ఒక రోజు గడవడం

౧.ఎప్పటిలాగే  ఉదయం:
 
నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా తారుమారవుతాయో ఆలోచిస్తూ ఉండగనే
చేజారి భళ్ళున ఎక్కడో బద్దలవుతుంది
ఊపిరి వెన్నులో గడ్డకట్టి
తీగలు తెగిపోతూ మిగిలిన శబ్ధ స్తంభన ఒక్కటే 
ఇక దేహమంతా ప్రేమలు లేవు
 
లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల
ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు
సున్నితమైనవన్నీ ఒక్కొక్కటీ
రెక్కలు విరిగి –
 
ఈ క్షణం ఇది  మూలాల కుదుళ్ళను
తలకిందులు చేసి సుడివేగంతో ఎక్కడికో విసిరివేసే పెను ఉప్పెన
మనుషులు ఎందుకింత యాతన పడాలో
ఈ శాపాన్ని తలదాల్చి ఎన్నాళ్ళు ఇలా మోయాలో
 
౨.పగటి పూట:
 
ఈ దారులకు అలవాటయిన పాదాలు
ఎక్కడికెక్కడికో కొనిపోతూ 
 
నువ్వు నడుస్తున్నప్పుడు ఎచటికో తెలియని నీ పయనాన్నీ నిన్నూ
అన్నీ తెలిసిన ఒక తల్లి, బిడ్డను తన  చేతులలోకి సుతారంగా తీసుకున్నట్టుగా 
తన లోనికి, తన శరీరంలో శరీరంగా తనలోనికి తీసుకొని దారులన్నీ నీతో నడుస్తూ ఉన్నప్పుడు –
కాసేపు నువ్వు 
 
వెక్కివెక్కి ఏడ్చే చంటి బిడ్డవు. 
తెలియని దన్ను ఏదో  ఒక ఎరుకగా
నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు
నువ్వే ఒక ఓదార్పు మాటవు. 
 
నీ చుట్టూ నువ్వే అనేక యుద్ధాలను అల్లుతూ,
ఉన్నవి  నీకు రెండు చేతులేనని  సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ,
అలసీ, నీ పైన నువ్వే గురి చూసుకొనే నిర్ధాక్షణ్యతవు
 
౩.రాత్రి:
 
ఉన్నది ఇక కేవలం అలసట
గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-
నెత్తురు కరుడు కట్టి కొసలపై తడి ఆరని రాతి ఆయుధాల చీకటి కారడివి-
 
ఏ యుగమో తెలియదు
ఈ రాతిరికిక ఈ ఆదిమ మానవుడు నిదురించాలి

About అవ్వారి నాగరాజు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసే నాగరాజుగారికి కవిత్వంపై ఎంతో మక్కువ.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.