నీరెండ రంగుల్లో

పచ్చగా వున్నప్పుడు పట్టించుకోని
క్షణాలెన్నో
మనసుకింద పడి నలుగుతుంటాయి
నీరెండ రంగుల్లో పరిమళాలు చుట్టూ అల్లుకుంటుంటే
చూపెక్కడో అతుక్కుంటుంది
దృశ్యాలు దారం కట్టి లాగినట్టు
మెల్లిగా దూరంగా కదులుతుంటాయి
ఎవరెవరో మెదులుతూ… నవ్వుతూ…
మాట్లాడుతూ….
మళ్ళీ కధ మొదలయినట్టుగా!
 

జీవితమంతేనేమో..
మొదలయినట్టే ఆగిపోతుంది
ఆగిపోతూనే ఆరంభమవుతుంది
అందరిలో నుండి
అన్ని భయాల్లో నుండి
ఎదగడం నేర్పుకుపోతుంది
 

మధ్యాహ్నపు ఎండ,సాయంత్రపు గాలి,
రాత్రి చుక్కలు ఎప్పుడూ ఏదో ఒకటి
గుర్తుకు తెస్తూనే వుంటాయి
మనసు మెచ్చే క్షణాలెన్నెదురైనా,
అడుగు ఆగిపోయిన గతాలే ఎక్కువ!

Posted in కవిత్వం | 3 Comments

నీకొక కవిత బాకీ


కొన్ని పదాలను పేర్చి వాక్యాల పొత్తిళ్ళలో
ఒక చిన్న మొక్కను
తన లేతపాటి ఆకులతో మృదువుగా చేతులు చాచే ఒక చిన్న మొక్కను నిర్మించగలమా?
 

బండబారిన ఈ చేతులతో
రోజూవారీ అనేకానేక చర్యలతో పలుమార్లు మృతప్రాయమై
దేహానికి ఇరువైపులా రెండు కట్టెల మాదిరి వేలాడే ఈ చేతులతో
దినానికొక్కతీరై పైపైకి సాగే ఒక చిన్న మొక్కను ఊహించగలమా?
 

ఎప్పుడో కొన్ని యుగాలకావల
ఙ్ఞాపకాల పొరల లోతుల్లో ఒత్తిగిలి
తన చేతులతో నాటిన ఓ చిన్ని మొక్కను
ప్రతి రోజూ లేచీ లేవగనే పక్కబట్టల మీదనుంచి పైకురికి
తనదైన ఆ చిన్ని అద్భుతం ఆ రోజుకుగాను
పచ్చని పలకరింపై ఏ మేరకు విస్తరించిందోనని
ఎదిగే ఆ పసిమి లోకం ముందర మన్నులో గొంతుకూర్చొని-
 

ఇప్పుడు ఈ చేతులలో
ఆకుపచ్చనివేవీ  పురుడు పోసుకోవు
నీటితో తడిసి  గాఢతనలుముకునే  మట్టి చారికలేవీ మిగిలిలేవు
 

ఇది ఒక శుష్క ప్రయత్నం
 

ఒక బాల్యంలాంటి
అటూ ఇటూ పరిగెత్తుతూ, అప్పుడప్పుడూ పాల తుత్తర తీరని ఏనాటివో స్మృతులతో
అమ్మ పాలిండ్లపై గారాంగా  మెత్తగ తడిమే పాపాయి చేతుల లాంటి
అపురూపమైనవేవీ ఈ కవితలలో పలకవు
చెక్కిళ్ళ మీద జారిన పాలచారికలలాంటి  ఙ్ఞాపకాలనేమీ ఈ పదాలు పుక్కిట పట్టవు

Posted in కవిత్వం | Comments Off on నీకొక కవిత బాకీ

సత్యాన్వేషణ – రెండవ భాగం

మానవుడు ఆర్థికజీవి. ఆర్థిక పరిస్థితులే అతని దృష్టిని నిర్ణయిస్తున్నాయి. అతని దృష్టి మారాలంటే ఆర్థిక పరిస్థితులు మారాలి. సంఘం రెండు వర్గాలుగా చీలి ఉంది – ధనవంతులు, బీదవాళ్ళు. వాళ్ల దృష్టిని వాళ్ల పరిస్థితి నిర్ణయించింది. సంఘంలో ఉన్నంతకాలం ఈ ఇద్దరికీ ఈ భిన్న పరిస్థితులు సరిపడవు. ధనవంతులకు ’హృదయ పరివర్తన’ కలిగి బీదవాళ్లకు సహాయం చేస్తారనుకోవడం హాస్యాస్పదం. వాళ్ల ఆర్థిక పరిస్థితిని నిర్ణయించినప్పుడు, ఆర్థిక పరిస్థితిని బట్టి భావాలు కలిగేటప్పుడు, ఆ పరిస్థితి యధాతధంగా ఉండగా వాళ్ల దృష్టి ఎలా మారుతుంది? ఇవన్నీ అబద్ధాలు. బీదప్రజలను మోసం చెయ్యడానికి చెప్పేమాటలు. ఈ మాటలు నమ్మగూడదు. బీదప్రజలు బాగుపడటానికి విప్లవమే మార్గం. అందుకు వర్గకలహమే సాధనం. “ప్రపంచ కార్మికులారా, ఏకము గండు”, “ఈ పోరాటంతో సంకెళ్ళు తప్ప మనకు పోయేది ఏవీ లేదు.”
ఈ సిద్ధాంతంలో భావానికి ప్రాధాన్యంలేదు. భావం ఆర్ధికపరిస్థితుల చేతుల్లో కీలుబొమ్మ అయింది. భావంతోపాటు మానవుని పనీ అంతే అయింది. భగవంతుడు ఒకడున్నాడని అంగీకరించే ఆధ్యాత్మికవాదులు ’పురుష ప్రయత్నం అవసరం’ అని చెప్పినట్లే వీరూ ’మానవ ప్రయత్నం అవసరం’ అంటారు. అనటమేగాని మానవుడు ఒకప్పుడు ధనవంతుని చేతుల్లోనూ, మరొకప్పుడు భగవంతుని చేతుల్లోనూ కీలుబొమ్మ అయినప్పుడు ఎట్లా వీలు? అవసరం ఎక్కడ? అంతేకాదు నైతిక విలువలక్కూడా సంఘంలో స్థానం లేకుండా పోయింది.
అన్నం కావాలి. ధనికవర్గం అధికారంలో ఉన్నంతకాలం బీద ప్రజలకు అన్నం దొరకటం అనేది పేరాశ, జరిగే పని కాదు. కాబట్టి బీదప్రజలు అధికారాన్ని చేపట్టాలి. అందుకు ఏ పని చెయ్యటం అవసరమైతే అదే ధర్మం. ఏ సాధనం ఈ ఆదర్శాన్ని నెరవేర్చగలుగుతుందో అదే ఉత్తమ సాధనం, మిగిలినవన్నీ బూటకపు మాటలు. సంఘంలో మార్పు రాకుండా ఉండటానికి ధనికవర్గం తయారుచేసిన తియ్యని మాత్రలు.
ఈవిధంగా సిద్ధాంతం నిర్మించబడింది. ఉద్యమం ప్రచారంలోకి వచ్చింది. బీదప్రజలు నడుం కట్టారు. విప్లవాలు చెలరేగినాయి. దయాసత్యశౌచాలు లేవు. మానవుడికీ మానవుడికీ ఉన్న సంబంధం తెగిపోయింది. ధనార్జన పరమార్థం అయింది. ఏవిధంగానైనా సరే డబ్బు సంపాదించటమే ప్రయోజకత్వంగా భావింపబడింది. మిగిలిన విలువలన్నీ దద్దమ్మల ఊహలక్రింద జమకట్టబడినాయి. ఒకరినొకరు మోసం చేసుకోవటం, అబద్ధం ఆడో, అవినీతిగా ప్రవర్తించో తన పనిని నెరవేర్చుకోవటం పురుష లక్షణం అయింది. మానవసంఘం దద్దరిల్లింది. ఉత్తమ పురుషులు మానవులను ఆవహించిన ఈ పైశాచిక దృష్టికి ఆహుతి అయ్యారు. మానవులు ఏళ్లతరబడి మూటకట్టిన తమ సంస్కారాన్ని తుడిచిపెట్టి ఎకాఎకిని జంతుజాలంలోకి దిగజారటానికి సిద్ధపడుతున్నారు. తమ సమాధిని తాము తవ్వుకుంటున్నారు. ఎవరికివారు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు, ఏదో ఒక లోకోత్తర విషయాన్ని సాధిస్తున్నట్టు భావిస్తూ తమ శక్తినంతా ఉపయోగించి వృధా కాలయాపన అవుతుందేమో అనే భయంతో, రేపు మనది కాదు అనే ఆతురతతో తమ సమాధిని తాము తవ్వుకుంటున్నారు
ఇక గత్యంతరం ఏమిటి?

ప్రపంచానికి ఈ విషమ పరిస్థితి ’మానవుడు ఆర్థికజీవి’ అనుకోవటంవల్ల వచ్చింది. ఈ సిద్ధాంతం – సామాన్య ప్రజలను గర్భదారిద్ర్యంలో ఉంచి, ఉత్తమ సిద్ధాంతాలను తాము ఆచరించకుండా, ఇతరులను తమ సొంత బలుపుకి ఉపయోగించుకోవటానికిగాను వాడే ధనికవర్గం వల్ల అవసరం అయింది. బ్రతుకే అనిత్యంగా కనపడేటప్పుడు మిగిలిన మాటలు ఎవరి చెవులకి ఎక్కుతాయి? కాబట్టి, ఈ సిద్ధాంతం గాలిదుమారానికిమల్లే ప్రజల్లో వ్యాపించటానికి ముఖ్యకారకులు ప్రజలు కాదు. ఈ సిద్ధాంతం అవసరాన్ని సంఘానికి ’తప్పనిసరి’ చేసిన స్వార్ధపరులు.

***********************

జీవకోటి పరిణామం ఎక్కడో ఒకచోట ఆగదు. మానవుడు బ్రతకటానికి చేసే ప్రయత్నాన్నుంచి స్వతంత్రేచ్ఛకూ, స్వతంత్రేచ్ఛనుంచి సత్యాన్వేషణకూ పరిణామం చెందాడు కాని, మానవుని జ్ఞానం సంకుచితం అవటంవల్ల, ఒక దశలో ఉన్న మానవుడు ఆ దశే సత్యమనీ, నిత్యమనీ అనుకుని ఆ దశను పట్టుకుని కూర్చోవటం వల్ల అనేక చిక్కులూ, వ్యర్థపోరాటాలూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిణామం చెందటానికి, ఆ పరిణామానికి తగిన సంస్కారాన్ని సృష్టించుకోవటానికీ, మానవుడు వెనుకంజ వెయ్యటానికీ, విజ్ఞానం, అజ్ఞానజనితమైన భయం, రెండూ కారణాలు. కోతులు మానవదశకు రావటానికి చాలా ఎదురు తిరిగి ఉంటాయి. ఈ పరిణామాన్ని సూచించే చిహ్నాలను నిరుపయోగమైన, తమ బ్రతుకుని అంతంచేసే చిహ్నాలుగా భావించి వాటిని నిర్మూలించటానికి ఎంతో ప్రయత్నించి ఉంటాయి. ఎందుకంటే తాము ఉన్న స్థితికి ముఖ్యావసరంగా కనపడే అనేక లక్షణాలు వచ్చే స్థితిలో ఉండవు. అవి లేకుండా తామెలా బ్రతకటం? రెండు కాళ్లమీద నడవటానికి ప్రయత్నించిన మొదటి కోతిని మిగిలినవన్నీ ఎంత ఎగతాళి చేసి ఉంటాయో! ’దానికేమి పోయేరోగం!’ అని బుగ్గమీద వేలువేసుకుని ఉంటాయి.
మానవునిలోనూ ఈ లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పై స్థితికి వెళ్లటానికి భయం. అదేదో అగాధంగా కనిపిస్తున్నది. ఈ స్థితికి అవసరం అయినవాటిని వదులుకుంటే ఏమౌతామో అనిపిస్తుంది. దీనినే ’fear of freedom’ అంటారు. ఈ భయం వల్ల ఎదురుతిరిగి తన ప్రాణాలను కూడా లెక్కచెయ్యక పోరాడుతాడు. ఉన్నచోట ఉండటమే వాంఛిస్తాడు. తెలియని మిత్రునికంటే తెలిసిన విరోధే నయం అనుకుంటాడు.
ఒకదశలో ఉన్న మానవుడు పైదశలో ఉన్న మానవుణ్ణి అర్థం చేసుకోవటం కూడా కష్టమే.ఎందుకంటే అతని చిత్తప్రవృత్తి వేరు, అతని సమస్యలు వేరు, అతని పరిష్కార మార్గాలు వేరు. ఎవరికివారు తమ తమ చిత్తవృత్తులనుబట్టే ఇతరులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు గనుక, అపార్థం చేసుకోవటానికి ఎక్కువ వీలుంది. ఈ విషయం మన నిత్య జీవితంలో అనుక్షణం అనుభవానికి వస్తూనే ఉంటుంది. కానీ పై స్థితిలో ఉన్నవారికి కిందిస్థితిలో ఉన్నవారి సమస్యలు అర్ధం చేసుకోవటం తేలిక. వారికి మార్గంచూపి, అంటే వారి సమస్యలను పరిష్కరించటానికి సహాయపడి, వారి అభివృద్ధికి ఆటంకం తొలగించటం వారి ధర్మం. ఈ దృష్టివల్లనే ’వేదాంతం ఆకలితో మాడేవాడికి కాదు.’, ’నాదేశంలో ఒక కుక్క ఆకలితో మాడుతున్నా దాని ఆకలి తీర్చటమే నా ధర్మం’ అనే సూక్తులు వేదాంతుల నోటినుండి వెలువడ్డవి.
కాబట్టి ఆర్ధిక పరిస్థితులే మానవుని దృష్టిని నిర్ణయిస్తాయి అనుకోవటం పొరపాటు. అది ఒక బలమైన శక్తి, కాని మానవుని దృష్టిని నిర్ణయించే శక్తి మరొకటి కూడా ఉంది. అది జ్ఞానం. దీన్ని సంస్కారం అనండి, భావం అనండి, మరింకేమన్నా అనండి- ఆర్ధిక పరిస్థితికాక మరొక శక్తి కూడా మానవుని దృష్టిని నిర్ణయించటానికి తోడవుతూ ఉందని మాత్రం అంగీకరించాలి. ఇది అంగీకరించకపోతే మానవుడు పరిష్కరించలేని విషమ పరిస్థితులు కలుగుతాయి. భావాన్ని కూడా ఒక శక్తిగా  అంగీకరించినంత మాత్రాన భావవాదుల సిద్ధాంతాన్నంతా అంగీకరించవలసిన అవసరం లేదు. పదార్ధం వేరు, శక్తి వేరు అని ఒప్పుకోవలసిన అవసరం లేదు. ఈ శక్తే వివిధరూపాలు ధరిస్తూ ఉందని ఒప్పుకోవలసిన అవసరం లేదు. ఈ శక్తి కూడా పదార్ధంలోనుంచి పుట్టినదే కాని తన ప్రభావం వల్ల తాను వృద్ధి చెందగలదు. తానొక శక్తిగా వృద్ధిచెంది, మానవుణ్ణి మార్చగలదు. పుట్టటం పదార్థ పరిణామంవల్ల పుట్టినా, పుట్టిన తరువాత తన కాళ్ల మీద తను నిలవగలదు.
“మీరు అన్నట్లు జ్ఞానం అంత శక్తి గలదైతే ఇతర వర్గాలకు చెందిన మేధావులు, మధ్యలో మోసంచేసి ధనికవాదుల్లో చేరతారు ఎందుకు?” అని అడిగాడు శిష్యుడు.
శిష్యుని మనస్సులో చెలరేగుతున్న ఊహలు గురువు గమనించాడు. ’మానవుని దృష్టి అచ్చగా ఆర్థిక పరిస్థితిని బట్టే ఉంటుంది’ అని చెప్పేవారి వాదన ఇది. ఆర్థిక పరిస్థితే కారణం అయినప్పుడు, ఇతర వర్గాలకు చెందిన మేధావులు బీద ప్రజలకు సహాయం చెయ్యటానికి పూనుకోవటంగానీ, బీదవాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడే పార్టీలో చేరటంగానీ, ఎలా తటస్థిస్తుంది?’ అనే ప్రశ్నకు ’కీర్తి కోసం’ అంటున్నారు. ఎవ్వరైనా సరిపడక మానుకుంటే ’అదుగో చూడు’ అని వేలుపెట్టి చూపుతున్నారు. ఇటువంటి మేధావులు ఎవ్వరైనా అగ్రగాములుగా ఉండి విప్లవాన్ని నడిపితే ఏమీ చెప్పలేక ’declassed individuals’ అని చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి, భావాల బలాన్ని అంగీకరించకపోవటం వల్ల వచ్చిన చిక్కులు ఇవి. ఈ సమస్యలన్నీ శిష్యుణ్ణీ కలవరపరుస్తున్నాయని గురువు గ్రహించాడు.
“నాయనా, అటువంటి వాళ్ళు భావాల బలంవల్ల చేరినవాళ్ళుగాని, ఆర్ధికస్థితి వల్ల చేరినవాళ్ళు కాదు. కష్టాలను తట్టుకునే జ్ఞానం వాళ్లకు లేనప్పుడు తమ ప్రయత్నంనుంచి విరమిస్తారు. ఇది ఒక్క మేధావులకే కాదు బీద ప్రజలకు కూడా వర్తిస్తుంది. దీనజనోద్ధరణకు కంకణం కట్టుకున్న పార్టీలకు ఎంతమంది బీద ప్రజలు వ్యతిరేకంగా నిలవటంలేదు! వారికి తగిన చైతన్యం లేదని నీవు సరిపుచ్చుకుంటావు. వీరిని గురించి కూడా ’కష్టాలను ఎదుర్కొనే ’భావ బలం’ వీళ్లకు లేకపోయింది’ అని ఎందుకు అనుకోవు? అది కాకుండా మరొక విషయం కూడా నీవు ఆలోచించాలి. .ఇతర వర్గాలకు చెందిన మేధావులు ఆపేక్షించేది అన్నం కాదు. వారిని నడిపేశక్తి స్వతంత్రేచ్ఛ, సత్యాన్వేషణ. వ్యక్తిగతంగా వారి అభిలాష ఏదైనా, దారిద్ర్యం నిర్మూలించటం ప్రథమ కర్తవ్యం గనక బీద ప్రజలకోసం, అన్నంకోసం పోరాడే ఉద్యమాలలో పాల్గొంటారు. ఒళ్ళు దాచుకోకుండా పాటుపడతారు కాని, వారి వ్యక్తిగత అభిలాషైన ’స్వతంత్రేచ్ఛ’కు, ’సత్యాన్వేషణ’కు ఈ ఉద్యమాలు అడ్డు తగిలినప్పుడు ఆ ఉద్యమాలనుంచి విరమిస్తారు, అంతకంటే గత్యంతరం ఏముంది?” అన్నాడు గురువు.

*  *  *  *  *

మానవుని పరిణామానికి దోహదం ఇచ్చే శక్తుల్లో భావానికి ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. జీవకోటికి తెలివితేతలు వచ్చినప్పటినుంచి, ఆలోచించగలిగిన శక్తి వృద్ధి పొందినప్పటినుంచీ, భావ ప్రభావం మానవుని మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆలోచనాపరుల సంబంధాల్లో ఆర్థిక దృష్టి ఎంత తక్కువగా కనిపిస్తుందో మనకు తెలిసిన విషయమే! భావానికున్న ఈ శక్తిని మనం అంగీకరించకపోతే, స్వాతంత్ర్యం కోసం ఆస్తులను అమ్ముకున్న వారినీ, ఇతర వర్గాలకు చెందిన బీదవాళ్లకోసం సమస్తం త్యాగం చేసిన వారినీ మనం అర్థం చేసుకోలేము.
ప్రకృతి నియమబద్ధమైనది. మానవుడు ప్రకృతిలో భాగమే అందువల్ల ఈ నియమబద్ధత ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఇన్ని అవాంతరాలు దాటి ఎవరో ముందుండి దారి చూపుతున్నట్లు ఒక స్థితినుంచి ఒక స్థితికి పరిణామం చెందగలిగేది కాదు. స్వభావ సిద్ధంగాఉన్న ఈ నియమ బద్ధతే నీతికి దారి తీసింది.
మానవజీవితంలో నీతినియమాలు ఎక్కడనుంచో వచ్చిపడినవి కాదు. ప్రకృతిలోఉన్న నియమబద్ధతకు సంబంధించిందే. ఒకరికొకరు సహాయం చేసుకోవటంవల్లా, అందరూ కలిసి బ్రతకవలసిన అవసరం ఉందటం వల్లా వచ్చినవే. ఒరిపిడివల్ల పుట్టి, అవసరంకొద్దీ నిలిచినవే. కాకపోతే, పరిణామక్రమంలో జీవకోటికి ఆలోచనాశక్తి వచ్చిన తర్వాత, సాంఘిక పరిస్థితులకు దూరంగా వాటంతట అవి నిలబడ గలుగుతున్నాయి. మానవకోటిని మృగదశకు జారకుండా కాపాడుతున్నాయి. నీతినియమాలు సంఘానికి ద్వారపాలకుల్లాగా ఎల్లప్పుడూ ఉండవలసిందే. వీటిని కాపాడి ఆచరించవలసిన బాధ్యత మాత్రం, మనముందు అన్నంకోసం తాపత్రయపడవలసిన అవసరంలేని వర్గాలది. వారే వీటిని విస్మరించి నిర్దాక్షిణ్యంగా ధనార్జనే పరమార్థంగా పెట్టుకుంటే, అన్నార్తులు తమ పొట్టకోసం వాటిని తిరస్కరించి విజృంభించటంలో ఆశ్చర్యం లేదు. ’నీవు రేపిన సుడిగాలి నీవే అనుభవిస్తావు’, ధర్మంగా బ్రతుకుతూ, దారిద్ర్యంలో, అజ్ఞానంలో ’దినదినగండంగా’ జీవితం వెళ్లబోసుకునేవాళ్ల సమస్యల పరిష్కారానికి సహాయపడి, వాళ్ళు కూడా నీతినియమాలు పాటించటానికి వీలైన పరిస్థితులను సృష్టించటం పైవర్గాల వారి విధి. అది జరగనప్పుడు ప్రళయమే.

* * * * * * * * * * *

మానవుడు పరిణామంలోని రాబోయే దశకు వెళ్ళటానికి భయపడుతున్నాడు. ఈనాడు మానవ జీవితానికి ఏవి ముఖ్యావసరం అనుకుంటున్నాడో, వాటికి రాబోయే దశలో విలువ ఉండదు. ’అవి ఊతంగా లేని స్థితిలో తను ఎలా బ్రతికేటట్టు? తను ఏమైపోతాడో?’ అని విపరీతమైన భయంతో వణికిపోతున్నాడు. ఇప్పటి లక్షణాలనుబట్టి ఆ స్థితిలో ఇప్పుడున్న ఆర్థిక సంబంధాలు, ఇప్పుడున్న విలువలు అన్నీ తారుమారు అయ్యేటట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న మానవుని చిత్త ప్రవృత్తికి ఆ స్థితి ఏమీ ఆకర్షవంతంగా కనుపించటం లేదు. పర్వత శిఖరాగ్రంనుంచి లోయలోకి దూకవలసిన మనిషికిమల్లే భయపడుతున్నాడు. కాని పరిణామశక్తి అతన్ని ముందుకు నెడుతూ ఉంది. అతను ఉక్కిరిబిక్కిరై ఎదురు తిరిగి పోరాడుతున్నాడు. రావలసిన స్థితికి దోహదం ఇచ్చే గుణాలను నిర్మూలించుకుంటున్నాడు. ఏ సంస్కారం, ఏ విజ్ఞానం, ఏ నైతిక దృష్టి తనను “ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు” అని ప్రోత్సహిస్తూ ఉందో, బలవంతపెడుతూ ఉందో దాని గొంతు నులమటానికి పూనుకున్నాడు. అది నశిస్తేగాని తనకు రక్షణలేదు అనుకుంటున్నాడు. మృగదశకు తరలిపోవటానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు.
ఇదీ నేటి విషమావస్థ. ఒక్క సంఘమే కాదు, ఏ మానవుడికి ఆ మానవుడే విషమావస్థలోపడి కొట్టుకుంటున్నాడు. అధోగతికి పోతున్న ప్రస్తుత పరిస్థితులలో బ్రతకటానికి అవసరం అయిన దృష్టీ, ఈ దృష్టికి వ్యతిరేకంగా ముందుస్థితికి వెళ్లమని ప్రోత్సహిస్తున్న పరిణామశక్తీ – ఈ రెంటికీ సమన్వయం కుదరక గగ్గోలు పడుతున్నాడు. తనలో రేగిన ఈ ద్వంద్వ సంరంభం వల్ల నిర్వీర్యుడై, దిగాలుపడి కూర్చున్నాడు.
మానవుడు రక్షింపబడాలి. పరిణామం అవిఘ్నంగా ముందుకు సాగిపోవాలి. మానవుని పతనానికి కారణం అయిన దారిద్ర్యాన్ని నిర్మూలించి, పురోగమనానికి అవకాశం కలిగించే పరిస్థితులు సృష్టించాలి. మానవునిలో ఉన్న, వచ్చేదశను సూచించే లక్షణాలకు ప్రోత్సాహం ఇచ్చి విజృంభింపజెయ్యాలి. ఆ శక్తులను సంఘటితపరచి, ముందుకు నడవాలి. మానవునికి ’చిన్నచూపు’ అలవాటైంది. స్వభావమైంది. ప్రతివస్తువునీ విభజించిగాని చూదలేకపోతున్నాడు. ఏ ముక్కకి ఆ ముక్కే పరిపూర్ణం అనుకుంటున్నాడు. వీటిని అన్నిటినీ కలిపి చూడగల శక్తి అతనికి కావాలి. భిన్నత్వంలో ఏకత్వం చూడగలగాలి. మానవుడు ముఖ్యం. మానవుడి శ్రేయస్సు మనం కాంక్షించేది. మానవుని సహజ శక్తులు అభివృద్ధి చెందటానికి అవకాశం కలిగించటం లక్ష్యం. ఏ రూపంలో, ఏ పేరుతో మానవుని స్వతంత్ర పిపాసను అరికట్టటానికి ప్రయత్నించినా అది మానవుని పతనానికి, సంఘవినాశనానికీ దారి తీస్తుంది.
ప్రపంచ పురోగమనాన్ని నిర్ణయించటానికి కొలబద్ద మానవుడే. అతన్ని వదిలి సంఘశ్రేయస్సు అనేది ప్రత్యేకం లేదు. దేశం, సంఘం, వర్గం, పార్టీ – ఈ భిన్నదృక్పథాలకు ఆదర్శం. మానవుని సహజ శక్తులు విజృంభించే అవకాశం కలుగజెయ్యటమేగాని, తమకు మానవునికి భిన్నంగా వ్యక్తిత్వం ఆపాదించుకొని, ఏదో ఒక వంకతో అరికట్టటం కాదు. ఏ దృక్పథమైనా అతని పరిణామానికి దోహదం ఇచ్చేదిగా ఉండాలి. కాని, అతనిమీద పెత్తనం చెలాయించేదిగా ఉండగూడదు.
“Man is the measure of things.”

Posted in వ్యాసం | 1 Comment

సత్యాన్వేషణ – మొదటిభాగం

మానవలోకంలో ధర్మానికి చోటు లేకుండా పోయిందని లోకం గగ్గోలు పెడుతూ ఉంది. ఇంచుమించు అన్ని దేశాలలోని మేధావులూ ఈ విషయం నొక్కి చెబుతున్నారు. పరిస్థితులు ఈ విధంగానే సాగిపోతే, కొద్దికాలంలోనే మానవుడు, యుగయుగాల నుంచీ తను సంపాదించిన జ్ఞానం, సంస్కారం కోల్పోయి జంజాలంలోకి దొర్లుతాడని భయపడవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి.
ఇటీవల పెచ్చుపెరిగిపోయిన దోపిడీవిధానం, దారిద్ర్యం దీనికి కారణం. మనిషికి ఎదో ఒక రకంగా బ్రతకటమే ముఖ్యసమస్య అయింది. బ్రతుకు దినదినగండం అయింది. అన్నమే ’పరబ్రహ్మ స్వరూపం’ అయింది. మనిషి ’ఆర్థికజీవి’ అయ్యాడు. అన్నం సంపాదించటానికి అవసరమైన విషయాలుకాక, మిగిలినవన్నీ తమ విరోధివర్గం తమను మోసం చేసి, తమను అజ్ఞానంలో, దారిద్ర్యంలో, బానిసత్వంలో అట్టిపెట్టటానికి లోకంమీద రుద్దిన ’విలువలు’గా పరిగణింపబడినాయి. అన్నంకోసం మానవుడు తన ఆత్మను చంపుకున్నాడు. సహజపరిణామాన్ని అరికట్టుకున్నాడు. బ్రతుకే దుర్ఘటం అయినప్పుడు అది అవసరమే అయింది. సంఘంలో నైతిక విలువలకు చోటు లేకుండా పోయింది.
మానవ పరిణామం ప్రాణం నిలుపుకోవటంతో ఆగదు. షడ్రసోపేతంగా భోజనం లభించినంత మాత్రాన మానవుడు తృప్తిపడడు, నిజమే. కానీ జనసామాన్యానికి తిండే కరువైనప్పుడు , ఏదో ఒకవిధంగా తిండి సంపాదించటమే ఆదర్శం అవుతుంది. తమకు తిండిని సంపాదించిపెట్టే ప్రతి సాధనం ఉత్తమసాధనమే అవుతుంది. నైతిక విలువలు నశిస్తాయి. సంఘం ఉడికిపోతుంది. ప్రజాబాహుళ్యాన్ని దారిద్ర్యంలో ఉంచటం వల్ల వచ్చిన పాపం మొత్తం సంఘానికి కొడుతుంది. మానవజాతే నశించేస్థితికి వస్తుంది. దారిద్ర్య నిర్మూలనమే దీనికి మందు. పైపూత వల్ల ప్రయోజనం ఉండదు. మానవుణ్ణి మిగిలిన విలువల్ని కోరగలిగిన స్థితిలో పెట్టాలి ముందు.
“అన్నమే పరబ్రహ్మం” అన్నాడు సత్యాన్వేషకుడైన శిష్యుడు.
“నాయనా, అన్నాన్ని మరిగించు” అన్నాడు గురువు.
శిష్యుడు మరిగించాడు. సత్యాన్ని కనిపెట్టాను అనుకున్నాడు.
“ప్రాణమే పరబ్రహ్మం” అన్నాడు.
“నాయనా, ప్రాణాన్ని మరిగించు” అన్నాడు గురువు తొణకకుండా

శిష్యుడు మరిగించాడు. ఈసారి తప్పకుండా సత్యాన్ని కనిపెట్టాను అనుకున్నాడు. ఉప్పొంగిపోయాడు.
“జ్ఞానమే పరబ్రహ్మం” అని చెప్పాడు.
దీనికి కూడా గురువు తొణకలేదు. “నాయనా, జ్ఞానాన్ని మరిగించు” అని చెప్పాడు.
శిష్యుడు జ్ఞానాన్ని మరిగించాడు. “ఆనందమే పరబ్రహ్మం” అని చెప్పాడు.

అధ్యాత్మికవాదులకు ’సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి’ పరమార్థం.అధ్యాత్మికవాదులు మానవునిలో అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలున్నాయని చెబుతారు. ఇది జీవకోటి పరిణామాన్ని నిరూపిస్తుంది. కానీ ఒకకోశం వృద్ధి చెందినంత మాత్రాన పూర్వకోశం రూపరహితం కాదు, ఉంటూనే ఉంటుంది. దానికి అవసరమైన పనులు జరుగుతూనే ఉండాలి. కానీ మానవుడి పరిణామాన్ని బట్టి ఒక్కొక్క దశలో ఒక్కొక్క కోశం ప్రాధాన్యం వహిస్తుంది.
పరిణామం ప్రవాహం లాంటిది. అంటే ఎప్పటికప్పుడు కొత్తనీరు కలుస్తున్నా పాతనీరు ఉండనే ఉంటుంది. పరిణామవాదాన్ని బట్టి, కదలని స్థితినుంచి కదులుతూ ఒక చోటునుంచి కదలని ఆ స్థితినుంచి నాలుగు కాళ్లమీద నడిచే స్థితికీ, ఆ స్థితి నుంచి రెండు కాళ్లమీద నడిచే మానవుని స్థితికీ ప్రకృతి పరిణామం చెందిందని తెలుస్తుంది. ఈ బాహ్యలక్షణాలన్నీ మానవునిలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రపంచం స్థూలదృష్టికి కనిపిస్తున్నట్టు, ముక్కలు ముక్కలుగా, ఏ ముక్కకి ఆ ముక్కగా పరిణామం చెందటం లేదు. ఒకే పునాదినుంచి ఒకేవిధంగా పెరుగుతున్నది.
ఆధ్యాత్మికవాదులు భావానికి ప్రాధాన్యం ఇచ్చారు. పదార్థము చైతన్యమూ వేరనీ, చేతనశక్తి అనేక రూపాలు ధరిస్తూ ఉందనీ అనుకోవటం దీనికి కారణం. శక్తికి గుణం ఉండదు. జీవకోటికి కనపడే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు పదార్ధానికి సంబంధించినవి. వీటిని జయించాలి, మానవుడు మోక్షాన్ని సాధించాలంటే త్రిగుణాతీతుడు కావాలి. తత్వమసి, ’అహం బ్రహ్మాస్మి’ అనే సంస్కారాన్ని పొందాలి అన్నారు.
పదార్థం, చైతన్యం వేరు అనుకోవటం వల్లా, చేతనశక్తి అనేకరూపాలు పొందుతూ ఉంది అని అనుకోవటం వల్లా, తనకూ మోక్షానికీ మధ్య పదార్థం నిలబడి తనను తప్పుదారులను తొక్కిస్తూ ఉంది అని అనుకోవటంవల్లా అనేక చిక్కులు తటస్థించినాయి. శరీరం మీద ఏహ్యభావం కలగటం, భౌతిక సమస్యలనుంచి వైదొలగటం, ప్రపంచాన్ని రోయటం, ఎవరికివారే తమ ముక్తికోసం కృషి చెయ్యటం, మానవప్రయత్నం మీద కంటే భగవంతునిమీద భారం వెయ్యటం మొదలైనవి. ఈ దృష్టి వల్ల ప్రజాబాహుళ్యానికి తీరని అపకారం జరిగింది. జ్ఞానంలో, దారిద్ర్యంలో మ్రగ్గటమే వారి జీవితం అయింది. తాము ముక్తిని పొంది, నిరంతరం ప్రజల సేవలో మునిగితేలినటువంటి బుద్ధునిలాంటి మహాపురుషులు మనదేశంలో లేకపోలేదు. తమకు విముక్తి లభించింది, తమ మనస్సులు అతినిర్మలంగా ఉంటాయి, వారు నిరంతరం కర్మలు చేస్తుంటారు కాని ఆ కర్మలు బంధాలు అవవు, వారిని అంటవు. ఈ స్థితికంటే పై స్థితి ఏదైనా ఉన్నా వారు కోరరు. బుద్ధుడు ఈ విధంగానే ప్రవర్తించాడని చరిత్ర చెప్పుతుంది. లోకంకోసం పై స్థితిని అతను నిరసించాడు.
కాని, ఇటువంటి దివ్యపురుషుల్ని కూడా ఆధ్యాత్మికవాదులు ’నాస్తికులు’ అని నిందించారు. దీనివల్ల ఆధ్యాత్మికవాదుల మనఃప్రవృత్తి అర్ధం అవుతుంది. ఏదైనా భగవంతుని వాసయోగ్యమైన ఈ శరీరం, వివిధ రూపాలు, ఈ ప్రపంచం వారికి పాపభూయిష్టంగా కనపడటం చాలా ఆశ్చర్యం.
మన వేదాంతంలో జ్ఞాని కర్మ చెయ్యాలా, అక్కర్లేదా అనేది చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్యమీద అనేక వాదోపవాదాలు చెలరేగినాయి. సామాన్య మానవుల మాట అటు వుంచి, జ్ఞానము, కర్మ -ఈ రెండూ వేరువేరు అయినట్లు అర్జునుడు శ్రీకృష్ణుని ’జ్ఞానకర్మలలో ఏది ఉత్తమము?’ అని అడిగాడు. ఇది ఉత్తమమా, అది ఉత్తమమా అని అడగటానికి ఈ రెండూ ఒకదానికి ఒకటి సంబంధంలేని విషయాలు కావు, ఒకదానిమీద ఒకటి ఆధారపడిన విషయాలు. ఒకే వస్తువు యొక్క రెండురూపాలు, ఎవరికీ అకర్మ స్థితిగాని, పూర్తికర్మస్థితిగాని సాధ్యంకాదు.

ఆలోచన కూడా ప్రకృతి చేష్టే! సంకల్పం కూడా కర్మే!
భగవంతునిమీద ఆధారపడటంవల్లగానీ, ఎవరి విముక్తి కోసం వారు పాటుపడుతూ, భౌతిక సమస్యలను సామాన్యుల చేతుల్లో ఉంచటంవల్లగానీ ప్రజలస్థితి దుర్భరం అయింది. దీనికితోడు అధికారంలో ఉన్నవారు ఆధ్యాత్మికవాదాన్ని తమ అధికారాన్ని నిలబెట్టుకోవటానికీ, తమ సుఖాలకూ ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. ప్రజలు నానాటికీ దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించటానికి మరొక సిద్ధాంతం అవసరమయింది. ఆ పరిస్థితులు మరొక సిద్ధాంతానికి దారితీశాయి.
భగవంతుడు లేడు. సంఘంలోని ఈ హెచ్చుతగ్గులు భగవంతుడు సృష్టించాడని చెప్పటం మోసం. ప్రజాబాహుళ్యాన్ని దారిద్ర్యంలో ఉంచి, వారి సహజ శక్తుల్ని చంపి, నిరపాయంగా దోపిడీ చెయ్యటానికి స్వార్థపరులు, ధనికవాదులు సృష్టించిన సిద్ధాంతం ఇది. వర్గసామరస్యం అబద్ధం. దోచుకునేవాళ్లకీ, దోపిడీచెయ్యబడే వాళ్లకీ సామరస్యం ఏమిటి? వర్గకలహమే యథార్థం. వర్గకలహం వల్లే సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది.
పదార్థమే అనాది పదార్థం. పదార్థానికి విడిగా దానిని నడిపించే మరేశక్తీ లేదు. పదార్థం తనకు తానే పరిణామం చెందుతూ ఉంది. అది దాని స్వభావం. పరిణామం చెందుతూ, తనలో ఉన్న శక్తులను బహిర్గతం చేసుకుంటూ ఉంటుంది. ఈ పరిణామాన్ని ఎవ్వరూ పైనుంచి నిర్దేశించలేదు. ఎవ్వరూ పైనుంచి ఈ పరిణామానికి సహాయం చెయ్యటం లేదు. అనుభవంవల్ల ప్రకృతిచేష్టలను అర్ధం చేసుకుని, ప్రకృతినుంచి రక్షించుకోటానికి అవసరమైన గుణాలను తనలో తాను పెంపొందించుకుంటూ జీవకోటి వృద్ధి చెందుతూ ఉంది.

 

(1949 విరోధి సంవత్సరాది సంచిక నుండి – DLI సౌజన్యంతో)

Posted in వ్యాసం | 3 Comments

శారద దరహాసం – 1

కామేశ్వరరావు:

శ్రీగణనాథుకు మ్రొక్కిడి
వాగీశ్వరి మదిని దలచి పద్యములల్లన్
జాగేల వేగ రండిక
స్వాగతమిదె పలుకుచుంటి సత్కవులారా!

కామేశ్వరరావు: రానివాళ్ళని కూడా పిలిచానన్నమాట 🙂

శ్రీరామ్: చమత్కారం బాగుంది

కామేశ్వరరావు: విజయదశమి సందర్భంగా జరిగే సమ్మేళనం కాబట్టి అమ్మవార్లని తలచుకొని సభ మొదలుపెడదాం. సనత్ గారూ, మీరు లక్ష్మీ ప్రార్థన చెయ్యండి.

సనత్ కుమార్: తప్పకుండా..

ఇచ్చెద మీదు కోడలికి ఇంపగు పద్య సుమమ్ములన్; పసు
ప్పచ్చని కొమ్ములిత్తు గిరిబాలకు నెయ్యపు టాడబిడ్డకున్
ముచ్చట మీర బంధు గణమున్ గొని వాయనమందుకొమ్మ! శ్రీ!
త్వచ్చరణమ్ములన్ నత శతమ్ములొనర్చెద! విష్ణు నిచ్చెదన్!!
 

రాకేశ్వరుండు: మీదు కోడలికి?

కామేశ్వరరావు: లక్ష్మి కోడలు సరస్వతి కదా

సనత్ కుమార్: ఎవరికిష్టమైనవి వాళ్ళకి వాయనం ఇస్తాను. మీ ఆడపడచుకి పసుపు కొమ్ములూ, మీ కోడలికి ఇంపైన పద్యాలు. మీ బంధుమిత్ర సపరివారం గా నువ్వు విచ్చేస్తే నీకు ఏమివ్వగలను? ఏదిచ్చిన

పుష్యం: బాగుంది..

కామేశ్వరరావు: లక్ష్మితో పాటు ఇద్దరమ్మలు కూడా వచ్చేసారు! బాగుంది.

గిరి: చాల బావుంది

విశ్వామిత్ర: అందరికీ వందనములు

ఫణి: బాగుంది.

శ్రీరామ్: గురువులకి వందనాలు

రానారె: ఆహా! బాగుంది. విష్ణునిచ్చెదన్ అని ఎవరో అంటున్నారే అని… విశ్వామిత్రులొచ్చారు

సనత్ కుమార్: సాధారణంగా వాయనా లిచ్చుకునేప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదువులు మీ కోడలినీ, మీ అమ్మయినీ కూడా తీసుకు రండి అంటారు కదా.. అట్లా…

కామేశ్వరరావు: పార్వతికి పసుపుకొమ్ములివ్వడం బాగుంది!

కామేశ్వరరావు: విశ్వామిత్రులకి స్వాగతం

విశ్వామిత్ర: శ్రీరాం గారు బహుకాలదర్శనాలు

సనత్ కుమార్: ఇంతమందిని తీసుకుని మేము చేసే శారద దరహాసానికి వచ్చి

సనత్ కుమార్: పద్య వాయనాలు అందుకోవమ్మ, శ్రీ అని ప్రార్థన.

శ్రీరామ్: మీరెప్పుడూ నాకు ప్రాతఃస్మరణీయులే

కామేశ్వరరావు: ముగురమ్మలూ వచ్చేసారు కాబట్టి ఇక అమ్మలగన్న అమ్మని పోతన పద్యంతో నమస్కరిద్దాం.

కామేశ్వరరావు:

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
 

సనత్ కుమార్: లక్ష్మీ దేవి ప్రార్థనతో మొదలుపెట్టమని కామేశ్వరరావు గారడిగారు… ముగ్గురమ్మలనూ తలుచుకుంటే బాగుంటుందని ఈ  ప్రయత్నం..

రానారె: సురారులమ్మ — అంటే సురశత్రుల అమ్మ?

కామేశ్వరరావు: అవును, రాక్షసుల అమ్మ

శ్రీరామ్: ఇంతకు మించిన ప్రార్ధన ఇంకేముంటుంది…అధ్యక్షులు అతిశ్రేష్టమైన పద్యం ఎంచుకున్నారు…

కామేశ్వరరావు: ఆ రాక్షసుల అమ్మ కడుపులో చిచ్చుపెట్టిన అమ్మ అని! 🙂

రానారె: ఓహో! అదన్నమాట. 🙂

కామేశ్వరరావు: ప్రార్థనానంతరం, ఇక శారదదరహాస సభలోకి ప్రవేశిద్దాం

రాకేశ్వరుండు: పారడి చేసిందనా?

రానారె: కడుపు ఆరడి చేసిందని

నరసింహ: ఆరడి పుచ్చిన అంటే

రాకేశ్వరుండు: కడు పారడీలు వ్రాసిందేమేనని.

కామేశ్వరరావు: రాకేశ్వరా:-)

dotC: 🙂

గిరి: :-)))

కామేశ్వరరావు: మృదుమధురోక్తులన్ గలువరేని ప్రసన్నసుధారసార్ద్రమై

నరసింహ: బాధ తగ్గించిందనే అర్థం ఏమన్నా వస్తుందా

రానారె: కాళికను నిలదీసిన తెనాలిఫెలో రేకేశుడే అయ్యుంటాడు

కామేశ్వరరావు:

మృదుమధురోక్తులన్ గలువరేని ప్రసన్నసుధారసార్ద్రమై
సదమల భావపుంజ విలసన్నవ పద్యకవిత్వ రోచిసుల్
హృదయసితోత్పలమ్ములకు నింపెలరింపగ నేటి గోష్ఠి శా
రదదరహాసమై రసికరంజన జేయుత దేవి సత్కృపన్


విశ్వామిత్ర: అస్తు

కామేశ్వరరావు: సభని శారదదరహాస వర్ణనతో ప్రారంభిద్దాం.

ఫణి: కూరిమి అభివాదనములు

ఫణి: చేరిచి నా కేలుచెంత సేసెదనయ్యా

భారారె: సదమల అంటే?

ఫణి: చేరిన సజ్జనకోటికి

ఫణి: శారదదరహాసభాస సత్కవితతికిన్

కామేశ్వరరావు: సత్ + అమల

భారారె: ఓ… ఒకే

విశ్వామిత్ర: @BRR  ఓ సారి మళ్ళీ లవకుశ చూడండి, లేదంటే రానారే బ్లాగు

కామేశ్వరరావు: రాకేశా, మీ శారద దరహాసాన్ని రుచిచూపించండి

భారారె: హ హా.. ఎందుకబ్బా?? 🙂

మురళీమోహన్: భరారె గారూ సదా+అమల కాదండి:)

సనత్ కుమార్: ఫణి గారు కేలుచెంత అంటే?

గిరి: "ఇదె మన ఆశ్రమంబు"..అందుకేనా విశ్వామిత్రా

రాకేశ్వరుండు:

శారికాజనచైత్రరావము శారదాదరహాసమే
సౌరసింధువు సస్యదానము శారదాదరహాసమే
చారుశారదరాత్రకౌముది శారదాదరహాసమే
క్షారసాగర శ్వేతఫేనము శారదాదరహాసమే
 

ఫణి: చేతులు దగ్గరగా పెట్టి

నరసింహ: క్ష్షీర సాగర నా

విశ్వామిత్ర: @గిరి అవునండీ

నరసింహ: క్షీర సాగర

రాకేశ్వరుండు: క్షార సాగర

విశ్వామిత్ర: రాకేశా – శెభాసో

రానారె: చాలా బాగుంది రాకేశ్వరుని పద్యం/పాట.

కామేశ్వరరావు: భూలోకంలో క్షీరసాగరం ఎక్కడ! క్షారసాగరమే

భారారె: 🙂 ఆమ్ల సాగర కాదు కదా.. అప్పుడు దరహాసమే దరహాసము

కామేశ్వరరావు: వెన్నెల మాసంలో కోకిల కూసింది 🙂

భారారె: పద్యం చాలా బాగుంది

పుష్యం: సంస్కృతకవులందు రాకేశ్వరు జేర్తుం 🙂

నరసింహ: బాగుందండి.

విశ్వామిత్ర: సౌరసింధువు   హ్మ్మ్

నచకి:

తెలుగున టైపుట యెట్లని
ఎలుగును యెత్తియు నడిగిన ఎవఱైనా నా
తెలివికి అర్థము కాగా
తెలుపరె చిట్కాలనేవి తేలికగుంటే
 

ఫణి:రాకేశా:చాలా బాగుంది
నచకి:రాకేశ్వరా, సూపరు!
రాకేశ్వరుండు:విశ్వమిత్ర గారు కృషండి, కృషిచేయాలి
నచకి:మీరు చేసారా, మేము చెయ్యాలని చెప్పారా? 😀
శ్రీరామ్:బరహా, అక్షరమాల ఇవేమైనా వాడండి …డాట్చి గారూ
కామేశ్వరరావు:ఫణిగారూ, మరి మీ శారద ఎలా నవ్వుతోందో చెప్పండి.
ఫణి:అలాగే
నచకి:లేఖిని వాడుతున్నాను, శ్రీరామ్ గారూ! అది కాక మరేదైనా ఉందేమోనని… చెప్పినందుకు నెనర్లు
ఫణి:

విరులు! విధాత యుల్లమున పెల్లుబికే అనురాగ మాధురీ
ఝరులు! కవీంద్రమౌనిబుధచంద్ర చకోర హృదంతరాళ సం
చరులు! మదీయ మానస రజస్తమగంధము ద్రోలు జ్ఞానమం
జరులు! స్పృశించు తెమ్మెరలు! శారద నీ దరహాస చంద్రికల్.
 

సనత్ కుమార్:అధ్యక్షుల వారు, పద్యం అయ్యాక, కొంచం ముచ్చటించుకున్నాక తర్వాతి దానికి వెళితే బాగుంటుందేమో అనిపిస్తోంది.. మీరేమంటారు?   అద్భుతం
నరసింహ:చాలా బావున్నదండి.అభినందనలు.
సనత్ కుమార్:అద్భుతం ఫణిగారు
కామేశ్వరరావు:@sanatkumar – అలాగే
గిరి:ఫణి గారు, రాకేశా, మీ పద్యాలు అత్యధ్భుతాలు
నచకి:విధాత యుల్లమున పెల్లుబికే అనురాగ మాధురీ ఝరులు! – చక్కగా ఉంది!
కామేశ్వరరావు:జ్ఞానమంజరులు – చాలా బాగుంది పదం
ఫణి:అందరికీ ధన్యవాదములు.
శ్రీరామ్:ఆహా…శారద దరహాసంలా బహు ప్రసన్నంగా ఉంది
సనత్ కుమార్:కవీంద్రమౌని ట,
రానారె:అద్భుతం ఫణిగారూ
రానారె:మంచి లయ వుంది మీ పద్యంలో.
నచకి:కవీంద్రమౌనిబుధచంద్ర చకోర హృదంతరాళ సంచరులు – ఎంత బె…ద్ద సమాసమో!
సనత్ కుమార్:వర్ణించేవాడు కదా కవి, మౌని కవి అయ్యడు భేష్
ఫణి:కవీందృలు, మౌనులు, బుధులు అనే చకోరాలు అని ననా భావం అండీ
కామేశ్వరరావు:కవీంద్ర, మౌని, బుధచంద్ర అనికూడా విడగొట్టుకోవచ్చు
సనత్ కుమార్:ఎందుకంటే ఆవిడ చిరునవ్వుట… భేష్..
నచకి:ఐతే ఓకే!
సూర్యుడు:రజస్తమగంధము?
భారారె:బాగుందండి….
రాకేశ్వరుండు:కానీ పెద్ద సమాసముంటేనే బాగుంటుంది.
నచకి:(ఇంతకీ నేనెవఱా అని ఆలోచిస్తున్న వాఱికి స్వపరిచయం: నచకి నా కలం పేరు… కిరణ్ నా అసలు పేరు.)
కామేశ్వరరావు:అయినా అదంతా ఒక సమాసమే
నచకి:అవునవును
ఫణి:రజో, తమో గుణాలనే వాసనలని పారద్రోలే మంజరులు
సనత్ కుమార్:శారద అమ్మవారు శుక్లాంబరధారి కదా… సత్వం అని సంకేతంగా వాడారు
కామేశ్వరరావు:ఓహో! నచకిగారా. ఇప్పుడే పేరు చెప్పి శరణుకోరమని అడుగుదామనుకుంటున్నాను 🙂
విశ్వామిత్ర:@సూర్యుడు గారూ, ఈ సారి కుదిరిందనమాట సంతోషం
రాకేశ్వరుండు:ఒకే సమాసమయినప్పుడు కలిపే వ్రాయాలిగా.
నచకి:కామేశా రణమే?
కామేశ్వరరావు:రాకేశ్వరా, కలిపే రాయాలి. అర్థం చేసుకొనేప్పుడు విడగొట్టుకోవచ్చు.
సనత్ కుమార్:కాదు రుణమే
రాకేశ్వరుండు:సరి
సూర్యుడు:@విశ్వామిత్రఅవునండి 🙂
నచకి:అసలు పదాల మధ్య space ఉంచటం మన భాషలో లేదేమో కదా గతంలో?
ఫణి:రాకేశా:అవును
రాకేశ్వరుండు:ఋణం
కామేశ్వరరావు:సాహితీసమరాంగణం అనుకోండి 🙂
నచకి:దారుణం
రాకేశ్వరుండు:దాఋణం
రాకేశ్వరుండు:దాబుణం
కామేశ్వరరావు:ఇక మరో వర్ణనలోకి వెళదాం
పుష్యం:🙂
నచకి:నాకు కదనకుతూహలమంటే యిష్టం.
నచకి:అవశ్యం!
సనత్ కుమార్:దాన్నే ప్రేరణం అంటారేమో…
సూర్యుడు:@ఫణిఅర్ధమయ్యిందండి, ధన్యవాదాలు
రానారె:వెళదాం.
కామేశ్వరరావు:రవీ, మీరేదో "అటజని కాంచె" అంటున్నారు. ఎవరో ఏమిటో చెప్పండి.
సనత్ కుమార్:రవిగారేదో కష్టంలో పడ్డారు
సనత్ కుమార్:ఒక్క క్షణంలో వస్తారు
నచకి:కాష్టమా? రోబో అనుకుని రావణ్ చూసారా ఏమిటి?
సనత్ కుమార్:మీరు ఉత్కంఠని కొంచం సేపట్లాగే కొనసాగించండి…
కామేశ్వరరావు:సరే. ఈ లోపుల నచకిగారూ, మీరు అమెరికా వెళ్ళిన అమ్మగారి గురించి చెప్పండి
ఫణి::))
నచకి:శారద వర్ణనమన్నారు?
నచకి:ఏ అమ్మగారు? శారదమ్మ గారి పద్యం కాదా?
కామేశ్వరరావు:అలాగే
నచకి:ఏలాగు?
కామేశ్వరరావు:శారదమ్మ పద్యమే చెప్పండి
నచకి:అట్లే


శ్రీవాణి వదనమ్ము సిరివెన్నెల గుఱియు చక్కగ విద్యార్థి చదువుకొనగ
కచ్ఛపి హృదయమ్ము స్వచ్ఛమై విరియును సంగీతకళ నాడ సకలజగతి
హంసవాహని మోము నలరారు హాసము మనసు స్వచ్ఛతనొంద మానవులకు
సాహితీప్రియ నవ్వు శశిభాసమై చిందు కలములు కదిలించి కవులు వ్రాయ

శారద దరహాస శరదిందు చంద్రికల్
చల్లగ మము జూడ చాలు మాకు
శ్రీకర శుభకరములా కరుణ కిరణా
లవియె మేలు జేయు భువికి నెపుడు!
 

గిరి:బావుంది
విశ్వామిత్ర:కిరణ 🙂
పుష్యం:చక్కగ విద్యార్థి చదువుకొనగ – మీ గురించి వ్రాసినట్లున్నారు  😉
కామేశ్వరరావు:శరత్తుకీ శారదకీ ఉన్న అనుబంధం చక్కగా వివరించారు!
నచకి:తప్పదు మఱి… అలాగే చెప్పుకోవాలి, పుష్యం గారూ! 🙂
రానారె:రెండు స్వచ్ఛతలున్నాయి పద్యంలో 🙂
నచకి:నెనర్లు, గిరి గారూ, రానారె గారు, అధ్యక్షుల వారూ!
కామేశ్వరరావు:శంకరయ్యగారూ, స్వాగతం!
నచకి:బాగా స్వచ్ఛమని చెప్పాలిగా మఱి 🙂
రాకేశ్వరుండు:నచకి గారు, అచ్చంగా ఇలాంటి పద్యాలే నేనెప్పుడూ చూచివ్రాసేవాణ్ణి
నచకి:విద్యార్థి సంగతి కాక …సిరివెన్నెల గారిని, నన్నూ (కిరణ్) ప్రస్తావిస్తూనే వ్రాసాను. 😉
రానారె:పుశ్యాంగారూ, కిరణాలు అని కూడా అంటున్నారు… ఆయనగురించే రాసుకొన్నట్టుందీపద్యం. 🙂
సనత్ కుమార్:రెండు స్వచ లు కలిస్తే స్వచ్చచ్చ ఔతుందా?
కామేశ్వరరావు:సనత్ గారూ, మిమ్మల్ని రాకేశ్వరులు పూనినట్టున్నారే 🙂
ఫణి:రాకేశా: స్ఫూరినొంది రాశేవాడిననండి
నచకి:రాకేశ్వరు జోకేస్తూ
రానారె: స్వ తీసేయండి సనత్ గారూ.
నచకి:మాకే ఎసరెట్టినారు…
విశ్వామిత్ర:ఒక లాకరు కూడా ఉంది పద్యం లో
కామేశ్వరరావు:@రానారె- 🙂
పుష్యం:అంతేగాదు మాఅబ్బయిలాగా స్కూలు కెళ్ళేముందు ఏలాగు వేసుకోవాలని అడిగారు కూడా 🙂
సనత్ కుమార్:అప్పుడు అచ్చచ్చ ఔతుంది ?
నచకి:మీరు బ్యాంక్ ఉద్యోగియా, విశ్వమిత్ర గారూ? 🙂
రానారె:ఐతే అ కూడా తీసేయండి.
నచకి:ఇప్పుడు అందరూ లాగూలు వేస్తున్నారల్లే ఉంది లెండి.
కామేశ్వరరావు:ఇక సమస్యాపూరణల్లోకి అడుగుపెడదాం
విశ్వామిత్ర:దాని పక్కే రుణ – నేను మిమ్మల్ని అడగాల్సినప్రశ్న మీరు నన్ను అడిగినట్టున్నారు 🙂
ఫణి:🙂
కామేశ్వరరావు:"సంస్కృతకవులందు కృష్ణశాస్త్రిని చేర్చెన్" – ఎవరో ఎలాగో పుష్యంగారూ చెప్పండి
పుష్యం:చిత్తం
నచకి:నేను గాదు లెండి… మా తల్లిదండ్రులు పని జేస్తారు… అలా వచ్చేసుంటాయి!
పుష్యం:

ఓం స్కూలు తెలుగు పంతులు
రం, స్కాచులు త్రాగి మత్తు రయమున ఎక్కన్;
షేం, స్కోపేమిటి కవికని
సంస్కృత కవులందు కృష్ణ శాస్త్రిని చేర్చెన్
 

రానారె:🙂 🙂 🙂 🙂 🙂
పుష్యం:(రం = Rum, షేం = shame) 🙂
విశ్వామిత్ర:ఈ మధ్య రయముగా ఎక్కా రకాలుకూడా వచ్చాయా? 🙂
నచకి:అబ్బో… స్కూల్ నుంచి బార్ దాకా బాగా కవర్ చేసారు పుష్యం గారు!
శ్రీరామ్_: ఓం స్కూలు ఎక్కడో అది..
సూర్యుడు:@పుష్యం:-)
విశ్వామిత్ర:ఈ మధ్య రయముగా ఎక్కే రకాలుకూడా వచ్చాయా?  🙂
భారారె::-))
పుష్యం:ఎప్పుడో వచ్చాయి 🙂
నచకి:🙂
ఫణి:శ్రీశ్రీ ఫక్కీలో రాశారుగా
పుష్యం:దుష్కర ప్రాసలు ఇచ్చిన
నచకి:శ్రీశ్రీ నాకూ గుర్తొచ్చెను!
ఫణి:బాగుంది.
రానారె:"షేం,స్కోపేమిటి కవికని" అదిరిపోయింది.
రాకేశ్వరుండు:తెలుగు పంతులికి త్రాగే అలవాటు లేక, పాపం రయముగానెక్కింది.
కామేశ్వరరావు:ఏం తాగినా, "స్కోపేమిటి కవికని" అని మంచి మాటే అన్నారు!
విశ్వామిత్ర:@pahni నేనూ అదేమాట అనబోతున్నాను
నచకి:🙂
పుష్యం:దుష్కర ప్రాసలు ఇచిన – చూక్స్లోనా ఇంగిలీసు శోబహ్ను ఇపుడుం 🙂
రాకేశ్వరుండు:రవి గారూ స్వాగతం. పునః.
కామేశ్వరరావు:రం, స్కాచ్ల వాసన తగిలినట్టుంది, రవి వచ్చేసారు 🙂
విశ్వామిత్ర:రవి గారు వచ్చారు (రయముగా కాకపోయినా)
శంకరయ్య: పుష్యం గారి పూరణ బాగుంది.
రానారె:కామేశ్వరరావుగారూ, 🙂
నచకి:ఏ రవి, భారవియా?
రవి: పక్క వీధిలో తిరిగి దారి తప్పాను.
పుష్యం:అందరికీ నెనరులు
కామేశ్వరరావు:అయినా సభలో తెలుగు పంతులుగారిని పెట్టుకొని అంతలేసి మాటలంటారా, అన్నా! 🙂
నచకి:మాకు రవి వచ్చినా చలి వదలలేదు! 🙁 రమ్మున్న పద్యమొచ్చినా వెచ్చదనం తగల్లేదు! 🙁
ఫణి:🙂
భారారె:రవిగారూ పక్క వీధిలో లోనా ప్రక్క వీధిలోనా
భారారె:😉
కామేశ్వరరావు:@BRR – 🙂
నచకి::-)@BRR!
శ్రీరామ్: ఇంతకీ మత్తులో పంతులుగారు ఋకారం మర్చిపోయారా ఏమిటి
రవి: 🙂
సనత్ కుమార్:రవిగారూ మీరు ఏ ఏ దారుల్లో వెడుతున్నారని ఇక్కడెవరైనా అడిగారా? ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?
రానారె:నచకి, రమ్మున్న పద్యం చాలకుంటే ఒక దమ్ముకొట్టిరండి.
నచకి:అంత దమ్ము లేదు లెండి… అంత లోనే దమ్మొచ్చి పడిపోతా!
రానారె:హహ్హహ్హ
శంకరయ్య: ఇక్కడో రిటైర్డ్ తెలుగు పంతులు ఉన్న విషయం మరవకండి
కామేశ్వరరావు:దీన్ని కాస్త మర్యాదపూర్వకంగా పూరించారు, శంకరయ్యగారు, వారు మాస్టారు కదా మరి. శంకరయ్యగారూ, మీ పూరణ అందించండి.
నచకి:ఓం స్కూలు పంతులైతే చెప్పండి… 🙂
ఫణి:మీరు కోప్పడరని ధైర్యం
పుష్యం:సరే .. ఓం స్కూలు నాంగ్ల పంతులని చదూకోంది 🙂
నచకి:ఆహా
శంకరయ్య: పుంస్కోకిల వాల్మీకియె
విశ్వామిత్ర:వహ్వా
నచకి:ఆహా!!!
శంకరయ్య: సంస్కృత కవులందు; కృష్ణశాస్త్రిని జేర్చెన్
పుష్యం:అందుకనే రాకేశ్వర చెప్పినట్టు చూచి వ్రాత ఉండాలి 🙂 ముందు చూసుంటే పుంస్కోకిల వాడే వాణ్ణి 😉
ఫణి:sh..
శంకరయ్య: సంస్కారి యొకఁడు
శంకరయ్య: కవితా
సూర్యుడు:@శంకరయ్యగారు, పుంస్కోకిల అంటే ఏమిటండి?
నరసింహ:ృ కారాన్ని వదలొచ్చాండీ
పుష్యం:ప్రాస సరిపోయిందికదా అర్ధందేముందిలేండి 🙂
నచకి:ఋత్వం అచ్చు కదా… భేషుగ్గా వదలొచ్చు!
కామేశ్వరరావు:దయచేసి పద్యం పూర్తయ్యే దాకా మీ ఆత్రాన్ని అట్టేబెట్టుకోండి అందరూ
శంకరయ్య: సంస్కృతుఁడని తెలుగు కవుల సంఘములోనన్.
శంకరయ్య:

పుంస్కోకిల వాల్మీకియె
సంస్కృత కవులందు; కృష్ణశాస్త్రిని జేర్చెన్
సంస్కారి యొకఁడు కవితా
సంస్కృతుఁడని తెలుగు కవుల సంఘములోనన్
 

రాకేశ్వరుండు:పుంస్కోకిల ప్రయోగం చాలా బాగుందండి. నిజంగా 'స్ఫూర్తి'దాయకం.
రానారె:దమ్మున్నపద్యం చెప్పారు మన తెలుగు పంతులు శ్రీ కంది శంకరయ్యగారు. నచకిగారికి చలివదిలిపోయుండాలే? 🙂
నచకి:ఆహాహా, ఎంత చక్కగా చెప్పారు!!
రాకేశ్వరుండు:స్కృ లో ఋకారం అచ్చు. కాబట్టి ప్రాసలో దాన్ని నిక్షేపంగా వదలవచ్చుఁ
ఫణి:చాలా బాగుంది!!
శంకరయ్య: పుంస్కోకిల అంటే మగ కోకిల
నచకి:కామేశ్వరరావు గారు (మాస్టారిని) "రమ్"అన్నప్పుడే దిగిపోయిందండీ!
రానారె:సూర్యుడుగారూ, పుంస్కోకిల అంటే పురుష కోకిల
నరసింహ:సమస్యని బాగా పూరించారు శంకరయ్య గారు.
సనత్ కుమార్:'అతడు ' సినిమాలో బ్రహ్మాజీ అంటాడు…  " అదేంటది? తూచ్ " అని…
పుష్యం:చాలా బాగుందండి 😉 నాకు ఇంగిలీష్ దక్క దిక్కు కనపడలేదు 🙁
నచకి:అహ్హహ్హ
విశ్వామిత్ర:కొత్తపాళీ గారికి నమస్సులు
శంకరయ్య: ధన్యవాదాలు
భారారె:బాగుంది శంకరయ్యగారూ
నచకి:ఆంగ్లమైతేనేం, అదరగొట్టారుగా!
సనత్ కుమార్:అలా ఋ కారమ వదలచ్చని మాకు తెలీదు.. చూచి కాపీ కొట్టనియ్యరు…
కామేశ్వరరావు:"పుంభావ సరస్వతి" అంటారు కదా. అంటే పురుషరూపంలో ఉన్న సరస్వతి అని అలా.
కొత్తపాళీ: సభకి నమస్కారం
కామేశ్వరరావు:అసలు రాయలవారికి స్వాగతం 🙂
కొత్తపాళీ: No no, please don't start that
నచకి:మీరు స్కాచ్‌ని నమ్మితే మాస్టారు సంస్కారిని నమ్ముకున్నారు. 😀
శ్రీరామ్:గురువుగారికి వందనాలు
రవి: సనత్ గారు, ఇదన్యాయం కదండి. ఋ కారం సంగతి నాకూ తెలీదు
సూర్యుడు:@శంకరయ్యగారు,  చాల బాగుందండి
నచకి:నమస్కారం, కొత్తపాళీ గారూ! (నచకి నాముడను)
సనత్ కుమార్:వడ్డి రాయలుగారు అసలు వారికి మస్కా కొడుతున్నరా?
పుష్యం:కొత్తపాళీ అయితే తప్పక స్కాచ్ వాసన తగిలి వచ్చుంటారు 🙂
రానారె:గురుభ్యోనమః
కొత్తపాళీ: అసలు నకిలీ ఏమి లేదు, అధ్యక్షస్థానంలో కూర్చున్నవారే రాయలు 🙂
రాకేశ్వరుండు:రవిగారు ఋకారం అచ్చండి. ఌకారం వున్నా దాన్నీ వదలవచ్చుఁ.
నచకి:శ్రీగురుభ్యోన్నమః
రవి: పుంస్కోకిల – కోకిల ఆడ, గోరింక మగ కదండి? 🙂
విశ్వామిత్ర:వాసన తగలి యా? తగిలించడానికా
కొత్తపాళీ: నచకి, గుర్తుపట్టాను 🙂
రాకేశ్వరుండు:చిలక ఆడ గోరింక మగ.
రాకేశ్వరుండు:వారికి పుట్టేది కోకిల. నపుంస్కోకిలేమో గానీ మొత్తానికి కోకిల.
పుష్యం:కాకేశ్వ్రుడి అరసున్నా చూచారా 🙂 నిన్న నాకు నేర్పారు
నచకి:గోరింక, కోకిల వేరే జాతి కాదూ? కాదనుకున్నా గోరింకను పుంస్కోకిల అనటం తప్పేం కాబోదుగా!
కొత్తపాళీ: మిత్రులు అప్పుడే స్కాచి వాసనలు ఎగబీలుస్తున్నారు. నాయనా ఇక్కడ ఇంకా ఉదయమే
ఫణి:కవికోకిల అంటే ఆడ కవి యనా భావం?
రానారె:రాకేశ్వరా, 'న;కరాలంటే ఇవే!
రానారె:🙂
పుష్యం:@raanaarae 🙂
నచకి:ఈ కరాలేమిటండోయ్??/
కామేశ్వరరావు:ఒకసారి ఒక సభలో ఎవరో అధ్యక్షులు తెలియక ఒక రచయిత్రిని, "వారు పుంభావసరస్వతి" అన్నారట!
కొత్తపాళీ: ఇక్కడ మన అలంకారాల్లో ఒక చిన్న విశేషం చెబుతాను, అధ్యక్షులు అనుమతిస్తే
విశ్వామిత్ర:@ఫణిలింగనిమిత్తం లేదు కూస్తే చాలు
రవి: రానారె:🙂
కామేశ్వరరావు:@కొత్తపాళీ- తప్పకుండా చెప్పండి
కొత్తపాళీ: కామేశ్వర్రావు .. విశ్వామిత్ర .. హ హ హ
ఫణి:🙂
సనత్ కుమార్:కూసినతర్వాత తెలుస్తుంది దాని లింగమేమిటో..
రాకేశ్వరుండు:మన బ్లాగరు స్థాయి హాస్యం (తెలుగు సినిమా స్థాయిహాస్యం కన్నా ఒక రెండంచెలు వెనుక) శంకరయ్య గారికి అభ్యంతరకరం కాబోవని ఆశిస్తున్నాను.
కొత్తపాళీ: దేన్ని దేనితో పోలుస్తున్నాము అన్న గ్రహింపులో .. ఏదో ఒక్క లక్షణమే అక్కడ కవి మనస్సులో ప్రధానంగా ఉంటుంది
కొత్తపాళీ: చెలి ముఖం చంద్ర బింబంలాఆ ఉన్నది అంటే ..
నచకి:రచయిత్రి పుంభావ సరస్వతియా! …నేను చిన్నప్పుడోసారిఒకరింటికెళ్ళి టీ ఇస్తే తాగేసి ఊరుకోక "కాఫీ బాగుందండీ" అన్నాను! అలాఉంది!!
శంకరయ్య: ఆనందిస్తున్నాను….. కానీయండి
రాకేశ్వరుండు:అంటే మచ్చులు బారి వుంది చెలిముఖం అని అర్థం రాదంటారు.
నరసింహ:హ హ హ
కొత్తపాళీ: అక్కడ మెచ్చద్గిన గుణం ఏమిటి? గుండ్రంగా ఉండడం కావచ్చు.కానీ అది మరీ అంత గొప్ప గుణం కాదు. పున్నమి చంద్రుడు గుండ్రంగా ఉండడమే కాకహాయిని గొలిపే కాంతితో నిండి ఉంటాడు.
కామేశ్వరరావు:రాకేశా, పోలికని చక్కగా పోల్చుకున్నారు! 🙂
విశ్వామిత్ర: ఆడ కవి : అంటే ఈ మధ్య ఓ వార్తావాహినిలో కదులు వార్త గుర్తొచ్చొంది -" కనీస సౌకర్యాలు లేక ప్రభుత్వ బాలికల వసతిగృహంలో విద్యార్ధుల అవస్థలు"
సనత్ కుమార్:కాదు రాకేశా వంట మాడి నీ ముఖం లా ఉంది అంటాం కదా.. అలా అన్నమాట
శ్రీరామ్:🙂
నచకి:బాలికా వసతిగృహమన్నాక విద్యార్థులకు అవస్థలు తప్పవు కదా!
కొత్తపాళీ: అలాగ కాంటిని వెదజల్లుతుండడం ఒక విశేషమైతే, ఆ కాంటినిచూస్తున్న వారికి (ప్రియుడికి) గొప్ప హాయిని కలిగించేది కావడం అసలు సిసలైనగుణం ఇక్కడ పోలికలో
మురళీమోహన్_: కదులు వార్త = scrolling news
రానారె:ఆచార్యులకు స్వాగతం.
నరసింహ:బాలికల వసతి గృహంలో విద్యార్ధుల– బావుంది
సత్యసాయి: నెనర్లు
కొత్తపాళీ: కాంటిని కాదు, కాంతిని
నచకి:అయినా రూఢ్యర్థమలా ఉన్నా "విద్యార్థులు" అంటే తప్పులేదేమో… బాలికలూ విద్యార్థులే… అమ్మాయిల గురించి చెప్పాలంటే"విద్యార్థినులు" అనవలసిందేనన్న నియమం ఉ
నచకి:ందా, మాస్టార్లూ?
కామేశ్వరరావు:పూర్ణోపమ అయితే కొత్తపాళిగారు వివరించిన ఇబ్బంది ఉండదు. అక్కడ సమానగుణం ఏమిటో కూడా చెప్తారు కాబట్టి.
కామేశ్వరరావు:సత్యసాయిగారికి స్వాగతం. నమస్కారం
కొత్తపాళీ: కామేశ్వర నిజం. రూపకంలోనే నిజంగా ఈ ఇబ్బంది వస్తుంది, కవికోకిల లాగా
సత్యసాయి: నమస్కారం
కామేశ్వరరావు:ఇక తర్వాతి సమస్యకి వెళదాం
రానారె:రూపకాలంకారాన్ని ఆస్వాదించడంలోనే రసజ్ఞత వుందంటారు!?
నచకి:అయినా "రాకేశ్వరుడే" చంద్రబింబం పోలికను కామెడీ చేస్తే ఎలా? 🙂
ఫణి:కొత్తపాళి గారూ, మీ పాయింట్ అర్థమైంది.
కొత్తపాళీ: ప్రకృతిలో నిజంగా ఉన్న చంద్రుడు, తామరపువ్వు, కోకిల -ఇటువంటివి కవిత్వంలో అనేక విధాలుగా పోలికలకి ఉపయోగ పడుతున్నాయి. ఒక పోలికలోవాడిన గుణమే మరొక పోలికలోనూ ఉన్నదని అన
రాకేశ్వరుండు:రూపకంలో సమస్య అంటారు మీరు. కానీ దీనిని నిందాస్తుతి వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.
నచకి:అవును… గాటిట్! నెనర్లు!
కొత్తపాళీ: నా వివరణ పూర్తయింది
కొత్తపాళీ: రాకేశ్వర .. good point
కామేశ్వరరావు:ఇక తర్వాతి సమస్యకి వెళదాం
కొత్తపాళీ: కామేశ్వర్రావుగారు, కానివ్వండి.
పుష్యం:రూపకమంటే రూపం వర్ణించడం అన్న మాట 🙂
రాకేశ్వరుండు:dotC, రోజూ అందరూ నన్ను రాకేశ్వరా అంటుంటే, మఱి అలాఆలోచించుకొని తృప్తిపడుతున్నాను. మచ్చలున్నోడా అని పిలుస్తున్నారనుకుంటేసుఖం లేదు.
విశ్వామిత్ర:నా పద్యాలను చూసి రాకేశ్వరుడు "నా మొహంలా ఉంది" అంటే – సంతోషించాలన్నమాట – ఇప్పుడే అర్ధమైంది
రానారె:రసజ్ఞత అంటే ఇదే.
నచకి:ఎగ్జాక్ట్‌లీ!
రానారె:తరువాతి సమస్యలోకి వెళదాం
కామేశ్వరరావు:అతని పద్యాలని నీ మొహంలా ఉన్నాయన్నా మరి సంతోషించాలి 🙂
రాకేశ్వరుండు:కామేశం గారు ఫిరంగి నా వైపు తిప్పారే! సరి కానీయండి, ముందుకు పోదాం.
కామేశ్వరరావు:"భామకు పదునారువేల భర్తలు గనరే!" – ఎలాగండీ భా.రా.రె?
భారారె:సరే ఇలాగండి. ఈ పద్యము నా మొఖం లానే ఉంటుదేమో చూడండీ


మోమాట మెరుగని కళా
యామిని, బిగిచనుల వామ యక్షిణి, లీలా
కామరస నటనల సినీ
భామకు పదునారు వేల భర్తలు గనరే
 

ఫణి:వహ్వా
నచకి:పాపం!
రాకేశ్వరుండు:పాపం
సనత్ కుమార్:మొహమాటం లెదట కదా.. ఇంక పాపం ఎందుకు?
కామేశ్వరరావు:"రామిరెడ్డి"గారి కళ్ళు సినీభామలమీదే 🙂
భారారె:  పాపమెందుకండీ ఎన్ని సినిమా ఛాన్సుల్లో హీరోయిన్ అవకాశాలో కదా
నచకి:అధ్యక్షుల వారు భలే చెప్పారు
భారారె:@కామేశ్వరరావు:🙂
నచకి:ఇందులోనూ ఓ పాజిటివ్ ఉంది… అన్నట్టు బాగా చెప్పారు భారారె గారు!
ఫణి:భారారె:ఈ అన్వయం బాగుంది.
సనత్ కుమార్: "రామిరెడ్డి"గారి కళ్ళు సినీభామల "మీదే" !!
రాకేశ్వరుండు:బాగుందండీ పూరణ, ఈ సమస్యను అందరూ తలోరకంగా పూరించివుంటారని పిస్తుంది. మంచి సమస్య.
నచకి:నా తలకు యే రకమూ తోచలేదుగా!
శంకరయ్య: నాకు బాగా నచ్చిందండీ
కామేశ్వరరావు:అవి వట్టి "లీలా కామరస నటనలు" అనడం బాగుంది
భారారె:ధన్యవాదాలు
రానారె:రవిగాంచనిచో కవిగాంచునంటారు.. భాస్కరుడే కవియైతే సినీభామలేమిటి ఎవరినైనా చూడగలరాయన.
పుష్యం:సినిమా నటికి భర్తలు సినిమాలోనా బయటా?
సత్యసాయి: 🙂
సూర్యుడు:వామ యక్షిణి?
భారారె:మంచి / సుందరమైన కనులు గలది
కామేశ్వరరావు:పుష్యంగారూ – అలాంటివి మీరడక్కూడదు 🙂
నరసింహ:ఓసారి హీరోయిన్ గా అవకాశం వచ్చిన తఱువాత కామ రస నటనలు చెయ్యాల్సిన అవుసరం ఉండదేమో కదా
పుష్యం:ఇవాళ రవి చాలాసార్లు ఉదయిస్తున్నట్టున్నారు
సూర్యుడు:@BRR :),
రాకేశ్వరుండు:యక్షణి అక్షరాలా అర్థం ఏమిటి
కామేశ్వరరావు:ఇక్కడది "యక్షిణి" కాదు "అక్షిణి"
భారారె:ఇప్పుడు హీరోఇన్స్ అయ్యాక సింగిల్ సాంగ్ చేస్తున్నట్టు 🙂
విశ్వామిత్ర:శినిమా లో భరిస్తే శినిమాలో హాల్లో భరిస్తే హాల్లో
నచకి:నచకి@తెలుగుసినిమా.కామ్ here, hear hear!
రాకేశ్వరుండు:వామాక్షిణికి తెలుఁగు సంధి. అర్థమయ్యింది నెనరులు.
కామేశ్వరరావు:యక్షిణి అంటే యక్షకాంత అన్న అర్థమైనా సరిపోయుంది.
భారారె:అవును
 

Posted in కవిత్వం | Tagged , | 7 Comments

అలనాటి వ్యాసాలు

"గత కాలమే మేలు వచ్చు కాలము కంటే…" అని ఓ కవి గడచిపోయిన కాలం తాలూకుమధురమైన జ్ఞాపకాలలో తేలియాడాడు. గత రాత్రి కురిసిన నీహారికాబిందుసందోహాలనేగా బాలభానుడు కొత్తపొద్దున మెరిపించి, మురిపించి మంచుముత్యాలుగా మార్చేది! అలనాటి తెలుగు సాహిత్యవ్యాసంగాలలో మెరసిన కొన్నిరచనలను "పొద్దు" ఈ తరం పాఠకులకు పరిచయం చేయాలని సంకల్పిస్తున్నది.

Unknown Object
పాతబడేకొద్దీ సోమరసం మాధురి పదునెక్కుతున్నట్టు, రోజులు గడుస్తున్నకొద్దీ తీయందనాలు చిందే అలనాటి ముచ్చట్లు అవి. బామ్మల బాల్యాన్ని, తాతయ్యల "మా కాలంలో అయితే.." కథలను విననివాడు, చాదస్తమనేవాడు ఆధునికుడు కాడు, అరసికుడు! అవి పాతచింతకాయ పచ్చళ్ళు కావు. నూడుల్స్, పిజ్జాలు మరిగిన కొత్తతరానికి బామ్మ పెట్టిన కొత్తావకాయ రుచులు! అంతేనా, గుమ్మడికాయ వడియాలూ, మిరియాల చారులూ, అల్లపు పచ్చళ్ళూనూ.

ఈ వ్యాసాలు, వ్యాసంగాలు స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన కొత్తల్లో ఉన్న సమాజానికి, సాహిత్యంలో వచ్చిన కొత్త ధోరణులకు, వ్యవహార భాషోsద్యమానికి, ఉద్భవిస్తున్న ఇతరత్రా కొత్త సాహిత్య సంప్రదాయాలకు ప్రతిబింబాలు. ముద్రణారంగం కూడా క్రమంగా బలపడుతున్న రోజులవి.

తెలుగు పత్రికల గురించి, తెలుగు సాహితీ వ్యాసంగాల గురించి ముచ్చటించుకొనే వరుసలో అగ్రపీఠం కృష్ణాపత్రికది. కారణజన్ములు ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు ఆయన మహోన్నత వ్యక్తిత్వానికీ, భావుకతకు, విషయవిస్తృతికి, ఆదర్శాలకు, సౌశీల్యానికి, సమాజ చైతన్యానికి, ఆధ్యాత్మికతకు, కళాభిమానానికి, సంస్కరణా దృక్పథానికి నిదర్శనాలు. 1908 లో వందేమాతరం ఉద్యమప్రభావంతో ముట్నూరి వారు "తెల్లదొరలను తుపాకీతో కాల్చుట" అని సంపాదకీయం వ్రాశారుట. ఆ సంపాదకీయం ప్రచురించిన వెంటనే పరిణామాలు దారుణంగా ఉంటాయని, ముద్రించిన ప్రతులను తగులబెట్టించారుట. కానీ, ఒకట్రెండు ప్రతులు ఎలానో తెల్లవాళ్ళకు దొరికి, అవి చదివి వారు కృద్ధులై, కృష్ణారావు గారిని పత్రిక నుంచి తొలగించమని కృష్ణాజిల్లా సంఘాధ్యక్షులు శెడింబి హనుమంతరావు గారిని తీవ్రంగా హెచ్చరించారుట. అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కుంటూనే ముట్నూరి వారు 1907 లో పత్రికలో చేరినప్పటి నుంచి 1945 వరకూ అప్రతిహతంగా కృష్ణాపత్రికను, సంపాదకీయాలనూ కూడా సమర్థవంతంగా నిర్వహించారు. ఆ రోజుల్లో గ్రామాలలో రచ్చబండలలో ఈ వ్యాసాల గురించి చర్చించుకుని కర్తవ్యం నిర్ణయించుకునే వారట.

కాటూరి గారు, అడివి బాపిరాజు గారు, పింగళి నాగేంద్రరావు గారు, మల్లాదిరామకృష్ణశాస్త్రి గారు, కొడాలి ఆంజనేయులు గారు, జరుక్ శాస్త్రి గారు, కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు వంటి లబ్ధప్రతిష్టులు కృష్ణాపత్రికను అలంకరించి, తీర్చిదిద్దారు.

ఆ తర్వాత వచ్చిన పత్రికలలో ప్రముఖమైనవి ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రభ, యువ, ఆంధ్రజ్యోతి వగైరా..

తమ స్వీయచరిత్ర "హంపీ నుంచి హరప్పా దాక" లో తిరుమల రామచంద్ర గారు అలనాటిభారతి పత్రిక గురించి ఉటంకిస్తూ – "భారతిలో వ్యాసం పడితే మదరాసు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు పట్టా అందుకున్నంత గొప్ప" అని ఓ మాటంటారు. ఆనాటి వ్యాసాల స్థాయి అది. చర్చలైతేనేం, కవికాలాదుల విషయమైతేనేం, అనువాద కవితలైతేనేమి, కావ్యాల పరిష్కారాలలో జరిగే పొరబాట్లయితేనేం, సాంస్కృతిక రీతులైతేనేం, సామాజిక పరిణామాలైతేనేం.. అవి మీఁగడ తఱగలు, తంగేటి జున్నులు.

"నూటిడి" అనే పదాన్ని పొరబాటుగా "నూబిడి" అని ఓ కావ్యంలో పరిష్కరిస్తూ ఒకాయన రాస్తే, మరొకాయన, అది ముమ్మాటికీ "నూటిడి" అని, అన్నమయ్యనూ, శ్రీనాథుడి ప్రయోగాలను ఉటంకిస్తూ, మా నూటిడి (నువ్వులుండ) ని మాకు కాకుండా చేయడమేంటని అధిక్షేపిస్తాడు. మరొకాయన ఆక్షేపిస్తాడు -"చారు" లో ఉన్నది శకటరేఫమా (ఱ), సాధు రేఫమా అని ఓ వాదన. ఆ వాదన కీచులాట కాదు. సాంబ్రాణి పొగలాటి కమ్మనైన, ఘమ్మనైన పొగ. భవభూతి తెలుగువాడంటాడు ఓ సాహితీవేత్త.

అనడమే కాక, దానికి దృష్టాంతాలు చూపిస్తాడు. "రసో వై సః" లో ఉటంకించిన "రసం" కావ్యాలకు వర్తించదని అభినవ గుప్తుడి వ్యాఖ్యానం ఆధారంగా ఒక పండితుడు నిరూపిస్తాడు. ఆ విషయంలో జగన్నాథపండితరాయల వారి అభిప్రాయంతో విభేదిస్తాడు.

ఆ కాలం సాహిత్యవ్యాసాల తీరూతెన్నూ ఇదీ!

ఇంకా "నారీ జగత్తు" పేరిట ఇల్లిందల సరస్వతీదేవి గారు అరవయ్యో దశకంలో -ఆధునిక సమాజంలో స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలను, శారదాచట్టం వంటిచట్టాలను, స్త్రీలు ఉద్యోగం చేయడం వల్ల జరిగే పరిణామాలను చక్కటి పరిశీలనాదృక్పథంతో వ్రాశారు. విద్వాన్ విశ్వం గారు ఆంధ్రప్రభలో మాణిక్యవీణను మీటితే "ప్రమదావనం" పేరిట మాలతీ చందూర్ గారు ఆంధ్రప్రభలోనే ఎన్నో యేళ్ళు పాఠకులతో ముచ్చటించారు. ఇంకా..జంఘాల శాస్త్రి, గిరీశం, పురాణం సీతా.. ఇలా ఎందరో అలనాటి వ్యాసాలలోని మరువలేని పాత్రలు!

ఆంధ్రపత్రిక 1910 నుండీ యేడాది కొకసారి ఉగాదికి ప్రత్యేక సంచిక వెలువరించి, అందులో ఉద్ధండుల వ్యాసాలను, కథలను ఏర్చి కూర్చి ప్రచురించేది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారు కూడా ఆ ధోరణి ననుసరించారు.

ఈ రచనల మూలకంగా తెలుగు వైతాళికుల గురించి, తెలుగు భాష సాహితీ రీతులగురించి, స్వాతంత్ర్య కాలం నాటి సామాజిక పరిణామాల గురించి, సాహిత్యంలో కొత్త ప్రయోగాల గురించి, ఆంధ్రేతర భాషల విషయంలో ఆంధ్ర సాహితీవేత్తల అభినివేశం గురించి ఇలా ఎన్నో విషయాలు తులనాత్మకంగా తెలుసుకునే వీలున్నది.

ఎంత చెప్పుకున్నా తరగని నాటి కథలను, సాహితీ వ్యాసాలను, వ్యాసంగాలను యూనీకోడీకరించి, పాఠకులకు పాతపొద్దుల మలయసమీరాలను కొన్నిటినైనా పరిచయం చేయడానికి పొద్దు నడుం కట్టింది. కొత్త తరానికి పొద్దు రెండు దోసిళ్ళతోఅందిస్తున్న కానుక ఇది. తనివితీరా అందుకోండి. మీ సూచనల నందించడం మరువకండి!
 

Posted in వ్యాసం | 6 Comments

విమర్శ ప్రమాణము


(ఆంధ్ర పత్రిక 1944 తారణ సంవత్సరాది సంచిక నుండి)


సృష్ట్యాదినుండి ఇప్పటివరకు కవులెంతమంది పుట్టినారో చెప్పలేము. కాని, వారిలో మనమిప్పటికీ స్మరించేవారు కొద్దిమందే ఉన్నారు. అయితే మనము మరచిపోయినంతమాత్రము చేత మన జ్ఞప్తిలో లేనివారు కవులు కాకపోరు. మనకు జ్ఞాపకమున్నంత మాత్రము చేతనే వారంతా మంచి కవులనడానికీ వీలులేదు. ఇక మనము మరచిపోయిన విమర్శకులు ఎంతమంది ఉండేవారో చెప్పనేలేము కదా.


అందరూ విమర్శకులే.

వజ్ర పరిక్ష ఎంత కష్ట సాధ్యమైనదో అంతకంటే సహస్రగుణము కావ్యపరిక్ష కష్టసాధ్యమైనది. వజ్రపరిక్షకు ఒక వజ్ర ప్రపంచము తెలిస్తే చాలును కానీ కావ్య విమర్శకు కావల్సిన సామాగ్రి అపరిమితమైనది.

ఇప్పుడున్న కవుల సంఖ్య స్థూలంగా చూస్తే సృష్ట్యాది నుండీ ఇప్పటిదాకా ఉన్న కవుల సంఖ్యకు సరిపోతుందా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు విమర్శకుడు కానివాడే లేడు. డెమాక్రసీ రోజులు కనుక కవిత్వమూ, దాని విమర్శా సర్వసాధారణము కావడము న్యాయమే. నాకెందుకు, నేను పది పన్నెండేళ్ళు వచ్చినప్పటినుంచీ కవిత్వమూ, కవితావిమర్శా మొదలు పెట్టినాను. ఎప్పటికప్పుడు నేను చెప్పే కవిత్వమువలెనే నా విమర్శకూడా నాకు మాత్రము బాగుండేది. అయితే ఎప్పటికప్పుడే కాని ఆ తృప్తి, వెనకటి కాలంలో బాగున్న కవిత్వము కాని, విమర్శలు కాని ఇప్పుడు నాకే నచ్చడములేదు.
 

ఒకే ఒక ప్రశ్న

అందువల్ల ఈమధ్య కొంతకాలమునుంచీ నన్ను ఒక ప్రశ్నపట్టి బాధిస్తున్నది. బంగారము మంచిదో, చెడ్డదో విచారణ చేయవలెనంటే స్థూలంగా గీటురాయి వల్ల చెప్పవచ్చును. ఇంకా సూక్ష్మమైన సాధనాల వల్ల కొలత వేసి ఇంత బంగారము, ఇంత రాగి, ఇంతమట్టి అని చెప్పే వీలున్నది. అట్లాగే ఇతర విషయాలు కూడా మంచి చెడ్డల విచారణ చేయడానికి ఏవో ఆధారాలు ప్రమాణాలు ఉన్నవి.


ఏది కొలబద్ధ?

కవిత్వానికి, విమర్శకు అటువంటి కొలబద్ధలు ఏమైనా ఉన్నవా? ఉంటే అవి ఎంతవరకు నమ్మదగినవి? కావ్యము మంచిదేదో, చెడ్డదేదో తెలుసుకునేందుకు ప్రమాణము దొరికితే కవిత్వానికీ, విమర్శకూ ప్రమాణము దొరికినట్లే కాబట్టి రెండింటికి కలిపి పర్యాలోచన చేద్దాము. అందులో పాశ్చాత్య్లమీద అభిమానము చేత ఆధునికులు అమలులోకి తెచ్చిన కొన్ని ప్రమాణాలు ముందు విచారిద్దాము. అయితే అవి మనకూ కొత్తవి కావు.


కాలమా?

అటువంటి ప్రమాణ కోటిలో ప్రప్రథమముగా పరిగణించేది కాలము. ఏ కావ్యము శాశ్వతముగా జనాదరణపాత్రముగా ఉంటుందో అదే గొప్పకావ్యమని ఉద్దేశ్యము. ఎన్నో గ్రంథాలు తాత్కాలికముగా జనుల మనస్సులు ఆకర్షిస్తవి. కొద్ది రోజులకు మళ్ళీ వాటి సంగతి తలిచేవాళ్ళు కూడా ఉండరు. హోమరు, డాంటీ, షేక్స్పియరు – ఇత్యాది మహాకవుల గ్రంథాలు కొన్ని శతాబ్దాలుగా మనము చదివి ఆనందిస్తున్నారు అవే ఉత్తమ కావ్యాలు, వాటి గుణము శాశ్వతత్వము కాబట్టి కావ్యానికి కాలమే ప్రమాణములనిపిస్తున్నది.


అందులో విప్రతిపత్తి లేదు

ఐతే ఇవ్వాళ వ్రాసే కావ్యము మంచిదో, చెడ్డదో విమర్శించడానికి ప్రస్తుతము వీలు లేదన్నమాట. కాలము విమరీంచి నిలిపేదాకా మనము ఆగవలసి వస్తుంది. ఇక కాలమంటే ఎంతకాలము!
 

అదీగాక ఒక్కొక్క కావ్యము ఉండడానికి దాని గుణమేకాక మరెన్నో కారణాలు ఉండవచ్చును. ఒక మహాకవి వ్రాసిన సామాన్య కావ్యాలు కూడా జనము అతనిమీద గౌరవముచేత స్మరిస్తూ మరవకుండా ఉంటారు. ఒక్కొక్కప్పుడు మతసంబంధమైన స్పర్శ కలుగుతే ఆ మతస్థులకు అది పూజ్యమై శాశ్వతమవుతుంది. చివరకు ధైర్యము చేసి పచ్చిబూతుగా ఎవరైనా పుస్తకము వ్రాస్తే అన్నిటికంటే అది శాశ్వతమవుతుందని నా విశ్వాసము. విశ్వాసము లేనివారు కాళిదాస ప్రహసనమనే ప్రసిద్ధి ఉన్న ప్రహసనము వ్రాసినవాణ్ణి, మన కవి చౌడప్పనూ అడగండి! ఈ విధంగానే ఉత్తమత్వమే కాక మరెన్నో కారణాలు ఉండవచ్చును-చిరంజీవులుగా ఉండడానికి.


అంతేకాక ఉత్తమమైనవి ఎన్నో కావ్యాలు కాలగర్భంలో పడిపోయినవి కవి తాను ప్రచారము కోసము ప్రయత్నించకపోతే లోకానికి ఎట్లా తెలుస్తుంది! ఒక్కొక్కప్పుడు ఉపద్రవాలవల్ల కావ్యాలు పోతవి. కొన్ని గ్రంథభాగాలే కనిపిస్తవి.ఎన్నో కాలగర్భంలో పడిపోయినవి చిత్రముగా కొన్నాళ్ళకు పైకి వచ్చి జనాదరణపాత్రమవుతున్నవి. ఇటువంటిదానికి గొప్ప ఉదాహరణము ఇప్పుడు మనము సామాన్యముగా భాసనాటకాలని వ్యవహరిస్తున్న ప్రతిమాది నాటకల్లు. ఇందులో రెండు విశేషాలు. అవి ఎవరు వ్రాసినా చక్కని నాటకాలే. అవి ఎన్నాళు కాలగర్భంలో పడిపోయినవో తెలియదు కదా! ఇప్పుడా నాటకాలు నమ్మకమైన ఆధారాలు లేకపోయినా, భాసుడి పేరుతో ముడివేయడమువల్ల వాటికి మరింత జనాదరణము వచ్చినదనడము నిస్సందేహ విషయము!


కాబట్టి కాలమనే ప్రమాణము మనకు విశ్వాసపాత్రమైనది కాదు.


విశ్వజనీనతా?

కాలము కాదు కావ్యము బహుకనాదరపాత్రము కావలె అంటే ఒకరకమైన మనుష్యులకే కాక బహువిధాలవారికి కావ్యము నచ్చవలె. అప్పుడే అది మంచి కావ్యమవుతుంది. అంటే మంచికావ్యాలు బాలురవద్దనుంచీ పరిణతబుద్ధులవరకూ అందరికీ బాగుండవలె. పిల్లలు కథాచమత్కృతికి వ్యగ్రులవుతారు.శాబ్దికులు శబ్ద సౌష్టవం వల్ల ముగ్ధులవుతారు. ధర్మప్రబోధముతో ధార్మికులు సంతుష్టులవుతారు. మహాభారత ప్రస్తావనలో పూజ్యపాదుడైన నన్నయభట్టారకుడు కూడా ఈ గుణమే ఉద్ఘాటించినాడు.

 


"ధర్మతత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని
యధ్యాత్మ విధులు వేదంతమనియు
నీతి విచాక్షునుల్ నీతి శాస్త్రంబని
కవి వృషభులు మహా కావ్యంబనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికు లితిహాసమనియు
పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చ యంబని"


ఇంకో విధముగా కూడా మనపెద్దలు ఈ గుణాన్నే వర్ణించినారు.


"ఒక్కొక్కని కావ్యము కవి గృహములోనే నిలిచిపోతుంది. మరొకరిది ఆ కవి స్నేహితుల ఇళ్ళదాకా వెళ్ళుతుంది. ఇక మరిఒకరి కావ్యము అనిదగ్ధుల సదనములందు పాదములుంచి విశ్వకుతూహలివలె శాశ్వతముగా సంచరిస్తుంది"


ఈ గుణాన్నే విశ్వజనీనత (Universality) అని పాశ్చాత్యవిమర్శకులంటారు.


అదీ నిలవదు

అయితే ఈ కొలబద్ద వేస్తే ఎన్నో మంచి కావ్యాలు పోతవి. కొన్ని కావ్యాలు పరిణతబుద్ధులకేకాని ఆనందము కలిగించవు.

 


"లేజవరాలు చెక్కుగీ
టిన వనవల్చు బాలకుడు
డెందమునన్ గరగంగ నేర్చునే?"


అన్నాడు కాదూ మన తెలుగు కవి! మరి అంతగొప్పగా నన్నయభట్టారకుడు మహాభారతమును ప్రశంసించినాడా? దాన్ని కూడా కొందరు నవనాగరికులు, ద్విజులు తమకు ద్విజేతరులచేత శాశ్వతముగా దాస్యము చేయించుకోడానికి వ్రాయించిన ప్రచార ప్రధానమైన గ్రంథమని తోసివేస్తున్నారు. అంతమాత్రముచేత మహాభారతము కూడా పోవలసిందేనా? కాబట్టి ఈ విశ్వజనీనత కూడా నమ్మకమైన కొలబద్ధ కాదు.


ఉదాత్తతా? అంటే……

ఇక కొందరు ఉత్తమ కావ్య లక్షణము ఉదాత్తత (Sublimity) అంటారు. మిల్టను వ్రాసిన పారడైజు లాస్టు చూడండి! అందులో మనుష్య జాతికే సంబంధించిన ఉదాత్త విషయాలు చిత్రించినాడు. డాంటీ వ్రాసిన డివైను కామెడీ కూడా అంతే! అట్లాగే గెటీ వ్రాసిన ఫాస్టు ఆలోచించండి. రవీంద్రుని 'కింగు ఆఫ్ ది డార్కు ఛేంబరు', మీటరు లింకు వ్రాసిన 'బ్లూబర్డు', 'ది సైటులెస్', హాప్ట్మను ది 'ది బెల్' హోమరు చిత్రించిన యుద్ధము కూడా సామాన్యమానవులది కాదు. దేవతాసములైన వీరులది. పెద్దలు పురాణము పంచలక్షణమని చెప్పినారు. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము! అట్టి ఉదాత్త ఏవయ వర్ణన చేసేదే ఉత్తమ కావ్యము!


అందులో బాధకాలు

ఈ గుణము కొలబద్దగా తీసుకుంటే ఉత్తమ కావ్యకోటిలో అందరూ సామాన్యముగా పరిగణించే కావ్యాలు చాలాభాగము వస్తవి. నాకెందుకు నాకు గాఢాభిమానపాత్రమైన కావ్యాలన్నీ వస్తవి. మహాభారతానికి మకుటాయమానమైన స్వర్గారోహణపర్వము ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకోండి! మానవులలో ఉత్తముడు ధర్మరాజు అందరిలో మానవ శరీరముతో స్వర్గములో అడుగుపెట్టదగినవాడు అతడొక్కడే! అతనికి బంధుజనులను చూడ బుద్ధిపుట్టగా ముందు ఉన్నతాసనము మీద దుర్యోధనుణ్ణి చూపుతారు. తన సోదరులు నరకములో ఉంటారు. దేవనీతిమీద కొంత సేపటికి అసహ్యము కలుగుతుంది ధర్మరాజుకు! చివరికి మానవనీతికీ దేవనీతికీ భేదము విశదీకరించి ఆకాశగంగలో స్నానము చేస్తేనే గానీ ధర్మరాజుకు కూడా 'మానవ భావ వికారముల శోకబంధము'లడగవని, అప్పుడే కాని స్వర్గ సౌఖ్యము అనుభవింపరాదనీ విశదీకరిస్తారు. ఈ విధముగా ఈ లోకనీతితో కట్టుబడే మనకు ఇంతకంటే ఉదాత్తమైన నీతి బోధించినాడు వ్తాసభగవానుడు! ఈ విధంగానే ఉదాత్తవిషయములు చిత్రించగలిగినవారే మహాకవికోటిలోకి వస్తున్నారు. అయితే ఈ ఉదాత్తధర్మమే ఉత్తమ కావ్య లక్షణమంటే బాగున్నట్లే ఉన్నది కానీ దీనికి కూడా ఎన్నో బాధకాలు ఉన్నవి.


అసలుకే మోసము

ముందు అసలిది సంసార పక్షమైన కొలత గాదు. ఈ కొలతబద్ధ వేసి కొలిస్తే నిలవగలిగే కావ్యాలు బహుస్వల్పము. ఇక మహాభారతాదులే కావ్యాల్య్ – ఇతరము కాదంటే కవులు చాలాభాగము వ్రాయకుండా ఊరుకోవలసి వస్తుంది. షేక్స్పియరు నాటకాలు చాలాభాగము పోతవి. మాలతీమాధవము నిలవదు. కాళిదాసు మేఘదూతము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము కూడా గణనలోకి రాకపోవచ్చును. అమరుకము ఏమి కావలె! గాథాసప్తశతి?


అవ్యాప్తి

కవులూ, విమర్శకులూ ఎందరో రామణీయకవాదులు కావ్యానికి ఉదాత్తత, దానికి ఉత్కృష్టత ఆపాదించే ఒక గుణవిశేషమే కాని నిత్యధర్మము కాదు. ఎన్నో కావ్యాలు రమ్యంగా మాత్రమే ఉంటవి. వాటి విషయముల ఈ ఉదాత్తత ఎంత గాఢాభిమానమైనా ప్రమాణభూతము కాని ఒప్పుకోక తప్పని స్థితి ఏర్పడుతుంది.


పోనీ, రామణీయకమో?

ఇక ఉదాత్తతను బాధించిన రమ్యత పోనీ, విశ్వసనీయమైన ప్రమాణమవుతుందా?కావ్యము మనోజ్ఞముగా ఉండవలె! "A thing of beauty is a joy forever" అని కీట్సు ప్రారంభించినాడు. కొందరు కళకు గమ్యస్థానము కళయే అన్నారు. కవులు చిత్రకారులవలెనే సౌందర్యోపాసకులు. అలంకారికులలో అధునాతనుడైన జగన్నాథపండితరాయలు "రమణీయార్థ ప్రతిపాదక శబ్దమే కావ్య" మన్నాడు. శ్రీ రాయప్రోలు సుబ్బారావు కూడా అన్నాడు

 


"నిర్వికల్పక విజ్ఞాన నిరతులైన
బ్తహ్మ వాదులకును, హ్లాదరమణీయ
వాదులైన కవులకును భేదమెంతు,
తారతమ్య మీమాంసకు తగను నేను"


బాగానే ఉంటుంది

మమ్మట భట్టారకుడు "కవిభారతి హ్లాదైకమయ" మనీ, "నవరసరుచిర" మనీ అన్నాడు. కావ్య విమర్శకు ప్రమాణముగా ఈ రమ్యత, మనోజ్ఞత అని అంగీకరించేందుకు చాలా అవకాశము కనబడుతున్నది. ఎంత చిన్న కావ్యమైనా మనోజ్ఞమైతే మనకది గ్రాహ్మమే!


కానీ, దానికి వ్యవస్థ లేదు

ఐతే దీనికి కూడా బాధ లేకపోలేదు. కావ్యానికి మనోజ్ఞతే ప్రధాన లక్ష్యమైతే ఇప్పటికి లోకములో ఉత్తమోత్తమకావ్యాలుగా పూజింపబడే కావ్యాలే వెనుకబడిపోతవి. ఉదాత్త కావ్యకోటిలో ఉదాహృతమైన కావ్యాలన్నీ మనోజ్ఞతలో చాలా చిన్న కావ్యాలకు తీసిపోవచ్చును. అంతే కాదు. ఈ మనోజ్ఞతకు సరియైన వ్యవస్థ చేసే వీలు లేదు. ఈ మనోజ్ఞత మనిషిని బట్టి మారుతుంటుంది. కాముకునికి శృంగార ప్రశంస ఒక్కటే మనోజ్ఞము. భక్తునికి భక్తి ప్రశంసే కాని శృంగార ప్రశంస అసహ్యము కలిగిస్తుంది. ప్రాకృత జనానికి పచ్చి బూతు రుచిగా ఉంటుంది. పాపము! వరూధిని మనోజ్ఞత ప్రవరాఖ్యునికి పనికి రాలేదు. ఆ శ్రోత్రియబ్రాహ్మణునిని అరణులు, దర్భలు, అగ్నులు ప్రియమైనట్లు అన్యములు కావు.

కాబట్టి ఈ రమ్యత కూడా అవ్యవస్థితమై పోతుంది.


భావనాబలమూ కాదు

పోనీ, కొందరు కవికి భావనాబలము (Imagination) ఉండవలె నంటారు. కదా అంటే ఇదమిత్థమని మనము స్పష్టముగా తెలుసుకునే వస్తువు కాదిది!


కావ్యాలాపాలు

మరికొందరు మనిషిని కావ్యాలు కదిలిస్తవి, ఉద్రేకము కలిగిస్తవి అంటారు. మద్యాదుల సేవవల్ల కలిగే ఉత్సాహమూ, ఆవేశమూ వంటిదే కావ్యపఠనము వల్ల కలిగే ఫలితమని వీరి ఉద్దేశ్యము. తనపాఠకుల చేత వీరంగము వేయించడమే కవివిధి అంటే పెద్దమనుషులైన వారు కవిత్వము జోలికి పోరు. అటువంటి కావ్యాలను ఉద్దేశించే పెద్దలు 'కావ్యాలాపములు విసర్జించవలె'నని పలికి ఉంటారు.


ఉపజ్ఞలో ఓగు

అదికాదు కవికి ఉండవలసింది ఉపజ్ఞ (originality) అంటారు కొందరు. అయితే కాళిదాసంతటి వాడు తనకు ఉపజ్ఞలేదని

"మణౌ వజ్ర సముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః"

అని ఉద్ఘాటించినాడు. ఉపజ్ఞ విమర్శకు ప్రమాణమైతే రఘువంశము మంచి కావ్యము కాదని తోసివేసే అవస్థపడుతుంది. అటువంటి కావ్యవిమర్శకు దూరమునుండే నమస్కారము చేయవలసి వస్తుంది.


వైచిత్రిలోని విపరీతాలు

మరికొందరు కవికి కావలసింది "వైచిత్రి" అంటున్నారు. నిజముగా ఆలోచిస్తే ఉపజ్ఞలేని వాళ్ళను అనుకరించబోయి చూపే ఉపజ్ఞాభాస ఈ వైచిత్రి అని స్పష్టమవుతుంది. కావ్యరచన ధనసంపాదనకూ, కీర్తిసంపాదనకూ, ఉపకరించే వ్యాపారముగా మారిన తర్వాత లోకవంచనకు చిల్లరకవులు చేసే గారడీ ఈ వైచిత్రి. 'నీ పేరేమి' ని తలక్రిందులు చేసి చవుకగా వైచిత్రిగల కావ్యముగా చేయవచ్చును.అప్పుడు అది 'మిరేపేనీ'? అవుతుంది.

'వైచిత్రి' కావ్యానికి కొలబద్ధగా తీసుకుంటే ఏమవుతుందో అది 'వికటకవి' కే వదలవలసి ఉంటుంది.


దేని కదే

ఇక కొందరు "ఏ కావ్యాని ఆ కావ్యమే గాని కావ్యాలన్నింటికీ సామాన్య ధర్మము లేదు. ఏ కావ్యానికి అదే ప్రమాణము, అంటే కావ్యము చదివి అది ఏ ప్రమాణములతో బద్ధమైనదో తెలుసుకుని విచారించవలెను" అంతారు. ఇది విమర్శకులు ముఖ్యముగా గమనించదగిన విషయము. అయితే ఈ పద్ధతి విషయగ్రహణానికి మాత్రమే పనికి వస్తుంది కాని అది మంచిదా, చెడ్డదా, గొప్పదా, తక్కువదా-ఈ విధముగా విలువకట్టడానికి ఉపయోగించదు. అర్థము చేసుకోకుండా విమర్శ ప్రారంభించేవారికి ఈ పద్ధతి అడ్డు తగులుతుంది.


అభ్యుదయ రచయితలకు పోటీ

"ఇకముందు లోకంలో రాబోతున్నది కమ్యూనిజము, దానికి అనుకూలించేవే మంచి కావ్యాలు, ఇతరమంతా తుచ్ఛమైనవి" అంటారు ప్రోగ్రెసివ్ రైటర్సు అనే పేరుపెట్టుకుని కొందరు. వారు చెప్పేదంతా కావ్యవస్తువుకు సంబంధించినదే కాని, కావ్యస్వరూపానికి సంబంధమేమాత్రమూ లేనిది. ముందు ఎట్లా ఉన్నా, అది అంగీకరిస్తే ఇంతవరకూ లోకంలో గొప్పకావ్యాలనుకునేవి తోసివేయవలసి వస్తుంది. వాటి రుచి ఎరిగినవారు ఎన్నటికీ అందుకు ఒప్పుకోరు. వీర్తో పోటీగా చాలారకాల ప్రచారకులు తమకు ఇష్టమైన ప్రచారానికి ఉపయోగించేదే కావ్యమని పోటీకి వస్తున్నారు.


సున్నకు సున్న, హళ్ళికిహళ్ళి

ఇంతవరకూ పాశ్చాత్యవాసనవల్ల మనవాళ్ళు వాడుకలోకి తెచ్చిన విమర్శాదర్శములు పరీక్షించి చూచినాము. అవి అన్నీ కూడా కేవలము పాశ్చాత్యులవే కావని కూడా సూచించినాము. అయితే పైవాటిని పరీక్షింపగా ఒకటీ తృప్తిగా నిలువలేదు.

పూర్వాచార్యులేమంటారు?

మన పూర్వులు ఎందులో సమర్ధులు కాకపోయినా తత్వ వివేచనలో మాత్రము నిపుణులు.కాబట్టి వారు దీనికి ప్రమాణమేమైనా నిర్వచించినారేమో విచారిద్దాము!


రసమతము

అనాది నుండి బహుపండితాదరము పొందిన మతము రసమతము. పెద్దలు ఏమన్నారు?

 

"కావ్యస్య శబ్ధార్ధౌ శరీరమ్, రసాదిశ్చాత్మా, గుణాః శౌర్యాదివత్, దోషాః కాణత్వాదివత్ రీతయో2వయవసంస్థానవిశేషవత్, అలంకారాః కటక కుణ్డలాదివత్"

ఈ ప్రసిద్ధ వాక్యములో అలంకారికవతాలు చాలా భాగము సమన్వయమైనవి. ఔచిత్యవాదమొక్కటీ, ధ్వనిమత మొక్కటీ మిగిలిపోయినవి. సూక్ష్మముగా విచారిస్తే ధ్వనిమతానికి, రసమతానికి ఎక్కువ బేధము లేదు. ఔచిత్యము కూడా నిజముగా గుణ వాదములోనిదే.


ఎవడు సహృదయుడు

ఎవడు సహృదయుడు?

శ్రీ మమ్మట భట్టారకుడు కావ్యానికి హేతువుగా మూడు సామగ్రులు ఉదహరించినాడు.

 

"శక్తిర్నిపుణతా లోకశాస్త్ర కావ్యాద్యవేక్షణాత్
కావ్యజ్ఞ శిక్షయా2భ్యాస ఇతి హేతుస్తదుర్భవే"


అందులో 'శక్తి' ని వివరిస్తూ-

"శక్తి, కవిత్వ బీజరూపః సంస్కార విశేషః, యాం న వినా కావ్యం ప్రసరేత్, ప్రవృతం వా ఉపహసనీయం స్యాత్" అన్నాడు.


నిపుణతను వివరిస్తూ లోకజ్ఞానమూ, ఛంధో వ్యాకరణాది శాస్త్రములు, గజ తురగ ఖడ్గాది లక్షణ గ్రంధములు, మహా కవుల కావ్యములు, ఇతిహాసాదులూ -వీటి విమర్శ వల్ల వచ్చే వ్యుత్పత్తిగా నిరూపించినాడు.


అభ్యాసము వివరిస్తూ-
"కావ్యం కర్తుం విచారయితుంచ యే జానంతి తదుపదేశకరణే యోజనేన పౌనః పున్యేన ప్రవృత్తిః" అన్నాడు.


ఆపైన "ఈమూడూ వేరే వేరే కారణాలు కావు కారణమే అంటే అన్నీ ఉన్నప్పుడే సాధ్యము" అని ఉపదేశించాడు.


కావ్య విమర్శకుడికి కూడా ఇవన్నీ కావలసిన గుణాలుగా కనపడుతున్నవి. అటువంటి సామాగ్రి ఉన్నవాడే సహృదయుడు. వజ్ర పరిక్ష ఎంత కష్ట సాధ్యమైనదో అంతకంటే సహస్రగుణము కావ్యపరిక్ష కష్టసాధ్యమైనది. వజ్రపరిక్షకు ఒక వజ్ర ప్రపంచము తెలిస్తే చాలును కానీ కావ్య విమర్శకు కావల్సిన సామాగ్రి అపరిమితమైనది.
 

మనవి

విమర్శ ప్రమాణము సర్వ వ్యాధి నివారిణులని చెప్పే చిట్కా మందులవలే సులభసాధ్యమైనది కాదు. విమర్శ చేసేందుకు సమగ్రమైన సామాగ్రి మన విమర్శకులకు ఎందరికి ఉన్నదో ప్రశ్నించుకోవలసిందని మనవి చేస్తున్నాను.

Posted in వ్యాసం | 2 Comments

నాలుగు కవిత్వపు మెతుకులు – 2

మీరు ఎటువంటి అంశాలను కవితలుగా రాస్తారు? ఎలాంటి కవితలకు ఎలాంటి ప్రతిస్పందనని మీరు చూశారు?
 

పొద్దులో ఆఫ్సర్ఇది కొంచెం కష్టమయిన ప్రశ్న, నాకు ఇష్టమయిన ప్రశ్న కూడా. నా కవిత్వాన్ని పనికట్టుకుని విమర్శించే కొందరు తరచూ సంధించే అస్త్రం కూడా ఇదే. కానీ, "రక్త స్పర్శ" నించి నా కవిత్వాన్ని దగ్గిరగా గమనిస్తున్న వాళ్ళకి సహజంగా ఈ ప్రశ్న పుట్టే అవకాశం లేదు. "రక్తస్పర్శ" లో వ్యక్తిగత కోణం, రాజకీయ దృక్పథం రెండూ వున్నాయి. వాటి మధ్య వంతెనని మనం అనేక విపరీత రాజకీయ కారణాల వల్ల కూల్చివేశాం, కాదంటే మన రాజకీయ తీవ్రత వల్ల ఆ వంతెనలన్నీ కాలిపోయాయి. వాటిని తిరిగి నిలబెట్టే ప్రయత్నం "రక్తస్పర్శ" లో కనిపిస్తుంది. ఆ పుస్తకం "అంతిమ స్పర్శ" అనే కవితతో మొదలయ్యింది. అది వొక విప్లవ కవికి నివాళి. కానీ, ఆ పుస్తకం నించి ఇప్పటికీ చాలా మంది కోట్ చేసే పంక్తులు కొంత వ్యక్తిగత కోణాన్ని చెప్పే పంక్తులే. "జ్ఞాపకాలు వేధిస్తాయే కానీ/ ఆప్యాయంగా పలకరించవు" లాంటివి. గుడిపాటి ఆ కవిత్వం "కోటబిలిటీ"కి కోట అంటాడు వొక వ్యాసంలో – ఈ పుస్తకం తను జైలులో వున్నప్పుడు చాలా కాలం బెడ్ సైడ్ బుక్ అనే వారట వరవరరావు. ఫైజ్ కవిత్వంలో వుండే పర్సనల్ అండ్ పాలిటిక్స్ అనే మిశ్ర లక్షణం "రక్తస్పర్శ"లో చాలా మందికి నచ్చింది. శివసాగర్ అజ్ఞాతవాసం నించి రాగానే బెజవాడలో నా మారుమూల గదిని వెతుక్కుంటూ వచ్చి నా నుదుటి మీద ముద్దు పెట్టి, చాలా సేపు నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని 'రక్తస్పర్శ"లోని కొన్ని పంక్తులని అలవోకగా చెప్పేయడం నాకు బాగా గుర్తు. వీళ్ళందరికీ అందులో వున్న ఆ రాజకీయ తీవ్రత నచ్చింది.


ఇస్మాయిల్ గారు కూడా తరచూ ఇంటర్వ్యూలలో, వ్యాసాలలో మీ పేరు ప్రస్తావించే వారు కదా?

అవును. అదే సమయంలో ఇస్మాయిల్ కి కూడా ఆ పుస్తకం నచ్చింది. కానీ, ఆయనకి నా రాజకీయ నిబద్ధత నచ్చలేదు "మీరు ఆ రాజకీయ నిబద్ధత వదిలించుకోవాలి. నిబద్ధత జీవితానికే కానీ, రాజకీయాలకి కాదు" అని మందలించేవారు. అలా రాజకీయాల్ని వదిలించుకోవడం అన్నది నాకు అసహజం అనిపించింది. కమ్యూనిస్టు రాజకీయ నేపథ్యం లేకుండా నా కుటుంబ చరిత్రే లేదు, అలాంటప్పుడు నేను ఆ నేపథ్యాన్ని నిరాకరించడం అంటే నా సొంత చరిత్రని నిరాకరించడమే అవుతుంది. పైగా, నేను కవిత్వ ప్రయాణం నిర్దిష్టత వైపు సాగాలని అనుకుంటాను. అస్తిత్వాన్ని గురించి ఎంత నిర్దిష్టంగా చెప్పగలిగితే అంత మంచి కవిత్వం అనుకుంటున్నాను ఇప్పటికీ- ఈ తాత్వికత పునాదులు మీకు నా వ్యాస సంపుటి "ఆధునికత – అత్యాధునికత" (1992) లో కనిపిస్తాయి. ఈ వ్యాసాలు ఆ కాలంలో పట్టుబట్టి వేయించాడు తిరుపతిరావు. మొదటిసారిగా పోస్ట్ మోడర్నిజమ్ చర్చ ఇందులోనే మొదలు పెట్టాము.
 

కవి వ్యక్తిత్వం అనేక అంశాల సమాహారం. వాటన్నిటి మధ్యా వొక ఫైన్ బాలన్సు దృక్కోణం. ఆ బాలన్సు వెతుక్కోడానికి మనం రాస్తామని నా నమ్మకం. నా లోపలి విషయాలు ఎంత ముఖ్యమో, నా బయటి విషయాలు కూడా అంత ముఖ్యం అనుకుంటాను. దేన్నీ నిరాకరించలేమనుకుంటాను. నిరాకరిస్తున్నామంటే మనల్ని మనమే సెన్సార్ చేసుకుంటున్నామని అర్ధం. అన్ని రకాల సెన్సార్లనీ సవాల్ చెయ్యడమే నా కవిత్వ దృక్పథం. "ఊరి చివర" లో మీకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పాత కొలమానాలతో చూసేవారికి అందులో కవిత్వం కనిపించకపోవచ్చు. వేలూరి ఈమాట సమీక్షలో లోపం అదే. ఆయన నన్ను కాకుండా, నా కవిత్వంలో తనని వెతుక్కునే ప్రయత్నం చేశారు, తను ఏ విధంగా చూడాలనుకున్నారో అలాగే నన్ను శాశ్వతంగా చూడాలని అనుకుంటున్నారు. ఇంకా కొంత మంది కూడా-


మీరు రాసినవాటిలో మీకు బాగా తృప్తి నిచ్చిన కవిత ఏది? ఎందుకు?

"ఊరి చివర"లో బిస్మిల్లాహ్ ఖాన్ మీద రాసిన ఎలిజి. "వొక రొట్టి ముక్కా, వొక దేశమూ, వొక షెహనాయీ" అనే కవిత. నేను తరచూ వినే స్వరం అది. ఆయన చనిపోవడానికి కచ్చితంగా వొక వారం ముందు వొక మిత్రుడి ద్వారా ఆయనని పలకరించే ప్రయత్నం చేశాను. కానీ, ఆయన వినికిడి సమస్య వల్ల సంభాషణ సాగలేదు. నా వ్యక్తిగత జీవితంలో పీర్ల పండగ చాలా ముఖ్యమైనది. బిస్మిల్లాహ్ ఖాన్ కర్బలా గానం నాకు నిత్యస్ఫూర్తి. ఆయన మరణం నన్ను బాగా బాధపెట్టింది. చివరాఖరికి ఆయనకి మిగిలింది ఆ నులక మంచం, ఆ రొట్టి ముక్క మాత్రమే అని తెలిసినప్పుడు ఇంకా బాధ పడ్డాను. కళాకారుడి మరణం ఇంత విషాదంగా ఎందుకు వుండాలో నాకు అర్ధం కాలేదు. జీవితంలో అన్నీ సుఖాలనీ నిరాకరించి షెహనాయికీ, తన దేశానికీ అంకితమయిన ఆయన ఆ నిశ్శబ్ద నిష్క్రమణలో నాకు చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.


ఆ మరణాన్ని మీరే విధంగా చూశారు?

ఆలోచనల్లో అఫ్సర్అసలు ఏ మరణమయినా అనేక ప్రశ్నల పుట్టినిల్లు. నేను చూసిన అన్ని మరణాలూ నాకు బాధ కలిగించాయి. ఏ మనిషి జీవితం సందేశం అవుతుందో లేదో తెలీదు గాని, ప్రతి మరణమూ నాకు వొక సందేశం, వొక సందేహం. వ్యక్తిగతంగా ఈ క్షణాన చేసే ఈ పనే గొప్ప పని అనుకుంటున్నాను. ప్రతి మరుక్షణమూ మరణమే అనుకుంటున్నాను. వ్యక్తి స్థాయి నించి సామూహిక స్థాయి దాకా జీవితం అనేది చాలా తాత్కాలికం అనే భావన బలపడుతోంది, పొద్దున ఇంట్లోంచి బయటికి వెళ్తే, సాయంత్రానికి సజీవంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం పోయింది. తెలంగాణ పల్లెల్లో ఈ అశాంతి ఇంకా ఎక్కువగా వుంది.  ప్రపంచ పటం మీద నిలబడినప్పుడు ఇంకా స్పష్టంగా ఇదే అనిపిస్తుంది. ఆ కవితలో చెప్పినట్టు "జీవితం వొక పిసినారి కల.." వొక తాత్విక భారం లాగా కనిపిస్తుంది ఇది, కానీ, ఇప్పటికిప్పుడు నేను ఇలాగే వున్నాను. వచ్చే క్షణం అనేది వుందో లేదో తెలీదు కాబట్టి, ఈ క్షణంలో చెయ్యాల్సిన అన్నీచెయ్యాలి అన్న వొక వెర్రి తపన. ఆ కవిత బిస్మిల్లాహ్ ఖాన్ కంటే ఎక్కువగా నా కోసం రాసుకున్నదే.


ఇతరుల రచనలు చదివి ఉత్తేజితులై ప్రేరణ పొంది మీరు రచన చేసిన సందర్భాలేమైనా వున్నాయా?

పథేర్ పాంచాలి. నేను వొకటికి పది సార్లు చదువుకున్న నా డైరీ లాంటి నవల. ఈ నవల నేను మొదటి సారి నా ఎనిమిదో తరగతి వేసవి సెలవుల్లో చదివా. ఆ తరవాత అది నా జీవితంలో విడదీయలేని భాగం అయ్యింది. చదివిన ఏడాది తరవాత ఆ సినిమా చూశాను. సత్యజిత్ రే మంచి దర్శకుడు కాదు అని అర్ధమయ్యింది, విభూతి భూషణ్ ముందు- సినిమా వొక్క సారి మాత్రమే చూశాను, నవల అప్పటి నించీ ప్రతి ఏడాది చదువుతూనే వున్నాను. ఆస్టిన్ వచ్చాక నేను చెప్పే దక్షిణాసియా నవల కోర్సులో అది టెక్స్ట్ బుక్ చేశా. అది ఇంగ్లీషులో కూడా అంత బాగా అనువాదం కాలేదు. కానీ, మద్దిపట్ల సూరి అనువాద మహిమని ఎప్పటికీ మరచిపోలేను. దాని ముందు సత్యజిత్ రే తెరానువాదం కూడా దిగదుడుపే.


ఆ నవలలో అంతగా కట్టిపడేసిన లక్షణం ఏమిటి?

నేను ముందే చెప్పినట్టు పుస్తకాలు చదివి ఉత్తేజితం కాలేను, ఆ పుస్తకంలో కనిపించే మనుషుల వల్ల ఉత్తేజితమవుతా. అపూ, దుర్గ నా తోబుట్టువులుగా మారిపోయారు దాదాపు – నా మొదటి కథ "అడివి"లో కొంత ఆ ప్రభావం కనిపిస్తుంది. కవిత్వంలో నేను అలా వొక రచన చదివి ప్రభావితమయి రాసిన సందర్భాలు అసలు లేవు. నా జీవితంతో ప్రత్యక్ష సంబంధం లేని ఏ విషయాన్నీ నేను కవిత్వంలోకి తీసుకు రాలేను. అది నా బలహీనత. అదే బలం కూడా కావచ్చు. పథేర్ పాంచాలిలో ఆ అపూలాగా, ఆ దుర్గ లాగా కవిత్వం నా కోసం నేను ఎక్కడో దాచి పెట్టుకున్న రహస్య ప్రదేశం.
 

మీరు చదివిన ఇతరుల రచనల్లో మీకు బాగా నచ్చిన రచనలు ఏవి?

మార్క్స్ -ఎంగెల్స్ సమకాలికుల స్మృతులు. అది నాకు బాగా నచ్చిన రచన చిన్నప్పటి నించీ ఇప్పటి దాకా. ఆ తరవాత నేను దాస్ కాపిటల్ చదివాను. అది చదవకపోతే, దాని గురించి రాజకీయ శిక్షణా శిబిరాల్లో చర్చించి వుండకపోతే నా బతుకు, నా ఆలోచనలు  అసంపూర్ణంగా వుండేవి. వామపక్ష పాతం ఎంతో కొంత లేని వాళ్ళు జీవితాన్ని చదవలేరని ఇప్పటికీ నమ్ముతున్నా.
 

తెలుగులో నాకు బాగా నచ్చిన రచన వరవరరావు "సహచరులు,"   శ్రీపాద అనుభవాలూ-జ్ఞాపకాలూ, తిరుమల రామచంద్ర "హంపీ నుంచి హరప్పా దాకా". కవిత్వంలో బైరాగి, కథల్లో బుచ్చిబాబు, సాహిత్యవిమర్శలో రా.రా, పత్రికారచనలో నండూరి, ఈ కాలంలో సైదాచారి, పసుపులేటి గీత కవిత్వం – రాజిరెడ్డి, కె.శ్రీనివాస్ ల  వచనం – కాత్యాయని , వేణు, గుడిపాటిల విమర్శ- చండీదాస్, కేశవరెడ్డి నవలలు.
 

మీ అభిమాన రచయిత ఎవరు?

వొకే వొక్క రచయిత పేరు అడిగితే కాఫ్కా. రెండు పేర్లు కావాలంటే కాఫ్కా, త్రిపుర -మూడు పేర్లు అడిగితే కాఫ్కా, త్రిపుర, రాజిరెడ్డి. ఆ ముగ్గురూ వొకే జాతి రచయితలు. నేను రాయలేని వచనం వాళ్ళు రాశారు. కవిత్వంలో ఎప్పటికీ శ్రీ శ్రీ, బైరాగి.
 

బోధనా రంగాన్ని ఎందుకు ఎంచుకొన్నారు? సాహితీ సృజనకు అవసరమైన వెసులుబాటు ఇతర రంగాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటుందా? వృత్తి పరంగా మీ ప్రయాణం గురించి చెప్పండి.

డాక్టర్ కావాలనుకొని ఏదో అయ్యానని యాక్టర్లు అంటూ వుంటారు. అలాంటి కథ నేనూ చెప్పగలను. అది తరవాత చెప్తా.

బోధనా రంగం నేను ఎంచుకోలేదు. అది అనుకోకుండా దొరికిన వరమే. నాకు ఉన్నత విద్య మీద ఆసక్తి ఎక్కువ. అది నా జీవితంలో ఎప్పుడూ మిస్ అయిన రైలు. ఇక్కడికి వచ్చినప్పుడు మాడిసన్ లో నేను వొక ఏడాది కంటే ఎక్కువ వుండలేను అనుకున్నాను. ఎప్పటికప్పుడు ఆంధ్రా వెళ్లిపోతున్నా అన్న అనిశ్చితి వుండేది. అది ఇప్పటికీ వుంది. 2006 లో ఇండియా వచ్చినప్పుడు ఇక ఇండియాలో ఏదో చిన్న వుద్యోగంలో వుండిపోవాలన్న కోరిక వుండింది. కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో వుండి పోదామని దాదాపు ఖాయం చేసుకున్నాను. అలా అనుకున్న మరునాడు టెక్సాస్ యూనివర్సిటీ నించి పిలుపు వచ్చింది. వొక వారం వూగిసలాడాను. కానీ, వెల్చేరు నారాయణరావు గారు, నా అకడమిక్ గురువు ప్రొఫెసర్ చార్లెస్ హాలిసీతో సహా అందరూ "లేదు, ఇక్కడ కొన్నాళ్లు పని చేసి చూడండి" అన్నారు. టెక్సాస్ యూనివర్సిటీలో పని చేసే అవకాశం రావడం ఇంకో వరమే. ఇక్కడ నేను చెప్పిన ప్రతి కోర్సూ నా మనసుకి నచ్చిందే.
 

తెలుగులో రాయడం నాకు అత్యంత ఇష్టమయిన పని. ఆ కోణం నించి చూస్తే , తెలుగు సాహితీ సృజనకి అవసరమయిన వెసులుబాటు ఇక్కడి బోధనా రంగంలో ఎక్కువ వుందని అనుకోను, ఇప్పటికిప్పుడు నేను ముందే ఒప్పుకొని వెంటనే ముగించాల్సిన రాత పనులు చాలా వున్నాయి. అవి రాయడానికి నేను కొంత నన్ను నేను ముందుకు పుష్ చేసుకోవాలి. కానీ, తెలుగులో రాయడం అన్న దానికి అంత పుష్ అక్కరలేదు. పైగా, పాఠం చెప్పడానికి నేను ఎక్కువ తయారవుతాను. నేను చెప్పేవి  ప్రధానంగా రైటింగ్ కోర్సులు కావడం వల్ల, విద్యార్ధుల రాత స్వయంగా చూడాలి అన్న తపన వల్ల,  యాభయికి పైన  విద్యార్ధుల రాత గ్రేడింగ్ చేసేసరికి వొక్కోసారి తల ప్రాణం తోకకి వస్తుంది. ఇప్పుడు విద్యార్థుల రాత పని మీద మా యూనివర్సిటీ చాలా శ్రద్ధ పెడుతోంది.
 

కానీ, అది నాకు చాలా ఇష్టమయిన పని. ఆ ఇష్టం వల్ల దాని మీద ఎక్కువ సమయం పెడతాను. ఈ పని వల్ల, తెలుగులో రాయడం అన్నది మూలన పడిపోతుంది. బోధన వృత్తి చిత్రమయింది, కేవలం పాఠం చెప్పే ఆ గంటకే పరిమితం చేసుకుంటే చాలా పనులు చెయ్యవచ్చు. ఆ గంటని జాగ్రత్తగా, చాలా నాణ్యంగా, శ్రద్ధగా మలచాలంటే చాలా గంటలు పడుతుంది. అప్పుడు మనకి  సొంత సమయం అంటూ వుండదు.


మనసు పెట్టి చెయ్యలేకపోతే ఏ పనీ వొప్పుకోలేను కూడా. అది జర్నలిజం అయినా, పాఠమయినా, బ్లాగులో కామెంట్ అయినా సరే! చేసే పని చిన్నదయినా, రాసే పంక్తి వొక్కటే అయినా అది వొక దీర్ఘ ప్రక్రియ నాకు. "నువ్వు ఈ దీర్ఘ రోగం నించి బయటపడితే ఇంకా చాలా రాయగలవు" అని ఇప్పటికీ మిత్రులు మందలిస్తూ వుంటారు, కానీ, పుట్టుకతో వచ్చిన బుద్ధి!
 

(మెడిసిన్ సీటు వదులుకొని ఇంగ్లీషు సాహిత్యంలోకి…ఆ కథ ఈ సారి)


ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి

Posted in వ్యాసం | Tagged | 17 Comments

భూపాలరాగం

పురుగుమందుకు మనుషులంటేనే ఎందుకో అంత ప్రేమ !
విషం మిథైల్ ఐసో సైనేట్ మారు వేషంలో
నగరం మీద విరుచుకుపడిన చీకటి క్షణాల ముందు
హిరోషిమా నాగసాకీ బాంబు దాడులే కాదు
'తొమ్మిదీ పదకొండు' ఉగ్ర దాడులు కూడా దిగదుడుపే !

టోపీల వాడి మాయాజాలమంటే అంతే మరి!
మనకి ఊపిరాడదని మన తలుపుకే కన్నం వేసే కంతిరితనం వాడిది.
అప్పుడెప్పుడో వాస్కోడిగామా వచ్చి మిరియంమొక్క అడిగినా
కంపెనీవాడొచ్చి మూడడుగుల నేలడిగినా
మన కళ్ళుకప్పి మాడుమీద వాడి జెండా దిగేయ్యటానికే!
మన కండలు పిసికి పండించిన  పంటను ఓడల కెత్తుకెళ్ళటానికే.
అదిప్పుడు పాత కథ.

కొత్త కథలో..
వామనుడు అడగక ముందే  నెత్తి చూపించే అమాయక బలి చక్రవర్తులం మనం
భూమిని చాపలా చుట్టి వాడి పాదాల ముందు పరచటానికి
పోటీలు పడే కలియుగ దానకర్ణులం.

మన రూపాయి ప్రాణవాయువును
వాడి డాలరు బతుకుతెరువు కోసం
తృణప్రాయంగా సమర్పించుకునే
పిచ్చి బేహారులం

వాడి విమానాలు క్షేమంగా దిగాలని
మన వూళ్ళు కూల్చుకుని
రహదారులు విశాలంగా చేసుకునే
విశాలహృదయులం

వాడి నాలిక మడత పడటం లేదని
మన మాటను సంకరం చేసుకునే టందుకయినా సంకోచపడం.
వాడి అణుదుకాణాల కోసం
మన అన్నపూర్ణ కడుపులో చిచ్చు పెట్టుకోటానికయినా మనం సిద్దం.

సార్వభౌమత్వమంటేనే ఒక చమత్కారం
ఆ డాబు దర్పాలకి మురిసి చప్పట్లు కొట్టటమే మనకు గొప్పతనం.

అణుఒప్పందం వల్ల భవిష్యత్తులో జరిగే భారతీయ చెర్నోబిల్ నాటకానికి
పాతికేళ్ళ క్రిందటే ప్రారంభమయింది
భూపాల రాగం… వింటున్నారా!

Posted in కవిత్వం | 7 Comments

మార్పు

బళ్ళు తెరిచి, చూస్తుండగానే నాలుగు నెలలు గడిచాయి. అప్పుడే క్వార్టర్లీ పరీక్షలొచ్చేశాయి. నగరంలో ఆంగ్లపాఠశాలలో, అప్పుడప్పుడే మాటలు నేర్చిన చిన్నపిల్లలు కేజీల్లెక్కన చదువుకుంటున్నారు.
ఎస్ ఫర్ స్పైడర్
ఎస్ ఫర్ స్పైడర్
వల్లె వేయిస్తూంది టీచరమ్మ, కాదు కాదు “మేడమ్”. ఆ పిల్లల్లో ఓ బుల్లెమ్మకి “స్పైడర్” అంటే హేవిటో అర్థం కాలేదు. ఎదురుగా పుస్తకంలో రంగుల్లో బొమ్మ కనిపిస్తూంది. బొమ్మ బావున్నా, ఆ బొమ్మను ప్రాణంతో ఎప్పుడూ చూడకపోవడంతో, అదేమిటో సరిగా తెలియడం లేదు. అడగాలో వద్దో తెలీదు. పైగా మేడమ్ ఇంగ్లీషులో మాట్లాడమని ఆదేశించిందయ్యె. ఎలా అడగాలో ఒక ఇబ్బందైతే ఏం అడగాలో అనేది మొదటి ఇబ్బంది. ఇంతలో గంట కొట్టడంతో ఆ వేళ బడి ముగిసింది. తర్వాత రెండు రోజులు బడి లేదు! ఇంట్లో నాన్ననడిగింది పాప. ఏం చెబుతాడు? పుస్తకమూ, పుస్తకంలో బొమ్మ, మరోమారు చూపించేడు. సాలీడు కోసం చూసేడు. ఇంట్లో బూజదీ లేక ఫ్లాటు కళకళ్ళాడుతోంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాలే అని తప్పుకున్నాడు.
పాప హోమ్ వర్క్ చేస్తూ చేస్తూ అలానే నిద్దరోయింది.పాప నిద్దట్లో ఓ కల!

………………………………………………………..

బడికి సెలవులిచ్చారు. మ్యూజిక్ క్లాసులు తప్పిపోతాయని, అయిష్టంగానే అయినా.. ఓ వారం రోజులు పాపని పల్లెటూళ్ళో తాతయ్య ఇంట్లో గడపటానికి దింపి వచ్చాడు నాన్న.
తాతయ్య పొద్దున తీరికవేళలో పెరడు శుభ్రం చేస్తున్నాడు. పాప కూడా వచ్చిందక్కడికి. ఏదో పాట పాడుకుంటూ, తన పని చేసుకుంటున్నాడు తాతయ్య. పాపాయికి స్పైడర్ అంటే ఏమిటో తాతయ్యను అడుగుదామనిపించింది. తాతకు ఇంగ్లీషు రాదుగా, పుస్తకం తీసుకు వచ్చి చూపించింది. తాత నవ్వి, పాపకు ఓ చిన్న పొడుపు కథ పాటగా చెప్పేడు.

 

చిక్కుల మేడలో చిలుకల కొలికి
తూగుటుయ్యాలలో ఊగుతూ ఉంటుంది
ఆకలి కూటి ఆగంతకుల్ని
పీక పిసికి చంపి మింగేస్తుంది

పాపకర్థం కాకపోతే తాతయ్యే సాలెగూడును చూపిస్తూ విడమర్చేడు. “భలే”, “భలే”  అంది పాప. మరో పొడుపు కథ అంటూ చెప్పాడు.

 

జనక్ జనక్ పిల్లగాడు
వాడి నడుముకు మూరెడుతాడు
వాడు లేకుంటే ఊరంతా పాడు

ఆ వస్తువిక్కడే పెరట్లోనే ఉంది వెతుక్కోమన్నాడు. తడుముకుంటుంటే తాతయ్యే సమాధానం చెప్పేడు. పని ముగించి లోపలకొచ్చేరు తాత,  మనవరాలు. బడిలో ఇంతవరకు ఏం నేర్చుకున్నావో చెప్పమన్నాడు తాతయ్య. పాప ఉత్సాహంగా పార్ట్స్ ఆఫ్ బాడీ గురించి చెప్పింది. head, face, chest, legs ఇలా. తాతయ్య దానికీ ఓ గమ్మత్తైన పాట చెప్పేడు.

 

అంభాలు (పాదాలు)
అంభాల మీద కుంభాలు (మోకాళ్ళు)
కుంభాల మీద కుడితిబాన (పొట్ట)
కుడితిబాన మీద ఈరబలక (ఎదరొమ్ము)
ఈరబలక మీద ఇనపగుండు (తల)
ఇనపగుండు మీద ఎదురుమోసులు (వెంట్రుకలు)
ఎదురుమోదుల్లో రేచుకుక్కలు (పేలు)

ఇంకా –

 

అక్కాచెల్లెళ్ళు పక్కపక్కనే ఉంటారు
అక్కింటికి చెల్లెలు పోదు – చెల్లెలింటికి అక్క రాదు.

సమాధానం చెప్పుకోమన్నాడు. పాప తడబడుతుంటే, ముఖంలో భాగం అంటూ అందించేడు. ఈసారి సమాధానం చెప్పేసింది పాప.

ఆ కొన్ని రోజుల తర్వాత పాపాయి ఊరికొచ్చేసింది. కాన్వెంటు తిరిగి మొదలయ్యింది. ఆ రోజు రాత్రి అమ్మ వడిలో తలబెట్టుకుని అడిగింది పాప, “అమ్మా తాతయ్య ఏం చదువుకున్నాడమ్మా?”
“తాతయ్య చదువుకోలేదమ్మా! అందుకే ఇప్పటికీ పల్లెలో ఉన్నాడు.నువ్వు బాగా చదువుకుని బాగా పైకి రావాలే” అంది అమ్మ.

టీవీలో గాంధీ గురించి, గ్రామస్వరాజ్యం గురించి ఏదో ప్రోగ్రాము వస్తోంది.
తాతయ్య చదువుకోలేదా? చదువంటే ఏమిటి?

……

చప్పున మెలకువ వచ్చింది పాపకు.

…………………………………………………..

మనస్తత్వ శాస్త్రం (psychology) ప్రకారం ఓ మనిషి బాల్యం కాస్తంత అటూ ఇటూగా ఏడు యేళ్ళట. అంటే పసితనం, అమాయకత్వాలకు ముగింపు ఏడేళ్ళు. సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని అది కూడా రానురాను కుంచించుకుపోతోంది. ప్రపంచంలో అనేక దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఐదేళ్ళకు గానీ ప్రాథమిక విద్య మొదలవదు. ఈ విషయంలో మనం ప్రగతి సాధించాం. మూడేళ్ళకు ముందే స్కూలో, స్కూలో అంటూ పరుగులు. అంతకు ముందే ప్లే స్కూలు. రెండేళ్ళ నుండే, అరువు భాషలో అరగతీత కార్యక్రమాలు వెరసి బాల్యం బరువు పెరుగుతూ పోతోంది.
భారతదేశ ప్రాచీన విద్యావిధానంలో చదువుచెప్పడం ఎనిమిది యేళ్ళకు మొదలయేది. వృత్తి విద్య సాధారణంగా తండ్రి నుండి సంక్రమిస్తుంది కాబట్టి, ఉద్యోగం వెతుక్కునే అవస్థ, ఉద్యోగం కోసం చదువు అన్న అవసరమూ ఉండేది కాదు. చదువు అలా పాటలా, ఆటలా ఆనందంగా ఉండేది. సరే ఇప్పటి చదువులిలాగే తగలడ్డాయి, తగలడతాయి. వాటినలానే ఏడవనిద్దాం. ఆ చదివే చదువైనా, అలా అలవోకగా పిల్లల మీద వత్తిడి లేకుండా ఉంటోందా? అంటే అదీ లేదు. ప్రాథమిక విద్యలో హోం వర్కుల భారం, మార్కులు, ఆ తర్వాత ఏదో సెట్టు. మధ్యే మధ్యే టీవీలు, క్రికెట్టూ, సినిమా సమర్పయామి.
ప్రభుత్వాన్ని తిడుతున్నాం, చదువులను విమర్శిస్తున్నాం. ఫీజుల గురించి వాపోతున్నాం. మనలో మాత్రం మార్పు రావట్లేదు. ఆ మార్పు మన ఆలోచనా మూలాల్లోంచి రావాలి. ఎందుకు రావట్లేదో?

Posted in సంపాదకీయం | Tagged , , , | 3 Comments