బ్లాగుద్యమం

బ్లాగు ప్రస్తుతం నెజ్జనులకో ముఖ్య వ్యాసంగమై పోయింది. తెలుగు బ్లాగులు బాగా వస్తున్నాయి. రోజూ కొత్త బ్లాగరులు చేరుతూనే ఉన్నారు, కొత్త బ్లాగులు వెలుస్తూనే ఉన్నాయి. వివిధ విషయాలపై బ్లాగులు రాస్తున్నారు. బ్లాగుల ప్రగతి ఎలా ఉంది? అవి ఎలా ఉంటున్నాయి? వాటి ప్రస్థానం ఎటువైపు? ఇటువంటి విషయాలను తాకుతూ వెళ్ళే బ్లాగు పరిశీలనా శీర్షిక ఇది.

బ్లాగు ప్రక్రియ మొదలయ్యాక తెలుగులో విస్తృతంగా రావడానికి కాస్త సమయం పట్టిందనే చెప్పాలి. నెజ్జనుల్లో తెలుగువారు లక్షలాదిగా ఉన్నా, ఇలా ఆలస్యం ఎందుకయిందీ అంటే.. కర్ణుడి చావుకున్నట్లుగా ఉన్నాయి కారణాలు:

  1. కంప్యూటరులో తెలుగును చూపించేందుకు ఏంచెయ్యాలో తెలీకపోవడం
  2. తెలిసినా.., దానికోసం అనేక తిప్పలు పడవలసి రావడం.
  3. కంప్యూటరులో తెలుగు ఎలా రాయాలో తెలియకపోవడం
  4. అసలు బ్లాగు ప్రక్రియ గురించి చాలా మంది నెజ్జనులకే తెలియకపోవడం.
  5. నెజ్జనుల్లో ఎక్కువ మంది కుర్రకారు కావడం.., ఇంగ్లీషు చదువులు చదివినందున వారిలో ఎక్కువ మందికి తెలుగులో రాయడం రాకపోవడం
  6. కొంతమంది తెలుగువారిలో ఇంగ్లీషుపై ప్రేమ, తెలుగంటే చులకన ఉండడం
  7. బ్లాగు రాయడం ద్వారా ఇంగ్లీషు ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నం

(ఏడయ్యాయి.. కర్ణుడి చావుకున్నన్ని కారణాల కంటే ఒకటి ఎక్కువే!)

అయితే గత సంవత్సరంగా తెలుగు బ్లాగులు బాగా పెరుగుతూ వచ్చాయి. దానిక్కూడా కారణాలు మెండు గానే ఉన్నాయి. కొన్ని:

  1. కంప్యూటర్లో తెలుగెలా చూడాలో చెప్పే వనరులు అనేకం వచ్చాయి. తెలియ జెప్పే ఉత్సాహవంతులూ బాగానే ఉన్నారు.
  2. తెలుగులో రాసేందుకు అవసరమైన ఉపకరణాలు కూడా బాగా వచ్చాయి. పద్మ, లేఖిని, అక్షరమాల మొదలైనవి. ముఖ్యంగా లేఖిని (http://lekhini.org) ఒక విప్లవాన్నే తీసుకువచ్చింది.
  3. తెలుగు బ్లాగులను, బ్లాగరులను ప్రోత్సహించేందుకై ప్రత్యేకంగా telugublog ( http://groups.google.com/group/telugublog) పేరుతో ఒక గుంపే తయారయింది. బ్లాగులు వాసిలోను, రాశిలోను కూడా పెరగడంలో ఈ గుంపు ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. గుంపు సభ్యులందరు కూడా కొత్తవారికి చేదోడు వాదోడు గా ఉంటూ, బ్లాగుల విస్తృతికి తోడ్పడుతున్నారు.

ఇక బ్లాగుల ధోరణులెలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

స్థూలంగా తెలుగు బ్లాగులు మంచి విషయ పుష్టితో ఉంటున్నాయని చెప్పవచ్చు. రాజకీయాలు, సామాజిక వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు, జ్ఞాపకాలు, కవితలు, సినిమా కబుర్లు, వార్తా నివేదికలు, వివిధ పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలను తిరిగి ప్రచురించడం వంటి అనేక రకాల విషయాలపై బ్లాగులు వస్తున్నాయి. కొన్ని బ్లాగులను గమనిస్తే, చెయ్యితిరిగిన రచయితలు రాసిన వ్యాసాల్లాగే అనిపిస్తాయి. వివిధ ప్రాంతాల మాండలికాల్లో కూడా బ్లాగులు వస్తూ బ్లాగాకాశంలో ఇంద్రధనుస్సును పూయిస్తున్నాయి. తెలుగు బ్లాగరులు ఫోటో బ్లాగులు కూడా రాస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆడియో బ్లాగులు కూడా వస్తున్నప్పటికీ ప్రస్తుతానికివి పాటలకే పరిమితం అయ్యాయి. త్వరలో మంచి మాటల బ్లాగులను వినవచ్చు.

బ్లాగరులు కొన్ని కొత్త పదాలను కూడా భాషలోకి చేర్చారు. వాటిలో కొన్ని: బ్లాగరి, బ్లాగోళం, బ్లాగావరణం, బ్లాగోతం, బ్లాగ్పటిమ, బ్లాగ్శూరుడు

తెలుగు బ్లాగుల్లో ఓ ప్రత్యేకత ఉంది.. అశ్లీలత, దుశ్చర్యల వంటివి ఇప్పటివరకు లేకపోవడం! వివాదాలూ తక్కువే. కొండొకచో వేడి వేడి చర్చలు జరిగినప్పటికీ అవి చక్కటి ఆరోగ్యకరమైన చర్చలే!

హైదరాబాదు తెలుగు బ్లాగరులు కొందరు నెలకోసారి ఒకచోట చేరి, బ్లాగుల గురించి చర్చించుకునే మంచి సాంప్రదాయం ఒకటి ఉంది. పే..ద్ద సంఖ్యలో సభ్యులు రానప్పటికీ వచ్చే కొద్ది మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత మంది బ్లాగరులు వీటిలో పాల్గొనవలసిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమావేశాలు జరగవలసిన అవసరం ఉంది.

అయితే తెలుగు నెజ్జనుల సంఖ్యతో పోలిస్తే బ్లాగరులు, బ్లాగు పాఠకులు తక్కువేనని చెప్పుకోవాలి. సాఫ్టువేరు నిపుణుల్లో తెలుగువారెందరో వెలుగుతున్నారు. ఆర్కుట్లో వేలాదిగా తెలుగువారున్నారు. కాని బ్లాగులు, బ్లాగరుల సంఖ్య మాత్రం వందలకే పరిమితమయింది.ఈ సంఖ్య బాగా పెరగవలసి ఉంది. తెలుగు బ్లాగులు, బ్లాగరులు, తెలుగుబ్లాగు గుంపు మొదలైన వారందరూ ఈ పనిలో కలిసి పనిచెయ్యాలి.

బ్లాగుద్యమంలో మా వంతు కృషి మేమూ చెయ్యదలచాము. నెలనెలా వచ్చే బ్లాగు జాబుల్లోంచి మంచి వాటిని ఎంచుకుని వాటిని సమీక్షించే కార్యక్రమమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ శీర్షికను మొదలుపెడుతున్నాం. నెలకో మూడు ఉత్తమ జాబులను ఎంచుకుని ఈ పేజీలో సమీక్షిస్తాము.

చూస్తూనే ఉండండి.. తెలుగులో మొట్టమొదటి .. 🙂

మా మొదటి బ్లాగు సమీక్ష: డిసెంబర్ 19 మంగళవారం విడుదల

This entry was posted in జాలవీక్షణం and tagged . Bookmark the permalink.

5 Responses to బ్లాగుద్యమం

  1. తెలుగు బ్లాగుల్లో పడి ఇంగ్లీషులో రాయటం మానేసినట్టున్నానే అని నేను నిన్ననే అనుకున్నాను. నేను బ్లాగటం మొదలుపెట్టింది ఇంగ్లీషులోనే అయినా, మొదటి బ్లాగులో నేను రాసిన విషయం చాలా చిన్నప్పుడు నేను ఆడుకున్న ఆటలగురించి (ఆర్కైవ్స్‌లో ఉంది) . దీన్ని తెలుగులో రాయగలిగే వీలుంటే ఎంత బాగుంటుందో కదా అనుకున్నానపుడు. తరువాత చాన్నాళ్లలకు అంటే చాలారోజులకు గూగుల్‌లో తెలుగుబ్లాగరుల బృందం ఉనికిని కనుగొన్నాను. లేఖిని గురించి తెలిసింది. ఇక ‘ఆగలేక మనసాపుకోలేక రాశాను ఒక లేఖ’, అరగంటలో ఒక ‘తవిక’ సృష్టించేశాను. బ్లాగులోకవాసులంతా స్వాగతమంటూ నన్ను తమలో ఒకణ్ణి చేసేశారు. ఇదో వ్యసనమైపోయింది. భయపడి, నిన్ననే ఒక ఇంగ్లీషు పోస్టు చేశాను. కానీ అందులో విషయమేమీ పెద్దగా లేదు. హ్యూస్టన్‌కొచ్చే ముందే నాకు తెలుగులో బ్లాగడం తెలిసుంటే మరో ‘బారిష్టరు పార్వతీశం’ తయారయుండేది. ఇప్పుడది ఇంగ్లీషులో వుండిపోయింది. ఇంతకీ కర్ణుని చావుకు గల ఆరు కారణాలేమిటో మీరు తరువాతి సంచికలలో ఒకసారి మాకు చెప్పాలి.

  2. తెలుగు బ్లాగుల్లో ఓ ప్రత్యేకత ఉంది.. అశ్లీలత, దుశ్చర్యల వంటివి ఇప్పటివరకు లేకపోవడం! వివాదాలూ తక్కువే. కొండొకచో వేడి వేడి చర్చలు జరిగినప్పటికీ అవి చక్కటి ఆరోగ్యకరమైన చర్చలే!

    ఈ మాట నా మిత్రులకు నేనెంతో సంతోషంగా చెబుతుంటాను.

  3. మంచి ప్రయత్నము. రానారె అన్నట్లు ఇప్పుడు నా దిన చర్యలో అధిక భాగము తెలుగు చదవాడం రాయడం అయిపోయింది. ఇన్ని కొత్త తెలుగు వెబ్‌సైట్లు వచ్చినా ఇంకనూ తెలుగు పిల్లలకు అవసరమైన తెలుగు నేర్చుకోవడానికి వుపయోగపడే సైట్లు మాత్రం రాలేదు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. నిజంగా lekhini.org గొప్ప విప్లవాన్నే తెచ్చింది. కానీ మీరెందుకో లేఖిని పద్ధతిని కొంత మార్పు చేశారు.All the best

Comments are closed.