సుధీర్ కవిత

నిన్న ప్రకటించినట్లే ఈరోజు సుధీర్ రాసిన ‘నరుడు’ కవితను వెలువరిస్తున్నాం. ఈ వారంలో వాతావరణం చలిచలిగా ఉన్నా పొద్దు మాత్రం చురుగ్గానే ఉంది. మొన్న కబుర్లు, నిన్న సినిమా వ్యాసం, ఈరోజు కవిత…
రేపు బ్లాగుసమీక్షతో మీ ముందుంటాం.

తర్వాత…మరిన్ని వెలుగులు పంచబోతోంది మీ

పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on సుధీర్ కవిత

నరుడు

sudheer.JPG

యునిక్ స్పెక్ (Unique Speck) పేరుతో సుధీర్ రాసే తెలు’గోడు’ బ్లాగు తెలుగు బ్లాగులోకానికి సుపరిచితం. ఆయన కలానికి బహుపార్శ్వాలున్నాయి. అది ఒకవైపు సున్నితమైన భావాలనూ పలికించగలదు, మరోవైపు చేదునిజాలను విప్పిచెప్పనూగలదు. ఆయన కవితల్లో ఒదగని భావాలు అరుదు. రచనల్లో వాసి తగ్గకుండా విరివిగా రాయగలగడం ఆయన ప్రత్యేకత. సుధీర్ రాసిన ‘నరుడు’ కవితను పొద్దు పాఠకుల కోసం అందిస్తున్నాం.

నరుని నాళ్ళు ఎన్నని?
తలచిన చాలు వాడొకనాడు!
మరణమన్నింటికీ ముగింపని
ఎన్నడెరుగునో వాడు!

ప్రతి పొద్దులో ఒక హద్దుని చేరగ
శక్తి యుక్తులను సమీకరించి
ఏదో సొంతం చోసుకోవాలని
కాలంతో కలియబడుతూ
కోరికలకంతం కనుగొనాలని
అనుక్షణం పరితపిస్తూ
జీవితం స్వర్గధామమవ్వాలని
నిద్దురలోనూ నెమ్మదిలేని మది కోరిక

నరుని నాళ్ళు ఎన్నని?
తలచిన చాలు వాడొకనాడు!
మరణమన్నింటికీ ముగింపని
ఎన్నడెరుగునో వాడు!

-సుధీర్ కొత్తూరి (http://uniquespeck.blogspot.com)

Posted in కవిత్వం | 1 Comment

సినిమా వ్యాసం రెండో భాగం

ముందుగా ప్రకటించినట్లే ఈరోజు సుగాత్రి రాసిన సినిమా వ్యాసం రెండో భాగం వెలువరిస్తున్నాం. గత నెలలో సినిమాల గురించి సుగాత్రి రాసిన పరిచయ వ్యాసం పొద్దు పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఈ వ్యాసం దానికి కొనసాగింపు. గతవారం పుస్తక సమీక్ష వెలువరించిన తర్వాత ఈ వారాంతంలో కొత్తగా పోగుపడిన “కబుర్లు” వెలుగుచూశాయి. ఈ రెండు శీర్షికల మీదా పాఠకుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం.

పొద్దు

———————————–
జనవరి 9 మంగళవారం: సుధీర్ కొత్తూరి కవిత.

 

Posted in ఇతరత్రా | Comments Off on సినిమా వ్యాసం రెండో భాగం

సినిమాలెలా తీస్తారు?-1

చిత్రనిర్మాణంలో ముఖ్యంగా మూడు దశలున్నాయి. అవి:
ప్రి-ప్రొడక్షన్
ప్రొడక్షన్
పోస్ట్-ప్రొడక్షన్

షూటింగుకు అవసరమయ్యే సన్నాహకాలన్నీ జరిగేది ప్రి-ప్రొడక్షన్ దశలో. చిత్రనిర్మాణంలో ఇది అత్యంత కీలకమైన దశ. అసలు దీంట్లోనే చిత్రనిర్మాణానికి సంబంధించిన తొంభై శాతం పని పూర్తవుతుంది. కథ నిర్ణయం, బడ్జెట్ తయారీ, కథాచర్చలు, స్క్రిప్టు, స్క్రీన్‌ప్లేల ఖరారు, క్యాస్టింగు, ఇతర సిబ్బంది, షూటింగు లొకేషన్ల నిర్ణయం, ఔడ్డోర్ యూనిట్ ఎంపిక, పాటల నిర్ణయం, పాటల రచన, పాటల రికార్డింగు, మొదలైనవన్నీ ఈ దశలోనే జరుగుతాయి.
ప్రొడక్షన్ దశలో షూటింగు జరుగుతుంది. మిగతా సినిమా అంతా షూటింగయ్యాక డబ్బింగ్ జరిగితే పాటల విషయంలో మాత్రం రికార్డింగ్ తర్వాతే షూటింగ్ జరుగుతుంది.
షూటింగు తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఎడిటింగ్, డబ్బింగ్, సెన్సారింగ్, ప్రింట్లు వెయ్యడం, డిస్ట్రిబ్యూషన్, చివరగా ఎగ్జిబిషన్ జరుగుతాయి.
ఇప్పుడు వీటిలో ఒక్కొక్క అంశాన్ని గురించి విశదంగా తెలుసుకుందాం:

ప్రి-ప్రొడక్షన్

కథ నిర్ణయం: సినిమా పని కథనెన్నుకోవడంతో మొదలౌతుంది. ఎంత పిచ్చివాళ్ళు కూడా కథ ఫలానా అని అనుకోకుండా సినిమా పని మొదలుపెట్టరు. ఈ కథనెలా నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? అనేవి తర్వాతి ప్రశ్నలు.
నిర్మాత లేదా దర్శకుడు తమంతట తామే ఒక కథనెన్నుకుని లేదా కథను రూపొందించుకుని దాన్ని సినిమాగా తియ్యాలనుకోవడం ఒక పద్ధతి. అలాకాకుండా ఇంకో పద్ధతిలో ఐతే కథారచయిత తన కథను తీసుకుని దర్శకుడు లేదా హీరోలను కలవడం, వాళ్ళకు ఆ కథ నచ్చితే, వాళ్ళు ఆ కథను తమ నిర్మాతలకు సిఫార్సు చెయ్యడం జరుగుతుంది. లేదా రచయితలు తమ కథను నేరుగా నిర్మాతకే వినిపించడం ఇంకొక పద్ధతి. ఎందుకంటే సినిమాకు నిర్మాతే చోదకుడు. ఇంకా చెప్పాలంటే సినిమాకు నిర్మాతే సొంతదారు. అందుకే ఉత్తమ చిత్రం పురస్కారం నిర్మాతలకే ఇస్తారు. ఇది ప్రపంచమంతటా నెలకొని ఉన్న సంప్రదాయం.

ఐతే తెలుగు సినిమా చరిత్రనొకసారి పరిశీలిస్తే మొదటి దశలో (1931 నుంచి 1950 దాకా దాదాపు ఇరవై సంవత్సరాలు) దర్శకుడికి ఎక్కువ ప్రాధాన్యతుండేది. హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం, మొదలైన దర్శకులు చలనచిత్రరంగానికి చుక్కానులుగా ఉన్నారు. (వాళ్ళు దర్శకనిర్మాతలైనా నిర్మాతలుగా కంటే దర్శకులుగానే ప్రసిద్ధులయ్యారు.) తర్వాత విజయా, ఏ.వీ.ఎం. లాంటి సంస్థల ఆవిర్భావంతో నిర్మాతల శకం వచ్చింది. కె.వి.రెడ్డికి, విజయా నిర్మాతలకు మధ్య ఒకరకమైన ఆధిపత్యపోరు కూడా కొంతకాలం నడిచింది. మీరు గమనించారో లేదో జగదేకవీరుని కథ విజయావారి సినిమాయే అయినా నిర్మాతలుగా చక్రపాణి-నాగిరెడ్డి పేర్లకు బదులుగా కె.వి.రెడ్డి పేరే ఉంటుంది. దానికి కారణం ఈ ఆధిపత్యపోరే! తర్వాత 1980 ల నుంచి హీరోల శకం రావడమొక కొత్తపోకడ. కథాచర్చల్లో ఇది ఒక ప్రధానమైన అంశం.

ఫలానా కథను సినిమాగా తియ్యాలని నిర్మాత-దర్శకులు నిర్ణయించుకున్నాక కథాచర్చలు మొదలౌతాయి. ఈ కథాచర్చలు నిర్మాత, దర్శకుడు, కథారచయితల మధ్య జరగడం ఆనవాయితీ.కథ నిర్ణయమయ్యాక ముందడుగు పడాలంటే బడ్జెట్ నిర్మాతకు ఆమోదయోగ్యం కావాలి. అయితే ఈ బడ్జెట్ వేసిచ్చే బాధ్యత దర్శకుడిదే!

బడ్జెట్: తామనుకున్న కథను సినిమాగా తీయడానికి దర్శకుడు వేసిచ్చిన బడ్జెట్ చూసి నిర్మాత అందుకు సిద్ధపడ్డాకే తర్వాతి అడుగులు పడుతాయి. సినిమాకు అవసరమైన పెట్టుబడి పెట్టేది నిర్మాతే అయినా తాము తీయదలచిన సినిమాకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయగలిగేది దర్శకుడే. కథ ఖరారు కాగానే ఈ కథను తెరకెక్కించడానికి ఇంత ఖర్చు అవుతుందని దర్శకుడు చెప్పాక అంత పెట్టుబడి అవసరమా? అవసరమైనా తాను అంత పెట్టుబడి పెట్టగలడా అనేది నిర్మాత అలోచించుకుని ముందడుగు వెయ్యడమో, వెనక్కు తగ్గడమో చేస్తాడు.

ఈ బడ్జెట్ అంచనాలు వెయ్యడంలో కె.వి.రెడ్డి సిద్ధహస్తుడని ప్రతీతి. ఆయన కథ వినగానే దీనికి ఇన్ని అడుగుల ఫిల్ము అవసరమౌతుంది అని చెప్పేవాడు. షూటింగు పూర్తయాక చూసుకుంటే ఖచ్చితంగా ఆయన చెప్పినంతే వచ్చేది. అలాగే బడ్జెట్ విషయంలో కూడా: మాయాబజార్ నిర్మాణ సమయంలో తెరవెనుక పెద్ద కథలే జరిగాయి. అప్పట్లో సాధారణ సినిమాలకయ్యేదానికి మూడురెట్ల నిర్మాణవ్యయంతో అంచనాలు రూపొందించి, అంతా సిద్ధం చేసుకుని తీరా షూటింగు మొదలుపెట్టే సమయానికి నిర్మాతలకు ధైర్యం చాలక అక్కడితో ఆపేద్దామన్నారట. దాంతో కె.వి.రెడ్డి హతాశుడయ్యాడు. ఎన్నో ఊగిసలాటల అనంతరం నిర్మాతలు ఖర్చెంతవుతుందో చెప్పమని దర్శకుణ్ణి పిలిపించి మళ్ళీ అడిగారు. ఆయన ఎంతో చెప్పి “ఇంతకు మించి మీరు ఒక్క పైసా పెట్టనక్ఖర్లేదు. ఖర్చు నా అంచనాలు దాటినట్లైతే అదనంగా అయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటాను.” అని వారికి హామీ ఇచ్చిన తర్వాతే రథం మళ్ళీ కదిలింది. బడ్జెట్ మీద దర్శకుడికి ఆ అదుపు లేనట్లైతే సినిమాలు తియ్యాలనే ఉత్సాహంతో వచ్చే చాలా మంది నిర్మాతల దారి గోదారే అవుతుంది.

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు కూడా బడ్జెట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారట: నిర్మాణవ్యయం దర్శకుడు వేసిచ్చిన అంచనాలను మించినట్లైతే దర్శకుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. సినిమాలు తీసే ఉబలాటంలో డబ్బుసంచులు పట్టుకుని దిగే ఔత్సాహిక నిర్మాతలు ఊబిలో దిగకుండా ఉండాలంటే ఇలాంటి కట్టుబాట్లు చేసుకోవడం చాలా అవసరం.

కథాచర్చలు: కథ నిర్ణయమైనాక కథాచర్చలు మొదలౌతాయి. ఈ కథాచర్చలప్పటికి ప్రధానపాత్రలు ఎవరిచేత వేయించాలో దర్శకనిర్మాతలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. (ఈ కథాచర్చలనే స్టోరీ సిట్టింగులని, స్టోరీ డిస్కషన్లని అంటారు.) దీనివల్ల స్క్రిప్ట్ రాసే రచయిత కూడా ఆ పాత్రధారులను దృష్టిలో పెట్టుకుని రాసే వీలు కలుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఇది మరింత అవసరం. ఒక్కోసారి దర్శకుడు లేదా రచయితలు “ఈ కథ ఈ హీరోను దృష్టిలో పెట్టుకునే తయారుచేశాం. ఈ సినిమాను తీయడమంటూ జరిగితే అది ఈ హీరోతోనే తీయాలనుకున్నాం.” అని చెప్పడం మనం వింటూ ఉంటాం. ఐతే అన్ని కథలకూ ఆ అవసరముండదు. కొన్ని కథలు ఎవరితో తీసినా, ముఖ్యంగా ఏ రకమైన ఇమేజ్ లేని నటులతో తీస్తేనే సరిపోయే విధంగా ఉంటాయి. ఈ కథల మాటెలా ఉన్నా పెద్ద హీరోను దృష్టిలో పెట్టుకుని తయారుచేసే కథల్లో ముందుగా ఆ హీరోకు స్థూలంగా ఇదీ కథ అని చెప్పి, కథాచర్చల్లో కూడా ఆ హీరోకు పూర్తి స్వేచ్ఛ – దర్శకనిర్మాతలతో సమంగా – ఇవ్వడం కొత్త పోకడ. ఇక్కడ దర్శకుడు కొత్తవాడైతే నటుడు అత్యుత్సాహంతో తనే దర్శకపాత్ర వహించి సినిమాను చెడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ కథాచర్చల్లో తప్పనిసరిగా ఉండేదీ, ఉండవలసిందీ దర్శకుడు, నిర్మాత, కథారచయిత. కథారచయిత అని చెప్పడమెందుకంటే సినీరంగంలో కథారచయిత, మాటల రచయిత, పాటల రచయిత, స్క్రిప్ట్ రచయిత, స్క్రీన్ ప్లే రచయిత…ఇన్నిరకాల రచయితలుంటారు. అరుదుగా కామెడీ ట్రాక్ రచయితలు కూడా వేరేగా ఉంటారు. వీళ్లలో ఒక్క కథారచయిత తప్ప మిగిలినవాళ్ళంతా తర్వాతిదశల్లో రంగప్రవేశం చేస్తారు. ఐతే ఒక్కోసారి తమ కథ వెండితెరకెక్కడమే మహాభాగ్యంగా భావించే రచయితలు కొందరు ఆ కథ లో ఎలాంటి మార్పులు చేసినా తమకభ్యంతరం లేదని ముందే ప్రకటించి కథాచర్చల నుంచి తప్పుకుంటారు.

స్క్రిప్టు: ఇక్కడ స్క్రిప్టుకు, స్క్రీన్‌ప్లేకు మధ్య గల స్వల్ప తేడా గురించి చెప్పడం అవసరం. మాటలు ప్రేక్షకులకు వినిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఆ సన్నివేశంలో ఏం జరుగుతోందో స్క్రిప్టులో రాసుకుంటారు. దాన్ని తెరమీద ఎలా చూపించాలో కూడా రాసుకుంటే అదే స్క్రీన్‌ప్లే అవుతుంది. ఒక మంచి కథారచయిత సినిమా చిత్రీకరణకు సంబంధించిన సాంకేతికాంశాలజోలికి పోకుండా స్క్రిప్టు రాసివ్వడం తేలిక. అసలు తాను కథ రాసేటప్పుడే ఆయా సన్నివేశాల్ని తన మనోయవనికపై సాక్షాత్కరింపజేసుకునే రచనలు చేస్తారు ఏ రచయితైనా. అందుకే స్క్రిప్టు రాసివ్వడం వారికి నల్లేరు మీద బండి నడక లాంటిది. అయితే స్క్రీన్‌ప్లేలో అనేక సాంకేతికాంశాలు చోటు చేసుకుంటాయి. ఇవి రచయితకు సంబంధం లేనివి. స్థూలంగా చెప్పలంటే దృశ్యవిభజన వరకు స్క్రిప్ట్ రచయిత చేతిలో ఉంటే షాట్ విభజన స్క్రీన్‌ప్లే రచయిత చేతిలో ఉంటుంది. సాధారణంగా చిత్రదర్శకుడే స్క్రీన్‌ప్లే నిర్ణయిస్తారు.
సంభాషణ, లేక స్క్రిప్టు రచయిత పాత్రల అభినయానికి సంబంధించి, ఆహార్యానికి సంబంధించి కొన్ని సూచనలు రాస్తాడు. అంతేకాక కథాచర్చలప్పుడు లభించని కొన్ని పాత్రౌచిత్యాలు, సంభాషణ రచనతో పూర్తవుతాయి. పాత్రల కదలికలు, హావభావాలు కూడా స్క్రిప్టులోనే వస్తాయి. మాటల రచన పూర్తయేసరికి కథా దృక్కోణంతోబాటు సినిమాలో ఎన్ని దృశ్యాలుండేదీ, వాటి ఉద్దేశ్యాలేమిటైందీ, కథావాతావరణం ఎలాంటిదనే విషయాలు కూడా తెలుస్తాయి.

స్క్రీన్‌ప్లే: మాటల రచయిత పని పూర్తై స్క్రిప్టు చేతికందాక దాన్ని వెండితెరమీద ఎలా చూపించాలనేది దర్శకుడి పని. అప్పుడే స్క్రీన్‌ప్లే ఖరారవుతుంది.
ఉదాహరణకు రచయిత సూర్యోదయమవుతోంది అని రాశాడనుకోండి. దర్శకుడు ఆ సూర్యోదయానికి తన చిత్రంలో, ఆ సన్నివేశంలో, ఆ దృశ్యంలో ఎంత ప్రాధాన్యత ఉందో అన్ని షాట్లు తీస్తాడు. ఆ దృశ్యంలో ఎన్ని షాట్లు తియ్యాలి, అందులో క్లోజప్పులు ఎన్ని, మిడ్ షాట్లు ఎన్ని, లాంగ్ షాట్లు ఎన్ని, సంభాషణ నడిచేటప్పుడు ఏదైనా పాత్ర మీద క్లోజప్ తియ్యాలా మిడ్‌షాటా, లాంగ్ షాటా… ఇవన్నీ నిర్ణయించడం దర్శకుడి పనే.
(స్క్రీన్ ప్లే గురించి మరిన్ని వివరాలు మరోసారి)

-సుగాత్రి(http://sahityam.wordpress.com)

Posted in వ్యాసం | Tagged | 3 Comments

పుస్తక సమీక్ష

తాజా విశేషం: కబుర్లు

ముందుగా ప్రకటించినట్లే పొద్దు పాఠకుల కోసం ఒక మంచి పుస్తకం (మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గా మిట్ట కథలు) పై ఒక మంచి పాఠకుడు (సుధాకర్) రాసిన సమీక్షను అందిస్తున్నాం. వారం, వర్జ్యం చూసుకోకుండా వచ్చిన ఆలోచనను వచ్చినట్లు రాసేసే “బ్లాగు మనస్తత్వం” వల్ల పొద్దులో సిద్ధమైన రచనలను వెంటనే పాఠకుల ముందు పెట్టకుండా ఆగలేకపోతున్నాం. ఆ తొందరలో ఒక్కోసారి ముందుగా ప్రకటించని రచనలు కూడా పాఠకులను పలకరించే అవకాశముంది. నిన్నటి “నేను-ఆనందం” కవిత దానికో ఉదాహరణ.

ఎప్పటిలాగే పాఠకులు ఈ సమీక్షపై తమ స్పందనను తెలియజేస్తారని ఆశిస్తున్నాం.

పొద్దును కూడలిలో పెట్టిన వీవెన్ కు,  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
———————————–
జనవరి 8 సోమవారం: సినిమా వ్యాసం-రెండో భాగం.

Posted in ఇతరత్రా | 1 Comment

కబుర్లు

Wesley Autrey అసలైన హీరో! “నిజానికిందులో విశేషమేమీ లేదు. ఆపదలో వున్నప్పుడు ఏ మనిషైనా చేయాల్సిందిదే!” అని అతి సామాన్యంగా చెప్తున్నాడీ అసమాన్యుడు.
వేగంగా వస్తున్న రైలు బారినుండి పట్టాల మీద అపస్మారకంగా పడ్డ యువకున్ని తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. రెండు పట్టాల మధ్యా ఆ యువకున్ని ఒడిసిపట్టుకుని పడుకుండిపోయాడు. రైలు డ్రైవరు ఆఖరి నిమిషంలో పట్టాల మీదున్న వీరిని గమనించి బ్రేకు వేసినా రెండు పెట్టెలు వీరి మీదినుండీ వెళ్ళాయి. యువకుడు క్షేమంగా వైద్యుల సంరక్షణలో వున్నాడు. అప్పటికప్పుడు తన ప్రాణాల గురించి ఆలోచించక తెగించిన వాడు కదా అసలు హీరో! (చరసాల బ్లాగు నుంచి)

సంగీతప్రియుల కోసం సరికొత్త ఉపకరణం: ఇకమీదట “ఇది లేని సంగీతప్రియులు ఉండర”ట. (ఉపకరణాల మార్కెట్ నిపుణుల ఉవాచ) ముంబాయికి చెందిన మితాషి ఎడుటెయిన్‌మెంట్ లిమిటెడ్ విడుదల చేసిన MPL 1003. ఇది 1.8 అంగుళాల LCD తెరతో చిట్టిచేతుల్లో సైతం ఇట్టే ఇమిడిపోగలదు. దీన్ని చెవికి తగిలించుకుని, లేదా విడిగా కూడా వినవచ్చు. కంప్యూటరు నుంచి లేదా వేరే ప్లేయర్ నుంచి USB కేబుల్ ద్వారా పాటలు దీంట్లోకి తెచ్చిపెట్టుకోవచ్చు. MP3, WMA, WAV ఫార్మాట్లలోని పాటలను చక్కగా వినిపిస్తుంది. AVI మరియు MP4 వీడియో ఫైళ్ళను మాత్రం ఈ ఉపకరణంతో వచ్చే CD లోని సాఫ్ట్‌వేరు సాయంతో AMV లోకి మార్చుకుని తర్వాత దీంట్లోకి తెచ్చుకోవలసి ఉంటుంది. దీని వల్ల ఫైల్ సైజు 40% వరకు తగ్గుతుందట. దీంట్లోనే 20 FM ఛానెళ్ళు, శబ్దాలను రికార్డు చేసుకుని వినే సదుపాయం, 1GB మెమరీ ఉన్నాయి. అంతా కలిపి 4,390/- కే.

కలకలం సృష్టించిన కపోతం: వెయ్యి పదాల్లో చెప్పలేని భావాన్ని ఒక్క బొమ్మ ద్వారా చెప్పవచ్చు. ఆ బొమ్మలే అబద్ధాలు ఆడుతున్నట్లు అనిపిస్తే? పోయిన్నెల్లో ఒక పావురబ్బొమ్మ మీద అలాంటి వివాదమే జరిగింది. ప్రామాణికతే ప్రాణాధారంగా భావించే పత్రిక హిందూలో వచ్చిన ఒక పావురం బొమ్మపై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలను నిగ్గుతేల్చడానికి వాళ్ళా ఫోటోను వందరెట్లు పెద్దదిచేసి చూశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

*******************
“మరో ప్రపంచం! మరో ప్రపంచం పిలిచింది!!” అన్నడు శ్రీశ్రీ. ఆ మరో ప్రపంచం పైనుంచి రాళ్ళేసి పిలుస్తుందేమిటి చెప్మా? అని ఆశ్చర్యపడ్డారు న్యూ జెర్సీ వాసులు. తీరా చూస్తే అదొక గ్రహశకలమని తేలింది.
గత మంగళవారం ఎక్కణ్ణుంచో ఒక పెద్ద లోహపు ముద్ద న్యూజెర్సీలోని ఒక ఇంటికప్పును పగలగొట్టుకుని ఇంట్లో వచ్చి పడింది. అలాంటి వస్తువునింతకుముందెక్కడా చూసి ఉండకపోవడంతో దాన్ని పరీక్షలకు పంపితే తేలింది అదొక గ్రహశకలమని. ఇలాంటి గ్రహశకలాలు తరచూ సముద్రాల్లోనూ, భూమ్మీదా పడుతూనే ఉంటాయని, ఇళ్ళమీద పడడం అరుదని ఖగోళశాస్త్రవేత్తలు తెలిపారు.
*******************
డైటింగు పేరుతో కడుపు మాడ్చుకుని, దారిలో కళ్ళుతేలేసేవాళ్ళే న్యూయార్క్ లో విమానాలు తరచూ ఆలస్యం కావడానికి అతిప్రధాన కారణమట – (ట్రాక్, సిగ్నల్ సమస్యల తర్వాత).

*******************

ప్రపంచంలో మొట్టమొదట యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరి మధ్య జరిగిందో చెప్పలేం గానీ సిరియా దేశంలో 6,000 యేళ్ళ క్రిందట బంకమట్టి ముద్దలతో కొట్టుకున్న ఆధారాలు దొరికాయి.
*******************
బ్యాంకులు జనాల వెంటపడి వేధిస్తున్నాయి అప్పులిస్తాం, అప్పు బిళ్ళలిస్తాం (Credit cards) అంటూ. ఆస్ట్రేలియాలో ఒక బ్యాంకువారు ఆత్రమెక్కువై ఒక పిల్లికి క్రెడిట్ కార్డిచ్చేశారట.
*******************
నగరంలో ఒకచోటి నుంచి ఇంకొకచోటికి వెళ్ళేటప్పుడు అతి తక్కువ కాలుష్యకారకమైనదారిలో వెళ్ళాలని ఎవరికుండదు చెప్పండి? స్వీడన్ కు చెందిన ఎవా ఎరిక్సన్ అనే శాస్త్రవేత్త సరగ్గా అలాంటి దారిని సూచించే పరికరాన్నే రూపొందించారు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అది దారిలో ఉండే ట్రాఫిక్ సిగ్నళ్ళు, స్పీడ్ లిమిట్లు, ట్రాఫిక్ జామయ్యే అవకాశాలను గమనించి ఉత్తమమైన మార్గాన్ని సూచిస్తుంది. ఇలాంటి దారుల్లో వెళ్ళడం వల్ల ఇంధనం ఖర్చు 8.2% తగ్గుతుందట.
*******************
ఇంటర్వ్యూలు లేకుండానే నర్సరీలో ప్రవేశాలు: సుప్రీం
వచ్చే విద్యా సంవత్సరంలో నర్సరీలో ప్రవేశాల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలు ఇంటర్వ్యూలు చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పిల్లలు, తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రెండు పాఠశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. నర్సరీ ప్రవేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది.
*******************
ఇంటర్నెట్ పరిచయాలు చిన్నపిల్లలు, టీనేజర్ల విషయంలో ప్రమాదాలకు దారితీయొచ్చన్నది అందరికీ తెలిసిందే! ఐతే చైనాలో పదిహేడేళ్ళ కుర్రవాడొకడు తనకు ఇంటర్నెట్లో పరిచయమైన ఒక మహిళను ప్రత్యక్షంగా చూసి ఆమె తానూహించినంత అందంగా లేకపోయేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడట.

*******************

రష్యాలోని వోల్గాలో జరిగిన తవ్వకాల్లో పురాతన విష్ణు విగ్రహమొకటి బయటపడింది. —ఈనాడు

Posted in వ్యాసం | Tagged | 3 Comments

దర్గా మిట్ట కతలు

Sudhakarసుధాకర్ – ఒక ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఆయన రాసే తెలుగు బ్లాగు శోధన 2005వ సంవత్సరానికి భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దు కోసం సుధాకర్ రాసి ఇచ్చిన సమీక్ష ఇది.
——————————–
నూట ముప్ఫై పుటల చిన్ని పుస్తకం. పిల్ల పుస్తకమే కదా, ఆలవోకగా ఒక గంటలో చదివెయ్యొచ్చని మొదలు పెట్టా ! చిన్న పిల్ల గాలి అలా నన్ను తీసుకుపోయి ఒక వాగులో వదిలినట్టనిపించి, రెండు మూడు కతల తరువాత అది జీవన నదిగా మారి , నేను దానిలో నవ్వుతా కొట్టుకుపోతూ, చివరికి అంతులేని ఆనంద సాగరంలో ఒక్క ఉదుటున నేను పడి ఆ సంద్రపు కెరటాలమీదగా ఒడ్డుకు కొట్టుకొచ్చి తీరా చూస్తే ఇంకేముంది పేజీలు అయిపోయినాయి. కళ్ళు ఒక్క సారి నులుముకుని మరలా ఆ చిన్న పిల్లగాలిని ఆహ్వానించా

దర్గా మిట్ట కతలురచయతకు రాయాలనే కొంటెతనం తప్ప, పేరు గురించి పెద్దగా ఆసక్తి లేదనిపిస్తుంది కదా? కానీ పుస్తకం చదువుతూ పోతే అది మాములు మిట్ట కాదని, ఒక సజీవ జీవసౌందర్యావిష్కరణకు పుట్టినిల్లు అని తెలుస్తుంది . ఈ కతల గురించి మాట్లాడే ముందు, కతలవీరుడి గురించి తెలుసుకుందాం. మొహమ్మద్ కదీరు బాబు (ఈ పేరు వెనక ఒక కత ఉంది) తన గురించి ఈ కతల పుస్తకంలో పెద్దగా రాయలేదు, అతని కతల కత తప్పితే . అది అతని నిరాడంబరత అని గట్టిగా చెప్పొచ్చు. కదీరు బాబు ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. తన జీవితంలోని చిన్నతనపు తీపి, చేదు అనుభవాలను తీపిగానే మనకి రెండు పుస్తకాలలో అందించారు(ఇంకొకటి పోలేరమ్మ బండ కతలు ).

మన కళ్ళకు చప్పగా అనిపించే దైనందిత జీవితాన్ని చిట్టి కదీరు తన జిజ్గాసతో పరిశీలించి వడపోసి, హాస్యాన్ని రంగరించి తేనెగా మన నోట్లో పోస్తాడు . ఇలాంటి పరిశీలన నాకు మక్సీమ్ గోర్కీ నా బాల్యంలో కనిపించింది . అయితే ఈ పుస్తకం మిమ్మల్ని అస్సలు ఆనందపు ఆర్ణవం నుంచి బయటకు రానివ్వదు. సుఖమైనా నవ్వే, బాధలోనూ నవ్వే

ఈ కధలలో ప్రేమ తప్ప ఇంకేమి తెలియని అమ్మ, బోళా నాన్న, ఎల్లెలెరగని స్నేహం, మనింటి మనుషుల్లాంటి పక్కింటోల్లు ఒకటేమిటి అన్ని రకాల అద్భుత,ఆదర్శమైన తెలుగు జీవిత మధురిమలు మనల్ని ముంచెత్తుతాయి . పరవశుల్ని చేస్తాయి. ఈ కతలకు ముందు మాట రాసిన ముళ్ళపూడి రమణగారి పదాలలో

వేదంలా ప్రవహించే తెలుగు జీవనదిలో ముస్లిం జీవన స్రవంతి ఇంతకాలం అంతర్వాహినిగా కనపడకుండా ప్రవహిస్తూ వుండాలి. ఖదీర్ బాబుదర్గా మిట్ట కతలలో భగీరధుడిలా ఆ నదిని మన ముందుకు మళ్ళించాడు . ఈ నది నీటిలో ప్రతి బిందువు ఒక ఆణిముత్యం. మంచుని ఎగజిమ్మే అగ్ని పర్వతం. ఇందులో నాన్నలూ , అమ్మలూ అవ్వలూ తాతలూ అందరూ భూలోక దేవతలు. సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్ళను కూడా నగలుగా వేసుకుని హుషారుగా తిరుగుతారు . పాలు పూలు పాపాలు, తాపాలు అన్నీ ఒక్కటే….మచ్చుకి నాలుక్కతలను మెచ్చుకుంటే మిగతా ఇరవయ్యి కోప్పడవు; నవ్వుతాయిఅంచేత………..”

ఈ కతలన్ని నెల్లూరు యాసలో కొనసాగుతాయి. అవి ఒక యాసలో ఉన్నయని కూడా చదివే వాడికి తెలియదు . అదే మరి గమ్మత్తు. ఈ కతలన్నీ ఆనంద జీవితాల గురించే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చాపకింద నీరులా చిన్న స్థాయి మధ్యతరగతి జీవితాల హాస్య భరిత బాధలను రచయత ఆవిష్కరించారు . దీనికి అతడు పెద్దగా కష్టపడలేదు. ఉన్నది ఉన్నట్టుగా రాసి పడేసాడు. భేషజం లేదు , భయం అంతకన్నా లేదు.

కతల గురించి కబుర్లు ఆపి, కొన్ని చమక్కుల్లాంటి కతల కలకండ ముక్కల్ని చూద్దాం

01. అలీఫ్, బే, తే మా నాయనమ్మకి గోరి కడితే :ఈ ఐవోరు బెత్తం పట్టుకుంటే వొదలడంట సామీ. ఈ సంగత్తెలిసే మా అన్న ఆరులో ఉర్దూకు బదులు తెలుగు తీసుకున్నాడంటఅని యింకాస్త దడిపించినాడు యూసఫ్ గాడు. ఆ దెబ్బకి ఇంకిప్పటికిప్పుడు ప్లానెయ్యక తప్పదని అర్దమైపోయింది అందరికి. ‘ ఠఠఠ్ఠాయ్ఐడియాఅన్నాడు గౌస్ జాన్ కొడుకు సందాని. ఏందిరా ఏందిరా అని అడిగినాము అందరం. ‘జాఫర్ ఐవోరు, విజ్డమ్ టుటోరియల్స్అన్నాడు చిటికేస్తా….అందరం సప్పంగా సల్లబడిపోయినాం. ఏడ్ఛినావులే.. ఆ పర్వేట్ లో బాగా చెప్పరని కదా సామీ మనం చేరనిది. అదీ కాక ఆడ పది రూపాయలు నాయినా ఫీజుఅన్నాడు యూసఫ్ . ‘ఫీజు ఎక్కువైతే ఏమిరా? కొట్టకుండా చెప్తారంటమద్యలో ఎగనూకినా ఏమీ అనరంట అన్నాడు సందాని.

02. మా ఇస్కూలు యానివర్సరీకి దుమ్ము లేపేసినా : “ఏమిరా కరీం కొడకా ! కిలాసు లా?” అన్నాడు నన్ను చూసి . ‘వుంది కానీ నేను యాక్షన్ చేస్తాను సర్అన్నాను రొంత బయంగా ఏమి యాక్షనురా?” అన్నాడాయన మీసాల నిండుగా నవ్వతా… “గబ్బర్ సింగు సార్ చేసేదా ?” అని ఆయనెక్కడ ఒద్దంటాడోనని ఎమ్మటే బీకరంగా గొంతు పెట్టి కితినే ఆద్మీ థేఅంటా మొదలు పెట్టినాను .

03. వంజరాలు మాగలు కండసుదుములు : కూర సంగతికొస్తే మా నాయనదంతా హైతో ఖానా నైతీ సోనాస్టయిలు (ఉంటే తినటం, లాకుంటే పొణుకోవటం). ఏ రోజయినా మా నాయిన యాబై రూపాయలు సంపాదించుకుని వచ్చినాడా యింకయ్యి నీసు డబ్బులకిందే లెక్క. పొద్దునొక నీసు కూరకి, సాయింత్రమొక నీసు కూరకీ ఆ డబ్బుల్లోని అణా పైసాని కూడా జమెయ్యాల్సిందే . “

04. నేను నేలలోఅమ్మ బెంచీలో :ఆమెని కదిలిస్తే కుర్ర పిల్లప్పటి కతలన్ని యిట్టాగే చెప్పద్దని మా అమ్మ కదిలించదు . ఎప్పటిలానే గమ్మున దుప్పటి చుట్టుకుని రెడీ అయుపోయింది సినిమాకి. జైబూన్ అపా వచ్చినాక రే….రిష్కా తేబో గబాల్నఅనింది నా తట్టు చూస్తా… ‘తేనుగా అన్నాను తల అడ్డంగా వూపుతూ….’ఏందిరో చెప్తా వుంటే..పో రిష్కా పిలచక రాబో అనింది జైబూన్ అపా కూడా…’తెస్తే నన్నుకూడా పిలచక పోవాలి సినిమాకిఅన్నాను దీర్గాలు పెట్టి సాగ తీస్తా …’సినిమాకా ? ఖాజాపీరు కోడలికి కాన్పయ్యింది నాయినా, చూసి రావడానికి పోతన్నాం ..ఆడకి పిలకాయలు రాకూడదు అనింది మా అమ్మ. నువు యాడికి పోతున్నావో నాకు తెలుసులేమ్మాఅని చిటికేసి మరేదగా నన్ను సినిమాకి పిలచకపోతే రిష్కా తేను అని బెదిరించేసాను . దెబ్బకి మా అమ్మ దారికొచ్చేసింది. ‘సరే పా నా కొడకా. ఇంటర్ బెల్లులో పులి బంగరాలు అడిగినావో అప్పుడు చెప్తా నీ పని అని పళ్ళు పట పట మని కొరికింది మా అమ్మ.”

ఇలా రాసుకుంటూ పోతే అన్ని కతలకు రాయవలసి వస్తుంది. అందువలన ఇక ఆపుదాం. ఇవన్నీ చదివాక, మనందరం ఒక్క సారి మన బాల్యం వైపు చూసుకోవటం ఖాయం. ఛస్ చాలా మిస్సయిపోయామనుకోవటమో , అరెరె ఈళ్ళందరూ అచ్చం మన సిన్నప్పటి యదవల్లానే వున్నారే అని నవ్వుకోవటమో గ్యారంటీ సామీ….

సుధాకర్ (http://sodhana.blogspot.com)

Posted in వ్యాసం | Tagged | 24 Comments

కవితావిభాగానికి పొద్దుపొడుపు

ఈ రోజు పొద్దులో కవితావిభాగానికి పొద్దుపొడుపు అని తెలుపడానికి సంతోషిస్తున్నాం.


తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. చరసాల బ్లాగులో ఉత్తరాల టపాను చదివి ఉత్తరాల మీద ఆమె రెండు కవితలు రాశారు. పొద్దులో తొలికవిత భావుకతగల బ్లాగరి రాధిక గారిదే కావడం విశేషం.

———————————-

మా తరువాతి ప్రచురణ: ముందు ప్రకటించినట్లే జనవరి 5 వ తేదీన ఓ ప్రముఖ రచయిత రాసిన పుస్తకంపై సమీక్ష.

Posted in ఇతరత్రా | Comments Off on కవితావిభాగానికి పొద్దుపొడుపు

నేను-ఆనందం

తొలి పొద్దులో గరిక పూవుపై
మంచు తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్ది
మురిసిపోయిన మనిషి నేనేనా?
వాన చినుకుల్లో కలిసి తడిసి
అలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును చూసి
చెక్కిలి జారిన కన్నీరు నాదేనా?
ఏది అప్పటి సున్నితత్వం?
ఏది అప్పటి భావుకత్వం?
వయసు పెరిగేకొద్దీ
మనసు చిన్నదయిపోతుందా?
ధనం వచ్చేకొద్దీ
ఆనందం విలువ పెరిగిపోతుందా?
-రాధిక(http://snehama.blogspot.com)

తెలుగు వికీపీడియా – రవి వైజాసత్య

రవి వైజాసత్య – తెలుగు నెజ్జనుల్లోకెల్లా అత్యంత ప్రముఖుల్లో ఒకరు. తెలుగు వికీపీడియా అనగానే జ్ఞప్తికి వచ్చే మొట్ట మొదటి వ్యక్తి ఈయనే! వికీపీడియాకు నేటి కళా, శోభా రావడానికి ప్రధాన కారకుడు! తెలుగు వికీకి ఓ స్థాయిని ఊహించి, సాధించిన వ్యక్తి. కొత్త వికీపీడియనులను ప్రోత్సహిస్తూ, వారు మంచి వ్యాసాలు రాయడానికి మార్గ దర్శకుడయ్యాడు. తెలుగు వికీపీడియాలో ఇప్పుడు ఉన్న నిర్వాహకులు, అధికారులు అందరూ ఆయన తయారు చేసినవారే!

వైజాసత్య తన బ్లాగులో మంచి మంచి జాబులు రాస్తున్నారు. ప్రపంచ రాజకీయాల పట్ల ముఖ్యంగా అమెరికా పాత్ర పట్ల ఆయనకు కొన్ని విస్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. సోమాలియా గురించి ఆయన రాసి ఇచ్చిన చిన్న వ్యాసాన్ని అతిథి శీర్షికలో మీకందిస్తున్నాం.

అన్నట్టు, తెలుగు వికీపీడియాలో.. వైజాసత్య వైజాసత్య లాగానే కనిపిస్తాడు కానీ వైజాసత్య కాడు, గమనించారా?

———————————-

మా తరువాతి ప్రచురణ: జనవరి 5 వ తేదీన ఓ ప్రముఖ రచయిత రాసిన పుస్తకాన్ని సమీక్షిస్తున్నాం.

Posted in ఇతరత్రా | 4 Comments