ఆధునికాంధ్రకవితాలోకంలో పెద్దగా పరిచయమక్కరలేని పేరు అఫ్సర్…
ఇన్ని వ్యాకరణాలూ
ఇన్ని నిఘంటువులు
అన్నీ వొంటి మీది బట్టల్లా కనిపిస్తాయి
అన్నిటి కిందా
ఒకే ఒక్క శరీరం ఘోష!"
అఫ్సర్ కవిత్వం వినిపించే తత్వం ఇదేకదా అనుకొని పలకరించాం…
ఎవరి భాషలో వాళ్లం
దూరాల్ని దగ్గిరగా 'నెట్టు'కొచ్చి…
మరిచిపోతున్న దేన్నో
మరింకోసారి గుర్తు చేసి!"
త్రిలింగదేశమంతా బాగా తెలిసినవాడు
భూగోళానికి రెండువైపులూ చూసినవాడు
పుట్టుకతోనే రెండు సంస్కృతుల సమ్మేళనం వొంటబట్టినవాడు
వొంటి మీది తెల్లని వస్త్రం నా మనసుని విప్పదు
నీ భాషలోకి వొదిగిపోయాను
నా అన్ని వుద్వేగాలతో, నేనూ
ఆవేశాలతో"
కవితల్లో చమత్కారమెంతుందో నేపథ్యంలో అంత సంఘర్షణ వుందని
మాటలయ్యాక వారి కవితలను చూస్తే మన గురించి తెలిసేవి కొన్ని
చదవండి అఫ్సర్‌గారితో ముఖాముఖి…
మొదటి భాగం
ముందుగా, మీకు సాహిత్య పరిచయం కలిగించిన వారి గురించి, ఆ విషయంగా మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుంది.?
మా నాన్నగారి ద్వారానే సాహిత్య పరిచయం. మాది కొంచెం ఆసక్తికరమయిన కుటుంబ చరిత్ర. మా అమ్మ తరఫు వాళ్ళంతా కమ్యూనిస్టులు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంలో, పార్టీ కోసం వున్నదంతా ధారపోసి, కట్టుబట్టలతో మిగిలారు. దానికి భిన్నంగా మా తాతయ్య గారు (ఆయన పేరే నాకు పెట్టారు) నిజాం కొలువులో కస్టమ్స్ అధికారి. అనేక భాషలలో పండితుడు కావడం వల్ల నిజాంకి ఇష్టపాత్రులయ్యారని ఆయన గురించి చాలా కథలున్నాయి. ఆయన పాండిత్యానికి ఇనాంగా నిజాం ఆయనకి ఎర్రుపాలెం దగ్గిర బంగారం పండే భూములు ఇచ్చారు. మా నాన్నగారి దాకా వచ్చే సరికి మాకు సెంటు భూమి కూడా మిగలలేదు. ఆయనకి పూర్తి వ్యతిరేకంగా మా నాన్నగారు నిజాం వ్యతిరేక పోరాటంలో నిలిచారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. ప్రజా నాట్య మండలిలో, అ.ర.సం లో కీలక పాత్ర పోషించారు. నిజాం ఇనామ్ భూములన్నీ వదులుకున్నారు. విశాలాంధ్ర పత్రికలో చిన్న జీతానికి చేరారు. ఆ తరవాత ఉత్తర భారత దేశం వెళ్ళి అక్కడ హిందీ మహావిద్యాలయంలోచదువుకున్నారు. ఖమ్మం దగ్గిర చింతకాని దగ్గిర హిందీ పండిత్ గా చేరారు. ఆ చిన్న వూళ్లోనే నేను పెరిగాను.
మాది ఆరుగురు పిల్లల పెద్ద కుటుంబం. రెండు గదుల అద్దె ఇల్లు ఎప్పుడూ. నా ఎలిమెంటరీ చదువు కొంత ఉర్దూ మీడియం, కొంత తెలుగు మీడియం. చుట్టూ పుస్తకాల గుట్టలు వుండేవి కాబట్టి, బాగా చదవడం అలవాటు అయ్యింది. ఆ చిన్న వూరికి దాశరథి, పెద్దిభొట్ల, మోరియా, కవిరాజ మూర్తి లాంటి అప్పటి పెద్ద రచయితలు నాన్నగారిని కలవడానికి అప్పుడప్పుడూ వస్తూండేవారు. వాళ్ళు వున్నంత సేపూ నాకు పండగ లాగా వుండేది. ఇంట్లో చాలా సందడిగా వుండేది. “అఫ్సూర్యుడా, ఎలా వున్నావ్ రా?” అని దాశరథి ప్రేమగా పలకరించేవారు. తరవాత ఉత్తరాలు రాసేటప్పుడు కూడా ఆయన నన్ను “అఫ్సూర్యుడు” (అఫ్సర్ ప్లస్ సూర్యుడు కలిపి) అనే పిలిచే వారు. నాకు ఉర్దూ అంటే ప్రాణంగా వుండేది. ఉర్దూ కవిత్వం ఎవరయినా చదువుతూ వుంటే ప్రాణానికి చాలా హాయిగా వుండేది. అమ్మ ముహర్రం పాటలు పాడేది. చాలా చిన్న వయసులో నేను ఖురాన్ చదువు పూర్తి చేశాను. ఆ స్మృతి నా “గోరీ మా” కథలో వినిపిస్తుంది.
చింతకాని బడిలో మా నాన్న గారు విద్యార్ధుల కోసం “మధుర వాణి” అనే పేరుతో దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడపత్రిక ప్రతి నెలా రాయించి పెట్టే వారు. ఈ గోడపత్రిక బడికే పరిమితమయినా, విద్యార్ధుల రచనల మీద ఆయన చాలా నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా అభిప్రాయాలు చెప్పడమే కాకుండా, విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకొని మార్పులూ చేర్పులూ చేయించేవారు. అవన్నీ నేను గమనిస్తూ వుండేవాణ్ని. వొక రచనని ఎడిట్ చేసుకోగలగడం గొప్ప కళ అని నమ్ముతాను నేను, నా రచనా జీవితం వొక విధంగా ఆ ఎడిటింగ్ పాఠాల నించే మొదలయ్యింది. కానీ, ఆయన అక్కడ వున్నంత కాలం నా కవిత్వం కానీ, చిట్టి కథలు గానీ వొక్కటి కూడా వేయలేదు. ఆ గోడపత్రికలో రచన చూసుకోవాలని విద్యార్ధులందరికీ తహతహగా వుండేది. నేను రచన ఇచ్చినప్పుడల్లా, చదివి, నవ్వి “నువ్వు బాగా రాయాలంటే బాగా చదవాలి” అని నా రచనని పక్కన పెట్టేసే వారు. అప్పుడు నేను నాటకాల వైపు మొగ్గాను. నేనే పది మందిని కూడదీసి, కొన్ని సీన్లు రాసి, మా ఇంటి పక్కన కిలారు గోవిందరావు గారి గొడ్లపాకలో అయిదు పైసల టిక్కెటు మీద వాటిని వేసే వాళ్ళం. అయిదు పైసలు లేని వాళ్ళు అయిదు చీట్ల పేకలు ఇవ్వాలని రూల్. ఆ వచ్చిన పేకలతో బెచ్చాలు ఆడేవాళ్లం.
మేం – పట్టణం అంటే ఖమ్మం రావడం మా బతుకులో పెద్ద మలుపు. ఏడో తరగతి నించి నేను ఖమ్మం జ్యోతి బాల మందిర్ లో చదివాను. ఇక్కడ నా అదృష్టం బాగుండి నాకు మంచి తెలుగు, హిందీ, ఇంగ్లీషు టీచర్లు దొరికారు. వాళ్ళు ఇంగ్లీషు, తెలుగు, హిందీలోనూ నా చేత కవిత్వం రాయించడం మొదలు పెట్టారు. తెలుగులో నేను ఎంతసేపటికీ ఛందోబద్ధ పద్యాలు రాసే వాణ్ని. అవి నాన్నగారికి చూపిస్తే, “వచన కవిత్వం ఈ కాలం కవిత్వం” అనే వారు. కానీ, నేను పద్యాల నించి బయటపడలేకపోయాను. ఇప్పటికీ ప్రాచీనసాహిత్యం చదివినంతగా ఆధునిక సాహిత్యం చదవను. పద్యాల నించి బయటపడే సమయం వచ్చేసరికి నాకు కవిత్వం మీద ఆసక్తి పోయింది. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీన పడింది. “సరిత” అని వొక మంచి సాహిత్య పత్రిక నడపాలన్న తపనతో మా నాన్నగారు “సాహితి ప్రెస్” అనేది పెట్టి నిలువునా మునిగిపోయారు. నేను ట్యూషన్లు చెప్పుకొని స్కూల్ ఫీజ్ కట్టుకునే పరిస్తితి వచ్చింది.
ఆ పరిస్థితిలో నండూరి రామమోహనరావు గారు, నేను వొక చిన్న వ్యాసం రాసి పంపిస్తే, వెంటనే అచ్చు వేశారు. అచ్చయిన వారానికి నాకు పాతిక రూపాయలు పంపించారు. ట్యూషన్లు తగ్గించి, “ఆంధ్రజ్యోతి” కి నెలకి మూడు వ్యాసాలు రాసే వాణ్ని. ఆ తరవాత అప్పుడప్పుడే కొత్త రూపం ధరిస్తున్న “ఆంధ్రప్రభ” ఆదివారం లో అనువాదాలు మొదలు పెట్టాను. “ఆంధ్ర జ్యోతి” లో నండూరి రామమోహన రావు గారు నా వ్యాసాల్ని ఎడిట్ చేసే వారు, ఆయన నా వ్యాసాన్ని ఎట్లా మార్చి ఎట్లా వేస్తారా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే వాణ్ని. అవి వచనంలో నా తొలి పాఠాలు. అలా పరోక్షంగా మొదలయిన ఆయన శిష్యరికం నా డిగ్రీ కాక ముందే ఆయన ప్రత్యక్ష శిష్యరికంలోకి తీసుకువెళ్లింది.
సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మే ఇంగ్లీషులో సీటు వచ్చింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండక నేను ఆంధ్రజ్యోతిలో చేరిపోయాను. సెంట్రల్ యూనివర్సిటీలో చేరమని, నెలకింతని తానే కొంత డబ్బు ఇస్తానని శివారెడ్డి గారు వొత్తిడి చేశారు. నా కాలేజ్ మిత్రులు నేను చదువు మానేస్తున్నందుకు కళ్ల నీళ్ళు పెట్టుకున్నారు, అనేక విధాలుగా నచ్చ చెప్పారు. యూనివర్సిటీ మెట్లు ఎక్కాలన్నది నా పెద్ద కల. అది వాళ్ళందరికీ తెలుసు. అది ఇండియాలో ఎప్పుడూ సవ్యంగా తీరలేదు, అప్పుడప్పుడూ యూనివర్శిటీల ఆహ్వానాల మీద ప్రసంగాలు ఇవ్వడం తప్ప.
మధ్యమధ్యలో నారాయణ రావు గారు “మీరు యూనివర్సిటీకి వెళ్లాలండీ. ఈ ఉద్యోగం మీకు సరయిన చోటు కాదు ” అంటూ అంటూనే వున్నారు. ఈ లోపు మిత్రుడు రమణ మూర్తి (త్రిపుర కథల పరిశోధకుడు) “కనీసం తెలుగు ఎమ్మే చదువు” అంటూ వొత్తిడి చెయ్యడం మొదలెట్టాడు. నేను వినని స్థితిలో కవి యాకూబ్ వొక ఎమ్మే అప్లికేషన్ ఫారం బెజవాడ పట్టుకొచ్చి, నా చేత నింపించాడు. పరీక్షలు నేను రాయలేనని మొండికేసినప్పుడు రమణ మూర్తి బలవంతంగా నన్ను పరీక్ష హాలులో కూర్చోబెట్టి, నేను పరీక్ష రాస్తున్నంత సేపూ తను కాంపస్ బయట నాకోసం ఎదురుచూస్తూ కూర్చునే వాడు. ఆ తరవాత నేను పీ ఎచ్ డీ చెయ్యాలన్నది గోపి గారి ఆలోచన. నాయని కృష్ణకుమారి, వేటూరి ఆనందమూర్తి, కులశేఖరరావు గారు ఆ ఆలోచనకి కాయితం రూపం ఇచ్చారు. ఎప్పటి మాదిరిగానే సీతారాం, గుడిపాటి, కాసుల ప్రతాప్ రెడ్డి, రామదాస్, సైదాచారి, పొనుగోటి కృష్ణా రెడ్డి, వెలిదండ నిత్యానంద రావు, పులికొండ సుబ్బాచారి, ఎండ్లూరి సుధాకర్ ఆ కాలంలోనూ నాకు గొప్ప అండ. సాహిత్యపరంగా అప్పుడు కొంత ఆరోగ్యకరమయిన వాతావరణం వుండేదని అనుకుంటాను. ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీతో పాటు అనేక చిన్న సాహిత్య బుల్లెటీన్లు, రచయితల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, అనుబంధాలు, సాహిత్య సభలూ…ఆ వాతావరణంలో ఇప్పుడు కాస్త మేఘాలు కమ్ముకున్నాయి. కవులూ రచయితల మధ్య అలాంటి సన్నిహిత వాతావరణం ఇప్పుడు వుందా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.
మీ కవితాసృజనకు ముందు సాహిత్యంతో మీకున్న పరిచయం ఎలాంటిదో చెబుతారా?
— సాహిత్యం అంటే మౌఖిక సాహిత్యం ప్రభావం ఎక్కువ. అమ్మ ముస్లిం అమరవీరుల కథలు చెప్పేది, ఇప్పటికీ నా కవిత్వంలో ఆ ప్రస్తావనలు వుంటాయి. మా తాత మహమ్మద్ సాలార్ (“రక్త కన్నీరు” ఫేమ్) ప్రజానాట్యమండలి నటుడు. గొప్ప గాయకుడు. చెరబండరాజు పాటలన్నీ పాడే వాడు. మార్క్సిజం వొక భావనగా అలా ఆ పాటల్లోంచి నా ఆలోచనల్లోకి చేరుకుంది. కుటుంబ నేపథ్యం వల్ల మార్క్సిజం, సంబంధిత సాహిత్యం నా జీవితంలో విడదీయలేని భాగం అయ్యింది.
సాహిత్యపరంగా రాయడం చాలా ఆలస్యంగా అంటే ఎనిమిదో తరగతిలో మొదలు పెట్టాను. పట్నం వచ్చాక వొక రకమయిన వొంటరితనంలోకి వెళ్లిపోయాను. ఆ వొంటరితనాన్ని నింపుకోవడానికి ఎక్కువ చదివే వాణ్ని, కొంత రాసేవాణ్ని. కానీ, రాయడం తక్కువే.
తొలి నాటి కవిత్వం కబుర్లు కొన్ని చెప్పండి?
ఎందుచేతనో కవిత్వంలోకి నేను ఆలస్యంగా అడుగుపెట్టాను. వ్యాసాలూ, చిన్న కథలూ, అనువాదాలూ ఎక్కువ చేసేవాణ్ని. రాసిన తొలినాళ్ళ కవిత్వం నా డైరీలకి మాత్రమే పరిమితమయ్యింది. అలా డైరీలలో రాసిన కవిత్వం వొక సారి పొరపాటున చదివిన సీతారాం దాన్ని తీసుకు వెళ్ళి నన్నేమీ మాట్లాడ నివ్వకుండా నేరుగా ప్రెస్ లో ఇచ్చాడు. అదే “రక్త స్పర్శ” (1985).
ఇంటర్/ డిగ్రీ చదువుకునే రోజులలో ఇంగ్లిష్ కవిత్వం రాయడం వొక పిచ్చి. అలా వొక కవిత ‘మిర్రర్” కి పంపాను. ఆ కవిత చదివి అప్పటి ‘మిర్రర్’ ఎడిటర్ ప్రభా గోవింద్ వెంటనే వుత్తరం రాశారు. నెలకి వొక కవిత నేను పంపేట్టు, ఆ పత్రిక వాళ్ళు నాకు వంద రూపాయలు ఇచ్చేట్టు ఆ వుత్తరంలో వొప్పందం అయ్యింది. అలా ఏడాది పాటు రాశాక విసుగు పుట్టి, ఇంగ్లీషు కవిత్వం మానేశాను.
1983 లో ఆంధ్రజ్యోతి వారపత్రిక కథలపోటీ పెట్టింది. ఆ పోటీలో “అడివి” అనే నా కథకి బహుమతి వచ్చాక నండూరి , పురాణం ఇద్దరూ నన్ను ఆంధ్రజ్యోతిలోకి తీసుకున్నారు. సాహిత్య వేదిక బాధ్యత అప్పజెప్పారు. అంతే…మళ్ళీ తెలుగు సాహిత్యంలోకి వచ్చి పడ్డాను. ఆంధ్రజ్యోతిలో పని చేసిన కాలం స్వర్ణయుగం. ఇప్పటికీ అప్పటి ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలు గొప్ప ఆకర్షణగా కనిపిస్తాయి నాకు. నేను చూసిన గొప్ప వ్యక్తులలో మరచిపోలేని మనీషి నండూరి.
ఆ రోజుల్లో నండూరి అంటే చాలా గొప్ప ఎడిటర్. బయట ఎవరికయినా నేను నండూరి దగ్గిర పని చేస్తున్నానంటే నా గౌరవ మర్యాదలు పదింతలు పెరిగేవి. రోజూ ఆయనతో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ రోజులు మళ్ళీ రావు. ఆయన తన దగ్గిర వున్న పుస్తకాలు తెచ్చి ఇచ్చి నా చేత చదివించారు. తన దగ్గిరకి వచ్చిన ప్రతి రచయితనీ నాకు పరిచయం చేసే వారు. ఎవరయినా తనని సాహిత్య సభలకి పిలిస్తే, ’నేనెందుకు అఫ్సర్ వస్తాడు లెండి’ అని నన్ను వక్తగా పంపించేవారు. ఆకాశవాణిలో నాకు ప్రసంగాలు ఇప్పించేవారు. ఆంధ్రజ్యోతిలో నాకు వచ్చే జీతం మరీ అన్యాయంగా వుండేదన్న భావన లోంచి ఆయన వివిధ రకాలుగా డబ్బు వచ్చే ఇతర పనులు కూడా అప్పజెప్పే వారు. అందులో భాగమే ఈ ఆకాశవాణి ప్రసంగాలు. ఆ దశలో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఉషశ్రీ, రావిశాస్త్రి, చాసో, ఆరుద్ర, అజంతా, రోణంకి నాకు సన్నిహితంగా తెలిశారు.
మొదటి రేడియోప్రసంగం మల్లాది రామకృష్ణశాస్త్రి కథల మీద – మొదటి సారి రేడియో స్టూడియోలోకి పోగానే నాకు వణుకు మొదలై, గొంతు పెగల్లేదు. ‘ఒరే నాయనా, ఈ సారికి పోనివ్వు. రేపటి నించి పొద్దున్నే లేచి కృష్ణా నది ఒడ్డుకి వెళ్ళి, ఈ ప్రసంగం అంతా పెద్ద గొంతుతో ఆ కృష్ణమ్మకి వినిపించు. నీ గొంతు ఎంత పెద్దది అయితే అంత! వచ్చే సారి నువ్వు శ్రీపాద గురించి మాట్లాడాలి. నీ గొంతు పెరిగితే నీకు ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా. అయినా, నోరు లేకుండా ఎట్లా బతుకుతావు రా నువ్వు?!” ఆయన వెటకారంగా అన్నారా అని నేను నండూరి దగ్గిర బాధ పడితే, ఆయన నవ్వి “సరే. వెటకారమే అనుకో. కానీ దాన్ని కాస్త సీరియస్ గా కూడా తీసుకో. వొక ప్రయత్నం చెయ్యి, తప్పేమీ లేదు కదా! అయినా, నువ్వు ఇకనయినా కాస్త మాట్లాడ్డం నేర్చుకోవాలి. మౌనశంఖం లా వుండొద్దు. కానీ, ఉషశ్రీ ఆ మాట వెటకారంగా అనలేదులే! ఆయన అలాగే మాట్లాడతారు.” అన్నారు. నా మానసిక ఇబ్బందిని పక్కన పెట్టి, ఉషశ్రీ చెప్పినట్టే నేను ఆదివారాలు పొద్దున్నే లేచి నా ప్రసంగం కాయితాలు తీసుకుని, కృష్ణ నది ఇవతలి వొడ్డున నిలబడి అవతల మంగళగిరి కొండ అదిరిపోవాలన్నంత ఆవేశంగా వాటిని బిగ్గరగా చదివే వాణ్ని. అలాంటి పనులు తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది కానీ, అది ఎంత మంచి సాధనో ఆలస్యంగా అయినా అర్ధం అయ్యింది. అతి కొద్ది కాలంలోనే నేను అలా ఆకాశవాణికి నిలయ విద్వాంసుడిని అయిపోయాను, కానీ ఏ నాడూ “నిలవ విద్వాంసుడి”ని కాలేదు. ప్రతి సారీ వొక కొత్త అంశం ప్రసంగానికి తీసుకునేవాణ్ని, వాల్మీకి నించి టాగోర్ దాకా, నన్నయ నించి నగ్నముని దాకా కవిత్వ సీమలో ఎల్లలు లేకుండా సంచరించాను. ఆ క్రమంలో బాగా చదవాల్సి వచ్చింది. “పది పుస్తకాలు చదువు, వొక పేజీ రాయి” అన్నది నండూరి మాట. శ్రీకాంత శర్మ గారు ప్రసంగం ప్రతి దగ్గిర చాలా పట్టింపుగా వుండేవారు. ప్రతి వాక్యం పట్టి పట్టి చదివే వారు, మొహమాటం లేకుండా మార్పులు చెప్పే వారు.
ఇంకో ప్రేరణ: పురాణం గారి ఇంట్లో “సాక్షి” సాహిత్య మిత్రుల సమావేశాలు జరిగేవి. రావిశాస్త్రి, చాసో, ఇస్మాయిల్, స్మైల్, కాళీపట్నం, భమిడిపాటి, అజంతా, పెద్దిభొట్ల, టీ ఎల్ కాంతా రావు, రామమోహన్ రాయ్…ఇవి కొన్ని పేర్లు మాత్రమే…ఎందరో ఈ “సాక్షి” క్లబ్ కి వచ్చే వారు. కొన్నిసార్లు ఈ సమావేశాలు అర్ధరాత్రి దాటేవి. చిత్ర విచిత్రమయిన వాగ్వివాదాలు జరిగేవి. వాటన్నిటికి నేను మూగ సాక్షిని మాత్రమే, ఎంత సేపటికీ మౌనంగా వుండేవాణ్ని. “ఏదయినా మాట్లాడ వయ్యా స్వామీ, నువ్వు మాట్లాడవూ, తాగవూ?!” అని పురాణం గారు పోరే వారు. నాకు చచ్చేంత బిడియం. “అఫ్సర్…కాయితం మీద కొమరం పులి. ఎదురుగా వుంటే బిక్కు బిక్కు పిల్లి” అని నండూరి నా మీద ఆశుకవిత్వం చెప్పడం గుర్తు. ఈ భయాన్ని చెదరగొట్టిన వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఉషశ్రీ మాత్రమే. ఆ తరవాత నన్ను బలవంతంగా రాజమండ్రిలో సాహిత్య వేదిక ఎక్కించి, ప్రసంగం చెప్పించిన సతీష్ చందర్. ఆ ప్రసంగం తరవాత వొకాయన వచ్చి “మీరు మహమ్మదీయులు అంటే నమ్మలేకపోయానండీ! మీ పలుకు ఎంత స్వచ్ఛంగా వుంది!” అన్నారొకాయన. నిజానికి నేను మహమ్మదీయుడిని అన్న భావం నాకు ఆ కాలంలో ఏ కోశానా లేదు. అది 1990 తరవాత వచ్చిన మార్పు మాత్రమే. నాకు నేను వొక ముస్లిం గా కనిపించడం 1990లోనే మొదలయ్యింది – యానాం వెళ్ళి వచ్చాక, “యానాం వేమన ఏమనే…” కవిత రాశాక.
నేను కవిత్వం రాయడానికి ముందు కథకుడిని, వ్యాస రచయితని. వ్యాసం రాయడం అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. నేను రాసిన వ్యాసాలు ప్రతి పంక్తీ చదివి, “ఇలా రాయ్” అని దాదాపూ నా చెయ్యి పట్టి రాయించారు నండూరి, పురాణం. ఎప్పుడయినా కవిత్వం రాస్తే, పురాణం కోప్పడే వారు “ నీలో మంచి వచన రచయిత వున్నాడు. ఆ కవిత్వం రాసి వాడి కొంప ముంచకు” అనే వారు. కానీ, వద్దు అన్నది చెయ్యడం నా వ్యక్తిత్వ లక్షణం. చివరికి ఆయన అన్నంత పనీ చేశాను.
ఇంకా కవితా సృజనకి ముందు నా సాహిత్య పరిచయం ఎక్కువగా వచన సాహిత్య పఠనం మాత్రమే. హై స్కూల్ దాకా తెలుగు క్లాసిక్స్ అంటే ప్రాణం. హై స్కూల్ సెలవుల్లో ఇంట్లో ఇక చదవాల్సిన పుస్తకాలు ఏమీ దొరక్క మార్క్స్, ఎంగెల్స్ చదవడం మొదలు పెట్టాను. నా పఠన ప్రయాణంలో అది అనుకోని మజిలీ. మార్క్స్ రచన ఏది కనిపిస్తే అది చదవడం మొదలు పెట్టాను. నిజానికి మార్క్స్ భార్య జెన్నీ మార్క్స్ జీవితం ఆధారంగా ఒక కల్పిత మార్క్స్ ఆత్మ కథ రాసి మిత్రులకి వినిపించే వాణ్ని. అది నా మొదటి సృజనాత్మక వచన రచన.
ఇంటర్/ డిగ్రీ…. ఆ అయిదేళ్లూ నేను విపరీతంగా చదివిన కాలం. కానీ, కవిత్వం చదివే వాణ్ని కాదు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ నవలా సాహిత్యం ఏది దొరికితే అది చదివాను. భారతీయ సాహిత్యం ముఖ్యంగా బెంగాలీ, తమిళం, కన్నడ నించి వచ్చిన అనువాదాలు ఎక్కువ ఇష్టంగా చదివే వాణ్ని. ఖమ్మం లైబ్రరీ, మా సిద్ధార్థ కాలేజీ లైబ్రరీలో తక్కువ పుస్తకాలే వున్నా, మంచి పుస్తకాలు వుండేవి. ఖమ్మం ప్రభుత్వ కళాశాల లైబ్రరీ పెద్దది. అక్కడ గొప్ప ఇంగ్లీష్ సాహిత్యం అంతా దొరికేది. ఇవిగాక, హీరాలాల్ మోరియా సొంత లైబ్రరీ నాకు అత్యంత ఇష్టమయిన చోటు. మోరియా గారు ఎవరికీ పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్లనిచ్చే వారు కాదు, ఆయన నా కోసం వొక కుర్చీ, టేబులు ఏర్పర్చి, ‘బేటా, నువ్వు ఇక్కడ ఎన్ని గంటలు కూర్చొని చదువుకున్నా పర్లేదు. కానీ, వొక్క పుస్తకం బయటికి ఇవ్వను. ఇక్కడే తిను, టీ తాగు” నేను ఆ ఇంట్లో కూర్చొని ఎన్ని పుస్తకాలు, పాత పత్రికలు చదివే వాణ్ణో లెక్క లేదు. మోరియా గారి భార్య, ఆయన కూతురు సాధన గంటకోసారి నాకు టీలూ, తినుబండారాలు తెచ్చి పెట్టే వారు. సాధన నా కంటే వొక ఏడాది పెద్దది, కానీ ఆమె ఇంగ్లీషులో రాసేది, అవి నేను తెలుగు అనువాదం చేసే వాణ్ని. ఇంటర్ లో మార్కులు సరిగ్గా రాలేదని సాధన ఆత్మ హత్య చేసుకుంది. నేను అతిదగ్గిరగా చూసిన వ్యక్తి అలా చనిపోవడం నాకు చాలా రోజులు నిద్రలేకుండా చేసింది. ఇది జరిగాక ఇంకో మిత్రుడు కుటుంబ సమస్యల వల్ల రైలు కింద తల పెట్టాడు, అదే సంవత్సరం నాకు అతి బాగా తెలిసిన, నాతో చింతకానిలో బాల్యంలో ఆడుకున్న వొక అమ్మాయి కాలేజీలో టీజింగ్ తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంది. తన భర్తతో పడక పెద్దక్క ఇల్లు చేరింది. రక రకాల ఈ వరస సంఘటనలు నన్ను ఇంకా అంతర్ముఖిని చేశాయి. చాలా కాలం దాదాపూ నోరు పడిపోయిందన్నంత పని అయ్యింది.
కానీ, మోరియా గారు “ఇంకా చాలా వుంటాయి జీవితంలో- ఇది మొదలు అంతే!” అని నన్ను రొటీన్ లోకి నెట్టారు. కానీ, మొత్తం మీద నా జీవితం నడక నిదానించింది. అప్పుడు పుస్తకాలు నాకు గొప్ప అండ. వొక విస్మృతి కింద దాక్కోవాలి అన్న తక్షణ భావంతో గంటల తరబడి పుస్తకంలో తలదాచుకునే వాణ్ని, ఆ మృత దేహాలు గుర్తుకు రాకుండా – కీట్స్, ఇలియట్, ఆల్బర్ట్ కామూ, కాఫ్కా, నీషే నాకు స్నేహితులయ్యారు. కానీ, నేను బాగా పారిపోతున్నానన్న స్పృహ నాకు వుండేది.
జీవితం ఏకాంతంలో లేదు, సామూహికతలో వుంది. నేను పెరిగిన పల్లె నాకు సామూహికతే నేర్పింది. ఈ స్పృహ వల్ల కొద్దికాలంలోనే నేను విద్యార్థి రాజకీయాల వైపు మళ్ళాను. కాలేజీకి అప్పట్లో శ్రీ శ్రీ, శివారెడ్డి, హెచ్చార్కే, వరవరరావు, కత్తి పద్మారావు, కేవీ రమణా రెడ్డి, టీ ఎల్ కాంతా రావు, పి. పుల్లయ్య (ఇప్పుడు ప్రసాద్) లాంటి వాళ్ళు వక్తలుగా వచ్చేవారు. నేను మళ్ళీ మార్క్సిస్టు బాటలోకి మళ్ళాను. విద్యార్థి రాజకీయాలలో నిండా కూరుకుపోయాక, ఇక నేను పార్టీలో ఫుల్ టైమర్ కావాలని వొత్తిడి మొదలయ్యింది. అప్పటికే పార్టీలో కుల రాజకీయాలు మొదలయ్యాయి. కుల, మత రాజకీయాలు వున్న చోట నాకు కాస్త కూడా వూపిరాడదు. ఇంత పోరాడీ మళ్ళీ, అదే బురదలో కూరుకుపోవడం ఏంటీ అనుకున్నాను. రాజకీయాలకు స్వస్తి చెప్పాను. మళ్ళీ చదువు. మళ్ళీ సాహిత్యం. మళ్ళీ అంతర్ముఖ పర్వం.
ఆ దశలో నా కుటుంబ నేపథ్య ప్రభావం వల్ల తెలంగాణా ఉద్యమం వైపు ఆలోచనలు తిరిగాయి. తెలంగాణా ఉద్యమం ఏం చేసింది? అన్న ప్రశ్న మొదలయ్యింది. ఆ ప్రశ్నే నా బతుకు బాటని తీర్చి దిద్దింది. తెలంగాణ ఉద్యమ సాహిత్యం మీద పరిశోధన చెయ్యాలి అన్న ఆలోచన అక్కడే వచ్చింది. మోరియా గారి ఇంటి పక్కనే వున్న విజ్ణాన నికేతనం లైబ్రరీలో సాహిత్య సమావేశాలు జరిగేవి. ఆ సమావేశాల తరవాత మళ్ళీ మోరియా గారి ఇంట్లో కబుర్లూ కాలక్షేపాలు వుండేవి. ఇవి నా లోపలి రచయితకి ప్రాణం పోశాయి.
ఉత్తరాలు రాయడం చాలా ఇష్టంగా వుండేది. ఇంగ్లీష్ కవిత్వ రచన వల్ల ఉత్తరాది రచయితలతో చాలా స్నేహాలు వుండేవి. వాళ్ళతో స్నేహం వల్ల పెద్ద నగరాల్లో వుండే రచయితలు అప్పుడప్పుడూ పుస్తకాలు పంపే వాళ్ళు. అలా నిస్సిమ్ ఏజెకీల్ తో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాను. ఆయన కవిత్వం చదవడం, మననం చేసుకోవడం కాస్త సరదాగా వుండేది. ఇప్పుడు చేత్తో ఉత్తరాలు రాసే అదృష్టం లేకపోవడం దురదృష్టం.
ఒక పల్లెటూరిలో పుట్టడం ఒక కవిగా మీకు లాభించిందనుకుంటున్నారా? లేక సాహితీ మిత్రుల సాంగత్యంలో మరింత బాగా రచనలు చేసేవాణ్నని భావిస్తున్నారా?
చింతకాని అనే వూరు నా బాల్యంలో లేకపోతే, రచయిత కావడం సంగతి అటు వుంచండి, నేను కనీసం ఈ మాత్రం మనిషిగా కూడా మిగిలేవాణ్ణే కాదు. ఆ వూరిని నేనింకా పూర్తిగా నా రచనల్లోకి తేలేదు గానీ, ఇంకా చాలా రాయాల్సింది వుంది. కానీ వొక ఆలోచనా జీవిగా ఆ వూరు నా ఇడియాలజీ. నా థియరీ. నా పరిశోధన చూస్తే మీకు ఈ విషయం అర్ధం అవుతుంది. ‘గోరీమా” కథలో ఆ వూరి గురించి కొంత మాత్రమే రాశాను. సాహిత్య పరంగా అంటే పుస్తకాల నించి నేను పెద్దగా స్ఫూర్తి తీసుకోలేను. అనుభవం నాకు గొప్ప స్ఫూర్తి అనిపిస్తుంది. ఆ వూరే లేకపోతే నా బతుకు అసంపూర్తిగా, నా రచనా జీవితం అరకొరగా వుండేది. నాకు ప్రదేశాలు, వాటి చుట్టూ వుండే మనుషులూ, వాళ్ళ అనుభవాలు గొప్ప పుస్తకాలు. అందుకే నా కవిత్వంలో కూడా ప్రదేశాలు ఎక్కువ కనిపిస్తాయి, అది యానాం కావచ్చు, మాడిసన్ కావచ్చు. కానీ, నేను ఎక్కడికెళ్లినా వొక పల్లెటూరి సరుకునే అనుకుంటా. దూసుకుపోయి మాట్లాడ్డం నా వల్ల కాదు. హైదరాబాద్ వెళ్ళినా, అమెరికాలో వున్నా నాకు వొక పల్లెటూరు కావాలి. హైదరాబాద్ లో నేను ఎక్కువ కాలం వుండలేకపోవడానికి కారణం అక్కడి శృతి మించిన నగర వాతావరణం. అదనంగా సాహిత్య జనాభా మరీ ఎక్కువ కావడం. హైదరాబాద్ గొప్ప నగరం. అందులో నా పల్లెటూరి మొహానికి చోటు ఎప్పటికీ లేదు. హైదరాబాద్ గురించిన ఈ ambiguity ఇప్పుడిప్పుడే కాస్త తొలగుతోంది. వొక దూరం, వొక దగ్గిర తనం, వొక తెలియని అయిష్టం, తెలిసీ తెలిసినట్టున్న ఇష్టం , హైదరాబాద్ నా వాస్తవంలోంచి చేజారిపోతున్నదన్న బాధ ఇప్పటి నా తాజా అనుభూతి. దీనికీ అక్కడి రాజకీయ పరిస్తితికి కొంత సంబంధం వుంది. ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా వుండాలన్న కోరిక కూడా లోపల్లోపల బలంగా వుంది. కానీ, నాకు మౌలికంగానే రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. అందుకే, నేను తెలంగాణ సాంస్కృతికత మీదా, హైదరాబాద్ సాంస్కృతికత మీదా, ఆ విలువల అన్వేషణ మీదా ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాను.
ఇక అమెరికా వచ్చాక నేను వున్న రెండు వూళ్ళు- మాడిసన్, ఆస్టిన్ – నా పల్లెటూరి మొహానికి బాగా సరిపోయాయి. కాబట్టి, సాహితీమిత్రుల సాంగత్యంలో నేను మరింత మంచి రచనలు చేయగలను అని చెప్పలేను. నికార్సైన మానవ ప్రపంచం, నిజమయిన మానవ విలువలు సాహిత్యలోకంలో లేవనుకుంటా, రోజువారీ యుద్ధం చేసే సామాన్యుల లోకంలో వున్నాయి. అందుకే వున్న చోటే పదిలం అని నా “వలస” లో రాసుకున్నాను. వున్న వూరుతో ఎంత అనుబంధం వుంటే అంత బాగుంటుంది. అది చింతకాని కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనంతపురం కావచ్చు, మాడిసన్ కావచ్చు, ఆస్టిన్ కావచ్చు, ఏ ఇసక ఎడారి అయినా కావచ్చు. ఇక్కడి గాలిలో, ఇక్కడి చెట్లలో, ఇక్కడి నీళ్ళలో, ఇక్కడి మనుషుల్లో నేను కలిసిపోవాలి. ఆ కలిసిపోవడంలోని ఆనందం, అంతకన్నా గొప్ప అనుభవం ఏ పుస్తకమూ ఇవ్వదూ, ఏ రచయిత సన్నిధీ ఇవ్వదు. "స్థావరం నా సమాధి. జంగమం నా ఇలాకా” అని “ఊరి చివర” లో వొక చోట రాశాను. జీవితం ఎప్పుడూ అద్దె ఇల్లు బతుకు మాత్రమే….కాబట్టి, ముందు నాకు ఇప్పుడు వున్న ఈ క్షణం, ఈ ఊరు బాగుండాలి, అప్పుడు నా నోరు బాగుంటుంది. నా కవిత్వమూ బాగుంటుంది – బాగున్నా లేకపోయినా అది కనీసం నాకు తృప్తినిస్తుంది.
ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి