‘రమల్’ ప్రశ్న శాస్త్రం-4

'రమల్ 'లో ప్రశ్న తెలుసుకోవడానికి  'ప్రస్తారం / జాయచా ' వెయ్యాల్సిన  అవసరం  ఉంది. ఈ ప్రస్తారంలో   మాతృపంక్తిని  పృఛ్ఛకుడే తన ప్రశ్నని  తలచుకొంటూ ఇస్తాడు. అది పాచికల  ద్వారా ఇవ్వవచ్చు. లేదా సూర్యుని బొమ్మ, దాని   కిరణాలూ వెయ్యడం  ద్వారా  ఎలా  కనుక్కోవచ్చో  తెలుసుకొన్నాం  కదా ?  ఇప్పుడు మరో  విధానాన్ని చెప్తాను:


ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని,  శ్వాస  బిగించి, ఒకే  ప్రయత్నంలో  నాలుగు  వరుసలలో  బిందువులని వెయ్యండి. వేసే బిందువులు పన్నెండు (12) కన్న  తక్కువ  గాని,  ఇరవై (20)  కన్న   ఎక్కువ గానీ ఉండకూడదు. అంటే  12 నుండి  20 లోపల  ఎన్నైనా  వెయ్యవచ్చు. అలా  వేసిన  తరువాత  రెండేసి  బిందువులని  రేఖతో  కలుపుతూ  వెళ్లండి.  అలా  కలుపుకొంటూ  పోగా,  బిందువు  మిగిలితే,  దానిని  ఒకచోట  వ్రాసుకోండి.  అలాగే  మిగతా  మూడు  వరసలతోనూ  ఇదే  వరస!  అలా  ఏర్పడిన  నాలుగు  చిహ్నాలతో  మొదటి  ఖానా  లోని  మొదటి మూర్తి  తయారవుతుంది. మిగతా  మూడు  మూర్తులు  కూడా  అలాగే  రాబట్టాలి. అలా  ఏర్పడిన  నాలుగు  మూర్తులతో  'మాతృ పంక్తి' తయారవుతుంది !

 

ఉదాహరణ :
(1)  ౦-౦  ౦—౦ ౦—౦ ౦—౦ ౦—౦ ౦—౦ ౦—౦ ౦—౦ ౦  = ౦ ( కబ్జుల్ ఖారీజ్)
(2 )  ౦–౦ ౦—౦ ౦—౦   ౦—౦ ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦ ౦—౦   =    ___   (పాత్ )

(3 )  ౦–౦  ౦—౦  ౦—౦   ౦—౦   ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦  =                   ౦

(4 )  ౦—౦  ౦—౦  ౦—౦  ౦–౦  ౦—౦  ౦—౦   ౦—౦  ౦—౦  ౦—౦ ౦—౦  =      ___

మరొకమారు  ఊపిరి   బిగించి  రెండవ మూర్తి  కోసం , బింవులు పెట్టండి

(1) ౦—౦  ౦—-౦   ౦—-౦  ౦—-౦   ౦—-౦  ౦—-౦  ౦—౦  ౦—-౦  ౦—౦       =     ___

(2) ౦-౦  ౦—౦  ౦-౦  ౦—-౦  ౦-౦  ౦—-౦  ౦—౦  ౦—౦   ౦                 =         ౦

(3) ౦-౦  ౦—౦   ౦—౦  ౦-౦  ౦—౦  ౦—౦  ౦—౦   ౦—౦                      =         ___ (కబ్జుల్ దాఖిల్

(4) ౦-౦  ౦—౦   ౦—౦  ౦—౦  ౦—౦  ౦-౦   ౦—౦  ౦-౦  ౦-౦ ౦           =          ౦   తీక్ష్ణాంశు )

మళ్లీ  మరొకసారి బిందువులతో   మూడవ  మూర్తిని  సృష్టించండి.

(1) ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—-౦   ౦—౦  ౦-౦   ౦—-౦  ౦         =        ౦     (కబ్జుల్ ఖారీజ్

(2) ౦—౦   ౦—౦  ౦—౦  ౦—౦   ౦—౦  ౦-౦  ౦-౦  ౦-౦  ౦–౦                 =      ___      (పాత్)

(3) ౦—౦   ౦—౦  ౦—౦   ౦-౦  ౦—౦  ౦-౦  ౦—౦  ౦                            =          ౦

(4)  ౦—౦  ౦-౦  ౦-౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦   ౦—౦                     =          ___

నాల్గవ  మూర్తి  కోసం  మరోసారి  చుక్కలు  పెట్టండి.

(1) ౦—౦  ౦—౦  ౦—౦  ౦-౦  ౦-౦  ౦—౦  ౦-౦  ౦-౦                        =      ___   ( హుమరా)

(2)  ౦—౦  ౦—౦  ౦—౦  ౦—౦  ౦-౦  ౦-౦   ౦-౦  ౦                           =        ౦     (లోహిత్ )

(3) ౦-౦  ౦—౦  ౦—౦  ౦-౦  ౦—౦  ౦—౦  ౦-౦  ౦-౦  ౦                     =      ___

(4) ౦—౦  ౦—౦  ౦-౦  ౦-౦   ౦-౦   ౦-౦  ౦-౦  ౦—౦                       =      ___


ఇప్పుడు  మాతృపంక్తికి  కావలసిన  నాలుగు  ఖానాల  లోని  మూర్తులు   ఏర్పడ్డాయి. వాటితో  ప్రస్తారం తయారు  చేద్దాం  రండి.
 

__

__

__

__

__

__

__

__

__


మాతృ పంక్తి లోని నాలుగు ఖానాలు ఇవి ! వీటిని ఆధారం చేసుకొని,దుహిత పంక్తి లోని నాలుగు మూర్తులు చేద్దాం.
 

__

__

__

__

__

__

__

__

__

.

ఈ విధంగా  ఏర్పడిన  మాతృ  దుహిత  పంక్తుల  ద్వారా , మూడవదైన  దౌహితృ  పంక్తిని  తయారు  చేయాలి. ఎలాగంటే  ఈ  రెండింటి  గుణకార  ఫలితంగా  అవి  ఏర్పడతాయి.  ఒకటి  ఇంటూ  రెండుతో  తొమ్మిదవ  ఖానాలోని   మూర్తిని,  మూడు  ఇంటూ  నాలుగుతో  పదవ  ఖానాలోని  మూర్తిని, అయిదు  ఇంటూ ఆరుతో  పదకొండవ  ఖానాలోని  మూర్తిని, ఏడు  ఇంటూ  ఎనిమిదితో  పన్నెండవ  ఖానాలోని  మూర్తిని  తయారు  చేయాలి.


గుణకారం  లోని  నియమాలు  ఏవంటే  బిందు X బిందు  =  రేఖ,  రేఖ X రేఖ  =  రేఖ,  బిందు X రేఖ  =  బిందు,  రేఖ X బిందు  =  బిందు  అవుతాయి.  ఉదాహరణకి  మన  ప్రస్తారం  లోని  దౌహితృ  పంక్తిని  వేసి  చూద్దాం.
 

12  ( ఏడు ఇంటూ ఎనిమిది ) అతవేదాఖిల్ 11 ( అయిదు  ఇంటూ ఆరు ) తరీఖ్/ శీతాంశు 10 ( మూడు ఈంటూ నాలుగు ) అతవేదాఖిల్ 9   ( ఒకటీ ఇంటూ రెండు )  తరీఖ్  /శీతాంశు

(౦) ( __)  =    ౦

( __ ) ( ౦ ) =     ౦

( __ ) ( ౦ ) =     ౦

( __ ) (  __ ) = __

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦

( __ ) ( ౦ ) =   ౦

( __ ) (  __ ) = __

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦

( ౦ ) ( __ ) =  ౦

( __ ) ( ౦ ) =   ౦


దౌహితృ పంక్తి  తరువాత  సాక్షి  పంక్తిలోని  నాలుగో  ఖానాలోని  మూర్తుల  కోసం  మళ్లీ  గుణకారం  చేసి  తెలుసుకోవాలి.  తొమ్మిది  X పది  =  పదమూడు, పదకొండు X పన్నెండు = పదునాలుగు వస్తాయి. మళ్లీ పదమూడు X పదునాలుగు =  పదిహేను,   పదిహేను X ఒకటి  =  పదహారు  ఖానాలలోని  మూర్తులు వస్తాయి. వీటిని కూడా  తయారు చేసి  చూద్దాం !
 

16 ( 15 ఇంటూ 1 ) 15 ( 13 ఇంటూ 14 ) 14 ( 11 ఇంటూ 12  ) 13 ( 9 ఇంటూ 10 )

( ౦ ) ( __ ) =  ౦

( __ ) (  __ ) = __

( ౦ ) ( __ ) =  ౦

( __ ) (  __ ) = __

( __ ) (  __ ) = __

( __ ) (  __ ) = __

( __ ) (  __ ) = __

( ౦ ) ( ౦ ) =     ___

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( __ ) =  ౦

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( ౦ )  =  __

( ౦ ) ( __ ) =  ౦


ఈ  విధంగా  పదహారు  ఖానాల  అందమైన  ప్రస్తారం  తయారయింది.  ఈ  ప్రస్తారాన్ని  నిర్ణీతమైన  పధ్ధతిలో  వేసి  ప్రశ్న  ఫలితాన్ని  తెలుసుకోవాలి.  ప్రస్తారం లోని  ఖానాలలో నాలుగు  భూతాలు  తమ  తమ  ప్రభావాన్ని  చూపిస్తాయి.  అవి వరుసగా  1 .అగ్ని,  2.వాయువు,  3.జల,  4.పృథ్వి  భూతాలు  పరిపాలిస్తాయి..


ఒకటవ  ఖానా  అగ్ని, రెండవ  ఖానా  వాయువు,  మూడవ  ఖానా  జలము,  నాల్గవ  ఖానా  పృథ్వి  కాగా  తిరిగి  అయిదవ  ఖానా  అగ్ని, ఆరవ  ఖానా  వాయువు, ఏడవ  ఖానా  జలము, ఎనిమిదవ  ఖానా  పృథ్వి  అవుతాయి. మరల తొమ్మిదవ ఖానా  అగ్ని,పదవ  ఖానా  వాయువు, పదకొండవ  ఖానా  జలము,పన్నెండవ  ఖానా  పృథ్వి  తత్వాలు  అవుతాయి. పదమూడవ ఖానా  అగ్ని,పదునాలుగవ   ఖానా  వాయువు, పదిహేనవ  ఖానా  జలము, పదహారవ  ఖానా  పృథ్వి  తత్వాలు  అవుతాయి.  ఆకాశ తత్వము  పృఛ్ఛకుని మనస్సు  లోనే ఉంటుంది. ఇప్పుడు తయారయిన  ప్రస్తారాన్ని/ జాయచాన్ని  చూడండి.జాయచం

 

 

కొసమెరుపు : ఈ ప్రస్తారం సంతాన ప్రశ్నకోసం తయారు  చెయ్యబడింది. మన  సాంప్రదాయ  జాతక  చక్రాలలో  లాగే , ప్రస్తారం లోని  తొలి  పన్నెండు   ఖానాలు  పన్నెండు  భావాలకి , ప్రాతినిద్యం  వహిస్తాయి. అంటే  తొలి  ఖానా  ప్రశ్నకర్తని, రెండవది  అతని  ధనాన్ని,  మూడవది సహోదరులనీ, నాల్గవది విద్యని,  అయిదవది  సంతానాన్ని, ఆరవది  శతృ  రోగ  ఋణ  సంబంధాలనీ,  ఏడవది  వివాహాన్నీ,  ఎనిమిదవది ఆయువు  ఆకస్మిక  ఆపదలనీ,  తొమ్మిదవది  అదృష్టాన్నీ,  పదవది  ఉద్యోగాన్నీ, పదకొండవది  లాభాన్నీ,  పన్నెండవది   నష్టాలనీ  తెలియజేస్తాయి. ప్రశ్న సంతానానికి  సంబంధించినది  కాబట్టి  తొలి  ఖానానీ, అయిదవ  ఖానానీ , భార్యకి  సంబంధించిన  ఖానా  ఏడవ దానిని,  ఆరవ  ఖానాని  (సంతానం  కూడా  ఋణానుబంధమే  కదా ! ) సంప్రదించాలి.


ఒకటి  ఇంటూ  అయిదుతో  ఒక  షకల్ని  , ఆరు ఇంటూ   ఏడుతో  మరొక  షకల్నీ తయారు  చేయాలి.  తిరిగి  ఈ  రెండు  షకళ్ళనీ  గుణించి  చివరగా  మిగిలిన  షకల్తో  సమాధానం  చెప్పాలి/


ఈ  నియమం  ప్రకారం  (  1*5 ) =   ( బిందు * బిందు ) తొలి  వరస ! రెండవ  వరసలో  ( రేఖ  * రేఖ ),  మూడవ  వరసలో (  బిందు * బిందు ), చివరి  వరసలో  (రేఖ * రేఖ )  వెరసి   ( బిందు, రేఖ, రేఖ, రేఖ )  అయ్యాయి.  అలాగే  ( 6*7 ) =  ( రేఖ* బిందు ), (బిందు * రేఖ ) , (రేఖ * బిందు ), ( రేఖ * బిందు )  వెరసి ( బిందు, బిందు, బిందు, బిందు ) అయ్యాయి,  ఇప్పుడు  ఈ  రెండీంటినీ  గుణకారిస్తే  ( రేఖ , బిందు, బిందు , బిందు ) అంటే  'అతవే  దాఖిల్ ' వచ్చింది. ఇది   దాఖిల్ షకల్  కాబట్టి,  దాఖిల్  అన్న  శబ్దానికి  అర్థం  ప్రత్యక్షమవడం  కాబట్టి,  ప్రశ్నకర్తకి  సంతానం  కలుగుతుందని  చెప్పడమయింది.

Posted in వ్యాసం | Tagged | Comments Off on ‘రమల్’ ప్రశ్న శాస్త్రం-4

ప్రపంచ పక్షి

సృష్టి నాటి నుంచి చూస్తున్నా
సూర్యుడెప్పుడూ తూర్పునే ఉదయిస్తున్నాడు
దశాబ్దాలనీ శతాబ్దాలనీ
గుర్తుల కోసం నువ్వే ఋతువుల పేర్లైనా పెట్టుకో
కాలం మాత్రం అనంతం నుంచి అనంతంలోకి
సాగే జీవన ప్రవాహం
మనిషి అందులో ఒక అల
 

నదులూ , సముద్రాలూ, పర్వతాలూ,
అగాధాలూ, అడవులూ, ఎడారులూ,
మహా సముద్రాలనీ
నేలనీ, నీటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నావ్!


జాతులనీ, రంగులనీ, మతాలనీ , కులాలనీ,
బానిసలనీ,
నిన్ను నీవే నిలువుగా, అడ్డంగా
నరుక్కుంటున్నావ్!


నిజమే….
నడక మాత్రమే తెలిసినవాడివి- నదులు
నీకడ్డమే మరి!


శతాబ్దానికవతల ఏముందో వినలేని
చెవిటి వాడివి
కంటికి కనిపించనిదంతా నీకు దగా!
నీ గుళ్ళూ, గోపురాలూ, పిరమిడ్లూ, ప్యాలెస్ లూ
నగరాలూ, నాగరికతలూ
కాలం తీరాల వెంట శిధిలాల్లా పడి ఉన్నాయ్!


నత్త గుల్లలే నీ చరిత్రకు గుర్తులుగా మిగిలున్నాయ్!
అణువును ఛేదించి అస్త్రాలను చేసేవాడా
జీవాన్ని మమ్మీ గా మార్చి పిరమిడ్ బొడ్డులో దాచేస్తావా?
కరువులూ, కాటకాలూ, వరదలూ, తుఫానులూ,
భూకంపాలూ, సునామీలు చాలకా …
మధ్యలో పుట్టి మధ్యలో పోయే ఓ మనిషీ!
మళ్ళీ యుద్ధాలను సృష్టిస్తున్నావ్!


నీ అధికారం, ఉగ్రవాదం, యు యెన్ వో వీటో పవరూ,
ప్రభుత్వాలూ, పహరాలూ డాలర్లు పేటెంట్లు
అణువుపగిలితే అంతా మసి!
విశ్వాన్ని జయించాలని విర్రవీగిన నియంతలు
బాత్రూముల్లో జారిపడి చచ్చిన ఉదంతాలు
వినలేదా!


క్యాలెండరుకు ముందేముందో తెలీనివాడివి
నీ కన్న పిట్ట నయం!
చినుకు కోసం నేలపడే తపన దానికి తెలుసు
ఉనికి కోసం జీవిపడే ఆరాటం తను చూడగలదు


తల్లడిల్లే పిల్లవాడు తల్లి నాలుకతో 'అమ్మా!'
అనే ఏడుస్తాడు ఏ ఖండంలోనైనా
తల్లి నాలుకలు వేరైనా తల్లి మాత్రం ఒక్కటే
బాధలకూ, భయాలకూ రంగులు వేరైనా వాసన ఒక్కటే అయినట్లు
జపానుకైనా ఇరానుకైనా
చెక్కిళ్ళ మీద జారే కన్నీళ్లు ఎప్పుడూ ఉప్పగానే ఉంటాయి


ఆఫ్రికా అడవులైనా, అలప్స్ కొండలైనా,
నైలునది నీళ్ళయినా, దార్ ఎడారి ఇసుకైనా
ఎవరెస్టు శిఖరమైనా మృత్యులోయ లోతైనా
పిట్ట కొక్కటే!


మనిషి ముక్కలు చేసిన ఆకాశాన్ని
తన రెక్కలతో కుట్టుకుంటూ
రవ్వంత వసంతం కోసం దిగంతాల అంచుల దాకా
ఎగరటమే దానికి తెలుసు


నేను
అలుపెరగని ఆ వలసపక్షిని
ప్రపంచ పక్షిని


ఖండాల జెండాలన్నీ ఒక్కటేనని మనిషి
నమ్మేదాకా దేశదేశాలకు
ఈ సందేశాన్ని పంచటమే నా పని!

Posted in కవిత్వం | 8 Comments

జనపదం

 


అదొక చిన్న పల్లెటూరు. కాని మెయిన్ రోడ్డు మీద వుంది. టౌనుకెళ్లాలంటే ఆ వూరు మీంచి వెళ్లాల్సిందే. అందుకే ఆ పల్లె రోడ్డు చిన్న చిన్న షాపులతో, టీ బంకులతో, సైకిల్ షాపులతో కళకళలాడుతూ వుంటుంది. ఒకసారి టౌను వెళ్తూ రోడ్డువార టీ కొట్టు దగ్గర ఆగాను. కస్టమర్లతో సందడిగా వుంది. ఒకాయన వచ్చి బెంచీ మీద కూచుంటూ, "ఓ టీ కొట్టు అర్జంటుగా" అన్నాడు. ఆ బంకులో యజమానే సర్వస్వం. "స్ట్రాంగ్‌గా కొట్టనా, లైట్‌గా కొట్టనా" అన్నాడు పొయ్యి దగ్గర్నించి టీ మాస్టర్ కమ్ యజమాని. "లౌక్యంగా కొట్టు" అన్నాడు కస్టమరు. ఆ భాష అవతలి వ్యక్తికి అర్థమైంది. నాకు అర్థం కాలేదు. "లౌక్యం" అంటే మరీ అంత స్ట్రాంగూ కాదు, అట్లాగని లైటూ కాదు అని తెలుసుకున్నాను. ఆహా! లౌక్యాన్ని ఎంత లౌక్యంగా వాడారని నివ్వెరపోయాను.
 

జనపదాల్ని వినాలంటే జనపదాల్లోనే వినాలి. గడచిన పాతికేళ్లలో ఎన్నో జనపదాలు మరుగున పడిపోయాయి. అర్బనైజేషన్ మొదలై నలభై ఏళ్లు దాటింది. తొలినాళ్లలో కొద్దిగా రాకపోకలు, పల్లె పట్నం మధ్య వారధులు వుండేవి. ఆ తరం తరవాత సంబంధాలు తెగిపోయాయి. పల్లెలు తమ స్వరూప స్వభావాలను కోల్పోయాయి. దీనికి కారణాలు యిక్కడ అప్రస్తుతం. పిల్లలు మాట్లాడుకునే మాటలు కొన్ని యిప్పుడు పట్నంలోనే కాదు పల్లెల్లో కూడా వినిపించడం లేదు. తాయిలం, అప్పచ్చి, బువ్వ, కాకెంగిలి లాంటి మాటలు లేవిప్పుడు. పల్లెటూరి పిలకాయలకు కూడా వీటి అర్థాలు తెలియవు. కొన్ని తినుబండారాలను పక్కపక్క ప్రాంతాలైనా తేడాగా పిలుస్తారు. ఒకసారి బడికి ఇన్స్‌పెక్టర్ గారు తనిఖీకి వచ్చారు. మా బడిలో ఒక మేస్టారు తరగతిలో చిరుతిళ్లు తింటున్నారని ఆయనకు ఆకాశరామన్న వుత్తరం అందిందిట. మా బడిలో ఏడుగురు టీచర్లుండేవారు. ఇన్స్‌పెక్టర్ గారు వస్తూనే, ఆ వుత్తరం ఎవరు రాసిందీ కనిపెట్టేసారు. ఫలానా టీచరు తరగతి గదిలో పప్పుచెక్క, బుగ్గారెలు తినుచున్నారు — అని రాశాడు ఆకాశరామన్న. మా ప్రాంతంలో పునుగులంటాం. పల్నాడులో వాటిని బుగ్గారెలు – బుగ్గ గారెలు అంటారు. కొత్తగా ఒకాయన వినుకొండ నించి బదిలీ అయి మా బడికి వచ్చారు. ఆయన తప్ప బుగ్గారెని మరొకరు ప్రయోగించలేరు. అందుకే ఆకాశరామన్న దొరికిపోయాడు!
 

కొన్ని కొన్ని పెద్ద ప్రాజెక్టులు, నిర్మాణాలు వచ్చి అక్కడి భాషని సంస్కృతిని సమూలంగా మార్చేస్తాయి. నాగార్జునసాగర్ వచ్చి పల్నాటి రూపు రేఖల్ని మార్చేసింది. శ్రీనాథ మహాకవి, చిన్న చిన్న రాళ్లు చిల్లరదేవుళ్లు… పద్యం, జొన్నకలి జొన్నయంబలి… చాటువులు నేడు చెల్లవు. అలాగే కృష్ణా గోదావరి నదుల మీద పలుచోట్ల వంతెనలు వచ్చాక రేవులు పోయాయి. దానివల్ల దానికి సంబంధించిన పదజాలం అంతరించిపోయింది. రాదారి పడవ, నావ, పుట్టి, డింగీ లాంటివి వినిపించడం కనిపించడం తగ్గింది. ఇద్దరి నించి అద్దరికి చేర్చేందుకు చెల్లించే సొమ్ముని "కేవు" అంటారు. మారుమూల గ్రామాలకు, గూడేలకు కూడా కరెంటు వచ్చింది. దానితో బుడ్డి దీపం, లాంతరు, చిమ్నీ, లస్టర్, గ్యాస్ లైట్ లాంటివి పోయాయి. అభ్యుదయం, నాగరికత పోయే మాటల కోసం ఆగదు, ఆగకూడదు. మాటల గురించిన మాట వచ్చింది కాబట్టి ఓసారి మననం చేసుకుంటున్నాం.
 

మనది వ్యవసాయదేశం. భారతీయత, భారతీయ ఆత్మ పల్లెల్లోనే వుందని చెప్పుకునేవారు. వ్యవసాయంతో బాటు వృత్తి విద్యలు పల్లె జనాన్ని పోషించేవి. యంత్రాలు రంగప్రవేశం చేశాయి. పశుసంపద పూర్తిగా తగ్గిపోయింది. దానితో ఎన్నో మాటలు పనిముట్లు మూల పడ్డాయి. ఎలపటెద్దు, దాపటెద్దు, ఎల్లావు పుల్లావు, కోడెదూడ పెయ్యదూడ, గిత్త ఎద్దు ఆబోతు యిలాంటివి ఇప్పుడు కుర్ర రైతులకు కూడా కొత్తగా వినిపిస్తాయి. సిగమార్లు, ముకుతాళ్లు, పట్టెళ్లు, చెర్నాకోల, ములుకోల, ములుగర్ర, చిక్కం లాంటివి రైతు నోళ్లలో నానేవి. పశువుల దాణాకి సంబంధించిన చిట్టు, తవుడు, కుడితి ప్రాచీన పదాలైనాయి. మేతకి పశువుల్ని డొంకలకి తీసికెళ్లడాన్ని "పుల్లరి" అంటాం. పుల్లరి సుంకం మీదే నాడు కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు.
 

మరైతే కొన్నాళ్లకి వేలాది జనపదాలు పూర్తిగా మాయమవుతాయా. ఎప్పటికీ కావు. భాష సజీవమైంది. పాతవి పోతూ వుంటే కొత్తవి వస్తూ వుంటాయి. సమయం గడిచిన కొద్దీ కొన్ని మాటలు అర్థాలు మార్చుకుంటాయి. ఇక్కడ ఒక్క నిజాన్ని చెప్పుకోవాలి. అర్బనైజేషన్ ఆ తర్వాత గ్లోబలైజేషన్ జరిగాక యింకా అనేక తెలుగు నుడికారాలు జాతీయాలు సామెతలు పడికట్టు పదాలు జనంలో వున్నాయంటే దానికి కారణం పత్రికలు రేడియో. రోజూ పత్రికల్లో పతాక శీర్షికలలో మంచి తెలుగు జాతీయాలని నుడికారాలని చదువుతూ వుంటాం. రేడియోలో వింటూ వుంటాం. నిప్పులు చెరిగారు, చేతివాటం, చక్రం తిప్పనున్నారా, మొండిచెయ్యి, అంతా హుళక్కి, ఏతావాతా, వేరు కుంపటి, చిలవలు పలవలు, పావులు కదిపారు, విధివిధానాలు, నీరు కార్చిన వైనం, జీర్ణించుకోలేకపోతున్నారు, నిర్వీర్యం, సయోధ్య, జయకేతనం, స్పందన, ప్రతిస్పందన – యిలా ఎన్నో వుదహరించవచ్చు. ’పగ్గాలు’ అనే మాట జనపదంలో పోయినా అధికారం అప్పగించినపుడు ’పగ్గాలు ఫలానా వారి చేతికిచ్చారు’ అని పత్రికల్లో కనిపిస్తుంది. భాషాభివృద్ధికి కూడా పత్రికలు నాడూనేడూ కృషి చేస్తూనే వున్నాయి. కాందిశీకులు, అలీనవిధానం, అస్మదీయులు, వంటి పలు కొత్త మాటలను పాఠకులకు పరిచయం చేశాయి పత్రికలు. రావణకాష్ఠం, శల్యసారధ్యం, శిఖండి, సైంధవుడు, కీచకుడు, చక్రం అడ్డేయడం లాంటివి వాడుతూ ఇతిహాసపాత్రల్ని గాథల్ని గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే ’చక్రం అడ్డేయడం’ అంటే ఏమిటో తెలియాలంటే భారత కథంతా తెలియాలి. అలాగే మిగిలినవీ. ఆలస్యంగా రంగప్రవేశం చేసిన ఎలక్ట్రానిక్ మీడియా తెలుగుభాషకి కొత్తరంగులు అద్దింది. దృశ్య మాధ్యమం అవడం వల్ల, ప్రపంచీకరణ ప్రభావం వల్ల తన ’పలుకు’బడిని మార్చుకుంది. విజువల్ మీడియా అవిశ్రాంత కృషి ఫలితంగా జనపదాలు బొత్తిగా మొహం చాటేసాయి. చాలా స్కూల్స్‌‌లో తెలుగుని కూడా ఆంగ్లంలో బోధించడం ఆనవాయితీ అయింది.
 

మునుపు వయసు మళ్లిన అత్తగారు, "కీలు దాని కాడుంది. అది తిప్పినట్టు యీడాడతాడు" అని కోడలు కొడుకు గురించి వ్యాఖ్యానించేది. ఇప్పుడు, "స్విచ్చి దాని కాడుంది. ఆ మీటపెట్టె దాన్చేతులో పెట్టుకుని నొక్కుతా వుంటే – యీడ బొమ్మ మారుతా వుంటది" అంటోందావిడ. అంటే రిమోట్ కోడలి చేతిలో వుందని వేష్ట. ఏదైనా తీగ, ఏ సొరపాదో చీరపాదో బాగా విస్తరిస్తే "అనూపంగా అల్లుకుంది" అనేవారు. పుచ్చపువ్వులాంటి వెన్నెల, గచ్చపొదలాంటి గయ్యాళి యిప్పుడు లేవు. విశ్వనాథ వారి తెలుగు ఋతువులు లఘుకావ్యం చదివితే ఎన్ని మాటలు జానపదాల్లోంచి జారిపోయాయో తెలుస్తుంది. అలాగే ఎన్నిఆచారాలు వ్యవహారాలు కాలగతిలో కలిసిపోయాయో అర్థమవుతుంది. విశ్వనాథ వర్షరుతువుని వర్ణిస్తూ ఒక పద్యంలో పందిరి గుంజ మీద మొలిచిన కాకిబొడ్డుని ప్రస్తావిస్తారు. అక్కడ ఆగకుండా "… కన్నె పిల్ల ఎద పొంగగ" అని కాకిబొడ్డుతో అనుసంధిస్తారు. ఇది సమగ్రంగా తెలియాలంటే యాభై ఏళ్లనాటి పల్లెటూరికి వెళ్ళాల్సిందే. వానాకాలం వస్తోందనగానే నేల పాతర్లలో ధాన్యాన్ని తీసి గాదెల్లో పోస్తారు. పూడ్చిన పాతరగుంట మీద ఏ కూరపాదు పెట్టినా చులవలు పలవలుగా అల్లుకుంటుంది. దానికి చెట్టుకొమ్మలతో పందిరి వేస్తారు. చెట్టుకొమ్మకి కణుపులుంటాయి. వాటిలో నీళ్లు నిలుస్తాయి. చెట్టుకొమ్మలో వుండే జీవ పదార్థం నీళ్లతో కలిసి ఒక విధమైన ఫంగస్ తలెత్తుతుంది. అవే పుట్టగొడుగులు, అవే కాకిబొడ్లు. వర్షాకాలంలో అట్ల తద్దె వస్తుంది. ఇది ఆడపిల్లల పండగ. గోరింటాకు పెట్టుకోవడం, తెల్లవారుజామున అన్నాలు తిని ఆడుకోవడం, ఉయ్యాలలూగడం రివాజు. అప్పట్లో పెరటిగోరింటాకే గానీ మెహందీ కోన్స్ లేవు. గోరింటాకు రుబ్బేటప్పుడు అందులో కాకిబొడ్డు వేస్తే ఎర్రగా పండుతుందని అప్పటి నమ్మకం. ఈ "కన్నెపిల్ల ఎదపొంగగ" అని కవి సమ్రాట్ వాడకం వెనక యింత విషయం వుంది.
 


 

ఆనాటి కవులు గ్రామీణ జీవన నేపథ్యంలోంచి వచ్చిన వారే. తమ నేలని పరిసరాల ప్రకృతిని అమితంగా ప్రేమించిన వారు. అందుకే విశ్వనాథ, జాషువా, తుమ్మల, ఏటుకూరి మొదలైన పలువురి రచనలలో తెలుగు జీవితాలు ప్రతిబింబిస్తాయి. జనపదాలు పదే పదే ప్రతిధ్వనిస్తాయి.
 

ఒక ఆసామి వూళ్లోకి వస్తున్న రైతుని, "కాలవ వురవడిగా వస్తోందా" అని అడుగుతాడు. "లేదు లేదు… తొలి జాము దాకా సజావుగానే వచ్చింది గాని తర్వాత సచ్చిపోయింది" అంటాడు రైతు. అంటే కాలవలో నీరు తగ్గిందని అర్థం. జనపదంలో వర్షాన్ని దుక్కులలో చెప్పుకునేవారు. "దుక్కి" వారి కొలమానం. దుక్కి దున్నడం కూడా వుంది. నాగలి పన్నడం అంటారు. అంటే దున్నాల్సిన నేలని ఎక్కడ ప్రారంభిస్తే నాగేటిచాళ్లు సక్రమంగా వస్తాయో చూసి మొదలెట్టడం. ఇదొక గొప్ప కళ. నాగలికి కాడి మేడి వుంటాయి. వెనకాల వుండే పెద్ద కొయ్యని నాగలిదుంప అంటారు. దుంపకి కర్రు వుంటుంది. అది ఇనుముతో చేసిన పలుగు ములుకు. అదే నేలని చీలుస్తుంది. దానితో పాటు నడిచే దుంప చాలుని వెడల్పు చేస్తుంది. ఎన్నిసార్లు దున్నితే అన్ని చాళ్లు దున్నామంటారు. ఎడ్లబండి కూడా మానవ నాగరికతకి గొప్ప చిహ్నంగా చెబుతారు. బండి చక్రాలని జోడు అని కూడా పిలుస్తారు. బండి చట్రాన్ని నిలిపే దాన్ని డొలుపు అంటారు. దాంట్లోంచే ఇరుసు వస్తుంది, చక్రాలకి వుండే అడ్డకొయ్యలని ఆకులంటారు. ఎడ్ల మెడ పైన కాడి వేసి, మెడ కింద నించి పట్టెడ వేసి దాన్ని తగిలించే కర్రల్ని చిడతలంటారు. ఇవి బండి కాడికి ఆ చివర యీ చివర వుంటాయి. ఇరుసుకి చక్రాల్ని ఎక్కించి చివర శాయి మేకుల్ని పెడతారు. కూచోడానికి వీలుగా వెదురుతో అల్లిన జల్లని బండివైపు వుంచి, అది కదలకుండా వసి కర్రల్ని అటూయిటూ గుచ్చుతారు. వీటన్నిటికీ చేతలోనే కావల్సిన ఏర్పాట్లు అమరికలు వుంటాయి.
 

ఏదైనా నగగాని వస్తువుగాని కుదిరిగ్గా పొందిగ్గా వుంటే "చేతాళం" బావుందంటారు. చేతాళం, చేత అనే పదాలిప్పుడు అరుదే. రైతులు కూడా ప్రస్తుతం విత్తనం, వంగడం మాటల్ని వదిలేశారు. బ్రాండ్స్‌తో వస్తున్న తరుణంలో సీడ్స్ అనడం పరిపాటి అయింది. నీళ్లకి అంటే సాగునీటికి సంబంధించి రకరకాల వనరులు వచ్చాక ఆనాటివి మూలపడ్డాయి. ఏతం అనే మాట బ్లాక్ అండ్ వైట్ సినిమా పాటల్లో మాత్రమే కనిపించి వినిపిస్తుంది. గూడ వేయడం, నత్తగుల్ల తిప్పడం, మోట బావి మూరెడు బారెడు చారెడు లాంటి కొలతలు యిప్పుడు లేవు. పుంజీడు అంటే నాలుగు అని అర్థం. శేరు, సోల, గిద్ద అనేవి కూడా పోయాయి. మానికతో గాని ఆ మాటతో గాని యిప్పుడు పన్లేదు. మానికని చూడాలంటే ప్రస్తుతం గోవింద రాజస్వామి గుడిలో మాత్రమే కనిపిస్తుంది. రూకలు కొలిచి కొలిచి అలిసిపోయిన గోవిందరాజస్వామి దానినే తలకింద పెట్టుకుని నడుం వాలుస్తారు. ఇదొక ఐతిహ్యం.
 

మత్స్యకారులకు సముద్రం మీద ఎంతటి అవగాహన వుంటుందో గ్రామీణులకు ఆకాశం మీద అంతటి పట్టు వుంటుంది. ఆకాశాన్ని చూసి వాతావరణాన్ని ఆ రోజుల్లో చెప్పేవారు. చంద్రుడు చుట్టూ మేఘాలు కట్టే గూడుని "వరదగుడి" అనేవారు. దాన్ని బట్టి వాన రాకడ తెల్సుకునేవారు. చుక్క పొడుపుల్ని బట్టి రాత్రివేళల్ని చెప్పేవారు. వేగుచుక్క పొడిస్తే నిద్రలేచే వేళైనట్టు. ఒక పెద్ద నక్షత్రం చుట్టూ చిన్న నక్షత్రాలు గుంపుగా వుండే దాన్ని పిల్లల కోడి అనేవారు. వీటిల్లో జనపదాలే కాదు జానపద విజ్ఞానం కూడా వుందని మనం గ్రహించాలి. అందానికి ప్రతీకగా చెప్పుకునే ఇంద్రధనుస్సుని కర్షక శత్రువుగా పిలిచేవారు. ఇంద్రచాపం వానవెలిశాక ప్రత్యక్షమవుతుంది. సూర్యుడు కూడా వుండాలి. వాతావరణంలో వున్న నీటి బిందువులు ప్రిజమ్‌లా పని చేస్తాయి. వాటి పైబడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది, ఆకాశం తెర మీద వానవెల్లిగా దర్శనమిస్తుంది. ఒక ప్రసిద్ధ సబ్బుల కంపెనీ, వానవెల్లి రంగులలో లభిస్తాయని వ్యాపారప్రకటన యిచ్చేది. తమిళనాడులో ఇంద్ర ధనుస్సుకి "సింగారి చెంగు" అనే పేరుంది. ఎంత ముచ్చటైన పేరు! ఇప్పుడువున్నదల్లా రెయి‌న్‌బో… ఓన్లీ రెయి‌న్‌బో!
 

ఒక్క సంగతి గమనించాలి. చాలా పల్లెపదాలు మాయం కావడమో, మారిపోవడమో జరిగింది గాని దేవుడు మాటలు చాలా వరకూ సర్వత్రా సురక్షితంగానే వున్నాయి. ఆలయం, ప్రాకారం, ధ్వజస్తంభం, గర్భగుడి, మండపం, అర్చన, ప్రదక్షిణం, గోపురం, తీర్థం, ప్రసాదం, నైవేద్యం, హారతి, మొక్కు, పూజ, పూలుపత్రి యివి యథాతథంగానే వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక కాలేజి అమ్మాయి వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల గురించి చాలా పొగుడుతూ – "దేవుడి కాన్వాయ్ చాలా కలర్‌ఫుల్‌గా వుంటుంది. ఐ రియల్లీ లైక్డిట్" అనడం విన్నాను. ఓరి భగవంతుడా అనుకున్నాను. అయితే, కైంకర్యం, స్వాహా, శఠగోపం, నామం లాంటి దేవుడి మాటలు దొంగలపరంగా వాడుతున్నారు. ఈ దురాచారం ఎందుకొచ్చిందో తెలియదు. బడిలో వినిపించే పలక, బలపం, పేనా, పెన్ను, ఇంకు, సిరా, పాళీ లాంటి మాటల్ని పెన్, రిఫిల్ మింగేశాయి. కుంభకారుడు సారె మీద అనేక రకాల మట్టి పాత్రలని తయారు చేసేవాడు. కడవ, కుండ, బుంగ, చట్టి, దుత్త, ముంత, పిడత, బాన, తాబేటికాయ – యివి కొన్ని పేర్లు. ఎద్దు మెడని అర్రు అంటారు. అందని వాటికి అర్రులుజాచడం అంటే మెడ చాచడం అని అర్థం. లావో దేవో అనే హిందీ పదాల్లోంచి లావాదేవీలు వచ్చింది. హమ్ తుమ్ నించి అమీతుమీ వచ్చింది. అమీ తుమీ తేల్చుకోవడం అంటే నువ్వో నేనో తేలాలని భావం. ఏకులు, పోగులు, చిలపలు, నూలు విచ్చెలు యివి రాట్నానికి సంబంధించిన సరుకు సరంజామా. ఏకులు వడికాక పోగుల్ని ఆసుపోస్తారు. దానికి వాడేందుకు చిన్న గొట్టం వుంటుంది. అటూయిటూ తిరిగే వారిని చూసి ఆసులో గొట్టంలా తిరుగుతున్నాడంటారు. పడుగుపేక అంటే వస్త్రం నేయడానికి అడ్డంగా నిలువుగా కూర్చే నూలుపోగులు. ఈ పడుగుపేకని నిత్య జీవితంలో పలుసందర్భాలలో వాడతాం. పల్లెల్లో విశ్వాసాలు, నమ్మకాలు బస్తీలకంటే ఎక్కువ. ఇంట్లోంచి ఎవరైనా పొరుగూరు వెళ్తుంటే, "అన్నం తిని వెళ్లు" అనరు. అలా అన్నాక తప్పక తిని వెళ్లాలి. లేకపోతే అశుభం జరుగుతుందని విశ్వసిస్తారు. అందుకని ఎంగిలిపడి వెళ్లు, మంచిమాట చేసికెళ్లు అంటారు. అప్పుడు ఔనన్నా కాదన్నా ఫర్వాలేదు. రాత్రిపూట ఉప్పు అనే మాట వాడరు. చవి, రుచి, బుట్టలోది అని వ్యవహరిస్తారు. "పెళ్లివారమంటూ భోరు భోరున వెళ్ళాం. వెళితే ఏవుందక్కడ? మడత కుడుములు శేష పాన్పులూ తప్ప" – ఇది నిష్టూరంగా అనే మాట. కుడుము గుండ్రంగా వుంటుంది. మడత కుడుం అంటే తినడానికి ఏమీ లేదని. శేష పాన్పులంటే తిండి లేక డొక్కల్లో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకున్నామని ధ్వని. బడిలో మాస్టారు బెత్తాన్ని, బరికెని వాడేవారు. "ఏరా అల్లరి కట్టిపెడతారా, చింతావారి అమ్మాయితో పెళ్లి చెయ్యమంటారా" అనేవారు మాస్టారు. చింతావారి అమ్మాయంటే చింతబరికె అని అర్థం. పెళ్లి చేయడమంటే బాదడం అని అర్థం. దూదేకుడు, గుద్దుల బెల్లం కూడా పిల్లల్ని కొట్టే పరిభాషే. ఇక వంటింట్లోకి వస్తే ఎంత సామాగ్రి కనుమరుగైంది. పొయ్యి, కుంపటి యిప్పుడు మ్యూజియమ్ వస్తువులు. ఏవుందీ పొయి రాళ్లలాగా మేం ముగ్గురం అంటారు పెద్దవాళ్లు. అంటే పిల్లలు రెక్కలొచ్చి ఎవరిదారిన వారెళ్తే మేం మిగిలామని చెప్పడం. రోలు, రోకలి, తిరగలి, సన్నెకల్లు, పీట, కల్వం, కుంది యివన్నీ వెళిపోయాయ్. పాలు పల్చనవుతున్నాయ్, పాలల్లో నీళ్లు కలపద్దు అనడం కొంచెం యిబ్బందిగా వుంటుంది. అందుకని పూర్వీకులు "తోడు పాలు కలపద్దు" అనేవారు. తోడుపాలంటే నీళ్లని అర్థం. ఎంత హాయిగా వుందండీ నిజంగా!
 

సాంకేతికరంగం చాలా అభివృద్ధి చెందింది. దీనివల్ల టెలిగ్రామ్ పూర్తిగా పాతబడిపోయింది. బంధువులు, స్నేహితుల మధ్య వుత్తరప్రత్యుత్తరాలు పూర్తిగా తగ్గిపోయాయి. E-mail, SMS వచ్చాయి. లేఖా సాహిత్యం కనుమరుగై, ఎన్నో మాటలు యీ తరానికి తెలియని పరిస్థితి వచ్చింది. వుత్తరం రాయడానికి కొన్ని లాంఛనాలు మర్యాదలు వుండేవి. పైన "క్షేమం" అని పెద్దక్షరాలతో రాయాలి. ఎవరికి ఎవరు రాస్తున్నారో చెప్పి, ఉభయకుశలోపరి అని రాయాలి. ఆపైన లేఖాంశాలు మొదలుపెట్టాలి. ఆ యింటి పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు దీవెనలు వుండాలి. చిత్తగించవలెను, ఇట్లు మీ విధేయుడు అంటూ చేవ్రాలు చేసి ముగించాలి. అన్నట్టు చేవ్రాలు అంటే సంతకం. నిశాని అంటే ఎడమచేతి బొటనవేలి ముద్ర. అయిదారు దశాబ్దాల క్రితం లేఖాసాహిత్యం ఒక శాఖగా వర్థిల్లింది. వుత్తరాలతో కథ, వుత్తరాలతోనే నవల తెలుగులో వచ్చాయి. కనుపర్తి వరలక్షుమ్మ గారి "శారదలేఖలు" అనేక సాంఘిక సామాజిక సమస్యల్ని చర్చించే సందేశాలు. ప్రముఖ రచయిత తాత్వికుడు చిత్రకారుడు సంజీవదేవ్ తన మిత్రులకు రాసిన లేఖలు విలక్షణమైనవి. విలువైన సమాచారంతో రాసిన విలక్షణమైనవి. సాధికారత గల చరిత్రకి ప్రముఖుల లేఖలు అక్షర సాక్ష్యాలుగా నిలిచాయి. ఇప్పుడు లిఖిత సంప్రదాయం పోయి ఆశుసంప్రదాయం మిగిలింది. చాలా సంగతులు గాలిలో కలిసిపోతున్నాయి. వార్తా ప్రసార సౌకర్యాలు లేని రోజుల్లో పల్లెలకు సమాచారం తెచ్చేవి పోస్టు కార్డ్సే. "టెలిగ్రాం" ఒకనాటి అర్జంట్ సమాచార వాహిక. టెలిగ్రాం కొట్టాడు, వైరిచ్చాడు అనడం పరిపాటిగా వుండేది. తెలుగులో తంతి. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌‍ని తంతితపాలాశాఖ అని పిలిచేవారు. మోర్స్‌కోడ్‌లో కట్టు, కడ అనే రెండు ధ్వని సంకేతాలతో ఎంత సమాచారాన్నైనా చేరవేసేవారు. వివిధ సందర్భాలకు తగిన శుభాకాంక్షల జాబితా, వాటికో నెంబరు వుండేది. ఆ నెంబరు కొట్టేస్తే అవతల కొసన ఆ గ్రీటింగ్‌‍ని పూర్తిగా రాసేసి అడ్రస్‌‍దారుడికి చేర్చేవారు. టెలిగ్రామ్ ఇవ్వాలంటే మాటకి యింతని వసూలు చేసేవారు. అందుకని అతిక్లుప్తంగా పంపే సందేశాన్ని కుదించేవారు. దీనికి వ్యాకరణాలు మర్యాదలు పాటించే ఆచారం లేదు. అందుకే దీన్ని "టెలిగ్రామ్యభాష" అని శ్రీశ్రీ పేరు పెట్టాడు. ఇప్పుడు SMS కూడా చిత్రమైన భాషని అలవాటు చేసింది.
 

సర్వత్రా వాతావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా కరెంటు స్తంభాలు తప్ప పచ్చని చెట్లు కనిపించడం లేదు. చాలా చెట్ల పేర్లు యిప్పటి పిల్లలకుతెలియదు. తుమ్మ తమ్మి తుమ్మి జమ్మి నేరేడు మారేడు పొగడు పొన్న పున్నాగ లాంటి చెట్లు యిప్పుడు జనపదాలలో కూడా లేవు. వేప కానుగ లాంటి చెట్ల నీడలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని వాటిని శ్రద్ధగా పెంచేవారు. వాటి పుల్లలతో పళ్లు తోమేవారు. పళ్లు తోమే పుల్లల్ని పందుం పుల్లలు అని పిలిచేవారు. అందాకా దేనికి, చేల చుట్టూ వుండే తాడి చెట్టు నిజంగా కల్పవృక్షం. ఒకనాడు మహాకావ్యాలన్నీ తాళపత్రాల మీదనే వచ్చాయి. తాటాకు ఇంటి కప్పుకి వాడేవారు. చిన్న తాడిని బొంద అంటారు. బొందడు, బొందపాపడు అనే మాటలు దాని మీంచి పుట్టినవే. తాటికాయ, తాటిముంజె, తాటిపండు పల్లెల్లో యిష్టంగా తినే వుచిత ఆహారం. మామిడితాండ్ర… తాండ్రంటే జెల్లీ… తాటి తాండ్ర కూడా వుంటుంది. అంత రుచిగానూ వుంటుంది. తాటిపండు గుజ్జుతో రొట్టెలు చేసుకుంటారు. ఇప్పుడీ ఫార్ములా తెలిసిన తరం దాదాపు అంతరించింది. తీసిన కొద్దీ వస్తుంటే, ఎన్ని తీసినా తరగకపోతే – "తేగల పాతరలా తరిగితేనా" అంటారు. ముంజెలు ముదిరి టెంకలవుతాయి. ఆ టెంకల్ని పాతర వేస్తారు. అవి మొలకెత్తుతాయి. తేగ తాడిచెట్టు అంకురమని ఎందరికి తెలుసు. ధనియాలు జల్లితే కొతిమీర మొలిచిందని ఆశ్చర్యపోతున్న రోజులు.
 

బతికుంటే బలుసాకు తిని బతకచ్చు – అని సామెత. బలుసాకు అనేది ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా పెరుగుతుంది. అనేక శక్తివంతమైన క్రిమి సంహారక మందుల కారణంగా కొన్ని కూరాకు కలుపు మొక్కలు కనుమరుగైనాయి. పొన్నగంటి, దొగ్గలి కూర లాంటివి ఎన్నో. ఈ పేర్లు కూడా పోయినట్టే. "నల్లేరు మీద బండి నడక" అంటే కేక్‌వాక్ అని అర్థం. నల్లేరు కూడా ఒకరకం కలుపుగడ్డే. నల్లేరు కాయలు, బుడంకాయలు తినడానికి బావుండేవి. కొంచెం పొట్టిగా లావుగా వుండి, ఎక్కువగా మాట్లాడుతుంటే, "వీడొక బుడంకాయ్" అంటుంటారు. అలాంటిదే "వుల్లిత్తు" కూడా. ప్రకృతిని మానవీకరించడం ప్రాచీన సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తుంది. "తీగె కూన" భూమాతని చుట్టుకుందంటాడొక కవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి "జాబిలి కూన" ప్రయోగం విలక్షణమైంది. జాను – పిల్లి జాబిలి. పిల్లి పిల్లల్ని కూనలంటాం కదా. చిన్న చందమామని జాబిలి కూన అన్నారాయన. ప్రకృతిని మనిషి ఎంతగా ఇష్టపడేవాడంటే – చాలా సందర్భాలలో చుట్టరికాలు కూడా కలుపుకునేవాడు. చందమామ, చందమామయ్య లాంటి వుదాహరణలు ఎన్నో.

శివారు, పొలిమేర లాంటి జానపదాలు చెవిన పడడం లేదు. పొలిమేర అంటే సరిహద్దు. సరిహద్దుల్ని ఎల్లలని కూడా అంటాం. గ్రామసరిహద్దులలో గ్రామ దేవత వుంటుంది. ఎల్లమ్మ తల్లి వూరి ఎల్ల దగ్గర కాపలా వుంటుంది. "పొలియో… పొలి" అన్న కర్షక పదాలు కూడా యిందు మీంచి వచ్చిందే. ప్రభవ, విభవ మొదలైన తెలుగు సంవత్సరాల పేర్లు, కార్తెల పేర్లు వెళ్లిపోయి, ఇంగ్లీష్ నెలల తారీకులు వాడుకలో మిగిలాయి. ఒకప్పుడు "ఏరువాక" వ్యవసాయ సంవత్సరానికి సంకేతంగా వుండేది. జానపద కళారూపాలు అంతరించడంతో వాటికి సంబంధించిన జనపదాలూ అంతరించాయి. సంక్రాంతి తరుణంలో వచ్చే సాతానిజియ్యర్లు, బుడబుక్కల వారు, జంగం దేవర్లు, మాసాబత్తని వారు, పగటి వేషగాళ్ళు, విప్రవినోదులు, చెంచుదొరలు, కొమ్మదాసర్లు, పిచ్చుకుంట్లవారు ఆధునిక సంస్కృతిలో తెరమరుగైనారు. బొమ్మలాటలు లేవిప్పుడు. వీధి నాటకాలు కనుమరుగైనాయి. బుర్రకథలో జముకుల కథలో ఎంతటి జవజీవాలుంటాయో వీధి నాటకాలలో అంతకుమించిన రసావేశం వుంటుంది. "అగ్గి తిరణాలంట – అజ్జునీ కతలంట; ఔరా! ఎంత సోద్దెవో! ఎన్నెన్ని యింతలో? బారత కతలంట! సుగ్గీజయం దానిసుట్టు బలాదూర్" అంటాడొక కవి. సుగ్గీజయం అంటే సుగ్రీవ విజయం. బలాదూర్ అంటే తీసికట్టు, దిగతుడుపు అని అర్థం. కుచ్చలకుశలాయకం అంటే లవకుశుల కథ – ఉత్తర రామాయణం.
 

పావురం, పిచ్చుక లాంటి పక్షుల్లో ఆడమగ చెప్పడానికి పెంటి, పోతు అని వాడతారు. దాశరథి తన శాంతిగీతంలో, "ఫిరంగి గొట్టంలో పిచ్చిక పెంటి నీళ్ళాడింది" అంటారు. అంటే ఫిరంగి గొట్టం కొన్నాళ్లుగా రికామీగా వుంది. అందుకే నిర్భయంగా పిచ్చిక గుడ్లని అందులో పెట్టింది. రికామీ అంటే తీరిక. అర్బనైజేషన్ తర్వాత మనిషికి ప్రకృతికి దూరం పెరిగిన మాట నిజం. చెట్టు పుట్ట, వాగు వంక, చెరువు చెలమ, పాడి పంట, పిల్లా మేక లాంటివి దూరమైనాయి. "ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది…" అన్న నండూరి వారి ఎంకిపాటలో ప్రకృతిని జంతువుతో సమకట్టారు. జంతువులు నెమరు వేస్తాయని చిన్నప్పుడు చదువుకున్నాం. దొరికిన మేతని గబగబా తినేసి, తర్వాత తీరిగ్గా దానిని నోట్లోకి తెచ్చుకుని, తాపీగా నమిలి మింగుతాయి జంతువులు. అన్ని జంతువులు నెమర్లేస్తాయ్ కాని గుర్రం మాత్రం వేయదు. తిరపతి వేంకటకవులు ఎవరో మరో ప్రసిద్ధులు తెలియక గుర్రాన్ని కూడా గాడిద గాటన కట్టేసరికి నానాయాగీ చేసారు. పశువులకి మేత వేసే చోటుని "గాడి" అంటారు. ఇప్పటికీ పత్రికల్లో అనుభవాలని నెమరువేసుకున్నారు, జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు అంటూ ప్రస్తావిస్తూ వుంటారు. మునుపు పత్రికల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే – "పరుశురామ ప్రీతి" అనే మాట వాడేవారు. త్రేతాయుగంలో పరుశురాముడు రాజులపై దండెత్తి సంహరించి, వారి ప్రాసాదాల్ని దగ్ధం చేసేవాడట. అక్కడ నుంచి పుట్టింది పరుశురామ ప్రీతి.
 

ఎన్నో వెండి బంగారు నగలు రాను రాను మోటుగా అనిపించి రూపాలు వాటితోబాటు పేర్లు మార్చుకున్నాయి. ముక్కెర, నత్తు, బేసరి, చావిలీలు, అందెలు, పాంజేబులు, మురుగులు, కడియాలు, నాగవత్తులు, దండకడియాలు, కట్టెవంకీలు, పాపిడి గొలుసులు, పలకసర్లు – యివి కొన్ని మాత్రమే. మనిషి అనాది నించీ తన జీవితాన్ని సుఖమయం చేసుకోడానికి నిరంతరం ఆలోచిస్తూనే వున్నాడు. అవసరంలోంచి ఆలోచనలు పుడతాయి కదా. ఏళ్ల క్రితం డొంకదార్లలో ఎంతెంత బరువులైనా తల మీద పెట్టుకుని నడిచి వెళ్లాల్సిందే కదా. డొంక వారగా యిప్పటికీ చిన్న రాతి నిర్మాణాలు కన్పిస్తాయి. అయిదడుగుల ఎత్తున రెండు రాళ్లు పాతి, వాటిపై అడ్డంగా మరో రాయి వేస్తారు. ఎవరైనా గడ్డిమోపులు, పళ్లబుట్టలు మోసుకు వెళ్ళేటప్పుడు, కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అక్కడ ఆగుతారు. సరిగా ఆ రాతివద్ద నిలబడి బరువుని దానిపైకి బదలాయించేవారు. మళ్ళీ తలకెత్తుకోవాలన్నా, మనిషి సాయం దొరకని డొంక దారిలో వారే తలకెత్తుకోడానికి యిది అనువుగా వుండేది. దీనికి తమిళంలో "శుమైతాంగి" అని చక్కని పేరుంది. తెలుగులో భారమితి. ఈ ఏర్పాటు చాలా చిన్నదే, కాని చాలా ఉపయోగకరమైంది. పూర్వం పాలు పెరుగు వెన్న యింకా అనేక తినుబండారాలు పెట్టుకోడానికి ఉట్టిని కనిపెట్టాడు మనిషి. ప్రతి యింట్లో కనీసం రెండు ఉట్లు వేలాడుతుండేవి. ఇది చూడ్డానికి సింపుల్‌గా వున్నా యిందులో బోలెడు మెకానిజం వుంది. ఎత్తులో వేలాడుతూ వుంటుంది కాబట్టి పిల్లులు, కుక్కలు అందుకోలేవు. దీన్ని వేలాడదీసేటప్పుడు ఒక కొక్కెం, దానికో చిన్న దొన్నె వుంచుతారు. ఆ దొన్నెలో మడ్డి ఆముదం కొద్దిగా పోస్తారు. అంటే పైనించి తాడు ఆధారంగా చీమలు రాకుండా ఆ జిడ్డు దొన్నె అగడ్తలా అడ్డుకునేది. "ఉట్టి" జనపదంలో ఎంతో సేవ చేసింది. విపరీతమైన ప్రజామోదం పొందింది. "ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కిందట" అన్న సామెతలో మాత్రం యిప్పుడు మిగిలింది.
 

ఒక్కొక్క వస్తువునో నిర్మాణాన్నో తీసుకుంటే, దాని చుట్టూ బోలెడు మాటలు. అవి కూడా ఎంత చక్కగా నప్పుతాయో! ఉదాహరణకి బావి వుందనుకోండి. దాని సైజుని చెప్పాలంటే చుట్టుకొలతో, వ్యాసమో చెప్పరు – దాని కన్ను అయిదడుగులు అంటారు. నాలుగు నిలువుల లోతు, వరల బావి అంటూ వర్ణిస్తారు. నేలపైన చుట్టూ కట్టే వంచని బొడ్డు అని పిలుస్తారు. చుట్టూ వుండే చప్టాని పళ్ళెం అనేవారు. నీళ్లు౮ తోడడానికి వాడే చేతితాడు చేంతాడు అయింది. ఒకప్పుడు చాలా పొడవుకి ఉపమానంగా కొండవీటి చేంతాడుని చెప్పేవారు. మనిషి చక్రాన్ని కనిపెట్టడం యీ యుగానికే పెద్ద సాంకేతిక విప్లవం. అది బావి గిలక దాకా వర్తిస్తుంది. గిలకని కప్పీ అని కూడా అంటారు. కపిలబావి అనే మాట అందుమీంచి వచ్చిందే. గిలకతో నీళ్లు తోడడం వల్ల శ్రమశక్తి సగానికి పైగా తగ్గుతుంది.
 

జానపదంగా పుట్టి పాఠ్యపుస్తకాలకెక్కిన పాట – కలవారి కోడలూ కలికి కామాక్షి, కడుగుచున్నది పప్పు కడవలో పోసి, అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న, కాళ్లకీ నీళ్లిచ్చి కనీళ్ళు నింపె – అని కామాక్షి కథ నడుస్తుంది. ఇందులో మాటలు, సంవిధానం ఒకనాటి వుమ్మడి కుటుంబాలని కళ్లకు కడతాయి. ఆర్థిక సాంఘిక పరిస్థితులు మర్యాదలు మన్ననలూ సమస్తం తెలుస్తాయి. "రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగీ, మా అన్నలొచ్చారు మమ్మంపుతారా" అని భర్తని అడుగుతుంది కామాక్షి. రచ్చ అంటే రచ్చబండ. పల్లెల్లో అన్ని పంచాయితీలూ యిక్కడే జరిగేవి. తీర్పులూ యిక్కడే చెప్పేవారు. ఇక్కడ పదిమందీ కూడేవారు. అందుకే రచ్చకీడ్చారు, రచ్చ చెయ్యద్దు లాంటి ప్రయోగాలు వచ్చాయి. సాంఘికాలే కాదు జానపదులు తమకు తోచిన విధంగా భారత రామాయణాలని, ప్రచారంలో వున్న వీరగాథల్ని పాటలుగా కట్టి పాడుకునే వారు. మహామహాదేవుళ్లని, మహారాజుల్ని కూడా తమ స్థాయిలోనే వూహించి పాట కట్టేవారు. లేనిపోని వైభవాలు గాని, ఆడంబరాలుగాని వ్యక్తీకరణలో అలంకారాలు గాని వారికి తెలియదు. అందుకే జానపద సాహిత్యం ముడివజ్రంలా అతిసహజమైంది. సానలు పెట్టడం, నగల్లో పొదగడం ఆధునికుల నైజం.
 

కొలతలు, తూకాలు కాలక్రమంలో మారిపోయాయి. పూర్వం నాటు పద్ధతిలో వుండేవి. "ఎంతెంత దూరం? కోసెడు కోసెడు దూరం" యిది పిల్లల ఆటలపాట. కోసెడు అంటే సుమారు రెండు మైళ్లు. ఇప్పుడు మైలురాయి వాడుకలో వుందిగాని మైళ్లు లేవు. మీటర్లు కిలోమీటర్లు వచ్చాయి. తూకాల్లో కూడా తులం పలం సవాశేరు వీశకట్టు మణుగు వుండేవి. సవాపావు అంటే సవాశేరులో నాలుగో వంతు. "సవాలక్ష" అంటూంటారు. అంటే చాలామంది అని వుద్దేశం. వస్త్రాలని మూరలు, గజాలు, వీసాలు లెక్కన కొలిచేవారు. ఇప్పుడు డబ్బుతో సహా అన్నీ దశాంశ పద్ధతిలోకి వచ్చాక సర్వత్రా ఒకటే అమలవుతోంది. ఇప్పటికీ పాతకాలం వారు అణా బేడల్ని మర్చిపోలేక పోతున్నారు. మారిన పైసల్ని యింకా నయాపైసలనే పిలుస్తుంటారు.
 

మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందని సామెత. మొగసాల అంటే బహుశా మొగశాల మొగసాలగా రూపాంతరం చెందివుండవచ్చు. ఇంటిముందు విశాలమైన అరుగుకి కప్పుగా వుంటుంది. అది ఇంటి ప్రహరీలో భాగం. అది దాటితే ఇంటి సింహద్వారం. సరంబీ అంటే అటక. దీన్నే మచ్చు అని కూడా అంటారు. మచ్చు అంటే మరో మంచి మాట జ్ఞాపకం వచ్చింది – మంచె. పంట చేలల్లో అనువైన మూల మంచె కడతారు. ఎత్తుగా చిన్నపందిరిలా వేసి, దాని మీద నిలబడి పిట్టలని తోలుతుంటారు. "వడిసెల" అనే పరికరం వుంటుంది. అందులో చిన్న రాయి పెట్టి, గిరగిరా తిప్పి, ఒక కొస వదిల్తే అది దూరంగా వెళ్లి పడుతుంది. పంట చేల అందాలని, మంచె మీది వొయ్యారాన్ని, వడిసెల విన్యాసాల్ని వర్ణిస్తూ ఎందరో కవులు అందమైన పద్యాలు చెప్పారు. మంచెకి శృంగార ఛాయలు అద్దారు. పశువుల కొట్టం, గొడ్లసావడి, బందుల దొడ్డి యివన్నీ జనపదాలే. బందుల దొడ్డి అంటే పశువుల జైలు. పంటచేలో పడి మేస్తే, చేను యజమాని బందుల దొడ్లో పెట్టించేవాడు. దానికి ఫైన్ చెల్లించి విడిపించుకోవాలి. "గుదిబండ" యిప్పటికీ వాడుకలో వుంది. కొంచెం మాటవినని పశువులకి మెడలో ఒక కొయ్యదుంగని వేలాడ దీస్తారు. అది పరుగెత్తడానికి ఏమాత్రం వీలుండదు.
 

వాడికి కుదురు లేదు – అంటే నిలకడ లేదని. కుదురు అంటే పాలకుండని నిలపడానికి గుండ్రంగా అల్లిన చుట్ట. కడవ కుదురు, తల కుదురు యిలా ఎన్నో రకాలు. మజ్జిగ చిలకడానికి వెన్న తీయడానికి మనిషి కనిపెట్టిన చక్కని పరికరం నిలువు కవ్వం. దాన్ని ఒక గుంజకి కట్టి కవ్వపు తాడుతో చిలకడం. బహుశా క్షీరసాగర మథనం దీనికి స్ఫూర్తేమో. మంథర గిరిని కవ్వం చేసి, వాసుకిని తాడుగా చేసి దేవదానవులు చిలికారని కదా పురాణగాథ. చేట, జల్లెడ యిప్పటికీ వాడుకలో వున్నా వేరే పేర్లతో చెలామణీలో వున్నాయి.
 

సుప్రసిద్ధ పండితులు, పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి ఒక శిష్యునింటికి భోజనానికి వెళ్లారు. శిష్యుని తల్లి పెద్దావిడ, చక్కగా వండి వడ్డించింది. ఆయన ఎంతటి గొప్పవాడో కొడుకు పలుమార్లు చెప్పగా విన్నది తల్లి. ఆయన భోజనం ముగించి లేస్తుంటే, "బాబుగారూ, ఏదో నా చేతనైంది చేసి పెట్టా. నా వంట ఎట్లా వుందో ఏమో. ఇంతకీ వాసయోగ్యంగా వున్నదా" అని అడిగింది – మహానుభావుడిని చిన్న మాటల్లో అడిగితే బావుండదని. ఆయన హాయిగా నవ్వి, తేన్చి… "ఆహా, శ్రావ్యంగా వుందమ్మా" అన్నారట. ఎటూ వేటూరివారి మాట వచ్చింది కనక చెబుతున్నా. హింసించునది కాబట్టి హింసం అయి, అది సింహంగా రూపాంతరం చెందిందట. అలాగే తోక గలది తోకి. క్రమేపీ కోతిగా మారి స్థిరపడింది. ఇలాంటి శబ్దాల పుట్టుపూర్వోత్తరాలను వెలికితీసి సూత్రీకరించారు.
 

పల్లెటూళ్లలో సరదాలు, సరసాలు ఒకనాడు మానసిక వికాసానికి వినోదానికి ఉపయోగపడేవి. ఎంతటి కష్టాన్నైనా మరిపించి నవ్వించేవి. చతుర్లాడడం, మేలమాడడం నాడు పరిపాటి. ధనిక పేద, చిన్న పెద్ద తేడాలు పక్కనపెట్టి వరసలు కలిపి పిలుచుకోవడం ఒక సంప్రదాయం. అందులో ఒక ఆత్మీయత ఒక అభిమానం ధ్వనించేవి. ఉమ్మడి కుటుంబాలు అంతరించాక ఎన్నో పిలుపులు కొరవడ్డాయి. చిన్నాన్న, బాబాయ్, క్కక్కయ్య యీ మూడూ అర్థంలో ఒకటే. నాన్నని కొందరు బాబయ్య, కొందరు బాబు అని పిలవడం కద్దు. ఇప్పుడు డాడీ ఒక్కటే వినవస్తోంది. చిన్నమ్మ, పిన్ని, కక్కి యీ మూడూ అమ్మ చెల్లెలికి పిలుపులు. పెద్దమ్మ, ఆమ్మ, అమ్మక్క – యివి అమ్మ పెద తోబుట్టువు పిలుపులు. ఇప్పుడు అన్నిటికీ ఒకే మాట "కజిన్". బంగారి మామ పాటలో, "అవిశి పువ్వులు రెండు అందకున్నై నాకు తుంచి నా సిగలోన తురిమి పోదువు గాని రావోయి బంగారి మామ" ఈ బంగారి మామ పదాలను ఆస్వాదించాలంటే అవిశి పువ్వుల కథాకమామీషు తెలియాలి. తమలపాకు తీగెల్ని అవిశి చెట్లకు అల్లిస్తారు. అవిశి చాలా త్వరగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. తమలపాకు తోటలో రకరకాల పనులుంటాయి. పెరిగిన తీగెలకు అల్లు పెట్టడం, తయారైన ఆకుల్ని పదునైన ఇత్తడి గోళ్లు పెట్టుకుని గిల్లడం యివి పనితనంతో కూడిన పనులు. తమలపాకుల్లో కవిటాకు, లేతాకు, నౌజు యిలా దశల్ని బట్టి రకరకాలు. అవిశిపువ్వులు చిన్న చిన్న కొడవళ్లలా వొంపు తిరిగి తెల్లగా అందంగా వుంటాయి. తోటలో పని చేసే బంగారి మామని మరదలు అడుగుతోంది – అందని అవిశిపువ్వుల్ని తుంచి తన సిగలో తురవమని. ఈ తోటల వివరం తెలిస్తే గాని అవిశిపువ్వుల అంతరార్థం బోధపడదు. లేకుంటే అవిశిపూలు అసందర్భంగా తోస్తాయి.
 

జనపదాలు మరుగున పడ్డాక ఎన్నో సామెతల్ని అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. "ఈనగాచి నక్కలపాలు చేసినట్టు"… యిది సాధారణ సామెత. ఆవుని యీనే దాకా జాగ్రత్తగా కాపాడి, తర్వాత దూడని నక్కలపాలు చేశారని దీని అర్థం. ఈతకి వచ్చింది – యీ మాట పశువుకి పంట చేనుకి కూడా వర్తిస్తుంది. సామెతలు గ్రామీణ జన జీవితాల్లోంచి వచ్చాయి. సామెతలు జనపదాల్లో పుట్టి ప్రవహించిన పంట కాలవలు. "సాము గరిడీలు" అనే పెద్దన ప్రయోగం పదహారణాల జనపదం. కోడి పందాలు మన జానపద క్రీడ. కోడి పుంజుల్లో బెరస, నెమలి పేర్లతో పలుజాతులున్నాయి. కోడి పుంజుకి కాలు మధ్యన పొడవైన ఎముక వుంటుంది. దాన్ని "కాటా" అంటారు. కాటాకి కత్తి కడతారు. ఒడుపుగా అది పందెంలో అవతల పుంజుని కొట్టినపుడు కత్తి దెబ్బకి మెడ తెగిపడుతుంది. అట్లాగే ఎడ్ల పందాలు. ఇసక ప్రతిలో బరువు వేసిన బండిని అందులో లాగిస్తారు. దాన్ని "కావు" అంటారు. బరువైన బండని నేల మీద లాగించడం మరో రకం పందెం. ఎద్దు, గిత్త, కోడె వీటి మధ్య తేడా వుంది. కోడె దూడకి కోడెతనం రాగానే ముకుతాడు వేస్తారు. తర్వాత జతకలపడం ఒక పెద్ద పని. అంటే బండి లాగడం, నాగలి దున్నడం నేర్పుతారు. "కాడి బుజాన పడిందని" బాధ్యత తీసుకున్నప్పుడు వాడుతుంటారు. పెళ్లిలో నవదంపతుల బుజాన కాడి వుంచి, పాలు పోసే ఆచారం యిప్పటికీ కొన్ని చోట్ల వుంది.
 


జనపదంలో వెతకాలే గానీ లేని శిల్పం వుండదు. అద్భుతమైన ఉపమానాలుంటాయి. "మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన" అనే మాట ఎప్పటికైనా ఎక్కడైనా యిముడుతుంది. పూచిన తంగేడు, తామర తంపర, తామరాకుపై నీటి బొట్టు, అటుకులు చింతాకులు, పేలాలు బొండుమల్లెలు యిట్లా ప్రతిదానికీ వారి స్థాయిలో తగిన పోలికని ఎంచుకుంటారు. హనుమంతుడు రాముల వారిచ్చిన ఎర్రరాయి వుంగరాన్ని ఆనవాలుగా రొంటిన ధరించి లంకకి వెళ్తుంటే – "అగ్గెత్తుకెళ్తున్నట్లుంది" అని ఒక్క జానపదుడు మాత్రమే అనగలడు. లంకాదహనాన్ని ఎంత గొప్పగా స్ఫురింప చేశాడని ఆశ్చర్యం వేస్తుంది. "ఇంటెనుక ఇంగువ చెట్టు, ఎంత కోసినా గుప్పెడు కాదు" ఇదొక పొడుపు కథ. ఒక పదునైన abstract వూహ. దీన్ని పొడుపు కథగా పొడుస్తారు. పొడుపు కథలో పొడుపు – విడుపు వుంటాయి. ఇంటి వెనుక ఇంగువ చెట్టంటే పొగ. ఎంత కోసినా గుప్పెడు కాదు! ఇలాంటి శిల్పనైపుణ్యం వున్నవి వందల సంఖ్యలో దొరుకుతాయి. "అనగనగనగా…" అంటూ కథల్ని సుద్దుల్ని ప్రారంభించి, శ్రద్ధగా వింటున్నదానికి సంకేతంగా "ఊఁ" కొట్టించుకుంటూ కథ నడిపే సంప్రదాయం నేడు కరువైంది. "తప్ప తాలు తారం కరుగు ఎన్ని పోతే" అంటాడు రైతు. ధాన్యంలో తప్పతాలు తూర్పాతలో కొట్టుకు పోతాయి. ఖాళీగోతం అవతల వేసి తూచడాన్ని తారం అంటారు. దాళా అంటే ఒక సిబ్బె బరువు. కూరగాయల తూకంలో అయితే, కొసరు మొగ్గు వుంటాయి. "నల్లపూసలో పచ్చపూస లేదు" అంటే చిన్న బంగారంకూడా లేదని. "ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు" అంటే ఎవరికీ పిడికెడు బిచ్చం వెయ్యడని. "ఆ గొడ్డు మంచిదైతే ఆ వూళ్లోనే అమ్ముడయేది" సంతకి అమ్మకానికొచ్చిన పశువుల మీద యీ విసురు సర్వసాధారణం.
 


"దొరవలె వున్నాడు భద్రాద్రి రాముడితడేనేమో చూడు" అనే తూము నరసింహదాసు కీర్తన చాలా ఠీవిగా వుంటుంది. దొర, దొరవారు, దొరసాని బ్రిటిష్ పాలనలో పుట్టిన మాటలు. మనవి రాచరికాలే గాని దొరతనాలు కావు. బడిలో పలకబలపం తియ్యకుండా కూచుంటే, అయ్యవారు – "ఏరా మన్నెదొరలా కూచున్నావ్.. తీ పలకతీ!" అనేవారు. మన్నెదొర మన్యం దొరలోంచి వచ్చిన మాట. అల్లూరి సీతారామరాజు పోరాడిన రంపచోడవరం ప్రాంతాన్ని మన్యం అంటారు. ఏజెన్సీ అన్నమాట. ఆనాడు అక్కడి దొరల గురించి, దర్పం గురించి బోలెడు కథలు ప్రచారంలో వుండేవి. అక్కడ నించి వాడుకలోకి వచ్చిన మాట ఈ మన్నెదొర. అయివేజు అంటే ఆదాయం. పంట మీద రావాల్సిన ఫలసాయం. కిస్తీ అంటే వాయిదా (ఇన్‌స్టాల్‌మెంటు). శిస్తు అంటే కౌలు డబ్బు. రెవిన్యూ శాఖకి పంటభూమికి చెల్లించే మొత్తాన్ని కూడా శిస్తు అంటారు. దీనికి నీటి తీరువా, మురికి నీటి పన్ను కలుస్తాయి. "సరికిసరి" అనే మాట కొంతకాలం పల్లెల్లో ఎక్కువ వినిపించేది. ఇది బార్టర్ పద్ధతిలో వాడతారు. ధాన్యానికి ఉప్పు సరికి సరి. నూకలకి రెండు సర్లు. అంటే మానెడుకి మానెడిస్తే సరికి సరి. రెండిస్తే రెండు సర్లు.వెచ్చాలికి ధాన్యం బియ్యం తీసుకోవడం, తిరిగి వాటిని సరుకులకి పరటా వేయడం కొంతకాలం క్రితం వరకూ పల్లెల్లో అమల్లో వుంది.
 


కోడు, కుంట, దొరువు యిప్పుడు వినిపించని మాటలు. ఇసక ప్రాంతాల్లో, చాలా పైనే నీళ్లుండే చోట దొరువులు తవ్వుతారు. వాటి చుట్టూ ఆకు కూరలు, కనకాంబరం మల్లె లాంటి పూల మొక్కలు తోటకి నీళు జల్లుతారు. కుంట అంటే మెట్ట ప్రాంతాల్లో పశువులు నీళ్లు తాగడానికి ఒక మూల పెద్ద గుంట తవ్వుతారు. ఇవి నారుమళ్లకి కూడా ఉపయోగపడతాయి. కొన్ని చోట్ల నారుమళ్లని ఆకుమళ్ళంటారు. ఇక కోడు అంటే వూర చెరువుని ఆనుకుని వుండే చిన్న చెరువు. టెయిలెండ్ రిజర్వాయర్ లాంటిది. వర్షాలతో చెరువు పొంగి పొర్లినపుడు, అదనపు నీటిని కోడు భరిస్తుంది. చెరువులో చేపలు సద్దుకి వూరి మీద పడకుండా కోడులోకి చేరతాయి. నీరు తీశాక తిరికి కోడు నీరు చెరువులోకి చేపలతో సహా వెళ్తాయి. నీటి పరిరక్షణ, పెత్తనం మీద ఆనాటి గ్రామీణ ప్రజానీకానికి గల పట్టు చాలా గట్టిది. కొన్ని మాటలు, భావజాలం అంతరించడం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు అదే జరిగింది. విశాలమైన డొంకలు, వాటి మీద పచ్చగడ్డితోబాటు రకరకాల కలుపు మొక్కలు పెరిగేవి. వాటిలో ఔషద గుణాలన్న కలుపు వుండేది. పశువులు గడ్డితోపాటు వాటిని మేసినపుడు ఆరోగ్యాన్ని కాపాడేవి. పచ్చిగడ్డిని  కూడా పంటలా పెంచడం వచ్చాక, వాటికి కూడా రసాయనాలను వాడుతున్నారు. దీంతో మంచి చేసే కలుపు మొక్కలు పోతున్నాయి. ఈ భూమ్మీదికి ప్రతి జీవి, ప్రతి ప్రాణి ఏదో ఒక ఉపయోగంతోనే వచ్చిందని గ్రహించాలి. చిన్న చిన్న పురుగులు, సీతాకోక చిలకలు క్రిమిసంహారకాల వల్ల గణనీయంగా తగ్గిపోయాయి. దాని వల్ల పరపరాగ సంపర్కం క్షీణించి ముఖ్యంగా కూరగాయల దిగుమతులు పడిపోయాయని నిన్నమొన్నటి పరిశీలనలో వెల్లడైంది.
 


అక్షరాలకు కొమ్ములుంటాయి. పశువులకి కొమ్ములుంటాయి. అలాగే పసుపుకొమ్ము అల్లపుకొమ్ము శొంఠికొమ్ము వున్నాయి. పసుపు నేలలో వూరుతుంది. ఇది చేతి వేళ్లలాగా వూరుతుంది. వేళ్లులా విస్తరించిన వాటిని చిల్లలు అంటారు. చిన్న కుండ పెంకుని కూడా చిల్ల పెంకు అంటారు. భాష మారిపోయిందని కొందరు, మాయమైపోయిందని కొందరు ఆందోళన పడుతున్నారు. దొరలపాలనలో కంటె ప్రపంచీకరణ తరువాత భాషకి ఎక్కువ నష్టం కలిగింది. ఒక్క తెలుగే కాదు, చాలా స్థానిక భాషలకి యీ నష్టం జరిగింది. కారణం పరభాషా ప్రయోగం, దాని అవసరం. ఏది కూడు పెడుతుందో దానివైపు పరుగులు తీయడం నైజం కదా. అదే జరిగింది. చాలాకాలం క్రితం బతకడానికి రంగం వెళ్ళేవాళ్ళు. చదువు సంధ్యలతో పని లేదు. అక్కడ రకరకాల పనులు చేసుకు బతికేవారు. రంగూన్‌ని ఆ రోజుల్లో పల్లె ప్రజలు రంగం అనేవారు. తర్వాత కొయిటాం వచ్చింది. అంటే కువైట్. ఇప్పుడు ఎన్నో దేశాలు దగ్గరైపోయాయి. చాలా ఏళ్ల క్రితం ఒక పెద్ద మనిషి "ఎస్పిరాంటో" అని ఒక ప్రపంచభాషకి శ్రీకారం చుట్టాడు. కాని అది ఏమాత్రం వ్యాప్తిలోకి రాలేదు. తిండి అలవాట్ల నించి మారిపోయిన మాట నిజం. నగరంలో, కాంక్రీట్ జంగిల్‌లో వుండే కాకికి పుల్లలు దొరకవు. చెట్లుండవు. అందుకే అది సైకిల్‌స్పోక్స్‌ని, కరెంట్‌వైర్ ముక్కల్ని, సన్నటి తీగెల్ని ముక్కున కరుచుకు తెచ్చి, కరెంటు స్తంభం మీద గూడు కట్టుకోవడం మనం చూడొచ్చు. మన కోసం సంప్రదాయమా? సంఫ్రదాయం కోసం మనమా? తెలుగువాడి పంచె లాల్చీ వుత్తరీయం ఎక్కడ? తెలుగు తల్లుల జరీ చీరెల మెరుపులెక్కడ? తెలుగు పిల్లల పట్టుపావడాలు ఓణీలు ఎక్కడ? వీటి కోసం ఎంతని వెదుకుదాం ఎక్కడని వెతుకుతాం? కాలం కనిపించని ఒక మహా ప్రవాహం. అందులో మనమంతా బుడగలం.
 


(ఈ వ్యాసం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి, ఆగస్ట్ 2010 లో మొదలై పన్నెండు వారాల పాటు ప్రతీ గురువారం ప్రసారమైన "మన తెలుగు" ప్రసంగ వ్యాసపరంపరలో భాగం.)

Posted in వ్యాసం | 32 Comments

ఒక రోజు గడవడం

౧.ఎప్పటిలాగే  ఉదయం:
 
నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా తారుమారవుతాయో ఆలోచిస్తూ ఉండగనే
చేజారి భళ్ళున ఎక్కడో బద్దలవుతుంది
ఊపిరి వెన్నులో గడ్డకట్టి
తీగలు తెగిపోతూ మిగిలిన శబ్ధ స్తంభన ఒక్కటే 
ఇక దేహమంతా ప్రేమలు లేవు
 
లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల
ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు
సున్నితమైనవన్నీ ఒక్కొక్కటీ
రెక్కలు విరిగి –
 
ఈ క్షణం ఇది  మూలాల కుదుళ్ళను
తలకిందులు చేసి సుడివేగంతో ఎక్కడికో విసిరివేసే పెను ఉప్పెన
మనుషులు ఎందుకింత యాతన పడాలో
ఈ శాపాన్ని తలదాల్చి ఎన్నాళ్ళు ఇలా మోయాలో
 
౨.పగటి పూట:
 
ఈ దారులకు అలవాటయిన పాదాలు
ఎక్కడికెక్కడికో కొనిపోతూ 
 
నువ్వు నడుస్తున్నప్పుడు ఎచటికో తెలియని నీ పయనాన్నీ నిన్నూ
అన్నీ తెలిసిన ఒక తల్లి, బిడ్డను తన  చేతులలోకి సుతారంగా తీసుకున్నట్టుగా 
తన లోనికి, తన శరీరంలో శరీరంగా తనలోనికి తీసుకొని దారులన్నీ నీతో నడుస్తూ ఉన్నప్పుడు –
కాసేపు నువ్వు 
 
వెక్కివెక్కి ఏడ్చే చంటి బిడ్డవు. 
తెలియని దన్ను ఏదో  ఒక ఎరుకగా
నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు
నువ్వే ఒక ఓదార్పు మాటవు. 
 
నీ చుట్టూ నువ్వే అనేక యుద్ధాలను అల్లుతూ,
ఉన్నవి  నీకు రెండు చేతులేనని  సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ,
అలసీ, నీ పైన నువ్వే గురి చూసుకొనే నిర్ధాక్షణ్యతవు
 
౩.రాత్రి:
 
ఉన్నది ఇక కేవలం అలసట
గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-
నెత్తురు కరుడు కట్టి కొసలపై తడి ఆరని రాతి ఆయుధాల చీకటి కారడివి-
 
ఏ యుగమో తెలియదు
ఈ రాతిరికిక ఈ ఆదిమ మానవుడు నిదురించాలి
Posted in కవిత్వం | 3 Comments

గ్రహాంతరవాసి

పనికిరాని వాడు పాదాలు కడిగాడని,
అపవిత్రమయ్యాననుకుంటుందా..పుణ్య నది?
పాదరక్షలు లేవని పశుగణాన్ని బాధిస్తుందా పుడమి తల్లి?
ఈ గాలికి రిజర్వేషన్ కోటలు లేవెందుకనీ?


నీ కాస్వాదించడం రాకపోయినా…
ఈ పూలు నవ్వుతూనే వుంటాయి.
కొండపైనా భూమిపైనా ఒకేలా కురిసే వర్షాన్ని- గొడుగు పట్టి మళ్ళించగలవూ!?


శాస్త్రజ్ఞాన కలశాలను నలుదిక్కులా పరిచినా..
తూర్పున మాత్రమే ఉదయించే సూర్యుడిలా
ఒకప్పటి నువ్వునూ
బహుశా అప్పుడు ‘జ్ఞానం’ వొచ్చి వుండదు.
సైన్సొచ్చి హృదయంలోని సత్యపు ఈక్వేషన్లు మార్చిందా?


నిన్ను బట్టి నీమనషులు కానీ
మనిషిని బట్టి మానత్వం కాదు.


ఎప్పటిమాట ?
స్పందన లేని గుండె
గుండె లేని మనిషీ
వుండవని..
 

ఇప్పటి ప్రశ్నో?
మనిషి జాడల్లేని మనసు అడుగులు
ఏ గ్రహాంతరవాసివని

Posted in కవిత్వం | Comments Off on గ్రహాంతరవాసి

“శుద్ధ సాహిత్యం” శుద్ధ అబద్ధం – 5

తొలినాళ్లలో ఇతర భాషల సాహిత్యంతో మీ పరిచయాన్ని గురించి చెప్పగలరా?


ప్రాచీన తెలుగు సాహిత్య నేపథ్యం నించి వచ్చిన వాణ్ణి కావడం వల్ల మిగిలిన భాషల్లో కూడా ప్రాచీన కావ్యాలు చదవాలన్న ఆసక్తితో నేను ఇతర భాషల వైపు మళ్ళాను. సాంప్రదాయాలు ఎలా వికసించాయో అర్ధమయితే తప్ప, ప్రయోగాల పరిణామం అర్థం కాదనుకుంటా. ఎక్కువ వచన కవిత్వమే రాసినా,  ఇప్పటికీ పద్య సాహిత్యం అంటేనే ప్రాణం.  ఛందస్సులతో ఆడుకోవడం మొదటి నించీ  సరదాగా వుండేది. కానీ, కాల క్రమేణా వేరే భాషల సాహిత్యం వైపు మళ్లడం వల్ల పద్య రచనకి వ్యవధి లేకుండా పోయింది. ఉర్దూ హిందీ కవిత్వాలు మొదటి నించి చదివే అలవాటు వుండేది.  ఇంగ్లీష్ లో పొయెట్రీ రెవ్యూ, పారిస్ రెవ్యూ,  హిందీలో “సరిత” “సారిక” సాప్తాహిక్ హిందూస్తాన్” “ధర్మయుగ్” పత్రికలు క్రమం తప్పక చదివే వాణ్ని. (ఆంధ్ర జ్యోతిలో పని చేసినప్పుడు  ఈ “పారిస్ రెవ్యూ” నమూనాలో   కొన్ని సాహిత్య శీర్షికలు చేశాను. ముఖ్యంగా అప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలు అన్నీ పారిస్ రెవ్యూ నమూనాలో చేసినవే. మంచి వచన రచయిత కావాలన్న అభిలాష వున్న వాళ్ళు తప్పక చదవాల్సిన పత్రిక ఇది. పైగా, ఈ మధ్య ఇందులో భారతీయ రచయితలు ఎక్కువగా కనిపిస్తున్నారు కూడా.) ఇంగ్లీషు, హిందీ వచనం వైపు ఎక్కువ ఆసక్తి వుండేది. కానీ,  షెల్లీ నించి ఎలియట్ దాకా రోజుకో కవిత బట్టీ కొట్టే వాణ్ని. భర్తృహరి అంటే విపరీతమయిన ఇష్టం. కవిత్వంలో భావ తీవ్రతకీ, ఆలోచనా సాంద్రతకీ, సౌందర్య భావనకీ మధ్య  సమతౌల్యం అనేది వుండాలనుకుంటే, అది భర్తృహరి కవిత్వంలో చూడవచ్చు. ఆ ప్రభావం వల్ల సంస్కృత సాహిత్యం వైపు మళ్ళాను. దేవనాగరి బాగా అలవాటు కావడం వల్ల ఇతర సంస్కృత కావ్యాలు చదవడం తేలిక అయ్యింది. ఆ తరవాత పుల్లెల వారి పుణ్యమా అని శాస్త్ర పరిచయమూ కలిగింది.

క్లాసిక్స్ మీద ఇప్పుడు మనవాళ్ళు కొందరికి కొంత చిన్న చూపు వున్నట్టుంది కదా?!


కొంచెం కాదు, ఎక్కువే వుంది. కుందుర్తి లాంటి కవులు వచన కవిత్వాన్ని ఒక ఉద్యమం చేసే తాపత్రయంలో క్లాసిక్స్ మీద వైముఖ్యాన్ని పెంచారు. నేను ఈ యేడాది నా ఇండియన్ పొయెట్రీ కోర్సులో మహాభారతం స్త్రీ పర్వంతో పాటు కొన్ని క్లాసిక్స్ ఇంగ్లీషు అనువాదాలలో పరిచయం చేశాను. విద్యార్థులకి అవి ఎంత నచ్చాయో చెప్పలేను. స్త్రీ పర్వం అంతా అత్యాధునిక వచన కావ్యం. క్లాసిక్స్ – అవి తెలుగు కావచ్చు, ఇంగ్లీషు కావచ్చు- చదివి తీరాలి. సంస్కృతం చదవగలిగితే మరీ మంచిది. తెలుగు ఇంగ్లీషు కాక ఇంకో భారతీయ భాషలో  ప్రవేశం వుండడం వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా అస్తిత్వ చైతన్యాల గురించి మాట్లాడుతున్న రచయితలూ, కవులూ ఇతర భారతీయ భాషల్లో కొంచమయినా ప్రవేశం సంపాదిస్తే బాగుంటుంది. లేకపోతే, మనం బావిలో కప్పల్లాగా వుంటాం. ఉర్దూ, హిందీల లో సాహిత్య విమర్శలో జరుగుతున్న కృషి చూస్తూంటే, మనం ఆ స్థాయిని  ఎప్పుడయినా అందుకోగలమా అనిపిస్తుంది. మనకి పరమత సహనంతో పాటు, పర భాషా సహనం కూడా నెమ్మదిగా పోతోందన్న భయం వుంది నాకు.

ఇతర భాషా సాహిత్యాలతో , సాహితీకారులతో పరిచయాల్లో మీరు తెలుసుకున్నవి చెప్పగలరా?

నా దృష్టి ప్రధానంగా ఇంగ్లీష్ కవిత్వం మీద వుండేది. నెమ్మదిగా నేను హిందీ, ఉర్దూ వైపు మళ్ళాను. హిందీలోనూ, భారతీయ ఇంగ్లీషులోనూ కవిత్వం రాసే వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసే వాణ్ని. (ఉత్తరాలు బాగా రాసే వాణ్ణి, ఇప్పుడు “ఈ-లేఖా”యుగంలో ఉత్తరాల రచనకి దూరమయ్యాను.)   వీటన్నిటికీ మించి పసుపులేటి పూర్ణచంద్రరావుగారి వల్ల  ఖమ్మంలో ఫిల్మ్ సోసైటీ మొదలవ్వడంతో అంతర్జాతీయ కళలూ, సాహిత్యం వైపు కాస్త దృష్టి మళ్ళింది . ఆ సినిమాల వల్ల మంచి సాహిత్య అధ్యయనానికి అవకాశం దొరికింది.  మిగిలిన భాషల వచన సాహిత్యం చదివే కొద్దీ, సినిమాలు చూసే కొద్దీ మన కథల విస్తృతి తక్కువ అనిపిస్తుంది. మన అనుభవాల లోతు తక్కువ అని అర్ధమవుతుంది. మన అధ్యయనంలో పెద్ద లోపం వుందని తేలిపోతుంది. నిర్దిష్టంగా మాట్లాడడం, స్థానిక సంస్కృతుల మీద ఆసక్తి పెంచుకోవడం మిగిలిన అన్ని భాషలలో దాదాపూ జరుగుతోంది.  అట్లా అని తెలుగులో ఏమీ లేదన్న నైరాశ్యం నాకు లేదు. ప్రపంచ పటం మీద అది నిలబడదని చెప్పడమే! ఇప్పుడు వస్తున్న దళిత, ముస్లిం, తెలంగాణ, సీమ, స్థానిక సాహిత్యాల వల్ల ఆ లోపం కొంత పోవచ్చు.

మీకు చిన్నప్పటి నించీ ఇంగ్లీష్ మీద ఇష్టం ఎందుకు కలిగింది?


ఇంగ్లీషు మాత్రమే కాదు, హిందీ ఉర్దు అన్నా నాకు మహా ఇష్టమే! కానీ,  ఇంగ్లీషు మీద ఇష్టం ఇంగ్లీషుతో మొదలవ్వ లేదు.  ముందు ఐస్ క్రీముల మీద ఇష్టం! తొమ్మిదో తరగతిలో వుండగా క్రిస్టియన్ మిషనరీలో పని చేసే ఒక ఆస్ట్రేలియన్  యువతి నా దగ్గిర తెలుగు, ఉర్దూ నేర్చుకునేది. ఆమెకి కనీసం రెండేళ్ళు నేను పాఠాలు చెప్పాను.  ఆ మాటకొస్తే, ఆమె నించి నేనే ఎక్కువ నేర్చుకున్నాను. ప్రతివారం ఆమె నాకు ఇంగ్లీష్ నవలలు, కవిత్వం చదివి వినిపించేది. ఆమె కవిత్వం బాగా చదివేది. చదవడం అంటే పైకి! “కవిత్వమే కాదు, నువ్వేం రాసినా అది  పైకి చదువుకో. అది ఎడిటింగ్ లో భాగం. వొక మంచి అనుభవం” అని చెప్పేది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె ప్రతి ఆదివారం అనేక రకాల ఐస్ క్రీములు, కేకులు  తయారు చేసేది.  నాకు ఐస్ క్రీమ్ అంటే చచ్చేంత ఇష్టం, కానీ అంత ఖరీదయిన తిండి కొనే శక్తి ఆ రోజుల్లో లేదు కాబట్టి, ఆదివారం రాగానే ఆమె ఇంటికి పరుగు తీసే వాణ్ణి.  అలా ఐస్ క్రీమ్ నించి ఇంగ్లీషులోకి వచ్చానన్న మాట. ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత మిగిలిందో చెప్పలేను కానీ, ఇప్పటికీ ఐస్ క్రీములు అంటే ఇష్టం మిగిలిపోయింది.

ఆమె నాతో మొదటి సారి బైబిల్ అంతా  చదివించింది. బైబిల్ చదవడం గొప్ప కనువిప్పు. (ప్రపంచ సాహిత్యం చదవాలనుకుంటే ముందు బైబిల్, ఖురాన్ చదివి తీరాలంటాను.) నా కోసం కలకత్తా నించి పొయెట్రీ వర్క్ షాపు కవిత్వం పుస్తకాలు తెప్పించింది. ఈ మధ్య కన్ను మూసిన పి.లాల్ ఆ పుస్తకాలు వేసే వారు. క్లాత్ బైండింగ్ లో చాలా అందంగా వుండేవి ఆ పుస్తకాలు. “ఇంగ్లీషు పరాయీ భాష కాదు, అది మన భాష” అన్న పి.లాల్ మాట నాకు బాగా నచ్చింది. కమలాదాస్, రామానుజన్, నిస్సిమ్ ఏజెకీల్ ఇలా చాలా మంది కవిత్వం అలా చదివాను. అదే సమయంలో నేను అనుకోకుండా వొక సారి బెజవాడ వెళ్ళడం, అక్కడ ప్రబోధ బుక్ సెంటర్ కి వెళ్ళడం జరిగాయి. గాంధీ నగర్ లో విశాలమయిన ఆవరణలో, పెద్ద పెద్ద చెట్ల మధ్య వొక అందమయిన బుక్ స్టోర్ అది (ఇప్పుడు వుందా?!) ఎనిమిదో తరగతి ఎండా కాలం సెలవుల నించి నేను ఖమ్మం నించి పని కట్టుకుని వెళ్ళి  వొక వారం పది రోజులు బెజవాడలో వుండి, రోజూ అక్కడికి వెళ్ళి చదువుకునే వాణ్ని. పుస్తకం కొనకుండా అక్కడే కూర్చొని చదువుకునే సౌకర్యం అక్కడ వుండేది. ఆ బుక్ స్టోర్  వాతావరణం కూడా  ఇంగ్లీషు సాహిత్యం మీద ఇంకా అభిరుచిని పెంచింది. ఆ తరవాత ఇంగ్లీషు సాహిత్య అధ్యయనం అనేది జీవితంలో ముఖ్య భాగం అయ్యింది.

ఇతర భాషా సాహిత్యాల నించి గమనించిన ఆసక్తికర అంశాలు, తేడాలు, పోలికలూ మీరు సాహిత్య మిత్రులతో మాట్లాడుకుంటున్నప్పుడు దొర్లినవి…


మిగిలిన భాషా సంస్కృతుల వాళ్ళు సాహిత్యాన్ని గురించి ఎట్లా మాట్లాడతారన్నది నాకు ఎప్పుడూ ఆసక్తికరమయిన ప్రశ్న. ఆ క్రిస్టియన్ నన్ ఏదయినా చదవగానే, నేను వెంటనే రక రకాల ప్రశ్నలు వేసే వాణ్ణి. ఆ అలవాటు వల్ల సంభాషణలు దీర్ఘ కాలం సాగేవి.  ఇండియాలో వుండగా కాస్త కవిగా గుర్తింపు వచ్చాక,  కేంద్ర సాహిత్య అకాడెమీ అప్పుడప్పుడూ నన్ను వివిధ సదస్సులకి ఆహ్వానించేది. ఆ సదస్సులకి వెళ్లినప్పుడు అనేక భాషల రచయితలనీ కలిసే వీలు దొరికేది. పైగా, హైదరబాద్‌లో అప్పుడు అమెరికన్ రెసెర్చ్ సెంటర్ ఎప్పుడూ సదస్సులు నిర్వహించేది. ఇలా కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసి వచ్చాయి.

ఇక అమెరికా వచ్చాక, అలాంటి అవకాశాలు కొన్ని వాటికవే వస్తే, కొన్ని అవకాశాలు నేను కల్పించుకున్నాను. మాడిసన్ లో రక రకాల రీడింగ్ గ్రూపులు నడిపాం. పొయెట్రీ మీట్స్‌కి వెళ్ళే వాణ్ణి. అమెరికన్ కవులు అంత తేలికగా మనల్ని కలుపుకోరన్నది నిజం, కానీ- స్నేహ బలం వల్ల నేను అలాంటి అవరోధాలు దాటగలిగాను. ఇప్పుడు  వాళ్ళే నన్ను పొయెట్రీ రీడింగ్స్ కి పిలుస్తున్నారు. నాకు ఢిల్లీ నించి మాడిసన్ దాకా వొక్కటే ప్రశ్న: వాళ్ళు సాహిత్యాన్ని చదివే/అర్ధం చేసుకునే పద్ధతులు భిన్నంగా వుంటాయా? వుంటే ఆ భిన్నత్వం ఎక్కడ?

మాడిసన్ లో వుండగా, మేము ఆఫ్రికన్ సాహిత్యం మీద ప్రతి ఏడాది వొక మూడు రోజుల సదస్సు నిర్వహించే వాళ్ళం. అప్పుడు గూగి తో సహా చాలా మంది ఆఫ్రికన్ రచయితలూ కవులతో కలిసి పని చేసే అవకాశం దొరికింది. గూగి రచనలు ఇంకా తెలుగులో రావాల్సిన అవసరం వుంది. అలాగే, అల్జీరియా స్త్రీవాద రచయితల రచనలు కూడా తెలుగులో రావాల్సిన అవసరం వుంది. ఆ అనువాద సాంప్రదాయం బలపడితే తప్ప మన గుడ్డి తనం మనకి తెలీదు. ఇప్పటికీ మెల్లకన్ను ప్రేయసి మీదనే పద్యాలు రాసే వాళ్ళు వుండడం మన దౌర్భాగ్యమే. ఆకుపచ్చ చెట్ల మీద రాసే వాళ్ళు, ఆ పచ్చదనం పోతోందన్న స్పృహ లేకుండా రాయడమూ ఒక సాహిత్య విషాదమే. రాజకీయ చైతన్యం  లేకపోవడం మనలో ప్రధాన లోపం. సాహిత్యం, మతం, రాజకీయాలు మూడూ వొక దానికి వొకటి ముడి పడి వున్న విషయాలు. కాకపోతే, వాటి పరిమితులు గుర్తెరిగి మనం సాహిత్య సృష్టి చెయ్యాలి.

ఇటీవలి కాలంలో నేను ఎక్కువగా ఆఫ్రికన్ సాహిత్యం చదువుతున్నా. ముస్లిం దేశాల నించి వచ్చే సాహిత్యం కాస్త పనికట్టుకొని చదువుతున్నా. మన దళిత, ముస్లిం సాహిత్యాలు, స్త్రీ వాదులు ఇతర భాషల నించి నేర్చుకోవాల్సింది చాలా వుంది. ముఖ్యంగా సాహిత్యంలో రాజకీయ అంశాల్ని ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. కానీ, మన వాళ్ళకి సాహిత్య రాజకీయాలు చెయ్యడం బాగా తెలుసు కానీ, నిజమయిన రాజకీయ సాహిత్యం రాయడం చాత కాదు. నినాదాలు రాసినంత మాత్రాన్న రాజకీయ సాహిత్యం కాదు. తెలుగులో  అతి కొద్ది మందికి మాత్రమే ఈ రాజకీయ సాహిత్యం మీద సరయిన ఆలోచన వుంది.

మిత్ర బృందం, సాహిత్య చర్చలూ?!


తొలినాళ్లలో చుట్టూ అంతా ఏకాకి నౌక చప్పుడే! ఇంటర్ దాకా కూడా నా విప్లవ రాజకీయాలలో వున్న కొద్ది మంది కూడా ఎక్కువ తెలుగు సాహిత్యం, అదీ విప్లవ సాహిత్యం చదివే వాళ్ళు.  అందులోనూ పాటలే ఎక్కువ! రాజకీయాలలో భాగంగా పాటలు రాయడం, దానికి సంబంధించిన చర్చలే ఎక్కువ. నాకు నేనొక ద్వీపంలో వుంటున్నట్టుగా వుండేది. నవల, కథ, వచన కవిత్వం గురించి మాట్లాడ్డం మొదలెడితే, “అన్నా, నువ్వు పాటలే ఎక్కువ రాయే… నీ పాటలు బాగుంటాయే…” అనే వాళ్ళు. అలా చాలా శక్తి పాటల్లోకి వెళ్లిపోయింది. అవేవీ ఇప్పుడు గుర్తు కూడా లేవు, అది వేరే సంగతి! కానీ, ఇప్పటికీ ఖమ్మం వెళ్తే, అక్కడి విప్లవ మిత్రులు ఆ పాటల పంక్తులు గుర్తు చేస్తారు. డిగ్రీలో వుండగా కొంత మంది గాయక మిత్రుల కోసం కొన్ని పాటలు రాశాను కానీ, నాకు పాటల మీద పెద్ద ఆసక్తి వుండేది కాదు.  అమెరికన్ రెసెర్చ్ సెంటర్ లో  జరిగే సమావేశాలకి, సెమినార్లకి వెళ్ళడం నాకు బాగా లాభించింది. ప్రపంచ సాహిత్యం ఎటు పోతోందో  కొంతలో కొంత అయినా అర్ధమయింది అక్కడే! అయితే, అమెరికా వచ్చాక నా మిత్ర బృందం పెరిగింది. అనేక భాషల వాళ్ళతో కలిసే అవకాశం దొరికింది. వాళ్ళ నించి నేర్చుకునే వీలు దొరికింది. టెక్సాస్ యూనివర్సిటీ లో ప్రగతి శీల ధోరణి ఎక్కువ. అనేక జాతుల కూడలి ఇది. ఆ విధంగా మాడిసన్ కంటే ఇక్కడ నేను ఎక్కువ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే వీలు దొరుకుతోంది. అలాగే, టెక్సాస్ తెలుగు వాళ్ళలో కూడా సాహిత్య సాంస్కృతిక చైతన్యం ఎక్కువ. ఇవన్నీ మంచి చర్చా బృందాలు. కొత్త విషయాలు మాట్లాడాలన్న ఆసక్తి, నేర్చుకోవాలన్న శ్రద్ధా వున్న బృందాలు.

తెలుగు కవిత్వంలో లేనివి ఇతర భాషల్లో ఉన్నవీ కొన్ని మంచి విషయాలు … అలాగే తెలుగుకవిత్వంలో వున్నవీ ఇతరభాషల్లో లేనివిషయాలు మీరేమైనా గమనించారా?


మిగిలిన భాషల్లో వచన సాహిత్యం బాగా వస్తోంది. మిగిలిన సాహిత్య ప్రక్రియల కన్నా, ఇప్పటికీ మన వచన కవిత్వం బలంగా వుంది. అందులో అనుమానం లేదు. కానీ,  వచనం బలపడనంత కాలం  మన సాహిత్యానికి వెలుగు లేదు. సాహిత్యం పరిణతి సాధించాలంటే వచన ప్రక్రియలు బాగు పడాలి. అన్నిటికీ సమాధానాలు దొరికిపోయాయన్న తృప్తీతో మనం ఆగిపోతున్నాం. “అన్నీ ప్రశ్నలే మాకు…అన్నీ ప్రశ్నలే మాకు.” అన్న అలజడి పెరగాలి. అప్పుడు వెతుకులాట మొదలవుతుంది. 50లలో , 70లలో రచయితల్లో ఆ వెతుకులాట వుండేది. ఆ కాలంలో వచ్చినంత వచనం తెలుగులో మరెప్పుడూ రాలేదు. ఇప్పుడు అంత వచనం లేదు. అనువాదాలు పెరిగితే మనం ఎక్కడున్నామో, ఎటు వెళ్ళాలో తెలుస్తుంది. అస్తిత్వ చైతన్యం గురించి మన ఆలోచనలు ఇంకా సూటిగా వుండాలి. ఇప్పటికీ శుద్ధ మానవతా వాదం, శుద్ధ కవిత్వం గురించి మాట్లాడే వాళ్ళని చూస్తే జాలేస్తోంది. ప్రపంచ సాహిత్యం ఎంతో కొంత చదివే తెలుగు వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడడం అన్యాయం.


ఇక తెలుగులో వున్నవీ, ఇతర భాషల్లో లేనివి….అంటారా? అది చెప్పడం అంత తేలిక కాదు. ఆ భాషల గురించి నాకు వున్న పరిచయం సరిపోదు. కానీ, literary activism అనేది తెలుగులో ఎక్కువ అనుకుంటాను. శతక కవులూ, గురజాడ నించీ ఇది వున్నా, ఇటీవల స్త్రీ, దళిత, ముస్లిం వాదాల వల్ల ఎక్కువ సాధ్యమయింది. సాహిత్యానికీ, బయటి జీవితానికీ, ఉద్యమాలకూ మనం ఇస్తున్న ప్రాధాన్యం మనల్ని కొంత భిన్నంగా నిలబెడుతుంది.

అమెరికా లో సెటిలయిపోయాక ఇండియా ఎలా కనపడుతోంది? అక్కడి నుంచిచూస్తే, ఇంకా అక్కడి తెలుగు వాళ్ళు రాస్తున్న నాస్టాల్జిక్ కవిత్వం సంగతులపై మీ భావనలేమిటి?


ముందు  ఒక సవరణ. అమెరికాలో నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, అవుతానో లేదో తెలియదు. నాకు ఆ సెటిల్మెంట్ అనే విషయం మీద అంత పట్టింపు లేదు. నాది జంగమ మార్గం.  అదలా వుంచితే,   ఏ విషయమయినా సరిగా అర్ధం చేసుకోవడానికి కొంత objectivity, పరిస్తితులకి కొంత ఎడంగా ఆలోచించే శక్తీ కావాలి. నా సాహిత్యం కోర్సులలో పఠనానుభవం గురించి నేను ఎప్పుడూ వొక ఉదాహరణ ఇస్తాను. చిత్రకారుడు బొమ్మ వేస్తున్నప్పుడు అప్పుడప్పుడూ వొక అడుగు వెనక్కి వేసి,  కుంచె పక్కన పడేసి, ఆ బొమ్మ వైపు సాలోచనగా చూస్తాడు. సవిమర్శగా చూస్తాడు. ఆ తరవాత మళ్ళీ కుంచె పట్టుకుని బొమ్మ వేయడంలో నిమగ్నమవుతాడు. తను పుట్టిన గడ్డకి దూరంగా వచ్చిన ప్రతి వ్యక్తీ, కొద్ది సేపు అలా సాలోచనగా, సవిమర్శగా చూసుకునే స్థితిలో వుంటాడు. మనల్ని మనం విమర్శించుకునే శక్తి రావాలంటే, మనం మన యదార్థ స్తితికి కొంత ఎడంగా వుండాలి. అలాంటి, అవసరమయిన దూరం/ఎడం నాకు అమెరికా అనుభవం వల్ల పెరిగింది.  ఒక రచయితగా ఇది నాకు చాలా అవసరం. ఇక వ్యక్తిగా అంటారా, ఈ దూరంలో చాలా వేదన వుంది. దాన్ని తట్టుకొని నిలబడడం అంత తేలిక కాదు. ఈ దూరం అంత నునుపు కూడా కాదు. ఇందులో వొక గరుకు విషాదం కూడా వుంది.  డాలర్ల సుఖంలో తెలియని/ కనిపించని  దుఖం చాలా వుంది.  అది ప్రతి అమెరికన్ తెలుగు వాడూ అనుభవిస్తున్నదే. కానీ, అది ఇంకా సాహిత్యంలోకి రాలేదు. రావాలి, వస్తే, అప్పుడు మనం డయాస్పోరా సాహిత్యం అంటున్న మాటకి కాస్త విలువ వస్తుంది. నాస్తాల్జియా వొక్కటే బతుకు కాదు. బతుకు నాస్తాల్జియా మాత్రమే కాదు. అనుక్షణం వర్తమానంతో పోరాటం. ఆ పోరాటం అక్షరబద్ధమయితే గొప్ప సాహిత్యం.

ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి

Posted in వ్యాసం | Tagged | 3 Comments

’రమల్’ ప్రశ్నశాస్త్రం-3

రమల్  పండితులకి  పదహారు  (16) అంకెలో  తీయదనం తెలుసునేమో మరి ! వారి వర్ణమాల  16 మూర్తులతో కూడి ఊంటుంది. అంతే కాదు ప్రశ్న చెప్పేందుకు ఉపయోగించే, 'జాయచా' / 'ప్రస్తారము'  ( జాతక చక్రము లాంటిది )లో కూడ  పదహారు  'ఖానాలు' /' గడులు'  ఉంటాయి. ప్రస్తారము  గురించి చర్చించే ముందు వర్ణమాలలో  విభాగాల   గురించి  తెలుసుకొందాము.

పదహారు మూర్తులని నాలుగు  భాగాలుగా  విభజించడం జరిగింది. 1. ఖారీజ్ షకల్లు , 2. దాఖిల  షకల్లు, 3 సాబిత్  షకల్లు, 4. మున్కిలీబ  షకల్లు. అని. వాటి  ఆకృతులని  బట్టే  ఆ విభజన  చేసారు.

ఖారీజ్  షకల్ కి మీద వరసలో బిందువు, చివరి వరుసలో రేఖ ఉంటాయి.

దాఖిల్ షకల్ కి మీద వరసలో రేఖ, చివరి వరుసలో బిందువు ఉంటాయి.

సాబిత షకల్ కి మీద వరసలోనూ, చివరి వరసలోనూ రేఖలు, మధ్య  వరుసలలో బిందువులు గాని , బిందువు గాని  ఉంటాయి.

మున్కలీబ్ కి మీద  వరసలోనూ , చివరి వరసలోనూ బిందువులు, మధ్య వరసలలో  రేఖలు గాని, రేఖ గాని   ఉంటాయి.
 

ఖారీజ్ షకల్             (లహియాన్,  నుస్రుతుల్ ఖారీజ్, అతవే ఖారీజ్, కబ్జుల్ ఖారీజ్)

__

__

__

__

__

__

__

__

 

 

దాఖిల్  షకల్లు (అంకీష్, నుస్రుతుల్ దాఖిల్,అతవేదాఖిల్, కబ్జుల్ దాఖిల్.)

__

__

__

__

__

__

__

__

 

 

'

సాబిత్ షకల్లు  (జమాత్, హుమరా, బయాజ్, ఇజ్జతమా ) __

__

__

__

__

__

__

__

__

__

__

__

 

మున్కిలీబ షకల్లు

( ఉకలా, ఫరహా, నకీ,

శీతాంశు )

__

__

__

__

 

 

 

ఇప్పుడు 'జాయచా' /' ప్రస్తారము' గురించి తెలుసుకొందాము. జాయచాలో  అయిదు  పంక్తులు ఉంటాయి.

మొదటి పం<క్తిని ' మాతృపంక్తి, అంటారు. ఇందులో  నాలుగు  ఖానాలు / గడులు  ఉంటాయి. ( 1,2,3,4 ఖానాలు )

రెండవ పంక్తిని  ' దుహుతృ పంక్తి' అంటారు. ఇందులో కూడ  నాలుగు  ఖానాలు / గడులు  ఉంటాయి            ( 5,6,7,8 ఖానాలు ).

మూడవ  పంక్తిని ' దౌహితృ పంక్తి' అంటారు. ఇందులో కూడ  నాలుగు  ఖానాలు / గడులు  ఉంటాయి .            ( 9,10,11,12 ఖానాలు )

నాల్గవ  పంక్తిని ' సాక్షి పంక్తి' అంటారు. ఇందులో  కూడ నాలుగు ఖానాలు / గడులు ఉంటాయి. యీ సాక్షి పంక్తిలోని త్రయోదశ ఖానా ప్రశ్న గడికి సాక్షి, చతుర్దశ ఖానాని  ప్రశ్న కర్త మరియు కార్య సిద్ధికి  సాక్షి, పంచాదశ ఖానాని  ప్రస్తారానికి  సాక్షి, షోడశ ఖానాని   ఫలిత  సాక్షి అంటారు.
 

ప్రస్తారం  ఎలా  తయారు  చెయ్యాలో  తెలుసుకొందాం. పాచికలు  ప్రశ్న  కర్త  చేతికిచ్చి,  వాటిని  విసరమని  చెప్తారు. ఆ  పాచికా  ద్వారా నాలుగు  మూర్తులు  ఏర్పడుతాయి. అంటే  మాతృపంక్తి  ఏర్పడుతుందన్న  మాట ! యీ  మాతృ పంక్తి ద్వారా  తక్కిన  ఖానాలు  అన్నీ  తయారు  చేయవచ్చు.


మన  దగ్గర  పాచికలు  లేవు  కదా ! మరేం  చేయాలి ?  అన్న   సమస్యకి  రెండు  విధులు చెప్పారు.

మొదటి విధి : ప్రశ్న కర్తని  శ్వాసని  బిగించి, తన  ప్రశ్నని తలచుకొంటూ,  ఒక  వృత్తాకారాన్ని  కాగితం  మీద  వెయ్యమనాలి. తరువాత  ఆ  వృత్తానికి  కిరణాల  లాగ  రేఖలు  గీయాలి. అంటే సూర్యుని  బొమ్మ  వేయాలన్న  మాట !

దాని Radial Diagram


ఉదాహరణకి  పైన  చూపించిన  విధంగా వృత్తము , దాని  చుట్టూ రేఖలు గీసుకోవాలి. (బొమ్మలో మూడు  రేఖలే  ఉన్నాయి  కదా అని, మూడే  గీయకండీ ! కంప్యూటర్లో సూర్యుని  బొమ్మ దొరకక అలా చేసాను.) ఊపిరి  బిగబెట్టీ పశ్నని  తలచుకొంటూ  మీరు  గీయ  గలిగినన్ని  రేఖలు  గీయండి. తరువాత  ఎన్ని  రేఖలు  గీసారో  లెక్క  పెట్టండి.


ఉదాహరణకి   పన్నెండు  రేఖలు  వచ్చాయనుకొందాము. అంటే  పన్నెండవ  మూర్తిని  మీరు  మొదటి ఖానా /గడిగా ఎంచుకొన్నారన్న  మాట ! మాతృ పంక్తి కోసం  నాలుగు  మూర్తులు  కావాలి  కదా ! మిగతావి  ఎలా  వస్తాయి ?


మొదటి మూర్తి నుండి  ఏడవ  స్థానంలోని మూర్తిని  రెండవ  ఖానాలో మూర్తిగాను, అక్కడి  నుండి  ఏడవ  స్థానంలో  ఉన్న మూర్తిని   మూడవ  ఖానాలో  మూర్తిగాను, అక్కడి  నుండి  ఏడవ  స్థానంలో  ఉన్న  మూర్తిని  నాల్గవ  ఖానాలోని మూర్తిగానూ ఎన్నుకోవాలి. .

ముందుగా ఒక  ప్రస్తారం  కోసం  మూర్తులను  ఎన్నుకొని  చూద్దాం !
 

ప్రశ్నకర్త   30  కిరణాలు / రేఖలు  గీసాడనుకొందాం ! 30 అంటే  16 కన్న  ఎక్కువ  కదా ! అప్పుడేం  చెయాలంటే  30 ని 16 చేత  భాగించాలి. 14  మిగులుతుంది. రమల వర్ణమాలలోని ౧౪వ  మూర్తిని అంటే , 'అతవే దాఖిల్ని' తీసుకోవాలి. దానిని  మాతృ  పంక్తి లోని  ముదటి  ఖానాలోని  మూర్తిగా  గుర్తించాలి. అక్కడినుంచి  లెక్క పెట్టి  ఏడవ  మూర్తిని  అంటే   14,  15  ,16,  తరువాత 1,2,3,4 వరకు  లెక్కపెట్టి,  నాల్గవ  మూర్తిని ,అంటే  'జమాత్'ని  రెండవ  ఖానాలోని  మూర్తిగా  గుర్తించాఇ ! అలాగే  4వ  మూర్తినుండి  ఏడవ మూర్తి  అంటే  4, 5, 6, 7, 8, 9, 10 వరకు లెక్క పెట్టి  10వ మూర్తిని  అంటే , 'నుస్రుతుల్  దాఖిల్ని  మూడవ  ఖానాలోని మూర్తిగా  గుర్తించాలి. మళ్లీ  అలాగే  10  నుండి,  ఏడవ  మూర్తిని లెక్క  పెట్టి  10, 11, 12, 13, 14, 15, 16 వరకు  వచ్చి  16 వ  మూర్తిని  అంటే  1 శీతాంశుని'  నాల్గవ  ఖానాలోని  మూర్తిగా  గుర్తించాలి. వీటిని  కుడి  నుండి  ఎడమకు  వేసుకోవాలి.
 

నాలుగవ ఖానా

తరీఖ్/ శీతాంశు

మూడవ  ఖానా

నుస్రుతుల్  దాఖిల్/ ఉష్ణగు

రెండవ  ఖానా

జమాత్/ సౌమ్య

మొదటి ఖానా

అతవే  దాఖిల్/ కవి.

__

__

__

__

__

__

__

 

 

ఈ విధంగా  ' మాతృ  పంక్తిలోని '   నాలుగు  ఖానాల  లోని  మూర్తులు  వచ్చాయి. ఇక  మిగతా  పంక్తులలో  మూర్తులు  వీటినుండే  తయారవుతాయి.


ఈ నాలుగు  మూర్తుల లోని  మొదటి  వరసలోని  రేఖ/బిందువులని  తీసి  అయిదవ   ఖానాలోని  మూర్తిని  తయారు  చేయాలి. (మొదటి ఖానా లోని మొదటి వరసలో బిందువు ఉంది.రెండవ ఖానా లోని ,మొదటి వరసలో  రేఖ  ఉంది. మూడాచ  ఖానాలోని  మొదటి  వరసలో  రేఖ ఉంది. నాల్గవ  ఖానా లోని మొదటి వరుసలో బిందువు ఉంది ) అంటే(   ౦ , __ ,  ___ , ౦ ) ఉన్నాయి.వీటిని  నిలువుగా  వేసుకొంటూ  పోతే  ' ఉకలా / మందగ్ ' తయారవుతుంది !

అదే విధంగా రెండవ  వరసలోని  ౦  ,  ___ ,  ___ , ౦  , లతో   మళ్లీ  ' ఉకలా / మందగ్  తయారవుతుంది.

ఇక  మూడవ  వరసలోని  ౦,  ___  ,  ౦  ,  ౦  , లతో  'నకీ /  ఆర్ ' తయారయింది

ఆఖరుగా  నాల్గవ  వరసలోని  ___,   ___,   ౦  ,  ౦, లతో  ' నుస్రుతుల్  దాఖిల్ /  ఉష్ణగు  తయారయింది.

అంటే  దుహిత  పంక్తిలోని  ( ౫, ౬, ౭, ౮ )  ఖానాల  లోని  మూర్తులు  క్రమంగా  , ఉకలా,  ఉకలా,  నకీ,  నుస్రుతుల్  దాఖిల్లు  తయారయాయి. దీనిని  బొమ్మలో  చూడండి.

ఎనిమిదవ  ఖానా

నుస్రుతుల్ దాఖిల్ / ఉష్ణగు

ఏడవ  ఖానా

నకీ / ఆర్

ఆరవ  ఖానా

ఉకలా / మందగ్

అయిదవ  ఖానా

ఉకలా / మందగ్

__

__

__

__

__

__

__

 

 

దుహిత  పంక్తి  తరువాత  '  దౌహితృ  పంక్తి  లోని  షకల్లు / మూర్తులు    ఒక  దానినొకటి  గుణకారించడం  వల్ల  తయారవుతాయి.  గుణించడం అంటే  రెండు మూర్తుల లోని  చిహ్నాలని  పరస్పరం  గుణకార  క్రియ ద్వారా కలిపి మరొక  మూర్తిని తయారు చేయడం ! ఈ  గుణకారానికి కొన్ని  నియమాలు  ఉన్నాయి; బిందువుని , బిందువుతో గుణిస్తే రేఖ అవుతుంది. రేఖని రేఖతో  గుణిస్తే  రేఖే  అవుతుంది. బిందువుని , రేఖతో  గుణిస్తే  బిందువే  అవుతుంది. అలాగే  రేఖని, బిందువుతో  గుణిస్తే  బిందువే  అవుతుంది !


కొసమెరుపు : దీనిని  ఉదాహరణ  ద్వారా  తెలుసుకొని  యీ  ప్రశ్నకి   జవాబు  వెతుకుదాం !


ప్రశ్న :  " యాత్ర  జరుగుతుందా లేదా ?

జవాబు :  ప్రస్తారం  లోని  మొదటి  ఖానా లోని  మూర్తి  ప్రశ్నకర్తని,  మూడవ  ఖానాలోని  మూర్తి అతని యాత్రని  గురించి  తెలుపుతాయి,  మన  ప్రస్తారంలోని  మొదటి  మూర్తి  ,'అతవే దాఖిల్'/ కవి  మూడవ  ఖానాలోని  మూర్తి  నుస్రుతుల్  ఖారీజ్ /  ఉష్ణగు  . యీ  రెండింటినీ  గుణిస్తే  ఏమొస్తుంది ?


సమాదానం :  నకీ  / ఆర్  వస్తుంది క్రింద బొమ్మలో చూడండి. '  నకీ ' గురించి , రమల్లో  అశుభ  చిహ్నంగా వర్ణించ బడింది. అందుచేత  యాత్ర  జరగదు  అని  అర్థం !!
 

__

__

__

__

అతవేదాకిల్  ఇంటూ నుస్రుతుల్ దాఖిల్   ఈక్వల్ టూ నకీ / ఆర్  వచ్చింది.

పూర్తి  ప్రస్తారం  గురించి తరువాత  పాఠంలో  తెలుసుకొందాము.


 

Posted in వ్యాసం | Tagged | Comments Off on ’రమల్’ ప్రశ్నశాస్త్రం-3

’రమల్’ ప్రశ్నశాస్త్రం-2

రమల్ ప్రశ్నాశాస్త్రం వ్యాసాల వరుసలో రెండవ భాగం ఇది.

————————-


రమల్ సంకేతాలు  బిందువు ( ౦ ), రేఖ (__ )  మాత్రమే! అప్పుడప్పుడు రేఖని ( __ )  రెండు బిందువులతో కూడ సూచిస్తారు. అంటే (౦ ౦) అలా  అన్నమాట .రేఖ రెండు బిందువులతో తయారయ్యేదే  కదా మరి ! నాలుగు నిలువు వరసలలో నాలుగు  బిందువులు,  నాలుగు  రేఖలతో , మొత్తం 16 షకల్ / మూర్తులు తయారవుతాయి. వాటినే  రమల్  వర్ణమాల  అంటారు. ఈ  సంకేతాలని  8 వర్గ ఖండాలతో (8 క్యూబ్ లాంటివి) తయారు  చేసిన  పాచికల  మీద  పొడిపించి, నాలుగేసి  వర్గాలని (గుటికలని ) ఒక  రాగి మేకులో గ్రుచ్చి పాచికలని  తయారు చేస్తారు.


'రమల్' ద్వారా  ప్రశ్నలకి  జవాబులివ్వడానికి,  పాచికల  అవసరం ఉంది. ఈ పాచికలని  అష్ట ధాతువులతో  తయారు  చేయించాలి.
1. బంగారము (సూర్య ), 2. వెండి (చంద్ర )  3. ఇనుము (మంగల్  లేక  కుజ), 4. ఇత్తడి, (బృహస్పతి ), 5. రాగి (శుక్ర ), 6. సీసము (శని), 7. తగరము (బుధ), 8. పాదరసము -ఇవే ఆ ధాతువులు !


పాదరసము  ఆకాశధాతువు. అందువల్ల  దాని  సంబంధం  అన్ని  గ్రహాలతోనూ  ఉంటుంది.  ఈ  పాచికల  గొడవ  ఏమిటి? అవి  లేనిదే  యీ  ప్రశ్న శాస్త్రం  పని  చెయ్యదా  అన్న  అనుమానం  సహజంగానే వస్తుంది. వాటి  అవసరం లేకుండా  కూడా  రమల్ ని ఉపయోగించి  సమాధానాలు  తెలుసుకోవచ్చు. కాకపోతే  యీ  పాచికలతో  పని  సులువవుతుంది !
 

ఇప్పుడు 16 సంకేతాలతో  తయారయే  షకల్ / మూర్తుల  గురించి  తెలుసుకొందాం.

‘రమల్’ మూర్తుల పేర్లు, వాటి స్వభావ స్వరూపాలు

 

పహలా  షకల్ /

ఒకటవ మూర్తి

 

లహియాన్/

లేదా  వాగ్మి

బ్రాహ్మణ వర్ణము,తెలుపు రంగు, ధర్మాసక్తి కల వ్యక్తి,

పండితుడు,మిష్టాన్నభోజి,,

మధురభాషి, అయిన వ్యక్తి.

__

__

__

 

 

దూసరా షకల్ /

రెండవ  మూర్తి

 

 

కబ్జుల్  దాఖిల్ /

లేదా  తీక్ష్ణాంశు

క్షత్రియ వర్ణము, గోధుమ రంగు,చిత్రకళాసక్తి కల వ్యక్తి, వ్యాపారి.  హాజిర్ జవాబ్ తరహా వ్యక్తి.

__

__

 

తీసరా షకల్ /

మూడవ మూర్తి

 

కబ్జుల్  ఖారీజ్ /

పాత్.

మ్లేఛ్ఛవర్ణము,అన్యాయము  అధర్మము  ఇష్టపడే వ్యక్తి, పిల్లి కళ్లు, నలుపు లేదా చిత్రమైన రంగు కల వ్యక్తి.

__

__

 

చౌదా షకల్ /

నాల్గవ మూర్తి

జమాత్ /

సౌమ్య

శూద్రవర్ణము,గోధుమరంగు, స్వర్ణకారుడు  వక్త, దూత  గుణవంతుడు

__

__

__

__

 

 

పంచవా షకల్ /

ఐదవ  మూర్తి

 

ఫరహా / .

దైత్య గురు

తెలుపు రంగు, అందమైన వాడు. చిన్నవైన నల్లని కళ్లు, మధుర భోజి, వ్రాయస గాడు

__

 

 

ఛటా షకల్ /

ఆరవ మూర్తి

 

ఉకలా /

మందగ్

నలుపు రంగు, మలిన హీన జాతి, ఎత్తు వెడల్పు గల ముక్కు, కలహ ప్రియుడు, కూరలు అమ్మే వాడు.

__

__

 

 

సతవా షకల్ /

ఏడవ మూర్తి

 

అంకీష్ /

సౌరి

ఉజ్వల శ్యామవర్ణము, గోళ్లు దంతములు గల వ్యక్తి, వ్యవసాయము చేసేవాడు. దిబ్బ పెదవులు

__

__

__

 

 

అఠవా షకల్ /

ఎనిమిదో మూర్తి

 

హుమరా /

లోహిత్

క్షత్రియ వర్ణము, కౄరుడు, హింస నిందిత కార్యములు చేశేవాడు. పెద్ద బుర్ర మధ్యమ శరీరము, .

__

__

__

 

 

నవా షకల్ /

తొమ్మిదో మూర్తి

 

బయాజ్ /

విధు

బ్రాహ్మణ వర్ణము, తెలుపు రంగు, భ్రమణశీలుడు, భక్తుడు, శ్రేష్టమైన పనులు చేసేవాడు.రత్నప్రియుడు

__

__

__

 

దశవా షకల్ /

పదవ మూర్తి

 

నుస్రుతుల్ ఖారీజ్ /

ఉష్ణగు

క్షత్రియ వర్ణము, శ్రేష్టుడు, రాజకార్య దక్షుడు, తెలుపు రంగు, స్వర్ణ, రత్న వ్యాపారి. చిన్నబుర్ర,

__

__

గ్యారా షకల్ /

ఏకాదశ మూర్తి

నుస్రుతుల్ దాఖిల్ /

సూరి

బ్రాహ్మణవర్ణము, తెలుపు రంగు, అధ్యయనము, అధ్యాపక వృత్తి, అందగాడు లేక సౌందర్యవతి.

__

__

 

బారవా షకల్ /

ద్వాదశ మూర్తి

అతవే ఖారీజ్ /

చక్ర

మ్లేఛ్ఛవర్ణము, దుర్బల శరీరము, ఉన్ని దుస్తులు ధరించే వాడు, గుహావాసి, మలిన వికృత రూపి

__

 

 

తేరవా షకల్ /

త్రయోదశ మూర్తి

 

నకీ /

ఆర్

తెలుపు, క్షత్రియ వర్ణము, మాంసాహారి, యోధ్ధ, స్వతంత్రుడు, శిశు ప్రేమికుడు.

__

 

 

చౌదహవా షకల్ /

చతుర్దశ మూర్తి

 

అతవే దాఖిల్ /

కవి

గోధుమ రంగు, పొడవు సుందరి, పెద్ద పిరుదులు గలది. పకృతి ప్రేమి, ఉద్యాన వన వాసిని.

__

 

 

పంద్రహవా షకల్ /

పంచాదశ మూర్తి

 

ఇజ్జతమా /

బోధన్

శూద్రవర్ణము, లిపికుడు, జ్యోతిషి, గుణవంతుడు, గోధుమ వర్ణము, కోమల స్వబావము.

__

__

 

 

సోలవా షకల్ /

షోడశ మూర్తి

 

తరీక్/

శీతాంశు

వైశ్యవర్ణము, స్త్రీ , సుందరి, దుర్బల శరీరము, ధాతువులు, చిత్రములు, వస్త్రములు చేసేది.

 

 

మూర్తులలో చెప్పిన గుణ వర్ణ, స్వభావముల  ఆదారంగా ప్రశ్నలకి  సమాదానాలు  చెప్పాలి. ఈ మూర్తులు  తమ తమ గుణాలని  అనుసరించే  ఫలితాలు  ఇస్తాయి.


కొసమెరుపు : ఏదైనా  చిన్న ప్రశ్న  ఔను / కాదు అనే  సమాధానం  మాత్రమే  కల  ప్రశ్న కలిగిందనుకోండి. 'రమల్' ద్వారా జవాబు  తెలుసుకోవాలంటే, నాలుగు  వరసలలో  చుక్కలు  గీతలు  ఆ ప్రశ్నని  మనసులో  తల్చుకుంటూ  పెట్టండి. తరువాత  ఆ  వరుసలలో  గల  గీతలు, చుక్కలు  లెక్క పెట్టండి. గీత  అంటే రెండు చుక్కలన్నమాట ! ఆ విధంగా  లెక్క పెట్టిన  తరువాత  సమ  సంఖ్య వస్తే గీత అని , విషమ  సంఖ్య వస్తే చుక్క అని గ్రహించి మూర్తిని తయారు  చేయండి.


ఉదాహరణకి

(1)  ౦౦౦౦౦౦ _ _ _ _  ౦౦౦ _ _ _ ౦  =  24 =          __

(2) _ _ _ _ _ _ ౦౦౦౦౦  _ _ _ _ = 25 =               ౦

(3) ౦౦౦౦ _ _ _ _ _ _ _ _ _ _ _ ౦౦ = 28=            __

(4) _ _ _ _ _ _ _ ౦౦౦౦౦౦౦ _  _ _ _౦ = 30 =        __


ఈ మూర్తి  పేరు మన ఛార్టు  ప్రకారం  'హుమరా'  ! హింస, నిందిత కార్యములు చేసేవాడు అని  రమల్ చెప్తోంది.  కాబట్టి  మీ  ప్రశ్నకి జవాబు  'కాదు'  అని  అర్థం!!

***************

Posted in వ్యాసం | Tagged | Comments Off on ’రమల్’ ప్రశ్నశాస్త్రం-2

నిశ్చల యాత్ర

భూమి, ఆకాశం కలిసే చోటునుంచి –
సముద్రం మేఘాన్ని పలకరించే సమయంలో-
ఆమె వస్తూ ఉంటుందని ఎదురుచూస్తూ కూర్చున్నాడు.

దిగులు సాయంత్రాలు ఎర్రటి ఉషస్సులుగా అతని కళ్ళు జీరలయ్యాయి. సంధ్య అతని కనురెప్పల మీద వాలిపోయింది. గుండెల్లో చీకటి విశ్వవ్యాప్తమైంది. కొండల అంచులు, చేమంతుల తోటలు, నదులు పుట్టే స్థలాలు అన్నీ వెతికాడు. వెతికి వెతికి అలసి కూర్చుండి పోయాడు.

ఆమని వచ్చింది. గ్రీష్మం వెళ్ళింది. హేమంతం అంతమైంది. శరత్కాల తృణపత్రాలు విషాదాన్ని అక్షింతలుగా జల్లాయి.

నాన్న వచ్చి"రారా ఇంటికి" అన్నాడు.
సముద్రం మీద వర్షం కురుస్తోంది. "చూశావా నాన్నా ఆకాశం ఏడుస్తోంది" అన్నాడు జాలిగా.

నాన్న పిచ్చెక్కిందనుకున్నాడు. చెయ్యిపట్టి లాక్కెళ్ళాడు. సాంప్రదాయ పురోహితుడికి "వయస్సు దాటిపోతుందని" వేపమండ ఇచ్చి, పిచ్చి వదలకొట్టమన్నాడు. పిచ్చి కుదిరింది. పెళ్ళి మెడకు చుట్టమన్నారు.

"నువ్వేనా" అన్నాడు.
మల్లెపూల దారాల పక్క అంచుల మీద నుంచి ఆమె తలెత్తి"ఏమిటి నేనేనా?" అంది.
"భూమి, ఆకాశం కలిసేచోటు నుంచి సముద్రం మేఘాన్ని పలకరించే సమయంలో భావుకత్వం చీర కట్టుకుని కవిత్వం కాసుల పేరేసుకుని నా కలల ప్రాంగణంలోకి వస్తోంది నువ్వేనా?"
ఆమె దుఃఖించటం మొదలుపెట్టింది. "నన్ను మోసం చేశారు దేవుడో – పిచ్చాడ్ని తెచ్చికట్టబెట్టారు దేవుడో"

"ఏడవకు నేను మాములు మనిషినే"
"నిజంగానా" ఆనందంగా అడిగింది.
"అవును. హృదయ కవాటాలు మూసేసి బయటకు వచ్చేశాగా. ఇదిగో నావైపు చూడు. నా మొహం మీద మేకప్ బాగోలేదు కదా! ఏం కావాలి నీకు? డబ్బా, హోదానా, పేరా, అంతస్థా?"
"అన్నీ పాతిక పాతిక శాతం".
"తథాస్తు".

నిద్రించే మనసు నిన్న రాత్రి పక్కమీద రాలిన జ్ఞాపకాల మల్లెపూలను కలులుగా పేర్చి సుషుప్తి వైరాగ్యాన్ని ప్రసవిస్తోంది. ఎన్ని అనుభవాల ఉత్తరాలు వేసినా సాయంత్రానికి ఖాళీ అయ్యే పోస్ట్ బాక్స్ లాంటి మనసు.

                అగ్నిపర్వతం అంచు మీద కూర్చుని –
                లావాపై తేలివచ్చే పడవలో –

సన్నటి కొండల మధ్యనుంచి పాయలా మొదలై, విశాలమైన ఇసుక తిన్నెల మీద పరుచుకునే గోదారిలా… విషాదం, గుండెల నుంచి మెదడు వరకూ పాకుతూంది. కలం కదిలితే నువ్వు, పదం పలికితే నువ్వు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్య నువ్వు.

నేనే నువ్వు అనుకునే మూర్తి కోసం, ఆర్కిటికా అంచుల మీద నిలబడి అంటార్కిటికా లోతుల్లోకి తొంగిచూస్తున్నాడు.
"రా నాన్నా ఇంటికి" అన్నాడు కొడుకు ప్రేమగా – ఫస్టు తారీఖు వచ్చిందని.

మేఘం మెరిసింది. "చూశావా బాబూ, లౌక్యం అనే అడవిలో దావానలం వచ్చి ’అవసరం’కాలిపోతోంది" అన్నాడు ఆనందంగా కొడుకుతో.
తల్లీకొడుకులు దిష్టి తీశారు.

కళ్ళకి కాటుక శాంతి, పెదవులకి చిరునవ్వు తాంబూలం, కంఠాభరణం కరుణ, చెవులకి మృదు సంభాషణ పట్టీ – నుదుట సహనం బొట్టు, చేతుల్లో విజ్ఞానం వీణ – ఎవరైతేనేం ఆ నీహారిక.

ఆండ్రోమెడా గాలక్సీ అంతా వెతికి, అవతలపక్క రోదసిలో ఉందేమో అని వెళ్ళబోతూవుంటే –

"రా తాతా ఇంటికి" అన్నాడు మనవడొచ్చి.

Posted in కథ | Comments Off on నిశ్చల యాత్ర

అస్తిత్వ ఉద్యమాల స్వరం అఫ్సర్ – 4

తెలుగులో దళిత ముస్లిం స్త్రీవాద తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలలో మీ పాత్ర గురించి కొంచెం చెప్పండి.

ఈ ప్రశ్నకి సమాధానం నిజానికి 1992 లో వెలువడిన నా వ్యాస సంపుటి “ఆధునికత- అత్యాధునికత” లో వుంది. అది 1992 లో రాసిన పుస్తకమే అయినా, ఈ 2010 లో కూడా నేను అదే అంటాను. అందులో నేను మొదట రాసిన వ్యాసం “మాతృ భాష వెతుక్కుంటున్న స్త్రీ వాద కవులు.” భాషలో పితృస్వామ్య భావజాలం అంతర్గతంగా ఎంతగా వుంటుందో చెబుతూ దాని నించి విముక్తం అయినప్పుడే స్త్రీవాద స్వరం వినిపిస్తుందన్నది అందులో ప్రధానమయిన వాదన. లింగ భాష గురించి ఆ  తరవాత చాలా చర్చలు జరిగాయి. ఆ వ్యాసం అనేక విమర్శ సంకలనాల్లో పునర్ముద్రణ అయింది కూడా. ఆ తరవాత దళిత, ముస్లిం వాదాలలో జరిగిన చర్చలలో నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. వాటిని నేను ఇప్పటికీ నిర్ద్వంద్వంగా సమర్థిస్తాను. సాహిత్యం పోను పోనూ నిర్దిష్టం అయ్యి తీరాలని అనుకుంటాను. సాధారణీకరణ అన్నది ఎంత తగ్గితే అంత మంచిది. ఈ నిర్దిష్టత మానవ సంబంధాల గురించి కావచ్చు, స్థల కాలాల గురించి కూడా కావచ్చు. ఈ మౌలికమయిన పునాది మీదనే కొత్త సాహిత్యాన్ని అర్థం చేసుకోగలమని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు సాహిత్యం గురించి వున్న అనేక అపోహలూ, అపార్థాలూ కేవలం ఈ నిర్దిష్ట తాత్వికత అర్థం కాకపోవడం వల్లనే అనుకుంటున్నాను. అయితే, ఏది సాహిత్యం అవుతుంది ఏది కాదు అన్న సునిశిత అవగాహన రచయితలకి వుండి తీరాలి. ఉదాహరణకి తెలంగాణ సాహిత్యం తీసుకుంటే, రాజకీయాలలో కె సి యార్ చెప్పింది వేదం అయినా నష్టం లేదు కానీ, సృజనాత్మక రచయిత కూడా అదే వేదం అనుకుంటే ప్రమాదం. రచయితలు రాజకీయాలు మాట్లాడాలి కానీ, రాజకీయ ఎత్తుగడల వలలో చిక్కు పడకూడదు అనుకుంటా. రచయిత రాజకీయాలు మాట్లాడుతూనే తన స్వేచ్చని కూడా కాపాడుకోగలిగితేనే రచనా సమగ్రత నిలుస్తుంది. వట్టికోట , దాశరథి, కవిరాజమూర్తి లాంటి రచయితలు ఆ సమగ్రతని కాపాడుకోగలిగారు కాబట్టే వాళ్ళ రచనలు ఉద్యమాలు చల్లారినా వేడిగా వున్నాయి. ఈ విషయంలో నాకు ఉర్దూ అభ్యుదయ రచయితలూ కవులూ ఆదర్శంగా కనిపిస్తారు. తెలంగాణ తనకి వున్న ఉర్దూ బంధుత్వం నించి నేర్చుకోవాల్సింది ఇదే.
 

దళిత వాదం మొదలయినప్పుడు ఒక కవిగా మీరు దాన్ని ఎలా స్వీకరించారు?

“యానాం వేమన ఏమనే..” అనే కవితలో ఈ సంగతి బాగా అర్థం అవుతుంది.   చిక్కనవుతున్న పాట సంకలనం వేస్తున్నప్పుడు లక్ష్మి నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ “ ఈ సంకలనంతో నీ పని మటాష్. ఇక నువ్వు పుస్తకం వెయ్యలేవు, నీ అన్ని కవితలూ ఇందులో వేసేస్తున్నాం” అని సరదాగా అనే వాళ్ళు. వాళ్ళిద్దరూ అన్నంత పనీ చేశారు. నేను రాసిన ప్రతి ముక్కా దళిత కవిత్వమే అనే వాడు లక్ష్మి నరసయ్య. దళిత కవిత్వంలో నా పాత్ర ఏమిటో ఇప్పుడు నేను చెప్పకరలేదు. “చిక్కనవుతున్న పాట” సంకలనం తెరిచి చూస్తే, అది మీకే తెలిసిపోతుంది. అయితే, కవిత్వం రాయడమే కాకుండా ఆ సంకలనం చుట్టూ మేము పడ్డ కష్టాలు అనేకం. వూరూరా కవిత్వ సభలు పెట్టే సంప్రదాయాన్ని మళ్ళీ బతికించింది దళిత కవిత్వమే, గట్టిగా చెప్పాలంటే  ఆ సంకలనమే!
 

మీరు వొక ముస్లిం అనే భావన అప్పుడు మీకు వుందా?

ఇంతకు ముందే చెప్పినట్టు – ముస్లిం అనే భావన 1992 తరవాత పెరిగింది. కానీ, సాహిత్యం నిర్దిష్టత వైపు వెళ్ళాలి అని అంతకు ముందు నించే నేను వాదిస్తూ వున్నాను. నా వ్యాసాలు చదివితే ఈ వాదాలు అర్థమవుతాయి. నిర్దిష్టత అనేది తెలుగు సాహిత్యంలో ఎలా మొదలయ్యిందో, ఎలా కొనసాగిందో చెప్పే ప్రయత్నమే నా విమర్శ అంతా! నేను ఇప్పుడు తెలంగాణ సాహిత్య చరిత్ర గురించి చేస్తున్న పని కూడా అదే. తెలంగాణ సాహిత్య చరిత్ర మీద నేను వచ్చే జనవరి నించి వరసగా వ్యాసాలు రాయబోతున్నాను. అవి తెలంగాణ సాహిత్యాన్నే కాదు, అసలు సాహిత్యంలో స్థానికతని ఎలా చూడాలో చెబుతాయి. ఇంతకు ముందు నేను కవిరాజ మూర్తి నవల గురించి రాసిన వ్యాసం ఆ పెద్ద పనికి చిన్న ప్రారంభం మాత్రమే. ఇదే సందర్భంలో తెలుగు సాహిత్యంలో ముస్లిం భావన కి సంబంధించిన చరిత్రని కూడా విశ్లేషించడం అందులో ప్రధాన ఉద్దేశం. ముస్లిం భావనని మనం వ్యక్తిగత స్థాయిలో చూడకూడదు, చరిత్ర నిర్మాణ క్రమంలో ఈ భావన ఎలాంటి పాత్ర పోషించిందో చెప్పాలి. నాకు వ్యక్తిగతంగా  ముస్లిం అనే భావన వుందా లేదా అన్నది ఇందులో చాలా చిన్న అంశం. కానీ, అది నా అస్తిత్వ నిర్మాణంలో ముఖ్యమయిన కోణం అనే వాస్తవాన్ని నేను ఎప్పుడూ విస్మరించలేను. విస్మరిస్తే, నేను మీకు అబద్ధాలు చెప్పినట్టే అవుతుంది. వాస్తవికత గుర్తింపు అస్తిత్వ చైతన్యంలో ప్రధానమయిన పార్శ్వం. ఆ గుర్తింపు లేకపోతే మనం తప్పుడు చైతన్యంలో వున్నట్టే లెక్క.
 


దళితులూ ముస్లింలూ కలిసి అస్తిత్వ పోరాటం చెయ్యగలరా?

అది రాజకీయ అవసరం. కానీ, దళితులకీ ముస్లింలకీ ఆర్ధికంగా వొక తేడా వుంది. రాజ్యం నించి దళితులకి వున్నంత రక్షణ ముస్లింలకి లేదు. ముస్లింలకి ఉద్యోగ భద్రత కూడా లేదు. పైగా, ముస్లింలు పరాయి వాళ్ళు అనే భావనని మన రాజకీయ వ్యవస్థ పెంచి పోషిస్తోంది. దళితులకి అలాంటి సమస్య లేదు, అవసరమయితే దళితులని కలుపుకొని వెళ్లడానికి హిందూత్వ పార్టీలు ప్రయత్నిస్తాయి తప్ప – దళితుల సమస్యలు, ముస్లింల సమస్యలు వొకటి కావు. కానీ, రాజకీయ స్థాయిలో వాళ్ళ కలయిక చాలా అవసరం. అయితే, సాహిత్యానికి వచ్చే సరికి ఇంకో సమస్య వుంది. తెలుగు ముస్లిం రచయితలు ఎవరి కోసం రాయాలన్నది ఆ సమస్య. అసలు వల్ల సాహిత్యం ముస్లింల దాకా చేరుతుందా అన్నది వొక సవాలు. దళిత వుద్యమంలో అలాంటి సందిగ్ధత లేదు. దళిత ఉద్యమానికీ, సాహిత్యానికీ అందుకే సజీవ సంబంధం వుంది. అలాంటి సజీవ సంబంధం ముస్లింల విషయంలో కుదురుతుందా లేదా అన్నది నాకు సందేహమే. కానీ, ముస్లిం సాహిత్యం విస్తృతంగా రావడం వల్ల మన సమాజంలో మన పక్కనే వుంది అజ్నాతంగా బతుకుతున్న వొక బలమయిన వర్గం గురించి మనలో అవగాహన, సహనం పెరుగుతుంది. అలాంటి అవగాహనా, సహనం పెంచే ముస్లిం సాహిత్యం కోసం నేను ఎదురుచూస్తున్నా.

ఆ వర్గం నించి వచ్చిన అత్యంత శక్తివంతమయిన ఈ తరం రచయితగా, విమర్శకుడిగా మీ పాత్ర ఏమిటి?

నేను రెండు రకాల పనులు చేస్తున్నా. వొకటి: అసలు మన చుట్టూ వున్న ముస్లింలని ఎలా అర్థం చేసుకోగలమో, వాళ్ళని అర్థం చేసుకోవడానికి వున్న సాధనాలేమిటో వెతికి పెట్టే ప్రయత్నం చేస్తున్నా. నేను పీర్ల పండగ మీద రాసిన పుస్తకం ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురుచూస్తున్నా. ఇప్పటికే ఈ వ్యాసాలు వివిధ అంతర్జాతీయ పత్రికలలో అచ్చయి, కాస్తో కూస్తో పేరు తెచ్చుకొన్నాయి. సాహిత్యేతర అంశాల నించి నా అన్వేషణ మొదలయింది. తరవాత అవే సాధనాలని సాహిత్యానికి అన్వయించి చెప్పాలన్నది నేను చేయబోయే అతి ముఖ్యమయిన పని.  ఇప్పటికే నేను రాసిన కవిత్వం గురించి, సాహిత్య వ్యాసాల గురించి ఇక్కడ చెప్పదలచుకోలేదు.

ఒక కవి ఇజాల్నీ, రాజకీయాల్నీ, సిద్ధాంతాల్నీ వ్యక్తిగతంగా ఏవి అనుసరించినా కవిత్వానికొచ్చేసరికి సంకుచితత్వం లేకుండా విశాల దృక్పథం తో రాయాలని తిలక్ అభిప్రాయం. మీరెంతవరకూ ఏకీభవిస్తారు?

తిలక్ అంటే నాకూ ఇష్టమే. కానీ, తిలక్ మాట ఈ కాలానికి వర్తించదని అనుకుంటున్నా.  కవి ఇజం, రాజకీయాలూ, సిద్ధాంతాలకీ- కవిత్వానికి ఇప్పుడు ఎడం వుండక్కరలేదు. అలా చెప్పడం సంకుచితత్వమూ కాదు. ఆ మాటకొస్తే విశ్వజనీనతా, విశాల దృక్పథం అనే మాటలకి ఇప్పుడు అర్ధాలు మారిపోయాయి. ఎంత స్థానికమయితే అంత విశ్వజనీనత ఇప్పుడు – ఎంత నిర్దిష్టంగా మాట్లాడితే అంత విశాల దృక్పథం ఇప్పుడు –

సిద్ధాంత ప్రచారాలకి కవిత్వాన్ని వాడుకోవడం దురదృష్టకరమని కొందరు కవులు, విమర్శకుల అభిప్రాయం. మీరేమంటారు?

సిద్ధాంత ప్రచారం కోసం కవిత్వాన్ని వాడుకోవడం అదృష్ట కరమని నా అభిప్రాయం. కవిత్వాన్ని అలా వాడుకోకూడని చెప్పడం ఇంకో రకం రాజకీయ సిద్ధాంతమే. అది పచ్చి దగా.

భావ కవిత్వం, సమస్యల్ని పట్టించుకోని సౌందర్యదృష్టీ ఇటువంటి కవిత్వాన్ని మీరు అభిమానిస్తారా?

అస్సలు అభిమానించలేను. సౌందర్య దృష్టి గురించి అదొక అపోహ మాత్రమే. అదొక స్టీరియోటైప్ మాత్రమే. శ్రమ కన్నా సౌందర్యం లేదు. శ్రమించకుండా సౌందర్యం పుట్టదు.

అధునిక కవుల్లో చాలామంది ఇస్మాయిల్ శిష్యులుగా చెప్పుకుంటారు.. మీ పైన ఆయన ప్రభావం ఎంతవరకూ ఉంది. ఒకవేళ ఉంటే సిసలైన ఇస్మాయిలిజం అని మీరు దేన్ని భావిస్తారు?

ఇస్మాయిల్ కి నిజమయిన శిష్యులు వుండడం సాధ్యమని నేను అనుకోను. శిష్యరికాలని నిరాకరించడమే ఇస్మాయిలిజం.

ఇస్మాయిల్ మనకి వున్న మంచి కవి, కానీ ఆయన కవిత్వానికి ప్రభావ గుణం లేదు. ఆయన కంటే వజీర్ రహ్మాన్ కవిత్వానికి ప్రభావ గుణం ఎక్కువ వుంది. ఆధునిక జీవితం వజీర్ కి అర్ధం అయినంతగా ఇస్మాయిల్ కి అర్ధం కాలేదని నాకు అనిపిస్తుంది. కానీ, ఇవాళ రాజకీయ వ్యతిరేక సాహిత్యం ఇష్టపడే వాళ్ళకి ఇస్మాయిల్ వొక పని ముట్టు మాత్రమే.  వాళ్ళకి నిజంగా ఇస్మాయిల్ కవిత్వంతో పని వుందని నేను అనుకోను.

జెన్ బౌద్ధం , హైకూ కవిత్వం  — వీటితో మీ పరిచయమెందాకా?

నేను అవి కొంత చదివాను కానీ, అవి నా కవిత్వంలోకి ఒదగవు.

అధివాస్తవిక కవిత్వంలో మీరెంతవరకూ మునిగారు.. మీ కవితల్లో వాస్తవికత, అధివాస్తవికత పోటీ పడుతూ ఉంటాయి కదా?

ఆధునికుడయిన ప్రతి కవీ ఎంతో కొంత అధివాస్తవికుడు, ఎక్కువగా వాస్తవికుడు. శ్రీ శ్రీ మంచి ఉదాహరణ. శ్రీశ్రీని మనం సరిగా చదివితే, అర్ధం చేసుకుంటే చాలా విషయాలు బోధ పడతాయి. కలకీ మెలకువకీ మధ్య ప్రయాణం అంత తేలిక కాదు. దాన్ని నేను ఇంకా పూర్తిగా కవిత్వంలోకి తీసుకు రాలేకపోయాను. ఆ ప్రయత్నం ఇంకా చేస్తూనే వున్నాను. వాస్తవికతకీ, అధివాస్తవికతకీ పోటీ లేదు. ఆ రెండీటీ మధ్యనే కవి ఉనికి. ఈ స్తితి అర్ధం కావాలంటే కొంచెం ఆచార్య నాగార్జునుడి తత్వం బోధ పడాలి.

ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి

Posted in వ్యాసం | Tagged | 8 Comments