నీల గ్రహ నిదానము – 2

(అర్ణవ ష్ఠీవి, సుమంత్రుల వారితో ప్రవేశం)

సుమంత్రుడు: మహారాజులకు జయమగు గాక!

దశరథ: అమాత్యవర్యా! మీ నిద్రాభంగము చేసినందులకు మమ్ములను..

సుమంత్ర: (అడ్డుపడి) మహాప్రభూ! మీ సౌజన్యము అనన్య సామాన్యము! సేవకుని కడ మన్నన లెందుకు? ఈ సుమంత్రుడు మీ ఆజ్ఞా బద్ధుడు.

దశరథ: మీరు అంతటి స్వామి భక్తి పరాయణులే! అర్ణవా, అమాత్యులను పిలిపించిన కారణము నీవు వారితో చెప్పితివా?

సుమంత్ర: దారి పొడవునా చెప్పుతూనే ఉన్నాడు మహారాజా! అరిష్ట చిహ్నములు మీకు కూడ స్వప్న దృశ్యములయినవట కదా?

దశరథ: అవును అమాత్యా! అవి అరిష్ట చిహ్నములే నందురా?

సుమంత్ర: నా కవి అటులనే గోచరించు చున్నవి. మహాప్రభూ! త్రికాల దర్శులయిన ‘వశిష్ట’ మహర్షి నారద మునీంద్రుల పిలుపున, రాజ్యము వదిలి నేటికి నాలుగు దినములు అయినది..

దశరథ: అవును, వారున్న యెడల వీటి అర్థము కరతలామలక మయ్యెడిది కదా! మహామంత్రీ, మీ ఎరికన వీటి అంతరార్థము తెలుపగల సమర్థు లెవరును లేరా?

సుమంత్ర: లేకేమి రాజేంద్రా! మన రాజపురోహితులు థౌమ్య మహాశయులు [ఈ పేరు నాటక రచయిత కల్పితం] అందులకు సర్వ సమర్థులు. (భటులతో) అకంపనా, అర్ణవ ష్ఠీవీ!

భటులు: ఆజ్ఞ మహామంత్రీ!

సుమంత్ర: తెల్లవారుట కింకను అర్థఝాము మాత్రమే ఉన్నది. మన రాజ పురోహితులు థౌమ్యుల వారు, ప్రాతఃకాల సంధ్యాదికములు నెరవేర్చుకొనుటకు, సరయూ తీరమునకు వెళ్లునది ఈ సమయమందునే. మీరూ సరయూ తీరమునకు వెడలి వారికి రాజాజ్ఞ నెరిగించి, తోడ్కొని రండు.

దశరథ: భటులారా! భూసురుల కడ తొందరపాటు పనికిరాదు. వారి స్నాన సంధ్యాధికములు పూర్తయిన తర్వాతనే తీసికొని రండు.

భటులు: ఆజ్ఞ ప్రకారము అటులనే చేసెదము మహారాజా! (వెళ్లిపోతారు)

దశరథ: అమాత్యా! థౌమ్య మహాశయులు విచ్చేయు లోపున, ప్రాతఃకాల కాలకృత్యములు నెరవేర్చుకొని వచ్చెదను గాక! మీరు సుఖాసీనులు కండు. (వెళ్లిపోతాడు)

సుమంత్ర: (జనాంతికముగా) మహారాజులకు స్వప్నమందును, భటులకు ప్రత్యక్షముగను కన్పించిన అరిష్ట చిహ్నములకు కారణమేదియో? రాక్షసమాయ కాదు గదా? పరీక్షించెదము గాక!

(సుమంత్రుడు గదిలో వస్తువులని పరిశీలనగా చూస్తూ, రాజు పడుకొన్న పాన్పు దగ్గరకు వెళ్తాడు. పాన్పును, తలగడలను చూస్తూ, పైకెత్తి చూస్తాడు)

(తెరలో భయం గొలిపే మ్యూజిక్! పిల్లి, కుక్క, కోతి లాంటి అరుపులు వినిపించి అతనిని భయ సందేహాలకు గురి చేస్తాయి)

(ప్రవేశం :: భటులు, విప్ర వేషంలో ఉన్న బుధునితో పాటు)

భటులు: జయము జయము మహామంత్రీ! మీ ఆజ్ఞ ప్రకారము థౌమ్యులవారిని తొడ్కొని వచ్చాము.

సుమంత్ర: (బుధుని చూసి ఆశ్చర్యపోతాడు) ఆర్యా! మీరెవరు? (భటులతో) రేయ్, మందబుద్ధులారా! సరయూతీరము నుండి, రాజ పురోహితులు థౌమ్యుల వారిని తెమ్మంటే యీ బడుగు బాపడిని వెంటపెట్టుకు వచ్చారెందుకు? (బుధునితో) అయ్యా! మీరెవరు?

బుధుడు: మహామంత్రీ! నా పేరు సౌమ్యుడు. మీ భటులు పాపము, సరయూ తీరమందు రాజపురోహితులను గానక, వారిని నెరియల యందును, బొరియల యందును వెదకుచుండుట చూసి, సౌమ్యగుణ సంపన్నుడను గావున, జాలిపడి, నేనే థౌమ్యుడనని చెప్పి, ఇటుల వచ్చితిని.

సుమంత్ర: అటులనా, విప్రవరేణ్యా! నమస్కారము. మా భటులకు రాజపురోహితుల ఎరిక లేకపోవుట మా దౌర్భాగ్యము. అయినను, థౌమ్యుల పేరు చెప్పుకొని తమరు వచ్చుటకు కారణము మాత్రము అగోచరము. ఏనుగు పేరు పెట్టుకొన్నంత మాత్రమున..

అకంపన: ఊఁరకుక్కలు ఏనుగులవుతాయా? మహామంత్రీ, ఈయన మమ్మల్ని మోసపుచ్చాడు.

అర్ణవ: మీ సెలవయినచో పెడరెక్కలు విరిచి కట్టి-

సుమంత్ర: వలదు భటులారా! అటుల చేయదగదు. అయోధ్యలో విప్రుల కవమానము రాజావమానమే యగును.

బుధుడు: అదిగదా, అజకుమారుని సౌజన్యము! అట్టి రాజుకు మంత్రి అయిన మిమ్ములను, అది లేశమైన అంటక పోవుట – నిర్మల జల మధ్యమందున్నను, గాత్ర సౌలభ్యమబ్బని మండూకము వలె నిష్ప్రయోజనము!

సుమంత్ర: ఏమి! నేను కప్పవలె బెకబెకలాడు చుంటినా? విప్రుడా, నీవు హద్దు మీరి మాట్లాడుతున్నావు.

బుధుడు: సుమంత్రా! ఈ సౌమ్యుడెవరో తెలియక నీవే హద్దు మీరుతున్నావు.

(ప్రవేశం :: దశరథుడు)

దశరథ: అమాత్యా! థౌమ్య మహాశయులు విచ్చేసినారా? (అని బుధుని చూసి ఆశ్చర్యపోతాడు)

బుధుడు: అజకుమారా! నీకు జయమగు గాక!! నేను సౌమ్యుడను, అత్రి మహాముని పౌత్రుడను. సర్వశాస్త్ర పారంగతుడను, శుక్రాచార్యుని కడ వేద వేదాంగములే కాక తంత్రము కూడ నేర్చిన వాడను. నీవు పిలువ నంపిన థౌమ్యునకు బదులుగా, నీ ఇంగిత మెరిగి, వచ్చిన వాడను.

సుమంత్ర: మహారాజా! ఈతడు తన పేరే థౌమ్యుడని చెప్పి మన భటులని మోసపుచ్చి వచ్చినాడు.

దశరథ: థౌమ్య, సౌమ్య నామముల సామ్యము చేత మన భటులే పొరబడి ఉండవచ్చు గదా! అమాత్యా, భూసురులకు అసత్య దోషము నాపాదింపకుడు. మన ఇంగిత మెరిగి వచ్చిన వారిని మనము గౌరవింప వలె!

సుమంత్ర: అవశ్యము మహాప్రభూ! కాని ఈతడు మన ఇంగితమెరిగి గాక, తన ఇంగితము సాధించుకొనుటకు వచ్చినట్లున్నది. రాక్షస గురువైన శుక్రాచార్యుల శిష్యుడైన ఈతడు భూసురుడు కాక, అసురుడై యుండనోపునని తోచుచున్నది.

భటులు: అయ్యబాబోయ్! రాక్షసుడా?

బుధుడు: సుమంత్రా! ఏమి నీ వాచాలత్వము? నన్ను ‘భూసురుడు’ కాదనిన అనెదవుగాక ‘అసురుడనుట’ మాత్రము క్షంతవ్యము కాదు.

సుమంత్ర: ఎందులకు కాదు? విప్రుడవే అయిన వేద వేదాంగ పఠనముతో తృప్తినందక, తంత్రము నేర్చుటేల?

బుధుడు: తంత్రము నీ రాజకీయ కుతంత్రముల కన్న తుచ్ఛమైనది కాదురా తెంపరీ!

దశరథ: (అడ్డు పడి) మహాత్మా శాంతించండి. సత్వగుణ సంపన్నులయిన మిమ్ములను రెచ్చగొట్టుట మా అమాత్యులదే పొరపాటు. మీ రాక మాకు పరమానందకరము, శుభప్రదము అయినది. మా వలన అయిన అపరాధము మన్నించి శాంతింపుడు. (మంత్రితో) సుమంత్రా! అయోధ్యలో బ్రాహ్మణులకు రాజదర్శనము ఎట్టి సమయము నందైనను నిషేధము కాదన్న శాసనము మీకు తెలియనిది కాదు. రాజాజ్ఞను ఉల్లంఘించినందులకు మీకు పది పణములు దండన విధించితిని. ముందీ బ్రాహ్మణునకు క్షమాభిక్ష వేడి, సుంకము కోశాధికారికి చెల్లింపుడు. (భటులతో) భటులారా! చెప్పిన పనిని చెరుపు చేసినందుకు, మీ కిరువురకు చెరి రెండు పణములు శిక్ష విధించితిని. మీరు, మీ వాచాలత వలన ఈ భూసురునికి జరిగిన అవమానమునకు క్షమాభిక్ష కోరుకొనుడు.

భటులు: సౌమ్య విప్రవరేణ్యా! క్షమింపుడు.

సుమంత్ర: (ముందు రాజుకి నమస్కరించి) ప్రభూ! మీ ఆజ్ఞా ధిక్కారము మాకు ఆత్మహత్యా సదృశము! జీవితము మీ సేవకే అంకితము చేసిన యీ సేవకుడు సౌమ్యునకు నమస్కరించు చున్నాడు. (నమస్కరించి) విప్రోత్తమా, తొందరపాటుతో నేను చేసిన తప్పిదమును మన్నింపుడు.

బుధుడు: (భటులతో) భటులారా, లెండు! (మంత్రితో) మహామంత్రీ! మీది తొందరపాటు కాదు, కర్తవ్య నిర్వహణ యందు తప్పనిసరియగు రాజకీయ మంత్రాంగము! కనుక మీ తప్పేమియు లేదు (దశరథునితో) అజకుమారా! నీ సౌజన్య సచ్ఛరిత్రములు మా కెంతయు సంతసము కలిగించినవి. అవి అజరామరమగును గాక! (దీవిస్తాడు)

దశరథ: మహాత్మా! మీ ఆశీర్వాదములు మా కెంతయో శ్రేయోదాయకములు. థౌమ్యులయినను సౌమ్యులయినను ఈ ప్రాతః కాలమున మేము పిలిపించినది..

బుధుడు: మీకు కనిపించిన అరిష్ట చిహ్నములకు కారణ మరయుటకే, అవునా?

దశరథ: అవును.

బుధుడు: రాజా! నీ కాప్త మిత్రులు, హితులు, సన్నిహితులు, ప్రజలు, భృత్యులూ.. వేయేల, అయోధ్య యందే గాక నీ రాజ్యము మొత్తము, మృత్యుదేవతకు కబళము కానున్నారు. అదియే యీ అమంగళ దృశ్యముల అంతరార్థము.

(అందరూ ఆ వార్త విని నివ్వెర పోతారు. దశరథుడు చెవులు మూసుకొంటాడు)

దశరథ: హరి హరీ! ఎట్టి దుర్వార్త వినవలసి వచ్చినది!! మహాత్మా, మీరు చెప్పునది నిజమేనందురా?

బుధుడు: సందేహము వలదు రాజేంద్రా! మానవులే కాదు.. పశువులు, సర్పములు, లతలు, వృక్షములు, మొదలగు తిర్యగ్ స్థావర సముదాయములు కూడ నశింప నున్నవి. అదియే కాక..

దశరథ: అమంగళము ప్రతిహతమగు గాక! విప్రోత్తమా, మీరు చెప్పునది ఇంకేది మిగిలినను సత్వరము చెప్పివేయుడు. ఈ దశరథుడు గుండె రాయి చేసుకొని వినుటకు సంసిద్ధుడై యున్నాడు.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

2 Responses to నీల గ్రహ నిదానము – 2

  1. Ravi Kumar says:

    Waiting for further scenes

    Curious to know what the writer wants to say

Comments are closed.