నీల గ్రహ నిదానము – 1

మూడవ దృశ్యము

(రోహిణి అంతఃపురము)

(రోహిణీ చంద్రులు పాన్పు లేదా తూగుటుయ్యాలపై కూర్చొని ఉంటారు)

(రోహిణి నాథునికి తాంబూలం అందిస్తుంది)

రోహిణి: (చంద్రునికి తన నోరు చూపిస్తూ) చూసారా నాథా! నా నోరు ఎలా పండిందో!

చంద్రుడు: తాంబూల సేవనానికి ముందు వెనకలు తెలియడం లేదు రోహిణీ! నీ నోరు ఎప్పుడూ ఎర్రనే!

రోహిణి: ఊఁ సరసోక్తులకు మీకు మీరే సాటి!

చంద్రుడు: ఇవి సరసోక్తులు కావు రోహిణీ!

రోహిణి: మరి చతురోక్తులా?

చంద్రుడు: కావు సుమా! చంద్రోక్తులు!

రోహిణి: సరిలెండి! ఇలా మాటలతో ప్రొద్దు పుచ్చుతారా?

చంద్రుడు: సంగతికి ఇష్టసఖి ఇంగితమూ వలదా మరి! దరిచేర రమ్ము రోహిణీ! (ఆమె చెయ్యి పట్టి లాగుతాడు)

రోహిణి: ఇప్పుడు కాదు స్వామీ! కాస్త ఆగండి. (అతని వైపు లాగబడుతూనే, ఏదో వింటున్నట్లు ఆగి పోతుంది, తరువాత చెయ్యి విడిపించుకొని)

చంద్రుడు: ఏమయినది రోహిణీ? తొందర చేసినది నీవే కదా!

రోహిణి: అవును నాథా! ఇప్పుడు వద్దంటున్నాను.

చంద్రుడు: ఏందుకని దేవీ?

రోహిణి: అదేమిటి! మీకు వినిపించనే లేదా?

చంద్రుడు: వినిపించుటయా? ఏదీ, ఎక్కడ?

రోహిణి: నారాయణ నామస్మరణ! (అంటూ వింగ్ వైపు చూపిస్తుంది) అదుగో ఆ మబ్బుల చాటున!

(చంద్రుడు ఆ వైపు చూస్తాడు. తెరలోంచి ‘”నారాయణ, నారాయణ'” అన్న నారదుని కంఠ స్వరం వినిపిస్తుంది.)

చంద్రుడు: అవును నిజమే! నారద మహర్షియై యుండనోపును!

రోహిణి: అవును, సందేహం లేదు, ఆ కంఠస్వరం అతనిదే! (అంటూ దిగ్గున లేచి వింగ్ వైపు వెళ్తుంది.) దేవర్షీ! ఈ రోహిణి తన సదనానికి మిమ్ములను ఆహ్వానిస్తోంది, రండి లోపలికి రండి.

(నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ ప్రవేసిస్తాడు)

(చంద్రుడు పాన్పు దిగి స్వాగతం పలుకుతాడు)

చంద్రుడు: మునీంద్రా! ఇటు ఇలా వచ్చి ఆశీనులు కండు.

నారదుడు: మన్ననలకు మించిపోయినదేమీ లేదులే చంద్రా!

చంద్రుడు: మహర్షీ! మీ మాటలలో ఏదో శ్లేష స్ఫురిస్తోంది!

నారదుడు: కార్యార్థినై కాక, ఇటు మీ దంపతుల రాసక్రీడలు చూడడానికి వచ్చాననుకొన్నావా రోహిణీ పతీ?

రోహిణి: చెప్పండి అన్నయ్యా! నా సవతులు ఎవరెవరిని ఆశ్రయించారో?

నారదుడు: రోహిణీ! నీ బుద్ధి చాల చురుకైనది! అందుకే నాథుని, కనుసన్నులలో నిల్పుకో గలిగావు. నీ సోదరీ మణులు కాదు, కాదు, సవతులు ఆశ్రయించినది వేరెవరినో కాదు, శనైశ్వరుని!
గీ||

కాచుకొమ్మిక రోహిణీ! గగన సీమ
మంట మండింప నుండె నీ మత్సరమ్ము
శంకరుని నైన పీడింప శక్తుఁడౌచు
పట్టనున్నాడు శని నిన్ను భావియందు

రోహిణి: ఎవరు, శనైశ్వరుడా?! (నివ్వెర పోతుంది) నాథా! శని సామాన్యుడు కాదు. మా బావ ఈశ్వరునే చిత్త చాంచల్యమునకు గురిచేసి, అక్కతో వియోగము కల్పించిన వాడు. (నారదునితో) మునీంద్రా! శనైశ్వరుడు వారికి ఆశ్రయ మిచ్చినట్లేనా?

నారదుడు: సందేహించకు రోహిణీ! అతడు త్వరలోనే నీ కక్ష్యలో ప్రవేశింప నున్నాడు.

రోహిణి: (కలవర పాటుతో) నాథా! ఇప్పుడేది దారి?

చంద్రుడు: నారదా! ఇప్పుడేది దారి?

నారదుడు: ఏ దారి ఎటో నా కెలా తెలుస్తుంది? శశాంకా! మార్గాంతరము…

ఇద్దరూ: మీరే చెప్పాలి మునీంద్రా! !

(రోహిణీ చంద్రులిద్దరూ నారదుని చెరొక చెయ్యి పట్టుకొని, పాన్పు వరకు తీసుకెళ్లి కూర్చోపెడతారు. ప్రక్కనే చేతులు కట్టుకొని నిలబడతారు)

రోహిణి: అన్నా నారదా! శనైశ్వరుడు నన్నెన్ని ఇక్కట్ల పాలు చేసినను నాకు సమ్మతమే! కాని నా నాథునితో వియోగము నేను సహింపలేను.

చంద్రుడు: దక్షుని శాపముతో సగము చచ్చిన నేను, రోహిణీ సందర్శనము కూడ కరువైనచో జీవచ్ఛవము కాగల వాడను.

నారదుడు: అందుకని –

ఇద్దరూ: ఏదైన ఉపాయము సెలవింఢు.

నారదుడు: ఒకే ఒక ఉపాయమున్నది.

ఇద్దరూ: (ఆతృతతో) చెప్పండి మునీంద్రా! !

నారదుడు: చుక్కలతో సంధి సామరస్యాలే ఈ చిక్కులు తప్పించగలవు. అది మీకు ఇష్టమయితే –

రోహిణి: (చివాలున నాగినిలా లేస్తుంది) అది మా కిష్టమయితే మీరు రాయబారం నడుపుతారా, మహర్షీ?

నారదుడు: అవునమ్మా, నీ అన్నగా ఆ మాత్రం భాద్యత వహించడంలో తప్పేముంది!

రోహిణి: ఈ రోహిణి, సవతులకి నాథుని శయ్య నర్పించి, ఎలా సంతోషిస్తుందనుకొన్నారు అన్నయ్యా? అంతకన్న శని చేత పీడింపబడుటయే నాకు పరమానంద కరము.

నారదుడు: రోహిణి అభిప్రాయము తెలిసినది. నీవేమందువు చంద్రా?

చంద్రుడు: తారలతో సామరస్యము, నా ఒక్కని అంగీకారముతో జరుగునది కాదు నారదా! అట్లని రోహిణిని శనిపీడకు గురిచేయలేను కూడ..

రోహిణి: (రోషంతో) నాథా! మీ మగబుద్ధి పోనిచ్చుకొన్నారు కాదు గదా! నేను ఒప్పుకొంటే మీరు ఆ తారలతో సరసానికి సిద్ధమేనన్న మాట!

చంద్రుడు: రోహిణీ! వ్యర్థ వార్తాలాపములకు ఇది సమయము కాదు. పరిస్థితిని సమీక్షించుట మంచిది. (ఆమె దగ్గరగా వచ్చి) నీ ఇడుములు నాకు సహ్యములైన కుడుములా దేవీ! మహర్షి ప్రస్తావన సమంజసమగునో లేదో పునరాలోచించు.

రోహిణి: (దుఃఖావమానాలతో) మీకేమి స్వామీ! ప్రాణనాథునితో పరాయి నారిని ఊహించుటయే నారీ హృదయమునకు ఎంతటి ఘాతుకమో మీకెట్లు తెలియ గలదు?! అయినను ఆలోచించు కొనుటకు ఏమున్నది? (గంభీరముగా) ఒక వైపు రోహిణి, మరొక వైపు తక్కిన చుక్కలు- మీకు ఎవరు వలయునో మీరే నిర్ణయుంచుకొనుఢు (అంటూ మూఖాన్ని చేతుల్లో దాచుకొని విలపిస్తుంది)

(చంద్రుడు కింకర్తవ్యతా విమూఢుడై ఆమె వంక చూస్తూ కాసేపు నిలబడి పోతాడు. తరువాత దగ్గరగా వస్తాడు)

చంద్రుడు: దుఃఖించకు రోహిణీ! నాకు ఈ లోకమంతయి నీ తర్వాతనే దేవీ! నిన్ను విడిచి పెట్టి నేను మనజాలను. ఇప్పుడే ఇంద్రోపేంద్రుల కడకు వెళ్లి దీని తరుణోపాయము కొరకు ప్రార్థించెదను. (నారదునితో) నారద మునీంద్రా! నేను వచ్చునంత వరకు మీరు రోహిణిని కనిపెట్టి ఉండండి. (వెళ్లిపోతాడు)

రోహిణి: (వెళ్తున్న చంద్రుని వంక గర్వంతో చూస్తుంది) చూసారా అన్నయ్యా! నా నాథుడెంతటి మెత్తటి వాడో!

నారదుడు: నిజమే తల్లీ! ఆ మెత్తనివానిని ఎక్కడ మొత్తాలో నీకు తెలిసినట్లు, వారికి తెలియక పోవడం ఆ తారల దురదృష్టము!

రోహిణి: వారి దురదృష్టము మాటకేమి గాని, నా సంప్రాప్త విపత్తుకు పరిహార మేదైనా కలదా మునీంద్రా!

నారదుడు: ఎంత జాణవు రోహిణీ! నీ నాథుడు అందుకే కదా వెళ్లినది, ఇంతలో ఎందుకమ్మా అంత తొందర?

రోహిణి: ఇంద్రోపేంద్రులు శనికి చాలినవారు కారని తెలిసిన దానను గనుక!

నారదుడు: శనికి చాలిన వారెవరో, నాకును తెలియదు రోహిణీ! బుద్ధిభూతమైన బృహస్పతియే ఇది చెప్పుటకు సమర్థుడు.

రోహిణి: మునీంద్రా! నాకు బృహస్పతి మంత్రమును ఉపదేశింపుడు.

నారదుడు: రోహిణీ! నీ కార్య చతురతకు చాల సంతోషము కల్గినది, విను. (ఉపదేశిస్తాడు)

రోహిణి: (ధ్యాన భంగిమలో కూర్చొని)

దేవంనాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం
బుద్ధి భూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. “

బృహస్పతి: (తెరలోంచి) రోహిణీ! నీవు పిలిచిన కారణము నా కవగతమైనది! గురుడనైన నన్నే ఏడున్నర క్షణముల పాటు, మృత్యుదండనకు గురు చేసిన ‘శనిని’, ఎదిరించు శక్తి యుక్తులు నా కడ మృగ్యము. అయినను నా ప్రియకాంతయైన ‘ తారను’ నా నుండి ఎడబాటు చేసిన చంద్రునికి నీతో వియోగమే సరియైన దండన!

నారదుడు: పరమ గురువరేణ్యా! మీ నోట ద్వేషపూరితమైన మాట తగదు. ‘ శని పీడానివార ణోపాయము’ను మీరు గాక మరెవరు సెలవీయ గలరు?!

బృహస్పతి: నారదా! నీ ఆంతర్యము నాకు అర్థమయినది. రోహిణి కొరకే కాక, సకల ప్రాణి కోటిని ఉద్దేశించి అడిగిన నీ ప్రశ్నకు, బదులు నా కడ లేకపోవుట శోచనీయమే! అయినను ఉపాయము చెప్పువారు లేకపోలేదు..

ఇద్దరూ: ఎవరా మహాత్ములు గురువర్యా?

బృహస్పతి: సకల ప్రాణికోటి యందలి బుద్ధిని శాసించువాడు, తెలివి తేటలలో నాతో సమానుడు, శనిదేవుని ఆంతర్యము నెరిగిన అత్యంత ప్రాణ మిత్రుడు, అడిగిన వారికి లేదనలేని సౌమ్యుడు, అయిన బుధుడే దీనికి ఉపాయము చెప్పగల సమర్థుడు.
గీ

శనికి మిత్రుఁడు బుద్ధిలో సముడు నాకు
సకల జీవుల బుద్ధిని చక్క దిద్దు
నడిగి నంత లేదన కిడెడు వాఢు
కుముద మిత్రున కీడగు కూర్మి కొడుకు
బుధుని రోహిణీ! యడుగు నీ విధము చెప్పి

(బ్రహస్పతి వెళ్లిపోయిన సంకేతం వినిపిస్తుంది)

రోహిణి: అన్నా! నాకు సౌమ్యోపాసనా మంత్రము తెలియ జేయుడు.
నారదుడు: తారా చంద్రుల పుత్రుడైన బుధుడు, నీకును పుత్ర తుల్యుడే! ఉపాసన అవసరము లేదు. నాతో పాటు పిలిచి చూడుము (అని) ప్రియంగు కళికా శ్యామం
రోహిణి:

ప్రియంగు కళికా శ్యామం

నారదుడు:

రూపేణాప్రతిమం బుధం

రోహిణి:

రూపేణాప్రతిమం బుధం

నారదుడు:

సౌమ్యం సౌమ్య గుణోపేతం—

రోహిణి:

సౌమ్యం సౌమ్య గుణోపేతం-

నారదుడు:

తం బుధం ప్రణమామ్యహం

రోహిణి: తం బుధం—

(రోహిణి మాట పూర్తి కాకుండానే, బుధుని ప్రవేశం)

బుధుడు: (రోహిణికి నమస్కరించి) తల్లీ! నీవు నాకు ప్రణమిల్లుట తగని పని! నా నమస్సు లందుకొని పిలిచిన పని చెప్పుము.

నారదుడు: సౌమ్యా! నీ సౌమ్య గుణము మాటలలోనే వెల్లడి అయినది. (రోహిణితో) రోహిణీ! ఇక దాపరిక మెందికు?

రోహిణి: నన్ను తల్లిగా మన్నించిన నీకు ఆశీస్సులు కుమారా! శనిదేవుడు నాపై కుపితుడై, పట్టి పీడింపనున్నాడు నా నాథునితో వియోగము తప్ప ఎట్టి దండననైనను నేను భరింపగలను. కాని శనైశ్వరుని ఆంతర్యము అదియే అయి యుండునని తోచుచున్నది! నీవు నాకు సహాయము చెయ్యగలవా సౌమ్యా?

బుధుడు: తల్లీ! శనిదేవును ఆంతర్యము పాతాళము కన్న అగాథము, అతడు నిన్నెట్లు పీడింప నున్నాడో!

నారదుడు: బుధా! కీడెంచి మేలెంచమని గదా ఆర్యోక్తి! శని ఆంతర్యమేదైనను అతని నాశ్రయించిన చుక్కల ఆంతర్యము మాత్రము – రోహిణికి పతీ వియోగమే!

బుధుడు: అర్థమయినది మహర్షీ! నా తల్లికే గాక సకల జీవులకు శనిపీడా నివారణోపాయము కావలెనన్న మాట!

రోహిణి: అవును కుమారా! అదియే అభిలషణీయము!

బుధుడు: తల్లీ! వ్యక్తిగత ప్రయోజనము కొరకు శనిని ఎదిరించిన వారెవరును నిలువ జాలరు. కాని బృహత్ స్వార్థము లేక ప్రయోజనమును ఆశించి, అతనిని ఎదిరించి పీడా నివారణ చేయదగును.

నారదుడు: ఇదివరకు ఎవరైనను అటుల చేసిన వారున్నారా సౌమ్యా?
బుధుడు: లేకేమి మునీంద్రా! నూట ఇరవై ఏండ్ల క్రిందట, శనీశ్వరుడు తొలిసారి, రోహిణి కక్ష్యలో ప్రవేశించు సమయమున, భూలోకమందు ద్వాదశ వర్ష క్షామము సంభవించినది. అప్పుడు మహా తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి, తన ఆశ్రమమందలి అక్షయ తటాకము నందలి నీటితోనే గాక, శివుని మెప్పించి, సురగంగను గోదావరి రూపమున భువికి తరలించి, క్షామము నివారించి శనిపీడ బాపిన వాఢాయెను!

నారదుడు: రోహిణికి ఇప్పుడు కలుగబోవు పీడ వ్యక్తిగతము కావున, నివారణము అసాధ్యమందువా సౌమ్యా?

బుధుడు: అసాధ్యము కాదు మునీంద్రా! కష్ట సాధ్యము.

రోహిణి: ఏ విధముగ కుమారా?

బుధుడు: తల్లీ! శనిదేవుడు మరల నీ కక్ష్యలో ప్రవేశింపనున్నాడు గావున, తిరిగి ద్వాదశ వర్ష క్షామము సంభవించునని ‘నీలివార్త’ వ్యాపింప జేసిన యెడల.. (అని ఆగిపోతాడు)

రోహిణి: ఆగిపోయావేం కుమారా! నీ వాక్య విశేషాన్ని పూర్తి చేయి.

బుధుడు: తల్లీ! ఇది సనయము కాదు, నాకీ విషయమున నీవును, నారదమునీంద్రులును సహాయము చేసిన యెడల..

నారదుడు: సౌమ్యా! నీకీ విషయమున నేను చేయు సహాయమెట్టిది?

బుధుడు: దేవర్షీ! త్రికాల దర్శులు, తపస్సంపన్నులు అయిన వశిష్ట, కౌశిక, భరద్వాజాది ఋషులు భూలోకము నందుండుట వలన, అసత్య వార్తా ప్రచారమునకు అవరోధము ఏర్పడ గలదు. అటుల కాకుండ..

నారదుడు: అర్ధమయినది బుధా! భువియందలి మహర్షులను దివికి పిలిపించిన యెడల నీ కార్యము సానుకూలము కాగలదు కదా!?

బుధుడు: అవశ్యము మునీంద్రా!

నారదుడు: పౌలస్త్యుడగు రావణబ్రహ్మ పెట్టు ఈతిబాధలు పడలేక, దేవతా సమూహమంతయు వైకుంఠ ద్వారమును తట్టి నారాయణును పిలుచుటకు ఉద్యమించినారు. నేనీ కార్యమునకు ఋషులనందరను సమావేశము చేయుటకు సంకల్పించితిని, గాన భువిలో వారి యవరోధము నీ కుంఢదు

బుధుడు: మునీంద్రా! మీది కడుంగడు చక్కని ఆలోచన! ఈ లోపున నేను నా కార్యమును చక్కబెట్టుకోగలను.

రోహిణి: కుమారా! నీ పని యందు నా సహాయ మవసరమైన యెడల నన్ను స్మరింతువు గాక!

(నారదుడు రోహిణి, బుధుని చేతి మీద తమ చేతులు వేసి ప్రమాణము చేయుచుండగా —–)

(తెర జారుతుంది)

(ప్రథమాంకము సమాప్తము)

—————–

— ఎ. శ్రీధర్, క్షీరగంగ బ్లాగు రచయిత.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

5 Responses to నీల గ్రహ నిదానము – 1

  1. nskartik says:

    very interesting what next?

  2. Rohiniprasad says:

    ఎవరికైనా దేన్ని గురించయినా రాసే హక్కు ఉంటుంది. అయితే నేటి సమాజంలో ఇన్ని సమస్యలూ, సంఘటనలూ కనబడుతూ ఉంటే నాటకానికి ఇంతకన్నా ఉచితమైన ఇతివృత్తం రచయిత ఎన్నుకోకపోవడం ఆశ్చర్యమే.

  3. chavakiran says:

    నాటకం బాగుంది.

  4. శ్రీ రోహిణీ ప్రసాద్ గారూ ! మీరు బహుముఖ ప్రతిభావంతులు. మీ నోట ఏ మాట వెలువడినా, దాంట్లో వివేకము, దిశానిర్దేశము ఉంటాయని నమ్మే అభిమానిని నేను. కష్టాలు, కడగండ్లు శని దేవుని వల్లనే అనే , ప్రగఢమైన నమ్మకం ప్రజా బహుళ్యంలో ఉంది !
    దాని నిదానానికి సూచించే పరిష్కారమే ఈ నాటక సారాంశం ! ఆ విధంగా దీనికి సామాజిక ప్రయోజనం ఉంది. నా రచనలొ సామాజిక స్ప్రుహ లేదనీ, ఫస లేదనీ మీరు భావించడం దురద్రుష్టం ! కాని పస లేని రచనని, ’పొద్దు’ ఎలా ప్రచురిస్తుందనుకొన్నారు ? నిదానించి, నాటకాన్ని పూర్తిగ చదవండి, ఆ తరువాత మీరు అను ( ఆ ) గ్రహం , ఏదైనా నాకు సమ్మతమే !

  5. Rohiniprasad says:

    * ‘నా రచనలొ సామాజిక స్ప్రుహ లేదనీ, ఫస లేదనీ మీరు భావించడం దురద్రుష్టం ! ‘
    శ్రీధర్‌గారూ, నేను అనని మాటలను మీరు ఊహించుకోవడం నా దురదృష్టమేమో!

    * ‘కష్టాలు, కడగండ్లు శని దేవుని వల్లనే అనే , ప్రగఢమైన నమ్మకం ప్రజా బహుళ్యంలో’ ఉంటే దాన్ని ఖండించే ప్రయత్నం చెయ్యాలని నేననుకుంటాను. అందరిదీ నా వైఖరి కాకపోవచ్చునని నాకు తెలుసు.

    * ‘ఆగ్రహం, అనుగ్రహం’ వగైరాల ప్రస్తావన చూసి నేనేదో దూర్వాసమహర్షిని అనుకుంటారేమో. నేనుకూడా మామూలు పాఠకుణ్ణే.

Comments are closed.