నిర్మోహ వామనం

-అభిశప్తుడు

మొదటి అడుగు: భూమి
కమ్ముకున్న అదృశ్య ప్రణవాన్ని
అరచేతి దోనెలతో పోస్తానన్నావు

ప్రణయాణువులతో పిగిలిపోతున్న కాగితప్పొట్లాంలో కాస్తయినా ఖాళీలేదు మనోప్రస్తారం నుంచి మరే ప్రసారం వీలుకాదు

ఈదురుగాలుల్ని ఉడికించిన గడ్డిపోచ నేను రికామీ తెమ్మెరై వంచిన, వంచించిన నీ నవ్వు

రెండో అడుగు: ఆకాశం కంటిరెక్కలకి కట్టాను కంకరరాళ్ళు ఐనా లోన ఎండమావుల్ని రద్దు చేసే ఏకాగ్రత నా కంటని రోగం! రంగు చివికిన ఇనుపరజను తుప్పని నువ్వు తర్కమంటూ నేను-
కంటి తెరలు కదలకుండా బలవంతాన కుట్టాను కానీ, నా ఉల్కల్ని కప్పే స్థిరత్వం నాకు సోకని జాడ్యం సాగిలపడ్డ పొగడపూలు ఆధ్యాత్మికమని నువ్వు తాదాత్మ్యమని నేను- ఒకే నాణేనికి బొమ్మా బొరుసులం కదా నేను అవిశ్వాసిననడం అర్థ సత్యం

మూడో అడుగు: పాతాళం అది రేపటిలా పొంచిన భవం కాదు రోమాల్ని నిక్కించిన భ్రాంతీ కాదు
అది ఆదిమగర్భంలో నాదాంకురమై కెవ్వుమన్న నీ స్వరం కాదు లుంగలు చుట్టుకునే పాదం లేదు పారవశ్యంలేక పాలిన పదం లేదు ఒంటరి మాళిగలో గరుకు గోడలు మింగే నీ పాటలానూ లేదు

అది వెన్నెల్ని దిగవిడిచేస్తూ దిసమొలయ్యే నిండుచంద్రుడి నిర్లజ్జలాంటి నీ చూపు కాదు గాలం అంచున ఎరలేదు తాడు కొసన అసలు ఉచ్చేలేదు కాటుక అంచుల కొలనులో కోణంగిలా కదిలే నీ కంటిపాపలానూ లేదు
తలను తాటించి భుజాలు కదలించి మేను మొదలు కుదిపించి ఆత్మ మెడలు వంచి జన్మ తరింపించే స్పర్శ లేనేలేదు

ఊదా వలయాల మీద తారాడే కాంతినీడ

లెక్కతేలని తరంగాలని ఒడిసిపట్టే రజోవల అది ఓ అస్పృశ్య స్పర్శ! ఉప్పిరిసిన వెన్నుకి ఒగర్చే గుర్రాల శ్వాస
మొగలి రేకుల మీద నఖరేఖల నిట్టూర్పు

లావా సెగల తలవని స్పర్శకి హిమనగం జార్చే పైట
ఆత్రాల ఊడలవైపు నేల సాచే చేయి
మబ్బుకండెకి వడికే మెరుపుదారంలా స్పృహలాంటి స్పర్శ!
ఏకాగ్రతలంటించి స్థిరత్వాలు సోకించి రుజాగ్రస్తుడ్ని చేసిన అంటు

భూమ్యాకాశాలకు వెలిగా రస పాతాళానికి అణిచేసిన అస్పర్శ!
పునర్జన్మో, పునరపి మరణమో తేలని పుల'కల'లోకి కళ్ళుమూసిన మాయ-

** ** **

*రేకీ attunementకి ఎంతమాత్రం తగని నన్ను బలవంతాన

ఒప్పించి, గెలిచి ఓడిన గురుదేవికి-

Posted in కవిత్వం | Tagged | 6 Comments

పరిభూత సురత్రాణం

ఎ.శ్రీధర్

కనిబరిగె (గుల్బర్గా) లోని ప్రసిధ్ధమైన ‘కపిలేశ్వర దేవాలయంలో’ కపిలేశ్వరునికి అష్టోత్తర శతనామార్చన చేయించి శివోపస్థాన రూపమైన ద్విపద గీతిని ఆలాపించింది ‘అవనిజ’…

“ఏమిటిది బాబాయ్?! ఎవరీ సురత్రాణ సైన్యాలు? ఎందుకిలా పారిపోవడం! మనని పరిపాలించే ఏలిక మహ్మద్ షా (రెండవ ) సురత్రాణుడు కదా! తన రాజ్యం మీద తనే తిరిగి దండయాత్ర చేయడ మేమిటి?”

పూజారి కాగడా వెలుగులో ఆమె అమాయకమైన ముఖాన్ని చూసాడు. మచ్చలేని చంద్రబింబం లాంటి ఆమె ముఖం ఆ కాగడా వెలుగునే వెన్నెలలా ప్రతిబింబిస్తోంది.

రంగు మీరగ వచ్చి రమ కౌగలింప-బంగరు పుంఖపు ప్రభ కైతవమున
కాలంబు వచ్చు నాకలి దీరునంచు-గాలినెయ్యుండు ముఖంబున డాగ

తూణీర రూప పాథోరాశియందు—బాణ రూపంబున పవళించు హరిని
గారవమున లేపి కరమున నంది-స్ఫార సుమేరు చాపంబున గూర్చి

చికుర రూపంబగు జేజేల దారి- శకట రూపంబగు క్షమయును గదల
శకటాంగ రూప భృచ్చంద్రార్కరుచుల-ప్రకటాట్టహాస ప్రభలు మించి పర్వ

హుంకార బోధిత మురునభోవాటి– నోంకార పటునాద ముగ్రమై వెలయ
ధనురాయు మన చండ ధాటికి నదరి-మినుకుల గుర్రాలు మేనులు వంప

“జయము నీ కగుగాక శంకరా” యనుచు– హయ చోదకుడు బ్రహ్మ యాశీర్వదింప
ఒక్క యేటున మేటి నుగ్ర పురముల మూటి-స్రుక్కడగించిన ముక్కంటి గొలుతు

పూజారి ఆమె పాడుతున్న గీతాన్ని పరవశత్వంతో వింటూ, కపిలేశ్వరునికి హారతి నిస్తున్నాడు. ఇంతలో బయటినుంచి కోలాహలం! ఛీత్కారాలు, హయహేషలు, ఆర్తనాదాలు, వినిపించసాగాయి. వాటిమధ్య ఒక అశ్వారూఢుడైన యువకుడు, “పారిపొండి, పారిపొండి, సురత్రాణ సైన్యం వస్తోంది, పారిపోండి.” అంటూ హెచ్చరికలు చేస్తూ దేవాలయం ప్రధాన ద్వారం దగ్గర ఆగి మరికాస్త బిగ్గరగా వినిపించాడు.

పూజారి చేతిలోని ‘హంస హారతి’ క్రింద పడిపోయింది. “అమ్మా, అవనిజా! లోపలికి రా!” అంటూ, ఆమెను గర్భగుడిలోకి లాగి, గుడి తలుపులు మూస్తూ అన్నాడు, “అమ్మా! సురత్రాణ సైన్యం ముందుగా దేవాలయాల మీద దోపిడీకి దిగుతుంది. ఈ గుడి నుండి సడి చేయకుండా బయటికి పోవాలి. కపాలీశ్వరుని ఆభరణాలు తీయడంలో నాకు సహాయం చెయ్యి” అంటూ, గర్భగుడిలో ఉత్తరదిశలో, పట్టుబట్టలతో కప్పబడి ఉన్న ఒక భోషాణాన్ని తీసాడు. స్వామికి అలంకరించిన నగలు అవనిజ తీసి ఇస్తూ ఉండగా వాటిలో పడేసి, కపాలీశ్వరుని వెనుక భాగాన ఉన్న గోడలోని, రహస్యమైన యంత్రపు మరని త్రిప్పాడు. గదిగోడలలో ఒక భాగంగా కలిసి ఉన్న రాతిపలక తెరచుకొని దారి నిచ్చింది.

అవనిజ విప్పారిన పద్మనేత్రాలని బండి చక్రాలలాగ చేసుకొని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా, భోషాణాన్ని ఆ సొరంగ మార్గంలోకి నెట్టి, “అవనిజా! పద త్వరగా!” అంటూ ఆమె చేయి పట్టుకొని లోనికి దారితీసాడు, పూజారి.

ఇద్దరూ లోపలికి ప్రవేశించి కాస్త స్థిమితపడ్డాక, ఆ సొరంగపు గోడలలో అమర్చిన ఒక కాగడాని తీసి వెలిగించాడు, అతను. ఆ కాగడా వెలుగులో ఇద్దరూ భోషాణాన్ని నెట్టుకొంటూ మెల్లగా అడుగులు వేస్తున్నారు. ఆ భోషాణానికి అమర్చి ఉన్న చక్రాలని కాగడా వెలుగులో బయటికి తీయడంతో దాన్ని నెట్టడం వాళ్లకి సులువయింది.

అప్పటివరకు జరిగినదాన్ని మననం చేసుకొన్న అవనిజ తన కాకలీ స్వరంతో “ఏమిటిది బాబాయ్?! ఎవరీ సురత్రాణ సైన్యాలు? ఎందుకిలా పారిపోవడం! మనని పరిపాలించే ఏలిక మహ్మద్ షా (రెండవ ) సురత్రాణుడు కదా! తన రాజ్యం మీద తనే తిరిగి దండయాత్ర చేయడ మేమిటి?” అని అడిగింది.

పూజారి కాగడా వెలుగులో ఆమె అమాయకమైన ముఖాన్ని చూసాడు. మచ్చలేని చంద్రబింబం లాంటి ఆమె ముఖం ఆ కాగడా వెలుగునే వెన్నెలలా ప్రతిబింబిస్తోంది. సమున్నతమైన ఆమె కోటేరులాంటి నాసిక, కనుబొమలనే రెండు ధనస్సుల మధ్యనుంచి ఎక్కుపెట్టిన బాణంలా నిటారుగా ఉంది. లక్కపిడతల్లాంటి ఆమె ఎర్రని పెదవులు, వాటిమధ్య మెరుస్తున్న తెల్లని పలువరస ఎలా కనిపిస్తున్నాయంటే అవి చూసిన పూజారికి ఒక శ్లోకం గుర్తుకొచ్చింది.

రాగవానధర ఏష సన్తతం: నిర్మల ద్విజ సమీప వర్త్యపి
ఏభిరస్య సహవాసతః ప్రియే : నేషదప్యపగతో నిజో గుణం!!”

శుద్ధ సత్వగుణముగల బ్రాహ్మణుల సన్నిధి యందున్నను రజోగుణమును విడువని జనము వలె, తెల్లని దంతముల చేరువనున్నను ఈ యధరము రక్తవర్ణమును విడువకున్నదని ఆ శ్లోక తాత్పర్యాన్ని స్ఫురించేలా చేసింది.

మరుక్షణం ప్రస్తుతానికి వచ్చిన పూజారి, అవనిజా! మన ఏలిక మహ్మద్ షాని, ఖాసిం బరీద్ అనే విద్రోహి యుద్ధంలో ఓడించి, బీదర్ కోటలో బందీని చేసాడు. మన ఏలిక కాస్త సౌమ్యుడు, మెతకవాడు. క్రొత్తగా వచ్చిన ఖసిం బదీర్ సురత్రాణుడు క్రూరుడు, మత యుద్ధమనే పేరుతో ధన మాన ప్రాణాలని దోచుకొనే రక్తపిపాసి. ఆ దుర్మార్గుని సైన్యం ఎలాంటి దౌర్జన్యాలు చేసారంటే ………..

“ఎలాంటి దురాగతాలు చేసాడు బాబాయ్?”

“తల్లీ! ఏం చెప్పమంటావ్?…

భువన విజయంలో మహారాజ శ్రీక్రష్ణ దేవరాయలు, మహామంత్రి తిమ్మరసు, అల్లసాని పెద్దనామాత్యులు తదితర రాజబంధువులు, రాజ పరివార బృందముల ఎదుట, బెల్గాం, బీదర్, కనిబెరిగ నుండి వచ్చిన యువకళాకారుల ‘రామాయణ ప్రదర్శన’ రక్తి కట్టింది. ఆ రోజు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహ ఘట్టం ప్రదర్శింపబడుతోంది.

వడిగుళ్లు సొచ్చి, దేవళ్ల బద్దలు చేసి– ధట్టించి తేజీల గట్టునొకడు
జిగురు పాలకటంచు జిగురించు-రావిమ్రాకుల నజ్జు నజ్జుగా గొట్టునొకడు
గురు సార్వభౌముల గోఢు పోసుక పట్టి-నామముల్మొదలంట నాకు నొకడు
గద్దించి వెన వైదికపు బాపనయ్యల పిల్ల జుట్లూడంగ బెరుకునొకడు
పొట్టేళ్ల గతి బట్టి బోడి సన్యాసుల ఢీయని త్రాకులాడించు నొకడు
సోమయాజుల బ్రహ్మసూత్రముల్ ద్రెంచి, సింగాణి విండ్లకి నల్లెగట్టు నొకడు
పైకాలు గొమ్మని బల్మి గోమటివారి చెలువపై బడి బూతు చేయు నొకడు..”

చాలు, బాబాయ్! చాలు, మరి విన లేకున్నాను” అంది, అవనిజ, కండ్ల వెంట కన్నీరు ధార కట్టగా!

పూజారి ఆమె ముఖం చూసి మనస్థితిని అర్థం చేసుకొని ఆగి పోయాడు. “దిగులుపడకమ్మా, అవనిజా! అశ్వారూఢుడై వచ్చి మన దేవాలయం ముందు హెచ్చరించాడు చూడు, ఒక యువకుడు..”

“అవును బాబాయ్! స్పురద్రూపి అయిన ఒక యువకుడు! అతడెవరు బాబాయ్?!”

“అతడేనమ్మా! మన విమోచనోద్యమ నాయకుడు. పేరు ‘ననుక దేవరాయడు’. .వర్తమాన విజయనగర పాలకుడైన తుళువంశ క్షత్రియుడు, ‘శ్రీకృష్ణ దేవరాయలకు ‘ గురుకుల సహాధ్యాయుడు. విజయనగరానికి వెళ్లి ఖసిం బదీర్ దురాగతాల్ని శ్రీకృష్ణ దేవరాయలకు వినిపించి సహాయమడగాలని తీర్మానించాడు.”

“అలాగా బాబాయ్!” అని ఆగిపోయి దీనమైన స్వరంతో విలపించింది అవనిజ. “నేను ఆడుదానను అయిపోయాను బాబాయ్, లేకుంటే, ననుకదేవరాయునితో కలిసి వెళ్లేదాన్ని” అని అంది.

పుజారి ఆమె మాటలకి నివ్వెరపడి, ఆమె వంక తేరిపార చూసాడు. “అవనిజా! నువ్వు స్త్రీవి కావడమే, ఆ దేవుడు నీకిచ్చిన వరం. కళా పిపాసి అయిన ఆంధ్ర భోజుని నీ నాట్యంతో, నీ గానంతో రంజింప జేసి, ననుకదేవుని సందేశాన్ని వినిపించి మన సహాయానికి తరలించగల కౌశలం నీకే ఉంది. ననుకదేవునితో పాటు..”

“నేను అతనితో వెళ్లేందుకు సిద్ధమే బాబాయ్! విమోచన యజ్ఞానికి ఆహుతి నిచ్చే సమిధ నవుతాను. ఈ ప్రయత్నంలో నేను ప్రాణం పోగొట్టుకోడానికయినా వెనుదీయను. నా నాట్యం, నా గానం, నా కళాకౌశలం దానికి ఉపయోగపడితే జన్మ ధన్యమయినట్లు భావిస్తాను.” అంది అవనిజ ధృఢనిశ్చయంతో.

ఆమె ముఖం, ఇప్పుడు వెన్నెల వెదజల్లే జాబిల్లిలా లేదు. చండ ప్రచండ కిరణాలతో ఎదిరిని భస్మం చేయగల మధ్యందిన మార్తాండుని లాగా భాసించింది ఆ పూజారికి.

************************

సొరంగ మార్గంనుండి బయటపడిన తరువాత చుట్టుప్రక్కల పరిసరాలని చూసింది అవనిజ.

అడవిమధ్యలో అసిరమ్మ గుడి అది! (అసిరమ్మ-శిరము లేని అమ్మ- ఛిన్న మస్త) అప్పటికే అక్కడ ఆరుగురు ఆశ్వికులు, ఒక పల్లకీ తదుపరి ప్రస్థానానికి తయారుగా ఉన్నారు.

ననుకదేవుడు వారిని చూడగానే, అశ్వంనుండి క్రిందకి దిగి భోషాణాన్ని బయటికి లాగడంలో పూజారికి సహాయం చేసాడు. ఆ తరువాత తలవంచి అవనిజకి అభివాదన చేసాడు.

“ననుకదేరాయా! ఇదుగో ఈ అమ్మాయే అవనిజ! గానకోకిల, నాట్యమయూరి, రూపానికి లక్ష్మి, కళా కౌశల్యానికి సరస్వతి, నారీశక్తి ప్రతీకయైన దుర్గ, అమాయకత్వానికి సురభి, ఆలోచనకి ద్రౌపది,..” అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, “ఇక చాలు బాబాయ్!” అని అడ్డుపడింది అవనిజ. ” నా గురించి అతిశయోక్తులు చెప్పేకన్న అతని గురించిన వాస్తవాలు చెప్పండి”, అంటూ.

ననుకదేవుడు కూడా పూజారిని వారించాడు. “గురువర్యా! నా గురించి చెప్పడానికేమీ లేదన్నదే వాస్తవం. ఇప్పుడు చెప్పాల్సినదీ, చేయవలసినదీ నా కీర్తిగానాలు కాదు, శ్రీ కృష్ణదేవరాయల గురించి చెప్పండి.

“శ్రీకృష్ణ దేవరాయలా! ఆయనెవరు?” అడిగింది అవనిజ.

“శ్రీకృష్ణ దేవరాయలు, తుళువంశ క్షత్రియుడు. విజయనగర సామ్రాజ్య వారసత్వాన్ని తన అన్న వీర నరసింహ రాయల దగ్గర నుండి చేపట్టిన రాజాధిరాజు! అతడు ధర్మనిష్టలో యుధిష్ఠిరుడు, బాహుబలమందు భీముడు, ధనుర్విద్యయందు ధనంజయుడు, నిష్కపట నీతి యందు సహదేవుడు, ఔదార్యమందు కర్ణుడు, వ్యూహరచనలో ద్రోణుడు, స్వసైన్య రక్షాతంత్రంలో భీష్ముడు, పరసైన్య విదారణ పద్ధతిలో అశ్వత్ఠామ, అశ్వహృదయ జ్ఞానంలో నకులుడు, సప్రేమ మహాసుందరుల వివక్త సన్నిధిలో కూడా చలించని శ్రీశుకుడు, ఆంధ్ర సాహిత్య కళామతల్లికి అనుంగు పుత్రుడు, అతడే మనకి కాబోయే సార్వభౌముడు.”

అవనిజ తన చేయి చెక్కిలికి చేర్చి, “అర్థమయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పురుషోత్తముడన్న మాట!” అంది.

“అవును మనము ఇప్పుడు అతని సన్నిధికే వెళ్తున్నాం. దేశవిమోచన దీక్షాకంకణులైన యువకిశోరాలు నాతోపాటు ద్వాదశసంఖ్యలో ఉన్నారు. వీరనారీమణులు మీతో కలిసి నలువురు, వెరసి పదహారుగురు. మనమందరం, కళాకారుల లాగా దారిలో మజిలీలు చేస్తూ విజయనగరం చేరుతాం. అల్లసాని పెద్దనామాత్యులవారు, మహామంత్రి తిమ్మరుసులవారు మనకి శ్రీకృష్ణ దేవరాయల సభాభవనమైన భువనవిజయంలో ప్రదర్శనకు ప్రవేశార్హత కలిగిస్తారు. ఆ ఆంద్రభోజుని మనసుని రాగరంజితం చేసాక కానుకలిచ్చే బదులు విమోచన నివ్వమని అడుగుదాం!” ఏకబిగిన చెప్పాడు, ననుకదేవుడు.

“ఆయన ఒప్పుకొంటాడంటారా?”

“ఆయన ఔదార్యంలో కర్ణుడని..”

“అటులనే, ఇప్పుడేం చేయాలి?”

“మీరు ఈ నగల భోషాణంతో పాటు ఆ పల్లకీ నెక్కి కూర్చోవాలి. తక్కిన కథ మన గురువర్యులు, మిత్రులు నడిపిస్తారు.”

************************

భువన విజయంలో మహారాజ శ్రీక్రష్ణ దేవరాయలు, మహామంత్రి తిమ్మరసు, అల్లసాని పెద్దనామాత్యులు తదితర రాజబంధువులు, రాజ పరివార బృందముల ఎదుట, బెల్గాం, బీదర్, కనిబెరిగ నుండి వచ్చిన యువకళాకారుల ‘రామాయణ ప్రదర్శన’ రక్తి కట్టింది. ఆ రోజు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహ ఘట్టం ప్రదర్శింపబడుతోంది.

దేవతల్ హర్షింప దేవ కామినులు— వావిరి నాట్యముల్ వర్థిల్ల జేయ
ఫుల్లాబ్జ దళ నేత్రి, పూర్ణేందువదన — నిల్లాండ్ర మేల్బంతి, యిభరాజవదన

జనకజ చేబట్టె, జన నాధ సుతుడు— ఘన ధన్వి రాముడు ఖచరులు వొగడ
భరతుడు గ్రహియించె భాసురంబుగను—కరముచే మాండవీ కర సరోజమును

సౌమిత్రి పట్టెను, సద్గుణవల్లి.— గామిని యూర్మిళ కర పల్లవంబు
శృతికీర్తి రమణీయ శోభన కరము,— జతగూర్చి పట్టెను శతృఘ్నుడంత!

కళ్యాణమయ్యెను గన్యకామణుల-కళ్యాణ మబ్బెను ఖచరవాసులకు
కళ్యాణ గానముల్ గంధర్వ సతులు—కళ్యాణ రవముచే గళమెత్తి పాడ

నూర్వశీ మేనకలున్నత స్థాయి—గర్వత నృత్యముల్ ఘటియించి యాడ
దేవతల్ సుమములన్ దివినుండి రాల్ప—భువి కళ్యాణోత్సవ భూరి వైభవము

ముగిసెను సంతోష పూర్వకంబుగను!

శ్రీకృష్ణ దేవరాయలు పాటను, నృత్యాన్ని, అభినయాన్ని చూసి ప్రశంసించాడు. కళ్యాణ శబ్దాన్ని పలుమార్లు నానార్థ సూచకంగా వాడినందుకు మెచ్చుకొన్నాడు. ప్రదర్శనకారులను ఏమి కావాలో కోరుకోమన్నాడు.

అవకాశం లభించిన ననుకదేవుడు, అవనిజ తధితరులు తమ రాకలోని పరమార్థాన్ని విడమరిచి చెప్పి రక్షించమని వేడుకొన్నారు. సార్వభౌములు వారిని తన ఏకాంతమందిరంలో కలియమని చెప్పి, కనుసన్నలతో తిమ్మరసుల వారిని అనుసరించమని సూచించి, వారితో పాటు అక్కడ నుంచి కదిలాడు.

************************

శ్రీకృష్ణ దేవరాయలు అరిభయంకరుడై ఖాసిం బదీర్తో పోరి, ఓడించి బీదర్ కోటలో బందీగా పడిఉన్న మహమ్మద్ షాను చెర నుండి విడిపించాడు. అంతే కాదు, ఎవరూ ఊహించని రీతిలో, తిరిగి అతనికే బహమనీ రాజ్యాన్ని అప్పగించాఢు. తిమ్మరసు మంత్రి దూరదర్శిత్వం, రాయల రాజనీతి ఎంత పటిష్ఠమైనవో ఆ సంఘటననే సాక్ష్యంగా ఛెప్పవచ్చు. ఆ రోజేగాని ఆ సురత్రాణుని వధించి ఉంటే తక్కిన ముస్లింపాలకుల మనసులలో ద్వేషబీజాలు మొలకలెత్తి వారందరి ఐకమత్యానికి దోహదం చేసి ఉండేవి. ఆ విధంగా అతడు అల్లసానివారి మాటలలో ‘యవన కోణిభవ స్థాపనా’!!’ అని, ‘పరిభూత సురత్రాణ!!’ అని కొనియాడబడ్డాడు.

ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు (1510 జనవరి 23) క్రిందట జరిగింది అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది!!!

స్వేచ్ఛావాయువులు పీల్చుకొన్న అవనిజా ననుకదేవులు రాయలచేత ఆదేశింపబడి తిరిగి కళ్యాణ బంధంలో బంధింపబడ్డారు..!!!!!!!

Posted in కథ | Tagged | 8 Comments

రెండు

-అవ్వారి నాగరాజు

ఏదో భయం ఉంటుంది
వోరగ తెరచి ఉంచిన అపరిచిత ప్రపంచపు
ఆహ్వానానికై ఎదురు చూసే పెరపెరా ఉంటుంది

రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద
చేతులు చాచుకుని
అగాథపు నీలిమ లోతులలో
పవ్వళించే స్వాప్నికతా ఉంటుంది
ఒక రోజు తొలగి ఇంకొక దానికి దారి చూపే
వేకువలలో  తెలియని సంశాయాత్మతో
తనలోకి తానై ఒక శూన్యతగా తారాడే అశక్తతా ఉంటుంది

అలల కదలికల నడుమ
అలకూ అలకూ కలిపి  తేలికగా నాట్యం చేసే తీగలాంటిదేదో ఉంటుంది
మాటకూ మాటకూ నడుమ కృత్యదావస్థ ఒకటి
పెనుగులాటై భుజాన  వేలాడే  భారపుమూటలా
పక్కటెముకలకూ రాపెడుతూ ఉంటుంది

సాంద్రమై అన్నింటినీ ఏకమట్టం చేసే
మహాసందోహపు అట్టహాసమూ ఉంటుంది
దూరాన ఎక్కడో మనిగిన
గడ్డి పూవు రెక్కలపై
అల్లాడే గాలి తరగలను కొలిచే
సున్నితపు మాపనీ ఉంటుంది

అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి

యధావిధిగా ఏమీ లేనట్టుగా

——————-

అవ్వారి నాగరాజు గారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తెలుగు సాహిత్యం, కవిత్వం మీద ఎనలేని ఆసక్తి.

Posted in కవిత్వం | Tagged | 10 Comments

ఎదురు చూపు

-రవి వీరెల్లి

నీ తలపు
ఎక్కడో పచ్చికబయల్లో పారేసుకున్న మన పాత గురుతులని
ఎదకు ఎరగా వేసి పద పదమని పరుగు పెట్టిస్తుంది

నీ ద్యాస
స్మృతుల శ్రుతిలో స్వరాలాపన చేస్తున్న నా హృదయ లయను
గమకాల అంచుల్లో తమకాల ఉయ్యాలలూపుతుంది

నీ ఊహ
మొగ్గలాముడుచుకున్న జ్ఞాపకాలని బుగ్గరించి విరబూయించి
అనుభవాల రెక్కల చిరుజల్లుగా చిలకరిస్తుంది

నువ్వొస్తావన్న ఆశ

నిశ్చల నీలి సంద్రంలా నిద్దరోతున్న నా మదిని
ఊరించే కోరికల పెను ఉప్పనలో ముంచెత్తుతుంది

ఇదిగో, కాలం వదిలివెళ్ళిన జ్ఞాపకాల నీడల్లో
నీకై ప్రతీక్షించే నాకు వృద్దాప్యం వచ్చిన అలికిడే వినిపించలేదు
నీ ప్రేమే ప్రేరణై
నీ తలపే ప్రాణమై
నీ ఊసే ఉపలాలితమై
తన ప్రతీ స్పందనలో నీకై పరితపించే నా గుండెకు
ఇంకా ఆశల కొనఊపిరిలూదుతూనే ఉన్నా

—————

రవి వీరెల్లి, ఐ.టి ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ రోనోక్, వర్జీనియాలో నివసిస్తున్నారు. తెలుగంటే ప్రాణం, అందులోనూ కవితలంటే మరీ ఇష్టం.

రైతుబిడ్డగా పుట్టిన ఆయనకు ఎప్పటికైనా సొంతఊరు (ఆముదాలపల్లి)  వెళ్లి వ్యవసాయం చేస్తూ రైతుగా బ్రతకాలని కోరిక!

Posted in కవిత్వం | Tagged | 9 Comments

యుద్ధం

-వైదేహి శశిధర్

విరిగిన కొమ్మలా వాలిన

తండ్రి చేతిని తన గుప్పెటలో బంధించి

ఘనీభవించిన కన్నీళ్ళ నావై

వేదనల తెరచాపలెత్తి

ఆ వైపు నిశ్శబ్దంగా నిలచిన ఆమె

 

కదిలే కారుణ్య వీచికనై

చార్టులో రిపోర్టులను మధించి

కరిగిపోతున్న కాలంతో

ఏకదీక్షగా పోరాడుతూ

ఈ వైపు కర్తవ్య నిమగ్ననై నేను

 

నివురు గప్పిన గాండీవాలై

మా మధ్య రెప్పవేయక చూస్తూ

రెస్పిరేటర్లు, డీఫిబ్రిలేటర్లూ

 

ప్రతిరోజూ అమ్ములపొది సర్దుకుని

రుగ్మతలపై యుధ్ధానికి

సన్నధ్ధమవుతూనే ఉంటాను.

కాలం గడచినా, వ్యక్తులు మారినా

యుద్ధం మాత్రం నిరంతరం

సాగుతూనే ఉంటుంది,

వేలాది గాయాలను మాన్పుతూ

————————-

డా. వైదేహీ శశిధర్ గారు పుట్టింది నరసరావుపేట, పెరిగింది గుంటూరు జిల్లాలో. మెడికల్ విద్య -ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. గత పన్నెండేళ్ళుగా అమెరికాలో కుటుంబంతో నివాసం. ప్రస్తుతం న్యూజెర్సీలో ఫిజిషియన్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సాహిత్యం, ప్రత్యేకించి కవిత్వం, సంగీతం అభిమాన విషయాలు. అభిమానకవి తిలక్. ‘నిద్రితనగరం’ కవితాసంకలనం ప్రచురించారు. దీనికి 2009 ఇస్మాయిల్ పురస్కారం లభించింది. అప్పుడప్పుడూ ఇంగ్లీషులో కూడా కవితలు రాస్తూంటారు.

Posted in కవిత్వం | Tagged | 9 Comments

పుష్పగంధి

-డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి

కావ్యమాల – నన్నయ నుండి నిన్నటివరకూ తెలుగు సాహితీ నందనవనంలో విరబూసిన సుగంధభరిత పద్యసుమాల మాల. ప్రతీ యుగములోను కొందరు కవులనెంచుకుని వారి రచనల్లోని అద్భుతమైన కొన్ని పద్యాలను ఉటంకిస్తూ, కీ.శే. కాటూరి వెంకటేశ్వరరావుగారు మాలికగా కూర్చి, “కావ్యమాల” పేరుతో తెలుగువారికి కానుకగా సమర్పించారు. సాహిత్య అకాడమీ పనుపున అల్లిన ఈ పద్య సుమమాలలో సహజంగానే కవిత్రయము, శ్రీనాథుడు, పోతనాదులు చోటుచేసుకున్నారు. ఈ సంకలనంలో వీరితో సమాన స్థానాన్ని పొందిన కవీశ్వరుడు -అనంతామాత్యుడు. భాస్కరుడు, కేతన, మంచనాదుల వంటి తన పూర్వీకులు, జక్కనాదులవంటి సమకాలీనులూ పొందలేని సముచిత గౌరవాన్ని “కావ్యమాల” లో అనంతుడు పొందాడు.

ఆంధ్ర వాఙ్మయమున శ్రీనాథుని కాలము సంధియుగము. ఇతిహాస రచనానంతరమూ, ప్రబంధరచనకు పూర్వమూ ప్రవర్తిల్లిన యుగమే ఈ సంధియుగము. ఈ యుగములో శ్రీనాథుని తరువాత సంస్మరింపదగిన సంస్కార సంపన్నుడగు సత్కవీశ్వరు డనంతామాత్యుడు. ఈతని కృతి భోజరాజీయము. ఇది కథాకథన కావ్యములలో అగ్రగణ్యము, స్వతంత్రతాప్రతిపత్తిని సముపార్జించుకున్న కావ్యరాజము.

కవి తన కావ్యమున అనేక పాత్రలను కల్పించును. అతను తన భావనాబలముతో వానిని పరిపోషించి ప్రాణము పోయును. చైతన్యమును గూర్చును. సహృదయుడైన పాఠకునికి, ’ఇవి లోకములో సాధారణముగా ఎదురుపడు నిజమైన ప్రజలే’ యని నమ్మిక పుట్టించును. ఇట్టి నమ్మకమును కల్గించు శక్తినే పాత్రచిత్రణము లేదా శీలచిత్రణమని అందురు.

కావ్యగత పాత్రలను పఠిత అనురక్తితో పరిశీలించును, పాత్ర ప్రతి చర్య పట్లా ఆసక్తి చూపును. కొన్నిసార్లు తనకు నచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశము చేసి తాదాత్మ్యము చెందుట కూడా కద్దు. పాత్ర ఆంగిక వాచిక సాత్వి కాహార్యాదు లన్నింటియందునూ పఠితకు పట్టరాని తమకము. దృశ్యకావ్యముల కంటే శ్రవ్యకావ్యములం దట్టి పాత్ర సాక్షాత్కారము అతి క్లిష్టము. అట్టిదానిని యెంతగా అక్లిష్టముగావించిన, అంతగా కవి కృతకృత్యుడైనట్లు భావింపనగును. భాషాక్లేశము గల కావ్యములం దిట్టిది మరింత క్లేశమే అగును. కానీ అనంతుని భోజరాజీయమం దిట్టి క్లేశము లేని కారణముగా పాత్రలు స్వేచ్ఛగా సమ సజీవముగా పఠితుల మనోరంగమందు మసలును. పాత్రల ద్వారముననే సంఘటనలు పుట్టును. పాత్రలు లేని సంఘటనలే ఉండవు.

భోజరాజీయ కావ్య మనేకోపాఖ్యాన సంపుటి. ఉపాఖ్యానములలో ఉపకథలు. ఉపకథలలో తిరిగి ఉపోపకథలు చోటు చేసుకొన్న కారణముగా దృశ్యకావ్యము లందువలే ప్రధాన, అప్రధాన పాత్ర నిర్ణయము కష్టమగును. మానవ మానవాతీత పాత్రలే కాక, వివిధములగు పశుపక్ష్యాదులు స్వభావోచితముగా తమతమ పాత్రలను నిర్వహించి కావ్యమున కద్భుతత్వమును చేకూర్చినవి. అందుచే నిది అద్భుత జగత్తుగా రూపొందింపబడెను.

ఇట్టి అద్భుత కథోపేతమైన భోజరాజీయమున అన్నదాన మహాత్మ్యము, సత్యవాక్య మహిమ, తీర్ధయాత్రల మహిమలను వక్కాణించు అనేక కథలు కలవు. అందు అన్నదాన మహిమ నుగ్గడించు వృత్తాంతములలో రత్నమండన పుష్పగంధుల కథ ఒకటి. ఎన్నెన్నో ఉపకథలతో పెనవేసికొన్న అద్భుతమైన కథ ఇది. ఈ వృత్తాంతమును ఒక ప్రత్యేక కావ్యమా అనున ట్లనంతుడు రూపొందించెను. ఇందు పుష్పగంధి నాయిక. భోజరాజీయములో జననమాది వివాహ పర్యంతముగా అభివర్ణితమైన పాత్ర పుష్పగంధి ఒక్కతియే. ఆనాడు యమునితో వాదించి భర్త ప్రాణములను పొందిన సావిత్రితో పోల్చదగిన మహత్తర శీలవతి పుష్పగంధి. అపురూప సౌందర్యవతిగా అద్భుత ప్రజ్ఞాపాటవములు కలిగిన మనోహర మూర్తిగా, విద్యావతిగా, ధైర్యశాలినిగా పుష్పగంధి పఠితల నలరిస్తుంది. తెలుగు సాహిత్యములో ఇట్టి స్త్రీమూర్తి అరుదుగా దర్శనమిస్తుంది.

పుష్పగంధి రాజకుమార్తె. తన్ను వివాహమాడినవాడు వివాహమైన తొమ్మిదినాళ్ళకు బ్రహ్మరాక్షసుని పాల్బడునను జాతక దోషముతో జన్మించిన దురదృష్టవంతురాలు. సద్గుణశీలుడు, ఆచారవంతుడు, నిత్య సత్యధనుడు, పుండరీక పురాధీశుడు అయిన సంపాతి మహారాజుకు, పరమ పతివ్రతయైన చంద్రరేఖకు వరప్రసాదినిగా ఆమె జన్మించింది. దోషజాతకురాలైన కూతురైననూ, ఆ దంపతులు తమ బిడ్డను మిక్కిలి గారముతో పెంచిరి. ఆమె అద్భుత సౌందర్యరాశి.

“చూత నవీన పల్లవము శుధ్ధ సువర్ణ పునీతదోచి తం
జాతరజంబుపై గలయజల్లి మెఱుంగులు దోమిదోమి ల
క్ష్మీతనయుండు వేడ్కపడి చేసిన పుత్తడిబొమ్మ”

పుష్పగంధి. ఆమె చక్కదనము, సౌశీల్యములతో తండ్రి సంపాతియే ధన్యుడైనాడు.

“గౌరియు సిరియు నిజాంక వి
హారిణులగునట్టి హిమ నగాబ్ధుల భంగిన్
ధీరత్వ గభీరత్వము
లారంగా విభుడు మెఱసె నాత్మజతోడన్”

విద్యావిలాసంబులందునూ పుష్పగంధి మేటియే.

“భారతియుండె నొండె నలపార్వతి గాని తలంచి చూడ నీ
నీరజ నేత్ర యొక్క ధరణీపతి పుత్రిక మాత్రగాదు”

అని సజ్జన కదంబము, గురువు మెచ్చునట్టుగా అతి శీఘ్రముగా విద్యలను గ్రహించిన సునిశిత బుద్ధిశాలి పుష్పగంధి. లలితకళలను సైతమూ, సునాయాసముగా స్వంతము చేసికొన్న సుగంధిని.

“పాటయు జదువును వ్రాతయు
నాటయు వాద్యంబు నాదియగు విద్యలకున్
మేటియని పొగడదగియడు
పాటిగ దా నభ్యసించె బాలిక పేర్మిన్”

ఆమె కుమారుడనే భావన తలిదండ్రులకు ఆమె జాతకమే కలిగించింది. పుష్పగంధి పెంపకమటులే సాగినది. ఆమె సౌందర్య మసామాన్యము. యవ్వనవతియైన ఆమె సుకుమార సుందర సురుచిరవదనము, చంద్రుని సైతము కుందునట్లు చేసినది.

ఆ లోలాక్షి లలాట వక్త్ర సదృశత్వాకాంక్ష జంద్రుండు దా
బాలత్వంబు వహించి చూచియు నొగిం బ్రౌఢత్వమున్ బొందియున్
బోలంచాలక జాలిపొంది వగలం బొల్పేది లోగుందె గా
కాలోకింప దదీయబింబపు కురంగాకారముం గూరునే.

ఆ నయనము లా నునుగురు
లా నగుమొగ మా మృదూక్తు లా గాంభీర్యం
బా నడుపు లా విలాసము
లా నెలతకె యొప్పు నొరుల కలవడవెందున్

ఇట్టి సౌందర్యరాశి, రాజకుమార్తెలకు సహజమైన జలక్రీడ పుష్పచయాది నిత్యకృత్యములను చెలికత్తెలతో వనములో సంబరముగా జరుపుకొను సందర్భమున ఒకనాడు రత్నమండనుడను రాజకుమారుడు డేగవేట నిమిత్తమచటకు వచ్చుట సంభవించెను. డేగను వెదకుచు వచ్చిన రత్నమండనునికి చెలువంబుల ప్రోక, విలాసలక్ష్మికింజొచ్చిన ఇల్లు, సౌఖ్యముల చోటు, వికాసము తానకంబు, కన్నిచ్చల యుంకిపట్టు, కుసుమేషుని నికారము జన్మభూమి అన్నట్లున్న చపలాయత నేత్ర, పయోరుహానన అయిన పుష్పగంధి దర్శనమైనది. పుష్పగంధి కూడ రత్నమండనుని తనోవిలాసమును సందర్శించినది. ఒకరిపట్ల మరియొకరు గాఢానురక్తులైరి. పుష్పగంధి కడుముద్దరాలు. తనను గమనించి సౌధములకు మరలిపోదుమని హెచ్చరించిన చెలికత్తెను చూసి ఆమె సిగ్గిల్లినది.

“అనిన నయ్యింతి సిగ్గున నవనతాస్య
యయ్యె నేమిసేయుదు నల్ల యవనినాధ
తనయుడిందు ప్రవేశించెననుచు దనదు
హృదయ మా వయస్యకు జూపునదియపోలె”

ఆమె ప్రవర్తనలోని ఉదాత్తత కిదియొక తార్కాణము. తన్ను వీడి అంతఃపురమున కేగిన పుష్పగంధిని తలచితలచి మూర్ఛబోయి పలుమార్లు ఆమె సౌందర్యమునే ప్రస్తుతించిన రత్నమండనుని మాటలే పుష్పగంధి మనోహర సౌందర్యమునకు తార్కాణములు. పిమ్మట పుష్పగంధి రత్నమండనునిపై ఉదయించిన ప్రేమచే చెలికత్తెతో కొంత దూరము నడచి మనోజాత శరాఘాతయై సోలి వ్రాలిపోయినది. పుష్పగంధికి సౌందర్యముతో పాటు సాహసము, సంస్కారము మిక్కుటము. రత్నమండనుని పంపుపై తన్ను రోయుచు వచ్చిన అతని చెలికాడు ఇంద్రదత్తుని ఆమె పిలిపించి తదానన దర్శనము ‘రోగికి సుహ్రుదుల గంగొనగా గుణమెట్టిదగునట్టి కైవడిజేతో రాగ మెలర్పగ” ప్రవర్తించి ఆతనితో చెలికత్తెలచే సంభాషింపజేసినది. ఇంద్రదత్తునిద్వారా రత్నమండనుని వివరములు సేకరించినది. రత్నమండనుడు మాళవ దేశాధీశుడు, రత్నపురి వాసుడూ నగు నందుని పుత్రుడనియూ, అవివాహితుడనియూ, పుష్పగంధి తెలిసికొనినది. ఇది సాహసమే కదా!

పుష్పగంధిని వివాహమాడినచో వివాహమైన తొమ్మిదినాళ్ళకు తాను బ్రహ్మరాక్షసుని చేతిలో మరణింతునని జాతక ఫలము తెలిసి కూడా రత్నమండనుడు మనస్సు మరల్చుకోలేదనిన, ఆమె ఆతని హృదయము నందెంత పటిష్టముగా నిలచినదో, ఆమె యెంతటి అద్భుత సౌందర్యరాశియో మరొకమారు స్పష్టమగును. అంతియే కాదు, రత్నమండనుడు తన తండ్రితో పల్కిన పలుకులు దీనికి మరో నిదర్శనము.

“.. తక్కటి విచారములేటికి పుష్పగంధికై
తనువెటులైననేమి వసుధం బెఱరాజ తనూజలేల య
య్యనిమిషనాధుపుత్రి దెస నైనను నా హృదయంబు నిల్చునే”

పుష్పగంధి అలౌకిక సౌందర్యమున కీవాక్యమొక్కటి చాలును.

పుష్పగంధి జాతకమురీత్యా దురదృష్టవంతురాలిగా లెక్కింపబడిననూ, రత్నమండనుని హృదయాధిదేవతయై అతడు కోరి వివాహమాడుటచే గొప్ప అదృష్టజాతకురాలైనది.

పుష్పగంధి ఉపాయశీలి. ప్రజ్ఞాపాటవములూ, ధీరత్వమూ కలిగిన అతివ. ఆమె జాతకములో చెప్పినట్లుగానే, వివాహమైన తొమ్మిదవనాడు రత్నమండనుడు వనమున ఏకాంతముగా సంచరించునపుడు, రాక్షసుని చేజిక్కును. గోవ్యాఘ్ర సంవాదమువంటి అద్భుతమైన సత్యవాక్యమహిమను వక్కాణించు కథల నా రక్కసునకు జెప్పి, తనవారిని చూచి మరలి వచ్చుట కా రాక్షసునినుండి అతి ప్రయత్నము మీద అనుమతిని పొంది పుష్పగంధి కడకు వచ్చును.

బ్రహ్మరాక్షసున కాహారముగా పోవుటకు సిద్ధపడుచున్న భర్తను చూచి పుష్పగంధి సామాన్యస్త్రీ వలె రోదింపలేదు. తన జాతకఫలమే ఆతని నిట్లు మృత్యుముఖమునకు త్రోయుచున్నదని తన్ను తాను దూషించుకొనలేదు. ఇచ్చిన మాట ప్రకారము తాను బ్రహ్మరాక్షసున కాహారముగా పోవుచుంటినని నవ్వుచు పల్కుచున్న భర్తను చూసి పుష్పగంధి-

“…. అనిష్టముల్ గని యుపాయ బలంబున ద్రోచుగాక స
జ్జనుడథముండువోలె గనుసన్నను జావ నుపక్రమించునే
విను నృపనందనుండవు, వివేకివి, చక్కనివాడవార్తయౌ
వనుడవు నేడు నీకు దగవా యిటు పల్కగ నాదు సన్నిధిన్”

అనుటలో ఆమె చిత్త స్థయిర్యము, భర్త పట్లగల అమిత విశ్వాసము, అంతర్గతమైన బాధా సుస్పష్టముగా గోచరించును.

తాను బ్రహ్మరాక్షసునకు శపథములు చేసి వచ్చినాడుగాన, తిరిగి ఆతని కాహారముగా వెడలుట తప్పదన్న రత్నమండనునితో పుష్పగంధి, రక్కసునితో ఏమి శపథముచేసి వచ్చెనో తెలుపమన్నది. అట్టి హృదయవిదారక సన్నివేశమున సైతము పుష్పగంధి కనబరచిన ఆత్మ స్థైర్యము శ్లాఘనీయము. పుష్పగంధిని కావ్యనాయిక వలె అనంతుడు రూపకల్పన చేసిననూ ఆమెచే అతిస్వల్పముగా మాత్రమే మాటలాడించును. ఆమె హృదయమును కేవలము ఆమె చేష్టల ద్వారమున మాత్రమే వ్యక్తము చేయించును.

పుష్పాపచయ సందర్భమున సఖులతో ’పట్టెదను డేగను’ అని మాత్రమే తొలుతగా మాటలాడిన పుష్పగంధి ఇచ్చో కొంత ఎక్కువగా మాటలాడినది. ఇది అవుసరము. కావుననే పుష్పగంధి, రత్నమండనుడు రక్కసుని కిచ్చిన మాటను తెలుపమని కోరినది. అందులకు రత్నమండనుడు

“కుడువదొడగునెడ నాకట
గడుదూలుచు నతిధివచ్చి గ్రాసమడిగినం
గడపునతడు పడుపాటుల
బడుదుననును పోయి మరలబడి రాకున్నన్”

నేను ఇంటికి వెడలి తిరిగి నీవద్దకు రాకపోయినచో, భోజనసమయాన మిక్కిలి ఆకలితో వచ్చి ఆహారమడిగిన అతిధిని వెళ్ళగొట్టువాడు ఎట్టి పాపము అనుభవించునో అట్టి పాపమును నేననుభవింతును’ -అని తనచేత రాక్షసుడు ప్రమాణము చేయించుకొనిన సంగతిని రత్నమండనుడు తెలియచేసెను. అది వినిన పుష్పగంధి ముఖము వికసిత కమలమే అయినది. సౌందర్యమును మించిన బుద్ధికౌశల్యమామె సొత్తు. ముగ్ధవలె సృజించిన పుష్పగంధి నోట, కవి ప్రౌఢోక్తులాడించుట సందర్భోచితము. తన మమనున తోచినది వ్యక్తీకరించక, చాల నిబ్బరముగా పుష్పగంధి “పొమ్ము నృపాల పుత్ర! తల పువ్వులు వాడక యుండ నెమ్మదిన్ రమ్మ”న్నది. భార్య మాటలలోని అంతరార్థ మాత డెరుగడు. ఆమె పల్కిన మాటలకు ‘దరహాస భాసురాస్యమ్మలరగ ‘ అతండు బ్రహ్మరాక్షసుని కడకు బయల్దేరెను. మాటకు కట్టుబడి రక్కసుని చేరుటయే అతని లక్ష్యము.

పుష్పగంధి గంభీర హృదయ. స్థిరచిత్త. కానీ భర్తను రక్కసుని కాహారముగా పొమ్మని తానే పంపుచున్న కఠినాత్మురాలిగా పౌరకాంతల దృష్టిలో నిలచినది.

“…….. అమ్మరో చూచితే యాతనియాలికి నారయనెట్టిగుండెయో…” అనువారు కొందఱు.

“రోగయుతుడు గాడు, రూపహీనుడుగాడు
వృద్ధుగాడు దుర్వివేకిగాడు
పడయరాని రాచపట్టి నేమని పుచ్చె
బ్రహ్మరాక్షసునకు భక్షణముగ”

అనువారు ఇంకొందఱు.
పుట్టినపుడె యింత పుట్టూమీదటనని యిట్టు చెప్పితె పురోహితులరాజ

కడిది మృత్యువు పుష్పగంధియై చనుదెంచి, నృపతనూజుని ప్రాణములపహరించుచున్నద
’ని వాపోవువారు మరికొందఱు. ఎవ్వరేమనుకున్ననూ పుష్పగంధి చలించలేదు. రత్నమండనుడు వివాహ గమనోన్ముఖుండునుంబోలె” పెద్దలకు నమస్కరించి ఒంటరిగా సత్యవాక్పరిపాలనకై రక్కసుని కాహారముగా వనమునకు బయల్దేరెను.

పుష్పగంధి సునిశిత బుధ్ధిశాలిని. ఈ లోకనింద కతీతముగా భర్తృ ప్రాణరక్షణార్థము భర్తకు కూడ తెలియకుండ, ఒంటరిగా వాని వెనుకనే అరణ్యమున ప్రవేశించిన ధైర్యశాలిని. తనవద్దకు మరలివచ్చిన రత్నమండనుని చేరి రాక్షసుడు భుజించుట కారంభించు సమయమును జూచి, పుష్పగంధి తన పతి ప్రాణభయంబు తప్పింప నిది యవసరంబని ఊహించి, తనకు తోచిన ఉపాయము నమలుపరచినది.

ఇచ్చట సమయమునకు పుష్పగంధి చూపిన చొరవ, ధీశక్తి, వాక్చాతుర్యము, ధైర్యసాహసములు సామాన్య స్త్రీలకే కాదు, రాచవనితలకు సైతము మార్గదర్శకమే. ఆపదలు కల్గినపుడు తాల్మి వహించి వాని నధిగమించు ఉపాయము వెదకుట సామాన్యము కాదు. తొలుత ముగ్ధలా కనిపించి వివాహానంతరము ప్రౌఢలా దర్శనీయమై, ఈ క్షణములో అపార ధీవిశేషాన్వితయైన ధీరురాలిగా ’ఇంతింతై వటుడింతయై’ వెలిగినది.

భిక్షాందేహి యనుచు గమ
లాక్షి యతని యెదుర నిల్చి హస్తములెత్తన్
వీక్షించి యతడు నీకే
భిక్షమనిన బెట్టు పురుషభిక్షంబనినన్

పుష్పగంధి “భిక్షాందేహీ” యని రాక్షసుని యాచింపగా, ఆతడు “ఏమి భిక్షకావాలో కోరుకొమ్మ” నిన పుష్పగంధి “పురుష భిక్ష” కావలననెను. ఇది ఒక అద్భుతమైన సాహసోపేతమైన వ్యక్తిత్వమును ప్రకటించు స్త్రీ స్వభావము. ఏ శపథము చేయించుకొని బ్రహ్మరాక్షసుడు తన భర్తను తన వద్దకు పంపెనో, అదే మాటతో ఆ రాక్షసుని గెల్చి తన పతిప్రాణములను దక్కించుకొని సావిత్రికి సాటిగా నిలచిన సౌశీల్యవతి పుష్పగంధి.

పుష్పగంధి మాటలకు అంతటి రక్కసుడే చోద్యపడెను. తనమాట తనకే వప్పగించిన పుష్పగంధిని మెచ్చి రత్నమండనుని వదిలివేసెను.

స్త్రీ బుద్ధి ప్రళయాన్ని సైతం శాసించి సౌఖ్యాన్ని నెలకొల్పగలదని పుష్పగంధి ఋజువు చేసెను. నాలుగైదు మార్లు మాత్రమే మాటాడింపజేసి, పుష్పగంధిని పాఠకుల మానస ఫలకముల మీద చెరగనిముద్ర వేయునట్లు తీర్చిదిద్దిన అనంతుడు శ్లాఘనీయుడు.

—————————————

డా. విన్నకోట రాఘవమ్మ, డా. వేలూరి సీతాలక్ష్మి, డా. అయ్యగారి విజయలక్ష్మి గార్లచే ఇటీవల ప్రచురింపబడిన ’నవ పారిజాతాలు’ పుస్తకము నుండి. ప్రాచీన కావ్యాలలోని విశిష్ట మానవ, మానవేతర పారిజాతాల మనోవికాస పరిమళాల సమాహారం, ఈ పుస్తకం. ఈ పుస్తకావిష్కరణ 2010, మార్చి 28 న విశాఖపట్నంలో సద్గురు శ్రీ శివానందమూర్తిగారి అశీస్సులతో జరిగింది. వివరాలకు, భారతదేశంలో డా. రాఘవమ్మ – ఫోన్: 9703048458 లేక అమెరికాలో డా. సీతాలక్ష్మి – లను సంప్రదించవచ్చు.

ఉపయుక్త గ్రంధములు:

భోజరాజీయము
కావ్యమాల

అనంతామాత్యుడు

క్రీస్తుశకం (సామాన్యశకం) 1425, 1434 ల మధ్య అనంతామాత్యుడు ‘భోజరాజీయం’ అనే కథా కావ్యం, ‘ఛందోదర్పణం’ అనే ఛందశ్శాస్త్రం ‘రసాభరణం’ అనే అలంకార శాస్త్రం రాశాడు. ‘భోజరాజీయం’ మహుడనే పేరుగల రాజు చరిత్రతో మొదలవుతుంది. తర్వాతి కథలలో భోజుని పూర్వజన్మ వృత్తాంతం, భోజరాజుగా జన్మించడం, సిద్ధుడి ద్వారా ‘ధూమవేధి’ విద్యను పొందడం వంటి కథలున్నాయి. ఈనాడులో భోజరాజీయం గురించిన వ్యాసం. వికీపీడియాలో అనంతామాత్యుడు పేజీ.

కొండూరు రాఘవాచార్యులు సంగ్రహించిన భోజరాజీయం

—————————————

డా. వేలూరి సీతాలక్ష్మి

చెన్నైలో పుట్టి, బాపట్లలో పెరిగిన డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి విశాఖ జిల్లా అనకాపల్లిలో 32 సంవత్సరాలకు పైగా తెలుగు అధ్యాపకురాలిగా, రీడరుగా పనిచేసి, ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారి పర్యవేక్షణలో అనంతామాత్యునిపై ఆమె రచించిన “భోజరాజీయ కావ్యానుశీలనం” గుంటూరు నాగార్జునా విశ్వవిద్యాలయంలో ఉత్తమ పరిశోధనాగ్రంధంగా ఆచార్య తూమాటి దోణప్ప బంగారు పతకం పొందింది. భమిడిపాటి రామగోపాలం (భరాగో) గారితో కలిసి తెలుగు చిత్రగీతాలపై ఆమె రచించిన “మరో నూటపదహార్లు” అనే పుస్తకం ప్రాచుర్యంలో ఉంది. ప్రఖ్యాత గాయని పద్మవిభూషణ్ శ్రీమతి పి. సుశీలపై “వెండివెన్నెల జాబిలి” అనే శీర్షికతో వ్రాసిన వ్యాసం భరాగో, ఇతరులు రూపొందించిన ఒక అభినందన సంచికలో భాగంగా వెలువడింది. ఇవికాక అనేక పుస్తక సమీక్షలు, సాహిత్య ప్రసంగాలు చేశారు.

ప్రస్తుతం ఆమె ఆంధ్ర పద్యకవితా సదస్సు విశాఖజిల్లా శాఖకు ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె అభిరుచులు -రసరమ్య గీతాల, రసాలూరే పద్యాల శ్రవణం, పఠనం.

Posted in వ్యాసం | 4 Comments

కవికృతి – ౬

దామోదర్ అంకం:

నేనెవర్ని…?!

ఎంత తప్పించుకుందామనుకున్నా..
నాకు నేను ఒంటరిగా దొరికిపోయినపుడు…
అమ్మ ఒడికి దూరంగా..
కానీ అంతే గారాబంగా..
నాకు నేను జోల పాడుకున్నపుడు…

ఎవరికి చెప్పుకోవాలో తెలియక..
నాకు నేను అద్దంలో విన్నవించుకున్నపుడు…
చిరుగాలి పరుగెడుతుంటే..
ఆ శబ్దం నను భయపెడుతుంటే..
నాకు నేను ధైర్యం చెప్పుకున్నపుడు…

సమయం నను తిరస్కరిస్తుంటే..
“ఏంకాదు” అని నన్ను నేను హత్తుకున్నపుడు…
తొందర పడుతున్న కాలానికంటే..
అపుడపుడూ నే ముందు పొతుంటే..
నన్ను నేను సంతోషంతో ఎత్తుకున్నపుడు…

ఒంటరిగా ఉంటే గంటలు గంటలు..
నన్ను నేను తుంటరిగా మట్లాడించినపుడు…
రాత్రి ఆకలౌతుందంటూ..
ఈ ఒక్క బుక్కా తినమంటూ..
నన్ను నేను బుజ్జగించుకున్నపుడు…

నాకు నేను ఎమౌతాను..?
నన్ను నేను ఎటు తీసుకుపొతాను..?
అసలు,,…నాకు “నేనెవర్ని”…?

*************

పవన్ కుమార్: కవిత చాలా బాగుంది, భావ క్రమం ఎంతో హృద్యంగా ఉంది. చాలా మంచి కవిత. నాకు నేను ఎమౌతాను..? అని ఆపితే ముగింపు శిల్పం అందగిస్తుంది. ఈ కింది పంక్తులిక అనవసరం.

నన్ను నేను ఎటు తీసుకుపొతాను..?
అసలు,,…నాకు “నేనెవర్ని”…?

***************************

చావా కిరణ్:

ప్రియా, వారందరి వెనక,

నీడల్లో ఎక్కడున్నావు?

నిన్నల్లరి పెడుతూ, నెడుతూ

మట్టిరోడ్డులో నడుస్తున్నారు.

అనంతంగా ఎదురు చూస్తున్నాను,

నీ కోసం పూలను సమర్పిస్తూ,

నడిచే వారంతా అందుకుంటున్నారు

ఒక్కొక్కటిగా పూలన్నీ,

నా బుట్ట రమారమి ఖాళీ అయింది.

ఉదయం వెళ్లి పోయింది,

మధ్యాహ్నం కూడా.

సాయంత్రపు నీడల్లో,

నా కళ్లు నిద్రతో మత్తెక్కాయి.

ఇంటికి మరలే వారు చూసి

నవ్వి సిగ్గుతో నన్ను నింపుతున్నారు.

బిచ్చగత్తెలా మొహంపై

బట్ట కప్పుకోని కూర్చున్నాను.

నీకేంకావాలి అంటూ వారడిగితే

కళ్లు నేలచూపి జవాబివ్వకున్నాను.

ఓహ్, వారికి నేనెలా చెప్పగలను

నీ కోసం ఎదురు చూస్తున్నానని.

నువ్వు వస్తానన్నావని.

కట్నం కోసం ఈ పేదరికాన్ని

కౌగిలించుకున్నానని ఎలా చెప్పను.

ఈ రహస్యాన్ని గర్వంగా దాచుకున్నాను.

గడ్డిపై కూర్చోని ఆకాశం వంకచూస్తూ కలగంటున్నా

నీ అద్భుత అకస్మాత్తాగమనానందక్షణాన్ని

స్వర్ణ ధ్వజాలు ఎగురుతున్న రథంలోని

నీ సింహాసనం నుండి దిగి వచ్చి,

ఎండా కాలపు లతలా వాడిన

ఈ పేదింటి అమ్మాయిని పిలిచి

నీ పక్కకు తీసుకోవటం చూసి

వీరంతా అవాక్కయినట్టు కలగంటున్నాను.

—-

కాలం దొర్లి పోతోంది, కాని

నీ రథ చక్రాల సవ్వడి లేదు.

ఎన్నో ఊరేగింపులు

సంరంభంగా వెళ్తున్నాయి.

కేవలం నువ్వే-

వాటన్నింటికీ వెనకమాల-

నీడల్లో నిశబ్దంగా నిల్చున్నావు.

కేవలం నేనే-

అవిశ్రాంతంగా వేచి రోదించి-

కరిగి విషాదంలో మునుగుతున్నాను.

గీతాంజలి 41

Where dost thou stand behind them all, my lover, hiding thyself in the
shadows? They push thee and pass thee by on the dusty road, taking thee for
naught. I wait here weary hours spreading my fierings for thee, while
passers-by come and take my flowers, one by one, and my basket is nearly
empty.

The morning time is past, and the noon. In the shade of evening my eyes are
drowsy with sleep. Men going home glance at me and smile and fill me with
shame. I sit like a beggar maid, drawing my skirt over my face, and when
they ask me, what it is I want, I drop my eyes and answer them not.

Oh, how, indeed, could I tell them that for thee I wait, and that thou hast
promised to come. How could I utter for shame that I keep for my dowry this
poverty. Ah, I hug this pride in the secret of my heart.

I sit on the grass and gaze upon the sky and dream of the sudden splendor of
thy coming all the lights ablaze, golden pennons flying over thy car, and
they at the roadside standing agape, when they see thee come down from thy
seat to raise me from the dust, and set at thy side this ragged beggar girl
a-tremble with shame and pride, like a creeper in a summer breeze.

But time glides on and still no sound of the wheels of thy chariot. Many a
procession passes by with noise and shouts and glamour of glory. Is it only
thou who wouldst stand in the shadow silent and behind them all? And only I
who would wait and weep and wear out my heart in vain longing?

గీతాంజలి – 4o

వాన చినుకు లేదు,

రోజుల తరబడి,

నా బీడు గుండెలో

అయ్యో ప్రభూ.

ఉపరితలమంతా శూన్యం,

ఒక్క చిట్టి మేఘం లేదు,

సుదూర వర్ష చిన్నెలూ లేవు.

సరిలేని, భయంకరమైన

నీ క్రోధ తుఫానులు పంపు

అదే నీ ఆలోచనైతే,

ఇంకా ఆకాశం ఆ కొస నుండి

ఈ కొసకు సాగు మెరుపుల కొరడాలు

కానీ, నా ప్రభూ.

వెనక్కి పిలువు వెంటనే

హృదయాన్ని నిలువునా దహిస్తున్న

ఈ నిశబ్ద సూటి

క్రూర భయంకర సెగలను

ఆకాశపు అనంత కొస నుండి

దయా మేఘాన్ని దిగువకు పంపు

కన్నతల్లి కన్నీటి దీవెనలా

కన్నతండ్రి కోమల కౌగిలింతలా

The rain has held back for days and days,
my God, in my arid heart.
The hori­zon is fiercely naked-
not the thinnest cover of a soft cloud,
not the vaguest hint of a dis­tant cool shower.
Send thy angry storm, dark with death,
if it is thy wish, and with lashes of light­ning
star­tle the sky from end to end.
But call back, my lord,
call back this per­vad­ing silent heat,
still and keen and cruel,
burn­ing the heart with dire despair.
Let the cloud of grace bend low from above
like the tear­ful look of the mother on the day of
the father’s wrath

పవన్ కుమార్: భావోద్వేగం ఉన్న కవిత. కట్నం, పేదరికం అంటూ కృత్రిమతను అంటించే పంక్తులు లాగేస్తే శోభనిస్తుంది.
ఈ కింది చరణం పూర్తిగా తీసెయ్యొచ్చు.

“కట్నం కోసం ఈ పేదరికాన్ని
కౌగిలించుకున్నానని ఎలా చెప్పను.
ఈ రహస్యాన్ని గర్వంగా దాచుకున్నాను”.

గీతాంజలి 40

అనువాదం చెయ్యడానికి కావాల్సింది కొండంత సహనం. మూలం ఏ భాష అయినా కనీస పరిజ్ఞానం మూల భాషలో ఉండి తీరాల్సిందే (కవిత్వానికి మరీ ముఖ్యం). మూలాన్ని చూడకుండా అనువాదానికి పూనుకోవడం తప్పు. గీతాంజలి మన భారతీయ భాషలలోనిది, దానిని ఇంగ్లీషు నుంచి చెయ్యాల్సిన ఖర్మ ఎందుకు? కొంత కష్టపడితే బెంగాలీ చదవడం రాయడం నేర్చుకోవచ్చు, తప్పకుండా ఇంగ్లీషులో చదివి ముందుగా సారాంశం అర్థం చేసుకున్నా వెన్నుదన్నుగా మూలాన్ని చదవడమో, చదివించుకొని వినడమో చెయ్యాలి అనువాదకుడు. బెంగాలీ నుంచి నేరుగా కాకపోయినా బెంగాలీ కొంత పరిజ్ఞానం తప్పదు. మన తెలుగులో ఈసరికే ఉన్న గీతాంజలి అనువాదాలను పరిశీలించడం అవసరం.

కింది ఈమాట లింకులో గీతాంజలి అనువాదాల మీద సమీక్ష ఉంది.

http://www.eemaata.com/em/issues/200605/67.html

బెంగాలీలో ఇది పూర్తి వచన కవిత్వం కాదు అని మూలాన్ని పరిశీలిస్తే తప్పక అర్థం అవుతుంది. రూప శ్రద్ధ అనువాదకుడికి చాలా ముఖ్యం.

బెంగాలీ మూలం (కొన్ని పంక్తులు) తెలుగులో కింద :

దీర్ఘకాల్, అనావృష్టి, అతి దీర్ఘకాల్

హే ఇంద్ర్, హోదయే మం, దిక్చక్రబాల్

భయంకర్ శూన్య హెరి, నాయ్ కూనూఖానే

సరస్ సజల్ రేఖ కెహ్ నాహి ఆనే

నవ్ బారి బర్షనేర్ శ్యామల్ సంవాద్

జొది ఇచ్చా హొయ్ దేవ్, అను బజ్రనాథ్

ప్రలయముఖేర్ హింశ్రార్ ఝటికార్ సాథే

పలే పలే బిద్యుతేర్ బక్ర కశాఘాతె

Posted in కవిత్వం | Tagged , | 5 Comments

ఓపెన్ టైప్

-అరిపిరాల సత్యప్రసాద్

కొంచెం దూరంగా తన కొలీగ్స్‌తో భోజనం చేస్తూ కనపడిందామె. చటుక్కున తల తిప్పుకున్నాను.

“ఉష లాగా వుందే..!! లాగా వుండటం ఏమిటి ఉషే.. కొంచెం వొళ్ళు చేసినట్లుంది..!! నన్ను చూసిందా? గుర్తు పట్టిందా? ఏమో.. గుర్తు పట్టకపోతే బాగుండు..!!” అనుకుంటూ, మళ్ళీ అటు చూడకుండా భోజనం వడ్డించుకున్నాను.

నాకు ఆ కంపెనీలో అదే మొదటిరోజు. ఇండక్షన్ ట్రైనింగ్ జరుగుతోంది. మూడేళ్ళ వుద్యోగానుభవం వున్నా.., కొత్త కంపెనీ, కొత్త ఇండస్ట్రీ కావటంతో నాకు అంతా కొత్తగా వుంది. అప్పుడే పరిచయమైన కొత్త మిత్రులతో కలిసి క్యాంటీన్‌లో వున్నాను.

“హేయ్.. రమణ, ఈజ్ దట్ యూ?” వినిపించి వెనక్కి చూశాను. ఉష..!!

“ఉష.. హాయ్.. ఏంటి ఇక్కడ” అన్నాను ఆశ్చర్యం నటిస్తూ.

“అవును ఇక్కడే.. బిజినెస్ ఎక్సలెన్స్ టీంలో వున్నాను.. సో.. నువ్వు ఇక్కడే చేరావన్నమాట.. ఏ డిపార్ట్మెంట్?” అడిగింది నా మెళ్ళో వున్న ట్రైనీ టాగ్ చూసి.

“ఎలయన్సెస్” చెప్పాను క్లుప్తంగా. తను నవ్వింది.. ఐదు సంవత్సరాల క్రితం నన్ను కట్టిపడేసిన అదే నవ్వు..!!

“ఎలయన్సెస్.. ఎవరెవరికి..??” అంటూ మళ్ళీ నవ్వింది. నేను చిన్నగా చిరునవ్వు నవ్వాను.

“నన్ను చూసి ఎక్సైట్ అవుతావనుకున్నాను.. అలాంటిదేమీ లేదే?.. సర్లే నా తో రా” అంటూ చెయ్యి పట్టుకుంది. “ఫ్రెండ్స్ వున్నారు.. ట్రైనింగ్ మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు, త్వరగా వెళ్ళాలి” అన్నాను

“ఓకే.. ట్రైనింగ్ అయిపోగానే నాకు రింగ్ చెయ్యి.. కలుద్దాం” అనేసి వెళ్ళిపోయింది.

లంచ్ చేసి, ఫ్రెండ్స్‍తో కిందకి వెళ్ళి సిగరెట్ వెలిగించగానే ఉష కూడా అక్కడికి వచ్చింది.

“ఓ, నువ్వు కూడా మొదలెట్టావన్నమాట.. ఏదీ నాకూ ఒకటి ఇవ్వు” అడిగింది. ఆడవాళ్ళు సిగరెట్ తాగడం నాకేమి కొత్తకాదు.. కాని ఉష సిగరెట్ కాలుస్తుందా?

“ఒక్కటే వుంది..” చెప్పాను.

“ఫర్లేదు.. వీ కెన్ షేర్” అంటూ నా చేతిలో సిగిరెట్ అందుకుంది. గట్టిగా రెండు దమ్ములు లాగి తిరిగి నా చేతిలో పెట్టింది. ఉష పెదవులను తాకిన సిగిరెట్ నా పెదవుల మీదకి.. ఆ వూహే నాకు గిలిగింత పెట్టింది. అదీ నా కొలీగ్స్ ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలిసినప్పుడు ఇంకా గమ్మత్తుగా వుంది. ఇద్దరం కలిసి సిగరెట్ పూర్తి చేశాం.

“మర్చిపోవద్దు.. ట్రైనింగ్ అవ్వగానే కలుద్దాం” అని మళ్ళీ చెప్పి తను వెళ్ళిపోయింది.

“ఎవరు రమణ ఆ అమ్మాయి?” అడిగాడు ట్రైనింగ్ రూంలో నా పక్కనే కూర్చున్న హేమేంద్ర.

“కాలేజిలో నా సీనియర్.. ఉష ” చెప్పాను నేను టూకీగా. “సీనియర్” అనగానే అతను వూహించుకున్నదంతా తప్పు అనుకున్నాడేమో మళ్ళీ మాట్లాడలేదు. కాని అతను వూహించుకున్నదానికన్నా ఎక్కువే జరిగిందని అతనికి తెలియదు.

***

నేను ఎంబీయే కాలేజిలో చేరిన మొదటిరోజే ఉష పరిచయమైంది. భయంభయంగా నడుస్తున్న నన్ను సీనియర్స్ గ్యాంగ్ ఒకటి పిలిచింది. నాకిప్పటికీ గుర్తు.. అందరూ లైబ్రరీ మెట్లమీద కూర్చోని వున్నారు. అందరి మధ్యలో ఉష.. బ్లాక్ జీన్స్ పైన ఎర్రటి స్లీవ్లెస్ టాప్.

“పేరు” ఎవరో అడిగారు.

“రమణ సార్”

“పూర్తి పేరు చెప్పు”

” ”

“చెప్పు”

“వద్దు సార్ మీరు వెక్కిరిస్తారు”

“అంత వెక్కిరించే పేరా.. అయితే చెప్పాల్సిందే”

“హటకేశ్వరం ఇందీవర వెంకటరమణ”

ఉష వెంటనే నవ్వింది.. మిగతావాళ్ళకి అర్థమవ్వలేదు. తను నిలబడి –

“అంటే ఎచ్.ఐ.వి. రమణ అన్నమాట” అన్నది నవ్వుతూనే. అందరూ ఘొల్లు మన్నారు.

“అందుకే మేడం, పేరు చెప్పను అన్నది..” అన్నాను ఆమె వైపు చూస్తూ.

“ఏయ్.. మేడం ముందు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావా? దించు.. చూపు దించు..” అన్నాడు పక్కనే వున్న మరో సీనియర్. నేను కొంచెం తల దించాను. పూర్తిగా దించలేదని ఆమెకి కోపం వచ్చింది.

“కిందకి దించు అంటే ఎక్కడరా చూస్తున్నావు.. ఇక్కడేనా చూస్తున్నావూ?” అన్నది గుండెమీద చెయ్యేస్తూ. నేను భయంగా తలెత్తాను..

“ఏంటి నచ్చిందా? చూడు అయితే.. చూడు..” అంటూ చేతులు వెనక్కి విరిచి ముందుకొచ్చింది. అప్పుడు నేను పరుగెత్తిన పరుగు క్లాస్‌రూంకి వెళ్ళేదాకా ఆపలేదు. వెనకాల అందరూ నవ్వుతున్నారు.

***

అందరూ నవ్వుతున్నారు. ట్రైనర్ నా వైపే చూస్తున్నాడు..

“విల్ యు ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్.” అన్నాడు కోపంగా.

“సారీసార్.. మీరు చెప్పింది వినలేదు.” చెప్పాను నేను నిజాయితీగా.

“ఇది కాలేజ్ కాదు.. ట్రై టు బి ప్రొఫెషనల్..!!” అన్నాడు కోపంగా. నేను తల వూపాను. కాని మనసు ఉష చుట్టే తిరుగుతుంటే ఆలోచనలని ఎలా ఆపగలను?

ఎలాగైనా ఈరోజు కలవకుండా తప్పించుకోవాలి. ట్రైనింగ్ అయిపోగానే గెస్ట్‌హౌస్‌కి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ‘ఉష అంటే ఎందుకంత భయం..’ అంతలోనే అనిపించింది. తనతో నాకు వున్న ఇంటిమసీ వేరే ఎవ్వరికీ వుండేది కాదు.. అప్పుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు గిల్టీగా ఫీలౌతున్నానా? ఏమో అర్థం కావటంలేదు. కాని ఉష మాత్రం ఏమి మారినట్టులేదు. అదే రెక్లెస్‍నెస్ అదే ఓపెన్ టాక్..!!

ట్రైనింగ్ పూర్తైపోయింది. మిగిలినవారు ఏవో జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యాలని ఆగిపోయారు. నేను మాత్రం వెంటనే టాక్సీ ఎక్కి గెస్ట్‌హౌస్‌కి వెళ్ళమని చెప్పి, నిర్లిప్తంగా కిటికీ లోనించి బయటకు చూస్తున్నాను.

ఉష నాకోసం ఎదురు చూస్తుంటుందా? అసలు ఎందుకు వుండమంది? కాలేజిలో నా రాగింగ్ ప్రహసనం విన్న తరువాత నా క్లాస్‌మేట్స్ చెప్పింది గుర్తుకు వచ్చింది.

“ఆ అమ్మాయి పేరు ఉష.. చాలా ఓ…పెన్” అన్నాడు మధుర్ చివరి పదాన్ని సాగదీస్తూ.

“అంటే”

“అంటే ఏముంది బ్రదర్.. షీ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్.. నెవర్ సే నో.. ఇంట్రెస్ట్ వుంటే ప్రయత్నించు” చెప్పాడు వాడు. అది విన్న తరువాత నాకెందుకో ఆమెంటే మంచి అభిప్రాయం కలుగలేదు. కాని ఇప్పుడు..!! ఇప్పుడున్న అభిప్రాయమే వేరు..!!

టాక్సీ ఏదో సిగ్నల్ దగ్గర ఆగింది. ఒక పిల్లాడు చేతిలో రకరకాల మేనేజిమెంట్ పుస్తకాలు పెట్టుకుని అమ్ముతున్నాడు. ప్రత్యేకించి రెండు పుస్తకాలు నన్ను ఆకర్షించాయి – “రాబర్ట్ కియోసాకి – రిచ్ డాడ్ పూర్ డాడ్” దాని పక్కనే “రాబిన్ శర్మ – ద మాంక్ హూ సోల్ద్ హిస్ ఫెరారి”. అవే పుస్తకాలు.. కాలేజిలో ఉషతో నాకు పరిచయాన్ని, ఆ తరువాత చనువుని పెంచినవి….

నా చేతిలో “రిచ్ డాడ్..” పుస్తకం చూసి అడిగింది.

“నచ్చిందా?” అని

“ఏమిటి?”

“అదే ఆ బుక్”

“బాగానే వుంది..”

“ఏంటి బాగుండేది.. ఇట్స్ కంప్లీట్‌లీ మెటీరియలిస్టిక్.. రీడ్ రాబిన్ శర్మ.. అతను మెటీరియల్ ప్లజర్స్ అనుభవించి వాటికి అతీతంగా వుండాలని వ్రాసిన పుస్తకం” చెప్పింది.

“మెటీరియలిజం అంటే మీకు ఇష్టంలేదా?” అంటే ఆ అమ్మాయి నవ్వింది.

“నీ గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్ తరువాత ఆమెకి వెయ్యి రూపాయలు ఇస్తే ఆమె ఏమంటుంది” అడిగింది కాజువల్‌గా. వూహించని ప్రశ్నకి ఖంగు తిన్నాను. తడబాటును కప్పిపుచ్చుకోని –

“నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు..” అన్నాను.

ఉష గట్టిగా నవ్వి “చో చ్వీట్..” అంటూ నా తలపై చేత్తో చిన్నగా కదిపింది.. “ఎనివేయ్.. నేను చెప్పాలనుకున్నది నీకు అర్థమైందని నాకు తెలుసు” అంటూ కన్ను గీటింది.

“అలా ఎలా తెలుస్తుంది?” అడిగాను.

తను నాకు దగ్గరగా వచ్చి అన్నది – “అదే కాదు… గర్ల్‌ఫ్రెండ్ తో సెక్స్ అనగానే నీ ఖంగారు చూస్తే నువ్వు వర్జిన్ అని కూడా తెలిసిపోయింది..”

నా గుండె కొట్టుకుంటున్న వేగం మెదడు దాకా తెలుస్తోంది. ఈమె నిజంగానే ఆ టైపా? చూడటానికి చక్కగానే వుందే..! ఏమైనా ఈమెకి దూరంగా వుండాలి అనుకున్నాను.

“ఈవినింగ్ ఇంటికిరా ఆ పుస్తకం ఇస్తాను.. డోంట్ ఫర్గెట్..” అనేసి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి తల మీద చెయ్యి పెట్టి అన్నది – “చో స్వీట్..” అని.

***

“సార్, బాంద్రా గెస్ట్‌హౌస్” అన్నాడు టాక్సీ డ్రైవర్.

నేను తేరుకోని డబ్బులిచ్చి నా రూంలోకి వడివడిగా వెళ్ళిపోయాను. రూంలో బాత్‌టబ్ వుంది. దాని నిండా గోరువెచ్చటి నీళ్ళు నింపుకోని అందులో దిగాను. మళ్ళీ ఉష గురించే ఆలోచన. ఇప్పుడు ఎక్కడ వుంటుంది? నా కోసం ఎదురుచూస్తూ ఆఫీస్‌లోనే వుంటుందా? లేకపోతే తన గురించి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి వుంటుందా? పెళ్ళైందో లేదో..!!

అప్పుడు కాలేజిలోనూ అలాగే చేశాను.. తను రమ్మన్నా నేను ఆమె ఇంటికి వెళ్ళలేదు.

“నువ్వు వస్తావని ఎంతసేపు వైట్ చేశానో తెలుసా? ఇంట్లో ఎవ్వరూ లేరు.. నాకు బోరు కొడుతూ వుండింది. నువ్వొస్తే ఎంత బాగుండేది” అన్నది

“మార్కెటింగ్ ప్రాజెక్ట్ గురించి ప్రొఫెసర్‌తో…” చెప్తుండగానే మధ్యలో అందుకుంది.

“స్టాపిట్ యార్.. ఒక అమ్మాయి పిలిస్తే రాకపోవటానికి చాలా సిల్లీ రీజన్ అది.. వేరే ఏదైనా అమ్మాయితో కలిసి పార్క్‌కి వెళ్ళాను అనో డేట్‌కి వెళ్ళాననో చెప్పు కొంచెం బాగుంటుంది” అన్నది

“ఛ ఛ అలాంటిదేమి లేదు”

“ఛ ఛ ఏమిటి.. అదేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు.. నేనైతే తప్పు చేసినా ఛ ఛ అనుకోను తెలుసా?” కన్నుగీటింది.

ఏమిటీ అమ్మాయి.. ఎందుకలా మాట్లాడుతోంది..??

“ఈ రోజైనా వస్తావా..?” అడిగింది

“వస్తాను” చెప్పాను.

నా క్లోజ్ ఫ్రెండ్ శేఖర్‌కి జరిగింది చెప్పాను. పక్కన మధుర్ కూడా వున్నాడు.

“నాకు తెలిసి ఆ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.. గో ఎహెడ్ బ్రదర్..” అన్నాడు శేఖర్.

“అవును.. మంచి ఛాన్స్.. నేను ముందే చెప్పానుగా.. ఆల్వేస్ విల్లింగ్.. ఎంజోయ్ రమణ” అన్నాడు మధుర్.

“ఛ.. ఛ.. అలాంటిదేమిలేదు.. పుస్తకం ఇవ్వటానికే..” అన్నాను నేను తడబాటుగా.

“పుస్తకం ఇవ్వాలంటే తనే తెచ్చి ఇవ్వచ్చుగా.. ఇంటికి రమ్మనడం ఎందుకూ” శెఖర్ అడిగాడు.

“అవును.. అది కూడా ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పడం ఎందుకూ? అనుమానమే లేదు..” మధుర్ వంతపాడాడు.

“నాకు ఇలాంటివేమి తెలియదురా.. ఫస్ట్ టైం” అంటుంటేనే నాకు గుండెల్లో దడ పెరుగుతోంది.

“ఫర్లేదులేరా.. ఆ అమ్మాయికి అంతా తెలిసే వుంటుంది.. తీసుకెళ్ళాల్సినవి మర్చిపోకు” అన్నాడు కన్ను గీటుతూ.

“ఛ..” అన్నాను మనసులో మరోరకంగా ఆలోచిస్తూ.

ఆ రోజు సాయంత్రం రూంలో స్నానం చేసి నీటుగా తయారయ్యాను. మథుర్ తన సెంట్ బాటిల్ ఇచ్చి “వాడరా.. బాగుంటుంది” అన్నాడు. శేఖర్ తన బైక్ ఇచ్చాడు. కొత్త పెళ్ళికొడుకుని శోభనానికి తయారు చేసినట్లు ముస్తాబు చేశారు ఇద్దరూ. మధ్య మధ్యలో ఆ టైపు జోకులు.. చివరికీ విజయీభవ అంటూ ఆశీర్వదించి పంపించారు.

ఉష ఇంటికి వెళ్ళాను. గుండె చప్పుడు చెవుల్లో కొడుతున్నట్టు వినపడుతోంది. నుదిటిమీద చమట తుడుచుకున్నాను. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ మీద చెయ్యిపెట్టి మళ్ళీ వద్దనుకున్నానో లెక్కే లేదు. చివరికి స్థిరంగా నిర్ణయించుకోని కాలింగ్ బెల్ కొట్టాను.

***

గణగణ మోగింది ఫోను. అలా ఎంతసేపు బాత్ టబ్బులో వున్నానో నాకు తెలియనే లేదు. చట్టుక్కున లేచి టవల్ చుట్టుకోని ఫోను ఎత్తాను. అవతల రిసెప్షనిష్ట్.

“సార్ మీకు ఎవరో ఫోన్ చేశారు..!! కనెక్ట్ చెయ్యమంటరా” అడిగిందామె.

“సరే ఇవ్వండి” అన్నాను. అది ఖచ్చితంగా ఉషే అని అనిపించింది. నా ఆలోచన తప్పు కాదు.

“ఏమైంది.. నన్ను కలవమన్నాను కదా”

“ఏం లేదు.. కొంచెం ఫ్రెష్ అయ్యి వద్దామని రూంకి వచ్చాను” అబద్దం చెప్పాను.

“ఏంటి సంగతి.. ఫ్రెష్‌గా వచ్చి ఏం చేద్దామని..” అంటుంటే ఆమె గొంతులోనే చిలిపితనం వినపడుతోంది.

“నువ్వేం మారలేదు ఉషా” అన్నాను నేను.

“అవును.. మారే వుద్దేశ్యాలు కూడా లేవు.. నాతో పాటు వస్తే నీకే తెలుస్తుంది..”

“ఎక్కడికి?”

“హవాయన్ షాక్స్..” అంటూ అడ్రస్ చెప్పింది.

నేను ఫోను పెట్టేసి బయలుదేరాను. అక్కడికి చేరుకునేసరికి ఆమె అక్కడే వుంది. చెయ్యి పట్టుకోని లోపలికి లాక్కెళ్ళింది. లోపల వాతావరణం అర్థమవ్వటానికి రెండు నిమిషాలు పట్టింది. అది ఒక పబ్.

“ఏం తీసుకుంటావు?”

“నువ్వు తాగుతావా?”

“ఏం నువ్వు తాగవా?”

“ఎప్పుడన్నా”

“ఇదే ఆ ఎప్పుడన్నా.. చెప్పు”

“విస్కీ విత్ షోడా..”

తను ఆర్డర్ ఇచ్చింది. తనకేమో లాంగ్ ఐలాండ్ చెప్పింది. తను మందు తాగుతుందని నేను వూహించనే లేదు.

చిన్న పడవ గోడలోనుంచి దూసుకొచ్చినట్లు వుంది ఆ కౌంటర్. మిగిలిన భాగమంతా తక్కువ కుర్చీలతో ఎక్కువ శాతం డాన్స్ వెయ్యడానికి వీలుగా వుంది. చాలా ఇరుకుగా వుంది.. అయినా చాలా మంది వున్నారక్కడ.. ఇంకా వస్తూనే వున్నారు. రంగు రంగుల లైట్లు దారి తప్పినట్లు ఎటంటే అటు తిరుగుతూ వున్నాయి.

నా గ్లాస్ నాకిచ్చి, తను కాక్‌టైల్ పట్టుకోని చిన్నగా డాన్స్ చెయ్యడం ప్రారంభించింది. నన్ను కూడా డాన్స్ చెయ్యమంది. “నా వల్ల కాద” న్నాను. అసలు ఒకరి మాటలు ఒకరికి వినపడకుండా మోతగా వున్న ఆ పాటలే నాకు రుచించట్లేదు. ఉష నన్ను పట్టుకోని గట్టిగా ముందుకు లాగింది. తుళ్ళిపడబోయి తమాయించుకున్నాను. నా చేతిలో విస్కీ ఆమె మీద కొద్దిగా వొలికింది. “ఫర్లేదు” అన్నట్టు నాలుక చిత్రంగా బయట పెట్టి నా నడుం మీద చెయ్యివేసిది. మరో చెయ్యి భుజం మీద పడింది. నేనూ డాన్స్ చెయ్యడం మొదలు పెట్టాను.

ఆ రోజూ ఇలాగే, ఇంతే దగ్గరగా.. పుస్తకం తీసుకోడానికి వెళ్ళి ఎంతసేపు వున్నానో నాకే గుర్తులేదు. అటక మీద ఉన్న పుస్తకాలు దించేందుకు చిన్న స్టూల్ వేసుకోని ఎక్కింది. నేను స్టూల్ పట్టుకోని.. ఆమె చేతులు పైకెత్తి పుస్తకాలందుకుంటుంటే నేను అలాగే ఆమె “స్ట్రెచ్డ్” శరీరాన్నే చూస్తూ వుండిపోయాను. స్టూల్ ఎప్పుడు వదిలేశానో నాకే తెలియలేదు.

తను నా మీద పడింది. ఇద్దరం మంచం మీద పడ్డాం. అది ఆమె కావాలనే చేసిందా, లేక యాదృచ్ఛికంగానే జరిగిందా అని ఆలోచించే స్థితిలో లేను. ఆ దగ్గరతనం.. ఆ స్పర్శ మాధుర్యంలో ఎప్పుడు కరిగిపోయానో నాకే తెలియదు. కొద్దిగా ముదుకు వంగి ఆమె పెదవుల మీద…

***

“ఏయ్ ఏమైంది నీకు… ఎక్కడ ఆలోచిస్తున్నావ్? కమాన్ డాన్స్.. ఇదే ఆఖరు పాట” చెప్పిందామె. అప్పటికే ఆమె నాలుగు గ్లాసులు, నేను నాలుగు గ్లాసులు తాగేశాము.

పబ్‌లో డాన్స్ అయిపోగానే తన ఇంటికి రమ్మన్నది ఉష.

“వద్దు ఉష.. బాగుండదు…” అన్నాను.

“ఏ కాలంలో వున్నావ్ రమణ.. ఇది ముంబై… నువ్వు రావటమేకాదు.. నాతో కాపురం చేసి నలుగుర్ని కన్నా కనీసం పక్కింటోళ్ళకి కూడా తెలియదు..” చెప్పిందామె.

ఇద్దరం ఆమె కార్లో బయలుదేరాము.

“ఉషా.. పెళ్ళి చేసుకున్నావా?”

“ఈ ప్రశ్న నాతో డాన్స్ చెయ్యక ముందు అడగాల్సిందేమో కదా..” అంటూ నవ్వేసి “అయ్యింది.. ఖంగారు పడకు ఆయన ఇంట్లో లేడులే. మేం విడిపోయాం.” చెప్పింది. నేను ఆమె వైపు ఎంతసేపు చూశానో, ఎందుకు చూశానో కూడా గుర్తులేదు.

ఇంట్లోకి అడుగుపెట్టగానే సిగరెట్ వాసన గుప్పుమంది.

“కూర్చో.. ఫ్రెష్ అయ్యి వస్తాను..” అంటూ వెళ్ళబోయి మళ్ళీ ఆగి “ఫ్రిజ్‌పైన విస్కీ వుంది.. ఫ్రిజ్‌లో సోడా.. నాక్కూడా ఒకటి కలిపివుంచు” కన్నుగీటి వెళ్ళిపోయింది.

నేను లేచి ఫ్రిజ్ వైపు నడిచాను.

***

విస్కీగ్లాసులో సోడా కలపగానే మధుర్ వెంటనే పైకెత్తాడు..

“చీర్స్.. చీర్స్” అరిచాడు వుత్సాహంగా.

“ఇంతకీ పార్టీ ఎందుకో చెప్పనే లేదు..” అడిగాడు శేఖర్.

“ఇంకెందుకురా.. మనవాడు నిన్న వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తిచేశాడు.” మధుర్ అన్నాడు. నాకేదో ఇబ్బందిగా వుంది.

“ఏరా నిజమేనా? మరి చెప్పనే లేదు? ఏంటి, వర్క్ఔట్ అయ్యిందా”

“ఊ” అన్నాను నేను.

“దానికి సిగ్గెందుకోయ్.. బీ లైక్ ఏ మాన్.. ఇంతకీ ఎలా జరిగిందో చెప్పు”

“చెప్పేదేముంది.. వి డిడ్ ఇట్..”

“అదేరా ఎలా.. ఐ మీన్ ఎలా మొదలైంది.. ఎవరెవరు ఏం చేశారు”

“నోరు ముయ్యి.. అదంతా ఇక్కడా.. రూంకి వెళ్ళాక చెప్తా.. ఇందాకే మధుర్ గాడికి చెప్పాను..”

“అవునురా.. డీటైల్డ్‌గా చెప్పాడు.. నేను చెప్తాగా” అన్నాడు మధుర్ కన్నుగొడుతూ.

నేను ఆలోచిస్తూ వుండిపోయాను.

***

“ఏంటి ఎప్పుడూ ఏదోవొకటి ఆలోచిస్తుంటావు..” ఉష అడిగింది. తెల్లటి నైట్ డ్రస్ వేసుకోని వుందామె.

“ఏమిలేదు..” అన్న తరువాత చాలాసేపు మాట్లాడుకోలేదు. తర్వాత నేనే అడిగాను “ఎందుకు విడిపోయారు..” అని.

ఆమె సూటిగా చూసింది. “ఈ ప్రశ్న ఇంకెవరన్నా వేస్తే నీకెందుకు అనేదాన్ని.. నీతో అలా అనలేను.. వాడు నా గురించి పూర్తిగా తెలిసే పెళ్ళి చేసుకున్నాడు. నీకు తెలుసుగా నేను మాట్లాడే తీరు.. అవతలి వాడు ఏమనుకుంటాడో ఆలోచించకుండానే డబల్ మీనింగ్ డైలాగులు.. ఒక్కోసారి డైరెక్ట్ మీనింగ్ డైలాగులు.. మొదట్లో అతనికీ ఇలా వుండటం నచ్చింది కాని తరువాత తరువాత అతనితోనే అలా వుండమనేవాడు. మిగతా మొగవాళ్ళతో అలా మాట్లాడకూడదన్నాడు.. నేను అలా వుండలేనన్నాను.. అలా మా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.. అంతే, విడిపోయాము..” చెప్పింది.

“అంతేనా…?” అడిగాను.

“అసలు బేసిక్ కారణం అదే.. కాకపోతే.. నాకు వేరే ఎవరితోనో సంబంధం వుందని అతనికి ఎవరో చెప్పారు.. జోక్ చెప్పనా ఆ సంబంధం ఎవరితోనో కాదు.. నీతోనే వుందట.. దట్ వాజ్ ద లాస్ట్ నెయిల్”

నేను అదిరి పడ్డాను. ఉషకి నాకు ఎఫైర్… నా వల్లే ఉష, ఆమె భర్త విడిపోయారు…!

“హలో.. అంత ఆలోచించాల్సిన పనిలేదు.. ఆ మనిషే అంత… నువ్వు కాకపోతే ఏ పోస్ట్‌మానుకో, పాలవాడికో అంటగట్టేవాడు.. కాలేజిలో మనిద్దరి గురించి ఏం మాట్లాడుకునేవారో నీకు తెలుసుగా.. అదే ఎవరో వాడికి చెప్పారు, దాంతో వాడికి ఒక పేరు దొరికింది అంతే.. పోస్ట్‍మాన్, పాలవాడికన్నా నువ్వే బెటర్ అని అక్కడే సంబంధం తెంచేసుకున్నాను.. నువ్వేం దిగాలుగా ముఖం పెట్టాల్సిన పనిలేదు.” అన్నదామె మరో పెగ్గు కలుపుకుంటూ.

ఆ తరువాత ఇద్దరం ఏమీ మాట్లాడలేదు.

***

ఆమె ఏమి మాట్లాడలేదు.

మంచం మీద అలాగే వున్నాం.. నేను కొంచెం దగ్గరగా జరిగి ఆమె పెదవులమీదకు వంగాను. ఆమె చటుక్కున తేరుకోని గట్టిగా నన్ను తోసేసింది. లేచి మంచం దిగి –

“ఫర్లేదే.. మంచి స్పీడు మీదే వున్నావు..” అంది.

జరిగినదానికి నేను తత్తరపడ్డాను. “అయితే నీ కవ్వింపులు దీనికోసం కాదా” అని అడగబోయాను. కాదని తెలుస్తూనే వుంటే ఇంకా అడగటం ఎందుకని తల దించుకోని “అయాం సారీ” అన్నాను.

ఆమె గట్టిగా నవ్వి – “దట్స్ ఓకే.. ఫర్లేదు.. నన్ను చూసిన ప్రతివాళ్ళు ఇలాగే అనుకుంటారు. నేను ఓపెన్‌గా మాట్లాడటం వల్లే అందరూ అలా అనుకుంటారు అనుకుంటా.. అయినా నేను ఇంతే..నా నేచరే అంత.. నిన్ను చూస్తే ఎందుకో నా గురించి అలా అనుకోవట్లేదు అనిపించింది.. అందుకే ఇంకొంచెం చొరవగా వున్నాను.. ఇంకెప్పుడూ నా గురించి ఇలా ఆలోచించకు.. లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్..” చెప్పిందామె.

నేను తలవూపాను.

***

“ఏమిటి మళ్ళీ ఆలోచిస్తున్నావు?” అడిగింది ఉష.

“అదే.. మన గురించి అలా ఎవరు చెప్పారో అని..” అన్నాను.

“వున్నాడ్లే.. నా మాజీ మొగుడికి కొలీగ్, మాథుర్ అని..!!” చెప్పిందామె.

నాకు వూహించని షాక్..!!

అప్పుడేదో యవ్వనోత్సాహంలో జరగనిది జరిగినట్లు నా ఫ్రెండ్స్ దగ్గర కోతలు కోసాను..!! దాని పర్యవసానం ఇంత దారుణంగా వుంటుందా? నాకెందుకో గిల్టీ ఫీలింగ్ ఎక్కువౌతూ వుంది.

“హలో మాష్టారు.. అది గెస్ట్ బెడ్‌రూం.. వెళ్ళి అక్కడ పడుకోని తీరిగ్గా ఆలోచించుకోండి..” చెప్పిందామె.

నాకెందుకో ఆమెకు జరిగింది చెప్పి క్షమించమని అడగాలని వుంది. కాని మనసుకు మాటకు మధ్య ఏదో అడ్డం పడుతోంది. నేను లేచి ఆ బెడ్‌రూం వైపు అడుగులువేశాను.

ఉషకి ఆ విషయం ఇప్పటికీ చెప్పలేదు..!!

——————-

అరిపిరాల-సత్యప్రసాద్

మంచి సంగీతం, మంచి సాహిత్యం అంటే అభిమానం.. తెలుగు భాషంటే మమకారం గల అరిపిరాల సత్యప్రసాద్ గుంటూరులో జన్మించారు. చదువు, తొలి వుద్యోగం రాష్ట్రంలో అనేక వూర్లు చూపించాయి. గుజరాత్‌లో ఎం.బీ.యే తరువాత, కార్పొరేట్ వుద్యోగం దేశమంతా చూపిస్తోంది. ఉద్యోగరీత్యా అనేక రకాల వ్యక్తులను, రకరకాల సంస్కృతులను చూసేందుకు అవకాశం కలుగుతూ వుంటుంది. అలా కలసిన వ్యక్తులు, ఎదురైన సంఘటనలే ఆయనకు కథా వస్తువులు.

రచయితగా 1995 ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం వారి దీపావళి కథలపోటీలో సాధారణ ప్రచురణతో తొలి అడుగులు వేసారు. తరువాత పది దాకా కథలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. గతంలో పలక బలపం, హాస్యదర్బార్ బ్లాగులు నడిపి, కొత్తగా జోకాభిరామాయణం అనే బ్లాగును ప్రారంభించారు.

Posted in కథ | 8 Comments

నాలుగు మెతుకులు

– అఫ్సర్

బయట విరగ్గాస్తున్న ఎండకి

లోపటి చీకటి తెలుస్తుందో లేదో!

కాసేపు

గొంతుక

వాహ్యాళికెళ్తుంది మౌనంలోకి.

గాలి కోసం

కాసింత వూపిరి కోసం.

2

బిగికౌగిలి చెట్ల మధ్య వొక తెల్ల చార

సన్నగా

తెరుచుకొని ఎటో తీసుకెళ్తుంది.

దాని భాష నాకెప్పుడూ

అందంగా వినిపిస్తుంది.

3

అడివి కన్న చిక్కగ పెనవేసుకుపోయిన

ఇళ్ళ మధ్య వొక ఇరుకు సందు

చంద్రుడి వెన్నెల్లాగా మెరుస్తుంది.

దాని నిశ్శబ్దం హోరు

నోరు విప్పని తుపాను.

4

వొక్కొ సారి నువ్వూ నేనూ

రెండు అలల కేకలం,

మరో సారి

నిద్ర పొరల కింద వొత్తిగిలిన కలలం.

5

భాష్యాలు ఎప్పుడూ వోడిపోతూనే వున్నాయిలే!

లోగొంతుకల్ని

తోడిపోసే చేద లేదు గా చేతుల్లో.

6

వొక తెగిపడిన మాటనో

వొక రాలిపడిన కేకనో

తెగనరక్కు దేన్నీ!

7

ఈ నాలుగు మెతుకులూ

దాచి వుంచు

ఏ దూరాల నించో వచ్చే

ఆ దిగులు బావి

ఖాళీ కడుపు కోసం!

Posted in కవిత్వం | Tagged | 8 Comments

రొద

– హెచ్చార్కే
రెండుగా చీలిన
ఒక వేదన
ముట్టడించిన మసక వెన్నెల
చిట్టచివరి విందులో ఇద్దరు
ద్రోహం ద్రోహం
అలలెత్తి అరిచిన దుర్బల సముద్రం!

ఎన్ని ఎండలల్లో
ఇంకెన్ని వెన్నెలల్లో
తగలెట్టుకోగలరు తమను తాము?
ఎవరినెవరు పంపారు శిలువకు?
వారిలో క్షమార్హు
లెవరో చెప్పలేని సందేహ సముద్రం!!

ఒక్కో రాత్రిగా
ఒక్కొక్క పగలుగా
పుట్ట లోంచి ఎటూ వెళ్లలేని పాముల్లా
తమలో తాము వాళ్లెన్నాళ్లు తిరిగినా
నిష్క్రమణ మార్గం
చూపించ లేని నిష్ఫల దుఃఖ సముద్రం!!!

Posted in కవిత్వం | Tagged | 7 Comments