లవర్స్ లాఫింగ్ క్లబ్

(ప్రేమికుల రోజు స్పెషల్)

jyothi.bmpఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా.

జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com .

——————–

rose.jpg

అనుకోని అదృష్టమంటే?
ప్రపంచసుందరికి రాసిన ప్రేమలేఖకి జవాబు రావటం.

ప్రియురాలు అందంగా కనవడేదెప్పుడు?
ఇల్లాలు గుర్తొచ్చినప్పుడు.

ప్రేమకి, పెళ్ళికి తేడా?
మొదటిది ఇష్టమైన కూరతో సుష్టుగా భోజనం చేయడం, రెండవది ఏదో ఒక కూరతో సరిపెట్టుకుని అయిష్టంగా భోంచేయడం.

తొందరపాటు ప్రియుడు?
‘ఆకాశంలో అంత అందమైన మెరుపులు నువ్వెప్పుడైనా చూశావా?’ అని ప్రియురాలు అడిగితే ‘నీతో ఐస్‌క్రీం పార్లర్‌కి వచ్చినప్పుడల్లా నాకు కనిపించేవి అవేకదా!’ అనేవాడు.

ప్రియురాలు ఉలిక్కిపడేది ఎప్పుడు?
‘అర్జంట్‌గా నాకు వెయ్యి రూపాయలు వుంటే ఇవ్వు డియర్, పెళ్ళికి ఇవ్వవలసిన కట్నంలో తగ్గించేస్తాను’ అని ప్రియుడు అన్నప్పుడు.

ప్రియుడు అదిరిపోయేదేప్పుడు?
ప్రియురాలు ప్రియుడితో ‘నీకు 3 చోట్ల ముద్దు పెట్టాలని కోరికగా ఉంది.’ అనంటే ప్రియుడు సంతోషంతో ‘త్వరగా చెప్పు, ఎక్కడెక్కడ?’ అనడిగితే ప్రియురాలు ముద్దుగా గారాలు పోతూ ‘ఊటీ,తాజ్‌మహల్, కాశ్మీర్ దగ్గర’ అన్నప్పుడు.

ప్రేమలో పడటం అంటే?
నాలికకి ఉప్పుకూ,చక్కెరకూ తేడా తెలియకపోవడం.

యువకుడైన బ్రహ్మచారికి, ముసలివాడైన బ్రహ్మచారికి గల తేడా?
యువకుడైన బ్రహ్మచారి తన గర్ల్‌ఫ్రెండ్ వచ్చే ముందు తన గదిని నీట్‌గా సర్దితే, ముసలివాడైన బ్రహ్మచారి తన గది సర్దడానికే గర్ల్‌ఫ్రెండ్‌ని పిలుస్తాడు.

ఇంటికి దీపం ఇల్లాలు, మరి ప్రియురాలు?
ఎమర్జెన్సీలైట్.

heart.jpg

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

Posted in వ్యాసం | Tagged | 1 Comment

సినిమాలెలా తీస్తారు?-2

ఇతివృత్తం -> కథాంశం -> సింగిల్ లైన్ స్టోరీ -> సీనిక్ ఆర్డర్ -> స్క్రీన్ ప్లే
సినిమా తీయాలంటే ముందు కథ కావాలి. ఏ కథ ఎంతబాగా ఆడుతుందనే విషయంలో ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. (“Last of the great Vijaya classics” గా గుర్తింపు పొందిన గుండమ్మ కథ ఎలా ఆడుతోందో, అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అదే విజయావారికి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు తీసిపెట్టిన దర్శకుడు కె.వి.రెడ్డి అనేవారు.)
రెడీమేడ్ కథను సినిమాకు adapt చేసుకుంటే (adopt చేసుకోవడం పాత సినిమాలను మళ్ళీ తీస్తున్నప్పుడు తప్ప సాధారణంగా జరగదు కాబట్టి) కథాచర్చలు సీనిక్ ఆర్డర్ నుంచి మొదలౌతాయి. అలా కాక కొత్త కథాంశాన్ని సినిమాగా తీయదలచుకున్నప్పుడు కథ యొక్క కథ ఇతివృత్తం నుంచి మొదలౌతుంది.
సినిమా రచయిత కథ చెప్పడానికొచ్చినప్పుడు ముందుగా దర్శక, నిర్మాతలు ఒక్క ముక్కలో ‘కథేంటి?’ అని అడగడం పరిపాటి. కథారచయిత కూడా కాలహరణం చేయకుండా దానికి సమాధానం నాలుగు ముక్కల్లో చెప్తే దాన్ని బట్టి ఆ కథ తమ అభిరుచికి తగిందో కాదో, ప్రేక్షకులను ఆకట్టుకోగలదో లేదో, ఆ కథను సినిమాగా తియ్యొచ్చోలేదో వారికి ఒక అంచనా ఏర్పడుతుంది. ఉదాహరణకు “లంచగొండి అధికారులను ఒక్కొక్కరినీ హీరో చంపుకుంటూ పోవడమే” భారతీయుడు, ఠాగూర్, అపరిచితుడు – ఈ మూడు సినిమాల ఇతివృత్తం. అంటే మూడు సినిమాల ఇతివృత్తం ఒకటే! కానీ కథాంశాలు మాత్రం వేర్వేరు. (ఈ మూడు సినిమాల్లోని హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన నేపథ్యం. అందుకే అవినీతిపరులను చంపడానికి వారెంచుకున్న మార్గాలు విభిన్నమైనవి. ఆ మార్గాలే ఆయా కథాంశాల్లో వైవిధ్యాన్ని తీసుకొచ్చి ఘనవిజయాలు సాధించాయి.)
స్వాతంత్ర్య సమరంలో INA తరపున బ్రిటిష్ వారితో పోరాడిన సైనికుడు స్వాతంత్ర్యానంతర భారతదేశంలో వేళ్ళూనుకునిపోయిన అవినీతిపై సాగించిన పోరాటమే భారతీయుడు కథాంశం.
సంఘంలోని అవినీతిని సహించలేని, నేరుగా ఎదుర్కొనే ధైర్యమూ లేని సంప్రదాయకుటుంబానికి చెందిన బ్రాహ్మణయువకుడిలో ఉండే ఎవరికీ తెలియని మరో మనిషి split personality ద్వారా బయటికొచ్చి ఆ అవినీతిపరులను ఎలా ఎదుర్కొంటాడో, వారిని ఎలా శిక్షిస్తాడో మనస్తత్వశాస్త్రపరంగా చూపించడమే అపరిచితుడు కథాంశం.
ఇలా మొదటగా నాలుగు ముక్కల్లో రాసుకునే కథనే సింగిల్ లైన్ స్టోరీ అంటారు. తర్వాత తీయబోయే పధ్నాలుగు రీళ్ళ సినిమాకు మార్గదర్శిగా ఉండేది ఈ నాలుగు ముక్కల సింగిల్ లైన్ స్టోరీయే.
తర్వాతి దశలో ఈ నాలుగు ముక్కల కథను నాలుగు పేజీల కథగా రాసుకుంటారు. నాలుగు ముక్కల్లోకి రాలేని ఉత్కంఠ, నాటకీయతలు నాలుగు పేజీల కథలోకి వస్తాయి. కథలోకి కదలిక వస్తుంది. ఒక సన్నివేశం తర్వాత ఇంకొక సన్నివేశం వచ్చినప్పుడు కథ ఎలా ముందుకు కదులుతోందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సన్నివేశాల కూర్పు కథాంశానికి అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకోవడానికి అవకాశముంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం పద్దెనిమిది రీళ్ళ సినిమాగా తీయబోయే కథకు ఇది సంక్షిప్తరూపం (precis writing లాంటిది).
ఇదే శీర్షికలో ఇంతకు ముందు చెప్పినట్లు సినీరచయిత తనకు నచ్చినట్లు రాయడం కాకుండా నిర్మాత, దర్శకుడు, హీరో, తదితరుల ఇష్టాలను కూడా పరిగణనలోకి తీసుకుని కథలో అందుకు అనుగుణంగా మార్పులు చెయ్యవలసి ఉంటుంది. ఆ మార్పులు ఇక్కడినుంచే మొదలౌతాయి. అంటే ఇతివృత్తం రచయిత చెప్పిందే అయినా కథాంశం మాత్రం అచ్చంగా రచయిత ముందనుకున్నదే కాకపోవచ్చు. ఇతరుల ఇష్టాయిష్టాలే కాకుండా అర్థం పర్థంలేని సెంటిమెంట్లు, నటీనటుల ఇమేజ్ లాంటివాటికి అనుగుణంగా కథ మార్చి రాయాల్సి రావడం రచయిత స్వేచ్ఛను హరించడమే.
సీనిక్ ఆర్డర్: సన్నివేశాల సమాహారం (దృశ్యమాలిక). కథారచనలో ఇది తర్వాతిదశ. కథాంశాన్ని తెరకెక్కించడానికి వీలుగా దృశ్యాలుగా విడగొట్టుకుని వరసగా రాసుకోవడమన్నమాట. దీంట్లో ప్రతి దృశ్యానికీ కథాంశపరంగా ఒక ప్రయోజనముండేలా, ప్రతి సన్నివేశం రసానుభూతికి భంగం కలగకుండా కథాంశాన్ని ముందుకు నడిపేలా జాగ్రత్త తీసుకోకపోతే కథనం పేలవంగా తయారవుతుంది.
మాటలు: సీనిక్ ఆర్డర్ సిద్ధమైన తర్వాత మాటల రచయిత రంగప్రవేశం చేస్తాడు.
స్క్రిప్ట్/స్క్రీన్ ప్లే రచన:
సినిమా దృశ్యమాధ్యమం. సినిమా రచన కూడా దానికి తగినట్లే ఉండాలి. నేపథ్య, వాతావరణ చిత్రణలు దృశ్యంలోనో, శ్రవణంలోనో తెలియాలి. తాము ఆ సన్నివేశం జరుగుతున్నచోటే ఉన్న భావన ప్రేక్షకులకు కలిగించాలి. ప్రేక్షకులకు తాము సినిమా థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నామనే ఆలోచన రానివ్వకుండా వారిని తనలో లీనం చేసుకుని తనతోబాటు ఆ వాతావరణంలో విహరింపజేసేదే నిజమైన సినిమా. దీనికోసం సందర్భానికి తగిన ధ్వనులు (సంవాదం, నేపథ్యసంగీతం, సంగీతం, వాతావరణ సంబంధ ధ్వనులు, జంతువులధ్వనులు) వినిపించడం, దృశ్యాలు చూపించడం చేస్తారు. లేకపోతే ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది. ఇవన్నీ స్క్రీన్ ప్లేలో “లెఫ్టు”లో వస్తే మాటలు “రైట్” లో వస్తాయి. అందుకే కె. విశ్వనాథ్ లాంటి దర్శకులు లెఫ్టు నింపడం పై ప్రత్యేకశ్రద్ధ వహిస్తారు. స్క్రీన్ప్లే తయారుచేసేటప్పుడు ఆయన తన సహాయకులకు ఎప్పుడూ “లెఫ్టు నింపండిరా” అని బోధిస్తూ ఉంటారని ఆయన దగ్గర పనిచేసినవాళ్ళు చెప్తారు. ఇంతకూ ఈ “లెఫ్ట్” ఏమిటి?
లెఫ్ట్ ఏమిటో తెలియాలంటే అసలు స్క్రీన్ ప్లే ఎలా రాస్తారో తెలియాలి.
స్క్రీన్ ప్లే రాయడం కోసం పేజీలో మార్జిన్ వదిలిన తర్వాత మిగిలిన భాగాన్ని నిలువుగా మధ్యలోకి విభజించుకుంటారు. దాంట్లో ఎడమవైపు దృశ్యవివరణ, కుడివైపు సంభాషణలు రాసుకుంటూ పోతారు. పేజీ పై భాగంలో ఎడమవైపు సీన్ నంబరు, మధ్యలో లొకేషను, కుడివైపు ఇండోరా/ఔట్డోరా, పగలా/రాత్రా, అవసరమైతే టైమ్ రాసుకుంటారు. స్క్రీన్ ప్లేలో – మరీ ముఖ్యంగా ఎడమవైపు – ఎంత వివరంగా రాసుకుంటే చిత్రీకరణలో అంత స్పష్టత వస్తుంది. ఆ రకంగా చూస్తే మంచి మంచి దృశ్యకావ్యాల్లాంటి సినిమాలు తీసేవాళ్ళంతా ఎర్రకామెర్లు లేని లెఫ్టిస్టులే! శంకరాభరణం సినిమా మొత్తం కలిపినా సంభాషణలు పదహైదు పేజీలకు మించి లేవు! సినిమాస్క్రిప్టులో లెఫ్టు ప్రాధాన్యతేమిటో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఐతే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మాటల మాంత్రికులు లెఫ్టుకు ఎక్కువ మొగ్గకుండానే “రైట్ రైట్” అంటూ దూసుకుపోగలరు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎవరి స్టైల్ వారిదే!

కమల్ హాసన్ సినిమా ద్రోహి స్క్రిప్టులోని ఒక పేజీ:

దృశ్యం: 4 ఆది బెడ్‌రూమ్ లోపల/పగలు
లాంగ్ షాట్ లో చెట్టు. కెమేరా కిందకు దించి ఆదినారాయణరావు ఇల్లు చూపిస్తారు.
మిడ్ షాట్ లో సుమిత్ర బాత్రూమ్ తలుపులు తీసుకొని వస్తున్న దృశ్యం.
మిడ్ షాట్ లో ఆదినారాయణరావు దుస్తులు ధరిస్తున్న దృశ్యం.
లాంగ్-మిడ్ షాట్ లో ఇద్దరినీ చూపిస్తారు.

సుమిత్ర:
ఆది:
సుమిత్ర:
ఆది:
సుమిత్ర:
ఆది:
సుమిత్ర:

ఆది:

క్లోజప్ షాట్ లో సుమిత్ర ఆదినారాయణరావు దగ్గరకు వచ్చే దృశ్యం.

సుమిత్ర:
ఆది:

మిడ్ షాట్ లో ఆమె నుంచి అతడు దూరంగా కదిలే దృశ్యం.

సుమిత్ర:

మిడ్ షాట్ లో ఆది వెనక్కు తిరగడం.

ఆది:
సుమిత్ర:

ఇదేమిటి?
ఆ(…అబ్బాస్ ఇంటికి.
యూనిఫారమ్‌లోనా?
ఆ(…కాస్త పని ఉంది.
ఇవేం చెయ్యను? నమిలి మింగెయ్యనా?
ఏదీ… ఏవిటది?
ప్రభాత్ థియేటర్. ఈవినింగ్ సిక్స్ థర్టీ షో – రుపీస్ నైన్ ఫిఫ్టీ – నాట్ రిఫండబుల్ – మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది.
గుర్తుందని అబద్ధం ఆడితే?

ఇంకా కోపం వస్తుంది.
అయితే, మర్చిపోయాను.

అయితే, అది…
…మీకొద్దన్నమాట.

ఏది?
ఇంకో పాపో! బాబో!

ఇలా లాంగ్ షాట్లు, మిడ్ షాట్లు, క్లోజ్ షాట్లు మార్చి మార్చి చూపించడమెందుకు?
ఇదే దృశ్యాన్ని ఆది, సుమిత్ర ఎక్కడివాళ్ళక్కడే బిగుసుకుపోయి డైలాగులు అప్పజెప్తూ ఉంటే, కెమెరాను కూడా ఒకేచోట పాతేసి, యాంగిల్ కూడా మార్చకుండా తీస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇక నుంచి మీరు సినిమా చూసేటప్పుడు షాట్ మారడాన్ని అప్రయత్నంగానే గమనిస్తారు. ఆ విషయం నాకు తెలుసు. 🙂
స్క్రీన్ ప్లేలో కుడి ఎడమల కనిపించే ఖాళీలు సెట్ ప్రాపర్టీస్, ఆ షాట్లో వచ్చే నటీనటుల వివరాలు, షూటింగులో ఓకే అయిన షాట్ నంబరు తదితరాలు రాసుకోవడానికి ఉపయోగపడతాయి.
సుగాత్రి (http://sahityam.wordpress.com)
Posted in వ్యాసం | Tagged | 3 Comments

సరదా..

తెలుగు నెటిజనుల్లో చాలా ఎక్కువగా రాసేది ఎవరు?
వలబోజు జ్యోతి! కేవలం కొన్ని నెలల కిందటే బ్లాగులోకంలో అడుగుపెట్టి, పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు జ్యోతి.

ఆమె రాసిన కొన్ని సరదా కబుర్లు, విషయాలు మీకోసం సరదా శీర్షికలో సమర్పిస్తున్నాం.
ఆమె రాస్తున్న బ్లాగులు:

http://shadruchulu.blogspot.com

http://annapoorna-jyothi.blogspot.com

http://geetalahari.blogspot.com

http://vjyothi.wordpress.com


http://vjyothi.blogspot.com

Posted in ఇతరత్రా | 1 Comment

చిన్నితెర చిరునవ్వులు

jyothi.bmp

ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా.

జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com .

——————-

* టి.వి సీరియల్స్ వల్ల లాభం ?
పగలూ, ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలో నేర్చుకోవడం.
* టి.వి సామెత. కామెంట్ ప్లీజ్?
చూపించేవాడికి చూసేవాడు లోకువ.
* మరీ విడ్డూరమంటే ?
చీ పాడు సీరియల్ ఎంత సాగదీస్తున్నారో అని తిట్టుకుంటూనే మిస్సవకుండా టి.వి సీరియల్ని చూస్తూనే వుండటం.
* ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుండటంకు నేటి పేరడి?
తెలుగు టి.వి సీరియల్
* మూలిగే నక్క మీద తాటిపండు పడటమంటే?
రాన్రాను ప్రేక్షకాదరణ కోల్పోతున్న దూరదర్శన్ ని పే చానల్ గా మార్చాలనుకోవడం.
* ఏరాయితో కొట్టుకున్నా ఒకటే అనడానికి నిదర్శనం?
సినిమాలోని పాటలు సినిమాగా వస్తే, ఆ సినిమా పేర్లతోనే టి.వి సీరియల్స్ రావడం.
* టి.వి సీరియల్స్ వల్ల ప్రయోజనం?
భర్తలు ఆఫీసు నుండి ఎంత లేటుగా వచ్చినా భార్యలని మేల్కొని వుండేటట్లు చేస్తాయి.
* బుల్లి తెరకు సెన్సారు చురక?
చట్టబద్ధమైన హెచ్చరిక టి.వి అతిగా చూడటం కళ్ళకు హానికరం అనే క్యాప్షన్ ఇకపై ప్రతీ చానెల్ వారూ విధిగా వెయ్యాలని నిబంధన పెట్టడం.
* అల్ప సంతోషి?
టి.వి వాళ్ళేసే అడ్వర్టైజుమెంట్ల వల్లయినా నా అర్ధాంగి నాకింత అన్నం వండి పెడుతుందని తృప్తి పడేవాడు.
* టి.వి పిచ్చి బాగా వున్న వ్యక్తి?
మీ దైనందిన కార్యక్రమం ఎలా మొదలౌతుందని అడిగితే భక్తిరంజనితో మొదలై మిడ్ నైట్ మసాలాతో ముగుస్తుంది అంటాడు.
* టి.విలో న్యూస్ రీడర్లు వార్తలు చదవడం పూర్తికాగానే పెన్ను జేబులో ఎందుకు పెట్టుకుంటారు?
మా రాత ఇంతేనని చెప్పడానికి.
* వెండితెరకి బుల్లితెరకి తేడా?
వెండితెర నిండా అంగాంగాల మోహం,బుల్లి తెర నిండా కుట్రల వ్యూహం.

* వట్టిగొడ్డుకు అరుపులెక్కువ అంటే?
బాగోని సినిమాకోసం టి.వి లో పదేపదే ప్రకటనలివ్వడం.

Posted in వ్యాసం | Tagged | 8 Comments

అతిథితో…

పొద్దులో ఎప్పటిలాగే అతిథితో మరో ఆవృతం మొదలైంది. ఈ సారి అతిథితో బాటే ఒక కవిత, ఒక పుస్తక సమీక్ష అందిస్తున్నాం. వీటిపై మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాం.

అతిథి…శ్రీహర్ష

అప్పుడప్పుడూ(కవిత)…రాధిక

అతడు అడవిని జయించాడు(సమీక్ష)

పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on అతిథితో…

అతడు అడవిని జయించాడు – డా.కేశవరెడ్డి

అతడు అడవిని జయించాడు – ఒక రాత్రిలో ఓ మనిషి చేసిన జీవన పోరాటం; డా. కేశవరెడ్డి రాసిన నవలిక.

అప్పుడే ఈనిన ఓ పంది, పుట్టిన పిల్లలని (సలుగులు) తినేందుకు దాడులు చేసే నక్కలు, తన పందినీ, దాని పిల్లలనూ కాపాడుకునేందుకు పోరాటం చేసే ముసలివాడు.. ఇవీ పాత్రలు, ఇదే కథ! నేపథ్యం – అడవి. నక్కలే కాదు, తానెవర్ని రక్షిస్తున్నాడో స్వయానా ఆ పంది కూడా ఈ పోరాటంలో ముసలివాడి ప్రత్యర్థే! ఎందుకంటే “అది మొరటు జీవం, శత్రువులు శ్రేయోభిలాషులు అని చూసుకునే ఇంగితం దానికి లేదు”

ఈతకొచ్చిన పంది, మంద నుండి తప్పించుకు పోయి అడవిలో ఓ పొద మాటున ఈనుతుంది. తప్పిపోయిన తన పందిని వెతుక్కుంటూ వెళ్ళిన ముసలివాడు, వెతికి, వెతికి చివరికి దాన్ని కనుక్కుంటాడు. అప్పటికే రాత్రయి పోతుంది. అది వాణ్ణి దగ్గరికి రానివ్వదు; ఈనిన పంది తాను బతికుండగా మరో జీవిని తన దాపులకు కూడా రానివ్వదు మరి! దాని దాడి నుండి ఎలానో తప్పించుకుని, పక్కనున్న చెట్టెక్కి, ఇక ఆ రాత్రంతా నక్కల బారి నుండి తన పందిని, సందమావల్లాంటి దాని సలుగులను కాపాడే ప్రయత్నం చేస్తాడు, ముసలివాడు.

నక్కలు పంది పిల్లల వాసన పసిగట్టి, వాటి కోసం ప్రయత్నాలు మొదలెడతాయి. రెండు నక్కలనైతే పంది అమాంతం పీక కొరికి చంపి పడేస్తుంది. మరో నక్కను ముసలివాడు తన ఈటెతో చంపేస్తాడు. కానీ నక్కలు ఊరుకుంటాయా, నక్కలు మరి! ఓ రెండు సలుగులను ఎత్తుకు పోనే పోతాయి. ఆ తరువాత ఏకంగా నక్కల గుంపే దాడికి తరలి వస్తుంది. ఒక్క పంది అన్ని నక్కలను ఎదుర్కోలేదు. చెట్టు మీద నుండి కిందకి దిగితే, ముసలివాడు వాటిని అదరగొట్టి తరిమెయ్యగలడు. కానీ వాడేమో చెట్టు దిగలేడు, దిగితే పంది మీదపడి చంపేస్తుంది. మరిప్పుడెలా?

అప్పుడు వస్తుంది ముసలివాడికి మెరుపులాంటి ఆలోచన. ప్రాణానికి ప్రాణమైన పందినే ఈటెతో చంపేస్తాడు. ఆ తరువాత నక్కల్ని తరిమేసి, సలుగుల్ని బుట్టకెత్తుకుని బయల్దేరుతాడు. కొన్ని గంటలపాటు జరిపే ప్రయాణంలో పాలు లేకపోవడం చేత, పంది పిల్లలు చచ్చిపోతాయి, రాబందుల పాలవుతాయి. ఇంత యుద్ధమూ చేసి ఉత్త చేతుల్తో ముసలివాడు ఇంటికి తిరిగి వస్తాడు.

ఇదీ కథ.

సాయంకాలం నుండి, మరుసటి రోజు పొద్దు పొడిచేదాకా జరిగే కథ ఇది. నిజానికి ఇది కథ కాదు. ఇదో నాటకం. ప్రతీ దృశ్యం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నట్లే ఉంటుంది. అతడు అడవిని జయిస్తున్న విధానం మనల్ని లీనం చేసేసుకుంటుంది. కేశవరెడ్డి రచనా కౌశల్యం మనల్ని ఊపిరి తిప్పుకోనివ్వదు. ముసలివాని కార్యకుశలత మనల్ని కట్టిపడేస్తుంది. రక్షించేందుకు ముసలివాడు కడు సమర్థుడని మనకు కథలోని ప్రతీ వాక్యమూ చెబుతూనే ఉంటుంది. అంచేతే.. నక్క రెండు కళ్ళ మధ్య నుండి దూరి, ముచ్చిలిగుంటలో నుండి బయటికి వచ్చేలా ఈటెను విసిరినపుడు, ఒక్క వేటుతో పందిని చంపినపుడు, బాకును విసిరి తోటిగువ్వను చంపినపుడు, అవలీలగా కుందేలును వేటాడినపుడు మనకేమాత్రం ఆశ్చర్యం కలగదు. అతడి పనితనంపై మనకంత నమ్మకం కలిగిస్తాడు, రచయిత!

– తన పందులను వెదుక్కుంటూ వెళ్ళే ముసలివాని నడక ఎలా ఉందో చెప్పిన వైనం (“పెద్ద అంగలు వేసుకుంటూ, చేతిలోని ఈటెను ఊపుకుంటూ అస్తమిస్తున్న సూర్యునిపై దండెత్తిన వాడి వలె అతడు నడుస్తున్నాడు”.)
– పందిని వెతికే క్రమంలో ముసలివానికి అడవి పట్లా, అడవి జంతువుల పట్లా గల అవగాహనను తెలియ జేసిన వైనం.
– ఆకలి తీర్చుకోవడం కోసం అతడు కుందేలును వేటాడి, చెకుముకితో మంట చేసి, దాన్ని కాల్చి తిన్న విధానం.
– సుగాలోల్ల అడవిలో, అర్ధరాత్రి, వానలో, తప్పిపోయి పిచ్చిగా పరుగెత్తుకుంటూ పోతున్న ఎనుబోతును వెంటాడి, పట్టి తెచ్చిన వైనం.
ఇవీ, ఇలాంటివెన్నో.. ఇవన్నీ మనకు చెప్పేదొకటే – ముసలివాడు పందినీ, దాని పిల్లల్ని రక్షించి తీరతాడని.

కానీ పందిని స్వయంగా తానే చంపుకుని, పిల్లలు చస్తూ ఉంటే చూడవలసిన నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది, ముసలివాడికి. ఏ పందినైతే రక్షించేందుకు మిన్నూ మన్నూ ఏకం చెయ్యబూనాడో, ఆ పందినే తన చేజేతులా చంపుకుంటాడు. ఎంత చిత్రం! ముసలివాని ఈ చేష్టకు మనం నిశ్చేష్టులమౌతాం. తేరుకున్నాక ఆలోచిస్తే ఆ చర్య ఎంతో తార్కికంగా అనిపిస్తుంది. కేశవరెడ్డి రచనా చమత్కృతి అది!

ఈ నవలికలోని పరిసరాల వర్ణన మనలను ముగ్ధుల్ని చేస్తుంది. అడవి, అక్కడి చెట్లూ చేమలు, జంతువులు, పక్షులు, వాటి అలవాట్లు ఎంతో వివరంగా వర్ణిస్తాడు రచయిత. వీటిని చదువుతూ ఉంటే మనకా దృశ్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. అందుకే ఓ నాటకం చూస్తున్న అనుభూతి కలుగుతుంది మనకు. ముసలివాని లాగానే రచయితకు కూడా అడవుల్లో జీవించిన అనుభవం ఉందేమో ననిపిస్తుంది.

“నిటలాక్షుండెత్తివచ్చినన్ రానీ..” తాననుకున్నది సాధించే తీరతానన్నట్టుగా పట్టుదల చూపిన మనిషి ప్రకృతి ముందు ఓడిపోయిన విధానం ఈ కథ. ఎంతో శ్రమ పడినా పని సాధించలేకపోయిన మనిషి నైరాశ్యం, అంతలోనే తిప్పుకుని.., తరువాతి సమరానికి తయారౌతున్న విధానం ఈ కథ. పందినీ సలుగులనూ పోగొట్టుకుని గుడిసెకొచ్చి నేలపై వాలిపోయిన ముసలివాని ఆలోచనలు చూడండి..
.. అలసిన నా మనసుకు ఒకింత విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది నా జీవితంలో చివరి రోజు కాదు గనుక…
ముసలివాడు సిసలైన హీరో! అతడు అడవిని జయించాడు. కేశవరెడ్డి పాఠకుల మనసుల్ని జయించాడు.

డా.కేశవరెడ్డి రాయలసీమలో పుట్టి ప్రస్తుతం నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లిలో డాక్టరుగా పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత, మధురాంతకం రాజారామ్ ఇలా అంటారు: “కేశవరెడ్డి తల్లి పుట్టినూరు మావూరే. అంతటి రచయితను కన్న తల్లి మావూరి ఆడపడుచే కావడం నాకు గర్వకారణం”.

డా.కేశవరెడ్డి ఇతర రచనలు:
ఇన్ క్రెడిబుల్ గాడెస్, రాముడుండాడు రాజ్జివుండాది, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, శ్మశానం దున్నేరు, సిటీ బ్యూటిఫుల్.

Posted in వ్యాసం | Tagged | 18 Comments

అప్పుడప్పుడూ…

తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. పొద్దులో తొలికవిత కూడా భావుకతగల బ్లాగరి రాధిక గారిదే కావడం విశేషం.

——————

మది నిండిన ఎన్నో మధురానుభూతులను
అప్పుడప్పుడూ ఒలక బోసుకుని
ఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లో
సర్దుకుంటూ వుంటాను
పాత పుస్తకాల పుటల్లోని నెమలీకలని..
దాచుకున్న ఉత్తరాల మడతల్లోని
మనసుల రూపాలని..
అపురూపంగా పరామర్శిస్తూవుంటాను
పట్టలేని భావోద్వేగాలు
యదను కుదిపేస్తూవుంటే
వాటిని కన్నీరుగాను,కవితలుగాను
మలచుకుంటూ..
తిరిగిరాని బాల్యాన్ని
కన్నులముందు ఆవిష్కరించుకుంటూ వుంటాను
-రాధిక (http://snehama.blogspot.com)
Posted in కవిత్వం | 8 Comments

శాస్త్రీయసంగీతం – నేను

SriharshaPVSS శ్రీహర్ష గత కొన్ని నెలలుగా హైదరాబాదు తెలుగుబ్లాగరుల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్న ఉత్సాహవంతుడు. భాషాభిమానం, సాహిత్యాభిమానం మెండుగా గల శ్రీహర్షకు శాస్త్రీయసంగీతమన్నా, కళలన్నా ప్రత్యేకమైన ఆసక్తి. ఈయన బ్లాగు కిన్నెరసాని – పేరుకు తగినట్లే ఆహ్లాదకరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ వ్యాసంలో శాస్త్రీయసంగీతం, కళల పట్ల తనకు ఆసక్తి ఎప్పుడు, ఎలా మొదలైందో వివరిస్తున్నారు శ్రీహర్ష. ఆస్వాదించండి:

——————-

‘ఇవాళ ఆరు నుంచి తొమ్మిదో తరగతి దాకా పిల్లలకి రెండు పీరియడ్లు క్లాసులుండవు, అంతా స్కూలు అసెంబ్లీ హాలులో హాజరు కావాలి’ అని చెప్పారు. అసెంబ్లీహాలులో ఎందుకు హాజరు కావాలో కూడా చెప్పారు కాని, రెండు పీరియడ్లు క్లాసులుండవనే మాట వినగానే కలిగిన ఆనందంలో ఎవ్వరికీ అది సరిగ్గా వినపడలేదు. థర్డ్ పీరియడ్ అవ్వగానే అందరం అసెంబ్లీ హాలుకి బయల్దేరాము. అసెంబ్లీహాలు బయట ఒక పెద్ద బ్యానరు కట్టివుంది. అందులో ఇంగ్లీషులో ఏదో పెద్ద వాక్యంలా రాసుంది. అంతగా గమనించలేదు కాని Society , Indian, Classical, Culture లాంటి కొన్ని పదాలు కనిపించాయి. నేను అప్పుడు ఆరో తరగతి చదువుతున్నాను. ఈ పదాల అర్థాలు చూచాయగా తెలుసుకాని మొత్తం బ్యానరు మీద రాసుంది అర్థంకాలేదు. గబగబా మెట్లెక్కి అసెంబ్లీహాలుకి వెళ్లాను. ఆ హడావుడంతా నాకు నచ్చిన బెంచీమీద కూర్చుందామని. తీరా పైకి వెళ్లి చూస్తే, బెంచీలన్నీ తీసేసారు. నేల మీద తివాచీలు పరిచారు. పిల్లలందర్నీ బూట్లు బయటే విడిచి లోపలికొచ్చి వరసగా కూర్చోమన్నారు. ఇదేంటబ్బా అనుకుంటూ లోపలికి వెళ్లి కూర్చున్నాక చూస్తే ముందర స్టేజిమీద కూడా కుర్చీలు తీసేసారు. అక్కడ కొన్ని పరుపులు వేసి వాటి ముందర మైకులు సర్దుతున్నారు. వాటి వెనకాలే కింద కనిపించిన బ్యానరు, దాని పైన ఇంకో బ్యానరు కనిపించాయి. పైనున్న బ్యానరులో SPICMACAY అని రాసుంది. కిందున్న బ్యానరుని ఈసారి సావకాశంగా చదివాను. అందులో Society for Promotion of Indian Classical Music And Culture Amongst Youth అని రాసుంది. పైన బ్యానరులో ఉన్న spicmacayకి కిందది ఫుల్ ఫార్మ్ అని అర్థమయ్యింది. పూర్తి అర్థం ఏమయుంటుందబ్బా అని అలోచిస్తుంటే మా సార్ ఒకాయన మమ్మల్నందర్నీ ‘silence’ అని ఒకసారి గదమాయించి, ‘ఇప్పుడు ఇక్కడ సరోద్ వాయిద్యం కార్యక్రమం జరుగుతుంది. మీరంతా అల్లరి చేయకుండా, మాట్లాడకుండా వినాలి. మీకు ఆ వాయిద్యం గురించి వివరిస్తారు కూడా. కార్యక్రమం చివర్లో మీకు ఏవయినా డౌట్లుంటే అడగవచ్చు’ అని చెప్పారు. ‘డౌట్లు అడగండి. అప్పుడే వచ్చినాయన మిమ్మల్ని మెచ్చుకుంటారు’ అని ఆయన ఓ ఉచిత సలహా ఇచ్చారు. వెంటనే ‘అయితే నేను ఓ డౌటడగవలసిందే’ అని నిర్ణయించేసుకున్నాను.

ఓ పదినిముషాలలో కార్యక్రమం మొదలయ్యింది. నార్తిండియా దుస్తుల్లో ఒకాయన వాయిద్యాన్ని పట్టుకుని స్టేజిమీద కొచ్చారు. ఆయన వెనకే తబలా పట్టుకుని ఇంకో ఆయన కూడా స్టేజి ఎక్కారు. ఇద్దరూ మైకులు చెక్ చేసుకుని, శృతి సరిచేసుకున్నారు. అప్పుడు ఆ వాయిద్యాన్ని ఆయన తన ఒళ్లోకి తీసుకుని దీనిని సరోదంటారని, ఇందులో చాలా తీగలుంటాయని దాని పుట్టుపూర్వోత్తరాలు, ఇంకొన్ని విషయాలు చెప్పి ఇక వాయించడం మొదలుపెట్టారు. వాయిస్తూ, మధ్య మధ్యలో వివరిస్తూ … ఎప్పుడు పట్టిందో కాని నాకు నిద్రపట్టేసింది. మళ్లీ ఒక్కసారిగా మెళుకువచ్చింది. అప్పటికి మాంచి వేగంగా వాయిస్తున్నారు సరోద్ ని. సరోద్ లో వాయిస్తున్న స్వరాలని తబలా పై పలికిస్తునాడు ఇంకొకతను. భలే పోటీలా సాగింది కొంచెంసేపు. అప్పుడు నాకు డౌటు అడగాలన్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఒక డౌటు రెడీ చేసిపెట్టుకున్నాను. ఇంతలో కార్యక్రమం అయిపోయింది. ‘మీకు నచ్చిందా’ అని అడిగారాయన. పిల్లలెవరూ ఏమీ మాట్లాడలేదు. పక్కనుంచి మా సార్లు సైగ చేసారు. ఆయన మళ్లీ ‘Did you enjoy the programme’ అని గట్టిగా అడిగారు. మా సార్ల సైగ అర్థంచేసుకుని మేమందరం ‘Yes’ అని అరిచాము. ‘That’s good’ అన్నారాయన. మీకేమయినా డౌట్లుంటే అడగండన్నారు. ఇదే అదను కోసం కాచుక్కూచున్న నేను ముందుకి వెళ్లబోయాను. అంతలోనే ముందు వరసలో కూర్చున్న వాడొకడులేచి వెళ్లి డౌటడిగాడు. ‘వీడెవడో ఫస్ట్ ఛాన్సు కొట్టేసాడనుకున్నాను’. తరువాత నేను వెళ్లి, సరోద్ లో పక్కనున్న మీటల గురించో, లేకపోతే ఏదో ఒక తీగగురించో డౌటడిగాను. ఆయన మెచ్చుకుని వివరించారు. తెగ పొంగిపోయాన్నేను.

ఇది నేను చూసిన మొదటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. తరువాత అదే సంవత్సరంలో మరికొన్ని spicmacay కార్యక్రమాలు జరిగాయి. మొదట్లో spicmacay కార్యక్రమాలంటే, రెండు పీరియడ్లు హాయిగా క్లాసులుండవు, అసెంబ్లీహాలులో బూట్లు బయటపెట్టి కిందకూర్చుని కార్యక్రమాలు చూడాలి / వినాలి, మధ్యలో మంచి నిద్ర వస్తుంది… ఇవి నాకు గుర్తున్న విషయాలు. తరవాత పై క్లాసులకి వెళ్లాక కూడా ఏడాదికి రెండు మూడు కార్యక్రమాలకి హాజరయినట్టు గుర్తు. ఎనిమిది, తొమ్మిది తరగతులకొచ్చే సరికి spicmacay, దాని ఫుల్ ఫార్మ్ కంఠతా వచ్చాయి. దాని అర్థం కూడా కొద్ది కొద్దిగా బోధ పడటం మొదలయ్యింది. అలా spicmacay పుణ్యమాని సితార్, భరతనాట్యం, కర్ణాటక ఫ్లూటు, సంతూర్, మణిపురి, ఒడిస్సి మొ.. కార్యక్రమాలు చూసాను. అప్పటిక్కూడా, కార్యక్రమాలలో ఒకటి అర కునుకుతీయడం, మధ్య మధ్యలో కార్యక్రమం కొంచెం చూడడం, కాస్త ఉత్సాహం గలిగితే డౌటు అడగటం, ఇదే వరస.

అయితే, spicmacay కార్యక్రమాల వ్యవహారమంతా పి.మోహన్ సార్ అని మా తెలుగు మాష్టారు ఆధ్వర్యంలో, ఇంకొంతమంది సార్లుకలిసి చూసుకునేవారు. మోహన్ సార్ అంటే ఎందుకో ముందునుంచీ నాకు చాలా గౌరవం. అది కాకుండా ఈ కార్యక్రమాలలో, కళాకారులని పరిచయం చేయడం, వారిని పూలమాలతో సత్కరించడం లాంటి వాటిలో ఎప్పుడూ పిల్లలనే పురమాయించేవారు. పై క్లాసుకి వెళ్లాక మనకికూడా అలాంటి అవకాశం రాకపోతుందా అనే ఊహ కూడా నన్ను spicmacay పై ఓ కన్నేసేటట్టు చేసింది. ఇక పదకొండో క్లాసుకి వచ్చాను. మాది CBSE స్కూలుకావటంతో, పదకొండో తరగతి వాళ్లకి పబ్లిక్ పరీక్ష ఉండదు. అందువల్ల, చదువుకి సంబంధం లేని ఎలాంటి పనయినా వాళ్లకే అప్పచెప్పేవారు. అలానే spicmacay కార్యక్రమాల బాధ్యత కూడా వాళ్లకే చెప్పేవారు. ఇక పదకొండో క్లాసుకి వచ్చాక మా స్నేహితులతో కలిసి నేను కూడా spicmacay కార్యవర్గంలో ఉండే వాడిని. అవసరమయ్యినప్పుడు కళాకారుల్ని స్టేషన్లో రిసీవ్ చేసుకోవడం, వారికి భోజన, టిఫిన్ల వ్యవహారాలు చూసుకోవడం, స్టేజి పైన బ్యానర్లు కట్టడం, బొకేలు, పూలమాలలు తెప్పించడం, కళాకారుల గురించి మైకులో చదవడం, కార్యక్రమం అయిపోయక vote of thanks చదవడం …. ఇవి మేము చేసిన పనులు. దగ్గరగా కళాకారుల్ని చూడడం, వారితో మాట్లాడం సహజంగానే ఈ కార్యక్రమాల పట్ల నాకు గౌరవాన్ని, ఇష్టాన్ని పెంచాయి. ఇలా పదకొండో తరగతిలో నేను దగ్గరుండి జరిపిన కార్యక్రమాలలో నాకు బాగా నచ్చినది, గుర్తుండిపోయినది కథకళి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి కేరళ నుంచి రామన్ కుట్టినాయర్ గారి గుంపు పదిమందికి పైనే వచ్చారు. కథకళిలో వారు చేసుకొనే అలంకారాలు, ఆ వాయిద్యాలు, ఆ హావభావాలు నన్ను బాగా ఆకర్షించాయి.

అదే ఏడాది మ స్కూలులో spicmacay స్టేట్ కన్వెన్షన్ ‘రాష్ట్ర స్థాయి సమావేశాలు’ జరిగాయి. మావంటి కార్యకర్తలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలనుంచీ వచ్చారు. ఇటువంటి గొప్ప సంస్థ వెనుక వుండి నడిపించే ఉత్సాహవంతులని కలిసే అవకాశం కలిగింది. చర్చల్లో spicmacay యొక్క ఉద్దేశాల గురించి, దాని భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించారు. నేను కుదిరినంత మేరకు వాటిలో పాల్గొన్నాను. నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. అలాంటి ఒక చర్చలో నాలో కలిగిన ఉద్వేగాన్ని బయటపెట్టాను. ‘మీరు ఇంత గొప్ప ఆశయాలతో, యువతరానికి మన కళలు, సంస్కృతులని పరిచయం చేయడానికి ఎంతో కష్టపడి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, గొప్పగొప్ప కళాకారులని దేశం నలుమూలలా తిప్పి స్కూళ్లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాని, ఎంత మంది ఈ కార్యక్రమాలని శ్రద్ధగా చూస్తున్నారో, వింటున్నారో మీరు ఎప్పుడయినా ఆలోచించారా? వేరే వాళ్ల దాకా ఎందుకు, నేనే నిన్న మొన్నటి వరకూ కార్యక్రమంలో చాలా సమయం పడుకునేవాడిని. మరి అటువంటప్పుడు, మీరు పడే శ్రమ వృధా అవుతోందనుకోటంలేదా’ అని అన్నాను. అప్పుడు, ఢిల్లీలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ఒక తెలుగాయన నన్ను భుజం తట్టి, ‘spicmacay ఆశయం మిమ్మల్నందర్నీ పూర్తి శ్రద్ధతో మూడు గంటల కార్యక్రమాలని పాఠంలాగా విని అర్థం చేసుకునేలా చేయాలని కాదు. మీ మనస్సులోతుల్లో మన కళల పట్ల, మన సంస్కృతి పట్ల ఒక చిన్న నిప్పుని పుట్టించడమే. రేపు మీరు పెరిగి పెద్దయాక, మీకంటూ మీరు జీవిస్తున్నప్పుడు, మీలో ఉండే ఈ నిప్పు పెద్దదై మిమ్మల్ని మన సంస్కృతిని అవగాన చేసుకోడానికి, మన కళలని ఆస్వాదించడానికి పురిగొల్పితే మా ఆశయం నెరవేరినట్లే’ అని అన్నారు. ఆ మాటలు నాకు కొంచెం బోధపడి కొంత ఊరట కలిగించాయి. అయినా ఆయన ఎప్పుడో భవిష్యత్తు గురించి చెప్పారు కాబట్టి అప్పుటికి నా చింతని కొంత దాటేసాను.

స్కూలు అయిపోయి, ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక, నా అదృష్టంకొద్దీ అక్కడ కూడా spicmacay ఉంది. మొదటి రెండు సంవత్సరాలు పెద్దగా వెళ్లలేదు, ఎక్కడ చదువుకి అంతరాయం కలుగుతుందోనని. తరువాత వెళ్లాను. ఇక్కడ కూడా, spicmacay ని చూసుకుననే కనకలింగేశ్వరరావు సార్ ప్రోద్బలం చాలా తోడ్పడింది. పదిహేనొందల మంది పట్టే కాలేజి ఆడిటోరియంలో, జూనియర్లని తెప్పించి కూర్చోపెట్టినా, పట్టుమని పది వరసలు ప్రేక్షకులుండక పోయినా కార్యక్రమాలని జరిపేసామంటే, spicmacay అంటే ఆయన కుండే మొండి పట్టుదలని చూసుకునే. దానికితోడు మా క్లాసుమేట్సు కూడా ఇందులో చేరి ఎవరికి నచ్చిన రీతిలో వారు పాలుపంచుకునేవారు. ‘స్టూడెంట్ల దగ్గర పదో పరకో డబ్బులు పోగు చెయ్యండయ్యా’ అని మా సార్ అన్నప్పుడు మొహమాట పడుతూనే ఒప్పుకున్నాక, కొద్ది రోజులు చేదు అనుభవాలు ఎదురయ్యాక, విసిగిపోయి, ‘సార్, ఇలా పది, ఇరవై కోసం అందరినీ ప్రాధేయపడ్డం ఎందుకు? ఎవరినో ఒకరిని పెద్దమనిషిని పట్టుకుంటే, వెయ్యో, రెండువేలో ఇస్తారు కదా సార్?’ అనేసాను. ‘అది వేరయ్యా, ఇలా ఒక్కొక్కరినే అడిగినప్పుడు, పదిమంది లేదన్నా, ఒకరిద్దరయినా నువ్వు అడిగినందుకు ఇస్తారు. డబ్బిచ్చినందుకయినా, నువ్వు మరీ మరీ రమ్మని చెప్పినందుకయినా కార్యక్రమానికొస్తారు’ అని అన్నారు. ‘నిజమే కదా’ అని అనిపించింది. ఆ తరువాత అందరి దగ్గరికీ వెళ్లి డబ్బడగటానికి, ‘ఇవాళ spicmacay కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలి’ అని క్లాసులో అనౌన్సు చెయ్యడానికి పెద్దగా జంకలేదు. అయితే, కొన్ని మంచి అనుభవాలు కూడా కలిగేవి ఈ సందర్భాలలో. మా క్లాసుమేటుని మేము క్యాంటీను దగ్గర డబ్బగినప్పుడు, ‘నాకిలాంటివి పెద్దగా ఇష్టముండవు. కాని మీరు మంచి పనేచేస్తున్నారని నాకనిపిస్తోంది, అందుకని నేను డబ్బిస్తాను’ అని చెప్పి ఓ పదో, పాతికో ఇచ్చాడు. ఇది మాకు చాలా రోజులు ఓ మాంచి టానిక్కులా పనిచేసింది.

కాలేజీ చదువు పూర్తయ్యింది. తరువాత ఉద్యోగంలో పడ్డాను. ఇప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా సాధ్యమయినంతవరకూ వెళ్తుంటాను. చిక్కడపల్లి త్యాగరాజ గాన సభయినాసరే, రవీంద్రభారతయినాసరే, హరిహరకళాభవనమయినాసరే, లేక శిల్పారామమయినా సరే. ఇలా అలవాటవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నా, స్కూల్లో spicmacay ఆశయం గురించి ఆ కార్యకర్త చెప్పిన మాటలు మాత్రం తరచూ గుర్తొస్తుంటాయి. ఇంకో విషయంకూడా గుర్తొస్తుంటుంది. ఇలా ఈ కార్యక్రమాలకి వెళ్తానని చెప్పినప్పుడు, లేక పోతే ఆ కార్యక్రమాల దగ్గర వేరే వాళ్లు కలిసినప్పుడు, తరచుగా నన్ను అడుగుతుంటారు ‘మీరు కూడా సంగీతం నేర్చుకున్నారా? మీకు సంగీతం వచ్చా?’ అని. మా కనకలింగేశ్వరరావు సార్ అనేవారు, ‘అందరూ పాడే వాళ్లే అయితే, మరి వినే వాళ్లు ఎవరయ్యా?’ అని. నిజమే, కళాకారులకి ఆస్వాదించే ప్రేక్షకులుంటేనే పాడాలనిపిస్తుంది, తమ కళను ప్రదర్శించాలనిపిస్తుంది. నా మట్టుకు నేను కళలకి ఒక మంచి ప్రేక్షకుడిగా ఉండడం మొదటి కర్తవ్యంగా భావిస్తాను.

-PVSS శ్రీహర్ష(http://kinnerasani.blogspot.com/)

Posted in వ్యాసం | Tagged | 10 Comments

జనవరి నెలలో:

అతిథి:
అలిగెడె – అమితాబ్ బచ్చన్ -రవి వైజాసత్య (బ్లాగు)

బ్లాగు:
 -చదువరి (బ్లాగు)

తెలుగు జాతీయవాది – అంబానాథ్

కబుర్లు:

సినిమా:
     -సుగాత్రి (బ్లాగు)
సినిమాలెలా తీస్తారు?-1

సమీక్ష:

దర్గా మిట్ట కతలు -సుధాకర్(బ్లాగు)

కవితలు:

నేను-ఆనందం -రాధిక (బ్లాగు)

నరుడు -సుధీర్ కొత్తూరి (బ్లాగు)

ఆ నవ్వు -చావా కిరణ్ (బ్లాగు)

సత్యా పదం-1 -కృష్ణదాస కవిరాజు (బ్లాగు)

కథలు:

కలవరం -సుధీర్ కొత్తూరి (బ్లాగు)

పెళ్ళిచూపులు (అనువాద కథ) -ఆంగ్లమూలం: అర్చన అనువాదం: త్రివిక్రమ్

Posted in ఇతరత్రా | Comments Off on జనవరి నెలలో:

తొలి తెలుగు బ్లాగరి కవిత

2004 మేనాటికే బ్లాగుల్లో తెలుగు కనిపించడం మొదలైందని రూఢిగా తెలుసు. మనకు తెలిసిన ఆ తొలి తెలుగు బ్లాగరి కృష్ణదాసకవిరాజు రాసిన కవిత ఒకటి పొద్దు పాఠకుల కోసం అందిస్తున్నాం. ఆస్వాదించండి.

సత్యాపదం-1

పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on తొలి తెలుగు బ్లాగరి కవిత