సత్యా పదం-1

కృష్ణదాసకవిరాజుకృష్ణదాసకవిరాజు – తన బ్లాగు(http://krsnadasakaviraju.rediffblogs.com/)లో 2004 మే లోనే తెలుగులో రాయడం మొదలుపెట్టిన ఈయన మనకు తెలిసినంతవరకు తెలుగులో మొట్టమొదటి బ్లాగరి. మరో విశేషమేమిటంటే కృష్ణదాసకవిరాజు అనేది ఒక ప్రముఖ తెలుగు బ్లాగరి కలం పేరు. ఫోటో చూస్తున్న మీకు ఆ విషయం వేరే చెప్పనక్ఖర్లేదనుకుంటున్నాం! 🙂

== సత్యా పదం ౧ ==

ఆడనే ఆడక, తందానతానలు మరి మరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీ మరీ.

కమలము చేబూని, విలాసము కలవాడై
కమలాక్షి వనుచు, విలాసవతివనుచు
అమల హృదివనుచు, కళావతివనుచు
రమామనోహర వల్లభుడననుచు,

ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ

అరుగుచూపవే అలసి ఆగినారేమో!
నీరివ్వవే, దప్పికతో ఆగినారేమో!
దారిచూపవే, దారితప్పినారేమో!
సిరిపతి కేమి తక్కువలే అయినా,

ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ

వెన్నెల రాజు వచ్చినాడు పైన,
కన్నెల రాజు ఇంకేల ఉన్నాడో,
వన్నెల దొరసాని సొగసులు చూడక,
ఇన్ని ఇక్కట్లేలనో, పాట్లేలనో మరి!

ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ

-కృష్ణదాసకవిరాజు (http://krsnadasakaviraju.rediffblogs.com/)

Posted in కవిత్వం | Tagged | 9 Comments

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

indiaflagparade.png

భారతీయులందరికీ 58 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎవరో ఒక దేశాధినేతను అతిథిగా ఆహ్వానించడం మన ఆనవాయితీ.

ఈసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నారు. స్వాగతం పుతిన్!

Posted in ఇతరత్రా | Comments Off on గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రెండన్నాం, కానీ మూడిస్తున్నాం!

మా గత సంపాదకీయం లోని “విశేషాల” వార్తకు ప్రజల స్పందన చూసాం. గడి గురించి మా సహ నెజ్జనులెంతగా ఎదురు చూస్తున్నారో మాకవగతమైంది. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఈ పనిలో కాస్త జాప్యం జరుగుతోంది. త్వరలో దీన్ని మీ ముందు పెడతాం.

ఇక నేటి విశేషాలు.. రెండు కథలు, ఓ కవిత. మొదట రెండనుకున్నాం గానీ, ఒకరోజు ఆలస్యానికి పరిహారంగా మూడోదీ అందిస్తున్నాం.

కలవరం

పెళ్ళిచూపులు

ఆ నవ్వు

ఆస్వాదించండి. విమర్శించండి.
-పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on రెండన్నాం, కానీ మూడిస్తున్నాం!

పెళ్ళిచూపులు

archana.bmpతెలుగువాళ్ళు రాసే ఆంగ్ల బ్లాగుల్లో ఎన్నదగినది http://archanaamperayani.blogspot.com. అర్చన రచనల్లో హాస్యచతురత, లోతైన ఆలోచనలు పుష్కలంగా ఉంటాయి. భావస్పష్టత, తిరుగులేని భావవ్యక్తీకరణ సామర్థ్యాలు ఆమె సొత్తు. ఆమె బ్లాగులోనుంచి తీసుకున్న ఈ రచనను ఆమె అనుమతితో మీ కోసం తెలుగులోకి అనువదించి అందిస్తున్నాం.

ఆంగ్లమూలం: అర్చన http://archanaamperayani.blogspot.com/2006/02/marriage-selection-procedure.html

అనువాదం: త్రివిక్రమ్

——————————

పెళ్ళికొడుకు పరివారసమేతంగా విచ్చేశాడు. వచ్చినవాళ్ళంతా సుఖాసీనులయ్యారు.

ఇతను కాక ఇంకా రావలసిన ముగ్గురు పెళ్ళికొడుకులూ ఒకేసారి వచ్చేస్తే వాళ్ళు నలుగురూ ఒకర్నొకరు చూసుకుని “You too…” అనుకునే సన్నివేశాన్ని ఊహించుకుని పెళ్ళికూతురి తండ్రి కలవరపడుతున్నాడు.
పెళ్ళికొడుకు అప్పటికే వీళ్ళెవరికీ కనబడకుండా ఎటైనా పారిపోదామా అని చూస్తున్నాడు. తన వెంటవచ్చినవాళ్ళలో సగం మంది అతనికి తెలియనివాళ్ళే. పెళ్ళికూతురి అక్కను చూసి “ఈ అమ్మాయినా నేను చేసుకోవాల్సింది?! ఈ అమ్మాయి చూడబోతే నాకంటే పెద్దదిగా కనబడుతోందే? అసలు ఈ అమ్మాయిని చూడ్డానికి నన్ను రమ్మని బలవంతం చెయ్యడంలో అమ్మ ఉద్దేశ్యమేంటి? ఇక లాభం లేదు. అఫీసులో నా పక్క సీటు పిల్లకు ట్రై చెయ్యాలి.” అనుకుంటున్నాడు.
పెళ్ళికొడుకు తల్లి (మనసులో): ఇల్లు బానే ఉంది. ఉన్నంతలో ఇల్లు చక్కగా సర్దుకున్నారు. మనుషులు కూడా మర్యాదస్థులే కాకుండా బాగా ఉన్నవాళ్ళలానే కనిపిస్తున్నారు. ఊ…చాలా మంది కనబడుతున్నారు. పెద్ద కుటుంబమే! మావాడికి తగిన సంబంధం. ఈ సంబంధం కుదిరితే పై గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి రెండురూపాయలు వేస్తాను.
పెళ్ళికొడుకు తండ్రి (మనసులో): “రెండో ఇన్నింగ్స్ మొదలయ్యేటప్పటికైనా ఇల్లు చేరగలమా?”
(ఇదే ఆలోచన పెళ్ళికొడుకు మనసును, అతడి తమ్ముడి మనసును, పెళ్ళికూతురి తండ్రి మనసును,…ఇంకా చెప్పాలంటే అక్కడున్న మగవాళ్ళందరి మనసులను తినేస్తోంది. ఐతే ఇక్కడ నడుస్తున్నది అంతకంటే ముఖ్యమైన వ్యవహారం కాబట్టి తప్పదన్నట్టు కూర్చున్నారు.)
పెళ్ళికొడుకు తమ్ముడు (మనసులో): ఏంటో? 🙂
ఎందుకో తెలియదుగానీ ఇలాంటి సందర్భాల్లో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అత్యంత నిరాసక్త, ఉదాసీన జీవులుగా ఉంటారు. ఎప్పుడూ నిద్రమొహాలతో, ఎడతెగని ఆవులింతలతో, ఏదెలా జరిగితే మాకేమన్నట్లుంటారు.
పెళ్ళికూతురింకా రాలేదు.అమ్మాయి తండ్రి (ఏ ఒక్కరితోనో అన్నట్లు కాకుండా): “అబ్బ! ఈ మధ్య మరీ ఉక్కపోతగా/చలిగా/ముసురుపట్టి ఉంటోంది. ఐనా ఈ ఊరు పదహైదేళ్ళ కిందట ఉన్నట్లు ఇప్పుడు లేదు.”

అక్కడున్నవాళ్ళందరూ ఒకేసారి ఔనౌనన్నట్లు తలలాడిస్తూ అన్ని వైపులకూ చిరునవ్వులు రువ్వారు – ఎవరికందితే వాళ్ళందుకోండన్నట్లు. బేటన్ అందుకున్న అబ్బాయి తండ్రి రాజకీయాల గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం మొదలుపెట్టాడు. తానేమీ తక్కువతినలేదన్నట్లు అమ్మాయి తండ్రి స్థానిక ఎమ్మెల్యే గురించి, మునిసిపాలిటీ గురించి, ఇంకా ఏయే విషయాల గురించి మాట్లాడబోతే తన భార్య వినకుండా విసుగ్గా వెళ్ళిపోతుందో ఆ విషయాల గురించి ఉత్సాహంగా విమర్శలు మొదలుపెట్టాడు. ఇక ఆ ఇద్దరు పెద్ద మనుషులు బడ్జెట్ గురించి, ప్రభుత్వం గురించి, ఇంకా బోలెడు పనికిమాలిన విషయాల గురించి ఉత్సాహంగా చర్చించేశారు.

అప్పుడు:
ఏ క్షణాన్నైనా సోఫా అంచు మీది నుంచి జారి కిందపడిపోయేటట్లుండే పె.కొ.తమ్ముడు తన కాలివేళ్ళకేసి దీక్షగా చూస్తున్నాడు. అక్కడ చేరిన ముత్తైదువులకు కంగారు మొదలైంది. అప్పుడే పె.కూ. తరపు పెళ్ళిపెద్దలు రిఫ్రెష్‌మెంట్స్ తీసుకురమ్మని పె.కూ.తల్లికి పురమాయించడం ద్వారా వాళ్ళందర్నీ ఈ లోకంలోకి లాక్కొచ్చిపడేశారు. అకస్మాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. పె.కూ.పక్షం క్రిస్టల్ గ్లాసులు బయటికి తీయాలా లేక చీనా కప్పులు వాడాలా అనే మీమాంసలో పడిపోయింది. పె.కొ.పక్షానికి అనీజీగా అనిపించింది: “వాళ్ళందరూ గుడ్లప్పగించి చూస్తూ ఉంటే మనం తింటూ కూర్చోవాలన్నమాట. దారుణం!”

పె.కూ.తల్లి ఫలహారాలతో వచ్చింది. అందరికీ అందించమని పె.కూ.అక్కకు సైగ చెసింది. పనిలోపనిగా పరిచయం కూడా చేసేసింది: “ఈమె మా పెద్దమ్మాయి.” *టింగ్…* పె.కొ. ఈ లోకంలోకొచ్చి పడ్డాడు: “ఓహో! ఈమె పె.కూ.కాదన్నమాట! బతికించావు భగవాన్!”

“ఆమె భర్త ఫలానా కంపెనీలో పనిచేస్తాడు. మా అల్లుడని చెప్పుకోవడం కాదుగానీ అతను చాలా మంచివాడు. అతను మా అల్లుడిగా దొరకడం మా అదృష్టమనే చెప్పాలి.” ఈ మాటలతో పె.కొ.మీద ఒత్తిడి నూరింతలు పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడున్నవాళ్ళందరికీ అతడు ఎంత కట్నం ఆశిస్తున్నాడో తెలుసు గద! పెద్దల్లుడితో అనుకోకుండా, అనివార్యంగా వచ్చిపడిన ఈ పోలిక వల్ల ఇప్పుడతను అక్కడున్నవారందరి కళ్ళకూ కట్నం కోసం మామగార్ని పీడించే జలగలాగ కనిపిస్తాడు. భగవాన్! ఇంత మంచి పెద్దల్లుళ్ళను ఎందుకిస్తావయ్యా?

ఈ రకమైన అర్థం పర్థం లేని సంభాషణలు కాసేపు కొనసాగాక అందరినోళ్ళూ మూతపడ్డాయి- మాట్లాడుకోవడానికి టాపిక్కేమీ దొరక్క. ఇంకోపక్క పెళ్ళికొడుకు అసహనం పెరిగిపోతోంది.

[…ఇక్కడ కట్ చేస్తే…]
-:రెండవ దృశ్యం:-

“ఇక అమ్మాయిని పిలవండి” అనే మాటతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. “వధువు వస్తున్నదీ…”

అమ్మాయి: (మనసులో) ఇంతకూ వీళ్ళలో పెళ్ళికొడుకెవరు? నేను పొరపాటున వేరొకతన్ని చూసి నవ్వానంటే గో…విందా! మా అమ్మ ఇక నన్ను బతకనివ్వదు.
పె.కూ.త: ఈమె మా చిన్నమ్మాయి. ఇప్పుడు సంబంధం చూస్తున్నది ఈ అమ్మాయికే.
పె.కూ. (మనసులో): ఛా! అక్కడికి వీళ్ళేదో నన్ను చూసి ఐశ్వర్యారాయనుకున్నట్లు. అమ్మా! ఇక ఆపుతావా?
పె.కూ.త (మనసులోనే గిలగిల్లాడిపోతుంది)రామా! ఈ పిల్ల నేను చెప్పిన మాట ఒక్కటీ వినదు గదా? ఈ ఆకుపచ్చచీరెలో ఉండేదానికంటే ఇంకా నల్లగా కనబడుతోంది. మెరూన్ కలర్ చీరెలో ఐతే బాగుండేది. ఇప్పుడీ పెద్దమ్మ వాళ్ళకెలా నచ్చుతుందో ఏమో?
పె.కొ. (మనసులో): మ్…బాగుంది. కానీ ఆ అమ్మాయికి ఆ చీరెలో సౌకర్యంగా ఉన్నట్టు లేదు. అంటే ఆ అమ్మాయి మామూలుగా మాడరన్ డ్రస్సులే వేస్తుందన్నమాట.
పె.కొ.తల్లి (మనసులో): వీడు ఆ పిల్లను కన్నార్పకుండా గుడ్లగూబలాగ చూస్తున్నాడేమిటి? వాళ్ళేమనుకుంటారు?
పె.కొ.తండ్రి (మనసులో): హమ్మయ్య! అమ్మాయి వచ్చేసింది. మహా ఐతే మరో 20 నిమిషాల్లో మనం బయలుదేరవచ్చు. అదే జరిగితే రెండో ఇన్నింగ్సేం ఖర్మ? మొదటి ఇన్నింగ్స్ కూడా చూడొచ్చు.

పె.కొ.త. (మనస్సులో): ఏమిటో!
పె.కూ.చె. (మనస్సులో): ఏమిటో!

సరే! అమ్మాయి వచ్చి కూర్చుంది.

అమ్మాయి తండ్రి : ఐతే…మీరు ఫలానా కంపెనీలో పనిచేస్తున్నారన్నమాట. (మనసులో) మాటలు కలపడానికి దీన్ని మించిన తారకమంత్రం లేదు. హె హె హె……

పె.కొ. (మనసులో): తలూపితే సరిపోతుందా లేక ‘అవునండీ’ అనాలా? నేనెక్కడ పనిచేసేదీ ఆయనకు మాత్రం ఇప్పటిదాకా తెలీదా? నేను కారు గ్యారేజీలో ఫిట్టర్ నని చెబితే ఎలా ఉంటుంది? హె హె హె. భలే తమాషాగా ఉంటుంది. ఐతే తర్వాత మా అమ్మ నన్ను చంపేస్తుంది. నా సెన్సాఫ్ హ్యూమర్ ను ప్రదర్శించే సందర్భమిది కాదు. ఈ జోకేస్తే అమ్మాయి మాత్రం ఖచ్చితంగా మురిసిపోతుంది.

పె.కూ (మనసులో): నాన్నా! అతనేం పని చేసేదీ నాకు వెయ్యిసార్లు చెప్పావు. ఇప్పుడు మళ్ళీ అతణ్ణి ఆ ప్రశ్న ఎందుకు అడుగుతావు? ఐనా అతడో దద్దమ్మలా ఉన్నాడు. అతడి మొహమ్మీది ఎక్స్‌ప్రెషన్ చూడలేక ఛస్తున్నాను.
పె.కొ.: అవునండీ!
పె.కూ.తల్లి: అమ్మాయినేమైనా అడగాలనుకుంటే అడుగు బాబూ! మొహమాటపడకు.
పె.కొ. (మనసులో): డేటడిగితే ఎలా ఉంటుంది?
(పైకి)ఐతే మీరు ఇంజినీరింగ్ పుణెలో చేశారన్నమాట. (మనసులో) నా పాత గర్ల్ ఫ్రెండు కూడా అక్కడే చదివిందని చెప్తే ఎలా రియాక్టవుతుందో?

అమ్మాయి: అవును (మనసులో) తను ఐఐటీలో చదివానని గుర్తుచెయ్యడానికి కాకపోతే ఇప్పుడీ దిక్కుమాలిన ప్రశ్న అవసరమా?
పె.కొ.తల్లి (మనసులో): సాయి బాబా! ఈ పిల్లను వీడు ఇదెందుకడుగుతున్నట్లు? ఆ పోరంబోకు పంజాబీ పిల్లను వీడు మర్చిపోయాడనుకున్నా. ఆ పాత కథనంతా ఇప్పుడు వీడినోటివెంట కక్కించకు తండ్రీ!

పె.కొ.: నైస్ సిటీ. కదా?
పె.కూ (మనసులో): “ఔనౌను..మంచి బార్లుంటాయక్కడ.” అనిచెప్తే గురుడేమౌతాడో? హె హె హె. పిల్లోడు థ్రిల్లైపోతాడు గానీ నా సెన్సాఫ్ హ్యూమర్ ను ప్రదర్శించే సందర్భం కాదిది.
అట్లాంటి పనికిమాలిన ప్రశ్నలైపోయాక మళ్ళీ నిశ్శబ్దం.
ఇప్పుడు పెళ్ళికొడుకు తరపు పెళ్ళిపెద్దలు: “ఐతే ఆగస్టు నెల్లో ముహూర్తం పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందా అండీ?”

పె.కొ. (మనసులో కెవ్వుమన్నాడు): అమ్మాయి నచ్చిందని నేనెప్పుడన్నాను?

పె.కూ. (మనసులో కెవ్వుమంది): సరేనని నేనెప్పుడన్నాను? ఐనా ఈ మనిషి ఇంత తొందరగా అవుననేశాడంటే పెళ్ళి కోసం ఎంతకాలంగా తిరుగుతున్నాడో పాపం? కొంపదీసి అందరూ కలిసి ముడిపెట్టేస్తారా ఏమిటి?

అందరూ చెవుల్దాకా నోళ్ళు చాపి చిరునవ్వులు నవ్వారు. “ఓ తప్పకుండా!”. “అలాగే! దానికేం?” అని ఒకరిద్దరు అన్నారు. అప్పటికే పె.కొ.తండ్రి ఆలస్యం చెయ్యకుండా బయలుదేరితే మొదటి ఇన్నింగ్స్ లో సిద్ధూ కామెంటరీ కూడా వినొచ్చని లోపల్లోపలే తొందరపడిపోతున్నాడు.
“ఏ విషయం ఒక వారం లో చెప్తామండీ”
“సరేనండీ, మేం మీ మాట కోసమే ఎదురుచూస్తూ ఉంటాం.”

“ఇక మేం వెళ్ళొస్తామండీ!”, “మంచిదండీ”, “ఉంటామండీ”, “శుభం”, “నమస్కారం” లాంటి మాటలు జోరుగా అప్పజెప్పుకున్నతర్వాత రెండుపక్షాలవాళ్ళ మనసుల్లో సవాలక్ష సందేహాలు షికార్లు చేస్తూ ఉండగా ఎవరి దావన వాళ్ళు వెళ్ళిపోయారు.

Posted in కథ | Tagged , , | 11 Comments

కలవరం

uniquespeck.jpgయునిక్ స్పెక్ (Unique Speck) పేరుతో సుధీర్ రాసే తెలు’గోడు’ బ్లాగు తెలుగు బ్లాగులోకానికి సుపరిచితం. సుధీర్ రాసిన ‘కలవరం’ కథను పొద్దు పాఠకుల కోసం అందిస్తున్నాం. పొద్దులో ఇది తొలికథ కావడం విశేషం.

————————–

చావైనా బ్రతుకైనా నీ జత వీడనని, శ్వాసల బాసలు మూగవోయేదాకా స్వార్థపు మలినం అంటించుకోనని, నా వారని నీవారని వ్యత్యాసమెరుగక సాదరముగనుండెదనని, మరణం మనలను ఎడబాపినా మరో మగువకు నాతో నాలో స్థానం లేదని, మరు జన్మకు సహితం నీ మొగుడుగనుంటానని…యవల చేల్లో ఆనాడు చేసిన బాసలు యద మందిరం దద్ధరిల్లేలా ప్రతిధ్వనిస్తున్నాయి- దిగ్గున లేచాడు శ్రీధర్! చెవులు కొరికే చలిలో సైతం చెమటలో తడిసి ముద్దైనాడు…”వేడి వేడి కాఫీ తీసుకోండి, మళ్ళీ ఏమైనా కలగన్నారా? ఈ రోజు మన ప్రోగ్రాం గుర్తుందికదా? వేన్నీళ్ళు పెట్టాను కాఫీ తాగి స్నానంచేసిరండి, టిఫిన్ చేద్దురుగాని.. .ఊ త్వరగా! నేనీలోపు వ్యాక్యూం చేసి బట్టలు వాషింగ్ మెషిన్ లో పడేసివొస్తాను సరేనా?” గల గలా మాట్లాడుతున్న మహాలక్ష్మిని చూస్తూ కలల ప్రభావంనుంచి ఇంకా పూర్తిగా కోలుకోని శ్రీధర్ సరే అన్నట్లు కాఫీ తాగుతూ మెల్లగా తలాడించాడు.
ఈ మధ్య శ్రీధర్‌కి టెన్షనెక్కువైపోయింది. ఏడెనిమిదేళ్ళక్రితం టీనేజి శ్రీధర్ వేరు ఇప్పటి శ్రీధర్ వేరు. డిగ్రీ చదివేరోజుల్లో శ్రీధర్ అంటే ఎందరికో క్రేజ్ ఉండేది. చదువులో, ఆటపాటల్లోనే కాదు గొడవల్లోను ముందుండేవాడు.

కెమిస్ట్రీ లెక్చరర్ సస్పెండ్ అవడానికి, తన సీనియర్ ఒకడు కాలేజ్ విడిచి వెళ్ళడానికి కారణం శ్రీధరే. ఇంకా ఎందరికో కొరకరాని కొయ్యలా ఉండేవాడు. డబ్బులు తీసుకొని ల్యాబ్ ఎగ్జాంస్ పాస్ చేస్తున్నాడని కెమిస్ట్రీ లెక్చరర్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు, తన సీనియర్ ఒకడు ర్యాగింగ్ చేస్తున్నాడని రిపోర్ట్ చేసి వాడ్ని సస్పెండ్ చేయించాడు…దానికి ఇగో దెబ్బతిని వాడు కాలేజే మానేసి శ్రీధర్ అంతుచూస్తానని ముక్కుపగలగొట్టించుకొని బ్రతుకుజీవుడా అనుకొంటూ పారిపోయాడు. కాలేజిలోనే కాదు ఊర్లోను అంతే. ఒకసారి దిగాలుగా కూర్చున్న అమ్మని అడిగాడు ‘ఏంటి సంగతి?’ అని. “నీకెందుకురా? గమ్మున చదువుకో, లేపోతే నీ పని చూసుకో. అన్నీ వివరాలు కావాలి.” అని కసురుకున్న అమ్మకి విసుగుపుట్టి విషయంచెప్పేవరకు అడుగుతూనేవున్నాడు. చివరికి చెప్పింది ఆఫీస్‌లో నాన్నని కొందరు విసిగిస్తున్నారని. ఎవరో కాంట్రాక్టర్ ఫైల్ మీద సంతకం పెట్టమని లంచమిచ్చి బెదిరిస్తూ వొత్తిడి తెస్తున్నారట. తోటి ఉద్యోగస్తులు కూడా సంతకం పెట్టొచ్చుకదా, నువ్వేం లంచమడగట్లేదు వాడే ఇష్టపూర్వకంగా ఇస్తానంటుంటే సత్యహరిశ్చంద్రుడిలా ఈ చాదస్తమేంటి రాజారావ్ అని ఆకాంట్రాక్టర్కే వత్తాసు పలుకుతున్నారట.ఏంచెయ్యాలో పాలుపోవట్లేదు, వేరే సెక్షన్‌కి మారడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు అని చెప్పింది.శ్రీధర్ అంతావిని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

ఆ మరుసటి రోజు ఆఫీస్‌నుండొస్తున్న రాజారావ్ గడపలో కాలు పెట్టకముందే మొఖం చాటంత చేసుకొని భార్య సరోజతో,”ఆ కాంట్రాక్టరు ఈ రోజు నా దగ్గరకొచ్చి క్షమాపణ కోరాడు.నువ్వు కూడ అప్పుడప్పుడు ఏంటండీ మరి చాదస్తం అని దెప్పిపొడిచేదానివి, నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా సమస్యలను అధిగమిస్తాము. అంతే కాదు ఆ కాంట్రాక్టరి కొడుకు హైదరాబాదులోనే చదువుతున్నాడట.ఏమైనా సమస్యుంటే మన శ్రీధర్ సహాయం తీసుకోవొచ్చా అని అడిగాడు.మంచితనంతో ఎవరినైనా మార్చవొచ్చు.మొన్నటివరకు బెదిరించిన కాంట్రాక్టర్ని చూడు నేడు తప్పు తెలుసుకోవడమే కాదు తన కొడుక్కోసం మన సహాయం కూడా కోరుతున్నాడు…” అని ఏకబిగిన లెక్చరిస్తున్న రాజారావ్ మాటల్లో కాంట్రాక్టర్ కొడుక్కి శ్రీధర్ సహయం కావాలన్న మాట సరోజనాకర్షించింది.

ఈలవేసుకొంటూ రాజారావ్ స్నానానికెళ్ళాక సరోజ కొడుకు శ్రీధర్తో,”ఆ కాంట్రాక్టర్ కొడుకునేంచేసావ్? వాడుకాని నాన్నతో నీ పేరు చెప్పుంటే ఈ రోజు మనింట్లో ఇంకో సత్యాగ్రహం జరిగుండేది” అని అంది.”అమ్మా! నేనిక్కడే వున్నాకదా! ఆ కాంట్రాక్టర్ కొడుకు వాడి సీనియర్లతో గొడవపడ్డాడట. అందులో ఒకడు డిప్యూటీ కమీషనర్ కొడుకు, ఇంకొకడు ఎంపి మనవడు.యాదృచ్చికంగా వాళ్ళిద్దరూ నా స్నేహితులు. ఇక కాలేజిలో కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళతో రాజీపడాల్సిందే. ఇది తెలిసి కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేసాడు, నేను వాళ్ళకి సర్దిచెప్పాను. మాటల్లో మాటగా నాన్నని విసిగించొద్దని చెప్పాను.ఇందులో తప్పేముంది?” అని సమాధానమిచ్చాడు శ్రీధర్. “ప్రతిదానికి భలే తెలివిగా, నీ తప్పేమీలేదన్నట్లు సమాధానం చెప్పి నోరు మూయిస్తావురా నువ్వు. ఈ తెలివితేటలు మంచి దారిలో పెట్టు” అని సరోజ చెప్పగానే, ” the cruel kindness of a doctor’s knife saved the poor man’ life!” అనే oxymoranic expression గుర్తుతెచ్చుకొని, “పొట్టలు చీల్చే కౄరమైన కత్తి కూడా ఒక డాక్టర్ చేతిలోపడితే ప్రాణాలు కాపాడుతుందమ్మా! నా నైజం అంతే! నువ్వేం దిగులుపడకు” అని సంజాయిషీ నుండి ఉపదేశపు లెవెల్లో వివరిస్తున్న శ్రీధర్ని, “ఇక చాల్లేరా సకల కళా పోషకా, నీతో వాదించడం కష్టం” అని వ్యంగ్యంగా అంటున్నా సరోజ మనసులో కొడుకుని చూసి మురిసిపోయింది.అయినా మళ్ళింకెప్పుడూ ఇలా బెదిరింపులు, రాజకీయాలు చెయ్యొద్దని కొడుకుని హెచ్చరించింది.

ఇలా శ్రీధర్ గురించి చెప్పుకొంటూపోతే ఎన్నో విషయాలున్నాయి- సకల కళా పోషకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి,చిరు, డాన్,తోపు,అన్న, బాసు ఇలా నానా రకాల టైటిల్సు అందుకొన్నాడు.

ఎన్ని కళలున్నా అమ్మాయిల విషయంలో మాత్రం శ్రీధర్ జీరో. తను 8వ తరగతిలో ఉన్నపుడు ఒకమ్మాయిని ఇష్టపడ్డాడు.యూనివర్సిటీలో స్నేహితులతో ఏ బర్త్‌డే పార్టీకో, కాలేజ్‌డేకో మందుకొట్టినప్పుడు వాళ్ళకు తన లవ్ స్టోరీ చెప్పేవాడు.ఆ అమ్మాయితో హైస్కూల్లో ఉన్నపుడు శ్రీధర్ మూడు సార్లు మాట్లాడాడట.చివరిసారిగా 10th క్లాస్‌లో తను స్లాం బుక్ ఇచ్చేటప్పుడు చేతులొణికి పెన్ను కింద పడేస్తే ఆ అమ్మాయి గలగల నవ్వుతూ “ఏంటి అమ్మాయిల్తో ఎప్పుడూ మాట్లాడలేదా? నేనేమీ భూతాన్ని కాదు.స్లాం బుక్ ఇప్పుడు వ్రాయలేకపోతే సాయంత్రం స్కూల్ అయిపోయాక వ్రాసివ్వండి” అంటూ అదే చెరగని నవ్వుతో వెళ్ళిపోయింది.ఆమెను చివరిసారిగా చూసింది 10th క్లాస్ ఫేర్‌వెల్ పార్టీలో!ఆ రోజు తను గులాబీ రంగు చీరెలో దేవ కన్యలా మెరిసిపోతూ అదే చెరగని నవ్వుతో చేసిన మాయ ఇంకా తనపై పనిచేస్తూనేవున్నాయి, తన జ్ఞాపకాలు గుండెలో గూడుకట్టుకొని అలానే నిలిచిపోయాయి, తన ప్రేమను చెప్పే ధైర్యంలేక, తెలిసీ తెలియని ఆ వయసులో తన మనసుదోచిన వన్నెలాడి ఊసులని వెలలేని వజ్రాలుగా మనసుపొరల్లో దాచుకొన్నాడు. ఒకరోజు కాలేజ్ canteenలో కూర్చొని స్నేహితులతో మాట్లాడుతున్న శ్రీధర్ ఎదురుగా నిలిచిన ఒక అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు. అది గమనించిన స్నేహితుడొకడు, ‘అన్న మనసు దోచిన కన్నె పిట్టరో’ అని అనగానే, శ్రీధర్ నవ్వుతున్న ఆ పిల్లను చూసి ఎప్పుడో చూసిన అదే నవ్వు, నను మాయచేసిన మంత్ర ముగ్ధ మందహాసం….తన మనసు దోచిన మగువ తనో కాదో తెలుసుకోమని వాళ్ళతో చెప్పాడు.అందమైన అమ్మాయిల చిట్టా మెయిన్‌టైన్‌చేసే సీనుగాడు చిట్టా విప్పాడు- పేరు సునయన, 2nd year electronics, ఊరు ఒంగోలు,1st year ఎక్కడో చదివాక కాలేజ్ transferలో ఇక్కడ చేరింది. క్లాస్‌లో చాలా calm. ఇప్పటికే ఒక నలుగురైదుగురు ఆషిక్‌లు వెంటపడుతున్నారు.అమ్మాయి చాలా స్ట్రిక్ట్. ఒకడి చెంప పగలడం చూసి ఇంకొకడు already డ్రాప్ అయ్యాడు. కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సురేష్ అనేవాడు మాత్రం ఎలాగైనా నిన్నే పెళ్ళి చేసుకొంటా అని బెదిరిస్తూ వెంటపడుతున్నాడు. Unfortunately ఊరవతల స్మశానంలా ఉండే electronics డిపార్ట్మెంట్ అవడంవల్ల ఆర్నెల్లైనా అన్న మనసు దోచిన ఈ అందం బయటపడలేదు.అన్న గ్రీన్ సిగ్నలిస్తే సురేష్ కాదు వాడి బాబు కూడ ఒప్పుకొంటాడు. సీనుగాడు excitementపై తను స్కూల్లో చూసిన అమ్మాయికాదు ఈ సునయన అని నీళ్ళు చల్లాడు శ్రీధర్. అయినా వాడు,”బాసు ఎప్పుడో చిన్నపుడు చూసిన అమ్మాయి మళ్ళీ దక్కటం దేవుడెరుగు కనపడటమే గగనం. అట్లాంటిది ఆ పైవాడే నీ బాధనర్థం చేసుకొని అచ్చు వొదినమ్మలాంటి ఇంకొ అమ్మాయిని నీ కోసం పంపాడు. ఈసారి మిస్ అవ్వకు బాసు!”

అని గీతోపదేశం చేసాడు.శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు- మౌనం అర్థాంగీకారమన్నట్లుగా!సునయన శ్రీధర్ల మధ్య స్నేహమేర్పడటానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎప్పుడూ ముభావంగా ఉండే శ్రీధర్ తను ఇష్టపడే ఆ నవ్వుకోసం కష్టపడి జోకులు, చలోక్తులతో సునయనను నవ్వించేవాడు.శ్రీధర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే సురేష్ లాంటి వాళ్ళ పీడ కూడా సునయనను వొదిలిపోయింది.రోజులు గడిచే కొద్దీ శ్రీధర్ తను సునయనను కాదు గాని ఆమె నవ్వును ప్రేమిస్తున్నాడని అర్థంచేసుకొన్నాడు. సునయన కూడ శ్రీధర్తో ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు.కాలేజ్ చివరిరోజు అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు- శ్రీధర్ సునయనలు పెళ్ళి ప్రకటన చేస్తారేమొనని! కాని అటువంటిదేమీ జరుగలేదు.సునయన శ్రీధర్తో, “సారీ! నేనసలు మిమ్మల్ని ప్రేమించడానికి మీతో స్నేహం చేయలేదు. మీగురించి విని నా వెంట పడుతున్న ఆకతాయిల అల్లరి భరించలేక వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీలాంటి బాయ్‌ఫ్రెండ్ ఉంటే మంచిదనుకొని మిమ్మల్ని ప్రేమించినట్లు నటిద్దామనుకొన్నాను, అయినా మీరు మంచి స్నేహితులయ్యారు.మీరు నన్ను ప్రేమించట్లేదని గ్రహించి హమ్మయ్యా అనుకొన్నాను.మీ ఫ్రెండ్ మీ లవ్ స్టోరీ చెప్పాడు. నేనచ్చు ఆ అమ్మాయిలానే వుంటానని….” అని మాట్లాడుతుంటే శ్రీధర్ అన్నాడు,” నువ్వు కాదు తల్లీ! నీ నవ్వు! నేను నీ నవ్వుని ప్రేమించాను నిన్ను కాదు! ఇంకొకరిని ప్రేమించడం నా వల్ల కాదేమో!” “అయినా ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అమ్మాయి కోసం మీరిలా నిరీక్షించడం అవివేకం మంచమ్మాయిని చూసి పెళ్ళి చేసుకొండి” అని ఒక ఉచిత సలహా ఇచ్చిన సునయినను, “అయితే నిన్నే చేసుకొంటా రా” అని అసహనంగా అన్న శ్రీధర్ మాటలకి సునయన నోరుమూసుకొని వెళ్ళిపోయింది.

కాలేజ్ అయిపోవడం శ్రీధర్ సునయనల స్టోరీకి తెరపడటం ఒకేసారి జరిగిపోయాయి!

MS చేయడానికి డల్లాస్ వొచ్చిన శ్రీధర్‌కి మొదటి రోజే అనుకోని షాక్! “హేయ్! శ్రీధర్! absolutely unbelievable! ఇది కలా నిజమా…” అంటూ చేతులు చాచి full excitement తో శ్రీధర్ని కౌగలించుకొంది ఆ స్కూల్ పిల్ల! శ్రీధరింకా షాక్‌నుండి కోలుకోలేదు…”మ..మ…మహాలక్ష్మీ! నువ్విక్కడ?” అని మాటలురాక తడబడుతున్న శ్రీధర్ని చూసి అదే గమ్మత్తైన నవ్వుతో,”ఏంటి? నువ్వే MS చెయ్యాలా? మేము చేయకూడదా? నీ చేతులింకా వొణుకుతున్నాయా అమ్మాయిల్తో మాట్లాడేటప్పుడు? చేతులేమో కాని మాటలైతే తడబడుతున్నాయి! ఆ సీన్ ఇంకా మరిచిపోలేదు శ్రీధర్…పెద్ద angry young man లా ఫోజు, అమ్మాయిని చూడగానే తడబాటు….” అంటున్న మహాలక్ష్మిని చూస్తూ, “నేనూ నిన్ను మరిచిపోలేదు మహాలక్ష్మీ! तुम ने एक मुस्कुराहट से ज्यादु कर्के मुझे पागल बना के गायब होगयि| (తూనేతో ఏక్ ముస్కురాహట్‌సె జ్యాదు కర్కె ముఝె పాగల్ బనాకె గాయబ్ హోగయి)…” అని మనసులో అనుకొన్నాడు.”నేనిక్కడికి వొచ్చేముందు మీ ఇంటికి వెళ్ళాను.నా 10th క్లాస్ సర్టిఫికేట్ పోతే తిరిగి అప్లై చేయడానికి మన స్కూల్ కి వెళ్ళాల్సొచ్చింది.ఎందుకో నువ్వు గుర్తొచ్చి నవ్వొచ్చింది.నువ్వేంచేస్తున్నావో, ఎలావున్నావో చూడాలని ఒక thrilling idea వొచ్చింది. స్కూల్ నుండి అడ్రస్ తీసుకొని మీ ఇంటికి వెళ్తే చెప్పారు నువ్వు America వెళ్ళే ప్రయత్నాల్లో వున్నావని. నీ ఫోన్ నంబర్ తీసుకొన్నాను. మా ఊరెళ్ళాక రింగ్ చేస్తే ఎప్పుడూ switched off అనే వొస్తుంది. మీ ఇంటి నంబర్ తీసుకోవడం మరిచిపోయా! నిన్ను contact చేయలేకపోయినందుకు చాలా disappoint అయ్యాను” అని గలగలా చెబుతున్న మహాలక్ష్మి మాటలు నోరెళ్ళబెట్టి చూస్తున్న శ్రీధర్‌కేమీ వినపడలేదు….అయినా అనేసాడు యాధృచ్చికంగా..నన్నెందుకు కాంటాక్ట్ చెయ్యాలనుకొన్నావ్ అని.”బహుశా నిన్ను ప్రేమిస్తున్నానేమో శ్రీధర్! అవును! మనం చివరిసారి కలిసిన ఆ సీన్- స్లాం బుక్ వ్రాయమంటే చేతులొణుకుతూ పెన్ను కింద పడేసినప్పుడు నీ మొహంలో tension, తొందర, ఆ అమాయకపు భావాలు తలచుకొన్నప్పుడెల్లా నవ్వొస్తుంది, నువ్విప్పుడెలావున్నావో చూడాలనిపించేది. కాంటాక్ట్ చెయ్యాలనుకొన్నా కుదరని పరిస్థితి. అంతే కాక చూపులతోనే చంపేసేలా వుండే నీ సీరియస్ ఫేస్ గుర్తొచ్చి ధైర్యం చాలేది కాదు. ఏదేమైనా మనం కలిశాము..” అని అంటున్న మహాలక్ష్మితో ఇక ఎన్నడూ విడిపోవద్దు అన్నాడు శ్రీధర్! “అబ్బో మాటలు బాగానే నేర్చావే, ఈ 2 years మనం ఒకరినొకరం అర్థం చేసుకోవొచ్చు శ్రీధర్! నువ్వంటే నాకిష్టం. అందులో ఎటువంటి అనుమానంలేదు. మన చదువయిపోయేవరకు మనమిలానే ప్రేమ పక్షుల్లా వుందాం. ఒకరినొకరు అర్థంచేసుకొని పెళ్ళిచేసుకొంటే ఏ సమస్యా ఉండదు, ఏమంటావ్?” అంటూ నవ్వింది మహాలక్ష్మి.

సరే అన్నట్లు తలూపాడు శ్రీధర్! రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి.ఒక రోజు శ్రీధర్తో,”కాలేజ్‌లో ఎవరైనా అమ్మాయి నిన్నాకట్టుకోలేదా? I mean నువ్వెవరినైనా ప్రేమించడం గాని జరిగిందా?” అన్న మహాలక్ష్మి ప్రశ్నకు,” అబ్బే కాలేజ్‌లో కూడా నేను సీరియస్‌గానే వుండేవాడిని. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో మందుకొట్టడం, సినిమాలు,షికారులు ఇదే లోకం” అంటూ సునయన గురించి చెప్పడం అంత అవసరంలేదు అనుకొన్నాడు శ్రీధర్.”నేనూ మా బావతో సినిమాలు షికార్లకి వెళ్ళేదాన్ని. మాఇంట్లో వాళ్ళు బావే నా మొగుడు అని ఎప్పుడో నిర్ణయించేసారు. మొదట్లో నాకతన్ని చూస్తే చిరాకేసేది.కాని పాపం చాలా మంచివాడు.బావంటే నాకిష్టమే కాని నేనెప్పుడూ అలాంటి దృష్టితో ఆయన్ని చూడలేదు. ఒక మంచి స్నేహితుడిలా ఫీలయ్యాను. అదే బావతో చెప్పాను.వెంటనే బావ కూడా నా కిష్టమైన వాడ్ని పెళ్ళి చేసుకోమని చెప్పాడు. He is a very good friend of mine indeed!” అంది మహాలక్ష్మి. ఇలా యవల చేల్లో కూర్చొని గతాలు అవగతం చేసుకొన్నారొకరికొకరు. శ్రీధర్-మహాలక్ష్మిల పెళ్ళి నిరాడంబరంగా జరిగింది.సంతోషంగా సాగుతున్న కాపురంలో సుడిగాలి తుఫానులా ఒకనాడు సునయన తలుపు తట్టింది.

ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన శ్రీధర్ డ్రాయింగ్‌రూంలో నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకొంటున్న సునయనా మహాలక్ష్మిలను చూసి అవాక్కయ్యాడు. “శ్రీధర్! ఇది సునయన! మా బాబాయ్ కూతురు. పరీక్షలుండటం వల్ల మన పెళ్ళికి రాలేదు. మన పెళ్ళైన ఏడాదికిగాని దీనికి తీరిక కుదరలేదు” అంటూ పరిచయం చేస్తుంటే సునయన ఏమీ తెలియనట్లే,”బావగారూ! బాగున్నారా?” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.ఆనాటి నుండి మొదలయ్యాయి శ్రీధర్‌కి పీడకలలు!-“ప్రియా! నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావు? ఒంటరితనపు చీకటి మంటల్లో మగ్గి మగ్గి మరణానికై నిరీక్షిస్తున్నా. గతం గుర్తుచేసుకొని గుండెపగిలేలా రోదిస్తున్నాను! అవని అంచులు దాటి అంబరమే హద్దుగా కన్నీరు కాలువలై పారగ, తప్పుచేసిన ఆ ఒక్క క్షణం కాలగమనంలో కలిసిపోకుండా నా దరిచేరితే సవరించుకోవాలని అసాధ్యమని తెలిసి కూడా అనునిత్యం ఎదురుచూస్తున్నాను, ఎదురుచూస్తున్నాను, ఎదురుచూస్తున్నాను…”అని గొణుగుతున్న శ్రీధర్ మహాలక్ష్మి కుదుపుకి ఉలిక్కిపడి దిగ్గున నిదురలేచాడు! “ఏంటి శ్రీధర్? ఈ మధ్య చాలా టెన్షన్‌లో వున్నట్లున్నావు? ఆఫీస్‌లో ఏమైనా వత్తిడా? ఎందుకు నా దగ్గర దాస్తావు?” అని అడిగిన మహాలక్ష్మితో,” ప్లీజ్ మహీ! నీకో విషయం చెప్పలేదు. చెబితే నువ్వెక్కడ నన్ను పెళ్ళిచేసుకోవేమో అని. నాకు సునయన ముందే తెలుసు. కాలేజ్‌లో ఇద్దరం కలిసి తిరిగాము. అందరూ మేము ప్రేమించుకొంటున్నామని అనుకొనేవారు కాని అది నిజం కాదు. సునయన నీ కజిన్ అని తెలిసి, తనని మనింట్లో చూసినప్పటినుండి నాకు ఒకటే టెన్షన్, నువ్వెక్కడ నన్ను విడిచి వెళతావేమోనని! సునయనతో తిరిగినందుకు కాదు, నీకు అసలు విషయం చెప్పనందుకు నేను నలిగిపోతున్నాను. క్షమించు” అన్నాడు.అంతా విన్న మహాలక్ష్మి, సునయనలు ఒక్కసారిగా గొల్లున నవ్వారు.”బావా! కాలేజ్‌లో మకుటంలేని మహరాజంటే ఏమో అనుకొన్నాను. ఇంత సెన్సిటివా? అక్కకు అంతా తెలుసు ” అని అంటున్న సునయనను వారించి బయటకి పంపింది మహాలక్ష్మి…”ప్రేమ సర్వ దోషములను కప్పును. ప్రేమ ఇచ్చుటయేగాని ఆశించుట ఎరుగదు” అని బైబిల్లోనుంచి,ఇంకా నాకు తెలియని ఎన్నో పుస్తకాల్లోనుంచి, అన్నిటికీ మించి నీ మంచితనం,నా పట్ల నీకున్న అంతులేని ప్రేమనుంచి ఎంతో తెలిపావు శ్రీధర్! అలాంటిది ఈ చిన్న విషయం చెపితే నిన్నెలా వొదిలేస్తాననుకొన్నావ్? నీకు తెలివితేటలతోపాటు వెలక్కాయంత వెఱ్ఱి కూడా వుందనుకొంటా!” అంటూ శ్రీధర్‌ని అక్కున చేర్చుకొని కౌగలించుకొంది మహాలక్ష్మి…నవ్వుతున్నా ఆ కలువ కళ్ళలో పలుచని నీటిపొర…తన మొగుడు తననెంతో ప్రేమిస్తున్నాడని గర్వంతో అనుకొంటా!

-సుధీర్ కొత్తూరి (http://uniquespeck.blogspot.com)

Posted in కథ | 6 Comments

ఆ నవ్వు

chavakiran.bmpచావా కిరణ్! పరిచయమక్ఖర్లేని ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఎంతో మంది తెలుగుబ్లాగరుల ప్రేరకుడు, మార్గదర్శి. చావా కిరణ్ కు ఇంటర్నెట్లో సొంత పత్రిక నడిపిన అనుభవం కూడా ఉంది. పొద్దు కోసం అతను రాసిచ్చిన ఈ చిరుకవిత మీ కోసం:

—————————————-

ఆ నవ్వులో

నిన్నటి దిగులు లేదు

రేపటి బాధ లేదు

ఆ నవ్వు

హిమానీనదం అంత స్వచ్ఛంగా

హిమాలయాలంత అందంగా

ఆ నవ్వు

నిన్నని మరిపిస్తూ

రేపటిని తలపకు రానీకుండా

నేడు నా ముందు నిలచింది సాకారమై

ఆ నవ్వును

ముందెన్నడూ చూడలేదు

ముందెన్నడూ అనుభవించలేదు

ఆ నవ్వు

మనసును మారుస్తూ , మాయచేస్తూ

వేసవిలో చల్ల గాలిలా హాయిగొలుపుతూ

నా ముందు నిలచింది సాకారమై.

– చావా కిరణ్ (http://oremuna.com/blog)

Posted in కవిత్వం | 6 Comments

ఉత్తరాయనంలో మొదటగా..

సంక్రాంతి సెలవులలో ఆవలకు వెళ్ళి మళ్ళీ వలలో పడిన మా పాఠకులకు తిరిగి స్వాగతం చెబుతున్నాం. రేపు – జనవరి 20 న – రెండు విశేషాలతో మీ ముందుకు వస్తున్నాం. మీ రాక కోసం ఎదురు చూస్తాం.

-పొద్దు

Posted in ఇతరత్రా | 4 Comments

సంక్రాంతి శుభాకాంక్షలు

————————
————————
పొద్దు పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు
————————
————————
Posted in ఇతరత్రా | 2 Comments

బ్లాగు సమీక్ష – తెలుగు జాతీయవాది

మా రెండో బ్లాగు సమీక్ష మీ ముందుకు తెచ్చాం.

తెలుగు బ్లాగుల్లో తెలుగు జాతీయవాది విలక్షణమైన భావాలతో ప్రసిద్ధి చెందింది.

ఈ సమీక్షపై పాఠకుల అభిప్రాయాలకై ఎదురు చూస్తాం.

-పొద్దు

Posted in ఇతరత్రా | 2 Comments

తెలుగు జాతీయవాది – అంబానాథ్

రిపబ్లిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ను అన్యాయంగా ఆక్రమించుకుని హిందీ దేశం అధికారం చెలాయిస్తోంది. తమదో ప్రత్యేక జాతి అని కూడా తెలుసుకోలేక తెలుగువారు హిందీ దేశానికి సామంతులుగా బతుకుతున్నారు. తెలుగువారు మేలుకుని తమ జాతీయతను గుర్తించి హిందీ దేశం నుండి విడివడి స్వతంత్ర ప్రతిపత్తితో జీవించాలి.
కొత్తగా ఉంది కదా? తెలుగుజాతీయవాది (http://telugujaatheeyavaadi2.blogspot.com/) బ్లాగు చదవని వారికి ఇది వింతగానూ ఉండొచ్చు. ఇదిగో, ఈ తెలియనితనాన్నే తెజావాలో అంబానాథ్ ఎత్తి చూపుతున్నది! మనమెంత అజ్ఞానంలో ఉన్నామంటే.. ఆయన మాటలు మనకు కొత్తగా, వింతగా అనిపించేటంత!!

భావాల రీత్యా తెలుగు బ్లాగులన్నిటిలోకీ విలక్షణమైన బ్లాగు తెలుగు జాతీయవాది. తెలుగు జాతీయవాదిని సమీక్షించాలంటే ఆ బ్లాగును మూడు కోణాల్లోంచి చూడాలి. తెలుగు జాతీయవాద భావన, తెలుగు భాష స్థితి, ఇతరేతర విషయాలు.

తెలుగు జాతీయవాద భావనకు మీరు బద్ధ వ్యతిరేకి కావచ్చు; అయినా మీరు తెజావాను ఆస్వాదిస్తారు. తెలుగు రిపబ్లిక్ అనే భావనను మీరు జీర్ణం చేసుకోలేక పోవచ్చు, కానీ తెలుగు జాతి పట్ల రచయితకున్న తీవ్ర ఉద్వేగ భరిత ఆవేశాన్ని మెచ్చకుండా ఉండలేరు. తెలుగు జాతి చరిత్రను సమీక్షిస్తూ ఓ జాబులో ఇలా అంటాడు..”శతాబ్దాల తరబడి నిరాఘాటంగా కొనసాగుతున్న తెలుగు జాతి సమైక్యం చారిత్రికంగా ఓ నిరాక్షేపమైన వాస్తవం.రెండువేల సంవత్సరాలకి ముందే ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు తెలుగుదేశాన్నంతా ఏకం చేసి 450 సంవత్సరాల పాటు పరిపాలించారు. గత వెయ్యేళ్ళలో కూడా కేవలం 170 సంవత్సరాలు మాత్రమే తెలుగు సోదరులు పరాయి పాలకుల చేతుల్లో ఒకరికొకరు దూరం చెయ్యబడ్డారు.”

అయితే ఆయన ఆవేదన ఒక స్థాయిని దాటి ఆక్రోశంగా మారిన దృష్టాంతాలూ లేకపోలేదు. హిందీ భాషను మనపై రుద్దడాన్ని నిరసిస్తూ ఓ జాబులో – “..ఇంకో మొగుడున్నాడు. ఆయన పేరు హిందీ. ఆయన 1950 నుంచి తెలుగు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. అదేమంటే ఇంట్లోవాళ్ళు పిలవకపోతేనేం, బయటివాళ్ళు రాజ్యాంగబద్ధంగా నన్ను పంపించారు కాబట్టి నేను వచ్చి ఇక్కడ తిష్టవెయ్యడం సక్రమమేనని సమర్థించుకుంటాడు. మనం చెప్పకపోయినా తనకితానే ఇంటికి యజమానినని చెప్పుకుంటున్నాడు. మనం ఈయన్ని మనమ్మకి నాలుగో మొగుడుగా ఇంకా ఎంతకాలం భరించాలో తెలీకుండా ఉంది.” అని వాపోతాడు.

తెరాస నేత తెలుగుతల్లి భావనను తృణికరిస్తూ మాట్లాడినపుడు అంబానాథ్ రాసిన ఆలోచనామృతం ఆయన భావోద్వేగానికి ఓ మచ్చుతునక. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ సందర్భంగా తెరాస తలపెట్టిన బందు సందర్భంగా రాసిన ఓ బంద్ కథ లో తెలుగువారి ఐక్యతను ప్రశ్నించడాన్ని నిరసిస్తాడు.
తెలుగు “దేశం” పరంగా ఆయన భావాలు మరీ తీవ్రంగా ఉండొచ్చు; పాఠకులు సమర్థించలేకపోవచ్చు. కానీ భాష విషయంలో సహేతుకమైన ఆయన ఆవేశం, ఆవేదనను సమర్థించకుండా ఉండలేరు. తెలుగు పట్ల తెలుగువారు, ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయనంత పదునుగా ఖండించే వారు అరుదుగా కనిపిస్తారు మనకు. ఈ వాక్యం చూడండి..”తమ పిల్లల్ని దేశద్రోహులుగా పెంచుకుంటామనే హక్కు తల్లిదండ్రులకి ఏ విధంగానైతే లేదో, మాతృభాషాద్రోహులుగా పెంచుకుంటామనే హక్కు కూడా వాళ్ళకి లేదు.” తెజావా మొత్తంలోకీ సర్వోత్కృష్టమైన వాక్యమిది. భాష పట్ల అంబానాథ్ దృష్టి ఈ జాబు – తెలుగులో మాట్లాడితే జరిమానా – లో సాక్షాత్కరిస్తుంది. ఉత్తమమైన జాబు ఇది.

తెజావాలో చక్కటి తెలుగు భాష కనిపిస్తుంది. మామూలుగా వాడుకలో ఉన్న ఇంగ్లీషు పదాలకు తెలుగు మాటలను పాఠకులకు పరిచయం చేస్తూ ఉంటాడు. రెక్కమాను (సైనుబోర్డు), శకునపక్షి (డిఫీటిస్ట్), అశ్లీలాంశం (టాబూ టాపిక్).. ఇలాంటివి. అమెరికాను గంధర్వ దేశం అంటాడాయన. వెయ్యి ఇంగ్లీషు ఇడియముల్ని తెలుగులోకి అనువాదం చేసి పెట్టుకున్నాను, త్వరలో ప్రచురిస్తాను అనంటున్నాడు. ఎదురుచూస్తూ ఉంటాం.

తెలుగు జాతి భావనకే కాక అంతర్జాతీయ సమకాలీన విషయాలకు కూడా తెజావాలో చోటుంది. సద్దామ్ హుస్సేన్ ఉరితీతను గర్హిస్తూ అంబానాథ్ రాసిన సంబరపడకు.. అంబానాథ్ పరిశీలనా శక్తికి ఓ ఉదాహరణ.

అంబానాథ్ మాట బహు కరుకు. సద్దామ్ ఉరితీతను అమెరికా చేసిన హత్యగా వర్ణిస్తాడాయన. ఆ జాబులోనే ఆయనింకా ఇలా అంటాడు.. “ఇది ఓ కీలుబొమ్మ ప్రభుత్వం. ఇది అమెరికాకి అంట్లు తోమిపెట్టడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాని ఓ చచ్చుదద్దమ్మల ముఠా.” పౌరుల గోప్యతపై ప్రభుత్వాల దాడిని నిరసిస్తూ ఇలా రాసాడు – “..ఉగ్రవాదుల పోరాటకారణాలేంటో వారి సమస్యలేంటో తెలుసుకోవడానికి ఇష్టపడని, వారిని చర్చలకి ఒప్పించడం చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వాలు మనల్ని రక్షించాలంటే ముందు మనమంతా వారి ముందు గుడ్డలు విప్పుకుని నిలబడాలట.ఈ మానం లేని వెధవ బతుకు బతికినా ఒకటే, ఉగ్రవాదుల చేతుల్లో చచ్చినా ఒకటే.”

పెళ్ళి చేసుకునే వయసును ప్రభుత్వం నిర్దేశించడం పై విమర్శిస్తూ ఆలోచనాత్మక విమర్శ ను బెండసాగులో మెళకువలు లో చూడవచ్చు. అలాగే మానవాళి వలసలు తగ్గాలంటూ ఆయన రాసిన జాబు కూడా ఎన్నదగినదే. చరిత్రలో వలసలు ఎప్పుడు, ఎలా జరిగాయో చర్చిస్తూ సాగుతుందా వ్యాసం

అంబానాథ్ భావాలు ఆశ్చర్యం కలిగిస్తూనే కొన్ని చోట్ల నవ్వూ తెప్పిస్తాయి. “తెలుగు రిపబ్లిక్ ఏర్పడే రోజు మరీ సుదూరంలో లేదనిపిస్తుంది.” అని రాస్తూ ఈ విషయాన్ని ప్రముఖంగా వ్యాపింపజేయాలని అంటాడు. తెజావా భావాలను ప్రచారం చేసే విధానం కూడా చెబుతాడు. ” మన కార్యాచరణ“లో – “..అందుచేత సదృశ భావజాలం గల అనేక ఇతర రకాల జాతీయవాదులతో భుజం భుజం కలిపి మార్పుకోసం కష్టపడడానికి తె.జా.వాదులు సిద్ధంగా ఉండాలి.”. “..ఈ విధమైన ముందస్తు సహకారం భవిష్యత్తులో రిపబ్లిక్కుల మధ్య పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలకి దారితీస్తుందని భావిస్తున్నాను.”

ఆయన భావాలు తీవ్రంగా ఉంటాయి. అయితే వాదనలో అస్పష్టత కనిపిస్తుంది. తన వాదనకు అనుకూలంగా లేని విషయాలకు ఆయన దూరం. సద్విమర్శను కూడా స్వీకరించలేని పరిస్థితి కొండొకచో కనిపించింది కూడా.

రాష్ట్ర విభజనోద్యమం గురించి రాసేటపుడు ఆయన వాదన ఏకపక్షంగా ఉంటుంది. 610 జీవోకు అనేది తప్పంటాడు, కానీ పెద్దమనుషుల ఒప్పందాన్ని తలవడు. “తెలంగాణాకి నీరుండాలే గాని ఏదో పొడిచేస్తామంటూ ఉంటారు నాయకులు.ఇక్కడ అంత భారీ స్థాయిలో పొడవడానికేమీ లేదు. తెలంగాణాలో అత్యధిక శాతం భూమి సారవంతమైనది కాదు.ఇక్కడ పండించే గోంగూరకి పులుపుండదు.గుమ్మడికాయలకి తీపి ఉండదు.గోదావరి కృష్ణ నీళ్లే కాదు వెయ్యి నదుల నీరు పారించినా ఈ భూమి స్వభావం దాదాపుగా ఇంతే.” అంటూ నిర్దాక్షిణ్య వాదన చేస్తాడు.

కారణమేంటో తెలియదు గానీ తెజావాలో పాఠకుల వ్యాఖ్యలు కనిపించకుండా పోవడం జరిగేది. బ్లాగు కూర్పు కూడా పాఠకుడికి అంత సౌకర్యంగా అనిపించదు. పాత జాబులను చదువుదామంటే లింకులగపడవు. అట్టడుగున మాత్రం నెలవారీగా పాత సంచికల లింకులు ఉంటాయి. బ్లాగును మరింత వీలుగా అమర్చవలసిన అవసరం ఉంది.

బ్లాగుల్లో వ్యాఖ్యలు రాసే విషయంలో అంబానాథ్ చాలా సిగ్గరి. ఇతర బ్లాగుల్లో ఆయన వ్యాఖ్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. బ్లాగులో పాఠకుడు రాసే వ్యాఖ్య బ్లాగరికి అనంతమైన ఉత్తేజం ఇస్తుందనే విషయం మాత్రం మరువరాదు. తెలుగు బ్లాగరులు ఉన్నదే తక్కువ మంది కాబట్టి, ఉన్న కొద్దిమందే తమకు నచ్చిన జాబుల్లో కాస్తంత చొరవగా వ్యాఖ్యలు రాయాలి.

-శేషాచలపతి

Posted in జాలవీక్షణం | Tagged , | 5 Comments