్చింది. మన కథానాయకులు గడచిన ఆఫీసు గదులను వర్ణించటం ధర్మమే, కాని రచయితకు అలాటి స్థలాలంటే చాలా భయం. అవి మెరుగు పెట్టిన గచ్చుతోనూ, బల్లలతోనూ, కళకళలాడుతూ ఉండినప్పటికీ ఈ కథకుడు తలవంచుకుని సాధ్యమైనంత శీఘ్రంగా వాటిని దాటుకుంటూ వెళ్లాడేతప్ప, అవి ఎంత వైభవంగా ఉన్నదీ, ఘనంగా ఉన్నదీ గమనించి ఉండలేదు.

అంతులేని కాగితాలు, చిత్తులూ, సాఫులూ, వంచినతలలూ, లావుపాటి మెడలూ, డ్రెస్ కోటులూ, ఫ్రాక్ కోటులూ, వీటన్నిటి మధ్యా విలక్షణంగా ఒక బూడిదరంగు జాకెట్టు దాన్ని ధరించిన మనిషి తల ఒక పక్కకు వంచి దాదాపు కాగితాన్ని తగిలేలాగ పెట్టి, పెద్ద అక్షరాలతో రాస్తూండడమూ మన కధానాయకుడికి కనబడింది; ఆ మనిషి రాసేది అక్రమంగా స్వాధీనపరుచుకున్న భూమి తాలూకు వ్యాజ్యం గెలిచిన బాపతు రిపోర్టు అయి ఉంటుంది. లేదా ఏదైనా ఎస్టేటు తాలూకు ఇన్వెంటరీ అయి ఉంటుంది; ఆ ఎస్టేటులో జీవించే పెద్ద మనిషి వట్టి అమాయకుడు, వ్యాజ్యం గొడవే పట్టించుకోకుండా తననూ, తన పిల్లలనూ, మనుమలనూ పోషించుకుంటూ వస్తుంటాడు. అప్పుడప్పుడూ బొంగురు గొంతులతో పలికే చిన్న చిన్న వాక్యాలు వినిపిస్తున్నాయి. “దయచేసి 368 నంబరు కేసిలా ఇవ్వండి, షిదోసెయి ఫిదోసెయిచ్”, “ఎప్పుడూ ఆఫీసు సిరాబుడ్డి మూత పట్టుకుపోతారేం?” మధ్యమధ్య మరింత గంభీరమైన గొంతు, బహుశా ఎవరో అధికారిది, దర్పంగా పలికింది; “దాన్ని మళ్లీ కాపీ చెయ్యి, లేకపోతే నీ బూట్లుకాస్తా లాగేసుకుంటారు; ఆరు పగళ్లూ, ఆరు రాత్రులూ తిండిలేకుండా ఇక్కడే పడి ఉండాలి!” కలాల బరుకుడు పెద్దగా వినపడింది. ఆ చప్పుడు చిట్టడవిలో ఎండుటాకుల మీదుగా బండి నడిచినట్లుగా ఉంది.

చిచీకవ్ మానిలవ్ లు మొట్టమొదటి బల్లవద్దకు వెళ్లి అక్కడ కూచున్న ఇద్దరు గుమాస్తా కుర్రాళ్లను, “క్రయదస్తావేజులు తీసుకునేది ఎక్కడో కాస్త చెబుతారా?” అని అడిగారు.

“మీకేం కావాలేం?” అని ఇద్దరు గుమాస్తాలూ వెనక్కు తిరిగి ప్రశ్నించారు.

“ఒక దరఖాస్తున్నది.”

“ఏం కొన్నారేం?”

“నాకు ముందు అమ్మకాల వ్యవహారం చూసేది ఎక్కడో చెప్పండి-ఇక్కడా, మరొక చోటా?”

“మీరేం కొన్నదీ, ఎంతకు కొన్నదీ తెలియజేస్తే ఎక్కడో చెబుతాం, లేకపోతే చెప్పలేం.”

ఈ గుమాస్తాలకు అందరు గుమాస్తాల్లాగే ప్రతిదీ కావాలనీ, వారు తాము చేసేపనికి అధిక ప్రాముఖ్యం ఆపాదించుకుంటున్నారనీ చిచీకవ్ గ్రహించాడు.

“చూడండి, బాబులూ, కమతగాళ్ల అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ, ధరలతో నిమిత్తం లేకుండా, ఒక చోటే చూస్తారని నాకు తెలుసు. కనక ఆది ఏ బల్లవద్దో చూపించండి. మీ అఫీసులో ఏం జరిగేది మీకే తెలియకపోతే మరొకర్ని అడిగి కనుక్కుంటాను,” అన్నాడతను. గుమాస్తాలు మాట్లాడలేదు. వారిలో ఒకడు వేలిని ఒక మూలకేసి విసిరాడు. ఆమూల ఒక ముసలాయన ఏదో రాసుకుంటున్నాడు. చిచీకవ్, మానిలవ్ బల్లల మధ్యనుంచి ఆయనవద్దకు వెళ్లారు. ముసలాయన తన పనిలో మరింత నిమగ్నుడై పోయాడు.

“అయ్యా, క్రయదస్తావేజుల తాలూకు దరఖాస్తులు తీసుకునేది ఇక్కడే నేమో దయచేసి చెబుతారా?” అని చిచీకవ్ వంగి అడిగాడు.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 27

నీ పై ప్రేమతో…

– బొల్లోజు బాబా

ఇక్కడ నిను నేను ప్రేమిస్తున్నాను.

పైన్ వనాల చీకట్లలో గాలి స్వేచ్ఛప్రకటించుకొంది.
నీటి అలలపై చందమామ భాస్వరమై వెలుగుతోంది.
అన్నీ ఒకేలా ఉండే రోజులు, ఒకదానినొకటి వెంబడించుకొంటున్నాయి.

పొగమంచు అస్ఫష్ట రూపాలతో నర్తిస్తోంది.
ఓ వెండికొంగ ఎక్కడినుంచో వచ్చి వాలింది
మరొకటి తారలదాకా ఎగురుకొంటో సాగింది.

ఒకోసారి తొందరగా మెలుకువొచ్చేస్తుంది.
నా హృదయం తడిచి దూరంగా సముద్రపుటలలతో ప్రతిధ్వనిస్తోంది.

ఇక్కడే, ఈ ఓడ రేవు లో నిన్ను ప్రేమిస్తున్నాను.
ఇక్కడే నిను నే ప్రేమించాను.
దిగంతాలు నిను దాచేయాలని ప్రయత్నించాయి వృధాగా.

దహించే ఈ శీతగాలుల మధ్య కూడా నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను.
ఏనాడూ తిరిగిరాని పెద్ద పెద్ద ఓడలపై నా ముద్దులను పంపుతూనే ఉన్నాను.
పాతలంగరుల్లా నన్ను నేనే మరచిపోతున్నాను.
మధ్యాహ్నం లంగరు దింపుతోంది శోక తీరంపై.

నా జీవితం అలసిపోయింది. నిష్ప్రయోజనంగా అనిపిస్తోంది.
నా వద్దలేనిదానిని నేను ప్రేమిస్తున్నాను.

నీవు చాలా దూరంలో ఉన్నావు.
నా విరక్తి మసకసంధ్యలతో పెనుగులాడుతోంది.
కానీ రాత్రి వచ్చి నాకు పాటలు వినిపించి సాగిపోతూంది.
చందమామ తన స్వప్నాల కీలుబొమ్మలను ఆడిస్తూంది.
పెద్దపెద్ద నక్షత్రాలు నీ కళ్లతో నన్ను చూస్తూంటాయి.

నేను నిను ప్రేమిస్తూండగా
గాలిలో పైన్ తోపులు తమ ఆకులతో తీగలతో నీ నామాన్ని గానం చేస్తున్నాయి.

పాబ్లో నెరుడా Here I Love You – కు స్వేచ్ఛానువాదం

——————-

బొల్లోజు బాబా

బొల్లోజు బాబా పుట్టింది యానాం. ప్రస్తుతం కాకినాడలో ప్రభుత్వ కాలేజీలో జూవాలజీ లెక్చరరుగా పనిచేస్తున్నారు. పుస్తక పఠనం, అప్పుడప్పుడూ ఆలోచనలను అక్షరాలలో పెట్టాలని ప్రయత్నించటం ఆయన అభిరుచులు.

ఆయన రచనలు:
1. 1954 లో ఫ్రెంచి వారి పాలననుండి యానాం ఏవిధంగా విముక్తి చెందిందో వివరించే “యానాం విమోచనోద్యమం” అనే పుస్తకం.
2. టాగోర్ రచించిన స్ట్రే బర్డ్స్ కు తెలుగు అనువాదం (ఈ లింకులో లభిస్తుంది)
ప్రస్తుతం కవితల సంపుటిని పుస్తకరూపంలో తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు.
బ్లాగు: http://sahitheeyanam.blogspot.com/

Posted in కవిత్వం | Tagged | 3 Comments

తామస విరోధి – తొమ్మిదవ భాగం

స్వాతి:

దిగులు దిగులుగా ఉంటుంది
పాత జ్ఞాపకాల ఈదురుగాలి
ఉండుండి సన్నగా కోస్తుంది.

అంటూ చలిపొద్దుని దుప్పటి ముసుగు తీసి చూపించిన రవి శంకర్ గారూ! మరి వసంతోదయాలు ఎలా ఉంటాయో మీ శైలి లో చెప్తారా! నేటి కాలపు కవిత్వం తీరుతెన్నుల్ని విసుగనుకోకుండా విశ్లేషించగల భూషణ్ గారు వచన కవిత ఒకదాన్ని రాసి ఈ సమ్మేళనానికి మరింత నిండుతనాన్ని ఇవ్వాలి.

తమ్మినేని యదుకుల భూషణ్:
వసంతగీతం

వెచ్చని
వసంతాన్ని
మాటలతో
వ్యర్థం
చేయకు.

కాలువ వెంట
చెక్కగేటు పక్క
వింతరంగు పూలు
కొంత సమయం
కేటాయించు

మహావృక్షాల
ఆకులను,
మొదళ్ళను
కదిలించే
సూర్యస్పర్శను

మంచులో
మెత్త బడిన
పూవుల ఆకుల-
సుగంధాన్ని
మోసుకువచ్చే
మలయపవనాన్ని-

కీర్తించు !!

స్నేహితుడా !
గోడగడియారం
చేతులతో
కరచాలనం
చేయకు

నిగూఢారణ్యాలను
బలిష్టపాదాలతో
కలియతిరుగు

గుహాముఖాల్లో
హర్యక్షరవం

ఎండిన
కొమ్మను
పట్టుకు
వేలాడే
ఎలుగు

పథికుడా!
బలంగా-
జీవించు,
మరణించు.

కొంగపాఠం

చిల్లులు పెట్టే చలిగాలి
కొల్లేరుచేరింది సైబీరియాకొంగ
ఇల్లొకటి ఏర్పాటు చేసుకుని,
తల్లిగా మారి తల్లడిల్లింది.

వేపచెట్టు నీడను
చేపఈత జాడను
ఎగరలేని బకాలకు వదిలేసి
వేగం, వెనుదిరిగి పోతుంటే,

ముక్కుపచ్చలారని కొంగలు
రెక్కలొచ్చేదాకా ఆగమంటే,

బక ఉవాచః
“నిగనిగలాడే మీ రెక్కల్లో
గగనాన్ని తాకే సత్తువ!
సగర్వంగా బ్రతకడం,
ఎగరడం ఎవరూ నేర్పలేరు !”

విన్నకోట రవి శంకర్:
అమ్మ నుంచి

అమ్మ కేంద్రం
అందరం వృత్తాలం
పరిధి పెరిగినవాడు
మరింతగా దూరమయ్యాడు

మాతృ భాష
మాతృ భూమి
మనసుపడి చదివిన మాతృ శాఖ
-అమ్మతో పోలికచెప్పిన అన్నిటికీ దూరమయ్యాం.
నిజానికి, జీవితమంటే
-పుట్టుక మొదలు అమ్మనుంచి విడివడుతూ మనిషి చేసే సుదీర్ఘ ప్రయాణం.

ముక్కు తెరిచి, బేలగా
అమ్మ వైపు చూసినప్పటికంటె
తనకు తెలిసిన దిక్కుకి తానెగిరినప్పుడే
రెక్కమీద రంగు మెరుస్తుంది పక్షికి.

తనవంతు పరావర్తిత కాంతిని
వెదుక్కున్న చంద్రునికి
అమ్మ నీడ గ్రహణంగా మారుతుంది.

విశ్వమంతా తన మూలం నుంచి
నిరంతరం విస్తరిస్తుంది

అమ్మ దీపస్థంభం
అందరం ఓడలం
ఎవరి బరువు వారు మోసుకొంటూ
తలో తీరానికి తరలిపోయాం.

నిషిగంధ: భూషణ్ గారు, కవితలోని గాఢత దాని నిడివి పై ఆధారపడి ఉంటుందా? స్పష్టత, క్లుప్తత ఉన్నా కూడా నిడివి ఎక్కువ ఉన్న కవిత అనుభూతిని చివరి వరకూ
ఒకే స్థాయిలో కలుగజేస్తుందంటారా?

భూషణ్: నిడివి విషయంలో నియమాలేమీ లేవు.నిడివిని నిర్ణయించేది
భావం.భావాంతం,పదాంతం ఒకేసారి జరగితే నిడివిలో హెచ్చుతగ్గులు ఉండవు. క్లుప్తతంటే భావాంతం ,పదాంతం వేరు కాకపోవడమే .క్లుప్తత ఉన్నప్పుడు నిడివిలో ఎక్కువతక్కువలు రావడానికి వీల్లేదు… చెప్పవలసిన భావం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుందన్న విషయం చాలా మంది (పెద్ద?) కవులకే తెలియదు. అంటే వారి క్లుప్తతాప్రమాణాలు అధమ స్థాయిలో ఉన్నాయన్నమాట. కొందరు,ఒక్కోసారి ,భావం ముగిశాక కూడా కవితను సాగదీస్తారు. ఈవిధంగా, నిడివి పెరగడానికి కారణం, కవి అసమర్థత కారాదు.నిడివికి తగిన భావసంపద ఉంటే గాఢతకు వచ్చిన ముప్పు లేదు.

ఎంత గొప్ప భావమైనా మహా అంటే పాతిక పంక్తుల్లో చెప్పివేయవచ్చు. ఎప్పుడోగానీ దీర్ఘకవితలు రాయవలసిన అవసరం కలగదు కవికి. బలవంతపు వమనంలాంటి దీర్ఘకవితలు రాసేవారిలో ఎక్కువమందికి కవిత్వంలో ఓనమాలు తెలియవు. తాళం చెవి లేనప్పుడు బలవంతంగా బద్దలు కొట్టవలసి వస్తుంది తాళాన్ని. కవి అంటే చేతిలో తాళం చెవి ఉన్నవాడు. కావున, తాళం బద్దలు కొట్టకుండానే, నిశ్శబ్దంగా, తలుపులు తెరవగలడు.. అల్పాక్షరాల్లో అనంతార్థాన్ని నిక్షిప్తం చేయగలగడమే కవిత్వం.

~~~~~~ సమాప్తం ~~~~~~~

తామసవిరోధిలో ఉత్సాహంగా పాల్గొన్న కవి మిత్రులకు, సందేహాలను తీరుస్తూ విశ్లేషణలను అందిస్తూ ప్రేరణనిచ్చిన తమ్మినేని యదుకుల భూషణ్, విన్నకోట రవిశంకర్, భైరవభట్ల కామేశ్వర రావు గార్లకు పొద్దు తరఫున ధన్యవాదాలు. ముందుముందు ఇటువంటి సమ్మేళనాల్లో ఇలానే మీరంతా పాలుపంచుకుని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము.

Posted in కవిత్వం | Tagged , | Comments Off on తామస విరోధి – తొమ్మిదవ భాగం

నెరా నెరా నెరబండి

-రానారె

వారందినాలూ మూడుపేసుల కరంటు రాత్రిపూట వదులుతున్నారు. అడ్డపంచె, బనీను, భుజంపై తువ్వాలు, చేతిలో సలాఁకపారతో దారెమ్మట పొలానికి నడుస్తున్నాడు బసిరెడ్డి.

“ఇంకెవరూ దొరకలేదేమో ఈ చెవుటిముండాకొడుక్కు!”, అంటూ రెండున్నర వేలకు మరో ఐదొందలు జోడించి చెవుటోని ముఖాన విసిరికొట్టాడు మేనేజరు.

“ఏమయ్యా అంత కోపం నీకు? యెవ్వని నాయన సొత్తు? అప్పే కదా ఇది? బిచ్చం కాదుగదా?”

ఆ మాటతో మేనేజరు ఉగ్రుడయ్యాడు. మేనేజరు, బసిరెడ్డిల ముఖాల్లో వచ్చిన మార్పులతో అయోమయంలో పడ్డాడు చెవుటోడు. ఒక అడుగు ముందుకు వేసి బసిరెడ్డికి దగ్గరగా నిలబడ్డాడు.

“ఫో ఇక్కణ్ణుంచి!!” చెవుటోణ్ణి భస్మం చేసేలావుంది మేనేజరు చూపు.

పొలం దగ్గరపడుతుండగా కస్సుమని శబ్దం చేస్తూ అగ్గిపుల్ల వెలిగింది. ఆ వెలుగులో అతని ముఖం మెరిసింది. బీడీ ముట్టించి, ఆది ఆరిపోకుండా వెంటనే ఒక దమ్ము పీల్చి, అగ్గిపుల్లను ఆర్పి దారిపక్కన జారవిడిచాడు. వెలుగును చూసిన కండ్లు మళ్లీ మెల్లగా చీకటికి అలవాటుపడుతుండగా గబగబా అడుగులు వేస్తున్నాడు.

ఆ అదును పొద్దుతిరుగుడు కాపు పెద్దపెద్ద పూలతో బాగానే పండింది. గింజలు పాలుపట్టి నిండుగా కనిపిస్తున్నాయి. ఆఖరి తడి కట్టేస్తే కోత మొదలుబెట్టొచ్చు. నేరుగా బాయి కాడికే పోయి, కరెం టొచ్చిందో లేదో చూద్దామని స్టార్టరు బటను నొక్కినాడు. మోటరు గుయ్యీగయ్యీ మన్లా.

కంచెకు ఆవల మనిషి కదిలిన చప్పుడయింది. బసిరెడ్డి అటు చూసేలోగా, “కరంటు రాలేదులే ఇంగా. తొమ్మిదికి ఇంగ రోంత టైమున్నిట్టుండాది” అంటూ కంచెదాటి ఈవలికి వచ్చి నిలబడె చెవుటోడు. ఔనన్నట్టు తల పంకిస్తూ, “ఆఁ! ఇంగా రాలా” అని గట్టిగా అరిచి చెప్పాడు బసిరెడ్డి. ఏమర్థమయ్యిందో యేమో, చెప్పిన మాటే మళ్లీచెప్పాడు చెవుటోడు. తల మాత్రం పంకించి ఊరుకున్నాడు బసిరెడ్డి ఈసారి.

చెవుటోనిది మాలపల్లె. అతని అసలు పేరు నాగయ్య. బసిరెడ్డి మడికి పక్కనే వుండే శంకర్రెడ్డి తోటకు కావలి కాస్తూ అందులోనే చిన్న గుడిసెలో వుంటాడు. ఒకోసారి చెవుటోని భార్యా బిడ్డలూ కూడా పల్లెనుంచి వచ్చి అందులో వుంటారు. చెవుటోనికి పూర్తి చెవుడుగాదు. గట్టిగా అరిస్తే వినిపిస్తుంది. లేదా పెదవుల కదలికనుబట్టి, సైగలను బట్టి అర్థం చేసుకుంటాడు. ఒకోసారి వినిపించినా వినిపించనట్టు నటిస్తాడు -ముఖ్యంగా తానేదైనా పొరబాటు చేసినప్పుడు, ఎవరైనా పనులు పురమాయించ బోయినప్పుడు, తిట్టినప్పుడు, కోప్పడినప్పుడు. ఒకోసారి ఎంత గట్టిగా అరిచినా, పాపం, నిజంగానే వినిపించదు. అయితే చెవుటోడు, చెవుటోని భార్య మాట్లాడుకోవడం చూసినవాళ్లంతా అబ్బురపడక మానరు. కంఠాన్ని ఒక ప్రత్యేకమైన మంద్ర స్థాయిలో శ్రమ లేకుండా పలికిస్తూ ఆమె మాట్లాడుతూ వుంటే చెవుటోనికి చెవుడని నమ్మలేరెవరూ. తన మొగుడు చెవుటోడని ఆమెకెప్పుడూ అనిపించలేదు కాబోలు, ఇతరులతో అతని మాట మాట్లాడేటప్పుడు “మీ నాగడు …” అంటుంది.

బసిరెడ్డికి దగ్గరగా వచ్చి కుడిచెయ్యి చాచీచాచకుండా నిలబడ్డాడు చెవుటోడు. అడ్డపంచె కింద చెడ్డీజేబులో చెయ్యిబెట్టి బీడీకట్టను బైటికితీసి, అందులోంచి ఒక బీడీ లాగి చెవుటోనికిచ్చి, ఒకటి తన పళ్లమధ్య ఇరికించుకొని వెలిగించాడు బసిరెడ్డి. అదే అగ్గిపుల్ల చప్పుడు లేకుండా చేతులు మారి చెవుటోని బీడీనీ వెలిగించింది.

“కరంటొచ్చినిట్టుండాది సూడండి య్యా” అంటూ వచ్చింది చెవుటోని భార్య. బసిరెడ్డి స్టార్టరు బటన్ నొక్కినాడు. మోటరుపంపు తిరగడం మొదలుబెట్టింది. పార చేతబట్టుకొని కాలవ చివరకు నడవబట్టినాడు బసిరెడ్డి.

కాలువ వెంబడి నీళ్లు సాగి వచ్చి, ఎడ దగ్గర మలుపు తిరిగి, పొద్దుతిరుగుడు చెట్ల దోనెల్లోకి విస్తరిస్తున్నాయి. చెవుటోడొచ్చి బసిరెడ్డి చేతిలోని పారను తనచేతికి తీసుకొని ఎడ దగ్గర నిలబడినాడు. “మీ నాగడు కడతాడులేయ్యా” అంది చెవుటోని భార్య.

మొగుడూపెళ్లాలిద్దరూ కంచెదాటి ఈవలికొచ్చి చొరవగా సాయం చేస్తున్నారంటే వాళ్ళేదో అవసరంలో వున్నారని బసిరెడ్డికి అర్థమయింది. అతని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదిప్పుడు. రెండేండ్లకు ముందు కోమటిశెట్టి దగ్గర తీసుకున్న బాకీ ఒకటుంది. ఈసారైనా కట్టమని ఇంటికొచ్చి అడుగుతున్నాడు శెట్టి. అంతో ఇంతో వడ్డీ కడుతూ ఉన్నాడు. ఎవరైనా ఇంటికొచ్చి అరుగుమింద కూర్చుంటే ఇల్లాలు కాఫీ ఇస్తుంది. అది మర్యాద. వసూలు కోసం వచ్చి అరుగుమింద కుచ్చునే శెట్టికి బాకీ బదులు కాఫీ ఇచ్చి, మాటలుచెప్పి సాగనంపాల్సి వస్తున్నదిప్పుడు. ఇదేం మర్యాద? ఎన్నాళ్లురా ఈ బతుకు అనిపిస్తోంది బసిరెడ్డికి.

“పొద్దుతిరుగుడు పంట బాగానే పండింది. గింజ నాణ్యంగానే వచ్చింది. మంచి రేటు కూడా పలుకుతోంది. నలుగురితో కలిసి బళ్లారివైపు చిన్న లారీలో వేసుకొని పోగలిగితే ఇంకా మంచి ధరకే అమ్ముకోవచ్చు. ఈ సొమ్ముతో పెద్దబాకీ ఒకటి సుమారుగా తీర్చేయొచ్చు. ఈసారితో సుమారైన బరువు నెత్తి దిగి పోతాది. మల్లా పంటకు ఎవుర్నైనా అడగాల్సిందే. ఈ చెవుటోనికి యే మవసరముందో! నా దగ్గర ఇప్పుడేమైనా ఆశించడమూ – వట్టిగొడ్డుకు పాలు పిండడమూ ఒకటే” అనుకొంటున్నాడు.

“నువ్వు మడికాడికి వస్చావేమోనని ఈరోజు మద్యానం నుంచి కాపెట్టుకోని వుండాడు య్యా మీ నాగడు. రెడ్డి కనబణ్ణాడా అని నన్ను గుడకా రెండుమూడు మాట్లు అడిగినాడు. ‘ఇయ్యాలప్పుడు యేమిటికొస్సాడు రెడ్డి? ఈ పొద్దు రేతిరికి గదా మోటర్లకు కరంటొచ్చేది’ అన్జెప్తిలే నీను”

‘కతా తానే వేసి, అర్థమూ తానే చెబుతాందీ చెవుటోని పెండ్లాము’ అనిపిస్తోంది బసిరెడ్డికి. చెవుటోడు కాలవలో వంగి పారతో ఎడ మారుస్తున్నాడు.

“యేమిరా విశేషము?” తెచ్చిపెట్టుకున్న కులాసా పలికించినాడు బసిరెడ్డి.

ఎడ మార్చి, పారకు అంటిన బురదను కాలవ నీళ్లతో కడిగి పక్కనున్న ఎడ మీద పెట్టి యడంగా వచ్చి నిలబడినాడు చెవుటోడు.

“నిన్నే! ఏమి సంగతి అని అడుగుతాండాడు రెడ్డి”

“బ్యాంకీలో రోంత పనిబడింది సామీ”

“యేం పనో సరీఁగా రెడ్డికి సెబితే గదా! ల్యాకపోతే ఎట్టతెలుచ్చుందీ?”

“గొర్లూ, మ్యాకలూ కొని మేపుకోమని .. మా యట్టా సన్నాబన్నోళ్లకు గౌర్నమెంటోళ్లు బ్యాంకీలో అప్పులిస్సాండారంట. ఆ అప్పులు తెచ్చుకునేదానికి రేపే ఆకిరీ దినం. రోంత నువ్వుగాన ఆ బ్యాంకీదాఁక వచ్చి నా పేరు రాయిచ్చినావంటె సాలు సామీ”

తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు బసిరెడ్డి. పొద్దుతిరుగుడు పూలు కొయ్యడానికి, గింజలు తీసి ఎండబెట్టి మూటలకెత్తడానికి కూలీలకూ ఇతర ఖర్చులకూ ఆయన దగ్గర డబ్బులేదు. ఊళ్లో అప్పులిచ్చేవాళ్లే గింజలూ కొంటున్నారు.

“శంకర్రెడ్డి వూళ్లో లేడా?”

“లేడు సామీ. వుంటే నీ కీ బరువు పెట్టకపోను”

“సరే, రేషను కార్డు తీసుకొని రేప్పొద్దున్నే ఇంటికి రా”.

* * * * * * * * *

పొద్దుపొద్దున్నే బసిరెడ్డి ఇంటిముందు ప్రత్యక్షమైనాడు చెవుటోడు. బ్యాంకు నుంచి వచ్చేటప్పటికి యే వేళ అవుతుందో యేమో, సద్ది తాగమన్నాడు బసిరెడ్డి. పల్లె నుంచి ఒకటిన్నర మైలు దూరంలోని మండలకేంద్రంలో వుంది బ్యాంకు. దారిలో చెవుటోడు అడక్కుండానే బీడీ ఇచ్చినాడు బసిరెడ్డి.

“యెంత ఇస్తాండారంటా?” చెవుటోని ముఖంలోకి చూస్తూ గట్టిగా అరిచినాడు.

“మూడువేలదాఁక ఇస్తాండారంట” చల్లగా చెవుటోని జవాబు.

“మనకొక ఆరు నూర్లు కావాల్నే!? గింజలమ్మఁగనే ఇస్తా”

” … ”

“ఇనబడిందా?”

“అల్లునికి వెయ్యి బాకీ వుండా. కూతురూ అల్లుడూ వొచ్చి కుచ్చోని తిండాండారు సామీ రెణ్ణెల్లబట్టీ”

“నీ సొమ్ము చాన్నాళ్లు బెట్టుకోను. గింజలమ్మఁగానే ఇస్తా”

“నీకు తెలీందేముండాది సామీ .. గొర్రెపిల్లల రేటు ‘పైన’ పలుకుతాంది”

‘అదీ నిజమే. యెంత చెట్టుకు అంత గాలి.’ దీర్ఘంగా ఆలోచిస్తూ నడుస్తున్నాడు బసిరెడ్డి. బసిరెడ్డి పెట్టిన మెలికతో చెమటలు పడుతున్నాయి చెవుటోనికి. నిముషం తరువాత బసిరెడ్డి గొంతు విప్పాడు, “పది రోజులు ఓపిక బట్టలేవంట్రా?!”
ప్రాధేయపూర్వకంగా వుందా మాట.

“అట్నే కానీలే సామీ”

ఆ తరువాత ఇద్దరికీ మాటల్లేవు. ఎవరి అవసరాల గురించి వాళ్లు ఆలోచిస్తూ నడుస్తూ బ్యాంకు చేరుకున్నారు. మేనేజరు ఇద్దరితోనూ సాదరంగా మాట్లాడి దరఖాస్తు పూరించి సంతకాలు చేయించి పంపించినాడు.

* * * * * * * * *
మూడు దినాల లోపునే, అప్పులు జారీ అయినాయనీ బ్యాంకుకు వచ్చి తీసుకోవలసిందనీ పల్లెలకు విజ్ఞప్తులు అందినాయి.

బసిరెడ్డి తానే చెవుటోణ్ణి తోడుకొని బ్యాంకులో అడుగుపెట్టాడు. బ్యాంకులో అనుకున్నంత రద్దీ లేదు. బసిరెడ్డి బ్యాంకు మేనేజరును దూరం నుంచి పలకరించి, చెవుటోణ్ణి చూపించాడు. మేనేజరు చెయ్యి కొద్దిగా పైకిలేపి చిరునవ్వు నవ్వి, వీళ్ల పని చూడమంటూ పురమాయించాడు. గుమాస్తాల చూట్టూ ఒక ప్రదక్షిణ చేసివచ్చి చివరిగా మళ్లీ మేనేజరు బల్లముందు ఆగారిద్దరూ.

బసిరెడ్డిని చూసి చిరునవ్వు నవ్వుతూ, “నాగయ్యా, ఇదిగోనయ్యా నీ డబ్బు” అని కరెన్సీ కట్టను చెవుటోని ముందుకు తోశాడు. ఆ కట్టను తాను తాకవచ్చునో లేదోనని సంశయిస్తూ బసిరెడ్డిని చూశాడు చెవుటోడు.

బసిరెడ్డి మేనేజరుతో, “మూడువేలు, కదా సార్”?

మేనేజరు చిరునవ్వు చెదరనీయక, “నాగయ్యనే లెక్కపెట్టుకోనివ్వండి”.

కళ్లముందు కొత్త నోట్లు, చిరునవ్వులూ కనిపిస్తున్నా, చెవుటోడు మొహమాట పడుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. మేనేజరు చిద్విలాసం చిందిస్తూనే ఉన్నాడు. బసిరెడ్డి చొరవగా ఆ నోట్లకట్టను తీసుకుని చకచకా లెక్కించాడు.

“ఐదు నూర్లు తక్కువ పడినట్టుంది సార్!!?”

“మీకు తెలీనిదేముంది బసిరెడ్డిగారూ!” అంటూ అరచేతులు చూపించాడు మేనేజరు.

మేనేజరు నవ్వును చూసి బసిరెడ్డి గుండెల్లో రాయిపడింది. వచ్చింది రెండున్నర వేలేనని తెలిస్తే చెవుటోడు ఆరొందలు అరువివ్వడు. జరగాల్సిన సంతకాలు జరిగిపోయాయి. బసిరెడ్డి ముఖంలో ఆందోళనను పసిగట్టిన మేనేజరు లాలనగా అన్నాడు,

“అంతా బ్యాంకువారికే కాదులెండి రెడ్డిగారూ! మీకు తెలీనిదేముందీ!”

‘ఐదొందలు మరీ ఎక్కువ సార్’ అందామనుకుని, ఆగాడు.

“రెడ్డిగారూ, నాగన్నను పంపించి రండి. మనం మాట్లాడుకుందాం.”

“ఏం మాట్లాడుకుందాం?”

“హహ్హ హ్హహ్హ భలేవారండీ! రెడ్డిగారూ, మీకు తెలీనిదేముందీ”

“శాంక్షన్ అయిన మొత్తం మూడువేలు, ఇచ్చేయండి సార్”

“మీరు బయటకెళ్లి కనుక్కోండి. నిన్నటి నుండి ఇప్పటివరకూ రెండు వందల పైగా లోన్లు ఇచ్చాం, అందరికీ ఇంతే. మన చిన్నారెడ్డిగారే ఇప్పించారు అందులో సుమారు సగం పైగా. ఈరోజు మనం కొత్తగా మాట్లాడటం ఏం బాగుంది చెప్పండి రెడ్డిగారూ, మీకు తెలీనిదేముందీ”

చిన్నారెడ్డి బసిరెడ్డికి బంధువు, చిన్నప్పటి నుంచి మిత్రుడు కూడా. చిన్నారెడ్డికి కూడా వాళ్ల నాన్నగారిలాగే రాజకీయాలంటే ఆసక్తి. మెల్లమెల్లగా ఆయన కూడా ప్రజల మనిషిగా మారుతున్నాడు. చిన్నారెడ్డిని పట్టుకుంటే పనులు జరుగుతాయని ప్రజలు అనుకుంటున్నారు. వాళ్లనుకొంటున్నట్టే ‘పనులు’ జరుగుతున్నాయి కూడా.

మేనేజరు మందహాసం స్థిరంగా వుంది. బసిరెడ్డికి ఆ మొహం మీద ఖాండ్రించి వుమ్మాలనిపించింది. కానీ తాను అవసరంలో వున్నాడు. ఇలాంటి రుణాల విషయంలో మామూళ్లు మామూలేనని, అందులో ప్రయోజనాల కోసమే పేదలకు రుణాలిప్పించే భగీరథులు అవతరిస్తారనీ, మళ్లీ ఎన్నికల సమయానికి ఈ రుణాలు చాలావరకు మాఫీ అయి, కొత్త రుణాలు వస్తాయనీ తనకు తెలీనిదేమీ కాదు. కానీ తాను నేరుగా ఇలా భగీరథావతారం ఎత్తడం ఇదే మొదటిసారి.

“ఐదొందలు మీకొక లెక్క కాదు, ఇచ్చేయండి సార్”

“మీరనేది నిజమే రెడ్డి గారూ. కానీ ఇప్పటివరకూ రెండొందలపైగా లోన్లు శాంక్షన్ చేశాం. ఇంకా చాలా చెయ్యాలి. ఒక్కరికోసం రూల్ మార్చడమంటే మనవల్ల ఔతుందా చెప్పండి? మీకు తెలీనిదేముంది. మీరొకసారి చిన్నారెడ్డితో మాట్లాడి రండి.”

ఒక క్లర్కు మేనేజరు కేబిన్ వైపు రాబోయాడు. మేనేజరు చూపుతోనే అతణ్ణి వారించాడు.

“శివునికి ఒళ్లంతా బూడిద. బసిరెడ్డి మామకు ఒళ్లంతా మొండితనం. వస్తా అమ్మా. కరంటొచ్చే టైమయ్యింది.” నవ్వుతూ అరుగు మీదినుంచి లేచి, వీధివైపుగా వెళ్లిపోయాడు చిన్నారెడ్డి. వీధి మలుపులో అతను కనుమరుగయ్యేదాకా అటే చూస్తుండిపోయారు దంపతులిద్దరూ.

“బూడిదంట బూడిద. అందురూ బెదిరించేవాళ్లే!” అంది బసిరెడ్డిభార్య.

“ఒళ్లంతా బూడిదే అయితే మంచిదే. సుమారైన మంట తగిలినా ఒళ్లు కాలదు.” బసిరెడ్డి నవ్వాడు.

“ఇది బ్రోకరు పని. మీరు చెయ్యడమూ బాగలేదు, నన్ను చెయ్యమనడం అంతకన్నా బాగలేదు.”

మేనేజరు ముఖంలో చిరునవ్వు మాయమయింది.

“అంటే చిన్నారెడ్డిని మీరు బ్రోకరంటున్నారా?”

“ఒక్కమాట చెప్పండి, మూడువేలు ఇస్తారా ఇవ్వరా?”

“ఇంకెవరూ దొరకలేదేమో ఈ చెవుటిముండాకొడుక్కు!”, అంటూ రెండున్నర వేలకు మరో ఐదొందలు జోడించి చెవుటోని ముఖాన విసిరికొట్టాడు మేనేజరు.

“ఏమయ్యా అంత కోపం నీకు? యెవ్వని నాయన సొత్తు? అప్పే కదా ఇది? బిచ్చం కాదుగదా?”

ఆ మాటతో మేనేజరు ఉగ్రుడయ్యాడు. మేనేజరు, బసిరెడ్డిల ముఖాల్లో వచ్చిన మార్పులతో అయోమయంలో పడ్డాడు చెవుటోడు. ఒక అడుగు ముందుకు వేసి బసిరెడ్డికి దగ్గరగా నిలబడ్డాడు.

“ఫో ఇక్కణ్ణుంచి!!” చెవుటోణ్ణి భస్మం చేసేలావుంది మేనేజరు చూపు.

బసిరెడ్డిని ఏమీ అనలేక, ఆగ్రహం చల్లారక, అతణ్ని తోడ్కొని వచ్చినందుకు చెవుటోణ్ణి నోటికొచ్చినట్టు తిడుతూ, తన కుర్చీ ఎత్తి విసరబోయాడు.

అంతలో మిగతా బ్యాంకు సిబ్బంది వచ్చి ఆయనను చల్లబరిచి, ఈ గందరగోళానికి చెవుటోడే కారణమని నిందిస్తూ బసిరెడ్డినీ చెవుటోణ్ణీ బయటకు సాగనంపుతున్నారు. బసిరెడ్డిని తోడ్కొని వచ్చినందుకు చెవుటోణ్ణి నిందిస్తున్నాడు మేనేజరు.

* * * * * * * * *
పొద్దుతిరుగుడుగింజలను అమ్మడానికి బళ్లారికి వెళ్లిన వారంతా డబ్బుతో తిరిగివచ్చేశారు – ఒక్క బసిరెడ్డి మాత్రం ఆ తరువాత రెండురోజులైనా ఇల్లు చేరలేదు. పొద్దు గూకింది. బసిరెడ్డి భార్య ముఖం నల్లబడింది. మనసు కీడు శంకించింది. సొమ్ముతో తమ ఇళ్లకు చేరిన రైతులతో బసిరెడ్డి గురించి అప్పటికే ఆమె అడిగింది. బళ్లారిలో తెలిసినవారో దూరపుబంధువులో ఎవరో వున్నారని, వాళ్లను చూడటానికి వెళ్తున్నట్టు తమతో చెప్పాడనీ ఒకరిద్దరు అన్నారు. సొమ్ము చేతిలో పడినాఁక ఇక తమకు కనిపించలేదని కొందరన్నారు. మరి కొందరు తమకు తెలీదన్నారు.

రాత్రి తొమ్మిదయింది. ఆమె అన్నం తినకుండా గడపలో కూర్చొని వుంది. ఆ పల్లెకు ఆఖరిబస్సు రాత్రి పది కావస్తోందనఁగా వస్తుంది. అది వచ్చేసరికి ఊరంతా నిద్రపోయి వుంటుంది. బస్సు చేసే చప్పుడు తమ ఇంటిదాక వినిపిస్తుంది.

పిల్లలిద్దరూ నెల్లూరులో ఒక పేరున్న రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నారు. ఆ ఖర్చు లేకపోతే తమకు అప్పుల సమస్యలు వుండేవి కావు. తలకు మించిన భారం నెత్తికెత్తుకున్నావన్నారొకరు, సూటిగా బసిరెడ్డితోనే. కొడుకును నెల్లూరిలో చదివించి, కూతురును దగ్గర్లోనే గవర్నమెంటు కాలేజీలో చేర్పించమని సలహా ఇచ్చాడొకాయన. నెల్లూరిలో కాలేజీలు బాగలేవు, కర్నాటకలో చేర్పించమన్నాడొక విజ్ఞుడు. వీళ్ళంతా దగ్గరి బంధువులే. ఈ ఉచిత సలహాలన్నీ విన్న పిల్లలు తెల్లమొహాలు వేశారు. బసిరెడ్డి అయోమయంలో పడ్డాడు. అప్పుకోసం ఈ శ్రేయోభిలాషుల దగ్గరకు మాత్రం వెళ్లవద్దన్నది బసిరెడ్డి భార్య. అసలే బసిరెడ్డి చాలా పట్టుదల గల మనిషి. ఆ పట్టుదల గురించే ‘నీ యంత మొండోణ్ణి యాడా చూళ్లే’దంటారు ఆయనతో చనువున్నవాళ్లు, వరసైనవాళ్లూ తమాషాకు. ‘బసిరెడ్డికి రోంత తిక్క’ అని పరోక్షంలో నవ్వుకుంటారనీ ఆమెకు తెలుసు.

ఎప్పటి విషయాలో తలచుకొంటోందామె. తమ గతాన్నీ భవితనూ గుఱించిన ఆలోచనలు కలిగించిన ఆందోళనలో, ఆఖరి బస్సు వచ్చిందో లేదో గమనించలేదు. అంతలో ఆ ఇంటివైపే టార్చిలైటు వేసుకొని వస్తున్నాడొక మనిషి. తమ టార్చిలైటు తమ ఇంట్లోనే వుంది. కళ్లు మిరుమిట్లుగొలుపుతున్న ఆ వెలుగు వెనుక మనిషి ఎవరో పోల్చుకోవడం కష్టంగా వుందామెకు. అది తన భర్తే అయివుండాలని ఎంతగానో కోరుకుందామె. ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయి చూస్తూవుండగానే ఆ మనిషి సమీపానికి వస్తున్నాడు. ఆ నడకను బట్టి, అడుగుల చప్పుడును బట్టి, అవి తన భర్త అడుగులేనని గుర్తించి కళ్లలో నీళ్లు నిండగా లేచి నిలబడింది.

పందిట్లోకి వస్తూ ‘ఇంకా మేలుకోనే వుండావా?’ పలకరింపుగా అన్నాడు బసిరెడ్డి. అతని చేతిసంచిని అందుకొని, పైటచెంగుతో కళ్లొత్తుకుంటూ ఇంట్లోకి దారితీస్తూ, ‘పొంతలో వేణ్ణీలుండాయి తోడిస్తా, పోసుకోని రాపో – తిందాము’ అందామె. మరో మాట మాట్లాడకుండా ఆమెననుసరించాడు బసిరెడ్డి.

కిరసనాయిలు బుడ్డీ వెలుగులో ఇద్దరూ భోంచేస్తున్నారు.

“బళ్లారిలో మాంచి మడక కార్లు, మందపాటి పార, కోతకొడవండ్లూ కనబణ్ణాయి. మనకూ రెండు పట్టకచ్చినా. ఆచారి అని మనకు తెలిసినోళ్లుండార్లే. వాళ్లు తయారుజేసి అమ్ముతా వుంటారు. మంచి నాణ్ణెమైన సరుకులే. వాటితోపాటు మూడు బ్యాట్రీల లైటు కూడా తెచ్చినా. మంచి పవర్ఫుల్ లైటు.”

“ఇంగ రోంత అన్నముండాది పెట్టుకో. చారు గూడా వుండాది”

“ఈ రెండ్రోజులూ యేం జేసినానంటే ఆ మేనేజరుగాని ఘనకార్యమంతా మట్టంగా కాయితం మింద రాసి, కరపత్రం కొట్టిచ్చినా. మొత్తం ఐదునూర్ల కాపీలు. రేపు శనివారం చెవుటోడు నన్నూరు కాపీలు సంతలో పంచుతాడు. ఒక కాపీ మండలాఫీసు బయట గోడకు అంటిస్తాడు. ఒక కాపీ ఎమ్మార్వో ఆఫీసుకు. ఒక కాపీ పోలీస్ స్టేషన్లో ఇస్తా. మిగతావి మన హైస్కూల్లో. సోమవారానికల్లా వాని నాయనకు జ్వరం రావాల.”

“కించిత్తు లమ్డీకొడుకు” మొగునికి జరిగిన అవమానానికి ప్రతీకారం జరగాలన్న కసి తప్ప మరేమీ లే దా మాటలో. ‘ఇదంతా తమ నెత్తికి చుట్టుకుంటాదేమో, దీంతో ఎవురెవురికి కోపాలొస్తాయో యేం పాడో!’ అని భయపడింది. ‘ఆ మిడిమేలపు మేనేజరుతో మాటలు పడి, మళ్లీ బ్యాంకులో ఏదైనా పనిబడితే, ఏమీ జరగనట్టు మళ్లీ మొహం చూపించేదెట్టా?!’ అని మథనపడింది.

బసిరెడ్డికి ఈ ఆలోచనలేమీ పట్టినట్టు లేదు. హాయిగా భోజనం ముగించి లేచాడు. తేలికపడిన మనసుతో ఇంట్లోనుంచి బయటికొచ్చి బీడీ వెలిగించాడాయన. పందిట్లో మంచాలు వాల్చి, వాటిపై పరిచే పరుపులు తేవడానికి ఇంట్లోకెళ్లింది ఆమె.

* * * * * * * * *

శనివారం సాయంత్రం మూడుగంటలు కావస్తోంది. పందిట్లో అరుగుమీద కూర్చొని, విసనకర్రతో విసురుకొంటున్నాడు బసిరెడ్డి. లోపల కాఫీ సిద్ధం చేస్తూవుంది బసిరెడ్డి భార్య. చెఱువు గట్టు నుంచి నీళ్లలోకి జారిపోవాలని ఆత్రపడే కప్ప మాదిరిగా పెద్దపెద్ద అంగలతో నడిచి వస్తున్నాడు చిన్నారెడ్డి. వీధిలో యండ వాలుగా పడుతూ అతని చెంపను పగలగొడుతూవుంది. దూరం నుంచే అతని రాకను గమనించాడు బసిరెడ్డి. పందిటి దాపునకు వచ్చేటప్పటికి, అరుగుమీద జరిగికూర్చొని తువ్వాలుతో ధూళిని విదిల్చి, కూర్చొమ్మంటూ చిన్నారెడ్డికి చోటు చూపించాడు.

“కాఫీ తీస్కో అన్నా!” అంటూ ఇంట్లోనుంచి బయటికొచ్చింది బసిరెడ్డిభార్య.

“బాగుండారామ్మా?”

“బానే వుండాం న్నా” అంటూ, ఇద్దరికీ కాఫీగలాసు అందించిందామె.

“ఈ యండకు కాఫీ తాగితే పానం పోతాదేమో” అంటూనే కాఫీగలాసు అందుకున్నాడు.

“మంచినీళ్లు తెమ్మంటావా న్నా? మజ్జిగుండాది తాగుతావా?”

“వొద్దులేమ్మా! యంత యండలున్న్యా కాఫీ తాగకపోతే నాలిక పీకినట్టుంటాది పాడుది.”

ఒక్క గుక్క కాఫీ తాగి, “ఏం ప్పా ఊళ్లో సమాచారాలు?” అన్నాడు బసిరెడ్డి.

“నీకు తెలీకండా ఏముండాయి మామా!”
వయసులో ఒకటిరెండేండ్లు చిన్నవాడు కావడంతో బసిరెడ్డిని అట్లా వరస కలిపి పిలవడం, చిన్నాచితకా పరాచికాలాడటం చిన్నప్పటి నుంచి అలవాటు.

“…”

కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. కాఫీగలాసులు ఖాళీ అయినాయి. చిన్నారెడ్డి చల్లకొచ్చి ముంతదాస్తున్నాడన్న సంగతి క్షణాలు గడిచేకొద్దీ ప్రస్ఫుటం చేస్తోందా నిశ్శబ్దం. దానికి తోడు యండలో నడక, కాఫీ వేడీ కలిసి చమటలు పట్టిస్తున్నాయతనికి. ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికన్నట్టు, సరసంగా అన్నాడు – “ఏమ్మా, మా మామ మాట్లాడడు?”

“ఏమో నువ్వే అడిగి కనుక్కో న్నా” అందామె నవ్వుతూ.

“ఏం మామా?”

“…”

“పలకడు…?! మామకున్న పంతాలకు నువ్వు కాబట్టి ఓర్పుగా సంసారం సగేసుకొని వస్తాండావు మ్మా. ఇంకో ఆడదయుంటే ఈ పందిరిగుంజకు కట్టేసి, రోజూ ఈ అరుగు మిందనే కూడూ నీళ్లూ పెట్టేది”

“అంతేనంటావ్?”

“అంతగాక?! ఇంత పట్టుదలైతే ఎట్ట? చెవుటోణ్ణి ఏదో అన్న్యాడని మన బ్యాంకి మేనేజరును ఊళ్ళో తలెత్తుకోనీకుండా…”

“మన బ్యాంకి మేనేజరా? నీకు సుట్టమా రా వాడు? మెట్టుతో కొట్టొద్దూ వాణ్ణీ నిన్…”

“మానేజరు మనోడు కాకపోవచ్చు, బ్యాంకి మనదే గదా? చూస్తివామ్మా?! అందుకే మామకు తొందరెక్కువనేది.”

“మీ మామను నేరుగా ఏమీ అనల్యాకనే గదా, ఆ బ్యాంకీవోడు చెవుటోని మిందికి ఒంటికాలిమింద లేసింది?”

“నిజమే తల్లీ. నోటికాడ కూడు తీసేస్తాండామని, కుక్క మాదిరిగా వాడు ఏదో మొరిగినాడు. సరే. దానికి మామ ఏం జేసినాడు? ఎవురికీ తెలీకండా, ఆఖరికి నీక్కూడా తెలీకండా యాణ్ణో బళ్లారిలో మూడ్రోజులుండి ఆ కతంతా ప్రింట్లు కొట్టిచ్చి, చెవుటోనితో సంతలో పంచేదానికి పూనుకున్యాడు. ఎవడో పరాయోడు మనూరికొచ్చి మనల్ని ఒక మాట అన్న్యాడంటే, ఎవురుకి చిన్నతనము? ఉండూరోళ్లము మనకందరికీ కాదా? నాతో ఒక మాట చెప్పింటేనేమి? మామ కాళ్లకాడికి ఈడ్చుకొచ్చి తప్పైపోయిందని ఒప్పించకపోతినా నేను? ఏమి మేమంతా సచ్చినామనుకున్యాడా మామ? ఈ ఊళ్లో బతికి, ఈ ఊళ్ళోనే సచ్చేటోళ్లం మనము. మనకు అవమానం జరిగిందని దండువారికొట్టించి చెబితే మనకే చిన్నతనం. వానికేం బయసినము?”

“నువ్వనేదీ నిజమే అన్నోఁవ్. బ్యాంకీవోడు ఈ ఊరు కాకపోతే ఇంగోవూళ్లో బతుక్కుంటాడు. వానికేమి?”

“చేతిలో కాగితాలకట్టతో చెవుటోణ్ణి చూడఁగానే నాకు అనుమానమొచ్చి సంగతేమిరా అని కనుక్కుంటే, ఇదీ మా మామ పని. ఆ కట్ట తీస్కొని వాణ్ణి ఇంటికి పంపిచ్చినా కాబట్టి సరిపోయింది.”

“ల్యాకపోతే? ల్యాకపోతే ఏమయ్యేదిరా?”

“నీ యంత మొండోణ్ణి ఈ లోకంలో యాడా చూళ్ళ్యా మామా. యట్ట బతుకుతావు మామా ఇట్టైతే!”
సరసమూ సానుభూతీ కలిసున్నాయా మాటలో.

“వాని తరఫున మాట్టాడేదానికొచ్చినావేం వోయ్. వాణ్ణిగాదురా, నిన్ను కొట్టాల మెట్టుతో.” బసిరెడ్డి కూడా నవ్వుతూనే అంటించాడు.

“శివునికి ఒళ్లంతా బూడిద. బసిరెడ్డి మామకు ఒళ్లంతా మొండితనం. వస్తా అమ్మా. కరంటొచ్చే టైమయ్యింది.” నవ్వుతూ అరుగు మీదినుంచి లేచి, వీధివైపుగా వెళ్లిపోయాడు చిన్నారెడ్డి. వీధి మలుపులో అతను కనుమరుగయ్యేదాకా అటే చూస్తుండిపోయారు దంపతులిద్దరూ.

“బూడిదంట బూడిద. అందురూ బెదిరించేవాళ్లే!” అంది బసిరెడ్డిభార్య.

“ఒళ్లంతా బూడిదే అయితే మంచిదే. సుమారైన మంట తగిలినా ఒళ్లు కాలదు.” బసిరెడ్డి నవ్వాడు.

తరువాత కొంత సేపటికి చెవుటోడు వచ్చాడు. “సంతలో రెండు కట్టలు పంచినాఁక, చిన్నారెడ్డొచ్చి మూడోకట్ట …”

తెలుసులే ఫరవాలేదన్నట్టు సైగ జేశాడు బసిరెడ్డి. సోమవారం వచ్చి కొన్ని కరపత్రాలను తీసుకెళ్లి మండలాఫీసు, ఎమ్మార్వో కార్యాలయం, హైస్కూలు, బ్యాంకి బయట గోడలకు అంటించమని చెప్పి పంపించేశాడు.

రాత్రి భోజనమయ్యాక, పనేమీ లేకపోయినా అలవాటుగా పొలానికి వెళ్లాడు బసిరెడ్డి. పొలం మొత్తం దున్నకం పూర్తయింది. తడిమట్టి వాసన కలగలిపి చల్లగా గాలి వీస్తోంది ఆ వెన్నెలరాత్రి. పక్కనున్న తోటలో నుండి పాట వినిపిస్తోంది.

నను రమ్మన్నాది –
నిన్నూ రమ్మన్నాది –
యిద్దరిని రమ్మనీ నిద్దరోతోందో –
నెరా నెరా నెరబండి –
నెరనెర నెర బండీ –
నెరా నెరా నెరబండి
హెయ్‌య్‌య్‌ య్య

మనసులో ఏ అలజడీ లేకుండా హాయిగా గొంతెత్తి పాడుకొంటున్నాడు చెవుటోడు. బసిరెడ్డి ముఖంలో చిరునవ్వు మొలిచింది.

నెల రోజుల తరువాత, బ్యాంకు మేనేజరుకు బదిలీ అయిందని ఊళ్లో తెలిసింది. బసిరెడ్డి ప్రభావమేనన్నారు కొందరు. కాదు చిన్నారెడ్డి చేయించాడన్నాడు మరికొందరు. అండమానుకు బదిలీ చేశారని కొందరూ, అదిలాబాదుకే లెమ్మని కొందరూ అనుకున్నారు. చెవుటోనికి బ్యాంకు లోను మొత్తం అందిన సంగతి ఊరంతా తెలిసింది. తమకూ మరో ఐదొందలు వస్తాయేమో చిన్నారెడ్డిని కనుక్కుందామని సన్నాబన్నావాళ్లంతా కూడబలుక్కున్నారు.

*~*~*~*~సమాప్తం~*~*~*~*

——————-

రానారె పొద్దు సంపాదకవర్గ సభ్యుడు

Posted in కథ | Tagged , , | 10 Comments

“ఒక్కలా”తీతం

— సౌమ్య వి.బి

సముద్రాన్ని చూస్తే నాలో ఏవో అలజడులు, అలల్లాగే చెలరేగిపోతూ, తన్నుకువస్తూ ఉంటాయి.

“నీళ్ళంటే నీకుండే భయంవల్ల అలా అనిపిస్తుంది” అంటుంది అమ్మ. Continue reading

Posted in కథ | Tagged , , , | 10 Comments

2009 ఆగస్టు గడిపై మీమాట

2009 ఆగస్టు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

Posted in గడి | Tagged | 6 Comments

2009 జూలై గడి పరిష్కారాలు – ఫలితాలు

ఈసారి గడి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. మొత్తం పంపిన వారు ఎనిమిది మంది. స్లిప్పుల సర్వీసులో పాల్గొనే వీరులెవరూ పంపకపోవడం అన్యాయం! స్లిప్పులు అందుకొని,అందించే ఉత్సాహం గడి నింపి, పంపడంలో కూడా చూపిస్తే బాగుంటుంది. అన్నీ వస్తేనే పంపించాలని ఏమీ లేదు కదా. Continue reading

Posted in గడి | Tagged | 6 Comments