చరిత్రలో రాయలసీమ


కానీ అతని బలహీనతను కనిపెట్టి కప్పం చెల్లించటంలో నిర్లక్ష్యం చేస్తూ, నిజాం అధికారాన్ని వ్యతిరేకిస్తూ వుండినారు. సుమారు 80 మంది పాలెగాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించారు. సైనికచర్యలకు అవకాశం కల్పించిన ఈ ధిక్కారంను మొదట ఆదోనికి చెందిన చిన్న గ్రామాధికారి లేవదీసినాడు. కానీ ఇతను కంపెనీ సైన్యం చేతిలో ఓడిపోయాడు. 1803లో కడపలో సుల్తాన్‌ఖాన్‌, చిత్తూరులో నాగేటి పాలెగాళ్ళ తిరుగుబాట్లు జరిగాయి. నాటి ప్రభుత్వం వీరిని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. పాలెగాళ్ళ అరాచక పాలన వల్ల ప్రజలు బాగా చితికిపోయారు. సాంఘిక జీవితం అల్లకల్లోలమయింది. భద్రత కరువయింది. అనేకమంది దోపిడిగాండ్రుగా తయారయినారు. ఈ పరిస్థితి రాయలసీమలో విస్తృతంగా వుండేది. ఈ దోపిడి గాండ్రనే ప్రజలు దివిటి దొంగలు అని పిలిచేవారు. కుమ్మరి గుండోళ్లని కూడా కొన్ని ప్రాంతాలలో అని అనేవారు. దత్త మండలాల మొదటి కలెక్టర్‌ థామస్‌ మన్రో వీరిలో కొందరిని లొంగదీసుకున్నాడు. మరి కొందరిని అణచివేసాడు.

విజయనగర రాజుల కాలం నుండి బ్రిటీషు వారి ఆధీనంలోకి వచ్చేంతవరకు ఈ ప్రాంతంలో భూసంబంధాలలో గాని, పంటల విధానంలో గాని, నీటిపారుదలలో గాని, ఎటువంటి మార్పులు లేక పోవటంవల్ల, కరువు కాటకాదులకు గురయి తీవ్రంగా చితికి పోయింది. తూర్పు ఇండియా కంపెనీ వ్యాపారసంస్థ. దీని ఆధీనంలోకి రాయలసీమ జిల్లాలు వచ్చాయి. ఈ కంపెనీకి వ్యాపారం తప్ప మరో ధ్యాస లేదు. తమ బొక్కసం నింపుకోవటమే ప్రధానలక్ష్యం. భూమి మీద విపరీతంగా పన్నులు విధించారు. జమీందారి విధానం ప్రవేశపెట్టడంతో రైతాంగం బాగా చితికి పోయింది. కరువు కాటకాలు వచ్చిన ప్రతీసారి వేలాదిమంది చనిపోయారు. కంపెనీ గుత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి ప్రకారం ప్రతి గ్రామాన్ని గ్రామ పెద్దకు గుత్తకు ఇస్తుంది. అతను ఆ గ్రామానికి విధించిన గుత్తను కంపెనీకి చెల్లించాలి. ఈ గుత్త విపరీతంగా వుండేది. థామస్‌ మన్రో రాయలసీమలో రైత్వారీ పద్ధతిని అమలు చేయాలనుకుంటే కంపెనీ డైరెక్టర్లు వ్యతిరేకించారు. గ్రామ గుత్త పద్ధతినే అమలు చేయవలసి వచ్చింది. దీనివల్ల రైతులు గ్రామాలను వదలి వెళ్లి పోయేవారు.

1820లో మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా నియమించబడిన తర్వాత రాయలసీమలో రైత్వారీ పద్ధతి శాశ్వతంగా అమల్లోకి వచ్చింది. రైత్వారీ విధానం అమలుచేయటంలో కంపెనీ అనుసరించిన పద్ధతుల వల్ల రైతాంగం బాగా దెబ్బతిన్నది. రైతులు ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయారు. కంపెనీ పరిపాలనా కాలంలో రైతాంగం పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. ''కంపెనీ పాలనకింద వున్న ప్రాంతాలలోని ప్రజల్లో దత్త మండలాల ప్రజలే కడుబీదవారు'' (మన్రో). తూర్పు ఇండియా పరిపాలనలో రాయలసీమ నిత్య కరువు కాటకాదులకు నిలయంగా మారిపోయింది.రాయలసీమ రైతాంగ జీవితంలో కరువులు అంతర్భాగమైపోయాయి.1870లలో కడప-కర్నూలు కాలువలను ప్రారంభించినా అనేక అవకతవకల వల్ల నిర్మాణం 1882 చివరినాటికి గాని పూర్తికాలేదు. ఈ కాల్వను ప్రధానంగా రవాణాకు వుద్దేశించటం వల్ల వ్యవసాయం ఆగిపోయింది. రాయలసీమ మరింత వెనుకబడిపోయింది. కరువు రాయలసీమ రైతాంగానికి జీవన్మరణ సమస్యగా తయారయింది. రాయలసీమ దక్షిణ భారతదేశంలో కరువు ప్రాంతంగా మారిపోయింది.

రాయలసీమ నామకరణం
ప్రస్తుతం రాయలసీమగా పిలువబడే ప్రాంతాలను 1800 ప్రాంతంలో నిజాం తూర్పు ఇండియా కంపెనీకి ఇవ్వటంతో అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని సీడెడ్‌ ప్రాంతంగాను లేదా దత్త మండలాలుగాను వ్యవహరిస్తూ వచ్చినారు. దత్త మండలాలుగా పిలువబడుతూ వచ్చిన ఈ ప్రాంతానికి అతి ప్రాచీనమైన చరిత్ర వుంది. నిజానికి తెలుగు ప్రజల మొదటి నివాస స్థానం ఈ ప్రాంతమేనని తెలియజెప్పే రుజువులు కూడా వున్నాయి. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి హిరణ్యక రాష్ట్రమని, రేనాడు మహారాజువాడి అని పిలిచేవారు.

దీర్ఘకాలం ఈ ప్రాంతం విజయనగర రాజులు పాలన కింద వుండటం వల్ల ఈ ప్రాంతం రాయలసీమగా వ్యవహరింపబడుతూ వస్తుందనేవారు. నిజానికి ఈ ప్రాంతాన్ని ''రాయలసీమ''అని పిలిచిందెవరు? ఆ నామకరణం ఎప్పుడు ఎట్లా జరిగింది? ''రాయలసీమ'' అనే పేరును బాగా ప్రచారంలో పెట్టిన వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు కావటం వల్ల ఆయనే ఈ ప్రాంతానికి ''రాయలసీమ'' అని నామకరణం చేసి వుంటారని అనుకుని నేను ఉదయంలో ఒక వ్యాసం రాసినాను. రాయలసీమ పేరు పెట్టింది చిలుకూరి నారాయణరావు గారని రుజువుల్తో అవధానం నాగరాజారావు గారు నా వ్యాసానికి ప్రతిగా ఉదయంలో రాసిన వ్యాసం చదివిన తర్వాత లోతులకెళ్ళి పరిశోధిస్తే చిలుకూరి నారాయణరావు గారే ఈ ప్రాంతానికి ''రాయలసీమ'' అని పేరు పెట్టినట్లుగా తేలింది. 16,17 శతాబ్దాల్లో ఈ ప్రాంతం మట్ల సంస్థానాధీశుల ఆధీనంలో వుండేది. ఈ కాలంలో రాయబడిన ''అభిషిక్త రాఘవము'' అనే ప్రబంధంలో ''రాయలసీమ'' అనే పేరు ఉంది.

''గాయకులశ్వరాయబల భానులు మట్ల అనంతరాజు కౌక్షేయక ధార ద్రెవ్విరని చెప్పె దరింతయ కాక వేలుపున్‌ రాయలసీమలోన చతురంగ బలంబుల తోడ వైరములే పాయక యున్న వారు సరిపాళెము వైచిన మట్ల జస్రమున్‌'' అని ఆ పద్యం. ఈ పద్యం మట్ల అనంతరాజును వర్ణించే సందర్భములోనిది. ఇంత ప్రముఖంగా వున్న రాయలసీమ పేరు ఎందుకనో ఆ తర్వాత మరుగున పడిపోయింది. ఎందుకు, ఎట్లా మరుగున పడిపోయిందనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత రాజకీయంగా సంభవించిన ఒడిదుడుకుల కారణంగా ఈ ప్రాంతం అనేక సంక్షోబాలకు గురయింది. 1792-99లలో టిప్పు సుల్తాను, తూర్పు ఇండియా కంపెనీ, నిజాం నవాబులు కలిసి చేసిన యుద్ద ఫలితంగా తంజావూరు రాజు పదవీచ్యుతుడయినాడు. అతని కింద వున్న నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొంతభాగం తూర్పు ఇండియా కంపెనీ వశమైనాయి. 1800లలో కడప, కర్నూలు, అనంతపురం, మదనపల్లి తాలూకాలు కూడా బ్రిటీషు వారి ఆధీనంలోకి పోయినాయి. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని దత్తమండలం అని, సీడెడ్‌ జిల్లాలని వ్యవహరిస్తూ వస్తున్నారు. దేశంలో జాతీయాభిమానం రగులుతున్న రోజుల్లో తెలుగువారిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులవి. అట్లాంటి సమయంలో రాజమహేంద్రవరం నుండి మహా మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ చిలుకూరి నారాయణరావు గారు ఉద్యోగ రీత్యా అనంతపురం వచ్చినారు. ఆయన వచ్చేనాటికి రాయలసీమ వాసుల్లో దత్త అనే మాట ఏవగింపు కలిగింది. ఆ పేరు బానిసత్వానికి చిహ్నంగా భావిస్తున్నారు. చిలుకూరి వారికి కూడా ఈ దత్త అనే పేరు వెగటుగా అనిపించింది. దత్త అనే పేరుతో 128 పంక్తుల్లో మంజరీ ద్విపదలో సీమ ఘనతను గానం చేసినారు.


దత్త నందురు నన్ను దత్త నెట్లగుదు
రిత్త స మాటలు చేత చిత్తముకలగె
ఇచ్చిన దెవ్వరో పుచ్చిన దెవరొ
పుచ్చుకొన్నట్టి యా పురుషులు నెవరొ
తురక బిడ్డం డిచ్చె దొరబిడ్డ పట్టె
అత్త సొమ్మును గొని యల్లుండు
దాన మమర జేసెనటన్న యట్లున్నదిది
 

అని ఎద్దేవా చేసినారు. సీమ ప్రాశస్త్యాన్ని కొనియాడారు…

ఆ రోజుల్లో రాయలసీమ వారు తమ హక్కులు, అవసరాల కోసం సంఘటితమవుతున్నారు. బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్న గుత్తి కేశవ పిళ్లైగారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్ల తమ ప్రాంతానికి వచ్చే లాభమేమిటని ప్రశ్నించినారు. ఈ ప్రాంతపు నలుమూలలా రాయలసీమ అవసరాల గూర్చిన ఆలోచన మొదలయింది. 1928 నవంబరు 17,18 తేదీలలో నంద్యాలలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. అప్పటికే రాయలసీమ వారి మనోభావాలను పసిగట్టిన కోస్తా ఆంధ్రులు మెళకువగా వ్యవహరిస్తున్నారు. 18వ తేదీన కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన ప్రథమ దత్త మండల సమావేశం జరిగింది. ఈ సభలో చిలుకూరి నారాయణరావు గారు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఏం పేరు పెడితే బావుంటుందన్న చర్చ ఈ సభలోనే జరిగింది. చిలుకూరి వారు గబుక్కున ''రాయలసీమ'' అన్నారు. సభలో పప్పూరి రామాచార్యుల వారిచేత ఒక తీర్మానం ప్రతిపాదింపజేసినారు. ఆ తీర్మానాన్ని సభ చేత ఆమోదింపజేసినది చిలుకూరివారే. ఆ పేరు రగులుకుంది. దావానలంలా వ్యాపించింది.

3-1-1946న చిలుకూరివారు ''మన రాయలసీమ భాషా సంపద'' అనే అంశం మీద రేడియో ప్రసంగం చేస్తూ 'రాయలసీమ' అనే పేరు పెట్టినందుకు గర్విస్తున్నట్టుగా చెప్పుకున్నారు. చిలుకూరి విషయానికి సంబంధించిన రుజువులు టేకుమళ్ల కామేశ్వరరావు గారి 'నా వాఙ్మయ మిత్రులు' అనే గ్రంథంలోను, 1948 నాటి మహోదయ వారపత్రికలోను ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే రాయలసీమ నామకరణం చేసినవారు చిలుకూరి వారేనని తెలుస్తున్నది.

About భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి

మేధావిగా, వక్తగా, రచయితగా, రాయలసీమ ఉద్యమకారుడిగా చిరపరిచితుడైన భూమన్ చిన్నతనంలోనే సాహిత్యం పట్ల మక్కువనూ, సమాజం పట్ల ప్రగతిశీల దృక్ఫథాన్నీ పెంచుకున్నారు. తన 18వ ఏటనే చలం ప్రభావంతో కొంతకాలం తిరువన్నామలైలో గడిపారు. 19వ ఏట నక్సల్బరీ, విప్లవ రాజకీయాల పట్ల ఉత్తేజితులై ఎందరో ప్రగతిశీల నాయకులకు సన్నిహితులయ్యారు. 1970 లో విరసం సభ్యుడై ఆ సంస్థ బాధ్యుడిగా కూడా కొంతకాలం వ్యవహరించారు. భారత చైనా మిత్రమండలి లో కూడా ఉన్నారు.

వీరి కవితలు “లే”, “విప్లవం వర్ధిల్లాలి” అనే కవితా సంకలనాల్లోనూ, “రాయలసీమ” పత్రికలోనూ ప్రచురితం అయ్యాయి. 1974లో చిత్తూరు కుట్ర కేసులోనూ, 1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) లోనూ అరెస్టు అయి జైలు నిర్భంధానికి గురయ్యారు. 1978లో జనసాహితి స్థాపక సభ్యులయ్యారు. 1984లో రాయలసీమ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు ఆ ఉద్యమ కార్యాచరణ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాయలసీమ గొంతుకగా వెలువడుతున్న “కదలిక” పత్రిక సంపాదక సభ్యులుగా ఉన్నారు.

రాయలసీమ ఉద్యమంలో భాగంగా పోతిరెడ్డిపాడుకు సాగిన పాదయాత్ర బృందంలో ప్రముఖ భూమికను పోషించారు. 1990 లో రాయలసీమ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కన్యాశుల్కం నూరేళ్ళ పండుగ, చలం శతజయంతి సభలను ఘనంగా నిర్వహించారు. సీమసాహితి పత్రిక, సంస్థ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. రాయలసీమ సమస్యలపై వివిధ పత్రికల్లో వందలాది వ్యాసాలను రచించారు. భూమన్ రచించిన రాయలసీమ వ్యాసాల సంకలనం “రాయలసీమ ముఖచిత్రం” అత్యంత ప్రజాదరణను పొందింది. వృత్తి రీత్యా తిరుపతి ఎస్.వి. ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా, శ్వేత డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.