తామస విరోధి – తొమ్మిదవ భాగం

స్వాతి:

దిగులు దిగులుగా ఉంటుంది
పాత జ్ఞాపకాల ఈదురుగాలి
ఉండుండి సన్నగా కోస్తుంది.

అంటూ చలిపొద్దుని దుప్పటి ముసుగు తీసి చూపించిన రవి శంకర్ గారూ! మరి వసంతోదయాలు ఎలా ఉంటాయో మీ శైలి లో చెప్తారా! నేటి కాలపు కవిత్వం తీరుతెన్నుల్ని విసుగనుకోకుండా విశ్లేషించగల భూషణ్ గారు వచన కవిత ఒకదాన్ని రాసి ఈ సమ్మేళనానికి మరింత నిండుతనాన్ని ఇవ్వాలి.

తమ్మినేని యదుకుల భూషణ్:
వసంతగీతం

వెచ్చని
వసంతాన్ని
మాటలతో
వ్యర్థం
చేయకు.

కాలువ వెంట
చెక్కగేటు పక్క
వింతరంగు పూలు
కొంత సమయం
కేటాయించు

మహావృక్షాల
ఆకులను,
మొదళ్ళను
కదిలించే
సూర్యస్పర్శను

మంచులో
మెత్త బడిన
పూవుల ఆకుల-
సుగంధాన్ని
మోసుకువచ్చే
మలయపవనాన్ని-

కీర్తించు !!

స్నేహితుడా !
గోడగడియారం
చేతులతో
కరచాలనం
చేయకు

నిగూఢారణ్యాలను
బలిష్టపాదాలతో
కలియతిరుగు

గుహాముఖాల్లో
హర్యక్షరవం

ఎండిన
కొమ్మను
పట్టుకు
వేలాడే
ఎలుగు

పథికుడా!
బలంగా-
జీవించు,
మరణించు.

కొంగపాఠం

చిల్లులు పెట్టే చలిగాలి
కొల్లేరుచేరింది సైబీరియాకొంగ
ఇల్లొకటి ఏర్పాటు చేసుకుని,
తల్లిగా మారి తల్లడిల్లింది.

వేపచెట్టు నీడను
చేపఈత జాడను
ఎగరలేని బకాలకు వదిలేసి
వేగం, వెనుదిరిగి పోతుంటే,

ముక్కుపచ్చలారని కొంగలు
రెక్కలొచ్చేదాకా ఆగమంటే,

బక ఉవాచః
“నిగనిగలాడే మీ రెక్కల్లో
గగనాన్ని తాకే సత్తువ!
సగర్వంగా బ్రతకడం,
ఎగరడం ఎవరూ నేర్పలేరు !”

విన్నకోట రవి శంకర్:
అమ్మ నుంచి

అమ్మ కేంద్రం
అందరం వృత్తాలం
పరిధి పెరిగినవాడు
మరింతగా దూరమయ్యాడు

మాతృ భాష
మాతృ భూమి
మనసుపడి చదివిన మాతృ శాఖ
-అమ్మతో పోలికచెప్పిన అన్నిటికీ దూరమయ్యాం.
నిజానికి, జీవితమంటే
-పుట్టుక మొదలు అమ్మనుంచి విడివడుతూ మనిషి చేసే సుదీర్ఘ ప్రయాణం.

ముక్కు తెరిచి, బేలగా
అమ్మ వైపు చూసినప్పటికంటె
తనకు తెలిసిన దిక్కుకి తానెగిరినప్పుడే
రెక్కమీద రంగు మెరుస్తుంది పక్షికి.

తనవంతు పరావర్తిత కాంతిని
వెదుక్కున్న చంద్రునికి
అమ్మ నీడ గ్రహణంగా మారుతుంది.

విశ్వమంతా తన మూలం నుంచి
నిరంతరం విస్తరిస్తుంది

అమ్మ దీపస్థంభం
అందరం ఓడలం
ఎవరి బరువు వారు మోసుకొంటూ
తలో తీరానికి తరలిపోయాం.

నిషిగంధ: భూషణ్ గారు, కవితలోని గాఢత దాని నిడివి పై ఆధారపడి ఉంటుందా? స్పష్టత, క్లుప్తత ఉన్నా కూడా నిడివి ఎక్కువ ఉన్న కవిత అనుభూతిని చివరి వరకూ
ఒకే స్థాయిలో కలుగజేస్తుందంటారా?

భూషణ్: నిడివి విషయంలో నియమాలేమీ లేవు.నిడివిని నిర్ణయించేది
భావం.భావాంతం,పదాంతం ఒకేసారి జరగితే నిడివిలో హెచ్చుతగ్గులు ఉండవు. క్లుప్తతంటే భావాంతం ,పదాంతం వేరు కాకపోవడమే .క్లుప్తత ఉన్నప్పుడు నిడివిలో ఎక్కువతక్కువలు రావడానికి వీల్లేదు… చెప్పవలసిన భావం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుందన్న విషయం చాలా మంది (పెద్ద?) కవులకే తెలియదు. అంటే వారి క్లుప్తతాప్రమాణాలు అధమ స్థాయిలో ఉన్నాయన్నమాట. కొందరు,ఒక్కోసారి ,భావం ముగిశాక కూడా కవితను సాగదీస్తారు. ఈవిధంగా, నిడివి పెరగడానికి కారణం, కవి అసమర్థత కారాదు.నిడివికి తగిన భావసంపద ఉంటే గాఢతకు వచ్చిన ముప్పు లేదు.

ఎంత గొప్ప భావమైనా మహా అంటే పాతిక పంక్తుల్లో చెప్పివేయవచ్చు. ఎప్పుడోగానీ దీర్ఘకవితలు రాయవలసిన అవసరం కలగదు కవికి. బలవంతపు వమనంలాంటి దీర్ఘకవితలు రాసేవారిలో ఎక్కువమందికి కవిత్వంలో ఓనమాలు తెలియవు. తాళం చెవి లేనప్పుడు బలవంతంగా బద్దలు కొట్టవలసి వస్తుంది తాళాన్ని. కవి అంటే చేతిలో తాళం చెవి ఉన్నవాడు. కావున, తాళం బద్దలు కొట్టకుండానే, నిశ్శబ్దంగా, తలుపులు తెరవగలడు.. అల్పాక్షరాల్లో అనంతార్థాన్ని నిక్షిప్తం చేయగలగడమే కవిత్వం.

~~~~~~ సమాప్తం ~~~~~~~

తామసవిరోధిలో ఉత్సాహంగా పాల్గొన్న కవి మిత్రులకు, సందేహాలను తీరుస్తూ విశ్లేషణలను అందిస్తూ ప్రేరణనిచ్చిన తమ్మినేని యదుకుల భూషణ్, విన్నకోట రవిశంకర్, భైరవభట్ల కామేశ్వర రావు గార్లకు పొద్దు తరఫున ధన్యవాదాలు. ముందుముందు ఇటువంటి సమ్మేళనాల్లో ఇలానే మీరంతా పాలుపంచుకుని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.