కవికృతి-౯

నో కాంప్రొమైజ్ ప్లీజ్

-స్వాతీ శ్రీపాద

నేను రాజీ ఉరితీతకు సిద్దంగా లేను.
కళ్లుమూసితెరిచేంత లిప్తలో
ఉనికికీ ఊహకూ_ సజీవతకూ సమూల మరణానికీ
ఉలిపిరి కాగితపు పరదా ఊగిసలాడుతున్న
తైంతిక సుకుమార జీవనవనంలో
విలువల గొంతునొక్కి
కలల గుమ్మటానికి వేలాడేందుకు
నేను సిద్దంగాలేను.
నో కాంప్రొమైజ్ ప్లీజ్..

సువిశాలపు ఆకాశం పాల చెక్కిళ్ళపై
పరుగులు పెడుతూ రూపాలు మార్చుకునే
తెలి మబ్బు తునకల క్షణికపు పాలపొంగు
ఈ విరామం.
ఊపిరాడని పొగల్లో సెగల్లో
తుహిన బిందువుల్లా ఆవిరి చేసేందుకు
నేను సిద్దంగాలేను.
నో కాంప్రొమైజ్ ప్లీజ్..

ముళ్ళమధ్య కళ్ళువిప్పి
నాజూకు పాదాల నవనీతపు
భావాలను
కన్నీళ్ళ అలజళ్ళ కుంపట్లమీద
కరిగించుకుందుకు ఎంతమాత్రం
నేను సిద్దంగాలేను.
నో కాంప్రొమైజ్ ప్లీజ్..

గుండెనిండా జ్ఞాపకాల పూలమడులు,
పెదవులమీద మొలకెత్తే చిరునవ్వులు,
నా తరువాత శూన్యం మందిరాలు.
నా ఉనికి అగరొత్తుల పరిమళమై
ప్రసరించేలా ప్రసవించేలా
నాలుగు యుగాల ఇతిహాసానికి
ప్రేమ నింపుకున్ననాకలం,
చరిత్ర పుటలమీద  అవిశ్రాంతంగా
కాలాన్ని చెక్కుతుంది.
అందుకే
నాకు మరెందుకూ సమయం లేదు.
ఊసుపోక కబుర్లాటకు
నేను సిద్దంగాలేను.
నో కాంప్రొమైజ్ ప్లీజ్..

ప్రకృతి

-ఆత్రేయ కొండూరు

ఆకునీడన జేరిన పువ్వు
గాలి తట్టినప్పుడల్లా
తెరిపెకోసం తొంగిచూస్తూ..

నేల కురిసిన వాన
హత్తుకునే అడ్డులు
నింపుకున్న గుంటలు
నవ్వులు చిందిస్తూ  ..

నింగిలోని చుక్కలన్నీ
మెల్లగా,
గరిక కొనలమీదుగా,
మెల్లగా  ఉదయిస్తూ..

ప్రతి కిరణమూ
రంగులద్దుతూ,
మనసునద్దం పడుతూ,
ప్రకృతి..

హైకూలు!

-పెరుగు.రామకృష్ణ

సముద్రం ,నేను
ఒకరి లోతుల్లోకి
మరొకరం…!*
**

నీటి కదలిక
పున్నమి చంద్రుడు
రాత్రంతా బావిలో…!*
**

ఒకే ఉపిరి
రెండు దేహాలు గా
ఆమె,నేను..!*
**

ధ్యాన ముద్రలో
రుషిలా,మా పల్లె
ప్రక్కనే కొండ…!*

ఒంటరి మనసు

-దామోదర్ అంకం

పెద్ద పులి పంజా సందుల్లో
పిల్ల లేడి లేత చర్మం
విచ్చుకోకుండా, గిచ్చిపోకుండా
పసి మొగ్గలపై గుచ్చిన గుండుసూదులు
నిద్రలేచేసరికి నా తలొక్కటే మిగిలింది
రక్తం కారకుండా నా పిక్కలు పీక్కుతిన్నాయ్ కుక్కలు
ఎర్రటి చిగురాకులు  రాలిమరీ
నను వెంబడిస్తుంటే ..పరుగెత్తాను
అప్పటికే నా నీడను రాబందులు లాక్కుపోయాయ్
ఇపుడు నేను ఒంటరిని..

నల్లాల్లో పాలు..
బర్రె పొదుగు నిండా నీళ్ళు…
చడీ చప్పుడు లేకుండా
ఒక్కపెట్టున జడివాన
గడ్డ కట్టుకుపోయిన సూర్యుడు
భగ భగమంటూ నెలరేడు
సగం కాలిన ప్రేమ పొలికేక పెడుతుంది..
“నన్ను కాపాడండీ…” అంటూ…
అపుడు నేను నడుస్తుంది స్మశానం ప్రక్కన
పాపం స్నేహానికి గర్భ శోకం..

మందాకినీ నదిలో
మంచి నీరు ప్రవహిస్తుంది
సాగరమంతా నిశ్శబ్ధం..
నది కలిసే చోట మాత్రం గల గల చుంబన శబ్ధం
గుర్రపు గిట్టల కింద
నలిగిపోయిన నల్ల గులాబీలు ..
గుత్తులు గుత్తులుగా
గుండెలు వేలాడదీసారు ..
ఎండలు మండుతుంటే..
చలిగాలి వీస్తుంది..అసలెక్కడున్నాను…”నరకమా..?”

ఒక చెవిలో సహస్రావధానం
మరొకదానిలో నా ప్రశ్నకు సమాధానం
ముక్కుపుటాలధిరేలా
నెత్తుటి వాసన..
అయ్యో..ఎర్ర పూలనెవరో
ఎత్తుకుపోయారు…
పగలంతా చీకటి..
రేయి నిండారా వెలుగు…
అన్ని ఋతువులకూ ఒకేసారి పోటీ
కాలం ఎందుకో ఇవాళ్ళ వెనక్కు పడిపోతుంది

అలసిపోయి నడుస్తున్న పరుగు
ఓటమినంగీకరించిన గెలుపు
వాన పడకుండా మట్టి వాసన
గుండె బద్దలయ్యేలా ఒక్క పిడి గుద్దు
హింసను ప్రేరేపిస్తున్న అహింస
అశాంతికి శిక్షననుభవిస్తున్న శాంతి
చందమామపై మచ్చలన్నీ పోతున్నాయ్
కాగితంపై అక్షరాలన్నీ మాయమౌతున్నాయ్
ఒక్కొక్కటిగా సిరగా మారి మళ్ళీ కలంలోకి
కలం ఇక శాశ్వత నిద్రలోకి…

పిడిబాకు

-బొల్లోజు బాబా

ప్రశాంతతను
గాయపరచే పిడిబాకు
మళ్లా ప్రత్యక్షమైంది
దెబ్బకు స్వప్నం కాస్తా వాస్తవంగా
వాస్తవం కాస్తా  మహా ఎడారిగా
మహా ఎడారి కాస్తా మృగతృష్ణగా
రంగులు మార్చేసాయి

ఆ నిర్జలోష్ణ కాసారపుటొడ్డున
రాళ్లు విసురుతో నా ఆత్మ

పిడి బాకు అంచున తృష్ణా బిందువు
పిడి బాకు అంచున మృగకాంక్షా శ్వాస
అచ్చోటనే రుధిర జాతర.
నరక సౌఖ్యం, స్వర్గ బాధ పెనవేసుకొన్న
సృష్టి సౌందర్య విస్ఫొటనం కూడా అక్కడే

తలుపు భళ్లున తెరచా
ఈ సమయం లో వచ్చావేమిటీ!
అందామె  ఆశ్చర్యపడుతో
నెత్తురు నింపుకొన్న నా క్షణాల్ని
చూపించా!

గాయపడ్డ నా గీతాన్ని
తన దేహంలోకి తీసుకొని
స్వస్థ పరచిందామె ….ప్రేమతో….

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

మందు పాతరల జీవితం

-ద్వీపరాగ

మందు పాతరల  జీవితం

అడుగడుగునా పొంచి ఉన్న మందు పాతరలు..
ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందో!
ఏ ప్రశాంతత ఎలా ముగిసిపోతుందో!
ఊపిరి బిగబట్టి
ఆచి తూచి వేసే అడుగులు.

చావు లాంటి బ్రతుకు
చావులోనే బ్రతుకు
మళ్లీ మళ్లీ అలా చావకపోతేనేం?
చస్తూ బ్రతక్కపోతేనేం?

ఎవరో నాటి,
మరెవరి స్పర్శకో పేలిన మందు పాతర
నిన్ను ముక్కలు చేసి ఆకాశంలోకి విరజిమ్మితే..

అక్కడే అలా చుక్కల్లో మిగిలిపోక
మళ్లీ భూమ్మీదకు జారి ఒక్కటవుతావేం?
మరొక్కసారి ఛిద్రమయి ఎగసిపోయే అనుభవాన్ని సొంతం చేసుకోవడానికా?
శిధిలమయింది బ్రతుకయితే
ముక్కలయింది మనసయితే
అతుకులేయగలిగే ఆశ ఏది?

నువ్వంటే!

మర్చిపోవాలన్న పట్టుదలలో
మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాను.

తరిమెయ్యాలన్న ప్రయత్నంలో
అనుకోకుండానే ఆహ్వానిస్తుంటాను.
నీ నుంచి దూరంగా పారిపోవాలన్న
నా పరుగు
తిరిగి తిరిగి నిన్నే చేరుకుంటుoది.

జ్ఞాపకంతో పోరాటం,
మనసుతో భీకర యుద్ధం,
నా పై నేనే చేసుకునే విధ్వంస రచన.

ఇదీ నువ్వంటే…

Posted in కవిత్వం | Tagged | Comments Off on మందు పాతరల జీవితం

రసమయం జగతి

-స్వాతికుమారి బండ్లమూడి

ఎంతో ఇష్టమైన పాటని రింగ్‌టోన్‌గా పెట్టుకోవటం ఎంత బుద్ధితక్కువ పని! ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చి, ఏదో శత్రుత్వం ఉన్నట్టు వీలైనంత త్వరగా పాట ఆపెయ్యాలి.

తడిచేతిని కర్చీఫ్‌తో తుడుచుకుని, ఫోన్‌ తీసి ‘విరించి’ అన్న పేరును చూస్తూ ‘హలో’ అన్నాను.
అటువైపు అలికిడి లేదు.

“మాట్లాడరే?” ఖాళీ అయిన లంచ్‌బాక్సును సర్దుతూ అన్నాను.
“ఓ… జగతీ, హలో” అవతలనుంచి.

“ఏమిటంత పరధ్యానం?” చెప్పటానికి పెద్ద విషయాలేం లేకుండా ఫోన్ చెయ్యరే ఎప్పుడూ!
“ఒక కథ రాయాలి.. “

పోగొట్టుకున్న మనుషులు, గతంలో వదిలి వచ్చిన స్థలాలూ, జ్ఞాపకాలూ తర్వాత అమూల్యమైన విలువని అపాదించుకుని బెంగగామారి మనిషిని తినేస్తున్నప్పుడు ఈమాత్రం సంగతులే మనుగడకో కొత్త అర్థాన్ని చూపిస్తాయి.

“ఏమిటో సబ్జెక్ట్?”
“నీ గురించే”

“నా గురించి రాయడానికేముంది?”
“అదే నాకూ అర్ధం కాక…”

“టీజ్ చెయ్యడం కూడా మొదలెట్టారా?”
“……….”

“ఐతే మీకథ రెండు రోజుల క్రితం మొదలౌతుందేమో.”
“అంతకుముందు సంగతులతో మొదలెట్టి నువ్వే ఎందుకు రాయకూడదు?”

“……….”
“దీనిక్కూడా ఎందుకంత ఆలోచన?”

“ఎక్కడి నుంచి మొదలెడితే బావుంటుందో అని..”
“ఆహా! ఇక ఉంటా మరి.. నీకూ నీకథకి మధ్య నేనెందుకు.”

————————XXXX——————-

మధ్యాహ్నం మెయిల్ చూసినప్పటినుండీ ఒకటే పరధ్యానం, చెన్నైలో మా టీముకి రెండురోజులపాటు మేనేజ్మెంట్ ట్రైనింగ్. నేరుగా ఫన్‌ట్రిప్ అంటే ఫండ్స్ రావని, చెప్పుకోవడానికి గొప్పగా ఉండదనీ ఈ ట్రైనింగ్ ముసుగు. అక్కడికెళ్ళాక ఇంగ్లీష్ వ్యక్తిత్వ వికాస పుస్తకాలని కాసేపు వల్లించి ఐపోయిందనిపించెస్తారు ఎలాగూ.

అదెలాఉన్నా మళ్ళీ చెన్నై వెళ్లాలన్న నా కోరిక తీరుతున్నందుకు చెప్పలేనంత ఉత్సాహంగా ఉంది. హరితో ఇదివరికెన్నో సార్లు ‘ఒకసారి వెళ్ళొద్దాం’ అన్నాను. “ఇప్పుడెవరున్నారక్కడ? ఐనా చూద్దాంలే,” అంటాడు. వాయిదా వెయ్యడమంటే, ’వద్దు’ అని సామరస్యంగా చెప్పడం. ఇప్పుడు ఆఫీస్‌టూర్ కాబట్టి ఏమంటాడో! వీక్లీ టార్గెట్ పూర్తిచేసి ఇంటికెళ్ళేసరికి తలలో యుద్ధం జరుగుతున్నంత నొప్పి.

“ఏమిటింతాలస్యం? కొత్తగా ప్రమోషనొచ్చిన వాళ్ళకి ఇల్లు గుర్తురాదేమో, నేను మధ్యాహ్నం కూడా తినలేదు”తలుపు తీస్తూనే నైట్‌డ్రెస్లో, చేతిలో టీవీ రిమోటుతో నామీద కంప్లైంట్లతో సహా సిద్ధంగా ఉన్నాడు.

‘నువ్వాలస్యంగా వస్తే కంపెనీకోసం, మన ఫ్యూచర్‍కోసం కష్టపడ్డట్టు, అదే నేనైతే ఇల్లు గుర్తు లేనట్టూనా? అంత ఆకలున్న వాడివి వండుకోలేకపోయావా?’ ఇవేమీ అనలేదు, కొన్ని విషయాలు మాట్లాడి తలనొప్పి పెంచుకోవడం కన్నా త్వరగా పని చేసుకుంటే పడుకోవచ్చు. ఒక నీరసపు నవ్వు నవ్వి “వచ్చే వీకెండ్ చెన్నైలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది కొత్త మేనేజర్లకి” చాలా అసందర్భమైన సందర్భంలో ’కొత్త’ అనే పదాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్పాను.

ఎదురు సమాధానం చెప్పకపోవడంతో అప్పటికే గిల్టీగా అనిపించినట్టుంది, “మనకి దొరికే రెండ్రోజులూ ఇలా ఆఫీస్ పనంటే.. విల్ మిస్ యూ! మానడానికి కుదరదా?”

‘నువ్వు నీ స్నేహితులతో షికార్లలోనో, ఇంట్లో టీవీలోనో మునిగిపోతే, నేను ఇల్లు శుభ్రం చేసుకుంటూ రాబోయే వారానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ప్రతివారం నేను .. విల్ యూ రియల్లీ మిస్ మీ?’ “ఊహూ, కుదరదు, పెర్ఫార్మెన్స్ ఎప్ప్రైజల్లో నెగెటివ్ వస్తుంది” నటనని మించి జీవించాను. మిస్సింగూ, వల్లకాడూ కాదు. ఆమాట కొస్తే ఎన్ని వారాంతాలు నేను లేకుండా నువ్వు స్నేహితులతో అరకులు, అజంతాలూ తిరగలేదు?

“చెత్త పాలసీలు. ఆడవాళ్ళకి ఎన్ని ఇబ్బందులుంటాయి?. ఇంతకీ లేడీ కొలీగ్స్ వస్తున్నారుగా! సర్లే వంట మొదలెట్టు.”

“ఎవరూ లేరు, ఒక్కదాన్నేగా మా టీంలో అమ్మాయిని” నిజమే అయినా, కసిగా చెప్పి నాపనైపోయినట్టు వీలైనంత నెమ్మదిగా లోపల్నుంచి వంట గది తలుపు నెట్టాను, చిరాకు శబ్ధమై బద్ధలవకుండా.

’నా గురించి నేను నిరంతరం తెలుసుకోవాలంటే ఎప్పుడూ నా పక్కన ఉండే నువ్వే నాకున్న ఏకైక ఆధారం’ అనుకున్నాను పెళ్ళైన కొత్తలో, అతుక్కుపోయి ఉన్నా వేరు వేరు దిక్కులకేసి చూసే బొమ్మా బొరుసుల్లా ఏకమైపోయిన జీవితం మనది. కానీ ఒకళ్ళనొకళ్ళం తెలుసుకుంటున్నామో, మిస్‌లీడ్ చేసుకుంటున్నామో అర్ధం కావట్లేదు. కొన్ని విషయాలు నీకు కేవలం అలవాట్లకు సంబంధించిన సమస్య. కానీ అవి నా విలువలకూ, వ్యక్తిత్వానికీ సరిపడనప్పుడు .. సారీ నేను మారలేను.

మొదట్లో ఒకసారడిగాను నానుంచి నువ్వేమాశిస్తున్నావని. “నాకు మా అమ్మలాగా ఎప్పుడేం కావాలో చూసుకోవాలి. మావాళ్ళతో గౌరవంగా, కలుపుగోలుగా ఉండాలి, వంట బాగా రాకపోయినా పర్లేదులే.. మరి నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావ్?”

“జీవిత కాలపు స్నేహం”

నీకు బాగా నవ్వొచ్చినట్టుంది “స్నేహం మాత్రమేనా? భార్యాభర్తలమే అయిపోయాం కదా”

నిజమే! ఇప్పటికీ భార్యభర్తలమే.. అరమరికల్లేని స్నేహంమాత్రం లేదు.

ఒకరిపై ఒకరం ఆధారపడి ఉండటాన్ని, అలా ఉండక తప్పని అవసరాన్ని.. దీన్నేనా మనం సహజీవనమని లోకాన్ని భ్రమింపజేస్తున్నాం?

……

నొప్పి నిదానించి కలలకు, కలతలకూ అందని మత్తు నిద్ర నాలోకి మెల్లగా జారుకుంటుంది. – థాంక్స్ టు పెయిన్ కిల్లర్స్.

ఏమిటో కలలోని మెలకువలాంటి వెచ్చదనం, చుట్టూ మూడేళ్ళుగా అలవాటైన వివశత్వపు కదలిక.
విసుక్కోలేదు, విదిల్చి కొట్టలేదు..

’ఆప్ట్రాల్ ఐ టూ నీడ్ యూ’

కొన్ని నిముషాలైతే మాత్రమేం? మనసుల మధ్య మొహమాటాలన్నీ పటాపంచలైపోయి, ప్రపంచమంతా అనవసరమనిపించేటంత పిచ్చిఆవేశంలో కాలిపోతూ.. ఆలోచనలూ, ఆరోపణలూ అన్నీఅనవసరమైపోయి.. ధ్యానమా, యోగమా?

సపది మదనానలో…

“ఇవ్వాళ బాస్ పిలిచాడు”

“ఊ..” దహతి మమ..

“ఈసారి రివిజన్లో నన్ను ప్రమోట్ చెయ్యొచ్చనిపిస్తుంది”

దహతి మమ మానసం..

“మన వాళ్ళేలే”

“అహా”….దేహి ముఖకమల..

“లోన్ పెట్టయినా కార్ కొనాలి. లేకపోతే ఎవడూ లెక్క చెయ్యడివ్వాళ.. ఎమంటావ్?”

“ష్హ్…..షటప్ హరీ”

“నీకు కెరీర్‍మీదా ఫ్యూచర్‍మీదా బొత్తిగా ధ్యాస ఉండదెందుకో”

“మరే,నిజం”

చీకట్లో నిశ్చలంగా చెట్టు కొమ్మలపై నిద్రిస్తున్న పక్షిగుంపుని టపాసులు పేల్చి చెదరగొట్టినట్టు…

ఏకాగ్రతలేని ఏకత్వ సాధన దేనితో సమానం, దేనికన్నా హీనం?

*******

మౌనంగా సెల్‍ వైబ్రేషన్ మోడ్లో గిలగిల్లాడుతుంటే తీసి ’విరించి’ అనే పేరు వెలుగుతుంటే’ ఏమిటింత పొద్దున్నే’ అనుకొంటూ పలకరించాను.
“నువ్వెక్కడ” అటునుండి..

“ఎయిర్‌ పోర్ట్‌లో.. బయల్దేరటానికి మరోఅరగంట పట్టొచ్చు”

“టైమ్ తెలీకుండా ఒక కథ చెప్పనా?”

“కొత్త కథ రాస్తున్నప్పుడే నేను గుర్తొస్తాననుకుంటా! ” బొత్తిగా నిజంలేని ఆరోపణ. ఎప్పట్లానే ఆయన కథ మంత్రముగ్ధంగా సాగిపోయింది. ఏసమయంలో ఐనా తనకథని, దాని వెనకున్న మధనని నాతో చెప్పగల చనువు, దాన్ని నిరంకుశంగా విమర్శించగల అధికారమూ నాకు ఈ రెండేళ్ల పరిచయంలో ఎప్పుడొచ్చాయో తెలీదుకానీ దానికి ముందు ఒక దశాబ్ధం నుంచీ ఆయన్ని పత్రికల్లో, పుస్తకాల్లో చదివి అభిమానించిన ధీమాకొద్దీ అప్పట్లో ఒక ఉత్తరం రాశాను. గత పదేళ్ళుగా వాడేసిన కథాంశాలూ, శైలిలో వచ్చిన రొటీన్నెస్, ఇప్పటి పాఠకులకి దగ్గరవ్వడం కోసం తనకి తాను దూరమౌతున్న రచనాత్మ , ఒక అభిమానిగా నేను ఆశించినది దక్కక ఎంత మోసపోయానో ప్రతీపేజీని అందులోని వాక్యాల్నీ ఉదహరిస్తూ ఏదో పూనిన ఆవేశం లో రాసేశాను.

కొన్ని నెలల తర్వాత నాకు సమాధానం వచ్చింది సమీక్ష కోసం పంపిన తన కొత్త పుస్తకంతో పాటు. విమర్శలు, అబిమానులు, అరోపణలూ కొత్త కాకపోయినా సరైన సమయంలో నా అభిప్రాయం, దాన్లోని వాస్తవం పనికొచ్చాయనీ, ఆ సమీక్షలోని నిజాయితీ తనకి చాలా అవసరమని దాని సారాంశం.

కథ చెప్పడం పూర్తిచేసి చివర్లో ” అక్కడికి నేనెప్పుడొచ్చినా నాపనులతో ఎక్కువ సమయం దొరకలేదు. నువ్వే వస్తున్నావుగా, ఈ రెండ్రోజులూ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు.”

రెండ్రోజులేం ఖర్మ కొందరెన్నాళ్ళు మాట్లాడినా చెప్పవలసిన విషయాలు మిగిలే ఉంటాయి.

“అలాగే! ఎనౌన్స్‌మెంటొచ్చింది. ఉంటా మరి.”

******

రాత్రంతా నిద్రపోనివ్వని హృదయఘోషతో, ఎప్పుడూ స్వర్గాన్నే చూస్తుండటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయతతో… అర్థంలేని అలల హోరుతో సముద్రం నిరంతరంగా ఏడుస్తుందట. చిన్న పిల్లాడొచ్చి కాలింగ్ బెల్ కొట్టి పారిపోయినట్టు ఏవో పూర్తిగా గుర్తొచ్చీరాని జ్ఞాపకాలు. గవ్వలదండల్ని ఎమోషనల్‍గా బహుమతి ఇచ్చుకున్న అడాలసెంట్ స్నేహాలు, బీచ్ ఒడ్డున అమ్మతో గడిపిన ఆఖరి సాయంత్రం. ఆమె పోయాక ఒంటరితనంతో పొగిలి పొగిలి అలలతో పంచుకున్న వేదనా.. ఇంకా..

“నీ పాటికి ట్రైనింగ్ క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడొచ్చి కూర్చున్నావ్. ఎండలో ఇసుక ముద్దలనుకుని అలలు నీ పాదాలపైకి ఎగబాకటం… చూస్తూ ఉండిపోవచ్చు కానీ, ఎంత చలికాలపు ఎండైనా ఇన్ని గంటలు కష్టమమ్మా!”

“నాఏడుపు మీకు నవ్వులాటగా ఉంది కదా!” గొంతులోకి ఉక్రోషం రాకుండా కష్టపడుతున్నాను.

“నీ వయసెంత?”

చటుక్కున సూటిగా చూస్తే నాకళ్ళలో అనుమానం కనిపించిందేమో, “ఏం లేదు, ఈ వయసుకే ఇంత మౌనంగా ఉండటం గంభీరంగా కనపడాలనా?”

“ఏం నా వయసులో మీరిలా ఉండేవారు కాదా?” విషయం నామీదినుంచి మళ్ళించాలని..

“అప్పుడేమిటి, ఇప్పుడు మాత్రం నీలా ఎందుకున్నాను”

“నాకన్నా పదేళ్ళు పెద్దేమో! యుగాలక్రితం పుట్టినట్టు మాట్లాడతారు.” అరచేతిలో గవ్వల్ని గలగల్లాడిస్తూ తడి తుడుస్తున్నాను.

“లాభం లేదు. నువ్వు ప్రేమించటం మొదలెట్టాలమ్మాయ్” ఒక నిట్టూర్పుతోపాటు సముద్రతీరాన్నీ వదలడానికి సిద్ధమౌతూ ఆయన..

“ఎవర్నో?” పాదాలమీద ఇసుక దులుపుకుని, కాలి పట్టీలు మెల్లగా విదిలిస్తూ లేచి నిలబడ్డాను.

“నిన్నూ, నీజీవితాన్నీ! అన్నట్టు, ప్రతిసారీ అలా అనుమానంగా చూడకు, నాకిబ్బందిగా ఉంటుంది” తడిచిన చెప్పుల్ని తొడుక్కుని నాముందుగా నడుస్తూ.. ” లలిత నిన్ను తీసుకురమ్మని గట్టిగా చెప్పింది. ఈ రెండ్రోజులు హోటల్ రూమ్ వద్దని చెప్పెయ్యి ” నా వైపునుంచీ అదే నిర్ణయమైపోయినంత ధీమాగా..

ఒక్కదాన్నీ విసుగుపుట్టించుకోవాలని నాకూ లేదు.

**********

ఓ….హో” ఆశ్చర్యాన్ని కొన్ని క్షణాలపాటు సాగతీస్తూ అప్పుడే విన్న విషయాన్ని మరోసారి మననం చేసుకున్నాను.

“ఐతే లలితా పబ్లిషర్స్ వెనకున్న కథ ఇదన్నమాట. అడపాదడపా పత్రికల్లో కథలూ, సీరియళ్ళూ రాసే ఈయన హఠాత్తుగా నవలలు, నాన్-ఫిక్షన్ పుస్తకాలు వేసెయ్యడం. కొత్తగా పాఠకుల మార్కెట్ని కదిలించడం వెనకున్న బలం.” భోజనాలయ్యాక లలిత చెప్పే మాటలు వింటూ సాలోచనగా అన్నాను.

“అవసరమనుకున్న సబ్జెక్ట్ మీద పబ్లిషర్లు ఆసక్తి చూపించక, రీసెర్చ్‌ని వదులుకోలేక అసంతృప్తితో ఉండేవారు. ఫార్చునేట్లీ.. పబ్లిషింగ్ కంపెనీలో నాఅనుభవం బాగానే పనికొచ్చింది.” తలోదిక్కుకి పడున్న రిఫరెన్సు పుస్తకాలని తీసి అరలలో సర్దుతూ చిరునవ్వుతో ముక్తాయించారు ఆవిడ.

“’ఉదయాన్నే లేవాలి. మీరు కానివ్వండి” దూరంగా టేబిల్ మీద కాగితాలు పరుచుకుని రాసుకుంటున్న ఆయన్ని కూడా ఉద్దేశించి హాల్లోంచి ఆవిడ లోపలి గదిలోకి వెళ్ళిపోయాక చేతిలో పుస్తకం తిరగేస్తూ ఉండిపోయాను. రచనల తాలూకూ నోట్స్ అనుకుంటా అది. అక్కడక్కడా కొన్ని వాక్యాలు కొట్టివేతలతో, దిద్దుబాట్లతో ఉన్నాయి.

ఏకాగ్రత కుదరక తిరిగి పెట్టేశాను. కొన్ని నిముషాల అర్ధవంతమైన నిశ్శబ్ధం తర్వాత, ఏదిముందు బయటపడాలో తెలీక ఎన్నో మాటలు ఒకదాన్నొకటి ఢీకొని లోలోపలే సమసిపోతుండగా..

“నీ బాధేమిటో, నీ ఆలోచనలేమిటో ఆయనతో చెప్పి చూశావా?” ఊహించని ప్రసక్తితో ఉలిక్కిపడి చూశా! పొద్దున రాగానే నాగొడవంతా ఏకరువు పెట్టిన సంగతి అప్పుడే నవ్వుతూ వదిలేశారనుకున్నాను.

తేరుకుని “వాదనలతో అభిప్రాయాలు మారతాయేమో కానీ జీవితాలు కాదు.” తేల్చేసినట్టుగా అన్నాను.

దించిన తల ఎత్తకుండా రాసుకుంటూనే “వాదించడం వేరు. నీ వాదాన్ని వినిపించడం వేరు”

రచనల్లో పనికొస్తాయి ఈ మాటల మెలికలు. “అర్థం చేసుకోలేని మనిషికి చెప్పీ ఏముపయోగం?”

ఆయన ఏమీ అనలేదు. మళ్ళీ నేనే ఇంకేదో చెప్పుకోవాలనిపించి..

” అంత అర్ధం చేసుకునే భార్య ఉండగా ఎన్నిమాటలైనా చెబుతారు. మీకెలా తెలుస్తుంది నా గొడవ?”

రాస్తున్న కాగితాలు మూసి నవ్వుతూ “నా కంప్లైట్లు నాకూ ఉన్నాయి. దానికేమంటావ్?”

కుర్చీలోంచి లేచొచ్చి పూర్తి చేసిన కథ ఫైల్ నాకిచ్చి “నేను చూసిన ఈ రెండేళ్లలో నువ్వో వ్యక్తిగా ఉద్యోగంలోనూ, అనుభవంలోనూ చాలా ఎదిగావు. ఆ సంగతి నీతోనే ఉంటున్న ఆయనకి కనిపించదేమో. బహుశా నీక్కూడా అనిపించకపోవచ్చు.” నాకెదురుగా ఉన్న సోఫా కవర్ సరిచేసి అక్కడ కూర్చుంటూ “ఈ లెక్కన నేనైతే నీతో చాలా దురుసుగా ప్రవర్తించలేదూ ఒక్కోసారి. నా కథల్ని కఠినంగా విమర్శించినప్పుడు? మరి నాకూ నీమీద గౌరవం, అభిమానం లేనట్టా?” సరిగ్గా నా కళ్ళల్లోకి చూసేలా తలెత్తి మోకాళ్ల మీద మోచేతులానించుకుని అప్పుడే పేపర్లు ఫైల్ చెయ్యడానికి వాడిన ప్లాస్టిక్ పంచ్‌ను రెండు చేతుల్లోకీ మార్చుకుంటూ నన్ను ఇరకాటంలో పెట్టేశారు.

తప్పించుకోలేక తల వంచేసుకుని కథ చదువుతున్నట్టు నటిస్తున్నానో, నిజంగా చదవడానికి ప్రయత్నిస్తున్నానో..

“తీరిగ్గా చదవచ్చు, ముందిటు చూడు” ఆయన చేతిలోని పేపర్ పంచ్ విడిపోయి రెండు భాగాలూ చెరో చేతిలోకొచ్చి, కత్తిరించబడ్డ గుండ్రటి కాగితమ్ముక్కలన్నీ ఒక్కసారిగా నేలరాలాయి అప్పటిదాకా ఆపుకొని తల పైకెత్తగానే బయటపడ్డ నా కన్నీళ్లతో పాటు.

నేల మీద మోకాళ్ల దండ వేసినట్టు వంగి మా ఇద్దరి మధ్యలో పడున్న కాగితం ముక్కలన్నీ ఏరి అరచేతిలో వేసుకుంటూ..

“అసంతృప్తి అనేది ఎవరి జీవితంలో ఐనా ఎంతోకొంత ఉండక తప్పదు. కొన్ని ఎప్పటవప్పుడే మరిచిపోవాలేమో! ఏమంటావ్?” నా సమాధానం కోసం పైకి చూసి బదులిచ్చిన బాష్పధారతో చలించిపోయి..

“ఏందుకు తల్లీ! నీమీద నీకంత జాలి.. ఊర్కో”

సున్నితంగా చేత్తో తల నిమురుతూ పక్కనొచ్చి కూర్చుంటే ఆ వాత్సల్యాన్ని,సాన్నిహిత్యాన్నీ కాదనుకోవడం అయ్యేపనేనా? మనసెరిగిన అమ్మ దూరమయ్యాక, క్రమశిక్షణ పేరుతో మొదట్నుంచీ దూరంగా ఉన్న నాన్న, తన అవసరాలు తప్ప మరో ఆత్మీయతని ఆశించలేని, అందించలేని భర్త, మనసువిప్పి మాట్లాడేంత స్నేహాన్ని ఎవరితోనూ చెయ్యనివ్వని ఇంట్రావర్షన్ – ఎన్నేళ్ళుగా పేరుకుపోయిందో.. దుఃఖం!కాసింత ఓదార్పు దొరికితే మరింతగా పెల్లుబుకి అహాన్ని ముంచేయడమేగా దాని లక్షణం.

********

ఇంకా రాత్రి ఎనిమిదైనా కాలేదు, వచ్చేపోయే జనం మధ్యలో చిక్కటిచలి లైట్ల వెలుతురు చాటున కిటకిటలాడుతోంది. ట్రాఫిక్ మీద అపనమ్మకంతో బాగా ముందు బయల్దేరొచ్చానేమో నేనెక్కాల్సిన ఫ్లైట్‍కి మరోగంట టైముంది. ఒక్క గంటేమిటి రాబోయే ఋతువులన్నిటికీ సరిపడా ఆనందాన్ని, ఒక జీవితకాలం పాటు తోడుండే జ్ఞాపకాల్ని సంపాదించుకున్నానీ రెండ్రోజుల్లో. పొద్దునే లేచి అప్పట్లో అమ్మతో పాటు వెళ్ళే గోపాలపురం గుళ్ళో తిరుప్పావై వినొచ్చి, నే చదువుకున్న కాలేజ్ లైబ్రరీలో నా చోటునోసారి ఆత్మీయంగా తడిమి చూసుకుని, ఆరోజుల్లో ఇక్కడ అద్దెకున్న ఇంటి పక్కన తమిళ వాళ్లతో మాట్లాడి….

ఇవన్నీ అతి మామూలు, చిన్న చిన్న సంగతులు. కానీ పోగొట్టుకున్న మనుషులు, గతంలో వదిలి వచ్చిన స్థలాలూ, జ్ఞాపకాలూ తర్వాత అమూల్యమైన విలువని అపాదించుకుని బెంగగామారి మనిషిని తినేస్తున్నప్పుడు ఈమాత్రం సంగతులే మనుగడకో కొత్త అర్థాన్ని చూపిస్తాయి. అందులోనూ ఉద్వేగాన్ని పంచుకుంటూ, పాతగుర్తులతో మనసు వికలమైనప్పుడు ఊరటనిస్తూ వెంటఉన్న వ్యక్తి వల్ల మరింత తృప్తిగా అనిపించింది.

అంతేనా లేక రేపెప్పుడో కలగబోయే బెంగకు కొత్త పునాది పడుతుందో?

“మాటల్లో పడి మర్చిపోయాను. ఇది నీకోసమే.. చదువుతూ ఉండు, అర్జెంట్ ఫోనొకటి మాట్లాడొస్తా” పాకెట్‌బుక్‌లో మడత పెట్టున్న కాగితమొకటి నాచేతికిచ్చి రింగవుతున్న ఫోన్ నోరునొక్కి ఆయన దూరంగా వెళ్ళిపోవడం చూస్తునే ఆత్రంగా, కొంచం అనుమానంగా తెరిచానా ఉత్తరాన్ని..

జగతీ,

నీ ఆవేదన అర్ధమైంది. కానీ నీ ఆలోచనే భయపెడుతుంది.

మనమనుకునేవి అవతలి వాళ్ళు అర్ధం చేసుకోవట్లేదని బాధపడతాం కానీ అదే సమయంలో ఆ వ్యక్తి దేనిగురించి బాధపడుతున్నాడో అనే కనీస ఆలోచన కూడా రాదుకదా! అదే మనిషిలో ఉన్న మంచి విషయాల్ని చాలా కన్వీనియెంట్ గా స్వీకరించేస్తాం కానీ లోపాల్ని మాత్రం ప్రత్యేకంగా గమనిస్తూ మితిమీరిన గుర్తింపునిస్తూ ఉంటాం ఎన్నోసందర్భాల్లో.

మనిషిగా ఆనందంగా ఉండటానికి చాలా కావాలి; ప్రేమ, గౌరవం, సరదా, సంతోషం ఇవన్నీ. అన్నీ ఒక్కరినుంచే దొరకాలంటే అయ్యేపనేనా? మనిద్దరి స్నేహంలో ఉన్నఆరాధనా, నువ్వొక మేనేజర్‌గామాత్రమే తెలిసిన వాళ్లనుండి వచ్చే గౌరవమూ అన్నీ ఒక్క మనిషినుండే ఆశించడం నీ నిరాశకి మూలమని నాకనిపిస్తుంది.

ఒకరి అలవాట్లలో నీచమైనవి, ఆలోచనల్లోకెల్లా హీనమైనవి, మాటల్లోకెల్లా పరుషమైనవి.. అన్నిటినీ ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ కూడా మచ్చలేని అంకండిషనల్ ప్రేమ ఎవరికైనా ఎలా సాధ్యం?

అసందర్భమైనా మరొక్క విషయం – చాలా సార్లు అడిగావు నాకిష్టమైన పుస్తకం ఏదని. ’నా డైరీ ’. చదవటానికీ, రాయటానికీ కూడా బాగుంటుంది. జీవితం కూడా డైరీనే. పాత సంగతులు చదివి ఊరుకోవడం కాదు, కొత్త ఆశల్ని అందంగా, తెలివిగా రాసుకోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ నీకు తెలీదనో, నువ్వేదో అజ్ఞానంలో ఉంటే ఉన్నఫళాన ఇది చదివి మారిపోవాలనో నా ఉద్దేశం కాదు. ఒక్కసారి నీలోకి నువ్వు తరచిచూసుకుని నీ ఎమోషన్లకి నీమీద పెత్తనమివ్వకుండా జాగ్రత్త పడమని సలహా ఇవ్వడం..

మీరూ నాకే చెబుతారా అని మళ్ళీ నీ ముక్కు ఎర్రబడితే, కళ్ళు చెమ్మయితే; సారీ! నే తిరిగొచ్చేలోగా తుడిచేసుకో. పాఠాలెన్ని చెప్పినా, ఎంత కరుగ్గా ఆక్షేపించినా నీ నిస్సహాయతా, బాధా చూడాలంటే నాకు గుండెను కోస్తున్నట్టు ఉంటుంది.

————————

ఉత్తరం మడిచి హాండ్ బాగ్ లోకి తోశాను. చిత్రంగా కోపం,బాధా లేవు. కొన్ని విషయాలు తెలుసుకోవటానికి అడుగుతాం, కొన్నిమాత్రం తెలిసీ అడుగుతాం. ఒక్కో సమయంలో పరిష్కారాలు చూపించడం కన్నా సమస్యని ’అర్థం చేసుకోవడమే’ పెద్ద ఊరట. ఈయనింకా రాలేదేమిటా అని ఎంట్రన్సు వైపు చూస్తుంటే మహాబలిపురం వెళ్ళిన మాటీమ్‌మేట్లంతా అప్పుడే హడావిడిగా గ్లాస్‌డోర్ నెట్టుకుని లోపలికొస్తున్నారు.

*********

ఒక చేతిలో టీవీ రిమోట్‌తో, మరో చేతికీ, చెవికీ మధ్య సెల్తో ఇబ్బంది పడుతూ తలుపు తీశాడు హరి, శంఖు చక్రాలతో ప్రత్యక్షమైన విష్ణుమూర్తిలా. అవతల వైపు ఎవరు మాట్లాడుతున్నారో “ఏరా! అప్పుడే నిద్రపోయావా? పదింటికల్లా పడుకోవటానికి, ఇంటితిండి తినడానికీ రాసిపెట్టుండాలి. నువ్వు లక్కీరా.” నా వైపొక అసహనపు చూపు పడేసి తలుపేసుకునే బాధ్యత నాది కాబట్టి ఫోన్‌తో బాల్కనీలోకెళ్ళిపోయాడు. టీవీలో చిన్న పిల్లల పెద్ద తరహా డాన్సుల ప్రోగ్రాం హోరెత్తుతుంది. విసుగ్గా ఆపెయ్యబోయి ఎందుకో వాల్యూమ్ మాత్రం కొద్దిగా తగ్గించి లోపలికెళ్ళాను.

విసుగుకి పైమెట్టు నిర్లిప్తత ఐతే దాన్నెక్కకుండా కొత్తదారిలో జీవితాన్ని మరల్చడం.. నావల్లవుతుందా?

—————–XXXXX——————–

“అంతే! నే రాయగలిగిన కథ. మీ అభిప్రాయం చెప్పనే లేదు?” సెల్లో మరో కాల్ వెయిటింగ్ వస్తుంటే ఇక ఆగలేక అడిగేశా. పూర్తిచేసి పంపి ఇన్ని రోజులైనా ఏం మాట్లాడలేదంటే.. నచ్చలేదేమో!

“చెప్పటానికేం లేదు నాదగ్గర. ఒట్టి ‘థాంక్స్’ తప్ప.” ఆయన మాటల వెనకెప్పుడూ ఒక చిరునవ్వు లయ.

“అదేమిటి?” అయోమయం నాకు.

“నా మీద నమ్మకం, నా మాటల మీద విలువ ఉంచినందుకు..” నన్ను మరో మాట చెప్పనివ్వకుండా లైన్ కట్ చేసిన శబ్ధం.

జీవంలేని హృదయంలో పట్టనంత ప్రేమను నింపి, దాన్ని అనుభవించేలోగానే అధిగమించి ఆలోచించడమూ తనే నేర్పి, అమాయకపు ఉద్వేగాల్ని లొంగదియ్యడానికి వివేకాన్ని అరువిచ్చి,చివరికి కృతజ్ఞతలు కూడా చెప్పుకోనివ్వకుండా దారికి ఎదురొస్తే.

ఈ మనిషినేమనాలి? తప్పించుకుని ఎటెళ్లాలి?

***********

స్వాతికుమారి ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులు.

Posted in కథ | 14 Comments

గాలి

-కెక్యూబ్ వర్మ

వీస్తున్న గాలి
వాసన ముక్కు పుటాలను తాకి
ఎదలో రొద పెడుతోంది.

ప్రశ్న వెన్నంటే ప్రశ్నల సాలె గూడులో౦చి
బయట పడలేని తనం.

తెగిపడిన శిరస్సుల ముందు
ఖాళీ చేతులతో మోకరిల్లలేను
కనుగుడ్ల ఖాళీ స్థలంలో ఇప్పుడు
ఏదో విద్యుల్లత

పద్మ వ్యూహం నుండి
బయటపడే మార్గం ఉమ్మనీరులో
ఈదిన నాడే నేర్చిన వారి
బిగి కరచాలనం,
చిరునవ్వుతో కదనోత్సాహం,
మృత్యు ఘంటికల కొసలు తెంపే
రణన్నినాదం.

సన్నని గాలితిమ్మెరతో పాటు
సయ్యిన చెవిపక్కగా దూసుకుపోయిన
బాణం గుసగుస
సాయుధుణ్ణి చేస్తోంది.

కె.కె.కుమార వర్మ గారు విజయనగరం జిల్లా, పార్వతీపురం పట్టణంలో వుంటున్నారు. అది కళింగాంధ్ర ప్రాంతం. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖలో గ్రామాభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. విరసం సంస్థలో 12 ఏళ్ళుగా సభ్యుడిగా వుంటున్నారు. శివారెడ్డి, ఆశారాజుల కవిత్వమంటే బాగా ఇష్టం. ప్రస్తుతం బ్లాగుల్లో వివిధ అంశాల పట్ల తన స్పందనను రాస్తున్నారు

Posted in కవిత్వం | Tagged | 4 Comments

తోలుబొమ్మలు

— స్వాతీ శ్రీపాద

“ఎవరు? ”

“………”

“ఎవరది?”

కళ్ళు బాగానే కనిపిస్తాయంటుంది కాని కనిపించడం లేదని అర్ధమవుతూనేవుంది. గొంతువిని గుర్తు పడుతుంది. లేదూ చాలా దగ్గరగావుంటే చూడగలదనుకుంటా..

“అమ్మా! బ్రేక్ ఫాస్ట్ తిన్నావా ?”

“నువ్వా? ఇప్పుడా అడిగేది? అన్నాలవేళ కూడా అయినట్టుంది ”

“ఏం చెయ్యను చెప్పు ? నీకు తెలీనిదేఁవుంది … ఆయనకు కావలసినవన్నీ అమర్చితే కాని బయట పడలేను.. సరే, కారియర్ వచ్చిందా?”

మేమందరం మాట్లాడుకుని, ఇంటి పక్కనేవున్న మెస్ నించి ఈ ఏర్పాటు చేసాం.

ఉదయం ఎనిమిదిలోపు రెండు ఇడ్లీలు , మధ్యాహ్నం భోజనం కారియర్ మళ్ళీ రాత్రి ఎనిమిదిలోపు ఏదో ఒక లైట్ మీల్. అయితే ఇడ్లీలు లేదా ఒక దోసె.

ఫాషన్స్ మారిపోయాయి.

ఎన్ని కొత్తరకాల చీరలొచ్చాయని.

నేనైతే చాలా మటుకు డ్రెస్‌లే వాడతాను.

ఇప్పుడివన్నీ ఏం చెయ్యాలి?

రోజంతా చూసేందుకు ఏర్పాటు చేసిన అమ్మాయి పాలు కాచి ఇవ్వడం, మిగతా అవసరాలూ చూస్తూంటుంది. కాని ఇప్పుడు ఆ ఏర్పాటుకూ అందరూ సుముఖంగా లేరు.

“తలో మూడు నెలలు ఉంచుకుందాం. ఎన్నాళ్ళని ఇలా, దీన్ని బిల్డర్ కి అప్పగిస్తే కనీసం మనకు ఒక్కొక్కళ్ళకు రెండు మూడు కొత్త అపార్ట్మెంట్స్ వస్తాయి. వాటిని అద్దె కిచ్చుకున్నా వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా కాస్త ఆసరాగావుంటాయి. అక్కడేవుంటావు కాబట్టి ఆ ఇల్లు ఖాళీ చేసి అమ్మను బయటకు తెచ్చేబాధ్యతనీదే.” ఇదీ నా తోడబుట్టినవాళ్లంటున్న మాట.

నిజమే ఆ పెద్ద ఇంట్లో అమ్మ ఒక్కతే వుండటం ఇబ్బందికరమే.

స్టోర్ రూమ్ నిండా ఒకదాని మీద ఒకటి పేర్చిపెట్టిన చెక్కపెట్టెలు. చెదలు పట్టి చిల్లులు పడి…

నిన్ననే అమ్మకు చెప్పాను ఇల్లు సర్దాలని. గదిలోకి అడుగుపెడుతూనే ఓ రకమైనపాత వాసన. మొహం చిట్లించుకుని ముక్కెగబీల్చి సర్దుకున్నాను. నిజానికి ఆగదిలో సంవత్సరాల కొద్దీ భద్రపరచిన ఆ వస్తువులన్నీ మాకు చెత్తగానే కనిపిస్తాయి..కాని అవే ఆమె సిరి సంపదలు. ఆమె తాలూకు గతజీవితపు సజీవ స్మృతులు. తన కుటుంబపు డాక్యుమెంటరీలు.

ఒక పెట్టెలో బాగా చిలుము పట్టిన ఇత్తడి సామాను. అరవై డెబ్బై ఏళ్ళక్రిందటి మరచెంబు… ఆకుపచ్చరంగుకి తిరిగింది. నాలుగ్గిన్నెల ఇత్తడి కారేజీ… అమ్మ ఎన్ని సార్లు చెప్పిందో పెళ్ళయాక అత్తారింటికి వచ్చేటప్పుడు పుట్టింటినించి తెచ్చుకున్న సామానదని. ఆ క్యారేజిలో పెరుగన్నం పెట్టి ఇవ్వడం పెళ్ళిలో ఆనవాయితీ. ఆ మరచెంబులో పాలు… ఇత్తడి కాఫీ ఫిల్టర్… పూజ సామాగ్రి… కుందులు, గంట , కర్పూరం వెలిగించుకునే హారతి పళ్ళెం…

మూతలు తియ్యకపోయినా, ఎందులో ఏమున్నాయో నాకు బాగా తెలుసు. ఆ మూల మూత విరిగిన ఆకుపచ్చ పెట్టెలో పాత ఫొటోలు — కొన్ని కార్డ్ బోర్డ్ మీద అతికించినవి, మరికొన్ని ఫ్రేమ్ కట్టినవి. బ్లాక్ అండ్ వైట్ పోటోలరంగు మారి పసుపు రంగుకు రావడమే కాదు, ముట్టుకుంటే విరిగిపోయే దశలో మిగిలాయి.

చిన్నప్పుడు మేమంతా ఆ స్టోర్‌రూమ్‌లో ఆడుకోవడం నిన్నగాకమొన్న జరిగినట్టుంది.

మా నలుగురికీ వయసు తేడా ఒక్కొక్క ఏడాదే. నిజానికి పెద్దక్కకీ రెండో అక్కకీ తేడా సరిగ్గా పదకొండు నెలలు. ఇద్దరు పుట్టినదీ ఒకే సంవత్సరంలోనే. చిన్నప్పుడు విన్న కథలన్నీ మేం వేసవిసెలవుల్లో నాటకాలు వేసేవాళ్ళం. మధ్యాహ్నం మాకు నిద్దరొచ్చేదికాదు. అమ్మ కాస్త కునుకుతియ్యగానే చడీచప్పుడూ లేకుండా పెట్టెలు తెరిచి అందులోని పంచెలూ చీరలూ కట్టుకుని నాటకాలాడే వాళ్ళం. జీవితమే ఒక నాటకమని తెలీని వయసది. చీరలు కట్టుకుందుకు ఎంత పోటీ పడేవాళ్ళమని… నేనంటే నేనని! చివరకు ఒకరిద్దరు పంచెలు కట్టుకోక తప్పేది కాదు. ఆ ఒకరిద్దరిలో నేను ఎప్పుడూ వుండేదాన్ని. చిన్నదాన్నని నన్ను నోరు మెదప నిచ్చేవారుకాదు. మంచి మంచి జరీ చీరలు మాత్రం వాళ్ళు సింగారించుకునేవారు. అచ్చు రాణీగారిలాగ పెద్దకొంగుతో తలమీద పిన్నులతో టక్ చేసుకుని, నేలంతా జీరాడుతూ మిలమిల మెరిసిపోయేది మూడో అక్క.

దొరికిన పౌడర్ మొహాలకు బూడిదలా అద్దుకోవడమే కాకుండా అమ్మ సింధూరంలో నీళ్ళు కలిపి పెదవులకు పట్టించుకునే వాళ్ళం.

ఎప్పుడన్నా అమ్మకంట్లో పడితే మాత్రం మా వీపులు విమానం మోతలు చేసేవి, చీరలన్నీ నాశనం చేస్తున్నామని.

ఇప్పటికీ ఎన్ని పెట్టెల్లో అమ్మ చీరలున్నాయో చెప్పలేను.

అందరం అమ్మాయిలం మాకు ఇచ్చేస్తుందని ఎంతో అనుకున్నాం. కాని అమ్మ ఒక్క చీరైనా ఎవరికీ ఇవ్వలేదు.

“అవి చీరలు కాదు నా గతం తాలూకు చిత్ర పటాలు. నేనున్నన్నాళ్ళూ అవి ఉండాల్సిందే.” తెగేసి చెప్పింది అమ్మ ఏళ్ళక్రితమే.

ఇహ ఇప్పుడైతే ఎవ్వరూ వాటికి ఆశ పడట్లేదు కూడా. ఫాషన్స్ మారిపోయాయి.

ఎన్ని కొత్తరకాల చీరలొచ్చాయని.

నేనైతే చాలా మటుకు డ్రెస్‌లే వాడతాను.

ఇప్పుడివన్నీ ఏం చెయ్యాలి? అమ్మను ఎవరింటిలో వుంచుకున్నా ఆవిడకో గది ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది ఇవన్నీ ఎక్కడ పెట్టుకోగలం. ఇప్పుడు అమ్మ మా ప్రపోజల్ తిరస్కరించే స్థితిలో లేదు.

ఇదివరలో ఎన్నిసార్లు ఎవరు పిలిచినా, “నన్నిలా నా ఇంట్లో ప్రశాంతంగా వుండనివ్వండి. నేను సంతోషంగావుండాటం కావాలా, మీతో వుండటం కావాలా మీరే తేల్చుకోండి” అంటూ మానోళ్ళు కట్టేసింది..

ఈ సారి మాత్రం అమ్మ ఇష్టాఇష్టాలడగ లేదు నేను. చేసేది చెప్పాను.

“మాకూ ఇల్లూ వాకిలీ మొగుడూ పిల్లలూ ఉన్నారు. ప్రతిక్షణం నీగురించి టెన్షన్ పడి తట్టుకోలేం. అందుకే ఇలా… పైగా ఇల్లు పాతది ఎప్పుడు ఏమౌతుందో చెప్పలేం… అందుకే ఖాళీ చేసి…”

చెప్పేశాను. అమ్మ ఈసారి ఎదురు చెప్పలేదు.

కానీ ఇప్పుడు ఈ సామాను తీస్తుంటే అమ్మ గదిలోకి వచ్చింది

“నన్ను ఒక్కొక్కళ్ళు మూడు నెల్లుంచుకుంటారా?”

అమ్మ ఆమాట అడగ్గానే మనసు చివుక్కుమంది.

ఈ మారు నిశ్శబ్దం నావంతైంది.

*****************

పాతికేళ్ళ క్రితం నాన్న పోయాక ఈ ఇల్లూ ఈ వస్తువులే అమ్మ నేస్తాలు. ఎవరితోనూ పెద్దగా పరిచయాలు పెంచుకునేది కాదు.

నేనా గదిలోకి వచ్చినప్పుడల్లా అమ్మ నిద్రకూడా మానుకుని నా వెనకే వస్తోంది.

పారేసే ప్రతి వస్తువుకీ ఓ కధ. ఓ గతం. ఓ చరిత్ర.

చిత్రం! ఇదివరలో అమ్మకు కళ్ళు సరిగ్గా కనిపించవనుకునేదాన్ని. ఈ గదిలో మాత్రం ఏ వస్తువు తీసినా ఆవిడకు తెలిసిపోతోంది.

“అదిలా ఇవ్వు” అమ్మ స్వరం.

తలెత్తి చూశాను. నా చేతిలోని చెక్కపెట్టెనే చూస్తోంది..

అది బొట్టుపెట్టె. ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ చేయించాక అది సామాను గదిలోకి తరలిపోయి కూడా పాతికేళ్ళు దాటింది.

“అది మాఅమ్మది. ఆవిడ జ్ఞాపకంగా తెచ్చుకున్నాను.” అని క్షణం ఆగి “దీన్ని చూస్తే అమ్మను చూసినట్టే వుంటుంది”

“అమ్మ బ్రతికింది గట్టిగా చూస్తే ముప్పై ఏళ్ళు కూడా కాదు. పెళ్ళి జరిగిన ఏడాదికి కాపరానికి వచ్చిందట. అది మొదలు ఎప్పుడు చూసినా అయితే బాలింత కాదంటే చూలింత. ప్రతిసారీ నరకం అనుభవించి పురిటినొప్పులు పడి బిడ్డను కనడం, ఆ బిడ్డ పురిట్లోనే పోవడం. ఆసుపత్రికి వెళ్ళడం అప్పట్లో ఆనవాయతీ లేదట. పెళ్ళయిన పదహారేళ్ళలో కన్న పదిమందిలో మిగిలినది నేను నా చిన్న చెల్లి మాత్రమే.” అమ్మ ఆగింది.

“అమ్మా పడుకోరాదూ ”

ఆ గదిలోంచి బయటకు వచ్చినా అమ్మ తన గతం నించి బయట పడలేదు.

“చివరకు కనలేకనే అమ్మ చచ్చిపోయింది.” అమ్మ కళ్ళనించి నీళ్ళు.

సవతి తల్లి చేతుల్లో నానా బాధలూ పడ్డారని వాళ్ళూ వీళ్ళూ చెప్పుకోగా విన్నాం కాని… అమ్మ తన తల్లిని గుర్తు చేసుకోడం నాకు తెలిసి ఇదే తొలిసారి.

“నేనూ మా అమ్మ లాగే చచ్చి పోతాననుకున్నాను… మీ నాన్న కొడుకు కావాలని పట్టుబట్టినప్పుడు. కడుపుతో వున్న తొమ్మిదినెలలూ అమ్మే ప్రతిక్షణం కళ్ళల్లో మెదిలేది. నా పిల్లలూ మా లాగే తల్లి లేని వాళ్ళయి అగచాట్ల పాలవుతారనిపించేది. మీ నాన్నకు మాత్రం తలకొరివి పెట్టడానికి కొడుకు కావాలని కోరిక.” అమ్మ మా ఎవ్వరితోనూ ఇంత ఫ్రీగా ఎప్పుడూ మాట్లాడలేదు.

ఇప్పుడు ఓ కూతురిగా నాతో మాట్లాడుతున్నట్టు లేదు. ఏదో ట్రాన్స్ లో వున్నట్టు… ఎవరో మిత్రురాలి తో మాట్లాడుతున్నట్టు…

“పురిటి నొప్పులు పడితేగదా బాధ తెలిసేది? చచ్చి బ్రతికే ప్రక్రియలో అది కూతురైనా కొడుకయినా ఒక్కటే కదా… ఉహు… ఇంకోసారి… ఇంకోసారి… అది వాళ్ళ ప్రాణమయితేగా…”

“……”

“అందుకే చివరికి సిజేరియన్ తప్పదని చెప్పి, డాక్టర్‌ని ఒప్పించి ఆపరేషన్ చేయించుకున్నాను. అది మీ నాన్నకు బ్రతికుండగా చెప్పలేదు.” అమ్మ ఏడుస్తోంది..

ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు.

కాస్సేపటికి తనను తాను సంభాళించుకుని… ఆ వైపుకి తిరిగి గోడవైపు మొహం పెట్టుకుని పడుకుంది అమ్మ.

“అయినా … ఏ తరమయినా …. ఎన్ని మార్పులు వచ్చినా… ప్రతి వాళ్ళూ తోలు బొమ్మలే … కళ్ళాలు మరెవరిచేతుల్లోనో వుంటాయి… తెరమీదమాత్రం మనం ఆడినట్టే అనిపిస్తుంది… ”

నా మొహాన చాచి కొట్టినట్టనిపించింది. ఆ రాత్రంతా నా కంటిమీదకు కునుకు చేరితే ఒట్టు.

అవును. అమ్మకు ఆ ఇల్లే జీవితం. అదే గతం, వర్తమానం , భవిష్యత్తు కూడా.

అప్పట్లో నాన్న పోయాక ఒక్కళ్ళంటే ఒక్కళ్ళమూ ఆవిడను వచ్చి వుండమని అడగలేదు.

“అమ్మో… ఆవిడనెవరు భరించగలరు… ముప్పొద్దులా వేడి వేడిగా వండి వడ్డించాలి. ప్రపంచంలో పరిశుభ్రత అంతా ఆవిడదే అయినట్టు పది సార్లు కడిగినదే కడుగుతుంది. అంతేనా! ఎంత తోస్తే అంత అల్లుళ్ళనైనా చూడకుండా అనేస్తుంది. ఆవిడను తెచ్చుకోడం కొరివితో తలగోక్కోడమే.” ఇది మేమందరం అనుకున్న మాటే.

అమ్మ ఎంత స్పష్టంగా చెప్పింది!

జరిగేది తనకు నచ్చటంలేదని. ‘మీ చేతుల్లో నేను తోలుబొమ్మన’ని.

మహా అంటే అయిదారేళ్ళు బ్రతికే అమ్మను ఇప్పుడు పీడించి ఈ ఇల్లు లాక్కోకపోతే మేం బ్రతకలేమా?

పెద్దగా సవ్వడి చెయ్యకుండా బయటపెట్టిన సామాను తీసి సామాన్ల గదిలో పెట్టి తాళం వేశాను.

అమ్మను సుఖపెట్ట లేకపోయినా బాధపెట్టే అధికారం మాకు లేదు.

అది నాకు తెలిసి వచ్చింది.

అందుకే అమ్మను తోలు బొమ్మను కానివ్వను.

———————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

Posted in కథ | 12 Comments

శకలస్వరం

-డా. పులిపాటి గురుస్వామి

ఎప్పటికీ
ఏదో ఒక బాధ..

దానికి రూపం ఉండదు,
నువ్వనుకుంటున్నట్టు
సరిహద్దులు కూడా ఉండవు.

నన్ను కాపాడుకోవటం కోసం
అది ఆవహించుకు పోతుంది.

వందశాతం వశీకరణ మంత్రమేదో ఉంది.
నేను దాన్ని ప్రేమించినట్టే
అది కూడా నన్ను..

కనికరింపుల కలత
దుఃఖాన్ని సాదరంగా
చేయి పట్టుకు తీసుకువచ్చి
నిలబెడితే..

దాని దీనమైన ముఖానికి
నవ్వాగదు నాకు..

నాకు నువ్వు కావాలి
దుఃఖం కూడా కావాలి .

డా.పులిపాటి గురుస్వామి గారు, ఎల్.బి.నగర్, హైద్రాబాద్‌లో వైద్యవృత్తిలో ఉన్నారు. కవిత్వం,రచనలు ప్రవృత్తి. స్వీయ కవితలతో “చెమ్మ” కవితా సంకలనాన్ని ప్రచురించారు.”జీవిగంజి” దీర్ఘ కవితను రచించారు.

Posted in కవిత్వం | Tagged | 4 Comments

మృతజీవులు – 32

-కొడవటిగంటి కుటుంబరావు

“నజ్ ద్ర్యోవా! నిజంగా?”

“ఏం, అతని బుద్ధే అంత. తన తండ్రిని అమ్మటానికి చూశాడు తెలుసా, మరీ అన్యాయం పేకాటలో పణం పెట్టాడు.”

“ఎంతచిత్రమైన విషయాలు చెబుతావమ్మా! నజ్ ద్ర్యోవ్ కు ఈ వ్యవహారంలో జోక్యం ఉంటుందని నేను చచ్చినా ఊహించి ఉండను.”

“నేను మటుకు మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నాను.”

“నిజంగా, ఈప్రపంచంలో ఎలాటివి జరుగుతాయో! చిచీకవ్ మొదట ఇక్కడికి వచ్చినప్పుడు, నీకు జ్ఞాపకం ఉందేమో, ఇంత రభస చేస్తాడని ఎవరనుకున్నారు? అయ్యొ, అన్నాగ్రిగోర్యెవ్న, నేనెంత కంగారులో ఉన్నానో నీకు తెలిస్తేనా! నీ స్నేహమూ, ఆపేక్షా ఉండబట్టి సరిపోయిందిగాని…నేను దిగులుపడి పోయేపనే! మన సంగతి ఎలావచ్చిందో! నేను చచ్చేట్టు పాలిపోవటం చూచి మా మాష్క, ‘అమ్మగారూ, మీరు చచ్చేట్టు పాలిపోయారు,’ అన్నది. ‘మాష్క, ఆ సంగతి ఇప్పుడు జ్ఞాపకం చెయ్యకు ‘, అన్నాను. “ఎంతపని జరిగిందీ! అయితే నజ్ ద్ర్యోవ్ కూడా ఇందులో ఉన్నాడూ! ఇంకేమనాలి!”

ఈ లేచిపోవటం గురించిన వివరాలు, ఎన్ని గంటలకు లేచిపోదామనుకున్నదీ మొదలుగాగల విషయాలు, తెలుసుకోవాలని ఒయ్యారిభామకు ఎంతో ఆశకలిగింది. కాని ఒప్పులకుప్ప తన కాసంగతులేవీ తెలియవన్నది. ఆవిడకు అబద్ధం చెప్పటం చాతకాదు. తాను వాస్తవం ఊహించాననుకోవటం దారివేరు, అప్పుడుకూడా ఆ ఊహ మనోవిశ్వాసం పైన ఆధారపడాలి. ఆమె మనసులో విశ్వాసం ఏర్పడితేచాలు, తన అభిప్రాయాన్ని ఎంతబలంగానైనా సమర్ధించుకో గలదు. ఇతరుల అభిప్రాయాలను మార్చటంలో ప్రజ్ఞగల ఎంతో గొప్ప లాయరు తన ప్రజ్ఞను ఆమెమీద ప్రయోగించినట్టయితే మనో విశ్వాసమంటే ఏమిటో ఆయనకు తెలిసివస్తుంది.

ఈ స్త్రీలిద్దరూ మొట్టమొదట అనుకోటాలుగా ప్రారంభించిన విషయాలను చివరకు వాస్తవంగా పరిగణించారంటే అందులో విడ్డూరమేమీ లేదు. విద్యాధికులమనుకునే మనమే అలా ప్రవర్తిస్తాం, ఇందుకు సాక్ష్యం మన సిద్ధాంతాలే.

… పురుష ప్రకృతి నిరుపయోగమైనది. వాళ్లు ఇళ్ళు దిద్దుకోలేరు, ఒకమాట మీద ఉండలేరు, దేన్నీ గట్టిగా నమ్మలేరు, వాళ్ళకు అన్నీ అనుమానాలే. వాళ్లు ఇదంతా అర్థంలేని సంగతి అన్నారు, గవర్నరు కూతుర్ని లేవదీసుకుపోవటం అశ్విక సైనికాధికారులు చేసేపని అనీ సివిలు ఉద్యోగులు చేసేపని కాదనీ, చిచీకవ్ అలాటి పనిచెయ్యడనీ, ఆడవాళ్లు అర్థంలేని మాటలు మాట్లాడతారనీ …

ఈ సిద్ధాంతాలను మొట్టమొదటగా మనపండితులు భయభక్తులతో సమీపిస్తారు; పిరికిగా, నమ్రతగా, జాగ్రత్తగా, “దీనికి వ్యుత్పత్తి ఇదే అయి ఉండకూడదూ? ఫలానికి దేశానికి ఆ పేరు ఫలాన్ని స్థలాన్ని బట్టి వచ్చి ఉండవచ్చుగదా?” లేకపోతే, “ఈ పత్రానికీ దీనితరువాతి దానికీ సంబంధంఉన్నట్టు స్ఫురించటం లేదా? లేకపోతే, “ఈ పేరుగల జాతికి చెందినవారు ఆ యీ జాతుల వారేనని మనము ఊహించటానికి అవకాశ మున్నదిగదా?’ అంటూ ప్రారంభిస్తారు. తరవాత తమ ఊహలను సమర్థించటానికి ఆ ప్రాచీన రచయితనూ, ఈ ప్రాచీన రచయితనూ ఉదహరిస్తారు. తమ ఊహకు ఆధారం కాస్త దొరికితేచాలు, దొరికినట్టు కనిపిస్తేనే చాలు, దైర్య విశ్వాసాలతో ప్రాచీన రచయితలను పరామర్శిస్తూ, వారిని ప్రశ్నించి తామే సమాధానాలు చెబుతూ, తాను పిరికిగా ఒక ఊహతో బయలుదేరానన్నది మరచిపోతారు. తాము నిజం గ్రహించామనీ, అంతా స్పష్టమయిందనీ అనుకుని తమవాదనను ఈ విధంగా పూర్తి చేస్తారు: “ఇది ఇలాగూ; ఈ పేరుగల మనుషులు వీరే! మనం ఈ విషయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి!” ఈ విధంగా సిద్ధాంతం వేదికపైనుంచి వెలువడి, ప్రపంచం చుట్టిరావటానికి బయలుదేరి, శిష్యులనూ, అనుయాయులనూ సంపాదించుకుంటుంది.

ఈ యువతీద్వయం ఈ క్లిష్టమైన వ్యవహారాన్ని ఎంతో తెలివిగానూ, విజయవంతంగానూ అంతు తేల్చే సమయంలో, చెక్క మొహమూ, దట్టమైన కనుబొమ్మలూ, చిట్లించే కళ్లూ వేసుకొని పబ్లిక్ ప్రాసిక్యూటరు గదిలోకి చక్కా వచ్చాడు, సంగతంతా ఆయనకు విశదీకరించటానికి ఒకరితో ఒకరు పోటీపడుతూ ఆ స్త్రీలు, చచ్చిన మనుషుల కొనుగోలు విషయమూ, గవర్నరు కూతుర్ని లేవదీసుకుపోయే ప్రయత్నం విషయమూ చెప్పి, ఆయనను ఎంత అయోమయంలో పడేశారంటే, ఆయన వాళ్లు చెప్పేదానికి తలా తోకా తెలియక అలాగే నిలబడిపోయి, ఎడమకన్ను చిట్లిస్తూ, తన గడ్డంలో పడిన నస్యాన్ని చేతిరుమాలతో దులుపుకున్నాడు. అందుకని ఆ స్త్రీలు ఆయనను అక్కడే ఉండనిచ్చి చెరొక దారినా నగరమంతా వెతకటానికి బయలుదేరారు. ఈపనివారు సాధించటానికి అరగంటకు కొంచెం జాస్తి కాలం పట్టింది. నగరమంతా కెలుకుడుపడిన మాటకూడా నిజమే; అంతా గందరగోళమై పోయింది. ఏమనుకోవాలో ఏవరికీ తోచలేదు. ఈ స్త్రీలు ప్రతిమనిషికీ ఎలాటి దిగ్భ్రమ కలిగించారంటే, అందరూ, ముఖ్యంగా అధికారులు, ఉక్కిరి బిక్కిరి అయారు. నిద్రపోయే కుర్రాడిముక్కులో తోడివాళ్ళు నస్యం పెడితే ఏమవుతుందో మొదట్లో వారిగతి అదే అయింది; నిద్రలో దీర్ఘంగా గాలిపీల్చేసరికి నస్యంలోపలికి వెళ్ళి వాడు కాస్తా తుళ్ళిపడిలేస్తాడు, తాను ఎక్కడున్నది కూడా తెలియక, వెర్రి వాడిలాగా కళ్లు వెళ్ళుకొస్తూ కలయజూస్తాడు, తనకేమయినదీ తెలుసుకోలేకపోతాడు, ఆ తరవాత వాడికి పరిచితమైన గోడలమీద ఏటవాలుగా పడే సూర్యకిరణాలు కనిపిస్తాయి, మారుమూలల దాగియున్న మిత్రుల కేరింతలు వినిపిస్తాయి, కిటకిలోనుంచి చూస్తే బయట ఉదయపుకాంతితో నిద్రమేలుకుంటున్న అడవిపక్షుల కలకలాలూ, అక్కడక్కడా తుంగలచాటున మాయమవుతూ మెరిసే నదీ, ఒకరినొకరు స్నానానికి రమ్మని పిలుచుకునే మొండిమొల కుర్రాళ్ళూ చూస్తాడు-తన ముక్కులో ఏం పెట్టారో వాడికి చిట్టచివరకు తెలుస్తుంది.

మొట్టమొదట నగరవాసులస్థితీ, అధికార్లస్థితీ అచ్చు ఇలాగే వుండింది, ప్రతివాడూ గొర్రెలాగా గుడ్లు వెళ్ళబెట్టి అలా నిలబడి పోయాడు. చచ్చిన కమతగాళ్ళతోనూ, గవర్నరు కూతురితోనూ, చిచీకవ్ తోనూ వాళ్ల బుర్రలు కలవరపడిపోయాయి. కొంతకాలం గడిచాక, వాళ్ళు కాస్త తెప్పరిల్లుకున్న మీదట వాళ్ళు వీటిని దేనికదిగా వేరుచేయగలిగి, అప్పటి వ్యవహారం అంతుచిక్కగపోగా ప్రశ్నలడగటమూ, విసుక్కోవటమూ చేశారు. “దీనికి సరి అయిన అర్థమేమిటి? ఈ చచ్చిన మనుషుల మాటేమిటి, చచ్చిన మనుషులంటే అర్థమేమిటి, వాళ్ళని ఎలా కొనటం? వాళ్లను తీసుకునేటంత బుద్ధిహీనుడెవడుంటాడు? వాళ్ళకోసం డబ్బివ్వటంకూడానా? దీంతో గవర్నరు కూతురు కేమిటి సంబంధం? దాన్ని లేవదీసుకుపోదలచిన వాడైతే చచ్చినవాళ్ళను కొనడం దేనికీ? వాళ్ళనేమన్నా కానుక పెడతాడా ఏమిటి? ఈ ఊళ్ళో ఎంత అర్థంలేని కబుర్లు ప్రచారమవుతాయో! రానురాను ఇలా అయిందేం? ఇలా తిరిగేసరికల్లా నీమీద ఏదో అభాండం వేస్తారాయె, దానికి తలాతోకా ఉండదాయె…అయినా అందరూ చెప్పుకుంటున్నా రాయిరి, అందుకేదో కారణం ఉండే ఉంటుందీ? బొత్తిగా ఏ కారణమూ లేదు. అంతా బొల్లికబుర్లు, శుద్ధాబద్ధం, వట్టిసొళ్ళు, సింగినాదం జీలకర్ర! పనిలేకపోతే సరి!…” ఇంతకూ ఎక్కడబట్టినా ఇదే చర్చ, అందరూ చచ్చిపోయిన వాళ్లను గురించీ, గవర్నరు కూతుర్ని గురించీ, చిచీకవ్ గురించీ మాట్లాడుకునేవాళ్ళే, పెద్దరభస సాగింది. అంతవరకూ నిద్రావస్థలో ఉండిన నగరం కాస్తా సుడిగుండంలా అయిపోయింది. అదివరదాకా డ్రెసింగ్ గౌన్లు వేసుకుని ఏళ్ళతరబడి ఇంట్లోనేపడి ఏడుస్తూ, బూట్లు బిగువైనాయని బూట్లు కుట్టేవాణ్ణో, దర్జీ వాణ్ణో, తాగివచ్చి బండితోలేవాణ్ణో తిట్టుతూ ఉండిన జడ్డుగాళ్లూ, సోమరిపోతులూ తమ కలుగుల్లోనుంచి బయటికివచ్చారు; ఎన్నో ఏళ్లుగా తమ మిత్రులను చూడటం మానేసి నిద్రాదేవతను వరించి పిల్లులను పోట్లాటకు పెట్టేవాళ్లూ (అంటే గురకపెట్టి నిద్ర పోయేవాళ్ళూ) విందుకు వెళ్లితే అయిదువందల రూబుళ్ల ఖరీదు చేసే చేపల సూప్ రుచిచూడ వచ్చుననీ, ఆరడుగుల స్టర్జిన్ చేప తినవచ్చుననీ, నోట్లో వేసుకుంటే కరిగిపోయే వంటకాలుంటాయనీ అన్నప్పటికీ కదలనివాళ్ళూ ఇప్పుడు కదిలారు. ఇంతెందుకు? నగరం ఎంతో సందడిగానూ, ప్రాముఖ్యం గలదిగానూ, జనసమర్థంకలదిగానూ ఉన్నట్టు కనబడింది. ఎవరూ ఎన్నడూ వినివుండని ఒక సీసోయ్ పఫ్నూతివిచ్ అనేవాడూ, మక్టోనల్డ్ కర్లోవిచ్ అనేవాడూ అకస్మాత్తుగా నలుగురిమధ్యా కనిపించారు. చేతిని కట్టులో దూర్చుకుని ఒక అతిపొడుగైన సన్నటివాడు-అంత కన్న పొడుగైనవాణ్ణి ఎవరూ చూసివుండరు-డ్రాయింగ్ రూముల్లో ప్రత్యేకంగా కనబడసాగాడు. కిటికీలు మూసిన బళ్లూ, కొత్తరకం వాహనాలూ వీథుల్లో చప్పుడుచేస్తూ తిరగసాగాయి-అంతా కల్లోలమయింది. ఇదే మరొకప్పుడయినా పరిస్థితులు మరోరకంగా వుండినా ఇలాటిపుకార్లు, ఇంత సంచలనం కలిగించేవి కావేమోగాని, ఈ నగరంలో ఎటువంటి వార్తగాని పొక్కి చాలాకాలమయింది, మూడు నెలలుగా ఈ నగరానికి ఎలాటి వార్తలూ రాలేదు, నగరాలకు సరకు రవాణాలు ఎంత అవసరమో ఇవీ అంత అవసరమే. నగరంలో సాగే చర్చలలో రెండుదృక్పథాలు ఏర్పడినట్టు స్పష్టమయింది. మగవాళ్లూ, ఆడవాళ్లూ రెండుపార్టీలయారు. హేతువాదం అవలంబించని పురుషులు చచ్చిపోయిన కమతగాళ్ళమీద పట్టించారు, ఆడవాళ్ళు కేవలం గవర్నరు కూతురిని లేవదీసుకుపోవటంలో నిమగ్నమైపోయారు.

నిజానికి క్రమశిక్షణా, జాగరూకతా ఆడవారిలోనే హెచ్చుగా కనబడ్డాయి, అందుకు వారిని అభినందించాలి. వాళ్ళకి విషయమంతా అచ్చుగుద్దినట్టు స్పష్టంగా గోచరించింది. కళ్ళకు కట్టినట్టున్నది, అంతా అర్థమైపోయింది. చిచీకవ్ ఎన్నో మాసాలుగా ప్రేమతో ఉన్నాట్ట, వాళ్ళు తోటలో వెన్నెట్లో కలుసుకునే వారుట, చిచీకవ్ కు కట్టుకుపోయినంత ఉండటాన గవర్నరుగారు అతనితో సంబంధానికి ఇష్టపడ్డాట, అయితే అతను వొదిలేసిన పెళ్ళాం అవాంతరమై కూచుందిట (చిచీకవ్ కు పెళ్ళి అయిందని ఎలా తెలుసుకున్నదీ ఒక్కరూ ఎరగరు), భర్త అంటే పడిచచ్చే ఆ భార్య గుండె బద్దలై గవర్నరుకు ఎంతో జాలిగా ఉత్తరం రాసిందట, ఆ భార్యా భర్తలు ఒప్పుకోరని రూఢి చేసుకుని చిచీకవ్ లేవదీసుకుపోవటానికి నిశ్చయించాట్ట. కొన్ని ఇళ్ళలో ఇదేకథను కొంచెంమార్చి చెప్పుకున్నారు:అసలు చిచీకవ్ కు పెళ్లామే లేదుట, కాని నేర్పరికావటంచేత తగు జాగ్రత్త తీసుకుని, కూతుర్ని సంపాదించుకోగలందులకై ముందుగా తల్లికి గాలం వేశాట్ట, వారిద్దరి మధ్యా రహస్య ప్రణయం నడిచిందట, తరవాత కూతుర్ని చేసుకుంటానన్నాట్ట, తల్లి ఇటువంటి దుర్మార్గంచూసి గుండె అవిసిపోయి, పశ్చాత్తాపం చెందినదై, ఈపెళ్ళి సుతరామూవీల్లేదన్నదిట, అందుకే చిచీకవ్ లేవదీసుకుపోయే ఆలోచన చేశాట్ట, పుకార్లు నగరం మూలమూలకూ పాకినకొద్దీ వీటికి చిలవలూ, పలవలూ ఏర్పడ్డాయి. రష్యాలో తక్కువ వర్గాలవారికి తమ పైవర్గాలవారిని గురించిన అపవాదులను చర్చించటం చాలా ఇష్టం. అందుచేత ఈ విషయం చిన్న చిన్న కొంపల్లో, చిచీకవ్ ను ఎన్నడూ చూడని, వినని వాళ్ళుండే చోటకూడా చర్చించ బడింది. అనేక కొత్తకొత్త అసందర్భాలూ, వాటికి తగిన సమర్థనలూ సృష్టించబడ్డాయి. అంతకంతకూ కథ రసవత్తరంగా తయారై ఒక రూపానికి వచ్చింది. ఈ రూపంలో ఈ కథ గవర్నరు భార్య చెవినపడింది. ఒక కుటుంబానికి తల్లి, నగరంలోని ప్రధాన స్త్రీ, ఇలాంటి సంగతులేవీ శంకించని మనిషి, ఈ కల్లబొల్లి కల్పనలు వినేసరికి ఆమెకు మండిపోయింది, అందులో ఆమెతప్పు ఏమీ లేదుకూడానూ. పాపం, పదహారేళ్ళపిల్ల తన యీడువాళ్లెవరూ ఎదుర్కోని బాధాకరమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రశ్నలూ, విచారణలూ, చీవాట్లూ, తిట్లూ, బెదిరింపులూ, హెచ్చరికలూ ఉప్పెనగావచ్చి మీదపడేసరికి ఆమెకు ఒక్కటీ అర్థంగాక బావురుమని ఏడ్చేసింది. ఎటువంటి పరిస్థితులలోకూడా, ఎలాటి సాకుతో నైనప్పటికీ, చిచీకవ్ ను లోపలికి రానివ్వవద్దని ద్వార రక్షకుడికి హెచ్చరిక ఇచ్చారు.

గవర్నరు భార్య పట్ల తమ కర్తవ్యం నెరవేర్చి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద పట్టించి, వారిని తమ పక్షం చేసుకోవటానికి యత్నిస్తూ, చచ్చినవాళ్ళను కొనటమనేది కేవలం మిషయేననీ, లేవదీసుకుపోవటం మరింత విజయవంతంగా సాగటానికది తెర అనీ వాదించారు. చాలా మంది పురుషులు తమ ఉద్దేశం మార్చుకుని ఆడవాళ్ళ పక్షమైపోయారు, అయితే మిగిలిన పురుషులు బయట పెట్టి అవహేళనచేసి, అవ్వలనీ, గాజులు తొడిగించుకున్న వాళ్ళనీ అన్నారు-అలాటి మాటలు పడటం కంటె పౌరుషహీనం మరి ఉండదు.

మగవాళ్ళు ఎంతగా ప్రజ్ఞకు పెనుగులాడినా ఆడవారిలో ఉన్న కట్టు వారిలో లేకపోయింది. వారి పద్ధతులు మొరటుగా, నాగరికత లేనివిగా, ఐక్యతాహీనంగా, నైపుణ్యరహితంగా, చచ్చుగా ఉండి, అనైక్యతకూ, అరాచకానికీ, అయోమయానికీ దారితీశాయి. క్రియకు తేలినదేమంటే, పురుష ప్రకృతి నిరుపయోగమైనది. వాళ్లు ఇళ్ళు దిద్దుకోలేరు, ఒకమాట మీద ఉండలేరు, దేన్నీ గట్టిగా నమ్మలేరు, వాళ్ళకు అన్నీ అనుమానాలే. వాళ్లు ఇదంతా అర్థంలేని సంగతి అన్నారు, గవర్నరు కూతుర్ని లేవదీసుకుపోవటం అశ్విక సైనికాధికారులు చేసేపని అనీ సివిలు ఉద్యోగులు చేసేపని కాదనీ, చిచీకవ్ అలాటి పనిచెయ్యడనీ, ఆడవాళ్లు అర్థంలేని మాటలు మాట్లాడతారనీ, వాళ్లు సంచుల్లాగా లోపలఏదివేసినా వేయించుకుంటారనీ; ముఖ్యంగా గమనించవలసిన అంశం చచ్చిపోయిన వాళ్లను కొనటమనీ, అందువల్ల ఉపయోగమేమిటో ఎవడూ చెప్పలేడనీ, అయినా అందులో ఏదో ఛడాలం ఉన్నదనీ అన్నారు. అందులో ఏదో ఛడాలం ఉన్నదని పురుషులు ఎందుకు భావించారో మనం ఇప్పుడే తెలుసుకుంటాం. ఈ రాష్ట్రానికి కొత్త గవర్నరుజనరలు నియమించబడ్డాడు. అలాటిది జరిగినప్పుడల్లా స్థానికాధికారులలో సంచలనం కలుగుతుందన్నది తెలిసిన విషయమేగదా. దానివెంటనే బర్తరఫులూ, మందలింపులూ, శిక్షలూ, పెద్ద అధికారులు తమకిందివారికి అందించే మామూలు వాయినాలన్నీ ముట్టటం జరుగుతున్నది, “ఇంకేముందీ?నగరంలో ఉన్న పుకార్లు కాస్తా ఆయన చెవిని పడ్డాయంటే పీకల మీదికి వచ్చేస్తుంది!” అనుకున్నారు స్థానికాధికార్లు. మెడికల్ బోర్డు ఇనస్పెక్టరు కాస్తాపాలిపోయాడు. అమధ్య అంటుజ్వరాలు వచ్చి ఆస్పత్రులలోనూ, వైద్యశాలల్లోనూ హెచ్చు సంఖ్యలో రోగులు చచ్చారు, ఆజ్వరాలను అరికట్టటానికి తగు చర్యలు జరగలేదు. “చచ్చిన మనుషులు” అనే మాట వినగానే ఈ పెద్ద మనిషికి ఎందుకోగాని ఆ రోగులేనని అనిపించింది. రహస్యంగా వివరాలు సేకరించడానికి గవర్నర్ జనరల్ చిచీకవ్ ను పంపివుంటాడని కూడా ఆయన అనుకున్నాడు, ఈ సంగతి ఆయన న్యాయస్థానాధ్యక్షుడితో అనగా ఆ పెద్దమనిషి అది అర్థంలేనిమాట అన్నాడు. కాని అంతలోనే ఆయన పాలిపోయాడు. ఒకవేళ చిచీకవ్ కొన్న మనుషులు నిజంగా చచ్చినవాళ్ళేనేమోననీ, తాను క్రయపత్రం రాయించడమేగాక ప్యూష్కిన్ తరుపున వ్యవహరించానే అనీ ఇది గవర్నరు జనరలుకు తెలిస్తే ఏమవుతుందోననీ ఆయన భయపడ్డాడు. ఈ సంగతి ఆయన ఒకరిద్దరితో అనటమేమిటి వాళ్ళు కాస్తతెల్ల మొహాలు వేశారు. భయం ప్లేగుకన్న గూడా ఎక్కువైన అంటువ్యాధి. అది సోకటానికి క్షణంచాలు. అందరూ తమలో లేని పాపాలుకూడా చూసుకున్నారు. చచ్చిన మనుషులు అనేమాట ఎంత బహుళసూచకంగా ఉన్నదంటే, కొంతకాలం క్రిందట రెండు దుస్సంఘటనల ఫలితంగా చచ్చి, అతితొందరలో పూడ్చబడిన శవాలుకూడా స్ఫురించాయి. మొదటి సంఘటన ఏమంటే, సంతకు ఇంకో జిల్లానుంచి కొందరు వర్తకులు వచ్చారు. తమ సరుకుకూడా అమ్ముడయాక వాళ్ళు ఇతర వర్తకులకు రష్యను దర్జాతో, జర్మను సారాలతో విందుచేశారు. ఆనవాయితీ ప్రకారం విందు కాస్తా కొట్లాటగా పరిణమించింది. విందు చేసినవాళ్ళు తమ అతిధులను చంపేసి తాముకూడా చచ్చినవాళ్ల భుజబలం రుచి చూసి, డొక్కల్లోనూ, పొట్టల్లోనూ, ఇతర శరీరం మీదా గట్టిదెబ్బలే తిన్నారు. గెలిచిన ఒకడి ముక్కు చితికిపోయి, అరవేలి ప్రమాణంలో మాత్రమే దక్కింది. విచారణలో వర్తకులు తమ నేరం ఒప్పుకుని తాము చుక్క వేసుకున్నామన్నారు. విచారణ జరిగే కాలంలో వారు న్యాయమూర్తులకు ఒక్కొక్కరికీ నాలుగేసి పెద్దనోట్లు ఇస్తామన్నట్టు ఒక పుకారు పుట్టింది. అయితే కేసు చాలా అస్పష్టంగా ఉండిపోయింది. విచారణజరిపి తయారుచేసిన రిపోర్టులో చావుకు కారణం బొగ్గు పొగమూలంగా ఊపిరాడక పోవటమని స్పష్టమయింది. అందుచేత ఆ చచ్చిన వారిని అలాగే పాతేయించారు. రెండవ సంఘటన జరిగి ఎంతోకాలం కాలేదు. దానివైనం ఎలాగంటే: ఫ్షివాయ – స్ప్యెస్ గ్రామానికి చెందిన రైతులూ, బరోన్క గ్రామ కాపురస్తులైన రైతులూ ఏకమై ద్రబ్యాష్కిన్ అనే పన్నులు వసూలు చేసే పోలీసు ఆఫీసరును కాస్తా మాయం చేసినట్టు ఫిర్యాదు తేబడింది. వాడు గ్రామానికి మహాతరచుగా రాసాగాడుట, పోలీసు వాళ్ళకు సాధారణంగా ఆడవాళ్ళంటే వ్యసనం ఉండి పల్లెల్లో ఉండే పిల్లలవెంటా, స్త్రీల వెంటా పడుతుండటమే వాడి రాకకు కారణమట. అయితే ఈ సంగతి అంత ఖండితంగా రుజువు కాలేదుగాని, సాక్ష్యం చెప్పిన రైతులు వాడు వట్టి యావమనిషి అనీ, ఒకసారి మాటువేసి వాణ్ణి ఒక గుడిసెలో నగ్నంగా పట్టుకుని మెత్తగా తన్నామనీ చెప్పారు. ఆడవాళ్లను వేటాడినందుకు పోలీసులను శిక్షించవలసినమాట నిజమేగాని, రైతులు న్యాయ నిర్ణయం తామే చెయ్యటంకూడా తప్పే-వాళ్లు హత్య చేసిన మాట నిజమే అయితే, కాని అదీ స్పష్టం కాలేదు. రోడ్డుపైన చచ్చిపడి ఉన్న మనిషి ఒంటిన ఉన్న దుస్తులు కేవలం వాలికలు, వాడి మొహంకూడా గుర్తించరాకుండా ఉన్నది.

ఈ కేసు చిన్న కోర్టులనుంచి హైకోర్టుకు వచ్చింది. ఇక్కడ లోపాయికారిగా అనుకున్నదేమంటే: నేరంలో పాల్గొన్న వ్యక్తులెవరో తెలియదాయె; రైతులు ఎంతోమంది ఉన్నారాయె; ద్రబ్యాష్కిన్ చచ్చేపోయాడాయె; వాడు ఒకవేళ కేసు గెలుచుకున్నా బావుకునే దేమీలేదాయె: రైతులు చూడబోతే బతికి వున్నారాయె.కేసు వారి పక్షం కావటం వల్ల వారికి ఏమో ఒరుగుతుందాయె; అందుచేత రైతులను పీడించుకుతిని ద్రబ్యాష్కిన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడనీ, వాడు తన చక్రాలులేని బండిలోపోతూ తెరవచ్చి చచ్చాడనీ నిర్ణయం జరిగింది. కేసు మహాచక్కగా పరిష్కారమై పోయింది, అయితే అధికారులిప్పుడు “చచ్చిన మనుషులు” అంటే వీళ్ళేనని ఎందుకో అనుమానించ సాగారు.

అసలే అధికారులు ఈ చిక్కులో ఇరుక్కుని వుంటే గవర్నరుకు ఒకసారిగా రెండు హెచ్చరికలు అందాయి. దొంగనోట్లు అచ్చువేసే వాడొకడు రకరకాల పేర్లతో వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలోనే తిరుగుతున్నట్లు సాక్ష్యమూ, రిపోర్టులూ లభించాయనీ, వెంటనే వాడి ఆచూకీ తీయవలసిందని మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక పక్క రాష్ట్రపు గవర్నరు పంపినది: ఒక బందిపోటు దొంగ తప్పించుకు పారిపోయాడట.ఈ రాష్ట్రంలో పాసుపోర్టు లేనటువంటిగాని, తమ పూర్వాపరాలు స్పష్టం చేయలేనటువంటిగాని అనుమానాస్పదులు కనిపిస్తే వారిని తక్షణం అరెస్టు చెయ్యమని. ఈ రెండు హెచ్చరికలమూలాన అందరూ కలతపడిపోయారు. వారదివరకు చేసుకున్నఊహలన్నీ ఒక్క సారిగా తారుమారయాయి. ఈ హెచ్చరికలలో చిచీకవ్ ప్రస్తావన వున్నదని కాదు; కాని ఎవరిమానాన వారు ఆలోచించిచూసుకోగా, తమకు చిచీకవ్ ఏ రకం మనిషి అయినదీ తెలియలేదనీ, అతను తనను గురించి స్పష్టంగా చెప్పుకోలేదనీ, మీదుమిక్కిలి తాను అన్యాయానికి గురి అయినట్టు చెప్పుకున్నాడనీ, అయితే దాన్ని బట్టి నిర్ధారణగా ఏమనుకునేటందుకూ లేదనీ, దీనికితోడు అతను తనకు ఎంతో మంది శత్రువులున్నరనికూడా అన్నాడనీ జ్ఞాపకం వచ్చి ఆశ్చర్యం కలిగింది.అతని ప్రాణానికి అపాయం ఉందన్నమాట. అంటే అతన్ని ఎవరో వేటాడుతున్నా రన్నమాట; అయితే మరి అతను ఏదో చేసిఉండాలి…ఇంతకూఅతను నిజంగా ఎవరు? అతను దొంగనోట్లు అచ్చువేశాడనిగాని, బందిపోటు దొంగ అనుకోవటానికిగాని ఏమాత్రమూ వీలులేదు- మనిషి మహా మర్యాదస్తుడుగా కనిపిస్తాడు; అయినప్పటికీ అతను ఎలాటి మనిషి అయి ఉంటాడు? అధికారులు మన కావ్యం తాలూకు మొదటి ప్రకరణంలోనే తమను తాము వేసుకుని ఉండవలసిన ప్రశ్న ఇప్పుడు వేసుకున్నారు. అసలు ఈ చచ్చినవాళ్ళ కొనుగోలు వైనం ఏమిటో తేలగలందులకు ఆ అమ్మినవాళ్ళను ప్రశ్నించటానికి నిర్ణయం జరిగింది; చచ్చిన మనుషులన్న దాని అంతరార్థం ఏమిటో, తన అసలు ఉద్దేశమేమిటో యాధాలాపంగా ఎవరితోనైనా అతను అని ఉండవచ్చు, తాను నిజంగా ఎవరయినదీ ఎవరితోనన్నా అతను ఒకవేళ చెప్పాడేమో. మొదటగా వారు కరబోచ్క సతి వద్దకు వెళ్ళారు, కాని ఆమెనుంచి ఆట్టే తెలియలేదు; అతను వాళ్ళను పదిహేను రూబుళ్లిచ్చి కొన్నాడనీ, ఈకలుకూడా తీసుకుంటా నన్నాడనీ, సర్కారు కంట్రాక్టు క్రింద పందిమాంసం తీసుకుంటా నన్నాడనీ, ఇంకా ఎన్నో కొంటా నన్నాడనీ, అతను తప్పక మోసగాడేననీ, అదివరకు ఒకడిలాగే ఈకలూ, పందిమాంసమూ సర్కారు తరపునకొని, అందరినీ మోసపుచ్చి, పెద్ద ఫ్రీస్టు భార్యకు నూరు రూబుళ్ళు నష్టం కలిగించాడనీ ఆమె చెప్పేది. ఆవిడ చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్పింది, ఆమె వట్టి మతిమాలిన ముసలిదని మాత్రమే అధికారులు తెలుసుకోగలిగారు. పావెల్ ఇవానవిచ్ కి తాను జవాబుదారీ వుండగలనన్నాడు మానిలవ్; అతని గొప్పతనంలో తనకు శతాంశం లభించేపక్షంలో తన సర్వస్వమూ ధారపోయగలనన్నాడు, అతన్ని తెగ మెచ్చుకుంటూ స్నేహం గురించి ఘనంగా చెప్పాడు, మాట్లాడుతున్నంతసేపూ కళ్ళు దాదాపు మూసుకొనే మాట్లాడాడు. ఆయన ఆడిన మాటలవల్ల ఆయన హృదయంలోని ఆర్ద్రత వ్యక్తమయిందేగాని, అసలు విషయం గురించి కొత్త అంశాలేమీ బయటికి రాలేదు. సబాకివిచ్ తన ఉద్దేశంలో చిచీకవ్ మంచివాడే అయివుండాలన్నాడు, ఇంకొకచోటికి తీసుకుపోయేటందుకు కమతగాళ్ళను అమ్మానన్నాడు, వారు అన్ని విధాలా సజీవులేనన్నాడు, అయితే భవిష్యత్తులో ఏం జరగబోయేదీ తనకు తెలియదన్నాడు, ప్రయాణశ్రమవల్ల దారిలో వాళ్ళు చచ్చిపోయేపక్షంలో ఆ తప్పు తనదికాదన్నాడు, దేవుడి తప్పన్నాడు, ఎన్నో రకాల జ్వరాలూ, ప్రమాదకర వ్యాధులూ ఉన్నాయన్నాడు, ఊళ్ళకు ఊళ్ళే చస్తున్నాయన్నాడు. అధికారులు అనుమానాస్పదమైన మార్గంకూడా ఒకటి అనుసరించారు, అయినా అప్పుడప్పుడూ అలాటి పద్ధతులు అమలు చేస్తూనేవుంటారు- చిచీకవ్ నౌకర్లను అతని గతజీవితం గురించీ, పరిస్థితులను గురించీ వాళ్ల స్నేహితులైన నౌకర్ల ద్వారా అడిగించాడు; అయితే అందునా ఆట్టే ప్రయోజనం లేకపోయింది. పెత్రూష్క నుంచి ముక్కిపోయిన గది వాసన మాత్రమే లభించింది. తన యజమాని రాచోద్యోగి అనీ, అంతకుముందు రివెన్యూ ఇలాకాన పని చేశాడనీ మాత్రం సేలిఫాన్ బయటపెట్టాడు. ఈ తరగతి మనుషుల కొక విచిత్రమైన అలవాటున్నది. నేరుగా ఏదైనా ప్రశ్నవేస్తే వారికి ఏదీ జ్ఞాపకం ఉండదు; తమ ఆలోచనలను కూడగట్టుకోలేరు, తమకు తెలియదనికూడా చెబుతారు? కాని ఇంకేదైనా అడిగినప్పుడు, అడిగిన దానికి అక్కర్లేనివి ఏవేవో జోడించి చెబుతారు. అధికారులు జరిపిన ఆచూకీ ఫలితంగా తేలినదేమంటే, తమకు చిచీకవ్ గురించి ఏమీ తెలియదనీ, కాని చిచీకవ్ ఏదో ఒకటి అయివుండాలనీనూ. అందుకని వారు ఈ విషయం పూర్తిగా ఆరాతీయాలనీ, కనీసం ఏమి చెయ్యాలో నిర్ణయించుకోవాలనీ, ఎలాటి చర్యలు తీసుకోవాలో, ఎలా ఉపక్రమించాలో,అతను ఎటువంటి మనిషో, అతన్ని అనుమానాస్పదమైన మనిషిగా పరిగణించి నిర్బంధించాలో, లేక అతనే తమ నందరినీ అనుమానాస్పదులుగా ఎంచి నిర్బంధంలో ఉంచగలిగిన మనిషో తేల్చుకోవాలనీ నిశ్చయించుకున్నారు. ఇదంతా చర్చించటానికి పోలీసు అధిపతి ఇంట సమావేశం కాదలిచారు; ఆయన ఈ నగరానికి తండ్రిలాటివాడనీ, మహోపకారి అనీ పాఠకులకు ఇదివరకే తెలుసు.

Posted in కథ | Tagged | 4 Comments

కవికృతి -౭

తిరిగే చేతుల్లో

-ఎమ్.ఎస్.నాయిడు

కొన్ని చీమల చేతుల కింద తిరుగుతున్నా
వాటి నిద్రని తాకాలని

నా తలకాయలో
వాటి ప్రియురాళ్ళ ముఖాల్ని తుడిచేశాను

నిద్రలో పాకి
నా ప్రియురాళ్ళ ముఖాల్ని అవి తినేశాయి

కొన్ని కలలు
చీమల చేతుల్లో ఉంటాయి

మరికొన్ని తలలు
కలల చేతుల్లో చితుకుతాయి

తిరిగే చేతుల్లో
వంకర్లో కొంకర్లో పోయే కలలే మిగులుతాయి

———-

ఒకడు కలకంటున్నాడు

-జాన్ హైడ్ కనుమూరి

ఒకడు కలకంటున్నాడు

రెపరెపలాడుతున్న
తూనీగల్నో తుమ్మెదల్నో పట్టాలని
వెంటాడుతున్న బాల్యపుచేష్టలా
రంగులవైపు పరుగెడుతూ
అందాన్నేదో వెతుక్కుంటూ
అతడు కలకంటున్నాడు

ఒకడు కలకంటున్నాడు
అలసిన దేహంతో
జాము జాముకు కూసే
కోడిపుంజులా నిద్రిస్తూ

మైళ్ళు, సంవత్సరాల వేగంతో నడుస్తూ
తనలోనికో, బయటకో
విధుల్లోకో దేశాల్లోకో
సముద్రాల్లోకో, దేశదేశాల్లోకో

రహదారి వెంట
రాల్తున్న గుల్మోహర్ రేకల్లా
అక్షరాలను ఏరుకుంటూ
జీవితాన్ని మంత్రించిన పుష్పంచేసి

కాగితపు మడతల్లో
పుస్తకమై నిలిచిపోవాలని
అతడు కలకంటున్నాడు

ఒకడు కలకంటున్నాడు
ఆహ్లాద దేహంతో
కలకనే వేళ
కళ్ళలో గుచ్చుకుంటున్న
ముళ్ళలాంటి వాస్తవాల మధ్య పడిలేస్తూ
పొడిచే ముళ్ళను నరుకుతూ
గాయపడుతూ
గేయమౌతూ

శతాబ్దాలుగా కూరుకుపోతున్న
బురదవీధుల్లోంచి
నల్గురు నడిచే దారికోసం
చూపుడువేలై నిలవాలని
అతడు కల కంటున్నాడు

ఏ కలా లేకుండా
ఎన్ని ఏళ్ళగానో
మోయాలని ప్రయత్నిస్తున్నా
పథకాలు రచిస్తున్నా
ఇప్పుడే ఎదిగొచ్చినవాడు

నగ్నదేహంపై వస్త్రంలా తొడుక్కొని
అడుగులేసే పాదాలకు
పాదరక్షలుగా తొడుక్కొని
క్షణమో అరక్షణమో కాదు
గజమో మైలో కాదు
నిరంతర యానంలోకి
మోసుకెళ్తున్నాడు

నేనే చూస్తూ నిలుచుండిపోయాను

————-
ప్రపంచ జీవనీకరణ

-ఆచంట రాకేశ్వర రావు

మూఁడు వీదుల మా గ్లోబల్ విలేజిలో
దేశాలను విడదీశారు
మొదటి రెండవ మూడవ ప్రపంచాలుగా ॥

ఊరికొక్క షావకారు వెనకటికి ఋషులుగా బ్రతికినవారు
ఇంట్లోవారిచే చెప్పులు కుట్టించి పెరట్లో పెట్టి అమ్ముతున్నారు।
భార్యా పిల్లల రక్తాన్ని పాలుగా మలచి త్రాగారు
బాగా బలిశారు కాసులకు అలుసయ్యారు।
చచ్చిన నానా విశ్వకర్మలు అందాకా చేసిన వ్యాపారాలు
యికమందు సాగడానికెన్నో యంత్రాలు నిలిపారు, చైనా వీరి పేరు ॥

ఊరిలోనొక కుఱ్ఱకారు ఊరందరికీ పెద్ద దిక్కు
వ్యవసాయం తక్కువైన ఒట్టి చార్వాకుడు
సుఖాల తోటలో శయనించు మహాభోగి।
జనాలకు పనిలేకుండా పోకూడదని
అప్పు చేసి అన్నీ కొంటాడు, వాడుకుంటాడు।
హలాహలాన్ని నిత్యం మ్రింగేవాడు
అంతరంగం శూన్యమైనవాడు, వీడి పేరు అమెరికా॥

యువమహారాజుగారి ఆగడాలను
మావలూతాతలూ మేమేం తక్కువంటూ
అనుకరించి అపుడపుడూ భంగపడతారు
వీరి పేరు ఐరోపా।
మహాషావుకారితో పోటీపడుతూనే పడలేకే
చిల్లరవస్తువులమ్మే తోపుడుబళ్ళు
ఊరినిండా వారే మిగిలినవారు॥

అయ్యో ఒకనాడు అప్పుల్లో పడ్డాడు మహారాజు
ఆయన కొనకపోతే ఊరికే ఉద్యోగం లేదు।
పిల్లల్ని కాళీగావుంచలేక షావుకారు
మహారాజుకి అప్పిచ్చి సారాయి పోశాడు।
ఊళ్ళో అందరూ తలోచేయి వేసి
చేతనైనంత కల్లు దోసిట్లో పోసి
చిన్నయ్యగారిని ఆదుకున్నారు॥

ఊరిచుట్టూ కొండంతా పిండి, తోటంతా త్రవ్వి
చేయించిన ఆసనాలకూ పండించిన గంజాయికీ
వ్యసన పడి బానిసై, ప్రకృతి గుణాలకు పావైనాడు ।
వీడి శరీరంలో అణువణువూ అపుడోకొంతా ఇపుడోకొంతా
కొన్న షావుకారికి మిగిలిందీ జీవచ్ఛవం॥

క్షామకాలం మీదపడుతుండగా
రేపు రాబోయే పెనువిపత్తుకు
ఏర్పాట్లకు తీఱికలేని యాపారులంతా
ఎండుటాకుల్లా రాలినప్పుడు,
మిగిలిన ఆ నలుగురితో
మరు జనమెత్తనుంది మా వూరు।

తాగుమోతులా తాండవించి
పుఱ్ఱెలు కాలరాసే కాలానికి
చూపిన మావూరు చోద్యాలు ఎన్నో
ఉన్నఅన్నిటిలోనిది యొక్కటి మాత్రమే॥

Posted in కవిత్వం | Tagged , | 4 Comments

పొగమంచు

-ఆత్రేయ కొండూరు

దగ్గరయ్యేకొద్దీ
దారి చూపిస్తూ ,
మసక రూపాలకు
మెల్లగా రంగులమరుస్తూ,

మురిపిస్తూ,
తేమతగిలిస్తూ..

కంటి వెనక దారి మూసేస్తూ,
ముందు వెనకలను ఏకం చేస్తూ..

ఉదయమయ్యేదాకా
సగం రంగుల పరిధినే
ఆస్వాదించ మంటూ..

తాత మాటలు తవ్వి తీస్తూ..

Posted in కవిత్వం | Tagged | 2 Comments

పోతన కవిత్వ పటుత్వము

__ శ్రీ తాపీ ధర్మారావు (పరిశోధన, 1954)

“ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు.

సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి పాటైనా గానీ నేర్చుకొని ఉండడు. కాబట్టి అతని కవిత్వంలో వ్యాకరణ దోషాలూ, తప్పుడు సంధులూ కనబడతాయి. రఱ ల పరిజ్ఞానం అసలే లేదు. అందుచేతనే అప్పకవిలాంటి లాక్షణికులు పోతరాజును ప్రామాణిక కవిగా అంగీకరించలేదు.

… కాబట్టే పోతన్న ఆంధ్ర జనసామాన్యానికి అభిమాన కవి కాగలిగాడు. భారత రామాయణాలలోని ఒక్క పద్యమైనా నోటికి రానివారు చాల మంది భాగవతంలోని పద్యాలను పఠించగలరు.

మరే మెరుగూ లేకపోయినా రచనలో శబ్దాడంబరమైనా ఉంచాలని పోతన్న అంత్యానుప్రాస కోసం ప్రాకులాడి నిఘంటువులన్నీ గాలించాడని కొందరనుకున్నారు.

ఇక పోతన రామభక్తుడన్నారు సహృదయులు. కాబట్టి అతని కవిత్వం భక్తిప్రేరితమూ, భక్తిపూరితమూ. ’భక్తిఆవేశంవల్ల ఒళ్లు మరచి ఏదో అన్నాడు, ఏదో వ్రాశాడు; ఆ భక్తి సంబంధమైన గొడవ మినహాయిస్తే ఇంక పోతనలో కవిత్వమేమి కనబడుతుంది?; అన్నారు మరికొందరు విద్యాధికులూ విమర్శక ప్రముఖులూనూ.

అయ్యో! పోతనామాత్యా! నీవు ‘దుర్గ మాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్’ అని అర్థించినదంతా వ్యర్థమేనా? ‘కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ’ నేడుస్తున్నట్లు కనిపించిన సరస్వతి దృశ్యమంతా నిఘంటువుల నిషాయేనా? ‘ఇమ్మనుజేశ్వరాధముల’ కివ్వనని చెప్పుతూ ‘సత్కవుల్ హాలికులైననేమి? గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైననేమి?’ అని సత్కవిగా సగర్వంగా చెప్పినదంతా వట్టి బాకా ఊదుడేనా?

అభిప్రాయ గుళికలవల్ల కలిగిన అనర్థమిది. ఆనాటి సహృదయులు ఆ కవులలోని గుణాలన్నీ చూచినవారే. అందులో మరీ స్ఫుటంగా ఉన్న ఏ గుణాన్నో ఒకదాన్ని గుళికా రూపంలో ప్రకటిస్తారు. తక్కిన కవితా విశేషాలు లేవని వారెప్పుడూ అనలేదు. అయినా ఆ గుళికా ప్రభావం విపరీతంగా పరిణమించింది.

వారు పేర్కొన్న గుణమొక్కటే ఆ కవిలో ఉన్నట్టూ, తక్కిన గుణాలు ఏవిగూడా లేనట్టూ ఇటీవలి పాఠకలోకం అర్థం చేసుకుంది. రసపోషణగాని, కవితా శిల్పంగాని, భావ నిరూపణంగాని, విషయచిత్రణం గాని ఆ కవిలో ఉంటాయని అనుకోరు. చూద్దామని శ్రద్ధగూడ తీసుకోరు.

పోతన్న అంత తేలికగా త్రోసివేయదగినవాడు కాడు. ఎందరో మహానుభావుల కన్న మిన్న. అమర్త్యకాంత అయిన ఆంధ్ర కవితా పితామహుని వరూధిని మర్త్యకాంతగా పుట్టకపోయానే అని విచారిస్తుంది. చూడండి-

ఎంత తపంబు చేసి జనియించినవారొక మర్త్యభామినుల్
కాంతు డవజ్ఞ చేసినను కాయము వాయుదు; రే నమర్త్యనై
చింతల వంతలం జిదికి సిగ్గరితిన్; మృతి లేని నాదు చె
ల్వింతయు శూన్యగేహమున కెత్తిన దీపికయయ్యె నక్కటా!

ఈ విధంగా వరూధిని గణితంలో ఒక లెక్కచేసినట్టు, లాయర్ వాదించినట్టు చింతిస్తుంది. ఇక పోతనగారి గోపిక అలా కాదు. యమునా తీరంలో ఒక వెదురుమొక్కగా పుట్టకపోయానే అని విచారిస్తుంది.

నా మోసంబున కెద్దిమేర వినవే నా పూర్వజన్మంబులన్
లేమా నోములు నోచుచో నకట కాళిందీతటిన్ వేణువై
భూమిన్ పుట్టెదనంచు గోరగదే బోధిల్లి; యట్లైన నీ
బామం దిప్పుడు మాధవాధరసుధాపానంబు గల్గుంగదే!

ఇది స్త్రీభావ సహజంగా, రసముట్టిపడేటట్టుగా ఉన్నది.

వామనావతార ఘట్టంలో పోతన చూపిన ‘కవిత్వపటుత్వము’ అసాధారణం. ఆ ఘట్టాన్ని అంత సమర్థతతో చిత్రించగల కవులు ఒకరిద్దరు మించి ఉండరు. బలిచక్రవర్తి దానాన్ని గ్రహించి వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండం నిండిపోతాడు. వటు డింతింతై మరింతై పెరిగి పోతూండటం పోతన్న హృదయానికి ప్రత్యక్షంగా కనిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి గదా! ఆ బ్రహ్మాండత్వం పాఠకునికి ప్రస్ఫుటం కావాలి గదా! అలా జరిగినప్పుడే గదా ఆ రసం పలికినట్టవుతుంది!

ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై.

అని వర్ణించాడు. ఆకాశవీధి, మేఘమండలం, కాంతిరాశి, చంద్రుడు, ధ్రవుడు, మహర్వాటి, సత్యపదం అని ఆ రూపాన్ని పెచాడు. కానీ మహాద్భుతాకారమెంత పెద్దదో కంటికి కట్టినట్టయిందా? తృప్తి లేదు. కాబట్టే –

రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

అని వర్ణించి కృతార్థుడయ్యాడు. ఆ మహాద్భుతరూపాన్ని ప్రత్యక్షంగా చూపించి పాఠకులను చరితార్థులను చేశాడు పోతన్న. నడిమింటి నున్న సూర్యబింబాన్ని చూడమన్నాడు. అది యెంత యెత్తున ఉందో, ఎంత పైకిపోతే దాన్ని తాకగలమో ఊహారూపంగా ప్రతి పాఠకుడికీ తెలుసును. దృష్టిని ఆ బింబం మీదనే ఉంచి పోతన్న వామనుడిని పెంచాడు. వామనుడికది గొడుగులా గుందన్నాడు. ఇంకా పెంచాడు. ఇప్పు డా బింబం తలలో పెట్టుకున్న రత్నంలా గుందన్నాడు. ఇంకా పెంచాడు. చెవి పోగులాగుంది. ఇంకా – కంఠాభరణంలాగ; ఇంకా – భుజకీర్తిలాగ; ఇంకా – కాలి అందెలాగ; ఇంకా పెంచాడు – ఆ బింబం పాదపీఠంలా గుందన్నాడు. ఎంత పెద్ద ఆకారాన్ని ఎంత స్ఫుటంగా చిత్రించాడో చూడండి. పోతన్న శిల్పనైపుణ్యం ఏమనగలం? మన మహాకవులెందరీ మహాకార్య మింత అందంగా నిర్వర్తించగలరు? అనకూడదు గాని భగవద్గీతలోని విశ్వరూప సందర్శన ఘట్టంలో నైనా ఇంతటి స్ఫుటత్వం ఉందేమో చూడండి-

ద్యావా పృథివ్యో రిద మంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః
దృష్ట్వాద్భుతం రూప ముగ్రం త వేదం
లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్.

ప్రహ్లాదచరిత్రలో నృసింహావతార వర్ణన ఎందరు కవు లా రీతిని వర్ణించి సాధకులకు సాక్షాత్కారం కలిగించగలరో యోచించినట్లయితే పోతన కవిత్వ పటుత్వం నిస్సందేహంగా తేటపడుతుంది.

గజేంద్రమోక్ష ఘట్టంలో పోతన చూపిన మహాకవి లక్షణాలు అమోఘములు. గజేంద్రుడి ప్రార్థనలో జ్ఞాన భక్తి వైరాగ్య ప్రపత్తులను ఏ విధంగా సోపానాలుగా ఉపయోగించాడో చూడవలసినదే. విష్ణుమూర్తి భక్తవాత్సల్యం ప్రకటించటానికి పోతన వేసుకున్న పథకం కేవల భక్తిప్రేరకమే కాదు, అత్యుత్తమ కవితా భరితం కూడా. నిరాటంకంగా లక్ష్మీదేవితో కాలం గడుపుదామని నిశ్చయించుకున్న విష్ణుమూర్తితో మనలను ఆ వైకుంఠపురంలో, నగరిలో, ఆ మూల సౌధం దాపల, మందారవనంలో, సెలయేటి ప్రక్కనున్న కలువతిన్నె దగ్గరకు పోతన్న తీసుకెళ్లాడు. అక్కడ మంచి రసవంతమైన పట్టులో గజేంద్రుడి మొర వినిపించాడు. క్షణంలో రమావినోదితనం ఎగిరిపోయింది. ఆపన్న ప్రసన్నత మూర్తీభవించింది. ఆ పైటచెంగు పట్టుకునే విష్ణువు సంరంభంతో బయలుదేరాడు. ఆ సంరంభం ఒక మహా ప్రవాహంలాగా కవి హృదయంలో పరుగెడుతూ వుంది. ఆ ప్రవాహ వేగంలోకి మనల నీడ్చాడు పోతన మూడు పద్యాలలో. సిరికి చెప్పకుండా, శంఖ చక్రాలు తీసుకోకుండా విష్ణువు వెళ్తున్నాడు. చేతిలో పైట చెంగు చేతిలోనే ఉంది. లక్ష్మి పాపం ఏమో తెలియక శాటీముక్త కుచంబుతో తాటంకా చలనంబుతో వెంటపడ్డది. కలువతిన్నె నుంచి తిరుగు ప్రయాణం ఆరంభమయింది. ఆ మందారవనంలో మరెవ్వరూ లేరు కాబట్టి వెంటన్ సిరి మాత్రమే. తరువాత ఆ మూల సౌధంలో కొస్తారు. అక్కడున్న అవరోథ వ్రాతం వెంట పడుతుంది. చావడిలో పక్షీంద్రుడు మొదలైనవారు. నగరి వెలుపలికి వచ్చేసరికి వైకుంఠంలోని ఆబాల గోపాలం వెంటబడ్డారు. వారిలోనే మనమూ ఉన్నట్టు పోతనకవి చేశాడు. చూడండా క్రమం-

తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతము; దావి వె
న్కను పక్షీంద్రుడు; వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖచ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్.

పద్యారంభంలో ‘వెంట’ ‘వెన్క’ ‘పొంత’ అన్న మాటల నుపయోగించిన పోతన్న పోనుపోను సంరంభాతిశయం వల్ల వాటి నుపయోగించటం మానుకున్నాడు. తానూహించిన సంరంభభావాన్ని పాఠకుల హృదయాల్లో ఇంత చక్కగా ప్రతిఫలించినట్టు చేసిన పోతనలో కవితావిశేషం లేదా?

ఇంతేకాదు. అతిసున్నితమైన మానసికావస్థలను చిత్రించటంలో కూడా పోతన్న ఏ కవికీ తీసిపోడు. పాత్ర హృదయం తనదిగా చేసుకొని దానికి సరిపోయినట్టు భావాలను ప్రకటించగలగటం పోతన్న కలవడినట్టు ఎందరికో అలవడలేదు.

రుక్మిణి తన బ్రాహ్మణుడిని కృష్ణుని దగ్గరకు పంపించింది. ఇంకా రాలేదు. ఇక్కడ వివాహ ప్రయత్నాలు సాగిపోతున్నాయి. కూర్చుని అనుకుంటూంది-

ఘను డా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేయునో యీశ్వరుం
డనుకూలింప దలంచునో తలపడో ఆర్యామహాదేవియున్
నను రక్షింప నెరుంగునో యెరుగదో నా భాగ్య మెట్లున్నదో!

ఈ పద్యంలో పోతన రుక్మిణీ హృదయంలో ప్రవేశించాడు. అనిన మాటలు కొన్ని; అనకుండా ఉన్న ఊహలు కొన్ని. అతిమనోహరమైన పద్యం. ‘భూసురుడేగెనో’ అన్నదేగాని ‘లేదో’ అనలేదు. ఆ ఘనుడి విషయంలో వెళ్లకపోవటమన్న ఊహ కూడా రుక్మిణి సహించలేదు. మార్గాయాసం వల్ల కొంచెమాలస్యమై యుంటుందని సమర్థించుకొని, “వెళ్లే ఉంటాడు. కృష్ణుడితో చెప్పేఉంటాడు.” అనుకొన్నది. విని కృష్ణుడిది తప్పుగా భావించి ఉంటాడా? అని ప్రశ్నించుకుంది. అతనలాగ తలచేవాడు కాడే అనుకొని ‘విచ్చేయునో’ అన్నదేగాని ‘విచ్చేయడో’ అనలేదు. ఆ ఊహే తనకు దుర్భరం. ‘లేదు’ అన్న పదం తన నోట పలకదు. తానూ, భూసురుడు, కృష్ణుడు అయిపోయారు. ఇక మిగిలినది దేవతలు. వారిలో ఇష్టదైవతం ఆర్యామహాదేవి. నలుగురితో పాటు తనకూ ఈశ్వరుడే దేవుడు. ఆర్యాదేవంతటి దగ్గరి దైవం కాడు. కొంచెం దూరం. వీళ్లను గురించి సందేహముంది. ‘ఈశ్వరుడు అనుకూలించటానికి తలుస్తాడో తలపడో’ అన్నది – అంత పరిచయం లేదు కాబట్టి. ఆర్యామహాదేవి విషయంలో తలుస్తుందో లేదో అన్న సందేహం రుక్మిణికి లేదు; తప్పకుండా తలుస్తుంది. తనకు నమ్మకమే. కాని ఆమెకు తన్ను రక్షించే ఉపాయం తెలుసునో తెలియదో! ఉన్న సందేహమంతా అదే. ఉపాయం తెలిస్తే తప్పక రక్షిస్తుందన్న మాటే. ఇంత వ్యత్యాసముంది కాబట్టే పోతన్న ఈ రెండు సందేహాలను ఈ విధంగా ప్రకటించాడు. విషయ విశ్వాసాన్నింత చక్కగా ప్రదర్శించగల సమర్థులు మన కవుల్లో ఎందరున్నారు?

ఇన్ని విషయాల నింత రసవంతంగా చిత్రించ గలిగినవాడు కాబట్టే పోతన్న ఆంధ్ర జనసామాన్యానికి అభిమాన కవి కాగలిగాడు. భారత రామాయణాలలోని ఒక్క పద్యమైనా నోటికి రానివారు చాల మంది భాగవతంలోని పద్యాలను పఠించగలరు. ఇటువంటి పోతనలో కవిత్వ విశిష్టత లేదనీ, ఇతను వ్యాకరణం రాని సహజ పండితుడనీ, అంత్యప్రాసకోసం నిఘంటువులకు ప్రాకులాడే వాడనీ భావించడం కూడనిపని. ఇంకా సందేహముంటే ఏదైనా ఒక్క ఘట్టం సంస్కృత భాగవతంతో సరిపోల్చి చూస్తే పోతన కవిత్వపటుత్వం కరతలామలకం కాకతప్పదు.

రాజాజీగారు కంబరామాయణాన్ని ఇంగ్లీషులో ప్రచురిస్తున్నట్లే మనలో ఓపికున్న సమర్థులెవరైనా తెలుగు భాగవతంలోని ఒకటి రెండు ఘట్టాలను ఇంగ్లీషులో ప్రచురించటం మంచిది. అట్లైతే సంస్కృత భాగవతంతో పరిచయమున్న ఇతర రాష్ట్రాలవారు కూడా మన ఆంధ్రకవి పోతన్నలోని కవిత్వ పటుత్వం గ్రహించి గౌరవిస్తారు.

——–

శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి సంపాదకత్వంలో ఆం.ప్ర.సాహిత్య అకాడమీ వెలువరించిన ‘భాగవత వైజయంతిక’ అనే గ్రంథంలో ఈ వ్యాసం ప్రచురింపబడింది.

Posted in వ్యాసం | Tagged , , | 4 Comments