రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది. ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు కూడా చురుగ్గా రాస్తూ ఉంటారు.
రవి అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. అడిగిన వెంటనే ఈ వ్యాసం రాసి ఇచ్చిన రవికి కృతజ్ఞతల్తో సమర్పిస్తున్నాం.
———————————————————————–
అలిగెడె
అలిగెడెనా..ఆలుగడ్డనా.. అంటే ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరీ దేశము గురించి తెలుసుకోవలిసిందే. సోమాలియా, ఆఫ్రికా కొమ్ములో ఒక ప్రభుత్వము లేని దేశము. సోమాలియా పేరు వినగానే మనకు 1990ల్లో బీబీసీ, డిస్కవరీ చానళ్లలో కనిపించిన డొక్కలు బయటికివచ్చిన కట్టెల్లాంటి నల్ల పిల్లలు, గద్దలు పీక్కుతింటున్న జంతువులు మదిలో మొదులుతాయి. ఈ దృశ్యాలు చూసిన తరువాత మనము డొక్కల కరువు (నందన కరువు) ను ఊహించుకోవడం అంత కష్టమేమీ కాదేమో. నేను యూనివర్శిటీలో చదివే రోజుల్లో మెస్ లో ఎవడైనా ఆవురావురుమని అన్నం లాగిస్తుంటే వీడెవండీ సోమాలియానా అని ఆటపట్టించే వాళ్లం. ఆకలికి, కరువుకు మారుపేరైన ఈ దేశాన్ని గురించి అప్పుడు అంతకు తప్ప నాకు తెలిసింది ఏమీ లేదు. తెలుసుకోవాలన్న కుతూహలము కలగలేదు.
మా గళగళ నగరం అనబడు మిన్నియాపోలిస్ వచ్చిన కొత్తలో ఒకరోజు టాక్సీ తీసుకొని పని మీద బయటి కెళ్లాల్సి వచ్చింది. టాక్సీ నడుపుతున్న వ్యక్తి వచ్చీరాని ఇంగ్లీషులో వింత యాసలో (వీళ్ల భాషలో ప, వ అనే అక్షరాలు లేవు వాటి బదులు బ,ఫ ఉపయోగిస్తారు) మాట్లాడటం మొదలుపెట్టాడు. అలా సంభాషణ మొదలయ్యింది. మాటల్లో ఈయన సోమాలియా నుండి అని తెలిసింది. “మీరు ఇండియా నుండా?” అని అడిగాడు. అవును అనగానే అభిమానంగా “నాకు ఇండియా వాళ్లు బాగా తెలుసు. మా సోమాలియాలో కూడా కొంత మంది భారతీయులు ఉన్నారు.” అన్నాడు. ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. ‘మన జీవులు ఆఖరికి సోమాలియాను కూడా వదిలిపెట్టలేదా రామా!’ అనుకున్నా. అలా మొదలైన నా అనుబంధం ఈ వింతదేశమునుండి ఎంతో మంది స్నేహితులని తెచ్చిపెట్టింది.
99% ప్రజలు సున్నీ ముస్లిం మతస్తులైన ఈ దేశములో ‘మహమ్మద్’ అని కేకేస్తే మూడొంతులమంది మగాళ్లు పలుకుతారు. ‘అలీ’ అంటే ఇంకో మూడో వంతు. ‘అబ్దీ’ అంటే మిగిలిన వాళ్లూ పలుకుతారు. మరి అంతమందికి అవ్వే పేర్లు ఉంటే మరి గందరగోళమే అని అనుకుంటున్నారా? దాదాపు అందరికి ముద్దుపేర్లు ఉంటాయి. మనము స్నేహితుల బృందములో శీనులు, వెంకటేషులు ఉంటే, సైకిల్ శీను, పొట్టి శీను, నల్ల శీను అని పేర్లు పెట్టుకున్నట్టే వీళ్లకి పొట్టి అలి, పొడుగు అలి, బక్క అలి, దుబ్బ అలి, 6వేళ్లు ఉండే అలి అని ముద్దు పేర్లుంటాయి. నా స్నేహితుడు ఒకాయని పండ్ల మధ్యలో తొర్రి సందు ఉంది కాబట్టి ఆయన్ను అందరూ అలిగిని (తొర్రిపండు అలి) అంటారు. వీళ్లు మన బాలీవుడు హీరో లకి కూడా ముద్దు పేర్లు పెట్టారు. అమితాబ్ బచ్చన్ పేరే అలిగెడె (పొడుగు అలి). 😉
వీళ్లు సాంస్కృతికంగా భారతీయులు దగ్గరివారని భావిస్తారు. పాత తరము వాళ్లంతా రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్, శత్రుఘన్ సిన్హా, ధర్మేంద్ర సినిమాలు చూస్తూ పెద్దైనవాళ్లే. మనకు తెలియకుండా మనము వీళ్ల సంస్కృతిని ఎంతో ప్రభావితం చేశాము. నాకు తెలియని పాత హిందీ సినిమా పాటలు కూడా నాకు వినిపిస్తుంటారు.
అడాళ్లకి చీరలన్నా, చుడీదార్లన్నా ఎంతో ఇష్టం. కొంతమంది సోమాలీలు బాంబేలో భారతీయ వస్త్రాలు కొనుగోలుచేసి ఇక్కడ అమ్ముతారు. చాలా మంది పూణే, బొంబాయిల్లో చదువుకున్న వాళ్లు కూడా ఉన్నారు. సోమాలీ భాషలో భారతీయుల్ని ”హిందీ” అంటారు. టీని ”చాయ్ ”అంటారు. చపాతీలు వీళ్లకు సుపరిచితము. వీళ్లకి అరటి పండంటే ప్రాణం. చికన్ లో అరటి పండు, మటన్లో అరటి పండు..కాదేది అరటిపండు కనర్హం అన్నట్టు ఏదితిన్నా దాన్లో అరటిపండు నంజుకొని తింటారు. నేను వీళ్లని ‘బనానా పీపుల్’ అని ఆటపట్టిస్తుంటాను.
మనకు మల్లే వీళ్ల జానపద వాఙ్మయములో అనుభవసారాన్ని వడపోసిన ఎన్నో సామెతలున్నాయి. ఏదైనా విషయము చెబితే అందులో ఖచ్చితంగా ఒక సామెతైనా ఉండి తీరుతుంది. ముసలోళ్ళ దగ్గర కూర్చుంటే చాలు సామెతలతో అనుభవసారము రంగరించిన చిట్టి కథలేన్నో చెబుతుంటారు. ముందు ముందు కొన్ని నా బ్లాగులో అందిస్తాను.
సోమాలియా అంతర్యుద్ధంలో కూరుకుపోయింది. దేశం మొత్తం ఒకటే జాతి, ఒకే భాష, ఒకే మతం. ప్రపంచములోనే అత్యంత అసమానతల్లేని దేశము. మరి అంతర్యుద్ధం ఎలా మొదలయ్యిందని ఆశ్చర్యపోతున్నారా? అదే మరి రక్తపాతం చిందించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా మరి. పూర్వము వనరులను పంచుకోవడానికి, పరిరక్షణకు సంచార జాతైన సోమాలీలలో తెగలు ఏర్పడ్డాయి. 70వ దశకములో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీ నియంత సియాద్ బర్రె తన అధికారాన్ని పటిష్టం చేసుకోవడానికి తెగల మధ్య నిప్పు పెట్టాడు. తెగల పోరాటములో సియాద్ బర్రెను గద్దె దించారు కానీ ఆయన అంటించిన కాష్టం ఇంకా కాలుతూనే ఉంది. అయితే దీనికి అగ్రరాజ్యాలైన సోవియట్ మరియు అమెరికాలు ఆయుధాలు సరఫరా చేసి అజ్యంపోశాయి. రక్తపాతముతో పాటు 1990 తొలినాళ్లలో కరువుకాటకాలు సంభవించడముతో పరిస్థితి విషమించింది. ప్రపంచ దేశాలు సరఫరా చేసిన ఆహార నిల్వలను కొందరు వార్లార్డులు చేజిక్కించుకొని ప్రజలకు అందకుండా చేశారు. ఈ నేపథ్యములో అమెరికా సైనికచర్య జరిపినది. అమెరికా సరఫరా చేసిన ఆయుధాలతోనే అమెరికా హెలికాప్టర్లను మట్టికరిపించారు. ఈ సంఘటననే ప్రముఖ హాలీవుడ్ చిత్రం బ్లాక్ హాక్ డాన్ గా తీశారు.
సోమాలీలు చాలా అందమైన జాతి. నమ్మశక్యము కాదు కానీ అమ్మాయిలు, అబ్బాయిలు సన్నగా, చాలా పొడవుగా సూపర్ మోడళ్ళలాగా ఉంటారు. వీళ్లు మాట్లాడితే చాలు కవిత్వం దొరలుతుంది. మాటల్లోనే పాటలు కట్టి మన జానపదుల్లాగా మధురంగా పాడుతుంటారు. కవుల భూమిగా పేరుపొందిన ఈ నేల రక్తసిక్తమవటం హృదయవిదారకం. ఎప్పటికైనా ఈ నేలపై శాంతి విరియాలన్న తపనతో..
–రవి వైఙాసత్య (http://vyzasatya.wordpress.com)