సరికొత్త పొద్దు పొడుపు వేళ

ప్రతీకాలంలోనూ సమకాలీన జీవన  స్వరూపానికి చరిత్రలో శాశ్వతమైన అస్తిత్వాన్ని కల్పించడానికి, ఆనాటికి చలామణిలో ఉన్నభాషకి సుదూర భవిష్యత్తులో సైతం సజీవత్వాన్ని సంపాదించి పెట్టడానికీ సాహిత్యం ఎప్పుడూ ఒక శక్తివంతమైన సాధనమే. కథారూపంలో కల్పిత పాత్రలని చదువరిలో పరకాయ ప్రవేశం చేయించినా; కవితాత్మకంగా భావోద్వేగాల్నీ, తాత్విక కోణాన్నీ, సౌందర్యానుభూతినీ ఆవిష్కరించినా; సిద్ధాంత మూలాల్నీ, శాస్త్రీయ విశేషాల్నీ వ్యాసాలుగా విపులీకరించినా; భాష ఆధారంగా విజ్ఞానాన్ని, తార్కిక సామర్థ్యాన్ని, మానవీయ లక్షణాల్నీ సరఫరా చెయ్యడమే వీటన్నిటిలోని అంతస్సూత్రం.
 
సాంకేతికంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న మధ్యమాల ద్వారా సాహితీ ప్రవాహం తనరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంది. అందులో భాగంగా ఆవిర్భవించినవే అంతర్జాల పత్రికలు. ’ఆ కోవలోనే మూడున్నరేళ్లక్రితం ఇంటర్నెట్ పాఠకుల ఎదుటకొచ్చింది పొద్దు. లేలేత కిరణాలతో ఉదయించినా సరికొత్త ప్రయోగాలతో, వినూత్నమైన రచనలతో, నానాటికీ బలపడుతున్న పాఠకాభిమానంతో అపరాహ్ణపు సూర్యుడిలా మరింత ప్రకాశవంతమవ్వడానికి తన సామర్ధాల్ని అనునిత్యం సుసంపన్నం చేసుకుంటూనే ఉందీ తొలిపొద్దు.     
 
సాంప్రదాయ పత్రికారీతుల్ని అందిపుచ్చుకుని, ఆధునికతను సాంకేతికతనూ జోడించి ఆన్లైన్ కవి సమ్మేళనాలు, క్రమం తప్పక ఖచ్చితమైన ప్రమాణాలతో కూర్చుతున్న ’గడి’ వంటివి తెలుగు పాఠక లోకానికి మేము సవినయంగా సమర్పించిన కొన్ని కానుకలు. ఒకవైపు ఉద్ధండులైన రచయితలను, సాహితీ స్రష్టలను పరిచయం చేస్తూనే  బ్లాగువనాల్లో వికసిస్తున్న రేపటి రచయితలకు కూడా సమాన స్థానమిచ్చి వారితో కూడా అప్పుడప్పుడూ కబుర్లు కలబోసుకుంటున్నాం. ఇక నవరసాల రచనలు అన్ని ప్రక్రియల్లోనూ యధావిధిగా ఉండనే ఉన్నాయి.
 
సంఖ్యాపరంగా అవలోకిస్తే- పత్రిక మొదలుపెట్టిన ఈ మూడేళ్ళలో నూటికి పైగా రచయితలు తమ రచనల్ని పొద్దుతో పంచుకున్నారు, వీరిలో తమ తొలిరచనలతో పాఠకలోకానికి పరిచయమైన వర్ధమాన రచయితలూ, అప్పటిదాకా అంతర్జాలానికి అపరిచితులైన ప్రముఖ రచయితలూ ఉన్నారు . అన్ని విభాగాల్లో కలిపి ఇప్పటికి నాలుగొందల పైచిలుకు విభిన్నమైన రచనల్ని ప్రచురించటం ద్వారా చెప్పుకోదగ్గ వైవిధ్యాన్ని సాధించగలిగామని భావిస్తున్నాము.
 
ఇప్పుడు కనిపిస్తున్న కొత్త రూపు కోసం ప్రయత్నాలు ఎప్పట్నుంచో సాగుతున్నా పాఠకులకు మరింత సౌలభ్యం అందించటం కోసం మెరుగులు దిద్దుతూ ఆశించిన స్థాయిలో రూపొందించగలిగాము. కంటికి ఇంపైన  రంగుల కలబోతతో; సంచికల, సంపుటాల వర్గీకరణతో దృశ్యపరమైన మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పటికీ మొదటి చూపులో తెలియని మరికొన్ని కొత్త సౌకర్యాలు అందుబాటులోకొచ్చాయి. వీటన్నిటి ద్వారా పాఠకులు పొద్దులో ఎటువంటి ఇబ్బందీ లేకుండా తమకి కావల్సిన రచనలను చేరుకోవచ్చు. పైన పేర్కొన్నవే కాకుండా ప్రస్తుతం ఉన్న లోటుపాట్లను, విషయ విస్తృతిలోని కొద్దిపాటి అసమతుల్యతను అధిగమించడానికి,  ప్రణాళికాబద్ధంగా మరింత నిబద్ధతతో  పనిచెయ్యడానికి పొద్దు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటుంది.      

 మరిన్ని మంచి రచనలతో  , మెరుగైన విలువలతో కూడిన సాహిత్యం కోసం కొనసాగించదలచుకున్న ఈ ప్రస్థానానికి మా పాఠకులు, రచయితలు, శ్రేయోభిలాషులు, స్నేహితులూ -అందరి ఆశీస్సులు మాకెప్పుడూ అవసరమే. మీ సూచనలను, సద్విమర్శలను సంతోషంతో స్వాగతిస్తాం. ఇక ఈ కొత్త ఉదయాన్ని కలిసి ఆస్వాదిద్దాం.

Posted in సంపాదకీయం | 4 Comments

నీల గ్రహ నిదానము – 2

నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము

(ద్వితీయాంకము)

(ప్రథమ దృశ్యము)

(దశరథ మహారాజు శయన మందిరం)

(తెర తీయగానే సన్నని వెలుగులో దశరథుడు పాన్పు లేదా తూగుటుయ్యాలపై పడుకొని ఉన్నట్లు చూపించి, అతడు కాస్త ఒత్తిగిల్లగానే లైట్లు ఆఫ్ చేయాలి)

(తెర వెనుక లైట్లు ఆన్ అవుతాయి)

(దుస్వప్నాలు ఒక దాని వెనుక ఒకటిగా షేడో రూపంలో చూపించాలి)

1వ నీడ: ఒక మనిషిని కోతి తరుముతున్నట్లు..

2వ నీడ: ఒక స్త్రీ జుత్తు విరబూసుకొని, రోదన చేస్తూ తిరుగుతున్నట్లు..

3వ నీడ: ఒక మనిషి, ఎనుబోతును ఎక్కి దక్షిణ దిశగా వెళ్తున్నట్లు..

4వ నీడ: ఒక మనిషి చెరసాలలో బందీ అయినట్లు..

(వరుసగా ఇన్ని దుస్వప్నాలు కనిపించిన తరువాత దశరథుడు పాన్పుపై లేచి కూర్చొంటాడు,)

(రంగస్థలం పైన లైట్లు వెలుగుతాయి.)

(దశరథుడు తెప్పరిల్లి పాన్పు దిగుతాడు)

దశరథుడు: (జనాంతికముగా) ఏమిది! ఇంద్రజాలము వలె కన్పట్టుచున్నది! చతుర్దిశలయందు, సరయు, నర్మద, గంగ, సింధు నదీజల పరీత భూమండలమును, ఏకచ్ఛత్రము క్రింద పరిపాలించిన, అకళంక కీర్తిచంద్రులు, అయోధ్యాపురీ రమారమణులైన మాంథాత, రఘు, దిలీప, అజ చక్రవర్తుల వంశజుడనైన, దశరథ రాజేంద్రుడనేనా నేను! (చెయ్యి గిల్లి చూసుకొని) అవును! నేను దశరథుడనే!! (చుట్టుప్రక్కల కలయజూసి) ఇది నా ఆలోచనా మందిరము వలె కన్పట్టుచున్నది. రాత్రి చాలసేపటి వరకు, అమాత్య సుమంత్రులవారితో మంతనములాడి, నే నిచటనే శయనించి యుండవలె! అవునవును, ఇచ్చోటనే శయనించితిని! అనగా.., ఇంద్రజాలము వలె కన్పట్టిన ఈ దృశ్యములన్నియు, స్వప్న దృశ్యములా! ఇసీ!! స్వప్నమునకా నేనింత కలవర పడినది!!! (చప్పట్లు కొడతాడు) ఎవరక్కడ?

(ప్రవేశం :: అకంపనుడనే భటుడు. నిలువెల్లా వణుకుతూ)

అకంపనుడు: (కంపిస్తూ) జ.. జ.. జ జయము జయము మహారాజా!

దశరథ: ఎవరు నీవు?

అకంప: మ.. మ.. మహారాజా! నేను అకంపనుడను.

దశరథ: కాదు, నిశ్చయముగ నీ వకంపనుడవు కావు!

అకంప: అయ. య్యయ్యో మ.. మహారాజా! నేను.. నేను అకంపనుడనే!

దశరథ: ఊఁహు! నేను నమ్మజాలను

అకంప: మ.. మ.. మహారాజా! ఎ.. ఎట్లా రుజువు చేసేది! నేను అకంపనుడనే!

దశరథ: నీవు అకంపనుడవే అయిన, ఇట్లు భయకంపితుడవు కానేల?

అకంప: (తేరుకొంటాడు) క్ష.. క్షమించండి మ.. మహారాజా! నేను ముమ్మాటికీ అకంపనుడనే! ఇలా.. ఇలా.. వణుకు పట్టడానికి తగినంత కారణం ఉంది మహారాజా! నేను చూసిన దృశ్యాలని మీరు చూసినా -క్షమించండి, ఇంకెవరు చూసినా, ఇలాగే వణుకు పుట్టి కంపించి పోవలసినదే!

దశరథ: ఏమంటివి అకంపనా! నీవు భయాందోళనలకు గురిచేయు దృశ్యములను చూసితివా?

అకంప: అవును మహారాజా! నేనే కాదు, అర్ణవ ష్ఠీవి కూడా చూసాడు. వాడు అక్కడికక్కడే రాయిలా నిలబడిపోయి, ‘ఉప్పుటేరులా’, ‘చెమట’ కార్చేసుకొంటున్నాడు. ఇంతలో మీ పిలుపు వినిపించినది.

దశరథ: ఏ దృశ్యములు? అకంపనా, కలలోనివా?

అకంపన: అయ్యయ్యయ్యో! మహారాజా! క్షమించండి క్షమించండి, క్షమించండి. కాపలా కాసే భటులం మేము కలలు కంటే, తలలు ఎగిరిపోవా మహాప్రభూ! మేమా దృశ్యాలను మా కళ్లతోనే చుసాం. కావాలంటే అర్ణవ ష్ఠీవిని కూడా పిలిచి అడిగి చూడండి.

దశరథ: వెళ్లి తీసుకొని రా!

(అకంపనుడు వెళ్లి రెండవ భటునితో వస్తాడు)

అర్ణవ ష్ఠీవి: జయము జయము మహారాజా! నేనే అర్ణవ ష్ఠీవిని!

దశరథ: చిరంజీవీ! నీకీ పేరు నీ తల్లితండ్రులు పెట్టినదేనా?

అకంప: అవును, మాహారాజా! వీడు వరప్రసాది, సార్థక నామథేయిడు!

దశరథ: (నవ్వుతూ) ఏమి! సార్థక నామథేయుడా? నిజమేనా అర్ణవ ష్ఠీవీ! నీవు చెమటతో ఉప్పుటేరులు సృష్టించగలవా?

అర్ణవ: అవును, మహాప్రభూ! మా తలిదండ్రులకు నేనును, నా అన్న సువర్ణ ష్ఠీవియును కవలలము. మమ్ము నిరువురను మా తల్లి, నారద మహర్షి వర ప్రసాదము వలన కనెనట!

అకంప: చిన్నప్పటినుంచి వీరిద్దరి చేష్టలు వింతగా ఉండేవట మహారాజా! వీడి అన్న సువర్ణ ష్ఠీవి కన్నీళ్లు కార్చినా, చెమట కార్చుకొన్నా, మల మూత్రములు విసర్జించినా, చివరకి కక్కుకున్నా ఆ విసర్జకము లన్నియు బంగారముగా మారిపోయేవట!

దశరథ: ఏమేమి, ఆశ్చర్యముగ నున్నదే!

అర్ణవ: మహాప్రభూ! నా దురవస్థ ఏమని చెప్పను. నా విసర్జకము లన్నియు, తటాక ప్రమాణములో నుండేవట! నా చెమటకి పరుపు తడిసి, ఎండ పెట్థిన తరువాత-

అకంప: ఉప్పు, రాశులు రాశులుగా రాలేదట మహారాజా!

దశరథ: పాపము! అర్ణవ ష్ఠీవీ, నీ అన్నమాట ఎట్లున్నను, నీ విషయమున మాత్రము, వరము శాపము వలె పరిణమించినదన్న మాట!

అర్ణవ: లేదు మహాప్రభూ! మా అన్న వరము కూడ వానికి దౌర్భాగ్యము అయినది! వాని కన్నీరు బంగారమగుట చూచి, చుడవచ్చినవారు పొత్తళ్లలో శిశువును గిల్లి గిచ్చి ఏడ్పించెడి వారట!

అకంప: దాది పాలెక్కువ పట్టి, నోట వేలు పెట్టి కక్కంచి ఆ కక్కును మూటకట్టుకు పోయేదట!

అర్ణవ: వాని మల మూత్రముల సంగతి సరేసరి మహాప్రభూ! మా తల్లితండ్రులే వాటి అధికాధిక సేకరణకు వానికి ఏవేవో తినిపించెడి వారట!

దశరథ: అభోద శిశువు పట్ల ఎంతటి అత్యాచారము! ఇప్పుడతడు ఎక్కడ నున్నాడు అర్ణవా!

అర్ణవ: ఇంకెక్కడ ఉన్నాడు మహాప్రభూ! వాని కఢుపులో బంగారముందని, అదే అలా బయట పడుతోందని నమ్మిన కొందరు దొంగలు మా ఇంట పడి-

అకంప: ఆరునెలల వయసులోనే వాన్ని ఎత్తుకుపోయి ఇంటి వెనుక తోటలోనే, పొట్టకోసి బంగారము కనపడక పారేసి పోయారట!

దశరథ: ఇసీ! మనుజుల లోభగుణము ఎంత చెడ్ఢది! అర్ణవా, నీవు ఇదివరకు ఎచట నుండెడివాడవు?

అర్ణవ: చిన్న మహారాణి కైకమ్మగారి వద్ద కాపలా కాసేవాణ్ని మహాప్రభూ!

అకంప: నెల రోజులలోనే వీడు కార్చిన చెమట చెరువయి పోవడం చూసి, కైకమ్మగారు, సుమంత్రుల వారితో ఆలోచించి బహిర్భూమిలోని మీ ఆలోచనా మందిరానికి మార్చారు మహారాజా! నన్నడిగితే వీడు – వీడు, కోట కవతల కందకం దగ్గర కాపలా కాస్తే బాగుంటుంది మహారాజా!

దశరథ: తప్పు అకంపనా! ఒరుల బలహీనతను చూచి ఓర్మి వహింపవలెను గాని, పరిహాసము సేయుట తగదు. అది సరియే! మీరిద్దరు కలిసి చూసిన దృశ్యముల మాట ఏమి?

అర్ణవ: మహాప్రభూ! రాత్రి రెండుఝాములు దాటిన తరువాత, నేనును అకంపనుడునూ కలిసి, పహరా తిరుగుతూ వాటిని చూసాము మహాప్రభూ! ఒక కోతి – మిమ్ములను- క్షమించండి మహారాజా! మీ వంటి పురుషాకృతిని తరుముతున్నట్లును..

అకంప: ఒక దేవతా స్త్రీ తల విరబోసుకొని మనకోట నాలుగు బురుజుల మీదుగా తిరుగుచున్నట్లును..

అర్ణవ: మహాప్రభూ! మీ వంటి పురుషాకృతి – ఒక ఎనుబోతు నెక్కి, ఆకాశంలోకి దక్షిణ దిశగా వెళ్లుచున్నట్లును..

దశరథ: ఆ పిమ్మట నేను, అదే నా వంటి పురుషాకృతి చెరసాలలో బందీ అయినట్లునూ… ఇవియేనా మీరు చూసిన దృశ్యములు?

ఇధ్దరూ: అవునవును మహారాజా!

దశరథ: నేను కూడ వాటిని చూచితిని, కాని నా కవి స్వప్న దృశ్యముల వలె కన్పట్టినవి.

అకంప: (కంపిస్తూ) మే.. మేము మాత్రం వాటిని కంటితోనే చూసాము మహారాజా! కలలో కాదు.

అర్ణవ: అవును మహాప్రభూ! కల కాదు, నిజంగానే చూసాం.

దశరథ: అకంపనా! రాత్రి చాలసేపటి వరకు మాతో మంతనము లాడిన సుమంత్రులవారు ఇంటికి మరలి ఉండరు. ఇక్కడే, రాజప్రసాదమునందే విశ్రమించినారేమో నీకు తెలియునా?

అకంప: నిజము మహారాజా! వా రీ మందిరములోనే విశ్రమించి ఉన్నారు.

దశరథ: వారిని మేల్కొలిపి, రాజాజ్ఞ నెరిగించి తోడ్కొని రమ్ము.

(అకంపనుడు వణుకుతూ వెళ్లబోతాడు.)

దశరథ: ఆగుమాగుము అకంపనా! నీ మేని కంపనములు ఇంకను తీరినట్లు లేదు. నీ విచ్చోటనే యుండుము అర్ణవ ష్ఠీవీ, నీవు వెళ్లి అమాత్యులవారిని తోడ్కొని రమ్ము.

అర్ణవ: చిత్తము మహాప్రభూ! (వెళ్తాడు)

దశరథ: అకంపనా!

అకంప: ఆజ్ఞ మహారాజా!

దశరథ: అర్ణవుని యీ దురవస్థ నుండి తప్పించుటకు మార్గమేదైనను కలదా?

అకంప: తపశ్శాలులైన మహాత్ములెవరో మాయందు దయయుంచి దీవించిన నాడే యీ దురవస్థల నుండి బయట పడుట!

దశరథ: ‘మా’ అనుచున్నావేమి అకంపనా! నీవును ఆపదల పాలైతివా?

అకంప: మహారాజా! మీ కడ ఎటుల చెప్పుకోగలను. నా అత్త కూతురు ‘మిత్తి’ వోలె నా గడప తొక్కి, నన్ను ఆపదల పాలు చేయుచున్నది.

దశరథ: ఇల్లాలిని మృత్యుదేవతతో పోల్చుట తగని పని అకంపనా!

అకంప: మహారాజా! నా ఇల్లాలు ఆ మృత్యుదేవతకే మృత్యువు! పగలు చూసిననే రాత్రి కలలోకి వచ్చు సౌందర్య విశేషము కలది. ఇక రాత్రి చూసిన వేరు చెప్పవలెనా? నేను రాత్రి కొలువులు చేసేది అందుకే మహారాజా!

దశరథ: ‘భార్యా రూపవతీ శతృః’ అన్న ఆర్యోక్తి వినలేదా అకంపనా? ‘నగుమోముగల చాన, నల్లనిదైనా మగనికి లోకాన మరుపాల వాన’ కురిపింప గలదు సుమా!

అకంప: మహారాజా! అది నల్లని తుమ్మమొద్దు అయినను నేను భరింపగల వాడనే గాని, కణకణ మండే బొగ్గుల కుంపటి యైన, ఎట్లు సహింప గలను?

Posted in కథ | Tagged | 2 Comments

నీల గ్రహ నిదానము – 1

తెలుగులో నాటకరచన నల్లపూసైపోతున్న కాలంలో ఎ. శ్రీధర్ గారు చక్కటి నాటకాలు నాటికలను రచిస్తూ, కొత్త రచనలను సాహిత్యలోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. గతంలో వారు రచించిన “చీకటి చకోరాలు” అనే సాంఘిక నాటికను పొద్దులో ప్రచురించాం. ఇప్పుడు వారే రచించిన నాటకం “నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము” మొదటి భాగాన్ని మీముందుకు తెస్తున్నాం. చదివి మీమీ అభిప్రాయాలను తెలుపవలసినదిగా మనవి.

—————————————————-

-ఎ శ్రీధర్

నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము

ప్రథమాంకము

ప్రథమ దృశ్యము

(చంద్రలోకంలోని శివాలయం)

(రోహిణి శివపూజ చేస్తూ ఉంటుంది)-

రోహిణి:

ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం, మోక్షదం తస్మా దోంకారాయ నమో నమః

ఓం ‘నం’ నమంతి మునయ స్సర్వే నమంత్యప్సరసాం గణాః
నరాణా మాది దేవానాం ‘నకారాయ’ నమో నమః

ఓం ‘మం’ మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞాన ప్రదం పరం
మహాపాప హరం దేవం తస్మా ‘మకారాయ’ నమో నమః

ఓం ‘శిం’ శైవం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం
జ్ఞానదం, పరమం, తస్మా ‘శ్చికారాయ’ నమో నమః

ఓం ‘వాం’ వాహనం, వృషభం, యస్య వాసుకీ కంఠ భూషణం
వామ శక్తి ధరం, దేవం ‘వకారాయ’ నమో నమః

ఓం ‘యం’ యకారో సంస్థితో దేవో యకారం పరమం శుభం
యన్నిత్యం పరమానందం ‘యకారాయ’ నమో నమః

(ప్రవేశం :: చంద్రుడు)

(చంద్రుడు ధ్యానముద్రలో ఉన్న రోహిణి వంక తమకంతో చూస్తూ పిలుస్తాడు)

చంద్రుడు: ప్రియే, రోహిణీ!

రోహిణి: (ధ్యానం భంగమవగా, చంద్రుని వంక చిరుకోపంతో చూస్తుంది) “ఏమందురు స్వామీ?”

చంద్రుడు: రోహిణీ! చంద్రశిలా నిర్మిత, అంతఃపుర ప్రసాద హర్మ్యాల్ని, నీ చిరునవ్వు హారతులతో వెలిగించకుండా–

రోహిణి: -శివుని ముందు హారతి వెలిగించడం దేనికి, అంటారు, అంతేనా స్వామీ?-

చంద్రుడు: అవును దేవీ! చిలుకల కొలుకలైన నీ కంటి కొనలు, అనురాగ రాగ రంజితాలు అయితేనే తప్ప, ఈ చిరుకోపంతో శోభిల్లడం లేదు సుమా!

రోహిణి: (శివుని ముందు నుంచి లేచి) స్వామీ! ఇది శివపూజా సమయం, ప్రణయానికి —

చంద్రుడు: సమయా సమయాల ప్రసక్తి లేదు రోహిణీ! పద! పూజ ముగిసినట్లే కదా! – (అంటూ ఆమె చెయ్యి పట్టుకొంటాడు)

రోహిణి: (విడిపించుకొని) కాసేపు నన్నంటకండి స్వామీ! నేను మీ ఆలినే అయినా –

చంద్రుడు: ఇప్పుడు మాత్రం శివ పూజా ‘పరురాలి’ నంటావ్! (‘పరురాలి’ అన్న పదాన్ని వత్తి పలుకుతూ)

రోహిణి: (చంద్రుని నోటి దగ్గర చేయి పెట్టి వారిస్తూ) మీ ఇల్లాలిని అంత మాట అనకండి స్వామీ! ఈ రోహిణి మనో వాక్కాయ కర్మల చేతనే కాక, రూప వయో లాచణ్యాదుల చేత కూడా-

చంద్రుడు: (అడ్డుపడి, ఆమె చుబుకాన్ని ఎత్తి పట్టుకుంటూ) నాకు తెలుసు రోహిణీ! నువ్వీ రాకా సుధాకరుని అనుంగు ప్రియురాలివి

రోహిణి: (తన్మయత్వంతో, చంద్రుని కౌగిలిలో చేరి) ధన్యురాలుని ప్రభూ!

(ఇద్దరూ ప్రణయోన్మత్తతలో పరిసరాలను మరిచిపోతారు)

(ప్రవేశం :: దక్ష ప్రజాపతి)

{దక్షుడు వస్తూనే ఆ దృశ్యాన్ని చూసి, వెనకడుగు వేస్తాడు. అదే సమయానికి– (తెరలోంచి) కొన్ని స్త్రీ కంఠ స్వరాలు — ‘ అశ్చిన్యాది తారకల కంఠ స్వరాలు వినిపిస్తాయి.}

నక్షత్ర కాంతలు: (తెరలోంచి) చూసారా తండ్రీ! ఆ రోహిణీ శశాంకుల ప్రణయ పరవశం! చంద్రుడింక రోహిణికే కైవసం-

దక్షుడు: చూసానమ్మా, చూసాను ఇప్పుడు అర్థమయింది నాకు, మీ కలవరంలోని ఆక్రోశం! శాంతించండి, నేను రోహిణికి నచ్చ చెపుతాను— (అని రోహిణి వంక చూసి) రోహిణీ! !! (బిగ్గరగా పిలుస్తాడు)

(రోహిణీ చంద్రులిద్దరూ ఆ కేకకి తెప్పరిల్లి విడిపోతారు)

రోహిణి: (తండ్రి వంక చూసి, సిగ్గు పడుతుంది) నాన్నాగారూ! రండి, ఈ సమయంలో మీ ఆగమనం

దక్షుడు: నీ ఆలింగనానికి అంతరాయం, అంతేనా?

చంద్రుడు: మామగారూ! నమస్కారం! అదికాది రోహిణి అభిప్రాయం

దక్షుడు: 0సమర్థించబోకు శశాంకా! సమయా సమయాలు పాటించక, నేను పిలిచిన పిలుపు కావచ్చుకాక, మీ ప్రణయావేశానికి ప్రొద్దు గుంక! అయినా నీ పని మాత్రం ఏమంత సమంజసం చంద్రా!? పవిత్రమైన శివసన్నిధిలో శివపూజా తత్పరురాలైన తరుణిని తమకంతో గవయడం.. ?

రోహిణి: నాన్నాగారూ! అది మా స్వవిషయం

దక్షుడు: నిజమేనమ్మా! రోహిణీ! మన స్వవిషయాలు మరి కొందరికి కాకూడదమ్మా విష తుల్యాలు

చంద్రుడు: మా దంపతుల ఆంతరింగిక విషయాలు మరికొందరి మనసులకి విషతుల్యాలా మామయ్యా?

రోహిణి: ఎవరా ఇచ్చగించని పరులు తండ్రీ?

దక్షుడు: వారు మీ కిరువురికీ కావలసిన వారేనమ్మా! చంద్రా! ఈ రోహిణితో పాటు అదే నక్షత్ర యోనిలో అయోనిజలు, అపరంజిబొమ్మలు అయి జన్మించిన వారిని కన్న, తండ్రిని కూడ నేనేనయ్యా!

రోహిణి: ఓహో! ఇప్పుడు అర్థమయింది, నా సవతులు మాత్సర్యంతో మీకు చెప్పిన మాటలు విని..

చంద్రుడు: మీరు మమకారంతో మమ్మల్ని మందలించడానికి వచ్చారన్న మాట!

రోహిణి: (గర్వంతో చంద్రుని వంక చూస్తుంది) విన్నారా నాన్నగారూ! మా ఇద్దరిదీ ఒకే బాట, ఒకటే మాట! ఈ రాజు, రోహిణికి మాత్రమే రేరాజు! చంద్ర సదనమను యీ తామర కొలనులో, రోహిణి మాత్రమే కలువ బాల!!

దక్షుడు: (కోపాన్ని అణచుకొంటూ) రోహిణీ! విచక్షణ లేక మాట్లాడుతున్నావు. అశ్విన్యాది నక్షత్ర కాంతలు నీకు సపత్నులే కాదు, సోదరీ మణులు కూడ! (ఆమె దగ్గరకు వెళ్లి అనునయంతో) చూడమ్మా! వారిలో అశ్విని, భరణి, కృత్తికలు ముగ్గురూ నీకు అక్కలు. మృగశిరాది రేవతి పర్యంతం నీ చెల్లెళ్లు – ఇందులో పరాయి వారెవరమ్మా? నువ్వు వారితో పాటు పుట్టింట పెరిగావు, వారందరితో కలసి మెట్టినింట మసలడం ధర్మం! నీ నాధుడు వారికి మాత్రం అనాధుడవడం ఈ తండ్రి భరించలేడమ్మా! నీతల్లి ‘ వీరిణి’ యీ వార్త విన్నప్పటి నుండి శోకాకులయై నిద్రాహారాలు వదిలి పెట్టింది. అందుకనే నేను నీకడకు కార్యార్థినై వచ్చాను.

రోహిణి: (వినరాని మాటలు వింటున్నట్లు) నాన్నగారూ! అనునయ వినయాలతో కలిపే కాపురాలు ఎంత కాలం నిలుస్తాయి? ప్రాణనాథుని తలలో నాల్క అయి, అతని ననుక్షణం, కనుసన్నలలో మెలిగేలా చేసుకో గలగడం ఒక కళ! (ఆగి, తండ్రి వంక ఓరగా చూస్తూ వ్యంగ్యంగా) నాన్నగారూ! సోదరీమణులే అయినా, సపత్నులుగా మారిన వారితో, (చంద్రునికి దగ్గరగా వెళ్లి) నే నీ చంద్రకళను ఎలా పంచుకోగలను?

దక్షుడు: అర్థమయిందమ్మా నీ సహృదయం! ఇక నీతో మాటలాడి ప్రయోజనం లేదు. (చంద్రునితో) చంద్రా! అందగాడవని, షోడశ కళా పూర్ణుడవనీ నిన్ను చూసి నా కన్నియలు ముచ్చటపడితే కాదనలేక నీ కాళ్లు కడిగి వారి నందరినీ నీకు దానం చేసాను. నీ పెళ్లినాటి ప్రమాణాలైనా గుర్తు తెచ్చుకొని వారిని ఏలుకోవయ్యా! !

చంద్రుడు: ఆగండి మామగారూ! అదే మీరు చేసిన పొరపాటు. మీ కన్నియలందరూ నన్ను చూసి ముచ్చట పడడం, అది నా గ్రహపాటు! నేను మాత్రం వారందరిలో తొలుదొల్త చూసినది రోహిణిని, మనసిచ్చింది కూడా ఆమెకే! ఆమె చేయి నందుకోవాలని మీ దగ్గరికి వస్తే, ఒకే యోనిలో పుట్టిన కన్నెలని వారిని విడదీయడం సాధ్యం కాదని మాయ మాటలు చెప్పి, ఇరువది ఆరు గుదిబండలని నా మెడకి కట్టబెట్టారు. పెళ్లినాటి ప్రమాణాలంటూ నే నెవరికైనా చేసి ఉన్నట్లయితే అవి కేవలం రోహిణికే! (పద్యం)
చం||

ఇరువదియారు కన్యలను యేర్పడ గట్టిరి నాదు కుత్తుకన్
వరుసకు వారు భార్యలవవచ్చును కాని ప్రియంబు రోహిణే
పొరబడి తక్కువారలతొ పొందొనరించిరి మాయ మాటలన్
విరసము తోడ బల్కుచును వెర్రినిఁచేయుచు మోసగించరే!

దక్షుడు: చంద్రా! నీవు రోహిణిని దక్క తక్కిన చుక్కలను చేపట్టడం..

చంద్రుడు: రోహిణి కొరకే మామగారూ!

దక్షుడు: పెళ్లయినాక వారిని పరిత్యజించడం..

చంద్రుడు: అది కూడ రోహిణి కొరకే!

రోహిణి: (కిలకిలా నవ్వి) విన్నారా నాన్నగారూ! అందచందాలకి సాటిలేని యీ వన్నెకాడు, షోడశ కళాప్రపూర్ణుడైన యీ శృంగార నాయకుడు, ప్రియురాలి అంగాంగాలను అమృత పూరితం చేయగల యీ అమృతాంశుడు, రోహిణికే ప్రాణ నాయకుడు. పాల సముద్రంలో పుట్టి, వెన్నలాంటి వెన్నెలను వెదజల్లే యీ జాబిల్లికి..

చంద్రుడు: ఈ రోహిణి మాత్రమే ఏకైక నాయిక!

దక్షుడు: (కాస్త కోపంతో) చంద్రుడా! ప్రేమ మత్తులో పడి ఉన్మత్తుడివి అయిపోయావు. రోహిణీసౌందర్య జాలంలో పడి అంధుడివి కూడా అయినావు. నా ఇరువది ఆరు ఆడబిడ్ఢలను నిష్కారణముగా, తోడు లేకుండా చేసావు. (మెత్తబడి) వాళ్ళలో ఎవరినైనా, ఏనాడైనా అనురాగ దృష్టితో చూసావా చంద్రా? పిల్ల నిచ్చిన మామగా నీ హితవు కోరి చెప్పే మాట విను – అశ్విని కన్న కమ్మని కంఠమా రోహిణిది! భరణి కన్న సమున్నతమా ఈమె కుచద్వయము! కృత్తిక శరీర కాంతులు అగ్నికైన తేగలవు కదా తలవంపులు!! మృగశిర మృగ నయనాలు కురిపించ లేవంటావా వలపు హరి చందనాలు?

రోహిణి: నాన్నగారూ, చాలించండి యీ స్తోత్ర పాఠాలు. వారు మీకు కన్నబిడ్డలైతే కావచ్చు గాక, నాకు మాత్రము భయంకర సపత్నులు!

చంద్రుడు: దేవీ! ఆవేశపడకు. నేనుండగా నీ కెందుకీ వ్యర్థ వార్తాలాపాలు? నీ సవతులు ఎంతెంత సుందరాంగులైనా, ‘అష్టవిధ నాయికా లక్షణాలు నీలోను, షోడశ కళలు నాలోనూ మూర్తీభవించి ఉన్నాయి. ముసలివాళ్ల కేం తెలుసీ కాముక విశేషాలు! నీవు మందిరంలోకి వెళ్లి విశ్రాంతి తీసుకో! (దక్షునితో) మామగారూ! మీరు వచ్చిన పని ముగిసిందనుకొంటే మాకు సెలవియ్యండి. ఇప్పటికే మా ఏకాంతం చాల వరకు వ్యర్థమయింది.

దక్షుడు: (ఉగ్రుడయి) చంద్రా! ఏమి నీ దురహంకారము!! నీవు ఇంద్రుని కన్న అందగాడివా? నారాయణుని మించిన నాయకుడివా? శివుని తలదన్నిన కామశాస్త్ర పారంగతుడివా? ఏమిరా నీ కండకావరం! పిల్ల నిచ్చిన మామనని ఒదిగి ఒదిగి మాట్లాడినందులకా యీ మిడిసిపాటు!! నేను సకలకార్య సుదక్షుడనైన దక్షప్రజాపతినని, ఉప బ్రహ్మనని మరచితివా??

(రోహిణి, దక్షుని ఆగ్రహం చూసి భయంతో అతని దగ్గరకు వెళ్తుంది.)

రోహిణి: నాన్నాగారూ! ! శాంతించండి, రండి లోపలికి వెళ్లి మాట్లాడుకొందాం. (చెయ్యి పట్టుకొంటుంది.)

దక్షుడు: (చెయ్యి విదిలించుకొని) ఛీ! ధూర్తురాలా!! నీవే దీని కంతటికీ మూల కారణము. (రోహిణికి చెంప దెబ్బ కొడతాడు)

(రోహిణి ఆ దెబ్బకి క్రింద పడుతుంది. చంద్రుడు ఆమెను లేవనెత్తేందుకు వస్తాడు. ఆమె లేచి, మోకాళ్ల మధ్య తల దూర్చి ఏడుస్తుంది. చంద్రునికి ఆమె కన్నీరు భరించరాని దవుతుంది. అతడు ఆవేశానికి లోనవుతాడు)

చంద్రుడు: దక్షా! నీ వెంత సుదక్షుడవో నాకు తెలియనిది కాదు. చంద్రునికి సరిపోలు వారు సురాసురులలోనే లేరు తెలుసా? నా ఇంటికి వచ్చి, నా ఇల్లాలిని చెంపదెబ్బ కొట్టిన వాడు, బ్రహ్మ ఉపబ్రహ్మలలో ఎవరైనను నేను సహించునది లేదు, ఆ! మామగారివి కాబట్టి క్షమించి వదిలి పెడుతున్నాను. ఇక మీరు దయచెయ్యండి. (రోహిణి దగ్గరగా వచ్చి) రోహిణీ! నా సఖీ!! దుఃఖించకు దేవీ, పద మన మందిరానికి పోదాం (బ్రతిమాలుతాడు)

(దక్షునికి ఆ దృశ్యం భరించ రానిదవుతుంది ఆవేశంతో ఉచితానుచితాలు మరచి పోతాడు.)

దక్షుడు: (రోషావమానాలతో శపిస్తాడు) చంద్రా! యుక్తాయుక్త జ్ఞాన శూన్యుడవై నన్ను అవమానించావు. ఈ రోజుతో నీ షోడశ కళలు నీలో హరించి పోవును గాక! నీవు కళా విహీనుడవై, నిస్తేజుడవై, మృత ప్రాయుడ గుదువు గాక!!

గీ||

మామ నజ్ఞానమున చందమామ నీవు
పరిభవించితొ మఱి దాని ఫలిత మిదిగొ
కళల గోల్పోయి నీ దగు కాంతి నుడిగి
పండి యుందువు జీవచ్ఛవంబు పగిది.

(అని వెళ్లిపోతాడు)

(దక్షుడు వెళ్లిపోగానే చంద్రుడు నిస్తేజుడై నిస్సత్తువతో క్రింద పడిపోతాడు. రోహిణి చంద్రుని వంక దిగులుతో చూస్తూ ఉంటుంది.)

(స్టేజి క్రమంగా చీకటయి పోతుంది. తెర వెనుక లైట్లు వెలుగుతాయి. శివలింగానికి వెనుక నున్న వైట్ కర్టెన్ మీద ఒక నీడ పడుతుంది. అలాగే 16 నీడలు ఒక దాని వెనుక ఒకటి కనబడి వెళ్లి పోతూ ఉంటాయి.)

1వ నీడ: చంద్రా! నేను ప్రథమ కళను, అమృతను! నిను వీడి వెళ్లి పోతున్నాను.

2 వ నీడ: శశాంకా! నేను ద్వితీయను, మానదను సెలవా మరి!

3వ నీడ: మృగాంకా! నేను తృతీయను, పూషను పోవుచున్నాను.

4 వ నీడ: సుధాంశా! నేను చతుర్థిని, తుష్టిని, దక్ష శాపవశమున నిన్ను వీడుతున్నాను.

5 వ నీడ: అమృతాంశా! ! నేను పంచమిని, సృష్టిని. పోవుచున్నాను.

6 వ నీడ: రాజా! నేను షష్టిని, రతిని నిన్ను పరిత్యజిస్తున్నాను.

7 వ నీడ: రేరాజా! నేను సప్తమిని, ధృతిని, సెలవియ్యి.

8 వ నీడ: చలువల రేడా! నేను అష్టమిని, శశిని, వెళ్లనా మరి!

9 వ నీడ: కలువల రేడా! నేను నవమిని, చంద్రికను వివశనై పోతున్నాను.

10 వ నీడ: తమ్ముల పగవాడా! నేను దశమిని, కాంతిని. నిను వీడిపోతున్నాను.

11 వనీడ: తపసి కనుపాపా! ! నేను ఏకాదశిని, జ్యోత్స్నను, దశమితో పాటు పోతున్నాను.

12 వ నీడ: జాబిల్లీ! నేను ద్వాదశిని, ‘శ్రీని’ నీలో నిలువ లేక పోతున్నాను.

13 వ నీడ: చుక్కల దొరా! ! నేను త్రయోదశిని, ప్రీతిని, నీకు అప్రియనై పోతున్నాను.

14 వ నీడ: చందమామా! నేను చతుర్దశిని అంగదను నీకు తిలోదకము లిచ్చు చున్నాను.

15 వనీడ: సోమా! నేను పంచదశినైన పూర్ణను నీలో ఇమడలేక శూన్యను కానున్నాను.

16 వ నీడ: శశీ! ! నేను షోడశిని, పూర్ణామృతను నాకు సెలవియ్యి.

(షోడశి నిష్క్రమణతో, తెర వెనుక లైట్లు ఆరి, రంగస్థలం పైన వెలుగుతాయి.)

చంద్రుడు: (సగం లేచి) ఓ నా షోడశ కళలారా! నన్ను విదిలి వెళ్లకండి, మీ నిష్క్రమణతో నా బ్రతుకు సమాప్తమవుతుంది. (అంటూ మళ్లీ క్రింద పడిపోతాడు.)

రోహిణి: నాథా, అమంగళము ప్రతిహత మగుగాక! మీరు అలా మాట్లాడితే నేను భరించ లేను.

చంద్రుడు: రోహిణీ! కళా విహీనుడ నైన నేను, నీ కెందులకూ కొరగాను, నన్ను విడిచి వెళ్లిపో! పొండి, ఈ చంద్రున్ని చీకటికి కబళం చేసి పారిపోండి. (మళ్లీ లేవబోయి పడిపోతాడు) (రోహిణి దుఃఖంతో శివుని ఆశ్రయిస్తుంది.)

రోహిణి: బావా! సతీ వల్లభా!! శివా!!! ఇక నీవే చూపించాలి త్రోవ!!!!

చంద్ర శేఖర చంద్ర శేఖర, చంద్ర శేఖర పాహిమాం! చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్రశేఖర, రక్షమాం!

(రోహిణి ప్రార్థన విని, చంద్రుడు ఉత్సాహం తెచ్చుకొని లేచి శివ సన్నిధికి వస్తాఢు)

చంద్రుడు:

రత్నశాను శరాసనం. రజతాద్రి శృంగ నికేతనం
శింజినీ కృత పన్నగేశ్వర మంబుజానన సాయకం
క్షిప్ర దగ్ధ పురత్రయం, త్రిధ శాలయై రభివందితం
చన్ద్రశేఖర మాశ్రయేమమ, కింకరిష్యతివై యమః

రోహిణి:

చంద్ర శేఖర, చంద్ర శేఖర, చంద్ర శేఖర, పాహిమాం,
చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం.

చంద్రుడు:

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృష వాహనం
నారదాది మునీశ్వర స్తుత వైభవం, వృష వాహనం
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్ర శేఖర మాశ్రయేమమ కింకరిష్యతివై యమః

రోహిణి:

చంద్ర శేఖర, చంద్రశేఖర, చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం

చంద్రుడు:

విశ్వసృష్టి విధాయకం, పునరేవ పాలన తత్పరం
సంహరం తమసి ప్రపంచ, మశేష లోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశం, గణనాధ యూధ సమన్వితం
చంద్ర శేఖర మాశ్రయేమమ కింకరిష్యతివై యమః

రోహిణి + చంద్రుడు:

చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం

(శివ లింగం దేదీప్యమాన మవుతుంది)

(తెరలోంచి శివుని కంఠస్వరం వినిపిస్తుంది.)

శివుడు: రోహిణీ చంద్రులారా! విచారించకండి. దక్షుని శాపం అప్రతిహతమే అయినా, దాని నుంచి తప్పించుకొనే మార్గం ఉంది.

ఇద్దరూ: సెలవియ్యండి ప్రభూ! !

శివుడు: చంద్రా! శాపోక్తి ప్రకారము, నీ వెన్నటికీ షోడశ కళాప్రపూర్ణుడవు కాలేవు. నీ షోడశీ కళయైన పూర్ణామృతను నా తలయందున్న నీ బింబమందు నిలుపుకొని, నిన్ను పంచాదశ కళా సమేతున్ని చేస్తాను.

చంద్రుడు: ధన్యోస్మి శివా! నన్ను పదిహేను కళలతో, తిరిగి వెలుగందేలా చేసి, నాకు పునర్జీవితాన్ని ప్రసాదించు. (నమస్కరిస్తాడు)

శివుడు: మూర్ఖుడా! నీకు స్వయముగా వెలుగందే భాగ్యమెక్కడిది?

గీ:

స్వయముగా వెల్గ గల్గెడి భాగ్యమేడ
పద్మ మిత్రుని తేజంబు ప్రతిఫలింప
వెల్గుచుందువు నీవు రేవెల్గు వగుచు
కాని వృద్ధి క్షయమ్ములు కల్గుచుండు

దక్షుని శాపం వల్ల నీవు నిస్తేజుడవు కూడ అయినావు. విచారింప వలదు సుమా! సూర్యుని తేజాన్ని నీలో నిలుపుకొని, ప్రతిఫలింప చేసే వరాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. మరియును వినుము- పంచాదశ కళలు కూడ నీలో నిండి ఉండుటకు వీలు లేదు! అందుకని రోజుకొక కళా లాభముతో వృద్ధి పొందుతూ, పదిహేను కళలతో పున్నమి రేడువై, మరల రోజుకొక కళా విహీనుడవై వృద్ధి క్షయాలు పొందుతూ ఉండు.

రోహిణి: బావా! నా నాథుని నేను మరల షోడశ కళలతో చూసుకోలేనా?

శివుడు: రోహిణీ! నీ నాథుడు నీతో కూడినప్పుడే ఉచ్ఛగతిని పొందగలడు. నీకు మాత్రము పరిపూర్ణుడై కన్పింపగలడు.

ఇరువురూ: ధన్యోస్మి మహాదేవా! (అని ప్రణమిల్లుతారు)

(మొదటి దృశ్యం సమాప్తం)

Posted in కథ | Tagged | 5 Comments

గుప్పెడు మిణుగురులు

-మూలా సుబ్రహ్మణ్యం

అడుగుజాడలు

ఆ తీరంలో
ఎంతటి మహాత్ముడి
అడుగుజాడలైనా
చెరిగిపోక తప్పదు

నీకు నువ్వే
ఓ దారి వెతుక్కోవాలి

జీవితమూ
సముద్రమే!

* * *

కలలెక్కడో అంతమవ్వాలి
మళ్ళీ పుష్కరాల వేళకి
ఈ నది ఉంటుందో లేదో

ఒక్క క్షణమైనా
నిన్ను విడిచిపెట్టి
నదిలోకి..
నదిని నీలోకి..

కాలం
ఎంత అర్ధరహితం!
* * *

మట్టి రోడ్డు పక్కన
దుమ్ములో తడుస్తూ నవ్వుతున్న
గాజుపూలు,  గన్నేరు పూలు
ఏవెక్కువ అందమైనవి?

తూనికలు, కొలతలులేని
ఒకే ఒక్క చూపు

సానుభూతి అంచుల్లో సంతోషం
అభినందనల అడుగున అసూయ

ఏ రంగూ లేని
ఒక్క కన్నీటిబొట్టు

నీకూ ప్రపంచానికీ మధ్య
గీతల్ని చెరిపేస్తూ…

* * *

సముద్రమో, నదో అక్కరలేదు
చిన్ని నీటి చెలమ
కన్నుల్లో…

సూర్యుడో, చంద్రుడో అక్కరలేదు
గుప్పెడు మిణుగురులు
గుండెల్లో..

చాలు!

Posted in కవిత్వం | Tagged | 28 Comments

కవికృతి-౧౨

౧.

– చావా కిరణ్

ఆ రోజు ప్రభూ,

నీ కోసం నన్ను సిద్దంగా ఉంచుకోలేదు.
—-

నేను పిలవకుండానే

ఒక సామాన్యునిలా

హృదయంలోకొచ్చి

అశాశ్వత క్షణాలపై

అమృత ముద్రవేశావు.
—-

ఈ రోజు అనుకోకుండా

గతం నెమరు వేసుకుంటూ

నీ రాజముద్రలు చూశాను.

—-
అవి ఆనంద విషాదాల్తో కలగలిసి

మర్చిపోయిన మామూలు అనుభవాల్లో

దుమ్ములో చెదురుమదురుగా ఉన్నాయి.

—-
చిన్నప్పుడు మట్టిలో ఆడేనాటినుండి

కావాలనే అలక్ష్యం చేయకున్నా

అప్పుడు నే విన్న అడుగుల చప్పుడు

తారల నడుమ ఇప్పుడు ప్రతిద్వనిస్తున్నదే.

—-

The day was when I did not keep myself in readi­ness for thee; and enter­ing my heart unbid­den even as one of the com­mon crowd, unknown to me, my king, thou didst press the signet of eter­nity upon many a fleet­ing moment of my life.

And today when by chance I light upon them and see thy sig­na­ture, I find they have lain scat­tered in the dust mixed with the mem­ory of joys and sor­rows of my triv­ial days forgotten.

Thou didst not turn in con­tempt from my child­ish play among dust, and the steps that I heard in my play­room are the same that are echo­ing from star to star.

౨. వేర్పాటు వాదం!

– వెంపటి హేమ

తెలంగాణం వేరననేల తమ్ముడా!
తెలుగుదేశం మనదనరాదా తీరుగా –
అన్నదమ్ముల మధ్య కలహం
అన్వయానికే అనర్ధ దాయకం !
చరిత్ర లోని తప్పులు మళ్లీ మళ్ళీ
చర్విత చర్వణం కారాదు సుమీ!
మనలో మనమే కొట్లాడుకుంటే
అయ్యో! మందికి లోకువ ఐపోమా!!
చరిత్ర నేర్పిన గుణపాఠం ఎపుడూ
మనసున చెరగని ముద్రగ ఉండాలి.-
పృధ్వీశు లందరూ పూనికతో వచ్చి
పురుషోత్తమునికి అండై ఉంటే…
హద్దు దాటి వచ్చేనా అలగ్జాండర్
అలనాడు భారతావనిని ఏలేనా !
మొహరించి నృపులెల్లరూ చేరి
నాడు మొగసాలను కాచియుంటే
మొగలాయీ సామ్రాజ్యానికి
మన దేశంలో మొలక పుట్టేదా –
పరదేశీయ పాలన మనకు వచ్చేదా,
నైజాం చేతిలో రాష్ట్రం నలిగిపోయేదా,
పాకిస్తాన్ పేరిట భరతమాత త్రుంచి
తన గుండెను పంచి ఇచ్చేదా ?
తెల్లవాడు వచ్చి ఎల్లర తెలివి హీనులజేసి
“డివైడ్ అండ్ రూల్” అంటూ దిగదొక్కి
దిక్కులన్నీ చుట్టి భువిని ఏలగలిగేనా,
మన లోకువ కనిపెట్టి విర్రవీగేనా?
కాలదోషం పట్టిన కథలన్నీ కలిసి
కావాలి ఇప్పుడు కనువిప్పు మనకు
కలతలు పెంచుకు మనలోనె మనము
పుట్టిన గడ్డనే చీల్చి పంచుకోనేల!
కలిమిని బలిమిని కలబోసుకుంటూ
ఐకమత్యముతో మనము హాయిగా ఉంటే
దీవించదా బిడ్డలను తెలుగు తల్లి!
తెలుగు దేశం కాదా తేనె మాగాణం!
* * *
తెలుసుకోవా నీవిది తెలుగువాడా …
నేడు నీవు తెలంగాణం వేరంటే
రేపు తానూ వేరనదా రాయల సీమ!
మరచారా నన్నంటూ రాదా మన్యభూమి!
వెనువెంట నడవదా మన వేంగినాడు! !
కోపగించి కొండెత్తక మానునా కోనసీమ!
ఒకేభాష మాట్లాడే వంద సీమ లుండె మనకు
నేను వేరనే మాటను నేర్పబోకు వారి కిపుడు –
అసూయాద్వేషాలు అన్నపుడూ రాణించవు
ఐక్యత లోపించిపోతే అలుసైపోమా అందరికీ!
ఇదే కదా ఇంతవరకు చరిత్రలోని ఘనలోపం!
మరువరాదెపుడు మహాభారత మహిత కథను!
అందరికీ చెరుపు చేసి అది విజయమేలా గౌతుంది?
ఆన్నలార! తమ్ములార!! ఆదర్శమూర్తులార!!!
అందరమూ కలిసిమెలిసి అభివృద్ధిని సాధిద్దాం…
వేర్పాటును కోరి మనం వేరై పోయిననాడు
“గ్లోబలైజేషన్”అన్న పదం గోలై వినిపించదా?
పరసీమలందున్న మనవాళ్లకు ఇంక
పరపతెలా మిగిలుంటుందో చెప్పగలవా ?
మనలోమనమే కలహిస్తూపొతే చూసి
మనలను ఇతరు లెలా మెచ్చగలరు !!!
తెలివిగల్గి తీరుగా మనం మసలుకుంటే
తెలుగు నేలను పారవా తేనెల వాకలు!
తెలుగుతల్లికి “జై”కొట్టు తెలుగువాడా!
గతమందు ఘనకీర్తి ఎంతో ఉన్నవాడా!!

* * *
చావా కిరణ్:

You are confused 🙂

If you are proposing Indian jaateeya vaadaM. Then there is nothing wrong in
Telangana Demand as another state.

If you are proposing Telugu jaateeya vaadaM, then you need to edit your
examples.

కత్తి మహేష్:

A complete miss understanding of the issue doesn’t make a meaningful poem.

చావా కిరణ్:

Not very complete mis-understanding. As the issue itself is pseudo issue
based on pseudo statistics for pseudo benefits. Don’t worry keep writing.

ఆచంట రాకేశ్వర్రావు :

చాలా బాగుంది పాట। కవితకంటే పాత గొప్పది।

ప్రాసయతి బాగా కుదిరింది। లయచాలా బాగుంది। హాయిగా చదువుకోగలిగాం।

చావాగారు ప్రస్థావించిన విషయమై,
గీతలు గీయడం మొదలు పెట్టాక దానిని ఎక్కడ ఆపాలి, నా ఊరి చుట్టూనా, నా భాష
మాట్లాడేవారి చుట్టూనా, నా యాసలో మాట్లాడేవారి చుట్టూనా, నా రంగులో
వున్నజనం చుట్టూనా, యేం బర్మా ఎందుకు కాకూడదు మనదేశం, యేం ఇండోనేషియా
ఎందుకు కాకూడదు? వంటి ప్రశ్నలు వస్తాయి। ఇవి మంచి ప్రశ్నలే కానీ ఈ పాట
నేపథ్యం దాని ఆత్మదష్ట్యా ఇవి ఇక్కడ అనవసరం। తెలుగు భక్తి గీతాలు
చాలానేవున్నాయి। ఇలాంటి ప్రశ్నలు వాటికి వేయడం రెంటికీ చెడ్డ రేవడి –
పాటనీ ఆశ్వాదించలేరు। సమస్యా తీఱదు।

మహేశ్ గారు ప్రస్థావించిన విషయమై,
వాక్ స్వాతంత్ర్యం అంటే మనము ఏమి మాట్లాడాలో అన్నవిషయానికే గానీ, ఎదుటి
వారు ఎలా అర్థంచేసుకొని, వారు ఎలా మాట్లాడాలి అన్న విషయానికి వర్తించదు
కాబట్టి, ఆ మాటలు పట్టించుకోకూడదు। నేను కూర్చుని – నేను
భారతీయరాజ్యాంగాన్ని ఎందుకు అనుసరించాలి, నాకు అది ఆమోదయోగ్యంగా లేదు –
అని ప్రశ్నించవచ్చుఁ, అలాంటి ప్రశ్నలవల్ల కాలక్షేపమేగానీ పురుషార్థం
దక్కదు।

వెంపాటి హేమగారి మంచి కవితకు అభినందనలు।

వెంపటి హేమ:
కవి మిత్రులకు శుభాకాంక్షలు, నేనేమీ పెద్దగా చదువుకున్న
దాన్ని కాదు. కానీ బతుకు బడిలో చదువుకుని ఇప్పుడు చరమాకం చేరుకున్న దానిని.
(పుట్టిన తేదీ ౧ జూలై ౧౯౩౬.)
న్యూస్ పేపర్లలో వస్తున్న ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను గురించిన
వార్తలకు, నిజం చెప్పాలంటే – దుర్వార్తలకు వ్యధతో స్పందించిన నా హృదయ ఘోష ఈ
కవిత. పొద్దువాలిపోయిన ఈ వయసులో నా మనసులోని వేదన వెనక ఉన్నది, ఐకమత్యంతో అందరూ
హాయిగా ఉండాలి అన్న కోరిక మాత్రమే గాని స్వార్ధం, స్వలాభాపేక్ష, వలపక్షం లాంటి
దురూహలేమీ కావు. “లోక సమస్తా సుఖినో భవంతు” అని కోరే అతిసామాన్య గృహిణిని నేను!
ఏ రాజకీయాలతోనూ నాకు ఏ సంబంధం లేదు. మీరిన వయసు ఇచ్చిన చొరవతో నాకు తెలిసినంత
వరకు నా కవితకు మూలమైన భావాలను ఇక్కడ రాస్తున్నాను. “బామ్మ మాట బంగారు బాట” అని
మంచి మనసుతో అర్ధం చేసుకోండి. లేదా, బామ్మ బొత్తిగా సెనైల్ ఐపోయింది – అని
నవ్వుకుని ప్రేమతో నన్ను మన్నించండి…..
ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన స్వతంత్ర పోరాటం, “ఏకులా వచ్చి మేకులా
బిగిసిన” అన్యదేశీయులైన బ్రిటష్ వారిని మనదేశం నుండి వెళ్ళగొట్టడానికి
భారతదేశవాసులు ఐక్యతతో సాగించిన శాంతియుత పోరాటం! అది విదేశీయులతో స్వదేసీయులు
చేసిన పోరాటం!
దేశం స్వతంత్ర మైన తరువాత దానిని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా
విభజించారు అన్న విషయము మనకు తెలిసినదే కదా. తరవాత కొన్నాళ్ళు మన రాష్ట్రాన్ని
తమిళనాడుతో కలిపి, ఉమ్మడి పాలన సాగించారు. రెండు విభిన్న భాషలు మాట్లాడే జనం
మధ్య పొత్తు కుదరడం కష్టమయ్యింది. అసలు .రాజ్యాంగ చట్టం ప్రకారం తెలుగుభాష
మాట్లాడే వారికందరికీ ఒక రాష్ట్రం న్యాయమని గుర్తించడానికి ఎందుకనో కేంద్రం
కొంత కాలయాపన చేసింది. చివరకు ఎంతో కష్టమ్మీద “ఆంధ్రప్రదేశఓ” ఒక రాష్టంగా
ఏర్పడింది. ఇది రెండు విభిన్న భాషల జనం మధ్య పోరు! దీనితోనూ ప్రస్తుతానికి
పోలికలేదు. ఇప్పుడు సాగుతున్న రాజకీయం ఒకే గడ్డ మీద పుట్టిన బిడ్డలమధ్య! ఒకే
భాష మాట్లాడే వాళ్ళ మధ్య !!
ఆంధ్ర ప్రదేశo లో రాయలసీమ, తెలంగాణం, వేంగినాడు, మన్యం,
కోనసీమ, పట్టి సీమ….. ఇలా ఏవేవో పేర్లతో ఎన్నో మండలాలు వున్నాయి. ప్రతి
మండలానికి ఒక ప్రత్యేకమైన యాస కూడా ఉంది. కానీ మూలభాష మాత్రం తెలుగే. రాష్ట్ర
సరిహద్దుల్లో ఉన్న భాష మీద పక్కరాష్ట్రపు భాష యొక్క ప్రభావం ఉండడంతో, ఒకే
మండలంలోని యాసలలో కూడా ప్రదేశాన్ని బట్టి కొద్దిపాటి మార్పులు చోటుచేసుకోక
మానవు. ఇక పొతే తెలంగాణంలోని తెలుగు భాషమీద అదనపుభారం పడింది. అది ఆ నాటి
పాలకులైన నిజాం సుల్తానుల స్వభాష ఐన “ఉరుదూ” తాలూకు భారం! ఇది సర్వసాధారణంగా
జరిగేదే. ఉత్తరభారతం మొగలాయీ పాలనలో ఉన్నప్పుడు ఎన్నో ఉరుదూ పదాలు హిందూస్తానీ
లో చేరడమే కాదు, దానికి స్వంతమే అయ్యాయి.ఇక మన దేశంలోని చాలాభాసలకి మూలమైన
సంస్కృతం మన దేశభాషలన్నింటిలోనూ ధారాళంగా చోటు చేసుకుంది కదా! ఉరుదూ
ఇన్ప్లూయన్సు కూడా చోటుచేసుకున్న తెలంగాణ మాండలిక భాష లో యాస వేరవ్వడంలో
ఆశ్చర్యమేముంది? అయినా మూలభాష తెలుగే కదా!
చాన్నాళ్ళకు పూర్వం నిజాం రాజ్యాన్ని పాలించిన సుల్తానులకి`
కర్నాటకలోనూ. మహారాష్ట్రలోనూ కూడా పాలిత ప్రాంతాలు ఉండడంతో గుర్తు తెలియడం
కోసం తెలుగు భాషను మాటాడేవాళ్ళు ఉండే చోటుని “తెలుగు ప్రాంగణం” అని వ్యవహరించే
వారుట! అదే కాలక్రమంలో తెలంగానంగా మారిందిట! ఇది విన్నప్పుడు భాషాపరంగా
ప్రదేశానికి పేరు పెట్టడంలో నిజాం సుల్తానులే ముందడుగు వేసారనిపించింది నాకు!
రాష్ట్రావతరణం తరువాత క్రమంగా మన రాష్ట్రం అభివృద్ధి లోకి
వచ్చింది. ఇటీవల ఇంటర్నేషనల్గా కూడా మన రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చింది!
అలాగని సంతోషించి నంతలోనె మళ్ళీ అరాచకపు చర్యలు మొదలయ్యాయి. ధనమనప్రాణ నష్టాలు
జరుగుతున్నాయి. అది నాలాంటి శాంతి కాముకులకు విచారాన్ని కలిగిస్తుంది. పిట్టల
మధ్య పోరు వస్తే పిల్లి బాగుపడిందిట! హైదరాబాదుకి రావలసిన ఎన్నో లాభసాటి
బేరాలు, అక్కడి కల్లోల పరిస్థితిని చూసి పక్కరాష్ట్రాలకి తరలిపోతున్నాయిట కదా!
ఇది ఇలా జరగనా … అన్న బాధ నాకు ఉంది. బయటికి అనేస్తే బాధ తగ్గుతుంది అంటారు
కదా అని దాన్ని కాగితం మీద పెట్టా ఒక కవితగా. సమయానికి “పొద్దు” ఒక అవకాశం
చూపించింది. ఆ కవితను పంపడం జరిగింది. మనలో మనకు ఏదైనా అసంతృప్తి ఉంటే దానిని
పోగొట్టే ప్రయత్నం చెయ్యడం బాగుంటుందని నా అభిప్రాయం. వేర్పాటు పరిష్కారం కాదని
నా నమ్మకం .
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నారు మనవాళ్ళు! (నేనూ
కొన్నాళ్ళు అమెరికాలోనూ కొన్నాళ్ళు ఇండియాలోనూ ఉంటాను.) మనలో మనమే ఒకటిగా
ఉండలేకపోతే, పరదేసీయులు మనల్ని వాళ్ళల్లో …

౩.

-పెరుగు.రామకృష్ణ

రక్తం రంగు చెప్పనక్కరలేదు
నువ్వు మనిషి వాసన వేస్తే చాలు..
నీ స్పర్శ నిరంతర పరిచయాల దొంతర
నులివెచ్చదనమొక్కటే కరువైంది
ఈ నేలకు నిన్ను చిరునామా చేయడం
నీలోని శాంతి సహన పర్వానికి నిదర్సనం
నీ చిరునామా కొరకు నువ్వెతుక్కోవడమంటే
పువ్వు పరిమళాన్ని కోల్పోయిందనే
మట్టివాసన సమసిపోయిందనే
లింగ వివక్షా పరీక్షల్లో నీ ఉనికి నువ్వు కోల్పోయావనే
పావురం కోసం తొడ మాంసాన్ని తూచిన
నీకొండ పిడికెడు గుండెగా మారిందా..?
నీ కాలి ధూళి తాకితే రాతి నాతిగా మారే గుణం కరువైందా..?
వొక్క పిలుపుకి కోటి పాదాలై కదలిన నీ నడక
శాంతి యుద్ధానికి శత సహస్ర ప్రాణాలుగా విచ్చుకున్న ఆత్మ
నీలోని పంచభూతాల్లోని జీవ లక్షణమే కదా..!
జీవ లక్షణానికి మరణం వుండదు,ఋణం తప్ప
బతికుండగానే, అమ్మను కాటికి మోసినప్పుడే
నీ భుజాల నుంచి కుళ్ళిన శవాల కంపు మొదలైంది
నీలో మనిషి మరణించిన చావుకేక వినిపించింది
ప్రపంచాగ్నికి ఆహుతిచ్చిన స్వార్ధ సమిధలు నిరర్ధకం
పిచ్చుక గూట్లో ఇరుక్కొని రాత్రంతా వెలుతురైన
ఒక మిణుగురు కావాలి ,స్తబ్దాటవిలో పాదయాత్ర కోసం
ఆ మిణుగురు తనం ఆరిపోయింది నీలో
కోట్లాది కన్నుల్లో కన్నీటి తడిని తుడిచిన
కరుణకు మొలిచిన ఆ చేయి విరిగిపోయింది నీలో..
వర్షానికి గొడుగుపట్టడం వేరు,
ఎండకి నీడగా చెట్టు అయి మొలవడం వేరు
రెండు చేతుల్ని వేయిచేసి నిండు మనసుతో
కౌగిలించుకునే అమ్మతనం ఆరిపోయింది నీలో..
విత్తుగా మొలకేత్తే గుణం చచ్చిపోయింది నీలో
నీలో ప్రాణమనే లక్షణం మరణించడానికి ముందే
నేల తల్లి చిరునామా మారిపోవడానికి ముందే
నువ్వు ఫీనిక్స్లా ,అగ్నిస్నానం చేయాలిప్పుడు
కొత్త ఆకాశం అక్కర్లేదు, కొత్త రుతువులు అక్కర్లేదు
వందేమాతర గీతమై కొత్త మనిషిగా మొలకెత్తాలిప్పుడు…!

(This poem bagged First best prize of Rs 4000/- and citation
in International poetry contest by koumudi.net
web journal in April2007 )

౪.

-ఆత్రేయ కొండూరు

గమ్యం ఎక్కడో శిఖరాలమీద
ఉద్భవిస్తుంది,
పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగా
పెదవి విరుస్తూ..

సామూహిక నిస్సహాయతకు
సాక్ష్యమన్నట్టు
వికటాట్టహాసం చేస్తూ..

వాడి ప్రశ్నల వాలుమీద
ఆత్మావలోకనమే ప్రయాణం..

ఆ నవ్వులు ముల్లుకర్రలు
ప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ..

ప్రత్యామ్నాయం దొరికేలోపే
మైనపు రెక్కలు కరిగి
ఆత్మ విమర్శై పలుకరిస్తుంది.

౫. అచ్చులు

-పెరుగు రామకృష్ణ

ముద్ద బంగారమే
నీ చేయి తాకితే చాలు
చింతాకు పతకం
పచ్చల చంద్ర హారం
నవరత్నాలని పేర్చినా
మాంగల్యం బిళ్ళలు చేసినా
నీది అమృత హస్తమే
మా అమ్మ చేతి గాజులకి
నువ్వుపెట్టిన మెరుగు
మా నాన్న చిరునవ్వంత తాజాగా
షష్టిపూర్తికీ మెరుస్తూనే వుంది
దుర్గమ్మ ముక్కుపుడక చూసినప్పుడల్లా
నీ కళా నైపుణ్యం ముందు
రెండు చేతులూ ముకుళిస్తాయి
కానీ ఏంలాభం..?
అక్షరాల్ని బతికించిన అచ్చులు
నీ కడుపులో చిచ్చు రేపాయి
యంత్ర చక్రాల తిరుగుడులో
నీ బతుకు చక్రం వెనక్కి తిరిగింది
నువ్విప్పుడు పడమటి ఆకాశంలో
రాలిపోయిన సూర్యుడివి…!

(కోల్పోతున్న కుల వృతుల్లో బంగారు పనిచేసే వారు
కనుమరుగవుతుండడం చూసి..)

——

౬.

-స్వాతీ శ్రీపాద

కాలానికీ విలువకూ మధ్యన
సామరస్యం పచ్చగడ్డి భగ్గుమంటుంది.
ఒకప్పటి అతిశయోక్తులు
ఇప్పుడు ఆధునికత జారుడు బండ దిగువన
శుష్క వచనాల దిగులు మొహాల్తో
శూన్యాన్ని దిగంతాలకు వేళ్ళాడదీస్తూంటాయి.

సమయం సాన మీద అనవరతం
అరిగిన గంధపు చెక్కగా అద్భుత సౌందర్యం
అలసి సొలసి లేత నీరెండ చెక్కిళ్ళలో
ఓ క్షణం కునుకుదీస్తూంటుంది.

అనుభవం ఉలితాకిడిలో పెనవేసుకున్న
ఆలోచనలు అదృశ్యంగా
అద్భుత శిల్పాలై
అంతరంగం అడుగడుగునా నర్తిస్తూ

ఒకప్పుడు చెలియలి కట్టదాటి
పొంగి పొర్లిన మధురోహల స్మృతి సువాసనలు
సజీవంగా
పడమట చేరుతున్న వసంతానికి రూపమిస్తూ …..
అనుకోవాలే గాని ప్రతి ఉషోదయం ఉగాదే కదా…
ప్రతి శిశిరం ఓ వసంతపు ఛాయే కదా!

=========================

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

కవికృతి – ౧౧

కవికృతి సమ్మేళనంలో సభ్యుల మధ్య చోటుచేసుకున్న కొన్నిసంభాణలు:

స్వాతికుమారి:
కవికృతి లో కొందరు కవులు తమ అనువాద కవితల్ని పంపారు. అసలు ఇతర భాషల కవితలను
తెలుగులోకి అనువదించడం వల్ల కవులకు, పాఠకుడికి ఉపయోగాలేమిటని మీరు
భావిస్తున్నారు? అనువాదాలు చేసేటప్పుడు తప్పక గుర్తుంచుకోవలసిన సూత్రాలు,
నియమాలు ఏవైనా ఉన్నాయా? చావా కిరణ్, పెరుగు రామకృష్ణ గారు వంటి వారు తమ
అభిప్రాయాలు చెబితే బాగుంటుంది.

పెరుగు.రామకృష్ణ:
అనువాద కవిత్వం చదవడం వల్ల వస్తు వైవిధ్యం తెలుస్తుంది..
కవిత్వ నిర్మాణంలో ఆయా భాషల కవులు ఎలా వున్నారో తెలుస్తుంది..
అభివ్యక్తి, సంక్షిప్తత అలవరుచు కోవచ్చు. ఆయా ప్రాంతాల సమకాలీనతను
అర్ధంచేసుకోవచ్చు.మొత్తంగా భారతీయ కవిత్వ సమకాలీనతను పరిశీలించొచ్చు.
లేదా విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేయొచ్చు.అనువాదం చేసేప్పుడు
అటువంటి కొత్త అంశాలని ఎంచుకొని చేయాలి. పాఠకులు చదివాక కొత్తదనం
వుందని అనందిచ గలగాలి.

కిరణ్ కుమార్ చావా:

== నేను అనువాదం ఎందుకు చేస్తాను ==
నా ఆనందం కోసం, మనసుకు రిలీఫ్ గా ఉండటం కోసం. కవిత్వాన్ని సాధన చెయ్యటం కోసం.
అవును, నిజమే, కవిత్వాన్ని కూడా సాధన చెయ్యాలి – సంగీతం వలె. అనువాదాలు
చేస్తుంటే రాశి పెరుగుతుంది. చెయ్యి తిరుగుతుందన్న మాట. అదే అన్ని స్వంత కవితలే
వ్రాయాలంటే హృదయం స్పందించాలి, అది స్పందించాక మనకు ఇంకేమీ పనులు ఉండకూడదు
వాతావరణం, పరిసరాలు అనుకూలంగా ఉండాలి. ఓ ఇలా సవాలక్ష కలిసి వస్తే కవిత
పుస్తకంపైకి వస్తుంది. అదే అనువాదం అయితే ఈ బాధలన్ని ఏం ఉండవు చదువు, అర్థం
చేసుకో, తెలుగులో వ్రాయి. కావాలంటే మధ్యలో ఆపి మళ్లా ఏ వారానికో అయినా పూర్తి
చెయ్యవచ్చు. స్వంత కవిత అయితే మధ్యలో ఆపితే ఇహ అంతే సంగతులు చాలా సార్లు.
ఒక్కోసారి పూర్తి అవుతుంది అనుకోండి.

==అనువాదాలు ఎలా చేస్తారు ==
చదువు, అర్థం చేసుకో, కవితను అర్థం చేసుకో, కవిని అర్థం చేసుకో, కవి మూడ్ కూడా
అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. భావం తెలుసుకోవటానికి ప్రయత్నించు, నువ్వు
అయితే ఎలా వ్రాస్తావో చూడు. (ఒక కవిని మరో కవే సరిగ్గా అర్థం చేసుకోగలడు కదా) ఆ
తరువాత అనువాదం అన్న విషయం మర్చిపోయి ఈ విషయంపై ఒక కవిత సృజించు. అంతే సంగతులు.

==పాఠకుడికి ఉపయోగాలు ==
ఏం లేవు. టైం వేస్ట్ తప్ప 😛 జస్ట్ కిడ్డింగ్. కవితలు మామూలువి చదవటం వల్ల ఏమి
ఉపయోగాలు ఉన్నాయో అనువాద కవితలు చదవటం వల్ల కూడా అవన్నీ ఉన్నాయి.

స్వాతీ శ్రీపాద:
ఆరంభం నించీ ఏ సాహిత్యమైనా ఒక రకంగా అనువాదమే. సంస్కృతం నించి తెనుగుకు ,
ఫ్రెంచ్ లాటిన్ నించి ఆంగ్లానికి. సాహిత్యానికి తొలి దశ లిపి కాదు. చాటువులు, ఆశు కవిత్వం.. లిపి రూపాన
వచ్చినవన్నీ అనువాదాలే. అది ఆదికవుల అసలు రచన మధ్యలో అనువాదకులు ఎంత
కూర్పు చేర్పు చేసారనేది ఎవరు నిర్ణయించగలరు.
ఇహ అనువాదం ఎందుకు అంటే ఇంత చక్కని వ్యక్తీకరణ నాభాషలో ఎలావుంటుందన్న
ఉత్సుకత . చదివిన గొప్ప రచన తమ భాషకు పరిచయం చెయ్యలన్న తహ తహ. మూల
భాషలో చదవలేని వారికి మాధ్యమంగా ఉంటుందన్న ఆశ..

**************

కవితలో క్లుప్తత ఎంత వరకు ఉండాలి ?
ఈ విషయంపై మీమీ ఆలోచనలు చెప్పగలరు.

కిరణ్ కుమార్ చావా:

నా ఉద్దేశ్యం అయితే కొంత వరకు మాత్రమే కవితకు అందాన్నిస్తుంది, మరీ క్లుప్తత
ఎక్కువయితే రామాయణం మొత్తం కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు తయారు అవుతుంది.

ఇంకో విషయమేమిటంటే – క్లుప్తత లేకుండటమే కొన్ని కవితల లక్షణము – ఒకే విషయాన్ని
పలు రకాలుగా చెపితేనే మాధుర్యం ఉంటుంది ఒక్కోసారి. తేనె ఒక్క బొట్టు నాకిన
తరువాత మరలా మరలా చెయ్యి వెళ్తుంది చూడండి ఆలా అన్న మాట. మరీ చెరకు పిప్పిలా
తయారు అవ్వకూడదు అనుకోండి. బేసిగ్గా నే చెప్పొచ్చేదేమిటంటే క్లుప్తత లేకుండా

ఉండటం కూడా కవిత యొక్క ఒక లక్షణం కావచ్చు.

స్వాతి కుమారి:

మంచి అంశం.
మిగతా రచనా ప్రక్రియలతో పోలిస్తే కవిత్వమనేది క్లుప్తం గా భావాల్ని వెలిబుచ్చే
పద్ధతి. ఒక భావానికి సంబంధించి భౌతిక పరిస్థితులనూ, నేపధ్యాన్నీ
ప్రస్తావించకుండానే దాన్లోన్ని సారాన్ని సున్నితం గా పాఠకుడికి స్ఫురింపజేయటం
కవిత యొక్క ఉద్దేశం. కానీ ఇది అన్ని సందర్భాల్లోనూ ఒకేలా వర్తించదు. ఆ కవితలోని
అంశం, ఆ కవితను చెప్పిన సందర్భమూ, దాని నుండి కవి ఆశించిన ప్రయోజనమూ వీటన్నిటి
దృష్ట్యా దానిలోని పదాల పొదుపూ, భావ క్లుప్తతా ఎంతవరకూ అవసరం అనేది
నిర్ణయించగలము.
ఉదాహరణకి వర్ణనలు, ఉపమానాల ద్వారా ఒక రమణీయతను చూపించదలిస్తే ఒక చిన్న వాన
చినుకునో, పువ్వునో కూడా రకరకాల ఉపమానాలతో, వర్ణనలతో కవితలో రాస్తే అందంగానే
ఉంటుంది. అది రచయిత యొక్క టెక్నిక్ నూ, కవితా వైచిత్రిని నిరూపిస్తుంది.
మరి కొన్ని కవితల్లో విస్తృతమైన భావాన్ని అతి తక్కువ పదాల్లో స్పురింపజేయడం
వల్ల రచయిత/కవి లోని గమనింపు(observation), సూక్ష్మ దృష్టీ కనిపిస్తాయి.
ఏదేమైనా కవితలోని ప్రతి ఒక పదమూ ముఖ్యమైనదే. ఒక పదం తీసేసినా ఆ కవిత అందం లో
కానీ, భావం లో కానీ, ఆశించిన ప్రయోజనం లో కానీ ఏ మార్పూ ఉండదు అనిపిస్తే ఆ
పదాన్ని కవి ఉంచకపోవటమే మంచిది. అనవసర పదాలూ, వాక్యాల వల్ల భావమూ, రమణీయతా
పలచబడతాయి.

పెరుగు రామకృష్ణ:
కవిత్వానికి క్లుప్తత ,గాడత ఎంతో అవసరం. కవిత్వాన్ని చక్కటి నగిషీతో
చెక్కిన తర్వాతే మంచి శిల్పం కనిపిస్తుంది. ముకుంద రామారావు కవిత్వంలో
కనిపించే క్లుప్తత ఒక ఆదర్శంగా చూస్తే చాలు. ఆ క్లుప్తత గొప్పతనం అర్ధమౌతుంది.
కవిత రాసాక వృధా పదాల్ని తొలగించి చూస్తే ఎంత అందం వస్తుందో తెలుస్తుంది

దామోదర్ అంకం:
మొన్నటికంటే నిన్న,నిన్నటికంటే నేడు,నేటికంటే రేపు,కాలం విభిన్న
హంగుల్ని సొంతం చేసుకుంటూ,వేగాన్ని పెంచుకుంటూ పరుగెడుతుంది. ఈ కాలంతో
పాటూ  పరుగెత్తాలంటే “క్లుప్తత” అనేది ప్రతీ విషయంలోనూ అవసరం. ముఖ్యంగా
అమ్మ ప్రేమలా యెదను చేరే కమ్మని కవిత్వం లో.
దూరంగా సా…గి పోకుండా, దగ్గరా  వా…లి పోయే కవితలు,రచనలు,పాఠకులను
ఆకర్షిస్తాయి. త్వరత్వరగా గుండె లోతుల్లో నిండిపోతాయి.అందుకే అవసరమైన
మట్టుకు క్లుప్తత కచ్చితంగా ఉండాలి.
కత్తి మహేష్:
దీర్ఘకవితల్ని చదివే ఓపికలేని కాలంలోకి మనమొచ్చేశాం.
కాబట్టి క్లుప్తత చాలా అవసరం. లేకపోతే రాయడానికి మనమున్నా చదవడానికి ఎవరూ
ఉండరు.

ఎమ్.యెస్. నాయుడు:

పై లేఖల్ని చదివాక , “క్లుప్తం” గా ఎలా ఆలోచించాలి, ఎలా రాయాలి, ఎలా
కవిత్వీకరించాలి అనే విషయాల్ని కాకుండా, మన ముందున్న కవిత్వ తరం గురించీ
చెప్పుకున్నా, కొంతలో కొంత ఈ మన కవికృతిలో అనేక విధాలుగా పరిచయాలు
ఎర్పడతాయనుకుంటున్నా.

అసలు కవిత్వం ఎప్పుడూ కురచగానే ఉంది.
ఎన్నో ప్రక్రియల్లో రాస్తున్నప్పటికీ , కవిత్వాంశం అందరికీ చేరదు.
బహుశా, అదే, ” క్లుప్తత”  అనే ప్రశ్నకి దారితీస్తుందా ?

స్వాతికుమారి:

కవిత్వం యొక్క ప్రయోజనమేమిటి?
పాఠకుడికి రసానుభూతిని కలిగించడం లో ఆధివాస్తవిక ధోరణి ఎంతవరకూ
సఫలమౌతుంది?
కవిత్వం పూర్తిగా అర్ధం కావాలా, ప్రత్యేకమైన ఏ అర్ధమూ లేకుండా కేవలం ఒక
దృశ్యాన్నో, అనుభూతినో స్ఫురింపజేసే కవితలు పాఠకులని ఎంతవరకూ
ఆకట్టుకోగలవు?

దామోదర్ అంకం:
అర్ధం కాని కవిత వ్యర్ధం.
కవి,కవితాత్మశరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి,ఒక్కోసారి, ఒక్క పదానికోసం
గంటలు కూడా వెచ్చించి రాసే కవితలు కచ్చితంగా అర్ధం అవ్వాలి. అలా రాస్తే
అర్ధం అవుతాయి కూడా..
ఒక చక్కటి విషయాన్ని నిక్కచ్చిగా చెప్పడం కవిత ముఖ్య లక్షణం.
పాఠకుని మదిని ఆక్రమించి కవితా విషయాన్ని గురించి ఆలోచిపజేయడం కవిత్వ ప్రయోజనం.
ఆదివాస్తవికమైన ధోరణి కవిత్వ పద క్లిష్టత ఆధారంగా చాలావరకు పాఠకునికి
రసానుభూతిని కలిగిస్తుంది. ఈ విషయంలో పాఠకుని భాషా పటుత్వం కూడా ముఖ్య
పాత్ర పోషిస్తుంది.

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

నువ్వాదరిని… నేనీదరిని…

–కొల్లూరి సోమ శంకర్

కథ గురించి:
కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నేపథ్యంలో సాగే “నువ్వా దరిని…… నేనీ దరిని” అనే ఈ కథ రెండు విభిన్న సమూహాల, రెండు రాష్ట్రాల, రెండు విభిన్న మతాల మధ్య సమైక్యతని చాటుతుంది. ఉత్తర దక్షిణ భారతదేశాల సాంస్కృతిక వైవిధ్యతని స్పృశించే ఈ కథ తనకంటూ ఏ రాష్ట్రమూ లేని ఓ సింధీ యువకుడి ఆవేదనకి అద్దం పడుతుంది. అన్ని రాజకీయ సరిహద్దులు మానవ తప్పిదాల్లా అనిపిస్తాయతనికి. రాజకీయ “సరిహద్దుల” సమస్యపై ఈ కథ వ్యంగ్యాత్మక చెణుకులు విసురుతుంది.

ఇక చదవండి … నువ్వాదరిని…… నేనీదరిని

—————————————-

ధూళి మేఘాలు ఒక్కసారిగా పైకెగసి, గాలినంతా దుమ్ముతో నింపేసాయి. ఆఖరి సిమెంటు లారీ నుంచి బస్తాలు దించేసారు. దూరం నుంచి లయబద్ధంగా సాగే “హై హై హొ హొ” అనే శబ్దాలు వినబడుతున్నాయి. రేగిన దుమ్ము సర్దుకున్నాక, వంతెన ఐదవ, ఆఖరి స్తంభంపైకి వీపుపై సిమెంటు బస్తాలు మోసుకెడుతున్న వందలాది శ్రామికుల అర్థనగ్న శరీరాలు ఊగుతూ కనబడ్డాయి.
నది ఒడ్డుపై నుంచి “పొంగు ” పరిగెత్తుకొచ్చాడు.
“సార్. ….యాక్సిడెంట్….” అంటూ రొప్పుతూ అరిచాడు. “201 నెంబరు ‘మెండు’ మంచెపై నుంచి పడిపోయాడు….”
“అంబులెన్స్ పిలవండి….త్వరగా …..” అని చెబుతూ, “అతను మునిగిపోయాడా?” అంటూ రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న వర్క్స్ సూపర్‌వైజర్‌ని ఉద్దేశించి గట్టిగా అరిచాను.
“వాపిలో పడ్డాడు…..” అంటూ అతను కూడా గట్టిగా అరిచాడు.
అప్పటిదాకా లయబద్ధంగా సాగుతున్న ‘ హై హై హొ హొ ‘ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. రాళ్ళను పగలగొట్టే గ్రైండర్ కూడా ఆగిపోయింది. పైకి వెడుతున్న వంద టన్నుల క్రేన్ వేగం మందగించింది. ఆడ, మగ, పిల్లలు తమ జీవితాలను పట్టించుకోకుండా నిర్మాణంలో ఉన్న వంతెన వైపు పరిగెడుతున్నారు.
“ఆపండి…వాళ్ళని ఆపండి…” అంటూ వర్క్స్ సూపర్‌వైజర్‌కి చెప్పాను. అయితే, వేలాది శ్రామికుల ఉత్సుకతని, అందులోను ఆ ఘటన వారిలో ఒకరికి సంబంధించినదైతే ఆ ఉత్సుకతని ఆపడం మరీ కష్టం..!
నేను అందుబాటులో ఉన్న పడవ ఎక్కాను, ప్రమాదం జరిగిన స్థలానికి త్వరగా చేరుకోవాలని. మార్గమధ్యంలో ప్రభుత్వ లాంచి ఎదురైంది. అందులో ఉన్న చీఫ్ ఇంజనీర్ రంగనాథరావు ఆందోళనగా ఉన్నారు.
“మళ్ళీ యాక్సిడెంటా? ఈ వంతెన ఇప్పటికే చాలామందిని బలి తీసుకుంది…” అన్నారాయన లాంచి మీదుగా చూస్తూ.
కృష్ణానదిపై కడుతున్న ఆ వంతెనకి ఆధారంగా ఉన్న ఐదవ స్తంభం వద్దకి మేము వేగంగా కదిలాం.

నీటిలో మునిగిన కూలీని గబగబా పైకి తీసి, ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాదిలో ఇది ఐదో ప్రమాదం.
లయబద్ధంగా సాగే ‘ హై హై హొ హొ ‘ ధ్వనులు మళ్ళీ మొదలయ్యాయి. క్రేన్ వృత్తాకారంలో తిరగసాగింది. గ్రైండర్ రాళ్ళని ముక్కలు చేసే తన పనిని మళ్ళీ మొదలుపెట్టింది. శ్రామికులు అనేక బారులలో పైకి కిందకి వడివడిగా ఆవేశంగా కదులుతున్నారు.
ఓ వంతెన నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే, దాన్ని కళ్ళారా చూడాల్సిందే. ఇరవై నాలుగు గంటలూ, రాత్రింబవళ్ళూ, బుల్‌డోజర్లు, భారీ క్రేన్లు, గ్రైండర్ల నేపథ్యంలో మానవ శరీరాలు హుందాగా కదులుతూంటాయి. ఓ నది రెండు తీరాలను కలపడానికి మనుషులు యంత్రాలు పొందికగా పనిచేస్తారు. ఆ నది కృష్ణా అయితే, ఇంక చెప్పేదేముంది? సహ్యాద్రి పర్వతాలలో పుట్టి, కర్నాటకలోకి….. తన జన్మస్థలానికంటే ఎన్నో విధాలుగా భిన్నమైన, విశాలమైన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. నేను కృష్ణా నదిని మొదటిసారిగా ‘వాయ్ ‘ దగ్గర చూసాను. అక్కడ నదీ ప్రవాహం ఓ జలపాతంలా, ఇరుకైన కొండల మీద నుంచి, రాళ్ళ మీదుగా కిందకి జారుతూ, బండరాళ్ళకున్న పగుళ్ళ మధ్యలోకి చేరి ఓ సన్నని ధారగా కనిపించింది. మహాబలేశ్వరంలో ఉండగా నాకు టెలిగ్రాం వచ్చింది, కృష్ణానదిపై వంతెన కట్టేందుకు నేను బిర్కోండ్వా వెళ్ళాలని.
“నేను చెప్పలేదు? కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలని? లేకపోతే స్తంభం ఎలా నిలబడుతుంది? ” అన్నారు రంగనాథరావు కోపంగా. “మీ కుర్రాళ్ళకు వేరే ఆలోచనలుంటాయి. ప్రాచీన ఆచారాలలోని ప్రయోజనాలని మీరు విశ్వసించరు….”
బదులుగా, “ఓ కొబ్బరికాయ ప్రమాదాలను ఎలా అరికట్టగలుగుతుంది?” అంటూ అరుద్దామనుకున్నాను. కానీ ఆయన వయసులోను, హోదాలోను నాకన్నా చాలా పెద్దవారు. ఆయనతో గొడవ పెట్టుకునేంత సాహసం నేను చేయలేను.
“చూడబ్బాయ్, మనం వెంటనే ఓ కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలని నేనంటాను. అప్పుడు మాత్రమే యాక్సిడెంట్లు ఆగుతాయి…” అని అన్నారాయన. నా అంగీకారంతో సంబంధం లేకుండా, దురదృష్టవంతుడైన ఆ 201 నెంబరు కూలీ పడిపోయిన మంచెపైన పూజకి ఏర్పాట్లు చేయమని తన సిబ్బందికి ఆదేశాలిచ్చేసారు.
సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున కృష్ణా నదీ తీరంలో ఒక లాంచి ఇరుక్కుపోయింది. ఆ రోజు నదిలో అలలు బలంగా ఉన్నాయి, నది పొంగుతోంది కూడా. లాంచి ఏ మాత్రం కదల్లేదు.
అప్పుడు రంగనాథరావు గారు కొబ్బరికాయతో వచ్చారు. నిజానికి కొబ్బరికాయని, ఇతర పూజాసామాగ్రిని వెండి పళ్ళెంలో పెట్టుకుని తెచ్చింది ఆయన కూతురు గాయత్రి . కొబ్బరికాయ కొట్టారు . కొబ్బరినీళ్ళని లాంచి ముందు భాగం నుంచి నదిలో పోసారు. సరిగ్గా అప్పుడే లాంచి కదిలింది. అనూహ్యం! నిజం! అసలే మాత్రం నమ్మశక్యం కానిది! నాకు కోపం వచ్చింది. కాదు, కాదు ఈ అద్భుతం పట్ల నాకు ఆగ్రహమే కలిగింది. ఇంత పెద్ద లాంచిని ఓ చిన్న కొబ్బరికాయ కదిలించింది. ఇంతకు ముందు ఐదుగురు స్ట్రక్చరల్ ఇంజనీర్లు లాంచిని కదపడానికి విశ్వప్రయత్నం చేయగా, అది కదలకుండా అలాగే మొండిగా ఇసుకలో నిలుచుంది. రంగనాథరావు గారు కొబ్బరికాయలు కొట్టి నదిపై వంతెన నిర్మించగలరు కాబట్టి నన్ను ఉద్యోగంలోంచి తీసేయమని నా యజమానులైన ఎబిసి కన్‌స్ట్రక్షన్స్ వారికి ఉత్తరం రాద్దామనుకున్నాను. గాయత్రి తలెత్తి చూసి పెద్దగా నవ్వింది. తెరలు తెరలుగా వినబడిన ఆ నవ్వు నా కోపాన్ని చల్లార్చింది.
“ఏం విచిత్రం? తమాషాగా ఉంది కదా నాన్నా?” అంది గాయత్రి.
“ఇందులో విచిత్రం ఏముంది? …. ” అన్నారు రంగనాథరావు ఆక్షేపణగా.
“ఏమో నాకు మాత్రం విచిత్రంగా అనిపించింది” అంటూ మళ్ళీ నవ్విందామె. తర్వాత గాయత్రి గబగబా గట్టు దిగింది, అలా దిగడంలో ఆమె కొద్దిగా నీళ్ళలోకి జారినట్లయింది. వాళ్ళ నాన్నతో పాటు జీపులో ఎక్కి కూర్చుంటూ..” రేపొద్దున్న ఇక్కడికి రావాలి. ఉదయం పూట ఈ ప్రాంతమెంతో బాగుంటుంది” అని అంది.
ఆ నవ్వు నా చుట్టూ ప్రతిధ్వనిస్తుండగా ఆ చిమ్మ చీకట్లో నేనలాగే నిలబడిపోయాను. ఆ నవ్వు కృష్ణవేణి మానవాకారం ధరించి వచ్చినట్లుంది.
అవతలి ఒడ్డున ఓ క్రమంలో ప్రకాశిస్తున్న హరికేన్ లాంతర్లు వెలుగురేఖలని ప్రసరిస్తున్నాయి. వందలాది గుడిసెల మధ్య విహారం చేస్తున్నట్లుగా ఇటుకలతో కట్టిన ఓ ఇల్లు ఉంది. దానికి అలంకారంలా చుట్టూ ఆకుపచ్చని గుడారాలు ఉన్నాయి. ఆ ఇల్లు రంగనాథరావు గారిది. మా ఒడ్డు వైపు కూడా వందలాది గుడిసెలు ఉన్నాయి. ఎబిసి కన్‌స్ట్రక్షన్స్ వారి సిబ్బంది కోసం కట్టిన నాలుగు తాత్కాలిక భవన సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వం వారి ఫైళ్ళ ప్రకారం మేము ఎడమ గట్టు మీద, ప్రభుత్వ సిబ్బంది కుడి గట్టుపైన నివాసముంటున్నాము.
రంగనాథరావు గారుంటున్నది కేవలం అవతలి గట్టు పైనే కాదు, అది మరో రాష్ట్రం ….. కర్నాటక! మనిషి దేవుడైతే, నదులను తన రాష్ట్రంలో మాత్రమే ప్రవహించేంత పరిమాణంలో సృష్టించేవాడేమో! కాని మనిషి దేవుడు కాదు. నది తన గమనాన్ని కొనసాగించాల్సిందే. ఐదేళ్ళ క్రితం ఈ వంతెన నిర్మాణం కోసం ప్లానింగ్ కమీషన్‌కి, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్‌కి ప్రతిపాదనలందాయి. అప్పటి పోలీసు కాల్పులలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఆందోళనలు, ఘెరావ్‌లు, సత్యాగ్రహాలు జరిగాయి. ఒక వర్గం వంతెన మహారాష్ట్రలో ఉండాలని అంటే, మరో వర్గం వంతెన కర్నాటకలో ఉండాలని పట్టుపట్టింది.
వాస్తవానికి ఈ సరిహద్దుకి 25 మైళ్ళ లోపు ఎటువంటి తేడాలు లేవు. మహారాష్ట్రులు కన్నడం మాట్లాడుతారు. చాలామంది కన్నడిగులు తమ జీవన రీతుల ప్రకారం మహారాష్ట్రులే, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో ఉండేవారికి ఏమాత్రం తీసిపోరు. గాయత్రినే ఉదాహరణగా తీసుకుందాం. ఆమె మరాఠీ మాత్రమే మాట్లాడగలదు. మరో భాష…మరాఠీ కన్నడాల సమ్మిళిత మాండలీకం కొంకణి…మాట్లాడేవారు మరి కొందరు ఇక్కడ ఉన్నారు.

వంతెనలో సగ భాగం మహారాష్ట్రలోను, మరో సగ భాగం కర్నాటకలోను ఉండేలా స్థల నిర్ణయం చేయాలని మా కంపెనీకి ఆదేశాలందాయి. మానవుడి రాజీ ప్రయత్నాలకు భగవంతుడు సైతం కొన్నిసార్లు ఊతమిస్తాడు. సరిగ్గా ఇక్కడే అంటే బిర్కోండ్వా వద్ద నది విశాలంగా ఉంటుంది, మా డిమాండ్లకు అనుగుణంగా ఉంటుంది. నీటి మట్టం ఓ మాదిరిగా ఉంటుంది. నదీగర్భం కొంత మెత్తగాను, కొంత దృఢంగాను ఉండి మాకు అనుకూలంగా ఉంది. ఇసుక ఉన్నట్లే, రాళ్ళు ఉన్నాయి. ప్రమాదకరమైన బావులున్నట్లే, అక్కడక్కడ మెత్తని అడుగునేలలు ఉన్నాయి. విచిత్రం! ఇక్కడ వంతెన నిర్మించడం సరైనది. రెండు రాష్ట్రాల పట్ల సముచితంగా వ్యవహరించినట్లుంది.
“ప్రకాశ్ …” అంటూ నన్ను పిలుస్తోంది గాయత్రి. తను ప్రభుత్వం వారి పడవలో ఉంది.
” మీ అమ్మగారు వచ్చారా? …. ”
” వచ్చింది. నిన్న సాయంత్రం. …. ” అంటూ బదులిచ్చాను.
” నేనొచ్చి ఆవిడని కలుస్తాను …. ”
” తప్పకుండా. నువ్వెప్పుడైనా రావచ్చు…. ”
నైలాన్ చీరలో గాయత్రి కొంచెం కొత్తగా కనపడింది. జడని ముడేసి బన్‌లో పెట్టుకుంది. ఆమె కళ్ళలో చిరునవ్వు.
” నేనసలు పొద్దున్నే వద్దామనుకున్నా. కాని ఆ యాక్సిడెంట్ వలన…. ”
” నువ్వక్కడ కనిపిస్తే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చావేమోనని అనుకున్నాను…. ”
” ఛ..ఛ..నాకలాంటి నమ్మకాల్లేవు. ఏదో మా నాన్న మాటని కాదనలేక…. ”
” అయితే నీకిలాంటి విషయాలలో నమ్మకం లేదన్నమాట? …. ”
” ఏమో! కొన్నిసార్లు అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. పైగా శుభారంభం కోసం కొబ్బరికాయ కొట్టడం మన ఆచారం…. ”
” అవును నిజమే…. ”
గాయత్రి నాకేసి చూసి సిగ్గు పడింది. హాయిగా నవ్వుకుంటూ, స్వేచ్ఛగా తిరుగుతున్న బంజారా కూలీల వెనుక మేమిద్దరం నడుస్తున్నాం. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు వాళ్ళు ధరించిన ఎంబ్రాయిడరీ దుస్తులలోని అద్దాలపై పడి మెరుస్తున్నాయి. కాసేపు అలా తిరిగాక, గాయత్రిని వాళ్ళింటి దగ్గర దింపి నేను మా ఇల్లు చేరాను.
నన్ను చూడగానే, ” నీకీ మదరాసీ పిల్ల ఎలా నచ్చిందిరా బాబు?…. ” అంది మా అమ్మ. నాకు బాధనిపించింది.
” అమ్మా తను మదరాసీ కాదు. ఇక్కడి అమ్మాయే. తను చాలా కాలం పాటు బొంబాయిలో గడిపింది…”
“కానీ ఆ పిల్ల చూడడానికి మదరాసీలానే ఉంది…”
60 ఏళ్ళ వృద్ధాప్యంలోను అమ్మ శరీరం తెల్లగా మెరిసిపోతోంది. దక్షిణమంటే మద్రాసని, ఉత్తరమంటే పంజాబని మాత్రమే అమ్మకి తెలుసు.
“అమ్మా, తనే ప్రాంతానిదైతే మాత్రం ఏమయింది? ఈ విషయం మీద మనం ఇంక మాట్లాడుకోవద్దు…”
అమ్మ తలపై నుంచి కొంగు కప్పుకుని, తన జపమాల తీసి జపం చేసుకోసాగింది. మధ్య మధ్య పైకి వినబడేలా గొణుగుతోంది.
” నువ్వు బదిలీ కోసం ఎందుకు ప్రయత్నించవు? ఈ నిర్జన ప్రదేశంలో ఇంకెంత కాలం ఉంటావు? …”
” వంతెన పూర్తయ్యేదాక ఇక్కడే ఉండాలి…” అని అన్నాను. ఆ సంగతి అమ్మకి కూడా తెలుసు.
స్థానికంగా ఘర్షణలు జరిగాకా, ఓ లౌకికవాదిని, ఏ పక్షం వైపు మొగ్గు చూపని ఇంజనీరుని నియమించమని మా కంపెనీకి ఆదేశాలందాయి. నాకంటూ ఓ రాష్ట్రంలేని ‘ సింధీ ‘ని నేను తప్ప; ఎటువంటి సరిహద్దులైనా చారిత్రక తప్పిదాలేనని భావించే నాలాంటి వాడు తప్ప…. ఈ పనికి మరెవరు దొరుకుతారు? తన తండ్రి ముఖంలో దేశ విభజన యొక్క బాధని, దుఃఖాన్ని చూసిన కుర్రాడికి, సంస్కృతిలో తన మూలాలు తెలియకుండా పెరిగిన వ్యక్తికి కృష్ణా, కావేరి, గంగ లేదా గోదావరి…. ఏ నదిపై వంతెనైనా ఆశలను కల్పిస్తుంది, కొత్త ఊపిరులందిస్తుంది. కృష్ణానది రెండు తీరాలను గమనించాను. రెండు ఒడ్లు ఒకే రంగులో ఉన్నాయి, కందకాల మరకలతోను, చిట్టడవులతోను, అక్కడక్కడ మామిడి చెట్లతోను ఒకే రకంగా ఉన్నాయి. వేసవిలో ఎండ వలన కోల్పోయే ప్రవాహం ఓ మాదిరిగా ఉంటుంది, ఆ నీరు కూడా నదీ గర్భం నుంచే పోతుంది. అయినా, ఆ ఒడ్డు ప్రత్యేకమైనది; కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రంగనాథరావు గారికి నివాస స్థలం!
ఆ రాత్రి గాయత్రి వాళ్ళింటికి వెళ్ళాను. మాటల మధ్యలో అమె తన జాతకం గురించి, వాళ్ళ బావ అశోక్ గురించి ఏవో గొణిగింది. నా మనసు గాయపడకూడదని…. “నదికి ఇటు వైపు నా బంధువర్గం, నా మూలాలు, నా ఎముకలు, నా ఆత్మ, మొత్తం నా ఉనికే ఉంది. నది దాటాలని చూస్తే నేను మునిగిపోతాను …” అని అంది.
నాకేం మాట్లాడాలో తెలియలేదు.
“మానవ జీవితపు సార్వజనీనతనే తీసుకో! ఆచారాల, అలవాట్ల, జీవనశైలుల నైతిక సామాజిక విలువలు అంతగా ప్రాముఖ్యత లేనివి, కొన్నిసార్లు నిరుపయోగమైనవి కూడా. అయినప్పటికీ ప్రతి సమాజం విడివిడిగా విభిన్నమైనదే. నీకు నాకు అడ్డుగా నిలిచేదేదీ లేదు గాయత్రి. నేను నీ నుంచి మైళ్ళ దూరంలో ఉన్నానని నేననుకోడంలేదు. నాకు కావల్సిందల్లా సంధానమే. పరిస్థితి నీకర్థమవుతోందా? లేదంటే నన్ను నా మానాన అవతలి ఒడ్డున ఉండిపొమ్మంటావా? ” అన్నాను. నేను ఏదేదో మాట్లాడి మరిన్ని సందేహాలు కలిగించాను, మరిన్ని నిర్వాదాలని జోడించాను.
గడచిన నాలుగు నెలల్లో వంతెన పెరగడం, ఆవలి తీరాన్ని తాకడం చూస్తునే ఉన్నాను.

ఈ వంతెనని ఎవరు ప్రారంభిస్తారు? ఇంకెవరు కేంద్ర మంత్రే.! ఎప్పుడు ప్రారంభిస్తారు? ఆయనకి తీరిక కుదిరినప్పుడు!
నదికి రెండు వైపులా ఉన్న వాళ్ళు ఆ వంతెనని ఎప్పుడెప్పుడు వాడుకుందామా అని తహతహలాడుతున్నారు. నిజానికి, తక్షణమే ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. కాని స్థానిక రాజకీయ నాయకులు పట్టు వీడడంలేదు. ఈ వైపు ఒడ్డున బంజారాలు మూటాముల్లె సర్దుకుని ఎప్పుడో వెళ్ళిపోయారు. బంజారా స్త్రీలు మెరుస్తున్న దుస్తులు , వెండి ఆభరణాలు ధరించి నడవడం; వారి సామాన్లు వస్తువులు జాగ్రత్తగా మూటలు కట్టి గాడిదలపై మోసుకెళ్ళడం లేదా బండి గుడారాలను తోసుకుపోడం, విశ్వాసం కలిగిన కుక్కలు వాళ్ళని అనుసరించడం…… ఇదంతా ఓ ఉత్సవంలా సాగింది. తమ తమ తాత్కాలిక ఇళ్ళను కూల్చేస్తున్నప్పుడు వారిలో కొంత విషాదం, మరికొంత ఆనందం. కాసేపు నవ్వుకున్నారు, కాసేపు కన్నీరు కార్చారు. తమ జీవితాలలో కొన్ని సంవత్సరాల పాటు సరిపోయేంత ధనాన్ని ఈ వంతెన వారికందించింది.
అవతలి ఒడ్డున వంతెన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు హడావుడిగా జరుగుతున్నాయి. పడవలన్నీ తీరానికి కొట్టుకొచ్చాయి, లాంచిలను ఒడ్డుకీడ్చేసారు. క్రేన్‌ని విప్పేస్తున్నారు. వేడెక్కిన గ్రైండర్ తొలి వర్షపు చినుకులకు చల్లారిపోయింది. గాయత్రి కూడా, తన తల్లిదండ్రులతో పాటు బెల్గాం వెళ్ళిపోడానికి సామాన్లు సర్దుకుంటోంది. ఆమె ప్రయాణం రేపే. నేను కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను. నా యజమానులు..అంటే మా కంపెనీ డైరక్టర్లు రేపిక్కడకి వస్తున్నారు. వేరే వంతెన నిర్మాణానికి ఇంకో చోటికి వెళ్ళడానికి నేను అంగీకరించను.
ఒకప్పుడు కూలీలు పొయ్యిలపై వంటలు చేసుకోగా గుంటలు పడి, ఎండి పోయిన ప్రాంతం నుంచి ‘దోండీ ‘ వస్తూ కనపడ్డాడు.
నా దగ్గరికి రాగానే, ” చెప్పు ” అని అన్నాను.
“కొత్త గుడి చాలా బావుంది. వస్తారా, వెళ్ళి చూసొద్దాం.” అని అన్నాడు. వంతెన మొదట్లో ఓ గుడి కట్టారు. అక్కడికి చేరుకున్నాం. అదొక చిన్న దీర్ఘ చతురస్రాకారపు నిర్మాణం, పైన గోపురం ఉంది. లోపల వినాయకుడి, హనుమంతుడి, కృష్ణుడి విగ్రహాలున్నాయి. వాటికి సిందూరం పూసారు.
“దీన్ని కట్టినందుకు లేబర్ ఛార్జిలు…?” అని అడిగాను.
” లేదు. ఇది ఉచితం! బంజారాలు స్వచ్ఛందంగా కట్టారు. డబ్బులేమీ తీసుకోలేదు.”
తమకు మూడేళ్ళ పాటు అన్నం పెట్టిన నదికి కృతజ్ఞతగా, వంతెన నిర్మాణం పూర్తయ్యాక, మిగిలిపోయిన ఇటుకలు, రాతి సున్నం, ఇనుముతో కూలీలు ఆ గుడిని కట్టారు
“మరి విగ్రహాలు…?” అడిగాను.

“ఈ విగ్రహాలు పెద్ద ఖరీదేం కాదు, స్థానికంగా తయరైనవే. విగ్రహాల ఖర్చును రంగనాథరావు గారు పెట్టుకుంటానన్నారు. రేపు వేలాదిమంది గ్రామస్తులు వచ్చి కానుకలు సమర్పించుకుంటారు. ”
“అలాగా…”
వంతెన యొక్క పొడవు వెడల్పులని చూస్తుంటే గుడి చాలా చిన్నగా కనిపిస్తోంది. కాని వింతగా, దాని వలన వంతెనకి నిండుదనం వచ్చినట్లుంది. గుడి బయట కూర్చున్నాను…. ఇంటికి వెళ్ళి నన్ను నేను ఎదుర్కోడం ఇష్టం లేక!
సాయంత్రం, వంతెనని చూడడానికి గ్రామస్తులు చాలా మంది వచ్చారు. ప్రభుత్వోద్యోగుల పిల్లలు కూడా వంతెనపై వేసిన తారు రోడ్డుమీద ఉత్సాహంగా పరిగెత్తారు. రకరకాల మనుషులున్న ఆ గుంపులోంచి గాయత్రి ప్రత్యక్షమైంది. నా ముందు నిలుచుంది.
ఆమె విచారంగా ఉంది.
“గుడి బావుంది” అని అంది.
“అవును”
” ఏం ఆలోచిస్తున్నావు?”
” ఈ వంతెన రూపకల్పన నేనెందుకు చేసానాని……..”
నా మాటలు ఆమెని బాధించినట్లున్నాయి. ఆమె ముఖంలో వ్యధ గోచరించింది. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, ” ఎందుకంటే నదిని దాటి నేను నీ దగ్గరికి వచ్చేందుకు” అని అంది.
ఈ మాటలకి కృష్ణమ్మే సాక్ష్యం!
* * *
ఆంగ్ల మూలం: అరుణా జేఠ్వాని

అరుణా జేఠ్వాని

శ్రీమతి అరుణా జేఠ్వాని గారు వృత్తిరీత్యా అధ్యాపకులు. రచనలు వీరి ప్రవృత్తి. పూనేలోని ఓ సుప్రసిద్ధ మహిళల కాలేజికి ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం అనేక విద్యా సంస్థలకు సేవలందిస్తున్నారు. అరుణగారు రచయిత్రి, కాలమిస్ట్, ఇంకా చిత్రకారిణి కూడా. అరుణగారు రాసిన ” ఎ బ్రిడ్జ్ ఆన్ రివర్ కృష్ణ ” అనే కథకి జాతీయ సమైక్యతకి గాను 2001లో రాజాజీ అవార్డ్ లభించింది. వీరి రచనలు ఎన్నో జాతీయ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ నుంచి కథలను, కవితలను ఆంగ్లంలోకి అనువదించారు. మరిన్ని వివరాల కోసం http://www.arunajethwani.com అనే వెబ్‌సైట్ చూడవచ్చు.

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 74 అనువాద కథలు, 30 దాకా స్వంత కథలు (10 పిల్లల కథలతో సహా) రాసారు. ఒక చిన్న పిల్లల నవలను, యోగకి సంబంధించిన రెండు నాన్- ఫిక్షన్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు. సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగును చూడవచ్చు

Posted in కథ | 2 Comments

కవికృతి-౧౦

౧.

-చావా కిరణ్:

ఉదయాన్నే గుసగుసలు
మనిద్దరం కలిసి పడవపై
కేవలం మనిద్దరమే సుమా,
అలా అనంత తీరానికి
ఆనంద లోకానికి వెళ్తామని
ఉదయాన్నే గుసగుసలు.
—-
అంతే లేని సముద్రంపై
నీ నగుమోము చూస్తూ
అలల్లా పూర్ణస్వేచ్చతో
బంధనాలు లేని పదాలతో
నా పాటలు పరవశిస్తాయి.
—-
ఇంకా ఆ ఘడియ రాలేదా
ఇంకా పని మిగిలేఉందా
అయ్యో, సాయంత్రం తీరం చేరిందే.
మసక వెలుగులో సముద్ర-
పక్షులు గూటికి మరలాయే.
—-
ఎవరికి తెలుసు?
సంకెళ్లెప్పుడు తెగుతాయో.
సాయంత్రపు చివరి కాంతిరేఖలా
పడవ ఎప్పుడు చీకట్లోకి సాగుతుందో
ఎవరికి తెలుసు ?
=====
Early in the day it was whispered that
we should sail in a boat, only thou and
I, and never a soul in the world would
know of this our pilgrimage to no
coimtry and to no end.

In that shoreless ocean, at thy silently
listening smile my songs would swell
in melodies, free as waves, free from all
bondage of. wprds^

Is the time not come yet? Are there
works still to do? Lo, the evening
has come down upon the shore and in
the fading light the seabirds come
flying to their nests.

Who knows when the chains will be
off, and the boat, like the last glimmer
of sunset, vanish into the night?

౨. కళ్లం

– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి:

ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు
జీవితాన్ని పంటకళ్ళం చేసేంత ఓపిక ఎవరికుందని?
తొలికోడి కూతకీ ఎద్దుల గాడికీ మధ్య
మనిషి వాసన లేదు_ట్రాక్టెర్ కమురు కంపు తప్ప
పేడతో అలికిన కళ్ళానికీ పంట కంకులకూ మధ్య
నూర్పిళ్ళపొలికేకల్లేవు _మిషన్ దబాయింపులు తప్ప
తూరుపెత్తే చేటలుండవు
చేట పొలివిసిరే చేతులుండవు
చేతముద్దబెట్టే ఇల్లాలుండదు
ఇల్లాలి కొంగునిండా గింజలుండవు
దండె కట్టు ఉండదు చెత్త తొక్కిళ్ళు ఉండవు
పశువుల బంతి ఉండదు
వృత్తిపనివాళ్ళ కదలికలుండవు
పంట ధాన్యంగా మారే అపురూప దృశ్యానికి
ఇప్పుడు కళ్ళం రంగస్థలం కానే కాదు
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు

కళ్ళమంత హృదయాలు ఇక్కడ ఎవరికున్నాయని ?
పదహారు చేతుల వ్యవసాయం
ఇప్పుడు రెండు చేతుల కింద లొంగిరాక
రైతు బతుకు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటోంది
సంకటి ముద్దల శ్రమ సౌందర్యం కాస్తా
డబ్బు కాగితాల అంచుల రాపిడికి
గాయాల పాలై గిల గిల గింజుకుంటోంది
గట్టు మీద పచ్చని పిలుపుల్లేక
వాన చుట్టాలు నేలకు దిగటం లేదు
వృత్తి నాళాలకు చమురందక
బోరుబావి జలదీపాలు వెలగటం లేదు
కళ్ళుమూసుకు పోయిన కంకుల నుదుటిమీద
వ్యవసాయం ఆయుర్ధాయం రాయబడివుంది.
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితేచాలు

పచ్చిపేడ గంప బరువున్న మానవ సంబంధాలను
ఎవడు మోస్తాడని?
గోడకింద పసలగాడీ ,దొడ్డిలో గడ్డివామీ
చేలల్లో పచ్చిగడ్డీ కడుగునీళ్ళతొట్టీ, దాణా బుట్టీ
ఎద్దుల్లేకుంటే ఇవేమీ అఖ్ఖర్లేదు గదా?

కమ్మరి కుమ్మరి మాలా మాదిగా వడ్రంగీ చాకలీ
పండిన గింజగింజలో వాటా దారులైన కులవృత్తులన్నీ
కళ్ళం లేకుంటే ఈ స్వరాలేవీ పల్లెలో నిలువవుగదా!
పిచ్చుకలకు గింజలు దొరకవు. చీమలకు నూకలు రాలవు
నాణ్యమైన కంకులు వచ్చి మిద్దె దంతెలకు వేళ్ళాడవు
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు
గాదెలు గరిసెల్నిఏకొంప నిలబెట్టుకొందని
మనిషి అస్థిత్వమంతా అతని జేబులోనే ఒదిగిన తరువాత

౩.

-కిరణ్ కుమార్ చావా

నే కళ్లు తెరిచే సరికే
రంగు రంగుల రెపరెపల
ఈ లోకం ఇలాగే ఉంది.
మాట సాయం కావాలన్నా
చేత సాయం కావాలన్నా
ఆపదలందయినా మరి
ఆనందాలందయినా సరి
వడ్డీల లాభాల లెక్కలే.
బంధుత్వానికైనా
స్నేహిత్వానికైనా
వియ్యానికైనా
సహజీవనానికైనా
రంగు కాగితాలే సాక్షి.
ఎప్పుడో ఇలా లేదంట
ఎవరి జ్ఞాపకాల్లోనో
ఇంకా బ్రతుకుతున్న
ఆ లోకం చూట్టమే లేదు.
కల్పన కూడా కష్టమే.
జ్ఞాపకాలే కల్పనేమో.

౪.నిజం

– స్వాతీ శ్రీపాద

వేల వేల ఆశల్ను అదృశ్యంగా భుజాన మూట కట్టుకుని
ఏదో సాధించాలని మరేదో మిస్సయిపోతున్నానని
హడావిడిగా ఈ లోకం వాకిట్లోకి ఊడిపడ్డా
కళ్ళు విప్పకముందే మనసుల  కుళ్ళు వాసన
జన్మ జన్మాంతరాల మురికి కూపాల్ను ముందుకు లాక్కు వస్తోంది
రక్త మాంసాలు పంచిచ్చిన అమ్మ
మౌనం ఊబిలోకి తొంగిచూస్తే
ఈ బిడ్డ ఆడదే కావాలా నా ఖర్మ కాకపోతే మళ్ళీ కొడుకంటారు
మాటిమాటికీ చచ్చి బతికే పిల్లల యంత్రాన్ని కాక తప్పదా?
అప్పుడు తన్నుకు వచ్చింది కేరు మంటూ ఏడుపు
ఎంత దగా ఎంత దగా …. ఇదేనా ఈ లోకం నాకు పలికే స్వాగతం.
పక్కనే హడావిడి పడి పోతున్న వైద్యుడి
అంతరంగసొరంగాలను తడిమితే మూగ భావాలు
శిశిరపు ఉషోదయం లో నును లేత ఆకు కొసల్నిఒంచి జారే
మంచు స్పటికాల్లా
ఎన్ని రంగులను కలబోసుకున్నాయి?
లేత గులాబీలు నూరి ముద్దచేసి పోత పోసినట్టున్న ఈ పిల్ల
పదహారేళ్ళయాక ఎందరి గుండెల్లో రాజుకునే నిప్పురవ్వవుతుందో
అప్పటికి నా యౌవనం వయసు చెల్లిపోతుందే ………
అప్పుడనిపించింది నాచూపుకు లేజర్ శక్తి వుంటే
ఈ మూర్ఖత్వం బూడిద చెయ్యనా అని
ఒక వ్యామోహపు తెర తొలగి ఒక భావాతీత చైతన్యాన్నై
నా దిశ నిర్దేశించుకున్నాను
చూపుడూ వేలేత్తి లోకాన్ని బెదిరిస్తూ …..
దగాజిలుగు తోలుకప్పుకున్న మనసుల్లో
నగ్నంగా జుట్టిరబోసుకుని నర్తించే
ఈ వికృత రూపాలకు విమోచన నవ్వాలి
నేను నేనవాలి
అంతే కాని ఈ బిడ్డనో ఆ బిడ్డనో కాదు…
పులి బిడ్డనవ్వాలి.

౫.ఇప్పుడు వీస్తున్న గాలి

-స్వాతీ శ్రీపాద

ఇప్పుడు వీస్తున్నగాలికి
ఒళ్ళంతా ముళ్ళు మొలుస్తున్నాయి
లోలోన రాళ్ళు పెరుగుతున్నాయి
నరనరాన పాతేసిన గత కాలం చెత్తంతా తవ్విపోసి
తాతల నాటి శవాలవద్ద
తలవాకిట జాగారానికై
మాటలు కునికిపాట్లు పడుతున్నాయి
హైటెక్ జీవన విధానాలు హైటెక్ సంస్కృతీ
బాహ్యసౌందర్యానికి నగిషీలు చెక్కుతూ
నాగరికత తాపత్రయ పడుతున్నా
లోలోపల ఎక్కడో ఇంకా
వెలికి తలెత్తి మొలకెత్తని మొక్క
పదిలంగా తొలి పత్రాల వెచ్చని పొత్తిళ్ళలో
కలలుకంటూనే
మగతా మెలకువల మధ్య
కాలాన్ని కొలుస్తున్నవేళ
దీర్ఘకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న
పాత తరాన్ని తట్టి లేపి
ఆధునిక నడి వీధిలో గుడ్డలిప్పి ప్రదర్శించటం
సిగ్గు సిగ్గు
నరం లేని నాలుకపై
పరుషిస్తున్న తిట్లదండకాలు
ఇప్పుడు వీస్తున్నగాలి తలెత్తుకోలేక
నలుగురి మధ్యనా మొహం చూపించలేక
నిస్సత్తువగా నిస్తేజంగా
తనలోపలికి
లోలోపలికి దూరాలన్నవ్యర్ధ కాంక్షతో
మెలికలు తిరుగుతూ అదురుతున్న పెదవుల గుండెలు
మసక బారిన చూపుల పదాలు
చిక్క బట్టుకున్న వేలి చివర్ల నిస్తంత్రీ నాదాలు
నిశ్శబ్దంగా గుచ్చి గుచ్చి అడుగుతూ
చరిత్రలు తవ్వుకుంటే ఎవరికెవరు తీసిపోతారు?
ఏ వాకిట ఆగి వున్నా
ఏమున్నది గర్వ కారణం?
నరజాతి చరిత్ర సమస్థం
తిట్లూ బూతుల సముదాయమేగా …..

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

కవిత

-ఆత్రేయ కొండూరు

తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే,

ఆకాశం కప్పుకున్న
అస్థిరమయిన రూపాలు
తేలిపోతూ, కరిగిపోతూ,
అలజడిచేస్తూ,
అక్షరాల జల్లు.

నిలిచే సమయమేది ?
పట్టే ఒడుపేది ?

పల్లంలో దాగిన
జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.

తడుపుదామనో
కలిసి తరిద్దామనో!

గుండె నిండేసరికి
నిర్మలాకాశం
వెచ్చగా మెరిసింది.

Posted in కవిత్వం | Tagged | 2 Comments

2010 ఏప్రిల్ గడి ఫలితాలు

ఏప్రిల్ 2010 గడి

ఈసారి గడి పూరణలు అతి తక్కువగా వచ్చాయి. బహుశః గడికి వేసవి సెలవుల గాడ్పు తగిలినట్లుంది. గడిని ఉత్సాహంగా నింపి పంపినవారు ఆర్కేడి, కొడీహళ్లి మురళీమోహన్ , భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హనుమంత రావు, శుభ , విజయ జ్యోతి గార్లు. వీరిలో నాకు తెలిసి చాలామంది ఈమధ్య గడి పూరించడం మొదలెట్టినవారే. అందుకని తప్పొప్పుల మీమాంస చేయదల్చుకొలేదు. కానీ అతి తక్కువ తప్పులతో పూరించిన శుభగారికి ప్రత్యేక అభినందనలు. స్లిప్పుల సర్వీసున్నా కూడా తక్కువ పూరణలు రావడం శోచనీయం.

1 వా 2 మ దే 3 వు డు 4 ధ 5 న 6 తి 7 సా
8 రు పూ 9 పో ని లు 10 వా రా హి
11 క బీ 12 రు 13 క వు ల్దా రీ తీ
14 వా ణీ వి లా ము రు 15 రో
హి 16 గు రు 17 మా 18 వీ సె 19 అ
20 ని 21 ట్రా 22 డ 23 స 24 మ రాం 25 గ పో
26 ప 27 ము స్కా 28 అ 29 హ
30 ధ న్కో 31 చ 32 తు రం 33 గ లా లు
34 కా రు 35 స్కా రు 36 వ లు
లు 37 తు ష్కు ర్న 38 ఎ
39 న 40 వ 41 త రం గా లు 42 రు 43 ద 44 త ము
45 వీ 46 సం 47 ర సి

అడ్డం ఆధారాలు

క్రమ సంఖ్య

అడ్డం పదం ఆధారం

1

వామదేవుడు ఈయన కూడా దశరధుడి పురోహితుడే. ఎడం వైపు అనడం వల్ల వామ అని సూచనిచ్చాం

4

ధ నవ తి చక్కనైన నవధతి చిన్నమ్మ(లక్ష్మి.. పెద్దమ్మ జ్యేష్ఠాదేవి) కూతురు అన్న ఆధారంలోనే పదం ఉంది

8

రుమ అంటే ఉప్పు బట్టీ. సుగ్రీవుడి పెళ్ళాం పేరు కూడా అదే.

9

పోనిలు పోనీలు అంటే పొట్టిగుర్రాలు .. వెళ్ళు (పో), ఆగు (నిలు) అని దోసందుగా అనడం వల్ల పోనిలు అని రాయాలి

10

వారాహి ఈవిడ వైష్ణవి, ఇంద్రాణి మొదలైన సప్తమాతృకలలో ఒకరు. హి.. హి.. హి.. అని చివరలో పెట్టి సూచించాం.

11

కబీరు తారకబీరుని తాగమని గోప్యంగా అన్నకి (గోపన్న) ఉపదేశించినాయన

13

కవుల్దారీ పొలంలేకపోతే కౌలు (కవులు) కు తీసుకోవచ్చు. కవిత్వం చెప్పగలిగిన వారు కవులు.

14

వాణీవిలాసము నంది తిమ్మన్న రాసిన కావ్యం.

15

రో దీని అర్ధం చేబదులు

16

గురు పెద్ద. కాలేజీ కుర్రాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాసూ అని, గురూ అని కూడా సంబోధించుకుంటారు కదా

18

వీసె వీడు 25600 గురిగింజలెత్తు .. సెనగగింజలనలేదు నయం.

20

నిట్రాడ నిలువుగా ఉండేది … ఎవరైనా మాటా మంతీ లేకుండా నుంచుని ఉంటే ఏంటీ నిట్రాడలా నుంచుని ఉన్నావు అని అంటారు.

23

సమరాంగణ సాహితీ సమరాంగణ సార్వభౌముడనికదా బిరుదు. కావ్యం రాయడం లోనూ, కత్తి దూయడం లోనూ సమర్ధుడు.

26

పవనము తోట (వనం) లోంచే వచ్చింది పవనమే కదా

28

అహహ నవ్వు కి అక్షరరూపం ఇదేకదా

30

ధన్కోకఫ ఫన్ కి ఓ కథ .. ఇంగ్లీషోడు తమాషా (ఫన్) కి ఓకధ చెపితే …

31

చతురంగబలాలు యుధ్ధం లో వాడేవి ఇవేకదా

34

కారు కారు మబ్బులు .. ఆకాసంలో మబ్బులతో సావాసం చేసినా కారు కదలాలంటే పెట్రోలు

35

స్కారు స్కార్ అంటే మచ్చే కదా.. దెబ్బ తగిలితే మచ్చ పడుతుందిగా ….

36

వలలు వలేయడం అంటే తెలుసుకదా.

39

నవతరంగాలు పాతకెరటాలిక్కడస్సలు మిగలలేదు అన్నీ కొత్తవే .. కొత్త కెరటాలివే కదా

42

రుదితము అంటే ఏడుపు .. ఎంత విదితంగా చెప్పినా ఏడుపే ఏడుపు

45

వీరరమ ఝాన్సీ దేవిలా మరలాగ యుధ్ధం చేయగల లక్ష్మి(రమ ఈవిడకింకో పేరు)..

46

సం ఇది ఉప సర్గం.

47

రసిక రసిక రాజా! తగువారము కామా. అన్న పాట గుర్తుంది కదా

నిలువు ఆధారాలు

క్రమ సంఖ్య

నిలువు పదం ఆధారం

1

వారుణవాహినిపధ కాలు గంభీరంగా ఉన్నా సారా పధకాలే. ఇది అన్నగారి హయాంలో వచ్చిన సారా పధకం

2

మమ పూజలు చేయించేటప్పుడు పురోహితుడు మిమ్మల్ని మమ అనుకోమంటాడు..విన్నారు కదా

3

వుపూబీలాగు ఎ రోజ్ ఈజ్ ఎ రోజ్ .. విత్ వాటెవర్ నేమ్యూకాల్ అన్నారు కదా. కిందనించి పైకి రాసినా దాని పరిమళానికి ఢోకా లేదు

4

ధనిక అంటే అందమైన అమ్మాయని అర్ధం. నికల్లో రక్తం పరుగెట్టించగల అందగత్తె.

5

నలువురు అంటే నలుగురే కదా. అవును… ఆనలుగురే. (4)

6

తివారీ ‘నేనెవరికి తండ్రిని’, ‘ఎవరికి ప్రియుడిని’ అని సందిగ్ధంతో రాష్ట్రం విడిచి పోయిన ఏలినవారు .. ఇంతకన్నా ఏం విడమర్చి చెప్పాలి

7

సాహితీ 23 అడ్డం లో అంతా చెప్పేసాం కదా

11

కవి ఈయన కవిత్వం చెప్తే చంపడానికి వేరే కత్తి కావాలా.

12

రుసరుస కోపానికి వ్రాతరూపం ఇదే

17

మారాం చిన్నప్పుడు మారాం చేస్తే ముద్దే కానీ పెద్దైనా మారకపోతే మారేంగే.

18

వీణ వాణికి వీణే కదా హస్తభూషణం

19

అపోహలు పోహా తినమంటే అపార్ధం (అపోహ) చేసుకుంటావేం (4)

21

ట్రావన్కోరు రాజభోగం కన్నా సంగీతభోగాన్నెక్కువ అనుభవించిన రాజావారి సంస్థానం .. ఇది వాగ్గేయకారుడు స్వాతితిరునాళ్ గారి సంస్థానం

22

డనక కాళ్ళు సరిగ్గా ఉంటే నడక బాగానే వచ్చుండేది ..లేవుకాబట్టి తిరగబడింది

24

మస్కాచస్కా ఈ ఉప్పు బిస్కట్లతో ఉబ్బేయచ్చని(మస్కా) ప్పగా చెప్పాడు ఆస్కారు

25

గహరం అంటే కట్టె. పొయ్యిలో కాల్చడానికి పనికి వచ్చేది

27

ముఫక పాపం తీవ్ర పడిశమనుకుంటా .. శ్లేష్మం కక్కడానికి తలకిందులైపోతున్నాడు ..అంటే కఫము ని తిరగేసి రాయాలని

28

అబల మంత్రాలు చదివితే ఆకలేయకపోవచ్చు.. బలం కూడా ఉండదుకదా … బల, అబల అనేవి విశ్వామిత్రుడు తాటకీ సంహారమప్పుడు రామునికి ఉపదేశించాడు

29

హలాలు హలాల్ చేయకుండా ఎర్రటి మాంసం తినరుకదా

32

తురుష్కులు తెలుగు లో టర్కీవారిని తురుష్కులు అనే అంటారు

33

గవర్న రు తివారీ గారు ఈ పదవిలోఉన్నప్పుడే కదా . పితృత్వపు కేసు, ఇంకారాసలీలల కేసులు వచ్చాయి

37

తురం తురగం అంటే గుర్రం. సగం గుర్రం తురం

38

ఎముక బాగా వాయించడాన్ని సున్నంలోకి ఎముక లేకుండా కొట్టడం అంటారు

39

నర మనిషి తాలూకు.. నరుడుకి సంబంధం ఉన్నది. నరకానికి కొద్దిగా తక్కువ

40

వర నరవర అంటే రాజు

41

తమ తమకం అంటే మత్తు.

43

ది ర గానుగ దిరదిర తిరుగుతోందంటాం కదా

44

తసి అంటే దట్టమైన నాఱు అని.
Posted in గడి | Tagged | 2 Comments