చరిత్రలో రాయలసీమ


 

ధారాదత్తం చేసాక..కర్నూలులో నూతన శిలాయుగపు పరికరాలు దండిగా దొరికినాయి. పత్తిపాడు వద్ద జాడీలు, చుట్టగుదురులు, లోటాలు, మాదిరి చిన్న పాత్రలు, కుదురు బిళ్ల, చిన్న గుర్రపుబొమ్మ, ఇంకా అనేకానేక ఆసక్తికరమయిన వస్తువులు దొరికినాయి. భారతదేశంలో మరెక్కడా దొరకని కొమ్ముకుండ ఒకటి ఇచ్చట దొరికింది. బహుశ పాలు, పెరుగులకు దీనిని ఉపయోగించి వుంటారని అనుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో వుంది. పత్తికొండ తాలూకా కప్పతల్లి మిట్టమీద, వస్తువులు మెరుగు పెట్టేందుకు వుపయోగించిన గాడి పల్లాలు దొరికాయి. ఆనాడు సున్నపురాతితో బండి చక్రాలు తయారు చేసేవారని తెలుస్తున్నది. నూతన శిలాయుగపు ప్రారంభదశలో జనం గుహలు మొదలైన ప్రకృతి సిద్దమయిన రక్షణ ప్రదేశాలలోనే వుండేవారు. సేద్యాలు చేసేవారు.భారత పురావస్తుశాఖ వారి 1968 నాటి పరిశోధనలలో ఈ విషయం బయట పడింది.


కడప జిల్లా ఎర్రగుంట్ల అనివేములలో చాలా సమాధులు (సిస్ట్‌లు) దొరికాయి. వాటిని అక్కడివారు పాండవగుళ్లు అంటారు. చిత్తూరు జిల్లాలో నవీన శిలాయుగం నుండి మానవులు నివసించినట్టు అక్కడ కనిపించే పాండవ గుళ్ల వలన తెలుస్తున్నది. టాలేమి, ప్లినీ రాత ప్రతుల్ని బట్టి కోరమండల్‌ చేరిన ఈ ప్రాంతం క్రీ.శ.1వ శతాబ్దానికి జనవాహితమయినట్టు తెలుస్తున్నది.

 

1859 లో మద్రాసు ప్రావిన్సు
 

అనంతపురం పట్టణానికి 12 మైళ్ల దూరాన వున్న కాలమేదునూరు మిట్ట మీద నూతన శిలాయుగపు వుత్తర దశ నాటి జనావాసం కనబడింది. నూతన శిలాయుగపు జనావాసం తరువాత ఇక్కడే ఇనుప యుగం ప్రారంభమయినట్టుగా తెలుస్తున్నది. గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు సమీపంలో నూతన శిలాయుగపు, ఇనుప యుగపు జనావాసాలు పక్కపక్కనే కనిపించాయి. ఈ జిల్లాలో ముదిగల్లు, దేవాదుల బెట్ట మాల్వవంతం, కొండాపురం, పూతేరులలో సిస్ట్‌లు కనిపించాయి. ముదిగల్లులో ఈ సిస్ట్‌లు 6-7 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో చెదిరి వున్నాయి. రాయలసీమను మౌర్యులు, పల్లవులు, శాతవాహనులు, చాళుక్యులు పరిపాలించారు. క్రీ.శ. 3వ శతాబ్దంలోచిత్తూరు జిల్లా పల్లవుల రాజ్య పాలన కింద ఉండేది. అనంతపురం జిల్లా అశోకుని తర్వాత పల్లవుల పాలనలోకి వచ్చింది. శాతవాహన పతనానంతరం క్రీ.శ. 2వ శతాబ్దంలో కడప జిల్లా పల్లవుల పరిపాలన కిందకొచ్చింది. కర్నూలు జిల్లా తెలుగు చోళుల పాలనలో ఉండేది. ఆంధ్రదేశాన్ని దీర్ఘకాలం పరిపాలించి, ఆంధ్ర చరిత్రలో కొన్ని నూతన అధ్యాయాలను నెలకొల్పిన చాళుక్యుల జన్మస్థలం కడప జిల్లా. ప్రాచీన కాలంలో ఈ జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారు. బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందులు సంఘర్షిస్తున్న కాలంలో రాయలసీమకు చెందిన రేనాడులో తెలుగు చోళులు పరిపాలించేవారు. ఈ కుటుంబానికి చెందిన కరికాలచోళుడు, త్రిలోచనపల్లవుడనే 4వ విజయస్కంద వర్మను ఓడించాడు. ఈయనే చోళ వంశారంభకుడు. ఇతని వారసులు కడప జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకాలను క్రీ.శ. 700 వరకు పరిపాలించినారు. మదనపల్లె తాలూకాలోని చిప్పిలి వారి రాజధానిగా వుండేది. క్రీ.శ. 5,8 శతాబ్దాల మధ్య కడప, కర్నూలు జిల్లాలను పాలించిన రేనాటి చోళులు తమ శాసనాలలో ప్రాచీన తెలుగును ఉపయోగించినారు. ఈనాడు వానిని అర్థం చేసుకోవడం కష్టం. రేనాటి చోళులు తెలుగు పద్యానికి రాజాదరణ నిచ్చినారు.

కొంతకాలం పల్లవులకిందా, మరి కొంతకాలం చాళుక్యుల కిందా సామంతులుగా వుండిన రేనాటి చోళులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు, మండలాలుగా విభజించినారు. మండలాలను గ్రామాలుగా విభజించినారు. పశుసంపదను రక్షించటంలో ప్రాణాలు అర్పించిన వీరుల సంస్మరణార్థం ఆనాడు నాటిన రాతిస్థంభాలు రాయలసీమ గ్రామాలలో నేటికీ వున్నాయి. ఆనాటి చోళరాజులు అనేక చెరువులు తవ్వించినారు.

కాకతీయులు తమ రాజ్యాన్ని రేనాడు, మురికినాడు, ఏరువనాడులుగా విభజించి పరిపాలించారు. కడప, కర్నూలు జిల్లా భాగాలు ఏరువనాడుగా విభజింపబడినాయి. కాకతీయులు వ్యవసాయాన్ని బాగా అభివృద్ది చేసినారు. భూములను కొలిచి తరగతుల కింద విభజించారు. భూసారాన్ని బట్టి పన్నులు విధించారు. కాలువలు, చెరువులు తవ్వినారు. అంజూపురం లాంటి కొన్ని గ్రామాలు వెలిసాయి. "పొత్తపినాడు పౌరులు అత్తిరాళ్లలోని పరమేశ్వర దేవాలయంలో సభ జరిపి చెయ్యేరు దక్షిణపు ఒడ్డున కరకట్ట పోసి పరమేశ్వర దేవాలయానికి వరద ముంపు కాకుండా చెయ్యటానికై గ్రామానికో మాడ వసూలు చేయ నిశ్చయించినారు'' అని ఒక శాసనం తెలుపుతోంది. కర్నూలు జల్లా అడవిగా వుండటం చూసి ప్రతాపరుద్రుడు ఉత్తర దిశ నుంచి నీటి పారుదలకు ప్రోత్సాహం ఇచ్చినాడు. అడవి కొట్టించి, గ్రామాలు నిర్మించి భూముల్ని ఉచితంగా ఇచ్చినాడు.


13వ శతాబ్దంలో మొదట్లో యదవసింగన పరిపాలన కాలం నాటి అనంతపురం జిల్లాలో వ్యవసాయదారుల సంఘం గురించిన సమాచారం వుంది. ఆ సంఘం పేరు ''చిత్రమేలి''. ఇది స్థానిక రైతులు ఏర్పరచుకున్న సంఘం. ఇటువంటి సంఘం ప్రసక్తి ఇక్కడ తప్ప మరెక్కడా కనబడదు. క్రీ.శ. 1136 నుండి 1650 వరకు అధికారంలో వున్న విజయనగర సామ్రాజ్యంలో రాయలసీమ ప్రాంతం ప్రముఖ పాత్ర వహించింది. విజయనగర రాజుల కాలంలో రాయలసీమ రతనాల సీమగా వెలుగొందిందని ప్రతీతి. విజయనగర రాజులు అంతకు ముందు ఎన్నడూ జరగని విధంగా వ్యవసాయాన్ని అభివృద్ది పరిచారు. నీటి పారుదల ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అనేక చెరువులు, కాల్వలు, ఆనకట్టలు కట్టించారు. ఆనాడు పళ్లు, పత్తి, చెరకు, కొబ్బరి, తమలపాకు, పోక, ధాన్యం, పప్పుదినుసులు, మొదలైన అనేక రకాల వ్యాపార పంటలు విస్తారంగా పండేటివి. విజయనగర కాలంలో1) నికొలాయే కాంటి-ఇటలీ-1420, 2)అబ్దుల్‌రజాక్‌ -పర్షియా-1422-45, 3) లుడోవికోడ్‌-వార్థేమా-ఇటలీ-1505-09, 4)దార్తే బార్బోసా-పోర్చుగీసు-1504-14,5)నన్నీజ్‌-పోర్చుగీసు-1535-37, 6) సీజర్‌ ఫ్రెడలి-కూవెన్నీస్‌-1563-67,7) ఫిలిప్పీ-ఇటలీ-1584-85, 8)సాస్పెట్టీ-ఇటలీ-1584-85, 9) పీజ్‌: మొదలయిన విదేశీయులు విస్తృతంగా పర్యటించి నాటి పరిపాలనను ఘనంగా కీర్తించారు. ఆనాటి రాజులే గాక రాణులు, ఉద్యోగులు అనేక చెరువులు కట్టించినట్టుగా ఆధారాలున్నవి.


1565లో తళ్లికోట యుద్ధంలో బహమనీ సుల్తానులు విజయం సాధించటంతో, విజయనగర రాజులు తమ రాజధానిని హంపీ నుండి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు మార్చుకున్నారు. యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ఓడినా, పూర్తిగా పతనం కాలేదు. బీజాపూర్,‌ గోల్కొండ నవాబులు బలపడ్డారు. 1650లో వీరు పెనుగొండ మీద దాడిచేసి విజయనగర రాజ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసారు. నవాబులు సరయిన ప్రభుత్వాన్ని ఇవ్వలేకపోయారు. రాజ్యం చిన్న చిన్న ప్రభువుల ఆధీనంలో వుండేది. 1677-78 ప్రాంతంలో శివాజీ పాలన కింద, తరువాత నిజాం ఆధిపత్యాన, తరువాత మైసూరు రాజ్యంలో హైదరాలీ కింద, 1792 ఒప్పందంతో నిజాం కిందికి వచ్చాయి. 1800 ఒప్పందంతో నిజాం సీడెడ్‌ జిల్లాలను తూర్పుఇండియా వారికి అప్పజెప్పాడు. రాయలసీమ ప్రాంతం ఆనాటి ప్రత్యేకత పాలెగాళ్ల వ్యవస్థ. విజయనగర సామ్రాజ్యంలో ఈ వ్యవస్థ ఏర్పడింది. విజయనగర పాలనా సౌలభ్యం కొరకు వివిధ ప్రాంతాలుగా విభజించి అధికారులను నియమించారు. పన్నులు వసూలు చేయటం, రక్షణ – కాపలాదార్లుగా వుండటం, రాజుకు అవసరమైన సైన్యాలను సమకూర్చటం వీరి బాధ్యత. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ వ్యవస్థ క్రమేణా దిగజారి అరాచక పరిస్థితి ఏర్పడింది. 18వ శతాబ్దంలో పాలెగాళ్లు నైజాం అధికారాన్ని మన్నించారు.

About భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి

మేధావిగా, వక్తగా, రచయితగా, రాయలసీమ ఉద్యమకారుడిగా చిరపరిచితుడైన భూమన్ చిన్నతనంలోనే సాహిత్యం పట్ల మక్కువనూ, సమాజం పట్ల ప్రగతిశీల దృక్ఫథాన్నీ పెంచుకున్నారు. తన 18వ ఏటనే చలం ప్రభావంతో కొంతకాలం తిరువన్నామలైలో గడిపారు. 19వ ఏట నక్సల్బరీ, విప్లవ రాజకీయాల పట్ల ఉత్తేజితులై ఎందరో ప్రగతిశీల నాయకులకు సన్నిహితులయ్యారు. 1970 లో విరసం సభ్యుడై ఆ సంస్థ బాధ్యుడిగా కూడా కొంతకాలం వ్యవహరించారు. భారత చైనా మిత్రమండలి లో కూడా ఉన్నారు.

వీరి కవితలు “లే”, “విప్లవం వర్ధిల్లాలి” అనే కవితా సంకలనాల్లోనూ, “రాయలసీమ” పత్రికలోనూ ప్రచురితం అయ్యాయి. 1974లో చిత్తూరు కుట్ర కేసులోనూ, 1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) లోనూ అరెస్టు అయి జైలు నిర్భంధానికి గురయ్యారు. 1978లో జనసాహితి స్థాపక సభ్యులయ్యారు. 1984లో రాయలసీమ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు ఆ ఉద్యమ కార్యాచరణ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాయలసీమ గొంతుకగా వెలువడుతున్న “కదలిక” పత్రిక సంపాదక సభ్యులుగా ఉన్నారు.

రాయలసీమ ఉద్యమంలో భాగంగా పోతిరెడ్డిపాడుకు సాగిన పాదయాత్ర బృందంలో ప్రముఖ భూమికను పోషించారు. 1990 లో రాయలసీమ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కన్యాశుల్కం నూరేళ్ళ పండుగ, చలం శతజయంతి సభలను ఘనంగా నిర్వహించారు. సీమసాహితి పత్రిక, సంస్థ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. రాయలసీమ సమస్యలపై వివిధ పత్రికల్లో వందలాది వ్యాసాలను రచించారు. భూమన్ రచించిన రాయలసీమ వ్యాసాల సంకలనం “రాయలసీమ ముఖచిత్రం” అత్యంత ప్రజాదరణను పొందింది. వృత్తి రీత్యా తిరుపతి ఎస్.వి. ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకులుగా, శ్వేత డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.