కేక

-వి.బి.సౌమ్య

“ఓహ్..నో!” దిక్కులదిరేలా వినడ్డదో కేక. అది నోటినుండి వెలువడ్డట్లు లేదు. అరికాలు నుండి మస్తిష్కం దాకా శరీరం లోని ప్రత్యంగమూ గొంతుకను సృష్టించుకుని, అన్ని గొంతుకలూ మౌనాన్ని పెగుల్చుకుంటూ, తమ గొంతు చించుకుని అరిచినట్లు ఉంది. ఆవేదనా, ఆక్రోశం, నిరాశా, నిస్సహాయతా కలగలిసి ఉన్నాయా కేకలో. ఎవరి మీదా చూపించలేని ఆగ్రహానికి గొంతుక కలిగితే ఎలా ఉంటుందో అలా ఉందా కేక. ఎవరి మీదా ప్రయోగించలేని పశుబలాన్నంతా శరీరం ఆ గొంతుకి ఇచ్చినట్లుంది అనిపించింది ఆ కేక నుండి పుట్టిన శబ్దం వింటే.

నిశబ్దంపై ప్రకటించిన యుద్ధంలా ఉందా కేక.

ఆకాశం వైపుకి చూస్తోంది కేక వెలువడ్డ గొంతుక.

అతని చేతులు రెండూ బలంగా తలను పట్టేసి ఉన్నాయి. కాళ్ళు మోకాళ్ళుగా మారి రాతి నేలను తాకాయి. బయటకు వినిపిస్తున్న శబ్ద తరంగమంతా నవనాడులలోనిండి కిందినుండి పైదాకా ప్రవహిస్తూ బైటకు రావడం బహుశా ఎక్స్‌రేకి చిక్కి ఉండేదేమో. అప్పుడు ఆ తరంగాలను బట్టి ఆ కేక గాఢత అర్థమై ఉండేదేమో విన్నవారికి. పలికిన మనిషి సమస్యేమిటో తెలిసేదేమో అప్పుడు.

-ఉలిక్కిపడి లేచాడతడు. ఎక్కడున్నాను?” తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఏదో స్ఫురించింది. అటూ, ఇటూ పరికించి చూశాడు. ఏముందీ! చిక్కటి చీకటి. ఇంకా దుప్పట్లోనే ఉన్న చేతిని బయటకు తీసి, పక్కనే ఉన్న గోడను తడిమాడు. చేతికేదో తగిలింది. నొక్కాడు. బెడ్‍లైటు వెలిగింది. వెంటనే పక్కకు తిరిగి చూశాడు. కాస్త దూరంలో రూమ్మేటు, చలనం లేదు. నిద్రలో ఉన్నట్లే ఉన్నాడు. మళ్ళీ లైట్ ఆపేశాడు. చీకట్లోంచి కళ్ళుమూసుకుని మరో చీకట్లోకి ప్రవేశించడమంటే ఇష్టం అతనికి. అలా కళ్ళు మూసాడే కానీ, ఆ కేక చెవుల్లో హోరత్తుతూ ఉండటంతో కళ్ళు తెరిచాడు. ఆ ఆకారం తానేనని తనకి తెలుసు. తన కేక తనకే మళ్ళీ మళ్ళీ వినిపించడం పిచ్చెక్కేంత ఆశ్చర్యంగా ఉంది అతనికి. ఎక్కడో కలలో ఏదో కొండపై కూలబడి పెట్టిన కేకకు ప్రతిధ్వనులు ఈ చీకటి గదిలో వినబడ్డం ఏమిటి? అయినా కూడా పక్కనే ఉన్న మనిషి నిశ్చింతగా పడుకునే ఉండటం ఏమిటి? అతనికి వినబడ్డం లేదా?

అది తనను మాత్రమే వేధిస్తున్న కేక అని అర్థమవగానే అతని వెన్నులో చలి పుట్టింది. మనసులో భయం మొదలైంది. “నాకేమైంది?” అన్న ప్రశ్న మొదలైంది.

“వాడిని లేపనా?”

“వద్దొద్దు, విషయం ఎలాగూ అర్థమవదు లే”

“అదీ నిజమే, అర్థం చేసుకోలేరు ఎవరూ ఇలాంటివి – అనుభవిస్తే తప్ప”

“మరెందుకు లేపడం?”

“ఏమో..”

“తోడు కోసమా?”

“కావొచ్చు. అంతే అనుకుంటా”

– అతనిలో సంఘర్షణలా జరుగుతున్న ఈ సంభాషణ అతనికి వినిపిస్తూనే ఉంది. “ఏం జరుగుతోంది నాకు? ఆ కేక, కలలోనిది ఇప్పుడిక్కడ వినబడ్డం ఏమిటి? ఈ లోపల సంభాషించుకుంటున్నది ఎవరు? నా ప్రమేయం లేకుండా నాలోకి జొరబడి, నన్నంతా ఆక్రమించుకుని, నా గొంతుక తనదిగా, నా ప్రాణం తనదిగా, నా శరీరమంతా తనదిగా, అసలు నేనంతా తానుగా వాడుకుంటున్నదెవరు?” – ప్రశ్నించుకున్నాడు.

ఎటు చూసినా చీకటి. చీకట్నుంచి చీకట్లోకి, ఒక్కోచీకటినీ దాటుకుంటూ, దారికానక తిరుగుతూ, వెలుతురుకోసం ఎదురుచూస్తూ – ఎంతసేపిలా? అప్పుడోటీ, ఇప్పుడోటీ సన్నని వెలుగురేఖలు తగిలి ఆశగా అటువైపుకెళ్తే, లిప్తపాటులో ముందు నుంచి రయ్యిన అది దూసుకెళ్ళి మరుక్షణం మళ్ళీ అంతా గాఢాందకారమైతే?

అలాగే ఉంది అతని పరిస్థితి ఇప్పుడు. అయోమయంగా అనిపిస్తోంది అంతా. ఓ పక్క పొద్దుట్నుంచీ ఆవిరైన ఓపికంతా అలసటై విజృంభిస్తూ ఉంటే, ఈ ఆలోచనలను మాని, పడుకుందామని కళ్ళు మూశాడు అతడు. ఒక క్షణం అంతటా ప్రశాంతత. చుట్టూ చీకటే అయినా, అది చీకటిని కోరుకుంటున్న సమయమే. కావాలని కళ్ళు మూసుకునే సమయం. పైకి తెలిసేది – నిద్రిస్తున్న శరీరం, చీకటి – అంతే. నిద్ర లోపలి గుట్టు ఎవరికెరుక? నిద్ర తన కథలు చెప్పాలన్నా, మనం నిద్రపోతే ఎలా చెప్పగలదు? ఎవరికి చెప్పగలదు? మనిషి బంధనం నుండి నిద్ర పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు – ఉన్మాదంలో ఉన్న అలలా ముంచుకొచ్చిందొకటి – ఒక్క కుదుపుతో భళ్ళున మెలకువ – పీడకల!

***************************************

నిద్రపట్టక ల్యాప్‍టాప్ తీసి నెట్ కి కనెక్ట్ అయాడు. నయన్ ఎక్స్‍పైర్డ్ – రాఘవ్ మెసేజ్ ఉంది. ఈ వార్త మధ్యాహ్నానికే తనకి తెలిసినా, మరోసారి బాధతో నిట్టూర్చాడు. మధ్యాహ్నమంతా తనలో జరిగిన అలజడి గుర్తు వచ్చింది.

“ఈ కేకకూ ఆ మరణానికీ ఏమన్నా సంబంధం ఉందా?” తనను తానే ప్రశ్నించుకున్నాడు.

కానీ, అదెలా సాధ్యం? నయన్ ఎవరో అసలు తనకేం తెలుసని? నయన్ – రాఘవ్ స్నేహితుడు. రాఘవ్ తన స్నేహితుడు – అంతే. కనీసం తామిద్దరూ ముఖామఖి కూడా చూసుకోలేదు.

మరి ఇపుడు తాను అనుభవిస్తున్నది రాఘవ్ బాధనా? కానీ, ఇది అలా లేదే? ఎంపతీ అయితే, ఇంత ఘాటుగా ఉంటుందా? ఇంత చిత్రవధ చేస్తుందా? అసలు నయన్ మరణానికీ, ఇప్పటి తన ఆలోచనలకీ సంబంధం ఉందా? మధ్యన నయన్ మరణం ఎందుకొచ్చింది?

“కాదు, నాలోని అలజడికి కారణం నయన్ కాదు.” అనుకున్నాడు. కానీ అంతలోనే, నయన్ ఇన్నాళ్ళూ వ్యాధితో ధైర్యంగా పోరాడిన విషయం గుర్తొచ్చింది. రాఘవ అతని గురించి తనకి గొప్పగా చెప్పడం గుర్తొచ్చింది. అప్పుడోసారి ఆర్నెల్ల క్రితం నయన్ కోసం ఇంకో ఇద్దరితో కలిసి తాను రక్తం ఇవ్వడం గుర్తొచ్చింది.

“ఆ రక్త సంబంధం వల్లనా ఈ బాధ?” అనుకున్నాడు. ఆ ఆలోచనకు మళ్ళీ నవ్వుకున్నాడు.

“నాకు ముఖ పరిచయమైనా లేని మనిషి మరణం నన్నెందుకింత కదిలించాలి?” ప్రశ్నించుకున్నాడు.

తన్ను కదిలిస్తున్నది మరణమా? ఆ మనిషి మరణమా? అన్నది కూడా అర్థం కాక కాసేపు అటూ ఇటూ తిరుగుతూ, చివరికి మళ్ళీ మంచం పక్కకొచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు.

“మరణం అన్న పదంలోనే ఏదో ఉంది. ఎక్కడో ఎవరో ఏదో భూకంపంలోనో, మరేదో ప్రకృతి వైపరీత్యంలోనో పోయారని చదివితేనే అయ్యో అనుకుంటాము. పరిచయంలేకున్నా మనమధ్య తిరిగిన మనిషి – కొన్నాళ్ళలో ఆ మనిషి ఉనికి ఈ లోకంలో ఉండదు అన్నది చాన్నాళ్ళుగా తెలిసిన విషయమే అయినా ..”

– అబ్బబ్బా! ఎవరు ఇదంతా మాట్లాడుతున్నది? మళ్ళీ ఎందుకు ఇప్పుడిదంతా? అంతా తెలిసిన విషయమే కదా. ఎవరు ఇదంతా చెబుతున్నది?

అతనికి గొంతు చించుకుని గట్టిగా అరవాలనిపిస్తోంది. కానీ, గొంతు పెగలడం లేదు.

ఇందాక తనంతట తానే పుట్టుకొచ్చింది కేక. ఇప్పుడు, తానే ఆ కేకను వినాలనుకుంటున్నాడు – కానీ, అది బయట పడంటోంది. అంతా దానిష్టమే.

“ఎవరిమీద ఈ కోపం? ఎవరి మీద చూపించలేకపోతున్నాను ఈ కోపాన్ని?” – ప్రశ్నించుకున్నాడు మళ్ళీ.

ఎవరిపైనో…దేనిపైనో… చెప్పలేనంత ద్వేషం కలుగుతోంది. ఎవరిపైన? మనిషిపైనా? మనసుపైనా? జీవితంపైనా? జీవించడం పైనా? మరణం పైనా? మరణించడం పైనా?

************************************************

“వీడెంత హాయిగా పడుకునున్నాడు.. నాకెందుకు నిద్ర పట్టదు? నాకెందుకు ఆ ప్రశాంతత లేదు?”

“కోపం జీవితంపై అనుకుందాం. అసలు నాకేం తక్కువైందని జీవితంపై కోపగించుకోవడానికి? ప్రపంచంలో ఎంతో మందితో పోలిస్తే నేను అదృష్టవంతుణ్ణే కదా.. నాకంటే సంతోషంగా ఉన్న కొద్ది మందిని చూసి ఇలా జీవితాన్ని ద్వేషించనా? మిగితావారితో పోల్చుకుని జీవించడాన్ని ప్రేమించనా? పుట్టాక చావడం తప్పదు కదా – ఈ మాత్రానికి జీవితాన్ని ప్రేమించడం దేనికి? ద్వేషించడం దేనికి?”

“మనిషినా? మనసునా? మరణాన్నా? – దేన్నైనా ప్రేమించడం, ద్వేషించడం దేనికి? నేనే ఎప్పుడో లేకుండా పోయేదానికి?”

“ప్రేమించకు, ద్వేషించకు – ఊరికే అనుభవించు”

“అవి రెండూ అనుభవాలు కావా ఏమిటి?”

“ఆ అనుభవాలు వేరు. ప్రేమించి ప్రేమ పొందకపోతే బాధ. ద్వేషిస్తూ ఉండటం ఒక బాధ. ప్రేమించి ప్రేమించబడటం ఇంకో బాధ. అవి లేకుండా మామూలుగా జీవితాన్ని చూస్తే….”

“అబ్బబ్బా! ఏమిటీ ఆలోచనలు!” – తల పట్టుకున్నాడు మళ్ళీ.

ఆలోచనలు తల్లో కూర్చుని అర్థంకాని రీతిలో నృత్యం చేస్తున్న అనుభూతి కలిగింది అతనికి.

“అయినా, ఇవతలేం జరుగుతోందో తెలీనప్పుడు అది నృత్యమైతే ఏమి? వట్టి కుప్పిగంతులైతే ఏమి? కుప్పిగంతులు అనుకోడంలోనే హాయి ఉంది – దాన్ని వెక్కిరించడానికి ఆస్కారం ఎక్కువుంటుంది.” – లోపలనుంచి నవ్వులు.

ఉలిక్కిపడి లేచాడు. “ఎవరివా నవ్వులు? ఎక్కడివా మాటలు? నన్నిలా చేసి, ఇప్పుడు నన్నిలా చూసి ఆనందిస్తున్నారా? ఎవరు వాళ్ళు? ఎందుకిలా చేస్తున్నారు?” – ప్రశ్నలు, ప్రశ్నలు, ప్రశ్నలు, మళ్ళీ, మళ్ళీ.

“వాట్సప్? ఏంటి ఈ టైం కి? పడుకునేస్తావ్ కదా తొమ్మిదికే…” – చాట్ విండో లో మెసేజ్ బీప్ తో ల్యాప్‌టాప్ వైపుకి తిరిగాడు మళ్ళీ.

“నథింగ్…పడుకోబొతున్నాను…బై” అనేసి మూసేసాడు. ల్యాప్‌టాప్ మూయగానే మళ్ళీ చీకటి.

చావొక్కటేనా నాలో ఈ ఆలోచనలు కలిస్తున్నది? బ్రతుకో? ఏది గొప్ప? ఏది పెద్దది? – బ్రతికినంతసేపు పట్టదు కద చావడం – బ్రతుకే పెద్దది. ఇంత బ్రతకూ బ్రతికి చివరికి చావేకదా… చావే గొప్పది.

బయటేదో కలకలం. దానితో ఆలోచనలకి అడ్డుకట్ట పడ్డది. ఏమిటో చూద్దామని బాల్కనీవైపు కి వెళ్ళాడు.

ఎదురుగా ఉండే స్లం ఏరియాలో ఏదో గొడవ.

“వీళ్ళొకళ్ళు! అస్తమానం ఎవరో ఎవర్నో కొట్టడం… చంపుకోడం…పనీపాటా లేదు…” విసుక్కున్నాడు మనసులో. ఇంతలో తలుపు చప్పుడు.

“ఈ సమయంలో తలుపు కొట్టడమేమిటో! అటుగా వచ్చిన మృత్యుదేవతే నా పని పట్టేందుక్కూడా వచ్చిందా? పోయినవాడి ఆత్మే నా ఇంట్లోకి వస్తోందా?

తను తలుపు తీయలేదు. దబదబా బాదుడు. అతను వెళ్ళి తలుపు తీయబోయాడు.

ఇంతలో సందేహం – తన రూమ్మేటు వైపుకి చూశాడు. అతనిలో చలనం లేదు. అతనెందుకు కదలడం లేదు?

“అంటే – ఆ తలుపు చప్పుడు నాకొక్కడికే వినిపిస్తోందా?” – అతనిలో మొదట అనుమానం, తరువాత భయం.

తలుపు తీసేందుకు ముందుకు వెళ్ళాడు. ఇంతలో చప్పుడు ఆగిపోయింది. అతనికేమీ అర్థం కాలేదు.

“ఏమౌతోంది నాకు? ఈ పీడకలలు, వింత అనుభవాలు – ఏమిటిదంతా? ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాను?”

మళ్ళీ బాల్కనీ దగ్గరేదో గొడవ. అతను మళ్ళీ ఇహలోకాన పడి, వాచీ చూస్కున్నాడు. పన్నెండౌతోంది. పొద్దున్నే త్వరగా వెళ్ళాలన్న విషయం గుర్తొచ్చింది. ఈఆలోచనలు కట్టిపెట్టి పడుకుందాం – అనుకుని, మంచం వైపుకి తిరుగుతూండగా, మళ్ళీ తలుపు చప్పుడు.

రూమ్మేటు కొద్దిగా కదలడం చీకట్లోనైనా తెలిసింది. దానితో ఈసారిది నిజం చప్పుడే అని నిర్థారించుకున్నాడు. కానీ, తీయాలంటే భయం. ఈసమయంలో ఎవరు? ఈరూమ్ లో తామిద్దరే. అయినా, పన్నెండింటికి ఎవరొస్తారు? పోయిన వాడి ఆత్మ – పోలీసులు – దొంగలు – దొరలు – ఎవరు? – క్షణకాలంలో అతనిలో ఎన్నో ప్రశ్నలు. తలుపు చప్పుడు పెద్దదైంది. రూమ్మేటు లేవడేం? అతనిలో కంగారు పెరిగిపోతోంది.

ఒక క్షణం…రెండు క్షణాలు…మూడు..నాలుగు…

ఇంతలో ఫోన్ రింగయింది. ఉలిక్కిపడ్డాడు. ఒక్క రింగ్ కే కట్టయింది. వెళ్ళి ఎవరు చేశారో చూడబోయేంతలో మళ్ళీ తలుపు చప్పుడు.

“వీడు లేవడేం?”

“ఒరేయ్! నీ భయం తగలెయ్యా! నువ్వు లేచి తీస్తావని ఊరుకున్నా కదరా!” -ఉన్నట్లుండి రూమ్మేటు విసుగ్గా లేచి అరిచేసరికి అదిరిపడ్డాడతడు.

“….”

“వెళ్ళి తీయరా…అయినా, ఇంత భయమేమిట్రా నీకూ….”

“భయమా… నీకేం తెల్సురా ఇక్కడ ఎంత టెన్షన్ పుట్టిందో…ఉన్నదానికి తోడు, నీడ్రామా ఒకటి…” చెమట్లు తుడుచుకుంటూ అన్నాడతడు.

“సర్లే….వెళ్ళి తలుపుతీ…నేను లేస్తాను..” అని అతను లేచి, మంచాన్ని తలుపు దగ్గర్నుంచి కొంచెం పక్కకి జరిపాడు.

దానితో, ఇతను వెళ్ళి, తలుపు గొళ్ళెం తీసాడు.

“హ్యాపీ బర్త్ డే టూ యూ సర్!” – ఒక చేతిలో బొకే, ఒక చేతిలో కేక్ తో ఎర్రచొక్కాలో ఎవరో. ఈ పీడకలలతో పుట్టినరోజు సంగతి కొద్దిక్షణాలుగా అతనికి తట్టలేదు. ఉన్నట్లుండి ఇది పంపిందెవరా? అని మొహాన పట్టిన చెమటను తుడుచుకుంటూ, అవాక్కై చూస్తున్నాడితడు. ‘ఫ్రం సంజన విత్ లవ్’ అని బొకేపై కార్డు చూడగానే ఆశ్చర్యం, ఆనందం. బొకే కుర్రాణ్ణి పంపేసి వెనక్కి తిరిగి రూమ్మేటును చూస్తే, అతను పెద్దగా నవ్వుతున్నాడు. “తను నాకు ఫోన్ చేసి చెప్పింది. నువ్వు లేచి తీసేదాకా తలుపు తీయొద్దని కూడా తనే చెప్పింది. అందుకే నేను లేచి తలుపు తీయలేదు…” – అన్నాడు నవ్వుతూనే. తన పీడకలలనూ, స్లం ఏరియా గొడవల చప్పుడునీ, తనని భయపెట్టిన అజ్ఞాత భూతాన్నీ మర్చిపోయాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. సంజన! అతను ఈసారి బాల్కనీలోకి వెళ్ళి సెటిలయ్యాడు. అప్పటికి వాతావరణం, గొడవలూ చల్లబడి ప్రశాంతంగా ఉంది బైట. ఫోన్లోంచి వచ్చే మాటలు ఆ ప్రశాంతతకి ఒక తాజాతనాన్ని ఇచ్చాయి. కొద్ది క్షణాల్లో అక్కడి దృశ్యమే మారిపోయింది. పెదాలపై చిరునవ్వులు. మనస్సులో ఉల్లాసోత్సాహాలు, బోలెడన్ని కబుర్లతోనూ నిండిపోయాడతడు. అతని మనసులోనూ ఇప్పుడు తన పుట్టినరోజన్న విషయం ప్రథమస్థానాన్ని ఆక్రమించింది. ప్రేయసిచ్చిన సర్ ప్రైజ్ -అతనిలోని అలజళ్ళను జయించింది. అతని కేక ఇప్పుడు ఏదో మూలలో నక్కింది. తనని తాను మూగతనానికి అర్పించుకుంది. బహుశా మళ్ళీ ఇలాంటి అవకాశం దొరికడం కోసం పొంచిఉందేమో…

—————–

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కామ్ లో ప్రచురితమయ్యాయి. పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో సౌమ్య ఒకరు.

Posted in కథ | Tagged , | 2 Comments

సాలూరు చినగురువుగారు

పట్రాయని సుధారాణి

సంగీత సాహిత్యరచన చేసి గాత్రజ్ఞులై దానిని గానం చేసేవారు వాగ్గేయకారులు. తెలుగు సాహిత్యచరిత్రలో వాగ్గేయకారులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. క్షేత్రయ్య, అన్నమయ్య వంటివారు శృంగార భక్తిరస ప్రధానములైన రచనలు చేసి, గానం చేయడంలో ప్రసిద్ధులైన వారు. అలాగే జయదేవుడు, నారాయణ తీర్థులు, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి వంటి ఎందరో మహానుభావులు మన సాహిత్యాన్ని, సంగీత శాస్త్రాన్ని ఉత్కృష్టమయిన స్థితిలో నిలిపిన వాగ్గేయకారులు.

పట్రాయని సీతారామశాస్త్రి

ఇరవయ్యవ శతాబ్దపు ఉత్తరార్థానికి చెందిన సంగీత విద్వాంసుడు, రసవద్గాయకుడిగా ప్రజామోదం పొందిన పట్రాయని సీతారామశాస్త్రిగారు అటువంటి వాగ్గేయకారుల కోవకు చెందుతారు.

పట్రాయని సీతారామశాస్త్రిగారిని గొప్ప సంగీత విద్వాంసుడిగా, సాలూరు చినగురువుగారు అనే పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతాలలో చాలామంది ఎరుగుదురు. మధుర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారికి విజయనగరంలో సంగీతవిద్య నేర్పిన గురువుగారిగా మరికొంత మందికి తెలుసు. 2010 సంవత్సరం సీతారామశాస్త్రిగారి 110వ జయంతి సందర్భంగా మే 24వ తేదీన మద్రాసు మ్యూజిక్ అకాడెమీ మినీహాల్ లో శాస్త్రిగారికి స్వరనివాళినర్పిస్తూ జయంత్యుత్సవ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాస్త్రిగారి స్వరరచనలకు ప్రాచుర్యం కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ నేపథ్యంలో సీతారామశాస్త్రిగారికి సంబంధించిన జీవితవిశేషాలను, రచనలను ఈ తరం వారికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ వ్యాసరచన సాగింది.

సీతారామశాస్త్రిగారి జీవన రేఖలు

పట్రాయని సీతారామశాస్త్రిగారు పట్రాయని నరసింహశాస్త్రిగారి కుమారుడు. ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన సాలూరు, విజయనగరం సంస్థానాలలో, ఒరిస్సారాష్ట్రంలోని బరంపురం, పర్లాకిమిడి వంటి ప్రాంతాలలో దాక్షిణాత్య సంగీత విద్వాంసులుగా ప్రసిద్ధి పొందిన పట్రాయని నరసింహశాస్త్రిగారు ‘సాలూరు పెదగురువుగారు’ గాను, పట్రాయని సీతారామశాస్త్రిగారు ‘సాలూరు చిన గురువుగారు’ గాను ఉత్తరాంధ్ర ప్రజల ఆదరాన్ని పొందారు.

సీతారామ శాస్త్రిగారి బాల్యం

పట్రాయని సీతారామశాస్త్రిగారు 1900 సంవత్సరం మార్చి 20న (ఫాల్గుణశుద్ధ విదియ, ఆదివారం) జన్మించారు. అతి చిన్న వయసులోనే మాతృవియోగం కలగడం వల్ల మాతామహుల ఇంటిలోనే పది సంవత్సరాలపాటు పెదతల్లి చెల్లమ్మగారి సంరక్షణలో పెరిగారు.

మాతామహులు మధురాపంతుల కూర్మన్నగారు. మానాపురం దగ్గర గుడివాడ అగ్రహారంలో వ్యవసాయవృత్తి ఆధారంగా జీవిస్తూ ఉండేవారు. సీతారామశాస్త్రిగారిని బాల్యంలో చిట్టిబాబు అని పిలిచేవారుట. తాతగారు కూర్మన్నగారు ఇసుకలో ఓం నమః వ్రాయించి అక్షరాభ్యాసం చేయించారు. బాలరామాయణం కంఠస్థం చేయించారు. అంతకుమించి సీతారామశాస్త్రిగారు ఏ బడిలోనూ చదువుకోలేదు. ఆవులు కాస్తూ, గాలిపాటలు పాడుకుంటూ, తాతగారికి పూజాపునస్కారాలలో సహాయం చేస్తూ పదిసంవత్సరాలు వచ్చేవరకు స్వేచ్ఛామయ జీవితం గడిపారు.

పట్రాయని నరసింహశాస్త్రిగారికి ముగ్గురుపిల్లలు. వారిలో ఒక కుమారుడు, కుమార్తె చనిపోగా మిగిలిన పుత్రుడు, సీతారామశాస్త్రిగారు. కొంతకాలానికే భార్య సూరమ్మగారు కూడా స్వర్గస్థులు కావడం నరసింహశాస్త్రిగారిని తీవ్ర మానసికవేదనకు గురిచేసింది. కుమారుడిని గుడివాడ అగ్రహారంలో మామగారు కూర్మన్నగారి సంరక్షణకు వదిలి దేశాటనం ప్రారంభించారు. అత్యంత శ్రద్ధాసక్తులతో నేర్చుకొని, అప్పటికే ప్రావీణ్యం సంపాదించిన దాక్షిణాత్య సంగీతం ఆయన జీవికకు ఆధారం అయింది. ఒరిస్సాలో జమీందారీ ఆస్థానాలకు చెందిన రాజుల ఆదరణలో చాలాకాలం గడిపారు. ఘనమైన సన్మానాలను అందుకున్నారు. జరడా, పర్లాకిమిడి, చినకిమిడి, ధారాకోట, చీకటికోట ఇంకా అనేక చిన్న చిన్న సంస్థానాలు నరసింహశాస్త్రిగారిని ఆదరించాయి.

పిల్లవాడు తండ్రిదగ్గరే పెరగడం మంచిదన్న అభిప్రాయంతో మాతామహులు పదిసంవత్సరాల వయసుగల సీతారామశాస్త్రిగారిని తండ్రికి అప్పగించారు. నరసింహశాస్త్రిగారు అప్పటికి బరంపురంలో సంగీత శిక్షకులుగా కొంత మానసికంగా, ఆర్థికంగా స్థిరపడ్డారు. బరంపురంలో త్రిపాసూరి ముఖ్యప్రాణరావు, చక్రవర్తిపంతులుగారు వీరిరువురినీ అత్యంత ప్రేమానురాగాలతో ఆదరించారు.

సీతారామశాస్త్రిగారు తండ్రివెంట తిరుగుతూ ఆయన సంగీతం చెప్పుకొనే ఇళ్ళలోని విద్యార్ధులతో పాటుగా సంగీతం నేర్చుకున్నారు. ప్రత్యేకంగా తండ్రిగారు సంగీత శిక్షణ అంటూ ఇవ్వలేదు. తండ్రి చెప్పిన పాఠాలన్నీ వారి విద్యార్థులతో పాటు నిత్యపారాయణ చేసేవారు. సంవత్సరం తిరిగే సరికి సంగీత గ్రంథం కంఠస్థం అయింది. తరువాత స్వయంగా పాఠాలు చెప్పడం ప్రారంభించారు. పన్నెండవ ఏడు వచ్చేసరికి సహజమయిన ప్రతిభా వ్యుత్పత్తుల వలన బాలగురువుగా పేరు సంపాదించుకున్నారు.

బాలుడైన సీతారామశాస్త్రిగారి మీద ఏదో అవ్యాజమైన అనురాగం ఏర్పరచుకున్న ఒక వంటబ్రాహ్మణుడు, నరసింహశాస్త్రిగారికి నచ్చచెప్పి తను పనిచేసే నాళంవారి సత్రానికి తీసుకొని పోయి, తల్లికన్నా ఎక్కువగా సంరక్షించేవాడుట.

బరంపురం మంగళవారప్పేటలోని విద్యార్థి బృందంతో సీతారామశాస్త్రిగారికి అనుబంధం ఉండేది. ఒక దేవాలయంలో ఆ బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలి కచేరి చేసి స్వర్ణ కంకణం అందుకున్నారు.

ఆ రోజుల్లో బరంపురం గొప్పవిద్యాకేంద్రం. గొప్పసాహిత్యవేత్తలు, సంగీత విద్వాంసులకు నిలయం. ఆ వాతావరణంలో ఏ మహాపండితుల, విద్వాంసుల ప్రభావం పడిందో తెలియదుకానీ, పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రత్యేకమైన విద్యాభ్యాసం చేయకపోయినా, స్వయంగా పద్యాలు వ్రాయడం, స్వతంత్రంగా సంగీత రచన చేయడం అలవోకగా అలవడ్డాయి సీతారామశాస్త్రిగారికి.

తండ్రీకొడుకులు ఇద్దరూ ఎవరికి వారే ధనసంపాదన చేసేవారు. ఒరిస్సాలో చాలా జమీందారీలలో తండ్రి, కొడుకు కలిసి కచేరీలు చేసారు. జరడా, చీకటి కోట, చినకిమిడి, పెదకిమిడి వంటి చిన్నచిన్న సంస్థానాలు వీరిరువురినీ సన్మానించాయి. బరంపురం, జయపురం, ధారాకోట, విజయనగరం, తణుకు మొదలైన ప్రదేశాలలో అనేక సంగీత కచేరీలు చేసి ఘనసన్మానాలు, మెడల్స్ అందుకున్నారు.

సాలూరు జీవితం

నరసింహశాస్త్రిగారు, కుమారుడు సంపాదించిన ధనంలో రూపాయికి కాణీ వంతున అతని ఖర్చుకి ఇచ్చి మిగిలినసొమ్మును ఆదా చేసేవారుట. ఆవిధంగా మిగిల్చిన ధనంతో బొబ్బిలి సమీపంలోని ఆనవరం అగ్రహారం దగ్గర కొద్దిగా భూమిని కొన్నారు. వృద్ధురాలైన నరసింహశాస్త్రిగారి తల్లి ఆనవరంలోనే తన కుమార్తె వద్ద ఉండేవారు. ఆమెని చూడడానికి వెళ్లినపుడే సాలూరు, బొబ్బిలి రాజాస్థానాలను దర్శించడం, వారి కోరిక మీద సాలూరులో స్థిరపడడం జరిగింది. సాలూరులో తండ్రీ కొడుకుల సంగీత శిక్షణలో ఎందరో, గొప్ప సంగీత విద్వాంసులుగా రూపుదాల్చారు. అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు ఆదినారాయణరావు నరసింహశాస్త్రిగారి శిష్యులే. సాలూరులో స్థిరపడేనాటికి సీతారామశాస్త్రిగారు నవ యువకులు.

సాలూరు రాజులు సవరలు. సాలూరు, ఒరిస్సా రాష్ట్రంలోని జయపురం ప్రాంతంలో ఉండేది. రాజుల భాష ఒరియా అయినా తెలుగు భాషా సాహిత్యాలమీద సంగీతం మీద చాలా అభిమానం ఆదరణ చూపేవారు. సాలూరు చిన్న సంస్థానమే అయినా కళలను ఎంతగానో ఆదరించింది. సాలూరు అధిపతులలో పదవతరానికి చెందిన లక్ష్మీనరసింహ సన్యాసిరాజు కళలకు మంచి ప్రోత్సాహం ఇచ్చాడు. అతని భార్య కృష్ణపట్ట మహాదేవి కూడా సంగీత కళానిధి. ఈ రాజుగారు సంగీతసాహిత్యాలకే గాక నాటకాలకు కూడా ప్రోత్సాహం ఇచ్చినవారు. అంతేకాక స్వయంగా నాటకాలలో వేషాలు కూడా వేసేవారు. రాజుగారు మంచి మార్దంగికులు కూడా. రాజకుటుంబాలన్నిటి తోటి శాస్త్రిగారికి ఆత్మీయమైన అనుబంధం ఉండేది.

సాలూరు రాజావారికి, సీతారామశాస్త్రిగారికి మంచి స్నేహం. రాజుగారికి నాటకాల సరదా ఉండేది. నాటకం రిహార్సులకు ఒక సమయం అంటూ ఉండేది కాదు. ఆ నాటకాలకు చినగురువుగారు హార్మోనియం వాయిస్తూ ఉండేవారు. వేళాపాళా అంటూలేని ఈ కార్యక్రమాల వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తండ్రి నరసింహశాస్త్రిగారు ఆందోళన పడేవారు. ఆనాటికి ఆయన ఒకయోగిలాగ, సన్యాసి జీవితం గడిపేవారు. సాలూరులో స్థిరపడేనాటికి తండ్రీ కొడుకుల జీవన విధానంలో చీలిక వచ్చింది.

సాలూరులో కళావంతుల కుటుంబాలు ఎక్కువ. అందువల్ల అక్కడ నాట్య, సంగీత శిక్షణకు అవకాశం చాలా ఉండేది. గృహస్తుల కుటుంబాల పిల్లలకు పెదగురువుగారు, భోగంకుటుంబాల ఆడపిల్లలకు చినగురువుగారు సంగీతం చెప్పేవారు. ఏ సంఘటనల ప్రభావమో కానీ కొంతకాలానికి వేశ్యలకు సంగీతం చెప్పనని శపథం చేసుకున్నారట సీతారామశాస్త్రిగారు.

సాలూరులో స్థిరపడిన వెంటనే చినగురువుగారికి కిండాం అగ్రహారానికి చెందిన ఆయపిళ్ల లక్ష్మీనారాయణ గారి కుమార్తె మంగమ్మగారితో వివాహం జరిగింది. స్వేఛ్ఛామయ జీవితం గడుపుతున్న చినగురువుగారికి సంసారబంధం కళ్ళెం వేసింది. మానసికంగా, ఆర్థికంగా జీవితానికి కట్టుబాటు ఏర్పడింది.

జీవనభృతి కోసం పాటుపడుతున్న రోజులలో ఫీల్కానా శివరావు పంతులుగారి ఆహ్వానంపై శ్రీకాకుళంలో నివాసం ఏర్పఱచుకున్నారు. గుడివీధిలో కొంతకాలం, పాలచెట్టువీధిలో కొంతకాలం నివసించారు. అప్పటికి ముగ్గురు మగపిల్లలు సంతానం. పెద్దకుమారుడు సంగీతరావు, రెండవకుమారుడు నారాయణమూర్తి, మూడవకుమారుడు ప్రభాకరరావు. ఆఖరిపిల్లవాడు రెండు సంవత్సరాల వయసులో ఉండగా మంగమ్మగారు స్వర్గస్థులయేరు. అప్పటికి చినగురువుగారికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పునర్వివాహం తలపెట్టలేదు. తల్లిలేని పిల్లలు ఒక్కొక్కరుగా మాతామహుల దగ్గరనుండి సీతారామశాస్త్రిగారి దగ్గరకు చేరారు.

శాస్త్రిగారి తండ్రి నరసింహశాస్త్రిగారు సాలూరులో లూథరిన్ చర్చి వెనక, చిన్న ఇంట్లో ఉండేవారు. సీతారామశాస్త్రిగారు పిల్లలతో పాటుగా తండ్రి వద్దకు వచ్చి సాలూరులో స్థిరపడ్డారు. ఆయన పెదతల్లిగారి కూతురు అయిన నరసమ్మగారు వీరందరి సంరక్షణభారం వహించారు.

దేశాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్న కాలం అది. ప్రజలకు గడ్డు రోజులు. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులులేవు. డబ్బు ఖర్చుచేసి సంగీత కళని సాధన చేసేవారు అప్పటి ఆంధ్ర దేశంలో తక్కువ. అందువల్ల ధనసంపాదనకు సంగీత శిక్షణ ఇవ్వడమో, కచేరీలు చేయడమో తప్ప వేరే మార్గం లేక, దేశాలు పట్టుకుని తిరగవలసి వచ్చింది చినగురువుగారికి. రెండు మూడు మాసాల గ్రాసానికి సరిపడా డబ్బు సంపాదించి సాలూరుకు తిరిగివచ్చేవారు. సాలూరులో ఉన్న సమయంలో విద్యార్థులకు ఉచితంగా సంగీత పాఠాలు చెప్తూ ఉండేవారు.

పెదగురువుగారు నరసింహశాస్త్రిగారు సంగీతాన్ని సంప్రదాయానుసారం ఎంతో క్రమశిక్షణతో నేర్చుకున్నారు. సంప్రదాయానికి ఏ మాత్రం భంగం ఏర్పడినా ఆయన తట్టుకోలేక పోయేవారు. కానీ చినగురువుగారిది సృజనాత్మకమైన స్వతంత్రమార్గం. గానసభలలో దాక్షిణాత్య సంగీత విద్వాంసుల కచేరీలలో గాయకులు పాడిన కీర్తనలు విని, తనకి రానివి ఉంటే తన పద్ధతిలో వాటికి రాగతాళాలతో స్వంతంత్రంగా స్వరరచన చేసేవారు. సంప్రదాయమైన కీర్తనలతో పాటు తన అభిప్రాయాలను వెల్లడించే విధంగా పద్యరచనలు చేసి వాటిని ఎంతో మధురంగా గానం చేస్తూ తన సభలను జనరంజకం చేసేవారు. ఈవిధంగా చినగురువుగారి కచేరీ పద్ధతి జనాకర్షణ కలిగి, ఎంతో ప్రజాదరణకు నోచుకున్నా పెదగురువుగారికి మాత్రం అసంతృప్తి కలిగించేది. సంప్రదాయహాని జరుగుతోందని వ్యాకులపడేవారు. చినగురువుగారు దీన్ని పట్టించుకునేవారు కాదు. తండ్రి మరణించిన తరువాత చినగురువుగారిలో సంప్రదాయం పై కొంత అభిమానం కలిగింది.

సాలూరులోని శ్రీ శారదా గాన పాఠశాల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. నరసింహశాస్త్రిగారు, సీతారామశాస్త్రిగారు కలిసి 1919 లోనే విద్యార్థులకు ఉచితంగా సంగీతబోధ చేయాలనే ఆశయంతో సాలూరులో శ్రీ శారదా గాన పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి, సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. నరసింహశాస్త్రిగారు మరణించాక సీతారామశాస్త్రిగారు పాఠశాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. పూరిల్లులా చుట్టూ వెదురు మణిగింపుతో పర్ణశాల రూపంలో ఉండేది పాఠశాల. రంగారావు పంతులుగారి సహకారంతో పర్ణశాల రూపం నుండి భవనంగా మార్చడానికి ప్రయత్నం చేసారు. కానీ ఆ ప్రయత్నం పునాదులతో ఆగిపోయింది. సీతారామశాస్త్రిగారి అనారోగ్యం వంటి కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. కానీ రెండేళ్ళ తరువాత శాస్త్రిగారు స్వయంగా పూనుకొని కొందరు పురప్రముఖుల సహాయంతో సాలూరు తాలూకాలోని వివిధ గ్రామాలలో పాఠశాల నిమిత్తం కచేరీలు చేసి, సాలూరు ప్రజలు ఇచ్చే అతి చిన్న మొత్తాలను విరాళాలుగా స్వీకరించి పాఠశాలన భవనరూపంలోకి మార్చారు. మొత్తానికి 1936 నాటికి సాలూరు గ్రామస్థుల సహకారంతో, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల అండదండలతో, శాస్త్రిగారి దేశాటనలో వివిధ ప్రాంతాలలో చేసిన కచేరీలతో సంపాదించిన సొమ్ముతో పాఠశాల నిర్మాణం పూర్తయింది.

ఆంధ్రదేశం, ఒరిస్సా ప్రాంతాలనుంచి ఎందరో విద్యార్థులు ఎంతో శ్రద్ధగా సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు. సంగీత విద్యార్థులలో వయోభేదంకాని, జాతి భేదాలు కాని ఉండేవికావు. అనేక వృత్తులకు చెందినవారు విద్యార్థులుగా వచ్చేవారు. పాఠాలకి ప్రత్యేకమైన వేళలు కూడా ఉండేవికావు. ఇలా నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్ధులలో చాలామంది నిర్థనులే. సాలూరు ప్రజలు ఈ విద్యార్థులకు సహాయం చేసేవారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులకు సంగీత పాఠాలు ఉచితంగా చెప్పినా, వారికి భోజన సౌకర్యాలు కల్పించడం చిన గురువుగారికి తలకు మించిన భారం అయేది. సాలూరులో ఉన్న చిన్న ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు కాని ఆధారం కానీ లేవు. గోదావరి, కృష్ణా జిల్లాల ప్రాంతాలలో గురువుగారికి చాలామంది అభిమానులు ఉండేవారు. వివాహాలకు, ఉత్సవాలకు గురువుగారు చేసే కచేరీలే జీవికకు ఆధారం.

జయపురం మహారాజు విక్రమ దేవవర్మ గారు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపేవారు. ఉత్సవాలకు వచ్చే కళాకారులు, కవులు అందరికి సాలూరులోనే మకాం. సాలూరు రాజుగారి సహాయం, పౌరుల సహాయంతో వారందరినీ చినగురువుగారు ఆదరించేవారు. సాలూరుకు వచ్చే హరిదాసులకు కార్యక్రమాలు ఏర్పాటుచేసి, వారికి హార్మోనియంతో పక్క వాయిద్య సహకారం ఇచ్చేవారు.

సాలూరులో శిష్య బృందంతో సీతారామ శాస్త్రిగారు
సాలూరులో శిష్య బృందంతో సీతారామ శాస్త్రిగారు

పాఠశాలను అభివృద్ధి చేయాలని, సంగీత విద్యార్థులకు ఉచిత శిక్షణతో సహా సకల సౌకర్యాలు కల్పించాలని, అనేక మంది పండితులను అధ్యాపకులుగా రప్పించి బోధన చేయాలని, భక్తి, జ్ఞాన వైరాగ్యాల ఆదర్శంలో సంగీత విద్యా ప్రచారం చెయ్యాలని సీతారామశాస్త్రిగారు ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ భగవత్సంకల్పం వేరుగా ఉంది.

ఆర్థికంగా గురువుగారి కుటుంబం పడుతున్న ఇబ్బందులు తెలిసిన ఆయన శిష్యులు విజయనగరం సంగీత కళాశాలలో వోకల్ పండితుడి పదవికి దరఖాస్తు పంపించారు. తరువాత ఆ పదవిని కాదనుకోవడం చినగురువుగారి ఆత్మగౌరవానికి పరీక్షగా తయారయింది. విజయనగరంలో జరిగిన విద్వత్పరీక్షలో నెగ్గి ఆ పదవిని దక్కించుకున్నారు. తాను అమితంగా ప్రేమించిన తన పాఠశాలను, తనను ఆదరించిన సాలూరును వదిలివెళ్ళవలసి వచ్చింది. తన శిష్యులకు పాఠశాలను అప్పగించి విజయనగరం వెళ్లి వోకల్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ప్రవేశించడానికి సాలూరు విడిచి వెళ్లిన సందర్భంలో సాలూరు ప్రజలు శాస్త్రిగారికి ఘనసన్మానం జరిపి అశ్రు నయనాలతో ఆత్మీయమైన వీడ్కోలు పలికారు

Posted in వ్యాసం | 11 Comments

అంతర్జాలంలో తెలుగు నాటిక

శ్రీధర్

అంతర్జాలంలో తెలుగు నాటిక ఇంత వరకు వెలువడలేదనే చెప్పాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రహసనాల రూపంలో వెలువడింది. బహుశా బుక్స్& గాల్స్ బ్లాగులో ఒక రచయిత్రి హాస్య సంభాషణలతో నాటకీయతని ప్రదర్శించారు. అది చూసాక నాకు గంటసేపు రంగస్థలం మీద ప్రదర్శించగలిగే దృశ్యనాటికని అంతర్జాలంలో పెట్టాలని అనిపించింది.

జాలంలోనే ఎందుకు? అంటే వర్తమాన తెలుగు వార, మాస పత్రికలు నాటికల ప్రచురణని పూర్తిగా విరమించాయి గనుక ! మరి ఔత్సాహిక నాటక సమాజాలు స్క్రిప్టు కోసం ఎక్కడికి పోతారు! తమకి తామే వ్రాసుకొంటారా, లేక పాత వాటినే మార్చి, మార్చి వ్రాస్తారా? (ప్రస్తుతం అదే జరుగుతోంది లెండి)

30 ఏళ్ల క్రితం అంటే 1980/1985 మధ్యలో అంద్రప్రభ, ఆంధ్రజ్యోతి నాటిక రచనల పోటీలు నిర్వహించాయి. దురదృష్ట వశాత్తు ఆ పోటీలు సద్వినియోగం కాలేదు. ఎందుకంటే దృశ్యనాటికల పట్ల న్యాయనిర్ణేతలకు సరైన అవగాహనా లోపం వల్ల! మచ్చుకి ఒక ఉదాహరణ ఇస్తాను.

1984లో ఆంధ్రప్రభ బహుమతి ఇచ్చిన ఒక పౌరాణిక నాటిక పేరు, “వియోగ విభావరి”, రామాయణంలోని కథ! కైకేయి కోరికలు విన్న దశరథ మహారాజు పడ్డ వేదన, ఆ పైన రాముణ్ని పిలిచి వనవాసానికి పొమ్మన్న ఘట్టం ! దృశ్యనాటికలో కైకేయి, సీత, మంథర లాంటి మూడు స్త్రీ పాత్రలున్న నాటకాన్ని ఎలా ఎన్నుకొన్నారో తెలియదు. అలాగే చారిత్రిక నాటకం పేరు “మహాప్రస్థానం”—గౌతమ బుద్ధుని గృహత్యాగ ఘట్థం. దీంట్లో కూడా ప్రదర్శనా సౌలభ్యం లేదు.

ఎందుకంటే, దృశ్యనాటికకి ముఖ్యమయిన గుణం ప్రదర్శనా సౌలభ్యం, అది లేకపోతే దాన్నెవరూ ప్రదర్శించరు. ఒక స్త్రీ పాత్ర కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, చాల ఇబ్బందులు ఎదురవతాయి. ముఖ్యంగా నటీమణుల కొరత. ఆ తరువాత, గంటసేపు ఉండే నాటికలలో ఏ పాత్రకీ సరయిన ప్రాతినిధ్యం ఉంఢదు గనుక ! నటనకీ, సంభాషణలకీ మేకప్పుకీ సెట్లకీ (రాజభవనం లాంటి సెట్లు నిర్మించడం కష్టమే కదా) ఖర్చూ శ్రమాను. అందుకే తక్కువ పాత్రలు, హీరో హీరోయిన్ల పాత్రలలో వీలయినంత ఉదాత్తతాచిత్రణ, విలన్ పాత్రలో రాక్షసత్వం, చిన్నచిన్న పాత్రలలో సైతం సంభాషణా చాతుర్యం.. అంటే మాండలికాలు, సామెతలు, ఊతపదాలు లాంటి సామగ్రి తప్పని సరిగా ఉండాలి. కట్ డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులు వాడుక భాషలో గాని యాస భాషలో గాని ఉండాలి. దీర్ఘ సమాసాలు, ఫుల్ స్థాపు లేని పొడవు డైలాగులు, పౌరాణికాలలో సైతం ఉండకూడదు. అందువల్ల పత్రికలు ప్రచురించిన నాటికలు ఆశించిన ఫలితాలు సాధించలేక పోయాయి. ఇంకో రకంగా చెప్పాలంటే పత్రికా రంగం నాటికల విషయంలో సమాజం పట్ల తమ భాధ్యతని నెరవేర్చ లేక పోయాయి.

ఈ రకమైన దృష్టి కోణంతో రచించి, ప్రదర్శించిన ప్రజా నాట్యమండలి (విజయవాడ) వారి నాటికలు రంగస్థలాన్ని అలంకరించి అవార్డులు రివార్డులు సాధించాయి. పావలా, ఉప్పెనొచ్చింది, మద్యంలో మానవుడు, ఒక దీపం వెలిగింది, చీకటి, అన్నమో రామచంద్రా, సమాథుల మీద పునాదులు వాటిలో కొన్ని. అయితే ఆ తరువాత వచ్చినవన్నీ ఒకే రకమయిన ఇతివృత్తాలతో, చిన్న చిన్న మార్పులు చేర్పులతో వ్రాసినదే వ్రాసి, వేసినదే వేసి, నాటక సమాజాలు ప్రేక్షకులని బోరు కొట్టించాయనే చెప్పాలి.

విభిన్నమైన కథతో, ప్రయోగాత్మకమైన నాటికలు వ్రాసి చూపిస్తే, వాటిని దర్శకులు ప్రదర్శనకి ఆమోదించేవారు కాదు. కారణం అవార్డులు రావేమోననే భయం. ఈ విషయంలో తిరిగి తిరిగి, ఎన్నెన్నో చెప్పులు అరగిన అనుభవం ఈ రచయితకు ఉంది.

దానా దీనా పత్రికలు, నాటక సమాజాలు ప్రజలని మోసం చేసాయి, వైవిధ్యభరిత మైన రచనలు రాకుండా చేసాయి.

ఆ తరువాత టి.వి మాధ్యమం వచ్చి, ప్రజలు నాటికల విషయం మరచి పోయారు.

చీకటి చకోరాలు దృశ్యనాటికే అయినా, దీన్లో ఇందులో చాల ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి భాషా పరంగా, ఇందులో పాత్రలు వాడుక భాషలోనే కాక, మాండలిక యాసలోనూ మాట్లాడుతాయి. అలాగే కొన్ని చోట్ల ఒకే డైలాగుని మాటిమాటికి చెప్తాయి. అంతే కాక, నాటకంలో కూడా నాటకమాడుతాయి. అయితే ఈ ప్రయోగాన్ని దర్శకులు, ‘అయోమయం బరంపురం’ లాగ ఉంది, సామాన్య జనాలకి అర్థం కాదేమో ! అని త్రోసిపుచ్చారు. ఏం చేస్తాను! 30 ఏళ్లు మూత పెట్టాను.

మళ్లీ ఇన్నాళ్లకి తెలుగులో బ్లాగు ప్రారంభించాక (నా బ్లాగు పేరు క్షీరగంగ) నా బ్లాగులోనే పెట్టేకన్నా, ఏదైనా వెబ్ పత్రికలో ప్రచురిస్తే బాగుంటుందని పొద్దు సంపాదకులని సంప్రదించాను. మూడు వారాల పరిశీలన తరువాత ఈ నాటిక ప్రచురణకు సిధ్ధమైంది.

ఆ విధంగా మీ ముందుకి వస్తోంది ఈ నాటిక! ఏ రచనకైనా పాఠకుల ఆమోదము, ఆశీర్వాదాలే పరాకాష్ట! పది నంది అవార్డుల పెట్టు! అందుకే ఈ నాటిక పైన మీ విలువైన అభిప్రాయాలని తెలియజేయండి. అంతర్జాలంలో తొలి తెలుగు నాటిక! “చీకటి చకోరాలు“ని మీ పొద్దులో చదివి చెప్పండి.

భవదీయుడు,

ఎ. శ్రీధర్,
క్షిరగంగ బ్లాగు రచయిత

Posted in వ్యాసం | 1 Comment

చీకటి చకోరాలు (రహస్య రోమాంచ ఏకాంక నాటిక)

శ్రీధర్

పాత్రలు : బావ, బావమరిది, స్వామి, ఆమె.
ప్రదర్శన సమయం: ఒక గంట మాత్రమే

(దృశ్యం కోరికలు తీర్చే బాబాగారి సమాధి. సమాధిపైన వేలాడుతూ ఒక గంట! దానిని బయటి నుంచి కూడ మ్రోగించేందుకు వీలుగా ఒక తాడు. వింగ్ వరకు)

(ప్రవేశం బావ, బావమరిది)

బావమరిది: బావా! ఇదే బాబాగారి సమాధి!

బావ: అలాగా! ఏమిటో దీని ప్రఖ్యాతి! Continue reading

Posted in కథ | 5 Comments

2010 మార్చి గడి ఫలితాలు – వివరణలు

-భైరవభట్ల కామేశ్వరరావు

ఈసారి ప్రత్యేకమైన ద్వ్యర్థి గడిని పూరించే ప్రయత్నం చేసిన అందరికీ ముందుగా అభినందనలు. ద్వ్యర్థి భాగం ఏది అన్నది అందరూ సరిగ్గానే గుర్తించారు. అయితే ఆ భాగంలో రెండు సెట్ల సమాధానాలు సరిగ్గా పూరించినవారు ఎవ్వరూ లేరు. మొదటిసారి కదా కష్టంగానే ఉంటుంది!

మొత్తం ఒక సెట్టుని సరిగ్గా పూరించినవారు కోడిహళ్ళి మురళీమోహన్ గారు. వారికి ప్రత్యేక అభినందనలు.

ద్వ్యర్థి భాగం సరిగ్గా పూరించిన (ఒక సెట్టు), మిగతా భాగంలో ఒక చిన్న తప్పుతో పూరించి పంపినవారు శ్రీలుగారు. వీరికికూడా అభినందనలు.

ఇక ద్వ్యర్థి భాగం కాకుండా తక్కిన గడినంతటినీ సరిగా నింపి పంపిన వారి పేర్లు: సుధారాణి పట్రాయని (ద్వ్యర్థి భాగంలో ఒకే ఒక తప్పు), మాచర్ల హనుమంత రావు.

ఒకటి రెండు అచ్చుతప్పులతో పంపినవారు: జ్యోతి, భమిడిపాటి సూర్యలక్ష్మి, వెంకట్ దశిక, శుభ, వేదుల సుభద్ర. గడి పంపిన ఇతరులు భాస్కరనాయుడు, సంచారి, అపరంజి.

పూరణలు పంపిన అందరికీ మరోసారి అభినందనలు.

ద్వ్యర్థి భాగంలోని ఆధారాల గురించి పదాల గురించి కొంచెం వివరించాలి. ద్వ్యర్థి గడిని కూర్చడం నాకిది మొదటిసారి. కాబట్టి బాగానే కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి ఆధారాలు, సమాధానాలు ఏమైనా మీకు నచ్చకపోతే క్షమించెయ్యండి.:-) నేనిచ్చిన ద్వ్యర్థి ఆధారాలని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి – ఇచ్చిన ఆధారానికి ఒకటే అర్థం ఉన్నా, ఆ అర్థానికి సరిపోయే పదాలు రెండుండడం. అయితే ఇవి పర్యాయపదాలు కాకుండా ఉంటేనే బాగుంటుంది. రెండు – ఇచ్చిన ఆధారంలో శ్లేష వల్ల రెండర్థాలు వచ్చి, ఒకో దానికి ఒకో సమాధానం ఉండడం. ఇప్పుడు ఒకో ఆధారం గురించీ వివరిస్తాను.

మధ్యనున్న వంట సామాగ్రి – మధ్య “న” ఉన్న వంట సామాగ్రి. ఇది మొదటి రకం. ఇచ్చిన ఆధారానికి ఒకటే అర్థం. దానికి సరిపోయే పదాలు రెండు. పెనము, బానలి/బాణలి.

పేరుకి పిల్లల పుస్తకమైనా తెలుగువాళ్ళ వేదాంగమే – ఇది కూడా మొదటి రకమే. పేరులో “పిల్లల”కి సంబంధించిన పదం ఉంటుంది. పదంలో వేదాంగం ఉంటుంది. తెలుగువాళ్ళకి ప్రత్యేకమైన పుస్తకం. పెద్దబాలశిక్ష, బాలవ్యాకరణం. రెండిటిలోనూ బాల పదం ఉంది. శిక్ష, వ్యాకరణం రెండూ వేదాంగాలే. రెండూ తెలుగువాళ్ళకి ప్రత్యేకమైన పుస్తకాలే.

అలాగే ఈ క్రింద మూడూ కూడా మొదటి రకానికి చెందిన ఆధారాలు:

తలను పొట్టిచేసినా కుట్టక మానవు – దొమలు, చిమలు.

మన ఉపఖండంలో పాలుపంచుకొనే ఒక ప్రదేశం – నేపాలు, భోపాలు (ఇంపాలని ఒకరు వ్రాసారు. అది “ఇంఫాలు”, వత్తు ప, కాబట్టి సరిపొదు)

పట్టుకుందామంటే పూర్తిగా చేతికందలేదే. వీడు కడు దుర్లభుడు! – చిక్క, దొర. ఇది కూడా మొదటి రకం ఆధారమే. చిక్కడు, దొరకడు ఆధారంగా ఇచ్చిన ఆధారమిది 🙂 కడు దుర్లభులు కదా వాళ్ళు. పూర్తిగా లేరు.

వెనకనుంచి వచ్చిందొక స్టారు – శిరా, రతా. ఇది రెండవ రకం అనుకోవచ్చు. ఇక్కడ “స్టారు” అన్న పదానికి నక్షత్రం, సినీతార అనే రెండర్థాలు.

ఇప్పటిదాకా చెప్పిన ద్వ్యర్థి ఆధారాలన్నీ చాలావరకూ అందరికీ తెలిసిపోయాయి. అసలు పట్టు పట్టినవాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఛాందసమైన దండలు చెల్లాచెదరయ్యాయి – ఇది కూడా కొంతమందికి తెలిసింది. “సరములు”, “మాలికలు” చెల్లాచెదరయ్యాయి. ఇక్కడ కొందరు సరములు బదులు హారములు అనుకున్నారు. కాని అది సరిపోదు. హారములు అంటే దండలే అయినా వాటికి ఛందస్సుతో సంబంధం లేదు! మాలికలంటే ఛందస్సులో ఒకే వృత్తంలో నాలుగుకన్నా ఎక్కువపాదాలు కలిగిన పద్యం. అలాగే సరములంటే ముత్యాల సరములనే ఛందస్సు. ఈ రకంగా ఈ రెండిటికీ చందస్సుతో సంబంధం ఉంది. “ఛాందసమైన” పదం ఇందుకు! ఇది కూడా మొదటి రకానికి చెందిన ఆధారమే. ఇందులో శ్లేష లేదు. వాక్యార్థం ఒకటే. సరిపోయే పదాలు రెండు.

ఈ శునకమ్ము కృష్ణమూర్తే – చాలామందిని ఇబ్బంది పెట్టిన ఆధారం ఇది! అయితే ఆశ్చర్యంగా పొద్దు స్లిప్పుల బ్లాగులో దీనికి సమాధానం ఒకరు చెప్పారు. కాని అందరికీ తెలియలేదు. ఇది రెండవ రకం ఆధారం. అంటే శ్లేషతో ఉన్న వాక్యం. “ఈ శునకమ్ము కృష్ణమూర్తి” అంటే ఒక అర్థం, ఈ కుక్క నల్లని రూపం కలిగినది అని. దీని సమాధానం “నల్లకుక్క”. దీన్ని మరోలా విడగొట్టుకుంటే, “ఈశున కమ్ము కృష్ణమూర్తియే” -> “ఈశునకు అమ్ము కృష్ణమూర్తియే”. అంటే ఈశ్వరుడి బాణం కృష్ణమూర్తే. త్రిపురాసుల సంహారంలో ఈశ్వరుడికి నారాయణుడు బాణమయ్యాడు. అలాంటి నారాయణుడే కృష్ణుడు. వారిద్దరికీ ఉన్న పేరొకటి దీనికి సమాధానం. వచ్చిన మిగతా అక్షరాలబట్టి అది “మురహర”.

ఇది ఆడవాళ్ళకి ఆభరణమన్నది పాతకాలం మాటా? – ఇది రెండవ రకానికి చెందిన ఆధారమనే అనుకోవచ్చు. ఇందులో “ఆభరణం” అంటే మామూలుగా వచ్చే “నగ” అన్న అర్థం ఒకటి. మనిషికి ఉండే మంచి గుణాన్ని “భూషణం”, “అలంకారం” అంటూ ఉంటాం కదా, ఆ అర్థం రెండోది. రెండో అర్థంలో “మానము” అన్నది జవాబు. ఇది కొంతమంది సరిగానే గుర్తించారు. ఎవ్వరూ గుర్తించ లేకపోయింది మొదటి అర్థంలో తీసుకుంటే వచ్చే జవాబు. అంటే ఆడవాళ్ళు పాతకాలంలో వేసుకొనే ఒక నగ. ఇది మిగతా అక్షరాల బట్టి “రశన”. అంటే మొలనూలు. ఇప్పటికీ కొందరు వేసుకుంటారేమో కాని ఇప్పుడది ఫేషన్ కాదు కదా! అందికే “పాతకాలం మాటా?” అని ప్రశ్నార్థకం పెట్టి వదిలేసాను.

జ్యా మధ్యనుండేవి. వీటికి ధర్మాసనమే దిక్కు – ఇది కూడా రెండవ రకానికి చెందిన ఆధారమే. శ్లేష ఉందిందులో. ఒక అర్థంలో అందరికీ జవాబు తెలిసింది – వ్యాజ్యాలు. “జ్యా” అన్న అక్షరం మధ్యలో ఉండి, కోర్టుకి సంబంధించినవి. రెండో అర్థమూ, జవాబు ఎవరికీ తెలియలేదు. “జ్యా” అంటే వింటి నారి. “జ్యా మధ్యనుండేవి” అంటే వింటి నారికి మధ్యలో ఉంటాయి. అలాగే “ధర్మం” అంటే విల్లు అనే అర్థం ఉంది. అంటే విల్లే వీటికి ఆసనం. దీని జవాబు “బాణాలు”. బాణాలు వేసేటప్పుడు వింటి మీద నారికి మధ్యగా పెడతారు కదా! బహుశా అన్నిటికన్నా క్లిష్టమైన ఆధారం ఇదే!

మిగతా ఆధారాలకి వివరణ అవసరం లేదనుకుంటున్నాను.

1పె

2ము

ద్ద

8

9

11బా

ణా

లు

ల్ల

కు

18శి

రా

19చి

క్క

క్ష

22నే

పా

లు

1బా

2 లి

3 భీ

4 మా

5

6కుం

7

8మా

9ము

10ర్జా

ల్స్క్మి

11వ్యా

జ్యా

లు

12నం

13బి

14కి

లా

15రి

16ల్వం

17

18

తా

19దొ

శో

మ్మ

లే

ణం

20హో

తె

21మాం

జా

22భో

పా

లు

దా

23బా

వు

టా

24

25గో

26

27

28తి

29

30

త్కా

31

ము

32

33

యా

ని

ము

34

35

కు

36

రు

37

ము

లు

38ము

క్తి

లం

39తి

40

లి

కి

41గో

42రా

———-

1. మధ్యనున్న వంట సామాగ్రి

3. కుంతీసుత మధ్యముని జీవితానికి భద్రత కావాలా?

5. తెలంగాణా భరతమాత

8. ఇది ఆడవాళ్ళకి ఆభరణమన్నది పాతకాలం మాటా?

10. కుడి యెడమైనా ఆ ఠీవికేం తక్కువలేదు

11. జ్యా మధ్యనుండేవి. వీటికి ధర్మాసనమే దిక్కు

12. విష్ణుభక్తుడే తంబీ

14. పసులకాపరికి లారీతో పనేమిటి?

16. నూరే రాయిని తిరగేసావేం?

18. వెనకనుంచి వచ్చిందొక స్టారు

19. పట్టుకుందామంటే పూర్తిగా చేతికందలేదే. వీడు కడు దుర్లభుడు!

20. ఒక గంటసేపు పులి తోడైతే చాలు మంచి వంటకం తయారవుతుంది

21. పదునైన దారమిప్పుడు రోడ్డు మీదకి షికారుకొచ్చింది

22. మన ఉపఖండంలో పాలుపంచుకొనే ఒక ప్రదేశం

23. చెప్పుల కంపెనీ వాళ్ళు చుట్టూ చేరి ఎగరేస్తారు

27. అలతిగా శ్రుతి మీరితే

29. చేమ కూరలో ఈ కారపు ఘాటు తాపీగా రుచిచూడాలి!

32. సింగపూరు పక్కనుంచి చల్లగాలి వీస్తోంది

34. మహేశ్వరుడి ధ్వంసరచనలో కనిపించే అందమైన నాయిక

35. కడవరకు అవసరం లేదు, కాస్త దగ్గరకు వస్తే చాలు

36. ఈ జన్మ ఉన్నదో లేదో!

37. పలు రసముల నాస్వాదించ లేనివి

38. అజిభీధఫపా విశ్వేసకి స్వాములవారు ఈ కాంతకోసమే తప్పస్సు చేసారా?
39. చేతికిచిక్కిన శత్రువు తల, కాళ్ళు నరికేయండి

40. ఈ యుగపు ఆడది

41. 42 అడ్డానికి opposite

42. 41 అడ్డానికి వ్యతిరేకం. వెరసి శాస్త్రీయమైన సంపాదకుడు

నిలువు

——–

1. పేరుకి పిల్లల పుస్తకమైనా తెలుగువాళ్ళ వేదాంగమే!

2. ఛాందసమైన దండలు చెల్లాచెదరయ్యాయి

4. లా తెలిసిన పిల్లిపిల్ల

6. మల్లెలపూవుని దాచుకున్న బంగారం

7. మంచువారింటి ఆడపడుచు పార్వతి

9. ఈ శునకమ్ము కృష్ణమూర్తే

13. ఆకులైనా తిననావిడ భర్తకి ఇష్టమైన ఆకు

15. చతుర్ముఖునికి పుట్టిన రోగం లులుప్తమైపోయింది

17. దమ్ముంటే ఎత్తుకుపో!

19. తలను పొట్టిచేసినా కుట్టక మానవు

20. 10 అడ్డం లాంటి దానినే నహో!

24. కొండదొరకి అతి చపలత్వం ఎలా వచ్చింది?

25. ఇదిగో ముద్దబంతిలో ఎంత సౌకుమార్యముందో చూడు!

26. తమిళంలో చనువుగా అవుననడానికి చాలా దూరమే వెళ్ళాలి

27. ఆకుతోడిది ఆమ్రేడిస్తే మాతా సుపుత్రులకి సంబరమే సంబరం

28. మిట్టూరోడి పొగరు

30. రసమయభవంతి – రారాజుకి అశాంతి

31. త్వరగా తబ్బిబ్బైతే సమాధానమునరయము

33. పిట్టే, కానీ కాకి కులముది కాదు

Posted in గడి | Tagged | 8 Comments

2010 ఏప్రిల్ గడిపై మీమాట

2010 ఏప్రిల్ గడిపై మీ అభిప్రాయాలను, సూచనలను ఇక్కడ రాయండి.

Posted in గడి | Tagged | 9 Comments

ఓ కథ చచ్చిపోయింది!

పూర్ణిమ తమ్మిరెడ్డి

ఓ కథ చచ్చిపోయింది. ఇదో, ఇప్పుడే, ఇక్కడే, నా సమక్షంలోనే! అంతా నా చేతుల్లోనే ఉందనిపిస్తూ, ఏదో ఒకటి చెయ్యాలని నేననుకుంటూ ఉండగానే చేయిదాటిపోయింది. చచ్చిపోయింది.

వేళ్లకి అంటుకున్న ఇంకు మరకల తడింకా ఆరనేలేదు, మృత్యువు వచ్చి వెళ్లిన వాసనలు మాత్రం గుప్పుమంటున్నాయి. టేబుల్ లాంప్ వెలుతురులో పాలిపోయినట్టు పడున్న తెల్లకాగితాలని సమాధి చేయ్యందే ఆ వాసనలు తగ్గవు. కళ్లు మూసుకునే పనికానివ్వాలనుకున్నాను కాని, కడసారి చూపుల్ని కాదనుకోకని అంతరాత్మ పరిఘోషించింది. నాలో పుట్టింది నా కళ్ళముందు చచ్చిపడుంటే చూసే ధైర్యమూ లేదు. చూడకుండా పనికానిచ్చే రాతిహృదయమూ లేదు. ఒక్కసారి. కేవలం ఒకే ఒక్కసారి కాగితాల వైపు చూడ్డానికి ప్రయత్నించాను. కళ్ళెదుటి దృశ్యం కన్నీటిలో కరుగుతూ పల్చబడేకొద్దీ, లోలోపలి దుఃఖం తీవ్రమైంది. కాగితాలను చేతి వేళ్ళతో తడుముతూ ఉంటే, వాటిపై పడున్న అక్షరాలూ, విరిగిన పదాలూ, పూర్తి కాని వాక్యాలు, కొట్టివేతలూ, దిద్దుబాట్లూ అన్నీ ఒక్కసారిగా గాలిలోకి లేచి నా తల చుట్టూ గిర్రున తిరగటం మొదలెట్టాయి.

“మమల్ని చంపి కథకి అమరత్వం చేకూర్చినా ఇంత బాధ ఉండేది కాదు. కథనే చేయిదాటినిచ్చి మా బతుకు చావుకన్నా దుర్భరం చేశావ్.”అని పాత్రలు ఈసడించుకుంటున్నాయి.

“కథ లేకపోతే మా ఉనికికి అర్థమేంట?”ని పదాలు నిలదీస్తున్నాయి.

ఏమని సమాధానపరచను? ఉద్దేశ్యపూర్వక నేరం కాదు, కేవలం నా అసమర్ధతే అని ఎలా నచ్చజెప్పను? మృత్యువే నయం కదూ, ఈ నిందారోపణలకన్నా! ఒక్క వేటులో కావాలనుకున్నది తీసుకుపోయింది. నా చేతకానితనాన్ని నర్మగర్భంగా దాచుకోగల చెత్తబుట్టలోనే ఈ కాగితాలనూ సమాధి చేశాను. అంత్యక్రియలయిపోయాయి. నేనో కథను రాయబోయానన్న విషయాన్ని మరో ప్రాణికి తెలీనివ్వకుండా ముందే జాగ్రత్తపడ్డం మంచిదయ్యింది. “ఓహ్.. ఎలా జరిగిందిదంతా?” అన్న పరామర్శలకు తావివ్వకూడదనే గబగబా చేతులు కడిగేసుకున్నాను. చెత్తబుట్టను ఖాళీ చేశాను. కథ తాలూకూ ఆనవాళ్లన్నింటినీ దాదాపుగా నాశనం చేసినట్టే, ఒక్క నా జ్ఞాపకాలలో తప్ప. అక్కడ నుండి కూడా తుడిచేయగలిగితే?!

తనది కానిదాన్ని, తనదన్న భ్రాంతిలో సొంతం చేసుకోలేక, విస్మరించలేక మధనపడుతూ, గత్యంతరం లేదని తెల్సిన క్షణాన వదులుకుంటూ, తనలోని కొంత భాగాన్నీ కోల్పోవడమనేది మనిషి బతికుండగానే అనుభవించే నరకం కదూ! కథనీ, దాని మరణాన్నీ మర్చిపోవాలంటే నాలోని కొంత భాగాన్నీ సమాధి చేయగలగాలి.

నేనో ఊహలబాటసారిని. బతికేది భూమ్మీదే! బతకడానికి కావాల్సినవన్నీ నిక్కచ్చిగా చేస్తాను. కమ్మని కలలు కనటానికి ఒళ్ళొంగేదాకా పని చేసి, కడుపు నిండా భోంచేసి, సంగీతాన్ని ఆస్వాదిస్తూనో, కథలని ఆలకిస్తూనో నిద్ర లోకి జారుకోవాలనే అవశ్యకాలు నాకేవీ లేవు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, వీలు కుదుర్చుకొని, గుళ్ళో కెళ్ళే ముందు చెప్పులు వదిలేసినట్టు, వాస్తవికతను వదిలి ఊహా ప్రపంచంలో ప్రవేశిస్తూ ఉంటాను. ఊహించుకోవడంలోని అలౌకికానుభూతిని అనుభవించి మళ్ళీ ప్రాపంచిక విషయాలేవన్నా నన్ను తట్టి లేపినప్పుడు గానీ వాస్తవికతలోకి రాను. అనుభవంలోకొచ్చిన అలౌకికానుభూతిని మానవబుద్ధికి అవగతమయ్యే మాటల్లోనో, రంగుల్లోనో, గమకాల్లోనో తర్జుమా చేసి, ప్రపంచం ముందు ప్రదర్శనకు పెట్టి, ఆమోదముద్ర వేయించుకోడానికి తాపత్రయపడి, ఓ వైపు అహాన్ని పెంచి పోషించుకుంటూనే మరోపక్క నైతికబాధ్యతని భ్రమసి, మోయలేని భారాన్ని నెత్తినేసుకొని, దించుకోలేక, పంచుకోలేక యాతనలు పడ్డం నా వల్ల కాదు. కళాకారుడిగా కన్నా స్వాప్నికుడిగానే నా ఉనికికి గుర్తింపు అనుకున్నాను.

ఓ రోజు, ఊహాంబరంలో విహరిస్తుండగా ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. నన్ను ఆకర్షించింది. ఆకర్షణలు నాకు కొత్త కావు. నా ధ్యాస దాని మీద నిలిచిపోయేసరికి, ఆలోచనకి కొత్తగా రెక్కలు పుట్టుకొచ్చాయి. రెక్కలు ఆడిస్తూ అది చేసే విన్యాసాలు నన్ను కట్టిపడేసాయి. దాని నుండి ధ్యాస మరల్చాలని అనిపించలేదు. ఇంత చనువిచ్చాక, అది మాత్రం ఊరుకుంటుందా? ఏదో ఒక మూల మరుగున పడి సమసిపోవాల్సింది కాస్తా, నా మెదడులోని క్రియాశీలక భాగంలో ప్రవేశించి, ఒక్క చోట ఉండక కుప్పిగంతులేస్తూ ఒక కణం నుండి మరో కణం పైకి దూకింది. ఆలోచన అడుగేసిన ప్రతీ కణం నుండి దాని క్లోన్లు పుట్టుకొచ్చాయి. ఒకటే ఆలోచన, బుర్ర నిండా! ఎన్నో మైళ్ళ ప్రయాణంలో బోలెడు వింతలూ-విశేషాలు చూస్తూ, తనతో పాటు రాగలిగిన ప్రతీదాన్ని లాక్కుంటూ, రాలేనిదాన్ని అక్కడే వదిలివేస్తూ నిరంతరంగా కొనసాగే నా ఆలోచనా స్రవంతికి ఇప్పుడో పెద్ద కొండల సమూహం అడ్డొచ్చినట్టయ్యింది. స్తబ్ధత అలుముకుంటుంది లోలోపల. అలసిందేమో పాపం, మెదడులోని నీటి మడుగుల్లోకి దూకి ఈత కొడుతూ దాని కేరింతలూ. నిద్రలో నాకు కలవరింతలూ.

ఇలా వదిలేస్తే కష్టమని, తలను గట్టిగా విదిల్చాను. దెబ్బకు ఆలోచన బుర్ర నుండి పోయింది. రక్తం ద్వారా నరనరంలోనూ ప్రయాణించింది. నాలోని ప్రత్యణువునూ తాకింది. చుట్టూ చుట్టొచ్చి గుండెలో ఓ మూల ఒదిగ్గా కూర్చుంది. ఆకర్షణలు కొత్త కాకున్నా, పరవశాన్ని నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు. తొలిసారి అనుభవంలో కలిగే ఉత్సుకత, గుండె దడ, అయోమయం ఒక్కోటిగా తెల్సొస్తున్నాయి. ఏదో క్షణాన భయం బలపడింది. గుండెను ఖాళీ చేస్తే నయమనిపించింది. గుండెలోని సంగతులను ఒద్దికిగా పట్టుకోగల పాత్రలు రెండే – ఒకటి మరో గుండె, రెండు కాగితం. పీడకలలో ప్రాణం మీదకొచ్చిందని గొంతు చించుకొని అరుస్తున్నా, పైకి మాత్రం మూల్గుళ్ళే వినిపిస్తాయి! ఒక గుండె, మరో గుండెను అర్థంచేసుకోవాడానికి మూల్గుడులాంటి సంభాషణలే దిక్కు. కథో, ఆత్మకథో కాగితంపై పెట్టగలిగితే అంతకన్నానా?! కానీ, కథంటే మాటలా? కంటికింపుగా అనిపించిన అందాన్ని కళ్ళల్లో నింపుకొని ఊరుకోక, కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న తాపత్రయం వంటిది కథ రాయడమంటే! అదీ కాక, కొన్ని కథలను చెప్పకుండానే వినిపించగలగాలి.

నా ప్రపంచం, నాకు తెల్సిన ప్రపంచం అన్నీ అయ్యి కూర్చున్న ఆలోచనని గుండె నుండి బయటి తరిమేయలేకపోయాను. కొన్నాళ్ళ వరకూ ఉన్న చోటునే ఉంటూ అది పెరుగుతూపోయింది. దాచుకోలేనంతగా. దాయలేనంతగా! గుండె భరించలేనంత భారమైనా మోయడానికి సిద్ధపడ్డాను. విశ్వరూపం దాల్చడంతో ఆగక. గుండెను చీల్చటం మొదలెట్టింది. బలాన్నంతా ఉపయోగించి ఒక్కసారిగా చీల్చటం లేదు. పదునైన సూదితో గుచ్చుతూ రంధ్రాలు చేసి గుండెను చీల్చుతుంది. పంటికింద నొక్కి పెట్టే బాధ కాదది. నా ఉనికినే ప్రశ్నార్థకం చేసేటంతటి బాధ. భరించలేకపోయాను. కాగితాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాను.

కథ రాయాలంటే ఏకాంతం కుదుర్చుకోవాలి నేను. తలుపు మూశాను, నా నుండి ప్రపంచాన్ని వెలివేయడానికి. నేనూ, నాలోని ఆలోచనకి తప్ప అన్యులకి ఆ గదిలో ప్రవేశం లేదు. గదినంతటినీ చీకటి చేసి, టేబుల్ లాంప్‍ని మాత్రమే వెలగనిచ్చాను. కాగితం మీద కలం పెట్టాను. అక్షరాలు, వాటి ఆకారాలు, వాటితో కూడిన మాటలు, మాటల అర్థాలు, విపరీతార్థాలు, నానార్థాలు, అర్థవంతమైన మాటల సమూహాలతో వాక్య నిర్మాణం, గొలుసుని గొలుసుతో ముడివేస్తున్నట్టు వాక్యాలను వాక్యాలతో అల్లిక – ఇవ్వన్నీ నాకు సుపరిచితమే. వీటి మధ్యనే బతుకంతా గడిపాను. గడుపుతున్నాను. ఇప్పుడు మాత్రం చేయి కదలటం లేదు. మాట పుట్టటం లేదు. అక్షరపు ఆకారం స్ఫురణకి రావటం లేదు. తొట్టతొలి నాటక ప్రదర్శన ఇస్తున్నప్పుడు బిర్రబిగుసుకుపోయే నటుడల్లే టేబుల్ లాంప్ వెలుతురులో చేయి కదలటంలేదు. ఆ క్షణాన్న శూన్యం అనుభవంలోకి వచ్చింది.

లోపలి బాధ హెచ్చింది. బయట శూన్యం బలపడింది. భాషాజ్ఞానం నిక్షిప్తమైన చోటకి వెళ్ళలేకపోతున్నాను. మెదడు సహకరించటం లేదు. ఏదోఒకటి రాయాలి. చేయి కదలాలి. మాటల కోసం నన్ను నేను మధించుకోవాలి. పొట్టలో అక్షరం ముక్కలుంటాయా? ప్రయత్నించాలి. కడుపులో చేయి పెట్టి దేవాల్సివచ్చింది. ఇంకా అక్షరం దొరకలేదు. మరింతగా ప్రయత్నించాను. సన్నని ప్లాస్టిక్ ట్యూబుని చూపుడు-బొటనవేళ్ళతో గట్టిగా పిండినట్టు పేగుల్ని పిండాను. నరనరంలోని రక్తం కాసేపు ఆగి, ఒక్కసారిగా పోట్టెత్తింది. తల పగిలిపోతోంది. బిగిసుకుపోయిన మెదడు నరాలు మెల్లిమెల్లిగా వదులయ్యాయి. భాషకి ద్వారాలు తెరిచాయి. అక్షరాలు, మాటలు, వాక్యాలు, వాక్యాలు నిర్మించాల్సిన ఊహాచిత్రం అన్నీ ఒక దాని వెనుక ఒకటి కాగితం మీద పడ్డాయి, గాయం నుండి కారుతున్న రక్తపు చుక్కాల్లా. కొన్ని పాత్రలను పుట్టించి, వాటికేవో పరిస్థితులు కల్పించి – కథ మొదలయ్యింది.

ఇక ఆలోచన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా కథలో నిల్పాలన్న తరుణంలో ఆలోచన తుర్రుమని ఎగిరిపోయింది. నాతో ఏ సంబంధమూ లేనట్టు. నాది కాదన్నట్టు. దాని వెంట పరిగెత్తబోయాను. వాస్తవికత కాళ్ళకి అడ్డం తగిలి కిందపడ్డాను. దేని కోసం అయితే ఇంతటి భారం తలకెత్తుకున్నానో అదే పోయాక కథ దేనికి? మొదలెట్టిన కథనేం చెయ్యాలి? ఆసరికే ఊపిరి ఆడక, ఊపిరి ఆగక కొట్టుకుంటున్న కథని చూస్తూ ఊరికే ఉండలేక, చేతుల్లోకి తీసుకొని, దాని సంపూర్ణ పోషణభారం తీసుకున్న వేళ, దాని కోసం తల బద్దలైపోతున్నా మాటలను మధిస్తుంటే.. అదో అప్పుడే, ఏదో క్షణాన కథ చచ్చిపోయింది, చిటుక్కున! నా చేతుల్లోనే, నేను చూస్తూ ఉండగానే!

మర్చిపోవాలనుకుంటూనే చనిపోయిన కథ గురించిన కథ చెప్పుకొచ్చాను. మర్చిపోవడానికి ప్రయత్నించటమంటే సముద్రపు ఒడ్డున నత్తగుల్లలన్నీ ఏరి, దారానికేసి కట్టి, ఆ దండను సముద్రంలోకి విసిరేయడం. ఎప్పుడో ఏదో ఒక అల మళ్లీ వాటిని తీరానికి చేర్చుతూనే ఉంటుంది. చనిపోయిన కథకీ కథ అల్లగలిగానే అని నవ్వువస్తోందిప్పుడు, కథే మిగిల్లేదన్న బాధను వెంటేసుకొని. అసలు దీనికి ఆయుష్షు తక్కువని ముందే గ్రహించగలిగాను. గ్రహించీ ఆరాటపడ్డాను, క్షణికమైనా బంధం కోసం పరితపించాను. బతికించుకోలేకపోయిన అసమర్థతను పదే పదే గుర్తుతెస్తూ, అంతరాత్మ ఘోషిస్తూనే వుంది, “ఒక కథ చచ్చిపోయింది” అని.

— పూర్ణిమ తమ్మిరెడ్డి, హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని

Posted in కథ | 14 Comments

వైశాఖ పూర్ణిమ

మేధ

చిలకపలుకులు అంటూ మొదలుపెట్టి, చెత్తకుండీకి ఓ మనసుంటే అని ఆలోచింపచేసి, అంతలోనే అల్లరా-నేనా! అంటూ గొడవ చేసి, శ్రీవారే బదులిస్తే అంటూ మధురోహల్లో ఓలలాడించి, సూసైడ్ నోట్ అంటూ కంగారుపెట్టి…నెలపొడుపుగా ఉన్నా అక్షరాల్ని నిండుపున్నమిగా చేయడమే అంటూ తన ఊసులన్నింటినీ మనకి అందించిన పూర్ణిమకి పరిచయం అనవసరం!! తన గురించిన మరికొన్ని ఊసులు-ఊహలు…

1. పుస్తకాలతో మీ పరిచయం ఎలా మొదలయ్యింది.. మీ కుటుంబ నేపధ్యం, మీరు చదివిన స్కూల్, మీ స్నేహితులు, టీచర్స్ ఏమైనా తోడ్పడ్డాయా..?

ఎ.బి.సి.డీలు నేర్పడానికి మా వాళ్ళు నాకో పుస్తకం తెచ్చారు. అది పుస్తకంతో నా తొలి పరిచయం. “నా పుస్తకం” భావన భలే గమ్మత్తుగా ఉండేది, తొలి పేజీలో నా పేరు (తప్పు స్పెల్లింగ్ తో, నా పేరు సరిగ్గా రాయడం నాకు చాన్నాళ్ళు చేత కాలేదు) రాసుకోవటం ఓ సంబరం. నేను ఉద్యోగంలో చేరిన ఏడాది వరకూ కూడా, నా పుస్తకాలూ అంటే పాఠ్య పుస్తకాలే. మా ఇంట్లో ఎవరూ అంతగా పుస్తకాలు చదవరు. మా అమ్మకి తెలుగు నవలలు, అప్పట్లో వచ్చిన తెలుగు-హిందీ సినిమాలూ, ఫుట్ బాల్, క్రికెట్ అంటే చాలా క్రేజ్. తన నుండి నాకు క్రికెట్ క్రేజ్ ఒక్కటే వచ్చింది. మా ఇంటి చుట్టుపక్కల లైబ్రరీల లాంటివేం ఉండేవి కావు. చిన్నప్పటి స్నేహితులు పుస్తకాలంటే ఆమడ దూరం పరిగెత్తేవాళ్ళే! ఇప్పటికీ నా స్నేహితుల్లో అత్యధిక భాగం పుస్తకాలంటే ’అమ్మో’ అనే అంటారు. స్కూల్ లైబ్రరీ పెద్ద పేరున్నది కాకపోయినా, ఉన్నవాటినే చదివేదాన్ని. అడపాదడపా డిబేట్, వ్యాసరచన పోటీల్లో బహుమతులుగా వచ్చిన పుస్తకాలే. శ్రీశ్రీ మహాప్రస్థానం అలానే వచ్చింది.

పుస్తకాలు దొరకపుచ్చుకునే అవకాశం లేకున్నా, చదవాలనే ఆసక్తి చాలా ఉండేది. చిత్తుకాగితాలనూ చదివాకే పడేసేదాన్ని. టీచర్స్ ప్రభావం అంటే, నాకు మా తెలుగు టీచర్, శ్రీమతి ఇందిర గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ మాకు పాఠ్యాంశాలు ఎంత బాగా చెప్పేవారంటే, తెలుగు చదవడం అన్నా, రాయడమన్నా నాకు innate అనిపించేంత. (తెలుగులో బాగా రాయలేకపోవడమనేది నా దురదృష్టమనుకుంటా!)

ఉద్యోగంలో ఓ ఏడాదో ఏడాదిన్నరో గడిచాక, నా మేనేజర్ నన్ను పిల్చి, “ఉద్యోగమే జీవితమనేలా ఉంటే కష్టం. ఇది ఈ రోజు నీకు నచ్చుతుంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నావ్. రేపు ఇష్టం లేకపోయినా పని చేయాల్సి వస్తుంది. అప్పుడు దీని మీద విరక్తి రావచ్చు. అందుకని ఉద్యోగమే కాక, వేరే ఏదైనా వ్యాపకం ఉండాలి” అని అన్నారు. ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. అందుకే బ్లాగ్ మొదలెట్టాను. బ్లాగ్ మొదలెట్టటం వల్ల, నా రాతలు ఎంత మెరుగుపడ్డాయో ఏమో కాని, నా పఠనం వెయ్యి రెట్లు మెరుగుపడింది. “నీకా రచయిత తెలీదా, ఉరి తీస్తా!”, “ఆ పుస్తకం తెలీదనకు, మేడ మీద నుండి తోసేస్తా” అని విసుక్కున్నా నాకు కొత్త రచయితలనీ, పుస్తకాలనీ పరిచయం చేస్తూనే ఉంటారు (బ్లాగర్) ఫ్రెండ్స్. ఇహ, నేనెంత విసిగించినా, ఓపిగ్గా నా స్థాయికి వంగి అక్షరాలు దిద్దించినట్టు, సాహిత్యపు విశేషాలు చెప్పుకొచ్చిన స్నేహితులూ ఉన్నారు. ఏవో మాటల మధ్య ఏదైనా పుస్తకాన్ని ప్రస్తావిస్తే, కొన్నాళ్లకి “మొన్న దీని గురించి మాట్లాడుకున్నాం కదా, నీకోసమే పుస్తకం” అని చెప్పి ఇచ్చే స్నేహితులు కూడా. అందరూ బ్లాగ్స్ ద్వారా పరిచయం అయ్యినవారే. నా బ్లాగు మూసేసినా, వాళ్లు బ్లాగులు ఉన్నా, లేకున్నా మంచి స్నేహితులుగా మిగిలాం.

ఇంత చెప్పుకొచ్చింది ఎందుకంటే, I’m immensely thankful to the Telugu blog-o-sphere and people in it, which has helped me better myself over the past few years. బ్లాగుల వల్ల చేదు అనుభవాలు కలిగినా, వాటి వల్ల నాకు జరిగిన మేలుని విస్మరించలేము.

2. ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతారు? అప్పటికి, ఇప్పటికి ఎప్పటికి నచ్చే పుస్తకం(లు)

నాకు మాయ చేసి, మభ్య పెట్టి, మాజిక్ కార్పెట్ మీద మరో ప్రపంచానికి తీసుకుపోయే రచనలు ఎప్పుడూ నచ్చవు. నాకు ఈ ప్రపంచమే కావాలి పుస్తకాల్లో కూడా, మనుషులే ఉండాలి వాటిలోనూ. జీవితం కావాలి. మరణం కావాలి. వాటి మధ్య అనేకానేకమైన సంఘర్షణలే కావాలి. జీవితం – with all its terms and conditions – నాకిష్టం. దానితో నా అనుబంధాన్ని పెంచే రచనలే కావాలి. అలా అని దాన్ని glorify చేసేవే కావాలని కాదు. బైరాగి అన్నట్లు “జీవితమొక వ్యర్థ వినోదం – జీవితమొక క్షణికోన్మాదం” లాంటి రచనలు కూడా. గాయం మాన్పేవి కాదు. గాయాల్ని అలవాటు చేసే పుస్తకాలు ఇష్టం. ప్రపంచం గాయపరిస్తే పుస్తకాల్లో తలదాచుకోవటం నాకు చేత కాదు. జీవితంలో లేని దేన్నో పుస్తకాల్లో వెతుక్కోవటం అంతకన్నా రాదు.

సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి విలన్లుగా ఉండే పాత తెలుగు సినిమాల్లో, విలన్లు ఉండే నివాసంలో ఒక స్విచ్ నొక్కగానే, అప్పటి దాకా అరలా కనిపించినది, తలుపులా తెరుచుకొని, కొత్త దారులని చూపిస్తాయే.. అలానే ప్రతి మనిషిలో కూడా ఉంటాయనుకుంటాను. మనకి తెలీని మనలోని ద్వారాలను తెరవడానికి కావాల్సిన స్విచ్‍లు పుస్తకాలని నా నమ్మకం.

అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నచ్చేవి ఇలాంటి రచనలే – నన్ను మెరుగుపరిచేవి.

3. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో, అలవాట్లలో పుస్తకాల పాత్ర ఉంటుందనుకుంటున్నారా? ఉంటే ఎలాంటి పాత్ర, మీ పై ఎలాంటి ప్రభావం ఉంది..?

ఇప్పుడు నా లాప్‍టాప్ లో చాలా ఈ-బుక్స్ ఉన్నాయి. నా గదిలో అరల్లో పుస్తకాలున్నాయి. వాటిని చదివితే నా మెదడులో కూడా డంప్స్ ఏర్పడతాయి. కాని మెదడులో ఉన్న ఆ ఇన్ఫోతో నేనేం చేస్తున్నా అన్నదాని బట్టే నాలో, నా వ్యక్తిత్వంలోనూ మార్పులు వచ్చినా, రాకున్నా. పుస్తకాలు చదవటం వల్ల మాత్రమే ఎవరూ గొప్పవారు కాలేరు. పుస్తకాలు చదవరని ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు. ఎన్ని పుస్తకాలు చదివుంటే అంత గొప్ప అనేది కూడా నేను ఒప్పుకోను. కొందరికి వాటి అవసరం ఉండకపోవచ్చు.

పుస్తకాలు చదవటం, ఆటలు ఆడ్డం లాంటివన్నీ వ్యక్తిత్వ వికాసాలే! కాని అంత మాత్రాన, వాటి వల్లే వాళ్లు మహావ్యక్తులు అవుతారని నాకు నమ్మకం లేదు.

నా విషయంలో ఏమవుతుందంటే, నాకు కబుర్లు వినడం ఇష్టం. మన జీవితంలో కలిసే మనుషులు Time and space limited కాబట్టి, గతించిన కాలంలోని వాళ్ళేమనుకున్నారో, ఏం చేసారో నాకు తెల్సుకోవాలని ఉంది కాబట్టి నేను పుస్తకాలు చదువుతున్నాను. కొందరు ఈ విశేషాలను కబుర్లుగా చెప్తారు, ఇంకొందరు రసవత్తరమైన కథలుగా చెప్తారు. నాకు అవీ-ఇవీ రెండూ ఇష్టమే.

4. మొదటినుండి ఉన్న నిశ్చితాభిప్రాయాలు పుస్తకాలు చదవడం వల్ల సమూలంగా మారిపోయిన సంగతులు-సందర్భాలు

నిశ్చితాభిప్రాయాలు మారడం.. హమ్మ్! ఉన్నాయ్! నిజం ఒప్పుకోవాలంటే, పుస్తకాలు చదవడం ఇష్టపడేదే దీని కోసం; నా ఆలోచనలూ, అభిప్రాయాలూ, నమ్మకాలు ఎలా మారతాయోనన్న ఉత్సుకత!

నేను స్కూల్లో ఉండగా, పాఠం చెబుతూ, “గాంధీ మహాత్ముడు అవతారపురుషుడు. అందుకే భారతదేశాన్ని ఒక్క తాటిపై నడిపించగలిగాడు.” అని ఒకరు వ్యాఖ్యానించారు. నాకు నచ్చాయ్ ఆ మాటలు. అలానే అనుకున్నాను. నమ్మటం మొదలెట్టాను. గాంధీ ఆత్మకథ చదువుతున్న కొద్దీ ఈ నమ్మకం మెల్లిమెల్లిగా నశించింది. మహాత్మాగాంధీ కాక, ఆ పేరు వెనుకున్న మనిషి పరిచయమయ్యే కొద్దీ అవతారపురుషుడు అనేది విస్మరించగలిగాను. గాంధీని ఒక మనిషిగా చూడ్డం మొదలెట్టాను. ఆ పుస్తకం పూర్తయ్యేసరికి మనిషి ఎంత గొప్ప పనులు చేసి, ఎంత కీర్తిని ఆర్జించినా, మనిషి కాకుండా పోడు అని తెల్సొచ్చింది.

ఇది చదివిన కొన్నేళ్ళకి లాన్స్ ఆర్మ్ స్ట్ర్రాంగ్ ఆత్మకథ చదివాను. స్పోర్ట్స్ బాగా ఫాలో అవుతా కాబట్టి, ఈ మనిషి గురించి కాస్తో కూస్తో తెల్సు. పుస్తకం అంతా బానే అనిపించింది. నాకు నచ్చింది. అందులో లాన్స్ కన్నా, నాకు వాళ్ళ అమ్మా, భార్యా చాలా నచ్చారు. వాళ్ల కోసమే పుస్తకం మళ్లీ చదివాను కూడా. కొన్నాళ్ళకి లాన్స్, అతని భార్యా విడిపోయారని తెల్సింది. అసహజ పద్ధతుల్లో తన బిడ్డకు జన్మనిచ్చి, తండ్రి కాలేని అతనికి ఒక అద్భుత వరం ఇచ్చిందావిడ అని పుస్తకం ద్వారా తెల్సుకున్న నాకు, ఈ వార్త నచ్చలేదు. కోపం వచ్చింది. లాన్స్ అంటే చిరాకేసింది. కాని అతణ్ణి ద్వేషించలేకపోయాను. మృత్యువునూ, టూర్ డి ఫ్ర్రాన్స్ నీ ఎంతటి విపరీత పరిస్థితులోనైనా నెగ్గే “ఛాంపియన్” కూడా ఒక మనిషే! మానవ సంబంధాలు విఫలమవ్వటంలో పెద్ద వింత లేదుగా!

ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. కాఫ్కాది ఒక మంచి కోట్ ఉంది. దాన్ని ఇక్కడ యధాతధంగా ఇస్తున్నాను.

“Altogether, I think we ought to read only books that bite and sting us. If the book we are reading doesn’t shake us awake like a blow on the skull, why bother reading it in the first place? So that it can make us happy, as you put it? Good God, we’d be just as happy if we had no books at all; books that make us happy we could, in a pinch, also write ourselves. What we need are books that hit us like a most painful misfortune, like the death of someone we loved more than we love ourselves, that make us feel as though we had been banished to the woods, far from any human presence, like a suicide. A book must be the axe for the frozen sea within us. That is what I believe.”

5. కవిత/కవిత్వం గురించి మీ మాటల్లో

హహహ.. నన్నెందుకీ ప్రశ్న అడగాలనిపించింది? అంటే కథ, నవల – వీటిని గురించి కాక, కవితే ఎందుకని?
నా అనుభవంలోనిది చెప్తాను, అది అందరికీ వర్తించకపోవచ్చు. తాను అనుభవించిన చిన్న సైజు స్వర్గాన్నో, నరకాన్నో లయబధ్థంగా అతి కొద్ది పదాల్లో అమర్చి, అది చదివిన వారి గుండె తీగలను మీటటమో, లేక లాగి వదలటమో చేసేది కవిత్వం. Condensed form of intensified emotion. కవిత్వం చదివితే ఏదో జరుగుతుందనే తెలుస్తుంది, ఏం జరుగుతుందో తెలీదు. కవిత్వాన్నీ, హాస్యాన్నీ వివరించకూడదు. విశ్లేషించకూడదు. అనుభవించాలంతే!

6. పుస్తకం.నెట్ నేపధ్యం.. సౌమ్య పాత్ర

మొదటి ప్రశ్న చివర్నుండీ కథ కొనసాగుతుంది. అలా నా బ్లాగ్ స్నేహాల వల్లా, పరిచయస్థుల వల్లా బోలెడేసి పుస్తకాలు కొంటూ కొంటూ, విశాలాంధ్ర మీద ఒకానొక దాడి తదనంతరం, నేను ఆన్‍లైన్ వస్తే, “ఏం కొన్నావ్? పుస్తకాల పేర్లేంటి?” అని ఒక ముగ్గురు నలుగురు అడిగితే వాళ్ళకి సమాధానాలిచ్చాను. ఐదో మనిషొచ్చి, “వెళ్లావా విశాలాంధ్రకి? ఏం కొన్నావ్?” అని అడిగేసరికి, ఇలా కాదనుకొని, పుస్తకాల పేర్లతో ఒక టపా రాసేసి, చివరాఖరున అతి తెలివితో “పుస్తకాలకీ ఒక ప్రత్యేక సైటుంటే బాగుణ్ణు కదా!” అని నిప్పు అంటీ అంటించకుండా వదిలేసా. బ్లాగుల్లో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు చేస్తారులే అనుకున్నాను. అనుకున్నట్టే ఆ పోస్టు చదివిన సౌమ్య వీరావేశంగా బ్లాగు ప్రముఖులకి “ఆలోచన ఇది, మీరేమంటారు?” అని ఓ మెయిల్ కొట్టింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకొచ్చారు. అందరిదీ ఒకే మాట, “ఆలోచన బాగుంది.. కాని లీడ్ ఎవరు తీసుకుంటారూ?” అని. కాస్త సందిగ్థావస్థ తర్వాత, మరెవరూ ముందుకి రాకపోవటంతో భయంభయంగానే సౌమ్య, నేనూ చేద్దాం అనుకున్నాం. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థంకాలేదు. పొద్దు టీం ని సంప్రదించాం. పుస్తకం.నెట్ అనేది మొదలయ్యింది. The rest, as they say, is history. 🙂

సౌమ్య, నేనూ టెక్నికల్ విషయాలను తప్పించి, పుస్తకం.నెట్ అనేది నడవడానికి కావాల్సినవన్నీ చేస్తాం. పుస్తకం.నెట్ అనే ఆలోచన నాదైతే, అది ఆలోచనగానే మిగలకుండా చూసింది మాత్రం సౌమ్య. ఇక సైటు నిర్వహణలో పాత్రలూ, పాత్రధారులూ అంటూ ఏం లేవు. పనివిభజన, అది-నీ-ఏరియా-ఇది-నా-ఏరియా లాంటివేం ఉండవు. వీలైనంత వరకూ ఏదైనా కల్సే చేస్తాం. ఒకరు అందుబాటులో లేనప్పుడు, మరొకరు చూసుకుంటాం. అంతే!

7. పుస్తకం.నెట్ కోసం ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, వీటి వెనుక ఏమైనా థీం ఉందా? అన్నింటిలోకి కష్టమైన, ఇష్టమైన ఇంటర్వ్యూ?

యెస్.. పుస్తకం అంటే ఒక రచయితా, ఒక పాఠకుడే కాదు కదా! వీళ్ళద్దరితో సహా పుస్తకంతో ముడిపడి ఉన్న ప్రతి వృత్తిలో వారినీ పరిచయం చేయాలని. అదే థీం.

“కష్టమైన..” – డెఫినట్‍గా ఆబిడ్స్ ఇంటర్వ్యూలు. నాకు టెన్షన్, వాళ్ళకి అనుమానాలు.

ఇష్టమైన – కొత్తపల్లి పత్రిక వాళ్లతో జరిపిన మెయిల్ సంభాషణ. కదంబి రామకృష్ణాచార్య గారిది కూడా ఇష్టం. ఫోన్ చేసిన ప్రతిసారి ఆయన నన్ను ఆటపట్టించడం మరీ ఇష్టం. 🙂

వీటికి జవాబులు రాస్తున్నప్పుడే, మేం ఎ.వి.కె.ఎఫ్ అధినేత అప్పలజోస్యగారిని కల్సాం. అదీ మరపురాని అనుభూతి. ఇక బాపూ, రమణ గార్లతో ముఖాముఖీ అనేది నా జీవితంలో ఉండాల్సిన అధ్యాయం కాదది. దేవుడెక్కడో తడబడ్డాడు, పొరబడ్డాడు. నన్ను వాళ్ళ ముందు నిలబెట్టాడు.

8. పుస్తకం.నెట్ వల్ల మీ దైనందిన జీవితంలో ఏమైనా మార్పులు..?

అరబ్బు కథలో దయతలచి లోనికి రానిస్తే, ఎడారిలో ఉన్న టెంట్‍ మొత్తం ఆక్రమించుకునే ఒంటెలా పుస్తకం.నెట్ ని తయారవ్వకుండా జాగ్రత్తపడగలను కాబట్టి, దైనందన జీవితంలో మార్పులు అంటూ ఏవీ ఉండవు. నా రోజువారీ పనులన్నీ అరలో సర్దిన పుస్తకాలనుకుంటే, మీరు అర దగ్గరకి వచ్చి, జాగ్రత్తగా గమనిస్తే తప్ప “పుస్తకం.నెట్” అనే పుస్తకం కనపడదు.

9. అవునూ ఒంటిచేత్తో ఇన్ని సమీక్షలు, పరిచయాలు, ఇంటర్వ్యూలు ఎలా వ్రా(చే)స్తున్నారు..?

🙂

10. పుస్తకం.నెట్ కి వస్తున్న స్పందన, ఇంకా చేయాలనుకుంటున్న మార్పులు, చేర్పుల గురించి…

పుస్తకం.నెట్ కి స్పందన – అమేజింగ్! ఊహాతీతం (మేం పెద్దగా ఊహించుకోలేదనుకోండి). సచిన్ భాషలో చెప్పాలంటే, మాకు సంతోషమే కాని అప్పుడే తృప్తి పడదల్చుకోలేదు. చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అలా అని అన్నీ చేసేయాలనీ లేదు. పుస్తకంకి రాసే నా స్నేహితులతో అంటూ ఉంటా, “జీవితమూ, ఉద్యోగమూ వల్ల కలిగే డెడ్‍లైన్స్ మధ్య పుస్తకాన్ని బతికించుకోగలిగితే చాలు” అని. ఏ ప్లాన్నైనా దీన్ని ఆధారంగా చేసుకొని అమలుపరుస్తాము.

11. మొన్నామధ్య ఒక చోట రచనా వ్యాసంగం మీద అంత ఆసక్తి లేదు అన్నారు.. అప్పట్లో మీ బ్లాగ్లో కొన్ని కధలు వ్రాశారు.. ఈ మధ్యలో ఏమైనా వ్రాశారా/వ్రాస్తున్నారా?

రాసాను. రాస్తున్నాను. రాస్తాను కూడా. వాటిని ప్రచురించడంపై ప్రస్తుతం వ్యాఖ్యానించలేను.

12. మరి ఆసక్తి లేదని అన్నారు?

ఆసక్తి లేదూ అంటే, రచన ప్రక్రియ అనేది నా నుండి ఎంత తీసుకోగలదో, “అంత” ఇవ్వడానికి నేను సిద్ధంగా లేనని అర్థం. ఏదో హాబీలా అంటే సరే కాని, ఒంటి కాలి మీద తప్పస్సు చేసేంత పట్టుదలతో రాసే ఉద్దేశ్యం లేదని.

నేను చూస్తున్నది ఏంటంటే, ఎంత బాగా (బాగా = ఎక్కువ, మంచి రెండూనూ) రాస్తే అంత మంచి రచయిత అని అంటుంది ప్రపంచం. బతకడానికి రాసేవాడు రచయిత అవునో కాదో నేను చెప్పలేను గాని, రాయకుండా బతకలేని వాడే నా ఉద్దేశ్యంలో రచయిత. అంటే, నా ఉద్దేశ్యంలో నేను రచయితను (పోనీ, రచయిత్రినీ) కానే కాను. 🙂

(ఈ (నా) కొత్త థీసిస్ కాస్త గందరగోళంలా అనిపించొచ్చు. కాని, నేను దానికే కమిట్ అయ్యాను.)

13. పుస్తకాలు, బ్లాగులు, పుస్తకం.నెట్ కాకుండా తీరిక సమయంలో ఏం చేస్తుంటారు?

నిద్రపోతాను. నిద్రపోతాను. నిద్రపోతాను.

పైన పుస్తకం.నెట్ ని అరబ్బు కథలో ఒంటెగా మారనివ్వటం లేదని చెప్పాగా. కానీ అలా నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నది మాత్రం క్రికెట్. ఐదు రోజుల పాటు, రోజుకు ఎనిమిది గంటలు తదేకంగా క్రికెట్ చూడ్డం నాకలవాటు. ఏడాదిలో భారత క్రికెట్ జట్టు ఎంత ఆట ఆడుతుందో తెల్సు కదా, అంతా నేను చూస్తానన్న మాట, ఏ టైమ్ జోన్ అయినా. నిద్ర, క్రికెట్ ఒక్కోసారి క్లాష్ అవుతూ ఉంటాయి. టెన్నిస్ చూడ్డం కూడా చాలా ఇష్టం. గ్రాండ్ స్లామ్స్ మిస్స్ అయ్యే సమస్య లేదు.

క్రికెట్, నిద్ర లేకుండా తీరిక ఉంటే “Eat. Shop. Celebrate.” అన్న సెంట్రల్ వాడి ఉవాచను తు.చ తప్పకుండా పాటిస్తూ ఉంటాను. స్నేహితులతో ఉంటే సమయమే తెలీదు నాకు. బొమ్మలు గీయడం, బొమ్మలు చేయడం కూడా ఇష్టమే.. ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు.

14. మిమ్మల్ని అండమాన్ దీవిలో ఒంటరిగా వదిలేస్తూ వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోమంటే … ఒక బుట్టలో పుస్తకాలు, ఇంకో దాంట్లో ఉత్తరాలు(మీరు వ్రాసిన, మీ ప్రాణస్నేహితులవి, ప్రముఖులవి గట్రా), మరో దాంట్లో సినిమాల డివిడిలు (అన్నీ మీకు బాగా నచ్చిన సినిమాలవే)

బుట్టలో పుస్తకాలు! – అని అంటా అనుకున్నారు కదూ?! 🙂 నేనలా అనాలంటే, మీరీ కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి..

దీవిలో నన్నెందుకు వదిలేస్తున్నారు? మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? ఎన్ని రోజులుండాలక్కడ? అక్కడ నరసంచారం ఉంటుందా? నేనుండడానికి చోటో? భోజనానికి, నిద్రకి సదుపాయాలూ? బుట్టలో పుస్తకాలు ఎలాంటివి? నా కలెక్షన్ నుండి తెచ్చినవేనా? నాకు నచ్చేవేనా? ఎంతటి బుట్టసలు? ఈ బుట్ట నేనే మోసుకోవాలా? డివిడిలు అన్నారు… మరి డివిడి ప్లేయరో? దేనిపై చూడాలి సినిమాలు? సినిమాల బుట్ట ఎక్కువ బరువా? పుస్తకాలది బరువా?

స్నేహితులు రాసిన ఉత్తరాలు మాత్రం పట్టుకెళ్లను. అవి మనలో ఉండాలే కాని, మనతో కాదు.

వీటిన్నింటికన్నా ఒక లైట్‍వెయిట్ లాప్‍టాప్ ఇస్తే సరిపోతుంది, వీలైతే ఇంటర్నెట్ తో సహా! :p

15. మీ వ్రాతలు చూస్తుంటే, చాలా భావుకత ఉన్నవారిలా అనిపిస్తారు.. ? What do you say?

నా బ్లాగు చదివిన పది మందిలో తొమ్మిది మంది ఖచ్చితంగా ఈ ప్రశ్న అడిగారు / అడుగుతున్నారు. వారిని వెంటనే నేను అడిగే ప్రశ్న, భావుకత అంటే ఏంటి? అని. మొదట్లో నాకీ పదం అర్థం కాక అడిగేదాన్ని. తర్వాత్తర్వాత “భావుకత” అన్న పదానికి ఎవరికి వారు ఇచ్చుకునే నిర్వచనాలు ఎక్కువ అని తెల్సాక “అవును / కాదు” అని చెప్పడానికి ముందు ప్రశ్న అడుగుతున్నాను – భావుకత అంటే మీ ఉద్దేశ్యం?

16 మిమ్మల్ని మీరే ఇంటర్వ్యూ చేసుకుంటే, ఎలాంటి ప్రశ్న అడుగుతారు, దానికి సమాధానం ఏమిటి?

I loved this question. 🙂 ఏం ప్రశ్నలు అడుగుతానన్నది చెప్పలేను కాని, I’ll be playing Karan Thapar’s Devil’s Mind for sure! 😉

17. మొదట బ్లాగు, అటు నుండి పుస్తకం.నెట్ మరి తరువాత..? Next is What..!?

హహహ.. తెలుగులో కొద్దో గొప్పో రాస్తుంటే కనీసం అక్షరాలన్నా మర్చిపోకుండా ఉంటానని బ్లాగు మొదలెట్టాను. పుస్తకం.నెట్ అనే ఐడియా ఇచ్చి ఇరుక్కుపోయాను, అక్కడికీ భుజాన వేసుకోకూడదనే అనుకున్నాను. సౌమ్యని ఒప్పించలేకపోవటం వల్ల కథ కొనసాగుతోంది. ఈ రెండూ ఎంత అన్‍ప్లాన్‍డో నేను మున్ముందు చేయబోయేవి కూడా అంతే unplannedగా ఉంటాయి. సో, మీ “what next?”కి నా సమాధానం, “వేచి చూద్దాం!”

18. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?

హహహ.. ఈ ప్రశ్న వచ్చే వరకూ నేను ఆగలేదు. మొదటి ప్రశ్నలోనే చెప్పేశాను. 🙂

మేధ

Posted in వ్యాసం | Tagged | 10 Comments

పద్యకవిసమ్మేళనంలో పాల్గొనని పద్యసుమాలు

వికృతి ఉగాది పద్యకవిసమ్మేళనంలో సమయాభావం వలన సమర్పించలేకపోయినవి, సంబంధిత కవులు ఆ సమ్మేళనంలో పాల్గొనలేకపోవడం చేత సమర్పించలేకపోయినవీ అయిన కొన్ని మంచి పద్యాలను కొత్తపాళీ గారు ఎంచి పంపించారు. వాటిని ఇక్కడ సమర్పిస్తున్నాం.
————————–

దత్తపది: మాలిక, తూలిక, పోలిక, చాలిక -ఉత్పలమాల నాలుగు పాదాల్లోనూ తొలిపదాలుగా ఉపయోగిస్తూ

సందీప్:

మాలిక కూర్చి నీ సిగన మాన్యులు పెట్టెనె! నేటి దేశముల్
తూలిక సాటి నీ చరితతో సరిచూచిన! కల్పవృక్షమే
పోలిక తోచుచుండు! చినబోతివె, నిందలు నీకు ధారుణిన్
చాలిక భారతంబ! పరచాలిక నీ ఘనతెల్లదిక్కులన్!

సమస్య: ఒకటి ఒకటి కూడి ఒకటెయగును

రాఘవ:

సంగమమునఁ జూడఁ జాహ్నవి కాలిన్ది
రెండు నదులు గలియు రీతి ద్వితయ
బంధువర్గములు వివాహవ్యవస్థలో
నొకటి యొకటిఁ గూడి యొకటె యగును

రవి (బ్లాగాడిస్తా):

ఆలుమగలుఁ గలసి అనురాగమౌ రీతి
మిత్రులిర్వురు నొక మైత్రి లీల (ప్రాసయతి)
భ్రాతలిర్వురిలను భ్రాతమైత్రి సరణి
ఒకటి ఒకటిఁ గూడి ఒకటెయగును.

సందీప్:

సొంతమేలు కొఱకు యెంతసేపు వెదకు
చదువుకున్నవారి చదువదేల?
స్వార్థభరితహృదయసాహస్రమైనను
ఒకటి ఒకటి కూడి ఒకటేయగును

చదువరి:

జీవునందె గలవు జీవాత్మ పరమాత్మ
శంకరార్యు లిటుల సలిపె బోధ
ఆత్మ లొకటి యగుచు అద్వైతమెట్లౌనొ
ఒకటి ఒకటి కూడి ఒకటెయగును

దత్తపది: మాసు, బాసు, కింగు, కేడీ – మన్మథుని గురించి

రాఘవ:

మాసుతుఁడు సురభిమిత్రుఁడు
భాసురమౌ చిలుకతేటివాఁడు సెలఁగి గ్రా
వాసుతకు శివునికిం గూ
ర్మ్యాసక్తులఁ గూర్చి తా మరణమునకె డిగెన్

ఆత్రేయ:

జగముల సెబాసు బడయగ
నగధరు కింగురి విడిచెన నంగుడు అకటా
మిగల రమాసుతుడు మసిగ
వగచెను దిక్కేడి యనిరతి వగలుడి కొరకై

సనత్ శ్రీపతి:

మా సుమ బాణముల్ హరుని మానసమందున ప్రేమ నింపగా,
భాసురమైనతేజమిటు భాసిలె స్కంధుగ ! క్రౌంచ తారకా
ద్యసురారీ ! ఒనరంగజేసితిని గాదా ధాత్రికిన్ గూర్మి ! నే
డిసుమంతైనను లేడు నా యశముకే ఢీ చెప్పు వాడెవ్వడున్ !

నచకి:

ఆసలు వీడబోకు, జయమాతని జెందుట తథ్యమేను లే-
మా, సుమబాణుడే హరుని మానసమందున ప్రేమ పెంచు, నం-
బాసుదతీ మనంబదియె ఫాలశశాంకుని గోరగా చిరా-
కే సెలవంచు నా శివునికిం గుశలంబది కల్గజేయగా
రాసకళావిలాసుడయి రాజిలు తుల్యుడు వానికేడిరా!

సమస్య: రాణ్మహేంద్రవరమ్ము జేరెను రత్నగర్భుని జెంతకున్

సనత్ శ్రీపతి:

మన్మనంబున ప్రేమ భావన మంతరించెడి వేళ ! మా
కున్ముదంబున కైత లిచ్చుచు, కోటి రత్నపు వీణయే,
వన్మినిట్టు సహింపబోమను వాదనల్ తెరదింపుచున్
రాణ్మహేంద్రవరమ్ము చేరెను, రత్నగర్భుని చెంతకున్

(కోటి రతనాల వీణ = తెలంగాణ. రత్నగర్భ = రాయలసీమ)

సభలో ప్రస్తావించిన అంశాలు కాక ప్రశ్నోత్తరాలలో జరిగిన మరికొన్ని ఆసక్తికరమైన పూరణలు

సమస్య – కుందేళులు రెండువచ్చి కుచములు గరచెన్

శ్యాం పుల్లెల:

అందముగ మంచుపడగా
కొందరు స్త్రీ ప్రతిమ చేసి కుచమూలమునన్
పొందికన ఉంచ కారట్స్
కుందేళులు రెండువచ్చి కుచములు గరచెన్

రాఘవ:

ఇందీవరంబు కుచమై
యిందుని బింబము శశమయి యింపుగఁ సరసీ
బృందద్వయమునఁ దేలగఁ
గుందేళులు రెండు వచ్చి కుచములఁ గఱచెన్

బ్లాగాడిస్తా రవి:

అందాల శశక మొక్కటి
చందురు వోలె. ప్రసవించి శాబము లీనెన్.
సందెకది గూడు రా, చిరు
కుందేళులు రెండు వచ్చి కుచముల గరిచెన్

సనత్ శ్రీపతి:

సుందరముగ సుందరినీ
కుందేళ్లను జెక్కి నిల్పె కూరలపై నీ
సందడిలో ! గమనింపగ
కుందేళులు రెండు వచ్చి కుచముల గరచెన్

ఫణి ప్రసన్న:

పెందాళే జూకెళ్ళితి
అందాళులు తీర్చిదిద్ద అరుదగు పొదనో
సుందర కన్యగ యచ్చట
కుందేళులు రెండు వచ్చి కుచముల కరిచెన్.

సమస్య – రాట్నము చేతబట్టుకొని రాక్షస కృత్యము చేసినాడహో

శ్యాం పుల్లెల:

పట్నపు పిల్లెరుగనిది, పాపడు బంతిని ఎట్లు వేయునో,
కట్నము చాలదంచు తన కాంతను కొట్టుట ఏమి కృత్యమో,
చట్నిని రొట్టెతో తినగ చక్కగ అయ్యరు రుబ్బి కమ్మగా,
రాట్నము – చేతబట్టుకొని – రాక్షస కృత్యము – చేసినాడహో

(క్రమాలంకారము – మొదటి మూడు పాదాల్లోని వరుస ప్రశ్నలకు చివరి సమస్య పాదంలో సమాధానాలు)

రవీంద్ర లంకా:

అట్నము లెట్లు గట్టెదము? ఆపదలొచ్చెనె యాంధ్రదేశమున్!
కట్నము కోట్ల లెక్కలుగ గట్టితి మీ తొడగొట్టు నేతకున్,
పట్నములమ్ము పొట్లముల పాలకుడేగద రావణుండొహో,
రాట్నము చేత బట్టుకొని రాక్షస కృత్యము చేసినాడహో

రాఘవ:

రాట్నముఁ జేతఁ బట్టికొని “రాక్షసకృత్యముఁ జేసినా డహో
అట్నము లాక్రమించి కపటాదరముల్ ప్రకటించి వృత్తులన్
పట్నములందుఁ దెల్లదొర పల్లియలందునఁ రూపు మాపె నీ
రాట్నమె సాక్షి” యంచు ప్రజలన్ నడిపించెను గాంధి నేతయై

దత్తపది: బీరు, విస్కీ, రమ్ము, జిన్ను – గాంధీ మహాత్ముడు

సందీప్:
సీ:-

వివిధదేశములేగి విస్కీవినోదాల, మాయకు లొంగక మాన్యుడయ్యె!
బీరుపోకుండగ వీరుల రాజ్యము, “సత్యమేవజయతే” శంఖమూది
రమ్ము! తెల్లదొరల రాక్షసాన్ని తరిమికొడదాము మనమంత కూడబడుచు
మతభేదమేలయ్య? మనమంత వొక్కటే! జిన్నాను పిలువండి జిన్నుడంచు”!

ఆ:-

అనుచు ప్రజలఁగూడి శాంతినే అసి చేసి
బంధనముల చీల్చి బాధ తీర్చి
చక్కనైన బాట జాతిపిత మలచె!
పొరుగుదేశములును పొగిడె మెచ్చి!

విశ్వామిత్ర:

సహనంబీరుచినొంద మిత్రుడయి శస్త్రమ్మై యలంకారమున్
మహరాజుల్ వడకేటిమొండితనమే మైనంటబీరమ్ముగన్
మహిపైసాత్వికమార్గమున్ విడని కర్మాచారయాజిన్ స్వజా
తిహితైషిన్ కొలుతున్, ప్రజన్ గవిసికీర్తింతేను గాంధీయమున్

Posted in కవిత్వం | Tagged , | 3 Comments

కవికృతి-౫

కౌగిలించుకుందాం..రండి..!
అనుసృజన: పెరుగు.రామకృష్ణ
Source: M.V.Sathyanarayana poem “Let us embarrace”

కౌగిలించుకుందాం..రండి..!
కౌగిలింతలో ఎంత అందమైన పులకింత
అన్ని దిగుళ్ళను కరిగించే ఆహ్లాదపు గిలిగింత
విషాదవదనులైన ప్రేమికుల కు
స్నేహంచెదరిన స్నేహితులకు
కరడుకట్టిన శత్రువులకు
అసలు ఒకరికొకరు తెలీని
అపరిచితులకు మధ్య
దూర తీరాలని చెరిపేస్తుంది..
ఒక కౌగిలింత..

కౌగిలించుకుందాం..రండి..!
గాలి సైతం దూరలేన్తగా
బిగి కౌగిలిలో హత్తుకుందాం..
ఒకరిలోన్చిమరోకరిలోకి ప్రవహిద్దాం
మనసుల్ని ఏకం చేస్తూ
హృదయాల్ని ముడివేస్తూ
ఒకరిలో ఒకరుగా
ఒకే ఆత్మ సంతకం గా
మిగులుదాం..
మరెవ్వరూ విడదీయలేనంత గట్టిగా
కౌగిలించుకుందాం..రండి .!

కత్తి మహేష్:
Embrace కు తెలుగు పదం కౌగిలింత కాదండీ…హత్తుకోవడం.

పెరుగు రామకృష్ణ:
Ya..i know ..Its a transcreation poem.. హత్తుకోవడం కంటే ఇది బావుంటుందని. original writer also said its fine..

కత్తి మహేష్:
కనిపించిన అందరినీ “కౌగిలించుకుందాం..రా!” అంటే కొంచెం ఇబ్బందిగా ఉండదూ! కౌగిలి చాలావరకూ రొమాంటిక్ ఆలింగనానికి ప్రయోగిస్తాం. హత్తుకోవడం ఎలాంటి
ప్రేమనైనా తెలపడానికి. అందుకే కౌగిలికన్నా హత్తుకోవడం బెటరేమో అనిపించింది. Its OK.

పెరుగు రామకృష్ణ:
మహేష్ గారి సూచన మేరకు మార్చిరాసిన కవిత:

మనసారా హత్తుకుందాం రండి..!
మనసారా హత్తుకుందాం రండి ..!
సందిగ్దాలన్నిటినీ స్తబ్దం చేస్తూ..
విషాదవదనులైన ప్రేమికుల కు
స్నేహంచచెదరిన స్నేహితులకు
కరడుకట్టిన శత్రువులకు
అసలు ఒకరికొకరు తెలీని
అపరిచితులకు మధ్య
దూర తీరాలని చెరిపేస్తుంది..
ఒక కౌగిలింత..

హత్తుకుందాం ..రండి..!
గాలి సైతం దూరలేన్తగా
బిగి కౌగిలిలో హత్తుకుందాం..
ఒకరిలోన్చి మరోకరిలోకి ప్రవహిద్దాం
మనసుల్ని ఏకం చేస్తూ
హృదయాల్ని ముడివేస్తూ
ఒకరిలో ఒకరుగా
ఒకే ఆత్మ సంతకం గా
ప్రతిబింబిద్దాం..
మరెవ్వరూ విడదీయలేనంత గట్టిగా
మనసారా హత్తుకుందాం రండి…!

———–

గరికపాటి పవన్ కుమార్:
మూలానికి దగ్గరగా ఉన్నప్పుడే అనువాదం తన ధ్యేయాన్ని సాధిస్తుంది. ఈ కవిత మూలం నాకు రచయిత ద్వారా పంపిన ఇంగ్లీషు అని భావించి ఈ కింది విశ్లేషణ, అసలు మూలం ఇంగ్లీషు కాక వేరే భాష అయి ఉంటే కింది విశ్లేషణ వర్తించదు:

ఇంగ్లీషులోని మూలం:

Come on! Let us embrace
How beautiful is this embrace
It melts down
All embarrassments
Between estranged lovers,
Between broken friends
Between bitter enemies;
Why not?
Even between utter strangers

ఉరామరికగా తెలుగులో అర్థం:

రా కౌగిలిద్దాం!
ఎంత అందమైనదీ కౌగిలింత
కరగించును
కలతలన్ని
విడిపోయిన ప్రేమికుల మధ్య
చెదిరిన స్నేహితుల మధ్య
ఆగర్భ శత్రువుల మధ్య
ఎందుకు కాకూడదు?
పూర్తి అపరిచితుల మధ్యైనా?

పెరుగు రామకృష్ణ గారి అనువాదం:

మనసారా హత్తుకుందాం రండి ..!

మనసారా అనేది అనవసరమైన పదం, మూలం లో లేనిది, అనువాదంలో పాటించవలసిన నియమం: మూలంలో లేనిది ప్రవేశ పెట్టకూడదు, అందుకే అలస్తైర్ రీడ్ మాటల్లో, సఫల అనువాదకుడు కావడనికి నువు సన్యాసివైనా కావాలి లేదా మూఢమతివైనా (నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు – తమ్మినేని యదుకుల భూషణ్) . హత్తుకుందాం? కౌగిలింత (రామకృష్ణ గారు పాఠకుల వ్యాఖ్యల వల్ల మార్చారు) Embrace కు దగ్గరి తెలుగు పదం

సందిగ్దాలన్నిటినీ స్తబ్దం చేస్తూ..

ఈ లైను తప్పు అనువాదం

విశాదవదన్నులైన ప్రేమికుల కు

Estranged అంటే 1. separated and living apart from one’s spouse 2. no longer friendly; alienated ఇంకా కొన్ని అర్థాలు ఉండవచ్చు కానీ విషాద వదన్నులు మాత్రం కాదు

స్నేహంచేదరిన స్నేహితులకు

’కు’ కాదు, ’మధ్య’ అని ఉండాలి

కరడుకట్టిన శత్రువులకు
అసలు ఒకరికొకరు తెలీని
అపరిచితులకు మధ్య

ఒకరికొకరు తెలియకపోవడమే అపరిచితం – పునరావృత్తి అనవసరం

దూర తీరాలని చెరిపేస్తుంది..

మూలంలో లేనిది

ఒక కౌగిలింత..

ఒకచోట కౌగిలింత మరొక చోట హత్తుకోవడం – కౌగిలింత బాగుంది.

——————–

మౌన ఘోష
-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

మాస్టారి ప్రశ్నకు జవాబుగా
ఆ పిల్లాడు
మౌనంగా చేతుల్ని చాస్తాడు
పెదాల రేకులు విప్పలేని
వాడిన మొగ్గలాంటి –
చిరిగిన మేఘవస్త్రం మాటున
చిదిమిన అశృకణం లాంటి –
ఆ పసివాడు
రూళ్ళకర్రకు నిశ్శబ్దంగా అచేతుల్ని అప్పగిస్తాడు.
వాడి హోంవర్క్‌ పేజీల్నిండా
ఉపవాస రేఖాచిత్రాలే.
వాడి ఖాళీ పలకనిండా
కన్నీరంటిన ముంజేతిముద్రలే.
వాడి చూపుల్ని మీటితే చాలు
విషాద సంగీతపేటికలెన్నో విచ్చుకొంటాయి.
దారెంట నీరసం చెక్కిన మోకాటిగాయాల వెనక కొంతసేపు వాడు-
ఆకలిచిచ్చును దాచుకొంటాడు.
బడిముందు పిల్లల దవడకదలికల్లోని మర్మరధ్వనుల్లోంచి ఆ కల పచ్చిపుండై
పునరుద్భవిస్తే –
శిధిల వీణాతంత్రినిలా వణకిపోతాడు.
వాడెపుడూ-
మాస్టారి చూపుల్ని తడిజేసే
మంచు మేఘంలా వుంటాడు.
చదువులతల్లి కనుకొలుకుల్లోంచి జారే
కాటుకంటిన విషాదబిందువులా వుంటాడు.
సెలవులు కూలిదినాలై
వాడి అరచేతులకంటించిన బొబ్బలఫలాలు
మాస్టారు సంధించిన రూళ్ళకర్రకు
ప్రశ్నార్ధకాలవుతాయి.
ఇప్పుడు మాస్టారిముందు –
మొగ్గవికసించేందుకు వాడే ఉత్ప్రేరక బోధనలకన్నా వేరు జీవించేందుకు అందించే
సహాయహస్తాల అధ్యయన సమస్యలే విస్తృతమవుతాయి.

———
పవన్ కుమార్:
మౌన ఘోష మీద విశ్లేషణ :
చర్విత చర్వణం కవిత్వంలో నిషిద్ధం. ఒకే భావాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఎన్నో ఉపమానాలను ఒక్క భావం కోసం గుప్పించడం వల్ల కవిత పాఠకుడి హృదయాన్ని చేరకుండా “తిలకాష్ఠ మహిష బంధనం” అవుతుంది.

మాస్టారి ప్రశ్నకు జవాబుగా
ఆ పిల్లాడు
మౌనంగా చేతుల్ని చాస్తాడు
పెదాల రేకులు విప్పలేని
వాడిన మొగ్గలాంటి –
చిరిగిన మేఘవస్త్రం మాటున
చిదిమిన అశృకణం లాంటి –
ఆ పసివాడు
రూళ్ళకర్రకు నిశ్శబ్దంగా అచేతుల్ని అప్పగిస్తాడు

మొదటి మూడు పంక్తులూ చాలు మిగిలిన భాగం అనవసరం.

మాస్టారి ప్రశ్నకు జవాబుగా
ఆ పిల్లాడు
మౌనంగా చేతుల్ని చాస్తాడు
తర్వాతి లైన్లు
వాడి హోంవర్క్‌ పేజీల్నిండా
ఉపవాస రేఖాచిత్రాలే.
వాడి ఖాళీ పలకనిండా
కన్నీరంటిన ముంజేతిముద్రలే.
వాడి చూపుల్ని మీటితే చాలు
విషాద సంగీతపేటికలెన్నో విచ్చుకొంటాయి

ఈ పైన చెప్పిన పంక్తుల భావాలాన్ని చక్కని కింద పంక్తుల్లో ఇమిడిపోయాయి

సెలవులు కూలిదినాలై
వాడి అరచేతులకంటించిన బొబ్బలఫలాలు
మాస్టారు సంధించిన రూళ్ళకర్రకు
ప్రశ్నార్ధకాల్లా!

అలా అనవసరమైన పదాలు పంక్తులు పక్కన పెడితే మొత్తం కవిత ఈ కింద:

ఆ పిల్లాడి పుస్తకాల్నిండా
ఉపవాస రేఖాచిత్రాలు
కన్నీరంటిన ముంజేతిముద్రలు
మాస్టారి ప్రశ్నకు జవాబుగా
వాడు
మౌనంగా చేతుల్ని చాస్తాడు
సెలవులు కూలిదినాలై
వాడి అరచేతులకంటించిన బొబ్బలఫలాలు
మాస్టారు సంధించిన రూళ్ళకర్రకు
ప్రశ్నార్ధకాల్లా!

ఖచ్చితంగా ఒక కవి రాసిన కవితను ఇలా సంపాదకత్వం చేయడం సాహసమే కాని క్లుప్తత సాధించే వరకూ ఈ సాహసాలు చెయ్యాల్సిందే.

Posted in కవిత్వం | Tagged , | 3 Comments