కవికృతి-౯

నో కాంప్రొమైజ్ ప్లీజ్

-స్వాతీ శ్రీపాద

నేను రాజీ ఉరితీతకు సిద్దంగా లేను.
కళ్లుమూసితెరిచేంత లిప్తలో
ఉనికికీ ఊహకూ_ సజీవతకూ సమూల మరణానికీ
ఉలిపిరి కాగితపు పరదా ఊగిసలాడుతున్న
తైంతిక సుకుమార జీవనవనంలో
విలువల గొంతునొక్కి
కలల గుమ్మటానికి వేలాడేందుకు
నేను సిద్దంగాలేను.
నో కాంప్రొమైజ్ ప్లీజ్..

సువిశాలపు ఆకాశం పాల చెక్కిళ్ళపై
పరుగులు పెడుతూ రూపాలు మార్చుకునే
తెలి మబ్బు తునకల క్షణికపు పాలపొంగు
ఈ విరామం.
ఊపిరాడని పొగల్లో సెగల్లో
తుహిన బిందువుల్లా ఆవిరి చేసేందుకు
నేను సిద్దంగాలేను.
నో కాంప్రొమైజ్ ప్లీజ్..

ముళ్ళమధ్య కళ్ళువిప్పి
నాజూకు పాదాల నవనీతపు
భావాలను
కన్నీళ్ళ అలజళ్ళ కుంపట్లమీద
కరిగించుకుందుకు ఎంతమాత్రం
నేను సిద్దంగాలేను.
నో కాంప్రొమైజ్ ప్లీజ్..

గుండెనిండా జ్ఞాపకాల పూలమడులు,
పెదవులమీద మొలకెత్తే చిరునవ్వులు,
నా తరువాత శూన్యం మందిరాలు.
నా ఉనికి అగరొత్తుల పరిమళమై
ప్రసరించేలా ప్రసవించేలా
నాలుగు యుగాల ఇతిహాసానికి
ప్రేమ నింపుకున్ననాకలం,
చరిత్ర పుటలమీద  అవిశ్రాంతంగా
కాలాన్ని చెక్కుతుంది.
అందుకే
నాకు మరెందుకూ సమయం లేదు.
ఊసుపోక కబుర్లాటకు
నేను సిద్దంగాలేను.
నో కాంప్రొమైజ్ ప్లీజ్..

ప్రకృతి

-ఆత్రేయ కొండూరు

ఆకునీడన జేరిన పువ్వు
గాలి తట్టినప్పుడల్లా
తెరిపెకోసం తొంగిచూస్తూ..

నేల కురిసిన వాన
హత్తుకునే అడ్డులు
నింపుకున్న గుంటలు
నవ్వులు చిందిస్తూ  ..

నింగిలోని చుక్కలన్నీ
మెల్లగా,
గరిక కొనలమీదుగా,
మెల్లగా  ఉదయిస్తూ..

ప్రతి కిరణమూ
రంగులద్దుతూ,
మనసునద్దం పడుతూ,
ప్రకృతి..

హైకూలు!

-పెరుగు.రామకృష్ణ

సముద్రం ,నేను
ఒకరి లోతుల్లోకి
మరొకరం…!*
**

నీటి కదలిక
పున్నమి చంద్రుడు
రాత్రంతా బావిలో…!*
**

ఒకే ఉపిరి
రెండు దేహాలు గా
ఆమె,నేను..!*
**

ధ్యాన ముద్రలో
రుషిలా,మా పల్లె
ప్రక్కనే కొండ…!*

ఒంటరి మనసు

-దామోదర్ అంకం

పెద్ద పులి పంజా సందుల్లో
పిల్ల లేడి లేత చర్మం
విచ్చుకోకుండా, గిచ్చిపోకుండా
పసి మొగ్గలపై గుచ్చిన గుండుసూదులు
నిద్రలేచేసరికి నా తలొక్కటే మిగిలింది
రక్తం కారకుండా నా పిక్కలు పీక్కుతిన్నాయ్ కుక్కలు
ఎర్రటి చిగురాకులు  రాలిమరీ
నను వెంబడిస్తుంటే ..పరుగెత్తాను
అప్పటికే నా నీడను రాబందులు లాక్కుపోయాయ్
ఇపుడు నేను ఒంటరిని..

నల్లాల్లో పాలు..
బర్రె పొదుగు నిండా నీళ్ళు…
చడీ చప్పుడు లేకుండా
ఒక్కపెట్టున జడివాన
గడ్డ కట్టుకుపోయిన సూర్యుడు
భగ భగమంటూ నెలరేడు
సగం కాలిన ప్రేమ పొలికేక పెడుతుంది..
“నన్ను కాపాడండీ…” అంటూ…
అపుడు నేను నడుస్తుంది స్మశానం ప్రక్కన
పాపం స్నేహానికి గర్భ శోకం..

మందాకినీ నదిలో
మంచి నీరు ప్రవహిస్తుంది
సాగరమంతా నిశ్శబ్ధం..
నది కలిసే చోట మాత్రం గల గల చుంబన శబ్ధం
గుర్రపు గిట్టల కింద
నలిగిపోయిన నల్ల గులాబీలు ..
గుత్తులు గుత్తులుగా
గుండెలు వేలాడదీసారు ..
ఎండలు మండుతుంటే..
చలిగాలి వీస్తుంది..అసలెక్కడున్నాను…”నరకమా..?”

ఒక చెవిలో సహస్రావధానం
మరొకదానిలో నా ప్రశ్నకు సమాధానం
ముక్కుపుటాలధిరేలా
నెత్తుటి వాసన..
అయ్యో..ఎర్ర పూలనెవరో
ఎత్తుకుపోయారు…
పగలంతా చీకటి..
రేయి నిండారా వెలుగు…
అన్ని ఋతువులకూ ఒకేసారి పోటీ
కాలం ఎందుకో ఇవాళ్ళ వెనక్కు పడిపోతుంది

అలసిపోయి నడుస్తున్న పరుగు
ఓటమినంగీకరించిన గెలుపు
వాన పడకుండా మట్టి వాసన
గుండె బద్దలయ్యేలా ఒక్క పిడి గుద్దు
హింసను ప్రేరేపిస్తున్న అహింస
అశాంతికి శిక్షననుభవిస్తున్న శాంతి
చందమామపై మచ్చలన్నీ పోతున్నాయ్
కాగితంపై అక్షరాలన్నీ మాయమౌతున్నాయ్
ఒక్కొక్కటిగా సిరగా మారి మళ్ళీ కలంలోకి
కలం ఇక శాశ్వత నిద్రలోకి…

పిడిబాకు

-బొల్లోజు బాబా

ప్రశాంతతను
గాయపరచే పిడిబాకు
మళ్లా ప్రత్యక్షమైంది
దెబ్బకు స్వప్నం కాస్తా వాస్తవంగా
వాస్తవం కాస్తా  మహా ఎడారిగా
మహా ఎడారి కాస్తా మృగతృష్ణగా
రంగులు మార్చేసాయి

ఆ నిర్జలోష్ణ కాసారపుటొడ్డున
రాళ్లు విసురుతో నా ఆత్మ

పిడి బాకు అంచున తృష్ణా బిందువు
పిడి బాకు అంచున మృగకాంక్షా శ్వాస
అచ్చోటనే రుధిర జాతర.
నరక సౌఖ్యం, స్వర్గ బాధ పెనవేసుకొన్న
సృష్టి సౌందర్య విస్ఫొటనం కూడా అక్కడే

తలుపు భళ్లున తెరచా
ఈ సమయం లో వచ్చావేమిటీ!
అందామె  ఆశ్చర్యపడుతో
నెత్తురు నింపుకొన్న నా క్షణాల్ని
చూపించా!

గాయపడ్డ నా గీతాన్ని
తన దేహంలోకి తీసుకొని
స్వస్థ పరచిందామె ….ప్రేమతో….

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

One Response to కవికృతి-౯

  1. RK says:

    తైంతిక?

Comments are closed.