కవులకు, భావుకులకు స్వాగతం! పొద్దులో మీ కవితలను ప్రచురించి మరింత మంది పాఠకులకు చేరువ కండి.
మీ కవితలను editor@poddu.net కు పంపండి.
కవితలు
గడి
నాటి జ్యోతి మాస పత్రిక నుండి, నేటి ఈనాడు ఆదివారం దాకా గళ్ళనుడికట్టులెన్నిటినో చూసారు. రోజుల తరబడి వేధించి, వెంటాడి నిదుర చెడగొట్టినవి కొన్నైతే, చటుక్కున చిటికెలో సాధించినవి కొన్ని. ఇక ఇప్పుడు మావంతు..
త్వరలోనే మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు, మీ సమయాన్ని కాజేసేందుకు వస్తూంది, మా గడి!
పొద్దు గడులలోని మాయాజాలం నుండి బయటపడగలరేమో చూస్తాం.
వికీ
తెలుగు వికీపీడియాలోని విశేషాల విరిమాల ఇది. గణాంకాలు, కొత్త విశేషాలు, కొత్త వ్యాసాలు మొదలైన వాటిని ఇక్కడ చూడొచ్చు.
డిసెంబరు 22 శుక్రవారం నాటికి మొదటి వ్యాసం సిద్ధం! ఆరోజు ఇదే పేజీలో మళ్ళీ కలుద్దాం!!
కబుర్లు
అటువంటి అరుదైన విషయాల్లో పల్సు పోలియో ఒకటి. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమాల్లో పల్సు పోలియో ఒకటి. ఇలాంటి కార్యక్రమాలను మరి కొన్నింటిని చేపడితే, వాటినీ అదే చిత్తశుద్ధితో జరిపితే ప్రజారోగ్యం విషయంలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలో రెండు మూడు:
- ప్రజలను ముడి బియ్యం తినేలా ప్రోత్సహించడం: ముడి బియ్యంలో పోషకాలు – ముఖ్యంగా బి విటమిను – బాగా ఉంటాయి. పాలిషు పేరిట వాటి తీసిపారవేసి, కేవలం కడుపు నింపే ఆహారాన్ని తింటున్నామని ప్రజలకు చెప్పాలి.
- వారంలో కనీసం మూడు రోజులు ఆకు కూరలు తినేలా ప్రచారం చెయ్యాలి.
- శుచీ శుభ్రత విషయంలో ప్రజలకు జాగ్రత్తలు బోధించడమే కాకుండా, వాటిని పాటించేలా బాగా ప్రచారం చెయ్యాలి.
ప్రజలు ఆరోగ్య నియమాలను పాటించడం మీద ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా కూడా భవిష్యత్తుపై అది పెట్టే పెట్టుబడే. ఆ పెట్టుబడి ప్రజారోగ్యాన్ని రక్షించడమే కాక, డాక్టర్ల కోసం, మందుల కోసం ప్రజలూ ప్రభుత్వమూ ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలను ఆదా చేస్తుంది. కానీ రోగాలొచ్చాక, వైద్యం కోసం పెట్టే ఖర్చు కేవలం ఖర్చే. దాన్నుండి వెనక్కి వచ్చేదేమీ ఉండదు.
ఎయిడ్సుపై ప్రచారంలో భాగంగా ఆరోగ్య మంత్రి కండోములమ్మారట.. ముడి బియ్యమే వండండి అమ్మలారా, అవే తినండి బాబుల్లారా అని కూడా చెబితే బాగుంటుంది కదా!
బ్లాగుద్యమం
బ్లాగు ప్రస్తుతం నెజ్జనులకో ముఖ్య వ్యాసంగమై పోయింది. తెలుగు బ్లాగులు బాగా వస్తున్నాయి. రోజూ కొత్త బ్లాగరులు చేరుతూనే ఉన్నారు, కొత్త బ్లాగులు వెలుస్తూనే ఉన్నాయి. వివిధ విషయాలపై బ్లాగులు రాస్తున్నారు. బ్లాగుల ప్రగతి ఎలా ఉంది? అవి ఎలా ఉంటున్నాయి? వాటి ప్రస్థానం ఎటువైపు? ఇటువంటి విషయాలను తాకుతూ వెళ్ళే బ్లాగు పరిశీలనా శీర్షిక ఇది.
బ్లాగు ప్రక్రియ మొదలయ్యాక తెలుగులో విస్తృతంగా రావడానికి కాస్త సమయం పట్టిందనే చెప్పాలి. నెజ్జనుల్లో తెలుగువారు లక్షలాదిగా ఉన్నా, ఇలా ఆలస్యం ఎందుకయిందీ అంటే.. కర్ణుడి చావుకున్నట్లుగా ఉన్నాయి కారణాలు:
- కంప్యూటరులో తెలుగును చూపించేందుకు ఏంచెయ్యాలో తెలీకపోవడం
- తెలిసినా.., దానికోసం అనేక తిప్పలు పడవలసి రావడం.
- కంప్యూటరులో తెలుగు ఎలా రాయాలో తెలియకపోవడం
- అసలు బ్లాగు ప్రక్రియ గురించి చాలా మంది నెజ్జనులకే తెలియకపోవడం.
- నెజ్జనుల్లో ఎక్కువ మంది కుర్రకారు కావడం.., ఇంగ్లీషు చదువులు చదివినందున వారిలో ఎక్కువ మందికి తెలుగులో రాయడం రాకపోవడం
- కొంతమంది తెలుగువారిలో ఇంగ్లీషుపై ప్రేమ, తెలుగంటే చులకన ఉండడం
- బ్లాగు రాయడం ద్వారా ఇంగ్లీషు ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నం
(ఏడయ్యాయి.. కర్ణుడి చావుకున్నన్ని కారణాల కంటే ఒకటి ఎక్కువే!)
అయితే గత సంవత్సరంగా తెలుగు బ్లాగులు బాగా పెరుగుతూ వచ్చాయి. దానిక్కూడా కారణాలు మెండు గానే ఉన్నాయి. కొన్ని:
- కంప్యూటర్లో తెలుగెలా చూడాలో చెప్పే వనరులు అనేకం వచ్చాయి. తెలియ జెప్పే ఉత్సాహవంతులూ బాగానే ఉన్నారు.
- తెలుగులో రాసేందుకు అవసరమైన ఉపకరణాలు కూడా బాగా వచ్చాయి. పద్మ, లేఖిని, అక్షరమాల మొదలైనవి. ముఖ్యంగా లేఖిని (http://lekhini.org) ఒక విప్లవాన్నే తీసుకువచ్చింది.
- తెలుగు బ్లాగులను, బ్లాగరులను ప్రోత్సహించేందుకై ప్రత్యేకంగా telugublog ( http://groups.google.com/group/telugublog) పేరుతో ఒక గుంపే తయారయింది. బ్లాగులు వాసిలోను, రాశిలోను కూడా పెరగడంలో ఈ గుంపు ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. గుంపు సభ్యులందరు కూడా కొత్తవారికి చేదోడు వాదోడు గా ఉంటూ, బ్లాగుల విస్తృతికి తోడ్పడుతున్నారు.
ఇక బ్లాగుల ధోరణులెలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
స్థూలంగా తెలుగు బ్లాగులు మంచి విషయ పుష్టితో ఉంటున్నాయని చెప్పవచ్చు. రాజకీయాలు, సామాజిక వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు, జ్ఞాపకాలు, కవితలు, సినిమా కబుర్లు, వార్తా నివేదికలు, వివిధ పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలను తిరిగి ప్రచురించడం వంటి అనేక రకాల విషయాలపై బ్లాగులు వస్తున్నాయి. కొన్ని బ్లాగులను గమనిస్తే, చెయ్యితిరిగిన రచయితలు రాసిన వ్యాసాల్లాగే అనిపిస్తాయి. వివిధ ప్రాంతాల మాండలికాల్లో కూడా బ్లాగులు వస్తూ బ్లాగాకాశంలో ఇంద్రధనుస్సును పూయిస్తున్నాయి. తెలుగు బ్లాగరులు ఫోటో బ్లాగులు కూడా రాస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆడియో బ్లాగులు కూడా వస్తున్నప్పటికీ ప్రస్తుతానికివి పాటలకే పరిమితం అయ్యాయి. త్వరలో మంచి మాటల బ్లాగులను వినవచ్చు.
బ్లాగరులు కొన్ని కొత్త పదాలను కూడా భాషలోకి చేర్చారు. వాటిలో కొన్ని: బ్లాగరి, బ్లాగోళం, బ్లాగావరణం, బ్లాగోతం, బ్లాగ్పటిమ, బ్లాగ్శూరుడు
తెలుగు బ్లాగుల్లో ఓ ప్రత్యేకత ఉంది.. అశ్లీలత, దుశ్చర్యల వంటివి ఇప్పటివరకు లేకపోవడం! వివాదాలూ తక్కువే. కొండొకచో వేడి వేడి చర్చలు జరిగినప్పటికీ అవి చక్కటి ఆరోగ్యకరమైన చర్చలే!
హైదరాబాదు తెలుగు బ్లాగరులు కొందరు నెలకోసారి ఒకచోట చేరి, బ్లాగుల గురించి చర్చించుకునే మంచి సాంప్రదాయం ఒకటి ఉంది. పే..ద్ద సంఖ్యలో సభ్యులు రానప్పటికీ వచ్చే కొద్ది మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత మంది బ్లాగరులు వీటిలో పాల్గొనవలసిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమావేశాలు జరగవలసిన అవసరం ఉంది.
అయితే తెలుగు నెజ్జనుల సంఖ్యతో పోలిస్తే బ్లాగరులు, బ్లాగు పాఠకులు తక్కువేనని చెప్పుకోవాలి. సాఫ్టువేరు నిపుణుల్లో తెలుగువారెందరో వెలుగుతున్నారు. ఆర్కుట్లో వేలాదిగా తెలుగువారున్నారు. కాని బ్లాగులు, బ్లాగరుల సంఖ్య మాత్రం వందలకే పరిమితమయింది.ఈ సంఖ్య బాగా పెరగవలసి ఉంది. తెలుగు బ్లాగులు, బ్లాగరులు, తెలుగుబ్లాగు గుంపు మొదలైన వారందరూ ఈ పనిలో కలిసి పనిచెయ్యాలి.
బ్లాగుద్యమంలో మా వంతు కృషి మేమూ చెయ్యదలచాము. నెలనెలా వచ్చే బ్లాగు జాబుల్లోంచి మంచి వాటిని ఎంచుకుని వాటిని సమీక్షించే కార్యక్రమమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ శీర్షికను మొదలుపెడుతున్నాం. నెలకో మూడు ఉత్తమ జాబులను ఎంచుకుని ఈ పేజీలో సమీక్షిస్తాము.
చూస్తూనే ఉండండి.. తెలుగులో మొట్టమొదటి .. 🙂
మా మొదటి బ్లాగు సమీక్ష: డిసెంబర్ 19 మంగళవారం విడుదల
‘చుక్కపొడిచింది’ సమీక్ష
– త్రివిక్రమ్
ఈ కథలసంపుటిలో పాలగిరి విశ్వప్రసాద్ రాసిన పది కథలు, ఒక వ్యాసం ఉన్నాయి. ఈ పది కథల్లో స్త్రీ పురుష సంబంధాల్లోని భిన్న పార్శ్వాలను చూపే కథలు, ఆర్థిక సమస్యలు, మానవసంబంధాల్లోపలి ఆర్థిక సంబంధాలను విప్పి చూపే కథలు, మనుషుల ప్రవర్తన గురించిన కథలు , భూస్వామ్యభావజాలంతో నిండిన రాయలసీమ గ్రామాల్లో దళితులెలా అణగద్రొక్కబడుతున్నారో, క్రింది కులాలవాళ్ళను పైవాళ్లెలా తోలుబొమ్మల్లా ఆడిస్తున్నారో వివరించే కథలు ఉన్నాయి. అవే రాయలసీమ గ్రామస్థుల జీవితాల్లో ఫాక్షనిజమ్ ఎలా చీకట్లు నింపుతుందో చెప్పే కథ ఒకటైతే( కరువొచ్చె కక్షలూ వచ్చె) ఆ చీకట్లోనుంచి వేకువను సూచించే చుక్కపొడుపు చివరి కథ. వీటికి తోడు పుస్తకం చివర చేర్చిన వ్యాసంలో రాయలసీమలోని వర్గపోరాటాల (ఫాక్షనిజమ్) నిజస్వరూపాన్ని, చారిత్రక పరిణామాన్ని కూలంకషంగా వివరించడమేగాక సినిమాలతో సహా ప్రసార మాధ్యమాల్లో అది వికృతీకరించబడడం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తారు.
చాలా మంది రచయితల్లా ఈయన జీవితపు పైపై మెరుగులను వర్ణించి చెప్పడంతో తృప్తిపడలేదు. ఈ సమాజమిలా ఎందుకుంది? మనుషులింత అమానుషంగా ఎలా, ఎందుకు ప్రవర్తిస్తారు? అని ఒక ఆర్తితో, అశాంతితో ప్రశ్నించుకుని సమాధానంకోసం వెతుక్కునే ప్రయత్నంలో బయటపడిన కథలివి. ” ముసురు” అలాంటి ఒక కథ. ఈ కథలోని మతిస్థిమితం సరిగా లేని ఒక పిచ్చిదానిది కడుపుకాలే ఆకలి. అంతటి దయనీయ పరిస్థితుల్లో ఆమె చేత అసభ్యకరంగా డాన్స్ చేయించి వినోదించే యువకులకదో వినోదం. ఆమెను బెదిరించి, ఆపై అన్నం పెడతామని ఆశ చూపి వానలో తడిపించి, చలికి వణికించి, పైట తీయించి, అసభ్యనృత్యం చేయించి అన్నిరకాలుగా వినోదించి చివరకు ఆమెనోటి దగ్గరకు చేరిన అన్నాన్ని లాగేసి వాళ్ళు ఆమెతో ఆడిన చివరి ఆటను చూస్తూ ఆగ్రహించనివాడు మనిషి కాడు. ప్రథమపురుషలో సాగిన ఈ కథలోని కథకుడు ఆపుకోలేని ఆవేశంతో వారి రాక్షసానందానికి అడ్డుతగిలి ‘వాదన చేతకాకపోతే సత్యమూ, న్యాయమూ కూడా అసత్యమూ, అన్యాయమూ అయి కూర్చుంటాయ’నే చేదు నిజాన్ని, “అన్నం పరబ్రహ్మస్వరూపం. దాన్నందించేవాడు ఆకలి బతుకుతో ఏ రీతిగానైనా ఆడుకోవచ్చు. అదే నీతి, న్యాయం, హక్కు అయిపోయిన” లోకంతీరును కూడా తెలుసుకుంటాడు. కానీ సమాధానపడలేక అశాంతికి గురవుతాడు. అదే అతడి మనసులో అలముకుంటున్న ముసురు.
జబ్బుచేసిన తన కొడుకును సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి డబ్బుల్లేక కొడుకును పోగొట్టుకుంటాడొక తండ్రి చెదిరిన చిత్రం కథలో. ఐతే అంతకుముందే ఆ తండ్రి ఎస్కేపిజాన్ని చూపించడం వల్ల ఇదొక మూస కథయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని వాస్తవికతను పోగొట్టుకోకుండా మంచికథైంది. “జ్వరమేం చేస్తుంది? అదే తగ్గిపోతుందని నాకు నమ్మకం. డబ్బులేమి ఆ నమ్మకాన్ని బలపరుస్తోంది.” కానీ ఆ డబ్బులేమిని బలపరిచేదేమిటి? తాను చిరుద్యోగేకానీ నిరుద్యోగైనా కాడే?
”దేవుడా! బాబుకు జ్వరం పోవాల.” అనుకున్నాడు. ఆపైన ఏదైనా మొక్కుబడి మొక్కుకోవడానికి భయపడ్డాడు. మొక్కుకున్నాక తీర్చుకోలేకపోతే? దేవుడి దగ్గరే ఈ భయం.
ఇంట్లో ఏమీ లేవని తెలిసీ ఉత్తచేతులూపుకుంటూ ఇంటికి వచ్చి, పలకని భార్యను “బాబు ఏమన్నా తిన్నాడా?” అని పలకరిస్తే..? ‘అగ్నిపర్వతం బద్దలవుతుంది. నాకు అహం దెబ్బ తింటుంది. ఆ పైన అది దెబ్బలు తింటుంది. ఎందుకొచ్చిన గొడవ, పిల్లవాడికి బాగలేనప్పుడు?’ అనుకునే ఉదారపురుషుడతడు. స్నేహితుడి దగ్గర బదులు తీసుకున్న డబ్బుతో పిల్లాణ్ణి ఆస్పత్రికి తీసుకుపోయినట్లైతే ఇంట్లో తిండిగింజలనుంచీ అన్ని అవసరాలూ అలాగే మిగిలిపోతాయి. అదే డాక్టరు దగ్గరకెళ్ళకుండా మందుల షాపులో మందులు తీసుకుంటే డాక్టరు ఫీజు మిగులుతుంది. తనకున్న కనీసావసరాల్లో ఒకటి రెండైనా ఆ మిగిలిన డబ్బుతో తీరుతాయి. చివరకా పనే చేసి, మిగిలిన చిల్లరతో సమస్యల చీకాకుల నుంచి తప్పించుకోవడానికి బూతుసినిమాకెళితే ఆ డబ్బును తనకు బదులుగా ఇచ్చిన తన మిత్రుడే అక్కడ కౌంటర్లో టికెట్లమ్మే పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ కనబడ్డం, ఐనా ఇతడు తనను తాను సమర్థించుకోవడానికి కారణాలు వెతుక్కోవడం…ఇవన్నీ సమస్యలనెదుర్కోలేని అతడి పలాయనవాదాన్ని ఎత్తిచూపడం వల్ల అతడి స్థితిగతులకు, చివరికి అతడి కొడుకు చనిపోవడానికి అసలు కారణం కూడా అదేనని చెప్పకనే మనకర్థమవువుతుంది. మిల్లులో తాను చేసే గుమాస్తా ఉద్యోగమే చేసే సారథి అవసరంలో తనకు డబ్బెలా ఇవ్వగలుగుతున్నాడు? తానేమో పూటగడవని స్థితిలో ఎందుకున్నాడని కూడా ఆలోచించక తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అందర్నీ తిడుతూ కూర్చునేరకం ఈ కథలోని ‘నేను’ పాత్ర. సారథి ఆచరణాత్మక దృక్పథం, అవసరంలో తోటివారికి సాయపడగల అతడి సామర్థ్యానికి, అవసరంకోసం ఇతరుల ముందు చెయ్యి చాపవలసి వచ్చే ఇతడి అసమర్థతకు మధ్యగల తేడాను బలంగా ఎత్తిచూపాడు రచయిత.
ఆర్థిక సమస్యలతో ముడిపడి ఉన్నదే ఇంకొక కథ మనిషి. జబ్బేమిటో తెలియని తన తండ్రి మూడు రోజులుగా శవం మాదిరే ఆసుపత్రిలో పడి ఉన్నాడు. తమ ఇంటిల్లిపాదీ “బతుకంతా పిండుకుని” మిగుల్చుకున్నది కాస్తా ఇక్కడ ఆవిరైపోతోంది. నూరేళ్ళు బతకవలసిన పిల్లలకోసం దాచిన శ్రమ ఫలితం కాటికి కాళ్ళు చాచిన తండ్రికోసం ఖర్చుచెయ్యవలసి వస్తోంది. జబ్బేమిటని నర్సమ్మనడిగితే ‘చదువుసంధ్యల్లేనోళ్ళక్కూడా జబ్బులపేర్లెందుకో?’ అన్నట్లు చూసి ఆమె పలక్కుండానే వెళ్ళిపోతే ‘ఆమెకైనా తెలుసోలేదో?’ అనుకున్నాడు రాంరెడ్డి. తండ్రి ఆరోగ్యం గురించి బెంగపడుతున్న రాంరెడ్డికి ‘బెంగ పెట్టుకోవద్దు’ అని మనుషులిచ్చే ఓదార్పు పనికిరాదు. డబ్బులొచ్చి ఆ మాట చెప్తేనే ఊరట. ఆ డబ్బులైనా ఆకాశం నుంచి రాలిపడి అనాలి. మరే రకంగా వచ్చినా డబ్బును మోసే శక్తి తనకు లేదు. ఒకవైపు నుంచి ‘ఈ ముసిలోడు తొందరగా చచ్చిపోతే బాగుండు’ అనే పాడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటే అక్కడుండలేక బయటికొచ్చిన రాంరెడ్డికి బయటి రొచ్చు వాసనే ఆస్పత్రి వాసన కంటే మేలనిపించింది. కానీ కొన్ని క్షణాల్లోనే అసలు రొంపి – పేదరికపు వికృతస్వరూపం – నగ్నంగా అతడి కళ్ళబడేసరికి పెళ్ళీడుకొచ్చిన తన కూతుళ్ళిద్దరూ గుర్తొచ్చి మనసు వికలమై అతడు గదికి తిరిగొచ్చేసరికి అతడి కళ్ళబడిన ఒక చిన్న సంఘటన – వేలకు వేలు తీసుకుంటూ ఉన్నా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆసుపత్రి సిబ్బంది వల్ల జరిగిన ఆ ఘటన – అతడిలో కొత్త ఆలోచనకు కారణమవుతుంది. ఆ ఆలోచన, దాని మూలంగా అతడి మనసులో జరిగిన సంఘర్షణే ఈ మనిషి కథ.
కమ్మటి సువాసనలు వెదజల్లే కరివేపాకును ఇష్టపడని వారుండరు. అలాగే తినేటప్పుడు దాన్ని ఏరి పారేయనివారూ దాదాపు ఉండరు. నోరూ వాయీ లేని ఆ కరివేపాకు లాగే ప్రేమించిన మనిషినీ వాడుకుని వదిలేస్తే ఆ మనిషి ఆ కృతఘ్నతను, ఆ అవమానాన్ని ఎలా సహించగలుగుతుంది? పూర్వాశ్రమంలో తన ప్రియురాలు భర్తచాటు భార్యగా ఉన్నప్పుడు ఆమెతో ప్రేమాయణం అతడికదో థ్రిల్. పైగా తన అవసరాలకు ఆమే అప్పుడప్పుడూ డబ్బిచ్చి ఆదుకునేది. కానీ అతడి మూలానే తనను భర్త వదిలేస్తే ఆమె మనసంతా ఇతడినే నింపుకుని ఇతడి జ్ఞాపకాలతోనే బతుకుతోంది – అని స్పష్టంగా తెలిసీ ఆమెను తప్పించుకుని తిరగాలనుకోవడం, ఆమెను కలవడమే తనకు పరువుతక్కువనుకోవడం ఆమెను కరివేపాకును చెయ్యడమే. దానికామె అతడికిచ్చిన ఘాటైన సమాధానం చెళ్ళుమని తాకుతుంది. మనసును తాకే కథ.
“చీకటి మరీ చిక్కగా ఉంది.”
“అయినా బాగుంది. అటుచూడు – రంగు రంగుల దీపాల గుంపంతా ఆ నీళ్ళలో పడి చూడ్డనికెంత బాగుందో?” నేను వెలుగులో చీకటిని చూపిస్తే ఆమె చీకట్లో వెలుగును చూపిస్తోంది. (అయినా ఆ వెలుగును చూడక చీకట్లోనే ఉండిపోయేవాళ్ళను ఎవరు బాగుచెయ్యగలరు?)
“మార్పు నీలోనే కాదు నీ తెలివిలోనూ వచ్చింది.”
“పలికే నాలికుంటే పెదాలతో నవ్వుతావెందుకు?” లాంటి సంభాషణలు ఈ కథకు మరింత అందాన్నిచ్చాయి.
పాములు కథ స్త్రీ-పురుష సంబంధాల్లోనిమరో పార్శ్వాన్ని విప్పి చూపుతుంది. ఇందులో కల్పన చేయవలసి వచ్చిన పని చంద్రశేఖర్ కు తాను ఎరగా మారి అవినీతికి పాల్పడిన తన భర్త హోదా తగ్గకుండా చూడ్డం. ఈ పనికి భర్త తననెలా అడగగలిగినాడు? 1. ఆడది తానొక మనిషిననుకునే స్పృహ లేకుండా చేసిన మగజాతికి చెందినవాడు కావడం వల్ల తన హోదాను, ఆస్థులను పెంచుకోవడానికి ఒక పనిముట్టుగా ఆడదాన్ని వాడుకోవడం అతనికి తప్పుగా అనిపించలేదు. 2. తనకు ప్రత్యేక గుర్తింపునివ్వకపోయినా పెళ్ళైన నాటినుంచి పూర్తి ‘స్వేచ్ఛ’నివ్వడం ద్వారా. ‘నిజంగా తనకు స్వేచ్ఛనే ఇచ్చాడా లేక తననలా భ్రమింపజేశాడా’ అనే అనుమానం ఆమెకప్పుడే కలిగిందింది – ఆ స్వేచ్ఛనామె అన్నాళ్ళూ పరిమితికి మించి వాడుకోలేదుగాబట్టి. మరి ఈ పనికి తనెలా ఒప్పుకోగలిగింది? డబ్బుతో పొందగల విలాసాలు, హోదాల మీద ఆశ ఉండడం వల్ల. అంతే ఐతే కథేముంది? భర్త ఒకందుకు తనను నియోగిస్తే తాను తన జాణతనం ఉపయోగించి రెండు పనులు చక్కబెట్టింది. భర్త అందుకు మురిసిపోయి తనను ముద్దుల్తో ముంచెత్తినా ఆ క్షణంలోనే వాళ్ళిద్దరి మనసుల్లోఆలోచనలు రేగుతాయి. ఆ ఆలోచనల వేడిలో ఇద్దరి అంతరంగాలూ పాముల్లా చెలరేగి బుసలు కొడతాయి.
కథనం పలచబడిపోకుండా ఒక కథలో సైద్ధాంతిక చర్చ చేయడమెలాగో తెలుసుకోవడానికి ఒక పాఠ్యగ్రంథంగా నిలుస్తుంది బతుకుబండి అనే కథ. ఇందులోని సారథి పాత్ర ఉరుకులు పరుగుల్తో వచ్చి దాదర్ ఎక్స్‌ప్రెస్ లో ఎక్కినప్పటి నుంచి గుండెలదరగొట్టే దాదర్ ఎక్స్‌ప్రెస్ తో పోటీపడి సాగిన ఈ కథన సామర్థ్యం వల్లే 17 పేజీల ఈ కథలో ఎక్కడా ఉత్కంఠ ఇసుమంతైనా తగ్గకుండా కథను నడిపించగలిగాడు రచయిత. అప్పటివరకూ పట్టాల్లేకుండా సాగిన అతడి బతుకు బండి పట్టాలెక్కేసిందనుకుంటున్నసమయంలోనే ఘోరంగా పట్టాలు తప్పి పోయి అతడి మూడేళ్ళ కూతురు, ఐదేళ్ల కొడుకు ప్లాట్‌ఫారమ్మీద దిక్కులేని పక్షుల్లా నిలబడిపోతారు. మనుషుల్లోని అవకాశవాదాన్ని, తమ ప్రాణాలు కాపాడినవాడిని నేరస్థుడిగా భావించి పోలీసులు నిలదీస్తుంటే “నీకీ శాస్తి కావాల్సిందే!” అనుకునే వాళ్ళ అహాన్ని, పోలీసులతణ్ణి దోపిడీదొంగగా నిర్ధారించి లాక్కెళ్తుంటే అడ్డుకోవడం మాని “మనకెందుకు దోవనపోయే దరిద్రం” అనుకునేవాళ్ళ ఉదాసీనత కళ్ళక్కట్టినట్లు వివరిస్తాడు.
“చెప్పు కింది పూలు” కథలో గుమ్మయ్య అనే దళితుడు బళ్ళోని టీచరు తన కొడుకును గురించి “వానికి ఏం తెలివితేటలయ్యా! ఇట్టాటి పిల్లోన్ని నేను పంజేసిన కాడ యాడా జూడలే. వాన్ని తప్పకుండా పై చదువులు చదివించమని” అంటూండడంతో వాణ్ణి హైస్కూల్లో చేర్చి చదివించడానికి పుస్తకాలు, ఫీజులకని ప్రెసిడెంటును డబ్బడగబోతే ఆ ప్రెసిడెంటు వాళ్ళ ఇంటిల్లిపాదీకి నేర్పుగా ఉచ్చు బిగించి వాళ్ళను ఎలా తన చెప్పు కింది పూలుగా మార్చి నలిపేశాడో విప్పి చెప్పాడు. దానికి అవకాశమిచ్చిందీ ఒక రకంగా ఆ దళిత కుటుంబీకుల జీవనవిధానం, గుమ్మయ్య తాగుడు అలవాట్లే. కానీ ఆ విషయం వాళ్ళు గ్రహించరు. వాళ్ళ ఆ అజ్ఞానమే వాళ్ళను ప్రెసిడెంటు లాంటివాళ్ళకు బానిసలుగా మారుస్తోంది. తమను కొట్టినా, తిట్టినా అవసరానికి డబ్బిచ్చీ, వ్యవహర్తగా మారీ తమను ఆదుకున్నాడన్న విశ్వాసమే వారి తరాన్ని అతడికి విశ్వాసులుగా మారుస్తుంది.
ఇక తోలుబొమ్మలు కథ మద్యనిషేధం నేపథ్యంలో సాగుతుంది. ఇది తన కులస్థుల మీద తనకున్న పట్టు నిలుపుకోవాలనే ఆత్రంతో విధేయతలు మార్చిన ఒక కులపెద్ద కథ. అంతకాలమూ రాఘవరెడ్డి మనిషిగా తాను విధేయతతో మసలుకొన్నా ఆయనేమో తన మాట వినిపించుకోకుండా తనకు సరిపడని మనిషొకడిని పై ఊరినుంచి రప్పించి సారా కాయించడానికి సిద్ధపడేసరికి నన్నప్ప రాఘవరెడ్డి ప్రత్యర్థైన ప్రెసిడెంటు పంచన చేరుతాడు. రాయలసీమ పల్లె ప్రజల జీవితాలను సునిశితంగా పరిశీలించిన ఈ రచయిత ఆ జీవితాల్లోని మరిన్ని పార్శ్వాలను తన కథల్లో స్పృశించగలడని తప్పకుండా ఆశించవచ్చు.
విశ్వప్రసాద్ రాయలసీమ కక్షల గురించి రాసిన రెండు కథల్లో మొదటిది “కరువొచ్చె కక్షలూ వచ్చె“. పేరులో ఉన్నట్లే ఈ కథ రాయలసీమలో కరువుకు, కక్షలకు మధ్య గల కార్య-కారణ సంబంధాన్ని తెలిపే ప్రయత్నం చేస్తుంది. “కాలే కడుపు కారుణ్యమెరుగదు” అంటారు ప్రసిద్ధ రచయిత కేతు విశ్వనాథరెడ్డి. నోటి దాకా వచ్చిన పైరు ఎండిపోతూ ఉంటే ఏం చేసైనా సరే పైరును నిలుపుకోవాలనే ఆరాటంలో దాయాదుల మధ్య పగలు రగిలిన వైనాన్ని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఒక కథలో వివరించాడు. విశ్వప్రసాద్ రాసిన ఈ కథలో “ఒక దిక్కు వానరాక పైరు ఎండిపోతాంటే ఉండే రోంత పైరునూ ఊళోళ్ళ పశువులు మేసి పోతాంటే ఎవరికైనా కడుపు కాల్తాది మల్ల.” ఆ కడుపు మంటే పాతపగలన్నిటినీ గుర్తుకు తెచ్చి పగల సెగలు రేపింది. ‘ మనుసులకు తిండెట్లా లేదు – ఉండే పసల మేతనన్నా కాపాడుకుందాం.’ అని మాట్లాడుకోవడానికొచ్చి అసలిది విడిచిపెట్టి ఆవేశాల్లో పడిరి.” “ఏదేమన్నా గానీ, మనం వొంగిపోగూడదు.అవతలోళ్ళను నాశనం చెయ్యాల. మనం చచ్చినా సమాధానమే.” అనుకుంటారు అక్కసుగా, పౌరుషంగా. ఫలితంగా “ఊరు వల్లకాడైపోయినట్లాయె”. మనుషులకు తిండిలేకఛస్తూంటే ప్రభుత్వమేం చేస్తోంది? అనే ప్రశ్నకు సమాధానమిలా ఇస్తాడు:” మన బతుకు మనం బతకడానికే పెద్ద పోరాటమైతాంది. ఇంగ ప్రభుత్వాలతో ఏం పోరాడ్తం? ఏం ఉద్యమాలు చేస్తం? మనకా స్తోమత లేదు. ఓట్లేయడానికి తప్పనిచ్చి దేనికీ పనికిరానోల్లం. మన్లో మనం కొట్టుకుంటా ఎట్లైనా రెండు పార్టీలకు చెరిసగం ఓట్లేస్తాం. అందుకే మనకు సాయం చెయ్యకపోయినా ఈ గవుర్మెంటుకు వొచ్చే నష్టమేం ఉండదు… కాబట్టి సాయం చెయ్యరు. ” అసలు ఇలాంటి కక్షలు ఇక్కడే ఎందుకున్నాయి? అనే ప్రశ్నకు ఈ కథలో “అనాదిగా ఈడ కక్షలుండయ్. అనాదిగా ఈడ కరువులుండయ్. కరువులకు, కక్షలకు కానరాని సంబంధముందేమో! చేయడానికి ఏం పన్లేక, ఆలోచించే ఇంగితం లేక తన అసహనాన్ని అణుచుకుండేదెట్లనో తెలియక కక్షల దిక్కు మళ్ళినాడేమో?” అని సమాధానమిచ్చినా ఈ పుస్తకం చివర చేర్చిన వ్యాసంలో విస్పష్టమైన, వివరణాత్మకమైన సమాధానమిస్తాడు.
“ఇక వీళ్ళ బతుకులిట్లా కాలిపోవలసిందేనా?” అనే ప్రశ్నకు సమాధానమే “చుక్కపొడిచింది” అనే కథ. గ్రామపార్టీలు ఒక చారిత్రక దశగా 1980ల నాటికే ఒక ముగింపుకొచ్చింది. నాటి శకలాలు ఇంకా అక్కడక్కడా ఉన్న మాట వాస్తవమే అయినా అవి కూడా పూర్తిగా సమసిపోయే దిశలో ఉన్నాయి. ఇప్పటి పొలిటికల్ ఫాక్షనిజంతో మమేకమై వికృతరూపంలో అప్పుడప్పుడూ బయటపడుతున్నాయి. ఇదే కథలో గ్రామపార్టీల్లో మునిగితేలుతున్న కుటుంబంలోకొచ్చిన కొత్త కోడలి అనుభవం ఆమె మాటల్లోనే “ఆత్మీయతలకు మాత్రం కొదవలేదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో లేని ఆపేక్షలు తనను ఉక్కిరిబిక్కిరి చేసేవి… తనను నెత్తిన బెట్టుకున్నంత పని చేసినారు.” ఐతే తన మామగారిని చంపిన వారిపై పెట్టిన కేసును జిల్లాకోర్టు కొట్టేసినప్పుడు తన అత్తగారు, మరిది “హైకోర్టుకు పోవడం ఖర్చులు దండగని” వారించడం ఎందుకో ప్రత్యర్థి ఖూనీ అయినప్పుడుగానీ ఆమెకు అర్థం కాలేదు. అవతలి వాడ్ని తన కొడుకులు ఖూనీ చేసినందుకు తన అత్తగారు తృప్తిపడ్డం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. తన మేనత్తను గుర్తు చేసుకుని “భర్తను చంపినవాణ్ణి చంపడానికి మానాన్నీ, ప్రాణాన్నీ ఎరగా వేసేంత ఉన్మాదమేంది?” అనుకొంది. “చంపినా చంపబడినా సాధించేదేం లేదు. ఎటుతిరిగినా ఓడిపోయే ఈ బతుకు నాకూ, నా పిల్లోళ్ళకూ వద్దు. కాలికి కత్తికట్టి నీ కొడుకులను నువ్వు బరిలోకి దించుతావేమో గానీ నా పిల్లోళ్ళను ఈ ఓడిపోయే పోరాటంలోకి దించను గాక దించను.” అని తన అత్తగారికి తెగేసి చెప్పింది. అప్పటికి “తూర్పున వేగుచుక్క పొడిచి దేదీప్యంగా మెరుస్తోంది”. అని సింబాలిక్ గా ముగుస్తుంది ఈ ఆఖరి కథ.
ఇక ఈ కథల్లో వాడిన భాష “ముతకముతగ్గా, ముట్టుకుంటే చేతులు గీరుకుపోయే మొనదేరిన నాపరాళ్ళ మాదిరి గరుగ్గా ఉంటుంది. కరుగ్గా వినిపిస్తుంది.” రచయిత తాను విన్నవాటినీ, కన్నవాటినీ యథాతథంగా రికార్డు చేయాలనుకోవడం ఒకటి రెండు కథల్లో లోపంగా కనిపిస్తుంది. గుమ్మయ్య ప్రెసిడెంటును ఐదువేలు కావాలని అడిగితే ఆయన “రూపాయలేనా? ఎర్రగుంట్లకు బొయి బాంకును కొడ్దాం పా! నాగ్గుడా అక్కరుండాది.” అని సెతురు పలికినప్పుడు, తలమీద దెబ్బపడిన గుమ్మయ్య భార్య “ఈని తలపండు పగలా! సంపినాడ్రో” అని అరిచినప్పుడు వాడుకున్నంత సహజంగా కడప ప్రాంత వ్యావహారిక భాషను అదే కథలో గుమ్మయ్య చెల్లెలి గురించి చెప్పేటప్పుడు, ముసురు కథలో ‘ఎర్రిదాన్ని’ గురించి చెప్పేటప్పుడు వాడుకోవడానికి ప్రయత్నించడంలో రచయిత తప్పటడుగు వేశాడేమోననిపిస్తుంది. అక్కడి భాష, భావం సహజమైనవే అయినా వాటిని కథలో రాసేటప్పుడు కాస్త నిగ్రహం పాటిస్తే బాగుండుననిపిస్తుంది.
గతంలో రాతిపూలు అనే విశిష్టకథల సంపుటి ప్రచురించిన నేత్రం ప్రచురణ సంస్థ తమ సాహితీత్రైమాసిక పత్రిక పున:ప్రారంభమైన తర్వాత ప్రచురించిన తొలి కథల సంపుటి ఈ చుక్కపొడిచింది. సీరియస్ సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన ఈ పుస్తకం ప్రతుల కోసం సంప్రదించవలసిన చిరునామా:
పి. పార్వతి 12/152, స్టేట్ బ్యాంక్ కాలనీ కడప – 516002
ఫోన్: (+91) 9849998034
మసకతర్కం
అతిథి
యర్రపురెడ్డి రామనాథరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తెలుగు బ్లాగుల్లో అత్యుత్తమ బ్లాగులను ఎంచవలసి వస్తే మొదటి మూడు స్థానాల్లో యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు. పొద్దు పొడవడం ఆయన రచనతోటే జరగడం మాకు గర్వకారణం. అడిగినదే తడవుగా వ్యాసం రాసిచ్చిన రామనాథరెడ్డి గారికి కృతజ్ఞతలతో ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం. ఆస్వాదించండి.
____________________________________
“రాము పాటలు చాలాబాగా పాడతాడు”. ఇది విననట్లే కనిపిస్తున్నాడు కానీ, ఐదేళ్ల రాముకు ఈ మాట నచ్చింది.
“ఔను. ఏదీ, నాయనా, ఒక పాట పాడు”. కొందరి ముఖాలు అప్పటికే రామును చూస్తున్నాయి “ఊ.. పాడాల్సిందే” అన్నట్లు.
గుర్తింపు. ఆ గుర్తింపు తెచ్చే ఆనందకరమైన ఇబ్బంది. అ ఇబ్బందిని దాటి కొంచెం సర్దుకొంటుండగానే తనకోసం అందరికీ మధ్యలో చోటు సిద్ధం.
అదొక సభ. అందులో ఇప్పుడు రాము ఒక సభ్యుడు. సభామర్యాదలింకా సరిగా తెలియకుండానే సభ్యసమాజంలో రేపటి పౌరుడు. కూర్చొని తనూ ఆనందిస్తూ పాడిన ఆ పాట పూర్తవగానే అభినందనల వెల్లువ, ఆ వెల్లువలోనే మరో పాట పాడాలంటూ ఎవరిదో కంఠం. ఇదే పాట మళ్లీ పాడాలని మరో అభ్యర్థన. విసుగనేది లేకుండా ఆ ఉత్సాహంలో అలా పాడేయటమే రాము పని.
ఎక్కడైనా మనకు గుర్తింపు వున్నపుడు, అది కల్పించే ఆనందాన్నీ హోదానూ అనుభవిస్తున్నపుడు, దాన్ని కాపాడుకొనే బాధ్యత కూడా మన వెన్నంటే వుంటుంది కదా. మరి ఐదేళ్ల వయసున్న రాము ఈ గుర్తింపును పోనీయకుండా ఎలా కాపాడుకోవాలి? అణకువతో మరికొంత సహనంతో తన అభిమానగణం మధ్యన మెలగటం ద్వారా. ఇలాంటి ప్రవర్తన తన వర్తమానానికి, భవిష్యత్‌కు ఎలా మేలుచేస్తుందో తల్లిదండ్రులు రాముకు అర్థమయేలా వివరించడం ద్వారా. అణకువలేమి లేక గర్వం వినాశనానికి హేతువనే విషయం విశదమయేలా తనకు వివరించగల తండ్రిద్వారా. “వినయేన శోభతే విద్యా!” మంత్రంలాంటి ఈ మాట దాని అర్థంతోసహా అవగతమయి గుర్తుండిపోయేలా చేసిన ఇతర పరిస్థితుల ద్వారా.
*** *** *** ***
వానాకాలం. మోజులు మోజులుగా వాన. కోడిపుంజులు, పెట్టలు, బొమ్మెలు (అప్పుడే యవ్వనంలోకి అడుగిడిన కోళ్లు), పిల్లలకోళ్లు అన్నీ గొడవలు మరచి వసారా కింద చేరేవి. వానవెలసినప్పుడు మరోమోజు వాన వచ్చేలోపు పురుగుల్ని దొరకబుచ్చుకొని తినడానికి వసారా కిందనుండి బయటకు వచ్చే కోడిబొమ్మెలను, మేతకోసం వాటిని తరిమేసే పిల్లలకోళ్లను, వీటిని తరమే పైకోళ్లు, ఈ మధ్యలో ఆ పురుగుల్ని పైకోళ్లనుండి దొంగిలించేసే పైలాపచ్చీసు కోళ్లు, యశస్వి యస్వీరంగారావులాగా పెద్దరికం వెలగబెట్టే ఇంటిపెద్దలాంటి పుంజు.
ఇంత కోలాహలం చేసే కోళ్లను చూడకుండా వుండలేక, గడపమీద కూర్చొని, అవ్వ నూరిన చెనిగ్గింజల ఊరిమిండి (వేరుశనగ చట్నీ), అమ్మ వేసిచ్చే పలుచని వేడిదోశలు స్టీలు గిన్నెలో వేస్కుని బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న పదేళ్ల రాముకు ఒక గదమాయింపు వినబడింది “రేయ్, గడప మింద నిలబడగూడదు, కూర్చోకూడదు. దిగు. ఇటుగానీ అటుగానీ ఉండి తిను.”
“యాఁ…!?” కొంత భయం, కొంత అసహనంతో కూడిన ఆ శబ్దానికి రాము భాషలో “ఎందుక్కూర్చోకూడదు?” అని తాత్పర్యం.
“అది నరసింహస్వామి కూర్చొన్న స్థలం. ఆయనక్కడ హిరణ్యకశిపుని పొట్టచీల్చి పేగులు మెళ్లోవేసుకొన్నాడు. దేవతలంతావచ్చి ప్రార్థించినా ఉగ్రరూపం చాలించలేదు…”
“హిరణ్యకశిపుని చంపడం ఎందుకు, గడపమింద కూర్చున్నాడనా?”
“ఓరి పిచ్చి నాయనా, అందుక్కాదు … ….కాబట్టి… … అందుగల డిందులేడను సందేహంబు వలదు, ఎందెందు వెదకిచూసిన అందందే గలడు, చక్రి సర్వోపగతుండు… కాబట్టి గడపదిగు.”
వాడు దుర్మార్గుడు కాబట్టి దేవుడు చంపాడు. అది గడపమీద జరిగింది. కాబట్టి ఎవరూ అక్కడ కూర్చొని వానను కోళ్ల మేత కీచులాటను చూడకూడదు. రాముకు ఇది చాలా అన్యాయం అనిపించింది. గడప దిగకుండానే సపోర్టుకోసం అమ్మవైపు చూశాడు. అమ్మ రాముకు దోశలు వేసే పనిలో వున్నట్లు నటిస్తోంది. నాయన వైపు చూశాడు. ఇబ్బందిగా కదిలాడు నాయన. రాముపై కాస్త చిరాకు నటిస్తూ వాకిట్లోంచి బయటికి చూస్తూ “వాకిట్లో అందరికీ అడ్డమెందుకురా లెయ్‌అణ్ణించి, కడవల్తో నీళ్లుబట్టుకొని గడపదాటుతుంటారు మీఅమ్మోళ్లు”. ఇది రీజనబుల్‌గా వుంది, న్యాయంగా వుంది, బాగుంది. లేవబుద్ది కాలేదు గానీ లేవక తప్పిందికాదు. రాముకిది సుప్రీంకోర్టు తీర్పు. ఇంక నో అప్పీల్.
పదేళ్ల వయసున్న రాము మనసులోని ఆ తర్వాతి ఆలోచనల సారం ఇది:
- మనసు అంగీకరించకపోయినా మన ఆహ్లాదం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టరాదు.
- నరసింహస్వామి అక్కడేదో చేశాడనికాదు, అందరికీ అడ్డం కాబట్టి గడపమీద కూర్చోకూడదు.
- అవ్వది చాదస్తం. నరసింహస్వామికి రాముపై కోపమొచ్చి ఏమైనా చేస్తాడేమోనని ఆమె భయం.
- అవ్వకు ఏదైనా ఎదురు చెప్పవలసి వస్తే అమ్మ ఆ ఇబ్బందిని తప్పించుకోవడంకోసం విననట్లు నటిస్తుంది.
- అవ్వకు ఎదురు చెప్పడం నాన్నకూ ఇబ్బందిలాగే వుంది కానీ కొంచె తెలివిగా చెప్పేస్తాడు.
- ఇలా నటించే అవసరం రాముకు లేదు. భవిష్యత్‌లో కూడా రాకుండా చూసుకోవచ్చు.
- తనకేదైనా ఆలోచన వస్తే దాన్ని విమర్శించేవారు, సమర్థించేవారు వుంటారు. తార్కికంగా ఆలోచించి, పెద్దలతో చర్చించి మనకు సరైనదనిపించే మార్గంలో నడవాలి.
- ”వినయేన శోభతే విద్యా!” అన్నారుకదా అని వయసులో పెద్దవారు చెప్పే ప్రతి మాటా గుడ్డిగా ఆచరించనవసరం లేదు.
అలాంటి తల్లిదండ్రులకు బిడ్డ కావడంవల్ల స్వతంత్రంగా ఆలోచించే గుణం పెంపొందింది రాముకు. ఇలాంటి పెంపుదల ఫలితం – కొంత విశాల దృక్పథం.
*** *** *** ***
ఇక్కడ ఇంకో రామూని తీసుకుందాం – కేవలం ఉదాహరణగా. గడపదిగమని గదమాయిస్తే “యా…!?” అని ప్రశ్నించడం, సపోర్టుకోసం వెదకడం ప్రతి రామూ చేసే పనే. ఈ రామూ గతి చూద్దాం. “సాక్షాత్తూ నాయనమ్మనే ఎదురు ప్రశ్నలు వేస్తావా, నరసింహస్వామి అంటే ఏమనుకున్నావ్, కొంచెం కూడా భయం భక్తి లేకుండాపోయింది నీకు” అని వాతలు పెట్టే తల్లిదండ్రులు . పిల్లవాని తర్కానికి తమ బెత్తంతో సమాధానం చెప్పే ఆ మాతాపితలను వారిస్తూ “వాణ్ణి కొట్టకండని”రక్షించడానికి అదే పితామహి (అవ్వ) మళ్లీ రంగంలోకి వస్తుంది.
అపుడు అయోమయానికి గురైన ఆ పిల్లవాని ఆలోచనల సారం ఇది:
- నాయనమ్మ వలన నాకు వాతలు పడినవి. ఆమె బ్రహ్మరాకాసి. అమ్మనాన్నలూ రాక్షసులే.
- “మళ్లీ నానమ్మే రక్షించిందే! తను బాధపడుతూ నన్ను ఓదారుస్తోందే! అంటే తన తప్పు అంగీకరించినట్లా?” ఏదేమైనా తర్కాన్ని తుంగలో తొక్కవలయును.
- ప్రశ్నించడం తప్పు. ప్రశ్నించినచో వొంటిపై వాతలు పడును.
- నాయనమ్మను అస్సలు ఎదురు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఆమే వచ్చి రక్షించేదాకా అమ్మానాన్న కొడుతూనే వుంటారు.
- నరసింహస్వామి పట్ల భయము, భక్తి రెండూ తప్పనిసరిగా వుండవలెను. ఎందుకనగా అవి లేకపోతే వాతలు తప్పవు.
అంతే అక్కడితో అగుతాయి ఆలోచనలు. కానీ అతని మనసు చల్లబడదు మళ్లీ అమ్మనాన్న తనని దగ్గరచేసుకొనేదాక. ఇలా ఈ రామూకు పుట్టుకతో వచ్చిన సృజనాత్మకత, తర్కించే గుణం మొగ్గలోనే కొంత తుంచివేయబడటం జరిగింది. ఈ అణచివేత ఫలితం – కొంత మానసిక అనిశ్చితి, కొంత సంకుచిత మనస్తత్వం .
*** *** *** ***
ప్రతి చిన్న ఘటన గురించీ రాము ఆలోచిస్తాడు కదా మరి.ఆలోచించి, ఆ సారంతో కొన్ని సంగతులు నేర్చుకొంటాడు. ఒక చిన్న సాధారణ దైనందిన ఘటన రెండు రకాల రామూలను తయారు చేసింది. తన ఎదుగుదలలో ఎన్ని ఘటనలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని పాఠాలు! ఈ రెండు రకాలే కాదు ఎన్నో రకాల రామూలుంటారు మనం గమనిస్తే. మన సమాజం ఇలాంటి రకరకాల రామూలతోనే కదా తయారయింది.
“నేను ఏ రకం రామూని” అని మనకు మనం ఆలోచిస్తే మనకూ అర్ధం అవుతుంది – మనం పెరిగిన పరిస్థితులు మన ఎదుగుదలపై ఎలాంటి ప్రభావంచూపాయో. మన మనసు ఎంత విశాలమో లేదా ఎంత సంకుచితమో ఆలోచనకొస్తుంది. ఈ ఆలోచన మన వ్యక్తిత్వాన్ని మరింత వికసింపజేసుకొనే అవకాశం కల్పిస్తుంది. తప్పకుండా ప్రతి రామూ కూడా “అంత మంచిది కాని” లక్షణాన్నొకదాన్నైనా అలవరచుకొని వుంటాడు – తన తల్లి లేదా తండ్రి లేదా ఇతర వ్యక్తుల ద్వారా . ఇవన్నీ మన వ్యక్తిత్వం రూపుదాల్చడంలోని మూలకాలు అవుతాయి.
*** *** *** ***
వ్యక్తి+త్వం. నీవొక వ్యక్తివి అని నీకు గుర్తుచేసే మాట. నీకు ఒక గుర్తింపునిచ్చే మాట. నీ వ్యక్తీకరణల -మాట,చేష్ట, మరే ఇతర కళారూపంలోనైనా- పరిణామాలకు నీదే బాధ్యత అని గుర్తుచేసే మాట. మనల్ని ఎదుటివారందరిలో చూడగలగటం, ఎదుటివారిలోని మన తత్వాన్ని గుర్తించడం వ్యక్తిగా అనవరతం మనం చేయాల్సినది. వ్యక్తిత్వం, గుర్తింపు, హోదా, బాధ్యత – బాగా బరువైన మాటలు మాట్లాడుతున్నాను కదా. కానీ విషయం మరీ గంభీరమైనదేమీ కాదు. మనకు కొంతైనా ఉపయోగపడేదే. ఔనంటారా?.
ఒక మంచి మనిషి పరిచయమయ్యాడని చాలా సంతోషముగా ఉన్నది – అన్నారో బ్లాగు మిత్రుడీమధ్య. మనలో చాలా మందిమి స్వభావరీత్యా మంచిమనుషులమే. కానీ చిన్న అభిప్రాయభేదం ముభావంగా మారిపోయేలా చేస్తుంది – దీనికి కారణం ఎంత చిన్నదైనా కావచ్చు. “నేననుకున్నంత మంచోడు కానట్టున్నాడితడు” అని మనకు అనిపించడానికీ, ఎదుటివారికి మన గురించి అలా అనిపించేలా చేయడానికీ కారణం సాధారణంగా చిన్నదే అయివుంటుంది, ఉదాహరణకు, ఆ ముందు రోజు రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడంతో వచ్చిన అలసట -> చికాకు . తర్కానికి లోబడి సాగే సాధారణమైన చర్చ ఒక సన్నని గీతదాటి వితండమయే పరిస్థితిలో – నేరములే తోచుచుండు.
ఈ గీతను ప్రతిరోజూ ప్రతి సందర్భంలో గుర్తించగలగడం అసాధ్యమే కావచ్చు. కానీ అదే అనుదిన లక్ష్యంగా అందరూ మనవాళ్లే అనే భావనతో కొనసాగటం ఒక మహా ప్రస్థానం. ప్రస్థానమంటే ప్రయాణమని అర్థం. ఈ మహాప్రయాణం మన వ్యక్తిత్వాన్ని మెరుగు పరచడం వైపు. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుందని ఒక చైనా సామెత.
–యర్రపురెడ్డి రామనాథరెడ్డి (http://yarnar.blogspot.com/)
సినిమా
ఈ ఏటితో తెలుగు సినిమాకు డెబ్భై ఐదేళ్ళు నిండాయి. 1931లో మొదలైన (టాకీ) సినిమాలు 1950ల నుంచి తెలుగువాళ్ళను అచ్చంగా సినీమాయలో పడేశాయి. సమాజంలో వీటికున్న విస్తృతి, ప్రభావశీలతల వల్ల సినిమాలు ఒక శక్తివంతమైన మాధ్యమగా అవతరించాయి. తెలుగువాళ్ళనింతగా ప్రభావితం చేస్తున్న సినిమాలెలా తయారవుతాయో తెలుసుకోవాలనే కుతూహలం గలవారి కోసం ఈ సినిమా శీర్షిక. రానున్న సంచికల్లో అసలు సినిమాలెలా తీస్తారో, చిత్రనిర్మాణంలోని వివిధ దశల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు.
సినిమా – ఒక పరిచయం:
సినిమా అనేది ఒకరకంగా చెప్పాలంటే దృశ్యరూపంలోని సాహిత్యమే. ఇది రంగస్థలమ్మీద ఒకసారి ఆడి ఆగిపోయే బదులు వెండితెరమీద మళ్ళీమళ్ళీ ఆడించడానికి వీలయ్యేలా రూపొందే నాటకం, దృశ్యరూపంలోని ఒక కావ్యం, ఒక నవల లేదా ఒక కథ. తెలుగులో టాకీలొచ్చిన తొలినాళ్ళలోనే ప్రసిద్ధి పొందిన కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి నాటకాలు సినిమాలుగా వచ్చాయి. ఆ రోజుల్లోనే నవలల్లో నుంచి ‘బారిష్టర్ పార్వతీశం’, ‘మాలపిల్ల’లు కూడా వెండితెర మీద సాక్షాత్కరించారు. చలం రాసిన ‘దోషగుణం’ అనే చిన్నకథ కూడా ఇటీవలే సినిమాగా వచ్చింది. ఐతే ఏ సాహితీరూపమైనా ఎటువంటి మార్పులూ లేకుండా యథాతథంగా తెరమీదికెక్కదు. లిఖితమాధ్యమానికి, దృశ్యమాధ్యమానికి మధ్య ఉన్న మౌలికమైన తేడాలు, ఆ రెండుమాధ్యమాలకు ఉన్న వేర్వేరు పరిమితులు ఈ మార్పులకు కారణాలు.
ఉదాహరణకు ఒక నవలనే తీసుకుంటే సాధారణంగా ఒక రచయిత తనకు ఏం రాయాలనిపిస్తే అది, ఎలా రాయాలనిపిస్తే అలా లేదా తానెలా రాయగలిగితే అలా రాసేస్తారు. వీలైనంతవరకు తనకు నచ్చిన విధంగా నవల రాసుకునే వెసులుబాటు, స్వేచ్ఛ ఆ రచయితకు ఉంటాయి. ఒక ఆలోచన వచ్చిన వెంటనే కుదురుగా కూర్చుని ఏకధాటిగా రాసుకుపోవచ్చు రచయిత. ఐతే సినిమా అలా కాదు. ఒకరికి వచ్చిన ఊహ లేక ఆలోచనకు దృశ్యరూపమివ్వడానికి ఎంతో మంది కలిసి శ్రమిస్తేగానీ ఒక సినిమా తెరకెక్కదు. సినిమా శిల్పమనేది కథాశిల్పానికంటే, నవలాశిల్పానికంటే వేరుగా ఉంటుంది. సినీమాధ్యమానికున్న సాంకేతిక పరిమితుల వల్లా, ఆర్థిక పరిమితుల వల్లా, భిన్న వర్గాలకు చెందిన ప్రేక్షకుల అభిరుచులు, అవగాహనాస్థాయిల్లోని తేడాల వల్లా దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అలవడ్డాయి. ఆ ప్రత్యేక లక్షణాలు కథల ఎంపిక, కథను నడిపే తీరు (కథాకథనం), పాత్రధారుల ఎంపికలో వివిధరకాలుగా వ్యక్తమవుతాయి.
కథల ఎంపిక: సినిమా తీయాలంటే అన్నిటి కంటే ముందుగా కావలసింది కథ. ఎవరెన్ని రకాలుగా చెప్పినా కథే సినిమాకు ప్రాణం. నేల విడిచి సాము చేసే ఉత్సాహంలో కొందరు నిర్మాతలు ఈ ప్రాథమిక సూత్రాన్నే మరిచిపోయి పెద్ద పెద్ద తారలు, సాంకేతిక నిపుణులతో డేట్లు కుదుర్చుకుని, తాము తీయబోయే సినిమా చరిత్ర సృష్టిస్తుందని ఆశపడి భారీగా ఖర్చుపెట్టి భంగపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. నటుల లేక సాంకేతిక నిపుణుల సామర్థ్యం కథాబలాన్ని పెంచడానికి, కథను మరింత బాగా ప్రెజెంట్ చెయ్యడానికీ ఉపయోగించుకోవాలే తప్ప అవుంటే చాలు సినిమా ఆడేస్తుందని భ్రమలు పెంచుకోరాదు.
సినిమాలకు ఎలాంటి కథల్ని ఎంచుకోవాలి? ఎలాంటి కథలనైనా ఎంచుకోవచ్చు. పౌరాణికాలతో మొదలై సాంఘికాలు, జానపదాలు, చారిత్రకాలు…ఇలా కొనసాగిన సినీప్రస్థానంలో ప్రతీకాత్మక కథలు (Allegories: ‘ఉపేంద్ర ‘ సినిమా), ‘ఆదిత్య 369′ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలు తీసి కూడా ప్రేక్షకులను మెప్పించవచ్చని ఉపేంద్ర, సింగీతం శ్రీనివాసరావు లాంటి సాహసికులు నిరూపించారు. కాలాన్ని బట్టి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులను బట్టి కథలను ఎంచుకోవాలి. బాగా తీస్తే జానపదాలకు, పౌరాణికాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని భైరవద్వీపం, బాలల రామాయణం నిరూపించాయి. సాంఘిక చిత్రాల విషయానికి వస్తే ఒకప్పుడు యాంటీ సెంటిమెంటు కథలను ప్రేక్షకులు తిరస్కరించారు. మారిన సామాజిక పరిస్థితుల వల్ల ఇప్పుడంత వ్యతిరేకత లేదు. ఒకప్పుడు సెంటిమెంటు డోసు ఎక్కువైనా జనం ఎగబడి చూసేవారు. ఇప్పుడు వెనుకాడుతారు. ఐతే ఎలాంటి కథనెన్నుకున్నా అది సగటు ప్రేక్షకులకు నచ్చాలనేదే సినీమాధ్యమంలో తారకమంత్రం.
కథనం: కథ చెప్పే (లేక కథ నడిపే) విధానమే కథనం. ఎంత మంచి కథనెన్నుకున్నా కథనసామర్థ్యం లేకపోతే ప్రేక్షకులకు, తద్వారా నిర్మాతకు నిరాశే కలుగుతుంది. సినిమాకు ఎలాంటి కథనెన్నుకున్నారని కాక ఎన్నుకున్న కథను ఎంత ఆసక్తికరంగా చెప్పారన్నదే సాధారణంగా చిత్రవిజయాన్ని, పరాజయాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని కథలు టూకీగా (ఔట్‌లైన్) వింటే అద్భుతమనిపిస్తాయి. నిర్మాతలు కూడా ఆ నమ్మకంతోనే చిత్రనిర్మాణానికి సిద్ధపడుతారు. కానీ వాటిని ట్రీట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళేసరికి క్రమంగా బలహీనపడి చివరికి చాలా పేలవంగా మారి నీరుగారిపోతాయి. మరికొన్ని కథలు ఔట్‌లైన్ వింటే సాదాసీదాగా అనిపిస్తాయి. కానీ అవేకథలకు సరైన ట్రీట్‌మెంట్ కుదిరితే ఘనవిజయం సాధిస్తాయి. మారుతున్న కాలంతోబాటే కథనరీతులు కూడా మారుతూ ఉంటాయి. కథను ఆసక్తికరంగా నడిపించడానికి లిఖిత సాహిత్యంలో అవసరం లేని/అవసరం రాని కొన్ని అదనపు లక్షణాలు సినిమా కథలకున్నాయి – ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటివి. (ఇంటర్వెల్ బ్యాంగ్: రాతలో ఉన్నప్పుడు ఎంత పెద్ద నవలకైనా మధ్యలో విశ్రాంతి లాంటివేవీ ఉండవు. పాఠకుడికెప్పుడనిపిస్తే అప్పుడే ఇంటర్వెల్..ప్రొజెక్టర్ అతడి చేతిలోనే ఉంటుంది కాబట్టి! (ఇక్కడ పుస్తకమే ప్రొజెక్టర్). కానీ సినిమాల్లో (ముఖ్యంగా మన భారతీయ సినిమాల్లో) భవిష్యత్తు సంగతి చెప్పలేం గానీ ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం సినిమా నిడివి దృష్ట్యా ఇంటర్వెల్ తప్పనిసరిగా ఉంటుంది. సినిమాకొచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్ వరకూ చూసి బోర్ కొట్టి వెళ్ళిపోకుండా నిలబెట్టేందుకైతేనేమి, తర్వాతేం జరగబోతోందోననే ఆసక్తి రేకెత్తించడం కోసమైతేనేమి ఇంటర్వెల్ బ్యాంగ్ అనే టెక్నిక్ ను (తప్పనసరిగా కాదుగానీ) ఎక్కువగా వాడుతారు. అంటే కథను ఒక ఆసక్తికరమైన లేక ఊహాతీతమైన మలుపు తిప్పి, ఏం జరుగుతోందో ప్రేక్షకులకు అర్థమై, ఏం జరగబోతోందో అని వాళ్ళలో ఉత్కంఠ రేగేవేళ, సరిగ్గా అప్పుడే ఆ మలుపులోనే ఇంటర్వెల్ కార్డు పడేస్తారు. కథ నడపడంలో ఇదో టెక్నిక్)
పాత్రల పరిచయం: “అనగనగా ఇద్దరు అన్నదమ్ములు. అన్న మంచివాడు, తమ్ముడిదేమో దొంగబుద్ధి…” అని చందమామ కథ లో లాగ మొదలయ్యే కథకు దృశ్యరూపమివ్వాలంటే వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు అని ఒక్క ముక్కలో చెప్పడానికి వీల్లేదు. ప్రతిదీ సన్నివేశాలపరంగానే చెప్పాలి. వీడి మంచితనం, వాడి చెడ్డతనం ప్రేక్షకులకు ఇట్టే అర్థమయ్యేటట్లు ఒకటిరెండు సన్నివేశాల్ని సృష్టించాలి. ఐతే ఇందుకు ప్రత్యేకంగా సన్నివేశాలను సృష్టించనవసరం లేకుండా కథాగమనంలోనే – అదీ కథాప్రారంభంలోనే – వారి స్వభావాలు తేటతెల్లమయ్యేటట్లు చూడ్డం ఇంకొక పద్ధతి. ఈ పద్ధతిలో కథనం చిక్కగా ఉన్నట్లనిపించినా సంభాషణలు కృతకంగా ఉండకుండా జాగ్రత్త వహించాలి.
గతంలో శ్రీవారికి ప్రేమలేఖ, మంచుపల్లకి లాంటి సినిమాల్లో ఒక సన్నివేశంలో ఒక పాత్రను చూపించి, ఆ పాత్ర మీద కెమెరా ఫ్రీజ్ చేసి “ఈ మనిషి ఇలాంటివాడు” అని బ్యాక్ గ్రౌండు నుంచి చెప్పించారు. ఈ పద్ధతి ఇప్పుడు చెల్లదు. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల్లో పాత్రల పరిచయం, మరి కొన్ని సరదా సన్నివేశాలతో ఇంటర్వెల్ వరకు నడిపించి, ఆ తర్వాతే అసలు కథలోకి వెళ్తున్నారు.
పాత్రధారుల ఎంపిక: పాత్రలకు తగిన పాత్రధారులను ఎంచుకోవడం నిజంగా కత్తిమీదసామే. కథ, కథనాలు బాగున్నా కేవలం కాస్టింగు(పాత్రలకు సరిపోయే పాత్రధారులు) నప్పకపోవడం వల్ల సినిమాలు ఫెయిలైన సందర్భాలు ఉన్నాయి. నటీనటుల నటనా సామర్థ్యంతో బాటు వాళ్ళ విగ్రహం, ఆంగికం, వాచికం లాంటివి అన్నీ పాత్రకు సరిపోతేనే ఆ పాత్రకు తీసుకోవాలి. లేకపోతే అపాత్రతే అవుతుంది. (ఇప్పుడు కాస్త నయం. నటుడి గొంతు బాలేకపోతే డబ్బింగు ఆర్టిస్టుది అరువు తెచ్చుకోవచ్చు.) ఇవేవీ కాకుండా కేవలం ఆయా నటులకు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ పాత్ర స్వభావానికి సరిపడకపోవడం కూడా కొన్నిసార్లు కాస్టింగును దెబ్బతీస్తుంది. ప్రేక్షకులు కొందరు నటులను కొన్ని రకాల పాత్రల్లో ఆదరించినంతగా ఇతరపాత్రల్లో ఆదరించరు. దీనికితోడు మరికొన్ని ప్రత్యేక కారణాల వల్ల తెలుగులో కనీసం ఇద్దరు ప్రముఖ హీరోలు కలిసి నటించే మల్టీస్టారర్ సినిమాలు రావడం పూర్తిగా తగ్గిపోయింది. అభిమానుల అభిమానం వెర్రితలలు వేసి నటులు తమ ఇమేజ్ చట్రంలో తామే బందీలయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అసాధారణ నటనాసామర్థ్యముండి కూడా ఇమేజ్ పరిమితులకు లొంగని నటులు ఆ కాలంలోనూ (ఎస్వీ రంగారావు), ఈకాలంలోనూ (కమల్ హాసన్) ఉన్నారు.
సినీమాధ్యమానికున్న పరిమితులు:
సాంకేతిక పరిమితులు: రచయితదేం పోయింది? నవల్లోని పాత్రలు అసాధ్యమైన ఫీట్లు చేసినట్లుగా రాసిపారేస్తారు. దాన్ని తెరమీదకెక్కించాలంటే దర్శకనిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ చుక్కలు కనిపిస్తాయి. ఐతే కె.వి.రెడ్డి లాంటి మాయామేయ దర్శకుడికి మార్కస్ బార్ట్లే లాంటి ఛాయాగ్రాహకుడు తోడైనప్పుడు ఇలాంటి పరిమితులూ అవాక్కైపోయి నోరు తెరుచుకుని సినిమా చూసేస్తాయి.
ఆర్థిక పరిమితులు: రచయితకొచ్చిన ఒక ఆలోచన దృశ్యరూపంలో సాక్షాత్కరించడానికి డబ్బులు కావాలి. ఇంకా దానికెంతో మంది సాంకేతికనిపుణుల సహకారముండాలి. అందరి మధ్యా గొప్ప సమన్వయముండాలి. (ఒక్కోసారి “వంటగాళ్ళెక్కువై వంట చెడిపోవడం” కూడా జరుగుతూ ఉంటుంది.)ఇంతా ఖర్చు పెట్టి, ఇంతమంది కలిసి ఇంత శ్రమ పడ్డాక దాన్నెవరూ చూడకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నిర్మాత మునిగిపోతాడు. కాబట్టి తీసే సినిమాను జనాలకు నచ్చేటట్లు జనరంజకంగా తీయాలని నిర్మాత ఆశించడంలో తప్పులేదు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా సినిమాలు తియ్యడం అందరివల్లా అయ్యేపని కాదు. అందుకే నిర్మాతలు ప్రేక్షకుల్లో ఒక వర్గానికి బాగా నచ్చే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. గతంలో మహిళా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కడవలకొద్దీ కన్నీళ్ళు కార్పించే సినిమాలు తీశారు. యువతరాన్ని థియేటర్ల వైపు ఆకర్షించడానికి ఒకప్పుడు ఫైట్లు, డాన్సులు పనికొస్తే ఇప్పుడు శృంగారానికీ, బూతులకే అగ్రతాంబూలమిస్తున్నారు. ఇది ఈమధ్య తరచుగా శృతిమించుతోంది కూడా.
లక్షిత ప్రేక్షకులు/టార్గెట్ ఆడియెన్స్: సాహిత్యం పుస్తకాల్లో ఉన్నంతవరకు దాన్ని చదివేవాళ్ళు సాధారణంగా సాహిత్యం పట్ల ఒక అభిరుచి, అవగాహన ఉన్నవాళ్ళై ఉంటారు. వారి అభిరుచికి, అవగాహనాస్థాయికి సరిపోయేవిధంగా రాసే సాహిత్యం చదివేవారికి అద్భుతంగా నచ్చినా యథాతథంగా తెరమీదికెక్కిస్తే సగటుప్రేక్షకులకు ఎక్కకపోవచు. వినోదం కోరి సినిమాలకొచ్చే సగటు ప్రేక్షకులు సినిమాల్లో వాస్తవికతను జీర్ణించుకోలేకపోవచ్చు లేదా కొత్తదనాన్ని ఆమోదించకపోవచ్చు. జనరంజకాలైన పాటలు లేవనో, కామెడీ లేదనో అసంతృప్తి చెందే అవకాశమే ఎక్కువ. కాలాతీతవ్యక్తులు నవలను ‘చదువుకున్న అమ్మాయిలు’ గా తీసినపుడు కథను దాదాపు పూర్తిగా మార్చివేశారు. ఆ నవల అంతగా ప్రసిద్ధం కావడానికి కారణమైన ఇందిర పాత్ర ప్రవర్తననుగానీ, ఆ పాత్ర మనస్తత్వ చిత్రణను గానీ సగటు ప్రేక్షకులు జీర్ణించుకోలేరనేమో పూర్తిగా మార్చేశారు.
-సుగాత్రి (http://sahityam.wordpress.com)
రచనలకు ఆహ్వానం
పొద్దు మీ రచనలకు సాదర స్వాగతం పలుకుతోంది. యూనికోడ్ లేదా RTS తెలుగులో కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలను నేరుగా editor@poddu.net కు పంపగలరు.
పొద్దుకు పంపే రచనలు:
1. పంపినవారి స్వంతమై ఉండాలి.
2. ఇంతకు ముందెప్పుడూ ఏ పత్రిక/బ్లాగు/వెబ్సైటులోనూ ప్రచురితమై ఉండకూడదు.
3. ఆ మేరకు ఒక హామీపత్రం జత చేయాలి.
4. పొద్దులో ప్రచురితమైన రెండువారాల తర్వాత “ప్రథమ ముద్రణ పొద్దులో” అని పేర్కొంటూ మీ బ్లాగు/వెబ్సైటులో ప్రచురించవచ్చు.
మీ రచనలను
– యూనికోడులో రాసి (టైపించి) పంపాలి. యూనికోడులో రాసేందుకు లేఖిని ఓ సులభమైన మార్గం.
– editor@poddu.net కు వేగు (మెయిలు) పంపాలి.
– రచనను జాబులోనే రాసి పంపవచ్చు, లేదా జాబుకు జోడింపు (ఎటాచ్‌మెంట్) గా కూడా పంపవచ్చు.
-పొద్దు