నాలుగు మెతుకులు

– అఫ్సర్

బయట విరగ్గాస్తున్న ఎండకి

లోపటి చీకటి తెలుస్తుందో లేదో!

కాసేపు

గొంతుక

వాహ్యాళికెళ్తుంది మౌనంలోకి.

గాలి కోసం

కాసింత వూపిరి కోసం.

2

బిగికౌగిలి చెట్ల మధ్య వొక తెల్ల చార

సన్నగా

తెరుచుకొని ఎటో తీసుకెళ్తుంది.

దాని భాష నాకెప్పుడూ

అందంగా వినిపిస్తుంది.

3

అడివి కన్న చిక్కగ పెనవేసుకుపోయిన

ఇళ్ళ మధ్య వొక ఇరుకు సందు

చంద్రుడి వెన్నెల్లాగా మెరుస్తుంది.

దాని నిశ్శబ్దం హోరు

నోరు విప్పని తుపాను.

4

వొక్కొ సారి నువ్వూ నేనూ

రెండు అలల కేకలం,

మరో సారి

నిద్ర పొరల కింద వొత్తిగిలిన కలలం.

5

భాష్యాలు ఎప్పుడూ వోడిపోతూనే వున్నాయిలే!

లోగొంతుకల్ని

తోడిపోసే చేద లేదు గా చేతుల్లో.

6

వొక తెగిపడిన మాటనో

వొక రాలిపడిన కేకనో

తెగనరక్కు దేన్నీ!

7

ఈ నాలుగు మెతుకులూ

దాచి వుంచు

ఏ దూరాల నించో వచ్చే

ఆ దిగులు బావి

ఖాళీ కడుపు కోసం!

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

8 Responses to నాలుగు మెతుకులు

  1. nagarajuavvari says:

    మెత్తటి పదాలు,వాటిమధ్యన అర్థవంతమైన విరామం, మంచి అభివ్యక్తి

  2. Raghuram says:

    కడుపు నిండినట్లుంది, ఈ కమ్మని కవిత తో…!!!

  3. భాష్యాలు ఎప్పుడూ వోడిపోతూనే వున్నాయిలే!

    లోగొంతుకల్ని

    తోడిపోసే చేద లేదు గా చేతుల్లో…

    వహ్వా! క్యా బాత్ హై:-)

  4. వొక్కొ సారి నువ్వూ నేనూ

    రెండు అలల కేకలం,

    మరో సారి

    నిద్ర పొరల కింద వొత్తిగిలిన కలలం…

    సున్నితమైన పదాలతో మెత్తగా మనసు పొరలకు శస్త్ర చికిత్స చేసిన కవిత. డా.అఫ్సర్ గారికి ధన్యవాదాలు.

  5. dr pulipati guruwamy says:

    వాహ్యాళి కెలుతున్న గొంతుక
    నిశ్శబ్దపు హోరు ..విప్పని తుఫాను నోరు
    అలల కేకలమైన వొత్తిగిల్లిన కలలం….
    గొప్ప అనుభూతి కి గురిచేసిన వాక్యాలు
    అఫ్సర్ గారికి ధన్యవాదాలు…
    కవిత లోని పదాలు మనసు లోని కణాలతో సరిపోయి
    సప్పున iv ఇంజక్షన్ లా…..సమ్మిళితమై …

  6. ఉష says:

    అఫ్సర్ గారు, వేటికవే అలా పదచిత్రాన్ని లిఖించేస్తూ.. ఒక్కటి మాత్రం నిజం.. ఈ నాలుగు మెతుకులు, గుక్కెడు గంజి అయినా రుచిగా తోచే మనసుకి అనుకోని అన్నదానం.

    “వొక తెగిపడిన మాటనో

    వొక రాలిపడిన కేకనో

    తెగనరక్కు దేన్నీ!’

    మ్చ్.. చురకత్తుల మాటలు, అవి తెగనరికిన మనసుకు చూడటమే కానీ నరకబడ్డ మాట సంగతి తెలిసిందిప్పుడే

  7. Pasunoori Ravinder says:

    mugimpu kadilinchindi sir

Comments are closed.