కబుర్లు

ఆరోగ్యము, వైద్యమూ
ప్రభుత్వ శాఖల్లో ప్రజా సంక్షేమం రీత్యా వైద్య ఆరోగ్య శాఖ అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వాలు చాలా తరచుగా విమర్శలు ఎదుర్కొనే శాఖల్లో ఇదీ ఒకటి. ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకునే పద్ధతులను ప్రజల్లో వ్యాప్తి చేసి, ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం ఒక బాధ్యత కాగా, ప్రజలు రోగాల బారిన పడినపుడు తగు వైద్యాన్ని అందించడం దీని రెండో బాధ్యత. ప్రభుత్వాలు సహజంగా రెండోదాని పైనే ప్రధానంగా దృష్టి పెట్టడం చూస్తూంటాం.మీరేం చేస్తున్నారు మంత్రి గారూ అంటే ఇదిగో ఆసుపత్రులకు ఇంత ఖర్చు పెట్టాం, మందులకింత ఖర్చు పెట్టాం అని చెప్పుకుంటూ పోతారే గానీ, ఇదిగో ప్రజల్లో ఈ ఆరోగ్య విషయమ్మీద అవగాహన కలిగించాం.. అంచేత ఈ ప్రయోజనాలు కలిగాయి అని చెప్పడం అరుదు.

అటువంటి అరుదైన విషయాల్లో పల్సు పోలియో ఒకటి. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమాల్లో పల్సు పోలియో ఒకటి. ఇలాంటి కార్యక్రమాలను మరి కొన్నింటిని చేపడితే, వాటినీ అదే చిత్తశుద్ధితో జరిపితే ప్రజారోగ్యం విషయంలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలో రెండు మూడు:

  1. ప్రజలను ముడి బియ్యం తినేలా ప్రోత్సహించడం: ముడి బియ్యంలో పోషకాలు – ముఖ్యంగా బి విటమిను – బాగా ఉంటాయి. పాలిషు పేరిట వాటి తీసిపారవేసి, కేవలం కడుపు నింపే ఆహారాన్ని తింటున్నామని ప్రజలకు చెప్పాలి.
  2. వారంలో కనీసం మూడు రోజులు ఆకు కూరలు తినేలా ప్రచారం చెయ్యాలి.
  3. శుచీ శుభ్రత విషయంలో ప్రజలకు జాగ్రత్తలు బోధించడమే కాకుండా, వాటిని పాటించేలా బాగా ప్రచారం చెయ్యాలి.

ప్రజలు ఆరోగ్య నియమాలను పాటించడం మీద ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా కూడా భవిష్యత్తుపై అది పెట్టే పెట్టుబడే. ఆ పెట్టుబడి ప్రజారోగ్యాన్ని రక్షించడమే కాక, డాక్టర్ల కోసం, మందుల కోసం ప్రజలూ ప్రభుత్వమూ ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలను ఆదా చేస్తుంది. కానీ రోగాలొచ్చాక, వైద్యం కోసం పెట్టే ఖర్చు కేవలం ఖర్చే. దాన్నుండి వెనక్కి వచ్చేదేమీ ఉండదు.

ఎయిడ్సుపై ప్రచారంలో భాగంగా ఆరోగ్య మంత్రి కండోములమ్మారట.. ముడి బియ్యమే వండండి అమ్మలారా, అవే తినండి బాబుల్లారా అని కూడా చెబితే బాగుంటుంది కదా!

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

One Response to కబుర్లు

  1. t.sujatha says:

    భేష్ చక్కగా చెప్పారండి.

Comments are closed.