శారద దరహాసం – 4

కామేశ్వర రావు: తొలకరి జల్లుల తర్వాత, అలాంటిదే తొలకరి చూపులు.
పుష్యం: పల్లెటూరులో పపెరిగినందుకు ఇలాంటి అనుభవాలు కొన్ని రుచి చూడగలిగాను ..
కామేశ్వర రావు: శ్రీరాం గారూ, మీరు మొదటి పెళ్ళిచూపులు వర్ణించండి.
శ్రీరామ్: సరేనండి
 

 

కొత్తది చీరకట్టు తన గుట్టును దాచునొ దాచదోయనున్
తత్తరపాటునందు నొకదానికివేరొక మాటచెప్పుచున్
బిత్తర చూపులంతెలియు బేలతనంబును దాచలేనియా
పుత్తడిబొమ్మచూడ మదిపొంగెడు భావము చెప్పశక్యమే!


రానారె: హేట్సాఫ్ శ్రీరామ్ గారు.

విశ్వామిత్ర: భలే –
dotC: ఇంత సింపుల్గా వ్రాసారా! అదరహో!
కామేశ్వర రావు: ఇది మీ స్వానుభవమా? :-)
విశ్వామిత్ర: మది పొంగిన భావం చెప్పకనే చెప్పారు
సనత్ కుమార్: అద్భుతం…
ఫణి: చక్కగా మంచి ఫ్లోలో రాశారండీ. బాగుంది.
రానారె: చెప్ప శక్యమె అంటూనే చెప్పేశారు ఈ పద్యంలో.
నరసింహ: పుత్తడి బొమ్మ – బాగుందండీ.
శ్రీరామ్: అందరికీ నెనరులు…
రాకేశ్వరుఁడు: ఇంతకీ ఆ పుత్తడిబొమ్మ మిమ్మల్ని పెళ్ళాడడానికి ఒప్పుకుందా లేదా ?
రానారె: కామేశ్వరరావుగారి ప్రశ్నకు జవాబు రాలేదు? :)
నరసింహ: ఒప్పుకోక?
రానారె: కోక!?
శ్రీరామ్: స్వానుభవాలే కానక్కల్లేదు కదండీ
శ్రీరామ్: రవిగాననిచో…అన్నారు
రాకేశ్వరుఁడు: ఆవిడ ఏ కవిసమ్మేళనంలో ఎలాంటి పూరణలు పంపుతుందో !
ఫణి: :0
కామేశ్వర రావు: పోని అయ్యే అవకాశం ఉంటే, అవ్వాలని ఆశీర్వదిస్తాం! :-)
పుష్యం: ఈరోజుల్లో పెళ్ళిచూపులుకూడా జీంస్లో, చొక్కలో :-)
పుష్యం: చొక్కాల్లో ..
శ్రీరామ్: ఈ రోజుల్లో అసలు పెళ్ళిచూపులెక్కడా
భారారె:  సభాసదులందరికి నమస్కారం. ఇక నేను సెలవుతీసుకుంటున్నాను
కామేశ్వర రావు: నచకిగారి అనుభవం వేరేగా ఉంది పాపం! దీని గురించి కూడా నచకిగారు ఏకంగా ఖండకావ్యాన్ని వ్రాసేసారు. అదికూడా పొద్దులో చదువుకుందాం
dotC :)
శ్రీరామ్: :)
విశ్వామిత్ర: రాకేశ్వరు గారి అనుభవం?
dotC: adi swaanubhavamE nijaaniki
dotC: కాకపోతే కొంత డ్రామా అద్దాను.
సనత్ కుమార్: స్నిగ్ధము మీ కామెంటే దగ్ధము కావించె పద్య దాహము ! పుష్యం
కామేశ్వర రావు: రాకేశ్వరులది సీక్రెట్టంట
రానారె: స్వాముభవమే ఐతే అది అఖండకావ్యం అంటాన్నేను.
ఫణి: సమయం అలా ఐపోతోంది.
dotC: ఖండితంగా చెప్పటమే మంచిది ఒక్కోసారి!
కామేశ్వర రావు: సరే పెళ్ళిచూపులయ్యాయి కాబట్టి మళ్ళీ సమస్యలు
రానారె: అంతేకదా మరి!
రానారె: :)
dotC: Good one!
రానారె: అయ్యాయి కాబట్టి … కార్య కారణ సంబంధం :)
కామేశ్వర రావు: రాముని రాక్షసాంతకుని దాశరధిన్ వినుతించుటొప్పునే?
కామేశ్వర రావు: ఫణిగారూ, మీ పూరణ. ముందు మొదటి పాదం మాత్రమే చెప్పండి.
రాకేశ్వరుఁడు: నా వలనైతే ఒప్పలేదు. ఎవరు ఒప్పించారో మఱి దాశరధిన్
సనత్ కుమార్: వావ్…. మంచి సమస్య
ఫణి: అలాగేనండి
రాకేశ్వరుఁడు: కందమా
ఫణి: :)
రాకేశ్వరుఁడు: ఏం దానందమా
కామేశ్వర రావు: అదేగా మరి :-)

 

వినుతింపుము సుజనశ్లో
కుని రాముని రాక్షసాంతకుని దాశరథిన్
వినుతించుటొప్పునే యిత
రుని మతిమాలి జగతి భవరోగము తొలుగన్.


విశ్వామిత్ర: @raanaare పెళ్ళితరువాత ‘కార్య’కారణ సంబంధమె .. కొండకచో – రణసంబంధం  కూడా
పుష్యం: అలాగే ఉంది.. అందుకనే అద్యక్షులు మనకు బాగా దురద వచ్చదాకా ఊరించారు :-)
సనత్ కుమార్: వావ్…. అత్యద్భుతం….
కామేశ్వర రావు: @viSvamitra – :-)
dotC: ఇలా కూడా చెయ్యచ్చా!! రాకేశ్వరా, అందుకోండి… చూచివ్రాతలుంటేనా…
ఫణి: నెనర్లు.
సనత్ కుమార్: దానమ్మా….
సనత్ కుమార్: అపరిగ్రహమా…
రాకేశ్వరుఁడు: అవును చూచివ్రాతలుంటేనా, నేను దీన్ని స్రగ్ధరలో పూరించేవాణ్ణి.
కామేశ్వర రావు: కందంలో ఉత్పలమాల పాదాన్ని ఇరికించిన విధానం అమోఘం!
సనత్ కుమార్: ఏదో ఒకటి చేసేవాళ్ళం…
ఫణి: ధన్యవాదాలు అధ్యక్షుల వారూ!
విశ్వామిత్ర: భలే భలే
ఫణి: రవి ఉబలాట పడ్డాడు ఏంటా అని. ఉంటే బాగుండేది.
కామేశ్వర రావు: తర్వాతి సమస్యకి వెళదాం. “తారా నను బ్రోవ రమ్ము తాపము దీరన్”
సనత్ కుమార్: రవి ఒక్కడేనా… మేం లేమూ
కామేశ్వర రావు: రాకేశా మీ పూరణ

 

నే రాకేశుడనఖిలము
నేరిచి గురువుకడ, నెనరు నేర్వకఁ గడు అ-
న్యారక్తుడనై నందున
తారా ననుబ్రోవరమ్ము తాపము దీరన్


రానారె: @విశ్వామిత్ర –  నర్మ’గర్భం’గా వున్నాయి మీ మాటలు… :)
dotC: రాకేశ్వరా, ఇదీ స్వానుభవమా?!
కామేశ్వర రావు: ఇందకల ఎవరో రాకేశ్వరుని పెళ్ళిచూపుల సంగతి అడిగారు కదా, ఇదిగో ఇదీ సంగతి :-)
రాకేశ్వరుఁడు: నచకీ నా మోహం లా వుంది. మీరు చెప్పేది.
విశ్వామిత్ర: మీ పేరు నిలబెట్టారు
రానారె: రాకేశా … ఇది నిజంగా నా గురించే రాసినట్ట్టుంది.
విశ్వామిత్ర: @rAnArE :) :)
రాకేశ్వరుఁడు: కామేశం గారు, మీరు చెప్పేదీ నా మోహంలానే వుంది.
dotC: మీ మొహంలా ఉంటే కష్టమే! మూడో కంటికి తెలియరాదు!
కామేశ్వర రావు: ఇంతకీ ఎవరా తార? నయనతారకి పెళ్ళికుదురి పోయిందే!
ఫణి: బాగుంది బాగుంది.
dotC: ప్రభూ, దేవా!
రానారె: పెళ్లికుదిరినా పోయేదికాదులెండి నయనతార. :)
పుష్యం: ఇందాక మనము ముచ్చటించిన సినీతార కాదుకదా ?? :-)
కామేశ్వర రావు: పుష్యంగారూ దీనికి మీ పూరణ చెప్పండి
పుష్యం: చిత్తం
విశ్వామిత్ర: య్యో – రాకేశుడి కి కన్ను హాలీవుడ్ మీదండీ

 

ఆరవగానే పోవుట
ఘోరము కాదా?? గిరగిర కూలరు పంకా
జోరుగ తిరగగ విద్యు
త్తా! రా! ననుబ్రోవ రమ్ము తాపము తీరన్!! :-)


శ్రీరామ్: వహ్వా!
విశ్వామిత్ర: :) :)
కామేశ్వర రావు: “విద్యుత్తా! రా!” విరుపు భలే ఉంది!
శ్రీరామ్: శ్యాం గారు విరగ్గొటారు..
ఫణి: వవ్వా! :)
రానారె: పచ్చడి
సూర్యుడు: @pushyam, :)
dotC: వావ్! ఈ వేసవి చల్లగా ఉంది!
పుష్యం: మా నాన్నగారు apsebలో పని చేసేవారు :-)
రాకేశ్వరుఁడు: ఈయన ఎవతో విద్యుత్తారని రమ్మంటున్నారు.
రానారె: శ్యాం గారూ, శ్రీశ్రీ వుండుంటే మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపేవాడు. :)
కామేశ్వర రావు: :-)
రాకేశ్వరుఁడు: విద్యుత్తారలను తాకేటప్పుడు జాగ్రత్త వంహించండి శ్యాం గాు.
రాకేశ్వరుఁడు: గారు.
పుష్యం: ఆయన చేతి వంట్ కాకపోతే పరవాలేదు :-)
విశ్వామిత్ర: :)
ఫణి: :-)
కామేశ్వర రావు: సమయం చాలా గడచిపోయింది. ఇంకా పద్యాలు చాలానే ఉన్నాయ్. ఎంతసేపు కొనసాగిద్దాం?
dotC: పాపము, అయ్యో అనుకుని తాపము తీర్చేటి తార యెవరైతేనేం!
పుష్యం: మాకు పరవాలదు పొద్దుట 9 అయ్యింది ;-)
dotC: naaku 11:30 am
ఫణి: ఇంకో సాయంకాలం?
పుష్యం: అందరికీ నెనరులు 2
మురళి మోహన్: మరో 7 నిముషాలు!
కామేశ్వర రావు: ఇంకొక అరగంటలో ముగిద్దామా?
సనత్ కుమార్: కొనసాగిద్దాం
ఫణి: ok.
సనత్ కుమార్: okie.
శ్రీరామ్: ఇది బాగుంది
కామేశ్వర రావు: @viSvAmitra :) )
dotC: పూరిస్తారనుకుంటే కొత్త సమస్యలు తెస్తున్నారే!
ఫణి: :)
కామేశ్వర రావు: తర్వాతి సమస్య – కలికిశిక్ష యేల కరుణమాలి
శ్రీరామ్: విశ్వామిత్రులవారికి సమస్యలివ్వడం బాగా అలవాటు
కామేశ్వర రావు: ఫణిగారూ, మీ పూరణ
ఫణి: అలాగేనండీ

 

చెలియ యలుకదేల చెంతకు రావేల
వెలది నీదు జడను విసరుటేల
నెలత మోము దాచ నేరమేమది బాల
కలికి శిక్షయేల కరుణ మాలి.


కామేశ్వర రావు: చాలా అందమైన శిక్షే పడింది :-)
విశ్వామిత్ర: @Sriram :)
విశ్వామిత్ర: నెట్టువాడు ఇంకొద్ది నిముషములలో నన్ను బయటకు నెట్టుతాడుట. అందరికీ నెనరులు. పద్యాలు భలే బాగున్నాయి
ఫణి: నెనర్లు.
dotC: జడతో ఉరేసినట్టు… నిజమే!
పుష్యం: జడ గంటలు లేవనుకుంటా?? లేకపోతే గాట్టిగా తగిలేది :-)
రానారె: ఫణిగారు, పద్యం బాగుంది. శ్రీకృష్ణుడు చెప్పిన పద్యమా?
కామేశ్వర రావు: :-)
రాకేశ్వరుఁడు: కలికి అంటే ఇక్కడి అర్ధం?
ఫణి: ఎన్టీయార్
ఫణి: రాకేశా: స్త్రీ
రానారె: మనసులో కెలికేది కలికి
కామేశ్వర రావు: కలికి అంటే ఎంటీయార్ కాదు, అమ్మాయి :-)
రాకేశ్వరుఁడు: కలికి చకోరాక్షి కడగన్నులు … సరి సరి లెస్స లెస్స
కామేశ్వర రావు: rAnAre – భేష్:-)
కామేశ్వర రావు: సభ్యులు అనుమతిస్తే, దీనికి నే చేసిన పూరణని మీ ముందుంచుతాను
రాకేశ్వరుఁడు: ఆలోచించుకోనీయండి…
రానారె: అంతకంటేనా!
ఫణి: ఎదురుచూస్తున్నాం
రాకేశ్వరుఁడు: ఎన్నికలు జరుపుతున్నాము.
శ్రీరామ్: మీకును ననుమతికావలెనా……..
కామేశ్వర రావు:

 

ప్రేమ నేరమౌనె? ఫిర్భీ జహాపనా
చేసినాము మేము చెరిసగమ్ము
నాకు లేదు కాని నా జానెజా అనార్
కలికి శిక్ష యేల కరుణ మాలి!


ఫణి: వాహ్వా!!
శ్రీరామ్: నారాయణ దాసు గారి ఇన్ స్పిరేషన్ తో రాసినట్టుంది
రానారె: అరరే!
రానారె: దాసుగారంటే హరికథా పితామహుడేనా?
పుష్యం: అదిరిందండి
ఫణి: “ఫిర్భీ జహాపనా! ” సందర్బానికి భాష అద్భుతంగా సరిపోయిన్దందడీ.
కామేశ్వర రావు: నెనరులు
సూర్యుడు: @kAmESvararAvu :-)
రాకేశ్వరుఁడు: ఉరుదూ ఆటవెలదన్నమట.
రానారె: ఫణిగారు – నా మాటను కొట్టేశారు.
శ్రీరామ్: ఔను, ఆయన ఇలాంటి కందమే ఒకటి రాసారు
రాకేశ్వరుఁడు: ఆచ్చతెనుగు ఆటవెలదిని ఉరుదూ వారికి అఱువిచ్చినట్టునారు.
రానారె: అందునా … అనార్-కలి ‘ఆటవెలది’ అనే కదా జహాపనుని అభిప్రాయం!
సనత్ కుమార్: బాగున్నది
రానారె: సూపరో సూపరు
dotC: వాహ్ వాహ్, అధ్యక్షా!వాహ్ వాహ్, అధ్యక్షా!
కామేశ్వర రావు: ఒక రెండు దత్తపదులు చెప్పుకొని ముగిద్దాం
కామేశ్వర రావు: కడప, పులివెందుల, రాజశేఖరుఁడు, జగన్ రాకేశా మీ పూరణ
రాకేశ్వరుఁడు: చిత్తం

 

శ్రీగిరి యందు నేకడ పరీక్షగఁ జూచిన నీ విలాసమే,
నాగుల రాజశేఖరుఁడు నక్కడె మోహితు డయ్యెఁ నీ వలన్
వాగులునా జగన్నగకు వాల్జడలయ్యెను! భక్తకష్టముల్
వేగము మ్రింగు పెద్ద పులి వెందులఁ జూచిన నీ విశిష్టతే!


రాకేశ్వరుఁడు: —
dotC: సూపరో!! ఈయన చూచివ్రాతలు వ్రాస్తారా!!
రానారె: శభాష్ రాకేశ్వరా
సనత్ కుమార్: అబ్బో బ్రహ్మాండం
కామేశ్వర రావు: ఈ పదాలలోంచి కూడా భక్తి పుడుతుందని ఇప్పుడే తెలిసింది :-)
ఫణి: బాగు బాగు.
ఫణి: స్ఫూర్తి లేకుండానే వ్రాశారు.
కామేశ్వర రావు: వాగులని వాల్జెడలతో పోల్చడం నాకు బాగా నచ్చింది
రాకేశ్వరుఁడు: రాజశేఖరుఁడంటే వేఱ్వేఱ్వురకు వేఱ్వేఱు భక్తులుంటాయిలెండి. అది ఆయని విలాసము.
సూర్యుడు: @rAkESvaruNDu :)
ఫణి: పులివెందుల విరుపు బాగుంది.
శ్రీరామ్: చాలా బాగుంది
రానారె: ఔనండి. ఈ పదాలతో ఇలాంటి పద్యం … రాకేశుడు మహా శక్తివంతుడు.
dotC: మీ దగ్గర బోల్డు అరసున్నాలున్నాయి కదా… మందమైన మా గోడలకీ కాస్త వేద్దురూ!
పుష్యం: @kaamaeswara కం// ఒహొహో అని చదువుతుంటె  – హహహా అని నవ్వు వచ్చె హైదరబాద్మే – రహనేవాలోంకీ బోల్ – శహబాస్ అది మంచి రచన చక్కని పద్యం :-)
కామేశ్వర రావు: తర్వాతి దత్తపది. నునునూ, నెనెనే, నినినీ, నననా – గోదాదేవి భక్తి
కామేశ్వర రావు: పుష్యంగారూ నెనరులు:-)
పుష్యం: ఇది ఆశువు కాదు లెండి.. ఇంతకు ముంది వ్రాసినది కొద్ది గా మార్చాను
కామేశ్వర రావు: శ్రీరాంగారూ దత్తపదికి మీ పూరణ వినిపించండి
శ్రీరామ్:
 

తానును నూత్నపత్ని వలె,దాల్చిన మాలికలిచ్చి కొల్చినన్
మానెనె నేలుకోవ హరి, మానిత భక్తికసాధ్యమున్నదే!
మానిని నీరజాక్షువరమాలగ గట్టిన భక్తిరజ్జువే
ఆ నన నారివోలె మదనాస్త్రములేసెను శేషశాయిపై!


ఫణి: ఆ నన నారి?
రానారె: నన ?
dotC: వామ్మో అనిపించింది సమస్య చూసాక! పూరణ చూసాక వాయమ్మో అనిపిస్తోంది!
శ్రీరామ్: ననమంటే పుష్పము
కామేశ్వర రావు: చాలా అందంగా ఉంది పూరణ
రానారె: ఆహా!
శ్రీరామ్: నెనరులు
సనత్ కుమార్: బ్రహ్మాండంగా ఉంది
రానారె: అద్భుతంగా వుంది పూరణ.
dotC: నారి వోలె అంటే వింటి నారియా?!
పుష్యం: ఇది ఎవరూ పూరిస్తారనుకోలేదు.. అదరగొట్ట్టారు :-)
శ్రీరామ్: అవునండి
ఫణి: మ్.. బాగుంది. పదాలని చక్కగా ఉపయోగించుకొన్నారు.
రానారె: మన్మథుని పుష్పబాణం
dotC: అధ్యక్షా, మీ పూరణ గలదా దీనికి?
శ్రీరామ్: ననవిలుకాడు అని మన్మ్ధధుడి పేరు
కామేశ్వర రావు: లేదండి, కావాలంటే రాసి పంపిస్తాను :)
రానారె: ఐతే కావాలి. :)
శ్రీరామ్: నాకు కూడా చూడాలని ఉంది కామేశ్వరరావు గారు
కామేశ్వర రావు: నన నారి – పూబోడి అనికూడా అనుకోవచ్చు!
రాకేశ్వరుఁడు: నననారి ప్రయోగం చాలా బాగుంది.
శ్రీరామ్: నెనరులు
కామేశ్వర రావు: సరే శుభప్రదంగా సినీతారల దత్తపదితో ముగిద్దాం :-)
సనత్ కుమార్: ;)
శ్రీరామ్: రవిగారు కూడా పూరించినట్టున్నారు ఈ దత్తపది
కామేశ్వర రావు: కాజల్, తమన్నా, సమంత, నమిత – తెలుగింటి ఆడపడుచు. నచకిగారూ మీ పూరణ
సనత్ కుమార్: వారు లేరు కదా
dotC: ముఝే భీ, ముఝే భీ!
రానారె: శుభప్రదంగా అంటున్నారు … విశ్వనాథ్ సిమినా తరహాలో మంచి పద్యం కావాలి. :)
సనత్ కుమార్: I mean రవిగారు
పుష్యం: ఇది బ్రహ్మచారి పద్యమా :-)
కామేశ్వర రావు: నచకిగారూ మీదే పూరణ
dotC: జయప్రదం, జయప్రదం…
రాకేశ్వరుఁడు: సినీతారల పేర్లు చూసి తబ్బిబ్బవుతున్నారేమో
రానారె: మరే!! పూరణం … ఈ మాటకు ఎన్ని అర్థాలున్నాయో కదా!
కామేశ్వర రావు: నచకీగారూ, సినీతారలనగానే ఎక్కడికి వెళ్ళిపోయారు?
రానారె: ఎక్కడున్నా వెంటనే వేదిక మీదకు రావలసిందిగా విజ్ఞప్తి.
సనత్ కుమార్: ఒక తారకి 16 వేల మంది భర్తలు అన్నారు … ఇక్కడ నలుగురు తారలున్నారు???
రాకేశ్వరుఁడు: కాజల్ తమన్నాదులు ఎదురు చూస్తున్నారు
రానారె: మొత్తం ఎంతమంది భర్తలో చెప్పుకోండి … అని ప్రశ్నిస్తున్నారా సనత్ గారూ?
పుష్యం: కాస్టూమ్ఛేంజి లో ఉన్నట్టున్నారు :-)
ఫణి: :)
రానారె: హ్హహ్హహ్హ
సనత్ కుమార్: లెక్క పెట్టడానికి నచకి వెళ్ళి ఉంటారని ….
రాకేశ్వరుఁడు: :D
రానారె: హహ్హహ్హ
కామేశ్వర రావు: :-)
dotC: unnaanu
dotC: !

 

మల్లికాజల్లులను బోలు మంచి నవ్వు
చేయి వేతమన్నా కందు చెంపలవియు
రతి విలాసమంత తనకు జతయె నిజము
కనగ నమిత సుగుణశీల తెనుగు బాల


dotC:
dotC: నాలుగు పేర్లు చెప్పగానే పిల్లలంతా సినిమాలకి వెళ్ళిపోయారా?!
రానారె: అలసిపోయారేమోననుకున్నాం …
రానారె: అమ్మో అమ్మో అమ్మో …
dotC: hmmm…
కామేశ్వర రావు: బాగుంది. చేయి వేస్తే, మీ చెంపలు తప్పక కందుతాయ్ మరి :-)
రానారె: “కనగ నమిత సుగుణశీల తెనుగు బాల” ఏమందుమేమందుము!!!
dotC: అలా వచ్చారా!
రాకేశ్వరుఁడు: పేర్లను చాలా సహజంగా ఇమడ్చారు.
రాకేశ్వరుఁడు: అద్భుతంగావుంది.
dotC: ఇంతకీ ఇంత సేపూ నేనేమైపోయాను?! రెండు సార్లు పూరణలు పేస్టితినే?
సనత్ కుమార్: అదిరింది
పుష్యం: తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా :-)
రానారె: పద్యం సూపరుడూపర్ హిట్టు
dotC: నెనరులు, అధ్యక్షా, రాకేశ్వర, రానారె, శ్యామ్, సనత్కుమార్ గార్లూ!
ఫణి: బాగుందండీ. తెలుగుబాల అందము, సౌకుమార్యము, గుణము అన్నీ ఉన్నది. చక్కగా ఉంది.
శ్రీరామ్: అతిసుకుమారంగా ఉంది పద్యం
dotC: నెనర్లు, శ్రీరాం గారూ, ఫణి గారూ!
రానారె: అందుకే ఈ పద్యాన్ని ఆఖరి అస్త్రంగా దాచారు మదధ్యక్షులవారు
రాకేశ్వరుఁడు: పోనీలెండి మాస్ ప్రేక్షకులు హీరోయినీల కోసం వేచియుండలేక గోల చేస్తుంటే, వచ్చి బాగానే మెప్పించారు.
dotC: ఇంకా నయం, సవర్ణదీర్ఘసంధి వెయ్యలేదు!
సనత్ కుమార్: అదీ సినేమా స్టంటేనండీ ప్రమోషన్ టెక్నిక్కులు
కామేశ్వర రావు: అతిసుకు”మారం”గా ఉంది
సనత్ కుమార్: అందర్లో ఉత్కంఠ
dotC: ఆ మాత్రం నిక్కులు లేకుంటే ఎక్కవుగా సినీమాలు.
రానారె: చక్కగా చెప్పారు
సనత్ కుమార్: ఆపై కాస్త సస్పెన్సు…
రానారె: అంతలోనే వచ్చేసింది …
కామేశ్వర రావు: సరే, ఇంక చింతా మాష్టారుగారు చేసిన అద్భుతమైన శారదదరహాస వర్ణన మంగళాశాసనంగా సభని ముగిద్దాం
dotC: ఆ పైన బోల్డంత నాన్సెన్సు!
రానారె: రైఠో
సనత్ కుమార్: తర్వాత గ్రాండ్ ఓపెనింగు… కలెక్షన్లు ఫుల్లు …
రానారె: కానివ్వండి …
dotC: అస్తు!
శ్రీరామ్: కామేశ్వరరావు గారూ కానివ్వండి….
కామేశ్వర రావు:
 

శారద భక్త రక్షణ విశారద. మేదుర మాధురీ సుధా
ధార కవిత్వ రూపమున దర్పిల సత్సభ పొంగి పొర్లి తా
చేరె దిగంతముల్ కవుల శ్రీకర భావ సమృద్ధి వెల్లువై.
భారతి హాస చంద్రికలు ప్రస్పుటమై యిట కాన వచ్చెడున్.

 

తారకాపథమందు చేరిన దక్షులౌ సుకవీశ్వరుల్ సభన్ శోభఁ గూర్చ
పారవశ్యము చెంది ధారగ పద్యముల్ పఠియింపగానభో పథము మురిసె.
శారదా దరహాస చంద్రిక చక్కనై దిశ లంటెగా కవుల్ తేజస మన.
భారతాంబ పవిత్ర వర్తుల భవ్యపుత్రుల గాంచె తా పొంగి వెలయు చుండె,

జన్మ జన్మల పుణ్యమీ సభికులగుట.
పుణ్య కర్మల ఫలితమీ “ప్రొద్దు” నుంట.
శారదా కృప ఫలిత మీతీరు నిచట
పద్య రచనల ప్రభలలో పరగి మనుట
 

సనత్ కుమార్: అత్యద్భుతం
కామేశ్వర రావు: ఇందులో సీసగర్భితమైన మత్తకోకిల ఉంది!
ఫణి: వారువారే!అధ్భుతం. అందరికీ ధన్యవాదాలు. శెలవు.
సూర్యుడు: చాలా బాగుంది
కామేశ్వర రావు: సభని రక్తి కట్టించిన కవిమిత్రులందరికీ ధన్యవాదాలు!
dotC: చింతా వారికి సాటియా! సెలవు!
రానారె: ధార …
శ్రీరామ్: అందరికీ ధన్యవాదాలు!
సనత్ కుమార్: అధ్యక్షుల వారికి అనేకానేక ధన్యవాదాలు, అభినందనములు
కామేశ్వర రావు: మిగతా పద్యాలు మైల్లోనో, పొద్దులోనో చదువుకుందాం
సనత్ కుమార్: తప్పకుండా
dotC: అస్తు!
రానారె: అందరికీ ధన్యవాదాలు … సభను చల్లగా నడిపించిన అధ్యక్షులవారికి అభివాదాలు, కృతజ్ఞతలు.
రాకేశ్వరుఁడు: మిగిలిన పద్యాలు మెయిలులో పంపమనవి
పుష్యం: అధ్యక్షులకు ఈ సభని ‘ జయప్రదం ‘ గా జరిపినందుకు నెనరులు
రాకేశ్వరుఁడు: మెయిలోనైతే చర్చ రక్తిగా సాగుతుంది.
రానారె: ఔను… అలాగే చేద్దాం
కామేశ్వర రావు: రాకేశా అలాగే.
dotC: ఇక్కడైతే రచ్చ శక్తిగా సాగుతుంది
సూర్యుడు: @kAmESvararAvu గారు,  ధన్యవాదాలు, శలవు
రానారె: ఒక్కొక్క పద్యాన్ని మెల్లగా వదమందా
రానారె: వదలమందాం
కామేశ్వర రావు: నిజంగానే ఈ పద్యాలు సభలో చదివి వినేస్తే సరిపోయేలాటివి కావు. సభాకవిత్వం కాదు :)
రానారె: మంచి నాణ్యమైన సరుకు
రాకేశ్వరుఁడు: వేగులలో ఒకటి రెండు ప్రతిపద్యాలు కూడా పంపవచ్చుఁ
dotC: నిజమే… ఉద్దండులు చాలా మందే ఉంటే నేర్చుకోవటానికే సమయం పట్టేస్తుంది నాలాంటోడికి!
కామేశ్వర రావు: అందరికీ మరొకసారి నమస్కారాలు. ధన్యవాదాలు. ఇక సెలవు. స్వస్తి.
రానారె: సభాకవిత్వం కాదు అని శ్లేష వేసినట్టున్నారు కామేశ్వర్రావుగారు? :)
కామేశ్వర రావు: అంతేగా మరి :-)
పుష్యం: సెలవు మరి..
రానారె: ధన్యవాదాలు
dotC: selav
కామేశ్వర రావు: శుభం భూయాత్!
రానారె: నేను కూడా సెలవు తీసుకొంటాను..
dotC: శుభరాత్రి మీకు!

Posted in కవిత్వం | Tagged , | 3 Comments

విజయంలో ఒక్కోమెట్టూ .. మొదటి భాగం

ప్రముఖ నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షకులు యండమూరి వీరేంద్రనాథ్ గారితో పొద్దు జరిపిన ముఖాముఖి మొదటి భాగం

 

‘సౌందర్యం క్షణికమైనా, క్షణం అసత్యం కాదన్న’ నమ్మకంతో శరత్కాల తృణ పత్రాలు రాల్చిన విషాదాక్షితల్ని చూసి మనసు తడి చేసుకున్న భావుకుడు..
తొలికలల తెల్లచీరకు కాటుకచీకటి వంటి నల్లంచుని కలనేసిన స్వాప్నికుడు…

గోదారి ఒడ్డున దగ్గుతో గడిపిన ఒంటరి రాత్రుల ప్రేరణతో సోమయాజినీ, ఊహించకుండా వచ్చిపడ్ద అపనిందల ఉపద్రవం నుంచి ’లేడిస్ హాస్టల్’ నీ కల్పించి ఎదురుదెబ్బల్ని ఎదుగుదలకు నాందిగా వాడుకున్న కార్యశూరుడు…

మనిషి మనుగడకు ముఖ్యావసరమైన డబ్బుకి సాహిత్యంలో స్థానం కల్పించినవాడు…

విజయ శిఖరాల్ని అధిరోహించడానికి ఒక్కోమెట్టునీ అక్షరబద్ధం చేస్తూ వ్యక్తిత్వాన్ని  వికసింపజేసుకొమ్మని రెండుతరాల్ని మెత్తగా మందలించినవాడు..
వేలమందిచేత లక్షల తెలుగు పుస్తకాలు కొనిపించి చదివించినా, అయాన్ రాండ్ నీ, అబ్సర్డ్ కథనాన్నీ సామాన్య పాఠకుల స్థాయికి చేర్చినా, తనదైన శైలితో ఏదో సాధించాలన్న కసిని ఎందరిలోనో రగిల్చినా… ఆయనకే చెల్లిన విషయాలవి.

ఎన్ని చెప్పుకున్నా, ఎంతగా మనం అనుకున్నా… ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని నిర్వచించటానికి కొన్ని పేలవమైన ఉపమానాలు, ఉదాహరణలు మాత్రమే…
మరి తనగురించి తాను ఏమంటారో… ఆ వీరేంద్రజాలికుని మాటల్లోనే…

 

Continue reading

Posted in వ్యాసం | Tagged | 4 Comments

శారద దరహాసం – 3

రాకేశ్వరుఁడు: రవీ మీ దగ్గర పూరణ లేదా ? వచింప సిగ్గగున్ కి ?

కామేశ్వరరావు: భారారె తర్వాత మీ పూరణే, రెడీగా ఉండండి

రవి: చిత్తం

భారారె: అలాగే  (నా వచ్చీరాని తెలుగులో వాడరాని పద ప్రయోగాలతో)

రానారె: ఫరవాలేదు… అందరం అలా మొదలుపెట్టినవాళ్లమే.

భారారె: రవి గారూ కానివ్వండి..మీ తరువాత నేను చెప్తాను

dotC: కొందఱమింకా అలాగే ఉన్నాం! 🙁

భారారె:

 

ఏ కరమందు నా భరతమేది ధగద్ధగలున్, సువర్ణ మే
ధోకర సంపదంతయును దుర్గతిపాల్పడ నెంతదీనమున్
చీకున ఆంగ్లపాదముల చెంతన బిచ్చమునెత్తుతున్నదే !
బాకులు క్రుమ్మినట్లగును భారతపౌర ! వచింప సిగ్గగున్

dotC: 🙁

భారారె: కరమందు అంటే చేతిలో అని అర్థంలో వాడాను

dotC: పద్యం బాగుంది… బాకులు క్రుమ్మినట్లే అయింది!

పుష్యం: బాగు బాగు .. చక్కగా చెప్పారు

శ్రీరామ్: బాగుంది

శంకరయ్య: ఓకే

కామేశ్వరరావు: భరతము + ఏది ధగద్ధగలన్ – భరతము ధగధగలని వదులుకొందని

ఫణి: బాగుంది

సనత్ కుమార్: ఈ మధ్య ఆలోచించటం కూడా ఇంగ్లీషు లోనే చేసే దుస్థితి కి జారిపోతున్నామేమో… మీ పూరణ డైరక్టుగా గుండెల్లో దిగిందండీ…

రానారె: మ్…

భారారె: ధన్యవాదాలండి

రానారె: రవిగారు జారుకున్నారు

రానారె: ఆయనొచ్చేలోపు ఇంకో సమస్యను ముందుకు తెస్తారా, కామేశ్వర్రావుగారూ?

కామేశ్వరరావు: శంకరయ్యగారూ, మీ పూరణ వినిపించండి

నచకి: రవి కదా… రకరకాల చోట్ల ఉదయాస్తమయాలతో బిజీ!

సనత్ కుమార్: మబ్బుల్లో దోబూచులాడుతున్నారు (ఇంటర్నెట్ ప్రాబ్లమౌతోంది వారికి)

రాకేశ్వరుఁడు: బాగుంది పద్యం

శంకరయ్య:

 

ఏ కమనీయమౌ కలల నెంచి స్వతంత్రముఁ గోరి పోరిరో
లోకనుతుల్ మహాత్ములు; విలుప్తము లయ్యెను వారి స్వప్నముల్
చీకటి కార్యముల్ సెలఁగి చింతలు పొంద జనమ్ము; నా యెదన్
బాకులు క్రుమ్మి నట్లగును భారతపౌర! వచింప సిగ్గగున్.

dotC: ఇది కూడా… లోతుగా దిగినయి బాకులు!

శ్రీరామ్: అద్భుతం

కామేశ్వరరావు: మహాత్ముడైన గాంధీ స్వయంగా పడుతున్న బాధలా ఉందండీ!

ఫణి: గాంధీ జయంతి సందర్భంగా ఉచితంగా ఉంది. బాగుంది.

నరసింహ: చాలా బాగుందండీ. గుండెల్లో గుచ్చుకున్నట్టుందండీ

భారారె: పద్యం బాగుంది మాస్టారూ

కొత్తపాళి: విలుప్తము లయ్యెను

కొత్తపాళి: గాంధీ జయంతి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా సముచితంగా ఉన్నది మాస్టారూ!

రానారె: ఏ మహనీయ సాధ్వి జగదేక … పద్యం గుర్తొచ్చిందండీ

రానారె: లవకుశ సినిమాలోనిది.

సనత్ కుమార్: గుండెల్లో… గున్పాలు దింపేశారే, ఏవేవో ఉహల్తో పద్యాల్పూరించారె….

కొత్తపాళి: మిత్రులారా నా గృహకృత్యాలు పిలుస్తున్నాయి. సభకీ, సదస్సుకి శుభాభినందనలు.

శంకరయ్య: ధన్యవాదాలు

కామేశ్వరరావు: ఎలాగో గాంధీ ప్రసక్తి వచ్చింది కాబట్టి ఆ మహాత్ముని తలచుకొందాం.

కామేశ్వరరావు: G-a-n-d-h-i అన్న అక్షరాలు పాదం మొదట వచ్చేట్టు గాంధీ గురించిన పద్యం. నచకిగారూ మీరందుకోండి

dotC: నేనే మొదలెట్టాలా? సరే!

భారారె: మొదలెట్టండి

dotC:

 

జీవనము మొత్తము నహింస భావనలకు
ఏమఱక నిచ్చియు మహాత్ముడేమి బొందె!
ఎందు లేరట్టి నిస్వార్థులెన్నగ నెవ
డీ భువిని ధర్మ సత్యవ్రతాభిలాష
హెచ్చుగ గలిగి చరియించె మెచ్చునట్లు?
ఐకమత్యమునాశించి అమరుడయ్యె!

….మొదలూ, చివఱా కూడా అయినై

ఫణి: స్వేచ్ఛా ఛందస్సా?

కామేశ్వరరావు: హృద్యంగా ఉందండి.

రానారె: వహ్వా

కామేశ్వరరావు: తేటగీతి

నరసింహ: మనోజ్ఞం

భారారె: wow

dotC: అంత స్వేచ్ఛ లేదండీ… తేటగీతి …అనుకుని వ్రాసాను… తప్పిందా యేం?!

రానారె: Nదులేరట్టి… Hచుగ గలిగి… భలే

ఫణి: బాగుంది.

రాకేశ్వరుఁడు: నచకి గారు చాలా సహజంగా వుంది మీ తేటమాలిక.

dotC: నెనర్లు, కామేశ్వరరావు, భారారె, రానారె, ఫణి, నరసిమ్హ, రాకేశ్వర గార్లూ!

కామేశ్వరరావు: శంకరయ్యగారూ, మీ పద్యం కూడా వినిపించండి

శంకరయ్య: నా పద్యం దాదాపు పై పద్యం లాగే ఉంది

శంకరయ్య:

 

జీవితమ్మును త్యాగమ్ముఁ జేసె నతఁడు
ఎలమి సత్యాగ్రహాయుధ మెన్నుకొనెను
ఎన్నగా లే రతని సాటి; యెన్నడును జ
డియుట నెఱుఁగని ధీరుండు, నియమశీలి
హెచ్చుగా సత్యము నహింస నెన్నువాఁడు
ఐన గాంధీకి భక్తి సుమాంజలి యిదె.

నరసింహ: బహు బాగు బాగు

dotC: పద్యాలకి పోలిక ఉంటుంది గాంధీ గారి గుఱించే కనుక… చక్కగా ఉంది పద్యం!

రానారె: భలే! ఎలమి … ఈ పదం చాలా బాగుంది.

ఫణి: గాంధీజీకి నిజమైన పద్యాంజలి.

సనత్ కుమార్: చాలా బాగున్నది…

కామేశ్వరరావు: గాంధీగారికి పద్యమాలికలు బాగున్నాయి

రానారె: ఎలమి కోరిన వరాలిచ్చేదేవుడే… అన్నమయ్య వాడిన పదం.

శ్రీరామ్: గాంధీజయంతి సందర్భంగా…

శంకరయ్య: చింతా రామకృష్ణారావు గారి పద్యం చూసాను. చాలా బాగుంది.

సనత్ కుమార్: అధ్యక్షా .. రవికేదో గ్రహణం పట్టినట్టయ్యింది. అంతర్జాలంలో వారు మరి నేడు దర్శనం ఇవ్వలేకపోవచ్చుట.

కామేశ్వరరావు: అవునండీ. వారు సభకు రాలేకపోవడం మన దురదృష్టం

సనత్ కుమార్: క్షంతవ్యుణ్ణీ అని తెలియజేయమన్నారు…

dotC: అయ్యో!

పుష్యం: అందులోనూ మీరు రవిగారి పూరణగురించి చాలా ఊరించిన తరువాత 🙁

ఫణి: 🙁

కామేశ్వరరావు: సరే, ఇక్కడ బాగా రాత్రయింది కదా మరి 🙂

రానారె: రామకృష్ణారావుగారి ఆశువులు లేకపోవడం లోటే… ఆశీస్సులు మాత్రం ఇచ్చారాయన. 🙂

సనత్ కుమార్: వారి పూరణను టైపుచేశారుట కానీ స్క్రీను అల్లానే మ్రాన్పడిపోయిందిట.

ఫణి: 🙂

కామేశ్వరరావు: తర్వాత దత్తపదికి వెళదాం

dotC: ఇక లేరా గాంధీలు?

సనత్ కుమార్: అంత ఊరించిన తర్వాత సభాధ్యక్షులేమైనా కరుణిస్తారా?

కామేశ్వరరావు: ఆసు, రాజు, రాణి, జాకి – నేటి విద్యావిధానం. సనత్ గారూ మీ పూరణ

శంకరయ్య: ఇంతకు ముందుది దత్తపది కాదా? దత్తాక్షరమా?

సనత్ కుమార్: దత్త పదులే? అప్పుడే?

కామేశ్వరరావు: శంకరయ్యగారూ, అవునండి అది దత్తాఖరి, ఇది దత్తపది

సనత్ కుమార్: సరే !!

కామేశ్వరరావు: దత్తాక్షరి

సనత్ కుమార్:

 

విద్యే వ్యాపారమయ్యెన్ ! 'విలువ' వలువలున్ వీడి రాణించెన్! ఔరా !
ఉద్యోగమ్మిచ్చు విద్యే యుగపు జపములై య్యొప్పెరా! జూడలే నీ
చోద్యమ్మున్ ! విఘ్నరాయా! సుగుణ సలలితా సుప్రజా ! కిన్కలేలా?
ఆద్యమ్మౌ వేదవిద్యా హలము నొసగరా ! ఆదుకో ! దుఃఖ దూరా !

కామేశ్వరరావు: సెహభాష్, స్రగ్ధరలో పూరించారు!

విశ్వామిత్ర: ఆసు ఎక్కడ

ఫణి: విలువ' వలువలున్ వీడి రాణించెన్! బాగుంది

శంకరయ్య: రాణించె నౌరా ?

కామేశ్వరరావు: దత్తపదాలు వెతుక్కోవలసిందే 🙂

dotC: విఘ్నరాయా సుగుణ

సనత్ కుమార్: విఘ్నరాయా! సు

విశ్వామిత్ర:  భలే

కామేశ్వరరావు: సుప్ర"జా ! కి"న్కలేలా

ఫణి: రాణించేనౌరా!

శంకరయ్య: అద్భుతం!

రానారె: భలే వచ్చింది పద్యం.

విశ్వామిత్ర: ఆదుకో ! దుఃఖ దూరా ! – నిజం – రోజూ బడిపిల్లలు ఇదే పాడుకుంటున్నారు

శ్రీరామ్: చాలా బాగుంది

నరసింహ: బాగా వచ్చింది.

పుష్యం: ఆసు, జాకీ కలిపి రాసారు, పోకర్లో మంచి హాండు 🙂

కామేశ్వరరావు: "ద్య"కార ప్రాసతో, దత్తపదాలని వాడుతూ, స్రగ్ధరని వ్రాయడం – ఆషామాషీ వ్యవహారం కాదు!

dotC: నిజం!

ఫణి: స్రగ్ధర. వ్రాసి యెరుంగనే!

విశ్వామిత్ర: అదీ  స్రగ్ధరలో

కామేశ్వరరావు: సరే. వాతావరణాన్ని కాస్త తేలికపరుద్దాం

కామేశ్వరరావు: పుష్యంగారూ తొలకరి జల్లులలో పిల్లల గెంతులు వర్ణించండి.

విశ్వామిత్ర: నేను "స్రగ్ధర" వ్రాయటం కూడ ఎరుగను, copy&paste  ఎ

సనత్ కుమార్: ఇదీ నేను చేసిన మొట్టమొదటి ప్రయత్నం.. కామేశ్వరరావు గారి ప్రోత్సాహంతో రాసినది

సనత్ కుమార్: అందరికీ ధన్యవాదాలు

పుష్యం: స్రగ్ధరలో మీ పూరణ – ముగ్ధముగా నుండెనండి మేలగు పదముల్

పుష్యం: కాస్కోండి 🙂

సనత్ కుమార్: స్నిగ్ధము మీ కామెంటే

పుష్యం:

 

నిప్పులు చెరిగెడి ఎండలు
ఎప్పుడు తగ్గునొ యనుచును ఎదురులు చూడన్
తిప్పలు తీర్చగ జనులవి
చప్పున వచ్చెను తొలకరి జల్లుల తోడన్

 

తడవగ జడిసెడి బుడతలు
గడప కడన తడఁబడుచును కదలక నిలవన్
గడుసరి పిడుగులు జడవక
ధడధడమని పరుగులిడుచు తడవగ వెడలన్

 

 

తొలకరి వానలందడవ తుమ్ములు దగ్గులు వచ్చునన్న తా
నలిగిన పిల్లవాని తన యక్కునఁ జేర్చుకు పిచ్చి తండ్రి నీ
తలకొక తుండు చుట్టెదను దానిని తీయక నాడుమన్నఁ; తాఁ
బిలుచుచు మిత్రులందరను వేగమె వానన గెంతులేయుచున్

విశ్వామిత్ర: వావ్

శ్రీరామ్: 🙂

విశ్వామిత్ర: వావ్2

రాకేశ్వరుఁడు: –

శంకరయ్య: భళి భళీ

విశ్వామిత్ర: ప్రాసకోసం తుమ్ములొచ్చినట్టున్నాయి , పాపం  🙂

నరసింహ: వాహ్వా

రానారె: ఆహా.. సర్వలఘు కందం ప్యత్నించారన్నమాట!

భారారె: ఆహా సూపర్

 

గిరగిరా తిరుగుతూ కేరింతలను కొట్టి – వల్లప్ప నరసప్ప పాట పాడి;
ధారగా కారేటి చూరునీళ్ళందున – తలనుంచుచును తాను తడిసి, మురిసి;
వానచినుకు నోట పట్టగా తలనెత్తి – నోరు తెరచి నాల్క బార చాపి;
వాన వెలిసి నీరు వాగులై పారగా – పడవలందున  వేసి పందెమాడి;

 

నేల రాలిన కాయల నేరి తెచ్చి
కోసి ఉప్పును కారము రాసి తినుచు
వేడివేసవిని మరచి నాడి పాడి
చేసినల్లరి గూర్చిక చెప్పఁదరమె

విశ్వామిత్ర: వాన వెలిసి నీరు వాగులై పారగా – పడవలందున  వేసి పందెమాడి; -వావ్3

పుష్యం: దొనె

పుష్యం: ———-

కామేశ్వరరావు: ఆహా! ఎంత బాగున్నోయో పద్యాలు!

నరసింహ: ఉప్పు కారము – నోరూరుతోందండి

కామేశ్వరరావు: సర్వలఘు కందం చాలా అందంగా ఉంది!

ఫణి: మీ చిననాటి జ్ఞాపకాల్లా ఉన్నాయే. చాలా బాగున్నాయి.

dotC: ఆహా, చాలా బాగున్నాయి! మధ్యలో డకరాపు వాన కురిపించారు సూపర్‌గా!

రానారె: వర్ణనలు చాలా సహజంగా వున్నాయి శాం గారూ… గిరిగారిలా మీరూ ఒక చిన్న పద్యకావ్యం రాయకూడదూ?

కామేశ్వరరావు: ఇవన్నీ తీరిగ్గా మళ్ళీ పొద్దులో చదువుకోవాలి

కామేశ్వరరావు: దీని గురించి నచకి గారూ కూడా ఒక చక్కని ఖండకావ్యమే వ్రాసారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టీ అది పొద్దులో చదువుకుందాం

శ్రీరామ్: నైరుతిఋతుపవనాలు తెలుగునేలని తడిపినట్తుంది…

dotC: 🙂

పుష్యం: అందరికీ పేరుపేరునా నెనరులు

సనత్ కుమార్: చాలా బాగున్నది

Posted in కవిత్వం | Tagged , | Comments Off on శారద దరహాసం – 3

నిర్వేదన

తనువుని తెంపిన
తొలకరి మొలక
తరువుగా మారాలని
తడిమట్టి తపస్సు
 

విరబూసిన పరిమళాల్ని
చిరుగాలిపై రువ్వుతూ
మూలాల్ని దాచిన
మొక్క మిడిసిపాటు
 

తానెన్నటికీ చూడలేని
వసంతాలను వర్షిస్తూ
లోతుగా ఎదుగుతున్న
వేరు వినమ్రత

Posted in కవిత్వం | 2 Comments

కథాకథనం – 1

తొలి ప్రయత్నంలోనే కథ రాయాలంటే అందరూ రాయలేరన్నది వాస్తవం. అలా రాయగలిగిన వారుంటే వారేదో ఆకాశం నుండి ఊడిపడ్డవారు కారు. మొదటిదెంత వాస్తవమో రాయడం పుట్టుకతో వచ్చేదనడం అంత అవాస్తవం. కథలు దాదాపు ఎవరైనా రాసుకోవచ్చునేమో, అందరూ ఎవరికి వారు పాడుకున్నట్టు. కానీ – మంచి కంఠం, నిశితమైన రాగజ్ఞానం, తాళజ్ఞానం ఉన్నవారు పాడినప్పుడే ఇతృలు వినగలుగుతారు. అలానే పదిమందికి పట్టే విధంగా (లేదా పదికాలాలు నిలిచేవిధంగా) రాయాలంటే అలా రాసేవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.
 


తమకు జరిగే మంచి చెడ్దలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ, మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది. కొందరిలో ఈ స్పందన తమకు జరిగే మంచి చెడ్దలతో ఆగదు. తమ వారికి జరిగే మంచి చెడ్డలకూ, తమవీ తమ వారివీ జీవితాలతో ముడిపడి ఉన్నవారి మంచి చెడ్దలకూ కూడా స్పందిస్తారు. అలా జీవితపు ముడుల సంగతి ఎక్కువగా తెలిసిన కొద్దీ – ప్రకితిలో కనిపించే అనేకానేక సూత్రాలకూ, దాని గాంభీర్యతకూ, అజేయతకూ, దానితో నిరంతరం పోరాడుతున్న మనిషి జీవితంలోని వెలుగు చీకట్లకూ, అందువల్ల ఏర్పడ్ద మానవ సంబధాల్లో పరస్పర ఘర్షణలకూ, వానిని క్రమ పరుచుకునేందుకు నిర్మించుకున్న వ్యవస్థలు మనిషి జీవితంపై నెరపే అనుకూల ప్రతికూల ప్రభావాలకూ, ఇలా తమ జీవితంలో ఆరంభించి దానితో ముడిపడి ఉన్న ఎన్నింటికో స్పందించే వారుంటారు. అలాంటి వాళ్ళు తక్కిన వాళ్ళ మీద మరింత మెరుగైన రచయితలు కావచ్చు.


వీరిలో –

కొందరు- ఎవరి డబ్బూ దస్కం వారిదే అన్నట్టు, ఎవరి కష్టసుఖాలూ, సమస్యలూ వారివే అనుకుంటారు. కొందరు డబ్బూ దస్కం ఎవరిది వారిదే అయినా కష్టసుఖాలూ, సమస్యలూ, పరిష్కారాలూ ఉమ్మడివనుకుంటారు. జీవితపు ముడుల సంగతి ఎక్కువగా తెలిసినవారు – జ్ఞానంతో సహా అన్నింటినీ తోటివారితో పంచుకోవడం భావ్యమనో, మంచిదనో అనుకుంటారు. పంచుకోగలిగినా, పంచుకోలేకున్నా మరికొందరు సాధ్యమైనన్నింటిని, సాధ్యమైన మేరకు, మమ్దితో పంచుకుంటారు. ఇదంతా వారి వారి సాంఘిక స్వభావం మీద చాలావరకూ ఆధారపడి ఉంటుంది. సాంఘిక స్వభావం అసలు లేనివారు రచయితలు కావడానికి ప్రయత్నించరు. ఇంతో అంతో ఉన్నవారెవరైనా ప్రయత్నిస్తే రచయితలు కావచ్చు.

రచయితలు కాగలవారు సాధారణంగా రాయడానికి ముందు చదువుతారు. చదువువల్ల దృక్పథం విశాలమైనట్టు కనిపించినా, చదువు వల్ల తాము మారినట్టనిపించినా, చదువుపట్లే కాకుండా రాతపట్ల కూడా ఆసక్తి పెరగ్గా చివరకు రచనకుండే శక్తి పట్ల నమ్మిక ఏర్పడ్దవారే, ప్రయత్నించినప్పుడు రచయితలయ్యే అవకాశం ఎక్కువ.

అలా కాకుండా-
ఫలానా శంకరనారాయణ రాసేడని ఒక ఆదినారాయణో, చెల్లెలు విమలమ్మ రాసిందని ఓ కమలమ్మో, అకస్మాత్తుగా కథ రాయబోతే ఎంత కొట్టుకున్నా వారి కలం ముందుకు సాగదు. పట్టుబలవంతాన ఎలాగో రాసి ముగిస్తే – అది ఏదో అవుతుందిగానీ కథ కాదు.

అలాగే-
పూర్వం లేదు కాని ఈ రోజుల్లో రాతల ద్వారా ఎంతో కొంత సంపాదనకవకాశముంది. ఏ పోటీలోనో మనం రాసిన కథ పేలితే, రాసిన ఐదారు పేజీలకే మూడు నాలుగు వేలు ముట్టే అవకాశముంది. ఈ స్థితి చూసికూడా కొందరు కథారచనకు దిగొచ్చు.

రాసిందానికి గుర్తింపో, డబ్బో రావడం వేరు. గొప్పలు కొట్టేయడానికీ, డబ్బులు పోగేసుకునేందుకూ రాయబోడం వేరు. ఇవి రెండూ రచయిత కావడానికి సహజమైన ప్రేరణలు కావు. ఇలాంటి ప్రేరనలతో రచనకు దిగినవారు ఎవరోకాని రచయితలు కాలేరు. అయితే పేరుకోసం, డబ్బుకోసం రాయడం తప్పా? వాటికోసం రచనలు చేస్తున్నవారు లేరా?

ఇవి విలువలకు సంబంధించిన ప్రశ్నలు. అందరి విలువలూ ఒకటి కావు. వాటికోసమే రాయదలచుకున్న వాళ్ళు వాటికోసమే రాయొచ్చు. తొలిదశలోనే వాటికోసం రాయదలచుకున్న వాళ్ళొక సంగతి గమనించాలి.

అచ్చం పేరుకోసం డబ్బుకోసం మాత్రమే రచనలు చేసేవారు చాలా తెలివైన వాళ్ళేకాక, ఎన్నో నేర్పులెరిగినవారై ఉంటారు. ఎన్నో ఒదులుకోగల వాళ్ళై ఇంకెన్నిటినో పోగొట్టుకోవడానికి సిద్ధమవ్వాలి. అయితే వాళ్లైనా ఆదిలో సహజమైన ప్రేరణలతోనే రచనా వ్యాసంగం ఆరంభిస్తారు. కథమీద పట్టు దొరికేక హృదయ వ్యాపారంగా మార్చుకుంటారు. మనంకూడా అంతటివారమే అయితే కథ రాయడం వచ్చేక ఆ మార్గం తొక్కొచ్చు.
అందాకా కథ రాయాలంటే-

 

  • మన స్వభావం జీవితంలో మంచిచెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి.
  • అనుభవాలనో, ఆవేశాలనో లేక అభిప్రాయాలనో ఇతరులతో పంచుకునే స్వభావం ఉందాలి.
  • సాహిత్యం ద్వారా ఆ పని జరుగుతుందన్న నమ్మకం, చేయగల శక్తీ ఉండాలి.
  • ఆదిలో ఆ శక్తి లేకున్నా ఫరవాలేదు. ప్రయత్నించి దానిని సంపాదించవచ్చు.
Posted in వ్యాసం | Tagged , , | Comments Off on కథాకథనం – 1

రమల్ – 1

రమల్ – రెండు సంస్కృతీ సాంప్రదాయాల మధ్య వారధి కట్టిన ప్రశ్నశాస్త్రం


జ్యోతిష శాస్త్రాన్ని  వ్రాసిన ఆచార్యులు పద్దెనిమిది మంది..వారి పేర్లు వరుసగా –

1. సూర్యుడు 2. పితామహుడు 3. వ్యాసుడు 4. వశిష్టుడు 5. అత్రి 6. పరాశరుడు 7. కశ్యపుడు 8. నారదుడు 9. గర్గుడు 10. మరీచి 11. మనువు 12.ఆంగీరసుడు 13. లోమశుడు 14. పౌలిశుడు 15. చ్యవనుడు 16. యవనుడు 17. భృగుడు 18. శౌనకుడు.


శృతులకి  నేత్రంగా  పరిగణింపబడే  జ్యోతిష శాస్త్రం, ముఖ్యంగా మూడు  భాగాలుగా విభాగింపబడింది.

1. ఫలితము,

2. గణితము

3. సిధ్ధాంతము


ఆ మూడింట్లోనూ ముఖ్యంగా ఫలిత భాగం ప్రాముఖ్యాన్ని సంపాదించింది, కారణమేమిటంటే అది మానవజాతి యొక్క  భూత, భవిష్యత్, వర్తమానాలని తెలియజేస్తుంది కాబట్టి !


ఫలిత భాగాన్ని తిరిగి కొన్ని అంగాలుగా విభజించడం జరిగింది. అవి 1. జాతకము 2. ప్రశ్న 3. తాజిక 4. ముహూర్తము. వీటిలో రెండవదైన ప్రశ్నశాస్త్రములో ప్రస్తుత  చర్చనీయాంశమైన  'రమల్' లెక్కలోకి వస్తుంది.  ఈ 'రమల్ ' రెండు సంస్కృతీ  సంప్రదాయాల మధ్య వారధి కట్టినా, రాజాదరణ / నవాబుల  ఆదరణ కోల్పోయి, క్రమంగా లుప్తమయి విస్మరింపబడింది. దానికికారణాలేవైనా ఎంతో ఉపయుక్తమైన ఈ శాస్త్రం యుక్క  పుట్టుపూర్వోత్తరాలు ఏ విధంగా ఉన్నాయో,  అది  రెండింటి మధ్య వారధి ఎలా అయిందో  తెలుసుకోవాలంటే, ముందుగా మూడు కథలు తెలుసుకోవాలి !


మొదటి కథ : ఇది  బారతదేశం లోనే  ఉత్పత్తి  చెంది, యవనుల  ద్వారా,  ఎల్లలు  దాటి, ' యవనాచార్యునిచే'  విస్తృతంగా  చర్చింపబడి  తిరిగి  మన  దేశానికి వచ్చిందనీ  'రమళ  రహస్యం" అన్న  సంస్కృత  గ్రంధంలో  వ్రాయడం జరిగింది.

రము క్రీడార్ధ  ధాతోశ్చ  తస్మాదళ  విధానతః |  
ఔణాదిత్వాదళం  ప్రాప్య  రమళేతి  ప్రథాం గతః ||

అన్న  శ్లోకం  ప్రకారం  'రము అనే  క్రీడా  శబ్దంలో  దళ  ప్రత్యయం చేయగా  రమళ  ఏర్పడిందనే  విషయం  తెలుస్తోంది.


ఈ పుస్తకం లోని  కథనం ప్రకారం, కైలాసంలో  ఒకసారి  పార్వతీ  పరమేశ్వరులు  విహారయాత్ర  చేస్తూ  ఉండగా, పార్వతీదేవికి  ఒక  చిలిపి  ఆలోచన  వచ్చి,  పరమేశ్వరుణ్ని  ఆట  పట్టించాలనే  ఉద్దేశంతో,  అతనికి  కనబడకుండా  దాక్కొంది. శివుడు ఆమె  కోసం  వెదికి  వెదికి  వేసారి, చివరికి  'మహా భైరవుణ్ని'  ప్రశ్నించాడట.


మహా భైరవుడు తాను  తల్లికి  మాట  ఇచ్చాననీ,  అందుచేత  నోటితో  చెప్పననీ  అని, తన  కాలితో  కొన్ని  చుక్కలు,  గీతలు లాంటి  సంకేతాలు  గీసి,  వాటి   ద్వారా  తెలుసుకోమన్నాడట. ఆ  సంకేతాలతో  శివుడు  చాల సేపు  ప్రయత్నించి విఫలుడయి, శక్తినే  శరణు  వేడాడట. అప్పుడు శక్తి  ఆ సంకేతాలకి  సమాధానం  చెప్పి,  అతని  ముందు  నిలిచిందట. ఆ తరువాత  మహా భైరవుడు  శివ  శక్తుల   అనుమతితో   ఆ  సంకేత  శాస్త్రాన్ని  వృద్ధి  చేసి,  కొంత మంది  మునులకి  దానిని   తెలియ చేసాడట.


రెండవ కథ : ఒకనాడు  కైలాస  పర్వతంలో  పరమ  శివుడు  విరాజమానుడై  ఉన్న  సమయంలో  పార్వతీ  మాత  అతనిని   చేరి,  భూత  భవిష్యత్  వర్తమాన  విషయాలని  సరళంగా తెలుసుకోగలిగి, లోకులకి  ఉపయోగపడే  విద్యని  తెలియ జేయమని అడుగగా, పరమేశ్వరుడు ఆమె కోరికని మన్నించి రహస్యమైన రమళ్ విద్యని  ఉపదేశించాడట !


శివుడు  శక్తికి  చెప్పినా , శక్తి  శివునికి  చెప్పినా  పెద్ద  తేడా  ఏమీ  లేదు  గాని , మూడో  కధ  మాత్రం  యీ  రెండింటికీ  భిన్నంగా  ఉంది.


మూడో కథ : ద్వాపర  యుగంలోని  అంతిమ  చరణంలో,  'మాదన్'  అనే  ఒక  ఋషి,  ఒకనాడు  ఒక  బ్రాహ్మణ  పండితుని  ఇంటికి  వెళ్లాడు. ఆ  సమయంలో  గృహ  యజమాని  ఇంట్లో  లేక పోయినా, అతని  నవ యవ్వనవతి  అయిన  కన్య  ఆ  ఋషిని  ఆహ్వానించి,  భోజనం  చేసి  వెళ్లమని  అడిగింది. మాదనుడు అంగీకరించి  ఆమె  వంట  ఇంట్లోకి  వెళ్లిన  వెంటనే,  ఆమె  సౌందర్యానికి  ఆకర్షితుడై, క్షణిక  ఆవేశంలో  తన  కౌపీనంలో  వీర్యస్ఖలనం  చేసుకొన్నాడట. తరువాత  తెప్పరిల్లి,  ఆ  కౌపీనాన్ని  అక్కడే  ఒక  మూల  విసిరేసి,  మనసుని  స్వాధీనం  చేసుకొని  ఆ  సుందరి  ఇచ్చిన  ఆతిథ్యాన్ని  స్వీకరించి  వెళ్లి  పోయాడు. ఆ  ముని  వెళ్లిన  వెంటనే  రజస్వల  అయన  ఆ  కన్య  తన  రజో  శ్రావాన్ని  ఆ  ముని  విడిచి  వెళ్లిన  కౌపీనం తోటి శుభ్రం  చేసుకొంది.


తత్ఫలితంగా  ఆ  కన్య  గర్భవతి  అయి,  తండ్రి  చేత  త్యజింపబడి,  దూరాన  ఉన్న  అరణ్యంలో  కుటీరాన్ని  కట్టుకొని,  నివసించ  సాగిందట. ఆమెకి  సూర్య  సమాన  తేజంతో,  పుత్రోదయం  కలిగింది. ఆ  పుత్రుడు  పుట్టగానే  దైవ  వశాన, మాదన   ఋషి  అక్కడికి  వచ్చి,  తన  కుమారుని  గుర్తించి,  సకల  విద్యా  పారంగతుణ్ని  చేసి,  శివమంత్రాన్ని  ఉపదేశించి  వెళ్ళిపోయాడట.


యువకుడైన  తరువాత  శివ  మంత్రాన్ని జపించి,  అతడు  మక్కేశ్వరున్ని ప్రసన్నం   చేసుకొని, గుప్త  విద్య  అయిన  రమల్  అభ్యసించి, యవనాచార్య  బిరుదంతో  జ్యోతిష  గ్రంధాన్ని  రచించాడట. ఋషుల  మీద  కోపంతో  దేవ  భాష  అయిన  సంస్కృతాన్ని కొన్ని  సంకేతాలతో  మార్చి,  'ఫారశీ  భాషని'  కనుగొన్నాడట. ఆ  సంకేతాల తోనే  తను  నేర్చిన విద్యని  వ్రాసి, దానిని  గ్రంధస్తం చేసాడట. ఆ  విధంగా  అతడు  విశ్వ  విఖ్యాత  జ్యోతిష  గ్రంధకర్త  అయ్యాడు.


పైన  చెప్పిన మూడు కథల ద్వారా, యీ  రమల్  విద్యని సదాశివుడే  చెప్పాడని తెలుస్తోంది. కాని  వీటిని  నమ్మడం  కష్టం. మొత్తం  మీద  అర్థమయిందేమిటంటే -ఈ  విద్య  యవన  దేశం  నుండి  వచ్చిందనీ,  దానినే సంస్కృత  విద్వాంసులు  స్వంతం  చేసుకొన్నారనీ  అభిప్రాయపడవలసి వస్తోంది.
 

ఏది  ఎలాగున్నా  ఈ  రమల్  ప్రాచుర్యాన్ని  మాత్రం  అంగీకరించక  తప్పదు ! ఇక   యీ  శాస్త్రం  ద్వారా  భవిష్య వాణిని  ఎలా తెలుసుకోవాలో  చూద్దాం. సంస్కృత  పండితుల  హస్తక్షేపం  వల్ల  ఇది  రెండు  సంస్కృతుల  మిశ్రమ  విద్య  అయింది. ప్రతీ  సంకేతానికి,  ఫారశీ  సంస్కృత  శబ్దాలు  ఉన్నాయి.  రెండు  భాషల  విద్వాంసులూ  సంయుక్తంగా  దీని  అభివృద్ధికి  కృషి  చేసారు. ఇది  ప్రశ్నశాస్త్రం  కాబట్టి,  పృచ్ఛకుడు  అడిగే  ఏ  ప్రశ్నకి  అయినా  జవాబు  ఇస్తుంది.  ప్రశ్న  సమయానికి  లగ్న  సాధన  అవసరం  లేదు. సంకేతాలని  తెలియజేసే  పాచికల్ని  విసిరి  వాటిని  ఆధారం  చేసుకొని  ప్రశ్నకి  జవాబు  ఇవ్వవచ్చు. పంచభూతాలైన  అగ్ని,  భూమి,  వాయువు,  ఆకాశం,  నీరు  ఎలా  ఏ  రీతిలో  ప్రవహిస్తున్నాయో  యీ  సంకేతాలు  చెప్తాయి  అని  యవనాచార్యుడు  అన్నాడు. మన  విద్వాంసులు  వీటికి  నవగ్రహాల భావ  లాస్యాలని  కూడ  జోడించారు. అందుకే  ఈ  శాస్త్రం  నాకు  అద్భుత  ప్రయోగమని  అనిపించి  ఈ  వ్యాస  రచనకి  ప్రోత్సహించింది.


పరిస్థితుల  ప్రభావం  వల్ల  విస్మరింపబడి,  అడుగంటిన  యీ  విద్యని  నాకు  తెలిసినంత  వరకు  పాఠకులకి  చెప్పాలనే  ప్రయత్నం ఇది.  ఆధునిక  కాలం  లోని  ప్రశ్నలకి  కూడ   దీని  ద్వారా  సమాధానాలు  తెలుసుకోవచ్చు. ఈ శాస్త్రం గురించి వ్యాసాల రూపంలో వివరిస్తాను.

Posted in వ్యాసం | Tagged | 1 Comment

కనిపించిన మౌనం

జడివాన చైతన్యంలో

జలకమాడిన తటాకం
గట్టుతో చెప్పిన గుసగుసలు


ఆవిరైపోతున్న ఆరోప్రాణంకోసం
పొంగిన పాల గుండెలో
నీటిబొట్టు చిందించిన చిర్నవ్వులు


ముకుళించిన మూఢభక్తికి
ముద్దరాలైపోయిన గుడిగంట
జగన్మాత క్రీగంటి చూపులతో సయ్యాటలు
 

పక్షిరెట్ట తెల్లదనంతో
తృప్తిపడ్డ బుద్ధవిగ్రహంలా
అలజడితీరం దాటిన ఏకాంతనావలో
మిణుకుమంటున్న దీపశిఖ…
ప్రవాహంలో విరిసిన పూర్ణచంద్రిక

Posted in ఇతరత్రా | Comments Off on కనిపించిన మౌనం

సామాన్యుడి సాహిత్య చర్చ

సాహిత్యమంటే రసప్రపంచం. మరి రసమంటే ఏమిటీ? మావిడి రసమా? అల్లం రసమా? చింతపండు రసమా? టమాటా రసమా?

ఈ పైన చెప్పినవి విడివిడిగా కాదుకానీ, ఇలాటి రసాలు అన్నీ మష్తిష్క మర్దనంతో బయటకు తీసి, కలమనే రాచిప్పలో పోసి కలగలపేసి సాహిత్యలోక సరస్వతీ దేవికి నైవేద్యంగా అర్పించిన ఈ రసమే ఆ రసము – అదే పరబ్రహ్మ స్వరూపం అంటారా.. మీరు నక్కతోక తొక్కి నాకలోకంలో పడ్డ నా తోటి జతగాళ్లు.

ఎవరో సరిగ్గా గుర్తులేదు కానీ, ఒక పెద్దాయన ఏదో వ్యాసంలో వారి కాలం నాటి సాహిత్యం, పాండిత్యం, పండితులు, సారస్వతం గురించి వ్రాస్తూ ఒక పిట్టకథ చెబుతారు

"పూర్వం ఒక పండితుడు ఓ పండితసభలో పాల్గొంటూ- ఇంతమంది పండితులు "రసము" గూర్చి తలోరీతిగా బుట్టెడు రచనలు చేసారు, మాటలు చెప్పారు. అవి అన్నీ పక్కనబెట్టెయ్యండి. సులువుగా నేను ఒకే ఒక్క పద్యంలో చెపుతాను వినండి అని "పాలు గోరెడు మార్జాల పరివృఢుండు." అని ఆ సభలోకి ఒక బిందువు విసిరాట్ట. ఇందులో రసమెక్కడుందండీ అని అడిగితే – పాలకు మించిన రసమెక్కడున్నదయ్యా అని ఆ పండితులవారి జవాబు. మరి పద్యమంటారు, పద్యానికి నాలుగు పాదాలుండాలి కదయ్యా? అని అడిగితే – పిల్లికి ఉన్నవి చాలుకదయ్యా అన్నారట సదరు పండితులవారు."

ఈ పిట్టకథ చెప్పడమైపోయాక ఒక మాట అంటారు. మా తరంలోని ఈనాటి పండితమ్మన్యులు, సమకాలికులు భావదారిద్రోపేతమైన భావుకతని పుంజీలు పుంజీలుగా వేసి చేసిన ఆ నైవేద్యం జెష్టాదేవి నెత్తిన బెట్టి మా వాణీ గృహంలో నట్టనడయాడిస్తున్నారు అని బాధ పడతారు. ఇవే మాటలు ఇప్పటి పాండిత్యానికి, పండితులకు అన్వయించి చూసుకుంటే ఆ పెద్దాయన మాట, ముందుచూపు, ఆవేదన నభూతో నభవిష్యతి.

అసలు గొడవేమిటయ్యా ? ఈ వ్యాసం ఉద్దేశమేమిటి? ఈ ఉదాహరణలేమిటి? పిట్టకథలేమిటి? అర్థం కాకుండా మొదలెట్టావు, ఏ సముద్రంలోకి విసిరేస్తావో చెప్పు బాబూ! అసలే ఈత కూడా రాదు నాకు.

అయ్యా…అక్కడికి రావాలనే ఈ ప్రయత్నం.సాహిత్య భాష వేరు, సాహిత్య రసం వేరు, దాని రుచి వేరు అని చెప్పటం ఈ వ్యాసం ఉద్దేశమండీ! వ్యాకరణం లేని వ్యవహారిక భాషా ప్రజ్ఞా పాటవాలతో పాఠకుడి చేతికి అంజనం పూసిన చందంగా పదచిత్రీకరణ చేసే ఈనాటి పండితమ్మన్యుల కోసం రాస్తున్న వ్యాసమిది! కావున మీరు కొద్దిగా ఓర్పు సహనం నేర్చుకోవాలి, అభ్యసించాలి, అనుభవించాలి.

ఓహో అలాగా! ఐతే మొదలెట్టు మరి
సాహిత్య భాషకి కొన్ని ద్రవ్యాలు అవసరమండీ! అన్నిటికన్నా ముఖ్యమైన ద్రవ్యం – చిత్తం భ్రమించిన కవి, రచయిత.

ఏమిటీ మతి చెడినవాడా కవీ, రచయిత అంటేనూ?. వేళాకోళంగా ఉందా నీకు
చిత్త భ్రమ అనగా సదరు కవీ ,రచయిత చిత్తప్రవృత్తిగా అర్థం చేసుకోవాలి తమరు.

ఓహో అలాగా! మరి తరువాతి ఔపచారిక ద్రవ్యాల సంగతో?
రెండవ ద్రవ్యం, వస్తువు అనగా చిత్తభ్రమణానికి కారణభూతమైన రసం.

ఓ పైత్య రసమన్నమాట!
పైత్యమో, పిండమో ఇప్పటికి పక్కనబెట్టి మూడవ ద్రవ్యాన్ని చూస్తే – అది ఆదిమానవ రూపంలో సంచరిస్తున్న పాఠకుడు.

ఏమిటీ పాఠకుడనేవాడు ఆదిమానవుడా?
అవునుఆదిమానవుడే. ప్రకృతి పురుషుడు. మీ సౌలభ్యం కోసం ఈ ఆదిమానవుల సమూహాన్ని మూడు తండాల్లోకి విభజించవచ్చు.

ఇందులో నా సౌలభ్యం ఏమిటీ! తమరి సమాధి.
చిత్తభ్రాంతి, చిత్తభ్రమణం గురించి మాట్లాడుకున్నప్పుడు సమాధి ప్రస్తావన చాలా ఔచిత్యంగా ఉంది. అనగా మీకు కొద్దిగా మెదడు ఉందని నా ఎఱికకు వచ్చింది.. సరే సమాధి సంగతి పక్కనబెట్టి సమూహాల్లోకి వస్తే – మొదటి తండా ఏ చిత్తభ్రమణ పైత్యరసాన్నైనా ఆనందించే సహృదయ తండా. రెండవ తండా పైత్యరసాన్ని మింగలేక కక్కలేక వాంతిభ్రాంతిలో పడికొట్టుకునే సామాన్య ప్రజానీకతండా. ఇహ మూడవ తండా పైత్య రసాన్ని ఏమాత్రమూ తట్టుకోలేక వమనం చేసే పండిత తండా.

ఓరి నీ తండాల పిండం తిండూలాలెత్తుకెళ్లా.ఇదేదో కొద్దిగా అర్థమయ్యీ అర్థమవనట్టుగా ఉందే!ఆదిమానవులంటావు, ప్రజానీక తండా, పండితుల తండా అంటావు…? పనసపండు తెచ్చి పళ్ళెంలో పెడితే తినలేని అల్లుడు దిక్కు దిక్కులు చూసాడట అలా ఉంది నా పరిస్థితి.
వస్తా …అక్కడికి తర్వాత వస్తానండీ! ముందు చిత్తభ్రమణాన్ని, చిత్తులనీ వర్ణించనివ్వండి!

ఇదేదో ఆసక్తిగా ఉండేట్టుంది. సరిగ్గా సద్దుకుని కూర్చోనీ. నీచిత్తుకాయితాల ఘోష అంతా అయిపోయాక నేను చిత్తభ్రమణమూ, పైత్యమూ గూర్చి లఘు సిద్ధాంత వ్యాసం సమర్పించుకోవచ్చునేమో!!
చిత్తులు స్థూలంగా మూడు రకాలు, వారికి కలిగే చిత్తభ్రమణాలు మటుకు కోకొల్లలు

ఏమీటేమిటీ? చిత్తులు మూడే రకాలా? భ్రమణాలు మటుకు కోకొల్లలా?
అవును. మొదటి రకం చిత్తులు – వీరు సాత్విక స్వభావ చిత్తులు. అనగా చిత్తం భ్రమించినా అది సాత్విక రూపంలో, రాళ్లూ గట్రా విసిరెయ్యక మెత్తనైన పూలు విసురుతుంది. వాడే భాష దోషరహితంగా, నాజూకైన నగలతో అనగా అలంకారాలతో ఉంటుంది. కవి గారూ అంతకు తగ్గట్టుగా సున్నిత మనస్కులై ఉంటారు. ఎంత సున్నితమంటే కంది పచ్చడి తిని కందిపోయేంత.

పెద్దన గారూ, పోతన గార్లాంటోళ్లన్నమాట.
అవునండీ.మీకు కొద్దిగా జ్ఞానముందన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు. సరే విషయం…విషయంలోకి వస్తూ…ఆడసింహం సంగతి తెలుసుగా, నెమ్మదిగా చక్కగా నోట్లో కరుచుకుని పిల్లలని తీసుకునిపోయినట్టు, వీళ్ల రాతలతో ఆదిమానవుణ్ణి వాళ్లెంబడి ఊయల్లో ఊగించుకుంటూ తీసుకునిపోతారన్నమాట.

ఓహో , బాగుంది.
ఇహ రెండో రకం చిత్తులు. వీరిది చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం పరిస్థితి. అనగా రాచరిక దర్పమన్నమాట.వీరు తమకున్న వ్యాకరణ వైవిధ్యంతో, ఛందోవైవిధ్యంతో ఆదిమానవులను సమ్మోహితులను చేసి లాక్కుపోతారన్నమాట. ఆ వైవిధ్యమూ,ఆ ఊపూ,ఆ రాచరికం ఆదిమానవుణ్ణి అలా పట్టేసుకోగా, రాజుగారెంబడి పడిపోతాడన్నమాట. రాజుగారెక్కడుంటే ఈ మానవుడక్కడే!ఇంకోలా చెప్పాలంటే – రక్తజఘన మర్కటం తెలుసు కదండీ. ఆ మర్కటం తన పిల్లలని సింహంలా నోట్లో కరుచుకుని తీసుకుపోదు. పిల్లలే తల్లిని కరుచుకుని తల్లితో పాటూ పోతూ ఉంటాయి…అలాగన్నమాట

అంటే శ్రీనాథుడు, మన కృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని వికటకవిగారూ, ఈ శతాబ్దంలో విశ్వనాథ, ఛందోబద్ధశ్రీశ్రీ లాంటోళ్ళా?
అవునండీ. ఉద్భటారాధ్యచరిత్రలా మధ్యలో మీ ఆర్భాటగోలారాధ్యచరిత్ర మాని చెప్పేది వినండి.

సరే చెప్పు
ఇహ మూడవ రకం చిత్తులు. వీరు మశక రకాలన్నమాట. గుడ్లు పెట్టేసి మళ్లీ కనపడకుండా పారిపోయే జాతి. వీరికున్న రక్తవే స్వాహా! రక్తవే స్వాహా! గుణంతో రక్తాన్ని పీల్చటమే కాక, తమ రచనా వైదుష్యంతో మెదడువాపు వ్యాధి విస్తృత పరిచి తమ వంతు కృషి చేస్తూ జీవిత సాఫల్యం పొందుతారు. భాష మీద పట్టు సంపాదించుకోరు, వ్యాకరణం అంటే తెలీదు.ఆ పైన వీరు వదిలి వెళ్లిన గుడ్లలో నుండి పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చిన మశకాలతో మరిన్ని తిప్పలు.

అనగా ఈనాటి రచయితలు, కవులూ అంతా మశకాలని నీ ఉద్దేశమా?
అవును మార్తాండతేజా. ముప్పాతిక శాతం మంది మశకాలే.ఏమిటీ తమరి కనుగుడ్లకేమయ్యింది. అలా పితుక్కొని బయటకొచ్చినాయి?

ఇంకొంచెంసేపు ఈ వివరణాత్మక పైత్యాన్ని వింటే మొత్తం ఊడిపోయి దొర్లుకుంటూ ఆ హిందూ మహాసముద్రంలో కలిసిపోయి సొరచేపలకు ఆహరమైపోతాయేమోనన్నంత భయంగా ఉందయ్యా!
పోనీ అలాగైనా ప్రశాంత కబోది జీవనం గడపొచ్చు మీరు. మీ జాతకంలో ఇదివరకే రాసేసి ఉండి ఉండవచ్చు.

ఆపవయ్యా! కబోది జీవనం నాకెందుకు గానీ, ఇలాటి చిత్తులను, వారి భ్రమణములను తట్టుకొను మార్గము విశదీకరించు!
చిత్తులకు బోధి వృక్షం కింద బోధ చెయ్యాలి. ముందు మనసనే సాన మీద రచనను జాగ్రత్తగా అరగదీసుకోమని. అరగదీసాక గంధమొస్తే పంచమని. దుర్గంధమొస్తే తనే , అట్టిపెట్టుకోమని.

ఎవరి కంపు వారికింపు అన్న చందమన్న మాట. మరి వారి కంపు వారికి బానే ఉంటుందిగా !
అదే వచ్చిన చిక్కు.అయితే ఉపాయమున్నది. ఒక్కటే ఒక్క పుస్తకభేది మాత్ర..జాడ్యం కొద్దీ మందు…అసామన్యమైన జాడ్యానికి మాంచి ఘాటున్న మందు కానీ పనిచెయ్యదు. అలాటిదే ఈ పుస్తకభేది మాత్ర.క్షోభపు రాతలు రాసిన కవీ, రచయితను పండిత తండాలోని ఆదిమానవులుఒక కరివేపాకు చెట్టుకు కట్టేసి, బలవంతాన తెరిచి పుస్తకభేది మాత్ర ఆయన నోట్టోనూ, కొద్దిగా ఆయన కలంలోనూ వెయ్యటమే. కుదరకపోతే, అనగా పిల్లి మెడలో గంట నే గట్టలేననుకుంటే మీరు దాన్ని వేసుగుని కూర్చోటమే! ఈ మాత్ర ఒకటి చిల్లికుండలో వేస్తే చిల్లు పూడి కారే నీళ్ళు కూడా ఠక్కున ఆగిపోయినాయని నిన్న మా మిత్రుడొకాయన చెప్పాడు.

అనగా వారి రచనలను బహిష్కరించడమన్నమాట. బాగుంది. అది సరేనయ్యా! ఒక ప్రశ్న. ఒక గజ ఈతగాడున్నాడు. ఆయన ఏ ఏటికి అడ్డంపడినా ఒకటే ఈత పద్ధతి పాటిస్తాడా?
లేదండీ ఒకసారి కుక్కలాగా ఈదొచ్చు, ఒకసారి మొసలిలాగా ఈదొచ్చు, ఆయాసమొస్తే కాళ్ళూ చేతులు ఎగేసి వెల్లకిలా కూడా ఈదొచ్చు.

మరి అలానే వ్యావహారిక భాషతో వివిధ రకాలైన ఈతలు కొట్టొచ్చుగా సాహిత్యమనే ఏట్లో?
ఎవరికి వారు ఈతరాకున్నా గజ ఈతగాడనుకోని ఏలాగున ఈదినా,ప్రాణాలు నిలబడేందుకు పీల్చే గాలిప్రధానమవునా కాదా !

అవును గాలే ప్రధానం. పైత్యానికి మందే విధానం.మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ఏమి చెయ్యాలో మరి చెప్పవయ్యా

పలికెడిది భారతంబట
పలికించెడి విభుడు వ్యాసభగవానుండట

కందువ మాటలు, సామెతలు, నుడికారాలు, పలుకుబడులు పసందు వేసి మాలగా గుచ్చిన రచన, కవిత – ఆదిమానవుల మెదడు వికసించటానికి ఒక అద్భుతమైన సాధనంగా ఉపకరిస్తుందండీ. లేకుంటే మూగ చెవిటి సంవాదమే !

ఇంతకీ వేరేవాళ్లవి వికసించడానికే రచనలు చేయాలంటావు. మరి అసలు శాల్తీ వికాసమెక్కడ?
అదే చెపుతూంట ఇంతసేపు. మీరు అటు బభ్రాజమానమూ కాక, ఇటు వైశంపాయనులూ కాక మధ్యస్థంగా వున్నారు. అక్కడ వచ్చింది చిక్కు

ఓహో!ఆ మధ్య ఇలాటి రచనొకటి చదివి నేను చెవిటివాడినా, మూగవాడినా అనేది అర్థం కాలా! ఇప్పుడు కళ్లు తెరుచుకున్నాయి.మరి రసమన్నావు దాని సంగతి కూడా చెబుతావా ?అసలు ఈ రసమెట్లా పుడుతుందయ్యా?
ఆలంబన, ఉద్దీపన ఈ రెండు పదార్థాల సంయోగంతో రసం పుడుతుందండీ.

అర్థం కాలా! ఏదీ ఒక ఉదాహరణ ఇలా పడెయ్యి
ఒక హరిణం అలా వయ్యారంగా అడుగులేస్తూ అడవిలో పోతూ ఉందనుకుందాం. వేటగాడికి లేడి ఆలంబన, అడవి ఉద్దీపన. అడవి అనే పరిసరం ఈ వేటగాడికి ఉద్దీపన కలిగిస్తే, వేటాడాలనే ఉత్సాహానికి లేడి ఆలంబన.

మరి వేటాడితే లేడికి పరలోకప్రాప్తేగా?
వేటాడేంతవరకూ రసప్రాప్తి, వేట ముగియడంతో రస సమాప్తి.

ఓహో!అంటే రచయిత అనేవాడు ఆదిమానవుణ్ణి తన భావ, భాషా సామర్థ్యంతో ఎంతసేపు ఆ వేట అనే ఆటలో నిలపగలడో అంతసేపూ రసం ఊరుతూనే ఉంటుందన్నమాట. బాగుందయ్యా.
అబ్బా! భలే పట్టేసారే కిటుకు. మీకున్నపాటి జ్ఞానం ఈ కాలపు రచయితలకుంటే ఎంత బాగుండు! ఇంకొద్ది వివరణతో సాహిత్య రసానికొస్తే – ఈ రసం రెండు రకాలు. బుద్ధితో వ్రాయగా వచ్చే రసం ఒక రకం, హృదయంతో వ్రాయగా వచ్చే రసం ఒక రకం. బుద్ధితో వ్రాసేది తనకున్న పాండిత్యాన్నీ, తెలివితేటలను లోకానికి పంచే రసం. పేరు ప్రఖ్యాతులనాశించో, పట్టాల కోసమో వ్రాసే రచనలు ఈ రసాన్ని బహు పుష్టిగా కలిగుంటాయి. ఇక హృదయంతో వ్రాసే రచనలు అనుభూతులతో కూడి, సంస్కారాన్ని వృద్ధి పరచే రసాన్ని కలిగుంటాయి..మనకున్న సారస్వత చరిత్రను జాగ్రత్తగా గమనించండి. కాలపరీక్షకు నిలబడ్డవన్నీ హృదయ సంబంధమైనవే…ఐతే అలా నిలబడ్డ రచనలన్నిటికీ ఒక గుణం ఉన్నది. ఆ రచన చేసిన సాహితీ స్రష్టకు తన రచన గూర్చి స్పష్టమైన అవగాహన ఉన్నది. ఆ రచన ఒకే కక్ష్యలో స్థిరంగా తిరుగుతూ ఉంటుంది.

కక్ష్య ఏమిటి నాయనా? రచనేమన్నా గ్రహమా? ఉపగ్రహమా? మూస పోసిన మూకుడా?
ఒక ఇతివృత్తాన్ని పట్టుకున్నప్పుడు, ఆ ఇతివృత్త పరిధే కక్ష్య. పరిధి దాటితే తోకచుక్కైపోయి రాలిపోటమే.

ఐతే పరిధి గీసుకుని రసాలు ఊరించాలంటావు
ఇతివృత్తం మీద స్పష్టమైన అవగాహన, దాని పరిధి తెలుసుకుంటే చాలని మూకుడు మీద మూత వేసి చెప్పటమైనదండీ

ఓహో! బాగుంది. చాలా బాగుంది.మరి ఈనాటి రచనలు…?
ఈనాటి రచనల కక్ష్య ఏది? లక్ష్యమేది?

మరి ఏ రచనైనా నువ్వు చెప్పిన కక్ష్యలో సంచారం చెయ్యడానికి……
రచనకు వాక్యనిర్మాణం ముఖ్యం, వ్యాకరణం మరింత ముఖ్యం. ఏ భాషైనా వాక్యనిర్మాణం వల్లే వేరే భాష నుండి వేరవుతుంది.సందర్భోచితమో, వ్యావహారికమో, అలంకారికమో – ఏదైనా కానీ నిర్మాణ పాత్రను పూర్తిచేసుకునున్న వాక్యాల్ని ఏరుకుని, చక్కగా గుది గుచ్చుకోవాలి. కక్ష్య పరిధి అవగాహనకు తెచ్చుకునిరచనకు పూనుకోవాలి. ఆలాటి రచనే రచనా ప్రపంచంలో స్థిర సంచారం చేస్తుంది. శాశ్వతంగా నిలబడిపోతుంది… ఆదిమానవుడిలో స్థాయీ భావాలను ప్రేరేపించాలి, వ్యాకరణంతో దాహార్తిని చల్లార్చాలి, భాషా హొయలతో ఉద్రేక పరచాలి, ఆ ఉద్రేకంలో నుంచి ఉద్భవించిన ఆనందం అనుభవించేట్టు చెయ్యాలి.ఆ పైనఇతర వేదనలను మరిపింపచేస్తే రస భోగం అనుభవమవుతుంది. రచనకు సార్థకత్వమేర్పడుతుంది.పాత సాహిత్యం, ఆయా రచయితలు చేసిన పని అదే

ఓహో తెరచాప వేసినట్టు ఇన్ని చాపలు "పరచాలి" అన్నమాట…..గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ ! అని అంటావన్నమాట ఐతే.
ఆ మాట మీరు చెప్పాలె.

మరి ఈనాటి రచనలు ఏలాగున ఉన్నాయో కూడా ఓ మాట జెప్పు
తిక్కనను మార్క్సిస్టు దృక్పథంతోనూ, విశ్వనాథను వ్యంగ్యాత్మక దృక్పథంతోనూ చూడాలని వాదిస్తే ఎలాగుంటుంది? అలాగుంటున్నాయన్నమాట. దోసెడంత వీధిలో కృష్ణవేణమ్మను తమ పైత్యరసంతో నింపి కుళ్ళుకాలవలా దుర్గంధాలతో పరుగులెత్తిస్తున్నారు.చిత్రగుప్తుని చిట్టాలన్నీ చింపేసి ఆయనకే చిట్టి కవిత రాసిచ్చేవాడు ఈనాటి కవీ, రచయితానూ.. వ్యావహారిక భాషనుకుంటూ కట్టె కొట్టె తెచ్చె అన్న చందంగా రచనలు చెయ్యడమూ, కవితలు వ్రాయడమూ..పేలపిండిలా ఆ పదార్థాన్ని ఆదిమానవుల మీద దులపడమూ …ఇదీ మశకాలు చేస్తూన్న పని

మరి ఎలాగుండాలో కూడా చెప్పెయ్యొచ్చుగా
పూర్వ శబ్ద స్వరూపాన్ని ప్రామాణికంగా గ్రహించలేనప్పుడు, ఆ ప్రామాణికతను సమకాలీన శబ్దానికి అన్వయించి ఆ శబ్దాన్ని ప్రామాణికంగా మార్చలేనప్పుడు రచనకు పూనుకునే సాహసం చెయ్యవద్దు. వీలుచేసుకుని రచనకు పూనుకునే ముందుపాత సాహిత్యాన్ని చదవాలి..అందులోని రచనా పద్ధతులని తెలుసుకోవాలి, నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి …వ్రాసి వ్రాసి చిత్తుకాగితాలు తగలేసి నెత్తికి గండభేరుండ తైలం రాసుకోవాలి. వ్రాసిన వ్రాతల్లో ఎక్కడో ఒకచోట తనను తాను చూసుకుని నవ్వుకోటమో, ఏడవటమో చేస్తే ఆ రచన నెమ్మదిగా రాటు దేల్తుంది. లేకుంటే రచన రాచపుండై వ్రాసినోడినే కాక ఇతరుల వెన్నెముకల్ని కూడా బాధపెడుతుందన్నమాట.

మరి ఆ ప్రామాణికత ఎవరు నిర్ణయిస్తారయ్యా?
పేడతో పిడకలెలా చేస్తారండీ?


ఓ వేసావే బ్రహ్మాండమైన దెబ్బ!మరి నీ వాక్య నిర్మాణం మీద నీకు ఎంత పట్టుంది ?
అందుకే నేను రచయితనూ కాను, కవినీ కాను. ఆదిమానవుణ్ణి.

అదిగో …ఈ ఘోషలో వాగాడంబరమే తప్ప అసలు అంబరం లేదని కొందరు అంటున్నారయ్యా
ఓ వారా! వారికో కొత్త తండా ఏర్పాటు చెయ్యవలసిందే!!

Posted in వ్యాసం | 11 Comments

శారద దరహాసం – 2


కామేశ్వరరావు: శ్రీరామ్ గారూ, మీ పూరణ వినిపించండి
శ్రీరామ్: చిత్తం
విశ్వామిత్ర: వామ యక్షిణి అంటే ఎడమచేతి వాటమేమో అనుకున్నాను – సినిమా వాళ్లకి ఇదో గురి
శ్రీరామ్:

 

ఏమరుపాటున సుదతీ!
స్వామిని కనిపెట్టకున్న శ్యాముని పగిదౌ
లేమకు సవతియె మగడగు
భామకు పదియారువేల భర్తలు గనరే!

నచకి: బాగుంది ఆలోచన
ఫణి: బాగుంది
రానారె: ఏ'మరు'పాటున సుదతీ! 🙂
విశ్వామిత్ర: ఆస్ట్రేలియాలో అచ్చతెలుగు కవిత్వం – ఏమరుపాటున భలే ఎత్తుగడ
రాకేశ్వరుఁడు: బాగుంది. నే చెప్పినట్టు తలో విన్నూత్న పూరణ.
రాకేశ్వరుఁడు: ఇంతకీ – వామము (p. 1160) [ vāmamu ] vāmamu. [Skt.] adj. Left, not right. సవ్యము, ఎడమ. Charming, lovely. రమ్యమైన. Crooked, వక్రము. Short, పొట్టి, హ్రస్వము.
సనత్ కుమార్: భావం విడమర్చరూ …
మురళీ మోహన్: శ్యాముని పగిదౌ – పు.శ్యాముని పగిది కాదుగదా:)
పుష్యం: అందరూ నాగురించి రాసే వాళ్ళే 🙂
రాకేశ్వరుఁడు: విశ్వామిత్ర:లానే నేనూ ఎడమ మార్గాన వెళ్ళు యక్షిణి అనుకున్నాను.
శ్రీరామ్: మీరు పాపులర్ మరి
కామేశ్వరరావు: ఆడపడుచు అర్థమగడు అంటారు. సవతులు పూర్తి మగడులాంటి వాడని కవి భావన. బాగుంది!
భారారె: హ హ.. ఏడమ చేత్తో గురిచీసి మన ఎడమ ప్రక్క గుండెను కొల్లగొట్టేస్తారు
సనత్ కుమార్: శ్రీరామ్ గారూ… భావం విడమర్చరూ …
సనత్ కుమార్: నాది కొంచం ట్యూబులైటు..
శ్రీరామ్: సనత్ గారూ..మీకు పెళ్ళైందా?
రాకేశ్వరుఁడు: ప్రకృతికి వికృతి పగిది, బాగున్నాయి పదప్రయోగాలు.
పుష్యం: @sanath ఛోకు మార్పించండి తొందరగా వెలుగుతుంది 🙂
రానారె: Sanath himself is chocking 🙂
రాకేశ్వరుఁడు: కానీ శ్రీరామ్ గారూ, ఆ లెక్కన చూచినా పదిహేనువేల తొమ్మిదీ తొంబైతొమ్మిది భర్తలే అవుతారుగా.
నచకి: మీరింకో మొగుడిలా తయారయ్యారుగా… లెక్క సరిపోతుంది రాకేశా!
శ్రీరామ్: రాక్…ఈ లెఖ్ఖ ఎక్కడిది?
కామేశ్వరరావు: రాకేశా – పదహారువేలమందిలో అష్టభార్యలు లేరండీ! 🙂
ఫణి: అసలు మొగుణ్ణి వదిలేశారు.
పుష్యం: @nacaki 🙂 🙂
శ్రీరామ్: స్టానోర్డ్ల్ లో స్టేటిశ్తిక్స్ చదువుతున్నారా? 🙂
రాకేశ్వరుఁడు: అసలు మొగుడు శ్యామసుందరుడు గదా. అవునవును.
సనత్ కుమార్: నలుగురిలో నగుబాటు చేయకండి.. ఔనని చెప్పినా … కాదని చెప్పినా ఈ మాత్రం అర్ధం కాలేదా అంటూ ప్రాబ్లమే…
కామేశ్వరరావు: "భామ" అనగానే దీనికి చాలామంది పూరణలు పంపారు. రాకేశా, మీ పూరణ వినిపించండి.
రాకేశ్వరుఁడు: ట్సిత్తం
నచకి: అది చిత్తమే కదా? ఈ ట్సకారమెందుకు?

రాకేశ్వరుఁడు:

కం.

ఏ మణులుం జాలవు నా
భామకు పదునారు! వేల భర్తలు గనరే
ఈ మాటను నిత్యముఁ
దమ భామల విషయమునఁ గూడఁ బాగుగ కామా!

కొత్తపాళి: చాలా సరసంగా ఉన్నది
మురళీ మోహన్: రాకేశా ఏకేసావు!
కామేశ్వరరావు: హహహ! రాకేశా, మధ్యలో నన్ను involve చెయ్యకండీ! 🙂
రాకేశ్వరుఁడు: అధ్యక్షులుగా మఱి.
పుష్యం: @raakaeSaa అదుర్స్ 🙂
విశ్వామిత్ర: ఆహా బ్రహ్మచారి పద్యం
నచకి: ఇంత సింపుల్ అని తెలియక పంపలేదు 🙁
శంకరయ్య: బాగుంది
రాకేశ్వరుఁడు: భామలు గుఱించి మాట్లాడుతూ సుమతీ కంటే కామా అంటేనే ఉచితం మఱి.
భారారె: భలె భలె
నచకి: (చూసాక ప్రతిదీ సింపులే కద!)
రానారె: కామా అన్నారు … ఇంకా చెప్పాల్సింది చాలా వుందన్నమాట 🙂
ఫణి: బాగుంది
కొత్తపాళి: బ్రహ్మచారి పద్యం
కామేశ్వరరావు: "ఏ మణులుం జాలవు" అంటే అది కామానే, పుల్స్టాప్ కాదు కదా 🙂
నచకి: భామామణులో?
శ్రీరామ్: విశ్వామిత్రులు సరిగ్గా చెప్పారు…
రాకేశ్వరుఁడు: నచకి "స్ఫూర్తి"కి అవకాశం లేక.
ఫణి: 🙂
నచకి: మఱే!
కామేశ్వరరావు: శంకరయ్య: మాస్టారూ ఇప్పుడు మీ పూరణతో సిద్ధం కండి.
విశ్వామిత్ర: నాలుగో పాదంలో "కూడ" అని ఉన్నదని యతి ని నిషేధించినట్టున్నారు
ఫణి: వావ్!
విశ్వామిత్ర:: ఒహో , తమ మూడో పాదమా – సరే
శంకరయ్య:

 

ఈ మహి నేలిన రాజులు
భూమీపతు లనెడి పేరు పొందిరి గనుకన్
నా మాటగఁ జెప్పెద భూ
భామకు పదునారు వేల భర్తలు గనరే!

ఫణి: చప్పట్ట్లు
నచకి: ఆహా… ఇదిగో మళ్ళీ సింపుల్ అనిపిస్తుంది… ముందేమో "స్ఫూర్తి" లేదాయె!
సనత్ కుమార్: వహ్వా
పుష్యం: వ్హ్వా 🙂
నరసింహ: భూ భామ – ఇది కొత్తగా ఉంది.
భారారె: అద్భుతమండి..
శ్రీరామ్: లాజికల్ గా ఉంది
నచకి: బహు బాగున్నది!
పుష్యం: మాత భామే కదా 🙂
రాకేశ్వరుఁడు: చాలా బాగుందండి శంకరయ్య గారూ, నేనూ జగన్మాతకు అందరూ భర్తలే అని వచ్చేట్టు ఆలోచించాను కానీ, ఏమీ స్ఫురించలేదు.
విశ్వామిత్ర: భలే, మీ మాట వినవలసినదే
కామేశ్వరరావు: "ఈ మహి నేలిన రాజులు" అనడంతోనే సమస్యాపూరణ జరిగిపోయింది!
నచకి: నిజమే
సనత్ కుమార్: జగన్మాతకు అందరూ భర్తలే ???
రవి: శంకరయ్య: గారు :- వావ్, ఇంత సింపులా
శంకరయ్య: ధన్యవాదాలు
రవి: మీ మాటకు తిరుగులేదు
సనత్ కుమార్: మీ ఉద్దేశం జగత్భామకేమో
రాకేశ్వరుఁడు: sanatkumaar భూమాత సర్వంస్వహ జగన్మాతే అవుతుందిగా.
నచకి: జగత్భామ యెవఱో!?
రానారె: జేజేలు.
పుష్యం: ఏమాటకు ఆమతనవలె – మీమాటకు తిరుగు లేదు మేష్టరు గారూ 🙂
నరసింహ: బాగుందండి.
కొత్తపాళి: బాగు బాగు
నరసింహ: ఆ మాటన వలె
నచకి: నీమము తప్పక వ్రాసిన నీ మాత్రము రాదు మాకు ఇంకేం జేస్తాం!
పుష్యం: అప్పు తచ్చుకు క్షంతవ్యుణ్ణి
రానారె: ఎడ్జస్టవుతాం 🙂
కామేశ్వరరావు: ఇక తర్వాతి సమస్యకి వెళదాం
కామేశ్వరరావు: "గోటితో సరిపోవుదానికి గొడ్డలేటికి సోదరా" అంటున్నారు పుష్యంగారు. ఏమిటో వివరించండి శ్యాంగారూ
నచకి: సాహితీప్రియులే కదా ఇంత త్వరగా ఒక సమస్య నుంచి మఱో సమస్యకి జంప్ అవగలరు!'\
పుష్యం: తప్పకుండా
పుష్యం:

 

పూటుగాతిన పొట్టలోపల పోటులొచ్చెనొ, చెప్పరా
నోటనల్లపు ముక్కనుంచిన నొప్పితగ్గును, ట్రిక్కురా
మాటిమాటికి ఇంగిలీషువి మందులెందుకు, ఖర్చురా
గోటితో సరిపోవుదానికి దానికి గొడ్డలేటికి? వద్దురా!

శ్రీరామ్: హ హ హ
నరసింహ: నచకి గారు పద్యం చెప్తున్నారల్లే ఉంది
ఫణి: చప్పట్లు చప్పట్లు
నచకి: ఆ ముక్కేదో చెప్పండయ్యా… నల్ల మందా?
శ్రీరామ్: సెహబాస్!
రాకేశ్వరుఁడు: ఆసు పద్యానికి శ్యాం గారికి, నచకీ గారికి అభినందనలు.
రాకేశ్వరుఁడు: నోటిన్ అల్లపు
సూర్యుడు: @pushyam, super
రానారె: మళ్లీ అదరగొట్టేశారు, శాం గారూ.
కామేశ్వరరావు: "నల్లపు" కాదండి, "అల్లపు" 🙂
నచకి: శ్యామ్ గారూ, చాలా సాఫీగా సాగింది పద్యం!
నచకి: నోటన్_అల్లపు అన్నారా… సరిపోయింది!
రానారె: మత్తకోకిల
నరసింహ: @pushyam గారూ అదిరిందండీ.
శంకరయ్య: భేష్ …. బాగు … బాగు
కామేశ్వరరావు: నిజంగా ఈ మధ్య డాక్టర్లు ఇలాగే తయారయ్యారు.
భారారె: పుణ్యం పురుషార్థం లా పద్యంతోపాటి ఆరోగ్య చిట్కా కూడా 🙂
పుష్యం: సంధులన్నీ రాకేశుని చలవ 🙂
సనత్ కుమార్: బాగున్నదండి
పుష్యం: అందరికీ ననరులు
రాకేశ్వరుఁడు: నోట యల్లపు అంటే మా అరసున్నాకు అన్నాయం జరిగినట్టవుతుంది
ఫణి: 🙂
నచకి: ఆ అరసున్నాలెక్కడ పెట్టాలో తెలియక ఇందాక నా పద్యపు లాకరులో దాచాం, ఆఖరులో తీస్తాం!
సనత్ కుమార్: పూర్తి స్థాయి లో కాకపోయినా కనీసం అర స్థాయిలోనైనా అన్నాయం అయ్యుండేది..
భారారె: @dot C :))
కామేశ్వరరావు: ఇక తర్వాతి సమస్య "బాకులు క్రుమ్మినట్లగున భారతపౌర! వచింప సిగ్గగున్"
పుష్యం: @నచకి అల్లం తింటే సాఫీగానే సాగుతుంది 🙂
శంకరయ్య: ఆ లాకర్ కీ నా దగ్గర ఉంది లెండి.
నచకి: శంకరయ్య: మాస్టారూ, మీరే దిక్కు!
నరసింహ: నీమము తప్పక వ్రాసిన నీ మాత్రము రాదు మాకు ఇంకేం జేస్తాం! నచకి గారూ దీనిని పూర్తి చెయ్యలేదేమండీ?
నచకి: పుల్లెల వారి పద్యానికి చివఱన అతికించిన ముక్క అది!
కామేశ్వరరావు: సనత్ గారూ, మీ పూరణ వినిపించండి.
నచకి: ఏమాటకు ఆమాటనవలె – మీమాటకు తిరుగు లేదు మేష్టరు గారూ
నచకి: అది వారి లైను
సనత్ కుమార్: తప్పకుండా …
సత్యసాయి: నాక్కూడా కవిత్వం వచ్చేసేటట్లుంది మీ పూరణలు చదువుతోంటే
సనత్ కుమార్:

 

వేకువ వేళ బిడ్డలను వీడగ నైతిని, తల్లినయ్యు నే
నాకుల లమ్ములున్ గుడిపి ఆకలి తీర్చితి, భీతనౌటచే,
కూకటి వ్రేళ్ళతో వనము కూల్పగ పక్షుల గుండె గూటిలో
బాకులు క్రుమ్మినట్లగును భారత పౌర ! "వచింప సిగ్గగున్ –

కొత్తపాళి: భలే భలే
సనత్ కుమార్: చీకటి నింప భావ్యమటె? చెట్లు వధింపగ ? – రాచ బాటకై ??"
సనత్ కుమార్:

 

పక్షి భాధను వినిపించు పరశువేది
కలదె – జంధ్యాల పాపయ్య కలము నేడు?
కలదె వడ్డాది పాపయ్య కర యుగమ్ము
కనుల గట్టి నట్ట్లు హృదయ కథలు జెప్ప

కామేశ్వరరావు: ఇటు సమస్యని పూర్తిస్తూనే అటు వర్ణన కూడా చేసారు. బాగుంది!
కొత్తపాళి: హృదయ బదులు గుండె అంటే ఇంకా సరసంగా ఉంటుంది
ఫణి: తప్పకుండా
సూర్యుడు: @sanatkumaar, బాగుందండి
ఫణి: తరువు అనుంటే బాగుండేది.
పుష్యం: కత్తి (బాకు) లా ఉందండీ 🙂
నచకి: సొబగు సొబగు
కొత్తపాళి: సూర్యుడు గారు, పొద్దులో పొడిచారా? సంతోషం!!
శ్రీరామ్: కరుణ రసాన్ని అధుతంగా ఆవిష్కరించారు
సూర్యుడు: @kottapALI, 🙂
సనత్ కుమార్: ధన్యవాదాలు … 🙂
రానారె: మీ పద్యముందిగా… పక్షిబాధను వినిపించడానికి
శంకరయ్య: జరిత మాతృవేదనను గుర్తుకు తెచ్చారు
శంకరయ్య: జరిత మాతృవేదనను గుర్తుకు తెచ్చారు
కొత్తపాళి: సనత్కుమార, రసవంతమైన పూరణ
భారారె: బాగు బాగు సనత్ గారూ
కామేశ్వరరావు: అవును. మీ పద్యమే "పరశువు" "పరసువేది" కూడాను
సనత్ కుమార్: పక్షి పడే బాధను చెప్పగలిగే పాపయ్యలిద్దరూ పాపమిప్పుడు లేరు కదా…
రాకేశ్వరుఁడు: ఒక ప్రక్క సమస్యా పూరణ, ఒక ప్రక్క ఉత్పల మాలిక, ఇంకో ప్రక్క మంచి తేటగీతి – లెస్స సనత్ గారు.
ఫణి: వనము బదులు తరువు అనుంటే వర్ణనకు కూడా సరిగా ఉండేది.
సూర్యుడు: @కామేశ్వరరావు 🙂
నచకి: అన్ని చెప్పినా లెస్సా?!?
రానారె: పొపయ్యలు లేరు గాని పాపడు గలడోయ్!
కామేశ్వరరావు: @నచకి – 🙂
నచకి: 🙂
కామేశ్వరరావు: రవీ, దీనికి మీ పూరణ వినిపించండి
నచకి: సభ సైలెంటైందేం?!
రవి: ఏ సమస్యండి?
కామేశ్వరరావు: 🙂 బాకులు క్రుమ్మినట్లగును భారత పౌర ! వచింప సిగ్గగున్
నచకి: ఆయనకు యే సమస్యా లేదు! లేని సమస్యను ఇస్తున్నారు రాయలవారు
కామేశ్వరరావు: సమస్యని మరచిపోయేలా దాన్ని పూరించారు సనత్ గారు 🙂

రానారె: ఔనండి. బాగా చెప్పారు.

Posted in కవిత్వం | Tagged , | Comments Off on శారద దరహాసం – 2

అఫ్సర్ అంతరంగం – 3


 

వృత్తిపరంగా, చదువు పరంగా మీ ఆలోచనలు కొన్ని చెప్పండి.

ఈ ప్రశ్నకి సమాధానం ఇంకో ప్రశ్నలో వుంది. ఒక రచయిత వాక్యం మనల్ని ఎంత దూరం లాక్కెళ్తుంది? దాని శక్తి ఎంత?   నేను ఇంటర్ లో వున్నప్పుడు  ప్రసిద్ధ కథా రచయిత చాసో తరచూ ఖమ్మం వచ్చే వారు, వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చే వారు. రాగానే ఆయన ముందు "ఏరా, ఈ సారి బొటనీలో  ఎన్ని మార్కులు ఎడ్చావ్?" అని-  నేను కథల గురించి మాట్లాడడం, ఆయన తన కబుర్లన్నీ బాటనీ కెమిస్ట్రీ వైపు మళ్ళించడం అప్పుడు వొక ఆట గా వుండేది. "నువ్వు ముందు ఈ ఇంటర్ సరిగా ఏడ్చి, ఆ తరవాత కథలూ కాకరకాయలూ మాట్లాడు" అని నిర్మొహమాటంగా, దాదాపూ తిట్టినట్టుగా అనే వారు. ఇంటర్ లో నేను బైపీసీ చెయ్యాలన్నది మా అమ్మానాన్నల కోరిక. డాక్టర్ కావాలని ఇంట్లో వొత్తిడి. బొటనీకి, సాహిత్యానికీ కెమిస్ట్రీ కుదిరేది కాదు, చాలా కష్టంగా వుండేది. అదే సమయంలో శ్రీ శ్రీ ఖమ్మం వచ్చినప్పుడు మా నాన్నగారి సమక్షంలోనే ఈ చర్చ వచ్చింది. అప్పుడు (ఇప్పుడు కూడా) శ్రీ శ్రీ అంటే దేవుడు నాకు. శ్రీ శ్రీ చెపితేనయినా వింటానేమో అని తండ్రి బాధ.  అప్పుడు శ్రీ శ్రీ " డాక్టర్ కాకపోతే కలెక్టరు. మా అమ్మాయిని నేను కలెక్టరు చేద్దామనుకుంటున్నా." అన్నారు.  ఆ తరవాత నేను చాలా కాలం రచయితల్ని కలవడం మానేశాను. అప్పుడు  ఎంత వినయంగా వుండే వాణ్ణో, అంత పొగరుగా కూడా వుండే వాణ్ని.  ఈ  వృత్తి వృత్తం లోంచి బయట పడాలి. సాహిత్యం నా దారి. పాఠాలు చెప్పడం వొక్కటే నాకు సరయిన వృత్తి అనుకోవడం మొదలెట్టాను. ఆ వైపు నన్ను నేను ట్రైన్ చేసుకోవడానికి వొక బడిలో పార్ట్-టైమ్ టీచర్ గా చేరాను.


కానీ, అమ్మ నాన్న వొత్తిడి మీద ఎంట్రన్స్ రాశాను. మంచి రాంకు వచ్చింది కూడా.  మెడిసిన్ లో సీటు వచ్చి వదులుకున్న వాణ్ని మీరేమంటారు? పిచ్చివాడు అంటారు. నేను మెడిసిన్ వదులుకొని బీయ్యే ఇంగ్లిష్ లో  చేరినప్పుడు నన్ను అందరూ అలా పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు. అదే సమయంలో నాకు రెండు విదేశీ అవకాశాలు వచ్చాయి. నా అకడెమిక్ రెకార్డ్ చూసి, హైద్రాబాద్ లోని వొక మైనారిటీ సంస్థ నా పేరుని సిఫార్సు చెయ్యడంతో ఇరాన్ ప్రభుత్వం అక్కడ మెడిసిన్ కోర్సులో చేరితే, అంతా ఉచితం అని ఆహ్వానించింది. మా కుటుంబ నేపధ్యం వల్ల కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు నా పేరు మాస్కోలోని మెడికల్ కాలేజీకి సిఫార్సు చేశారు. ఇవేవీ నేను వొప్పుకోలేకపోయాను.  వొకే వొక్క పిచ్చి కారణం:  వొక చలం  వాక్యం!  "డాక్టర్లూ, యాక్టర్లూ, లాయర్లూ చచ్చాకనే ప్రజా సేవ చేస్తారు" అని – ఆ వొక్క వాక్యం మంత్రవాక్యం అయ్యి, నాకూ మా కుటుంబానికి చాలా దూరం పెంచింది. చదువు గురించీ, వృత్తి గురించీ నా ఆలోచనల్ని మార్చింది.  ఇంగ్లీషు బీయ్యేలో చేరినప్పుడు కుటుంబం నించి నాకు ఆర్ధిక మద్దతు తెగిపోయింది. అయినా, పెద్ద బాధ పడలేదు. చాలా పొగరుగా,  చిన్నా చితకా పనులు చేసుకుంటూ బీయ్యే ఇంగ్లీషు పూర్తి చేశాను. బియ్యే ఇంగ్లీషులో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ కాస్త వూపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ ఆనందం ఎంతో కాలం మిగలలేదు. ఇంటి ఆర్ధిక పరిస్తితులు ఇంకా దిగజారి పోయి, ఇక నేను చదువు ఆపేశాను. ఏదో వొక చిన్న వుద్యోగంలో చేరక తప్ప లేదు.  వృత్తి పరంగా ఆంధ్రజ్యోతిలో చేరిపోయాను. ఆ తరవాత నా వృత్తి దారి నా చేతుల్లో లేకుండా పోయింది. బతకడమే ముఖ్యం కాబట్టి పెద్ద సాహసాలూ చేయలేదు వృత్తి మార్చుకోవడానికి.

కుటుంబ పరంగా తేడాలు?

మా నాన్న గారు మిత వాద కమ్యూనిస్టు, నేను మొదటి నించీ అతివాద కమ్యూనిస్టుని. మా ఇద్దరి మధ్యా ఆ తేడాలు శాశ్వతంగా వుండిపోయాయి. ఆయనకి సాహిత్య పరంగా సాహిత్య సౌందర్యం మీద కొంత మొగ్గు వుంది. నాకు సాహిత్య సౌందర్యం ద్వితీయం. రాజకీయ సాహిత్యం వొక్కటే నిజమయిన సాహిత్యం అనుకునే వాణ్ని. ఇప్పటికీ అనుకుంటాను.

అమ్మ కుటుంబం  కమ్యూనిస్టు నేపధ్యం నించి వచ్చినా, ఆమెకి మత విశ్వాసాలు ఎక్కువే. కొన్ని సార్లు విసుక్కునేది, "ఎప్పుడూ ఈ గడ్డం రైటర్ల (చలమూ, మార్క్సూ)  పుస్తకాలేనా? పొద్దున్నే ఇంట్లో ఆ మొహాలు చూడ లేక చస్తున్నాం. కాస్త ఖురాన్ చదువుకో" అనేది. కానీ, తన కమ్యూనిస్టు కుటుంబ నేపధ్యం వెనక ఈ గడ్డం రైటరే (మార్క్స్) వున్నాడన్న విషయం ఆమెకి తెలీదు, నేను చెప్పే దాకా — అమ్మ తరఫు వాళ్ళు ఆచరణలో కమ్యూనిస్టులు తప్ప, పుస్తకాలు చదివి కమ్యూనిస్టులు అయిన వాళ్ళు కాదు! వాళ్ళకి కమ్యూనిజం అంటే సుందరయ్య గారే! మార్క్సిజమూ మతమూ వొక అస్తిత్వంలో ఎలా వొదుగుతాయన్న సిద్ధాంత చర్చకి అక్కడ తావు లేదు.

డాక్టర్ కాలేదే అనుకున్నారా ఎప్పుడయినా?

ఎప్పుడూ లేదు. తప్పులయినా, వొప్పులయినా అన్నిటికీ నాదే బాధ్యత. పశ్చాత్తాప పడే తప్పులు చేయకూడదని ప్రయత్నిస్తా ఎప్పుడూ.

ఏ వృత్తిలో వున్నా, కవిత్వం నా అస్తిత్వం. చదువు నా ప్రాణ వాయువు.  సత్కాలక్షేపం నా దారిభత్యం. అవి తోడున్నంత కాలం వృత్తి, డబ్బూ నాకు అంత ముఖ్యం కాదు.

పత్రికారంగంలో మీరు పనిచేసిన తొలినాళ్లకూ ఇప్పటికీ మీరు ప్రధానంగా గమనించిన మార్పులేమిటి?

నిజాయితీగా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఎడిటర్లు లేరు. అప్పుడు ఎడిటర్ అంటే గొప్ప పదవి. అది పెద్ద మార్పు.  వాళ్ళకి జీతాలు పెరిగాయి కానీ, స్వేచ్చ తగ్గింది. ఎంత స్వేచ్చని కత్తిరించుకుంటే అంత పెద్ద జీతం ఇప్పుడు!  ఇది మొదటి విషాదం.   ఇప్పుడు నా సన్నిహిత మిత్రుడు శ్రీనివాస్ ఎడిటర్ అయిన ఆనందం వున్నప్పటికీ, నేను పని చేసిన ఆంధ్ర జ్యోతి ఇదేనా అనిపిస్తుంది కొన్ని సార్లు! ఆ పత్రిక భాషని ఆ శ్రీనివాసుడు కూడా మార్చలేకపోతున్నాడా అని బాధేస్తుంది.

నిస్సందేహంగా బేలతనం, బానిసతనం నా లక్షణాలు కావు. అవి రెండూ నా నించి ఆశించే వాళ్ళకి ఎప్పుడూ నిరాశే! జీవితంలో నేను చూడని చీకటి కోణం లేదనే అనిపిస్తుంది కొన్ని సార్లు. కానీ, నేను నా అదృష్టాలని మాత్రమే లెక్క పెట్టుకుంటాను ప్రతి సారీ!

రెండో విషాదం:  మరీ ఇంత బాహాటంగా, నిస్సిగ్గుగా పత్రికలు  రాజకీయాల తోక గా మారడం.

మూడో విషాదం : తెలుగు పత్రికల్లో భాష, సాహిత్యం  గురించి తెలిసిన వాళ్ళూ, ఆ భాషని చక్కగా వుపయోగించుకునే వాళ్ళూ లేరు. పేజీలు నింపడమే పరమ ప్రయోజనం అయ్యింది. ఆ పేజీలని దేనితో నింపుతున్నామన్న స్పృహ లోపించింది.

నాలుగో విషాదం: అసలు సమాచారం కన్నా, ప్రకటనల ఇష్టా రాజ్యం మేరకి పత్రికలు నడవడం!

అన్నిటి కంటే పెద్ద విషాదం: సమాచారం అంటే సంచలనం మాత్రమే అనే అపోహ వ్యాపించడం!

ఆది యందు  పత్రిక నాకు పట్టెడన్నం పెట్టిందన్న కృతజ్నత ఇంకా మిగిలి  వుండడం వల్ల ఇంకా పెద్ద మాటలేమీ అనలేకపోతున్నా.


పత్రికా రంగం నించి బయట పడడం మీకు నచ్చిందా?

చెప్పలేను. అవన్నీ నేను అనుకోని చేసిన పనులు కాదు. వెల్చేరు నారాయణ రావు గారు నేను ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్న కాలంలోనే అంటే 1987 ప్రాంతాలలోనే నేను యూనివర్సిటీ కి వస్తే బాగుంటుందని అనే వారు. అది నేను మొదటిలో అంత సీరియస్ గా తీసుకోలేదు. కారణం, నేను పత్రికలలో వున్న హోదాలు మంచివీ , వాటి మీద నాకు వుండిన అమితమయిన  ఇష్టమూ! ఇప్పటికిలా జరిగిపోతుంది కదా అన్న నిత్య నైమిత్తిక తృప్తీ.

 

పైగా, అవి  నాకు తృప్తినిచ్చిన హోదాలు కూడా . పత్రికా రంగంలో వున్నంత కాలం ఎక్కడా అసంతృప్తి లేదు. చిన్న చిన్న తేడాలు ఎక్కడయినా వుంటాయి. కానీ, నా సృజనాత్మకత అంటూ ఏదయినా వుంటే, దాన్ని గౌరవించే, దానికి విలువ ఇచ్చే ఎడిటర్ల దగ్గిరే పని చేసే అదృష్టం దక్కడం విశేషమే. నండూరి దగ్గిర వున్నప్పుడు ఆంధ్ర జ్యోతి సాహిత్య పేజీని నిండు పేజీగా మార్చగలిగాను. దాని ప్రభావాన్ని గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పకరలేదు.  ఆదివారం అనుబంధం నా ఇష్టం వచ్చినట్టు మార్చే స్వేచ్చ కూడా ఆయన ఇచ్చారు. నేను ఆంధ్రజ్యోతి వార పత్రికలో పనిచెయ్యకపోయినా, పురాణం గారు కథలూ, కవిత్వాల ఎంపికలో ఎప్పుడూ నన్ను అడిగే వారు. అప్పటికి పురాణం గారికి ఇస్మాయిల్ కవిత్వం మీద చిన్న చూపు వుండేది. ఇస్మాయిల్ కవిత్వం ఆయనకి చదివి వినిపించి , ఆ చిన్న చూపు అన్యాయమని వాదించే వాణ్ని. "అయినా, కవిత్వం జోలికి నేను వెళ్లనులే. అదేదో నువ్వే చూసి కంపోసింగ్ కి ఇవ్వు" అనే వారు.   ఆంధ్రభూమిలో "అక్షరం" , ఆదివారం రెండూ చేశాను. రెండు చోట్లా సంపాదకీయాలు కూడా రాసేవాణ్ని.  ఆంధ్రభూమి రాయలసీమ ఎడిషన్ ఇంచార్జ్ గా పంపిస్తున్నప్పుడు ఎం‌వి‌ఆర్ శాస్త్రి గారు అన్న మాట నాకు ఎప్పుడూ గుర్తు వుంటుంది. "అది దూరం కదా అనుకోవద్దు. ఎడారి కదా అనుకోవద్దు. ఆ వూళ్ళకి, అక్కడి మనుషులకి ఎలా దగ్గిర అవుతావో ఆలోచించు. అక్కడి నేలని ప్రేమించు. మనుషుల్ని ప్రేమించు. నీ పని మీద నీకే గౌరవం పెరుగుతుంది." ఆ మాట ఎప్పటికీ నాకు గుర్తుంటుంది.  అనంతపురంలో వున్నా, ఆస్టిన్ వచ్చినా- పత్రికా రంగాన్ని నేను ఇష్ట పడ్డాను. ఇప్పుడు మారిన పత్రికా రంగంలో ఆ ఇష్టం అలాగే వుండేదా అంటే చెప్పలేను. కానీ, నారాయణ రావు గారు, ఇతర మిత్రులూ  ఎప్పుడూ అంటారు " మీరు ఆంధ్రాలో వుంటే ఈ పాటికి ఎడిటర్ అయ్యే వారు" అని! అలాంటివి చెప్పలేం! నాకు చాలా బలమయిన ఇష్టానిష్టాలున్నాయి. నా ఇడియాలజీకి సంబంధించిన పొగరూ , విగరూ వున్నాయి. అది అందరికీ నచ్చకపోవచ్చు. పత్రికా రంగంలో అవి అస్సలు పనికి రావు. పైగా, నాకు హోదాల మీద అంత ఆకర్షణ లేదు. నా పని నాకు నచ్చాలి, నాకు తృప్తినివ్వాలి. అది లేకపోతే, గొప్ప పదవి ఇచ్చినా నేను చెయ్యను. ఈ రకంగా చూస్తే ఆస్టిన్ ప్రస్తుతానికి నా చివరి మజిలీ కావచ్చు. (అయినా, స్థావరం మీద నాకు నమ్మకం లేదనుకోండి) ఇక్కడ నాకు తృప్తీ, స్వేచ్చా అన్నీ వున్నాయి. అటు తోటి అధ్యాపకులకూ , ఇటు విద్యార్ధులకూ నేనంటే ఇష్టం! మరీ ముఖ్యంగా నా సమయం నా చేతుల్లో వుంది. మరీ మరీ ముఖ్యంగా ఈ వూరు నాకు నచ్చింది; టెక్సాస్ తెలుగు వాళ్ళు నాకు మరీ నచ్చారు.
 

నిస్సందేహంగా బేలతనం, బానిసతనం  నా లక్షణాలు కావు. అవి రెండూ నా నించి  ఆశించే వాళ్ళకి ఎప్పుడూ నిరాశే!  జీవితంలో నేను చూడని చీకటి కోణం లేదనే అనిపిస్తుంది కొన్ని సార్లు. కానీ, నేను నా అదృష్టాలని మాత్రమే  లెక్క పెట్టుకుంటాను ప్రతి సారీ!  ఈ పూటకింత  అన్నమూ, తల మీద కాసింత నీడా లేని వాళ్ళు ఎక్కువగా  వున్న లోకంలో మన ఈతి బాధలు పెద్ద లెక్క కాదు. ఆకలినీ, కష్టాల్నీ రోమాంటిసైజ్ చేసుకోవడం నాకు నచ్చదు. ఆ రకంగా నేను చాలా ప్రాక్టికల్.


మరీ కుంగిపోయినప్పుడు, బేలతనంతో ఆత్మ హత్య చేసుకున్న నా మిత్రులంతా గుర్తొస్తారు. మోరియా గారి అమ్మాయి సాధన ఆత్మ హత్య చేసుకొని, ఆస్పత్రిలో వున్నప్పుడు మేము ఆమె మంచం చుట్టూ నిలబడి వున్నప్పుడు ఆమె మా నాన్నగారి చేతులు దగ్గిరకి తీసుకుని వొక మాట అంది " అంకుల్, నేను పొరపాటు చేశాను. నాకు చనిపోవాలని లేదు, నన్ను ఎలాగయినా బతికించండి..ప్లీజ్!" అని- ఆ మాట అన్న మరుక్షణం తను మొహం వేలాడేసింది. ఆమె ఆ చివరి మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి. ఆమె ఆ చివరి నిస్సహాయ క్షణం నా అనేక కవితల్లో కనిపిస్తుంది. కానీ, అది కవిత్వ క్షణం కాదు, అది వొక బతుకు సందేశం.  ఇప్పుడు ఈ క్షణం ఈ వూపిరి ఇవి మాత్రమే  బతుకు కొలమానం నాకు.


నా కవిత్వం మీద విపరీతమయిన చర్చ జరిగి, నన్ను అందరూ ఏకపక్షంగా తిట్టిపోస్తున్న వొక దశలో శివారెడ్డి గారు "ఇన్ని రాళ్ళ దెబ్బలు తింటున్నావ్ అంటే నీ చెట్టు మీద కాయలే అందరికీ కావాలన్న మాట" అని! ఆ మాట ఇప్పుడు  అతిశయోక్తి అనిపించ వచ్చు, కానీ, ఆ క్షణాన నాకు ఆ మాట అమృతం. అదే నాకు కావాలి. కాయలు కాస్తామా లేదా అన్నది వేరే సంగతి, అసలు మన వేళ్ళలో తడి వుందా లేదా అన్నది నాకు ముఖ్యం! ఆ తడి వుంటే ఎడారినయినా జయించవచ్చు!
 

ఈ అనుభవాల లోంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏమిటి?

పాఠాలు మారిపోతాయి జీవితంలానే – మనం బతుకు సిలబస్ ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. కానీ, ఏ సిలబస్ కైనా కొన్ని మౌలిక సూత్రాలు వుండాలేమో!


వొకటి: జీవితం నెగటివ్ గా వున్నప్పుడు పాజిటివ్ గా, జీవితం పాజిటివ్ గా వున్నప్పుడు నెగటివ్ గా ఆలోచించే శక్తి మనిషికి చాలా అవసరం అనిపిస్తుంది. ఆ రెండీటీ మధ్య వున్నప్పుడు జీవితం వొక చిరునవ్వుతో సమానం! బాధలు గడ్డిపోచలు! పాజిటివ్ గా వుండాలి అనుకోవడం కొంత కష్టం. కానీ, "నెగటివ్ గా ఎందుకు వుండాలి" అనుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటాను.

రెండు:  ప్రాతస్మరణీయమయిన వ్యక్తులు వుండొచ్చు, వుండకపోవచ్చు. కానీ, ప్రాతస్మరణీయమయిన వచనాలు ఎప్పుడూ వుంటాయి! కాబట్టి, వ్యక్తి కంటే, అతని వచనం ముఖ్యం.

మూడు: ఈ క్షణంలో జీవించడం…ముమ్మాటికీ!
 

(అస్తిత్వ ఉద్యమాలూ, అనుభవాలూ ఈ సారి)

ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి

Posted in వ్యాసం | Tagged | 14 Comments